Showing posts with label News Paper. Show all posts
Showing posts with label News Paper. Show all posts

Saturday, July 11, 2020

మేధస్సు రాజకీయం వెంట ‘పడి’పోకూడదు! -కర్లపాలెం హనుమంతరావు - సూర్య సంపాదకీయ వ్యాసం





పశ్చిమ జర్మనీ పురాప్రాణి విజ్ఞానవేత్తలలో ప్రముఖుడైన మానసిక విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్ రూడోల్ఫ్ బిల్జ్ మనిషి చిత్త ప్రవృత్తి మీద అనేక పరిశోధనలు చేసిన అనంతరం తేల్చి చెప్పిన సారాంశం – మనిషి మనసు ఇట్లా ఉంటుంది.. అట్లా ఉంటుంది’ అని గట్టిగా స్థిరపరిచి చెప్పడానికి  ఏ మాత్రం వీలులేని బ్రహ్మపదార్థం- అని. పరిస్థితిని బట్టి ప్రవృత్తి మార్చుకోవడం మనసు బలం. అధునాతమైన ఏ విజిజ్ఞాసాపథప్రమేయ విజ్ఞానమైనా ఈ తరహాలో ఉన్నప్పుడు ఇవాళ జరిగే సంఘటనకు మనిషి రేపు ఎలా స్పందిస్తాడో అన్న ఊహ ఊసుబోకకు మాత్రమే పరిమితమవుతుంది. సాహసించి ఏ కొద్ది మంది బుద్ధిబద్ధ మేదావుల కొంత కల్పన చేసినా ఆ ఊహపోహలు వేటికీ గతకాలపు అనుభవాలను దాటి ముందు వచ్చే పాటి శక్తి చాలదు. ఆ మేధోవర్గ ప్రవచనాలను ఆధారం చేసుకుని తతిమ్మా సామాన్య జనం పడే గుంజాటనల ఫలితాంశమే  లోకంలో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్న రాజకీయ  గందరగోళ వాతావరణం.
మేధోవర్గంగా మన్ననలు పొందిన బుద్ధిజీవులు ఈ రోజు తమకు తాముగా అస్వతంత్రులవుతున్నారు.  ప్రయోజిత  ఆలోచనాధారకు తమదైన శైలిలో ముద్రలు వేస్తూ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.  మద్దతు  లభించని పక్షంలో  ఆకృతి లేని మాటలకు, నిరాకార భావాలకు ఏలుబడికి వచ్చే అవకాశం ఉండదని తెలిసే ఈ ప్రక్రియ కొనసాగడం ఆందోళన కలిగించే అంశమే కదా?
సమూహాలను మించి వ్యక్తులను అభ్యుదయ శక్తులుగా చూడడమూ, సముదాయాల మీద  వ్యక్తుల ఆధిపత్య ధోరణికి హారతులు పట్టడమూ.. రెండూ వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్య పంథా ఏలుబడి మార్గంగా ఎంచుకోబడిన చోట అది మరీ ప్రమాదకరం.  నిబద్ధ రాజకీయాలు (కమిటెడ్ పాలిటిక్స్) అన్న అభాసాలంకారమే అసలు పుట్టేందుకు ఆస్కారం ఉండకూడని జనస్వామ్య వ్యవస్థలో ‘నిబద్ధ మేధోవర్గం’ కూడా ఒకటి పుట్టుకురావడం విషాదకర పరిణామం.
కాలగమనాన్ని, సాంకేతిక విజ్ఞాన ప్రగతిని, విజ్ఞానశాస్త్రపు మనోవేగ ప్రసరణ తీవ్రతను గమనించనివారు మాత్రమే నిబద్ధ రాజకీయం’ అనే ఆలోచన చేసి ఆనక దాని చూట్టూతా సమాజాన్ని సైతం తిప్పించాలని తాపత్రయం చూపించేది. అది వృథా ప్రయాసగా మారిందని గ్రహించే వేళకు వారి పొద్దు ఎటూ వాటారిపోతుంది. దానితో కొంత మంది స్తబ్దుగా  తెర వెనకకు మలిగిపోతారు. మరి కొద్దిమంది బుద్ధిజీవులు ఆగలేక ఆఖరి నిశ్వాసలో నిట్టూర్పు ధ్వని వినిపిస్తారు. విన్యాసం ఏదైనా కావచ్చు కానీ.. రెండు చర్యల సారాంశం మాత్రం ఒక్కటే.. ‘ఏకబద్ధ మేధోసిద్ధాంతం’ అనే ఆలోచనకు ఎప్పుడైనా చివరకు దక్కేది  వైఫల్యమేనని.
 రాజకీయాలలో మాత్రమే ఈ తరహా నాటకీయ ప్రవృత్తులు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. రాజకీయవేత్తలకు ఉండే ప్రత్యేక లాభం కూడా అదే. పరార్థాన్ని స్వార్థం ఆక్రమిస్తుందో, స్వార్థం స్థానే పరార్థం రూపు దిద్దుకుంటుందో.. ఒక పట్టాన అర్థం కాని మయసభ మాదిరిది ఈ ఊసరవెల్లి క్షేత్రం. రాజకీయాలలో వ్యక్తిగతప్రయోజనం పార్టీ ప్రయోజనంగా విలసిల్లడమూ, పార్టీ ప్రయోజనం ప్రజాభీష్టంగా  ప్రదర్శించే ప్రయత్నాలు సందర్భాన్ని బట్టి ముమ్మరించడమూ మనం చూస్తుంటాం.  అందులో ఏది ఏదో చెప్పడం బ్రహ్మకైనా సాధ్యంకాదు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఉండే విశాలమైన అర్థం పరిమిత ప్రయోజనాలకు కుచించుకునిపోయే సందర్భాలు అవే. ఈ వైపరీత్యానికి కారణమేంటని గాని ఆలోచించగలిగితే రాజకీయవేత్తలలో నిరంతరం గూడుకట్టుకుని ఉండే సంకోచం.. భయం అని నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. బహుత్వంలో ఏకత్వం దర్శించలేక తమ అస్తిత్వం పట్ల గూడుకట్టుకునే అభద్రతాభావన అది. ఆ భావన ప్రసరణ వివిధ రూపాలే రాజకీయాలలో క్షణక్షణం సాగే రసవత్తర నాటక ప్రదర్శనలకు మాతృక.
ద్వంద్వాలను చూస్తూ, వాటికి అతీతంగా ఉంటూ,  ప్రకృతిని, దాని సృష్టిని జడం నుంచి స్థావరం వరకు, స్థావరం నుంచి జంగమం వరకు సూక్ష్మ అనుశీలన చేసి లోకానికి స్థూలం నుంచి విపులంగాను, విపులం నుంచి స్థూలం వరకు వివరించి చెప్పవలసిన బాధ్యత  మేధోసంపన్నులది. ఆ మేధోవర్గమూ రాజకీయవేత్తల పాత్రల్లో ఇమిడే ఇప్పటి ప్రయత్నాలు విచారం కలిగించే వైపరీత్య విపరిణామం.  
రాజకీయవేత్తల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి, మేధావుల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి విధిగా తేడా ఉంటుంది. ఉండాలి కూడా. ఆ అంతరం గుర్తెరుగకుండా మేధావిత్వం వెలగబెడుతున్నామనే మెజారిటీ  ఆలోచనాశీలులు తమ్ము తాము వంచించుకుంటున్నారు; తమను నమ్మిన  సామాన్య లోకాన్ని సైతం వంచించాలని చూస్తున్నారు.
రాజకీయవేత్త ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపు ఎల్లలు దాటి బైటికి చూడవు. మేదావికి ఆ అడ్డమాకులతో ఏం పని నిజానికి? అతని మనసు ఆకాశంలో స్వేఛ్చావిహారం చేసే విహంగంతో సమానమని కదా లోకం మన్నన! నిస్సీమమర్యాదగా సంచరించే ఆ మనసుకు హద్దులెక్కడివి? కేవలం సంకెల బద్ధం కాని బుద్ధిబలం ఒక్కటే మేధావిని కాని, రచయితను కాని, కళాకారుడిని కాని రాజకీయవేత్త నుంచి వేరు చేసి చూపించే గొప్ప లక్షణం. మేధావికీ   కమిట్ మెంటులు, కట్టుబడులు, బిగింపులు, అదుపాజ్ఞలకు లొంగుబాట్లు ఉన్న పక్షంలొ అతని ఆలోచనాధార, ప్రవాహఝరులకు అడ్డుకట్టలు డుతున్నట్లే లెక్క!
 ఇప్పుడు ఈ దేశపు మేధోలోకంలో గోచరించే ఈ సీమాయితబుద్ధిమత్వమే భయపెడుతోంది. రాజకీయవేత్తలోని రాజకీయ పదజాలాన్ని అరువు తెచ్చుకుని తమ ఆలోచనలకు తామే బందీలవుతూ.. లోకాన్ని సైతం తమ పరిమిత భావధారతో బంధించాలని చూస్తున్నారు మేధావులు! మనిషిని విశ్వరూపుణ్ణిగా మార్చవలసిన మేధావి పరిమితుణ్ని చేయాలన్న ప్రయత్నం విచారం కలిగిస్తోంది.
భూమి బంధాలను  సైతం విజ్ఞానశాస్త్ర సాధనతో ఒక వంక తెంచివేస్తోనే మరో వంక నుంచి తనలోని పెరగలేనితనం వెర్రిపిలకలు వేస్తున్నా నిర్లిప్తత పాటించడం నిజంగా ఒక వైపరీత్యమే! ఉత్తమోత్తమమైన  ఉత్ఠానమే సిద్ధాంతంగా అమలు కావాలన్న పంతంలేమి ప్రధానంగా ముందుకు రావడం.. అంటే మేదావులు తమ పాత్ర నిర్వహణలో విఫలమవుతున్నట్లే లెక్క. సంకోచం లేకుండా మేధావులు రాజకీయాలలో పడిపోతున్నారన్న మాటే.. అనుమానం లేదు!

 మహాప్రళయంలో కూడా నిర్భయుడు, నిరాసక్తుడు అయివుండవలసినవాడు, భయభ్రాంతులుగా, మమతాచిత్తులుగా మారిపోవడం దేనికి సంకేతం? అనుశీలన పరిశీలన కన్నా దిగువ స్థాయికి దిగజారిపోవడం ఏ ప్రమాదానికి ఆహ్వానం? ఏకదేశసిద్ధాంతాలకు తమను తాము బిగించుకున్న ఫలితంగా మేధావులలో వ్యుత్పన్నత పలచబారిపోతోన్నది. 'నాతనం' నావారు అనుకున్నవారి చేతకానితనాన్ని  వేలెత్తి చూపించడానికి నామోషీ పెడుతోన్న సందర్భం దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు మేధావులూ బరితెగింపు మార్గం పట్టేసారని లోకం బాహాటంగానే విమర్శిస్తున్నది. ఎవరు నొచ్చుకున్నా చెప్పక తప్పని  చేదు నిజం ఇది.
గిట్టని వర్గాల చేవకు చెయ్యెత్తి జైకొట్టడం జైళ్లకు చేర్చే సాకుగా  మారడం స్వార్థరాజకీయాలకు అతుకుతుందేమో! ఆ తరహా  కుతిల(బాధామయ) స్థితులకూ ఒక అంతస్తు కల్పించే ప్రయాస మేధోలోకం నుంచీ ఔత్సాహికంగా రావడమంటే.. నిస్సందేహంగా జనస్వామ్యవ్యవస్థ సర్వవినాశనానికి నాందీ వచనం ఆరంభం అయినట్లే! చీకటిలో తచ్చాడే మనుషులకు  ఏ ఒక్క మేధోజీవీ అనధికార దీపంగా అయినా  వెలిగి రహదారికి ఎక్కే  దోవ చూపించేందుకు సిద్ధంగా లేని  దుస్థితులు మళ్లీ దాపురించాయని నిస్సందేహంగా చెప్పేయవచ్చు. 
ఇక్కడ ఇప్పుడు ఏది లేదో దాని వల్లనే అంతటా చీకటి. ఆ చీకటి పారదోలడమే పనిగా ఉండవలసిన మేధోవర్గమే జనం చీకటిపాలబడేందుకు మొదటి కారణమవుతున్నది. దో విచిత్ర పరిస్థితి.
మేస్సుకు ఎవరో భాష్యం మార్చేసినట్లుగా ప్రస్తుతం ఏ ప్రచార మాధ్యమం గమనించినా ఆలోచనాపరుడంటే ఏకదేశ రాజకీయభావవిన్యాసకుడుగా మాత్రమే దర్శనమిస్తున్నాడు!


సమాజం మహాసముద్రం. గభీరం, గంభీరమైన అగాధమొకటి ఎదు ఉండగా, దానిని వివిధ నత్తల్లో అనుశీలన చేసి వడగట్టిన ఫలితాంశాలను సమాజశ్రేయస్సుకు అంకితమిచ్చే పని మేధావిది. ఆ విధి దిక్కులేనిది అయిపోయింది.
అభివృద్ధికి అర్థం నాలుగు రాళ్లు చేతుల్లో ఆడడం కాదు. సామాజికుణ్ణి ఎంత వరకు స్వతంత్రుణ్ణి, సమగ్రుణ్ణి, సర్వతోముఖుణ్ణిగా తీర్చిదిద్దుతుందన్న దాని మీదనే దాని  ప్రకాస్తి నిలుస్తుంది. ఎటూ రాజకీయవేత్త వల్ల కాని పని ఇది. మనిషిని బంధించేందుకు మాత్రమే ఎత్తులు  వేసేది రాజకీయం. జన బంధ విముక్తి తన ఉనికికి ఇబ్బందని దానికి తెలుసు. కనుక విడిచే పరిస్థితి ఉండదు. సామాజికుడి విముక్తి, జీవన విస్త్రృతులే లక్ష్యంగా పనిచేసే మేధావి  పనివిధానం అందుకు విభిన్నం.
ప్రపంచ దేశాల  వర్తమాన పరిస్థితులతో దేశీయుడి జీవన స్థితిగతులను ఎప్పటికప్పుడు తుల్యమాన పద్ధతిలో బేరీజు వేసుకుంటూ మంచి చెడులను చర్చకు పెట్టడం, క్రియాశీలులు  తమ ఉద్యమాలకు ఉత్తమ లక్ష్యాలు సిద్దంచేసుకునేందుకు వీలుగా వేదికల కల్పనలో తమ వంతు అంకితభావంతో నిర్వహించడం  మేధోజీవి పాత్ర. మేధావి  ఎట్టి సంకటంలో కూడా ప్రతినివిష్ఠ బుద్ధి కాకూడదు.  మనసుకు సంకెళ్లను పడనీయకూడదు. బంధం ఒకరు వేసినా, తనకు తానుగా వేసుకున్నా.. ఆ క్షణం నుంచి   అతని వాణి స్తబ్దము, దభ్రమూ కాకతప్పదు.

రాజకీయం, మేధస్సుకుకానొక అంగం మాత్రమే! ఎల్లవేళలా ఒకే ఆకారంలో ఉండని రాజకీయ వ్యవహారాలను తన సర్వస్వంగా భావించిన మేధావి మేధోమధనను నమ్మలేం. కారణం, అతడూ రాజకీయవేత్తతోనే తన బాణి, వాణి మార్చుకునే వర్గంలోకి దిగజారుతాడు కనక.

రాజకీయాన్ని, దానిలోని వైవిధ్యాన్ని మేధావి ద్రష్ట బుద్ధితో అనుశీలన చేసి అందులోని ఋతానికి, ధర్మానికి మాత్రమే ఆవిష్కర్తృత్వం వహించే బాధ్యత భుజాన వేసుకోవాలి. అట్లా వేసుకోగలిగిన మేధావులే నామవాచ్యులయినట్లు చరిత్ర రుజువులు చూపిస్తోంది. ఆ విధంగా చేయలేనివారు విపరీతపు సిద్ధాంతాలను బుర్రలోకి చొప్పించుకుని మేధోమార్గాన్నే మొత్తంగా పర్యాప్తమూ, పరిమితమూ చేసుకుంటున్నారని చెప్పాలి. పరిమిత సూత్రాలకు అపరిమతమైన ధార్మికతను అంటకట్టి కోరి కోరి తమకు తామే భావనాపంజరాలలో చిలకలుగా మార్చుకుంటున్నారు తాజా మేధావులు! ఎవరి పలుకులో అస్తమానం  చిలుకల్లా వల్లించడంతో మేధస్సుకు దక్కవలసిన న్యాయమైన గౌరవం దూరమవడానికి  కారకులవుతున్నారు.
లోకంలో ఏ సిద్ధాంతమూ, ధర్మమూ సమగ్రంగా ఉండవు. ఎల్లాకాలం ఒకే రూపంలో  చెల్లుబాటవాలనుకోవడం ధర్మం కూడా కాదు.  నిన్నటి ధర్మం ఈ రోజు చద్దివాసన వేయక తప్పదు. కారణం ఏ సిద్ధాంతమైనా ఏదో ఒక  వర్గ  ప్రయోజనానికి పరిమితమయి స్థిరపరచిందవడమే! అప్పటి కాలానికి అది ఉత్తమమని తోచినా.. కాలగమనంలో అవసరాల నిమిత్తం రంగప్రవేశం చేసే నూతన సిద్ధాంతాలు దానిని నిర్వీర్యం చేయడం తప్పనిసరి. అప్పుడు రాజకీయవేత్త కన్నా ముందు దాన్ని నిర్ద్వందంగా సమర్థిస్తూ వచ్చిన మేధావి సమాజం ముందు బోనులో నిలబడే  దుస్థితి వస్తుంది. 
 మానవ చరిత్రలో ఇంత వరకు ఎన్ని రాజకీయ సూత్రాలు అవతరించలేదు! అవధులులేని అధికారాలు అనుభవించీ కాలానుగతంగా అంతరించిపోలేదు! సిద్ధాంతం ఏదైనప్పటికి, ప్రతిదీ మంచి చెడుగుల కలగలుపు నేతే. తానులోని ఏ పోగులు శాశ్వత, సర్వహిత ధర్మ  సమ్మత లక్షణ సమన్వితమైనవో అనుశీలన చేసి ప్రపంచానికి  విడదీసి చూపించడంతో మేధావి బాధ్యత సంపూర్ణమయినట్లే!
కాలం అచంచలం, పృథివి పరిమితం -అన్నట్లుగా నిత్యం ప్రజాజీవితాలతో స్వీయప్రయోజనార్థం రాజకీయవేత్తలు రూపకాలు ప్రదర్శిస్తుంటారు. మేధావులు  వాటికి సూత్రధారుల వేషం కట్టకూడదు. పాత్రధారణనయితే బొత్తిగా దూరం పెట్టడం ఉత్తమం.
బంధాలు లేని  విచారధార వల్లనే కదా విజ్ఞానశాస్త్రం మానవపురోగతికి శక్తి మేరకు సమిధలు సమర్పించ గలుగుతున్నది! ఈ ఒక్క సూత్రం పట్టుకుని మేధోవర్గమూ ముందుకు పోగలిగినప్పుడే ప్రకృతి జనిత సర్వ పదార్థాల క్రమావిష్కార రహస్యాలను   అనుశీలించ గలిగే తన ప్రత్యేక శక్తిసామర్థ్యాలను   నిలుపుకునేది. మనిషిని సర్వతోముఖమైన సర్వజన సంక్షేమంకరమైన కళ్యాణమార్గం వైపుకు మళ్లించే సంకల్పం నిలుపుకోదలుచుకుంటే .. ఇప్పటిలా  ఏదో ఓ రాజకీయ పక్షాన్నో, పంథానో అదే శాశ్వతమని నెత్తిన పెట్టుకు వూరేగే మూఢత్వం ప్రదర్శించకూడదు. ఎంత లావు మన్నన పొందిన మహామేధావికయినా ఈ నియమంలో మినహాయింపులేదు.
 ఏకసిద్ధాంతబద్ధతకు లొంగని నిబద్ధత నిలుపుకున్నంత వరకే మేధావిలోని అసలు మేధస్సుకు జవం, జీవం.. మన్ననా, మర్యాదా. మాన్యత సాధించిన మేధోవర్గం ద్వారానే సామాన్య జనానికి ఎప్పటికప్పుడు వర్తమాన సమాజంలోని రాజకీయ స్థితిగతులు, మంచి చెడ్డలు వడగట్టినట్లు బోధపడేది.
***
(11 -07 -2020 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)



Monday, March 16, 2020

నటి శ్రీదేవి దుర్మరణం నేపథ్యం - హద్దులు తెలియని ప్రసార మాధ్యమాల పద్ధతులు - కర్లపాలెం హనుమంతరావు-మనం దినపత్రిక


కాలాలకు, తరాలకు అతీతమైనది ఆ అభినేత్రి ఆకర్షణ. భాషలు, ప్రాంతాలకు అతీతంగా దేశం ఇంటా బైటా ఒకే తీరైన అశేషమైన అభిమాన సంపద ఆ నటీమణి సొంతం. ఐదు దశాబ్దాల పాటు అటు  కుటుంబ జీవితాన్ని, ఇటు అభినయ వృత్తిని సమన్వయించుకొంటూ మూడొందల పై చిలుకు చిత్రాలలో  ప్రధాన పాత్రలు పోషించడం..  ప్రముఖ కథానాయకులకు దీటుగా ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే స్థిరంగా నిలబడి ఉండడం.. ఒక మహిళగా ఈ పురుషాధిక్య ప్రపంచంలో(మరీ ముఖ్యంగా మగవారి కనుసన్నలలో మాత్రమే నడిచే చిత్రపరిశ్రమలో) నిజంగా ఒక అద్భుతమే! అందం.. అభినయం ఉన్నంత మాత్రాన అందరికీ  సువర్ణావకాశాలు కలసి రావు. అడుగుపెట్టిన ప్రతిచోటా అందలం ఎక్కిందంటే  నిర్వచించేందుకు శక్యం కాని అదృష్టమేదో ఆమె  వరంగా పొంది ఉండాలి.  ఊహించని ఎత్తులకు ఎగబాకించిన ఆ అదృష్టం వరంగా పొందిన అత్యంత అరుదైన భారతీయ తారామణులలో శ్రీదేవిది నిస్సందేహంగా ముందు వరస. కాబట్టే అంతుబట్టని శ్రీదేవి హఠాన్మరణం ఖండాతరాలలో సైతం నాలుగు రోజులు  పెను సంచలనం సృష్టించింది.

జీవితమంటే శ్రీదేవికి సినిమానే. జీవితమూ అంతే విచిత్రంగా సినీమాటిక్^గా ముగిసి పోవడం ఎంతటి కఠినాత్ముడి చేతనైనా కంట తడి పెట్టించే దుర్ఘటన. కోట్లాది ఆమె అభిమానుల మనోభావాలకు సంబధించిన సున్నితమైన ఈ  అంశాన్ని స్వదేశంలోని ప్రసార మాధ్యమాలు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాలు నిర్వహించిన తీరుకు ఇప్పుడు సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి.

ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఎదగాలన్న పంతం ఎలా వీడకూడదో శ్రీదేవి జీవితకావ్యం నుంచి కార్యశీలులంతా  నేర్చుకోవచ్చు. సందర్భం వచ్చింది కనుక ప్రసార మాధ్యమాలూ సోదాహరణంగా ఆమె జీవితంలోని వికాసకోణాలను హుందాగా ప్రదర్శించవచ్చు. సమాజం పట్ల ప్రసార మాధ్యమాలకూ ఉండవలసిన బాధ్యతను గుర్తెరిగి ఉండి ఉంటే.. రెండుగా చీలిన టి.వి తెర మీద ఒక వైపు శ్రీదేవి నీటితొట్టి వరకు నిదానంగా నడుచుకుంటూ వెళ్లి హఠాత్తుగా పడిపోయే దిగ్భ్రాంతికర ఊహా దృశ్యం.. మరో వైపు ఆ   అందాల నటి వానలో తడుస్తూ వయసుకు మించిన కథానాయకుడితో చేసే శృంగార నృత్యం  చూసే దురదృష్టం వీక్షకులకు  పట్టి ఉండేదే కాదు.  వివాదాలకు అతీతంగా మెలిగిన ఒక మంచినటి జీవిత చరమాంకం   చివరకు  వివాదాస్పద అంశాల  ముగింపుగా మిగిలిపోవడం వెనుక భారతీయ ప్రసార మాధ్యమాల.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాల బాధ్యతారాహిత్యం ప్రధాన పాత్రే వహించిందన్నది నిష్ఠుర సత్యం.

రాజీపడని పెంకెతనం ఒక్కోసారి  తెచ్చిపెట్టే అభద్రతాభావన , అశాశ్వతమైన బాహ్యాలంకరణల మీద శృతి మించిన   మోజు ఎంతటి ఘనచరిత్ర కలవారి మీదనయినా ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తుందో శ్రీదేవి జీవితాన్నుంచే ఓ పాఠంగా గ్రహించవచ్చు. ఆ మేరకైనా సమాచార మాధ్యమాలు తమ వంతు బాధ్యతను కొంతయినా నిర్వర్తించి ఉంటే.. ఇంత చర్చకు ఆస్కారం ఉండేదే కాదు.
వయసును ఎవరం ఎలాగూ  జయించలేం. కనుక కనీసం మనసునైనా కొంత మేరకు  నియంత్రించుకునే ప్రయత్నం చేసుకో గలిగితే అర్థాంతరంగా వచ్చి పడే అవాంతరాలను కట్టడి చేసుకోగల ఆత్మవిశ్వాసం అలవడుతుంది. నిత్యం మిరిమిట్లు గొలిపే వెలుగుల్లోనే తప్ప కనీసం మసక  చీకటి మలుపుల్లోకైనా వెళ్లనిచ్చగించని నేటి తళుకుబెళుకుల తరానికి శ్రీదేవి వంటి 'అతిలోక సుందరి' సినీజీవితమే ఆదర్శంగా ఉంటున్నద ఇప్పుడు. ఆచరణలోని దాని సాధ్యాసాధ్యాలను  గురించి అమాయకమైన యువతరానికి ఉదాహరణగా తెలియ చెప్పే అవకాశం శ్రీదేవి హఠాన్మరణం కలిగించింది. అయినా టి. ఆర్. పి రేటింగుల మీది అధిక ధ్యాస.. ప్రేక్షకులు పక్క ఛానెళ్లకి  మళ్ళకూడదన్న వ్యాపార లాభాపేక్షతో ప్రసార మాధ్యమాలు సామాజిక బాధ్యతను పూర్తిగా  ఉపేక్షించాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.

గెలుపు కోసం తపించిపోవడం ఎప్పుడూ వ్యక్తిత్వ వికాసానికి అవసరమయే ముఖ్య ప్రేరణే. కానీ విజయపుష్పాల పొదల మాటున కాటువేసేందుకు విషసర్పాలు ఎలా పొంచి ఉంటాయో విప్పిచెప్పి యువతను   అప్రమత్తం చేసే మరో మంచి అవకాశం శ్రీదేవి విషాద మరణం ద్వారా  అంది వచ్చినా.. అలవాటుగా ప్రదర్శించే నిర్లక్ష్యపు ధోరణితో ప్రసార మాధ్యమాలు మరోసారి తమ సామాజిక బాధ్యతను విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సర్వే సర్వత్రా.

అందని ఎండమావుల కోసం ఎగబడే ఆరాటం.. అవి అందినప్పటికీ ఎంత కాలం అందుబాటులో ఉంటాయో ఇతమిత్థంగా తేలని అభద్రతాభావన జీవితంలో ఎన్ని ఉపద్రవాలను తెచ్చి పెడుతుందో   'శ్రీదేవి విషాదాంతం '  ఉదాహరణగా చూపించి మరీ నేటి యువతరాన్ని హెచ్చరించవచ్చు . కానీ.. వీక్షకులంటే టి. ఆర్. పి రేటింగు  మినహా  రక్త మాంసాలున్న మామూలు మనుషులన్న స్పృహ   మరిచినట్లే ఉన్నాయి మన ప్రసార మాధ్యమాలు.  బుడ బుడ పొంగే స్నానాల తొట్టి నీటి అడుగులనుంచి  ఊపిరాడక గిలగిలా కొట్టుకొనే ‘రూప్ కీ రాణీ’ రూపాన్ని గ్రాఫిక్సుల ఆర్భాటంతో ప్రదర్శించడం ఎంత వరకు  టి.వి. చానెళ్లకు సమంజసం?

 శ్రీదేవి చాందినీ జీవితాన్ని   అర్థాంతరంగా ఇలా  ఓ గ్రహణం ఎందుకు మింగేసిందో?! వాస్తవాలన్నీ శాస్త్రీయ కోణంలో నిర్థారణ అయితే గానీ  ఇతమిత్థంగా ఎవరం తేల్చిచెప్పలేం. కానీ  వార్తలకు, నీలి వార్తలకు మధ్య ఆట్టే భేదం  పాటించే అలవాటు తప్పిన మన ప్రసార మాధ్యమాలు మాత్రం చెవిన పడ్డ ఏ పుక్కిట పురాణాన్నైనా చటుక్కున  ఓ వ్యాపార సరుకుగా మార్చేసుకొనే కళలో  ఆరితేరాయి. వ్యాపార ప్రాయోజితాల మీదే తప్ప  సామాజిక ప్రయోజనాల మీద దృష్టి దండగన్న దురదృష్ట ధోరణి ఇప్పటి ప్రసార మధ్యమాలలో పెరిగిపోతోందా? అమ్మ కన్నీటినయినా  అమ్మకం సరుకు చేసుకొని బతికేసే లౌల్యం క్రమంగా  పెరిగిపోతోందా? సామాజిక మాధ్యమాలకి ఎప్పుడో అంటుకొన్న   ఈ   మహమ్మారి ఇప్పుడు ప్రసార మాధ్యమాలనూ ఆక్రమించేస్తుందనిపిస్తోంది. శ్రీదేవి హఠాన్మరణం అనే ఓ అత్యంత విషాదకర సామాజిక దుర్ఘటనను  ఓ పెద్ద 'సేలబుల్' న్యూస్’ ఐటంగా మార్చి విచ్చలవిడిగా ప్రసారం చేసేటందుకు పురిగొల్పింది ఈ మహమ్మారే అనిపిస్తోంది.

ఈ వ్యాసం ఆరంభించే సమయానికి (27, ఫిబ్రవరి, 2018 ఉదయం 11 గంటలా 11 నిమిషాలు) గూగుల్ అన్వేషణ బాక్సులో 'శ్రీదేవి మరణం' అని తెలుగులో టైప్ చేస్తే కేవలం 0.52 సెకన్లలోనే 83, 200 లంకెలు సూచించబడ్డాయి.   శ్రీదేవి  మరణించడానికి కారణం .. 'గుండె పోటు'(Heart attack) గా నమోదయి కనిపించింది. కానీ ఇదే సమయానికి   తెలుగు టీవీ 24 గంటల ఛానెళ్లన్నింటిలో శ్రీదేవి దుర్మరణానికి కారణం ఆమె కుటుంబంలో ఆస్తిని  గురించి వచ్చిన పేచీలుగా ఓ వార్తా వ్యాఖ్యానం చిలవలు పలవులుగా   విస్తరించి వినిపిస్తోంది! 24వ తేదీ  నాటి మొదటి గుండె పోటు కారణానికి.. 27 వ తేదీ నాటి  కుటుంబ ఆస్తుల ఘర్షణల కారణానికి   మధ్య అంతులేనన్ని సినిమాటిక్  మలుపులతో  వార్తా కథనాలు యధేచ్చగా  ఏ ఛానెలుకు తగ్గట్లు ఆ ఛానెలు తనదైన శైలిలో వండి వారుస్తూ ప్రేక్షకుల మనోభావాలతో చెడుగుడు ఆడేసుకొన్న మాట వాస్తవం. ఒక క్రైమ్ మిస్టరీకి మించిన ఉత్కంఠను రేకెత్తించి సగటు టి.వి ప్రేక్షకుడి దృష్టి పక్క ఛానెలు వైపుకి మళ్లకుండా వార్తాఛానెళ్లు పోయిన పెడసరి పోకడలే ఇప్పుడు భావస్వేచ్చావాదులను  సైతం పునరాలోచనలో పడవేస్తున్నాయి.

వార్తా చానెళ్లు  నిరంతరాయంగా నిమిషానికో సారి  భయంకరమైన నేపథ్య సంగీతంతో,  గ్రాఫిక్స్ ఇంద్రజాలంతో ప్రదర్శించే  'బ్రేకింగ్ న్యూస్' దగ్గర  నుంచి  రెగ్యులర్ న్యూస్ బులెటన్ల చివరి స్లాట్ వరకూ ఊదర గొట్టేస్తున్న  వార్తలు అన్నింటికీ ఈ మూడున్నర రోజులూ ప్రధాన కేంద్ర బిందువు 'శ్రీదేవి' మరణ వార్త  ఒక్కటి మాత్రమే! ఏ విధంగా టి.వి. ల ఈ తెంపరితనాన్ని సమర్థించాలో  అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు  భావస్వేచ్చ కోసం నిత్యం పోరు సలిపే సమరయోధులు ఇప్పుడు.

భారత కాలమానం ప్రకారం శ్రీదేవి మరణించినట్లు వార్త బైటికి పొక్కిన 24, ఫిబ్రవరి,2018 11. 30 కి .. ఈ వ్యాసం ప్రారంభించిన సమయానికి (27, ఫిబ్రవరి,2018, ఉదయం 11 గంటలు)మధ్య దాదాపు మూడు రోజులు మించి వ్యవధానం ఉంది. 24గంటల వార్తా ఛానెళ్లు చేసే నిరంతర వార్తా ప్రసారాల ప్రకారం ఈ సుమారు 72గంటల వ్యవధిలో  స్థానికంగా కానీ, జాతీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ మరే ఇతరేతర  వార్తా ప్రాథాన్యత గల విశేషాలు అసలు సంభవించలేదనే అనుకోవాలి కాబోలు!

అన్ని ప్రధాన సంఘటనలను స్థలాభావం వల్ల ఏకరువు పెట్టడం కుదరక పోవచ్చు.  కానీ.. మచ్చుక్కి  ఓ మూడు నాలుగు రోజులు ప్రపంచాన్ని   ప్రభావితం చేసే ప్రధాన వార్తా విశేషాలు ఉటంకిస్తే వార్తాఛానళ్ల నిర్వాకం తేటతెల్లమవుతుంది. చైనా అధ్యక్ష పదవిని జిన్ పింగ్ కు శాశ్వతంగా కట్టబెట్టేటందుకు రాజ్యాంగ నిబంధనకు సవరణలు చేసేందుకు తీర్మానం జరిగింది ఈ మూడు రోజుల్లోనే. జాతీయ స్థాయిలో.. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారి  మరాఠీ చట్టసభ సభ్యులకు అనువాద పాఠం అందచేయకుండా  గవర్నర్  మరాఠీ భాషా దినోత్సవానికి ఒక రోజు ముందు బడ్జెట్ ప్రసంగం చదవడం పెద్ద రాధ్ధాంతానికి దారి తీసింది. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయి.. భారీ పోలింగుతో ముగిసాయి. ఈ వ్యాసం రాసే రోజునే రాజకీయాలలో నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నారా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రవేశ దినోత్సవం.  'తగిన మద్దతు ఇవ్వని పక్షంలో రైతాంగం యావత్తునీ కలుపుకొని కేంద్ర రాజధానిలో ఆందోళన చేసేందుకైనా సిద్ధమ'ని తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ కుండబద్దలు కొట్టిన రాజకీయ పరిణామం జరిగిందీ ఈ వ్యవధానంలోనే. ఇవేవీ మన తెలుగు వార్తా ఛానళ్లలో చాలా వాటికి అంతగా ప్రాథాన్యమివ్వదగ్గ   వార్తాంశాలుగా తోచలేదు!   శ్రీదేవి మరణ కథనాలు వండి వార్చేందుకే 24 గంటలు సమయం చాలక తన్నుకు లాడుతున్న నేపథ్యంలో విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం ఎట్లా సాధ్యమవుతుంది .. అనిపించినట్లుంది తెలుగు వార్తా ఛానెళ్లలోని అధిక శాతానికి.

సమయం కేటాయింపులోనే కాదు  ప్రసారం చేసే విధానాలలోనూ వార్తా ఛానెళ్లు ప్రదర్శిస్తున్న పోకళ్లకు నోళ్లు వెళ్లబెట్టేస్తున్నారు ఆలోచనాపరులందరూ. శ్రీదేవి హఠాన్మరణ వార్త ఎంతటి కసాయి గుండెనైనా  కంట తడి పెట్టించే తీరులో ఉంది. సందేహం లేదు.  కానీ అంతటి దిగ్భ్రాంతికర దురదృష్ట సంఘటన వార్తగా ప్రసారమయే సందర్భంలోనూ ఆ అభినేత్రి వృత్తిపరంగా తాను  ప్రారంభ దశలో  వానలో తడిదుస్తుల్లో  వేసిన చిందులు పదే పదే టి వి తెర నిండుగా  ప్రదర్మించి    అభిమానుల మనోభావాలను కించపరచడం ఎంత అమానవీయమో ఛానెళ్ల నిర్వాహకులు ఆలోచించినట్లు లేదు.

వార్తలను వార్తలుగా చదివే విధానానికి టి వి ఛానెళ్లు స్వస్తి  పలికి చానాళ్లే అయింది . కర్ణాకర్ణిగా వినవచ్చే ఊసుపోని కబుర్లే ఇప్పుడు టి.వి. ప్రేక్షకులను అలరించే మసాలా దినుసులు. ఒకప్పటి    పేరు మోసిన దర్శకుడు  పదుగురి నోళ్లలో నలగడమే పనిగా పెట్టుకొని   పద్దాకా చేసే అసందర్భ ప్రేలాపనలను  ప్రముఖంగా ప్రసారం చేయడం  సున్నిత మనస్కులను ఎంతగా చీదర గొల్పుతున్నాయో టి.వి ఛానెళ్ల బాధ్యులకు  అర్థమవుతుందా?

నగ్న చిత్రాల నిర్మాణాన్ని బహిరంగంగా పట్టపగలే చర్చకు పెట్టి సమర్థించే వారికి టి.వి ప్రసారాలలో చోటివ్వడాన్ని మహిళా మండళ్లు ఇప్పుడు బహిరంగానే తప్పు పడుతున్నాయి.  పోలీసు స్టేషన్ల వరకు కేసులు ఈడ్చుకు వెళుతున్నాయి. తమకూ సమాజం పట్ల ఒక  బాధ్యత  తప్పక ఉంటుదన్న స్పృహ ప్రసార మాధ్యమాలకే ఉండి ఉంటే పరిస్థితులు ఇప్పుడింతగా దిగజారుండేవా?! అన్నింటికీ పరాకాష్ట    ఈ మూడు నాలుగు రోజుల బట్టి  మంచినటి శ్రీదేవి దురదృష్టకరమైన అర్థాంతర అనుమానాస్పదమైన మరణం మీద నిరంతరాయంగా కొనసాగుతున్న టి.వి ప్రసార మాధ్యమాల తీరు!  ఏ ఆధారాలూ దొరక్క పోయినా..  కేవలం ఊహపోహల ఆధారంగా  ఊసుపోని పోచికోలు  కథనాలను ఆపకుండా ప్రసారం చేస్తూ ప్రేక్షకుల విలువైన 'వాచింగ్ టైమ్ 'ను వృథా చేస్తున్నందుకు  టి.వి. వార్తా ఛానెళ్లను గట్టిగా నిలదీయవలసిన అవసరం ఇప్పుడు మునుపటి కన్న   మరింతగా పెరిగింది. అనారోగ్యకరంగా ప్రసార మాధ్యమాల  నడుస్తున్న స్పర్థను తిలకిస్తున్న వారంతా చిత్రాలకు మల్లే టి వి ప్రసారాలకూ ఖచ్చితంగా ఒక నియంత్రణా వ్యవస్థ తక్షణమే అవసరమన్న అభిప్రాయానికి వచ్చేసారు.

వినోద విజ్ఞానాలు జన సామాన్యానికి అందించే పుస్తకాల స్థానే ప్రస్తుతం  అంతర్జాలం.. దానికన్నా ముందు టి వి మాధ్యమం  ఆక్రమించాయి. సమాజాన్ని చైతన్య పరచే బాధ్యత గతానికి మించి  ఇప్పుడు మరింత అధికంగా ఉన్న నేపథ్యంలో టి వి  నిర్వాహకుల హద్దులు దాటుతున్న ప్రసార పద్ధతులు ప్రజాహిత వాదులందరినీ కలవరానికి గురి చేయడంలో అసహజమేమున్నది!

నిర్ధారణ కాని అంశాల చుట్టూ ఆసక్తికరమైన కథనాలు అల్లే ఆత్రుతలో టి వి ఛానెళ్లు చేస్తున్న  పొరపాట్లు చాలా సందర్భాలలో ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మరెన్నో సమయాల్లో మనస్తాపానికీ దారి తీయిస్తున్నాయి. శ్రీదేవి హఠాన్మరణ విషాద వార్త ప్రసారం చేస్తూనే ఆ సంఘటనకు రెండు రోజుల ముందు నాటి పెళ్లి వేడుకల్లోని ఆమె ఆటపాటలను కలిపి చూపించడం ఆ మహానటి అభిమానుల మనోభావాలను ఎంతలా కుంగదీస్తుందో ఏ ఒక్క ఛానెలూ పట్టించుకున్నట్లు లేదు!

వీక్షకుల  మనోభావాలతో యధేచ్చగా ఆడుకోవడమే తమ భావ ప్రకటనా స్వేచ్చగా టి.వి ప్రసార మాధ్యమాలు భావిస్తున్నాయా?  సమాజాన్ని, వ్యవస్థలని అత్యంత బలంగా ప్రభావితం చేసే ప్రధాన శక్తులలో చిత్రాలకు మించి  ముందుండేది ఇడియట్ బాక్స్.. టి.వి!

భావస్వేచ్చంటే  యధేచ్చగా  వ్యవహరించడమని టి.వి ప్రసారాల నిర్వాకులు అపోహపడుతున్నారు. దానినీ సరిదిద్ద వలసిన బాధ్యత   బావ ప్రకటనా స్వేచ్చ  ప్రగాఢంగా కాంక్షించే  ప్రజాస్వేచ్చావాదులే  తమ భుజస్కంధాల మీదకు  తిరిగి   తీసుకోవలసిన తరుణం ఆసన్నమయింది.
- కర్లపాలెం హనుమంతరావు
బోథెల్ ; యూఎస్
karlapalwm2010@gmail.com
WhatsApp +918142283676
***(మనం - దినపత్రిక ప్రచురితం )

Wednesday, December 4, 2019

‘ధర్మా’గ్రహం -కర్లపాలెం హనుమంతరావు




బాబ్రీ మసీదు కూల్చివేత పట్టపగలు.. కొద్ది మంది  మతవాదుల  దుందుడుకు ఆగడం. రాజ్యాంగ అధికరణం 370 రద్దు ప్రజాస్వామ్య ప్రభుత్వ అర్థరాత్రి అతిరహస్య  ఎత్తుగడ. రెండు ఘటనలకు ఎన్ని సమర్థనలో.. అంతకు మించి ఖండనలు! చారిత్రిక తప్పిదాలను సరిదిద్దిన సాహసోపేత సంస్కరణలుగా సంఘ్ పరివార్, వారి తైనాతీల వాదనగా ఉంటే.. మతాతీత దేశానికి అతకని ముతక పోకడలుగా  ప్రజాస్వామ్యవాదుల నిరసన!   ఒక కూల్చివేత  ఘటన పూర్వాపరాలు పంథొమ్మిది వందల తొంభై నాటి వాతావరణానికి ప్రతీక. మరో కొట్టివేత సన్నివేశం వెనుకా ముందు నాటి పరిస్థితులు రెండువేల పంథొమ్మిది నాటి  స్థితిగతులకు నిదర్శనం. మధ్య ఉన్న దాదాపు మూడు దశాబ్దాల కాలంలో దేశం ‘మూడ్’ ఏ విధంగా మారిందన్నది  చరిత్ర పరిశోధకులలో ఆసక్తి ర్రేకెత్తించే అంశం.  
బాబ్రీ మసీదు కూల్చివేత  నాటికి ధర్మకుమార్ దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ఎకనామిక్స్ ప్రొఫెసర్. హిందూ మితవాదం, కమ్యూనిష్టు భావజాలం.. రెండిటి పట్లా ఒకే తరహా వైఖరి ఆ స్త్రీ మేధావిది. ఒక మతానికి చెందిన ప్రార్థనాలయం మరో మతవాదుల మూకచేష్టల కారణంగా కూలడం సహజంగానే మతసామరస్యం కాంక్షించే ఆ విద్యాధికురాలి మదిలో ఆవేదన రగిలించింది.   కూల్చివేత  ఘటనపై అప్పటికప్పుడు ఒకానొక ప్రముఖ దినపత్రిక మొదటి పుటలో  ఓ సుదీర్ఘ ప్రకటన రూపంలో స్పందించారా చైతన్యశీలి. ‘మరో ప్రార్థనాలయం కూల్చివేత హిందూ స్వాభిమానాన్ని  ఏ విధంగా పునరుద్ధరిస్తుందో ముందు తేలాలి. జాతిగౌరవం ఏ మోతాదున పెరుగుతుందో, దేశ సమగ్రత ఏ తీరున పటిష్టమవుతుందో  వివరించాలి!' అంటూ  విధ్వంసకారుడిని నేరుగా నిలదీస్తూ సాగే ఆ నిరసనలో ఆద్యంతం నిండి ఉన్నది ఆనాటి సగటు భారతీయుడి మదిలో ర్రగిలే ఆందోళనే. మత ప్రాధాన్యత అధికంగా ఉండే  సున్నిత అంశాలు కొన్నింటి పట్ల  ప్రదర్శించే దురుసుతనం దేశ అస్థిరతను  మరంతగా విస్తరిస్తుందని,  ప్రపంచం ముందు ప్రజాస్వామ్య దేశానికి తలవంపులు తెస్తుందని, భావితరాల జీవితాలలో వృథా ఉద్రిక్తతలను  పెంచుతుంద’ని ఆ ప్రొఫెసర్ ఆవేదన.    నిరసనతో కలగలసిన ఆ ఆవేదన ధర్మకుమార్ ఎంతో ధైర్యసాహసాలతో బహిర్గతం చేయడం  ఆనాటి ప్రజాస్వామిక స్వేఛ్ఛాయుత వాతావరణానికి సంకేతంగా భావిస్తే తప్పేముంది?  మొదటి పుట నిండా నలుపు రంగు పులుముకొని పైన  తెల్లటి అక్షరాలతో కొట్టవచ్చినట్లుగా ఓ నిరసన ప్రముఖ దినపత్రికలో  దర్శనమివ్వడం ఈ కాలపు రాజకీయ  విలువల దృష్ట్యా నిజంగా ఓ అద్భుతమే.  
ఆ ప్రకటనకు మద్దతుగా  అప్పటి  మేధోవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, బ్యురోక్రాట్లు, పాత్రికేయులు, వివిధ రంగాలలో  పేరొందిన ప్రముఖులు ఎందరో మద్దతుగా నిలవడం,  పంథొమ్మిది మంది ప్రముఖుల సంతకాలతో  ఆ నిరసన  ప్రకటన వెలువడడం పెద్ద చర్చకు దారి తీసిందంటారు అప్పట్లో.  ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ ఐ.జి.పటేల్ నుంచి మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కె.సుందర్ జీ వరకు  సంతకాలు చేసినవారంతా నాటి సమాజం దృష్టిలో  ఎంతో విశ్వసనీయులు! ఖర్చులు భరించి  తానే జారీ చేసిన ప్రకటన కాబట్టి ధర్మకుమార్  విలువలకు కట్టుబడి స్వయంగా సంతకం చేసారుకాదు.  సంతకాలు చేసిన ప్రముఖులలో ఆర్.పి.గోయెంకా, రాజ్ త్యాగరాజన్, దేశ్ బంధు గుప్తా వంటి వ్యాపార దిగ్గజాలూ కనిపించడం ఏ విధంగా  సాధ్యమయింది?! ఈ కాలం తరహాలో ధర్మకుమార్  ధర్మాగ్రహం ఏ హిప్పీ కటింగ్  కమ్యూనిష్ట్ చిల్లర 'కుట్టుపని' కిందనో ఎందుకు వెక్కిరింతలకు గురికాలేదు?! గత మూడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలను నడిపించిన  పాలక పార్టీల దృక్పథాలలో క్రమంగా వస్తోన్న మార్పుల నుంచే ఈ సందేహాలకు సరైన సమాధానాలు దొరికేది.
మూడు దశాబ్దాలకు మూడేళ్లు ముందు ప్రస్తుతం నడుస్తున్న 2019, అగష్టు, 5 సోమవారం భారత  రాజ్యాంగం కశ్మీరు లోయ వాసులకని  ప్రసాదించిన  స్వయంప్రతిపత్తి సౌకర్యానికి గండి కొడుతూ  ఆర్టికల్ 370 అర్థరాత్రి నిశ్శబ్దంగా నిర్వీర్యమయింది! స్వీయపాలన ‘వద్దు.. మాక’ని స్థానికుల నుంచి కించిత్తైనా వత్తిడులు లేవు. అధికరణ కారణంగా బాధితులం అవుతున్నట్లు ఏ వర్గ సమూహపు మొత్తుకొళ్ళూ వినిపించవు! ప్రజలిచ్చిన అధికారం  ఒక్కటే పాలకపక్ష అప్రజాస్వామ్య చేష్టలకు  ఊతం! నాటి ఎకనామిక్స్ ప్రొఫెసర్ ధర్మకుమార్ దారిలోనే నేడూ ప్రజావ్యవస్థలకు రక్షణగా నిలబడ్డదలచినవారు   మీడియా  ముందుకొచ్చి   ధైర్యంగా  ప్రశ్నిస్తేనో? ప్రశ్నల పర్యవసానాల సంగతి పక్కనుంచి..   ప్రశ్నించే పరిస్థితులు  దేశంలో  అసలు ఎంత వరకు బతికున్నాయన్నదే ప్రస్తుతం ప్రధానంగా   ముందుకొస్తున్న  ప్రశ్న.
ప్రజాస్వామ్య పంథాకి పెడగా ప్రభుత్వాల అడుగులు పడుతున్న ప్రతిసార్రీ గల్లాపట్టుకు  నిలదీసే గుండె నిబ్బరం  కోటికి ఎక్కడో ఒకరికైనా ఉందా? ఉందనే మాట వరుసకు అనుకుందాం. ధర్మకుమార్  దారిలోనే వారి చేతా   నిరసన పత్రమొకటి తయారయితేనో?!  'దేశభక్తులంతా తప్పక ఆలోచించాలి. కేవలం రాజ్యాంగ అధికరణ 370 రద్దు చర్యతోనే  మన జనస్వామ్య వ్యవస్థలన్నీ సుదృఢవుతాయని నమ్ముతున్నారా? సమస్యకు  సంబంధించిన ఎరినీ విశ్వాసంలోకి తీసుకోని రద్ధుసంస్కరణ దేశ ఉద్రిక్తతలకు  తగ్గ మందుగా మీరు  భావిస్తున్నారా? అదే వాస్తవమయితే మతాతీత కులాతీత ప్రజాస్వామ్య భూమిక పై నిర్మితమైనదిగా జాతి గౌరవించే దేశ రాజ్యాంగం  నిజానికి అప్రజాస్వామికమైనదని  మీరు ఒప్పుకున్నట్లే!  దేశం ఓ మూల  భూభాగానికి మాత్రమే  ప్రత్యేక   రక్షణ కవచాలు అందించడం అంటే   అఖండ భారతావని సార్వబౌమికతను కించపరిచిందన్నట్లేగా రాజ్యాంగం మీద మీ ఆరోపణ? కశ్మీరు లోయ  స్వయంప్రతిపత్తి పట్ల  ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించడమంటే అఖిల భారతావని  ఇతర భాగాల   బాగోగులపై  ఇసుమంతైనా శ్రద్ధ  రాజ్యాంగానికి  లేదన్నట్లేగా మీ ఫిర్యాదు?' తరహాలో సాగే ఆ నిలదీత పత్రం   ప్రముఖ దినపత్రిక ప్రథమ పుటలో ప్రచురించడానికి సిద్ధమయితేనో?  ఖర్చులకని  యాచిస్తే గుప్తంగా మద్దతిచ్చే విజ్ఞులకు ఇప్పుడూ పెద్ద కొదవేమీ ఉండబోదు. కానీ సర్కారును ఇరుకున పెట్టే ఏ  ‘డిస్సెంట్ నోట్’ పైనా పెన్ను పెట్టి ‘సైన్’ కొట్టే దమ్ము ధర్మకుమార్ కాలంలో మాదిరి ఇప్పుడు ఎంతమంది బిగ్-బాసులకుంది?’ అదే బిలియన్ డాలర్స్ ప్రశ్న ప్రస్తుతం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా   విశ్వ విపణి వీధులనేలే భారతీయ కుబేరులలో ఎందరో నిజానికి  ఉదారభావాలకు పెట్టింది పేరు. ప్రజాస్వామ్య పంథాట్లా వారికుండే  అచంచల విశ్వాసం సాధారణ పౌరుల అంచనాలకు అందేవికావు.  ఆర్టికల్ 370 వంటి పాక్షిక లాభాలు చేకూరే రాజ్యాంగ అధికరణల పట్ల ప్రముఖులందరికీ   ఒకే తరహా  అభిప్రాయం ఉండకపోవచ్చు. అందుకు తప్పు పట్టలేం.  చట్టాల పట్ల కన్నా.. ఈ తరహా  బిల్లుల ఆమోద తిరస్కారాలకై చట్టసభలు నడుస్తున్న తీరు మీదనే ఎందరో ప్రముఖులకు  బాహాటంగా చెప్పలేని బాధా.. ఆందోళన. పాలకవర్గ రాజకీయ ప్రేరిత  ప్రణాళికల కార్యాచారణ విధానాలను అంతర్గత సంభాషణలలో  ఎంతగా తూర్పారపట్టినా బహిరంగంగా  మాత్రం  తటస్థ వైఖరి తీసుకోక తప్పని దుస్థితి కొందరు పెద్దలది. పరిథి మీరి మరీ వత్తాసుకు పోక తప్పని ఒత్తిళ్లు మరి కొందరు వ్యాపారప్రముఖులవి. సంపూర్ణ మౌనమే సర్వదా శ్రేయస్కరంగా భావించి ఓ నమస్కారబాణంతో సరిపుచ్చుకునే సంపన్నుల సంఖ్యే ప్రస్తుతం దేశంలో ఎక్కువ!  కారణం;   ఆర్టికల్ 370ద్దులోనే లేదు.  గద్దె ఎక్కిన పార్టీల ప్రాయోజిత సర్దుబాట్లు సంస్కరణల ముసుగులో మరెన్నో ముందు ముందుకు తోసుకుని వచ్చే  కొత్త తరహా వాతావరణానికి   2019 నాంది కావడంలో ఉంది.    
సంతకాలకై ధర్మకుమార్  సంప్రతించిన నాడు .. కేవలం ఒక నిరసన పత్రం పైన  పొట్టిసంతకం గిలికిన కారణానే తమ అండన బతికే వేలాదిమంది రోడ్డున పడరన్న ధీమా  భరత్ రామ్, లలిత్ థాపర్ వంటి పరిశ్రమల పోషకుల గుండెల నిండుగా ఉండిన పంథొమ్మిది వందల తొంభై రెండులు…
అదే మాదిరి గుండె నిబ్బరం మాజీ ఆర్థికశాఖామాత్యులైన శ్రీమాన్ చిదంబరానికే ఉండని    రెండువేల పంథొమ్మిదులు…
దాదాపు  మూడు దశాబ్దాల మధ్యన పరుచుకున్న దేశ రాజకీయ, పాలనా వ్యవస్థల పని తీరుల్లో కనిపిస్తున్న మార్పులను గమనిస్తే  దేశం ‘మూడ్’  ‘బ్యాడ్ టు వర్స్ట్’ దిశగా ఎంత  వేగంతో దిగజారుతున్నదో తెలిసి దిగులవుతున్నది ప్రజాస్వామ్య వికాసం పట్ల ఎంతటి ఆశావహ దృక్పథం గల దేశభక్తులకైనా!
 కంటి  ముందు  జరిగే   ర్థిక దాడులు, కుంటి సాకులు ఇరికించే  అక్రమ  నేరాల కేసులు, ఊహించేందుకైనా భీతి గొలిపే ఉపద్రవాలు ఇంకెన్ని ఏ సందు గొందుల నుంచి ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నవో అంతుపట్టని ఉగ్ర వాతావరణం మధ్యన నేటి దేశం  అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నది మరి!  లోయకోని జాతులే కాదు.. దేశంలోని అన్ని తరగతులు ఒక్కో తీరున  ఒకనాటి దేశ అత్యయిక పరిస్థితులను దాటి శిక్షల గదుల్లో మగ్గుతున్నాయి.
‘ప్రజాస్వామ్యం పట్ల ఎంతటి ప్రగాఢ విశ్వాసమున్నప్పటికీ  ఉదారవాదం ఆచరణలో సదా ఓ మిథ్య మాత్రమే’  అని భావి తరాలు సైతం ఒక   శాశ్వత నిరాశ భావన లోనికి జారక ముందే మందలు మందలుగా మరెంతో మంది ప్రొఫెసర్ ధర్మకుమార్ లు అందుకే  పుట్టుకు రావాలసుంది.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక- సంపాదకీయ పుట వ్యాసం)
***




























    

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...