'కొత్త సిద్ధాంతం కనుక్కున్నానోచ్!' అన్నాడు సుబ్బారాయుడు. సిద్ధాంతాలు కనుక్కోడంలో అతగాడు సిద్ధహస్తుడు. సుబ్బారాయుడి సిద్ధాంతం కనుక్కునే ముందు సుబ్బారాయుణ్ణి గురించి తెలుసుకోడం ముఖ్యం.
ఏడేళ్లు
రెవిన్యూ డిపార్ట్ మెంటులో మమేకమై పనిచేసిన అనుభవంతో సుబ్బారాయుడు ఆ మధ్య ఓ చివిత్రమైన
యంత్రం కనుకున్నాడు. అది అప్పట్లో గొప్ప సంచలనమే కాదు.. సుబ్బారాయుడి స్థానచలనానికీ
కారణమయింది.
గవర్నమెంటాఫీసన్న
తరువాత పదిరకాల మనుషులు వచ్చిపోతుంటారు. ఎవరు నిజంగా మంత్రిగారి బంధువో, ఎవరు కాంట్రాక్టర్ సర్కిల్లో తిరిగే మనిషో,
ఎవరు కోన్ కిస్కా గొట్టాంగాడో .. పెదవి విప్పకుండానే పసిగట్టే
యంత్రమది. పార్టీ వచ్చి ఎదుటి సీట్లో కూర్చోగానే దాని మనసు, పరసు
కూడా ఇట్టే వాసనపట్టేయడమే దాని స్పెషాలిటీ.
ప్రయోగాత్మకంగా
దాన్ని తన సీటుకు పెట్టుకున్న పూటే ఆకస్మిక తనిఖీకి వచ్చిపద్డారు సంబంధిత మంత్రి.
ఆయన సరాసరి వచ్చి సుబ్బారాయుడు ఎదర సీట్లోనే అధిష్ఠించారు. మంత్రిగారని
యంత్రానికేం ఎరిక? జేబులు తడుముతూ వీడియోలో
పడ్డం.. వెంటనే సుబ్బారాయుడి ఉద్యోగం ఊడ్డం.. అంతిమ ఫలితం.
ఆ సాయంత్రమే
మంత్రిగారు పిలిపించుకుని తనను, యంత్రాన్ని తన వ్యక్తిగత కార్యాలయంలో
నియోగించుకున్నట్లు సుబ్బారాయుడు చెబుతుంటాడస్తమానం. మంత్రిగారి మంత్రాంగం బృందంలో
చేరిం తరువాత యంత్రాల పని మాని.. సూత్రాలు కనిపెట్టే రంధిలో పడ్డాడు సుబ్బారాయుడు.
'ఒక్కటిగా కనిపించేది ఏదీ ఒక్కటి కాదు'- అదీ
సుబ్బారాయుడి కొత్త సిద్ధాంతం ఈసారి.
'మరెన్ని?' అడిగానో రోజు మా ఇంటికి మాటా మంతికని
వచ్చి కూర్చున్నప్పుడు.
'రెండు.. అంతకు మించి ఎన్నైనా కావచ్చు'
'అదెలాగా?!'
నా జేబులోంచి
ఓ వంద నోటు తీసుకుని 'ఇదెంత?' అనడిగాడు
సుబ్బారాయుడు.
'వంద'
'కాదు.. రెండు యాభైలు..' అంటూ తనజేబులో
పెట్టుకున్నాడు.
కాదనేందుకేం
లేకపోయింది. లాజిక్ అలా కుదిరింది. ఇంతలో మా పాప శిరీష వచ్చి మంచి నీళ్ళిచ్చింది. 'పిల్లలెంత మంది?' అనడిగాడు
మళ్ళీ.
'ఈ పిల్ల ఒక్కతే!' అన్నా బిక్కుబిక్కుమంటూ.
'కాదు.. ఇద్దరూ!' అనేశాడు వెంటనే. 'పాపా! నువ్వు నాన్న కూతురివా? అమ్మ కూతురివా?'
అని పాపనే అడిగేడు.
'ఇద్దరి కూతుర్నీ' అందది ముద్దుగా.
'చూశావా! నాన్న కూతురు శిరీషా, అమ్మ కూతురు శిరీషా'
అన్నాడు సుబ్బారాయుడు.
'నమస్తే! అన్నయ్యగారూ!' అంటూ కాఫీ కప్పులు
తీసుకెళ్లేందుకని వచ్చింది మా శ్రీమతి. 'నీ కిద్దరు పెళ్లాలు'
అని ఎక్కడంటాడోనని ముందే జాగ్రత్త పడి వాడిని బైటకు తీసుకొచ్చేశా వెంటనే..
బస్సెక్కించడానికి.
దారి
పొడుగూతా వాడు ద్వైత సిద్ధాంతాన్ని
గురించి బాధిస్తూనే ఉన్నాడు.
'సమస్త విశ్వాన్నీ అక్రమించిన సర్వేశ్వరుడు ఒకడైతే.. బూజుపట్టిన పూజగదిలో
ముక్కవాసన గొట్టే అగరొత్తులు పీలుస్తూ గోడకు చేరగిలబడిన సర్వేశ్వరుడు ఇంకొకడు.
గుజరాత్ ఘోరం విని కన్నీళ్లు పెట్టుకుని కవిత్వం రాసిన వాజ్ పేయీ ఒకరైతే, మోదీ పాలన బ్రహ్మాండంగా సాగుతోందని పార్లమెంటు సాక్షిగా వాదించే వాజ్ పేయీ
మరొకరు. 'యుద్ధానికి సిద్ధం' అనే
ముష్రఫ్ ఒకరైతే, 'శాంతి చర్చలకు వస్తాం' అనే ముష్రఫ్ మరొకరు. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బుష్.. పాకిస్తాన్ లో మరో బుష్.
ఇలా ప్రపంచమంతా ద్వైతంతో ఎందుకు నిండి వుందో తెలుసునా?' అనడిగాడు
నా స్కూటర్ వెనక నుంచి దిగిపోతూ.
దూరంగా
అతగాడెళ్లాల్సిన బస్సు వస్తూ కనిపించింది. అయినా వదలడు కదా!
'పులీ మేకా; పామూ ముంగిసాల్లాంటి శత్రువులను
సృష్టించిన బ్రహ్మదేవుడికి మనిషిని సృష్టించే వేళకు నిద్ర ముంచుకొచ్చింది. అప్పటికే
బాగా నైటయింది. 'లైటార్పి ఇహ పడుకోండీ!' అంటూ పక్కన సరస్వతీదేవి సతాయింపొకటి. ఆ చికాకులో మతిమరుపు మహాశయుడు
బ్రహ్మయ్య మనిషిని రెండు సార్లు తయారు చేసేశాడు. తెల్లారి లేచి చూసుకున్న తరువాత
గానీ తాను చేసిన తప్పు తెలిసిరాలేదు. సృష్టించడం తప్పించి నాశనం చేసే పని
బ్రహ్మయ్యకు చేతకాదు కదా. అంచేత రెండింటినీ కలిపి ముద్దచేసి భూమ్మీదకు విసిరేశాడు.
అందుకే మన భూమ్మీది మనుషులెప్పుడూ రెండుగా కనిపిస్తారు. రెండు సోనియమ్మలు, రెండు మోదీలు, రెండు నువ్వూలు.. రెండూ నేనూలూ..'
అంటూ బస్సెక్కేశాడు.
అదే ఆఖరు
చూపనుకుంటా నా వరకూ.
మొన్న పెద్ద
బజార్లో గోడ మీద పెద్ద వాల్ పోస్టరొకటి కనిపించిందట మా శ్రీమతికి. 'స్వామి వైవిధ్యానందులవారి ప్రవచనములు'
అన్న దాని పక్కనున్న ఫోటో శాల్తీకి గడ్డం, మీసాలు
లేకుంటే అచ్చం మీ సుబ్బారాయుడేనండీ!' అంది మా ఆవిడ ఇంటికి
తిరిగొచ్చిం తరువాత.
సొంత
పెళ్ళాన్ని పట్టుకుని ద్వైతం మత్తులో 'నీ కిద్దరు మొగుళ్లు’ అన్నాట్ట ఇంట్లో ఓ రోజు! ఆవిడగారు చీపురు కట్ట
తిరిగేసింది. అప్పట్నుంచి అదే పోత.. పోత!
అర్నెల్ల తరువాత స్వామి వైవిధ్యానందులవారి అవతారంలో తిరిగి ప్రత్యక్షమయాట్ట! ఈ మధ్యన ప్రవచనాలూ.. అవీ ఇస్తూ
మస్తు ప్రచారంలోకి వచ్చేశాట్టలేండి!
'మీరూ ఓ సారి వెళ్లి కల్సి రారాదూ!
మంత్రులూ, ఎం.పీలతొ కలివిడిగా తిరిగే మనిషి.. మనకూ ఎందుకైనా
పనికొస్తాడు ముందు ముందు' అనింట్లో ఒహటే పోరుపెడుతుంటే ..
అదీ నిజమేననిపించింది నాక్కూడా. సాయంత్రం
ఆ సభ జరిగే వైపుకు వెళ్లాను.
అనివార్యకారణాల
వల్ల సభ వాయిదా పడిందని బైట బోర్డు!
మర్నాడు
పేపరు చూస్తే గానీ తెలిసింది కాదు.. ఆ అనివార్య కారణాల కథా కమామిషేంటో! వారణాసి నుంచి
వేంచేస్తో వైవిధ్యానందులవారు యూపీ ఎం.పి పాసు మీద
శిష్యగణంతో సహా పట్టుబడిపోయారుట! అదే సమయంలో సదరు గౌరవనీయులైన
ఎం.పీగారు లోకసభలో బెంచీ మీద కూడా
గుర్రుకొడుతూ కెమేరాలకు చిక్కడంతో.. టీవీలు లైవ్ ప్రసారాలతో ఆడుకున్నాయి. ఆ వత్తిడి కారణంగా స్వామివారిని స్టేషన్ రూములోనే
నిర్బంధించక తప్పింది కాదని .. భక్తశ్రేణికి రైల్వేవారి వినయపూర్వకమైన ప్రకటనోటి
వెలువడింది!
ద్వైత సిద్ధాంత మర్మాలను గురించి
స్వామివారు బోధపరచపోతే రెండు శాల్తీలకూ పెనాల్టీలు కట్టమని కూర్చున్నాట్ట నాస్తిక కుర్ర టీ.సీ. బోర్డు అధికారుల బుర్రలకు ద్వైత సిద్ధాంత సారం
బాగా పట్టించేదాకా స్వామి వైవిధ్యానందులవారికి రైల్వేవారి సెల్లే వసతి గృహం
కాబోలు!
'అయ్యొ రాతా! దానికోసం గానూ సభెందుకండీ వాయిదా? ఒక
స్వామి సెల్లులో ఉన్నా మరో
స్వామి
ప్రవచనాలకు వచ్చి పోవచ్చుగదా?' అంది మా
శ్రీమతి ఎంతో విశ్వాసంగా.
-కర్లపాలెం
హనుమంతరావు
(ఈనాడు -
సంపాదకీయ పుట తేదీ. 02, అక్టోబర్, 2002న- ప్రచురితం)