Showing posts with label elegy. Show all posts
Showing posts with label elegy. Show all posts

Saturday, February 13, 2016

మళ్ళీ 'దోడ తిత్తివా!' అని ఆ సారు అడిగితే వినాలనుంది!


ఈతిబాధలు ఎప్పుడు ఉండేవే! నీతిబోధలూ ఎప్పుడూ ఉండేవే!  ఈతిరీతిని  నిలదీసే పలుకులకు ములుకురాగాలు చెక్కి   అరుణ్ సాగర్ సారుకి మల్లే సంధించగల విలుకాడు మళ్లీ ఎన్నటికి దొరికేనో!
మేల్ కొలుపులో కోలుపోతను కలిపి.. భోరుమనే  జాలిఅక్షరాలెన్నింటినో  కుండపోతగా కురిసి.. గుండెల్ని ముంచెత్తెయ్యడం ఎంతమందికి తెలుసో తెలీదు! అరుణ్ సాగర్ సారుకి తెలుసన్న మాట మాత్రం తెలుసు. 
ఆ జడివానల్లో తడిసి ముద్దైన ఓ నాటి ఎన్నటికీ మరుపురాని  ఆ తీపిచేదు ముంపుఅనుభవాల సాక్షికంగా  అనుకుంటున్న మాటలివన్నీ.
ఒక్కసారా సార్! 
పచ్చదనమంతా ఆవిరయి.. మబ్బుదేవుడు విదిల్చే ఆ ఒక్కవాన చినుక్కోసం  ఒంటికాలి జపంచేసే.. మోడుముని మాదిరి.. ఎన్ని లక్షణ క్షణాలు తపించిపోయిందో   పిచ్చి మనసు!  
తప్పిపోయిన తల్లిని  ముక్కుపచ్చలారని బిడ్డ సంతలోపడి వెక్కివెక్కి ఏడుస్తూ వెదుక్కొన్నట్లు!
ఆ అరుణ సాగరంనుంచి ఆవిర్లై లేచి గాలిమబ్బు ముసుగులో సాగొచ్చి   బీడుదాహం తీర్చింది  వట్టి నీటిచుక్కే అయుంటే ఈ ఏడుపంతా ఇప్పుడెందుకు! 
శిశిరంలో పరిసరాలు  బరిబెత్తలు కావడం.. 
వసంతుడలా విలాసంగా వచ్చి యధావిధి  పచ్చడాలు  కప్పిపోయే ఇచ్చకాల  విధాయకాల కాలచట్రానికి చిక్కి ముక్కే చమత్కారాలో .. సత్కారాలో కాదు! గాడిదగుడ్డు కారాలు అంతకన్నా కానే   కాదింతా! 
నాలుగు మెతుకులు కతికిన ఎద సొద!

ఖాళీ కడుపుతో నకనకలాడుతూ వీధులవెంట వెర్రిగా తిరిగే రోజుల్లో  ఆ సారు  ఇంటి వసారా గుప్పెడు మెతుకులూ  పొట్ట నింపాయి. 
ఆ ఇంటికబళం ఒక్కమెతుకు వాసనకే ఓ పూటంతా  మిఠాయిదుకాణం సరుకు  వెగటనిపించేది! 
ఆ దొడ్డయ్య ఏం పెట్టి  వండుతాడో! తిన్నదంతా వంటికా పట్టింది! 
ఆత్మగుజ్జుకు అంటుకున్న ఆ మెతుకుల రుచయ్యా! మరుపుకెలా వస్తుంది.. ఊపిరిలో ఉత్సాహం చచ్చుబడిందాకా!
మాయదారి కాలం! 
ఉన్న కాసిన్ని మంచిమనసుల్ని ఇలా ఆత్మనాలికమీద గీకి  
'హుఫ్ .. కాకి!' అంటూ  ఇప్పుడు అర్థాంతరంగా దాచేయడం ఏమిటి! 
ఇదేం ఆట.. !
మళ్లీ మా అరుణ్ సాగర్ మాట వినాలనుంది! 
'దోడ తిత్తివా!' అంటూ ఆ సారు  మూలవాసుల యాసలో పలకరిస్తుంటే 
చెవులు రిక్కించి మరీ వినాలనుంది! 
కుదరదా! 
అయినా 
రెక్కీఅయినా నిర్వహించకుండా   
కర్కశంగా ఇలా రెక్కుచ్చుకుని మంచివాళ్ళనే లాక్కుపోవడమేమిటి
కాలమా! 
నీ సాడిజం మరోసారి రుజువయింది!
ఈ హేట్ యూ 
యాజ్ లాంగ్ యాజ్ ఐ లవ్ అవర్  అరుణ్ సాగర్ సార్!

***
(విలక్షణ కవి, ప్రజా పాత్రికేయుడు కామ్రేడ్ అరుణ్ సాగర్ 
హఠాన్మరణానికి  విలపిల్లుతూ)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...