సరదా 'కీ' సరదా
శ్రీ శ్రీ జ్ఞాన నేత్రం
- కర్లపాలెం హనుమంతరావు
శ్రీశ్రీకి దేవుడి మీద నమ్మకం లేదుగానీ... ఆయనిచ్చే వరాల మీద బోలెడంత ఆశ ఉంది. ఆ కారణంగా ఘోర తపస్సు చేయగా, చేయగా 'మహాకవి' కదా ఏమి కోరుకుంటాడో చూద్దామన్న ఆసక్తితో ప్రత్యక్షమయ్యాడు దేవుడు.
"అయ్యా, నేను బోలెడన్ని పుస్తకాలు రాశాను. సినిమాలకు మంచి మంచి పాటలు చేశాను. అయినా డబ్బు మిగలటం లేదు. ధనం సంపాదించే కనీస అర్హత నాకు ఉందా? లేదా? అంటూ శ్రీశ్రీ దేవుడిని దబాయించాడు. దేవుడు చిర్నవ్వు చిందిస్తూ “నువ్వు
ఇప్పుడు పాట రాస్తోన్న సినిమా నిర్మాతను కలువు" అని ఉచిత సలహా ఒహటి పారేసి చిత్రంగా మాయమయ్యాడు దేవుడు.
నిర్మాతను కలిసి శ్రీశ్రీ మళ్లీ అదే ప్రశ్న వేశాడు.
"మీరు గుడ్డి గుర్రం మీద పందెం కాసినా లక్షలకు లక్షలు రూపాయలు వస్తాయి. ఆ కిటుకేమిటో నాకూ చెబితే, మీకు లాగా ఒహ మంచి సినిమా తీయాలని ఉంది" ఆశగా నిర్మాత ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు శ్రీశ్రీ.
"చెప్పటం ఎందుకు?, స్వయంగా చూద్దురుగానీ ఉండండి." అంటూ తన పెద్ద కొడుకును పిలిచి "గోడ మీదున్న ఫొటోని చూడు! ముగ్గురు పెద్దాళ్లు, ఏడుగురు పిల్లలు - ఏడూ ఇంటూ మూడూ .... లెక్కేసి ఆ సంఖ్యగల గుర్రం మీద పందెం కాసిరా." అని పది వేల రూపాయలు ఇచ్చి పంపించాడు నిర్మాత.
అంతే శ్రీశ్రీకి జ్ఞాననేత్రం విచ్చుకుంది. తనూ వెళ్లి ఆ నంబరు గుర్రం మీద ఉన్నదంతా ఊడ్చి పందెం కాశాడు.
అయితే 27వ నంబరు గుర్రం గెలిచింది.
" ఇదేంటి ఈసారి మీ జోస్యం ఇలా వికటించింది! " నిర్మాతను నిలదీశాడు శ్రీశ్రీ విచారపడుతూ.
"అదేం లేదే! మావాడు జాక్పాట్ పది లక్షల రూపాయలు కొట్టుకొచ్చాడుగదా! ” ఎదురుగా బల్లమీద పేర్చి ఉన్న డబ్బు కట్టల్ని చూపిస్తూ వివరించాడు నిర్మాత.
"అదెలాగా? ఏడు ఇంటూ మూడు ఈజిక్వల్టూ ఇరవై ఒకటేగదా?"
"మీరు మహాకవి కనుక అలా ఆలోచించారు. బడుద్దాయి గనుక మా వాడు 27 అని లెక్కవేశాడు." అన్నాడు తాపీగా నిర్మాత.
శ్రీశ్రీకి అప్పుడు తెలిసొచ్చింది. సంపద సృష్టికీ తెలివి తేటలకూ లంకె లేదనీ, కావాల్సింది సుడి మాత్రమేనని.
అదెటూ తనకు లేదని తెలుసుకున్నాక 'ఖడ్గసృష్టి' రాయటంతో సరిపెట్టుకున్నాడు మహాకవి.
( శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో )
( ఈ కట్టుకథ కేవలం నవ్వుకునేందుకే సుమా!)
- కర్లపాలెం హనుమంతరావు
01 -01-2021