Showing posts with label Languages. Show all posts
Showing posts with label Languages. Show all posts

Monday, December 13, 2021

తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ కర్లపాలెం హనుమంతరావు ( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య )










తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ 

కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య ) 




బెంజమెన్ షుల్జ్ - తొలి తెలుగు ముద్రాపకుడు


తెలుగులో తొలిసారిగా గ్రంథాన్ని ముద్రించి చరిత్రకెక్కిన బెంజమెన్ షుల్జ్ చిరస్మరణీయుడు. ఇతడు 1689లో జర్మనీలో జన్మించాడు. 1719 × తన 29వ ఏట దక్షిణ భారతదేశం వచ్చాడు. డెన్మార్క్ రాజు ఐదవ ఫ్రెడరిక్ పంపగా జర్మనీ నుంచి దక్షిణ భారతదేశంలోని తరంగంబాడికి క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చిన రెండవ జట్టు ఫాదరీల్లో షుల్జ్ ఒకరు. చెప్పులు సైతం లేకుండా నిరాడంబరంగా పాదచారిగా మత ప్రచారం చేశాడు. అనారోగ్య కారణాల వల్ల స్వదేశం తిరిగి వెళ్లిన తర్వాత కూడా తెలుగు టైపులు పోతపోయించి, తెలుగు గ్రంథాలు రచించి ముద్రించాడు. జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహాన్ ఆర్నెడ్ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలను షుల్జ్ తెలుగులోకి హాలేలో ముద్రించాడు. 23 సంవత్సరాల ముద్రణారంగంలో శ్రమించాడు. స్వదేశం వెళ్లిపోయాక కూడా 17 సంవత్సరాల పాటు తెలుగు పుస్తకాలు ముద్రించాడు. స్వయంగా 'GRAMMATICA TELUGICA' (1728) పేర 8 ప్రకరణాల్లో తెలుగు వ్యాకరణం రచించాడు. దీనిని హాలే విశ్వవిద్యాలయం వారు భద్రపరచి 1984లో తొలిసారి ముద్రించారని ఆరుద్ర తెలియజేశారు.8 తమిళం, పోలీసు, డేనిష్ భాషల్లో 20 పుస్తకాలను ఆరేళ్లలో ముద్రించాడు. మద్రాసులో సెంట్ జార్జ్ కోటలో కుంపిణీ గవర్నరు ఒప్పించి భారతీయుల కోసం పాఠశాల పెట్టించడమే గాక అందులో తెలుగు విభాగాన్ని ప్రారంభించి పిల్లల్లో తానూ ఒకనిగా కేవలం రెండు నెలల్లో తెలుగు నేర్చుకున్నాడు. అంతేకాదు బైబిల్ను సాహసోపేతంగా తెలుగులోకి అనువదించి ముద్రించాడు. 1760 నవంబర్ 25న షుల్జ్ కన్నుమూశాడు.


K. జేమ్స్ గ్రాంటు - దేశీయ విద్యలపై దృష్టి


కుంపిణీ వారికి మన దేశంలో మొట్టమొదట వశమైనవి ఉత్తర సర్కారులు. ఈ ప్రాంతాల సంక్షిప్త రాజకీయ చరిత్రను, విపులమైన రెవెన్యూ చరిత్రను వ్రాసిన తొలి ఆంగ్లేయిడు జేమ్స్ గ్రాంటు నిజాం దర్బారులో బ్రిటిషు రాయబారిగా పనిచేశాడు. దేశీయ విద్యలు మూలపడ్డాయని, వాటిని ఉద్దరించాలని చెప్పాడు.


ఛార్లెస్ వైట్ - నిఘంటు నిర్మాణానికి అంకురార్పణ


సెంట్ జార్జ్ కోటలో సివిల్ సర్వెంట్ హోదాలో పనిచేసిన ఛార్లెస్ వైట్ తెలుగులో నిఘంటు నిర్మాణానికి 1793 ప్రాంతాల్లో అంకురార్పణ చేశాడు.మంచి నిఘంటువు తయారు చేసిన వారికి బహుమతులివ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. అంతేకాదు తెలుగు నేర్చుకొనేవారికి ఉపయోగపడే ప్రాథమిక గ్రంథాలను రాయించాలని సూచించాడు. ఈయన సూచనవల్లే సెంట్ జార్జి కోట

పాలకులు మామిడి వెంకయ్య 'ఆంధ్ర దీపిక' హక్కులను కొన్నారని భావించవచ్చునని తెలుగు భాషా సారస్వతాల రంగాన్ని బ్రౌసు మహోజ్వల కాంతులతో నింపాడు. తెలుగు భాషా సాహిత్యాల పునరుద్ధరణకు, పునరుజ్జీవానికి అతడు ధారవోసిన శ్రమ అపారం. 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఇంగ్లండులో విద్యాభ్యాసం తర్వాత 1817లో కుంపిణీ ప్రభుత్వ సివిల్ సర్వెంట్గా భారతదేశంలో అడుగుపెట్టాడు. దక్షిణ భారత క్యాడర్లో బ్రౌను నియామకం ముఖ్యంగా తెలుగు వారు చేసుకున్న పుణ్యం.

కలెక్టరు సహాయకునిగా, మెజిస్ట్రేటుగా, పర్షియన్, తెలుగు పోస్ట్మాస్టర్ జనరల్ కునిగా, గా, విద్యామండలి సభ్యునిగా, కాలేజ్ బోర్డు కార్యదర్శిగా అనేక హోదాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. 38 సంవత్సరాలు కుంపిణీ వారి కొలువులో ఉన్నాడు. తాను దేశంలోనూ, తిరిగి ఇంగ్లండు వెళ్లాకకూడా మొత్తం దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. ఇది ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. తెలుగు గ్రంథాల రచనలో, తాళపత్ర గ్రంథాల సేకరణలో, ఉద్ధరణలో, భద్రపరచడంలో, పరిష్కరణలో, ముద్రణలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పనిచేశాడు బ్రౌన్. బ్రౌన్ వేమన పద్యాల ఆంగ్లానువాదం 1825లోనే చేపట్టాడు. తెలుగు ఛందస్సు (1827) ముద్రించాడు. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు, తెలుగు వ్యాకరణం, ఆంగ్లంలో తెలుగు వ్యాకరణం ప్రచురించాడు. ది లిటిల్ లెక్సికాన్, ది జిల్లా డిక్షనరీ కూర్చాడు. కొత్త నిబంధనను అనువదించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలో 1829లో 693 పద్యాలతో, 1839లో 1164 పద్యాలతో ప్రచురించాడు. ఆయన ఎన్నో విధాలా శ్రమించి వ్యయప్రయాసల కోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంథాల సంఖ్య వేలల్లో వుంది. మాజేటి సర్వేశలింగం సంకలనం నుండి సేకరించిన గ్రంథాలు 613 కాగా 227 గ్రంథాలు తెలుగు, 386 సంస్కృత గ్రంథాలు. మచిలీపట్నంలో కొన్నవి 1830 గ్రంథాలు. ప్రత్యేకంగా కడపలో భవనాన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, దిగ్ధంతులైన పండితులను నియమించి అనేక కావ్యాలు, శతకాలకు సంబంధించిన వేరు వేరు చోట్ల లభ్యమైన ప్రతులను పోల్చి చూపి (Collation) శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరింపజేశాడు. వాటిల్లో వసు చరిత్ర, మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, దశావతార చరిత్ర మొదలైనవి ఉన్నాయి. పోతన భాగవతాన్ని పరిష్కరించడమే కాక తెలుగు భారతం 18 పర్వాల పరిష్కరణకు, శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చు చేశాడు. తెలుగు నేర్చుకోదలచే ఇంగ్లీషు వారి కోసం, ఇంగ్లీషు నేర్చుకోదలచే తెలుగు వారి కోసం వాచకాలు తయారు చేశాడు. మద్రాసులో, కడపలో, మచిలీపట్నంలో స్వంత ఖర్చులతో ఉచిత పాఠశాలలు నడిపాడు. ఆయనే అన్నాడు " In 1825 found Telugu Literature dead in thirty years I raised it to life "10 అని. అది అక్షరాలా నిజం. 1855 ఏప్రిల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తిరిగి ఇంగ్లండు వెళ్లిపోయాడు. లండన్ యూనివర్సిటీలో తెలుగు గౌరవ ఆచార్యునిగా పనిచేశాడు. గ్రంథ రచన, ముద్రణ నిర్వహించాడు. ఆయన చివరి ప్రచురణ 'తాతాచార్యుల కథలు'. 1884లో కన్నుమూశాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్న వేమన పద్యానికి నిదర్శనంగా తెలుగుజాతి ఎన్ని తరాలకైనా మరువరాని పుణ్య పురుషుడు సి.పి. బ్రౌన్.


సర్ థామస్ మన్రో ప్రజల గవర్నరు -

తన 19 ఏళ్ల వయసులో మద్రాసుకు సైనిక విద్యార్థిగా వచ్చిన సర్ థామస్ మన్రో తన 66వ ఏట మద్రాసు గవర్నర్ గా చేస్తూ చనిపోయాడు. తెలుగు నేర్చుకున్న తెల్ల దొరల్లో ఈయన సుప్రసిద్ధుడు. రాయలసీమ తెల్లదొరల అధీనంలోకి వచ్చాక ఈయనను పాలకునిగా నియమించారు. దత్త మండలాల్లో ఉన్న 80 మంది పాలెగాండ్లను అదుపులోకి తెచ్చి రైతులకెంతో ఉపకారం చేశాడు. పాఠశాలలు నెలకొల్పేందుకు, ప్రజోపయోగకరమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందించాడు. రాయలసీమ అంటే ప్రాణం.

1783లో రైటర్గా మద్రాసు వచ్చిన విలియం బ్రౌన్ మచిలీపట్నం, విజయనగరం, విశాఖ, గంజాం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక హోదాల్లో 50 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1817లో 'జెంటూ' (తెలుగు) వ్యాకరణం ముద్రించాడు. అందులో పూర్వ వ్యాకర్తలను స్మరించడమే గాక కొన్ని పూర్వ వ్యాకరణాలు నిరుపయోగాలన్నాడు. 1818లో ఆయన ప్రచురించిన జెంటూ వొకాబులరీ వల్ల ఆనాటి సాంఘిక చరిత్ర తెలుసుకోవచ్చు. 1832లో తెలుగు అనువాదకునిగా పనిచేశాడు. మచిలీపట్నంలోని మామిడి వెంకయ్య, గుండుమళ్ల పురుషోత్తం వంటివారు విలియం బ్రౌను తెలుగు వ్యాకరణ రచనకు సహాయం చేశారు. ఆయన తెలుగు వ్యాకరణం చాలా విశిష్టమైనది. ఇంగ్లీషు వర్ణక్రమం ప్రకారం తెలుగు అక్షరాలు 22 మాత్రమేనని వర్గీకరించాడు. ఇది ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకొనేందుకు దోహదం చేసింది. తెలుగు భావ ప్రకటనకు గంభీరంగానూ, వినడానికి కమ్మగానూ ఉంటుందని అన్నాడు.


ఎ. డి. క్యాంబెల్ - ప్రామాణిక వ్యాకరణం


అలెగ్జాండర్ డంకన్ క్యాంబెల్ 1807లో రైటర్గా మనదేశానికి వచ్చాడు. బళ్లారి, తంజావూరు కలెక్టరుగా పనిచేశాడు. ప్రభుత్వ తెలుగు, పర్షియా అనువాదకునిగా పనిచేశాడు. బళ్లారి మిషన్కు ఈయన కృషివల్లే ముద్రణశాల లభించింది. 1817లోనే సెంట్ జార్జికోట కాలేజ్ బోర్డుకు కార్యదర్శి అయ్యాడు. రెవెన్యూ బోర్డు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తెలుగును నిశితంగా అధ్యయనం చేయడమేగాక తెలుగులోనూ, తెలుగును గురించి ఆంగ్లంలోనూ ప్రామాణిక రచనలు చేసిన కొద్ది మందిలో క్యాంబెల్ ఒకరు. ఉదయగిరి నారాయణయ్య అనే పండితుని దగ్గర ఆంధ్ర శబ్ద చింతామణిని ఆమూలాగ్రం చదువుకున్నాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక పీఠిక, ఆంధ్రకౌముది, అహోబిల పండితీయం మొదలైనవి 10 ఏళ్లపాటు శ్రద్ధగా పఠించాడు. ఈ పరిజ్ఞానంతో తర్వాతి వారికి ఉపయుక్తంగా ఉండేలా ఆరు అధ్యాయాలు, 519 సూత్రాలతో తెలుగు వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రచించాడు. అప్పట్లో ఇంగ్లీషు వచ్చిన తెలుగు వ్యాకరణాల్లో క్యాంబెల్ వ్యాకరణ గ్రంథం ప్రామాణికమైనదిగా పరిగణనకెక్కింది.


1812 నుంచి దేశ భాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. అదే తర్వాత కాలేజ్ బోర్డుగా మారింది. 1816లో వ్యాకరణం ముద్రణ జరిగింది. 1812 నుంచి 1820 వరకు ఎనిమిదేళ్లు కాలేజ్ బోర్డు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా పనిచేశాడు. ఆయన ప్రతిభా విశేషాలకు మెచ్చి ప్రభుత్వం వారు నిఘంటువు రాయమన్నారు. క్యాంబెల్ ఆంధ్ర దీపికను ప్రాతిపదికగా తీసుకొని కొత్త పదాలు కలుపుకుంటూ తెలుగు ఇంగ్లీషు అర్థాలిస్తూ నిఘంటువు పూర్తి చేశాడు. దాని తొలి ముద్రణ 1821లోనూ, రెండవ ముద్రణ 1848లోనూ జరిగింది. తన వ్యాకరణానికి ఆయన రాసిన ప్రవేశిక చాలా గొప్పది. ఆంధ్ర భాషా చరిత్రను, ఆంధ్రదేశ చరిత్రను సంక్షిప్తంగా రాసినా అది కూడ ప్రామాణికమైనది. ఆంధ్ర చరిత్ర రచించిన వారిలో క్యాంబెల్ మొదటివాడు కావచ్చునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.11 తన గ్రంథంలో త్రిలింగ శబ్దానికి విపులమైన పీఠిక రచించాడు. ప్రాచీన పాశ్చాత్య చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించిన అంశాల్ని ప్రస్తావించాడు. వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్రప్రసక్తి ఉన్న ఘట్టాలను క్రోడీకరించాడు. మెకంజీ సేకరించిన వ్రాత ప్రతులను, శాసనాలను ఆధారం చేసుకొని విజయనగర రాజుల జాబితా రూపొందించాడు.


ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ - తులనాత్మక అధ్యయనం


మద్రాసులో రైటర్ 1796లో సివిల్ సర్వీసు ప్రారంభించిన ఎల్లిస్ 1802లో రెవెన్యూ బోర్డు సభ్యునిగా, జిల్లా జడ్జిగా, కలెక్టర్ గా అనేక హోదాల్లో పనిచేశాడు. మచిలీపట్నంలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాడు. తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు దక్షిణ భారతీయ భాషల విషయంలో చెప్పుకోదగిన కృషి చేశాడు. తమిళ, సంస్కృత, మళయాళ భాషలలో తెలుగును తులనాత్మకంగా అధ్యయనం చేసి ద్రావిడ భాషావాదం బలపడడానికి ఎల్లిస్ దోహదం చేశాడు.


ఎ. డి. క్యాంబెల్ తెలుగు వ్యాకరణానికి పరిచయంగా ఎల్లిస్ తెలుగుతో ద్రావిడ భాషకు గల సామ్యాన్ని గురించి రాసిన నోటును (1816) పొందుపరచడం జరిగింది.


భారతీయుల సాంఘిక పరిస్థితుల పట్లా, చరిత్ర పట్లా ఎంతో శ్రద్ధ కనబరచి ఆ విషయాలపై ప్రామాణిక రచనలు చేశాడు. "జనని సంస్కృతంబు సకల భాషలకును" అన్న కొందరు ఆంగ్ల పండితుల వాదాన్ని ఎల్లిస్ ఖండిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలనీ, సంస్కృతం నుంచి జనించినవి కావని నిరూపించాడు. వాక్య నిర్మాణ పద్ధతిలో దక్షిణాది భాషలు సంస్కృతంతో ఎలా విభేదిస్తున్నాయో రాశాడు. మామిడి వెంకయ్య 'అంధ్ర దీపిక' ఉపోద్ఘాతంలో చెప్పిన తత్సను, తద్భవాలను గురించి చర్చించాడు. లక్ష్మధరుని షడ్భాషా చంద్రికను ఉటంకించాడు. ఇది భాషా శాస్త్ర విషయకంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకోదగింది. ఎల్లిస్ మరణానంతరం ఆయన భాషా శాస్త్ర పరిశోధన పత్రాలన్నిటినీ సర్ వాల్టర్ ఇలియట్క అందే ఏర్పాటు జరిగింది. ఇలియట్ డాక్టర్ పోపు ఇచ్చి ఆక్స్ఫర్డ్ బోదిలియన్ గ్రంథాలయంలో భద్రపరచేట్లు చేశాడు.


కోలిన్ మెకంజీ - చారిత్రక సంపద


తెలుగుతో పాటు 15 భారతీయ భాషల్లో వేలాది వ్రాతప్రతులు సేకరించి అనంతర తరాలకు అమూల్యమైన విశేషాలను అందించిన పాశ్చాత్య ప్రముఖుడు కోలిన్మెకంజీ. లూయిస్ ద్వీపానికి చెందిన మెకంజీ 1783లో ఈస్టిండియా కంపెనీ వారి ఇంజనీర్స్ క్యాడెట్లో ఎంపికై భారతదేశం వచ్చాడు. మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేలో పాల్గొన్న ఇంజనీర్లలో మెకంజీ ఒకరు. కోయంబత్తూరు, దిండిగల్, నెల్లూరు, గుంటూరు ఎక్కడికి సర్వే కోసం వెళ్లినా తనతో జిజ్ఞాసువులైన పండితులను తీసుకెళ్లేవాడు. 1809లో మద్రాసు సర్వేయర్ జనరల్, 1817లో కలకత్తా సర్వేయర్ జనరల్ గా ఉండి దాదాపు 70 వేల చదరపు మైళ్ల మేర సర్వే జరిపించాడు. కావలి వెంకట బొర్రయ్య. లక్ష్మయ్య అనే ఇద్దరు ప్రతిభావంతులైన తెలుగు సోదరుల సహాయంతో దేవాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, శాసనాల ప్రాచీన చరిత్రను మెకంజీ వెలికితీశాడు. ఆయన కృషిని సెంట్ జార్జి కోట ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రశంసించింది.

తాను సేకరించిన 1620 ప్రాంతాల స్థానిక చరిత్రల కైఫీయతుల విశ్లేషణ, కేటలాగింగు చేపట్టిన కొంత కాలానికి 1821లో కలకత్తాలో మెకంజీ మరణించాడు. మెకంజీ సేకరించిన సమాచారన్నంతటినీ గపిండియా కంపెనీ కొనుగోలు చేసింది. 

ఏషియాటిక్ జర్నల్ మెకంజీ సేకరించిన విషయ సంపదను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది.


విల్సన్స్ మెకంజీ కలెక్షన్స్ పేరుతో 1828లో కలకత్తాలో కేటలాగింగ్ ఆరంభమైంది. మెకంజీ సేకరించిన 176 తెలుగు లిఖిత ప్రతుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. 36 పౌరాణిక, వైతాళిక సాహిత్య గ్రంథాలు, 23 స్థానిక చరిత్రలు, 82 ప్రతులు కావ్యాలు, నాటకాలు, గాధలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి సహాయంతో సాధికారికమైన స్థానిక చరిత్ర నిర్మాణం చేయవచ్చు.


వీరేగాక ఇంకా ఎందరో తెల్లదొరలు తెలుగు ప్రాంతాల్లో, తెలుగువాళ్ల మధ్య తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు. వారందరి గురించి విపులంగా చర్చించడం ఈ అధ్యయనంలో సాధ్యమయ్యేది కాదు. అయితే వారిని నామమాత్రంగానైనా స్మరించడం బాధ్యత. బెంజిమెన్ బ్రాన్ఫీల్, జాన్. పి. మారిస్, థామస్ కన్ సెట్టస్, సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్, హెన్రీ థామస్, కోల్ బ్రూక్, జె. బి. గిల్ క్రిస్ట్, విలియం కేరీ, జార్జి అబ్రహం గ్రియర్ సన్, రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ (సి. పి. బ్రౌన్ తండ్రి) క్లాడినస్ బఛ్యస్, జాషువా మార్ష్మన్, హెన్రీ మార్టిన్, డేనియల్ కోరీ, డా. జాన్ లీడెన్... ఇలా వారి వారి స్థాయిల్లో, పరిమితుల్లో తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు.


- కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య

Sunday, December 12, 2021

మాటలతో ఆటలు - కర్లపాలెం హనుమంతరావు (సరదాకే)

 


ఎవరో ఒకరు పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? అంటాడు మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ ఘటోత్కచుడి అవతారం ఎత్తేసి. భాష అంతస్సారం రాక్షసజాతికే వంటబట్టగా లేనిది, జీవకోటిలో ఉత్కృష్టమైందని గొప్పలు పోయే మనిషి బుర్రకు తట్టకుండా ఉంటుందా? ఇహ, ఆవుకు కూడా 'కొమ్ము' తగిలించే మన తెలుగుభాషలోని మాటల తమాషా సంగతిః.. కాస్సేపు.. బుర్రకు తట్టినవి.

అసల తట్ట అంటేనే వెదురును ముక్కలు ముక్కలుగా చేసి కళ ఉట్టిపడేటట్లు  అల్లే ఒక పదార్థం. తాటాకు చెట్టు నుంచి వస్తుంది కాబట్టి తట్ట అయిందేమో! విజ్ఞులొక పరి  మా జ్ఞానం పట్ల కూడా గౌరవముంచి ఆలోచించాలి! మింగే లక్షణం గలది కాబట్టే తిమింగలం అయిందన్నది మా మిత్రుడొకడి పరిశోధనలో తేలిన అంశం. కేస్ట్ కౌచింగ్ మీద  ఆ మధ్య పెద్ద దుమారమే రేగింది తెలుగు సినీపరిశ్రమలో  .. గుర్తుందిగదా! ఈ గొడవలు ఇట్లా ముందు ముందు తగలడతాయాన్న కాలజ్ఞానం మస్తుగా ఉండుండబట్టే దీపిక అనే బాలివుడ్ కథానాయికి తాను 'పడుకోని' దీపిక అని పుట్టీపుట్టంగనే ప్రకటించేసుకుంది.

చౌ ఎన్ లై కి చాయ్ తాగేటప్పుడైనా ఎనలైట్మమెంటు కింద 'లైస్' (అబద్ధాలు)పకుండా చెప్పే పని తెలీని  రాజకీయనేతగా ప్రసిద్ధి. ఎన్ టి రామారావును కాంగ్రెసోళ్లు పాలిటిక్సులోకి వచ్చిన  ఎమ్టీ (ఖాళీ) రావు’ అని ఎద్దేవా చేసేవాళ్లు. చివరకు పాపం కాంగిరేసువాళ్లకే ఆ పార్టీ తరుఫున నిలబడితే ఎన్నికల 'రేసు' లో కనీసం ధరావత్తులు కూడా 'రావు'  అనే దుస్థితి  వచ్చిపడింది. సోనియమ్మ గారాబాల బిడ్డ రాహుల్ గాంధీ. తరచూ ఊహించని క్షణాలలో తిరగబడ్డం ఆ బాబీ హాబీ! ఆందుకే ఆ గారాబాల   రాగా(రాహుల్ గాంధీ)బాల గా మాధ్యమాలకు ఎక్కింది. గీర్వాణం అంటే సంస్కృతభాష. ఆ వాణిలో నాలుగు ముక్కలు ముక్కున పట్టీ పట్టంగానే గీరపోయే పండితులే దండిగా ఉండటం సర్వసాధారణం. సో అ 'గీర వాణం' పేరు గీర్వాణానికి చక్కగా అతికిపోతుంది. బా అన్నా వా అన్న ఒకే శబ్దం బెంగాలీబాషలో. ‘పో అని ఆ శబ్దానికి అర్థం. ఇష్టం లేని అక్క మొగుడు ఎవడో ఒంటరిగా ఉండడం చూసి కమ్ముకొచ్చినప్పుడు 'పో.. పో' అంటూ  కసిరికొట్టి ఉంటుంది వయసులో ఉన్న మరదలు పిల్లో. ఆ మాటే చివరకు అక్క మొగ్గుళ్లందర్నీ 'బా.. వా' లుగా సుప్రసిద్ధం చేసేసింది మన తెలుగుభాషలో.

కాల్షియం సమృద్ధిగా ఉంటేనే మనిషిలో పెరుగుదల సక్రమంగా ఉండేదంటారు  ధన్వంతురులు. ఆ ధాతువు అధిక పాళ్లలో దొరికేది కాబట్టే ' పెరుగు' పెరుగు అయింది. ధన్వంతురుల అన్న మాట ఎలాగూ వచ్చింది  కాబట్టి ఒక చిన్న ముచ్చట.  ధనం మాత్రమే తన వంతన్న దీక్షగా  చికిత్స చేసే వైద్యనారాయణులు కొంతమంది కద్దు. ఆ మహానుభావులకు  ఆ పేరు చక్కగా సూటవుతుంది. ఆయుర్వేదం చేసే వైద్యుల కన్నా అల్లోపతి చేసే ఫిజీషియన్లకు ఆ పదం అద్దినట్లు సరిపోతుంది. అన్నట్లు  ఫీజు తీసుకుని వైద్యం చేసే ఫిజీషియన్ ని  ‘ఫీజీషియన్ ‘ అనడమే సబబు.

బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అస్తమానం కమ్మని కలలు కనేవాళ్లు తల్లిదండ్రులు. కనకే అమ్మానాన్నా 'కన్నవాళ్లు' గా ప్రసిద్ధమయారు.

కలసి ఆడే కర్రల ఆట కాబట్టి కోలాటం 'కో'లాటం అయింది. రైయ్యిమని దూసుకుపోతుంది కనక రైలుబండి అయినట్లు.  మని, అన్నా 'షి' అన్నా పడిచస్తాడు కనక  మనిషి 'మని-షి'గా తయారయ్యాడు. తతిమ్మా జంతుకోటితో కలవకుండా తానొక్కడే  మడి కట్టుకున్నట్లు విడిగా ఉంటాడు కాబట్టి 'మడి'సి కూడా అయ్యాడనుకోండి.

'కీ' ఉండని చిన్న టిక్కీ కాబట్టి  కిటికీ. 

రాసి రాసి గుర్తింపు లేక  నీరసం వచ్చేసిం తరువాత  కవులు కట్టే గ్రూపు-రసం. విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా  రాసే కవుల గుంపు వి-రసంఒక ముఠా కవులు మరో గ్రూపు కవుల మీద ముటముటలాడుతూ  విసుర్లు వేసుకునేవారు ముఠాలు కట్టిన ప్రారంభంలో.

ఆ రంభ వచ్చినా ఆరంభంలో మగవాడికి ఏం చెయ్యాలో తెలిసిరాలేదు. ఆడమన్నట్లా ఆడేది మొదట్లో ఆడది. అందుకే ఆమె ఆరంభంలో ఆడది అయింది. మగువను చూస్తే 'గాడు' (తీపరం)  పుట్టే జీవి కావడం మూలాన వయసు కొచ్చిన మగాడు మగాడు అవుతాడు. క్షీరధార రుచిని మరిపించే  కవిత్వం కురిపించే  కవులు ఉంటారు. ఆ కవులే  అసలు సాహిత్యంలోని  'కౌ'లు.  మెరికలు పోగయ్యే దేశం గనక అది అమెరికాగా ప్రసిద్ధిపొందింది. ఆయిల్ ఫ్రీ లీ అవైలబుల్ గనక ఆఫ్రికా అయిందేమో తెలీదు. అట్లాగని ఆస్ట్రేలియాలో అంతా స్ట్రే డాగ్సులా తిరుగుతారనుకోవద్దు. అట్లా చేస్తే స్టేలు కూడా దొరకని క్రిమినల్  కేసుల్లో బుక్కయిపోతారు. అట్లాగే అరబ్బు కంట్రీసు కూడా. పేరును చూసి 'ఐ రబ్ విత్ ఈచ్ అండ్ ఎవ్విరిబడీ' అంటూ మన బ్లడీ ఇండియన్ ఫిలాసఫీలో బలాదూరుగా  తిరిగితే.. సరాసరి పుచ్చెలే ఎగిరిపోవచ్చు. నేతిబీరకాయల్లోని నేతిని మన గొనసపూడి పూసల నేతితో  అన్నోయింగ్లీ కంపేరు చేసేసుకుని సెటైర్లకు దిగెయ్యడం మన దేశంలో కాలమిస్టులకు అదో అమాయక లక్షణం. న ప్లస్ ఇతి ఈజ్  క్వల్ టు   నేతిరా  నాయనల్లారా! ‘-ఇతి అంటే  'ఇది కాదు' తెలుగర్థం.  దాన్ని పట్టుకునొచ్చి నేతి బీరకాయలో అది లేదని ముక్కు చీదుకోడం చదువు మీరిన వాళ్ల చాదస్తం.

ఎలుక కు చిలుకకు ఒక్క పేరులో తప్ప పొంతన బొత్తిగా   ఉండదు.  టమోటోకి టయోటాకి మాటలో తప్ప రేటులో  పోలికే  తూగదు. పదాలున్నాయి కదా పదార్థాల కోసం దేవులాడితే వృథా ప్రయాసే! ‘ఎలాగూ’  లో ఏ లాగూ కోసం వెతికినా దొరకదు కాక దొరకదు. మైసూర్ బజ్జీలో మైసూరు కోసం వెదికి ఉసూరు మనకు!  అన్ని పదాలు కలుస్తాయని కాదు. కలవకూడదనీ కాదు.

ఇట్లా పనికిమాలిన పదాలను పట్టుకుని ఎన్ని ఆటలైనా అలుపూ  సొలుపూ  లేకుండా ఆడేయడానికి అసలు కారణం..నాకు ఏ పనీ పాటా లేకుండా తిని కూర్చునే లక్షణం పుష్కలంగా ఉండడం. దయచేసి  ఇక్కడ ఏ ‘లంగా’  కోసం వెతక్కండి మహాప్రభో! ఖాయంగా దొరకదు గాక దొరకదు దొరలూ .. దొరసానులూ!

-కర్లపాలెం హనుమంతరావు

26 -11 -2020

***

భావోద్వేగాలా? భాషాభివృద్ధా? -కర్లపాలెం హనుమంతరావు

 

భావోద్వేగాలా? భాషాభివృద్ధా?

-కర్లపాలెం హనుమంతరావు

ముందు ముందు రాబోయే సాంకేతిక అవసరాలకు అనుగుణంగా భాషను ఎప్పటికప్పుడు సరళతరం చేసుకుని సిద్ధంగా ఉండటం తక్షణమే ప్రారంభమవాల్సిన భాషా సంస్కరణ వాస్తవానికి! అవును!  మన తెలుగుకు  ప్రపంచభాషలలో లేని ప్రత్యేకతలు చాలా ఉన్న మాటా నిజమే! సంగీత స్వరాలలోని అన్ని సంగతులను అక్షరబద్ధం చేయగల సుస్పష్ట అజంత (అచ్చు వర్ణంతో ముగించే) సౌలభ్యం ఇటాలియన్ భాషకులా మళ్లీ మన తెలుగుకు  సొంతం అంటారు. తెలుగులో ఉన్న త్యాగరాజ సంకీర్తనలను తమిళ భాషలోకి తర్జుమా చేసుకొని ప్రచారం చేసుకొనే తమిళుల ప్రయత్నం విఫలమవడానికి కారణమూ తెలుగు వర్ణానికి ఉన్న సంగీజ్ఞత తమిళ భాషకు లేకపోవడమే! అయినా సరే..  ఈ వేగయుగంలో సాటి భాషలతో పోటీకి దిగి ముందంజగా  సాగాలంటే ఆలంకారికంగా ఉన్నా,  అందం మరంత పెంచే  అపురూప ఆభరణాల వంటి వర్ణమాలలోని కొన్ని ప్రత్యామ్నాయం ఉన్న అక్షరాలను పరిత్యజించక తప్పదు. మనసు బరువెక్కినా బరువైన అక్షరాలు కొన్నిటిని వదిలించుకొనక తప్పదు! చిన్నతనంలో మనం ఎంతో శ్రద్ధతో శ్రమించి మరీ నేర్చుకొన్న  56/53  వర్ణమాల సెట్  మీద గల మమకారం అంత తొందరగా చావదు. అయినా భాషాభివృద్ధికి పరిత్యాగం వినా మరో మార్గం లేదు. మనం ఇప్పటికే అవసరమైన  చోట కొన్నిటిని వదులుకున్నాం! బండి ర ('') కు బదులు తేలిక ర,  'ఋషి' పదంలోని '' అక్షరానికి ప్రత్యమ్నాయంగా 'రు' తరహావి.  అనునాసికాలయితే దాదపుగా  అన్నీ ఇప్పటి తరం వాళ్లు గుర్తుపట్టే స్థితిలో లేరు.

వర్ణమాల  సౌందర్యాన్ని చెరబట్టడానికి నేనూ విముఖుణ్ణే! కానీ మనోవేగంతో పోటీకి దిగి ముందుకు ఉరకలెత్తే సాంకేతిక రంగ అభివృద్ధిని దేశీయపరంగ అందుకోనేందుకు  జానపదుల నోటికి కూడా పట్టేందుకు వీలుగా పదజాలం సరళీకృతం కావాల్సివుంది. భాషాసంస్కరణలకు ప్రధాన అవరోధంగా ఉంటున్నదీ పామరజనానికి ఆమడ దూరంలో మసులుతున్న పాండిత్య పలుకుబడులే! పట్టణాలకే కాదు.. పల్లెపట్టులకూ రసపట్టుల్లా మారే పలుకుబడులు పెరిగే కొద్ది భాష వాడకం విస్తృతమవుతుంది.

గతంలో ఓల్డ్ ఇంగ్లీష్ స్థానే న్యూ ఇంగ్లీష్ వచ్చి ప్రపంచ భాషల్లోని అవసరమైన పదజాలాన్ని ఏ భేషజమేమీ లేకుండా సొంతం చేసుకునే సంస్కరణకు శ్రీకారం చుట్టింది.  ఆనాటి నుంచే  ఆంగ్లం  విశ్వభాషగా  రూపాంతరం చెందుతూ అన్ని సంస్కృతులను ప్రభావితం చేసేయడం! ఆ దిశలోమన తెలుగునూ సంస్కరించుకోకుండా భాష చచ్చిపోతున్నదో అని ఎంత భావోద్వేగాలు ప్రదర్శించీ ప్రయోజనం ఏముంది!

భావోద్వేగాలా.. భాషాభివృద్ధా? ఏది ప్రధానం అని ఆలోచించుకోవాల్సిన సంధి దశలో మనం ఇప్పుడు ఉన్నది. 

-కర్లపాలెం హనుమంతరావు

24 -06 -2021

 

Friday, December 10, 2021

వ్యాసం పాడ 'నా' తెలుగుపాట - యూ . ఎ. నరసింహమూర్తి ( నేటి తెలుగు - నుంచి ) సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు

 


వ్యాసం

పాడ 'నాతెలుగుపాట

యూ . నరసింహమూర్తి

నేటి తెలుగు - నుంచి ) 

సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు



వ్యాసం 

పాడ 'నా' తెలుగుపాట

- యూ . ఎ. నరసింహమూర్తి 

( నేటి తెలుగు - నుంచి ) 

సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు 


' గంగ తల నుండి కావేరి కాళ్లదాక వెలిగె   దిఓ్మోహనమ్ముగా తెలుగు కీర్తి' అంటూ కించి గానం చేశాడు రాయప్రోలు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తరించే నాటికి కీర్తి ఖండఖండాంతరాలకు వ్యాప్తమౌతున్నట్లు కీర్తించే అవకాశం కళాకారులకు ఉచింది. కళాకారులతో గొప్ప చిక్కుంది. వాళ్లకు నచ్చితే ఆకాశానికెత్తేస్తారు. నచ్చకపోతే పాతాళానికి అణచేస్తారు. విజయవాడలో రేడియో స్టేషను ప్రారంభిస్తే గాని పాడనని భీష్మించుకుని కూర్చున్నాడు గురువు. ఒకానొక ప్రభుత్వం తెలుగుదేశంలో అంతరించేదాకా తెలుగునాట గొంతువిప్పనని ప్రతిజ్ఞ చేశాడొక శిష్యుడు.  ఎంతో తపస్సు చేస్తేగాని తెలుగుదేశంలో పుట్టడం, తెలుగుభాష మాట్లాడటం అనే వరం సిద్ధించదని పూర్వం అప్పయ్యయ్య దీక్షితులన్నమాట. ఆ తెలుగు జిల్లాలలో  పుట్టడమే మహా పాపఖర్మం అనేక విధాల' అన్నాడు గుడిపాటి వేంకటచలం. ' ఆ తెలుగుగాలి మురికిని కొంతన్నా కడిగేస్తుంది అరుణాచలం' అని కూడా అన్నాడాయన. అయినా ఆయన తెలుగుభాషను మాత్రం లలేదు. దాని సొగసుల్ని కాదనలేదు.


' మనవాళ్లుట్టి వెధవవాయ్ లోయ్' అన్న గిరీశం మాటలో గురజాడ గొంతుకూడా కలిసే ఉంది. అది మన పాత సంస్కారాన్ని గురించి విసిరిన విసురులా కనిపిస్తుంది. పూర్వుల తెలుగుతనాన్ని కాపాడుకోలేక పోయామన్న చింత చాలా మందికుంది. తెలుగువారిలో తెలుగుతనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయిపోయింది, అది ఎప్పుడో ఉండేది కూడా.  మన తెలుగుపిల్లలెరుగరు. ' కలిమికి ఆంగ్లము - తెలివికి సంస్కృతము బా   జా జాతీయతకు హిందీ, 'నీ తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెదవాంధ్రా!' అని నేను దశాబ్దాల కిందటే ప్రశ్నించాను' అని వేలూరి శివరామశాస్త్రి వాపోయారు.  ఆ యన వచనంలో చెప్తే విశ్వనాథవారు  ' అచ్చ సంస్కృతి తెలియని యాంధ్రజాతి - యాధునిక మిది పలుత్రోవలై వించు' అంటూ పద్యంలో పరామర్శించారు. తెలుగువారి ప్రాచీన వైభవాన్ని ఘనంగా కీర్తించిన  విశ్వనాథ  ' వాల్మీకి రెండు విధములుగ నదృష్టవంతుడు. ఒకటి ఆంధ్రదేశమున పుట్టకపోవుట ; రెండు - అప్పటికింకను ఆంగ్లేయులు మనదేశమున నడుగుపెట్టకపోవుట' అంటూ తెలుగుదేశంలో పుట్టడమే నేరమన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ' ఏ ప్రాచీన నిక్షేపమైనా చేజారిపోయిన తరువాత బిక్కమొగం పెట్టేవాడు తెలుగువాడు' అంటూ ఇటీవలి మధురాంతకం రాజారాం కూడా అనడం ఆలోచించదగ్గది.


అన్నింటిలోను మనం గొప్పవాళ్లమేనని గప్పాలు కొట్టినరోజులు కొన్ని ఉన్నాయి. అందుకు భిన్నంగా ' సర్వ విషయాలలోను  మన వాళ్లు తీసికట్టే తమలోతాము గోతులు తవ్వుకోవడంలో తప్పించి| అంటారు శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి.  తెలుగుతనాన్ని అత్యంతగా ప్రేమించిన ఆ మహనీయుడు 'వేషం విషయమై మన తెలుగువారికిప్పుడు శ్రద్ధాలేదు. సంప్రదాయ గౌరవమూలేదు. అనుకరణ పరాయణత్వం తప్ప' అని తెలుగు వేషభాషలు అంతరించిపోతున్నందుకు చింతించారు. ఆఖరికి తెలుగు వాళ్లకు హోటళ్లు నడపడం కూడా చేతకాదని ఆయన అభిప్రాయం. ' రావలసిన వాళ్లను ఆకర్షించకపోవడమే గాదు, వచ్చినవాళ్లనైనా ఆదరించలేడు తెలుగు యజమాని' అంటూ తెగబడి చెప్పాడాయన. ఆంధ్రదేశంలో పుట్టడం వలన చాలా నష్టం ఉందని అభిప్రాయపడిన వాళ్లలో ఆయనా ఉన్నాడు. ' వారు ఆంధ్రులు కాక మరే జాతివారయినా అయివుంటే బతికి వుండినప్పుడూ, పరమపదించాక గూడా వారినాజాతీయులు బహువిధాల పూజించుకుని వుందురు' అంటూ వేటూరి ప్రభాకరశాస్త్రి గురించి ఆయన గ్రహించకపోలేదు. ' ఈ తెలుగు సినిమాలకు - బ్రాఁతిగఁ గొనిపోకు పిల్లవానిని వీడున్ బూతులను నేర్చుకొనియెను - చేతో మర్యాదలేని చీదరమాటల్' అంటూ విశ్వనాథ వారెప్పుడో చెప్పారు. పాతికేళ్ల కాలంలో తెలుగు సినిమాలలోని  సమస్త విషయాలు ఎంత బరితెగించి పోయాయో ఆయనగాని చూసివుంటే ఇంకా ఇంకా ఏమనేవారో! ' ఆంధ్రులకు దేశాభిమానం లేదు. భాషాభిమానం అంతకన్నా లేదు' అన్నాడు ఆత్రేయ. ' తెలుగావకాయ ఘాటెక్కింది - తెలుగు గోంగూర పులుపెక్కింది' అంటూ 1939లో కాటూరి వారొక హాస్యరచన చేశారు. ఆయన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి పదవీ విరమణ సందర్భంలో "ఆంధ్రదేశస్థ సర్వాంగ్లభాషా కళాశాలలకున్ కనులు చల్లబడెనే' అంటూ పద్యాలు రాశారు. చెళ్లపిళ్ల వంటివాడు ఒక హైస్కూలులో తెలుగు పండితుడుగా పదవీ విరమణ చేయవలసిన దుర్గతి ఆంధ్రదేశంలో ఉందన్నది ఆయన విచారం. తెలుగువారి పత్రికాపోషణ మీద కూడా విలువైన అభిప్రాయాలున్నాయి. ' ప్రబుద్ధాంధ్ర సంపాదకుడు నెలకు ఇరవై రోజుల చొప్పున ప్రెస్సు బిల్లూ, పేపరు బిల్లూ పూర్తిగా చెల్లించలేకపోతూ ఉండడం దేశీయుల గాఢనిద్రకు నిదర్శనం' అని సాక్షాత్తు గిడుగువారే అన్నారు. అది ఆసరాగా చేసుకుని శ్రీపాదవారు ' తెలుగువాడిప్పుడు భావదాస్యంలో మగ్గిపోయి ఆత్మగౌరవం యెరక్కుండావున్నాడు. పామునోట్లో కప్ప కబళించే

దోమలా  ఉన్నాడు" అంటూ వాపోయారు.


ఇంకా ప్రసిద్ధులెందరో వ్యతిరేకాభిప్రాయాలు వెల్లడిచేసినవారున్నారు. అందులో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, కొన్ని ఛాందసత్వంవల్ల, కొన్ని మార్పును అంగీకరించలేక పోవడం వల్ల, కొన్ని అవగాహన లోపంవల్ల వెల్లడైన భావాలు కావచ్చు. కాని అన్నీ అలాంటివి కావు. ఆంధ్రులు ఆరంభశూరులు, అనుకరణప్రియులు, అనేకత్వ లక్షణం కలవారు అనే విమర్శ పూర్వం నుంచీ ఉంది.


గోదావరి గట్టున కూర్చొని తెలుగుభారతం రాయడానికి నన్నయ్య ఎన్నో సంస్కృత సభల్లో సాముగరిడీలు చేయలసి వచ్చింది. పాల్కురికి సోమనాథుడు "తెలుగు మాటలనంగవలదు' అని బతిమలాడవలసి వచ్చింది, శ్రీనాథుడు తన భాషను సమర్థించుకోవలసి వచ్చింది. తెలుగువేషం మార్చుకోవలసి వచ్చినందుకు శ్రీనాథుడెంతో బాధపడ్డాడు. కాని మరాఠీవారి పాలనలో, మహమ్మదీయుల ఏలుబడిలో మన పేరు ఊరు, వేషం - భాష మార్చుకోవడం ఒక సంస్కారంగా మారింది. ఇంగ్లీషు వాళ్లు వచ్చిన తరవాత వైఖరిని గూర్చి చెప్పుకోవడం గొంగళిలో తింటూ వెంట్రుకలేరుకోవడమే కాగలదు. ఎప్పుడూ ఒక పరాధీనత మనకు, మన భాషకు, మన సంస్కృతికి తప్పడంలేదు. పరాధీనతను పల్లెత్తకుండా అంగీకరించేవారు ఎందరో ఉంటారు. స్వేచ్ఛాప్రియులు కొందరే ఉంటారు. అందులో ఆంధ్రదేశం తనను వెలివేసిందన్న బాధతో ఆంధ్రదేశాన్నే వెలివేసిన మహారచయిత ఒకడు. పరాధీనత అనే భావాన్నే భరించలేక స్వేచ్ఛకోసం మాతృ దేశాభిమానంతో ఆంధ్రదేశంలో అడుగుపెట్టిన అగ్గిపిడుగింకొకడు.


' కొన్ని గడియలకు  ఓఢ్రరాష్ట్రీయచ్ఛాయ అలుముకుంటుందనగా నేను పర్లాకిమిడి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోకి వచ్చేస్తాను. పర్లాకిమిడిలో రైలెక్కుతాను. పాతపట్నం వెళ్లి ఏటిలో స్నానంచేసి... పర్లాకిమిడి మళ్లీ మద్రాసు ప్రెసిడెన్సీలో చేరితే తప్ప బతికి వుండగా నేనా ఊళ్లో అడుగుపెట్టనని కంకణం కట్టుకుని రైలెక్కుతాను' అన్నారు గిడుగువారు. మూడు లక్షలమంది ఆంధ్రులకు అన్యాయం జరిగే సందర్భంలో ఆయన ఈ మాట అనవలసి వచ్చింది. అందులో ఆయన స్వార్థమేమీలేదు. ఛాందసం లేదు. అవగాహన లోపంలేదు. అచ్చమైన తెలుగుతనం మూర్తీభవించిన మహదావేశం అందులో ఇమిడి ఉంది. ఆ మహావేశమర్థించి ఆంధ్రులార? చల్లుడక్షతలు నేడు' అన్న రాయప్రోలు మాటను ఇలాంటి సందర్భాలలో పునశ్చరణ చేసుకోవలసి వస్తుంది. కళాకారులు కాలాన్ని కట్టిపడేస్తారు. వాళ్లను కించపరిస్తే ఆమచ్చ కలకాలం మిగిలిపోతుంది. వాళ్లు నాణేన్ని పైకెగరేసి బొమ్మంటే బొమ్మే పడుతుంది. బొరుసంటే బొరుసే పడుతుంది. వారి ఉదాత్త హృదయాంతరాలలో మారుమోగినప్పుడు మాత్రమే తెలుగుపాట రక్తికట్టగలదు.


- యూ . ఎ. నరసింహమూర్తి 

( నేటి తెలుగు - నుంచి ) 

సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు 

                    10 - 12-2021 

                     బోథెల్ ; యూ . ఎస్ . ఎ 


Thursday, December 9, 2021

ఆంధ్రము - తెలుగు - కోరాడ రామకృష్ణయ్య -కర్లపాలెం హనుమంతరావు

 ఆంధ్రము - తెలుగు 

కర్లపాలెం హనుమంతరావు 

మనిషి, జాతి, దేశం - వీటి గుర్తింపుకు సాంకేతికంగా ఒక ప్రత్యేకమైన పేరు ఏదైనా ఉండటం తప్పని సరి . చిత్రాంగా తెలుగువారి భాషకు రెండు పేర్లు ఆంధ్రము , తెలుగు! ( తమిళులదీ ఇదే వరస : తమిళం - అరవము .. అట్లాగే మరికొన్ని భాషలకూ ఉన్నప్పటికి వాటి చర్చ ఈ వ్యాస పరిధికి బైట. కనుక ఆంధ్రము - తెలుగు వరకే మనం పరిమితమవుదాం . ఈ చర్చ వల్ల భాషా సాహిత్యాలు, సంఘం ప్రాచీన పరిస్థితులు, ప్రాచీనా భాష పరిణామ క్రమం మీద కొద్దిపాటి అవగాహన వస్తుంది. అదీ ఈ వ్యాసం ఉద్దేశం కూడా.  


భాష అంటే మనిషి తన మనసులోని భాషను సంఘంలోని సాటి మనిషితో పంచుకునే  ప్రక్రియ సాధనం.  మనుషులకు సంబంధించిన జాతి, రాళ్లు  నివసించే ప్రాంతానికి దగ్గరగా పలికే పేర్లు ఆయా భాషలకు ఉండటం సహజం. ఉదాహరణకు అంగిలులకు దేశం ఇంగ్లాండ్, భాష ఇంగ్లీషు; అట్లాగే మన ఓడ్రులకు ఒరిస్సా, ఒరియా ) . అయి అఱువాళర్ అనేది ఒక తెగ పేరు. వాళ్ల  భాష పేరు ' అఱు ' వము. కానీ అరవల ప్రాచీన వాజ్ఞ్మయంలో ఆ పేరు కాకుండా ' తమిళం ' అనే పేరు మాత్రమే కనపడుతుంది. ఈ వింతాకు కారణం ఉత్తర దిక్కున ఉండే మన తెలుగువాళ్లే అంటారు ప్రసిద్ధ భాషా పరిశోధకులు కోరాడ రామకృష్ణయ్యగారు. తమిళం - అరవం లాగే ఆంధ్రం- తెలుగు కూడా ఆయా జాతి పేరుకు బట్టి ప్రాంతాన్ని బట్టి ఏర్పడినవే. రెండు వేరు వేరు జాతులు అయివుండి వేరు లేరు భాషలు ఉపయోగిస్తూ కాలక్రమేణా రెండు జాతుల వాళ్లూ దక్షిణాపథంలో ఒకే ప్రాంతంలో స్థిర పడి పోవడం వల్ల ఒకే భాషగా కలగలసిపోయి రెండు పేర్లతో పిలవబడుతున్నదా? ఈ అనుమానం చాలాకాలం బట్టి పరిశోధకులను వేధిస్తూనేవుంది. 

ఐతరేయ బ్రాహ్మణంలో ఓ కథ ఉంది. ఆర్యాంధ్ర జాతికి చెందిన వాళ్లు ఆర్య సంఘం నుంచి బహిష్కరించబడి పుండ్ర, పుళింద, మూతిబ లాంటి జాతులలో కలసి వింధ్యకు దక్షిణం దిక్కులో స్థిర పడ్డారని దాని సారం. వీళ్లే క్రమంగా క్రమంగా దక్షిణా పథానికి విస్తరించి కృష్ణా గోదావరి ప్రాంతాల ఆదిమవాసులు తెలుగు వారితో కలసిపోయారని విశ్వాసం . కృష్ణాతీరంలో రాజ్యాన్ని స్థాపించుకుని పాలన కూడా చేసినట్లు ఒక నమ్మకం. క్రీస్తు పూర్వం 3 వ శతాబ్ది నాటికే మగధ రాజ్యం తరువాత అంతటి మహరాజ్యంగా మెజస్తనీస్ మెచ్చుకున్నది ఈ ప్రాంతాన్నే . కృష్ణానదీప్రాంతంలోని ' కుబీరకుడు ' అనే రాజును గురించి 

భట్టిప్రోలు శాసనం కూడా ప్రస్తావించింది. ఆ శాసనం అశోకుడి కాలానికి కొద్దిగా ఇటువైపుదని పరిశోధకుల అభిప్రాయం. పశ్చిమ దిగ్భాగంలో ఉన్న మగధను కూడా జాయించి ఆంధ్రులు హైందవ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఉత్తర దేశంలోని ఆర్యాంధ్రులు దక్షిణంలోని గోదావరీ కృష్ణాప్రాంతవాసులు తెలుగు వారితో  కలసిపోయి    సామ్రాజ్యపాలకులుగా పశ్చిమదిక్కు కు కూడా ఆక్రమించి మొత్తానికి పాలకులు అయినందున తెలుగు మాట్లాడే ప్రాంతం కూడా ఆంధ్రప్రాంతం అయిందని, ఇక్కడి ప్రజలు ఆంధ్రులు, రాల్లు మాట్లాడే తెలుగు భాష ఆంధ్రం కూడా అయిందని   తాత్పర్యం . 


ఆర్యాంధ్రులు రాక ముందు కృష్ణా ప్రాంతం నిర్జనంగా ఏమీలేదు. తూర్పుదిక్కు నుంచి దక్షిణానికి సముద్ర మార్గంలో వెళ్లే బౌద్ధ యాత్రికులకు అమరావతి  స్థావరంగా ఉన్న నాగజాతి వాళ్లు ఆతిథ్యం ఇస్తుండేవాళ్లు . నాగజాతి అనే ఒక జాతి ఉన్నట్లు అమరావతీ స్తూపం మీద చెక్కిన చిత్రకథల ద్వారా నిర్ధారణ కూడా చేసుకోవచ్చు .  ఇంత జరిగినా ' తెలుగు' వాళ్ల ప్రస్తావన ఎక్కడా లేకపోవడానికి పరిశోధకులు ఊహించేదే నిజమయితే అక్కడి తెలుగువాళ్లు ఆ సరికే బర్మా వైపుకు ' తెలుంగులు' పేరుతో వలసపోగా .. మిగిలిపోయినవాళ్లు ఏ ' తెలగాణ్య బ్రాహ్మణులు, తెలగాలు'  గానో వ్యవహరింపబడ్డారు. క్రీ.శ 2వ శతాబ్దినాటి యవన యాత్రికుడు టాలమీ పేర్కొన్న ' ట్రిలింగాన్ ' ' ట్రిగ్లిఫాన్ ' ఈ తెలుగు ప్రాంతమే అయివుండవచ్చు.  ప్రాభవం బలంగా  ఉన్న చోట బలహీనులు ఉనికి కొల్పోవడం చరిత్ర గమనంలో మనం చూస్తున్న పరిణామమే, ఇక్కడ ఆంధ్రుల ప్రాభావంలో  ఆదిమ తెలుగు జాతికీ  అదే గతి పట్టివుండవచ్చు.   త్రిలింగము అనే కథ తరువాతి కాలంలో పౌరాణిక పరంగా కల్పన చేసి ఉండవచ్చు. 


చిట్టచివరగా ఒక మాట. తైలంగులు, తెలగాలు, తెలంగానా వంటి శబ్దాలను బట్టి ' తెలుగు ' అనేదే మూల రూపం అయివుండవచ్చు . కానీ అప్పటి సంస్కృత పండితులు ఈ దేశీయ పదాన్ని సంస్కృతీకరించే శ్రద్ధతో స్వభాషానురూపమైన రూపం, వ్యుత్పత్తి తయారు చేసారనడంలో సందేహంలేదు. ఆ తరహారూపాన్నే టాలమీ తీసుకున్నందువల్లనే  తెలుగును  ' ' ట్రిలింగాన్' ' ట్రిగ్లిఫాన్ ' అని ప్రస్తావించి ఉండవచ్చు. 


నోట్ : సంస్కృతీకరణ - ప్రక్రియను గురించి కుమారిలభట్టు ' తంత్ర వార్తికం ' అనే గ్రంథంలో చాల విపులంగా వివరిస్తాడు. కృష్ణానదికి ప్రాచీన రూపం మైసోలాన్. ఆ పరీవాహక ప్రాంతమంతా 'మైసోలియా' . ( అదే ఇప్పటి మచిలీపట్టణం). మై - అంటే ద్రావిడ భాషలలో ' నలుపు ' అని అర్థం. దీనిని సంస్కృతీకరించినందు వల్లనే నది ' కృష్ణ ' అయింది. దీనికీ ఓ ప్రాచూ నామం ఉంది. . ' కృష్ణ బేణ్ణా ' . కాలక్రమేణా అదే కృష్ణవేణి అయింది. ఇట్లా సంస్కృతీకరణను గురించి ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వచ్చు. కానీ, ఇది సముయమూ కాదు. స్థలమూ పరిమితం, 

( వ్యాసానికి ఆధారం: కీ.శే. కోరాడ రామకృష్ణయ్యగారి ' ఆంధ్రము - తెలుగు ' - ( దక్షిణ దేశా భాషా సారస్వతములు - దేశి ) 


- కర్లపాలెం హనుమంతరావు 

03 - 10-2021 


బోథెల్ ; యూఎస్.ఎ 




Tuesday, December 7, 2021

భాష - వ్యాసం అమ్మ భాష ' మమ్మీ ' పాలు! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం)

 



భాష - వ్యాసం 

అమ్మ భాష ' మమ్మీ ' పాలు! 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు  సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


తొలిదశలో విద్యాబోధన మాతృభాషలోనే నిర్బంధంగా  జరగాలనే కర్ణాటక ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన కొన్ని వ్యాఖ్యల సేపథ్యంలో బోధనాభాషగా మాతృభాష పాత్ర ఏమిటనే చర్చ  ప్రారంభమయింది. 


మనరాష్ట్రంలో ప్రభుత్వమే ఆరో తరగతి నుంచి ఆంగ్లభాషను బోధనా మాధ్యమంగా ముందుకు తెచ్చినందువల్ల ఈ చర్చకు ఇక్కడ మరింత ప్రాధాన్యత  ఏర్పడింది. 


ఉనికి కోసం పోరాటం: 


కర్ణాటక ప్రభుత్వం 1994లోనే ఒకటినుంచి నాలుగు తరగతుల దాకా కన్నడ భాషను నిర్బంధంగా బోధించాలని ఆదేశాలిచ్చి అమలు జరుపుతోంది. ఇంగ్లీషు మాధ్యమంగా కొత్త పాఠశాలల్ని ప్రారంభించాలన్నా, ఉన్న పాఠశాలల్లోనే కొత్త తరగతులు తెరవాలన్నా ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తోంది. కర్ణాటక ఐక్య  పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వ ఉత్తర్వుపై 2004లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది .  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పురావడంతో కర్ణాటక ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థాను తలుపు తట్టింది. ఈ దశలో  ఉన్నత న్యాయస్థానం తీర్పు అమలును నిలుపుదం  చేయటానికి నిరాకరిస్తూనే  జులై 21న ప్రాథమిక పాఠ శాలలో ఆంగ్ల విద్యాబోధన సాగకపోతే విద్యార్థులు గుమస్తా ఉద్యోగాలకైనా పనికిరాకుండా  పోతారని, అరవై నుంచి యాభైవేల రూపాయల దాకా ఫీజులు  చెల్లించి తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో వేయటానికి తల్లిదండ్రులే సిద్ధ పడుతుంటే ప్రభుత్వానికేమి ఇబ్బందని అర్థం వచ్చేలా సర్వో నత న్యాయస్థానం  కొన్ని వ్యాఖ్యలు చేసింది.


కేవలం 26 అక్షరాలు రెండున్నర లక్షల పద బంధా లున్న ఆంగ్ల భాషను శ్వేతజాతి నేతలు అప్పట్లో తమ సామ్రాజ్యం విస్తరించిన అన్ని చోట్లా స్థానిక భాషలమీద పెత్తనం చేయటానికి  వాడుకున్నారు. 


రాజాదరణ దొరికిన భాష రాణిస్తుంది. ' మనభాష, మన తిండి ఒంటబట్టిన మనిషి మరో చోటికి వెళ్ళలేడు . మనకే లొంగి ఉంటాడు' అనేది మెకాలే సిద్ధాంతం. దానిమీదే భరత ఖండంలోనూ  మిగతా బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ  ఆంగ్లభాషను స్థాని కులు తమకు దాసులయ్యే మేరకే వాడుకలోకి తెచ్చారు. ఆ క్రమంలో ఆంగ్లభాష అభివృద్ధి చెందుతూ స్థానిక భాషలు, వివిధ మాతృభాషలు మరుగునపడుతూ వచ్చాయి. 


ప్రస్తుతం మన రాష్ట్రంలో తెలుగు దీనావస్థలో ఉండటం మాతృభాషాభిమానులందరికీ ఆందోళన కలిగిస్తోంది. తమిళనాట  భాష ఆధారంగా పెద్ద ఉద్యమాలు వచ్చాయి. తమ భాషను ఉపయోగించుకుంటూనే శాస్త్రాలను, ఇతర అంశా లను పరిపుష్టం చేసుకునే విధానం అక్కడ కొనసాగుతోంది.  తమిళతనం ప్రజల భాషలో సజీవంగా ఉండే విధానాన్ని ఎంత ప్రపంచీకరణలోనూ వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. 


ఉత్తరాదిన హిందీ భాషోద్యమం కారణంగా ఆంగ్లం కన్నా హిందీలో మాట్లాడటం గౌరవంగా భావిస్తారు. ఆంగ్ల భాష జనజీవనంలోకి అవసరానికి మించి చొచ్చుకునివచ్చి చేస్తున్న హానిని గుర్తించిన రామ్మనోహర్ లోహియా లాంటి సోషలిస్టు వాదులు ఒక దశలో ' అంగ్రేజీ హటావో'  అనే ఉద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టిన చరిత్ర ఉంది. 


మనకు మన తెలుగు పనికిరాకుండా పోతోంది. అమెరికా లాంటి దేశాలకు వలస పోవటానికే ఈ ఆంధ్రదేశంలో పుట్టామని భావించే కుర్రతరం క్రమక్రమంగా అధిక మవుతోంది. ప్రపంచం మొత్తంమీద తెలుగు మాట్లాడేవాళ్లు 15 కోట్లమంది . చాలా యూరోపియన్ భాషల కన్నా మన భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ . ఒక్క భారతదేశంలోనే హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడేది తెలుగు భాష . యాభై ఆరు అక్షరాలు, ఆరులక్షల పదబంధాలున్న మనభాష చేత ఇరవయ్యారు అక్షరాలున్న ఆంగ్లానికి ఊడిగం చేయించాలని ఉబలాట పడుతున్నాం. సొంత రాష్ట్రoలో ఉద్యోగం చేయటానిక్కూడా తెలుగు మనకు పనికి రాకుండా పొతున్న పరిస్థితి.


దాదాపు రెండు తరాల విద్యార్థుడు  తెలుగు భాష రాకుండానే .. తెలుగు భాషపై అవగాహన లేకుండానే విశ్వ  విద్యాలయాలనుంచి బైటికి వచ్చిన వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. 


ఇప్పుడు ఇళ్లల్లో తెలుగు అక్షరం కనిపించదు. తెలుగు పదం వినిపించదు . మరో రెండు తరాల పాటు ఈ నిర్లిప్తత ఇలాగే కొనసాగితే తెలుగు భాష ఏక మొత్తంగా ఉనికి లేకుండాపోయే ప్రమాదం పొంచి ఉందనే భాషాభిమానులు ఆవేదనలో అర్థం ఉంది .


మాతభాషను మించినది లేదు. ప్రజలకు  ప్రాణం పోసేది  తల్లిభాషే.  ప్రాథమికస్థాయి నుంచి  మాతృభాషలో  విద్యాభ్యాసం  చేసి అవసరాన్ని బట్టి పరభాషలను ఉపయోగించుకున్న వాళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 


మనరాష్ట్రం నుంచి  ఐఐటి కి  ఎన్నికయిన  వారిలో ఎక్కువమంది పది వరకూ తెలుగులో విద్యాభ్యాసం చేసినవాళ్ళే.  బాల్యంనుంచే ఆంగ్లభాషను మప్పినంత మాత్రాన భవిష్యత్తులో ఆ భాష మీద పట్టు సాధించగలమన్న గ్యారంటీ మాత్రం ఏముం టుంది ? తెలుగులో చదువుకున్న వాళ్ళంతా నన్నయలూ, తిక్కనలూ అవుతున్నారా? నోబెల్ బహమతి గ్రహీతల్లో ఎక్కువ మంది ఇంగ్లీషు భాషలో రాసినవారు కాదు. ఆంగ్ల భాషతో పనిలేకుండానే చైనా, రష్యా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి కదా! ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం  ఆంగ్లభాషల్లో కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ . ఇవన్నీ  ఆంగ్ల భాష మీద వ్యతిరేకతతో చెప్పే మాటలు కావు . తెలుగువాళ్ళకు అసలు ఇంగ్లీషు వద్దని చాదస్తంగా  చెప్పటానికి కాదు. ఏ భాషనైనా ఆవసరాన్ని  బట్టి తప్పక నేర్చుకోవాల్సిందే. అయితే ఒక దశ  వరకూ మాతృభాష  మాత్రమే  మాధ్యమంగా ఉండితీరాలని చెప్పటమే ఇక్కడి ఉద్దేశం.


బహుశా ఈ శాస్త్రీయ దృక్పథంతోనే కర్ణాటక ప్రభుత్వం కన్నడం ప్రాథమిక స్థాయిలో తప్పని సరి  బోధనా భాషగాఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు . ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కనీసం తల్లి భాష/ స్థానిక భాషలలో ఏ ఒక్క దానిలో కూడా విద్యాబోధన అంటూ ఉండనవసరం  లేదని తాత్పర్యం చెప్పుకొనే విధంగా ఉండటమే ఆశ్చర్యకరం


ఆంగ్లంలోనే విజ్ఞానం యావత్తూ  ఉందనీ..  అంతర్జాతీయ స్థాయిలో విద్యా ఉద్యోగాలకు అవసరమైన బిడ్డకు తల్లి  గర్భంలోనుంచే ఆంగ్లం నూరిపోయాలని  వాదించేవారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉంది. ఇవాళా సాష్ట్  వేర్ రంగంలో ఉద్యోగాలా చేస్తూ , విమానాలలో  విదేశాలకు ఎగిరిపోయిన వాళ్లలో అధిక భాగం అనివార్యంగా ప్రాథమిక దశలో మాతృ భాషలోనే విద్యాభ్యాసం చేసిఉంటారు. 


అప్పటి విద్యావిధానం అలాంటిదే మరి . సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తిన  రెండో అభ్యంతరం ఆర్థిక సంబంధమైనది. వేలు ఖర్చుపెట్టి తమ పిల్లల్ని ఆంగ్ల పాఠశాలల్లో చేర్పించటానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్న నేపధ్యంలో  ప్రభుత్వనికి ఎందుకు నొప్పి .. అని సుప్రీంకోర్టు వ్యాఖ్య! ఈ తరహా  పరిశీలన కార్పొరేట్ మార్కెట్ వర్గాల నుంచి కాకుండా నేరుగా సమున్నత న్యాయస్థానం నుంచే రావటం ఆందోళన కలిగించే విషయం.


ఈ వ్యాఖ్య ఏ మేరకు సమంజసమో తేలాలంటే దీని నేపథ్య౦ ముందు కొంత అర్థంచేసుకోవాలి . 


ప్రపంచీకరణ విద్యను వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తుంది. ప్రపంచంలోని యువతలో 54 శాతం మనదే శంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఇంటర్మీడియెట్ స్థాయినీ కలుపుకొని దాదాపు ఆరుకోట్ల మంది విద్యార్థులుంటారు. ప్రపంచ విద్యావ్యాపారంలో

అతి పెద్ద మార్కెట్ మనవేశమే.. అని పసిగట్టిన అంతర్జా తీయ పెట్టుబడిదారీ వర్గాలు  ఇక్కడి విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండటం గమనించింది.  విద్య వ్యాపారంగా సాగాలంటే ముందు ప్రభుత్వమనే అవరోధాన్ని  తప్పించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ జనరల్ అగ్రిమెంట్ ఆన్ త్రేడ్ ఇన్ సర్వీసెస్  (జి.ఎ.టి.ఎస్) చర్చల్లో విద్యను ఒక అంశంగా చేర్చటానికి  ఇదే కారణం. దీనికి మనదేశమూ అంగీకరించింది. 


మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఈ బిల్లు చట్టమైతే విదేశీ డిగ్రీన్ని ఇక్కడ విరివిగా అమ్ముకోవచ్చు. అంత ర్థాలం (ఇంటర్నెట్) ద్వారా ఇక్కడ కళాశాలలు నడిపించవచ్చు.  ఉద్యోగాలకసలు విదేశీ పట్టాలే ప్రమాణంగా మారే ప్రమాదమూ ఉంది కోట్లు రాబట్టే  ఈ వ్యాపారంలో  ఇక్కడి పెట్టుబడిదారీ వర్గాలూ చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నాయి . కాబట్టే   కేవలం ఆంగ్ల  మాధ్యమంలో మాత్రమే ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమని దశాబ్దం కిందటి నుంచి కొత్తవాదనను ప్రచారంలోకి తెచ్చాయి.


ప్రభుత్వం అంతటి నిర్లజ్జగా బైటికి  చెప్పలేదు .  కనుక ప్రజానుకూల సంక్షేమమనే తీసిని అద్ది నమా ఉదారవాద సిద్ధాంతానికి  తెరతీసింది. మాటలో ఎంత సంపూర్ణ అక్షరాస్యత, ప్రాథమిక విద్యలో ప్రాధాన్యత, ఉన్నత విద్య , విద్యాహక్కు అంటున్నా.. చేతల్లో మాత్రం దేశీయ విద్య విదేశీ శక్తుల హస్తగతనువుతూ పోవటాన్ని పరోక్షంగా ప్రోత్సహించే ధోరణిలోనే పథకాశాలు రచిస్తోంది. 

మాతృ భాషలో విద్యాబోధన జరగాలన్న నిబంధనను విద్యాహక్కు చట్టం నుంచి  2006 లోనే  తొలగించి ప్రభుత్వం తన నిజస్వరూపం చాటుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కిందటే సక్సెస్ పాఠశా లల పేరుతో ఆంగ్ల మాధ్యమాన్ని సీబీఎస్ఈ పాఠ్యాంశాలతో సహా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అరకొరగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కొత్త పాఠ్య  ప్రణాళికను  ఆంగ్ల మాధ్యమంలో బోధించలేక పాఠాలను  తెలుగు లిపిలో రాయించి బోధిస్తున్నారని చెప్పుకొంటున్నారు. కొత్త మాధ్యమాన్ని  అందుకోలేని విద్యార్థులు తిరిగి తెలుగు మాధ్యమంలోకే వెళ్ళిపోవటమో .. అదీ కుదరని పక్షంలో  ఏకంగా చదువుకే నామం పెట్టేయటమో చేస్తున్నారన్నది నిష్ఠుర సత్యం. 


ప్రాథమిక స్థాయిలో మాతృభాష మాధ్యమ విధానం నుంచి పక్కకు తొలగితే సహజంగానే ఇలాంటి దుష్పరిణా మాలు జరుగుతాయనే- పొరుగునున్న తమిళనాడులో రెండు భాషలనూ సమన్వయం చేసుకుంటూ విద్యాబోధన విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మాతృభాషలో బోధన అంటే ఏమిటో, అన్ని వర్గాల పిల్లలకు దీన్ని ఒక దశ వరకూ నిర్బంధం చేయటం ఏ విధంగా అవసరమో, ఆంగ్ల మాధ్యమం ఏ దశనుంచి ప్రారంభిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో .. ఇత్యాది  ముఖ్యమైన విధానాలను  నిస్వార్ధంగా  నిజాయితీగా , నిదానంగా అన్ని వర్గాల వారికి నచ్చజెప్పటానికి ప్రభుత్వం పూనుకొనుంటే  అసలీ వివాదమే ఉత్పన్నమయ్యేది కాదు. 


ప్రాథమిక దశ తరువాత బోధనా మాధ్యమం ఐచ్ఛికంగా  ఉండాలి. ఎవరు ఏ మాధ్యమం కోరుకుంటే ఆ మాధ్యమాన్ని సమాన సౌక ర్యాలతో అందుబాటులో ఉంచటం  ప్రభుత్వాలు అనుసరిం చవలసిన  ఉత్తమ విధానం.  ధనార్జన కోసమే విద్యాసంస్థలు నడిపే వ్యాపారవేత్తలను  పరోక్షంగానైనా ఏ ప్రజా ప్రభుత్వమూ ప్రోత్సహించరాదు. 15 కోట్ల  మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నప్పటికీ  పరిపాలన అదే భాషలో సాగకపోవడానికి , పరాయితనం  మీద అవసరానికి మించిన మోజే  ప్రధాన కారణమని తెలుసుకున్నపపుడే  తెలుగు భాషకు మళ్ళీ మంచికాలం వచ్చినట్లు లెక్క. 


 మన ప్రజల డబ్బుతో చదువుకొని విదేశాలలో శాశ్వతంగా స్థిరపడిపోవటాన్ని గొప్పతనంగా కాక, సామాజిక ద్రోహంగా మనం చూడగలిగిననాడు  పరిస్థితుల్లో మార్పు క్రమంగానైనా వస్తుంది.


తొలి వెలుగు దీవం


మన కర్ణాటక వివాదం మీద వెలు వరించే మలితీస్సులో భాషా  ఆవశ్యకత ప్రాథమిక దశ వరకు ఎంత అవసరమో గుర్తించి తదనుగుణంగానే మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆశించటంలో తప్పులేదు గదా ! ఈ మధ్య పార్లమెంటు ఆమోదం పొందిన విద్యా హక్కు బిల్లు అందరికీ విద్యను అందించటం ఒక హక్కుగా పేర్కొంది. అట్టడుగు స్థాయివారూ విద్యను సక్ర మంగా అందుకునే పరిస్థితులను కల్పించాల్సింది ప్రభుత్వమే. అప్పుడే  బడుగు జీవికి సక్రమమైన విద్య మాత్న భాషలో  అందేది.  


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈూడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...