Sunday, December 12, 2021
ఎవరు దేవుడు? -కర్లపాలెం హనుమంతరావు (సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం
ఎవరు దేవుడు?
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)
‘దేవ’ శబ్దం పదకొండు ధాతువుల సమాగమం- అని
మన ప్రాచీనుల విశ్వాసం. లోకాలను ఆడిచడం, ధర్మమార్గం నమ్మినవాళ్లకు సాదనాలు అందించి జయం చేకూర్చడం, మదోన్మత్తులను శిక్షించడం, స్వయం ప్రకాశం, స్వీయానందమనే సులక్షణాలుగా కలిగి ఉండి పరిసరాలను ప్రభావితం చేయడం, ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం
రాత్రిని, శాశ్వత విరామం
కొరకు ప్రళయాన్ని
సృష్టించడం, ఉదాత్తజీవికి ఉండదగ్గ సులక్షణాలు సర్వం తాను కలిగివుండటం,
సంపూర్ణ జ్ఞానికి ఉండే నిండు విగ్రహంతో సర్వత్రా వెలుగొందేవాడు దేవుడవుతాడని 'దివు-క్రీడా, విజిగీషా, వ్యవహార,
ద్యుతి, స్తుతి, మోద,
మద, స్వప్న, కాంతి,
గతిషు' అన్న నిర్వచనం నుంచి రుషులు రాబట్టినట్టి
దైవస్వరూప భావం. ఆయుర్వేదమంత్రం(14 -20) అగ్ని, వాయువు, సూర్యుడు,
చంద్రుడు, వసువు, రుద్రుడు,
ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ లాంటి దేవుళ్లుగానే
భావించింది. మాక్స్ ముల్లర్ మహాశయుడయితే మరీ సులువు సూత్రంలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant
originally Bright and nothing else) పొమ్మని తేల్చేసాడు.
మధ్యస్థంగా మసిలే శ్రీసాయణాచార్యుడు
స్వర్గం అనే లోకం ఒకటి ఊహించుకుని దేవుడి చేతికి దాని సింహద్వార బీగాలు తాళాలు అప్పగించాడు.
దేవుడు అంటే యజమాని, అన్ని రకాల పొగడ్తలకు అర్హుడైన
స్వామి అన్న భావం ఆరంభమయింది శ్రీ సాయణాచార్యుడి జమానాలోనే అని
పరిశోధకుల అభిప్రాయం. ఎవరే నిర్వచనం ఇచ్చినా, భాష్యం
చెప్పినా- ప్రాణికి, ప్రకృతికి మేలు చేకూర్చే చర్యలు చేపట్టే శక్తిని దైవంగా భావించడానికి అభ్యంతరం
ఉండనవసరంలేదు.
ప్రకృతి శక్తులు, వాటి అంతర్భాగాలైన సూర్య చంద్రుల
వంటి గ్రహనక్షత్రాలు చలవ వల్లనే భూమ్మీద మనిషి మనుగడ. నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి-వంటి పంచభూతాలు ప్రాణుల ఉనికికి మూలాధారాలు. మానవ
జీవితాన్ని అనుక్షణం ఏదో రూపంలో ప్రభావితం చేసే చెట్టు చేమా, గుట్టా పుట్టా
కూడా దైవసమానాలేనని డాక్టర్ దాశరథి రంగాచార్య వంటి విజ్ఞుల అభిప్రాయపడ్డారు.
వేదాలని లోతుగా పరిశీలిస్తే దైవరూపాలన్నీ జడరూపాలలో ఉన్నట్లు
తెలిసి అబ్బురమనిపిస్తుంది. చైతన్యస్వరూపుడిగా మనిషి భావించుకునే
దేవుడు మనిషికి వాస్తవ జగత్తులో ఎన్నడూ కనిపించిందిలేదు. ప్రకృతి శక్తులకు మాత్రమే దైవత్వ
మాపాదించే ధోరణి తైత్తరీయోపనిషత్ అంగీకరించదు. 'రసో వై సః రసం హ్యేవాయం
లబ్ధ్యా నందీ భవతి' (2.7) సిద్ధాంతం ప్రకారం భగవంతుడంటేనే స్వయంగా
ఆనందస్వరూపుడు; జీవాత్మ ఆయన సన్నిధానంలో ఆనందమయం అయిపోతుంది.
ఆనందం కలిగించకపోతే ఎవరికైనా జీవించి ఉండాలన్న ఇచ్ఛ ఎందుకు కలుగుతుంది?' అని వాదించే కోవకు చెందుతారు వీళ్లు.
నిజానికి దేవుడు ఎప్పుడూ మారలేదు. అతని స్వభావంలో ఎప్పుడూ మార్పు వచ్చే అవకాశం కూదా లేదు. మారినట్లు
కనిపించేదంతా ఆ దేవుడిని నమ్మిన మనిషి భావనలో వచ్చిన మార్పు మాత్రమే! వేదకాలంలో
మనిషి ప్రకృతి శక్తులను అర్థం చేసుకొనే శక్తి చాలక భయంతో
దేవుళ్లుగా భావిస్తే, పురాణకాలం వచ్చేసరికి ఆ ప్రకృతి శక్తుల
స్థానే మానవమూర్తులను బోలే దేవీదేవతలు, వాళ్ల మధ్యనా మనుషులకుండే
భావోద్వేగాలు, వాళ్ల సంసారలంపటాలు మొదలయ్యాయి. ఆధునిక యుగంలో
కూడా షిర్డీ శాయిలాంటి మనుషుల్లో నుంచే పుట్టుకొచ్చిన దేవుళ్లకు ఆరాధనలు
ఎక్కువయ్యాయి. మనుషులుగా
తమకు అసాధ్యమైన పనులు సాధించే శక్తి ఒకటి ప్రేరణ కింద సమాజం ముందు ఏదో ఒక రూపంలోనో,
భావనలోనో ఉండటం తప్పని సరి. ఆ దివ్యరూపాలకు, అతీతభావనలకు
ఆలంబనమే ఆధునిక మానవుడు ఆరాధించే రూపాలు. వారే అధునిక తరాలకు దేవుళ్లు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులను. విద్యాబుద్ధులు గరిపే
ఉపాధ్యాయులలో దైవరూపాలను చూసుకొనే సంస్కృతి భారతీయులలో తరతరాలబట్టి కొనసాగుతూ
వస్తున్నది. ఆపదలప్పుడు ఆదుకున్నవాళ్లను కూడా దేవుళ్లుగా భావించదం మనకు
స్వభావసిద్ధంగా వస్తోన్న పాత తరాల లక్షణం. దేశానికి స్వాత్రంత్ర్యం
సాధించుకున్న సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్న మోహన్ చంద్ కరం చంద్ గాంధీని
మహాత్మునిగా మాత్రమే కాకుండా దేవుడిగా భావించిన జనసామాన్యం తక్కువేమీ లేదు.
ఆదర్శప్రాయమైన జీవితాలను గడిపిపోయేవారిని దైవసమానులుగా
భావించే పూజించే అలవాటు మనకీ దేశంలో తరతరాలుగా వస్తున్నదే! 'సంశయాత్మా వినశ్యతి' అన్న ఆర్యోక్తి వింటూనే ఉంటాం.
పూజ్యభావనతో ప్రతిష్ఠించిన చారిత్రిక పురుషుల విగ్రహాలను గుళ్లో దేవుళ్ల కింద
భావించి కొలవడాన్ని కొందరు బుద్ధిమంతులు హేతుబద్ధమైన ఆలోచనలను ముందుకు తెచ్చి
ఖండిస్తుంటారు. ఆ తరహా తార్కికులకు తృప్తి కలిగించడం కష్టం; భక్తిభావనకు
విశ్వాసం ప్రధానం కనక. 'విశ్వాంసో ధర్మ
మూలాంహి' అని కదా పెద్దల మాట!
దేవుళ్ల రూపాలు మారవచ్చు. దైవారాధన రూపాలూ మారవచ్చు. ఈ మార్పులేవీ
దేవుళ్లుగా మనం ముందు నుంచి భావిస్తున్న ఆ శక్తుల స్వభావాలలో మార్పు తేలేవు, అగ్నిదేవత ఏ
రూపంలో ఉన్నా కాల్చే స్వభావం కలిగే ఉంటుంది. ఏ విధంగా పూజించినా ముక్కులకు దిగేదాకా మునిగితే గంగ ప్రాణాలు
హరించేస్తుంది. రూపంలోని మార్పు, అర్చనలోని మార్పు మనిషి స్వభావంలో
వచ్చే మార్పులకు మాత్రమే సంకేతాలు. ఈ
ఇంగితం మనిషికి లేకనే .. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి
మనిషికి మధ్యన, జాతికి జాతికి మధ్యన, దేశానికి
దేశానికీ మధ్యన, సంస్కృతి సంస్కృతీ మధ్యన, తరానికి తరానికి మధ్యన ఇంతింత సంఘర్షణ.
కవులు సైతం తమ కావ్య రచనల ఆరంభంలో దేవతా ప్రార్థనలు చేసే
సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థన
చేయడం ఇక్కడ గమనార్హం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు,
జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ ఎన్నో
రకాలుగా దేవుళ్లను సైతం తరగతుల కింద విభజించుకొని ఇష్టులైన దేవుళ్లకు మళ్లా ప్రత్యేక
ప్రార్థనలు చెయ్యడం .. మనిషి హ్రస్వదృష్టికి నిదర్శనం.
'కతివై దేవాః?' దేవుళ్లు
ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని సమాధానం చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు
ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు
డజనుమంది, ఇంద్రుదు, ప్రజాపతి
ఒక్కొక్కళ్లు- మొత్తం ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. పంచభూతాలు, సూర్యుడు,
చంద్రుడు, నక్షత్రజాతి - ఈ మొత్తం ఎనిమిది
వసుదేవతలు, జగత్తును నసింపచేయాలన్నా,
నివసింపచేయాలన్నా వీటి చలవే కాబట్టి ఇవి వసుదేవతలు. కర్మేంద్రియాలు,
జ్ఞానేంద్రియాలు చెరి ఐదేసి.. ఆ పైన జీవాత్మ - మొత్తం పదకొండు- రుద్రదేవతలు.
శరీరాన్నుంచి ఆత్మ వెళ్లిపోయే సమయంలో ప్రాణులను ఏడిపిస్తాయి కాబట్టి వీటికీ
రుద్రదేవతలనే పేరు వచ్చిందని ఓ భావన కద్దు. సంవత్సరంలోని
పన్నెండు మాసాల ద్వాదశ ఆదిత్యదేవతలు. చైత్రానికి సూర్యుడు, వైశాఖానికి
ఆర్యముడు, జ్యేష్టానికి వివస్వానుడు.. అదే వరుసలో ఆషాఢ,
శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ,
కార్తీక, మార్గశిర, పుష్య,
మాఘ, ఫాల్గుణ మాసాలకు అంశుమంతు, పర్జన్యుడు, వరుణుడు, ఇంద్రుడు,
దాతృది, మిత్రుడు, పూర్ణ,
భృగుడు, తృష్ణ -లు
ప్రాతినిథ్యం వహిస్తూ ఆయుష్షును హరించే దేవతలు. ఇంద్రుడంటే విద్యుత్తు, ప్రజాపతి యజ్ఞానికి ప్రతీకలైన దేవతలు. ఇంతమంది దేవతలున్నా మళ్ళీ ముగ్గురే
ముఖ్యమైన దేవతలు. భూమ్మీద ఉండే అగ్ని, మేఘంలో ఉండే వాయువు..
మెరుపు, అంతరిక్షంలో ఉండే సూర్యుడు.
మూడు ముఖాలతో ప్రకాశించే అగ్నిదేవుని ప్రస్తుతులు 200 సూక్తాలలో కనిపిస్తాయి. ప్రపంచసాహిత్యంలోనే
అత్యంత పురాతనమైన వేదాలలోని మొదటి వేదం రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్/హోతారం రత్నధాతమమ్' అగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రదేవుడికే
ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వానలు కురిపించగల సత్తా వజ్రాయుధ హస్తపాణి
ఇంద్రుడొక్కడిదే. వృత్తుడనే మొండి జలరక్కసి పీచమణచే వృత్తాంతం మహా వీర రసస్ఫోరకంగా
పురాణాలు వర్ణించడం వెనకున్న రహస్యం ఆర్యావర్తమంతటా ఇంద్రుడి పట్ల ఉండే విశేషమైన భక్తిప్రవత్తులు!
వైదికపరంగా ఇంద్ర శబ్దం ఐశ్వర్యానికి ప్రతీక. ఆధునికి
భారతీయ సాహిత్య విమర్శకులలో బాలగంగాధర్ తిలక్ ఇంద్రుణ్ణి అగ్నికి, వృత్తుణ్ణి మంచుకు ప్రతీకలుగా
స్థిరపరిచాడు. పౌరాణికుల దృష్టిలో ఇంద్రుడు స్వర్గాధిపతి అయినప్పటికి
వైదికవాజ్ఞ్మయపరంగా 'జీవుడు'కి ప్రతీక.
దేవతలకు అధిపతిగా, రాక్షసులకు విరోధిగా, తాపసులకు అడ్డంకిగా గౌరవం, హైన్య భావం ఒకేమారు ముప్పిరి గొల్పే వైవిధ్యమైన
కథలు ఇంద్రుని మీద
వచ్చినంతగా వైదిక వాజ్ఞ్మయంలో మరో దేవతపైన రాకపోవడం గమనించాలి.
ద్యుస్థానీయ దేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖమైన దేవుడు. సౌర
మండలంలోని సమస్త శక్తికీ మూలాధారంగా ఋషుల భావనలో గౌరవం సాధించిన ఈ సూర్యదేవుడిని
వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. 'ఓం నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ'అనే
రుగ్వేద పదవ మండలం 37 శ్లోకంలో 'మిత్రావరుణులకు
కళ్లుగా, సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులకు దర్శనమిచ్చే దివ్యజన్మ కలవాడిగా, సకల లోకాలను ప్రకాశింపచేసే మహాదేవుడిగా,
మానుష కార్యాలన్నీ యాజ్ఞిక రూపంలో గ్రహించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతులందుకునే ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడు. సోముడు, వరుణుడు, నదులు, రుద్రుడు,
బృహస్పతి, సవ్వితృడు, విష్ణువు,
ఉషస్సుల వంటి దేవతలు
ఇంకెందరో వేదాలలో తమ తమ స్థానాలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు.
ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.
పౌరాణిక దేవతలుః వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేద కాలానికి దశ తిరిగింది.
విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాథనలు అధికమయ్యాయి.
యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించి
ఆరాధించడం సామాన్యుడికి సులువైన మార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ
కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవీదేవతలకు చుట్టబెట్టి
కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తి మార్గమనే భావన ప్రచారంలోనికి
వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల
వ్యవహారాలు ఆరాధనలో భాగమయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజా పునస్కారాలు
ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త
కొత్త దేవతారూపాలు ఉనికిలోకి రావడం కొత్త పరిణామం.
జైనుడైన అమరసింహుడు తన అమరకోశంలోని స్వర్గ వర్గంలో
దేవుళ్లకు ఉండే'అమరా నిర్జరా దేవాస్త్రిదశా
విబుధాః సురాః' లాంటి
26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరా మరణాలు లేని వాళ్లని,
ఎప్పుడూ ముఫ్ఫై ఏళ్లలో ఉన్నట్లే కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని ఇట్లా ప్రతీ పదానికీ ఉండే
వ్యుత్పత్తి అర్థాన్ని అవగాహన చేసుకుంతూ పోతే ఎప్పుడూ కనిపించని దేవుళ్ల శక్తి
యుక్తుల మాట ఎట్లాగైనా పోనీ, కంటి ముందు తిరిగే మనిషి సునిశిత బుద్ధి వైశాల్యాన్ని
మెచ్చుకోబుద్ధివేస్తుంది. హద్దులెరుగని కల్పన చేయగల మేధోసామర్థ్యం
సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సొంతమన్న సూత్రం ఎంత తిరుగులేనిదో దేవతల పుట్టుకే
ఒక ఉదాహరణగా
నిలుస్తుంది. వేదకాలంనాట జడప్రాయులుగా ఉన్న దేవుళ్లు పురాణకాలం వచ్చేసరికి
మహిమోపేతులైన విగ్రహాల రూపంలో జనసామాన్యం మధ్య సుప్రతిష్ఠులవడంలో మనిషి సృజనాత్మకత
దాగివుంది.
వాల్మీకి రామాయణం 14వ సర్గలో దేవతల పుట్టుకను గురించి ప్రస్తావన ఉంది. జటాయువు తన పుట్టుకను
గురించి శ్రీరాముడికి వివరించే సందర్భంలో సృష్టిక్రమం, దేవతల
పుట్టుకల ప్రస్తావన వస్తుంది. ప్రజాపతులలో ఆఖరివాడు కశ్యప ప్రజాపతికి, అదితికి కలిగిన సంతానం ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి
చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం. కవుల కావ్యాలలో
కూడా పౌరాణిక దేవతల ప్రార్థనలకే అధిక ప్రాధాన్యం. తెలుగుకవులైతే నన్నయ కాలం నాటి
నుంచి అవతారికలలో ఈ
పౌరాణిక దేవతలకే వినతులు సమర్పించింది.
జానపద దేవతలు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి సమాజంలోని ఒక
ప్రధాన వర్గం చేసే పూజావిధానాలలో చాలా మౌలికమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖిత సాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక
మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖిత సాహిత్యం ద్వారా నీరాజనాలు
పట్టడం సర్వసాధారణమయిపోయిందనుకోండి. అమ్మవారు, పోతురాజుల వంటి ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లనే దాపరికం లేకుండా
పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం.
గ్రామదేవతలలో స్త్రీ దేవతలే అధికం. పురుషదేవతల ఉన్నా వాళ్లు అమ్మవార్లకు ఏ సోదరులో, భర్తలో, బంధువులో మాత్రమే. యుద్ధదేవతలు సాధారణంగా
పురుషదేవతలు అయివుంటారని, వ్యవసాయ సంబంధమైన
దేవతలలో స్త్రీ దేవతలే అధిక సంఖ్యలో ఉంటారని ఒక పరిశీలన. వ్యవసాయాధారిత దేశం అవడం చేత
భారతావని పల్లెపట్టుల నిండా స్త్రీలే అధికంగా ఉండడం, వారికి అనుకూలమైన
స్త్రీదేవతలే గ్రామాలలో ఎక్కువ ఆరాధనలు అందుకోవడం అనూచానంగా వస్తున్నట్లు పరిశీలకులు
భావిస్తున్నారు. జానపద దేవతలలో ప్రధానంగా రెండు తరగతులు కనబడతాయి. పార్వతీదేవి వంటి
శక్తి మూర్తులకు ప్రతినిధులుగా భావించబడే గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి
వంటి వారు ఒక తరగతికి చెందితే, ప్రజల సంక్షేమం కోసం
ప్రాణత్యాగాలు చేసిన ఊరి ఆడపడుచులు కాలక్రమేణా గ్రామదేవతలుగా మారి కొలుపులు అందుకునేవారు
మరో తరగతి దేవతలు.
వీరులను దేవుళ్లుగా భావించి ఆరాధించే సంప్రదాయం ప్రపంఛమంతటా
ఉన్నట్లే భారతదేశంలోనూ కద్దు. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క,
సారలమ్మ, శీవాజీ వంటి వాళ్ళు దైవసమానుల స్థాయికి ఎదిగి పూజలందుకోవడం గమనార్హం.
కులాచారం ప్రకారం తమ తమ దేవతలను ఆరాదించే సంప్రదాయం కూడా భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది.
బలులివ్వడం, మాంసాహారం నైవేద్యంగా సమర్పించడం, మద్యాన్ని ఆయా దేవతలకు ఆరబొయ్యడం, ముడుపులు కట్టడం,
తమకు ఇష్టమైన కాయనో, పండునో దేవుని
ప్రీత్యర్థం తినకుండా వదిలివేయడం.. జానపదులు ఆరాధించే విధానాలలో కొన్ని!
తెలుగు కావ్యాలలో జానపద దేవతలకు ఇష్టదేవతాప్రార్థనలలో
బొత్తిగా స్థానం లేదు! అందుకు చారిత్రిక కారణాలేమైనా ఉన్నాయేమో పరిశోధకులు
తర్కించవలసిన ముఖ్యమైన చారిత్రిక అంశం.
ఆధునిక దేవతలుః
ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, సంతోషిమాత, రాఘవేంద్రస్వామి,
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి నిజజీవులు దేవతలుగా పరిగణింపబడి
ఆరాధనలు అందుకుంటున్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ అంబేద్కర్,
మహాత్మా ఫూలే వంటి నవయుగ నిర్మాతలూ దేవతల స్థాయికి ఎదిగి నిత్యం
పూజలు అందుకుంటున్న క్రమం మనపిప్పుడు చూస్తున్నాం.
భారతీయులు తల్లిదండులను, గురువులను దేవతలతో సమానంగా
భావించి గౌరవించే సంప్రదాయం అనాది నుంచి వస్తున్న సత్సంప్రదాయం. 'గుకారశ్ఛాంధ కారోహి రుకారస్తేజ రుచ్యతే/అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురుదేవ న సంశయః': -గు అంటే చీకటి రు అంటే దానిని అడ్డగించేవాడు గురువు అని అర్థాలు చెప్పుకొచ్చింది
సంప్రదాయం.
సృష్టికి మూలం పరమాత్మ అనే భావన మీద ఆమోదమున్నప్పుడు సహజంగానే సృష్టిలోని సకల జీవజాతుల్లోనూ ఆ పరమాత్ముని
బింబమే ప్రతిఫలిస్తుందనీ ఒప్పుకోవాలి. ఆ రకంగా చూస్తే దేవుడు ఇన్ని రూపాలలో
ఉన్నాడన్న భావన కన్నా ఉన్న అన్నీ రూపాలకు అంతర్గత సూత్రం ఒకే పరమాత్మ స్వరూపం అని
అర్థం చేసుకోవడం మేలేమో! మతాల గురించి ఈ కలికాలంలో మనం ఏదేదో ఒకళ్ల నొక్కళ్లం దూషించుకుంటూ
సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథా ప్రయాసలేవీ లేని
ఒక స్పష్టత ఉంది. 'ఇన్ద్రం మిత్రం వరుణమగ్నిమహురథో దివ్యః స
సుపర్నో గురుత్వాన్/ ఏకం సద్విప్రా బహుధా వదన్త్యగ్నిం యమం మాతరిశ్వాన మహుః'- బుద్ధిబలం ఎక్కువైనందువల్ల
ఆకారమే లేని పరమేశ్వరుడికి ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని, యముడని,
అగ్ని అని ఏవేవో పేర్లు పెట్టి పిలుచుకుంటూ భిన్నరూపాలలో
భావిస్తున్నాం. వాస్తవానికి ఉన్నది ఒక్కటే. ఏకం సత్. అదే సత్స్వరూపం అని అన్న ఈ
రుగ్వేద మంత్రం అంతరార్థం ఇప్పటికైనా మనం అవగాహన చేసుకోవడం ఒక్కటే నానాటికీ మతపరమైన విద్వేషభావనలు సామాజిక వ్యవస్థను చెదరగొట్టకుండా శాశ్వతంగా మాసిపోయి శాంతిభద్రతల పునరుద్ధరణకు సులువైన దారి ఏర్పడేందుకు
అవకాశం దొరుకుతుంది.
కంటికి కనిపించని దేవుళ్ల కౌటింగ్ కన్నా.. కంటి ముందు కదిలే మనిషులే
మనుషులకు దేవుడనే భావన బలపడితే మరీ మంచిది.. అసలే గొడవలూ
ఉండవు.
-కర్లపాలెం హనుమంతరావు
29 -04 -2021
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుటలో ప్రచురితమైన వ్యాసం)
తెలుగు సాహిత్యంలో ముసల్మాన్ కవులు - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక ప్రచురితం)
తెలుగు సాహిత్యంలో ముసల్మాన్ కవులు
- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపత్రిక ప్రచురితం)
' మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృ భాష యొండు మాన్యము గదా
మాతృ శబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల'
ఈ పద్యం ప్రత్యేకత రచన చేసిన కవి ఒక ముస్లిమ్ మతానుయాయుడు. ఇది 'తెనుగుబాల' శతకంలోని ఒక నీతి పద్యం. రాసింది ముహమ్మద్ హుస్సేన్ .
పేర్లు ప్రత్యేకంగా చెప్పకపోతే తెలుగు కవుల సృజనే అని మురిపించే సాహిత్యం తెలుగునాట ముస్లిం కవులు, రచయితలు సృష్టించిన మాట వాస్తవం. వినుకొండ వల్లభరాయుడి 'క్రీడాభిరామం' తలలేని రేణుకాదేవి విగ్రహం ముందు నాటి ఊరి వెలుపలి వాడ ఆడపడుచులు నిర్వస్త్రంగా వీరనృత్యాలు చేయడం వర్ణించింది అద్భుతంగా. అదే పంథాలో అజ్మతుల్లా సయ్యద్ అనే ఓ ముసల్మాన్ కని దేవరకొండలో జరిగే జాతర దృశ్యాలను నాటి సాంఘిక పరిస్థితులు కళ్లకు కట్టేవిధంగా వర్ణించాడు.(చాటు పద్య రత్నావళి. పు. 126)
సర్కారు ప్రకటించిన స్థలంలో జరిగే సంతలో డబ్బున్న ఆడంగులు రకరకాల వస్త్రవిశేషాలు సందడిగా కొనుగోలు చేసుకుంటుంటే దమ్మిడీ చేత లేని లంబాడీ ఆడంగులు తమ దరిద్రానికి ఏడుపులు మొదలుపెట్టారుట. లంబాడీ తండాల ఆక్రోశానికి ధనికవర్గాలు నవ్వుకుంటుంటే ఉడుక్కుంటూ 'మాకీ జూసి నగ్తర్/మీకీ తలిదండ్రి లేవె మీ నే తు/ప్పాకీ తీస్కొని కొడ్తే/మాకీ పాపంబిలేద్రె..'అంటూ ఆ బీద మహిళలు షష్టాష్టకాలకు దిగడం చదివితే నవ్వు వస్తుంది.. ఆనక మనసుకు కష్టమేస్తుంది. తమ మతస్తులను అన్యమతానుయాయులు అవహేళన చేసే అవలక్షణాన్ని అన్యాపదేశంగా నిరసించే కవి ప్రతిభకు జోహార్లు చెప్పాలనీ అనిపిస్తుంది.
'సాయిబులకు తెలుగు సరిగా రాదు' అంటూ ముస్లిం పాత్రలకు 'నీకీ.. నాకీ' అంటూ తెలుగు నాటకాలు, చిత్రాలు తరచూ హేళన చేస్తుంటాయి ఇప్పుడు కూడా. నిజానికి నిత్య వ్యవహారంలో తెలుగు నేలల మీద.. ముఖ్యంగా దక్షిణాదిన ఏ ముస్లిమ్ మతస్తుడూ ఆ తరహా వెకిలి యాసతో మాట్లాడడు. ఏదైనా కొంత మాటలో తేడా కనిపించినా అది భాషాభేదం వల్ల కాదు. సంస్కృతుల మధ్య ఉండే సన్నని తారతమ్యపు పొర కారణంగా సంభవించేది. చిత్రాలలో చూపించేటంత విడ్డూరమైన ఉచ్ఛారణ వినోదం కోసమైనా మంచి అభిరుచి అనిపించుకోదు కదా!
తెలుగువారి హిందీ, ఇంగ్లీషు, మరే తెలుగేతర భాషలలో కనిపించే ఉచ్ఛారణలోనూ ఓ విధమైన యాస సాధారణగా కనిపించే తీరే. వాస్తవానికి తెలుగుదేశాలలో శతాబ్దాల బట్టి తెలుగువారి సంస్కృతీ సంబంధాలలో పాలలో తేనెలాగా కలగలసిపోయిన ఘనత ఇస్లాం మతానుయాయులకు దక్కుతుంది.
నల్లగొండ జిల్లా చిత్తతూరు గ్రామానికి చెందిన ఇమామల్లీ సాహెబ్ అని ఒక కవిగారికి కులమతాలనే వివక్ష లేదు. కవి అని తనకు తోచిన ప్రతీ సాహిత్యజీవికి అంతో ఇంతో సాయంచేయడం ఆయన అలవాటు. మరో సాటి కవి ఎవరో (చమత్కార.పు.15) సాహెబుగారి ఔదార్యాన్ని 'అల్లాతుంకు సదా యతుం సె ఖుదచ్ఛచ్ఛాహి ఫాజత్కరే/ఖుల్లాహాతుగరీబు పర్వరినిగా ఖూబస్తునాం మైసునే/అల్లాదేనె మవాఫికస్తుహర్ దూస్రే కోయి నైహై ఇమా/ మల్లీ సాహెబ్ చిత్తలూరి పుర వాహ్వా దోయిలందార్బలా ' అంటూ ఉర్దూ మిశ్రిత ఆంధ్ర ఛందోపద్యంలో శ్లాఘిస్తాడు.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం జనాభాలో అధిక శాతానికి ఉర్దూ పలుకు నోటి వరకే పరిమితం. అందులోనూ తెలుగువారిలాగా మాట్లాడేవారే ఎక్కువమంది. రాయడం దగ్గరకొచ్చేసరికే ముస్లిముల పాత్ర అటూ ఇటూ. తెలుగు సంస్కృతితో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ వాజ్ఞ్మయంలో ఆ మేరకు బంధం ఎందువల్ల బలపడింది కాదో?! పరిశోధకులే నిగ్గుతేల్చవలసిన చారిత్రకాంశం ఇది.
ఈ సాధారణ సూత్రానికి మినహాయింపుగా ముస్లిం కవులు తెలుగులో సాహిత్య సృజన చేసిన మాట కొట్టిపారవేయలేం. రాసిలో కాకపోయినా వాసిలో తెలుగు సాహిత్యంతో పోటికి దిగగల సత్తా ఈ సాహిత్యానికి కద్దు.
మరుగున పడ్డ ముస్లిం కవులను గురించి మరుపూరు కోదండరామరెడ్డిగారు మరువలేని అంశాలు కొన్ని ప్రస్తావించారు. దావూద్ అనే ఇస్లామిక్ కవి 'దాసీ పన్నా' అనే కవితా ఖండిక దొరకబుచ్చుకుని చదువుకునే దొరబాబులకు ముస్లిం కవులు సాహిత్య సృష్టిలో ఒక్క ఆలోచనాధారలో మినహాయించి తతిమ్మా అన్నిటా సమవుజ్జీలేనని అంటారు. ఒప్పుకోక తప్పదు .
రాజపుత్రుడి రక్షణ కోసం, పన్నా తన పుత్రుణ్ని బలికావించింది. లోకపాపాల కోసం తన బిడ్డను బలి ఇచ్చానని చెప్పుకుంటున్న యొహోవా దేవుడికే ఇది పెద్ద సవాల్! ఎందుకంటే ఆయన చచ్చిపోయిన వాళ్లను కూడా బ్రతికించే శక్తి గలవాడు . కాబట్టి మూడో రోజుకయినా తన బిడ్డను సమాధిలోంచి తిరిగిలేపి తీసుకురాగలిగాడు.కాని పాపం , పన్నాకి ఆ శక్తిలేదు! అయినా పుత్ర త్యాగానికి వెనుకంజవేయలేదు. అందుకే ఆమె త్యాగమే గొప్పదని శ్లాఘిస్తూ దావూద్ హుస్సేస్ రాసిన ఈ కవిత ఎంతో కరుణరసార్ద్ర౦గ ఉంటుంది.
' సతత వాత్సల్యంబు జాల్వార్చి పోషింప/
తలపు గొన్నట్టి నీ తల్లిలేదు/
అఖిలార్ద్రతను నీకు నర్పించి/
మమతలం దలడిల్లునట్టి నీతండ్రిలేడు/
ఆత్మరక్తమై తమ్ముడంచు మించిన ప్రేమ/
నరసి పాలింప నీ అన్నలేడు/
రాజపుత్రుడితండు రక్షణార్హుడటంచు/
పరికించు పాలిత ప్రజయు లేదు/ దిక్కుదెసగలవాడవై దిక్కుగనక/
శోకసంతప్త భావనిస్తులత తోడ/
శత్రువుల మధ్య జిక్కిన సాంగపుత్ర/
నిన్ను పన్నాయె రక్షించు నిక్కమింక!' అంటారు కవి. ఎవరి మాటలు ఏ విధంగా సాగినప్పటికీ .. బలి అయిన ఆ అభాగ్య బాలుడిని అడిగితే ఏమని ఉండేవాడు? అని ఆయనే మానవతా హృదయంతో కంపించి ప్రశ్నించుకుంటూ ఆ మృతబాలుడి మనోభావాలనూ కవిగా తానే వెల్లడిస్తాడు
'మీ మీ స్వార్థాల కోసరంగా నోరులేని నన్ను బలిచేశార'ని వాదించడా? అని నిలదీస్తాడేమోనని సందేహిస్తాడు. మానవత్వం సహజలక్షణంగా లేని వ్యక్తులకు ఈ తరహా భావనలు మదిలో మెదిలే అవకాశమే లేదు. దావూద్ సాహెబ్ కవి ముస్లిం మతానుయాయుడు అయినంత మాత్రాన మనిషిలో ఉండవలసిన అనుకంపన లేకుండా పోయిందా?
మానవతా విలువలకు మతాలను అడ్డుపెట్టుకుని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద తప్పు! అదే ఇప్పుడు దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న అరాచకం ! ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించిన ఆలోచనాపరుల పైన దేశద్రోహం అభియోగం రుద్దే జుగుప్సాకరమైన ప్రయత్నమూ యథేచ్ఛగ సాగుతున్నది! షేమ్ ఆన్ అవర్ పార్ట్! సిగ్గు పడవలసిన అమానుషత్వం!
ఇంత విపులంగా ఇక్కడ చెప్పుకురావడానికి కారణం ఈ పద్య గద్య సాహిత్యంలో ఎక్కడైనా మన తెలుగు సినిమాలు హేళనచేస్తున్న లోపం కనిపిస్తున్నదా? ఈ పుస్తకం రాసింది ఒక ముస్లిం మతానుయాయి అన్న వాస్తవం చెవినబడితే విస్తుపోమా ? పుట్టింది ముస్లిం సంప్రదాయం అనుసరించే కుటుంబంలలోనే అయినా.. దావూద్ సాహెబ్ తరహాలో ఇస్లాం సంప్రదాయంలో నాని, హిందూ వేదాంతంలో ఊరిన ఎందరో ముసల్మాన్ కవులు చరిత్ర విస్మృతి పొరల్లోకి వెళ్లిపోయినట్లు మరుపూరివారి ఆరోపణ. ఇరవైయ్యొకటో శతాబ్దిలోకి అడుగు పెట్టినప్పటికీ అదే వివక్ష కొనసాగడం హర్షణీయమా?
కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు. ఆదర్శము లాంటి నవలలు , అబ్దుల్ ఖాదర్ జిలాని దివ్య చరిత్రము, నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము వంటి మహాపురుషుల జీవితచరిత్రలు, ఆజాద్ చరిత్రము లాంటి దేశ చరిత్రలు, ఆఖరుకి అభినవ తిక్కన కవితా సమీక్ష వంటి లోతైన సాహిత్య విమర్శనలు సైతం ముస్లిం కవి అయినప్పటికీ ఆయన చేతుల మీదుగానే ఏ తెలుగు పండితుడి రచనకూ తీసిపోని రీతిలో రూపుదిద్దుకున్నాయి!
సాహిత్యం పట్ల అభిరుచి అంటూ ఉండటం ఒక్కటే ముఖ్యం. ఆ ప్రధానమైన దినుసు మనదై ఉంటే దావూద్ సాహెబ్ లా రూపాయిన్నర పెట్టుబడితో పెట్టుకొన్న కిళ్లీ బడ్డీకొట్టు కూడా మనిషిలోని అక్షర తృష్ణను రెచ్చగొడుతుంది. ఏ మతం, ఏ కులం ఆ అభినివేశపు పురోగతికి అడ్డు కాలేవు.
అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండరామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డివంటి వుద్దండులు నిత్యం సాయంత్రపు వేళలలో తన ‘సాహిత్య తాంబూల సేవన మంజూషా” (కిళ్లీ కొట్టుకి కవులు పెట్టుకున్న ముద్దు పేరు అది) లో చేరి, తమతమ పద్య రచనా పఠనంపై గోష్టులు గావించడం ముస్లిమైన దావూదు కవిలో తెలుగు సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని రేకెత్తించింది . ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి ఆశ్రయంలో విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే సమయానికి దావూద్ సాహేబు ఇరవైరెండు ఏళ్ల ఆడపిల్ల తండ్రి!
' సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నందుకు రాళ్ల దెబ్బకు సిద్ధంగా ఉండమ'ని ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ వెనుకంజ వేయని దుర్భావారి నిర్భీతి ఇప్పుడైనా ఎంత మందికి ఉంటుంది?
సంస్కృతాంధ్రాలలో మదరాసు విశ్వవిద్యాలయం విద్వాన్ పట్టా పుచ్చుకుని నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరి మొదటి నెల జీతం గురుదక్షిణ కింద మనియార్డరుగా దావూద్ సాహెబ్ పంపిస్తే 'నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దుర్భావారు ప్రదర్శనకు పెట్టి మురిసిన మరపురానిరోజులు మళ్లీ వచ్చేనా! చిత్త పరివర్తనము, రసూల్ ప్రభువు శతకము, సంస్కార ప్రయాణము, సూఫీ సూక్తులు, సాయిబాబా మీద దండకంతో సహా ఓ కావ్యము, ఆజాద్ చరిత్రము, వచనంలో అభినవ తిక్కన కవితా సమీక్ష.. అట్లా దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల్లో తన దైన ముద్రతో తెలుగు సాహిత్యంలో గౌరవనీయమైన స్థానం సాధించిన ఘనత దావూద్ సాహెబ్ కవిది.
ఇస్లాము మతాన్ని విశ్వసించే సాహిత్య స్రష్టలు సృష్టించినవిగా చెప్పుకునే తెలుగు శతకాలే సుమారు మూడు పదులు . వికీపీడియాలో కనిపించే ఆ జాబితా ఆసాంతం పరిశీలిస్తే హిందూ కవుల ధోరణిలోనే ముసల్మాను కవులూ శతక సాహిత్యంలో తమకు సుపరిచితమైన భక్తి, తాత్విక విశేషాలనే ప్రబోధాత్మక పంథాలో ప్రకటించినట్లు స్పష్టమవుతుంది.
ముహమ్మద్ హుస్సేన్ అనే ముసల్మాన్ కవి 'భక్త కల్పద్రుమ శతకము'పేరుతో ఒక చక్కని శతకం రాసారు. ఈ పేరుతోనే పదహారణాల తెలుగు కవుల (బత్తలపల్లి నరసింగరావు, మేడవరము సుబ్రహ్మణ్యశర్మ, ఖాద్రి నరసింహ సోదరులు) చేతుల మీదుగా మరో మూడు శతకాలు రూపుదిద్దుకున్నప్పటికీ హుస్సేన్ కవి శతకం దానికదే ప్రత్యేకం. మొక్కపాటి శ్రీర్రామశాస్త్రిగారితో కలసి మొహమ్మద్ హుస్సేన్ రాసిన మరో శతకం 'సుమాంజలి'. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము, తెనుగుబాల శతకము మరి కొన్ని!
ఆ దారినే సయ్యద్ ముహమ్మద్ అజమ్ అనే మరో ముసల్మాన్ కవి 'సయ్యదయ్యమాట సత్యమయ్య' మకుటంతో, గంగన్నవల్లి హుస్సేన్‌దాసు 'ధర్మగుణవర్య శ్రీ హుసేన్ దాసవర్య' మకుటంతో 'హుస్సేన్‌దాసు ముస్లిమ్ శతక సాహిత్యం సృష్టించారు. ముహమ్మద్ యార్ 'సోదర సూక్తులు', తక్కల్లపల్లి పాపాసాహెబ్ కవి మతవిభేదాలను విమర్శిస్తూ ' వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమేదియనె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట' అంటారు.
షేక్ ఖాసిం 'సాధుశీల శతకము'లో 'కులము మతముగాదు గుణము ప్రధానంబు/ దైవచింత లేమి తపముగాదు/, బాలయోగి కులము పంచమ కులమయా,/ సాధులోకపాల సత్యశీల' అంటూ సుద్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. షేక్ అలీ గురుని మాట యశము గూర్చుబాట' అనే మకుటంతో 'గురుని మాట' శతకం రాస్తూ 'ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన /పాండితీ ప్రకర్ష పట్టుబడదు/ పరులభాష గాన భాధను గూర్చును/గురుని మాట యశము గూర్చు బాట' అన్నారంటే మతాలతో నిమిత్తం లేకుండానే సమాజ సంస్కరణల పట్ల సాహిత్య ప్రగతిశీలులందరిదీ ఒకే బాట- అన్న మాట ఖాయమైనట్లే కదా!
సమకాలీన సమాజం నుంచి వ్యక్తులను, వర్గాలను రకరకాల సమూహాల వంకతో వేరు చేసే ప్రయత్నంలోని రాజకీయ ఎత్తుగడలతో సాహిత్యానికి, సమాజానికి నిమిత్తం ఉండదు. ఎక్కడి సంస్కృతితోనే ప్రభావితమైన శక్తులు ఇక్కడి పరిసరాల కాలుష్యానికి కారణమని దుష్ప్రచారం నిరాటంకంగా కొనసాగినప్పటికీ లౌకిక సమాజం ఆమోదించదు.
ముసల్మానుల సాహిత్య ప్రయాస ఇచ్ఛాపూర్వకంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మాట అవాస్తవేమీ కాదు కానీ.. ఉనికి పోరాటాలు ఊపందుకున్న 1990 లకు చాలా ముందు నుంచే అన్ని దశల్లోనూ యథాశక్తి తన వంతు ప్రతిభతో ప్రభావితం చేస్తూనే వస్తోందన్నది మొహమ్మదీయ మతం అన్నది ఒప్పుకోక తప్పని వాస్తవం.
కుడి నుంచి కుడి వైపుకు రాసుకు పోయే లిపి ఉర్దూ. ఎడమ నుండి కుడికి రాయడమంటే ముసల్మానుల దృష్టిలో పెడరాతల కిందే లెక్క. ఆ తరహా రాతలను నిరసించమని వారి మతం నివారిస్తున్నప్పటికీ పెడచెవినబెట్టి తెలుగు సాహిత్య వర్ణమాలకే గులాబిమాలలు సమకూర్చి పెట్టిన ఘనత ఇస్లాం కవిశ్రేష్టులది.
ఉర్దూ మాతృభాషగా ఉన్నప్పటికీ లెక్కకు మించిన సాహిత్యవేత్తలు తమ ప్రతిభతో తెలుగు సాహిత్యలక్ష్మికి తొడిగిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు పత్రికా రంగంలో తొట్టతొలిగా పాదం పెడుతూ 1842, జూన్ 8 మొదటి 'వర్తమాన తరంగిణి' వారపత్రిక తొలి సంచికలో 'మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి' అని రాసుకున్నారు సయ్యద్‌రహమతుల్లా సాబ్!
1891 లో నరసాపురం నుంచి మీర్ షుజాయత్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో సాగిన 'విద్వన్మనోహారిణి' తదనంతరకాలంలో వీరేశలింగంగారి 'వివేకవర్ధని' లో కలసిపోయింది. రాజమండ్రి నుండి వెలువడ్డ 1892 నాటి బజులుల్లా సాహెబ్, 'సత్యాన్వేషిణి, 1909 నాటి షేక్ అహ్మద్ సాహెబ్ 'ఆరోగ్య ప్రబోధిని' ముసల్మానుల తెలుగు పాత్రికేయ రంగంలో చేసిన సేవలకు కొన్ని నిదర్శనాలు. 1944 లో హైదరాబాదు నుంచి వెలువడ్డ 'మీజాన్' దినపత్రికకు తెలుగు ప్రసిద్ధ రచయిత అడవి బాపిరాజు సంపాదకులుగా సహకారం అందించారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారి 'తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది. సయ్యద్ సలీం నవల ' కాలుతున్న పూలతోట' 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించింది. వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం 'జుమ్మా' 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు గెల్చుకున్నది.
సయ్యద్ నశీర్ అహ్మద్ 'అక్షర శిల్పులు' పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు, రచయితల వివరాలతో 2010 లో సమాచార గ్రంథం వెలువరించడం .. తెలుగు సాహిత్య లోకంలో ఉర్దూకవుల పాత్రను తగ్గించి చూడలేమని చెప్పడంగా అర్థం చేసుకోవడం మేలు.
'సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా/హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా, హమారా'('సమస్త ప్రపంచములలో ఉత్తమైనది మన హిందూస్థాన్.. ఇది మనదే.. మనదే!మనం దీని బుల్ బుల్ పిట్టలం సుమా!ఈ దేశం ఈ దేశమే మన ఉద్యానవనం మిత్రమా!) సెప్టెంబర్ 23, 1964 నాటి మహమ్మద్ ఇక్బాల్ పాట అయినప్పటికీ ముస్లిమ్ సోదరసోదరీమణుల మనోరథం ఇప్పటికీ ఇదే! దేశం లౌకిక తత్వానికి సంకేత సూచకంగా ఈ గీతాన్నీ మనం మన జాతీయగీతాలలో ఒకటిగా మలుచుకున్న లౌకిక భావం మర్చిపోతున్నామా? 'పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలూ చెలరేగే నేడు' అంటూ మహాకవి శ్రీశ్రీ వాపోయాడు వెలుగు నీడలు సినిమాలో. అరైవై ఏళ్లనాటికన్నా అధ్వాన్నంగ ఉంది ఈనాటి పరిస్థితి!
' లుచ్ఛా జమానా ఆయా/అచ్ఛోంకో హాథ్ దేనా హర్ ఏక్ సికా/ అచ్ఛా జమానా ఫిర్ కబ్ / వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబు!' (చెడ్డవాళ్ల కాలం వచ్చింది. చెయ్యివ్వడమే ప్రతివాడు నేర్చేసుకుంటున్నది. మంచిరోజులు ఎప్పుడు వస్తాయో చెప్పవయ్యా వల్లీసాహెబూ? అని ఓ శాస్త్రులుగారు పోయిన వాపోతకు ఆ వల్లీసాహెబుగారు 'బందేనవాజ్ బుజురుగ్ /జిందా హై ఆజ్ తో న జీతే హమ్ ఖుదా/ బందాహి జానె వహాసబ్/గందరగోళం జమాన ఖాజాసాబూ! (దేశసేవకులు, పుణ్యపురుషులు (చేసిన మంచి పనుల వల్ల) శాశ్వతంగా ఉన్నారు. మనం అట్లా జీవించలేం. దైవభక్తుడు, సేవకుడు ఆ విషయం తెలుసుకోడం మేలు. ఇప్పడు వచ్చిందంతా గందరగోళంగా ఉండే కాలం కదా ఖాజాసాబూ?) అంటూ ఆ వల్లిసాబుగారు జవాబు ఇచ్చారని ఓ సరదా కవిత్వం. అల్లికలో సరదా కనపడుతున్న మాట నిజమే కానీ, పద్యాలలో ప్రస్తావించిన దైన్య స్థితి మాత్రం ఈ హిందూ- ముస్లిమ్ మత భేదాల కారణంగా దేశంలోని సామరస్య వాతావరణం దెబ్బతింటుందోన్న వాస్తవం అందరం ఒప్పుకోవాలి.
మెహబూబ్ నగర్ జిల్లా మొదటి పేరు పాలమూరు జిల్లా. కరువుకాటకాలకు ఆ జిల్లా మారుపేరు. పనిపాటలు చేసుకుని పొట్టపోసుకునే జనాభా అధికంగా ఉండేదీ అక్కడే! అనావృష్టి పరిస్థితులకు అక్కడి జనాభా తరచూవలసబాట పట్టే పరిస్థితులను కదలిపోయి 'తూఫాను వానలే తుదికి గతియాయె/ఋతుపవనాలెల్ల గతిని దప్పె/చెఱువులు కుంటలు దొరువులు జాలులు/ఇంకి నెఱ్ఱెలు వారె బంకమట్టి/వర్షాలు కురియక కర్షకులెల్లరు/ బ్రదుకుదెరువు బాసి బాధపడుచు/గొడ్డు గోదముల నెల్ల గడ్డి గాదెము లేక/దుడ్డుదమ్మిడికమ్మి దుఃఖపడుచు/లేబరై గుంపుగుంపుగ లేవసాగె/తాళములు వేసి ఇళ్లకు తల్లెచెంబు/కుదువబెట్టుచు కూటికై వదలి రిపుడు/పల్లెలెల్ల లబోమని తల్లడిల్లె' అంటూ ధుఃఖంతో జహంగీర్ మహమ్మద్ అనే ముసల్మాన్ కవి అచ్చమైన తెలుగు పలుకుబడిలో వెళ్లగక్కిన ఆవేదన ఏ ముస్లిమేతర కవి సాధించగలిగేది ?
కదిలితే తెలుగు కవిత, మెదిలితే తెలుగు మాటగా బతికిన ముసల్మాన్ కవుల జాబితా కదిలించాలే గాని హనుమంతుని తోకంత! విందుకు పిల్చి రోసెన్న అనే పెద్ద మనిషి పాచి అన్నం పెట్టినందుకు విస్తరి ముందు నుంచి లేచిపోతూ హుస్సేన్ మహమ్మద్ అనే రాయలసీమ కవి 'అయ్యవ! మియ్యవ!కొయ్యవ!/చయ్యన చల్దన్నమేసి సరిపుచ్చెదు రో/శయ్యా పిన్నలు పెద్దలు/కుయ్యోమనుచున్న యిట్టి గోడును గనవా!' తిట్టిపోసాడు. ఆ సందర్భంలో హుస్సేన్ సాబ్ నోటి నుంచి వెలువడిన ఆవేదన 'అక్కట దయలేదా మరి/బుక్కెడు కూటికిని కటకటంబుట్టించితిరో!/కుక్కవొ నక్కవొ తిక్కవొ!/చిక్కడు నీ వంటి లోభి సిద్ధము వినరా!' అనే ఆవేదన ఇప్పటి వాతావరణంలో ఆ మైనారిటీ జాతి ఎదురుకొనే అవమానాలకు దర్పణం పట్టినట్లనిపిస్తుంది కదూ! 'భక్త కల్పద్రుమ శతకము కర్త మహమ్మదు హుస్సేన్ ఈ హుస్సేస్ సాబ్ అవునో కాదో తెలియదు. సాహేబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే! అన్నట్లుంది దేశంలో ఉర్దూ పౌరుని దైన్య స్థితి.
-కర్లపాలెం హనుమంతరావు
23 - 99-2021
బోధెల్ ; యూ. ఎస్.ఎ
Thursday, December 9, 2021
వయోవృద్ధుల ఊత కర్ర- సాంకేతిక పరిజ్ఞానం -కర్లపాలెం హనుమంతరావు
వయోవృద్ధుల ఊత కర్ర- సాంకేతిక పరిజ్ఞానం
రచన: -కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపత్రిక - కాలమ్ )
వినడానికి విడ్డూరంగానే ఉన్నా.. వయో వృద్ధుల జీవన ప్రమాణాలను పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరుస్తుందన్న మాట నిజం. ఆరంభంలో అలవాటు లేని అవుపాసనలా అనిపిస్తుంది; మాలిమి చేసుకున్న కొద్దీ వయసు వాటారే వృద్ధులకు అదే ఊతకర్రకు మించి మంచి తోడు అవుతుంది.
గడచిన ఒకటిన్నర శతాబ్ద కాలంగా మానవ జీవనస్థితిగతుల్లో కనిపించే గణనీఉయమైన మెరుగుదల హర్షణీయం. అందుకు కారణం పారిశుధ్యం పైన మునపటి కన్నా పెరిగిన శ్రద్ధ; అదనంగా నాణ్యమైన వైద్య సంరక్షణ. మానవ ఆయుర్దాయం క్రమంగా పెరగడం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలలో కూడా ప్రస్ఫుటంగా కనిస్తుందిప్పుడు.
విశ్వవ్యాప్తంగా మనిషి సగటు జీవితకాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదల కొత్త శతాబ్దం నుండి ఆరంభయింది. 2016 మధ్య వరకు దొరుకుతున్న లెక్కల ప్రకారం ఈ పెరుగుదల ఐదు సంవత్సరాల ఐదు నెలలు. గత శతాబ్ది ’60 ల తరువాత నమోదైన అత్యంత వేగవంతమైన పెరుగుదలలో ఇదే గరిష్టం. దేశ జాతీయ గణాంకాలు ఇంతకు మించి ఘనంగా మోతెక్కడం మరో విశేషం. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 రికార్డులు చూసుకుంటే, భారతదేశంలో ఆయుష్షు ప్రమాణం ‘70-‘75లలో 49 సంవత్సరాల ఏడు నెలలుగా ఉంటే, అదే జీవితకాలం 2012-2016ల మధ్యలో ఏకంగా 68.7 సంవత్సరాలకు ఎగబాకింది. ఇంత పెరుగుదల వల్ల తేలిన పరిణామం ఏమిటంటే, జాతీయ జనాభా మొత్తంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య గణనీయంగా పెరగడం! ఇవాళ దేశ జనాభాలో వయోవృద్ధుల వాటా ఒక బలమైన స్వతంత్ర వర్గంగా తయారయింది. సమాజంలోని ముఖ్యాంగాలలో ఒకటిగా లెక్కించక తప్పని పరిస్థితి కల్పించింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానమూ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి పథంలో దూసుకురావడం.. అదృష్టం.
ఆధునిక సాంకేతిక జ్ఞానం సాయం లేకుండా రోజువారీ దినచర్య క్షణం ముందుకు సాగని పరిస్థితులు ఇప్పడున్నవి. అంతర్జాల పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేసే ఉపకరణలు(యాప్స్) ఉనికిలో లేనట్లయితే ప్రపంచానికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించడం కష్టమే! సాంకేతికత సాయం వినా కోవిడ్- 19 వంటి మహమ్మారులు ఇప్పుడు సృష్టించే లాక్-డౌన్లు, ఐసొలేషన్ ఉపద్రవాలను ఏ విధంగా తట్టుకోవడం?
ఉత్పాతాలు ఒక్కటనే కాదు, మహమ్మారులు జడలు విదల్చని ముందు కాలంలో కూడా మనిషి జీవితంలో సాంకేతిక అనివార్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం ఆధారంగా మెరుగయ్యే జీవనశైలి పైన మారుమూల పల్లెజీవి కూడా మోజుపడే తరుణం ఒకటుంది. అయినా సాంకేతిక రంగ సంబంధిత మార్కెట్ అన్ని రిస్కులు ఎందుకు ఎందుర్కొంటున్నట్లు? క్షణక్షణం మారే ఆ సాంకేతిక పరిజ్ఞానం సృష్టించే అనిశ్చిత వాతావరణమే అందుకు ప్రధాన కారణం. రైడ్-ఆన్-కాల్ సౌకర్యం అందించే ఉపకరణలు ముమ్మరం అయిన తరువాత మధ్యతరగతివారి కార్ల కొనుగోళ్ల వాటా అథఃపాతాళానికి అణగిపోవడమే అందుకు ఉదాహరణ! వంటిఆరోగ్యం నుంచి ఇంటిపనుల వరకు అన్నింటా టెక్నాలజీ నీళ్లలో పాలలా కలగలసిపోయి ఉన్న నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం వయసు మళ్లినవాళ్లకు వాస్తవంగా ఒక గొప్ప వరం కావాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అందుకు విభిన్నంగా ఉన్నాయి. అదీ విచిత్రం!
గడప దాటి కాలు బైటపెట్టలేని వయోవృద్ధులకు కుటుంబ సభ్యుల నిరంతర సేవలు ఎల్లవేళలా లభ్యమయ్యే కాలం కాదు ఇప్పటిది. ఇంటి పట్టున ఒంటిగా మిగిలుండే వృద్ధులకు అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ నిజానికి ఎంతో అండగా ఉండాలి. కానీ, పాతకాలపు ఆలోచనలు ఒక పట్టాన వదలుకోలేని ముసలివాళ్ల సంశయాత్మక మానసిక బలహీనత సాంకేతిక పరిజ్ఞాన పరిపూర్ణ వినియోగానికి అవరోధంగా మారుతున్నది. మొబైల్ అంటే కేవలం టెక్స్టింగ్ మాత్రం చేసుకునే ఓ చేతిఫోన్ సౌకర్యం.. అనుకునే తాతా అవ్వలే జాస్తిగా కనిపిస్తున్న పరిస్థితి ఇప్పటికీ. యాప్ లంటే కుర్రకారు ఆడుకుందుకు తయారయ్యే ఏదో ఫోన్ సరదాలని గట్టిగా నమ్మినంత కాలం టెక్ ఆధారిత వేదికలను నమ్మి ఆమ్మమ్మలు, తాతయ్యలు గాడ్గెట్లను నిత్యజీవితావసరాలకు ధీమాగా వాడటం కల్ల. వయసు పైబడినవారిలో టెక్నాలజీ మీద ఉండే అపనమ్మకం ఎట్లా తొలగించాలన్నదే ఈనాటి టెక్ మార్కెట్లను తొలిచేస్తున్న ప్రధాన సమస్య.
కాలిఫోర్నియా శాన్డియాగో విశ్వవిద్యాలయం ల్యాబ్ డిజైనర్ షెంగ్జీ వాంగ్ ఇటీవల వయసు వాటారిన వాళ్ల మీద సాంకేతిక పరిజ్ఞానం చూపించే ప్రభావాన్ని గురించి ఓ పరిశోధన పత్రం వెలువరించాడు. పదే పదే ఎదురయ్యే పలు సందేహాలకు సులభంగా సమాధానాలు రాబట్టే సౌలభ్యం తెలీకనే సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొత్త టెక్ అంటే చిరాకుపడతారన్నది షెంగ్జీ వాంగ్ థియరీ. ఇటు ఉత్సుకత ఉన్న ముసలివాళ్లనైనా ప్రోత్సహించనీయని చిక్కుముళ్లు అనేకం పోగుపడటమే వృద్ధజనం ఆధునిక సాంకేతికత వాడకానికి ప్రధానమైన అడ్డంకి అని కూడా అతగాడు తేల్చేశాడు.
తరచుగా మారిపోయే అప్ డేట్స్, తత్సంబంధమైన మార్పులు చేర్పులు పెద్దవయసువారికి ఒక పట్టాన అర్థం కావు. ఉదాహరణకు, ‘బటన్స్’ ఒక క్రమంలో నొక్కి కోరుకున్న సేవలు పొందటం అలవాటు పడ్డ తరువాత, అవే సేవల కోసం ఆవిష్కరించిన మరో కొత్త ‘బటన్ లెస్’ విధానం మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవడం వృద్ధుల దృష్టిలో విసుగు పుట్టించే వృథా ప్రయాస. ఒక వయసు దాటినవారి మానసిక ఏకాగ్రతలో వచ్చే సహజ మార్పులను పరిగణనలోకి తీసుకోని పక్షంలో అధునాతన విజ్ఞానం ఎంత ఘనంగా పురులు విప్పి ఆడినా పెద్దలకు ఆ భంగిమల వల్ల ఒనగూడే లాభాలు ఒట్టిపోయిన గోవు పొదుగు పిండిన చందమే. గొప్ప సాంకేతిక విజయంగా నేటి తరం భావిస్తున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పెద్దలను ఇప్పటికీ జయించలేని ఒక మాహా మాయామృగంగానే భయపెట్టేస్తోంది. కృష్ణారామా అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడపే వయసులో మొరటు మృగాలతో పోరాటాలంటే ఏ ముసలిమనిషికైనా ఉబలాటం ఎందుకుంటుంది?!
పొద్దస్తమానం కొత్త కొత్త పాస్ వర్డ్స్ ఎన్నో పరిమితులకు లోబడి నిర్మిస్తేనే తప్ప సేవలు అందించని యాప్ లు వయసు మళ్లినవాళ్ల దృష్టిలో ఉన్నా లేనట్లే లెక్క. జ్ఞాపకశక్తి, నిర్మించే నైపుణ్యం సహజంగానే తరిగిపోయే ముసలివగ్గులకు ఈ తరహా పాస్ వర్డ్ ‘ఇంపోజిషన్స్’ శిక్ష దాటరాని ఆడ్డంకిగా తయారవుతున్నది. లాగిన్ కాకుండా ఏ సేవా లభించని నేపథ్యంలో అన్ని వెబ్ కాతాలకు ఒకే తరహా లాగిన్ ఉంటే వృద్ధజనాలకు ఎక్కువ సౌలభ్యంగా ఉంటుంది. ఆ తరహా వెసులుబాటుకు గూగుల్ వంటి పోర్టల్సు ఒప్పుకుంటున్నా, సెక్యూరిటీ కారణాలు అవీ ఇవీ చెప్పి చుక్కలు చూపించే అప్రమత్తత వాటిది. దిక్కులు చూస్తూ కూర్చునే దానికా వేలు పోసి స్మార్ట్ ఫోనులు పెద్దలు కొని ఒళ్లో పెట్టుకొనేదీ! ఎన్నో రకాల అంతర్జాల వేదికలు(ఇంటార్నెట్ ఫ్లాట్ ఫారమ్స్)! అంతకు వంద రెట్లు అయోమయ ఉపకరణలు(యాప్స్)! ఒక్కో అంతర్జాల కాతా కు ఒక్కో తరహా నియమ నిబంధనలు! సాంకేతిక సంక్లిష్టత కురుక్షేత్ర యుద్ధం నాటి అభిమన్యుడి సంకట స్థితి తెచ్చిపెడుతుంటే, తాజా టెక్నాలజీ వల్ల వృద్ధజనాలకు ఒనగూడే ప్రయోజనం ఏమిటన్నది జవాబు దొరకని ప్రశ్నయింది.
కొత్త టెక్నాలజీ హంగూ ఆర్భాటంగా రంగ ప్రవేశం చేసేది ముసలితరంగాతమను మరంత వంటరి చేసేందుకే అని పెద్దలు భావించడంమొదలయితే నూతన సాంకేతిక పరిజ్ఞాన వికాసం మౌలిక లక్ష్యమేసమూలంగా దెబ్బతిన్నట్లు లెక్క. కనీసం డబ్బు చింత లేని పెద్దవారికైనా.. ఆధునిక సాధనాలతో ఆ దివి సదుపాయాలన్నీ భువి మీదకు దింపుతామనే హామీ అత్యాధునికమని చెప్పుకునే లేటెస్ట్ టెక్ నిలుపుకుంటుందా? మనవళ్ల, మనవరాళ్ళ తరం మాదిరి యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే కదా ఏ ఆధునిక పరిజ్ఞానం వాడకం వైపుకైనా అవ్వాతాతల ఆసక్తులు రవ్వంతైనా మళ్లేది! అట్లాగని సైబర్ నేరాలతో రాజీపడిపొమ్మని కాదూ.. అర్థం.
తప్పేమన్నా జరిగిపోతుందేమోనన్న భయం పెద్దవయస్కుల్లో ఎక్కువ మందిని స్మార్ట్ ఫోన్ రిస్క్ తీసుకోనివ్వడంలేదు. ఈ కాలంలో పసిపిల్లలుసైతం అతి సులువుగా ఆడేస్తున్న విసిఆర్ రిమోట్.. ముందు తరాన్ని ఈవిధంగానే మహా బెదరగొట్టింది. వాస్తవానికి టచ్, వాయిస్ వంటిసదుపాయాలతో సీనియర్ సిటిజన్లు అద్భుతమైన సేవలు అందుకునే సౌలభ్యం మెండు. ఆ ‘హై- టెక్’ అద్భుత దీపంతో పని చేయించుకునేసులువు సూత్రం ముందు ముసలితరం అల్లావుద్దీన్ తరహాలో స్వాధీనపరుచుకోవాలి. మొబైళ్లూ, యాప్ ల నిర్మాతలే, టి.వి అమ్మకాల పద్ధతిలో డోర్ స్టెప్ డెమో సర్వీసులు అందించైనా అందుకు పాతతరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒకే రకం సేవలకు పది రకాల పరికరాలతో ముసలి మనసులను మయసభలుగా మార్చకుండా సీనియర్లే తమ అవసరాలు, అభిరుచులకు తగ్గట్లుగా ప్రత్యేక ఉపకరణాలు స్వంతంగా ఎంచుకునే తీరులో ఈ శిక్షణా పరంపరలు కొనసాగాలి. పాతతరానికి కొత్త నైపుణ్యాలు నేర్పించడంలోనే ఆధునిక టెక్నాలజీ విజయ రహస్యమంతా ఇమిడి వుందన్నముఖ్య సూత్రం మరుగున పడటం వల్లే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధుల విషయంలో పేరుకు మాత్రమే కాళ్లున్నా కదలలేని కుర్చీలా కేవలం అలంకారప్రాయంగా ఆర్భాటం చేస్తున్నది.
ఖర్చులకు రొక్కం కావాలన్నా కాళ్లు పీకేటట్లు బ్యాంకుల ముందు పడిగాపులు తప్పని కాలం ఒకప్పడిది. తపాలా కార్యాలయానికి వెళ్లి కార్డు ముక్క గిలకనిదే అయినవాళ్ల సమాచారం అందే పరిస్థితి లేదు అప్పట్లో! మరి ఈ తరహా తిప్పలన్నిటినీ తప్పించేటందుకే నెట్ బ్యాంకింగొచ్చిందన్నారు; ఈ మెయిలింగొచ్చి గొప్ప మార్పులు తెచ్చిందన్నారు! ఇంటి కిరాణా సరుకునుంచి బైటకు వెళ్ల దలిస్తే కావలసిన రవాణా సౌకర్యం వరకు, సమస్తసర్వీసులు దబాయించి నొక్కే బటన్ కిందనే దాగి ఉండే స్మార్ట్ ఫోన్ సీజన్లో లోకం ఊగిపోతుందంటున్నారు! ఏమేమి సేవలు వచ్చాయో, ఎవరిని మెప్పించే ఏ మహా గొప్ప మార్పులు తెచ్చి ఊపేస్తున్నాయో!? చురుకుపాలు తగ్గిన పెద్దవాళ్ల అవసరాల గొంగడి మాత్రం ఎక్కడ వేసింది అక్కదే పడి ఉందన్న అపవాదు మాత్రం తాజా టెక్నాలజీ మూటకట్టుకుంటున్న మాట నిజం. ‘అయ్యో! ఐ-ఫోనుతో పనా ? అయ్యేదా పొయ్యేదా నాయనా?’ అన్నముసిలివాళ్ల పాత నసుగుడే సర్వత్రా ఇప్పటికీ వినవస్తున్నదంటే.. లోపం ఎక్కడుందో లోతుగా తరచిచూసుకొనే తరుణం తన్నుకొచ్చిందనే అర్థం!
వయసు మీద పడే కొద్దీ పంచేద్రియాల పటుత్వం తగ్గడం సహజం.సౌలభ్యం ఒక్కటే కాదు, పనిసులువూ పెద్దల దృష్టిలో అందుకే ప్రధానంగా ఉంటుంది! రవాణా, ఆరోగ్య సంరక్షణల వంటి ముఖ్యమైన రోజువారీకార్యకలాపాలలో పెద్దవయస్కులకు మద్దతు ఇచ్చే తేలికపాటి డిజైన్ల పైనదృష్టి పెట్టాలి. టచ్ బటన్ టెక్నాలజీలో గొప్ప సేవాభావం ఉంటే ఉండవచ్చు. కానీ, ముందుతరం అతి కష్టం మీద అలవాటు పడ్డ ‘బటన్’ సిస్టమ్ పూర్తిగా తొలగిస్తే ఎంత ‘స్మార్ట్’ అయివుండీ పెద్దలకు వనగూడే ప్రయోజనంమళ్లీ ప్రశ్నార్థకమే అవుతుంది కదా! విసిగించకుండా, కంటిని, వంటిని అతిగా శ్రమపెట్టకుండా సేవలు అందించే ఉపకరణాలు ఉపయోగంలోకి తెచ్చినప్పుడే సీనియర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ మీద మోజు మొదలయేది. వాడకం పెరిగేది. కోరకుండానే సాయానికి రావడం, ఆపరేషన్ పరంగా తప్పు జరిగినా ఆంతర్యం గ్రహించి సేవలు చేయడం, వేళకు మందులుమాకులు, తిండి తిప్పల వంటి విషయాలలో అప్రమత్తంగా ఉండిఆత్మీయంగా సేవలు అందించడం వంటి సామాజిక కార్యకర్తల బాధ్యతలన్నీకుటుంబ సభ్యులను మించి శ్రద్ధగా నిర్వహించే సాంకేతిక పరిజ్ఞానంసాకారమయిన రోజే సినియర్ సిటిజన్ల మార్కెట్టూ స్మార్ట్ టెక్నాలజీ రంగంబ్యాలెన్స్ షీటులో క్రెడిట్ సైడుకు వచ్చిపడేది. వయసు వాటారిన వారి స్మార్ట్ టెక్నాలజీ వాటా మార్కెట్లో మరంత పుంజుకున్నప్పుడే అటు సీనియర్ సిటిజన్ల సంక్షేమం, ఇటు ఆర్థిక రంగ పునరుజ్జీవం సమాంతరంగా ముందుకుసాగేది.
వృద్ధాప్యానికి మద్దతు ఇచ్చే బాధ్యత సమాజం మొత్తానిది. మొబైల్కంపెనీలు ముసలివారి ప్రత్యేక అవసరాల కోసం ఉపకరణలు తయారుచేయడమే కాదు, అదనంగా ధరవరలలోనూ ప్రత్యేక రాయితీలు కల్పించాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా నిర్దిష్ట ప్రచారాలనుముమ్మరం చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. సరసమైన ధరకునాణ్యమైన వైఫై అంతరాయం లేకుండా అందుబాటులో ఉన్నప్పుడే పెద్దవయసువారి అడుగులు ప్రధాన సాంకేతిక స్రవంతి వైపుకు నిమ్మళంగాపడే అవకాశం.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు దాదాపు విచ్ఛిన్న దశకు చేరి దశాబ్ద కాలందాటిపోయిన మన దేశంలో పెద్దవయస్కుల పట్ల పిన్నవారి ప్రేమానురాగాలప్రదర్శనల్లోనూ పెనుమార్పులు తప్పటంలేదు. కాలం తెచ్చే మార్పులనుమనస్ఫూర్తిగా అంగీకరించడం మినహా మరో ఐచ్ఛికం లేని నేపథ్యంలో.. సమాజం తీరును వేలెత్తి చూపే కన్నా వేలు కింది బటన్ నొక్కడం ద్వారా కుటుంబానికి మించి సమాజం అందించే సేవా సౌకర్యాలుఅనుభవించడమే కుటుంబాలలోని పెద్దలకూ మేలు. వృత్తి వత్తిళ్ల మధ్యనే వీలయినంత శ్రద్ధ తీసుకుని కన్నబిడ్డలు, దగ్గరి బంధువులే ఇంటిపెద్దలనునవీన టెక్నాలజీకి దగ్గర చేయడం .
రచన: -కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపత్రిక - కాలమ్ )
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...