'మాతృదేవి
యొకటి,మాతృభూమి యొకండు
మాతృ భాష యొండు మాన్యము
గదా
మాతృ శబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల' ఈ
పద్యం ప్రత్యేకత రచన చేసిన కవి ఒక ముస్లిమ్ మతానుయాయుడు కావడం. ఇది 'తెనుగుబాల' శతకంలోని ఒక నీతి పద్యం, రాసింది ముహమ్మద్ హుస్సేన్
.
పేర్లు ప్రత్యేకంగా చెప్పకపోతే తెలుగు కవుల సృజనే అని మురిపించే
సాహిత్యం తెలుగునాళ్లల్లో
ముస్లిం కవులు, రచయితలు కొంత సృష్టించిన మాట నిజం.
వినుకొండ వల్లభరాయుడి 'క్రీడాభిరామం'
తలలేని రేణుకాదేవి విగ్రహం ముందు నాటి వెలివాడ ఆడపడుచులు నిర్వస్త్రంగా
వీరనృత్యాలు చేయడం అత్యద్భుతంగా
వర్ణించింది. అదే పంథాలో అజ్మతుల్లా సయ్యద్ అనే ఓ ముసల్మాన్ కని దేవరకొండలో జరిగే
జాతర దృశ్యాలను నాటి సాంఘిక పరిస్థితులు కళ్లకు కట్టేవిధంగా వర్ణించారు. సర్కారు
ప్రకటిత జాగాలో జరిగే సంతలో డబ్బున్న మహిళలు రకరకాల వస్త్రవిశేషాలు సందడిగా కొనుగోలు చేయడం దమ్మిడీ
చేత లేని లంబాడీ ఆడంగులకు దుఃఖం కలిగిస్తుంది. ధనికమహిళల నవ్వులకు ఉడుక్కుంటూ 'మాకీ జూసి నగ్తర్/మీకీ తలిదండ్రి లేవె మీ నే తు/ప్పాకీ తీస్కొని
కొడ్తే/మాకీ పాపంబిలేద్రె..'అంటూ ఆ బీద లంబాడీ బిడ్డలు పోయే షష్టాష్టకాలకు నవ్వూ వస్తుంది. ఆనక మనసుకు కష్టమూ అనిపిస్తుంది. తమ
మతస్తులను అన్యమతానుయాయులు అన్యాయంగా అవహేళన చేసే అవలక్షణానికి అన్యాపదేశంగా కవి
ప్రకటించే నిరసన అది. నిజానికి నిత్య వ్యవహారంలో తెలుగు నేలల మీద.. ముఖ్యంగా దక్షిణాదిన
ఏ ముస్లిమ్ మతస్తుడూ ఆ తరహా వెకిలి యాసతో మాట్లాడడు. మాటలో కొంత తేడా ఉన్నా అది భాషాభేదం
వల్ల కాదు; సంస్కృతుల మధ్య ఉండే సన్నని తారతమ్యపు తెర అడ్డు
వల్ల!
తెలుగు మాగాణులల్లో శతాబ్దాల
బట్టి తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలలో పాలలో తేనెలా కలగలసిపోయిన ఘనత ముస్లిములది.
నల్లగొండ జిల్లా చిత్తలూరు గ్రామానికి చెందిన ఇమామల్లీ సాహెబ్ అని ఒక కవిగారికి
కులమతాలనే వివక్ష లేదు. కవి అని తనకు తోచిన ప్రతీ సాహిత్యజీవికి అంతో ఇంతో సాయంచేసే
సద్బుద్ధి ఆయనది. సాటి హిందూ కవి ఎవరో సాహెబుగారి ఔదార్యాన్ని 'అల్లాతుంకు సదా యతుం సె
ఖుదచ్ఛచ్ఛాహి ఫాజత్కరే/ఖుల్లాహాతుగరీబు పర్వరినిగా ఖూబస్తునాం మైసునే/అల్లాదేనె
మవాఫికస్తుహర్ దూస్రే కోయి నైహై ఇమా/ మల్లీ సాహెబ్ చిత్తలూరి పుర వాహ్వా
దోయిలందార్బలా ' అంటూ ఉర్దూ మిశ్రిత ఆంధ్రంలో
ఛందోబద్ధంగా శ్లాఘిస్తాడు.
ఆచార్య తూమాటి దోణప్పగారు
‘జానపదకళాసంపద’ ప్రకారం తెలుగులో తమకు కావలసిన సాహిత్యం తామే సృష్టించుకున్న ఘనత
జనపదాల ముస్లిం జాతిది. ఉరుదూమయంగా ఉండే భాషాగీతికలను తెలుగు లిపిలో రాసుకుని
కొరాను సమీప భాషలో పాడినట్లు తృప్తిపొందడం ఉండేది ఒకప్పుడు.ఈ ఝంఝాటమంతా ఎందుకని
ఏకంగా తెలుగులోనే అల్లాకు ప్రార్థనలు సలిపే సాహిత్యం సృష్టించుకున్నారు ముస్లిం
జనపదులు.
బ్రౌను దొర ఎన్నో తెలుగు
సాహిత్య గ్రంథాలను మహమ్మదీయల నుంచే సేకరించారు. ‘రసికజనమనోభిరామం’ అనే కావ్యాన్ని
శేబు మహమ్మదు సాహెబు ప్రతిని అనుసరించి రాయించుకున్నారు బ్రౌన్ దొర. ‘శృంగార
నైషధం ఎనిమిది ఆశ్వాసాలు’ ఆ సాహెబుగారి గ్రంథాలయం నుంచే దొర సేకరించింది! బనగానపల్లి
నవాబులకు హిందూమతమంటే ఆదరం. తెలుగు సాహిత్యాన్ని ఇష్టంగా పోషించారు. 'వాలిన సిద్ధేంద్రస్వామిని కృప/నేలిన వైకుంఠదాముని/ కేలికి రమ్మాని
కిటుకపరచి మందు/లాలించి పతికి తాంబూలముతో బెట్టె' అంటూ ఒక
భామాకలాపం 'మందులపట్టు' దరువులో సిద్ధేంద్రయోగి
ప్రస్తావన కనిపిస్తుంది. ఆ సిద్ధయోగీంద్రుడి 'సిద్ధయోగీశ్వర విలాసము'
ద్విపద కావ్యం రచనకు ప్రోత్సాహం లభించింది ఆ ఇలాకా జాగీర్దారు
భ్రాజత్ ఖాన్ నుంచే.
జమీందారి యుగంలో కొందరు
తెలుగు ముస్లిములు శిష్టసాహిత్యం సృష్టి చేసారు. ధారాళమైన ధారలో ‘ఉమర్ ఖయ్యాం
-ఈశ్వరుడు’ పేరుతో వ్యాసం రాసిన పిఠాపురం మతగురువులు ఉమర్ ఆలీషా విస్తృతమైన తెలుగు సాహిత్యం సృష్టించారు. షేక్ మౌలా మున్షీ 'నీతి వాక్య రత్నాకరం' చింతామణి పత్రికలో ప్రచురితమయింది. ‘సత్యాన్వేషి’ పత్రిక పెట్టి జుజులుల్లా సాహెబు కొంతకాలం
ప్రచురించిన ఖండన వ్యాసాలు 1892 ప్ర్రాంతాలలో తీవ్ర వివాదాలకు దారితీసాయి. ‘పారశీక వాజ్ఞ్మయమచరిత్ర’ను
మూడు భాగాలలో భారతి - 1932 నాటి సంచికలలో ప్రచురించిన
మొహమ్మద్ ఖాసిం ఖాన్ గారికి శ్రీ శ్రీ, పురిపండా, అబ్బూరి వంటి తెలుగు ప్రముఖలతో సన్నిహిత సాహిత్య బంధం కొనసాగింది.
‘ఓరుగల్లు చరిత్ర’ రచయిత సాహెబ్ అహమదల్లీ,
హైదరాబాద్ తెలుగు సాహిత్య అకాడమీ అధ్యక్షపీఠ మెక్కిన అళ్ హజ్
మహమ్మద్ జైనుల్ అబెదీన్, ‘అరబ్ నివాసులుహిందువులా?’ అంటూ 1938,జూలై నాడే భారతిలో చర్చ చేసిన మౌల్వీ షాజిక్, ‘తౌహిద్
కా రవుషన్’ పేరుతో సర్వమతసార సంగ్రహంలో విస్తారంగా హిందూ, ముస్లిం,
క్రైస్తవ మతాల ఆచార వ్యవహారాలను, ప్రార్థనాది కర్మకాండలతో
సహా వివరించిన షేక్ మీరా జాన్.. ఇలా ఎందరో తెలుగు సాహిత్యానికి సేవలందించిన
ముస్లిం మహానుభావులు!
మెహబూబ్ నగర్ జిల్లా మొదటి
పేరు పాలమూరు జిల్లా. కరువుకాటకాలకు ఆ జిల్లా మారుపేరు. పనిపాటలు చేసుకుని పొట్టపోసుకునే
శ్రామికజీవులు అధికంగా ఉండేదీ అక్కడే! అనావృష్టి పరిస్థితుల కారణంగా కూలీ నాలీ జనం
తరచూ వలసబాట పట్టే దుర్భిక్ష స్థితులకు కదలిపోయి 'తూఫాను వానలే తుదికి గతియాయె/
ఋతుపవనాలెల్ల గతిని దప్పె/ చెఱువులు కుంటలు దొరువులు జాలులు/ఇంకి నెఱ్ఱెలు వారె
బంకమట్టి/వర్షాలు కురియక కర్షకులెల్లరు/ బ్రదుకుదెరువు బాసి బాధపడుచు/గొడ్డు
గోదముల నెల్ల గడ్డి గాదెము లేక/దుడ్డుదమ్మిడికమ్మి దుఃఖపడుచు/లేబరై గుంపుగుంపుగ
లేవసాగె/తాళములు వేసి ఇళ్లకు తల్లెచెంబు/కుదువబెట్టుచు కూటికై వదలి
రిపుడు/పల్లెలెల్ల లబోమని తల్లడిల్లె' అంటూ పుట్టెడు ధుఃఖంతో
పుట్టిన ఊళ్లను తలుచుకుని జహంగీర్ మహమ్మద్ అనే ముస్లిం కవి భోరుమన్నారు. ఏ ముస్లిమేతర కవి ప్రతిభ ముందు
తక్కువ తూగదు జహంగీర్ సాహెబ్ తెలుగు పలుకుబడి.
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య
సంపుటాలలో పేర్కొన్నట్లు తెలుగు నాళ్లలో ముస్లిములు సంఖ్యాపరంగా కూడా తక్కువేమీ
కాదు. ఇస్లాం,
అరబ్బీ, దక్కనీ, పారసీ
పదాలతో తెలుగుభాష ఆదానప్రదానాలు సుసంపన్నమయిన తీరు అపూర్వం. కుంపిణీ పాలనకు ముందు
తెలుగువారి రాతకోతల్లో పాలలో నీళ్లలా ఉర్దూ, పారశీక పదాలు ఎన్నో వాడుకభాషలో
కలగలసిపోయాయి. ఇంగ్లీషు పాలకులకూ పాలనాపరిభాషగా ఉర్దూ, పారశీ
పదాలే అందుబాటులో ఉన్న పరిస్థితి ఒకప్పటిది. దక్కను ప్రాంతంలో తెలుగువారు చాలా
దశాబ్దాల దాకా ఉర్దూ
మాద్యమంలోనే విద్యాభ్యాసం చేసిన కాలం కద్దు. విద్యాధికులైన తెలుగువారి కారణంగా
కొంత ఉర్దూ సాహిత్యం
వర్ధిల్లింది! కానీ అచ్చంగా ముస్లిముల మూలకంగా తెలుగు సాహిత్యం ఆ జనాభా దామాషాలో వృద్ధిచెందింది
కాదు. పరిశోధకులు మరింత లోతుగా పరిశీలించవలసిన అంశమిది.
దక్షిణాంధ్రం చూస్తే ముస్లిం జనాభాలో అధిక శాతానికి
ఉర్దూ పలుకు నోటి వరకే పరిమితం. రాయడం దగ్గరకొచ్చేసరికే ముస్లిముల పాత్ర బహు
స్వల్పం! తెలుగు సంస్కృతితో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ వాజ్ఞ్మయంలో ఆ మేరకు బంధం ఎందువల్ల బలపడింది
కాదో?
ఈ సాధారణ సూత్రానికి మినహాయింపుగా
ముస్లిం కవులు తెలుగులో కొంత సాహిత్య సృజన చేసిన మాట బొత్తిగా కొట్టిపారవేయలేం.
రాసిలో కాకపోయినా వాసిలో తెలుగు సాహిత్యంతో
పోటీకి దిగగల సత్తా ఉర్దూ సాహిత్యానికి ఉంది. మరుగున పడ్డ ముస్లిం కవులను గురించి మరుపూరు కోదండరామరెడ్డిగారు
మరువలేని అంశాలు కొన్ని ప్రస్తావించారు.
దావూద్ అనే ఇస్లామిక్ కవి 'దాసీ పన్నా' ఖండిక దొరకబుచ్చుకుని చదువుకునే దొరబాబులకు
ముస్లిం కవులు సాహిత్య సృష్టిలో ఒక్క ఆలోచనాధారలో తప్ప తతిమ్మా అన్నింటా
సమవుజ్జీలేనని ఒప్పుకోక తప్పదు. రాజపుత్రుడి రక్షణ కోసం, పన్నా తన పుత్రుణ్ని బలికానిచ్చింది.
ఆమె త్యాగం గొప్పతనాన్ని శ్లాఘిస్తూ దావూద్ హుస్సేస్ సాహెబ్ రాసిన కవిత ఎంతో కరుణరసాత్మకంగా
సాగుతుంది. 'సతత వాత్సల్యంబు జాల్వార్చి పోషింప/ తలపు
గొన్నట్టి నీ తల్లిలేదు/ అఖిలార్ద్రతను నీకు నర్పించి/ మమతలం/ దలడిల్లునట్టి
నీతండ్రిలేడు/ఆత్మరక్తమై తమ్ముడంచు మించిన ప్రేమ/నరసి పాలింప నీ అన్నలేడు/
రాజపుత్రుడితండు రక్షణార్హుడటంచు/ పరికించు పాలిత ప్రజయు లేదు/ దిక్కుదెసగలవాడవై
దిక్కుగనక/శోకసంతప్త భావనిస్తులత తోడ/ శత్రువుల మధ్య జిక్కిన సాంగపుత్ర/ నిన్ను
పన్నాయె రక్షించు నిక్కమింక!' అంటారు కవి. బలి అయిపోయిన ఆ అభాగ్య బాలుడిని అడిగితే ఏమని ఉండేవాడు? అని ఆయనే
మానవతా హృదయంతో కంపించిపోతూ ప్రశ్నించుకుంటూ ఆ మృతబాలుడి మనోభావాలనూ కవిగా తానే
వెల్లడిస్తాడు'మీ మీ స్వార్థాల కోసరంగా నోరులేని నన్ను
బలిచేశార'ని వాదించడా? అని నిలదీస్తాడేమోనని సందేహిస్తాడు. మానవత్వం
సహజ లక్షణంగా లేని వ్యక్తులకు ఈ తరహా విశాల భావనలు మదిలో మెదిలే అవకాశమే ఉండదు. దావూద్ సాహెబ్ కవి ముస్లిం మతానుయాయుడు
అయినంత మాత్రాన మనసులో ఉండవలసిన అనుకంపన లోపించిందా? సుప్రసిద్ధ
సంస్కృతాంధ్ర పండితులు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి ఆశ్రయంలో విద్యాభ్యాసానికి శ్రీకారం
చుట్టే సమయానికి దావూద్ సాహేబు ఒక ఆడపిల్ల తండ్రి! ‘సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నందుకు రాళ్ల దెబ్బకు
సిద్ధంగా ఉండమ'మని ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనుకంజ వేయని
దుర్భావారి నిర్భీతి ఇప్పుడు ఎంత మందికి ఆదర్శం? సంస్కృతాంధ్రాలలో
మదరాసు విశ్వవిద్యాలయం విద్వాన్ పట్టా పుచ్చుకుని
నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరి మొదటి నెల
జీతం గురుదక్షిణ కింద మనియార్డరుగా దావూద్ సాహెబు పంపిస్తే 'నా
సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దుర్భావారు మురిసిపోయారు. మానవతా విలువలకు మతాలను అడ్డుపెట్టుకుని
వ్యాఖ్యానించడం ఎంత పెద్ద తప్పో ఈ మాదిరి సంఘటనలు ఇంకెన్ని ఈ దేశానికి పాఠాలై బోధించాలో?
పుట్టింది ముస్లిం సంప్రదాయం
అనుసరించే కుటుంబాలలోనే అయినా.. దావూద్ సాహెబులా ఇస్లాం
సంప్రదాయంలో నాని, హిందూ వేదాంతంలో ఊరిన ఎందరో ముసల్మాన్ కవులు
చరిత్ర విస్మృతి పొరల్లోకి జారిపోయినట్లు మరుపూరివారు వాపోతారు.
జాతుల పరంగానే భారతీయతకు
గుర్తింపు అనడం పెడవాదన అవుతుంది. ఇప్పుడు దేశమంతటా ఆ తరహా భావజాలమే విచ్చలవిడిగా పులుముడుకు గురవుతున్నది. ఆ దురాలోచనను ప్రశ్నించే సామాజిక
హిత చింతనాపరుల పైనా దేశద్రోహం అభియోగం రుద్దే జుగుప్సాకరమైన ప్రయత్నమూ యధేచ్చగా
సాగుతున్నది! అదే ఆందోళనకరం!
ఇస్లాం మతాన్ని విశ్వసించే సాహిత్య స్రష్టలు సృష్టించినవిగా చెప్పుకునే తెలుగు శతకాలే సుమారు
మూడు పదులు వికీపీడియాలో
కనిపిస్తున్నాయి. ఆ జాబితా ఆసాంతం పరిశీలించినా హిందూ కవుల ధోరణిలోనే ముసల్మాను కవులూ శతక సాహిత్యంలో తమకు సుపరిచితమైన భక్తి, తాత్విక
విశేషాలనే ప్రబోధాత్మక రీతిలో ప్రకటించినట్లు స్పష్టమవుతుంది.
పదహారణాల తెలుగు కవుల ముగ్గురు
(బత్తలపల్లి నరసింగరావు,
మేడవరము సుబ్రహ్మణ్యశర్మ, ఖాద్రి నరసింహ సోదరులు)
చేతుల మీదుగా రూపుదిద్దుకున్న శతకం 'భక్త కల్పద్రుమ శతకము’.
అదే పేరుతో హుస్సేన్ కవి రచించిన శతకమూ వాటికి వాసిలో అణుమాత్రం తీసిపోనిది. ఆ దారిలోనే సయ్యద్ ముహమ్మద్ అజమ్
అనే కవి 'సయ్యదయ్యమాట సత్యమయ్య' మకుటంతో,
గంగన్నవల్లి హుస్సేన్‌దాసు 'ధర్మగుణవర్య శ్రీ
హుసేన్ దాసవర్య' మకుటంతో
శతక సాహిత్యం సృష్టించారు. తక్కల్లపల్లి పాపాసాహెబ్ కవి మతవిభేదాలను విమర్శిస్తూ 'వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి
మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట' అంటూ సుద్ది చెప్పారు. షేక్
ఖాసిం 'సాధుశీల శతకము'లో 'కులము మతముగాదు గుణము
ప్రధానంబు/ దైవచింత లేమి తపముగాదు/, బాలయోగి కులము పంచమ
కులమయా,/ సాధులోకపాల సత్యశీల' అంటూ
నేటి కాలానికి అవసరమయే మంచి ముక్కలు చెప్పే ప్రయత్నం చేసారు. షేక్ అలీ ‘గురుని మాట యశము గూర్చుబాట'
అనే మకుటంతో రాసుకొచ్చిన తీరులో వెలువడ్డ ముసల్మానుల శతకాలు
పరిశోధించాలే గాని.. ఇంకెన్ని శతాధికాలు తేలుతాయో? మతాలతో నిమిత్తం లేకుండానే సమాజ
సంస్కరణల పట్ల సాహిత్య ప్రగతిశీలులందరిదీ ఒకే బాట- ఒకే మాట అన్న మాటను మాత్రం ఈ
శతక సాహిత్యం ఖాయం చేసిందన్న మాట వాస్తవం!
తరువాతి కాలంలో వీరేశలింగంగారి 'వివేకవర్ధని' లో కలసిపోయినా 1891 లో నరసాపురం
నుంచి మీర్ షుజాయత్
అలీ ఖాన్ గారి
ఆధ్వర్యంలో సాగిన 'విద్వన్మనోహారిణి' తెలుగుసాహిత్యానికి చేసిన సేవ
అమూల్యమైనది. రాజమండ్రి నుండి వెలువడ్డ 1892 నాటి బజులుల్లా
సాహెబ్, 'సత్యాన్వేషిణి,
1909 నాటి షేక్ అహ్మద్ సాహెబ్ 'ఆరోగ్య ప్రబోధిని' ముసల్మానుల తెలుగు పాత్రికేయ
రంగానికి చేసిన సేవలకు మరి కొన్ని మచ్చుతునకలు. 1944 లో హైదరాబాదు నుంచి వెలువడ్డ 'మీజాన్' దినపత్రికకు
తెలుగు ప్రసిద్ధ రచయిత అడవి బాపిరాజు సంపాదకులుగా సహకారం అందించారు.
ఆధునిక యుగానికి వస్తే..
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం
తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారి 'తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ"
అనే సిద్ధాంతవ్యాసానికి 1991 లో నాగార్జున
యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది. సయ్యద్ సలీం నవల "కాలుతున్న
పూలతోట"కు 2010 లో కేంద్ర సాహిత్య
అకాడమీ అవార్డు సాధించింది. వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం ‘జుమ్మా’ 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు గెల్చుకున్నది. ఇంకా ఎంతో మంది
మహమ్మదీయ మత విశ్వాసులు విశాల భారతీయ లౌకిక తత్వంలో మమేకవుతూ దేశ పురోగతికి తమ వంతు పాత్ర
నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు.
సయ్యద్ నశీర్ అహ్మద్ 'అక్షర శిల్పులు'
పేరుతో వెలువరించిన 333 మంది తెలుగు ముస్లిం
కవులు, రచయితల వివరాలతో 2010 లో సమాచార
గ్రంథం పుటలు తిరగవేస్తుంతే పటం కట్టి పూజించుకోదగ్గ ఎందరో సాహిత్య ద్రష్టల కృషి కంటబడుతుంది.
'సమస్త ప్రపంచంలో ఉత్తమైనది మన హిందూస్థాన్. ఇది మనదే. ఇది
మాత్రమే మనది! మనం దీని బుల్ బుల్ పిట్టలం సుమా!ఈ దేశం.. కేవలం ఈ దేశం మాత్రమే మన ఉద్యానవనం
మిత్రమా!’ అని అర్థ వచ్చే 'సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా/హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా
హమారా’ అంటూ సెప్టెంబర్ 23, 1964 నాడు మహమ్మద్ ఇక్బాల్ కల మెత్తి రాసిన జాతీయ గీతంలోని
ప్రతి అక్షర భావమూ నేటికీ కోట్లాది మంది భారతీయ ముస్లిం భయ్యా బహెన్ల మనసుల్లో నుంచి
పెల్లుబుకుతున్నదే! 'పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలూ చెలరేగే నేడు' అంటూ మహాకవి శ్రీశ్రీ ‘వెలుగు నీడలు’ చిత్రంలో తెగ వాపోయాడా నాడు. కానీ
దెబ్భై ఏళ్ల పాటు ప్రజాస్వామ్య
ఫలాలు అనుభవించిన తరువాతా ఎందుకింత సంకుచింతంగ దేశం ఆలోచన సాగుతున్నదనేదే చింత!
'లుచ్ఛా
జమానా ఆయా/అచ్ఛోంకో హాథ్ దేనా హర్ ఏక్ సికా/ అచ్ఛా జమానా ఫిర్ కబ్ / వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబు!' (చెడ్డవాళ్ల కాలం వచ్చింది. చెయ్యివ్వడమే ప్రతివాడు నేర్చేసుకుంటున్నది.
మంచిరోజులు ఎప్పుడు వస్తాయో చెప్పవయ్యా వల్లీసాహెబూ?) అని ఓ
శాస్త్రులుగారు అడిగిన
ప్రశ్నకు 'బందేనవాజ్ బుజురుగ్ /జిందా హై ఆజ్ తో న జీతే హమ్
ఖుదా/ బందాహి జానె వహాసబ్/గందరగోళం జమానా ఖాజాసాబూ! (దేశసేవకులు, పుణ్యపురుషులు (చేసిన మంచి పనుల వల్ల శాశ్వతంగా ఉన్నారు. మనం అట్లా
జీవించలేం. దైవభక్తుడు, సేవకుడు ఆ విషయం తెలుసుకోడం మేలు.
ఇప్పడు వచ్చిందంతా గందరగోళంగా ఉండే కాలం కదా ఖాజాసాబూ?) అంటూ
వల్లిసాబుగారు బదులిచ్చారని ఓ చాటువు.
అల్లికలో సరదా కనపడుతున్నా ప్రస్తావనకొచ్చిన అంశం ఇప్పటి
గందరగోళ పరిస్థితులకి అద్దం పడుతున్నదా లేదా?
-సరదాకేః గందరగోళం జమానా -కర్లపాలెం హనుమంతరావు- సూర్య
దినపత్రిక ప్రచురితం
***