Showing posts with label Humanity. Show all posts
Showing posts with label Humanity. Show all posts

Friday, March 5, 2021

శేషారత్నం - కథానిక - -కర్లపాలెం హనుమంతరావు - కౌముది/రచన ప్రచురితం

 

కాంతయ్య పోయి మూణ్ణెలయింది. తండ్రి పోయిన ఏడాదిలోపే కూతురికి  పెళ్లి చేస్తే  కన్యాదాన ఫలం తండ్రికి దక్కుతుందన్న నమ్మకంతో అనంతమ్మ కూతురు పెళ్ళి పెట్టుకుందిప్పుడు,

అబ్బాయి చెన్నైలో ఫిలిప్స్ కంపెనీలో ఉద్యోగం . కావలివాళ్ళు. కాస్త కలిగిన వాళ్ళు. కాంతయ్యకు మా టీచర్స్ సర్కిల్ లో మంచివాడన్న పేరుంది. ఆయన కూతురు గాయత్రిని చేసుకుంటామని మా ఆర్ జె డి మ్యాడం గారే ముందు చొరవ చూపించడం వల్ల ఏ ఇబ్బందుల్లేకుండానే సంబంధం ముడిపడింది. ముహూర్తానికి ఇంకో నెల రోజులు టైముందనంగా  అనంతమ్మ దగ్గర్నుంచి 'కాస్త అర్జంటుగా వచ్చి పొమ్మ'ని కబురొస్తే గుంటూరొచ్చాను. 

పెళ్లి పనులు నిదానంగా నడుస్తున్నాయి. గాయత్రికి అప్పుడే పెళ్లికళ వచ్చేసింది కూడా. మా కాంతయ్య కనక ఉండుంటే ఎంత సంతోషించేవాడో అనిపించిందా క్షణంలో. అనంతమ్మే ఎందుకో కాస్త కళవళపడుతోంది. 

ఆ మధ్యాహ్నం నేను ప్రయాణపు బడలికలో పడుకుని ఉంటే గదిలోకొచ్చింది 'నిద్ర పోతున్నావా అన్నయ్యా!' అంటూ. 

'లేదులే! ఏవిఁటి విషయం? ఎందుకంత తొందరగా రమ్మని కబురుచేసావు?' అని ఆడిగా. 

బీరువాలో నుంచి ఏవో కొన్ని కాగితాలు తీసి నా ముందు పెట్టింది తను. 'ఇంటి పేపర్ల కోసం వెదుకుతుంటే ఇవి కనిపించాయన్నయ్యా! ఏంటో అంతు బట్టక నీకు కబురు పంపించా. గాయత్రికే ముందు చూపిద్దును కానీ, దాని పరీక్షల గొడవలో అదుందిప్పుడు. ఆయనా నువ్వూ అరమరికలు లేకుండా ఉండేవాళ్లుగా! నీ కేమైనా తెలుస్తాయని..'అంది. 

'నేను చూసి చెబుతాలే! నీవు పోయి పని చూసుకో!' అని అప్పటికామెను పంపించేశా.  

కాంతయ్య స్టేట్ బ్యాంకులో ఏదో లోను తీసుకున్నట్లున్నాడు. వాయిదాలు సక్రమంగా రావడం లేదని ఇచ్చిన నోటీసులు అవన్నీ. పాత బాకీ వడ్డీతో సహా  సుమారు లక్షన్నర. పదిహేను రోజుల్లోపు బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఇంటిని జప్తు చేసి సొమ్ము జమేసుకునే నిమిత్తం చర్యలు చేపడతామని ఇంగ్లీషులో  లాయరిచ్చిన నోటీసులు రెండున్నాయందులో. నోటీసులన్నీ ఏదో రామన్నపేట  అడ్రసు నుంచి రీడైరక్టు చేయబడ్డవి. 

కాంతయ్యా నేనూ ఒకే సారి ఉపాధ్యాయ వృత్తిలో చేరినవాళ్లం. వేటపాలెంలోని  ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరం ఒకేసారి కలసి పనిచేసాం మొదట్లో. మంచి స్నేహితులమయ్యాం. తరువాత  ఎన్ని స్కూళ్లు మారినా, ఎన్ని పొజిషన్లు మారినా ఇద్దరి మధ్యా స్నేహం బలపడుతూ వచ్చిందే కాని, చెదరలేదు. 


మా నాన్నగారి ఊరు పెదగంజాం. ఆ ఊరి శివాలయం పూజారి సాంబయ్యగారి అమ్మాయి ఈ అనంతలక్ష్మి. ఈ సంబంధానికి కాంతయ్యను సూచించింది నేనే. నా భరోసా మీదనే సాంబయ్యగారు కాంతయ్య దగ్గర ఆస్తిగా ఒక్క చిల్లుకాణీ లేకపోయినా గవర్నమెంటు ఉద్యోగం చూసి కూతుర్ని కట్టబెట్టారు. ఆయన పోయే ముందు ఊరి బయట ఉన్న రెండు గదుల పెంకుటింటిని కూతురు పేరున రాశారు. 


మా కాంతయ్య మాణిక్యం. గాయత్రి పుట్టినప్పుడు అనంతమ్మకు గర్భసంచీలో సమస్య వచ్చి మళ్లీ పిల్లలు పుట్టే ప్రయత్నంగాని చేస్తే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరిస్తే తనే ఆపరేషన్ చేయించుకున్న మంచిమనిషతను. అనంతమ్మయితే మొగుడే వైకుంఠం, కూతురే కైలాసంగా బతికే అమాయకురాలు. హాయిగా సాగిపోయే ఆ సంసార నౌకను చూసే విధి ఓర్వలేకపోయినట్లుంది..  కాంతయ్య ప్రాణానికే ప్రమాదం తెచ్చిపెట్టింది. 


మూడు నెలల కిందట విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఏదో కార్యక్రమం రికార్డు చెయ్యడానికని వచ్చి బైట రోడ్డు దాటే సమయంలో లబ్బీపేట వైపు నుంచొచ్చే సిటీ బస్సు ముందు చక్రాల కింద పడి నజ్జునజ్జయిపోయాడు మా కాంతయ్య! ఆ విషాదం నుంచి అనంతమ్మ ఇంత తొందరగా తేరుకుంటుందని నేనైతే అనుకోలేదు. తను డీలాపడితే కూతురు మరంత కుంగిపోతుందనుకుందో ఏమో, ధైర్యం కూడగట్టుకుని ముందా పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టే పనిలో పడింది. కలిసొచ్చి మంచి సంబంధం కుదిరినందుకు అందరం ఆనందంగా ఉన్నాం. ఇప్పుడీ అనుకోని కుదుపు!


అప్పటికేదో అనంతమ్మకు సర్దిచెప్పాగానీ, అసలు విషయం తెలుసుకునేందుకు నా ప్రయాణం మరో రోజుకు వాయిదా వేసుకుని బ్యాంకుకెళ్లా నేను. మేనేజరుగారు కాంతయ్యకు పూర్వ పరిచయస్తుడవడంతో వివరాలు రాబట్టటం తేలికయింది. అనంతమ్మ పేరుతో ఉన్న ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మూడేళ్ల కిందట బ్యాంకు నుంచి రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు కాంతయ్య. ఇంత వరకు ఒక్క పైసా కూడా జమపడలేదు. కనక బ్యాంకు రూల్సు ప్రకారం జప్తుకు వెళ్లే చర్యలు చేపట్టడం ఖాయం అని చల్లగా చెప్పుకొచ్చారు మేనేజరుగారు. 


అనంతలక్ష్మి పేరున ఉన్న ఇల్లు అనంతలక్ష్మికి తెలీకుండా కుదువపెట్టడం ఎలా సాధ్యం? లోను అప్లికేషన్ తీయించి చూస్తే అందులో ఉన్నది అనంతలక్షి ఫొటో కాదు! ఎవరో ఆడమనిషిది. అడ్రసు మాత్రం అప్పట్లో కాంతయ్య పనిచేసిన రామన్నపేటదే! హామీ సంతకం సాక్షాత్తూ కాంతయ్యదే! మేనేజరుగారికి కాంతయ్య హఠాన్మరణం గురించీ, అతగాడి కూతురి పెళ్లి గురించీ వివరంగా చెప్పి.. పెన్షన్ బెనిఫిట్స్ నుంచి నేనే పూనుకుని ఎంతో కొంత జమచేయిస్తానని హామీ ఇచ్చి, లోన్ పేపర్లోని చిరునామా, ఫొటో జిరాక్సులు తీసుకుని వచ్చేశా.


కాంతయ్య ఇలాంటి పనిచేసేడంటే  నమ్మశక్యంగా లేదు. భార్య ఆస్తి మీద భార్యను కాకుండా వేరే ఎవరో ఆడమనిషిని ఆ స్థానంలో చూపించి అంత భారీ రుణం ఎందుకు తీసుకున్నట్లు? నాకు తెలిసి కాంతయ్యకు స్మోకింగూ, మంచితనం  తప్ప వేరే వ్యసనాలు లేవు. సీదాసాదా వ్యక్తిత్వం. మాటకు కట్టుబడే మనిషి. మరేమిటి ఈ మిస్టరీ? ఆ ఇంటిని చూసుకునే అనంతమ్మ పిల్లకు పెళ్లి పెట్టుకుంది.  ఇంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని ఆ అమాయకురాలికి తెలిసివుండకపోవచ్చు. తెలిస్తే ఇప్పుడు ఏం చేసుంది? ఒక వంక మొగుడు చాటుగా చేసిన నమ్మక ద్రోహం. మరో వంక పీకల మీద కూతురు పెళ్లి! కాంతయ్య పరువు మర్యాదలు చూసి వచ్చినవాళ్లు ఇప్పుడు ఆ సంబంధం చేసుకుంటరా? తనో రోల్ మోడల్ గా భావించుకున్న తండ్రి అసలు స్వరూపం తెలిసి గాయత్రి క్షమించగలదా? పీటల మీద వరకు వచ్చేసిన ఈ పెళ్లి ఇట్లా ప్రమాదంలో పడటం ఆ సున్నితమైన మనసు తట్టుకోగలదా? నిన్నటి వరకు అంతా సవ్యంగా సాగిపోతోందనుకున్న వ్యవహారం ఇట్లా సడన్ గా అడ్డం తిరిగే సరికి ఏం చెయ్యాలో  తెలీక రాత్రంతా ఆలోచిస్తూనే ఉండిపోయాను. తెల్లారుఝాముకో నిర్ణయానికొచ్చాను. 'ముందు ఆ ఆడమనిషెవరో తెలుసుకోవాలి. వీలైతే వెంటనే ఆ డబ్బును రాబట్టాలి. ఇంటి తనఖా రద్దైపోతే ప్రస్తుతానికి సమస్య ఉండకపోవచ్చు. ముందు, లోన్ పేపర్లలో ఉండే చిరునామాకు వెళ్లిరావాలి. అప్పటి వరకు అనంతమ్మకు ఏమీ చెప్పకూడదు.' అనుకున్నాను. నాకూ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా.. హైదరాబాద్ ప్రయాణం మరో రోజు వాయిదా వేసుకుని రామన్న పేట బైలుదేరాను.. లోను  జిరాక్సు పేపర్లూ, ఫోటో తీసుకుని. 

***

రామన్నపేట పెద్ద ఊరేమీ కాదు. చీరాల వేటపాలెం మధ్య దారిలొ రోడ్డుకు  ఎడంగా ఇసుక దిబ్బల మీద ఎత్తులో ఉంటుందా ఊరు. బస్సు దిగి ఊళ్లోకి వస్తూ విచారిస్తే 'అనంతలక్ష్మి' పేరు గలవాళ్లెవరూ లేరు పొమ్మన్నారు చాలామంది. ఫొటో చూపించి అడిగితే ఒక ముసలాయన 'ఈమె పేరు అనంత లచ్చమ్మ కాదు సారూ! అనసూయమ్మ. అట్లు పోసుకునే అనసూయమ్మ అంటే ఎవరైనా చెబుతారయ్యా! అట్లా శివాలయం దాకా పోయి ఎడం వేపు గొందిలోకి మళ్ళితే అక్కడుంటుంది' అన్నాడు అదో రకంగా నవ్వుతూ. 

నేను ఆ వివరాలు కనుక్కుంటూ వెళ్లేసరికి ఒక నలభై, నలభైఅయిదేళ్ల ఆవిడ ఒక తాటాకు పాక  పంచలో అట్లు పోస్తూ పెనం ముందు కూర్చుని కనిపించింది. ఫొటోలోని మనిషి ఆమే! కొంతమంది మగవాళ్ళు చెక్క బెంచీల మీద కూర్చుని ఆకుల్లో అట్లు వేయించుకుని తింటున్నారు. నన్ను చూసి 'శేషారత్నమా! సారుకు ఆ స్టూలు తెచ్చి ఎయ్యి' అని లోపలికి కేకేసిందామె. 


నేను అట్లు కోసం వచ్చాననుకున్నట్లుంది ఆమె. అదీ ఒకందుకు మంచిదే. వచ్చీ రాగానే వ్యవహారంలోకి దిగితే బెడిసిగొట్టే ప్రమాదముంది. బాదం ఆకుల్లో రెండు అట్లు వేయించుకు తిని 'కాఫీ ఉందా?' అనడిగాను. 'కాఫీలు ఈడ ఎవుళ్లూ తాగరు సార్! టీ కావాలంటే అట్లా పోతే మస్తాను బంకు కాడ దొరుకుద్ది' అంది. నేను తటపటాయిస్తుంటే చూసి 'పోనీ.. మా పిల్లకు రెండు రూపాయలు ఇయ్యండి సార్! తెచ్చిపెట్టుద్ది' అంది. ఆ అమ్మాయి పోయి తెచ్చిచ్చిన టీ తాగేసరికి కొట్టు ముందు జనం కాస్త పల్చబడ్డారు. 


సమయం చూసి అడిగాను 'ఇదివరకు ఈ ఊళ్లో కాంతారావుగారని ఒక పంతులు గారు పనిచేసిపోయారు. ఆయనిప్పుడు ఎక్కడున్నాడో ఏమన్నా తెలుసా?'

'మీరెవరూ?' అని అడిగిందావిడ చేస్తున్న పని ఆపేసి అనుమానంగా చూస్తూ. 

'స్టేట్ బ్యాంకు నుంచీ వస్తున్నానమ్మా! ఆయన తీసుకున్న లోను విషయం మాట్లాడదామనీ!' అన్నాను. 

అనుకున్నట్లే ఆమె ముఖకవళికల్లో మార్పు వచ్చింది. పొయ్యి మీద నుంచి పెనం ఇవతలకు లాగిపడేసి దాని మీదిన్ని నీళ్ళు చల్లి లేచి 'సారూ! ఒకసారిట్లా లోపలికి వస్తారా?' అని అడిగింది తను లోపలికి పోతూ. నేను ఆమెను అనుసరించాను. బైట నిలబడ్డ ఇద్దరు ముగ్గురు ఆరాగా లోపలికి తొంగిచూస్తున్నారు. పల్లెటూళ్లల్లో అందరికీ అన్నీ కావాలి. 

ఆమె ఒక నులక మంచం వాల్చి నన్ను కూర్చోబెట్టి 'పంతులుగారు ఇప్పుడేడ పనిచేస్తున్నారో నాకూ తెలవదయ్యా! ఆయన ఆ బ్యాంకులోను నా కోసమే తీసుకున్నారు సారూ!' అందామె ఆగి ఆగి ఆలోచిస్తున్నట్లుగా.

ఆ అప్పుకు ఒక్క పైసా జమకాలేదమ్మా! ఇట్లా చేస్తే బ్యాంకువాళ్లు చూస్తూ కూర్చుంటారా? పోలీసు కేసవుతుంది. ముందు నిన్నే అరెస్టు చేస్తారు' అన్నాను బెదిరిస్తున్నట్లు. 

'నన్నెందుకు చేస్తారూ!' అంది బెదిరిపోయి. 

'అప్పు పత్రాల మీద నీ ఫొటోనే కదా ఉందీ! నువ్వు పేరు మార్చి ఆయన భార్యనని మోసం చేస్తే బ్యాంకువాళ్లు చేతులు ముడుచుక్కూర్చుంటారా? బ్యాంకులో తనఖా పెట్టిన కాగితాలు నిజంగా నీవేనా?' అన్నాను స్వరం మరంత పెంచి. 

ఆమె తలవేలాడేసింది. అప్పటి దాకా చిత్రం చూస్తూ నిలబడ్డ శేషారత్నం బిత్తరపోయినట్లు నిలబడిపోయిందో మూల.

'నీ మూలకంగా పంతులుగారిక్కూడా శిక్ష పడుతుంది తెలుసా?' అనగానే అనసూయమ్మ చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ దుఃఖంలోనే ఒక్కో ముక్కా వదులుతోంది. 'పంతులుగారు దేవుడయ్యా! ఆయన్నేం చెయ్యద్దయ్యా! పాపిష్టిదాన్ని, నా వల్లే ఆయనకీ కష్టాలు' అంటూ మధ్య మధ్యలో ఎక్కిళ్లు. 

'అసలేం జరిగిందో వివరంగా చెప్పమ్మా! దాన్ని బట్టే మా బ్యాంకువాళ్లు తీసుకునే చర్య ఉంటుంది' అన్నాను. నాకూ ఇలాగా మరో మనిషిలాగా నటించడం ఇబ్బందిగానే ఉంది. మరేం చేయడం? అసలు విషయం రాబట్టుకునేందుకు మరో దారి తోచలేదు. 

'నువ్వు రంగయ్య కొట్టుకాడికెళ్లి ఇందాక నేను చెప్పిన సరుకులు పట్టించుకు రావే!' అంటూ కూతుర్ని  బైటికి పంపించేసి నిదానంగా చెప్పడం మొదలుపెట్టిందా అనసూయమ్మ.  'కాంతయ్య పంతులుగారు ఈడ స్కూల్లోనే పాఠాలు చెప్పడానికి వచ్చాడయ్యా! కుటుంబాన్ని తేలేదు. నా కాడే టిఫిన్లు.. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు! చాలా మంచాయన. మా కృష్ణానందం ఆయన కాడే చనువుగా తిరుగుతుండేవాడు'

'కృష్ణానందం ఎవరూ? నీ కొడుకా?'

'నాకు కొడుకులు లేరయ్యా! ఉన్నదంతా ఈ ఎతిమతం శేషారత్నమే! వాడు దీని మొగుడు. నా పెనిమిటి రాచపుండొచ్చి పోతా పోతా ఇంటికి మగదిక్కుగా ఉంటాడని ఏడనో ఉన్న ఆడిని తెచ్చి పిల్లదాని మెడకు చుట్టబెట్టాడయ్యా! నా అల్లుడికీ అందరికి మల్లేనే దుబాయ్ పోవాలని పురుగు కుట్టిందయ్యా! కాయితాలకనీ, ఇమానం కర్చులకనీ మొత్తం రెండు లచ్చలు దాకా అవుతాయి. ఇయ్యకపోతే నీ కూతురి మీద  గ్యాసు నూనె పోసి నిప్పంటిస్తా అంటూ రోజూ ఇంట్లో రభసే! ఆడి బాధకు తాళలేక ఇది నిజంగానే ఓ రోజు పుల్లకాలవలో దూకేసింది. మా పంతులుగారే టయానికి ఆడ ఉండబట్టి బైటికీడ్చుకొచ్చాడు. నా కతంతా ఇని ఒంగోలు దాకా తీసుకెళ్లి బ్యాంకులో ఏలుముద్రలు తీయించి రెండు లచ్చలు  ఇప్పించాడు సార్! ఆ డబ్బుతోనే నా అల్లుదు దుబాయ్ పోయింది. అక్కడ సాయబ్బులకాడ పనిచేస్తే బోలెడంత డబ్బొస్తుందంటగా! ఏడాది తిరిగే లోగా అప్పంతా తీర్చేస్తానని నా బిడ్డ మీద ప్రమాణం చేసి మరీ పొయ్యాడయ్యా! సారు బదిలీ మీదెళ్లిపోయాడని తెలిసి ఈడు ఠలాయించదం మొదలుపెట్టాడు. మెల్లంగా మాకు అయిపూ ఆజా లేకుండా ఎళ్లిపొయ్యాడయ్యా! ఎంత విచారణ చేయించినా ఏడ చచ్చాడో తెలీలా.. ఇప్పటి దాకా. పంతులుగారికి మొగం చూపించలేకనే ఇదిగో.. ఇట్లా మూల మూలన నక్కి ఏడవడం' అని రాగాలు మొదలుపెట్టింది. 

శేషారత్నం ఎప్పుడొచ్చిందో.. ఇదంతా వింటూ ఓ మూలన బిక్కుబిక్కుమంటూ గోడక్కరుచుకుని నిలబడివుంది! అప్పుడు చూశాను..  పిల్ల మెళ్లో పసుపు తాడు. నిండా పదిహేనేళ్లయినా నిండని బిడ్డ! మెడలో ఆ తాడు గుదిబండలా  వేలాడుతోంది!


అనసూయమ్మ ఏడుపుకు ఇద్దరు ముగ్గురు మగాళ్లులోపలికొచ్చేశారు. గొడవేమీ కాకముందే మర్యాదగా తప్పుకోడం మంచిదనిపించింది. వస్తూ వస్తూ అనసూయమ్మతో 'పంతులుగారు బస్సు ప్రమాదంలో పోయి మూడు నెల్లయింది.  ఆయనకూ నీకు మల్లేనే ఆస్తి పాస్తులేం లేవు. ఉన్నది ఆ ఉద్యోగం.. మంచివాడన్న పేరు. ఇదిగో నీ కీ పిల్లలాగా ఓ కూతురు, అన్నెం పున్నెం ఎరుగని  ఓ భార్య.. ఆమె తండ్రి ఆమెకిచ్చిన ఆ ఇల్లు. దాన్నే ఆయన నిన్నేదో ఆదుకోవాలని తప్పుడు మార్గంలో  బ్యాంకులో పెట్టినట్లుంది. అది బైట పడితే ఇంటి కన్నా ముందుపోయేది ఇంటి పరువు. ఇంకో నెలరోజుల్లో ఆయన కూతురు పెళ్లుంది. అది ఆగిపోతే ఆ ఉసురు నీకూ, నీ కూతురికే తగిలేది!' అంటూ చేతిలోని శుభలేఖను విసురుగా అక్కడ పారేసి బైటికివచ్చేశాను. 

ఆవేశంలో కాస్త ఎక్కువగానే మాట్లాడేమోననిపించింది తిరిగొచ్చేదారిలో. అప్పటికే నాకూ గుండెల్లో కాస్త నొప్పి నొప్పిగా అనిపించడంతో టాక్సీ చేసుకుని నేరుగా హైదరాబాదొచ్చేశా! అనంతమ్మను కలిసే అవకాశమే లేకపోయింది.


టాక్సీలోనే మూర్ఛరావడం.. డైవర్  సాయంతో ఇల్లుచేరడం! వచ్చీ రాగానే పెద్దాపరేషన్!  కనీసం ఓ నెల్లాళ్ల పాటైనా  మన లోకంలో లేనట్లే గడిచిపోయింది కాలం. 

గుంటూరు విషయాలను గురించి విచారించడానికి గుండె ధైర్యం లేకపోయింది. ఇంట్లో కూడా నా మీద  నిరంతర నిఘా!

***

రెండేళ్ల తరువాత.. 

మా ఆవిడ కీళ్లనొప్పుల ఆపరేషన్ కోసమని నిమ్స్ కి రిఫర్ చేస్తే వెళ్లినప్పుడు ఓ.పిలో రోగులను చూస్తూ కనిపించింది గాయిత్రి. ముందుగా నేను చూసింది ఆమె మెడలో మంగళ సూత్రాలు ఉన్నాయా లేవా అని. ఉన్నాయి. ఎంతో రిలీఫ్ అనిపించింది. 

నన్ను చూసి గుర్తుపట్టి నవ్వు మొగంతో దగ్గరికొచ్చి పలకరించిందా అమ్మాయి 'అంకుల్! బాగున్నారా!' అంటూ. విషయం విని తనే దగ్గరుండి మా ఆవిడ ఆపరేషన్ సజావుగా సాగేందుకు సహకరించింది. వారం తరువాత డిశ్చార్జ్ అవుతున్నప్పుడు 'థేంక్స్' చెప్పడానికి వెళితే 'ఓ సన్ డే ఓపిక చేసుకుని మా ఇంటికి ఆంటీతో సహా లంచ్ కి రావాలి అంకుల్!' అంటూ అడ్రసిచ్చింది. 


ఆ ఆదివారమే మధురానగర్ లోని వాళ్ల ఇంటికి వెళ్ళాం మొగుడూ పెళ్లాలం. ఆ అమ్మాయి భర్త అప్పుడు అనుకున్న ఆర్జెడి మ్యాడం గారబ్బాయే!  గాయత్రికి నిమ్స్ లో పిజి వచ్చిందని చెన్నయ్ లో తాను చేసే ఉద్యోగం రిజైన్ చేసి ఇక్కడే ఇంకేదో కంపెనీలో చేస్తున్నాడని తెలిసింది. ఆర్జెడిగారు రిటైరయి  సొంతూరిలో ఉంటున్నట్లు ఆ అబ్బాయే చెప్పుకొచ్చాడు. 

'అమ్మ బాగుందా తల్లీ!' అనడిగాను గాయత్రిని భోజనాల దగ్గర. 

'తను పోయి రెండేళ్లయిందిగా అంకుల్! మీ కింకా తెలుసేమో అనుకున్నా. పెళ్లింకో పది రోజుల్లో ఉందనంగా గుండెనొప్పొచ్చింది. అందుకే ఆ ముహూర్తం వాయిదాపడ్డం. తరువాత రెండు నెల్లకు మా పెళ్లయింది. అప్పుడున్న టెన్షన్లో మీ లాంటి ముఖ్యమైన నాన్న ఫ్రెండ్సందర్నీ మేం మిస్సయి పోయాం! మీ నెంబరు  కోసం ఎన్నో సార్లు ట్రై చేసినా కలవలేదు’ అంది గాయిత్రి గిల్టీగా. 

‘అంకుల్ బాగా కోలుకున్న దాకా బైటి కనెక్షన్లేవీ పెట్టుకోవద్దని డాక్టర్లు అదే పనిగా  హెచ్చరించారమ్మా! అందుకే నేను సెల్ నెంబర్ మార్పించి కొత్తది నా దగ్గరుంచుకుంది చాలాకాలం' అని ఇప్పుడు బాధపడింది మా శ్రీమతి. 

భోజనాలయి హాల్లో కూర్చున్నాం నేనూ, ఆ అబ్బాయీ! గాయిత్రి మా ఆవిడకు ఇల్లు తిప్పి చూపించడానికి తీసుకువెళ్లింది. ఆ అబ్బాయి అప్పుడన్నాడు 'అంకుల్! మీరు రామన్నపేట వెళ్ళార్ట కదా! మీరక్కడ వదిలేసొచ్చిన శుభలేఖ పట్టుకుని ఓ పదహేను పదాహారేళ్ల పాప మా అమ్మను వెదుక్కుంటూ వచ్చింది. మా మాంగారు వాళ్లమ్మ పేరుతో తీసుకున్న బ్యాంక్ లోను కథా కమామిషంతా చెప్పి బాగా ఏడ్చింది. పెళ్లి ఆపొద్దని కాళ్లావేళ్లా పడ్డంత పనిచేసిందంకుల్ పాపం! 'పంతులుగారు మా అమ్మను ‘చెల్లెమ్మా’ అని పిలిచేవాడని, తానైతే ఎప్పుడూ 'మామయ్యా!' అనే పిలిచేదాన్నని ఎన్ని సార్లు చెప్పుకునేడ్చిందో! చాలా బాధనిపించింది వింటానికి అమ్మకూ నాకూ’ 

కాంతయ్యకు ఒక సొంత చెల్లెలుండేది. మొగుడు కోత భరించలేక అ పిల్ల  తన రెండేళ్ళ పాపతో సహా క్రిష్ణకెనాల్లో దూకేసిందొకానొకప్పుడు. కాంతయ్య బహుశా అనసూయమ్మలో ఆ పోయిన చెల్లెలిని, పాపలో ఈ శేషారత్నాన్ని చూసుకొనుంటాడు!  లేకపోతే పరాయి ఆడమనిషి కష్టం తీర్చేందుకు మరీ అంత దారుణంగా బ్యాంకును, భార్యను మోసగించే  నీచ మనస్తత్వం చస్తే కాదు మా కాంతయ్యది. 


ఆ మాటే ఆ అబ్బాయితో అంటే 'మామగారి మంచితనం గురించి మాకు తెలీదా! అయినా గాయిత్రిని చేసుకుంది  ఆ మంచితనమొక్కటే చూసి  కాదంకుల్ ' అన్నాడు ముసి ముసిగా నవ్వుతూ. 

‘మరి!’

'మా అమ్మదీ పెదగంజామే! మా అత్తగారి పేరనున్న ఆ ఇల్లు గుడి పూజార్ల కోసమని మా ముత్తాతగారు ఏనాడో కట్టిచ్చిచ్చింది. గాయిత్రి ముత్తాత డబ్బు క్కక్కుర్తికి  దాన్నో గౌండ్లకు ధారాదత్తం చేశాడు. దాంట్లో చాలా ఏళ్ల బట్టి ఓ కల్లు దుకాణం  నడుస్తుందని విన్నప్పుడల్లా తాతగారి వ్యథ వర్ణనాతీతం. ఎట్లాగైనా తిరిగి ఆ ఇంటిని స్వాధీనపరుచుకుని మరేదైనా మంచి పనికి వినియోగించాలని మా అమ్మ పంతం. ఆ సమయంలోనే   గాయత్రి సంబంధం తటస్థించింది. అమ్మాయి మాకు వేరే అన్నిరకాలుగా నచ్చిందనుకున్న తరువాత ఏమైనా ఇక వెనక్కు వెళ్లకూడదనే అనుకున్నాం. ఆ అట్లుపోసుకునే మనిషెవరో నేరుగా మా దగ్గరికే వచ్చేసుంటే సమస్యుండేది కాదు. గుట్టుచప్పుడుగా లోను మేమే తీర్చేసి అత్తగారి దాకా  అసలా  విషయమే పోకుండా జాగ్రత్తపడేవాళ్లం. ఆ అట్లుపోసుకునే మనిషి నేరుగా తన దగ్గరికే వచ్చేయడంతో విషయం సరిగ్గా అర్థం కాకో.. ఏమో..  వత్తిడి తట్టుకోలేక   ప్రాణం  మీదకు తెచ్చుకున్నారు అత్తగారు. ముహూర్తం  వాయిదా పడింది ఆ దుర్ఘటన వల్లయితే.. అందుక్కారణం లేని  తన మొగుడు తీర్చని బాకీ  అనుకుంది    ఈ పిచ్చి పిల్ల. పేరేంటన్నారూ?' 

'శేషారత్నం..' వెంటనే అందించాను.  పేరే కాదు.. అమాయకపు చూపులతో ఆడుతూ పాడుతూ తిరిగాల్సిన వయస్సులో  పసుపుతాడు గుదిబండలా మోసే   ఆ పిచ్చి తల్లి రూపు  అప్పుడే మనస్సులో ఎందుకో గట్టిగా అచ్చుపడి ఉంది.  

'ఆఁ.. ఆ శేషారత్నం ఇంకెవరో పెద్దాయన్ను వెంటేసుకుని డబ్బు సంచీతో సహా వచ్చిందో పూట మా ఇంటికి మళ్లీ.. బ్యాంకు లోను వెంటనే తీర్చేసెయ్యమని.. అక్కతో పెళ్లి మాత్రం ఆపొద్దని ఒకటే ఏడుపు. అప్పటికే బ్యాంకు లోను గాయిత్రి చేత  కట్టించి ఇంటిని స్వాధీనం చేసుకునుంది మా అమ్మ. తనిప్పుడు అక్కడే ఉండటం! దిక్కూ మొక్కూ లేని ఆడపిల్లలకూ ఓ దారీ తెన్నూ దొరికే వరకూ దగ్గరుండి ఏదైనా ఓ ఉపాధి కల్పించే కళలో శిక్షణ ఇచ్చే సెంటర్ నడిపిస్తోంది!'  

'మా సిస్టర్  శేషారత్నం కూడా ఇప్పుడు అక్కడే శిక్షణ పొందడం' అంది అప్పుడే లోపలికొచ్చిన గాయత్రి చిన్నగా నవ్వుతూ. 

'శేషారత్నానికి తల్లి ఉంది కదా!' ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాను. 

'ఆ అట్లుపోసే మనిషి అట్లుపోసి అమ్మినంత సులువుగా వంట్లోని కిడ్నీని కూడా అమ్మేసిందంకుల్! శేషారత్నం ఆ పూట పట్టుకొచ్చి ఇవ్వబోయిన సొమ్ము ఆ కిడ్నీ సొమ్ము తాలూకే! ఆ తరువాత ఇన్ఫెక్షనొచ్చి ఆమె చనిపోయింది. ఆ సంగత్తెలిసి గాయత్రి బలవంతంగా ఆ తల్లిలేని పిల్లను తెచ్చి అమ్మ నడిపే వెల్ఫేర్ సెంటర్లో  పడేసింది' అన్నాడు గాయిత్రి భర్త భార్యవైపు చూసి నవ్వుతూ చూసి.

***

-కర్లపాలెం హనుమంతరావు

(కౌముది/రచన - పత్రికల్లో ప్రచురితం)

 ***  

 

 

 

   

   


Monday, March 1, 2021

రుణానుబంధాలు - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

కథానిక : 

రుణానుబంధాలు 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)


పెరట్లో గిలక బావి దగ్గర స్నానం  చేస్తున్నాను. . శారదమ్మ తత్తరపడుతూ పరుగెత్తుకొచ్చింది 'రాధాకృష్ణయ్యగారు పోయార్టండీ!' అంటూ.


గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చినట్లయింది. 'ఛ! ,, ఊరుకో!' అని కసిరాను. 


'నిజమేనండీ! రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నార్ట. శాస్తుర్లుగారు వాళ్ళింటి కెళ్ళి ముహూర్తాలు కూడా విచారించుకుని వెళ్లార్ట! ఇంతలోనే ఏం ముంచుకొచ్చిందో ఏమో.. ఇట్లాగయింది'


ఆ ఇంటి వైపు పరుగులు తీయబోతున్న శారదమ్మను ఆపి 'నీ కెవరు చెప్పారివన్నీ? ఏట్లా విన్నావో .. ఏమో?' 


'బజారంతా వాళ్లింట్లోనే ఉంది. ఎంత ఎతిమతం దాన్నైతే మాత్రం ఇట్లాంటి విషయాల్లో పొరపాటు పడతానా! నే పోతున్నా.. మీరు తాళం వేసుకు రండి!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమయిపోయింది మా శారదమ్మ.


స్నానం ఎట్లాగో అయిందనిపించి, బట్టలు మార్చుకుని మళ్లీ వాకిట్లోకొచ్చాను. 


చాలా మంది అటే పోతున్నారు. ఇంటికి తాళం వేస్తుంటే ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. ఇక కదల్లేక అక్కడే గుమ్మం ముందున్న అరుగు మీద కూలబడిపోయాను. వారం రోజుల కిందట జరిగిన విషయం వద్దనుకున్నా కళ్ల ముందు కదులుతోంది.


రాధాకృష్ణయ్యా నేనూ బాల్య స్నేహితులం. వాడు జడ్.పి లో టీచర్ గా చేసి రిటైరయ్యాడు. నేనో బ్యాంకులో పనిచేస్తూ రిటైరవడానికి సిద్ధంగా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య వయసులో నా కన్నా మూడేళ్లు పెద్ద. సర్వీసులో ఉండగానే ఎట్లాగో పెద్దపిల్లకు పెళ్లిచేశాడు. రెండో పిల్ల పెళ్లే వాడికి పెద్ద సమస్యయి కూర్చుంది. 


పిల్లా ఆట్టే చదువుకోలేదు. మరీ సంసారపక్షంగా పెంచింది వాళ్లమ్మ. అన్నిహంగులూ ఉన్నవాళ్ళకే పెళ్లిళ్ళు అవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రెండు మూడు లక్షలన్నా పెట్టలేని వీడికి మంచి సంబంధాలు రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. 


ఎట్లాగయితేనేం పెళ్లి సంబంధం ఒకటి ఖాయమయిందని వాడొచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి?


పెన్షన్ డబ్బులు పూర్తిగా అందలేదు. పెళ్లికని దాచిన డబ్బులో కొంత తీసి కొడుక్కి పంచాయితీ బోర్డులో ఉద్యోగం వేయించాడు. ఇప్పుడు అర్జంటుగా ఓ లక్ష సర్దమని వచ్చి కూర్చున్నాడో రోజు. 


సమయానికి నా దగ్గరా అంత డబ్బు లేకపోయింది. డాబా మీద పోర్షన్ వేయడం వల్ల చేతిలో డబ్బాడటం లేదు. 


' పోనీ.. తెల్సినవాళ్లెవరి దగ్గర నుంచైనా ఇప్పించరా! పెన్షన్ డబ్బు అందగానే సర్దేద్దాం' అని బతిమాలుతుంటే బాధేసింది. 


'ఛఁ! చిన్ననాటి స్నేహితుడి అవసరానికి ఓ లక్ష రూపాయలు సర్దలేకపోతున్నానే!' అని మనసు పీకింది.


ఆ సమయంలోనే తటస్థపడ్డాడు శివయ్య. 


శివయ్య రైల్వే గార్డుగా చేసి రిటైరయ్యడు. అతనికి పెన్షన్ మా బ్యాంక్ ద్వారానే వస్తుంది. మొదట్లో కమ్యూటేషన్, గ్రాట్యుటీ అంతా వచ్చింది కరెక్టేనా కాదా అని లెక్కలు కట్టి చూపించింది నేనే. 


మూడు లక్షలు దాకా వస్తే కొంత ఫిక్సడ్ డిపాజిట్ చేయించాను మా బ్యాంకులోనే. 


నెల నెలా బ్యాంకుకు వచ్చిపోయే మనిషవడం వల్ల పరిచయం కాస్త ఎక్కువే అన్నట్లుండేది పరిస్థితి. 


ఎందుకో, అతనికి నా మీద అదో రకమైన గురి కూడా. డిపాజిట్లు రిన్యూవల్ చేయించుకోడానికి వచ్చినప్పుడెల్లా ఎక్కడెక్కడ ఎంత వడ్డీలు ఇస్తున్నారో విచారించుకుని పోతుండేవాడు. 


ఎప్పటిలా ఆ రోజూ శివయ్య నా దగ్గరికొచ్చి కూర్చున్నాడు. 


'పంతులుగారూ! డిపాజిట్లలో వడ్డీ మరీ తక్కువ వస్తున్నది సార్! ఇంకా మంచిది ఏమైనా ఉంటే చెప్పండి సార్!' అని అడిగాడతను.


అప్పుడు మెదిలింది మనసులో ఆ ఆలోచన. శివయ్య ఏమనుకుంటాడో అన్న తటాయింపు ఉన్నా స్నేహితుడికి సాయం చెయ్యాలన్న తపన నన్నట్లా అడగనిచ్చింది. 


'శివయ్యా! నా కర్జంటుగా ఒక లక్ష కావాల్సొచ్చింది. బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాలే! నెల నెలా ఇస్తాను. రెండు నెలల్లో తీర్చేస్తాను. వీలయితే ఈ లోపే ఇస్తాలే!' అన్నాను.


శివయ్య కాదనలేదు, 'బ్యాంకు వడ్డీ ఇవ్వండిలే సార్! చాలు!' అంటూ ఆ రోజే లక్ష రుపాయలూ డ్రా చేసి ఇచ్చాడు. 


'నోటు రాసిస్తాను' అన్నాను. 'మీ నోటి మాట కన్నా విలువైనదా నోటు? వద్దు' అంటూ కొట్టిపారేశాడు శివయ్య. 


ఒక కాగితం ముక్క మీద మాత్రం రాయించుకున్నాడు. 


'శివయ్య నా మీదుంచుకున్న నమ్మకాన్ని వమ్ము చెయకూడదు' అనుకున్నానా రోజు. అదే మాట రాధాకృష్ణయ్యతోనూ అన్నాను డబ్బిస్తూ. 


'పెన్షన్ రాగానే ముందు ఈ బాకీనే తీరుద్దాం. నీ పరువోటీ,, నా పరువోటీనా? అందాకా నోటు రాసిస్తాను తీసుకో!' అన్నాడు  రాధాకృష్ణయ్య. 


'మిత్రుల మధ్య పత్రాలేమిటి?' అంటూ నేనూ ఆ రోజు కొట్టిపారేశాను. 


ఇప్పుడు విధి రాధాకృష్ణయ్యను కొట్టిపారేసింది. 


ఎంత వద్దనుకున్నా లక్ష రూపాయల విషయం మర్చిపోలేకుండా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య ఇంట్లో ఈ బాకీ సంగతి చెప్పాడో లేదో? చెబితే మాత్రం నోటులేని బాకీని చెల్లుబెట్టాలని రూలేముంది? తన స్నేహం రాధాకృష్ణయ్యతోనే కానీ, వాడి కొడుకుతో కాదుగా!


శాస్త్ర్రులగారబ్బాయి వచ్చి అరుగు మీద కూర్చునున్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. 


'ఇంకా మీరిక్కడే కూర్చుని ఉన్నారేంటంకుల్? అవతల వాళ్లంతా మీ కోసం ఎదురుచూస్తుంటేనూ? పదండి పోదాం' అంటూ నన్ను లేవదీసి వాళ్ళింటి వేపుకు తీసుకెళ్లిపోయాడు.


వరండాలో చాపేసి దాని మీద పడుకోబెట్టున్నారు రాధాకృష్ణయ్యను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది వాడి ముఖం. 


'నా బాకీ సంగతేం చేశావురా?' అని ఆడగాలనిపించింది అంత దు:ఖంలోనూ. 


ఆడవాళ్ళు కొందరు ఏడుస్తున్నారు లో గొంతుకతో. 

అప్పటికే బంధువులంతా పోగయివున్నారు. 


రాధాకృష్ణయ్య కొడుకు దుఃఖాన్ని దిగమింగుకొని ఏర్పాట్లు చూస్తున్నాడు. 


నన్ను చూడగానే దగ్గరికొచ్చి కంట తడిపెట్టుకున్నాడు. ఓదార్పుగా వాడి భుజం మీద చెయ్యేసి తట్టేనే గాని నా కళ్లలో మాత్రం నీరు ఊరవా! వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను. 


'ఎట్లా జరిగిందిరా ఈ ఘారం?' 


'రాత్రి వరకు బాగానే ఉన్నారంకుల్! మధ్య రాత్రి  నిద్రలో లేచి అమ్మతో 'గుండెలు బరువుగా ఉన్నాయ'న్నారుట. 


చెల్లెలి పెళ్లి గురించే అలోచించడం వల్లనుకున్నాం. 'అంతా సజావుగా సాగుతుందిలే నాన్నా!' అన్నా ఏదో గుండె ధైర్యం చెప్పడానికి. 


'అంతేనంటావా!' అని మళ్లీ పడుకుండిపోయారు. మళ్లీ ఇక లేవలేదు. తెల్లవారుఝామున గుండెల్లో నొప్పితే మెలికలు  తిరిగిపోతుంటే అర్థమయింది రాత్రొచ్చింది గుండె పోటు ముందు సూచన అని. 


అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఉంటే..' మాట పూర్తవక ముందే గొంతు పూడుకుపోయింది ఆ పిల్లాడికి. 


'పోయే ముందు నీ కేమీ చెప్పలేదుట్రా?' అని అడిగాను ఆశగా. 

తల అడ్డంగా ఊపేడు. 'ఆ అవకాశమే లేకుండా పోయిందంకుల్. అదే బాధ..'


ప్రసాద్ నుంచి వచ్చిన ఆ జవాబుతో ఉన్న ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.


ఇక్కడ చేరినవాళ్లలో కొంత మంది కూతురు పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోతుందన్న విచారం వ్యక్తపరిచారు. 


విచిత్రంగా నా బాధ మాత్రం వేరేగా ఉంది. నా సొమ్ము సంగతి ఏమిటి? అనేదే నా ఆలోచన. 


వాడూ నేనూ ఇంతప్పటి నుంచి ఒకటిగా తిరిగాం. కాలేజీలు వేరు వేరు అయినా సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఒకళ్లను ఒకళ్లం వదలకుండా లవకుశలకు మల్లే కలిసే తిరిగాం.  ఉద్యోగాల మూలకంగా విడిపోయినా ఇద్దరి మధ్య ఎన్నడూ  ఎడం పెరగలేదు. 


రిటైరయిన వాడు సొంత ఊళ్లో ఉంటే, రిటైర్ మెంటుకు దగ్గరగా ఉన్నందున నేనూ సొంత ఊళ్లోనే పనిచేస్తున్నా. 


ఇప్పుడు విధి మాత్రం మమ్మల్నిద్దర్నీ ఈ విధంగా విడదీసింది. 


పాడె మీద పార్థివ  దేహాన్నుంచి అంత్యక్రియలు ఆరంభించారు. 


ఇంకో పది నిముషాలలో నా ప్రాణస్నేహితుడి రూపం కూడా కంటి కందనంత దూరంగా కనుమరుగయిపోతుంది. 


పచ్చనోట్ల వ్యవహారాన్ని ఎట్లాగైనా మర్చిపోవాలి. 


అందుకు ఒక్కటే మార్గం. వాడిని భుజం మీద మోసుకుంటూ అంతిమస్థలి దాకా అందరితో కలసి నడవడమే! 


వాడు చితిలో కరిగిపోయే దృశ్యం కళ్లారా  కనిపించినప్పుడు కానీ చేదు వాస్తవం మనసు పూర్తిగా జీర్ణించుకోలేదు. 


పై చొక్కా విప్పేసి, కండువా భుజం మీద వేసుకుని తయారవుతున్న నన్ను చూసి శారదమ్మ దగ్గరకొచ్చింది. 'మీ కసలే బాగుండటం లేదు. అంత దూరం మోయగలరా?'


'వాడు నా మీద మోపిన రుణభారం కన్నా ఇది గొప్పదా?' అని అందామనుకున్నా కానీ, అతికష్టం మీద తమాయించుకున్నా.


కట్టుకున్నదానికైనా చెప్పుకోలేని గడ్డు నిజం. శారదమ్మకు ఈ అప్పుగొడవలేమీ అప్పట్లో తెలియనివ్వలేదు. 


అంతిమ యాత్రలో అందరితో కలిసి నడుస్తున్నా ఆగడమే లేదీ పాడాలోచనలు. 


నేనే వృథాగా వర్రీ అవుతున్నానేమో! అంత పెద్ద మొత్తం! తన దగ్గర రుణంగా తీసుకున్న విషయ రాధాకృష్ణయ్య కొడుక్కు చెప్పకుండా ఉంటాడా? పెన్షన్ డబ్బు అందగానే ప్రసాద్ తన బాకీ తీరుస్తాడేమో! 


అట్లా తీర్చని పక్షంలో తానేం చెయ్యాలి? ఒకటా రెండా! వడ్డీతో కూడా కలుపుకుంటే పెద్ద మొత్తమే అవుతుంది. తీర్చాలని ఉన్నా అంతా తీర్చలేడేమో! వాడు అసలు నేనెందుకు తీర్చాలని  అడ్డానికి తిరిగితేనో? 


మిత్రుడి కొడుకు మీద కోర్టుకెళ్లే ఆలోచనే జుగుప్సా అనిపించింది నాకు. 


ఆస్తులు పంచుకున్నట్లే, అప్పులూ పంచుకోవడం కన్నబిడ్డల్లా కొడుకుల బాధ్యత.ప్రసాద్ కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునే రకం కాదు.. ఇట్లా సాగుతున్నాయి దారిపొడుగూతా నా ఆలోచనలు . 


కర్మకాండల తతంగం ముగిసి బంధుమిత్రులు వెళ్లిపోయి ఇల్లంతా మెల్లిగా  ఆ విషాదానికి సర్దుకునే సమయంలొ .. అదను చూసి అడిగాను ప్రసాదును అక్కడికీ ఆశ చావక 'ప్రసాదు! నాన్న ఇంటి సంగరులెప్పుడూ నీతో చెప్పలేదా?' అని.


'మాట్లాడుతూనే ఉంటారంకుల్! ఇదిగో.. ఈ పెళ్లి తలపెట్టినప్పటి నుంచే మూడీగా మారిపోయారు. సొమ్ము సమకూరదనేమన్నా దిగులేమో! చేసిన అప్పులు తీర్చడ మెట్లాగన్న ఆలోచనా నాన్నగారిని బాగా కుంగదీసింది. సగం ఆ దిగులుతోనే కన్నుముశారేమోనని నా అనుమానం' అన్నాడు ప్రసాద్.


నాకు కొద్దిగా ఉత్సాహం వచ్చింది 'తాను చేసే అప్పుల గురించి ఎప్పుడైనా నీతో చర్చించేవాడా?' అనడిగాను ఆశగా. 


'నోటితో చెప్పలేదు కానీ.. ఇదిగో ఈ డైరీలో రాసి పెట్టుకున్నారు. కొద్ది మందికి అప్పుపత్రాలు రాసినట్లున్నారు. అంతా కలసి ఒక అయిదారు లక్షలు అయినట్లుంది' 


'మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావ్?'


'ముందు చెల్లెలి పెళ్లి పూర్తి చెయ్యాలి. అప్పుడే నాన్నగారికి కన్యాదాన ఫలం దక్కేది. ఆ తరువాత కూడా పెన్షన్ డబ్బులేమన్నా మిగిలుంటే  వీలయినంత వరకు పత్రాలకు సర్దుదామనుకుంటున్నా. మీరేమంటారంకుల్?' 


'మంచి ఆలోచనరా! బాకీలు తీర్చి తండ్రిని రుణవిముక్టుణ్ణి చెయ్యడం కొడుకుగా నీ బాధ్యత కూడానూ! అందరూ  నోట్లే రాసివ్వలేదేమో! చే బదుళ్లూ..'


'మధ్యలోనే తుంచేశాడు ప్రసాద్ 'నోట్లు విడిపించుకోవడమే తలకు మించిన పని. నోటి మాట  బదుళ్లూఎలా తీర్చగలం? అందులోనూ అందమా  నిజమే చెబుతారని గ్యారంటీ ఏంటంకుల్?చనిపోయినవాళ్ల పేరు చెప్పుకుని డబ్బులు దండుకునేవాళ్ళు కోకొల్లలు ఈ కాలంలో! అవన్నీ తీర్చడమంటే నా వల్లయ్యే పనేనా?..


'ప్రసాద్ సమాధానంతో నా నవనాడులూ కుంగిపోయాయి. 


'పోనీ.. ఆ డైరీలోనే నా పేరేమైనా రాసేడేమో! డైరీ చూపించమని ఓ సారి అడిగితే!' నా ఆలోచన నాకే సిగ్గనిపించింది. కానీ, లోపలి మధనను ఆపుకోలేని బలహీనత. 


ప్రసాద్ స్నానాల గదికి వెళ్లిన సందు చూసి అక్కడే టేబుల్ మీదున్న డైరీ తీసి ఆత్రుతగా తిరగేశా. 


ఊహూఁ! ఏ పేజీలోనూ నా పేరే కనిపించ లేదు! 


నాకుగా  నేను  ఆ చేబదులు ఊసెత్తితే ప్రసాద్ నన్ను ఏ కేటగిరీలో చేరుస్తాడో తెలుసు! పరువే ప్రధానంగా గడిపే మధ్య తరగతి జీవిని నేను. 


'లక్ష రూపాయలకు నీళ్లొదులుకోక తప్పదు' అని ఆ క్షణంలోనే ఒక నిశ్చయానికి వచ్చేశాను. 


రాధాకృష్ణయ్య నన్ను తప్పింకుని పోగలిగాడు కానీ, శివయ్య నుంచి నేనెలా తప్పించుకోగలను!


అప్పటికీ సాధ్యమైనంత వరకు శివయ్య కంటబడకుండా ఉండేందుకు ప్రయత్నించాను. 


ప్రసాద్ తండ్రి పింఛన్ సొమ్ము అందుకున్నాడు.  కిందా మీదా పడి చెల్లెలి పెళ్లి అయిందనిపించాడు. పెళ్ళిలో నా భార్య బాగా పూసుకు తిరిగింది. నేనే, మనసు పెట్టి మిత్రుడి కూతురి కళ్యాణ శుభవేళంతా కలవరంతో గడిపేసింది! 


రాధాకృష్ణయ్య పేరు చెవిన పడగానే ముందు లక్ష రుపాయల రుణం కళ్ల ముందు కదలడం నా దురదృష్టం. 


ఆబ్దికాలకు హాజరయి వచ్చిన తరువాత .. వీలయినంత వరకు వాడిని ఊహల్లోకి రానీయకపోవడమే మిత్రుడిగా నేను వాడికి చేయదగ్గ న్యాయం అనిపించింది.


శివయ్య పెట్టిన గడువు రానే వచ్చింది. ఆ రోజు అతను బ్యాంకుకు వచ్చాడు కూడా. కానీ, బాకీ సంగతి హెచ్చరించలేదు! నేనూ నాకై నేను ఆ ఊసు జోలికి పొదలుచుకోలేదు. కానీ, ఎంత కాలమని ఇట్లా?!


నా మీద నమ్మకంతో ఏ నోటూ లేకుండానే  అతి తక్కువ వడ్డీతో అంత పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చిన పెద్దమనిషి నుంచి మొహం చాటేసే దౌర్భాగ్య పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నానే! 


'మిత్రుడయితే ఏంటి? అంత పెద్ద మొత్తం అప్పుగా ఇస్తున్నప్పుడు రాధాకృష్ణయ్య దగ్గర నోటు రాయించుకుని ఉండాల్సింది. నా పొరపాటే నా నేటి దౌర్భాగ్య పరిస్థితికి నూటికి నూరు పాళ్లు కారణం' అని అనుకోని క్షణం ఉండటంలేదు ఈ మధ్య కాలంలో!


బ్యాంకు కొచ్చిన మూడో సారి కూడా తన బాకీ  ఊసెత్తని నన్ను అదోలా చూశాడు శివయ్య. 'సారీ శివయ్యా! అనుకున్న టైముకు డబ్బందలేదు. వడ్డీ ఇస్తాను. అసలుకు నోటు రాసిస్తాను.. కాదనకుండా తీసుకో!' అన్నాను.


వడ్డీ పైకం తీసుకుని నోటు తయారుచేయించి తెచ్చాడు. సంతకం చేసి ఇచ్చేటప్పుడు 'వచ్చేనెలలో నా బిడ్డ పెళ్లి  పెట్టుకున్నాను సార్! ఎట్లాగైనా సొమ్ము సర్దాలి' అంటున్నప్పుదు శివయ్య ముఖం చూడలేక నేను  సిగ్గుతో చచ్చిపోయిన మాట నిజం.


శివయ్య ఇప్పుడు బ్యాంకుకొచ్చినా నన్ను కలవడం లేదు. నేను పలకరించినా ముభావమే సమాధానం.


ఓ శుక్రవారం  బ్యాంకు కొచ్చి ఉన్న డబ్బంతా విత్ డ్రా చేసుకున్నాడు శివయ్య. 


నా దగ్గరికొచ్చి 'సోమవారం నోటు తీసుకువస్తాను. ఎట్లాగైనా సొమ్ము చెల్లించాలి. వడ్డీ అక్కర్లేదు. అసలు ఇస్తే అదే పదిలక్షలు!' అని తాఖీదు  ఇచ్చిపోయాడు. 


శివయ్య దృష్టిలో నేను అంతలా పడిపోవడానికి కారణమెవరు? 


రాధాకృష్ణయ్యా? రాబోయే మరణాన్ని వాడేమైనా కలగనలడా? ఆ మృత్యుదేవత రాధాను కాకుండా తననైనా ఎంచుకుని ఉండొచ్చుగా! అప్పుడీ శివయ్య ఏం చేసివుండేవాడు? 


శివయ్యను మాత్రం తప్పెలా పట్టగలను?అంత పెద్ద మొత్తాన్ని స్వల్ప వడ్డీకి ఏ ఆధారం లేకుండా తనకు ధారపోసిన గొప్పవ్యక్తిని ఎట్లా తప్పుపట్టడం? 


ఏ వత్తిడుల కారణంగానో తానిప్పుడు వైఖరి మార్చుకున్నాడో? 


సమయానికి తాను చెసిన సాయాన్ని గురించి సమాచారం లేనందువల్లనే కదా మిత్రుడి కొడుకు ప్రసాదైనా తన చే బదులును లెక్కలోకి తీసుకోనిది? ఇన్ని పాత రుణాలను చెల్లిస్తోన్న అతని మంచి గుణం కేవలం నోటు లేదనే ఒకే ఒక సాకుతో ఎగవేసేందుకు  ఒప్పుకుంటుందా? 


పరిమితికి మించిన నమ్మకాలు, సమాచార లోపాలు.. విధి ఆడించిన నాటకాల కారణంగానే  వ్యక్తిత్వాలు ఇక్కడ ప్రశ్నార్థకాలు అయ్యాయే తప్పించి.. ఆర్థిక బంధాలు మానవీయ సంబంధాలకు మించిన బలమైనవిగా భావించడం సరయిన దిశలో సాగే అవగాహన కాదేమో!  


ఏదేమైనా శివయ్య బాకీ తీరిస్తే గాని, నా మనశ్శాంతి నాకు తిరిగి రాదు. 


ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీతభత్యాల ఎరియర్స్  తాలూకు మధ్యంతర చెల్లింపులకు ఆదేశాలు ఆ శనివారమే వెలువడ్డంతో ఆదివారం అంతా బ్యాంకులో కూర్చుని సిబ్బంది మొత్తం ఉత్సాహంగా ఆ పని చూసుకున్నాం. 


సొమవారం ఉదయానికల్లా అందరి ఖాతాలలో సొమ్ము జమ. 


ఈ సారి ఎరియర్స్ సొమ్ముతో వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకోవాలని శారదమ్మ ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తోంది. 


సోమవారం శివయ్య బ్యాంకు వైపుకు వస్తాడనుకున్నాను. రాలేదు! 


మరో రెండు రోజులు చూసి నేనే సొమ్ముతో సహా శివయ్య చిరునామా వెతుక్కుంటూ వెళ్లాను. 


ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమయింది. అది  ఒక మురికిపేటలో ఉంది. శివయ్య ఇల్లు చాలా అధ్వాన్నంగా ఉంది. 


తలుపు కొట్టాను. ఒక నడివయసు ఆడమనిషి గడియ తీసింది. 

నన్ను ఎగాదిగా చుసి 'ఎవురు కావాల?' అంది. 


చెప్పాను. 


నిర్లక్ష్యంగా పక్కగది చూపించి వెళ్లిపోయింది.


శివయ్య మంచం మీదున్నాడు. మంచం చాలా మురికిగా ఉంది. 


శివయ్య మొహంలో కళ లేదు. నెలరోజులు లంఖణాలు చేసిన రోగిష్టిమారిలా కనిపించాడు. 


నా పలకరింపులు అయినంత సేపూ డోర్ కర్టెన్ వెనక ఏవో కదలికలు. 


డబ్బు ఇవ్వడానికి బేగులో చెయ్యి పెట్టాను. 


అతను బలహీనమైన చేతితో ఆ పని ఆపుచేయించాడు 'మీ ఫ్రెండు గారి అబ్బాయే వచ్చి ఇచ్చి వెళ్లాడు. నోటు మీకు ఇద్దామనుకునే లోపలే అడ్దంపడ్డాను.' అంటూ పరుపు కింది  దాచుకున్న పత్రాలలో నుంచి ఒక పత్రం ఏరి తీసిచ్చి 'ఇక మీరు వెళ్లవచ్చు' దండం పెట్టేశాడు. 


 ఏదో అడగబోయేటంతలో ఇందాకటి ఆడమనిషి లోపలి కొచ్చింది అనుమానంగా చూస్తూ. 


శివయ్య అటు తిరిగి పడుకుండిపోయాడు. 


అంటే ఇక నేను 'బైటికి దయచేయచ్చు'  అని అర్హ్తమనుకుంటా. 


సవాలక్ష అనుమానాలతో నేను తిరిగివచ్చేశాను. 


ప్రసాదుకు ఈ బాకీ సంగతి తెలుసన్నమాట! 


రాధాకృష్ణయ్య చూచాయగా కూడా చెప్పినటట్లు  లేదే! 


ప్రసాదుతో మాట్లాడితే గాని విషయాలు తేలవు. 


చికాకు కారణంగా నేను ఆ దిక్కుకు పోవడమే మానేశాను. 


పాడు డబ్బు పితలాటకం మూలకంగా ప్రాణస్నేహితుడి కుటుంబానిక్కూడా దూరమయిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. 


వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో  నేను ఆ కుటుంబానికి రాధాకృష్ణయ్యలాంటి వాడిని. ప్రసాద్ ఎన్నో సార్లు సలహా కోసరంగాను తన దగ్గరి కొస్తుండేవాడు. 


తన ముభావం  కారణంగా రాకలు తగ్గించేశాడు. 


నేను ప్రసాద్ ను కలవడానికి బైలుదేరుతుంటే శారదమ్మ అన్నది నిష్ఠురంగా 'ఆ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ లేడుగా! కొత్త బావగారు తనకు దుబాయ్ లో కొలువిప్పించాడు. ఆ సంగతి చెప్పడానికని ఎన్ని సార్లు వచ్చినా మీరు  మొహం చాటేశారు.. మహగొప్పగా!'  


నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. 


అయిందేదో అయింది. ముందీ డబ్బు మిస్టరీ తేలాలి. 


శారదమ్మ ద్వారా ప్రసాద్ దుబాయ్ చిరునామా సేకరించి ఇంత పెద్ద ఈ మెయిల్ పంపించాను. 


ఫోనులో నేరుగా మాట్లాడవచ్చు. కానీ, అత్మాభిమానం.. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడనీయదు: 


చే బదులు విషయంలో ముందు  నుంచి జరిగిందీ.. తరువాత నా ప్రవర్తనా..  అందుకు కారణాలు గట్రా అంతా ఓ సోదిలా వివరించి.. చివరగా శివయ్య బాకీ తీర్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియచేశా. 


తెల్లారే సరికల్లా ప్రసాద్ నుంచి తిరిగు మెయిల్! 


'ఆ శివయ్య ఎవరో నాకు తెలీదు  అంకుల్! నేను అతనికి డబ్బిచ్చిందేమీ లేదు! నాన్నగారు అలా మీ ద్వారా అతని దగ్గర్నుంచి అప్పు తీసుకున్నట్లు నాకు ఎప్పుడూ చెప్పను కూడా చెప్పలేదు. ఆ సంగతి ఇదిగో ఇప్పుడు మీ ఉత్తరం అందిన తర్వాతనే తలిసింది. అందరి అప్పులూ తీర్చేశాను. ఈ ఒక్కటి మాత్రం ఎందుకు? ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. తండ్రిని రుణశేషుణ్ణిగా మిగల్చడం కన్నబిడ్డకు భావ్యం కాదని మీరే అంటారుగా! అమౌంట్ పంపుతున్నా! దయచేసి అతని బాకీ అణా పైసల్తో సహా తీర్చేయండి!'


ప్రసాద్ పంపిన డబ్బు అందిన తరువాత బలవంతంగానైనా శివయ్యకు ఆ డబ్బిచ్చెయ్యాల్సిందేనని వెళితే .. అంతకు మూడు రోజుల కిందటే పోయినట్లు తెలిసింది. 


కొడుకు జులాయిట. ఎక్కడి డబ్బు పేకాటకు పోస్తుంటే .. అడ్డొస్తున్నందుకు దుడ్డు కర్రతో బుర్ర రాంకీర్తన పాడించాడుట! 


అప్పటికి తిరిగొచ్చినా శివయ్య సొమ్ము నా దగ్గరుంచుకో బుద్ధేయలేదు. 

అతని కష్టార్జితాన్ని సద్వినియోగం చేయడమెట్లాగా అని మధన పడుతుంటే.. మాటల సందర్భంలో బాకీ అడిగిన రోజు శివయ్య చేసిన పెద్దల వెల్ ఫేర్ సెంటర్ల ప్రస్తావన గుర్తుకొచ్చింది.


నాకు తెలిసిన ఓల్డేజ్ హోమ్   కు శివయ్య పేరున ఆ పెద్ద మొత్తం శాశ్వత విరాళం కింద ఇచ్చిన తరువాత గాని మనసుకు శాంతి లభించింది కాదు. 

***

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)







'








 

 

 

'

 

 

'

Wednesday, February 24, 2021

వెన్నెల-కథానిక -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు- ఆదివారం అనుబంధం ప్రచురితం)

 


నాకప్పుడు ఏ అయిదో ఆరో  ఏళ్ళుంటాయనుకుంటా. నాన్నగారి ఉద్యోగ రీత్యా నెల్లూరి ఉదయగిరి దగ్గర్లోని సీతారాంపురంలో ఉన్నాం. నాన్నగారు అడపా దడపా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చేది. ఆయన ఊళ్లో లేనప్పుడు లంకంత ఆ ఇంట్లో అమ్మా నేనూ మాత్రమే ఉండాల్సొచ్చేది. పగలంతా ఎట్లాగో ఫరవాలేదు కాని, చీకటి పడితే చాలు ప్రాణాలు  పింజం పింజం అంటుండేవి. ఊరు కొత్త కావడం వల్ల పరిచయాలు తక్కువ. ఉన్నా రాత్రిళ్లు తోడు పనుకునేటంత పరిచయస్తులు లేరు. మా ఇంటికొచ్చి వైద్యం చేసే ఆచారిగారు తోడుకీ, ఇంటి పనికీ ఒక మనిషిని పంపించారు. ఆమె పేరే 'వెన్నెల'.

వెన్నెల పేరు ఎంత అందంగా ఉంటుందో.. మనిషి అంత మొరటుగా ఉండేది. గడ్డం కింద సొట్ట, కనుబొమలు మగాళ్ల మీసాలంత ఉండేవి. మాట పెళుసు. కుడికాలు ఎత్తెత్తి వేస్తుంది. నడుస్తుంటే గతుకుల రోడ్డు మీద ఎద్దులబండి పడిలేస్తూ పోతున్నట్లుండేది.

పెళ్లి కాలేదుట. 'నా' అన్నవాళ్లెవరూ లేరని చెప్పారు ఆచారిగారు. అయినా డబ్బుల దగ్గర కాపీనం చూపించేది. ఇంట్లో ఏ పనికిరాని వస్తువు కనిపించినా మూట కట్టుకునిపోయేది. వారానికొకసారి ఎక్కడికో వెళ్లి వస్తుండేది. ఎక్కడికని అమ్మ అదిగితే మాట మార్చేది.

 నాకు వెన్నెలంటే మెల్లగా ఇష్టం ఏర్పడడం మొదలయింది. సందు దొరికినప్పుడల్లా నన్ను ఒళ్లో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతుండేది. అన్నీ అడవి కబుర్లే. వినడానికి గమ్మత్తుగా ఉండేవి. కుబుసం విడిచిన పాములు ఎంత చురుకుగా కదులుంటాయో, గిన్నీకోడి ఎలా తమాషాగా కూతపెడుతుందో, కుందేళ్ళు మనుషులకు దొరక్కుండా ఎలా తెలివిగా తప్పించుకుంటాయో, అడవి మధ్యలో ఉన్న పాతాళం బావిలో నీళ్లు అన్నికాలాల్లో ఎలా తియ్యగా చల్లగా ఉంటాయో, తేనెపట్టును ఈగలు కుట్టకుండా ఎలా తెలివిగా కొట్టుకురావచ్చునో, కప్పలు రాత్రుళ్ళు రాళ్ల సందుల్లో చేరి ఎలా బెకబెకమంటాయో అనుకరించి నవ్వించేది. భయపెట్టేది. అయినా సరే, కమ్మంగా ఉండేవా అడవి కబుర్లు నాకారోజుల్లో.

 వెన్నెల ఇంట్లో ఉన్నంత సేపూ అమ్మను ఏ పనీ ముట్టుకోనిచ్చేది కాదు. 'దొరసానమ్మా! దొరసానమ్మా!' అంటూ బాగా మన్నన చేసేది. నన్నయితే 'చిన్నదొరా!' అంటూ చంక దించేదికాదు. నాన్నగారు ఇంట్లో ఉంటే మాత్రం చడీ చప్పుడు లేకుండా పనిచేసుకుపోయేది. వెన్నెల కలివిడితనమంతా ఆడవాళ్లతోనూ, నా లాంటి చిన్నపిల్లలతోనే!

 చెల్లాయి అమ్మ కడుపులో ఉందా రోజుల్లో. మా తాతగారి ఊరు పాండిచ్చేరి దగ్గరుండే కడలూరు. 'కాన్పుకు కాస్త ముందే పోరాదా?' అనేవారు నాన్నగారు. 'ఈ అడవిలో ఏం ఉంటారో.. ఏం తింటారో! ప్రసవం టైముకు పోతాలే!' అనేది అమ్మ. నా ఊహ తెలిసి అమ్మ నాన్నగారిని వదిలి ఉన్నది చాలా తక్కువే. 'ఎన్నో కాపురాలను చూశాను గానీ, సీతారాముల్లా మీ అంత వద్దికగా ఉండేవాళ్లని శానా తక్కువ మందిని చూశాను దొరసానీ!' అంటుండేది వెన్నెల. పాపాయికి అమ్మ స్వెట్టర్ అల్లుతుంటే దగ్గర కూర్చుని వింతగా చూసేది వెన్నెల.

 మేం కడలూరు పోవాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. మర్నాడు ప్రయాణమనగా ఆ రోజు జరిగింది ఆ సంఘటన. ఇప్పటికీ నాకు నిన్నగాక మొన్న జరిగినట్లుంది. ఆ రోజు పగలంతా అమ్మ నడుం నొప్పిగా ఉందని మంచం దిగలేదు. వెన్నెలే అన్ని పనులూ చేసుకుపోతోంది. సాయంకాలం నాకు పెరట్లో స్నానం చేయించే సమయంలో నడవాలో నుంచి పెడబొబ్బలు. అమ్మ అదే పనిగా ఆగకుండా అరుస్తూనే ఉంది. గభాలున లేవబోయి కాలు మడతబడి బోర్లా పడిపోయింది వెన్నెల. తట్టుకుని లేచి ఇంట్లోకి పరుగెత్తింది. వెనకనే తడి ఒంటితో నేనూ.. !

అమ్మ మంచం మీద ఒక కోతి. పళ్ళు బైటపెట్టి కిచకిచమంటూ అమ్మని బెదిరిస్తోంది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పెద్దగా ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసి ఆ కోతి నా మీదకు దూకపోయింది. వెన్నెల దాన్ని వెనక్కు నెట్టేసింది. తను మూలనున్న గడకర్ర అందుకునే లోగానే ఇంకో అరడజను కోతులు లోపలికి జొరబడ్డాయి. ఇల్లు కిష్కింధకాండే! ఒక గండుకోతయితే మరీ రెచ్చిపోయినట్లు  పిచ్చి పిచ్చిగా  గెంతుతూ అమ్మ మీదకు దూకి తను అల్లుతున్న స్వెట్టర్ లాక్కుని బైటకు పరుగెత్తింది. అంతే.. వెన్నెలకు శివమెత్తినట్లయిపోయి ఒక కర్ర తీసుకుని దాన్ని తరుముకుంటూ పోయింది. ఆ కంగారులో ఇంటి ముందు కరెంటువాళ్లు తీసిన గోతిలో పడిపోయింది. నలుగురూ చేరి ఆమెను బైటికి తీశారు. గోతిలోని రాళ్లు తలకు ఒకటి రెండు చోట్ల తగిలి రక్తం ధారగా కారిపోతోంది. ఆచారిగారు వచ్చే వేళకు ఆమె శ్వాస తీసుకోవడం ఆపేసింది. నాన్నగారొచ్చే సమయానికి ఇంటి ముందు శవం.. అదీ సీను!

వెన్నెల శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆమె కోసం ఎవరూ రాలేదు. ఊళ్లోవాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆమెను మా ఇంట్లో చేర్చిన ఆచారిగారిక్కూడా ఏంచెయ్యాలో పాలుపోలేదు. నాన్నగారే ఫార్మాలిటీస్ ప్రకారం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ల అనుమతి తీసుకుని కూలీ మనుషుల చేత పాతిపెట్టించారు. ఈ హడావుడిలో మా కడలూరు ప్రయాణం వాయిదాపడింది.

 వెన్నెల లేని ఇల్లు వెలవెలాబోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆమె మా ఇంట్లో మనిషి అయిపోయింది. వెన్నెలను పదే పదే తలుచుకుంటూ అమ్మ డీలాపడిపోయింది. నా సంగతి సరేసరి. మనిషి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లే ఉంది. వెన్నెల కోతి వెంట పడి గోతిలోపడిన దృశ్యం ఇప్పటికీ నిన్న గాక మొన్న జరిగినట్లే ఉంటుంది.

మర్నాడు మా కడలూరు  ప్రయాణమనగా ఆచారిగారు ఒక మనిషిని మా ఇంటికి వెంటబెట్టుకుని వచ్చారు.. వెన్నెల జీతం ఇతనికి ఇచ్చేయండంటూ. ఆ టైములో నేను అమ్మ ఒళ్లో పడుకుని నిద్రపోతున్నాను. ఆచారిగారి మాటలకు మెలుకువ వచ్చింది. ఆ మనిషికి డబ్బిచ్చి పంపిన తరువాత ఆచారిగారిని నాన్నగారు అడిగారు. 'వెన్నెల అంత మంచి మనిషి కదా! ఎవరూ లేకపోవడేమేంటి? ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవరు సాయానికి రాకపోవడమేంటి? మీ క్కూడా అమెను గురించి నిజంగా ఏమీ తెలీదా? ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లిన మనిషెవరు?' అంటూ.

'ఈ మధ్యకాలంలో వెన్నెలను మీ అంత బాగా చూసుకున్నవాళ్లెవరూ లేరు. నాకు తెలిసింది మీకూ చెబుతా. ఇప్పుడు చెబితే తప్పులేదు. నిజానికి చెప్పాలి కూడా.' అంటూ చెప్పడం మొదలుపెట్టారు ఆచారిగారు. ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి.

'సీతారాంపురం ఫారెస్టాఫిసులో ప్యూన్ గా చేసె యేసేబు కూతురు ఇది. దీని అసలు పేరు వెన్నెల కాదు. మేరీ. ఇది ఆడికి పుట్టింది కాదు. ఎక్కదో దొరికితే ఎత్తుకొచ్చి సాక్కున్నాడు. ఇది ఇప్పుడంటే ఇట్లా ఉంది గాని చిన్నతనంలో చాలా బాగుండేది. పాత సినిమాలల్లో భానుమతిలాగా పాడేది. అల్లరి చేసెది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊళ్లో అందర్నీ ఆటపట్టిస్తుండేది. దీని చేత తిట్టించుకోడం పిల్లలకూ, పెద్దలకూ సరదాగా ఉండేది. దీన్ని కవ్వించి తిట్టించుకుని ముచ్చటపడిపోయేవాడు బాషా.

బాషా అంటే ఈ పరగాణాల్లో పెద్ద రౌడీ కింద లెక్క. వాడంటే అందరికీ హడల్. పాత డొక్కు జీపులో జనాల్ని కొండ మీదికీ కిందికీ దింపుతుండేవాడు. అట్లాంటివాడితో ఇది సరసాలాడుతుండేది. వాడే పెట్టాడు దీనికి 'వెన్నెల' అనే పేరు. వెన్నెలని బాషా పెళ్లాడుతాడనుకునేవాళ్లు ఊళ్లో అందరూ. 'నా కూతురు రాణీవాసం పిల్ల. ఈ రౌడీ నా కొడుక్కిచ్చి చేస్తానా! దాని చెయ్యి పట్టుకు పోడానికి ఏ మైసూరు మహారాజో వస్తాడు' అంటుండేవాడు యేసోబు మందు మత్తులో. ఆ మాట బాషా చెవిలో పడిందో సారి. 'ఆ తాగుబోతు సచ్చినోడిచ్చేదేంటి? నేను తీసుకునేదేంటి? వెన్నెల ఎప్పటికీ నాదే. దాని మీద చెయ్యే కాదు.. కన్ను పడినా నా చేతిలో చచ్చాడన్న మాటే!' అంటుండేవాడు బాషా.

ఆ టైములోనే అడవి బంగళాలోకి ఓ ఆఫీసరు దిగాడు. కుర్రాడు పచ్చగా, పట్టుకుంటే మాసిపోయేటట్లుండేవాడు. ఉదయగిరి కోట మీదా, సీతారాంపురం అడవి మీదా ఏవో రిపోర్టులు రాసుకోవడానికి వచ్చాట్ట. ఆయన దర్జా, హంగూ ఆర్భాటం చూసి నేనే డంగైపోయేవాడిని. ఇక చదువు సంధ్యా లేని ఊరి జనాల సంగతి చెప్పేదేముంది! వచ్చీ రాగానే బాషా జీపు రెండు నెలలకు బాడుగ మాట్లాడేసుకున్నాడు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టే ఆయన జోరు చూసి యేసోబులో ఆశ కలిగింది. వయసులో ఉన్న తన కూతురిని పనిమాలా బంగళాలో ఆయన ముందు తిప్పుతుండేవాడు. బాషా కిది మంటగా ఉండేది.

ఒకరోజు రాత్రి.. చీకట్లో వెన్నెల మా ఇంటికి వచ్చింది. రెండు రోజుల్నుంచి కడుపులో ఒకటే ఇదిగా ఉంది. ఏమీ సయించటంలా! మందియ్యి ఆచారీ!' అంటూ. దాని చెయ్యి పట్టుకుని చూస్తే నాడిలో తేడా ఉంది. నా అనుమానం నిజమైతే వెన్నెలకు నెల తప్పినట్లే. గుచ్చి గుచ్చి అడిగినా ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ టైములో దాని మొహంలో కలవరపాటు కనిపించింది.

ఆ మర్నాడు రాత్రి..  వర్షం పడుతూ ఉంది. నవంబర్ నెల చివరివారం.. చలి బాగా ఉంది. పెందరాళే పడుకోవడం నాకలవాటు. నెల్లూరు నుంచి రావాల్సిన చివరి బస్సు వచ్చినట్లుంది. ఆ సందడికి మెలుకువ వచ్చింది. మళ్ళీ నిద్ర పట్టలేదు. వెన్నెల గురించే ఆలోచిస్తూ పడుకున్నాను.మళ్లీ మాగన్నుగా నిద్ర పట్టే సమయానికి ఎవరో తలుపు టకటకమని కొడుతున్న చప్పుడు. ఊళ్లో ఎవరికైనా బాగోలేకపోతే ఎంత రాత్రి వేళలోనైనా ఇంటి కొచ్చి తడుపు తడుతుంటారు. లేచి వెళ్ళి తలుపు తీస్తే మొగం నిండా దుప్పటి కప్పుకున్న ఓ ఆకారం వాకిట్లో వణుకుతూ నిలబడి ఉంది. 'బంగళాలో ఆఫీసర్ మాదాచ్ఛోత్ పడున్నాడు. వెళ్లి చూసుకో! 'ఇంకా ఊపిరి ఉంటే ఏ మందో మాకో ఇచ్చి తెల్లారేసరికల్లా ఊళ్లో నుంచి పంపిచెయ్!' అంటూ మళ్లా  చీకట్లో కలసిపోయింది ఆ ఆకారం.

జీపు వెళ్లిన శబ్దమయింది. అంటే ఆ శాల్తీ బాషా అన్నమాట. బంగళాకు పరుగెత్తాను. మనిషి ప్రాణాలు పోలేదు కానీ.. స్పృహలో లేడు ఆఫీసరు. ఏదో కలవరిస్తున్నాడు కానీ, అర్థంకావడం లేదు. తెల్లారేసరికి తలా ఓ చెయ్యేసి ఎలాగో ఆయన్ని ఆత్మకూరు పంపించేశాం.

తెల్లారిన తరువాత యేసోబు ఘొల్లుమని ఏడుస్తూ వెన్నెలని భుజాన వేసుకుని పరుగెత్తుకొనొచ్చాడు. ఆ పిల్ల వర్షం నీళ్లల్లో తడిసిన రక్తపు ముద్దయి పుంది. స్పృహలో కూడా లేదు. బంగళా వెనక బాలిరెడ్డి తవ్విస్తున్న కొత్త బావి గుంతలో పడుంది సామీ! ఎప్పుడు పడిందో.. ఎందుకు పడిందో.. ఆ దేవుడికే తెలియాలి. వానకు తడుస్తొ.. చలికి వణుకుతో.. వంటి మీద యావ లేకుండా పడివుంది. 'నా కూతుర్ని బతికించు ఆచారీ! చచ్చి నీ కడుపున పుడతా!' అంటూ కాళ్లా వేళ్ల పడి ఏడుస్తున్నాడు యేసోబు.

ఏదో ఎత్తు మీద నుంచి పడటం వల్ల ఆ పిల్ల కుడి కాలు ఎముకలు మూడు చోట్ల విరిగాయి. మొహం మీది బొమికలు పొడుచుకొచ్చి చూడ్డానికే మహా భయంకరంగా ఉంది. నెల్లూరు ఆసుపత్రిలో మూడు నెలలుంది. మనిషి బతికింది కనీ శాశ్వతంగా అవిటిదైపోయింది. ఆ మొహం మీద సొట్టలూ, మచ్చలూ అన్నీ అప్పటివే. ఇప్పటి ఈ మనిషిని చూస్తే అప్పటి ఆ  అందమైన ఆడపిల్ల అంటే ఎవరూ నమ్మరు. అప్పటి పాటుకు గర్భసంచీ కూడా దెబ్బతింది. తీసేయాల్సొచ్చింది. ఆ ఆఫీసరు మళ్లా ఊళ్లోకి రాలేదు. పోలీసు కేసయింది. బాషా కనిపించకుండాపోయాడు. వాడి మొదటి పెళ్లానికి మతి చెలిస్తే పిచ్చాసుపత్రిలో పడేశారు. ముగ్గురు పసిబిడ్డలు బాషాకు. ఇన్నాళ్లూ వాళ్లని నెల్లూరు హాస్టల్లోనే ఉంచి వెన్నెలే సాకుతూ వస్తోంది. అందుకే అది అందరి దగ్గరా డబ్బు దగ్గర మాత్రం అంత కాపీనంగా ఉండటం!

'వారానికి ఒకసారి వెళ్లేది వాళ్ల దగ్గరికేనా?' అంది అమ్మ పశ్చాత్తాపంగా.

'అవునమ్మా! ఈ రోజుల్లో పిల్లల చదువులు.. పెళ్లిళ్లు అంటే ఎంతెంత కావాలీ! అదీ దాని యావ. బాషా పిల్లల కోసం అది తన పెళ్లి ఊసు ఎత్తనిచ్చేది కాదు. ఆ దిగులుతోనే యేసోబు తాగి తాగి చచ్చాడు. పెళ్ళికి ముందే కడుపు చేయించుకుందని ఊళ్లో అందరూ దాన్ని చులకనా చూస్తారు. అందుకే దాని చావు నాడు కూడా ఎవరు ఇటు తొంగి చూడలేదు.

యేసేబు పెంచుకున్నందుకు వెన్నెలను కిరస్తానీ అనాలా? బాషాను ప్రేమించినందుకు ముసల్మాను అనాలా? ఆ ఆఫీసరు పాడు చేసినందుకు మన మతం మనిషి అనాలా?  ఆ సందిగ్ధంలో ఉండే ఆ రోజు వెన్నెల పార్థివ దేహాన్ని ఏం చేద్దామని మీరు అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పడానికీ పాలుపోలేదు. ఇందాక వచ్చి మీ దగ్గర వెన్నెల జీతం పట్టుకుపోయిన వ్యక్తి బాషా పిల్లలుండే హాస్టల్ ఉద్యోగి. ఇక ముందు ఆ పిల్లల గతేమిటో ఆ శ్రీమన్నారాయణుడికే తెలియాలి' అంటూ లేచారు ఆచారిగారు.

(ఆ పిల్లలకు ఆ ఏర్పాట్లేవో మా నాన్నగారు తరువాత చేయించారు ప్రభుత్వం వైపు నుంచి)

 ఆచారిగారు ఇంత చెప్పినా .. ఆ నవంబరు చివరివారం రాత్రి చీకట్లో.. అడవి బంగళాలో ఏం జరిగిందో మిస్టరీగానే మిగిలిపోయింది. వెన్నెల గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ విషయమే నన్ను తొలుస్తుండేది.

---

సుమారు పాతికేళ్ల తర్వాత ఆ చిక్కుముడీ తమాషాగా విడిపోయింది.

అనుకోకుండా ఒక పుస్తకాల దుకాణంలో ఆంధ్రప్రదేశ్ కోటలను గురించిన పరిశోధనా గ్రంధం ఒకటి నా కంటబడింది. అందులో ఉదయగిరి కోటను గురించి ఆంధ్రా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డా॥ చిలువూరు సూర్యనారాయణశర్మగారు  రాసిన వ్యాసం ఉంది. ఆ వ్యాస విషయాన్ని బట్టి, సీతారాంపురం అడవులను గురించి చేసిన ప్రస్తావనలను బట్టి.. ఆయనకూ .. ఆ ప్రాంతానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించింది.

శర్మగారి చిరునామా సంపాదించి ఆయన్ని కలిశాను. ముందు ఆయన నోరు విప్పడానికి అంతగా సుముఖత చూపించలేదు. కానీ, వెన్నెల చనిపోయిన తీరు ఊరిలో ఆమెకు జరిగిన అవమానాలను గురించి వివరించినప్పుడు ఆయనలో కదలిక వచ్చింధి. ఆ కదలికే ఆయన నోటి నుంచి ఆ నవంబరు చలి రాత్రి ఏమి  జరిగిందో బైటపెట్టింది.

'ఆచారిగారి ద్వారా నెల తప్పినట్లు  తెలియడంతో ఆ నిర్వాకం నాదేనని పసిగట్టింది  వెన్నెల. నా రూము కొచ్చి తాళి కట్టమని గోల పెట్టింది. అప్పటికే నాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు! విషయం విన్న వెంటనే షాక్ అయింది. అయినా వెంటనే తేరుకొంది. 'నా తంటాలేవో నేను పడి చస్తా ఆనక. బాషా బండ చచ్చినోడు. నన్నీ టయింలో ఇక్కడ చూసాడంటే మీకిక్కడే నూకలు చెల్లినట్లే. వాడొచ్చి పోయిందాకా నేను వెనక పక్క కింద గది కిటికీ సన్ షేడ్ మీద దాక్కునుంటా. మీరు పోయేటప్పుడు  మర్చిపోకుండా  నన్ను  పైకి లాగితే చాలు! అబ్బలు చేసిన ఛండాలప్పనికి బిడ్డలెందుకు బలవాల.. నాకుమల్లే? అందరికీ మా ఏసోబయ్యలాంటి దేవుళ్లే దొరుకుతారా? మన మూలకంగా ఎవుళ్ళూ ఉత్తిపున్నేనికే బాధపడద్దంటాడు  మా తాగుబోతయ్య!'  అనుకుంటూ .. అంత వర్షంలోనూ .. చీకట్లో..  కిటికీ చువ్వల మధ్య గుండా  దూరుకుంటూ కింది భాగం గది కిటికీ  పైని పాత బడ్డ సన్ షేడ్  మీదకు జారెళ్లి కూర్చుంది వెన్నెల.. తల్లి!' అంటున్నప్పుడు శర్మగారి గొంతులో సన్నని వణుకు. 

'బాషా తలుపు విరగ్గొట్టుకొనొచ్చి వెంట తెచ్చుకున్న జీప్ రెంచితో నా బుర్ర మీద చాలా సార్లే మోదేడు. స్పృహ తప్పడం తెలుస్తూనే ఉంది. ఆ తరువాత జరిగినవేవీ  తెలియవు. విశాఖలో చాలాకాలం ట్రీట్ మెంట్ తీసుకున్నాను' అని గతం గుర్తుచేసుకున్నారీ శర్మగారు.

తలుపు చిన్నగా కొట్టి ఒక పాతికేళ్ల అందమయిన అమ్మాయి కాఫీ కప్పులతో సహా లోపలికి వచ్చింది.

'మా అమ్మాయి' కాజ్యువల్ గా పరిచయం చేశారు శర్మగారు,

'పేరేంటి తల్లీ?' అనడిగాను అణుకువతో 'నమస్తే చెప్పే ఆ పాపను.  

'వెన్నెల'  అంది చిరునవ్వుతో. నా చిన్నతనంలోని


 వెన్నెల చిరునవ్వే మళ్లీ గుర్తుకొచ్చింది.

నాకు ఆడపిల్ల పుడితే పెట్టుకోవాలనుకున్నదీ అదే పేరు.

-కర్లపాలెం హనుమంతరావు

24 -02 -2021

***

(ఈనాడు- ఆదివారం అనుబంధం







ప్రచురణ)

 











 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, February 16, 2021

మనిషి- విపుల కథ -కర్లపాలెం హనుమంతరావు


 


మధ్యాహ్నం మూడింటప్పుడు జానకి కాల్ చేసింది 'మామయ్యగారు కనిపించడంలేదండీ!అంటూ కంగారుపడుతూ

లంచ్ ముగించుకుని 'డే బుక్రాసే పనిలో పడబోతున్నానప్పుడే! జానకి మాటలు ముందు అస్సలు బుర్రకెక్కలేదు. 'బాబాయి కనిపించకపోవడమేంటీఆయనేమన్నా చిన్న పిల్లాడా.. తప్పిపోడానికిఅనిపించింది. 

'అసలేం జరిగింది జానకీ?' అనడిగాను ఆదుర్దాగా!

పొద్దున పదకొండు గంటల ప్రాంతంలో ఏవో మందులు తెచ్చుకుంటానని బయటకుపోయాట్ట! ఇంత వరకు ఇంటికి రాలేదుట! 

మందుల దుకాణం ఉండేది మా వీధి చివర్లోనేనత్తలాగా నడిచి వెళ్ళొచ్చినా పావుగంటకు మించి పట్టదుఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు దాటిందిఎట్లాంటి కండిషన్లో కూడా పన్నెండు గంటలకు విసరి ముందు కూర్చోడం బాబాయికి అలవాటుఅట్లాంటి మనిషి ఇంకా ఇంటికి రాకపోవడమేమిటి?!

 

నా మనసునేదో కీడు శంకిస్తోందిపని ముందుకు సాగలేదుమేనేజరుగారికి విషయం చెప్పి పర్మిషన్ తీసుకుని బ్యాంకు నుంచి బైటపడ్డాను.

ఇంట్లో జానకి తిండి తిప్పలు మానేసి దిగాలుగా కూలబడివుందో మూల. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడి గిన్నెలుఅక్కడనే ఉన్నాయి

'వీధి చివర్లోని మందుల షాపులో అడిగి చూశావా?' అని అడిగాను జానకిని

'ఎట్లా ఊరుకుంటానండీ! ముందు చేసిన పని అదే! ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారుపక్కనున్న హోటల్లో వాళ్లు ఏదో అన్నారు గానీ, నాకు సరిగ్గా అర్థం కాక మీకు ఫోన్ చేశా!అంది జానకి

మరోసారి మందుల షాపుదాకా వెళ్లి చూశానుషాపు తెరిచిలేదుహోటల్లోని మనిషి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా అనిపించిందిబాబాయికి సెల్ ఫోన్ వాడే అలవాటు లేదు.. ఎక్కడున్నాడో తెలుసుకోడానికి 

బాబాయిది వేటపాలెంమా నాన్నకు అందరికన్నా చిన్న తమ్ముడు.పోయినేడాదే షష్టిపూర్తి అయింది. మా ఊరి హైస్కూల్లో సంస్కృతం ఉపాధ్యాయుడుగా చేసి రిటైరయ్యాడుపిన్ని పోయి చాలా కాలమయిందిఆదుకునే పిల్లలెవరూ ప్రస్తుతం లేరు

'ఒంటరిగా ఆ ఊళ్లో ఏం ఉంటావ్! మా ఊరొచ్చేయమని చాలా సార్లు పోరుపెట్టాను. 'ఇప్పట్నుంచే ఒకళ్ల మీద ఆధారపడ్డం దేనికిలేరా! ఒంట్లో ఓపికున్నంత కాలం లాగిస్తానుతప్పదనుకున్నప్పుడు నీ దగ్గరకు కాక ఇంకెవరి దగ్గరకు వెళతానులే! అని తప్పించుకుని తిరుగుతుండటంతో అడగడం మానేశానుఇప్పుడైనా ఆ కంటికి 'గ్లాకోమాజబ్బేదో వచ్చిందనిచూపించుకోడానికి నా బలవంతం మీద వచ్చాడు..  గానీ లేకపోతే ఒక పట్టాన ఆ రథాన్ని కదిలించడం ఎవరి తరమూ కాదు

'నిన్న ఆసుపత్రికి వెళ్లొచ్చారు కదా! ఇవాళ కూడా అక్కడికే వెళ్లారేమో!అని అనుమానం వెలిబుచ్చింది శ్రీమతి

ఆసుపత్రిలో విచారించినా ఫలితం లేకపోయిందిమందుల దుకాణం దార్లో ఉన్న తెలిసిన వాళ్ల ఇళ్లల్లోనూ విచారించానుఏదైనా యాక్సిడెంటు లాంటిది జరిగితే తెలుస్తుందని ఆశఎవరి దగ్గరా ఏ సమాచరమూ లేదు

'ఇంకో గంట ఆగి చూద్దాంచీకటి పడితే బాబాయి బైట ఉండలేడురేజీకటి సమస్యఎంత అర్జంటు పనున్నా దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరాల్సిందే! నీకూ తెల్సు కదా?' అన్నా జానకితో

దీపాలు పెట్టే వేళా దాటిపోయిందిబాబాయి జాడ లేదు! పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడం తప్ప మరో మార్గం లేదు

కంప్లైంట్ బుక్ చేసుకునే  స్టేషన్లోని వ్యక్తి ఒకటే గొణుకుడు 'పసిపిల్లలంటే తెలీక దారి తప్పుతారువయసులో ఉన్న ఆడపిల్లలంటే అదో లెక్కకాటిక్కాళ్లు చాచుకున్న తాతలు కూడా ఇట్లా మిస్సయిపోతుంటే ఇహ మా పని గోవిందే!ఇట్లా సాగాయి ఆయనగారి  సెటైర్లు

బాబాయి వివరాలుమా చిరునామా అయిష్టంగానే తీసుకున్నాడు, 'విషయమేదన్నా ఉంటే కబురుచేస్తాంమీ ప్రయత్నంలో మీరుండాలిఅని పంపించేశాడు చివరికి.

సభ్యత కాదని తెలిసినా చివరికి బాబాయి బ్యాగ్ ఓపెన్ చేసి చూశాంస్పేర్ కళ్లజోడు సెట్టునాలుగు జతల పంచెలుజుబ్బాలుమందుల పెట్టె,చలంగారి 'బిడ్డల శిక్షణపుస్తకం కనిపించాయిపిల్లల పెంపకం బాబాయి అభిమాన అంశంపథకం ప్రకారం ఇల్లొదిలి పోలేదన్న విషయం స్పష్టమయినందున కొంత రిలీఫ్ ఇచ్చినామందుల పెట్టె చూసే సరికి దిగులు రెట్టింపయింది

బాబాయికి అస్త్మాబిపిషుగర్! వేళకు మందులు పడాల్సిన జబ్బులే ఇవన్నీ!  ఉదయం నుండి ఈదురుగాలిగా ఉందిఆకాశం మబ్బుగా ఉంది.ఎప్పుడు పడుతుందో వర్షం అన్నట్లుగా ఉంది వాతావరణం.   

చలిలో, చీకట్లో రేజీకటి మనిషి కొత్త ఊర్లో కొత్తగా సంక్రమించిన గ్లాకోమా వ్యాధితో పాటు గట్టిగా నాలుగడుగులు వేసినా ఆయాసం ముంచుకొచ్చే'ఉబ్బసంరోగంతో  ఇంత సేపు బైట ఏం చేస్తున్నట్లు?ఎక్కడున్నట్లు?ఎక్కడున్నా కాస్త సమాచారం అందించవచ్చు కదా!

నా చిరాకుఅసహనం చూసి సముదాయించే పనిలో పడింది జానకి. 'పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం గదా! తెల్లారేలోగా ఏదో ఓ సమాచారం తెలుస్తుంది లెండిఅంటూ

తెల్లార్లూ కళ్లు గుమ్మానికిచెవులు ఫోన్లకు అర్పించి నట్లింటో నిరాహారంగా జాగారం చేసినా ప్రయోజనం శూన్యంరాత్రి కురిసిన కుండపోతకు మా స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోయాయి

బ్యాడ్ న్యూస్ వినడానికే పూర్తిగా సిద్ధమయిపోయి  కూర్చున్నాం ఇద్దరంబ్యాంకు డ్యూటీకి వెళ్లబుద్ధి కాలేదుసెలవు పెట్టేసి వేటపాలెంలోని  నా బాల్యమిత్రుడు శాయికి ఫోన్ చేసి వివరాలు అవీ  చెప్పి 'ఒకసారి బాబాయి ఇంటికి వెళ్లి చూసి ఇన్ ఫామ్ చెయ్యరా!అనడిగాను

పది నిమిషాలల్లో వాడి దగ్గర నుంచి రిటన్ కాల్..  'ఇంటికి తాళమేసుంద'ని

ఏడుపు ఆపుకోవడం ఇక నా వల్ల కాలేదుచిన్నప్పట్నుంచి బాబాయంటే చాలా ఇష్టం

మా నాన్నగారు మహాస్ట్రిక్ట్లెకల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని రోజంతా అన్నం పెట్టద్దని అమ్మకు హుకుం జారీచేశారొకసారి. అమ్మ నన్ను  బాబాయి దగ్గరకు పంపించింది రహస్యంగాపిన్ని బైట ఉన్నా నాకు ఇష్టమని ఆలుగడ్డ కూర స్వయంగా చేసి, తినిపించి చీకటి పడే లోపు  మా ఇంట్లో దించిపోయాడు. 'మళ్లీ వచ్చే పరీక్షల్లో వంద శాతం మార్కులు తెచ్చుకుంటానని నా చేత ప్రమాణం చేయించి నాన్నగారి కోపాన్ని చల్లార్చింది బాబాయే! ఆ పరీక్షల్లో నేను మాట నిలబెట్టుకోవాలని రోజూ ఇంటికొచ్చి నా చేత గణితంలో అభ్యాసం చేయించాడాయన ఎన్ని పని వత్తిళ్లున్నా. . 

బాబాయివాళ్లకు బాబూరావని నా ఈడు కొడుకు ఒకడుండేవాడుచదువు సంధ్యలు అబ్బక జులాయిలా తిరుగుతున్నా వాడిని ఏమీ  అనేవాడు కాదు బాబాయ్బిడ్డల చేత ఇష్టం లేని పనిచేయించ కూడదన్న చలంగారి సిద్ధాంతం ఆయనదిపదో తరగతిలో వాడు ఇంట్లో దొరికింది లంకించుకుని చెన్నయ్ పారిపోయాడుఎంత వెదికించినా లాభం లేకపోయిందిమూడు రోజుల తరువాత వాడి బాడీ దొరికిందని చెన్నయ్ నుంచి కబురు!  దేశం కాని దేశంలొ భాషే రాని ప్రాంతంలో వాడి ఘోష పట్టించుకునే నాథుడు దొరక్క నడుస్తున్న  ఎలక్ట్రిక్ ట్రైన్  ముందు ఉరికేశాట్ట

ఉన్న ఒక్క కొడుకు అట్లా దక్కకుండా పోయినప్పట్నుంచి బాబాయి మరీ చాదస్తంగా తయారయ్యాడు. పిన్నయితే కొడుకు మీద దిగులుతోనే పోయిందంటారు

ప్రస్తుతం బాబాయి ఏకాకిసహజంగా  మొండి మనిషి కనక వేటపాలెం విచిడిపెట్టి వచ్చేందుకు  'ససేమిరాఅన్నాడు వచ్చింది గ్లాకోమా కనకపెద్ద డాక్టర్లకు చూపించడం తక్షణావసరం కనక హైదరాబాద్ తరలి వచ్చాడు ఎట్లాగో. 

నిన్ననే ఆసుపత్రిలో  చూపించానుపంజగుట్టలోని విజన్ ఫీల్డ్ సెంటర్లో టెస్టులూ అవీ చేయిచుకుని రిపోర్టులు పట్టుకు రమ్మనాడు డాక్టర్ఈ రోజు బ్యాంక్ నుంచి రాగానే అక్కడకు పోవాలని ప్లాన్ఇంతలో ఇలాగయింది!

'బాబాయిని ఇక్కడకు పిలిపించి పొరపాటు చేశానావేటపాలెంలోనే ఉండుంటే ఆయన తిప్పలేవో ఆయన పడుతుండేవాడు'. ఇదీ నా గిల్ట్ ఫీలింగ్ రాత్రి నుంచి.

'ఇలాగవుతుందని మనమేమైనా కలగన్నామాకడుపున పుట్టిన బిడ్డలే పట్టించుకోని ఈ రోజుల్లో బాబాయి అనే  అభిమానం కొద్దీ ఏదో సాయం చేద్దామని  పిలిపించుకున్నారుఅయినా బైటికెళ్లిన మనిషి అట్నుంచటే వెళ్లిపోవడమేనామరీ అంత ముంచుకుపోయే పని ఉంటే ఇంటికొచ్చి చెప్పిపోవాలిలేదా కబురన్నా చేయాలిఇదేం మనిషిఇవతల మనమెంత కంగారు పడతామో చుసుకోవద్దా?' అని నన్ను ఊరడించబోతూ బాబాయిని ఝాడించడం మొదలుపెట్టింది నా భార్య

తనకూ బాబాయంటే తగని అభిమానమేనిన్నటి నుంచి పడుతున్న యాతన అట్లా అనిపిస్తోందిఇప్పుడు ఎవర్ననుకుని ఏం లాభంబాబాయిని ఇట్లా మాయం చేసిన ఆ మహానుభావుడే ఈ మిస్టరీని విడదీయాలిపోలీసుల వల్ల ఏమీ కాలేదు లాగుంది.. కబురు లేదు!

మధ్యాహ్నం సమయంలో నా సెల్ ఫోన్ మోగింది. 'రామచంద్రంగారేనాండీ?' ఎవరిదో అపరిచితమైన గొంతు

'అవునుమీరెవరూ?'

'మాది నరసారావుపేట  దగ్గర మురికిపూడి అండీ! సుబ్రహ్మణ్యంగారు మీ బాబాయేనాండీ?'

'అవునవునునిన్నటి నుంచి ఆయన  ఆచూకీ  తెలియడంలేదు. మీకేమైనా తెలుసాండీ?' నా గుండెలు దడదడకొట్టుకుంటున్నాయి

'కంగారు పడకండి సార్! ఆయన ఇక్కడే ఉన్నారు!'

'ఇక్కడంటే? మురికిపూడిలోనా?!  అంత దూఆం ఎందుకెళ్లాడసలుఏం చేస్తున్నాడక్కడబాగానే ఉన్నాడా?' నాకంతా అయోమయంగా ఉంది

'బాగానే ఉన్నారుఆందోళన పడాల్సిందేంలేదుఇప్పుడే తెల్సింది ఆయన ఇట్లా మీ బాబాయిగారనిఅందుకే ఫోన్ చేస్తోంది'

'ముందొకసారి  ఆయనకు ఫోనివ్వండిమాట్లాడాలి’ కంగారుగా అడిగాను

'ఇస్తా గానీ.. ముందు నా మాట కాస్తాలకించండి సార్! తెల్లారుఝామున వచ్చారిక్కడికివచ్చీ రాగానే సొమ్మసిల్లిపోయారు.  మా ఊళ్లో మంచి డాక్టరు లేడండీ! పేట నుంచి డాక్టర్ని తెచ్చేసరికి ఈ ఝామయిందిఇప్పుడు నయంగానే ఉంది'

'ముందు మీరెక్కడున్నారో చెప్పండి! వెంటనే బైలుదేరి వచ్చేస్తా!అని ఫోనులోనే అరిచేశాను ఉద్వేగాన్నాపుకోలేక

ఒక్క నిముషం నిశ్శబ్దం తరువాత బాబాయి లైనులోకి వచ్చాడు 'నువ్వేం రానక్కర్లేదు గానీ.. ముందొక పని చెయ్యరా! మీ వీధి చివర మందుల షాపుంది కదా! దాని ఫోను నెంబరొకసారి కనుక్కొనివ్వు ఒక అయిదునిమిషాల్లో! నువ్వేం రావద్దుమేమే ఓ గంటలో బైలుదేరి వస్తున్నాంమీ ఇంటి వివరాలు అవీ ఈయనకు చెప్పు!అన్నాడు

మందుల షాపు నెంబరుమా ఇంటి అడ్రసు కనుక్కొని 'రాత్రి ఏ టైముకైనా సరే  మీ బాబాయిగారిని మీ ఇంట్లో దించుతాం.. 'అని ఫోన్ కట్ చేశాడు అవతలి మురికిపూడి పెద్దమనిషి 

బాబాయి యొగక్షేమాలు తెలిసినందుకు ఆనందంగా ఉందిక్షేమంగా ఉన్నందుకు రెట్టింపు రిలీఫుగానూ ఉందిఎక్కడి హైదరాబాదుఎక్కడి మురికిపూడిమందులకని బైటికెళ్లిన బాబాయి అన్నొందల కిలోమీటర్లవతల తేలడమేమిటిమధ్యలో ఈ మందుల షాపు నెంబరెందుకు

బాబాయిని దించడానికని వచ్చిన పెద్దమనిషి చెప్పిన వివరాలు తెలుగు చలనచిత్ర  కథలను మించి విచిత్రంగా ఉన్నాయిబాబాయీ ఆయనా కలిపి వినిపించిన కథ. సారాంశం  వింటే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! 

మందులకని బాబాయి దుకాణానికి వెళ్లినప్పుడు ఎవరో పదేళ్ల పిల్లగాడు పొట్ట పిసుక్కుంటూ నిలబడున్నాడుట దుకాణం ముందు! పక్కనే కాకా హోటలుందిఆకలికి ఏమైన ఏమైనా పెట్టించమని అడుగుతున్నాడేమో అనుకుని బాబాయే ఏదో టిఫిన్ పెట్టించబోయాట్ట

'వాడి ప్రాబ్లమ్ లోడింగ్ కాదండీ! అన్ లోడింగ్! ఎక్కడ్నించొచ్చాడో.. ఎందుకొచ్చాడో!.. తెల్లారుఝామున పాక వెనకాల కూర్చోబొతుంటే పిండి రుబ్బుకునే  మా ఆడంగులు  పట్టుకున్నార్ట సార్! ఇట్లాంటి ఛండాలాలు ఇక్కడ చూస్తే ..సిటీ  కదా.. వ్యావారాలు నడుస్తాయామరీ మీ కంత దయగా ఉంటే ముందు మీ ఇంటికి తీసుకెళ్లి  వాడి కడుపుబ్బరం తీర్చండి!'అన్నాట్ట హోటలాయన  వెటకారంగా.

బాబాయి ముందు వాణ్ణి మా యింటికే తెద్దామనుకున్నాట్టవాడి బాధేందో తీర్చి .. ఎవరి పిల్లాడో కనుక్కుని.. ఎక్కడి నుంచొచ్చాడో విషయం రాబట్టి.. వాణ్ణి వాడింటికి చేర్చాలని బాబాయి తాపత్రయం! 

కొడుకు దిక్కులేని చావు చచ్చిపోయినప్పటి నుంచి దిక్కులేని ఏ పిల్లాడిని చూసినా తన కొడుకే గుర్తుకొస్తుండేవాడు బాబాయికిమొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నా కారాపినప్పుడు అడుక్కునే పిల్లలకు తలా ఇరవై  దానం చేశాడు అంత డబ్బు  పిల్లల చేతుల్లో పోయడం పరోక్షంగా సోమరితనాన్ని మరింత ఎంకరేజ్ చెయ్యడమే'నని నా అభిప్రాయం. 'మీరు తాగి పడేసే సిగిరెట్లకూ,మందు బుడ్లకూ అయ్యే దుబారానో? ఒకట్లో  అర్ధం  శాతం కూడా అవదురా ఈ ఖర్చుఅని పెద్ద ఉపన్యాసమే దంచాడారోజీ  బాబాయి.  లోకానికి చాదస్తంగా కనిపించేది కూడా  అదే!

ఆయన చాదస్తం,  స్పీచులు మాకు అలవాటే గానిబయట వాళ్లు ఎందుకు ఊరుకుంటారు?! మెడికల్ షాప్ ముందున్న కుర్రాడిని బలవంతంగా ఆపి బాబాయి వివరాలు రాబట్టే పనిలో  ఉంటే.. షాప్ ఓనర్  'పోనీయండి మాష్టారూ! మన కెందుకొచ్చిన పీడాకారం! ఎక్కడివాడోఎందుకిక్కడ తిరుగుతున్నాడోఏదైనా గొడవైతే చివరికి మనకు చుట్టుకుంటుందిమన పనులు మానుకుని పోలీసులుకోర్టుల చుట్టూతా  తిరగాల్సొస్తుందిఅన్నాట్టదాంతో బాబాయి ఉగ్రుడయిపోయాట్ట

'అట్లా ఎట్లా వదిలేస్తామండీ! ఈ పిల్లాడి ఇంట్లోవాళ్లు ఎంత కంగారు పడుతుంటారుఅదే మీ పిల్లాడయితే వదిలేస్తారా? మానవ  సమాజంలో బతుకుతున్నాం మనంప్రతి మనిషికీ కొన్ని బాధ్యతలున్నాయివట్టి హక్కుల కోసమే గోల పెడితే ఎట్లా?' అని ఉపన్యాసం దంచేసరికి షాపాయన హర్ట్ అయ్యాట్ట, 'నీతులు చెప్పేవాళ్లు తక్కువయి కాదు లోకం ఇట్లా ఏడ్చిందినాకు చెప్పడం కాదు.. మీరు చేసి చూపించండి ముందు!' అని ఛాలెంజికి దిగాట్టమాటా మాటా పెరిగింది ఇద్దరి మధ్యా

'మెడికల్ షాపాయన అన్నాడని కాదుగానీ.. ఎట్లాగైనా ఈ పిల్లాడి వాళ్లింట్లో చేర్చాలనిపించిందిరా. వీడి వివరాలు రాబట్టటమే బ్రహ్మప్రళయమైందిపెద్ద బస్టాండులో ముందు వీడి 'కడుపు'బ్బంది  తీర్చి ఇంత పెట్టించడం దగ్గర్నుంచి.. బస్సులో అంత దూరం కట్టేసినట్లు కూర్చోబెట్టడం దాకా నా తాతల్ని మళ్ళీ నాకు చూపించాడురా ఈ భడవా. ఎట్లాగూ మెడికల్ షాపులో నా కోసమని  కొనుక్కున్న నిద్రమాత్రలు ఉన్నాయిగా! ఓ గోళీ తగిలించా!అన్నాడు ముసిముసిగా నవ్వుతూ

'అది సరే బాబాయ్! ఇట్లా వెళుతున్నానని ఇంటికి ఒక ఫోన్ కాల్ చేసైనా చెప్పాలి కదా! ఇంట్లో నేనూజానకీ నిన్నట్నుంచి ఎంతలా కంగారు పడుతున్నామో తెలుసా?' అని బాబాయి మీద గయ్యిఁ మన్నాను కోపం పట్టలేక

'సాగర్ బస్టాండ్ లో నీ నంబరుకి కాల్ చేయించానురా! ఎంత సేపటికీ ఎత్తకపోతివి.. నేనేం చెయ్యాలీ!అని ఎదురు ప్రశ్నించాదు బాబాయి

'మీరు చేసిన నెంబరు రాంగ్ సార్! ఆ నెంబరుకు కాల్ చేస్తే నాకూ ఎవరూ ఎత్తలేదుమా బుడ్డోడి అయిడియాతో ఈ నెంబరు చివరి మూడుకు బదులు ఎనిమిది కలిపి చేస్తే రామచంద్రంగారి నెంబరు కలిసిందిఅన్నాడు మురికిపూడి పెద్దాయన. ఇక్కడి కొచ్చిన తరువాత  బాబాయి నా నెంబర్ తన  కొత్త   ఫోన్ బుక్కులో  చివరి నెంబరు తప్పు రాసుకున్నాడుచూపు సమస్య వల్ల

అదే చెబితే 'అవునా!అంటూ  ఆశ్చర్యపోయాడు బాబాయి తెప్పరిల్లి మురికిపూడి పెద్దాయనతో 'ఏ మాటకు ఆ మాటేనయ్యా! మీ బుడ్డోడిది మాత్రం ప్రహ్లాదుడి బుద్ధిఇట్లాంటి పిల్లల్ను చదువులోనే పెట్టాలిబడికి పోతానంటే గొడ్డులా బాదడమేంటి! నీ దెబ్బలకు తాళలేకే ఇంటి నుంచి వీడు  పారిపోయిందిపిల్లాడు   ఏదన్నా చేసుకోనుంటే.. జీవితాంతం అఘోరించేవాడివి..' బాబాయి కళ్లల్లో నీళ్లు! బాబూరావు గుర్తుకొచ్చి ఉంటాడు.. పాపం!

' బ్యాంకు లోను పెడితే గాని బడ్డీ కొట్టయినా నడపలేని దరిద్రుడినివేలూ లక్షలూ పోసే చదువులు నా వల్లయే పనేనా సారూ?! స్థితి అర్థం చేసుకోడు.. రోజూ బడి కోసం మొండికేస్తుంటే ప్రాణం విసిగి రెండు తగిలించా!   నా లాంటి బక్కాడి  కొంపలో పడ్డం వాడిదే తప్పు!..'  అన్నాడు గాని.. మురికిపూడి పెద్దాయన గొంతులో పశ్చాత్తాపం  స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. 

పోతూ పోతూ బిడ్డను ఊరి దాకా తెచ్చి భద్రంగా  అప్పగించినందుకు బాబాయి చేతిలో ఇంతకు మించి ఇచ్చుకోలేనం’టూ  ఓ రెండువేలు పెట్టబోయాడు మురికిపేట పెద్దాయనబాబాయి తీసుకోలేదు. 'ముందు ఈ డబ్బు పెట్టి పిల్లాడిని ఏదన్నా మంచి బళ్ళో వెయ్యి! ముందు ముందు దారేదో దొరక్కపోదు!అన్నాడు

బాబాయి మాట ఆ గంటలోనే  నిజమయిందిమురికిపూడి నుంచి బాబాయి బిడ్డ తండ్రి చేత చేయించిన  ఫోన్ కాల్ కు మెడికల్ షాపాయనలోని మానవత్వం నిద్రలేచింది బుడ్డోడి తండ్రి ఇట్లా వచ్చాడని తెలిసి మా ఇల్లు వెదుక్కుంటు వచ్చాడాయన. 'పిల్లోడి కథంతా విని 'నాకు ఎట్లాగూ  పిల్లలు లేరుమీ వాడిని పదో తరగతి వరకు చదివించే పూచీ నాదీఅంటు అక్కడికక్కడే వాగ్దానం చేశాడు

ఇప్పుడు చెప్పండి! ఇదంతా నిజంగా ఒక సినిమా కథలాగా లేదూ! 'పిల్లాడి తండ్రిని  పిలిపిస్తే పోదా! ఈ వయసులో నువ్వు అంత దూరం వెళ్లి అప్పగింతలు పెట్టిరావాలా?' అని  నువ్వు ఫోనులో నిలదీశావు చూడురామచంద్రం! నేను  అంతలా శ్రమపడ్డందుకేరా  ఈ మెడికల్ షాపాయన మనసులోని మానవత్వం నిద్రలేచిందినీతులు చెప్పేవాళ్లు తప్ప చేతల్లో చూపించేవాళ్లు లోకంలో ఎవ్వరూ ఉండరని ఈ షాపాయన ఇప్పటి వరకు గట్టి విశ్వాసంతో ఉన్నాడుమానవత్వం మీద నమ్మకం పోగొట్టుకునే మనుషులకు మించి సమాజానికి మరో పెద్ద ప్రమాదం లేదుఈ రోజూ నేను కష్టపడితే పడ్డాను గానీ.. సమాజం ఒక మనిషిని పోగొట్టుకోకుండా కాపాడగలిగానుఅదే నాకు ఆనందం' అన్నాడు బాబాయి తృప్తిగా

 

బాబాయికి తెలియని సంగతి మరొకటి ఉందిసమాజం మరో మనిషిని కూడా పోగొట్టుకోకుండా  నిలబెట్టుకుందిమొదటినుంచి బాబాయి అత్యుత్సాహాన్ని చాదస్తంగా  కొట్టిపారేస్తూ వస్తోన్న నేనే ఆ మరో మనిషిని.

-కర్లపాలెం హనుమంతరావు

బోధెల్; యూఎస్ఎ

17 -02 -2021

(విపుల మాసపత్రిక - జనవరి 2015లో ప్రచురితం)







 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...