Showing posts with label Punshment. Show all posts
Showing posts with label Punshment. Show all posts

Sunday, December 12, 2021

నేరాలు - శిక్షలు- కర్లపాలెం హనుమంతరావు


 

నేరం అంటే తప్పు. అపరాధం. సంఘ ప్రయోజనానికివ్యక్తి భద్రతకు ఉమ్మడిగా కొన్ని నీతి నియమాలు ఏర్పాటు చేసుకునే పద్ధతి  అన్ని కాలాలలోనూ ఉంది. ఆ కట్టుబాట్లను కాదని ప్రవర్తిస్తే సమాజం మొత్తానికే ముందు ముందు ముప్పు ఏర్పడే అవకాశం కద్దు. ఆ ప్రమాదం నివారించడం  కోసం గాను  'శిక్ష'లు ఏర్పడ్డాయి.  తప్పు చేసినవారిని దారిలో పెట్టడమే ప్రధానంగా 'శిక్షలుముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. కొన్ని  సరిదిద్దుకోలేని పెను తప్పిదాలకు పెద్ద పెద్ద శిక్షలూ కద్దు. ఈ శిక్షలు నిర్ణయించే అధికారం గతంలో రుషులకు ఉండడం గమనించవచ్చు. మహితాత్ములు నిర్ణయించిన  శిక్షలు అమలు  చేసే బాధ్యత సాధారణంగా రాజ్యం శాంతిభద్రతలను  సురక్షితంగా పర్వవేక్షించడమే ధర్మంగా గల పాలకులకు ధఖలై ఉండేది.   ఆన్నికాలాలలోనే కాకుండా అన్ని లోకాలలలో కూడా  నేరాలు చేయడంవాటికి తగ్గట్లు  శిక్షలు విధించి అమలు చేయబడడం గమనించవచ్చు. 

 

తెలుగువాళ్ళు పవిత్రంగా భావించే భాగవతంలో ఉపాఖ్యానల ద్వారా ఈ కొన్ని శిక్షలు.. అవి అమలు జరిగిన తీరు  స్థాలీపులాకన్యాయంగా పరిశీలించడమే ఈ చిన్నవ్యాసం ఉద్దేశం.

భాగవతంలో శిక్షలు ప్రధానంగా మూడు రూపాలలో కనిపిస్తాయి. స్వయంగా విధించుకునేవివేరేవారు విధించి అమలుచేసేవిశిక్షలు పడినా ఎన్నటికీ అమలుకాకుండా నిలబడిపోయినవీ.

సతీదేవి ప్రాణత్యాగం స్వయం శిక్షకు ఉదాహరణ. తండ్రి దక్షుడు యాగం చేసే సందర్భంలో అల్లుడైన రుద్రుడికి ఆహ్వానం అందదు. అయినా అతని భార్య దాక్షాయణి, 'పిలవని పేరంటానికి వెళితే అవమానాలు ఎదురయే అవకాశం ఉంద'ని భర్త హెచ్చరించినా 'తండ్రి ఇంటిలోని సంబరాలు తనయలు చూడాలి గదా! 'సర్వదిక్కులవారు కదిలి వెళ్ళే  యాగానికి  తానూ వెళ్లితీరాల'న్న మంకుపట్టుతో సహచరుడి తోడు లేకుండానే తరలివెళ్లింది. ఫలితం తీరని అవమానం. 'జలంబు ఆచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించిజితాసనయై భూమియందాసీనయగుచు యోగమార్గంబులో' చివరికి  ఆమె చేసిన శరీర త్యాగం భర్త ఆనతి మీరిన నేరానికి స్వయంగా విధించుకున్న శిక్ష. దేవుళ్లకు ఈగోలుఅలకలుకలతలు,దుఃఖాంతమైన కథలు ఉండటం అదొక వింత.

ఇకఇతరులు విధించే శిక్షల వ్యవహారానికొస్తే దేవతలురాక్షసులుమనుషులుమునీశ్వరులు  ఎవరు విధించే శిక్షలు వాళ్లవే.  

చిత్రకేతువు అనే విద్యధరాధిపతి ధర్మ సభలో ఈశ్వరుడి కౌగిట్లో ఉన్న గౌరిని చూసి ఆడవాళ్లు సభలలో నడుచుకొనే తీరు మీద చర్చపెట్టేశాడు. శివుడు చిరునవ్వుతో పోనిచ్చినా గౌరీదేవి గొప్ప అవమానం జరిగినట్లు క్రుద్ధురాలైంది. 'ఎగ్గుపల్కిన పాపాత్ముడెల్ల భంగి/దండనార్హుండు గాకెటు తలగగలడు'(6 -496)అని భావించింది. ఫలితం 'పాపపుస్వరూపమైన రాక్షసయోనిలో పుట్ట'మని శపించింది. తన కంటే అధికులను తప్పు పడితే నేరమని గౌరమ్మ  భావం. ఇంకెవరూ ఆ పని చెయ్యకుండా భయపడేందుకు చిత్రకేతువుకు అంతలావు శిక్ష. 

విష్ణుద్వేషులైన రాక్షస జాతిలో పద్దస్తమానం హరినామ జపం పారాయణం చేసే పసికొడుకును ప్రారంభంలొ చదువు సాములకు పెట్టి దారికి తెచ్చుకోవాలని చూశాడు రాక్షసరాజు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ నుంచి బైట పడకపోగా తనకే నీతిపన్నాలు చెప్పడంలో రాటుదేలిన ప్రహ్లాదుణ్ని 'ముంచితి వార్ధులం గదల- మొత్తితి శైల తటంబులందు ద్రొ/బ్బించితి శస్త్రరాణి  పొడి- పించితి మీద విభేంద్రపంక్తిద్రొ/క్కించితి ధిక్కరించితి శ-పించితి ఘోరదవాగ్నులందు ద్రో/యించితి పెక్కు పాట్లనల-యించితి చావడిదేమి చిత్రమో!అన్న పద్యంలో రాక్షసరాజే  చెప్పుకున్నట్లు ఒకటిరెండు కాదు వరస బెట్టి శిక్షల మీద శిక్షలు విధించేశాడు. 

కంసమహారాజు బాలకృష్ణుణ్ణి వెదికి మరీ శిక్షలు విధించడం మానవమాత్రులు విధించే శిక్షలు ఎంత విచిత్రమైన పద్ధతుల్లో ఉంటాయో అర్థమవుంది. వత్సాసురబకాసుర,  అఘాసుర ధేనుకాసురల్లాంటి దుష్టరాక్షసులను  ఒకళ్ల తరువాత ఒకళ్ళను చంపమని పంపటానికి కృష్ణుడు చేసిన తప్పిదాలేమీ లేవు. తనకు ప్రాణాపాయం ఉందని కంసుడు తలపెట్టిన  దుష్కృత్యాలు ఇవన్నీ!

సనకసనందాదులు జయవిజయులకు ఇచ్చిన దండనలు మునులు ఆచరించే శిక్షల జాబితాలోకి వస్తాయి. వైకుంఠ ద్వారాలకు పహరా పనిలో ఉండే జయవిజయులు స్వామి దర్శనార్థ వచ్చేవారి వివరాల  జోలికి  పోకుండా మొండిగా అడ్డుపడుతున్నందుకు పడ్డ ఆ శిక్ష. విఐపి ల ఆఫీసులకు కాపలాలు కాసే డవాలా బంట్రోతులదే సగం పెత్తనంగా సాగుతున్న ఈ కాలంలో జయవిజయుల ఉదంతానికి సమకాలీన ప్రాధాన్యత కద్దు. గేటుకు కాపలా కాసే వాళ్లు అగంతుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంత అవసరమో తెలియజేసే కథ. 

అరాచక పాలన ద్వారా తోటి వాళ్లందరినీ పిల్లలాట కింద హింస పెట్టే వేనుడి కథ అయితే ఇప్పటి కాలానికి ఎంతో మందికి నిజానికి గుణపాఠం కావాల్సుంది. విజ్ఞులు ఎంత చెప్పినాఎన్ని విధాల నచ్చచెప్పినా నీచబుద్ధి వదలని ఆ పాలకుడు చివరకు ఆ మునుల చేతనే శిక్షకు గురవుతాడు. 

శిక్షించే విధనాలు చాలా రకాలు. 'బావా! రమ్మని బరనగవు నగుచువీనిం బట్టి బంధించి గడ్డంబును/మీసంబునుం దలయును   గొరిగి విరూపిం '(10 -146) చేసిన రుక్మిణీవల్లభుడి రుక్మి శిక్షావిధానం కాయక విధానం. ఇప్పుడూ మళ్లా అమల్లోకి వస్తే ఎన్ని పరువు హత్యలు తగ్గి సమాజం ఆరోగ్యవంతంగా తయారవుతుందో .. ఊహించదం కష్టం.

కానీ దురదృష్ణ కొద్ది.. కొన్ని సందర్భాలలో తప్పు ఒకరు చేస్తే.. శిక్ష వేరేవాళ్లకు పడడం ఇప్పట్లా భాగవత కాలంలోనూ కద్దు. చిత్రకేతువు అనే రాజు అంగిరసుడు అనే ఋషి ప్రసాదించిన సంతానఫలం కృతద్యుతి అనే భార్య ఒక్క  దానికే ఇవ్వడం సాటి సవతులలో అసూయను రగలాడినికి కారణం అవుతుంది. కృతద్యుతి  కడుపున కాసిన ఆ కాయ మీదనే మహారాజు ధ్యాసంతా. కడుపు రగిలిన సవతులు పసిబిడ్డకు విషమిచ్చి చంపేస్తారు. మహారాజు పక్షపాత నేరానికి పాపంపుణ్యం ఎరుగని పసిబిడ్డ ప్రాణాంతకైన శిక్షను అనుభవించడం ఘోరాతిఘోరం. పాలకులకు నిష్పక్షపాత బుద్ధి లేని పక్షంలో అమాయకులు అన్యాయంగా ఎట్లా శిక్షలకు గురువుతారో.. ఈ కాలంలోనూ అన్ని ప్రాంతాలలో వీపు చరిచి చెప్పేటంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయ్! 

బలి చక్రవర్తి రాజ్యభ్రష్టత్వం  ప్రహ్లాదుడి వాచా దండన ఫలితం.  రాజ్యపాలన కొచ్చిన తరువాత రాక్షసలోకంలో మంచి మార్పులు సంభవించి లక్షీదేవి తన పరివారంతో సహా బలి చక్రవర్తి రాజ్యంలో మాకాం వేయడం నచ్చని దేవతలు అదితిని ప్రార్థిస్తే ఆమె విష్ణువుని ఈ సంకటం నుంచి కాపాడమని కోరుకున్నది. బలిని పాతాళానికు పంపితే గాని రాక్షసులు తిరిగి రాక్షసులుగా మారి లక్ష్మీ పరివారం వైకుంఠం చేరదని గ్రహించిన విష్ణువు అదితి గర్భలో ప్ర్రవేశిస్తాడు. అనుమానంతో  చేసిన విచారణల  మూలకంగా జరిగింది తెలుసుకుని కర్తవ్యబోధనకు ఆశ్రయించిన మీదట జరిగిందంతా చెప్పి విష్ణువుకు లొంగిపొమని ప్రహ్లాదుడు బలికి హితవు చెపుతాడు. రాక్షసులను తిరిగి దుర్మార్గులుగా మార్చుకుంటానన్న బలి మాటలకు కోపించిన ప్రహ్లాదుడు శపించిన మీదటనే బలి  రాజ్యభ్రష్టత్వం  కథ కొనసాగింది. ప్రహ్లాదుడు బలికి విధించిన శిక్ష 'వాచా దండనఅయితే బలి చేసిన నేరం హిరణ్యకశిపుడి వంటి వారి చరిత్ర వినీ గుణపాఠాలు నేర్చుకోకపోవడం. 

ఎంతటి మహామహుమహులైనా ఎప్పుడో ఓకసారి తప్పుదారిలో నడిచి శిక్షలు అనుభవిస్తారన్న దానికి త్రిలోకాధిపతి కథే ఉదాహరణ.  తన కనుసన్నలలో ఉండే పుష్కలావర్త మేఘాలను ఎడతెరిపి లేకుండా కురిసి రేపల్లె వాడలను ముంచెత్తమని అజ్ఞాపిస్తాడో సందర్భంలొ అహంకరించి. అలకకు కారణం కృష్ణుడి పలుకులు విని తనకు ఏటేటా జరిపే వేడుకలు జరపకపోవడం. మేఘాల వర్షాలకు జడివానలు కురిసినా గోపాలబాలుడు గోవర్థన గిరిని చిటికెన వేలుతో పైకెత్తి పట్టుకొని ఆ ఛత్రఛాయల కింద లోకాలను కాపాడాడు. తన తప్పు తెలిసి వచ్చిన ఇంద్రుడు నా వంటి వెర్రివారిని/ శ్రీ వల్లభ! నీవు శాస్తి చేసితి వేనిం/గావరము మాని పెద్దల/త్రోవల జరుగుదురు బుద్ధి తోడుత నీశా!(10 -937) అని సాగిల పడ్డాడు ,  

- కర్లపాలెం హనుమంతరావు 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...