చందమామ కథ
పరీక్షా ఫలితం
రచన - బి. లక్ష్మణాచారి
( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964
సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
సింధుదేశాన్ని మలయకేతు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏకైక పుత్రిక వనజముఖి పరమ సుందరిగా కీర్తికెక్కింది. ఆమెను పెళ్ళాడాలని అనేక మంది రాజ కుమారులు వచ్చారు గాని, రాజకుమారి పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయారు. ఈ పరీక్ష గురించి వాడవాడలా తెలిసిపోయింది.
తనను పెళ్ళాడేవాడు ధైర్యవంతుడూ, వీరుడూ, యుక్తిపరుడూ అయి ఉండాలనే ఉద్దేశంతో రాజకుమారి ఈ పరీక్ష ఏర్పాటు చేసింది. ఆమె వచ్చిన వారి నందరినీ పరీక్షకు పెట్టలేదు; వారి వయసూ, అంద చందాలూ తనకు నచ్చిన మీదటనే ఆమె వారికి పరీక్ష ఇచ్చింది.
ఆ పరీక్ష ఈవిధంగా ఉన్నది: రాజభవనానికి ఉత్తరాన ఒక తోటా, దానికి ఉత్తరాన చిన్న అరణ్యమూ ఉన్నాయి. ఆమెను పెళ్ళాడ గోరినవాడు ఆ అరణ్యంలో ప్రవేశించి, అందులో దారి తప్పకుండా తిరిగి రాజభవనానికి రావాలి. అరణ్యంలో ఒక పులి ఉన్నది. దాన్ని నిరాయుధుడై జయించి రాజ ముందుకు వచ్చి, తోటలో ప్రవేశించాలి. ఆ తోటలో ఒక భయంకరమైన పక్షి ఉన్నది; అది ఎవరినన్నా చూడగానే మీదికి వచ్చి కళ్ళు రెండూ పొడిచేస్తుంది. దాన్ని కూడా తప్పించుకుని రాజభవనం కేసి వస్తే తోటకూ, రాజభవనం ఆవరణకూ మధ్యగా ఒక బురద కందకం ఉన్నది. అందులో గొంతు లోతు బురద ఉంటుంది. ఆ కందకంలోకి దిగి రాజభవనం చేరుకోగానే, రాజ మె కుమార్తె తన స్వహస్తాలతో లోటాడు నీళ్ళి స్తుంది. ఆ లోటాడు నీళ్ళతోనే బురద అంతా పోయేలాగు కడుక్కోవాలి. ఈ పరీ క్షలో నెగ్గినవాణ్ణి ఆమె పెళ్ళాడుతుంది.
ఆమెను పెళ్ళాడ వచ్చిన వారిలో కొందరు పులి చేత చచ్చారు. మరి కొందరు పులి బారి నుండి తప్పించుకుని, భయంకర పక్షి మూలాన కళ్ళు పోగొట్టుకున్నారు. పులినీ, పక్షిని జయించి బురదలో దిగి వచ్చినా, లోటాడు నీటితో ఒళ్ళంతా కడుక్కోవటం ఎలా సాధ్యమవుతుంది?
ఈ అసాధ్యమైన పరీక్ష గురించి నాగావళి రాజకుమారుడు ప్రతాపుడనేవాడు విన్నాడు. అతను సింధుదేశపు రాజధానికి వచ్చి, రాజ భవనానికి ఉత్తరాన ఉన్న అరణ్యాన్ని ఒక సారి చుట్టి వచ్చాడు. అరణ్యం చుట్టూ బలమైన కంచె వేసి ఉన్నది. ఆ కంచెలోనే ఉత్తర భాగంలో ఒక ద్వారమున్నది. చుట్టూ కంచె ఉండటమే గాక, రాజభవనానికి దగ్గిరిగా కూడా ఉన్నందున, ఆ అరణ్యం సహజమైనది కాదనీ, కృత్రిమ మైనదనీ, అందులో ఉండే పులి కూడా మనుషులు పెంచేదే అయి ఉంటుందనీ అతను ఊహించాడు.
తరువాత ప్రతాపుడు రాజకుమార్తెను సందర్శించాడు. అతను పరీక్షకు నిలబడ టానికి ఆమె సమ్మతించింది. ఎందుకంటే అతను యువకుడూ, అందగాడూనూ. అతను మనిషి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా ఒక ముఖ కవచం చేయించుకున్నాడు. అది ధరించినట్టయితే, కళ్ళూ, ముక్కూ, గడ్డమూ, నుదురూ మొదలైన వాటితో కూడి, అచ్చగా మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది, కాని అది లోహంతో చేయబడినది. ఈ కవచాన్ని చంకన పెట్టు కుని, చేతిలో మాంసం మూటగట్టి పట్టు కుని, ప్రతాపుడు ఉత్తర ద్వారం కుండా అరణ్యంలో ప్రవేశించాడు.
అరణ్యంలో అతను కొద్ది దూరం వెళ్ళే సరికి గాండ్రిస్తూ పులి ఎదురయింది. అతను మాంసం మూట విప్పి పులిముందు పడేసి తన ముఖానికి కవచం ధరించుకుని ముందుకు సాగాడు. పులి మాంసం తినటంలో నిమగ్నమై పోయి అతని గొడవే పట్టించుకోలేదు.
ప్రతాపుడు అరణ్యం దాటి తోటలో ప్రవేశించగానే భయంకర పక్షి వచ్చి, అతని ముఖ కవచంలోని కళ్ళను పొడిచి తన దారిన తాను పోయింది. అతను ముఖ కవచాన్ని తీసి దూరంగా పారేసి, తోటకూ రాజభవనం ఆవరణకూ మధ్య ఉండే బురద కందకంలోకి దిగి, పైకి వచ్చి, రాజ భవనాన్ని చేరుకున్నాడు.
రాజకుమారి లోటాడు నీళ్ళతో సిద్ధంగా ఉన్నది. ప్రతాపు డామెతో, "ఈ పరీక్షలో రెండు అంశాలలో నెగ్గాను. ఈ మూడవ దానిలో నెగ్గించే బాధ్యత అంతా నీ పైన ఉన్నది," అన్నాడు.
"ఈ లోటాడు నీటితో ఒంటి బురద అంతా కడుక్కోవలిసినవాడవు నీవేగదా?” అన్నది రాజకుమారి.
" అలాగే కడుక్కుంటాను. కాని ఆ నీరు పొయ్యవలిసిన పని నీది. జాగ్రత్త, ఒక్క చుక్క కూడా నేలపై పడకూడదు. అలా పడిన ప్రతి చుక్కకూ ఒక్కొక్క బిందెడు నీరివ్వవలిసి ఉంటుంది,” అన్నాడు ప్రతాపుడు.
"పరీక్షలో నెగ్గాపులే. స్నానం చేతువుగాని పద!" అన్నది రాజకుమారి. తరవాత వారిద్దరికీ వైభవంగా పెళ్ళి జరిగింది.
- బి. లక్ష్మణాచారి
( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964
సేకరణ :
కర్లపాలెం హనుమంతరావు
16 - 11-2021
బోథెల్ ; యూఎస్ఎ