కవితా కల్పకం - విద్వాన్ విశ్వం
ప్రస్థానము
కవితా కల్పకం - విద్వాన్ విశ్వం
ప్రస్థానము
మాలిన్యము నుండి నన్ను
మంచి వేపు నడిపించుము
కారుచీకటి లో నుంచి
కాంతి వేపు నడిపించుము
చావు నుండి అమృతత్వపు
చాయలకై నడిపించుము
( వైదికం - బృహదారణ్యకం - ఉపనిషత్
***
తపస్సు
అల నయోధ్యాపురీ
కలభాషిణుల మోము,
చెలువమ్ము నందుకొన
జలజము లెల్లన్
కొలను నడుమను నీటి
మొలబంటిగా నిలచి
కలకాలము తపము
సలుపు నట్లుండెన్
( లౌకికం - అమృతానందయోగి )
***
దయ
దిశమొలతో జడలు దాల్చి
దిశాంతముల జరియించిన
ఆకులతో, నారలతో
నంబరములు నేసికొన్న
బూది, మన్ను, దుమ్ము వంటి
మీద పూత పూసికొన్న
బండలపై, గుండ్లపై
దిండు లేక పండుకొన్న
మనసులోని మాలిన్యము
చనుట కెట్లు తోడుపడును ?
జీవుల వేధించక, జన
జేత వగుటకు ఏడ్వక,
లోకమ్మును దయతో నా
లోకించినపుడు గదా
నీ మనసు నిర్మలమై
కోమలమై శాంతువగుట!
( పాళీ - దమ్మపదం)
అనురాగం
అగమ్యమైనది
అనుపమమైనది
అమితమైన దా
అనురాగాంబుధి
దాని దాపులకు
దరిసిన వాడిక
ద్వంద దుఃఖ జల
ధానము జేరడు
( హిందీ - రసభాలి)
అనేకుల కది!
- రవీంద్రనాథ్ ఠాగోర్
సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
క్రొవ్విరులను గూర్చిన
నీ మువ్వపు మాలికను
కంఠమందు వైతువా
పువ్వుంబోణీ! అయినచో
ని వ్విరి సరమునకు
బదులు నే నేమిత్తున్ ?
నే గట్టిన తో మాలను
నీ కొక్కర్తుక కె
యొసగ నెట్లు పొసగు?
నో రాకా హిమకర వదన!
అనేకుల కిది
వారి నెల్ల నెటు వర్జింతున్ ?
ఉన్నారు భావుకులు :
మన కన్నుల కగపడని
చోట్ల గలవారెవరో
ఉన్నారు; కవుల పాట
సన్నిహితులు ఉన్నవారు
చాలమందియె
ఇందరికై ఈ మాలిక
నందమ్ములు జిలుక కట్టినాడ
గావునన్;
కుందరసమదన !
నీకే చెందించుట
నెట్లు పడును?
చెప్పుము నీవే.
నీ యడదకు
నా యడద నుపాయనముగ
నడుగు సమయ మది
గతియించెన్;
తోయజ నయనా
ఎపుడో పోయిన దా
కాలమెల్ల గతియించెన్
పూర్వగాథయై.
పరిమళమంతయు
లోపలి యరలోనె
దాచు కొన్నయట్టి
మొగ్గతో సరియై ,
నా జీవిత -
మొక పరియై యుండెను-
పోయె నట్టి ప్రాప్తము
పడతీ!
ఉండిన తావిని
దిక్కుల నిండా
వెదజల్లి వేసి
నే నుంటిని;
ఏ పండితు డెరుగును
పోయినదండి వలపు
మరల చేర్చి, దాచు
మంత్రమున్ .
సారస నయనా
నీ హృన్నీ రేజాతమ్ము
నొకరి నెయ్యమునుకే
ధారాదత్తము సేయగ నేర!
ననేకులకు
దాని నియ్యగ వలయున్ .
- బెంగాలీ - రవీంద్రుడు
సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
07 - 10 - 2021
బోథెల్ ; యూ. ఎస్. ఎ
మేల్కొలువు
మేల్కొనండి జనుల్
మేల్కొనండి నరుల్
మన జీవ రక్షకుడు
చనుదెంచుచున్నాడు
చీకటులు విచ్చినవి
వేకువలు విరిసనవి
రవి వచ్చు మార్గమును
సవరించెను దుషస్సు
ఎచట నన్నము దొరకు
అచట కేగెదము నింక
మేల్కొనుడు మేల్కొనుడు
మేల్కొ నుండిక జనుల్ !
( వైదికం- రుగ్వేదం )
జిలుగు
వాచ్యభిన్నమై
మరియొక సూచ్యమైన
వస్తువుండు
మహాకవి వాక్యములను;
వెలికి కనిపించు
నవయవమ్ములకు
కట్టువడని
వనితల జిలుగు
లావణ్య మట్లు
- ఆనందవర్ధనుడు - ధ్వన్యాలోకము
మిటుకులాడి
కోపించిన
ననురాగము చూపించిన
కంటనీరు తొలకించిన
సల్లాపించిన -
చొక్కించు ( పరవశింపచేయు) నదే పనిగ
మిటుకులాడి తెరవ( ఆడుది )
నీ మదిన్
( ప్రాకృతం - సత్తసయీ )
మా కోనకు...
కడవ ముంచు కొనవలెనా
కలికి రమ్ము మా కోనకు
నీరు నీ పదాల చుట్టు చేరి
నీ గుట్టు చెప్పగలవు
సారజాక్షి! వాననీడ
లూరుచుండె సైకతముల
ఫాలమందు వ్రేలు కుంత
లాలవోలె మబ్బులెల్ల
నీలి చెట్ల కొమ్మలు ను
య్యాలలూగుచున్నవి
నీ యాడుగుల చవి
నో యువిద నే నెరుగుదును
నా యండందలో నది
పాయక నిరంతరము నినదించుచుండె
కడవ ముంచుకొన వలెనా
కలికి రమ్ము మా కోనకు
కాలహరణ కావలెనా
కాంత రమ్ము మా కోనకు
కడవ నీటి పైన వదిలి యుండి
చడి చప్పుడు గాక యుండ
గడప వచ్చు నీ కాలము
తడబడ నక్కర లేదిక
కసము మొలిచె దరువులలోన
పసరు మూసుకొని వచ్చెను
కోసరి కోయవచ్చును గగన
కుసుమమ్ముల నెన్నియైన
నీలి కనుల వల చీల్చి
ఓ లలనా తలపు పులుగు
లోలి యెగిరి పోవు చుండ
చాల సేపుగడప వచ్చు
కాల హరణ కావలెలా
కాంత రమ్ము మా కోనకు
---
జలక మాడవలెనా
ఓ జలజాక్షీ రమ్మిచటికి
నీలిచీరెవిడిచి వేసి
కూలమ్ముననే యుంచుము
నీలి చీరె నిన్ను గప్పి
గోలా దాచును లెమ్మ
అలలు తము కంఠంబును కౌ
గిలిలో బిగియంగబట్టి
చెలియా! నీ చెవిలో మ
త్తిలి యాడును మంతనాలు
జలక మాడవలెనా ఓ
జలజాక్షీ! రమ్మిచటికి!
---
నీట మునిగి పోవలెనా
బోటి రమ్ము మా కోనకు
శీతలమ్ము నీరు ఇచట
లోతు కూడ చాలినంత
నాతి! గాఢ నిద్రవోలె
నీ తిమిరమ్ము గ్రమ్మె నిచట
కోన లోతు లోతులలో
చానా గానమ్ము మౌ నమ్ము నొకటై
జ్ఞాన ముద్ర భాసిల్లును
నీట మునిగి పోవలనా
భామ రమ్ము మా కోనకు!
- బెంగాలీ - రవీంద్రుడు