Showing posts with label collection. Show all posts
Showing posts with label collection. Show all posts

Tuesday, December 28, 2021

కథ తలవంచని పూవులు రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


కథ 

తలవంచని పూవులు 

రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి 

సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  

( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


విక్రమ ధనంజయా ! వీరనారాయణా! జయీభవ ! విజయీభవ! విద్యాభోజ ! విదర్భ రాజా ! విజయీభవ ! దిగ్విజయీభవ !


వండియాగధులు వెండిదుడ్లతో ప్రవేశించి పక్కకు తిప్పుకొన్నారు. మాలవ మహారాజులుంగారు రత్నఖచిత  సువర్ణ సింహాసవంమీద ఆసీనులు ఆయి సామంత, దండనాథాదులూ, యావత్ప్రజానీకమూ ఆ వెనుక యథాస్థానాల్లో కూర్చున్నారు. ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారుజనం..


ఏటేటా జరిగే శారదా ఉత్సవాల్లో ఆరోజు చివరిది.  దేశదేశాగత నట, విట, కవి, గాయక , వైతాళికులతో ఆనగరం తొమ్మిదిరోజులనుంచీ నిండిపోయింది. అన్ని రోజుల ఉత్సవ సారమూ ఆరోజున మూర్తికట్టి అక్కడికి చేరినట్టుంది.


సూర్యకాంతి ప్రాసాదంలో ఆనాడు వినోద ప్రదర్శనం. ముందు ఆస్థాన వైణికుడు వీణ మీద పట్టు బురఖాతీసి శ్రుతి సవరిస్తున్నాడు. జనం సుకుమార వీణాగానానికి ఎదురుచూస్తున్నటులేదు. విచ్చుకత్తుల రాజభటులు ఎర్రని చూపులతో ఎంత అదలిస్తున్నా కోలాహలం అణగటం లేదు.


దాక్షిణాత్య శిల్పి చంద్రమౌళి ఒక ప్రక్క నిల్చున్నాడు. అతడెప్పుడూ రాజసభలు చూడలేదు. నాగరికుల తళుకు  బెళుకులకు ఆతని  అమాయక హృదయం అలవాటుపడలేదు. హృదయాలను సైతం కరిగించి అమృత మూర్తులుగా మలచగల అతనికి పాటి మానవులను పలకరించి ప్రసన్నులను చేసుకోవడం ఎట్లాగో తెలియలేదు. ప్రాసాదం చివర ఒక స్తంభాన్ని ఆనుకొని తెల్లబోయి చూస్తున్నాడు. 


నగర జనుల నిష్కారణ భంగిమలను, ఒయ్యారాలను చూచి  సహజంగా ఉండవలసిన మానవులు ఎందుకిట్లా బిగువులు పోతారో అతనికి అర్థం కాలేదు.


వీణ ప్రారంభం అయింది. ఆ సిద్ధహస్తుడు అమృత వాహిని పలికిస్తున్నాడు. శ్రోతలు ఇంకెందుకో చూస్తున్నట్టుంది. మంత్రి హస్తసంజ్ఞతో వీణ ఆగి పోయింది.


ఇక ఇంద్రజాలం అన్నారు. ఒక పొట్టివాడు ముందుకువచ్చి మహారాజు ఎదుట భూమికి మూడు సారులు సమస్కరించి నిలుచున్నాడు. శుద్ధ శ్రోత్రియంగావున్న ముఖంలో చంద్రవంకలా గంధపుచారలుంచి దానిమీద ఎర్రని కుంకుమబొట్టు పెట్టాడు. చేతిలోని నెమలీకుంచె ఆకాశం మీద మూడుసార్లు తిప్పాడు. జలజల పువ్వులు రాలాయి. 'గగన కుసు మాలు ప్రభూ చిత్తగించండి' అన్నాడు. ప్రజలు విరగబడి నవ్వారు. 


నెమలిపింఛం గాలిలో సున్నా లుగా చుట్టాడు. అందులో కన్నులు మిరుమిట్లు గొలుపుతూ బలిష్టమైన రెండు వానరవిగ్రహాలు బయలు దేరి యుద్ధం చెయ్యడం ప్రారంభించాయి. “వాలి సుగ్రీ వులు" భూలోక దేవేంద్రా!' అన్నాడు. ప్రధాని చూపుతో ఆగి, పక్కకు తొలగిపోయాడు. వీణకన్న దీనితో కొంచం ప్రజలముఖాలు కలకలలాడాయి.


ఒక మహాకాయుడు  నడిచే నల్ల రాతి విగ్రహంలా సభామధ్యానికి వచ్చాడు . ప్రజల్లో కలకలం బయలు దేరింది. ఉన్న చోటునుంచి ముందుకు త్రోసుకువస్తున్నారు. రాజోద్యోగులు సర్దలేక  తొక్కిడిపడుతున్నారు. '



' అడుగో బ్రహ్మదేశపు బలశాలీ' అనేమాటలు సభలో గుప్పుమన్నాయి. అతనికి కావలసిన యేర్పా ట్లన్నీ చరచర చేయించారు. మహారాజు సింహాసనం మీద సుఖస్థితిలో సర్దుకుని కళ్ళల్లో కుతూహలం కనపరచారు. మహాకాయుడు మెడలు తిరగని బింకంతో మహారాజువై పు తలవూపి సమస్కారం అభినయించాడు. ఇద్దరు భృత్యులు రెండుబాహువుల పొడవూ, రెండంగుళాల మందమూగల ఒక ఇనుప చువ్వను తెచ్చి అతని ముందుంచారు. అతడు అవలీలగా ఏనుగు తామర  తూడును అందుకున్నట్టు దాన్నందుకుని కుడిచేతి వేళ్ళ మధ్య రెండు నిమిషాలు గిరగిర తిప్పి భూమిపై నిల బెట్టాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అతడు దానిని పొట్లకు ఆనించి కండరాలు పూరించి ఇటు ఊగి అటు ఊగి కొంతసేపటికి పూర్ణానుస్వారంగా వంచి  ఆ వలయాన్ని నిర్లక్ష్యంగా ఎదుటికి పడవే శాడు. ప్రజలు చప్పటవర్షం కురిపించారు. ప్రభువు ముఖంలో చిరునవ్వు వెలిగింది. ప్రధాని ఆజ్ఞ రాజ భృత్యులు వేయిదీనా రాలు వెండిపళ్లెరంలో పోసి అతనికి బహూకరించారు. మహారాజులుం గారు లేచారు . అతన్ని చూడడానికి జనం విరగబడి వెంటబడ్డారు . 


రాజమార్గంలో జనప్రవాహం పొంగిపోయింది. చంద్రమౌళి  జనుల ఒత్తిడికి ఆగలేక తూలి ఘంటాపసంమీద పడ్డాడు. అతని పెదవిమీద, వాడి లేకులూడిన పువ్వులా చిరునవ్వుపుట్టి చెదరి అదృశ్యమయింది.



సాయంకాలం చంద్రకాంత సౌధంలో మహా సభ అన్నారు. మధ్యాహ్నం నుంచి సభాభవనం ఆలంకరిస్తున్నారు. సభాస్థలి భూలోక స్వర్గంలో ఉంది. మాలవసుహారాజు  వైభవానికి అది ప్రదర్శనశాల గాబోలు • రంగురంగుల తలపాగాలతో సకల సామంత రాజులూ సభలోకి వేంచేస్తున్నారు.


చంద్రమౌళి  ఒక పట్టుసంచీ చేతితో పట్టుకొని చంద్రకాంత సౌధం చలువరాతి మెట్లమీద నిలుచున్నాడు. నేటి సభలో ప్రవేశం ఎట్లాగా అని తెల్లని అమాయకపు కళ్ళతో ఆలోచిస్తున్నాడు. 


ఎక్కడి దక్షిణదేశం? ఎక్కడి విదర్భనగరం? రెండు దూర దూర దేశాలను రెండు దూరదూర మానవ హృదయాలను దగ్గరగా చేర్చి స్నేహపూరితం చేసే శక్తి లోకోత్తరమైన తన శిల్పకళకు లేదా? అనుకున్నాడు.


మహాకవిగారు సపరివారంగా వస్తున్నారు. ఆయన తెల్లని బట్టతల, చుట్టూ రెల్లుపూలు పూచిన గోదావరిలంకలా ఉంది. చెవులకు బంగారు కుండలాలు, చేతులకు సింహతలాటం మురుగులు. పెద్దరకం కుంకుమ రంగు కాశ్మీరు కాలువ భుజాలను కప్పింది. వెంటవచ్చే ఆశ్రితకవుల కైవారాలతో ఆయన హృదయం మత్తెక్కి ఉంది. ఆయన చూపునకు మరింత ఒదిగి, తన అల్పత్వం ఒప్పుకొన్న బట్టుమూర్తికి ఆకోటలో కనకాభిషేకం - కాదని తలయెత్తినవాడికి దేవిడీనున్నా. ఆ కోట బురుజులు ఆయనకోసం కట్టినవి. వాటి మధ్యకు తనకు తెలిసి సంతవరకూ ఏ ప్రతిభాశాలినీ రానివ్వలేదు. వచ్చినా ఆ - పరిధి దాటి ఎక్కడికీపోడు. తన పద్యాల అర్థం తానే - చెప్పాలి. మహారాజే ఆనందించాలి. తక్కిన కవీశ్వరు లకు మహారాజుకూ ఆయన ఆనకట్టు.


చంద్రమౌళికి సరిగా నమస్కరించడం చాతకాలేదు. అయినా చేతులు జోడించి మెట్టుమీద నిలుచున్నాడు. మహాకవిగారు నిర్లక్ష్యంగా నిలువునా చూసి 'ఎవరయ్యా నువ్వు' అన్నట్టు కళ్లను ఎగర వేశారు. 


"చాలా దూర దేశంనుంచి వచ్చానండి” 


" మం... చి పనిచే... శావు"


"మాలవ ప్రభువు మిక్కిలి రసజ్ఞులనీ, కళా సౌందర్య వేత్తలనీ మా వైపు గొప్పవాడుక”


"ఎవరు కాదన్నారు?” 


" ఆ రసిక ప్రభువు దర్శనం చేస్తేనే నా కళ చరితార్థం; ఆ నే నమ్మకంతో ఎన్ని కష్టాలైనా లెక్క చెయ్యకుండా వచ్చాను..." 


"అబ్బా!”


" కళాజీవి  బాధా, రసజ్ఞ సందర్శనం కోసం పడే తహతహా  మహాకవీంద్రులు తమకు తెలియనిది కాదు. " 


ఈ చివరిమాటతో కవిగారి వికారం కొంత ఉపశమించినా ఆయన అహంకారానికి తగిన ఆహారం పడలేదు. “


" నా కళను ప్రభువులవద్ద ప్రదర్శించే అవకాశం.. " 


"ఇంతకీ... ఏమంటావు?"


" .. కలిగించ వలసిందని కోరుతున్నాను.." 


“మధ్యను నేనెవరు? నువ్వేమో మహాకళావేత్తవు , ఆయనేమో  మహా రసజ్ఞులాయె! ఆలస్యం ఎందుకు ప్రభువులు సభకు వేంచేసే వేళ అయింది. వెళ్ళి దర్శనం చెయ్యి.”


"ఒక దేశాంతం ఆగంతకుడికి ఈ మాత్రం సహాయము చెయ్యలేరా? మీ ప్రభువు కళాప్రియత్వానికి ఈమాత్రం వన్నె పెట్టలేరా ?”


" ఈ మధ్య కొత్తమాటలు నేర్చారు. చిన్నప్పటి నుంచీ వేల  పద్యాలు రాసి పోశాను. మహాకవి అనిపించుకున్నాను. అంతేగాని ఈ కళ యేమిటి? కళాయి యేమిటి?...కవిత్వం ఏమైనా చేసి తెచ్చావా?" 


" లేదండి."


"అయితే...ఈ ఉపన్యాసమంతా ఏమిటి? మాకు చాలా తొందరపని ఉంది. ఇప్పుడు కవుల సభ. నువ్వేమో కనివి కావు. ఇంక నీ కళా ఏమిటి?


“మనవి చేస్తున్నాను. కవిత్వం అంటే నాకు తెలియదు. నేనేమీ మాటాడలేను. కాని నేను తెచ్చిన ఆపూర్వ వస్తువు పలుకుతుంది. మాటాడుతుంది. రసజ్ఞుల  మనస్సును లాలించగలరు. ఒక్క త్రుటి ... ప్రభువు ఎదుట నిలుప గలిగి తే... " 


“అబ్బో!... ఏదీ ఆ వస్తువు?"


"క్షమించండి. ప్రభు సమక్షంలో తప్ప పైకి తియ్యను. అది నా కళామర్యాద. ఆయన కానుకను ఆయనే తొలిసారి చూడాలని నా కాంక్ష . ఈ ప్రభు గౌరవాన్ని మీరు కూడా ఆమోదిస్తారనే నమ్ముతున్నాను.” 


మహాకవి గారి కుండలాలు ఊగాయి. అవమానం జరిగింది. కళ్ళల్లో మంటలు రేగాయి. తన ప్రాముఖ్యం కోసం  ఇంతవరకూ  చేతులు జోడించుకు తిరిగేవాడేగాని ఎదిరించి మాటాడిన వాడు లేకపోయాడు. శిల్పివైపు చురచుర చూసి జారే కాశ్మీరు శాలువాను మరింత పైకి లాగి  చరచర పరివారంతో నడిచి వెళ్ళిపోయారు. 


చంద్రమౌళి తన తప్పేమో  తెలియక తెల్లబోయాడు. కర్తవ్యం ఏమిటి?


లోపల సభ ప్రారంభమయింది. మహాకవి గారి శుష్క సమాసాలు సాగిసాగి వినిపిస్తున్నాయి. ఇటు నుంచి చదివితే రాజు పేరు, అటునుంచి విదివితే తన పేరూ ఇందులో ఉందని ఒత్తి ఒత్తి చెబుతున్నారు . 


చంద్రమౌళి ఇంత దూరం వచ్చి రాజ దర్శనం చెయ్యకుండా వెళ్ళకూడదనుకున్నాడు. చర్రున  సభలోకి దూసుకువెళ్లాడు.  సభాస్థలి చేరకుండా రాజభటు లడ్డగించారు. 


"ప్రభుదర్శనం చెయ్యాలి! " 


" అనుజ్ఞ నుండి తీరాలి" 


"ఇది మీ ప్రభువారికి కానుక. పాదపీఠం దగ్గర ఉంచివస్తాను. వెళ్ళి నివ్వండి.”


"అడుగు కదిలితే .. మెడ  మీద తల ఉండదు"


"మీ ప్రభువు సరసతా, మీ యోగ్యతాఇంతటి వేనా ? " 


ఒక రాజభటుడు చటుక్కున  వచ్చి ఆ మహాశిల్పి మెడమీద చెయ్యి వేసి ఒక్క ఊపున గెంటివేశాడు. 

అతడు చలువరాతి  మెట్లమీదనుంచి దొర్లి   నేలమీద పడ్డాడు. చేతిలోని  పట్టు సంచీ  దూరంగా పడ్డది. 


చంద్రమౌళి నెమ్మదిగా లేచి సంచీ  తీసుకుని నీరునిండిన కళ్ళతో ఒక్కసారి రాజభవనంకేసి చూసి చరచర కోట వెలుపలికి నడిచాడు. 


రాజవీధి నిర్మానుష్యంగా ఉంది. తన లోకోత్తర శిల్పాన్ని పైకి తీసి తినివితీరా  చూసుకున్నాడు. దాని వెనక ఉన్న కథ అతని తడికళ్ళల్లో తిరిగింది.


3


ఒక నాడు తన పల్లె కుటీరంలో చంద్రమౌళి ఉలిని ఒక మంచిగందపుముక్క మీద నడుపుతున్నాడు. 


అతని తీయని  ఊహలు సున్నితమైన ఉలి నుంచి  జారి  చందన ఖండంలో సుందర రేఖలుగా విడుతున్నాయి. శిల్ప సౌందర్యమో, చందన  హృదయమో  ఆ రేఖల్లో పరిమళాలు నింపుతున్నాయి. 


సుందరేశ్వరుని ముందు కృశాంగి హైమవతి, ఆయన కళ్ళల్లో ప్రేమ భిక్ష . ఆ కులపాలిక అరమోడ్పు కన్నుల్లో చిక్కని సిగ్గులు.   ఉలి కన్నా వేగంగా మనసు పరిగెత్తుతున్నది . ఆ శిల్పంలో కలిసిపోయి తానున్నట్టే  మరచిపోయాడు ఆకళా తపస్వి. 


తన కుటీరం వాకిట్లో ఏదో అలజడి. అయినా  అతను తలయెత్తలేదు. ఇంకా   కర్రగుండెలో నుంచి కళను పిండుతూ నే ఉన్నాడు.  


భార్య 'ఆశ' ఆలజడిగావచ్చి ఎదుట నుంచుంది. ఐదేళ్ళబిడ్డ కళ వెక్కి వెక్కి యేడుస్తూ ఉండగా  చంద్రమౌళి ఆలయెత్తి చూచాడు.


తపబిడ్డకంటినుంచి జారే నీలాలు చూచిన అతని చేతిలోని ఉలి జారిపోయింది. తపోభంగంలా శిల్పం ఆగిపోయింది. 'ఏమిటి సంగతి' అన్నాడు విధిలేక. 


ఆశ ఎర్రబముఖంలో చెప్పడం పెట్టింది.—“పాపం, 'కళ? యేమీ చెయ్యలేదు సుమండీ —మన పొగడ చెట్ల క్రింద పువ్వులేరుకుంటూ ఆడుకుంటున్నది. ఆ ధనవంతుల బిడ్డలేదూ శేషగుణి, ఆ పిల్ల, కళను పిలిచి తీసుకువెళ్ళింది. ఇద్దరూ చాలా సేపు ఆడుకున్నారు. ఆ పిల్ల మెడలోని  రత్నాలహారం దీని మెడలో వేసి 'నీకిచ్చేశాను తీసుకో'  అందిట. కళ నిజమనుకుని ఇంటికి పరుగెత్తుకువస్తూఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ కళ హారం ఎత్తుకు పోతున్న తాన  తల్లితో చెప్పింది. వెంటనే ఆవిడ పరుగెత్తుకువచ్చి 'దొంగబుద్ధులు, దొంగపిల్లలు . లేనివాళ్లతో స్నేహాలు వద్దంటే మా పిల్ల వినదు ' అని ఈ పిల్లను గుంజి హారం తీసుకుని వెళ్ళిపోయింది. 


" ఇదేనా  మర్యాద ? చూడండి. కూటికి పేదలమైతే గుణానికీనా?" అని ఆమె బరువుగా నిట్టూర్చింది, చురచురము నే కళ్ల తో. 


చంద్రమౌళి అన్నాడు నెమ్మదిగా — "పిచ్చిదానా నీకూ ధనవంతులం టే వ్యామోహం. వారి తళతళలాడే   నగలూ, మిలమిల లాడే చీరలూ దూచి ఎంత ఆకర్షణ నీకు! వారిలాగే మెరిసి పోవాలని ఎంత ఆరాటపడతావు ! ఆ కోరిక ఎప్పుడో మనల్ని శాపమై మొత్తుకుంది. ఈ సడిస్తుంది. అని నీకు తెలియ లేదు. ఇంక ఊరుకో " అని మళ్లా శిల్పాన్ని అందుకున్నాడు. 


ఆశ ఊరుకోలేదు.


" ఆపండి ఆ పని. ఆలుబిడ్డలు సుఖించని ఈ చెక్క డాలు శిల్పాలూ ఎందుకూ? చేతులో ఇంత నేర్పుండి ఏం లాభం? తలుచుకుంటే అట్లాంటి రత్నహారాలు పది సంపాదించగలరు. నన్నూ  బిడ్డనూ అలరించి అలంక రించగలరు. కళను చూచి మెచ్చి ఇచ్చే ప్రభువులు దేశంలో లేకపోలేదు. వచ్చేవి కారణోత్సవాలు. మీ చెయ్యిసోకి తే

రాళ్ళుమాటాడతాయి. ఒక్క శిల్పంతో ఆ మాలవరాజును సంతోష పెట్టలేరా? కాంక్షతో  తీవ్రంగా వెలిగే  ఆశ కళ్ళకు అతడు లొంగిపోయాడు.


ఆనాడే దీక్ష వహించాడు. ప్రశస్తమైన ఏనుగు దంతం సంపాదించారు. చంద్రవంకలా ఉన్న ఆ దంత  ఖండాన్ని నిలువునా పూలదండగా  మార్పివెయ్యా లను కున్నాడు . ఉలి ఆమోఘంగా పని చెయ్యడం ప్రారంభించింది. 


ప్రతీ రాత్రి ఎదురుగా కూర్చునేది. ఆమె కళ్ళ అందం ఆతని  శిల్పానికి దీపం అయింది. ఆమె ఎర్రని పెదవుల చిరునవ్వు అతని కల్పనకు జీవంపోసింది. ఆమె ఒక్కొక సుందర భంగిమ అతని చేతిని పరుగులెత్తించింది. ముప్పది రోజులు అహోరాత్రాలు పని చేశాడు.


ముక్కలు చెయ్యలేదు. అతుకు లేదు. ఏనుగు దంతం హఠాత్తుగా మల్లెపూలదండగా  మారిపోయింది. రేకురేకునా సహజమైన మధురిమలు. ముడత ముడతలో  అచ్చమైన నొక్కుల సొగసులు. కొన్ని పూర్తిగా విడిన మల్లెలు, కొన్ని అరవిచ్చినవి . చివర ఒక బొడ్డు మల్లె కొలికి  పూస. 


ఒక్కొక్క పువ్వుకూ ఒక్కొక్క నెత్తురుబొట్టు ఖర్చు పెట్టాడు.


చిక్కిపోయిన చెక్కిళ్ళతో తృప్తిగా నవ్వి అతిని గుండె  పూచిన పూలమాలను ఆశ ఎదుట  సగర్వంగా ఎత్తి పట్టుకున్నాడు. ఆశ కళ్ళల్లో ఆనందజలం చిమ్మింది. 


ఒక ముహూర్తాన ప్రభు సందర్శనంకోసం మూటకట్టుకు బయలుదేరాడు.



చంద్రమౌళి రాజవీధిలో వేడిగా నిట్టూర్చి తన  శిల్పం వైపు ఇంకొక సారి చూశాడు. ఆ తెల్లని పువ్వులు తనని  చూసి పకపక నవ్వినట్లనిపించింది. ప్రతి పువ్వూ తీసకోసం దీనంగా ఎదురు చూసే  ఆశ ముఖం జ్ఞాపకం చేసింది. అమాయకపు కళ్ళల్లో నీరు కార్చి తన బిడ్డ కళ పరుగెత్తుకొనివచ్చి కాళ్లు  చుట్టు వేసుకున్న ట్టనిపించింది.


పొంగివచ్చే కన్నీళ్లను ఆపుకుని నగరం వెలుపలి శూన్యంలోకి వచ్చి ఒక రావి చెట్టుకింద నిలుచున్నాడు. అమోఘమైన తవ శిల్పాన్ని ఊచిపుచ్చుకుని చెట్టు మొదటికి విసిరి వేశాడు. అది పోయి ఒక రాతికి తగిలిన చప్పుడయింది.


నివ్వెరపోయి చెట్టు మొదట పరిశీలించాడు. ఆశ్వయుజమాసపు వెన్నెల వెలుగుల్లో స్పష్టంగా కనబడుతున్నది. 


ఆ పుష్పమాల ధ్యానముద్రలో ఉన్న బుద్ధదేవుని పాదాల ముందు పడింది.


అతనికి నవ్వు వచ్చింది.


“సింహాసనంమీది విగ్రహానికి సమర్పించదలచిన ఆపూర్వ పుష్పమాల ఈ జీమా దయామూర్తి పాదాలను పూజించిందా? ఎంత ధన్యుణ్ణి! 


చంద్రమౌళి నిమీలిత నేత్రాలతో బుద్ధదేవుని పాదాలముందు నిలువునా మోకరిల్లాడు. 


బుద్ధ జీవుని ఒక శీతల హస్తం అతని వెన్నుపై నిమిరినట్లయింది !



రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి

 ( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  


Saturday, December 25, 2021

వ్యాసం: కాళిదాసు కాలంలో విద్యలు - పి. వి. భట్టశర్మ ( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

వ్యాసం

కాళిదాసు కాలంలో విద్యలు

పివిభట్టశర్మ

 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ వ్యాసం: 

కాళిదాసు కాలంలో విద్యలు 

- పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ



మనదేశంలో వేద కాలమునుండిన్నీ ఉప

నయన సంస్కారంతో విద్యారంభం జరుగు తూండేది. ఈ సంస్కారం ఆయావర్ణముల వారికి పలు విధాలు గా ఉంటూ వచ్చేది. వారిలో క్షత్రియుని విద్య వీటినుండి ప్రారంభ మయ్యేది. విక్ర మోర్వశీయత్రోటకం లో ఆయువు (పురూరవునిపుత్రుడు ఆశ్రమ విద్యతోనే సమర్వేద్యనుకూడా అభ్యసించినట్లు మహాకవి ప్రయోగంవలన తెలుస్తున్నది. ) 


ఆశ్రమాల్లో విద్య నేర్చుకొనే శిష్యు రాండ్రు రెండు కాలుగా ఉండేవారని ధర్మసూత్రాలలో ఉన్నది. మొదటి తరగతి వారిని సద్యో వధువు లనేవారు. వీరు విద్యాభ్యాస మయినతరువాత గార్హస్థ్యం స్వీకరిం చేవారు. 


ఇక రెండవరకమువారు బ్రహ్మవాదినులు. వీరు జీవితాంతము బ్రహ్మచర్య మాచరించేవారట. ఇందుచేతనే “మీ చెలి వివా హమువఱకే నైఖాన సవ్రత మవలంబిస్తుందా, లేక జీవితాంతమూ వ్రతంలోనే మగ్నమవు తుందా” అని దుష్యంతుడు శకుంతల చెలులను ప్రశ్నిస్తాడు. 


మహాకవి కాలంలో సహవిద్య (Co-education) నిషిద్దం కాదు . ప్రియంవద,అనసూయ, శకుంతలలు ఆశ్రమంలోని బ్రహ్మ చారులతో కలిసే విద్య నేర్చారు.


ఆనాటి విద్యకు జ్ఞానము, వినయ చరమలక్ష్యాలు. కేవలం జ్ఞానోసార్ధనవలననే వికాసం కలగదు; జ్ఞానంతోపాటు వినయం కూడా ఆవశ్యకమని ఆనాటివారి తలపు. ఈ జ్ఞానవినయాలు గురువుల సహవాసంవలన లభ్య మవుతూండేవి. ఊరకే పుస్తకాలు వర్ణించిన మాత్రాన ఆ రోజుల్లో విద్వాంసు అనిపించుకోడం కష్టంగా ఉండేది. 


చదువుకు, సాయంగా రాగద్వేషాలు అణగేటట్లు తమ నడవడిని దిద్దుకొనేవారు. ఈ భావాన్నే మహాకవి "సమ్యగా గామితా విద్యాప్రబోధవినయావివ” - బాగుగా వచ్చిన చదువు ప్రబోధవినయాల నిచ్చినట్లు అనే ఉపమలో  నిబంధించారు. ‘విద్యా దదాతి వినయమ్' అనే సూక్తిని  కాళిదాసు తమ గ్రంథాల భూమికల్లోనే చరితార్ధం చేశారు. 


ఈ కాలానికి హద్దు లేదు, భూమి విశాల మయినది. ' నాతో సమాన మైన భావాలుండేవాడు తప్పకుండా ఉంటాడు' అనే భవభూతి మాదిరి దర్పంతో ఎప్పుడూ ఈ కవికులతిలకులు మొదలు పెట్టరు. "కీర్తి గడించిన భాససౌమిల్లకకవిపుత్రుల ప్రబంధాలకంటే  కాళిదాసుకబ్బంలో ఈ నాటకీయ గౌరవం ఎందుకు ? పండితులను సంతోష పెట్టేవఱకూ బాగా ఉన్న దనుకోచ్చు "మున్నగు వినమ్రమైన వాక్యాలతో వీరు ప్రారం భిస్తారు. పురూరవుని దర్బారు. చిత్రరథుడనే  గంధర్వరాజు ఇంద్రుని సందేశం పట్టుకొని మహారాజు చిత్రరధునకు స్వాగత మిస్తాడు. ఆ గంధర్వుడు రాజును శ్లాఘిస్తాడు. ఇంద్రుని పక్షంలో వారు  చూస్తున్నారంటే అదంతా ఇంద్రుని పరాక్రమ విశేషమేనని తన కృతజ్ఞతను పురూరవుడు ప్రకటిస్తాడు. 'వినయమే  పరాక్రమానికి అలంకార' మని ఈ సందర్భంలోని చిత్రరధుని వాక్యంలో కవి తన అభిప్రాయం

తెలియచేసినట్లు అనిపిస్తుంది. 



రఘువంశమే కాళిదాసుఅంతిమ కావ్యం అంటారు. ఈ కావ్యం ప్రారంభంలో మహా కవి వినయమ నే కొండుకొన పై నుండి ఉపదేసిస్తున్నట్లుగ ఉంటుంది. చూడండి — “సూర్యవంశ మెక్కడ? ఈ అల్బబుద్ధి ఎక్కడ? దుస్తర మైన సముద్రాన్ని లోతు తెలిసికోకుండానే తెప్పతో దాటుదామని యత్నిస్తున్నా. కవి యశఃప్రార్థినై మందుడనైన నేను హాస యోగ్యుడనే ప్రాంపును పొందదగ్గ పండ్లను పొట్టివాడు చేతులెత్తిన వెంటనే  పొందలేడు గదా" అని అంటూ తర్వాత కూడా "ప్రాచీన కవులు మాటలతలుపులు తెరిచిన ఈ సూర్య వంశంలో--వజ్రసముత్కీర్ణమై మణిలో దారమునకువలె —— నాకున్నూ గమనం లభ్య మవుతుంది" అంటారు.


త్రివర్గములకు మూలమైన మూడు విద్యలను పూర్వజన్మలోనే అంతుచూచినవి జ్ఞాపకముండునట్లు ఆ రాజు ఈ గురువులకు కష్ట మివ్వ నేర్పాడు అనడంలో ( రఘువంశం  18.50 ) కవి మూడు విద్యలను ఉల్లేఖించి కవి తమ కాలపు విద్యావిధానం సూచించారు . వేదత్రయం నుండి ధర్మాధర్మాలు, దండనీతి నుండి న్యాయాన్యాయాలు , వార్త నుండి అర్థ అనర్థాలు  - అని మల్లి నాథులు వ్యాఖ్యానించారు. 


దీనితోపాటు మహాకవి అక్కడక్కడ చతుర్దశి విద్యలనూ పేర్కొన్నారు . (5-21) మీమాంస మాట నామగ్రాహం గ్రహింపక పోయినా, రఘువంశప్రారంభశ్లోకంలోనే మీమాంసలో కవి నేర్పు స్పష్టమవుతున్నది.


శివతపోవర్ణనఘట్టంలో, 'విరాసనం వేసి, దృష్టి తిన్నగా, నిశ్చలంగా ఉండేట్లు చేసి బాహువులు వంచి, అంకంపై చేర్చి రెండు చేతులూ కమలాకారంలో నిలిపి, ఈశ్వరుడు ధ్యానం చేశారట. పాతంజలంలో సరిగా ఇదే పద్దతి నిర్దిష్టమైయున్నది. కుమారసంభవంలోగుణత్రయ విభాగాయ - త్యా మానయంతి ప్రకృతిం' అనేవి, రఘువంశంలో “లోష్ట కాంచనముల్లో సమబుద్ధి గల రఘువు ప్రాకృ తికమైన గుణత్రయాన్ని జయించెను' అనే వర్ణనకూడా ఆనాటి సాంఖ్యసిద్ధాంత ప్రాబ ల్యాన్ని, కవికి సాంఖ్యంలో గల పరిచ యాన్ని వ్యక్త పరుస్తున్నాయి.


ప్రపంచానికి కారణమై, కారణము లేనివాడవు, ప్రపంచమున కంతకుడనై అంతము లేనివాడివు" అని బ్రహ్మ చేసిన శివస్తోత్రము,

విక్రమోర్వశీయ నాందిలో "వేదాంతేషు యమాహు పురుష " మున్నగునవి కవికి గల వేదాంతపరిచయానికి  నిదర్శనలు. పై

భావాలు 'యతో వాఇమాని భూతానిజాయంతే ' అనే 

ఉపనిషద్భావాలకు వ్యాఖ్యానమే. ఉపనిషత్  అర్థం తెలియకుండా వేదాన్ని అప్ప చెప్పే' ఛాందసులు ఆనాడూ ఉన్నట్లుగా ‘వేదాభ్యాసజడు,లనడింవలన ఊహించవచ్చు నేమో. 'సాంగం చ వేద మధ్యాప్య'  అని వేదాంగాలు నిర్దేశింపబడ్డాయి. ప్రాతఃకాలమే నందినిని సేవిస్తూంటాడు. ముందు నందీని , నెనుక దిలీపుడు! నందిని డెక్కలనుండి వచ్చే ధూళి మార్గాన్ని పవిత్రం చేస్తున్నది. అదే మార్గంలో వస్తున్న సుదక్షిణ శ్రుతిని అనుసరించే స్మృతివలె వస్తున్నదిట .


యుద్ధభూమిలో శత్రువ్యూహములను భేదించే వ్యూహాల అంతు, శాస్త్రములు అంతున్న ఈ బాలుడు చూడగలడని ముందుగా  ఆలో చించే - రఘువు అని పేరు పెట్టారట. (రఘి ధాతువు గమనార్థకము) ఈ విధంగా నే మహా కవి తమ వ్యాకరణపరిజ్ఞానాన్ని అక్క డక్కడ విశదీకరించారు.


శ్రీరామవివాహసందర్భం. నలుగురు  రాజ కుమారులను పరిణయమైన ఆ రాజకన్యలు.. ఆ కన్యలను పొందగల్గిన రాజకుమారులున్నూ నిస్తులు లయ్యారట. ఆ వధూవరుల మేళనము ప్రాత: పదికలతో ప్రత్యయములు కలిసినట్లున్న దట. వధూవరులు అనే రెండు ఉపమేయములకు ప్రత్యయప్రకృతులకు ఉపమించారు. వరశబ్దం పుంలింగ ఏకవచనం. ఆటాంటి ప్రత్యయశబ్దాన్నే ఉపమానంగా వాడారు. ఈ విధంగానే స్త్రీలింగమైన వధూశబ్దానికి సరిగా స్త్రీలింగమైన ప్రకృతిశబ్దంతోనే సాదృశ్యం నిబంధించారు. ప్రకృతి ప్రత్యయములవలన ఫలితం పదనిష్పత్తి. అదే విధంగా వధూ వరుల యోగంతో గృహస్థాశ్రమం సిద్ధమవుతుంది. ఈ రెండు ఉపమేయ ఉపమానాలకు యోగం సాధారణ ధర్మము; సన్నిధమనేది ఉపమావాచకము. వ్యాకరణం వంటి నిష్క  శాస్త్రాన్ని కూడా తమ చమత్కారపూర్ణ ఉపమలతో  సరస మయ్యేటట్లు మహాకవి నిరూపించారు. ఈ అలంకారాన్ని 'పూర్ణోపము ' అని సాహితీశాస్త్రజ్ఞులు. ఇదేకాక 'ధాతో:  స్థాన ఇవాదేశాత్' మున్నగునవి కవికి  వ్యాకరణమంటే గల ఆదరణ తెలియచేస్తున్నది. మహాకవిసమయంలో మనవిద్యల ఉన్నతస్థాయిని ఊహించుకోగలవారికి, పతనమైనమన నేటివిద్యావిధానం దృగ్గోచరమై హృదయా వేదన ఎక్కువ కాకతప్పదు. 

--- 

 - పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

Thursday, December 23, 2021

పాతబంగారం – కథ అనువాదం నేను ఎవరినైతేనేం! 'వేంకటేశ్ ' ( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


పాతబంగారం 

అనువాదం 

నేను ఎవరినైతేనేం! 


'వేంకటేశ్ ' 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ



'నే నెందుకు నవ్వుతున్నానో మీ కందరకూ తెలుసుకోవాలని ఉందన్న మాట? చచ్చిపోయేముందు ఎవడన్నా ఎందుకు నవ్వుతా డనేకదూ మీరనుకొనేది. అవునా? నాగురించి మీరేమీ ఆదుర్దా పడబోకండి


డాక్టరుగారు! అనవసరంగా శ్రమపడక మీ పనేదో మీరు చేసుకోండి! మీరు ఏవిధంగానూ నన్ను  బతికించలేరు. అసలు ఎవ్వరూ కూడ నా చావు తప్పించలేరు. ఈ పరిస్థితిలో ఎవరూ బతికించలేరు. 


ఎందుకంటే, నాకు ఒకటి కాదు రెండు బలమైన కత్తిపోట్లు తగిలాయి. ఒకటి వీపుమీద రెండోది డొక్కలోను. కండలు, నరాలు బయటకు రావటం మీకు కనిపిస్తునాదనే అమకుంటున్నాను. 


'మీరంతా నే నెందుకు నవ్వు తున్నానో వినాలని కుతూహలపడుతున్నా రన్నమాట. చచ్చిపోయే వ్యక్తికి నవ్వు తెప్పించే విషయం ఏమిటా అని ఆశ్చర్య పడిపో తున్నారుకదూ. నేను చెబుతాను. మీరేమీ ఆదుర్దా పడనవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞాపక స్తోంది. అసలు నే నెవరినో...


 'మీ రేమిటో గుసగుసలాడుతున్నారే. ఏమిటది? ఎందుకో నవ్వుతున్నారే? నేను చెప్పే దంతా  పూర్తిగా విని అప్పుడు గ్రహించండి..  చచ్చిపోయేముందు కూడ నాకు నవ్వు తెప్పించిన కారణ మేమిటో...


'ఇప్పటికి రెండు నెలలనుండి ప్రయత్నిస్తున్నా నేనెవరినో తెలుసుకొంటానికి.  ముసల్మానునా, హిందువునా లేక సిక్కు నా, బ్రాహ్మడినా లేక అస్పృశ్యుడినా, భాగ్యవంతుడినా లేక పేదవాడినా, నాది తూర్పుపంజాబా లేక పశ్చిమపంజాబా, నా నివాసస్థలం లాహోరా లేక అమృతసరా, రావల్పిండా లేక జలంధరా? 


నే నెవరినో నిర్ధారణ చెయ్యటానికి నేనే కాకుండా యింకా అనేకమంది శాయశక్తులా ప్రయత్నించారు. . నా కుల వేమిటో, నా మత మేమిటో అసలు నా పేరేమిటో తెలుసుకొందామని.  కాని ఫలితం మాత్రం కనుపించలా. ఇప్పుడు కొద్దికొద్దిగా నా పూర్వవిషయాలు గుర్తుకొస్తున్నాయి... యిప్పుడు... చచ్చిపోయే ముందు!...


అనేక ప్రయత్నాలు చేశారు. ఒక్కరికీ సాధ్యం కాలా. అసలు నే నెవరో నిశ్చయించు కొందామని.  నేను కూడ చాల శ్రమపడ్డాను. 


డాక్టరుగారు! మీరు నా వంక చూడకండి. మీరు ఆ విధంగా చూస్తుంటే నాకు మరీ నవ్వు వస్తోంది. ఉహుఁ మీరేకాదు, ఈ పరిస్థితిలో నన్ను ఏ డాక్టరూ బతికించలేడు... మీరు ఎందుకు అంత దీక్షగా ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారో నాకు తెలుసు. నా గాయాలను ఎట్లా మాన్పుదామని అలోచిస్తున్నారు కదూ! 


ఈ రెండు గాయాల్లో ఏ గాయానికి ముందు కట్టు కడతారు. ఒక గాయానికి కట్టు కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఒంట్లో ఉన్న నెత్తురు, కండలు, - రెండో గాయం గుండా బయటకు పోతాయి. ముందు రెండో గాయాన్ని కట్టటానికి ప్రయఅనిస్తే మొదటి గాయం గుండా పోతాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమించి కథను, కాదు, నా పూర్వచరిత్రను కొంచెం నిదానంగా  వినండి....


శ్రద్ధగా రెండు మాసాలపాటు ఢిల్లీ ఆస్పత్రిలో ఉన్న తర్వాత నాకు తెలివొచ్చింది! 'నీ పేరు?” అన డాక్టరు.


“నేను చాల ప్రయత్నం చేశాను. కాని గుర్తు లేదు అని చెప్పవలసి వచ్చింది. 


' హిందువుడివా లేక ముసల్మానువా?' వెంటనే డాక్టరు అడిగారు . 


యీ రెండో తికమక ప్రశ్న కు కూడా  'గుర్తులేదు' అని చెప్పవలసి  వచ్చింది.


' నా పూర్వచరిత్ర ఏమిటో గుర్తులేకుండా పోయింది. నా కులం, నా మతం, నా యిల్లు, సంసారం అన్నీ పూర్తిగా మర్చిపోయా. అసలు నాకు పెళ్లయిందో లేదో, బ్రహ్మచారినో మరి ఎవరినో నాకే అర్థం కాకుండా పోయింది. చివరికి పేరన్నా

' తెలుసుకొందామని శాయశక్తులా ప్రయత్నించా. 


పేరు లేకపోతే ప్రపంచంలో నేను ఫలానా వ్యక్తి నని నిరూపించేందుకు ఆధార మెక్క డుంటుందో మీరే చెప్పండి. 


విచారించగా విచారించగా కొంత కాలానికి తెలిసింది నే నెట్లా యీ ఆస్పత్రిలోకి వచ్చానో. పంజాబునుండి వస్తున్న కాందిశీకులతోబాటు నన్ను కూడ ఆ స్పత్రికి రు ట. అట్లా వచ్చినవారిలో చాలమంది ఆస్పత్రిలోనే మరణించారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమతస్థులని నేను అడగ్గా హిందువులు, ముస్లింలు, సిక్కులూ — అన్ని మతాలవాళ్ళూ ఉన్నారని ఆస్పత్రి వాళ్లు చెప్పారు. 


అసలు జరిగిం దేమిటంటే లాహోరు అమృతసర్ల మధ్య మోసుకు పోతున్న రెండు రైలుబళ్ళు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి. ఒక రైలుబండి పశ్చిమ పంజాబునుండి అమృతసరుకు హిందూ కాందిశీకులను మోసుకొస్తోంది. రెండో బండి తూర్పు పంజాబునుండి లాహోరుకు ముస్లిం కాందిశీకులను మోసుకుపోతోంది. 


దాదాపు రాత్రి 11 గం. సమయాన రైలు ఒకవంతెనమీద ఉండగా పట్టాలకింద ఒక బాంబు పేలింది. వెంటనే రైలుబండి అంతా పేలింది. 


చాలమంది అప్పుడే మరణించారు. చాలమందికి గాయాలు తగిలాయి. గాయాలు తగలకుండా తప్పించుకొన్న వారిని చుట్టుపక్క ల పొంచిఉన్న గూండాలు కాల్చి చంపారు. గాయాలు తగిలిన వాళ్ళు గుడ్డితనంగా తలొక దారి వెంటా పరిగెత్తుకు పోయారు. 


ఎదురుగుండా వస్తున్న బండికికూడ గంట తర్వాత యిటువంటి ప్రమాదమే సంభవించింది. ఆ రైలుబండిలో గాయాలు తగిలిన వాళ్ళుకూడ తలదాచుకొంటానికి దొరికిన దారి వెంబడి పారిపోయారు.


'మరురోజు ఉదయం భారతప్రభుత్వ సేనలు, పాకిస్థాన్ ప్రభుత్వ సేనలు సరిహద్దు  గస్తీ తిరగటానికివచ్చి అనేక శవాలను, గాయపడి కదలలేకుండా పడిఉన్న వాళ్ళనూ చూశారు. వాళ్లల్లో ఎవరు హిందువో, ఎవరు ముస్లిమో నిర్ణ యించటం బహుకష్టమైపోయింది. 


నేనుకూడా ఆ విధంగా గాయపడిన వాళ్ళల్లో ఒకణ్ణి. నన్ను స్ట్రెచర్ మీద అంబులెన్సువద్దకు మోసుకొని పోయినవాడు చెప్పాడు .. నే నెక్కడ ఎట్లా పడిఉన్నానో వివరాలన్నీ! 


 గుడ్డలన్నీ నెత్తురుతో తడిసిపోయాయి. నా చుట్టూ ఒక రక్తపు మడుగు తయారైంది. కొత్త సరిహద్దు ప్రకారం 'నా కాళ్ళు పాకి స్టాక్ భాగంలోను, తల  భారత దేశంలోను పడిఉన్నాయి. ఈ కొత్త సరిహద్దు వెంట అనేకమతాల, జాతులవారి రక్తం ప్రవ హించింది.


'చూడు! మౌలానా! దయ్యాన్ని  పట్టించే వాడిమాదిరిగా నా వంక అట్లా చూస్తావేం? నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. నేను యిప్పుడో యింకాసేపటికో చచ్చిపోతాను. చచ్చిపోయేముందు ప్రతిక్యక్తికీ అన్ని విషయాలు - తెలుస్తాయి. నేను ముసల్మాను నని చెప్పినట్లయితే యిస్లాం మతమును అనుసరించి నా అంత్య క్రియలు జరుపుదా మని ఆలోచిస్తున్నావుకదూ! 


ఏమండీ! మహషాయ్ ! నాకు తెలుసు. నేను హిందువునని చెప్పి నట్లయితే మీ ధర్మసేవక్  సంఘాన్నను సరించి నా అంత్యక్రియలు జరుపుదామని ఆలోచిస్తున్నారు కదూ! 


బొంబాయిలో పార్శీవాళ్లు - శవాల్ని బయట పారేస్తారని విన్నాను. వాటిని బ్రతికుండగానే  పీక్కు తింటానికి పక్షులు తయారవుతారన్న విషయం నా కింతవరకు తెలియదు... 


'ఇక నా చరిత్ర కొనసాగిస్తా. ఎందుకంటే, నేను మీతో మాట్లాడేకాలం చాలకొద్ది మాత్రమే ! 


నాకు తగిలిన గాయాలు ఏమంత పెద్దవి  కావు. బలమైన గాయాలు రెండువారాలు కట్టు కడితే నయ మౌతాయి. కాని నా బుర్రకు గట్టి దెబ్బ తగిలి, మనస్సు చెడిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాని మూలంగా జ్ఞాపకశక్తి పోయింది. దాంతో నేను ఒక అనామకుడిగా తయా రయాను . 


నా పేరు నేను మర్చిపోయా. నాలాంటి అభాగ్య కాందిశీకులు చాలమంది ఆస్పత్రి కొచ్చారు. ఆస్పత్రి వాళ్లు నన్ను బయటకు వెళ్లమన్నారు. తలదాచు కొనేందుకు చోటైనా దొరక్క పోతుందా అని అన్వేషణ ప్రారంభించా.


'జుమ్మా  మసీదుదగ్గర ఒక శరణాలయం ఉంటే అక్కడకు వెళ్లి కాస్త చోటు యివ్వవలసిందని శరణాలయాధికారిని ఆశ్రయించా. 


' నువ్వు హిందువుడివా, ముసల్మానువా? అని అడిగాడు ఆ అధికారి. '

' నాకు గుర్తులేదు' అని చెప్పా. నాకు గుర్తు లేని మాట వాస్తవమే . నేను అబద్ధం ఎందుకు చెప్పాలి?


'ఈ శరణాలయం ముసల్మానులకోసం' అని ఆ అధికారి నన్ను బయటకు గెంటాడు. అక్కడి ఆశ నిరాశ చేసుకొని ఎట్లాగొకట్లా ఢిల్లీకి చేరుకున్నా. 


ఇక్కడ యిదివరకటి శరణాలయం కంటే పెద్దదాన్ని చూశా. తలదాచు కొనేందుకు కాస్త చోటు యివ్వమని వాలం టీర్లను ప్రార్ధించా.


'హిందువుడివా, ముసల్మానువా' అంటూ అదే ప్రశ్న వేశారు. యిక్కడా  'నాకు గుర్తులేదు' అని నేను మళ్లీ ఆమాటే చెప్పా. '


' నీ పేరు?అని అడిగారు. 


‘అదికూడ నాకు గుర్తులేదు. అసలు నా కేదీ గుర్తులేదు.' 


'ఇం కెక్కడి కన్నా వెళ్లు. ఈ శరణాలయం హిందువుల కోసం . 


ఈ విధంగా ఒక చోటునుంచి యింకో చోటికి తిరిగా, హిందువులకోసం శరణాలయా లున్నాయి. మహమ్మదీయులకోసం శరణాలయాలున్నాయి. కాని  మానవులకోసం మాత్రం లేవు. 


'ఆ రాత్రి శరీరం బాగా  అలిసి ఉండటం చేత  నడవ టానికి ఓపిక లేక ఒక సిక్కు సర్దారు బంగళా ముందు స్పృహతప్పి పడిపోయా. అతడు సెక్ర టేరియట్ లో ఒక చిన్న ఆఫీసరు. అతడు నన్ను లోపలకు తీసుకుపోయి రొట్టె, పాలు యిచ్చాడు. నాకు కొంచెం స్పృహ వచ్చిన తర్వాతగూడ నేను హిందువునో, ముసల్మానునో సిక్కునా  నన్ను అడగలా. 


' కులాసాగా ఉందా బాబూ? ' అని మాత్రం అడిగాడు.


‘అతని బంగళాలో నేను చాల రోజులు గడిపా. 


నేను నా కథను ఉన్నది ఉన్నట్లు చెప్పినా నాకు తెలిసినంత వరకు . అప్పటికిగూడ అతని కుటుంబం  నన్ను చాల ఆప్యాయంగా చూసింది. కొన్ని రోజులతర్వాత వారి చుట్టాలు కొంతమంది రావల్పిండినుండిపారిపో యెచ్చారు. ముస్లిం గూండాలచేతిలో వాళ్ళు చాల కష్టా లనుభవించారు. వాళ్ల కళ్ల ఎదటే  వాళ్ళ బంధు వులను నానాహింసలు పెట్టి అవమానాలపాలు చేశారు. వాళ్ల హృదయాలు ముస్లిములంటే అసహ్యంతో నిండిపోయాయి. ఈ కథంతా - విన్న తర్వాత నాకు తెలియకుండా నేనుకూడ ముస్లిములను అసహ్యించుకోవటం మొదలం పెట్టా..


'సర్దార్ గారు నా కథంతా చెప్పి  , నా కే విధంగా మతి పోయిందీ, ఏ విధంగా నేను కష్టాలుపడ్డదీ వివరాలన్నీ వచ్చిన బంధువులకు చెప్పారు. పెద్దవాళ్ళు నన్ను అనునయించి నా పూర్వ స్మృతిని తెప్పించటానికి చాల ప్రయత్నం చేశారు. కాని పిల్లలుమాత్రం నన్ను అనుమానం గానే చూశారు. 


అందులో ఒకడు యింకొక డితో యీ విధంగా చెప్పటం విన్నా: 'వాడు చెప్పిందంతా అబద్ద మనుకో. మతి తప్పిపోయిం దని బొంకుతున్నాడనుకో, వాడు నిజంగా ముస్లిం అయివుంటాడు ' 


నాకు భయం పుట్టింది.


'ఆ ఆలోచనే నన్ను కూడ వేధించుకు తింది. నేను నిజంగా ముస్లిమునేమో. ఏమో ఎవరికి తెలుసు. నేనుకూడ యిప్పుడు ముస్లిములు చేస్తున్న మాదిరిగా ఘోరాలు చేసిన తర్వాత నాకు మతి తప్పిందేమో. నా ఘోర కార్యాలకి భగవంతుడు న న్నీ విధంగా శిక్షించా డేమో.' 

ఆ రోజు రాత్రే సర్దార్ యింటి నుండి పారి పోయా. తిరిగి వీధులవెంట తిరుగుతున్నా. మళ్లా ఉపవాసాలు, 


' ఈ శరణాలయం ముస్లిములకోసం నీ వెవరు ?' 

నీ పే రేమిటి ? నీ మత మేమిటి?నువ్వు ఎక్కడనుండి వస్తున్నావ్?.. ప్రశ్నలు ! ప్రశ్నలు ! ! ప్రశ్నలు!!! -అన్నీ ప్రశ్నలు, .


ఎక్కడచూచినా ప్రశ్నలు. నేను అందులో ఒక్క దానికీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే నే నెవరినో నాకే గుర్తు లేదు. ఇక నడవలేక ఆకలి మండుకుపోతుంటే తిరిగి జుమ్మా మసీదు  దగ్గరకు పోయి అక్కడే కూచున్నా. ఆకలితో చచ్చిపోవటం, నిశ్చయ మనుకొన్నా. స్పృహతప్పి పడిపోయా. 


అట్లా ఎంతసేపు పడిఉన్నానో! ఎప్పుడో ఒక్క సారి మాత్రం కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఎనిమిదేళ్ల పిల్లాడు నుంచొని ‘లే! లే!!” అని అంటున్నాడు. 


'ఇదిగో! యివ్వి తిను. మా అమ్మ నీకోసం పంపింది'. తిండి అన్న మాట వినంగానే లేవాలని బుద్ధి పుట్టిం దను కొంటా, కాని లేవటానికి శక్తి ఎక్కడనుండి వస్తుంది .  లేవలేకపొయాన.  ఆ పిల్లాడి సహాయంతోనే అతిప్రయాసతో లేచి కూచొని చపాతీలు తింటం ప్రారంభించా. 


ఎంత రుచిగా ఉన్నాయి ఆ చపాతీలు! భగవంతుడే నాకోసం అమృతాన్ని యీ రూపంలో పంపించినట్లుగా ఉంది. కల కాలం జీవించునాయనా! ' అని దీవించా. 


కాస్తముక్క కూడ విదలకుండా అన్నీ తినివేశా. కృతజ్ఞత తెలియజేద్దామని అతని చెయ్యి తాకగానే 'నీకు బాగా జ్వరంగా ఉందే ! మా యింటికి పోదాం. మా నాన్న యునాని వైద్యుడు. మందు వేస్తాడు. తగ్గిపోతుంది.' అని ఆ పిల్లాడు నన్ను వాళ్లయింటికి లాక్కుపోయాడు. 


ఆ యునానీ వైద్యు డొక ముసల్మాన్. రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తాడు. బీద, బిక్కికి ఉచితంగా మందులిస్తాడు. అతనికి హిందువులు, ముస్లింలు, సిక్కులు అన్న వివక్షత లేదు. జబ్బులు తో వస్తే వారందరికీ మందులిస్తాడు. 


హకీంసాహెబు మందుల వల్ల నా జ్వరము తగ్గింది . కాని అంత పెద్ద వైద్యుడివద్దకూడ పూర్వ స్మృతిని తెప్పించే మందు లేకపోయింది. 


నా కథంతా ఆయనతో చెప్పి 'ఒక వేళ నేను హిందువునేమో. నేను మీ యిల్లు వదలి ఇంకో చోటికి పోవాలి' అని అన్నా. కాని హకీం సాహెబు నన్ను అక్కడే ఉండమని బలవంతం చేశాడు. 'నీవు హిందువయితే మాత్రం  ఏ మొచ్చింది? హిందువులు మాత్రం మనుష్యులు కారూ?`


నే నక్కడే కొంత కాలమున్నా. ఒక రోజున హకీం సాహెబు కొడుకు నా మాదిరి దురదృష్ట వంతులకు రొట్టెలు యివ్వ టానికి వెళ్లి తిరిగి యింటికిరాలా. నేను, హకీం సాహెబు అతనికోసం ఆ రోజల్లా వెతికాం. కాని అతని జాడ తెలియలా! 


జుమ్మా  మసీదు దగ్గర హిందువులు చంపారని రాత్రి తెలిసింది. ఈ వార్త వినంగానే హకీం సాహెబు కుటుంబ మంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆ పిల్లాడి భూతం నన్ను రాత్రి, పగలూ వెంటా డుతూ తన మృదుమధుర వచనాలతో 'నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీవు తిండి పెట్టా. కాని నువ్వు నన్ను చంపేశావు. గుర్తుంచుకో ! అంటోంది. నేను చంపలేదని నాకు తెలుసు. కాని నేను హిందువునేమో. మతి దప్పక పూర్వం నేను కూడ అనేకమంది ముస్లిం పిల్లలను చంపానేమో, ఈ ఆలోచన నన్ను అక్కడ నిలవనియ్యలా! 


ఆ రోజు తెల్లవారు ఝామున ఇంట్లో ఎవరు  లేవకముందే బయటకుపారిపోయా. 


అవి, ఢిల్లీలో మృత్యుదేవత తన సహస్ర బాహువుల్నీ జాపుతూ కరాళనృత్యం చేస్తున్న రోజులు. పట్టపగలే సామాన్య ప్రజానీకం మృత్యువువాత పడుతోంది. అగ్ని హోత్రుడిపాలవుతున్నది . 


ఏదో ఒక విధంగా గూండాలను తప్పించుకొని రైలుస్టేషనుకి చేరు కొన్నా. ఇక్కడికన్న బొంబాయిలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందని బయలుదేరా . నా మాట విని అక్కడ పక్కన పంజాబునుండి వస్తున్న ఒక కాందిశీకుడు చిన్నబోయిన వదనంతో కూచున్నాడు. 


రైలు కదిలినప్పటికి  'ఎవరు నీవు?' అని అడిగాడు. 'నాకు తెలి యదు. హిందువునైనా కావచ్చు. ముస్లిమునైనా కావచ్చు.'


' ఈ మార్గంగుండా ముస్లింలు ప్రయాణం చేస్తే ఘోర ప్రమాదాలకు గురి అవుతారని విన్నా. నీకు గడ్డం ఉంది. అందుకని అడిగా!' 


నేను నా కథ అంతా అతనికి వినిపించా. అతడు నా గడ్డాన్ని దీక్షగా పరిశీలిస్తూ నావంక అనుమానంగా చూస్తున్నాడు.


'వారం రోజులనుండి గడ్డానికి  కత్తి తగలక పోవటంచేత గడ్డం కొంచెం పెరిగింది. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ భరత పురం వచ్చాం. అక్కడ రైలు ఆపివేయబడింది. 


ముసల్మానులు అని అనుమానం వేసినవారి నందర్నీ రైలులోనుండి బయటకు లాగి కాల్చి చంపే స్తున్నారు.


‘ఆ విషయాన్ని తలుచుకొంటుంటే నాకిప్పు టికీ నవ్వు వస్తోంది. ఎందుకు నవ్వు వస్తోందో మీకు తెలుసుకోవాలని ఉందా ? ఆ విధంగా ముసల్మానులను బయటకు లాగి కాల్చి చంపే వాళ్ళంతా 'మహాత్మా గాంధికి జైయ్' అని అర స్తున్నారు. అది చాలు చచ్చిపోయేముందు ఎవడైనా నవ్వటానికి.


వాళ్లు  మా బోగీదగ్గరకు రాగానే నాకూ  చావు తప్ప దనుకొన్నా. నేను ముస్లిము అవునో కాదో నాకు మాత్రం తెలియదు. కానీ నాకు గడ్డం ఉంది. అది చాలు నన్ను చంపటానికి. 


యిందాకటినుండి కూచున్న పంజాబీ నామీద దుప్పటి వేసి నన్ను పూర్తిగా కప్పేశాడు. వాళ్లు అడగంగానే 'ఆయన మా అన్నండి. లాహో రులో బాగా గాయాలు తగిలాయి. ఇప్పుడు మాటాడే పరిస్థితిలో లేడు' అని స్నేహితుడు చెప్పాడు. నా పంజాబీ 'ఏదో ఒకవిధంగా చివరకు బొంబాయి చేరు కొన్నా. ఇక్కడకూడ అదే ప్రశ్న ఎదుర్కొంది.


నువ్వు హిందువుడివా, ముస్లిమువా ?


'ఎవరు హిందువు ? ఎవరు ముస్లిము? అన్న ఆలోచన నాకు యిప్పుడు తట్టింది. నేను ముస్లిముగా కనుపించినప్పటికీ పంజాబీ నన్ను కాపాడా డు. హకీం సా అతను హిందువా? సాహెబు కొడుకును చంపిన కిరాతకులు హిందువులా? ఎవరు ము స్లిములు? 


హకీం సాహెబు కుటుంబం ముస్లిము కుటుంబమా, లేక రావల్పిండిలో సిక్కులను నానా బాధలు పెట్టిన రాక్షసులు ముస్లిములా ? ఎవరు సిక్కులు? సర్దార్ సాహెబు కుటుంబమా  లేక ఢిల్లీలో వీరవిహారం చేస్తున్న నీచులా ? ఎవరు  ముస్లిం? ఎవరు హిందువు? ఎవరు సిక్కు ? ఈ పవిత్రస్థలములో కూడ నువ్వు హిందువువా, ముస్లిమా, 'సిక్కా అన్న ప్రశ్నే !


' నే నెవర్ని? హిందువునా? ముస్లిమునా? రాత్రింబగళ్లు ప్రశ్న నన్ను బాధిం చింది. నిద్రపోతున్నప్పుడుకూడ యీ ప్రశ్నలు భూతాల రూపందాల్చి బల్లాలు పుచ్చుకొని జవాబు పొందటానికి ప్రయత్నించాయి. నేను కలవరింతగా యీ మాట అన్నానేమో. 'నన్ను వదలి వెయ్యండి. నేను ముసల్మానును కాదు. హిందువునూ కాదు. సిక్కు నూకాదు. ఒక మాన వుణ్ణి మాత్రమే!' 


బొంబాయిలో కాందిశీకులకు శిబిరాలున్నాయి . సి క్కులకు ఖాత్యా కళాశాల దగ్గర ఒక శిబిరం ఉంది. హిందువులు రామకృష్ణ ఆశ్రమంలో తలదాచుకోవచ్చును. ముస్లింలు అంజుమన్ ఇస్లాం హైస్కూలుకు పోవచ్చును. కాని నేను ఎక్కడకు వెళ్లను? నాకు తలదాచుకొనేందుకు ఎక్కడా చోటులేదు. 


ముష్టి  నా కెవళ్లూ వేసేవాళ్లు కాదు. ముష్టి వేసేందుకు గూడ ఏ మతంవాడినో అడిగేవాళ్లు. నేనేం చెప్పేది? నేను ఏ మతానికీ సంబంధించిన వాడిని కాదు. అయితే నేను చచ్చిపోవాలన్న మాట. 


ఉహుఁ. ఆవిధంగా చావ లేను. నేనెవరినో తెలుసుకోవాలి. లేకపోతే నేను బతకటానికి అవకాశం లేదు.


డాక్టరు 'సమాని' నా స్మృతిని తెప్పిస్తాడని విని అక్కడకు వెళ్లా. అతడు మందులు, మాకులు వేసి రోగం తగ్గించడు. ఊరికే మాట్లాడి కుదు రుస్తాడు. నీ మనస్సును కష్ట బెట్టుకోకు. నీబుర్ర లో ఏమనిపిస్తే అది అంతా చెప్పు. సంబంధమున్నా సరే లేకపోయినా సరే అని చెప్పి తను ఒక కలంపుచ్చుకొని నా ముందు కూచున్నాడు. 


నేను కళ్ళు మూసుకొని నానోటి కొచ్చిందల్లా మాట్లాడా. 'నీలపు ఆకాశం, పచ్చని చేలు'


‘బాగుంది, ఆపబోకు' '


' నీలపు ఆకాశం, పచ్చని చేలు, ఒక నదీ ప్రవాహం. నదిలో పడవలున్నాయి. ఒక కాలవ, కాలవలో పిల్లలు యీదుతున్నారు. ఒకళ్ల మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు.' 


' ఎవరీ పిల్లలు ? హిందువులా, ముస్లిములా, - సిక్కులా'


'ఏమో, ఎవరో, కానివాళ్ళుమాత్రం పిల్లలు' '


' సరే, కానీ .. పంటపొలం, పండగ. ! డోలక్ వాయిద్యం విను.. ఆహాఁ. ఎంత బావుందో ! ఆహాఁ! ఏంపాట !!! ఎవరు పాడుతున్నారా పాట??


' స్త్రీలు ' 


'సరే. ఎవరా స్త్రీలు. హిందువులా, ముస్లిములా, సిక్కులా.' '


' పంజాబు స్త్రీలు. హిందువులు, ముస్లిములు - సిక్కులు' 


' ఇక ఏమీ చెప్పలేను. ఏమీ కనిపించడం లేదు. ' 


'ఊ' అని నిట్టూరాడు డాక్టరు . . యికలాభం లేదన్నట్లు.


' ఏం? ఎందుకని? ఏ మొచ్చింది ?'


“ నాతల తిరిగిపోతోంది. చీకటిగా ఉంది. ప్రపంచమంతా భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి. ' 

 

'గట్టిగా ప్రయత్నించు  . ఇప్పుడేం కనిపిస్తున్నాయి? ' 


' ఆకాశాన్నం టే మంటలు. ఇళ్లన్నీ తగలబడి పోతున్నాయి. ఏడుపు స్వరాలు వినిపిస్తున్నాయి.' 


 'సరే, గూండాలు వచ్చారన్న మాట. వీళ్ళే బంధువుల్ని చంపేశారు. వీళ్ళే నీ ఆస్తి అంతా దోచేశారు. వీళ్ళే నీ పెళ్లాం పిల్లల్ని చంపేశారు. నీ మతి పోగొట్టారు...వా ళ్ళేం చెబుతున్నారు? 


; నా కేమీ వినిపించటంలా, అంతా గోలగా ఉంది. ఒక్క మాటమాత్రం చెవులో గుద్దినట్లు వినిపిస్తోంది. ' చంపుచంపు చంపు. ' 


'వీళ్ళే నిన్ను సర్వనాశనం  చేశారు. వీళ్ల మీద నువ్వు పగతీర్చుకోవాలి. ' 


' నేను హిందువునో, ముసల్మానునో డాక్టరు తెలుసుకో బోతున్నాడు! నేను ముస్లిముని! సర్దార్ సాహెబు బంధువుల్ని చంపా. అనేకమంది హిందువుల సిక్కుల ప్రాణాలు తీసి వేశా. నేను హిందువుని!  హకీం సాహెబు కొడ కుని చంపా. ఇంకా అనేకమంది ముస్లిములను చంపా. ' 


' వద్దు. అక్కర్లేదు. నేనెవరినో నేను తెలు సుకోనక్కర్లా. నేను హిందువుగాని, ముస్లిం గాని, సిక్కు గాని అవదల్చుకోలా• మానవుడిగా మాత్రమే ఉంటా. అంతే! అంతే!!' అని అరుస్తూ డాక్టరు దగ్గరనుండి పారిపోయా! 


నేను హిందువుని. నేను ముస్లిముని

నేను ముస్లిముని'  హిందువుని' ‘


' నే నెవర్నయితే మాత్రం నాకేం పనీ? ' 


' నే నెవర్ని కాదు. నాకేం పని లేదు' “

' నేను హిందువుని . నేను ముస్లిముని'


ప్లేగు నుండి  పారిపోయినట్టు డాక్టరు దగ్గర నుండి పారిపోయా. 


కాని యీ మాటలు మాత్రం నన్ను వదలి పెట్టలా ! 

నేను ఏ వీధికుండా పరు గెత్తుతున్నా నో నాకు తెలియదు. భయంకరమైన  వ్యక్తి ఒకడు నన్ను పట్టుకు ఆపాడు. ' ఆరే సాలా ! ఎవర్రా నువ్వు? ఎక్కడికి పోతున్నావ్ ?' 


అతడొక ముస్లిం అవాలి . అతని చేతిలో కత్తి ఉంది. 

 ' నేను హిందువుని. నేను ముస్లి ..' '


' ముస్లిము' అన్నమాట పూర్తి చేయక ముందే నా వీపులో బాకు దిగిపోయింది. అదే ఈ వీపులో ఉన్న బాకు పోటు!


'కాఫిర్ కా బచ్చా' అని అంటున్నాడు. నేను పూర్తిగా పడిపోకుండా పారిపోతున్న ప్పుడు. నా వెనుక రక్తం కారుతోంది. మీరు నమ్మరు. అయితే నమ్మబోకండి. 


చచ్చిపోయే ముందు నేను నిజం మాట్లాడుతున్నా నని నాకు మీరేమీ సర్టిఫికేట్ యివ్వనక్కర్ల.......


 “నేను ముస్లిముని. నేను హిందువుని' అని అనుకుంటూ నేను పోతున్నా. 


ఈసారి 'హిందువు' అంటానికి పూర్వం నా డొక్కలో ఒక బాకు

దిగింది.


'ఇప్పుడు మీరు గ్రహించా రనుకొంటా, నాకీ రెండు గాయాలు ఎట్లా తగిలాయో! 


నన్ను హిందువులు, ముస్లిములు యిద్దరూ బాకుతో  పొడిచారు. అందుకనే మీరు నన్ను బతికించ లేదని చెప్పింది డాక్టరుగారు! 


ఇక్కడ యింత ఆదుర్దాగా చూస్తున్న మీలో ఒక్కడు కూడ  నన్ను బతికించలేడు . పగతీర్చుకొంటానికి మాత్రం నా చావును ఆధారంగా తీసుకొంటారు. ఇప్పుడు గనక నేను హిందువునని చెప్పినట్లయితే వెంటనే హిందువులు నాలుగు అమాయకముస్లిం పిల్లల ప్రాణాల్ని ఆహుతి గొంటారు. ముస్లిము నని చెబితే ముస్లిములంతా హిందూ మతాన్ని రూపుమాపేస్తారు. 


' నేను నవ్వుతున్న దెందుకంటే, యిప్పుడే తెలిసింది నే నెవరినో ? ఇంత కాలాని యిప్పుడు తెలిసింది పూర్వచరిత్రంతా! 


నా బిడ్డల  చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి . ఇద్దరు కూడ నా కళ్ల ఎదటే చంపబడ్డారు. ఆ విధంగా నా మతి చెప్పింది. ఆఁ! అవును! అంతా నా కిప్పుడు గుర్తు కొస్తోంది. మా పొలాలు, మా గ్రామం, నా స్నేహితులు, నా యిరుగు పొరుగువాళ్ళు - అంతా యిప్పుడు జ్ఞాపక మొస్తున్నారు. చచ్చి పోయేముందు..  నిజం .. అన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి .


'మీరు నేనేమి చెబుతానో అనియింకా నిరీ క్షిస్తున్నారు. కాని లాభం లేదు. నేను చెప్పను.  నేను హిందువునో, ముసల్మానునో చెప్పను.  చెప్ప దలచుకోలేదు. 


నాకు యీ రెండు -గాయాలు తగిలించిన హిందువుగాని, ముస్లింగాని నేను తన జాతివాడినని తెలుసుకోకూడదు. ఆరే పొరబాటున పొడిచానే అని పశ్చాత్తాపం పొందకూడదు. ఇదే నా పగ. వీ ళ్లిద్దరిమీదే కాదు. నాలాంటి అమాయక ప్రాణాలను బలి గొంటున్న వేలకొలది హిందువులమీద, ముస్లి ములమీద, సిక్కులమీద . 


మతోన్మాదులు పుట్టటం మూలంగా, బతకటం మూలంగా ఆత్మీయమైన నా పంజాబుకు తీరని కళంకం వచ్చింది.


' నేను హిందువునా, ముస్లిమునా ?' 


' నేను ముస్లిమునా హిందువునా?' 


ఈ ప్రశ్నే వాళ్లకు కావాల్సింది. ఈ ప్రశ్న వాళ్లను రాత్రింబగళ్లు వేధించుకు తినేది. పట్టణంలోను, పల్లెలోను, రైళ్లలోను , బస్సులోను, ట్రాములోను -ఫ్యాక్టరీలోను, ఎక్కడబడితే అక్కడ యిదే ప్రశ్న. 'వాడు హిందువా, ముస్లినూ?' 


వాళ్లకుగాని వాళ్ల పిల్లలు ఉంటే ఆ  పిల్లలకుగాని, వాళ్ల పిల్లల పిల్లలకు గాని శాంతి ఏమిటో తెలియదు. 


అంత భయంకరం, ఘోర భయంకరం నా పగ. 


ఇంకా మీకు తెలుసుకోవా లని ఉందా, నే నెందుకు నవ్వుతున్నానో?'

- రచన - వెంకటేశ్ 


(మూలం - అబ్బాస్ కథ) 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


- సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ





Wednesday, December 22, 2021

సేకరణ పాత బంగారం - కథ ఇల్లాలు రచన - వై.ఎస్. ప్రకాశరావు ( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక )

 పాత బంగారం - కథ 

ఇల్లాలు 

రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


ಆ ఆదివారం . క్రితం రోజు నే జీతాలు ముటాయి. 


అకస్మాత్తుగా పుట్టింది కోరిక . . ఎక్కడికైనా ప్రయాణం చేసిరావాలని. వెంటనే బయలు దేరాను. 


 మెయిల్ లో కాకినాడ వెళ్ళి తిరిగి సాయం కాలానికి వచ్చేదామని. 


నీటుగా కటకప్ చేసుకొని కళ్లకు గాగుల్స్ పెట్టి రిక్షాలో రాజమండ్రి టవున్ స్టేషన్ చేరాను. తీరా వెళ్లేటప్పటికి మెయిల్ గంటలేటు అని తెలుసుకొని ప్రయాణంమీద నిరాశపడ్డాను. 


తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది . . పనిలేక ప్రయాణం చేసే నాలాటి ప్రయాణీకుడు పనిపైన ప్రయాణం చేసే ఇతర ప్రయాణీకులను అవస్థ పెట్టటాని కిష్టం లేక. 


కాని ప్రయాణం చెయ్యాలని కోరుతున్న మనస్సును నిరాశ పెట్టడాని కిష్టం లేక వెనుదిరిగి వెళ్ల లేకపోయాను. 


ప్లాట్ ఫారమ్మీద కొంత సేపు తిరిగాను. కాలం గడవటం బహుకష్ట మెంది. ఇంతిలో రోడ్ మీ ద కాఫీ 'కేంటీన్' వైపు దృష్టి మరలింది. 


కేంటీన్ లోకిపోయి కాఫీ తీసుకున్నట్లయితే కొంత కాలం గడుస్తుందికదా అని బయలు దేరి వెళ్ళి 'స్పెషల్ సెక్షన్'లో పంకా క్రింద కూర్చు న్నాను. సర్వర్ కు  కాఫీకి ఆర్డర్ ఇచ్చి గాగుల్సతీసి ముఖంమీది చమటను చేతి రుమాలుతో తుడుచుకుంటుండగా ఆ బల్లకు ఎదురుగా  కూర్చున్న ఓ పెదమనిషి 'ఎక్క డకు వెళ్ళాలి, నాయనా?' అని ప్రశ్నిం చాడు. 


'కాకినాడ వెళ్ళాలి' అని సమాధాన మిచ్చాను.


ఆయన వాలకంచూస్తేనే గవర్నమెంటు ఆఫీసర్ లా కనుపిస్తు న్నాడు. తెల్లని సగం చేతుల చొక్కా, రంగువెలిసిన కాకీ ఫుల్ పేంటులో 'టకప్’ చేసి కళ్ళకు చత్వారంజోడు పెట్టాడు. ఆయన్ను చూడగానే కొంతసేపు ఆయనతో సంభాషణ చేయాలని మనస్సు పుట్టింది. '


' చదువుకుంటున్నావా?' అని మరల ప్రశ్నించాడాయన. '


' లేదు, ఉద్యోగం చేస్తున్నా' నని సమా ధానమిచ్చాను. 


సంతోషమన్నట్లుగా ఆయన ముఖసూచన చేసి మళ్ళీ ప్రశ్నించాడు. 


' ఏడిపార్టుమెంటులో పనిచేస్తున్నావు? ' 


ఆయన వేసే ప్రశ్నలధోరణిచూచి, ఇంకా వివరాలన్నీ కనుక్కుంటాడని ముందుగానే గ్రహించి, ఆయన అడగబోయే వివరాలన్నీ చెప్పేసేను. 


నామాటలు వింటూనే ఆయన ఏదో ఆలోచనలో పడ్డాడు.


'ఏమండీ అలా ఆలోచిస్తున్నారు? నేనేమైనా మీకు తెలుసా?' అని అడిగాను. 


ఆ, ఏమీలేదు, నీవు చెప్పింది వింటూంటే నాకేదో చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొస్తున్నది' అన్నా డు గొంతుక సవరించుకుంటూ. 


రైలు కింకా చాల టైమున్నది కదా - ఆయనదగ్గరనుండి తెలుసుకోవాలను కునే లోపు సర్వర్ కాఫీ తీసుకొచ్చి ఇంతలో నాముందు పెట్టాడు. 


ఆ కాఫీ ఆయన కందిస్తూ, మరో కప్పు తీసుకురమ్మని సర్వర్ తో చెప్పాను. 


' నేనిప్పుడే తీసుకున్నా, ఫరవాలే, నీవు తీసుకో! '  అన్నాడాయన. 


కాఫీ ముగించి ఇరువురం బయటకు వచ్చాం. నేను రెండు కిళ్ళీలుకొని ఒకటి ఆయనకిచ్చి రెండవది నేను వేసుకున్నా. నేరుగా స్టేషన్ కు పోయి ప్లాట్ ఫారం చివర్న  ఒక పెద్ద చెట్టు క్రింద ట్రాలీమీద కూర్చున్నాం.


'రిటైరైనారండీ? ' అని ప్రశ్నించాను, విషయ మేమిటో తెలుసుకుందామని.


"

'రేడిపార్టుమెంటులో పనిచేసి రిటైరయ్యానని  ఆయన చెప్పాడు. 


ప్రభుత్వోద్యోగంలో రిటైర్ అయ్యాడు.


' నా విషయం వింటే మీ చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొచ్చిం దన్నారు?' అన్నాను.


' అవును. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. నేను చేసిన పాపం చెప్పుకుంటే నాకూ కొంత మనస్థిమితం కలుగుతుంది. నీకూ ఒక ఉదాహరణగా ఉంటుంది, విను నాయనా! ' అన్నా డాయన. 


ఇంచుమించు ముప్పై సంవత్సరా లుండవచ్చు. ఒకరోజున ఆఫీసు పనిపైన ఒక పల్లెటూరు వెళ్ళా. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు కావస్తోంది. గ్రామమునసబు గారింటికి వెళ్ళి నా హోదా చెప్పుకుని నాకు భోజన -పానాదులు సమకూర్చుకున్నా. 


గృహస్థు నలభైయేళ్లు పైబడిన మనిషి. ఇంట్లో ఆయన భార్య, మూడునాలుగేళ్ల ఆడపిల్ల తప్ప మరెవ్వరూ లేరు. 


ఆయన భార్య పెద్ద అందగత్తె కాకపోయినా కురూపి మాత్రం కాదు. ఇరవై సంవత్సరాలు పైబడిఉండవు. ద్వితీయవివాహమనుకోవచ్చు. 


నా స్నాన మైన తరువాత  గృహస్థుతో కలిసి భోజనం ముగించాను. ఆరుబయట వసారాలో నాకు మునసబు గారికి వేర్వేరు మంచాలు వేసి ఆయన భార్య వసారా సనుసరించి మంచం మీద పిల్లను  వేసుకొని పడుకొంది. 


నాకు కావలసిన సౌకర్యా లన్నీ కూడ మునసబుగారు భార్య చేతనే ఏర్పాటు చేయించారు. ఆమెకూడా అరమరిక లేక చాల చనువుగా మసిలింది. 


ఆమె నడవడికనుచూచి నే నామెను తప్పు అర్థం చేసుకున్నాను. 


రాత్రి సరిగా పన్నెండు గంటలు దాటి  ఉంటుందేమో. నాకు మాత్రం నిద్రపట్టలేదు. ప్రక్కను గృహస్థు గాఢనిద్రలో ఉన్నాడు. 


నాకు కలిగిన భావములు నన్ను ఆమెగురించి కలవరపరిచాయి. 


నే నెటువంటి ఉద్రేకానికి గురి అవుతున్నానో నా కప్పటి పరిస్థితులలో తెలియలేదు. నెమ్మదిగా లేచి చూచాను. గృహస్థు గాఢనిద్రలో వున్నా డని నిశ్చయపర్చుకొని, నెమ్మదిగా తడబడు తున్న అడుగులతో గదిలోకి వెళ్ళాను. ఆమె పిల్లపక్కన పడుకుని గాఢం గా నిద్రపోతోంది. నేను వెళ్ళి ఒణకుతున్నా..  ఆమెను తట్టాను . 


ఆమె ఆ నిద్రలో కళ్లు తెరచిరూచి కలవరపడింది. నే నామె చేయి పట్టుకో ప్ర యత్ని చేశాను. ఆమె వొణికిపోతూ "వస్తానుంఉండ ”ని చెప్పి పిల్లతో సహా బయటకు వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టింది .


ఆ రాత్రి నేను పడ్డ అవస్థ భగవంతునికే తెలుసు. మనస్సులో ఏదోభీతి దృఢంగా నాటుకుంది. నేను చేసిన తుచ్ఛమైన పని కి నన్ను నేనే నిందించుకున్నా. 


స్త్రీ మనస్తత్వ మెరక్కుండా ప్రవర్తించి నందుకు నన్ను నేనే తిట్టిపోసుకున్నా. ఆగదిలో నే తెల్లవారేలోగా ప్రాణం విడిచేద్దామా అనిపించింది. 


కాని మళ్ళీతట్టింది. నేను చేసినపని తిన్న ఇంటి వాసాలు లెఖ్క పెట్టటం. వారింట ప్రాణం తీసుకోటం మర్యాదస్తుడైన గృహస్థుకు ప్రాణాపాయం తెచ్చి పెట్టడమే కాక, వారి వంశమర్యాదను భంగపర్చటమని  భావించి వెనుదీశాను. 


గ్రామస్థుల ఎదుట నన్ను నిలదీయగలరని దృఢంగానమ్మాను.  దానితో శరీరం కంపించింది. 


తెల్లవారేలోగా ఇంచు మించు ఇరవై ముప్ఫై సార్లు తలుపులాగి చూచాను, కాని రాలేదు. దానితో మరింత భయపడ్డాను. 


తెల్లవారింది.  వారింట్లో కోడి ఎలుగెత్తి ‘కొక్కురోకో' అని చూసింది. 


అదిరిపడి మళ్ళీ వెళ్ళి తలుపులాగి చూచాను. తలుపు గొళ్లెం  తీసివుంది. 


మునసబు గారు మంచంమీది ఇంకా నిద్రపోతున్నారు. 


ఇలాలు దొడ్లో ఏ దో ఇంటిపని చేసు కుంటోంది. 


నేను గాభరాపడుతూ  సామాన్లు సర్దుకొని  అక్కడ ఉండడానికి ఇష్టం లేక వెంటనే బయలు దేరాను. 


అది గమనించి ఇల్లాలు వెంటనే భర్తను లేపింది. ఆయన లేవటంతో నాకు మరింత గాభరా ఎక్కు వైంది. 


ఆయన మరో గదిలోనికి వెళ్ళి బట్టల సవరించువచ్చి 'ఏమండీ అంత కంగారు పఉతారెందుకు? తాపీగా స్నానంచేసి కాఫీ వెళ్ళండి. అది గృహస్థధర్మం. అన్నాడు . కాని ప్రేమపూర్వకంగా  ఆయన అన్న ఆమాటలతో నాకు  శరీరం దహించుకు పోతున్నట్లయింది. 


ఎట్లాగో ముళ్ళమీద నుంచున్నట్లు వారికోరికను మన్నించి తరువాత వెళ్తూ ' వెళ్ళొస్తాను చెల్లెమ్మా' అన్నాను. 


' వెళ్లి రాండి అన్నయ్య గారూ! ' అందిఇల్లాలు. నాకామాట బల్లెంతో పొడిచినట్లయింది.


వెళ్ళి వెంటనే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనిపించింది. 


స్త్రీ మనస్తత్వం నీకు తెలియంది కాదు, నాయనా. సంవత్సరాలనుండి ఈ విషయం జ్ఞాపకమొచ్చినప్పుడల్లా నేను చేసినతప్పు   ఎవరికి  చెప్పి పశ్చాత్తాపం పొంది దాని ద్వారా కొంత మనఃస్తిమితం కలుగ చేసుకుంటున్నాను'  అని ఆయన కథ ముగించాడు. 


అప్పట్లో ఆయన ముఖం చూస్తే నాకే జాలి వేసింది. 


ఓ విధంగా ఓదార్చకపోతే బాగుండదని మొదలు పెట్టా.

' తప్పు మానవుడు చెయ్యకపోతే పశువు  చేస్తుందిటండీ? చేసిందానికి మీరు పశ్చా త్తాపం చెప్పుకోనే చెప్పుకుంటున్నారు. చేసిన తప్పు ఈ రోజుల్లో ఎవరు చెప్పు కుంటారండీ? మీరు చేసినపాపం చెప్పు కున్నందువల్ల అప్పుడే పోయింది. ' అని సముదాయించేప్పటికి ఆయనముఖంలో కొంత వికాసం కన్పించింది. . ' 


' నాయనా!  యువకుడవు. నాకథ జ్ఞాపకముంచుకోవడం  నీకు మంచిది  నాయనా.; . అని తలవంచుకుని మౌనంగా కూర్చున్నాడు. 


నేను ఆలోచనలో పడ్డాను, ఆయన చెప్పిన సంఘటనలో ఆయన పడ్డ అవస్థకన్న ఆ ఇల్లాలి తెలివి తేటలు, సహనం ఆలోచనలు ప్రథమ స్థానం  పొందాయి. ఎంతో  నేర్పరితనంగా తన మానం  రక్షించుకొని అతిథిని అగౌరవపర్చ కుండా పంపింది! 


ఆడవాళ్ళందరూ అంత తెలివిగా ఉంటే ప్రపంచ మే బాగుపడి పోను- అనిపించింది.


రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...