పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే.. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు 'యస్య జ్ఞాన
దయాసింధో'
అని గురువుగారు ప్రార్థన మొదలుపెట్టగానే 'గొడదాటితే అదే సందో' అంటూ గోడ దూకి పారిపోయేవారుట. సరదాగా
అనుకునేందుకేగానీ ఈ 'అమరకోశం'
ప్రథమ కాండం స్వర్గవర్గంలోని మొదటి
ప్రార్థనా శ్లోకానికి సంస్కృత వాఙ్మయంలో చాల కథే ఉంది.
'యస్యజ్ఞాన దయా సింధోరగాధస్యా నఘా గుణాః।
సేవ్యతా మక్షయో ధీరాసశ్రియైచా మృతాయ॥'
ఇదీ శ్లోకం పూర్తి పాఠం.
'ఓ! విద్వాంసులారా జ్ఞానానికి, దయకు ఆశ్రయభూతుడు, గంభీరుడు దేవుడు. ఆయన గుణాలు, రాగాది దోషాలు లేని నాశనరహితుడు. ఆ దేవుణ్ణి సంపద, మోక్షాల
కోసం సేవించాలి!’ ఇది పరమాత్మ పరమైన అర్థం.
దోషరహితమైన రత్నాలకు ఆలవాలమైన అగాధం సముద్రం. విష్ణువుకు నివాసం.
లక్ష్మి(సంపద) కోసం,
అమృతం(చిరాయువు) కోసం సముద్రుణ్ణి సేవించాలి' అని మరో అర్థం చెప్పుకోవచ్చు.
బౌద్ధ విశ్వాసి
అమరకోశ కర్త
అమరసింహుడు. హిందూవిశ్వాసుల ఇష్టదేవతలను సేవించమని
మంగళాచరణ శ్లోకం ఎందుకు పఠిస్తాడు? అనే సందేహం సహజంగానే వస్తుంది. అమరకోశానికి వ్యాఖ్యానం రాసిన క్షీరస్వామి తన 'అమరకోశోద్ఘాటనవ్యాఖ్య'లో ఇదే శ్లోకానికి బుద్ధ పరమైన వ్యాఖ్యానం అందిస్తూ.. పై సందేహానికి సమాధానం ఇచ్చాడు. 'గ్రంథారంభేZభీప్సిత సిద్ధి హేతుం జిన మనుస్మృత్య ఇత్యాది వాక్యాణి’ అన్నాడు. బౌద్ధమంటే గిట్టని హిందూవిశ్వాసులు తన గ్రంథాన్ని
దూరం పెట్టకూడదన్న ఆశతో హింధువుల ఇష్టదేవతలను ప్రార్థించాడు- అని ఆయన జవాబు. (సర్వానంద విరచిత ‘టీకాసర్వస్వవ్యాఖ్య’ వివరణలో కూడా 'బౌద్ధదర్శన
విద్వేషిణి ఇహ ప్రవృత్తి ర్న స్యా దతో-త్ర
బుద్ధపదోపాదానం కృతం కవినా'
అన్న సమర్ధన కనపడుతుంది). అమరసింహుడికి
హిందూమతంతో ఏ సంబంధం లేదంటే నమ్మబుద్ధికాదు నిజానికి. అమరకోశంలో ఆయన వివరించిన పదాలన్నీ ఒక
నిష్ణాతుడైన హిందూపండితుడి అవగాహనకు సైతం అందనంత ఉన్నతంగా ఉండడమే అందుకు కారణం.
తనతో వాదంలో ఓడిన నిస్పృహలో అమరసింహుడు స్వీయవిరచిత గ్రంథాలన్నీ పరశురామప్రీతి
చేస్తున్నట్లు విని శంకరుడు ఆ ప్రయత్నం విరమింపచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది.
అగ్నికి ఆహుతి కాకుండా మిగిలిన ఈ ఓక్క అమరకోశం ప్రాశస్త్యాన్ని భగవత్పాదులే ‘అమరకోశం చాలా గొప్ప గ్రంథం. హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పేర్ల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా
శృతి ప్రతిపాదించింది. స్మృతులు, పురాణాలు తీరులోనే తాత్త్విక అంశాల
నామధేయాలను, విషయాలను,
వాటి అర్థాలను
అమరకోశం ప్రతిపాదించింది' అని శ్లాఘించినట్లు ఒక కథ.
షోలాపూర్ దాస్ రావ్ జీ సఖారామ్ దోనీ తన
అమరకోశం పీఠికలో అమరసింహుడు జినుడని చాలా
ఉదాహరణలతో నిరూపించే ప్రయత్నం చేసాడు. లేఖక ప్రమాదాల
వల్ల సుమారు వంద శ్లోకాలు కనిపించడం లేదని.. అందులో 'యస్య జ్ఞాన..'
శ్లోకానికి ముందు మరో రెండు శ్లోకాలున్నాయని వాటిని బహిరంగపరిచాడు.
'జినస్య లోకత్రయవందితస్య ప్రక్షాళయేత్ పాదసరోజయుగ్మం।
నఖప్రభాదివ్యసరిత్ప్రవాహైః సంసారపంకం మయి గాఢలగ్నమ్॥(1)
'నమః శ్రీశక్తినాథాయ కర్మారాతివినాశినే।
పంచమ శ్చక్రిణాం యస్తు కామస్తస్మై జినేశినే॥' (2).. ఇవీ ఆ రెండు విస్మృత శ్లోకాలు.
లింగయసూరి 'యస్య జ్ఞాన ..
' శ్లోకానికి దైవపరంగా వ్యాఖ్యానం చేస్తే.. మల్లినాథుదు 'సశైవానాం శివః వైష్ణవానాం విష్ణుః జైనానాం జినః బౌద్ధానాం బుద్ధ:’ అంటూ సాధారీకరణం చేసి అందరి సమస్యలు ఒక్క దెబ్బతో తీర్చేసాడు.
ఏదేమైనా
'అమరం నెమరేస్తే కావ్యాలెందుకు కాలరాయనా?'
అష్టాధ్యాయీ జగన్మాతా అమరకోశో జగత్పితా '
'అమరం చదవనివానికి నే నమరను' అని సరస్వతీదేవి పరంగా
వినిపించే ప్రచారమూ అమరకోశానికి ఉండే ప్రాముఖ్యం తెలియచేస్తుంది. అమరకోశం మిగతా కోశాలన్నింటికీ మార్గదర్శకంగా మిగిలింది. మరీ కావ్యాలు రాయడానికని కాదు కానీ.. హిందూ సంస్కృతి పారిభాషికా పదాలతొ పరిచయం పెంచుకుంటే సంస్కృతమే కాదు.. తెలుగు పదసంపద మీదా మరింత పట్టు పెరుగుతుందన్న మాట అతిశయోక్తి కాదు.
కాబట్టి కవి కావాలనుకున్న యువకులు మరీ గతంలోలాగా బట్టీయం వేయకపోయినా ఒకటికి పదిసార్లు ఆ అమరకోశం పుటలు తిరగేస్తే పోయేదేమీ ఉండదు.. అజ్ఞానం తప్ప!
-కర్లపాలెం హనుమంతరావు
25 -05 -2018
-
No comments:
Post a Comment