Friday, December 15, 2017

‘కాఫీ’రాగాలు- (ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి సుత్తి.. మెత్తంగా- కాలమ్ లో ప్రచురితం
దేవతలూ రాక్షసులూ  పాలసముద్రాన్ని తెగ మధించేసారు. ముందుగా కాలకూటం.. ఆనక పీయూషం. రాక్షసులకు కాలకూటం దక్కితే.. లక్కీ దేవతలు అమృతం లంకించుకుంటిరి. ఏమీ దొరకని మన మనుషులమే మన్ను తిన్న పాముల్లా ఓ మూల పడుంటిమి.  బ్రహ్మయ్యకే పాపం.. పాపం అనిపించింది. అందుకే కాలకూటం లోంచి 'కా'.. పీయూషం లోంచి పీ.. బైటికి పీకి కాపీ అనే కొత్త కాక్ టైల్ సృష్టించేసి మన వంతుకని ప్రసాదించింది. ఆ  కాఫీతోనే మనకిప్పుడు ఇన్ని గంతులు!
అందుకే విషంలోని మాదకశక్తి..  అమృతంలో ఉండే అద్భుతమైన  రుచి.. రెండూ కాఫీలో ఉంటాయి కదా! అమృతం హంబక్కేమో కానీ.. కాఫీ కిక్కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్  రియాల్టీ! కోక్ నుంచి కొబ్బరి బోండాం దాకా ఎన్ని డ్రింకులు అందుబాటులో ఉంటేనేమి.. కాఫీకుండే ఆ కిక్కే వేరు స్వామీ! ఫిల్టర్ కాఫీ  స్పేసును ఫిల్లప్  చేసే  హాట్  డ్రింకు మనకింకెన్ని  జన్మలెత్తినా దొరకడం కల్ల.. నో డౌట్! రామనవమి బెల్లప్పానకం, ముక్కు దిబ్బడకని వాడే మిరియాల కషాయం, పడ్డ పడ్డప్పుడు మాత్రమే దొరికే గేదె జున్నుపాలు.. ఇవి మినహా మనకి మరేమీ తెలియని   అమాయాకపు రోజుల్లో  కాఫీలు  మప్పే  తెల్లోడు మనల్ని పర్మినెంటుగా సర్వెంట్సు  చేసుకున్నది! కాఫీనా? మజాకానా?  
ఒకానొక్కప్పుడు ఓ కప్పుడు కాఫీ దిలాసాగా ఆరుబయలు కుర్చీల్లో చేరగిలిబడి తీరిగ్గా  తాగే అదృష్టం ఒక్క  తెల్లదొరలకు మాత్రమే సొంతం! ఇప్పుడో? 'కుదిరితే కప్పు కాఫీ.. నాలుగు కబుర్లు' ఈ కాలం కుర్రకారుకి.  కాటికెళ్లే ముసలి డొక్కులక్కూడా చివరి కోరిక చికోరి తగు పాళ్లలో కలిపి మరిగించిన కమ్మని కాఫీ ఓ లోటా నిండుగా లాగించి హరీమనాలని!  ఎంత కాఫిర్ కైనా కాఫీ దగ్గర కాసుల్లెక్క ఉండకూడదు! 'కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా?' అంటూ వెంటబడి మరీ చంపుకు తింటుంటారు  ఆడపెళ్లివారు పెళ్లిళ్ళలో. అమ్మాయి తండ్రేమన్నా అమీర్ బాబనా? అదో మర్యాద.. కాఫీకి దక్కే గొప్ప గౌరవం!
టర్కీలో పిల్ల చేసిన కాఫీ కమ్మంగా ఉంటేనే పిల్లడు పెళ్లికి  సై. కాఫీ రుచిలో కాస్తింత తేడా వచ్చినా ఆనక పెళ్లాం కాపురానికి  నీళ్లొదులుకోవాల్సిందే! పాడు కాఫీ! ఎన్ని కాపురాలలా కుల్చేస్తోందో ఇక్కడా టర్కీలోలా! అయినా కాఫీకున్న గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు!
కాఫీ అయ్యర్లకు వరల్డువైడుగా పేరొచ్చిందీ ఫిల్టరు కాఫీ వల్లనే సుమా! 'అయ్యరూ! నీవు లేనట్టి తావు-కలదె పరికింప నెందు భూవలయమందు!' అంటూ స్త్రోత్రమాలలందించాడో  కాఫీగత బ్యాచిలరు కవి జీవుడు. 
కాఫీ కాయడం క్రికెట్టాటల్లో బెట్టింగు కాయడమంత సులభం కాదు. పొడి వేసిం తరువాత పాలు పొయ్యాలో..   పాలు  మరిగిం తరువాత పొడి వెయ్యాలో గూగుల్లో చూస్తే గానీ  పాలు పోని జ్ఞాని ప్రతి కొంపకీ కంపల్సరీగా ఒకరుంటారు.  డికాషనుకు ఎంత   ప్రికాషను అవసరమో, పంచదార ఎంత పాళ్లలో పడితే చెక్కర రోగం ముదర పెట్టదో.. అబ్బో., కాఫీ మేకింగుల మీద ‘క్లాసులు పీకింగే’ వృత్తిగా పెట్టుకొని కింగులూ క్వీజులూ అవుతున్న వాళ్లు ఆన్లైన్లలో ఇప్పుడు బోలెడు మంది!     
మా ముసిల్ది మరీ రెచ్చి పోతోంది. కాఫీ కోటా డబుల్ చేసింది. తాను గుండ్రాయిలా తిరుగుతూనే ఉన్నా ఆ పాలూ, పంచదారా, కాఫీ పౌడర్ గట్రా జి ఎస్ టి టాక్సుతో సహా పెరిగిన ధరలకు కొని తట్టుకోలేక పాపం మా డాడీనే తల పట్టుక్కూర్చుంటున్నాడు. అన్నట్లు  తలపోటుక్కూడా డబుల్ స్ట్రాంగు బ్లాక్ కాఫీని మించిన మంచి టానిక్  లేదంటున్నారు డాక్టర్లు! మూలక్కూర్చుని మూలిగే  ముసలాళ్ళ మురిపాలే కాఫీల మిదింతలా పెరిగి పోతుంటే ..  పని పాటలు చేసుకుంటూ బతకి చావాల్సిన  సంసారులం.. ఇహ మన కాఫీ బడ్జెటు కథ స్పెషల్గా  చెప్పేదేవుంది?
 కాఫీల మీద శాస్త్రవేత్తలు కూడా అస్తమానం ఏవో దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తుంటారు. ఒక ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకుడు   కాఫీ తాగితే కేన్సర్ దూరమవుతుందంటాడా? ఆ మర్నాడే.. మరో చికాగో విశ్వవిద్యాలయ బృందం చికోరీ లేని కాఫీ మాత్రమే సేఫని స్టేట్మెంటిచ్చేస్తుంది. అన్ లిమిటెడ్  కాఫీ డ్రింకింగ్   యుట్రిసు మీద స్ట్రెస్సని ఊటా యూనివర్శిటీ వాక్రుచ్చితే.. అదేం లేదు.. పుట్టబోయే కిడ్ ‘విజార్డ్’ అవాలంటే కెఫిన్ కాన్స్టంట్రేడెడ్ కాఫీ కనీసం రోజుకో పది సార్లైనా గొంతులో దిగాల'ని గుయానా యూనివర్శిటీ గగ్గోలు పెదుతుంది.  మగాళ్లకి మెదడులో కణితలు పెరిగి అనుకోని ప్రాణాపాయం జరిగే అవకాశం గత శతాబ్దం కన్నా  అరవై  శాతం అధికమయిందని  అదేందో అర్థం కాని టెర్మినాలజీలో  కాఫీ డ్రింకింగ్ పెరిల్సుని గురించో జర్మనీ విశ్వవిధ్యాలయం బెదిరిస్తే.. తాజా పరిశోధనల్లో- తాజాగా తయారైన కాఫీ తాక్కుండా ముక్కుతో పీల్చినా చాలు మెదడులోని అసిటోన్ ఎంజైమ్స్ ఉద్దీపనం చెంది ఆ రోజంతా ఫీల్ గుడ్ మూడ్ మెయింటైన్ చేసేయచ్చని మన దగ్గరే ఓ హెర్బల్ పరిశోధక సంస్థ  అభయహస్తం ఇచ్చేస్తోంది.    ఆ అర్థం కాని పాడు లెక్కలు అవీ పట్టించుక్కూర్చుంటే ఆ తాగే గుక్కెడు కాఫీ కూడా కాలకూట విషమై రేపు పోయే ప్రాణం ఇవాళే హరీ అనడం ఖాయం. 
ఏడో శతాబ్దం నాటి మత్తు గింజలు ఈ  ఏడు కాఫీ గింజలు! ఎంతలా విశ్వరూపం దాల్చి  ఏడిపిస్తోందీ పాడు లోకాన్ని! ఎక్కడి  ఇథియోపియా.. ఎక్కడి మేరా మహాన్ ఇండియా?  
 ఇస్లామిక్ గావా వైన్- ఈ డెవిల్స్ డ్రింక్!  ఇవాళ అదే  ఇండియా గుడ్ విల్ డ్రింక్! నిషేధించాలనుకున్న క్రైస్తవమే కాఫీ  రుచికి దాసోహమంది! మక్కా యాత్రకని పోయిన బాబూ బుడాన్ సూఫీ  వట్టి చేతుల్తో రావడ మెందుకని ఏ సుమూహూర్తాన ఆ ఏడు గింజలు గిల్లుకొచ్చాడో గానీ.. దాందుంప తెగ.. కన్నడ దత్తాత్రేయ కొండల గాలి తగిలి  నూటేడు  దేశాల నుంచి  ఇప్పుడ అదే మనకు ప్రధాన ఆదాయ వనరైంది!  యూరోపు ‘గుడ్ మార్నింగ్'  మన అరకులోయ  కాఫీతోనే!  ఇండోనేసియా పిల్లి తిని ఆరగించుకొనే  పళ్ళు ఈ కాఫీ గింజలు. ‘చరిత్ర మనకెందుకయ్యా? రుచి ముఖ్యం గానీ!’ అంటూ చిరాకు పడి పోవద్దు. ఓ కప్పు కాఫీ తెప్పించుకోండన్నా! అప్పుడే  చెత్త వాగినా చప్పట్లు కొట్టాలనే అనిపిస్తుంది. దటీజ్  కాఫీస్ మ్యాజిక్!
'జొన్న అన్నమే ఆహారం.. జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని  వాపోయాడొకప్పుడు పాపం.. ఆ తిండిపోతు శ్రీనాథుడు. ఇప్పుడతగాడే కనక బతికుండుంటే? 
దేశభక్తి కవిత్వానికి పాలుమాలిన కవులు సైతం పాలు మరగ్గాచిన  కాఫీ ద్రావకం మీద దండకాలు రాయకుండా ఉండలేక పోయారు. అభినవ సరస్వతి పత్రికలో గౌరావఝ్ఝల సీతారామయ్యగారు 'కాఫీతీర్థంతో సమానమైన తీర్థం మరోటి లేనే లేదు పొమ్మం' అంటూ తేల్చేసారు. డెబ్బై ఏళ్ల కిందటే  గృహలక్ష్మిలో పేరు తెలీని తెలివైన కవి ఒకాయన 'అమ్మవార వౌచు నిఖిల జనంబుల/ గృహములందు దాపురించినావు/ నిను భరింపలేము నిను ద్రోయగా లేము' అంటూ  దండకాలు అందుకున్నాడు. 
లీటరు  రేటు వింటుంటే పాలకు బదులుగా వాటరు వాడటం  బెటరు అనిపిస్తోందిప్పుడు. కాఫీ పౌడరు ధర వింటుంటే కాఫీ తాగక ముందే బి. పి పెరిగి పోతోంది. చిటికెడు చక్కర ఇంత గుక్కెడు  నీళ్లల్లో కలుపుకు తాగుదామని ఉన్నా..  ఆ చికోరి రుచి  వలలో చిక్కుకున్న దౌర్భాగ్యానికి కాఫీ చుక్క గొంతులో దిగక పోతే పక్క కూడా దిగ బుధ్ధి కావడం లేదు!   
 తాపీ ధర్మారావుగారోసారి కాఫీపై దండకం చెప్పమంటే పోకూరి కాశీపతిగారు ఆశువుగా  కాఫీ జగన్మోహిని జన్మవృత్తాంతం గూర్చి గురజాడ గిరీశాన్ని మించిన థియరీ కూర్చి వినిపించేసారు. తొల్లి శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాతాన్ని తెచ్చి సత్యభామకు ఇచ్చే సందర్భంలో  దారిలో దాని గింజ నేల మీద రాలి  కాఫీ చెట్టుగా మొలిచిందంట! 
'అనుదినమ్మును కాఫియే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు' అంటూ లేటెస్టుగా కాఫీ టేస్టును గూర్చి మిథునం  చిత్రం కూడా  జై కొట్టింది.
 ‘కాఫీశ్వరీ! నెస్సుకేఫేశ్వరీ! బ్రూకుబాండేశ్వరీ! గంట గంటా ప్రతీ యింటా ఉప్పొంగవే ఉష్ణ పానీశ్వరీ!’ అంటూ ప్రాథేయ పడ్డం తప్పనిసరి. మరేం చేస్తాం? మనిషిగా పుట్టేం కదా.. గిట్టే దాకా కాఫీలు తాగడం కంపల్సరీ! 

-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి  సుత్తి.. మెత్తంగా-  కాలమ్ లో ప్రచురితం)


Wednesday, December 13, 2017

చలంగారి అట్లపిండి ఘుమఘుమలు- హాస్య కథ


గుడిపాటి వెంకట చలం అనంగానే మనందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఆ మహానుభావుడి మైదానం. ఊర్వశి లాంటి గొప్ప సంచలన నవలలు.  దైహిక, మానసిక  స్వాత్రంత్ర్యం కోసం స్త్రీ  పడే ఆరాటం మీద  తెలుగులో ధైర్యంగా, బహిరంగంగా అచ్చుకెక్కిన ఘనత గుడిపాటివారిదే. చలం అనువదించిన ఠాగోర్ 'గీతాంజలి' అందుకు విరుద్ధంగా  విశిష్టంగా ఉంటుది. చలం మీద ఒక ప్రతికూల అభిప్రాయాన్ని స్థిరపరుచుకొన్న కుహనా సామాజిక వాదులు సైతం విస్తుపోయే విధంగా సాగిన స్వతంత్ర అనువాద రచన గీతాంజలి.  స్వఛ్చమైన హృదయాన్ని కంటిక్కనిపించని విశ్వమూర్తికి అత్యంత పవిత్రంగా సంపూర్ణంగా సమర్పణ కావించుకోవాలని చలం పడే ఆరాటం ప్రతీ శబ్దంలోనూ ప్రతిధ్వనిస్తుంది. అంతటి గహ్యమైన ఇంట్రోవర్ట్ పేరున సాహితి మాస పత్రికలో కనిపించిన ఈ 'అట్లపిండి' గల్పిక నన్ను ఆశ్చర్యంలో ముచెత్తేసింది. 'అట్లపిండి' ఒక హాస్య గల్పిక. ఆ ప్రక్రియలోనూ చలం(?) ఎక్కడా  ఫెయిలవలేదు. నవ్వించే రచనలు చేస్తామని చంకలు గుద్దుకొంటూ రకరకాల బిరుదులతో చక్రాంకితాలు ముద్రించుకు తిరిగే హాస్యరచయితలంతా ఒకసారి చదివి తరించవలసిన అతి చక్కని చిక్కని రచన. అందుకే ఇక్కడ పి.డి. ఎఫ్ రూపంలో ఇస్తున్నది, చదివి బద్ధకించకండా స్పందించ గలిగితే  చలం హాస్యచతురతకూ ఓ చక్కని నివాళి అర్పించినట్లవుతుంది
-కర్లపాలెం హనుమంతరావు

14-12-2017

https://drive.google.com/file/d/1O_4_dGxhtf2XlhuzbcKJZw4A_HnKfYHN/view?usp=sharing

Tuesday, December 12, 2017

తెలుగులో తమాషా పద్యాలు- (ఆంధ్రప్రభ దినపత్రిక- 13, డిసెంబర్, 2017 న ప్రచురితం)
పంచదార పద్యం
వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట నివాసులైన శ్రీమాన్ సుందర రాఘవాచార్యులవారు సహజ చమత్కార కవితాసమర్థులు. 1965 ప్రాంతంలో వారి కుమారుడి వివాహ సందర్భంగా పంచదార ఎక్కువ మోతాదులో అవసర పడింది. అప్పుడు కరువు మూలకంగా పంచదారకు కోఠా విధానం అమలులో ఉండేది. ఏదేని సందర్భాలలో అధిక మోతాదులో కావలసి వస్తే అర్జీ చేసుకున్న మీదట తహశీల్దారుగారు మంజూరు చేసుకొనే వెసులుబాటూ ఉండేది. ఆచార్యులవారు ఆ కారణంగా దొరగారికి రాసుకున్న విజ్ఞాపన పద్య రూపంలో సాగింది. పంచదార కోసం చేసుకొన్న ఆ దరఖాస్తులోని ఒక పద్యం:
శ్రీయుత తహశీల్దారూ
చేయు మనవి సుతుని పెండ్లి చేయుట కొరకై
సాయము కావలె నాకును
ఈయవలె పంచదార ఇరువది సేరుల్
అధికారి ఆచార్యులవారి పద్యానికి ముగ్ధులై  మరో ఐదు సేరులు అధికంగా మంజూరు చేసినట్లు ఓ కథనం.
***


భాస్కర శతకానికి నకలు శతకంః

ప్రతి పద్యంలోనూ ఉదాహరణల సహితంగా ప్రతిపాదనలు ఉండటం భాస్కర శతకం ప్రత్యేకత. దీనినే 'ఉదాహరణ' ప్రక్రియగా గుర్తించారు సాహిత్యంలో.
ఉదాహరణకు,
ఊరక వచ్చు బాటు పడకుండిన నైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ ; బ్రయాసము నొందిన దేవదానవుల్
వార లటుండగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెగాదె శృం
గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభ రత్నము రెండు
భాస్కరా!
ఏ పాటూ పడకుండానే  అన్నీ కలిసొస్తుంటాయి కొంతమందికి. అందుకు కారణం అదృష్టం. అది లేనప్పుడు ఎన్ని తిప్పలు పడినప్పటికీ ఫలితం సున్నా, నానాబాధలు పడి దేవతలు, రాక్షసులు  పాల సముద్రాన్ని మధిస్తే, మధ్యలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకు ఏ శ్రమ లేకుండానే అందాలరాశి మహాలక్ష్మి, అదనంగా కౌస్తుభమణి లభించాయి కదా!'- అని ఈ పద్యానికి అర్థం.
కవి ఆనుపానులు ఇతమిత్థంగా తేలక పోయినా దృష్టాంత ప్రక్రియ పరంగా సుమారు 500 ఏళ్ల పై బట్టి తెలుగువారి నోట పలుకుతున్న భాస్కర శతకంలోనిది ఈ పద్యం, పద్యాలలో కవి చూపించే ఉదాహరణలు రామాయణ, భారత, భాగవతాల వంటి  పసిద్ధ కావ్యాల నుంచి ఉదహరించినవి కాబట్టి చదువరుల మనసుల్లో అవి సూటిగా నాటుకొనేవి. అయినా  కంసాలిపల్లి ప్రౌఢకవి కంసాల సుబ్బకవిగారికి ఎందుకో భాస్కర శతకంలోని దృష్టాంతాల అన్వయం అంత  సవ్యంగా లేదనిపించింది! అంతకన్నా దివ్యమైన ఉదాహరణలతో అదే శతకాన్ని ఆసాంతం తిరగ రాసేసాడా చిఱుమఱ్ఱి నరసింహకవిగారి  శిష్యపరమాణువు. గురువుగారి చేత 'సుత్తెపోటు' కవిగా ప్రశంసలు అందుకున్న సుబ్బకవిగారు  భాసర శతకంలోని పై పద్యానికి సృష్టించిన నకలు  పద్యం: చిత్తగింజండి!
'ఊరక వచ్చు బాటు పడకుండిన నైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ ; బ్రయాసమునంద బనెమి కానలో
గోరని ఋష్యశృంగుని దగుల్కొని కాంత లయోధ్య జేర్ప నీ
రేరుహగంధి శాంత నియరే! యెసలారగ నాడు భాస్కరా!
ఆడగాలంటేనే ఎరగని ఋష్యశృంగుణ్ని ఎంతో శ్రమించి  అయోధ్యకు చేర్చిన భామినులెవరికీ అతగాడి సంపర్క సుఖం అదృష్టం లేక దక్కలేదు. ఆ అదృష్టం పుష్కలంగా ఉంది కాబట్టే శాంతకు అతగాడితో దాంపత్య  సౌభాగ్యం దక్కింద'ని కవిగారి తీర్మానం. సుబ్బకవిగారు 'సుత్తెపోటు' కవిగారు అవునో.. కాదో ఎవరికి వారుగా తేల్చుకొవాలి మరి!
***చేతికర్ర మీద విరహం
ఒకానొకప్పుడు పెద్దమనిషి వేషధారణ సాధారణ జనుల కన్నా విభిన్నంగా ఉండేది. చేతిలో కర్ర, కిర్రు చెప్పులు, భుజం మీద పట్టు అంచు కండువా.. చూడగానే పదిమందిలోనైనా ప్రత్యేకంగా కనిపించాలని ఈ ఆహార్యం. దురదృష్టం కొద్దీ.. శ్రీ పెరంబుదురు రాఘవాచార్యులు అనే పండితులవారు  చేతికర్రను ఎక్కడో పోగొట్టుకొన్నారు. ఆ బెత్తం విరహం భరించలేక  కవులు కాబట్టి ఓ పెద్ద ఖండకావ్యమే గిలికేసారా కవి పండితుడు. ఆ ఖండకావ్యంలోని ఆరంభం ఇలా సాగుతుందిః

'సమర గర్వోద్దిష్ట శాత్రవదోర్దండ-కండూతి బోవ జక్కాడినావు

గహన సంబంధ భీకర జంతు సంహార-కారణంబయి కీర్తి గాంచినావు

కౌలేయవర్గ దుష్కరవృత్తి దూలించి-జీవముల్ నిలిపి రక్షించినావు

మార్గమధ్వాన్వీత మహిత కంటకజాల-మును జిమ్మి పాదముల్ బ్రోచినావు

నిరత మద్దేహ రక్షణోన్నిద్ర భద్ర-మూర్తివని నమ్మి, పరులచే ముట్టనీయ
నైతి నను వీడి బోవ నీకతి ముదంబె బెత్తమా! కాదు పోవ నీకుత్తమంబు
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- 13, డిసెంబర్, 2017 న ప్రచురితం)


***

Friday, December 8, 2017

'తప్పు’డు మనుషులు- ఆంధ్రప్రభ దినపత్రికలోని సరదా వ్యాసంఅదృష్టం బాగుండి మనం మనుషులుగా పుట్టేసాం. ఏ దున్నపోతుగానో జన్మెత్తుంటే జీవితాంతం గడ్దీ గాదం కోసం మాత్రమే అల్లాడాల్సొచ్చేది. థేంక్ గాడ్! గాడిదగా పుట్టించలేదు మమ్మల్ని. బడిబిడ్డల  స్కూలు బ్యాగుల్ని మించిన మైల బట్టలు మోసీ మోసీ నాలుక్కాళ్ళు చచ్చుబడుండేవి. ఏ కుక్కగానో పుట్టించినా గతంలో  కొంత బెటరేమో గానీ.. ప్రెజెంట్లీ నాట్ ప్లెజెంట్ డేస్! రోజులు బా లేవు. బడా నేతల ట్విట్టరు ఎకౌంట్లు కొత్తగా నెత్తికి చుట్టుకుంటున్నయ్! కాకులుగా పుట్టినా ఓకే నే! సర్కారీ నౌఖరీల్లో దూరి  ఏ  కాకిలెక్కల్తోనో కాలక్షేపం చేసేయచ్చు కానీ  పద్దాకా లెక్కలడిగి పీడిచ్చేస్తున్నాయ్ ఈ మధ్య ప్రభుత్వాలన్నీ. మా చెడ్డ చిక్కులొచ్చి పడుతున్నయ్ వీటి చాదస్తంతో! ఆ గండం నుండి గట్టిక్కించావ్ దేవుడా! గండర గండడు మనిషి. వాడి జాతిలో పుట్టించేసావ్! ఇహ ఇప్పుడెన్ని తప్పులు చేసినా బదులు చెప్పే ఇబ్బందే లేదు. ధన్యవాదాలయ్యా దయమయా.. కోడి మాదిరిగా పుట్టించనందుక్కూడా!  తెల్లారగట్టే పర్ఫెక్టుగా లేచి కూసి కూసి చచ్చే పని తప్పించావు నాయనా! కొంగలా పుట్టిస్తావేమోనని బెంగ పడి చచ్చాను! ఇంత బుల్లి చేప్పిల్ల నోట పడాలన్నా తెల్లార్లూ ఒంటి కాలు మీద  దొంగ జపాలు చెయ్యాలయ్యా చన్నీళ్ళల్లో! ఆ పాట్లన్నీ తప్పించినందుకు వేన  వేన దండాలయ్యా ఆపద్భాంధవా! తోకల్లేక పోతేనేమిలే? తప్పులు చేయడమే ఓ గొప్ప హక్కుగా  భావించే మానవ జాతిలోకి మమ్మల్ని తోసి  తిప్పలు తప్పించావుగా తండ్రీ.. మెనీ మెనీ  థేంక్స్ దయామయా!
ఏ తప్పూ చేయడం రాని చవట జాతులు సృష్టిలో సవాలక్ష ఉన్నాయి. గద్ద గురి తప్పకుండా గంప కిందున్న కోడి పెట్టను  కొట్టుకు పోగలదు. ఎట్లాంటి అంట్లవెధవ అడిగినా పొలమారకుండా చిలక  పర్ఫెక్టుగా జోస్యం కార్డు బైటికి తీసేయగలదు.  ఎంత్తెత్తు నుంచైనా  దూకించు.. పిల్లి ముంగాళ్ల మీదనే మొగ్గ్గేసి నిలబడగలదు. కొమ్మ నుంచి కొమ్మ మీదకు గెంతే కొద్ది టైములో కూడా కోతిది పర్ఫెక్టు టైమింగు! జెమినీ సర్కసు మార్కు పర్ఫెక్టు ఫీట్సన్నీ చేసే జీవులు సృష్టిలో  లక్షా తొంభై ఉన్నాయ్! అయినా మిస్టేకుల మీద మిస్టేకులు మాత్రమే చేసి నవ్వించే   జోకర్  జాతిలోకే మమ్మల్ని  తోసి పుణ్యం కట్టుకున్నావయ్యా పరంధామా!  అడుగడుక్కీ తడబడి పోవడం.. తడవ తడవకీ గొడవలు పడిపోవడం.. భలే థ్రిల్లింగుగా ఉందిలే ఈ మానవ జన్మ. మహా ప్రసాదం స్వామీ నీ  దయా దాక్షిణ్యాలకి!
మనిషి పుట్టుక కాబట్టి మడత పేచీలుండవు. పంచపాండవులు ఎంతమందని ఏ మందమతొచ్చి అడిగినా మంచం కోళ్ల మాదిరి ముగ్గురేనని ముచ్చటగా దబాయించేయచ్చు. రెండు వేళ్లకు బదులు ఒక్క వేలు చూపించినా వేలెత్తి చూపించే హక్కు ఏ భోషడిక్కీకీ లేదు. ఏ తప్పూ చేయకుంటే లైఫు మరీ ఓల్డు లైలా మజ్నూ మూవీలా  బోర్ కొట్టి చావదా? ఆ వినోద రహస్యం తెలుసును కాబట్టే .. గెజిట్ జీ. వో లు అవీ   తప్పులేవీ లేకుండా ఛస్తే రిలీజు చెయ్యరీ సర్కారీ నౌఖర్లు. ఆ జీవులూ నీ సృష్తిలీలలే  కదా .. తప్పులెలా దొర్లకుండా ఉంటాయిలే మహానుభావా?
తప్పులున్నంత కాలమే జైళ్లుండేది. జైళ్లున్నంత కాలమే జైలధికారులుండేది. జైలధికారుల కదికారమున్నంత కాలమే తప్పులు యధేఛ్చగా జరుగుతుండేది. ఏ తప్పులూ ఎవరూ చేసి సహకరించక పోతే అసలు  ముప్పు ముందు మీడియా దొరలకే కదా..  మేత దొరక్క! 
పర్ఫెక్టుగా బతకాలనుకొనే చాదస్తపు జీవికి మానవ  జన్మ శుద్ధ వేస్ట్. నేరాలవీ భారీగా చేసేసి ఆనక కన్నీళ్ళు గట్రా  కుండల కొద్దీ కార్చినప్పుడే పబ్లిక్కులో సింపతీ ప్లస్సయ్యేది. ఏ తప్పూ చేయడం రాక తగుదునమ్మా అంటూ రాజకీయంలకి జొరబడ్డా.. ఎంత దొరసాని బిడ్డ కథయినా డ్యామిట్.. అడ్డం తిరుగడం ఖాయం! 'అయ్యో.. పాపం' అంటూ అమాయకుల చేత  కావిళ్ల కొద్దీ కన్నీళ్లు కార్పించాలి. పాప్యులారిటీ పెరగాలంటే పద్దాకా  పప్పులో తప్పకుండా కాలేస్తుండాలి. తప్పదు. మిస్టేకుల్ని మించిన ట్రిక్ పాలిటిక్సులో మరోటి  లేదు మరి!
యమర్జన్సీ తప్పు తరువాతే ఇందిర 'అమ్మ'గా ఎమర్జయింది. ‘మహానేత’గా మేక్ ఇన్ ప్రాసెస్ లో మొహమాటాల కస్సలు తావుండ కూడదన్నా! పట్టు బట్టి మిస్టేక్స్ చేసినప్పుదే  జనం మీద పట్టు దొరికేదక్కా! 
'తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు' అన్న వేమన వాస్తవానికి ఓ వెర్రినాగన్న. 'ఒపీనియన్స్ డిఫరైతే గాని పొలిటీషియన్ కానేరడ'న్నాడయ్యా గురజాడగారి గిర్రాయి! మిస్టేక్స్ మీద పొలిటీషియనుకే మిస్టర్ పర్మినెంట్ పేటెంట్ రైట్స్! 
తప్పును తప్పు అని కుండ బద్దులు కొట్టే పూర్ శరద్ యాదవ్ సిన్సియార్టీ.. తప్పే ఒప్పని దబాయించి మరీ బుర్ర బద్దలు కొట్టేసే  లల్లూ యాదవ్ పాప్యులార్టీ ముందు బలాదూర్!  జయమ్మ కుర్చీ పక్కనే కూలపడుండేది శశికళమ్మ ఎల్ల వేళలా. ఎన్ని తప్పులు చేయందే చెలికత్తె నుంచి చిన్నమ్మ స్థాయికి ఆ మహాతల్లి ఎగబాకినట్లు? కాణీకి.. ఏగాణీకి మొగంవాచి బోలెడన్ని తప్పులకు బోల్డుగా ఒడిగట్టింది.. కాబట్టే కనిమొళి ప్రభ  తమిళనాట ఇంకా  కొడిగట్టకుండా వెలిగిపోతోంది.
తప్పు చేయడం అంటే ఓ కొత్త వివాదం సృష్టించడం. కొత్త కొత్త నినాదాలకు ఉప్పందించడం. జడ్జీల నుంచి బెంచి క్లర్కుల వరకు అందరూ బాగుండాలి. అందుకే దండిగా తప్పులు జరుగుతుండాలి! పొరపాట్లు చెయ్యమని మొండికేస్తే ఎట్లా?  ఇహ పోలీసులెందుకు? జైళ్లెందుకు? దండక్కదా!. దొంగలకు, దొరలకు మధ్య ఉండే పల్చటి తెర ఈ తప్పుల తడికే నప్పా! 
తప్పుల్ని తప్పు పట్టడం పెద్ద తప్పు. 'పొరపాటయిపోయింది.. సరిదిద్దండి' అన్న రెండు ముక్కలకుండే దమ్ము కొరియా కిమ్ము  అణుబాంబుకైనా  ఉండదండీ బాబూ! మిస్టేక్సుల్లో టెస్టు పెడితే ప్రశ్నపత్రాలు సెట్ చేసే మాష్టర్సుదే ఫస్టు ర్యాంకు. పేజీకి ఈజీగా నాలుగైదైనా తప్పులుండాలి. లేకుంటే లేజీ ఫెలోసని లోకమెక్కడ  లోకువ కడుతుందోనని శంక. వివాదాలేవీ లేకుండా ఆన్సర్ 'కీ', హానర్ పోస్ట్, నంది అవార్డు, బయో పిక్కు, టీ.వి చర్చ ముగిసాయంటే..  ఎక్కడో కచ్చితంగా ఏదో తప్పు జరిగినట్లే! మానవ జన్మమీద మచ్చ పడ్డట్లే!
మనిషిగా పుట్టించి మనకు నిత్యం తప్పులు చేసే మంచి అవకాశం కల్పించాడు దేవుడు. పర్ఫెక్షనో అంటూ చాదస్తానికి పోయి  భగవంతుడి నమ్మకాన్ని వమ్ము చేయద్దు. మన వంతు తప్పులు మనం చేసుకు పోతున్నప్పుడే పై వాడికీ నాలుగు చేతుల నిండా పని. అస్తమానం బొక్కలు వెదికే జాతి కూడా భూమ్మీద ఒకటుంది కదా! సరిదిద్దే అవకాశం దేవుడు వాటికీ ప్రసాదించాడని మరవద్దు.. మరో  పెద్ద తప్పు చేయద్దు!
ఉదాత్తమైనది మానవ జన్మ. వృథా చేయద్దని కాంగీ కొత్త అధినేత ఉద్బోధ. రాహుల్ బాబు జాతికి ఈ మధ్య ట్విట్టరు ద్వారా ఓ చక్కని సందేశం అందించారు. అందరికీ ఆదర్శంగా ముందుండడమే కదా గొప్ప నేత  మంచి లక్షణం! అందుకే.. మోదీ  హయాంలో అందలాలెక్కిన ధరవరలను శాతాల్లో చూపిస్తూ శతాధికమైన దోషాలను యధేఛ్ఛగా  దొర్లించేసారు. సారుని జౌరంగజేబని తిట్టిన నోళ్లే ‘ఔరా’ అంటూ అవాక్కయి పోతున్నాయి నాయనా ఇప్పుడు! 
ఎంత లావు శివ భక్తుడైతే ఏమి? ‘మనిషి’గానే పుట్టాడు  కదా  సోనియమ్మ కడుపున? చూడాలిహ! ముందు ముందు మోదీజీ సైతం తానూ 'ఓ మహా మనీషి'ని అని నిరూపించుకొనేందుకు ఇంకెన్ని ఘోర  తప్పిదాలకు శ్రీకారం చుట్టబోతున్నారో!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఆంధ్రప్రభ  దినపత్రిక, 09-12-2017నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్ లో ప్రచురితం)
Friday, December 1, 2017

గ్రంథచోరులు- ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్


ఆన్ లైనులో కెళ్లి  కెలుక్కుంటే చాలు. కాపీ రైట్ చట్టం పట్టింపు లేకుంటే  కామ్ గా కాపీ, పేస్టు చేసుకొని కర్త పేరు మార్చేసుకోడం మహా సులువు.  ఆకాశమంత జ్ఞానానికి ఆవిష్కర్తలం అనిపించుకోడం.. ఇవాళ్టి డిజిటల్ యుగంలో కోక్ తాగినంత సులువు. కేవలం అచ్చు బుక్కులు  మాత్రమే లభ్యమయే దిక్కుమాలిన కాలంలో గ్రంథ చోరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. పాపం!

వనితా.. విత్తం తస్కరణలక్కూడా సులువు సూత్రాలు చెప్పే శాస్త్రాలున్న  కాలంలో  పుస్తకాలు కొట్టేసే  చిట్కాల గైడ్లు మచ్చుక్కి ఒక్కటైనా దొరక్కపోవడం గ్రంథచోరులకు పెద్ద లోటు!    అరవై నాలుగు కళల్లో చౌర్యమూ ఒక విభాగమే! అయినా.. ఆ శాఖ అభివృధ్ధి ఎందికు పుంజుకోలేదో? చిత్రమే కదా?

పుస్తక చౌర్యం మరీ అంత అకార్యమైన కళేం కాదు. యమధర్మరాజులుగారు గ్రంథచౌర్యం మీదో ఉద్గ్రంథమే రాసారని వినికిడి. ఏ దొంగ వెధవ గుట్టు చప్పుడుగా  నొక్కేసాడో..   ఇప్పుడా తాళపత్రాలు ఏ  గ్రంథాలయంలోనూ కనపడ్డం లేదు!

పుస్తక  చౌర్యానికీ బోలెడంత గ్రంథముంది. ఆశించిన  పుస్తకం అందుబాటుకి రావాలి. కోరుకున్న అందులో తారసబడాలి. ఇప్పుట్లా ఏ సెల్ ఫోనో అరచేతిలో ఉంటే 'ఠప్పు'మని ఓ క్లిక్కుతో  అంశం  మన సొంతమవుతుంది. క్జిరాక్సులకే దిక్కులేని కాలంలో ముత్తెమంత సమాచారం సేకరించాలన్నా పుస్తకం మొత్తం ఎత్తేయడం ఒక్కటే ఉత్తమ మార్గంగా ఉండేది.

అరువులా అడిగి పుచ్చేసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగే మరో దారి ఉన్నా..   కొంతమంది పుస్తకదారుల జ్ఞాపకశక్తి మరీ దారుణంగా ఉంటుంది. ఏనుగు మెమరీ కూడా వాళ్ల ధారణా శక్తి ముందు చీమ తలకాయ! ఏళ్లు పూళ్లు గడిచి.. ఎన్ని యోజనాల దూరంలో  స్థిరపడినా ప్రయోజనం శూన్యం. ఆనవాళ్లేవీ  లేకుండా  ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రారబ్దం బాగోలేకుంటే ఫలితం సున్నా. ఏ దుర్ముమూర్తానో నిశ్శబ్దంగా వెనకనుంచి వచ్చి 'ఎంరోయ్! మూర్తీ.. ఎట్లా ఉన్నావ్? అంటూ వీప్మీద ఛర్రుమని విమానం మోత మోగించేయచ్చు. ఆనక  ముసి ముసి నవ్వుల్తో కసిగా నిలదీయడంతో దోష విచారణ కథ మొదలవుతుంది. కోర్టు.. బోను.. సీనొక్కటే తక్కువ.  తలపండిన వకీలుగారు ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లు సాగే విచారణను ఎదుర్కోవడం ఎంత అబద్ధాలకోర్సు డాక్టరేటుకైనా తలకు మించిన పని.

ఫలానా పంథొమ్మిదొందల అరవై తొమ్మిది మార్చి మూడో తారీఖు మిట్టమధ్యాహ్నం పూట ఎండన  పడి తమరు మా ఇంటి కొచ్చారూ! ఏదో మిత్రులు కదా అని ఆతిథ్య ధర్మ నిర్వహణార్థం  కాశీ చెంబెడు మజ్జిగ నీళ్ళు నిమ్మరసం పిండి మరీ తమరికి సమర్పించుకున్నాను. అప్పుడు తమరేం ఉద్ధరించారో  గుర్తుందో లేదో ఇప్పుడు?  ఎండ చల్లబడిందాకా  బైటికి వెళ్లలేనంటే పోనీలే.. టైమ్ కిల్లింగుగా ఉంటుందని నా సొంత గ్రంథాలయం నుంచి ఎప్పట్నుంచో సేకరించి దాచుకున్న చలం 'ఊర్వశి'  అరుణాచలంలో ఆయన స్వహస్తాలతో అట్టమీద పొట్టి సంతకం గిలికిచ్చిన  అపురూపమైన పుస్తకం తమరికి ధారాదత్తం  చేసాను. బుద్ధీ,  జ్ఞానం అప్పటికింకా పూర్తిగా వికసించలేదులే నాకు. ఆపుకోలేని అర్జంటు పని మీద నేనటు లోపలికి వెళ్లి తిరిగొచ్చిన ఐదు నిమిషాలలోపే తమరు  జంపు!  ఖరీదైన  వస్తువులింకేమైనా చంకనేసుకొని ఉడాయించారేమోనని అప్పుడు  మా  ఊర్మిళ  గుండెలు బాదుకొన్న చప్పుళ్లు ఇంకా ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మిత్రమా! మా ఆవిడ శోకన్నాలు నాకు నిత్య కర్ణ శ్రవణానందాలే కనక దానికి ఆట్టే ఫీలవలేదు.  కానీ నా ఊర్వశిని  నువు  చెప్పా పెట్టకుండా చంకనేసుకొనలా  చెక్కేయడమే చచ్చే బాధించిందిరా మూర్తీ! నిజమైన స్నేహం కన్నా పుస్తకమే విలువైందని నువ్వా నాడు ప్రాక్టికల్గా నా కళ్లు తెరిపించావు చూడు.. అందుకు   'థేంక్స్' చెప్పుకుందామనుకొన్నా..  ఏదీ నీ అడ్రసు? రామాయణంలో సీత దర్శనం కోసం ఆ శ్రీ రామచంద్రుడయినా  అంతలా తపించాడో లేదో ? నా ఊర్వశి కోసం, తమరి వేరెబౌట్సు కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పటికైనా కనిపించావు. అదే పది వేలు. ఎన్ని వేలు కావాలో అడుగన్నా.. ఇచ్చేస్తా! కానీ.. మళ్లీ నా ఊర్వశిని మాత్రం నాకు తిరిగి ఇచ్చేయ్ రా.. ఇప్పుడే!' అంటూ జబ్బ పట్టుకొని నడిరోడ్డు మీదే  నిలబెట్టి పరువు తీసే  పుస్తకాల పురుగులు ఇప్పటికీ తారస పదుతూనే ఉంటారు. అందుకే తస్కరించే ముందు పుస్తకం వివరాలతోనే కాదు.. పుస్తకం తాలూకు  ఓనరు వివరాలతోనూ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

డిజిటల్ గా దేశం ఎంతలా అభివృద్ధి పథం వైపు ముందుకు దూసుకు పోతున్నా.. పోయిన పాతపుస్తకాల కోసం.. పాతకాలంనాటి పద్ధతుల్లోనే పడరాని పాట్లు పడే చాదస్తులు ఎప్పుడూ ఎక్కడో ఓ చోట తారసపడి గ్రంథాల విలువను మర్చిపోనివ్వరు.

అవును మరి.. ఒక గ్రంథం తయారీకి అది రాసేవాడి శరీర కష్టం విఘ్నేశ్వరుడి బాధను మించి ఉంటుంది! 'భగ్నపృష్టః కటిగ్రీవ స్తబ్ధ దృష్టిః రథో ముఖః.. కష్టేన లిఖితం గ్రంథం, యత్నేన పరిపాలయేత్' అని ఊరికే అనరు కదా ఎవరైనా? అష్టాదశ పర్వాల మహాభారతాన్ని ఆ వ్యాసులవారు ఓ వ్యాసంలా గడగడా వప్పచెప్పుకు పోవచ్చు. అది వట్టి నోటి పని. కానీ.. చెప్పింది చెప్పినట్లు క్షణమైనా గంటం  ఆపకుండా  చెవులతో వింటూ.. బుద్ధితో ఆలోచిస్తూ.. చేత్తో బరా బరా  రాసుకుపోవడం?! రాత సంగతి ఎట్లా ఉన్నా ముందు వెన్నెముక గతి? ముక్కలు చెక్కలై పోదా? మెడ కండరాలైనా పట్టుకు పోవా?కంటి చూపు? చీకటి పడితే  కటిక చీకటే!  ఆపకుండా అంత లావు భారతం ఎట్లా రాసుకు పోయినట్లు! దేవుళ్లు  కాబట్టి ఏ మాయో మర్మమో  చేసి కార్యం ఇతి సమాప్తం అనిపించి ఉండవచ్చు. మానవ మాత్రుల కెట్లా సాధ్యం?'కష్టేన లిఖితం గ్రంథం' అన్నారు అందుకే! పిట్ట ఈకలతో ఎండు తాటాకుల మీద గుండ్రటి లిపి! అక్షరం ఆకారం చెడకుండా రంధ్రాలు పొడుచుకుంటూ  పోతుండాలి.  అంత  కష్టం కాబట్టే పుస్తకాలను భద్రంగా చూసుకోవాలని పెద్దలు సుద్దులు చెప్పింది.

ఏ కష్టమూ లేకుండానే సృష్టించుకొనే వీలుంటే.. వేదాలు నీళ్లలోకి  జారినప్పుడు విధాత ఎందుకంతలా బేజారవుటాడు? గ్రంథాల విలువ తెలుసు కాబట్టే సోమకాసురుడా కవిల కట్టలు కంటబడగానే లటుక్కుమని నోట కరుచుకొని  పారిపోయాడు! 'పోతే పోయాయి లేవయ్యా? మళ్లీ  రాయించుకో.. ఫో!' అని కసురుకొని వదిలేయలేదు  పరమాత్ముడు.  పనిమాలా మత్సాహారమెత్తి మరీ మొరటు రాక్షసుడితో  ప్రాణాలకు తెగించి పోరాడాడు. తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చి 'ఇహ ముందైనా జాగ్రత్తగా ఉండ' మని మందలించాడంటానే తెలియడం లేదా పుస్తకాల విలువ ఏ పాటిదో?.

విలువైన వస్తువులు ఎక్కడుంటాయో దొంగతనాలూ అక్కడ తప్పకుండా జరుగుతుంటాయి. గ్రంథాలయాల దగ్గర అందుకే పగటి దొంగలు తారట్లాడేది.  పుస్తకం చూస్తున్నట్లే చూసి.. కటిక్కున  పుటను పరా పరా చించి జేబులో కుక్కేసుకొని బైటపడే గ్రంథచోరులు గతంలో చాలా మందే  తారసపడుతుండే వాళ్లు. వెసులుబాటుంటే అసలు  ప్రతినే లేపేసేందుకు అన్ని విధాలా ప్రయత్మించే గ్రంథచోరులుండ బట్టే   తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలోని మన తెలుగు తాళపత్ర గ్రంథాలు చాలా వాటికి కాళ్లొచ్చినట్లు ఈ మధ్య ఒక తమిళనాడు సాయంకాలం దినపత్రిక వివరాలతో సహా ప్రచురించింది.

ఈ-డిజిటల్ కాలమే కాదు.. ఎన్ని డిజిట్స్  జీతమొచ్చే గొప్ప  ఉద్యోగమైనా  మనిషి గ్రంథచౌర్యబుద్ధిని అడ్డుకోలేక పోతోంది. అందుకే తెలంగాణాలోని ఒక మారుమూల పట్నంలోని గ్రంథాలయంలో పుస్తకాలు దొంగిలిచ్చవద్దని హితవు చెబుతూ
'బుక్కులు తీసుకుపోయిన
మక్కువతో చదివి మీరు మరి ఇవ్వవలెన్
చిక్కెనని యింట దాచిన
మిక్కిలి పాపంబు మీకు మితిమీరియగున్!'
అంటూ పద్యాలు కొన్ని రాయించి మరీ నోటీసు బోర్డులో పెట్టించారు నిర్వాహకులు.
గ్రంథచోరులు దృష్టి ఈ పద్యం రాసున్న బోర్డు మీదా పడబోతుందా? ఏమో.. చూడాలి మరి ముందు ముందు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్- 02, డిసెంబర్, 2017)