Showing posts with label ancedote. Show all posts
Showing posts with label ancedote. Show all posts

Saturday, December 11, 2021

సింహళ పాలకుల ఆంధ్రాభిమానం - దురభిమానం -కర్లపాలెం హనుమంతరావు

 సింహళ పాలకుల ఆంధ్రాభిమానం - దురభిమానం 

-కర్లపాలెం హనుమంతరావు


12 , 13 వ శతాబ్దాలనాటి మాట. ఇప్పటి శ్రీలంక అప్పట్లో సింహళం.   పోలన్నరువా దాని రాజధాని.  అప్పటి శిలాశాసనాలు, 'మహావంశ' వంటి  రాజవంశజుల చారిత్రక గ్రంథాలే కాకుండా, బుద్ధుడి దంత చిహ్నాలు సింహళానికి కళింగ నుంచే తరలిన దాఖలాలు  కూడా  వత్తాసుకు రావడం  వల్ల .. సింహళ  పాలకులు కళింగ వంశానికి చెందిన వాళ్లు కావచ్చనే భావన బలపడింది . 

నాటి పాలకుల మొదటి తరపు పాలకుడు ' శ్రీవిజయ'  వంగీయుడు అని  కొన్ని వాదనలు ముందుకు వచ్చినా . . కాదు, కళింగుడేనని  తరువాతి కాలంలో తేలడంతో కళింగ సిద్ధాంతానికి మరింత  ఊతమిచ్చినట్లయింది.

 ఏడో శతాబ్దంలో ఓ కళింగ ప్రభువు యుద్ధంలో ఓడి అశ్రయం కోసం సింహళంలోని  ఒకానొక బౌద్ధవిహారం దాకా వచ్చినట్లు  'మహావంశ' గ్రంథం చెప్పనే చెబుతున్నప్పుడు  పాలకుల కళింగ వంశాన్ని గురించిన వాదనలు కొనసాగడం కాలం వృథాచేసుకోవడమే!     

 పదహారేళ్ళ పాటు ఘనంగా పాలించిన  నాలుగో తరం  నాయకుడు మహీంద్రుడు పెళ్లాడింది కూడా కళింగ కన్యనే. ఆ జంట ఫలం ( ఐదవ)  మహీంద్రుడు అనూరాధపురం రాజధానిగా పాలన చేసినట్లు                          శా సనాల సాక్ష్యం అందుకు తోడుగా ఉంది . 

ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పటికీ  తొమ్మిదో శతాబ్ద౦ దాకా సింహళ వ్యవహారాలలో ఆంధ్రుల   జోక్యం ఉన్నట్లు కనిపించదు.  పదో శతాబ్దంలో దక్షిణ సింహళంలోని  కొంత భాగం చోళుల అధీనంలోకి  వచ్చినప్పటి నుంచే  ఆ దేశ వ్యవహారాలలో చోళుల చొరవ ఎక్కువయినట్లు చరిత్ర చెప్పే  మాట నమ్మదగ్గదే . 

కళింగులు, సింహళీయులు ఇద్దరికీ ఒకటవ కుళోత్తమ తుంగుడు శత్రువు. ఆ ఉమ్మడి శత్రువును తరిమికొట్టే  నిమిత్తం  కళింగ రాకుమార్తె త్రిలోకసుందరిని  ఒకటవ విజయశ్రీ  పెళ్లాడినట్లు  చెబుతారు.    ఇటు కళింగదేశంలోని 'గంగ' వంశంలో కూడా ఈ తరహా పేర్లే  వినబడతాయి.  కాబట్టి విజయసింహుడికి ఆ వంశజుల   బాలికతో వివాహమైందని ఊహించుకోవడంలో తప్పేమీ  లేదు . యుద్ధాల నిమిత్తం జరిగే పెళ్లిళ్లు  రాచరిక వ్యవహారాలలో మామూలే.  

వధువు త్రిలోకసుందరి తన బంధుబలగంతోనే అత్తారింట్లో అడుగు పెట్టింది.   మనావంశ కథనం ప్రకారం మధుకన్నవ, బాలక్కర, భీమరాజు,  చిన్నచెల్లెలు సుందరి సింహళ దేశంలోకి అట్లా అడుగుపెట్టిన చుట్టాలూ పక్కాలే.    విజయసింహుడి  బిడ్డకు  తాతగారి పేరు  'మధుక మార్నవ' దాఖలవడం కూడా అందుకో ఉదాహరణ .  మధుక మార్నవ   భార్య సుందర మహాదేవి.  మార్నవ మహారాజు   పరిపాలన  క్రీ.శ 1116 నుంచి  17 సంవత్స రాలపాటు  సాగినట్లు చరిత్ర చెబుతున్నది  . 

ఇప్పుడు ' దిబుంలగాల' గా చెప్పుకునే అప్పటి 'యుదంబగిరి' లో   విజయ  బాహుడు అనే సింహళాధీశుడు  ఒక గుహ కట్టించి దానికి  'కళింగ గుహ' అని పేరు పెట్టినట్లు  శిలాశాసనాల సాక్ష్యం ఉంది. ఆ వంశంలోని రెండవ గజబాహుడికి ఆంధ్రులపై ప్రీతి   జాస్తి అని ప్రతీతి .  అతని   16 ఏళ్ల పాలనాకాలంలోనే  (1137 -53)  ఆంధ్ర, సింహళాల మధ్య  బంధం మరంత.  బలపడినట్లు  చరిత్ర కథనం . అతగాని    ఆంధ్రాభిమానం గిట్టని పరాక్రమబాహుడు అనే మరో రాజు రాజ్యాన్ని కబళించాడు.  తమాషా ఏమిటంటే, నిస్సంతు అయినందువల్ల అంత్యకాలంలో ఆయనే  ఆంధ్రదేశపు విజయబాహువు అనే బంధువుకు రాజ్యాన్ని అప్పగించవలసి రావడం ! ఆ అప్పగింతకు వ్యతిరేకంగా చెలరేగిన వ్యతిరేకత    విజయుడు అనే సేనాని కృషి కారణంగా  సద్దుమణిగింది .   ఆయన  ఓ గొల్లవారిపిల్ల  ప్రేమలో చిక్కి ప్రాణాలు  పోగొట్టుకున్నాడు. ఆ  పిమ్మట   పీఠమెక్కినవాడు    నిస్సమ్మకమల్లుడు. ఆయన తండ్రి జయగోపరాజు. తల్లి పార్వతీమహాదేవి . 

నిస్సమ్మకమల్లుడు పదహారణాల ఆంధ్రుడు. ఆ ఆంధ్రాభిమాని     తొమ్మిది ఏళ్ళ పాలనను  స్వర్ణయుగంగా సింహళ సమాజం ఇప్పటికీ చెప్పుకుంటుంది.  అస్తవ్యస్త  వ్యవస్థకు ఒక కట్టుబాటు ఏర్పాటుచేసి అంకితభావంతో దానిని అమలుచేసిన గొప్ప పాలకునిగా  అతనికి చరిత్రలో  గుర్తింపు ఉంది. 

నిస్సమ్మకమల్లుడు సింహళ దేశీయులకు  సుఖశాంతులు, సుభద్రత అంటే ఎట్లా ఉంటాయో రుచి చూపించిన మొదటి  పాలకుడాయన. అయినా అతని పట్ల 'మహావంశ'   చిన్నచూపు చూసింది .   కేవలం తొమ్మిదంటే తొమ్మిది వాక్యాలతోనే    ఆ రాజు ప్రాశస్త్యం తగు సమాచార లేమి  కారణమని  సమర్ధించుకున్నా ఈ వివక్ష ఆంధ్రుల పాలిటి దురదృష్టమే! ద్రవిడ దేశం మీదకు దాడికి వచ్చినప్పుడు   రామేశ్వరంలో ఆంధ్ర ధ్వజం నాటిన ఆ తెలుగు వీరుడి   ప్రతి పలుకు, ప్రతి  చర్యా  ఆంధ్ర విలక్షణతతో  తేజరిల్లడం గొప్ప విశేషం .  పదహారణాల ఆంధ్రుడయినప్పటికీ   ఆ నిస్సమ్మకమల్లుని  ఆంధ్ర  రికార్డులు సైతం పట్టించుకొనకపోవడాన్ని మనం  ఎట్లా సమర్ధించుకోవడం? ! 


పరాయిగడ్డ పై ప్రముఖ రాజధాని పోలన్నరువును  నాడే  నిర్మించిన ఘనత   నిస్సమ్మకమల్లునిది! దేశం ముమ్మూలలా  విస్తృతంగా సంచారం చేస్తూ  దేవాలయాలు, పూజామందిరాలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మించిన ప్రజారంజక పాలకుడా మహారాజు.  రస్తాలూ, తటాకాలు వంటి ప్రజోపయోగకరమైన వనరుల అభివృద్ధి పై  సైతం ఆ ప్రభువుకు నిర్లక్ష్యం లేకపోవడం ఈనాటి పాలకులకు  ఆదర్శనీయం కావాలి. 


బౌద్ధ మతానుయాయిగా బౌద్ధ సంఘాలలోని దురాచార నిర్మూలన కోసమై   యథాశక్తి ఆ రాజు చేసిన కృషి సర్వమతాల సమ్మతం  విశేషంగా సాధించింది .   

 నిస్సమ్మకమల్లుని ప్రతి పలుకూ , ప్రతి చర్యా అతనిలోని  పదహారణాల ఆంధ్రత్వానికి అద్దం పడుతుంది. ఆయనకూ నేటి  మన పాలకుల తరహాలోనే  తన పరిధిలోని  వస్తుసంపదకు  'కళింగ' నామధేయం అద్దడంలో అపరిమిత , శ్రద్ధ. అర్థాంగి సుభద్రను  'కళింగ సుభద్ర'గా ప్రసిద్ధం చేసిన ఆంధ్రాభిమాని  నిస్సమ్మకమల్లుడు.  ఇప్పటి పోలన్నరువా అతని కాలంలో 'కళింగపురం'. నాణేల మీదంటే  'కళింగ లామతేజస' అని ముద్రింపచేశాడు ;  సరే, తోటలను సైతం  కళింగ ఉద్యానవనాలుగా స్థిరపరచడమేమిటి! ఆ ప్రభువుకు   ఆంధ్ర మూలాల పట్ల గల  గాఢాభిమానానికి చెప్పకోదగ్గ  గొప్ప తార్కాణాలు ఇట్లాంటివి ఇంకెన్నో ! 

కళింగాధీశుడు ఉమవర్మ వేయించిన తామ్రశాసనంలో  నిస్సమ్మకమల్లుని ' సింహపురి నివాసం  '  ప్రస్తావన కనిపిస్తుంది .   అమరావతి, నాగార్జున పర్వత ప్రాంతమంతా ఒకనాడు బౌద్ధమత ప్రాభవంతో వెలుగులీనడం అందరికీ తెలిసిన చరిత్రే. సింహళం మొదటి తరం పాలకులలోని ఒకటవ శ్రీ విజయుడు బహుశా కృష్ణాతీరం నుంచే  సింహళ దేశానికి తరలిపోయి ఉండవచ్చని ఒక ఊహ. ఆ సింహపురి ఇప్పటి నెల్లూరు కాదు.  సింహవాహనం పైన దర్శనమిచ్చే బెజవాడ. అదే శ్రీ దుర్గాంబాదేవి కనుసన్నులలో మెలిగే  విజయవాడ అయినా అయే అవకాశం కద్దు. అనంతర కాలంలో కళింగ రాజుల ప్రాభవం చెప్పుకోదగినంతగా లేని కారణంగ  ఆ ఆంధ్రరాజు నిస్సమ్మకమల్లుని చరిత్ర మరుగున పడే అవకాశం కాదనలేనిది! 


ఏది ఏమైనా ఊహపోహలు చరిత్ర కాలేదు కదా !    పరిశోధకులు మాత్రమే ఇతమిత్థంగా  నిగ్గు తేల్చదగ్గ అంశాలు నిస్సమ్మకమల్లుని చుట్టూతా  చాలానే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్న మాట. 

నిరంతరం స్వయంగా పర్యవేక్షణ పనులలో పాలుపంచుకుంటూ ప్రజలతో మమేకమైన ఆ ప్రభువు   సుపరిపాలనా దక్షత   సింహళ చరిత్ర ఖజానాలో .. తరాలు గడిచినా తరగనంతగా జమపడివున్న ధన సంపద.  విదేశీ గడ్డ అయినా స్వజాతి ఔన్నత్యాన్ని కీర్తించిన ఆ పాలకుని వ్యక్తిత్వం సర్వదా  అభినందనీయం. ఈనాటి మన తెలుగువారందరికీ ఆదర్శనీయం. , ఆచరణీయం కూడా. 


-కర్లపాలెం హనుమంతరావు

బోధెల్ ; యూ.ఎస్.ఎ

21 -06 -2019


Friday, December 10, 2021

ఈనాడు- సంపాదకీయం నిద్ర ప్రాథమిక హక్కు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 )


ఈనాడు-  సంపాదకీయం 

నిద్ర ప్రాథమిక హక్కు

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 ) 



'అశ్వినీ దేవతలు అత్యంత అప్రమత్తంగా నిన్ను గమనిస్తున్నా నా కంటిమీద వాలిన ఓ నిద్రాదేవతా! నీకు నమస్కారం' అంటుంది అధర్వణ వేదం. నిద్రావస్థలు ద్రష్టల దృష్టిని వేదకాలంనాడే ఆకర్షిం చాయనడానికి - స్వప్నయోని, స్వప్న జన్మభూమి - సిద్ధాంతాలే దృష్టాంతాలు. నిద్రస్థితిలో ప్రత్యగాత్మ బుద్ధి అంతఃకరణలో చైతన్యవంతమై ప్రకాశిస్తుంటుందని భారతీయ తత్వశాస్త్ర సిద్ధాంతం. 'నిద్రలో మేలుకొని ఉండేదే బ్రహ్మం' అని కఠోపనిషత్ వాక్యం! జగత్ కారకుడైన విష్ణువు శరత్ కాలారంభంలో గాఢనిద్రనుంచి మేల్కొన్న తరువాత పునఃసృష్టి ప్రారంభించాడంటున్నాయి పురా ణాలు. జగజ్జేత అలెగ్జాండర్ పర్షియా దేశం మీద ప్రచండ యుద్ధం ప్రారంభించే ముందు సుదీర్ఘనిద్రలోకి వెళ్ళినట్లు గ్రీసు చరిత్ర చెబు తోంది. 'నిద్రాదేవత నిన్ను పూనెగదరా నిర్భాగ్య దామోదరా!' అని మనకో నానుడి కద్దు . దామోదరుడిది యోగనిద్ర. మన్ను తిన్నందుకు శిక్షగా బాలకృష్ణుడి నడుమును తల్లి యశోదమ్మ తాడుతో బంధించి దామోదరుడిగా మార్చిన కథ భాగవతంలో ఉంది. నిద్ర కూడా మనకో దేవతా స్వరూపమే. జ్యేదేవి ఆ దేవత పేరు. జగన్మాతకు జ్యేష్ఠ భగిని. ఫిన్నిష్ జాతివారి నిద్రాదేవత 'ఉని' . 'శృంగార చతుష్షష్టి'లో శయన సందేశనం అత్యంత సుఖదాయకమని 'నాగరక వృత్తం' అభివ్యక్తీకరిస్తోంది. విశ్వవిఖ్యాత శిల్పకారుల్ని సైతం 'యోగనిద్ర' ఆపరిమితంగా ఆకర్షించింది. జ్ఞానీ బుద్ధ, ప్రజ్ఞాపారమిత, ప్రతిమా శిల్పరీతులే అందుకు ఉదాహరణలు. లీచ్ ఫీల్డ్ కెథడ్రాల్ లో  కనువిందుచేసే నిద్రాదంపతుల ఫలకాలు నిద్రా దేవతకు శిల్పకళ అర్పించే ప్రజ్ఞా నివాళులు.


వేకువజామునే మేలుకొలిపే వైతాళికులు, సుఖశయ్యను గురించి విచారించే సౌఖ శాయనికులు- ప్రాచీనకాల రాచరిక మర్యాదల్లో అని వార్యంగా కనిపించే సపర్యక బృందాలు. దేశాక్షి, భూపాల, మలయ మారుతాది ఉదయరాగాల్లో ఇష్ట దేవతలను మేలుకొలిపే వైతాళిక సాహిత్యం భారతీయ భాషల్లో బోలెడంత . యుగాల కిందట కౌసల్యా సుప్రజా రాముణ్ని పూర్వసంధ్యలో మేల్కొలిపే నిమిత్తం  విశ్వామిత్రుని నోట వాల్మీకి పలికించిన 'ఉత్తిష్ఠ' అనే మాట నేటికీ కోట్లాది భారతీ యులను నిద్రమత్తునుంచి తట్టిలేపుతూనే ఉంది . నిద్ర ఒక సృష్టి వింత. ఆకురాలే కాలం మొదలు కాగానే దీర్ఘనిద్రకు జారుకునే జీవజాతుల  జాబితా సుదీర్ఘమైనది . గాఢనిద్రలో ఉన్న గుడ్లగూబను నీటముంచినా చావదంటారు. చలికాలపు పెనునిద్రలోని చుంచుల్ని చావమోదినా చలించకపోవడం గమనించదగ్గ విశేషం . ఈజిప్టు నత్తల నిద్ర ఐదారేళ్లు! జీవ ప్రతికూల వాతావరణంనుంచి సంతానాన్ని సంరక్షించుకొనే ప్రకృతి మాత తంత్రం- నిద్ర.  పూర్వరాత్రి నిద్ర నొక సౌందర్య సంవర్ధకంగా పాశ్చాత్యులు భావిస్తారు. పురాణ కవులకు ఇష్టదైవాలు ప్రత్యక్షమై కావ్యకర్తృత్వాన్ని పురమాయించింది నిద్రావస్థలలోనే . జోల, లాలి వంటి నిద్ర సాహిత్యం ప్రతి భాషలోనూ ప్రత్యేకత సంతరించుకోవడం గమనించాలి. ఆరునెలల పాటు ఏకబిగిన నిద్రపోయే జాతిని  స్వయంగా చూసినట్లు గ్రీకు చరిత్రకారుడు హెరడోటస్ చెప్పుకొన్నాడు. సెక్టస్ పాపే ను  ఎదుర్కొనే వేళ సముద్ర మధ్యంలోనే గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు ఆగస్టస్ సీజర్. వాటర్లూ యుద్ధానంతరం రోజులో మూడొంతులు పడకలో ఉంటేగాని పోయిన శక్తి పుంజుకోలేకపోయాడు నెపోలి యన్. 'లోకంలోని సమస్త సింహాసనాలను బహుమానంగా ధార పోసినా శయ్యాసౌఖ్యాన్ని వదులుకోలేనని స్వయంగా ఆ జగజ్జెతే ఒప్పుకొన్నప్పుడు - నిద్రాదేవి శక్తికి మరో తార్కాణమవసరమా ?! 


' సుప్తి బోలంగ/ సుఖమెందు గలదు!' అంటాడు విక్రమార్క చరిత్రంలో జక్కన కవి. 'నిద్ర సుఖమెరుగదు' అన్న నానుడి మనకు ఉండనే ఉంది. 'నిద్ర దురదృష్ట హేతువుల్లో ఒకటి' అని పెద్దలన్నది పొద్దస్తమానం పడకమీదే పొద్దుపుచ్చే  నిద్రబోతులనుద్దేశించి. నిజానికి మొద్దులాగా నిద్రిస్తేనే ఎద్దులాగా పనిచేసేది. నిద్ర ప్రాణావసరం. 'నిద్రాలేమి ఆరోగ్యానికి హాని' అన్నది  ఆనాటి ఆర్య క్షేమేశ్వరుడి నుంచి నేటి ఆరోగ్యశాస్త్రవేత్తల దాకా అందరి అభిప్రాయం. నిద్ర మనో మాలిన్యాన్ని కడిగిపారేసే క్షారం. అవయవాలను ఉత్తేజపరిచే ఔషధం. 'శారీరక, మానసిక లోపాలను సర్దుబాటు చేసి ధాతువులను సుస్థితిలో నిలపడంలో నిద్రకు ప్రత్యామ్నాయం లేదు' అంటాడు విద్వ ద్వరేణ్యుడు. శయ్య మీదకొరిగి సున్నితంగా సుఖనిద్ర పొందే అదృ ష్టవంతులను తలచుకొని కుమిలిపోతాడో సంస్కృతకవి. లంక కంపి స్తున్నంత కోలాహలం సైతం  కుంభకర్ణుడి నిద్రను భంగపర్చలేకపోయింది  నిద్రాభంగం కాల. ప్రాణేశ్వరుడి ఎడబాటు దుఃఖం  నుంచి  నిద్రాదేవతను ఆశ్రయించి ఊర్మిళాదేవి ఊరడింపు పొందగలిగింది. 'అలుక యెత్తిన వానికి, నర్థచింతకునకు, నాతురునకు గాను గోచరాత్మకునకు వచ్చునే ఎన్నబడి జనులెరింగిన యిన్నాలుగు తెరగులందు నెయ్యదియైన నన్ను మొగుడ నీదట, నాకన్నియు గలుగంగ నిద్రయేటికి వచ్చున్? - అంటూ తిక్కన మహాభారతం సౌప్తిక వధోద్యోగ పూర్వరంగంలో నాటి అశ్వత్థామ పడిన  వ్యధే నిద్రాదేవి సాంగత్యానికి దూరమైన వారందరిదీ. ఇరుగుపొరుగుల సొద , వాహనాల రొద, శ్రుతిమించిన ఉత్సవాల ఉత్సాహం, గూబలదిరే నేతల ప్రసంగాలు... కర్ణభేరికి ముప్పుగా దాపురించే ఇత్యాదుల  జాబితా ముందు ఆంజనేయుని వాలం చాలా చిన్నది. నిద్ర ప్రకృతిసిద్ధంగా జీవికి దక్కే ప్రాథమిక హక్కు.  దువ్వూ రివారు అన్నట్లు 'కాలమున దక్క మరియేమి కార్యమందు! మరణ మునకును నిద్రకును అంతరము కలదు! ' మానసిక సామర్థ్యాలు అచేతనంగా ఉండే ఈ అర్ధమరణ స్థితిలో ఉన్నవారి మీద జరిగే దాడులు అమానుషం. గత ఏడాది ఢిల్లీ రామ్ లీలా  మైదానంలో రామ్ దేవ్ బాబా దీక్షకు మద్దతుగా చేరినవారిమీద పోలీసు యంత్రాంగం అర్ధ రాత్రి నిద్రవేళ విరుచుకుపడ్డ తీరును రాజ్యాంగ విరుద్ధ చర్యగా సర్వో న్నత ధర్మాసనం దుయ్యబట్టడం ముదావహం. నిద్రాభంగం కలిగించే అనాగరిక చేష్టమీద న్యాయపరమైన చర్యలు తీసుకొనేటందుకు దోహదం చేసే తీర్పు ఇవ్వడం అభినందనీయం.


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 ) 


Thursday, December 9, 2021

ఆత్రేయ - తన మూలం ఇదం జగత్

 


ఆత్రేయ గోత్ర నామం: మన'సు కవి'

అసలు పేరు: కిళాంబి వేంకట నరసింహాచార్యులు

పేరు తెచ్చిన పేరు: ఆచార్య ఆత్రేయ


ఆచార్య అంటే ప్రొఫెసర్ కాదు. అసలు పేరులోని తోక. రాయటం రాని రచయిత. ఎంతసేపటికీ ఎదుట కూర్చున్న రాతగాడికి డిక్టేట్ చేయటమే. రాత్రి సుష్టుగా భోచేసి, వెంటనే పడుకుని, రెండు గంటల వేళ లేచి తెల్లారే వరకూ రచనలు చేసే ఆత్రేయ - 'రాత్రేయ' బూతు పాటలు రాస్తారు గనుక 'బూత్రేయ'. ఎవరేమని పిలిచినా పట్టింపులేని మనస్తత్వం అంటారు ఆయనది. హాస్య స్ఫూర్తి ఉన్నా హాస్యం రాయటం రాదు. రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్నీ ఏడిపించే మనసుకవి. మన 'సుకవి'. సరస్వతీ పుత్రుడేగానీ, లక్ష్మీపుత్రుడుగాదు. పొద్దున పదివేలు చేతి కొస్తే సాయంకాలానికి ఖాళీ! శుక్రవారంనాడు నిర్మాతల్నుంచి చచ్చినా ఒక్క పైసా రాలదు. కానీ ఆయన సాధించేవాడు! 'ఏ రోజు ఎంత కావాలో తెచ్చుకో! రేపటికి దాచుకోవద్దు!' అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా 'చిన్నారి మనసులు' చిత్ర నిర్మాణానికి పూనుకున్న మహానుభావుడు. డబ్బు పెడతానన్న ఓ పెద్దమనిషి మాటల్ని నమ్మి సినిమా యజ్ఞానికి పూనుకుని సమిధగా మారిన ఎందరో మహానుభావుల్లో ఆత్రేయ మొదటివాడు కాదు, చివరి వాడూ కాదు. చివరికి చేసేది లేక 'చిత్రం'గా అనుకున్నదాన్ని 'పిల్లలతో చెలగాటం - పెద్దలకే ఇరకాటం' పేరుతో దూరదర్శన్‌ కు  పదమూడు భాగాలుగా తీయాల్సి వచ్చింది. కాల్చుకోవాల్సి వచ్చింది. . చేతులు

చివరి దశలో పెద్ద ఇల్లుపోయి చిన్న గదుల ఓ మేడమీద ఓ చిన్ని వాటాలో చిన్ని మంచం మీద గడిపినవాడు.


"మనిషి పుట్టినప్పుడు ఎలా ఉంటాడో. (గిట్టనప్పుడు) గిట్టనప్పుడూ  అలాగే ఉండి 'పోతాడు'. చివరి దశా తొలిదశ ఒకేలాగా మారటం అంటే ఆ మనిషి జీవితం అనే గీతంలో పదాలు, చరణాలు.. సరిగ్గా పడలేదనే అర్ధం" అంటాడు ఆత్రేయ వేదాంత ధోరణిలో! ఎంతయినా మనసు కవి కదా!


' సీను రాస్తే రాత్రేయే రాయాలి' అనిపించుకున్నాడుగానీ, 'బ్రతికితే ఆత్రేయలాగే. బ్రతకాలి' అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. అతని ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే అందుకు కారణం. '

- కర్లపాలెం హనుమంతరావు 

( రియల్ ఎస్టేట్స్ - మాసపత్రిక - ధనమూలం ఇదం జగత్ కాలమ్ - ప్రచురితం ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...