Showing posts with label telugu velugu. Show all posts
Showing posts with label telugu velugu. Show all posts

Thursday, December 9, 2021

వ్యాసం- బాల భాష- భలే భాష రచన- కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక)

వ్యాసం- 





బాల భాష- భలే భాష 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 



ఊహలను, కష్టసుఖాలను తోటివారితో పంచుకునే సాధనం- భాష. గుంపులుగా సంచరించే జీవులకు భాష అవసరం మరీ జాస్తి. వంటరిగా మసిలే కాకికి పది పన్నెండు అరుపులు వస్తే గుంపులుగా తిరిగే కోతికి వందదాకా శబ్దాలు చేయడం వచ్చు. మనిషి సంఘజీవి కనక భాషా తదనుగుణంగానే ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందింది. ఆ క్రమమే శిశువుల్లోనూ ప్రతిఫలిస్తుంటుందని జీవపరిణామవాదం. బాలభాషను స్థాలీపులాక న్యాయంగా పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.


ప్రాపంచిక వ్యవహారాల్లో భాష అవసరాన్ని కనిపెట్టి మనిషి ఎలా దాన్ని వశంలోకి తెచ్చుకున్నాడో.. శిశువూ అదే క్రమంలో వస్తువులు, వాటి సౌకర్యాలు, వాటిని సమకూర్చుకునే పద్ధతులను గురించి నేర్చుకుంటుంది. ఒక మూల కొన్ని వస్తువుల కుప్ప ఉందనుకోండి. అందులో తనకు కావాల్సిన వస్తువు ఉంది. మూగ సైగలద్వారా స్పష్టంగా చెప్పడం కుదరదు కదా! పెద్దవాళ్ళెవరైనా ఒక్కొక్క వస్తువును చూపిస్తుంటే .. అది అవునో కాదో చెప్పాలి. అనుకున్నది దొరికేదాకా ఓపిక కావాలి. శిశువుకు అంత సహనం ఉండదు. కోరినది వెంటనే అందాలంటే స్పష్టమైన పదంతో సూచించడం అవసరం. మాటలు నేర్చుకోవడం అందుకే శిశువుకైనా ఒక తప్పనిసరి అవసరంగా మారింది. మాటలు రాని ఇద్దరు శిశువులను ఒకే చోట కూర్చో పెట్టిచూడండి. వాళ్ళిద్దరూ ఏవో విచిత్రమైన శబ్దాలతో పరస్పరం సంభాషించుకునే ప్రయత్నం చేస్తారు. అదే మాటలు నేరిస్తే కావాల్సిన వస్తువు పేరు వత్తి చెప్పో, ముఖకవళికలద్వారా సూచించో, అవయవాలను యథాశక్తి కదిలించో సాధించుకోవచ్చు. కానీ ఈ అభ్యాసమంతా ఎన్నో తప్పుల తడకలో తమాషాగా సాగుతుంది. ఆ కోణంనుంచే ఈ రచన సాగుతుంది. బిడ్డకు వస్తువు పేరు తెలిసినా దాని లక్షణం సంపూర్ణంగా తెలియదు చాలాసార్లు. ఆ వస్తువును గురించి తనకు తట్టిన భావంతో గుర్తించడం బిడ్డకు అలవాటు. బెల్లం రుచి నచ్చి బెల్లం పేరు పలకటం వచ్చిన పిల్లలు.. రుచి నచ్చిన మరే తినుభండారం చేతికిచ్చినా 'బెల్లం' అనే అంటారు. బెల్లం రుచి పేరు 'తీపి' అని తెలిసిన తరువాత ఆ 'తీపి' ఇష్టం కనక ఇష్టమైన ఏ రుచినైనా వాళ్ళు తీపి అనే అంటారు. పండగనాడు పిండివంటలు చేస్తారు. కాబట్టి అప్పచ్చులు చేసిన ఏరోజైనా పిల్లల దృష్టిలో పండుగైనట్లన్నమాట.

ఒక వస్తువు ప్రత్యేక లక్షణాలను గుర్తించి ఆ లక్షణాలుగల వస్తువును ఆ పేరుతోనే పిలిచే శక్తి కొన్ని నెలలు గడిస్తేనేకాని బిడ్డకు పట్టుబడదు. పెద్దవాళ్లు పక్కనుండి సరిదిద్దే వరకూ చిన్నాన్నను నాన్ననీ, పక్కింటి పిన్నిని అమ్మనీ చేసేసి కంగారు పెట్టేస్తుంటారు. మీసాలు..గడ్డాలు కలగలిసిపోయిన ఆసామినెవరినన్నా చూపించి పెద్దాళ్ళు 'బూచాడు' అని భయపెడితే.. మీసాలు గడ్డాలున్న ప్రతి మగవాడూ ఆ బిడ్డ దృషిలో బూచాడే. ఆఖరికి టీవీలో రోజూ కనిపించే చంద్రబాబునాయుడునుంచి.. యోగా గురువు రాందేవ్ బాబాదాకా. వ్యక్తుల ప్రత్యేకలక్షణాలను గ్రహించి ప్రత్యేకమైన పేర్లతో గుర్తించడం శిశువుకి అలవాటు అయిందాకా ప్రతిరోజూ ఇంట్లో ఇలాంటి ఏదో తమాషా జరుగుతుండాల్సిందే. ఒక వస్తువు ప్రత్యేక లక్షణాన్ని గుర్తించే సామర్థ్యం అలవడ్డ తరువాత ఆ లక్షణాలున్న అన్ని వస్తువులను ఒక సముదాయంగా భావిస్తారు బిడ్డలు. గులాబి రంగు నచ్చింది కనక మల్లె, మందారం, గన్నేరు, చివరికి గడ్డిపూవైనా సరే- గులాబీలే బాలలకు. పెద్దవాళ్ళు ఒకొక్క పువ్వు లక్షణాన్ని వివరించి పేర్లు చెప్పించాల్సిన సమయమిదే. మొగైనా..పువ్వైనా, రెక్కైనా.. తొడిమైనా ఒక దశలొ పిల్లలకు అన్నీ పూల కిందే లెక్క. వివిధ దశలను ప్రత్యేకమైన పేర్లతొ గుర్తించి పిలిచే పదసంపద సొంతమయేదాకా పిల్లలతో ఇదో రకమైన తారుమారు సరదా.


పిల్లల దగ్గర సభ్యపద ప్రయోగాలు మాత్రమే చేయడం చాలా అవసరం. అర్థం తెలియకపోయినా పెద్దవాళ్ళ మాటలను గుడ్డిగా అనుకరించడం పసిబిడ్డల లక్షణం. భాషను చురుకుగా నేర్చుకోవడానికి బిడ్డకు ఉపకరించేదీ అనుకరణ గుణమే. అనుకరణ బిడ్డకు అంత సులభమేమీ కాదు. ఎన్నో పాట్లు. కొన్నిసార్లు నవ్వు పుట్టించే సందర్భాలూ కద్దు. పిల్లలకు తెలిసే వస్తువులు కొన్నే. ఆ వస్తువుల లక్షణాలు కనిపిస్తే తెలీని వాటినీ వాటి పేర్లతోనే పిలుస్తుంటారు. ఇంట్లో ఉండే తువ్వాయికి నాలుగు కాళ్ళు కనక నాలుగు కాళ్ళున్న గాడిదైనా సరే వాళ్ళకళ్ళకి తువ్వాయే. పండక్కి తను కొత్తగౌను కట్టుకుంది కనక ఇంట్లో వాళ్ళందరూ గౌన్లే కట్టుకుంటారని ఓ పాపాయి ఊహ. నిన్న, రేపు, కొనడం, అమ్మడం, రావడం, పోవడం.. లాంటి పదాల మధ్య తేడాలు అంతుబట్టక ఒకదానికి బదులు ఒకటి వాడి నవ్వు తెప్పిస్తుంటారు ప్రతి ఇంట్లోనూ పిల్లలు. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఆటలాడుకుంటూ కల్పించుకునే సొంతపదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వస్తువులకు వాళ్ళు పెట్టే పేర్లు ఒక్కోసారి చాలా సృజనాత్మకంగా కూడా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. 'పడవ'ను ఒక పాపాయికి 'కాలవ ఇల్లు' అంది. వానబడితే కప్పలు బెకబెకలాడతాయి కనక వర్షాన్ని మరో చిన్నారి 'బెకబెక'గా సంబోధిస్తుంది. మానవసంబంధాలను అచేతన పదార్థాలకూ ఆపాదించే కావ్యలక్షణం పసివాళ్లకు ఎలా అబ్బుతుందో..అదో అబ్బురం. ఒక పాపకు వంకాయి పేరు మాత్రమే తెలుసు. సంత నుంచి


తండ్రి తెచ్చిన సొరకాయను, పొట్లకాయను .. వరసగాబెట్టి వంకాయ అమ్మమ్మ, వంకాయ తాతయ్య అంటూ వంకాయభాషలోనే పిలుస్తుంది. ఇంకో పాపకు పక్కింటి పడుచుపిల్లదగ్గర బాగా చనువు. అస్తమానం 'అక్క' అంటో ఆ పిల్ల వెంటే తిరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ ఆ పాపకు అక్క అమ్మ, అక్కఅన్న, అక్కనాన్న.. అని లెక్కన్న మాట. మరో బాబు దృష్టిలో పోషణ చేసేవాళ్ళందరూ అమ్మల కిందే జమ. అందుచేత


నీళ్ళుచేదుకునే బావి - బావమ్మ, అప్పచ్చి ఇచ్చే పక్కింటి ఆమె 'అప్పచ్చమ్మ'. చుట్టరికాలతో సొంతంగా పాటలు కట్టుకుని పాడుకోవడం పిల్లలకు ఎంతో సంతోషం కలిగించే సరదా. 'కప్ప నీ అప్ప, బల్లి నీ బావ, బొమ్మ నీ అమ్మ, చీమ నీ చెల్లెలు'- ఇలా సాగే పిల్లల పాటలు ఆంగ్లంలో 'నాన్సెన్స్ రైమ్స్' పేరిట చాలా ప్రసిద్ధి. పిల్లల ఈ అభిరుచి వల్లే బాలలకథల్లో కాకిబావ, నక్కమామ లాంటి చిత్రమైన పాత్రలు పుట్టుకొచ్చింది. తల, గొంతు, తత్సంబంధమైన తదితర కండరాల కదలికలను బట్టి ధ్వని ఉచ్చారణ ఉంటుందని మనందరికి తెలుసు. కండరాల స్వాధీనత వెసులుబాటు శిశువు ఉచ్చారణను నిర్దేశిస్తుంది. ఆ స్వాధీనానికి బిడ్డకు కొంత వ్యవధానం అవసరం. అయినా ఈ లోపే శిశువుకి వస్తువుమీద ఒక అవగాహన ఏర్పడి వుంటుంది. కండరాలను సులభంగా కదిలించగలిగిన అక్షరాలనే బిడ్డ ముందుగా పలుకుతుంది. ర, డ లాంటి అక్షరాలు అంత సులభంగా లొంగవు. త, ప లాంటి అక్షరాలూ ఆరంభంలో పలకడం కొంచెం కష్టమే. కష్టమని ప్రయత్నం శిశువుల లక్షణం కాదు. ఒక అక్షరాన్ని పలకడంలోని ఇబ్బంది.. దాని పక్క అక్షరాన్నిబట్టి ఉంటుంది. త, ప.. లు లాంటివి ఒంటిగా పలికే ఇబ్బందిని 'అత్త.. అప్ప' అని 'అ' ముందు చేర్చడంద్వారా పరిష్కరించుకోవడం ఇలాంటి ఒక పద్దతి. అక్షరాలను మార్చడం, కొన్ని అక్షరాలను వదిలేయడం, కష్టమైన అక్షరాలకు బదులుగా తేలిక అక్షరాలు పలకడం ఇంకొన్ని పద్ధతులు. కొత్తపదం దొరికినప్పుడు పరిచయమున్న పాతపదానికి దాన్ని అనుసంధానించుకోవడంద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. శిశువు. రోకలి- లోకలి, తమలపాకు-తాంపాకు, పటికబెల్లం- కటికబెల్లం, పులుసు- పుస్సు, పెనసలు- పెస్సలు, పుస్తకం- పుత్తకం.. ఇలా ఎన్ని పదాలనైనా గుర్తించవచ్చు. రెండేళ్ళు నిండేవరకు శిశువుకు 20, 30 పదాలకు మించి రావు. మూడు నాలుగు ఏళ్ళకు అత్యద్భుతమైన వేగంతో నాలుగైదు వందల పదాలదాకా సాధిస్తారు పిల్లలు. ఒంటరిగా వుండే పిల్లలకు పదాలు ఎక్కువ రావు. ఈడుకు మించినవాళ్ళతో జోడుకట్టే బాలల భాషాజ్ఞానం అసాధరణంగా ఉంటుంది. పరిస్థితులు, ఆరోగ్యం, ఆసక్తి, పరిశీలనా శక్తి.. ఇలా భాషాభ్యాసానికి దోహదం చేసే ఉపకరణాల చిట్టా పెద్దదే.


అన్ని భాషాభాగాల్లోనూ నామవాచకాలను పిల్లలు ముందు గ్రహిస్తారని ఒక సాధారణ అభిప్రాయం. అభ్యాసం నామవాచకాలతోనే ప్రారంభమైనా శిశువుకి క్రియావాచకాలమీద

ధ్యాస జాస్తి. పని చేయడం మీదే శిశువుకు సహజంగా ఉండే ఆసక్తి దీనికి కారణం. ఇతర భాషాపదాలనూ క్రియాపదాలుగా మార్చి పలకడం.. అదో విచిత్ర పద విన్యాసం. ప్రతి పదానికి ఒక క్రియని జోడించే అలవాటువల్ల ఆ పదాన్ని ఆ క్రియకు పర్యాపదంగా ఉపయోగిస్తుంది శిశువు. మేడమీదకు తీసుకు వెళ్ళడానికి 'మీద.. మీద' అని సూచించడం దీనికి ఒక ఉదాహరణ. విరుద్ధపదాలను సైతం ఒకే వాక్యంలో సమర్ధవంతంగా కూరి వినోదం అందించడం పిల్లల మరో తమాషా విద్వత్ లక్షణం. ఆడవాళ్ళతో చాలాకాలం మెలిగిన బిడ్డ మొగవాళ్ళతోనూ 'ఇది ఇయ్యవే..ఇలా రావే' అని మాట్లాడుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది?


పొడుగు పొడుగు వాక్యాలతో గాని పెద్దలు స్పష్టపరచలేని భావాన్ని ఒక చిన్న పదంతో స్పంష్టంగా వెలిబుచ్చగల చిచ్చర పిడుగులు చిన్నారులు. అసలు సిసలు మినీకవులన్నా తప్పు లేదు. ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపమనడానికి 'జో..జో.." అని రెండక్షరాలతో సూచిస్తుందో బాలమేధావి. రెండు మూడు సంబధంలేని విడి పదాలను జోడించి విచిత్రమైన వాక్యం తయారు చేయగలరు బాలలు. 'నాన్న.. తియ్య.. లే' అంటో చేతులు తిప్పుకుంటో పిల్లాడు చెబుతున్నాడంటే 'నాన్న మిఠాయి తీసుకురాలేదు' అని ఫిర్యాదు చేస్తున్నాడన్న మాట.


అభినయం తగ్గి మాటలు పెరగడం శిశువు వికాసదశ పరిణామం. వస్తువు, దాని ప్రత్యేక లక్షణం గుర్తు పట్టే విచక్షణ పెరిగే కొద్దీ పదాలను పొందిక చేసి వాక్యాలుగా ఉచ్చరించడం బిడ్డకు అలవాటవుతుంది.


పసిపిల్లలకు 'నేను' అన్న భావం ఒక పట్టాన బుర్రకెక్కదు. అందరూ తనను ఎలా పిలుస్తారో తననూ తానూ అలాగే సంబోధించుకుంటుంది ఓ చిట్టి. 'చిట్టికి పప్పులు కావాలి' అంటే 'నాకు పప్పులు కావాలి' అని అర్థం అన్నమాట. 'చిట్టి ఏడుస్తుంది.. చూడూ' అని అరుస్తుందంటే 'నన్ను ఏడ్పించద్దు' అని అర్థించడమన్న మాట.


'వర్షం వెలిసింది' అనడానికి 'వర్షం పోయింది' అని, 'నూనె ఒలికింది' అనడానికి 'నూనె పారిపోయింది' అని .. ఇలా ఒక పదార్థ లక్షణాన్ని వేరొక పదార్థ లక్షణానికి అన్వయించేసి చిత్రమైన పదబంధాలను తయారుచేసే శక్తి పసిపిల్లలది. ఎంతకూ తన మాట వినిపించుకోని తల్లిమీద 'నీకు చెవులు కనిపించవా?' అని గయ్యిమంటో లేచిందో పిల్లరాక్షసి. ఎంత అదిమి పట్టుకున్నా ఆ తల్లిపెదాలు నవ్వుతూ విచ్చుకోకుండా ఉంటాయా? 'అయ్యో.. బంగారంలాంటి బలపం పారేసావే' అని తండ్రి గద్దించడం గుర్తుంచుకున్న బాబు .. బళ్లో ఉపాధ్యాయుడు 'బంగారం చూసావా?' అని అడిగినప్పుడు 'చూసాను.. బలపం లాగుంటుంది' అనేస్తాడు ఠకీమని. ఎంత కోపిష్టి గురువుకైనా

ఫక్కుమని నవ్వు రాకుండా ఉంటుందా? 'అల్లరి చేసే బిడ్డ ఒళ్ళో ఇన్ని పప్పులు పోసి 'ఈ పప్పులు తీసికెళ్ళి వీటితో ఆడుకో' అని తల్లి గద్దిస్తే.. బిడ్డా అంతే చురుగ్గా ' 'పప్పుల్తో ఆడుకోం! పప్పులు పెట్టి చిన్ని తోటీ చింటూతోటీ ఆడుకుంటాం' అని తల్లి భాషను పెద్దఆరిందలా సరిదిద్దబోతే పెద్దవాళ్ళం మనం ఎంతసేపని పెదాలు బిగపట్టుకోగలం?! ఇట్లాంటి మెట్లెన్నో ఎక్కిన తరువాతే ఏ బాలైనా రేపటి ఉద్దండపిండంగా తయారయేది. భాషాభ్యాసంలోపదకవిపితామహుడు నన్నయకైనా దాటక తప్పని పసిదనపు చిలిపి దశలివన్నీ.***


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 

Wednesday, February 10, 2021

భార్యావిధేయత - కర్లపాలెం హనుమంతరావు- సరదావ్యాసం - తెలుగు వెలుగు ప్రచురణ

 





విధివిధేయతకన్నా గడుసుపురుషుడు భార్యావిధేయతను నమ్ముకుంటాడు.

భగవంతుడు కనిపించడు. భార్య కనిపిస్తుంది. భయం భార్యమీదా, భక్తి భగవంతుడిమీదా ఉంచుకొంటే బతికున్నంతకాలం భుక్తికి వెదుకులాట తప్పుతుంది.

పెళ్లినాడే పెళ్లాం కొంగుకి పంచె  అంచు ముడివేయించి మరీ పెద్దలు భార్యామణి ఆధిక్యతను అధికారికంగా ప్రకటిస్తారు.   బరువు భాద్యతలు భర్తవంటారుగాని.. వట్టిదే! భర్త బరువుభాధ్యత భార్యదే! భార్య బరువుబాధ్యత భర్తకు పడకటింటివరకే పరిమితం,

 పెళ్ళికోసం పాపం మొగాడు కలర్ఫుల్ కలలు కంటాడుగానీ .. భర్తబతుకు ఉత్తరకుమారుడికి మించి ఉత్తమంగా ఉంటుందన్న భరోసా లేదు. పెళ్లయిన ఉత్తరక్షణంనుంచే పిల్లాడికి  లక్ష్మణకుమారుడి లక్షణాలు ఆవహిస్తాయి.

బైట పల్లకీమోత సంగతేమోగానీ.. ఇంట పెళ్లాన్ని తప్పించుకొనే రాత విధాత ఏ మగవాడి నుదుటా రాయలేదు.

పెళ్లాం చెబితే వినాల్సిందే!  రాముడు అదే చేసాడు. అష్టకష్టాల పాలయ్యాడు, అయినా కృష్ణుడూ అదే బాటపట్టి భార్యామణి కాళ్లు పట్టాడు. పడకటిల్లే కదా! ఏ పాట్లు పడితే మాత్రం తప్పేంటి! అనేది వట్టి బుకాయింపులకే! గడపకవతలా  తన తరుణి గీచిన గీత  మగవాడు జవదాటరాదు. దాటితే ఏమవుతుందో ఏ మొగుడూ బైటికి చెప్పడు!

ఎన్నికల్లో ఓటేసే జనాలంత అమాయకంగా ఉంటారా భార్యలెవరైనా! మగాడేదో మానసిక సంతృప్తి కోసం ఆడదాని జడత్వం మీదనో.. పతివ్రతా మహత్యం మీదనో కథలు కవిత్వాలు  అల్లుకుంటే అల్లుకోవచ్చుగాక. ఆడవాళ్ళు వాటిని చదివి లోలోన నవ్వుకుంటారని పాపం మగభడవాయికి తెలీదు!

లల్లూప్రసాదు అర్థాంగి   శ్రీమతి రబ్రీదేవమ్మగారి కథల్లోనే స్త్రీశక్తి ఏమిటో  తేటతెల్లమవడంలేదా! పోనీలే పాపమని మొగుణ్ణి తనమీద పెత్తనం చెలాయించేందుకు ఆడది అంగీకరిస్తుంది కానీ.. వాస్తవానికి ఇంటి పెత్తనం, మొగుడి కంటిపెత్తనం.. వంటిపెత్తనం.. చివరాఖరికి.. జైలుకెళ్ళిన భర్త కుర్చీమీద కూడా దాన వినిమయ విక్రయాది సర్వహక్కుభుక్తాలు తాళికట్టించుకొన్న భార్యామణికి మాత్రమే దఖలుపడి ఉంటాయి. న్యాయస్థానాలు కూడా అందుకు విరుద్ధంగా తీర్పులివ్వడానికి పస్తాయిస్తాయి. న్యాయాధీశుడూ ఒకింటి ఇల్లాలి అర్థాంగుడే కదా!

 

కైకేయిని కాదని దశరథుడు ఏమన్నా చేయగలిగాడా? సత్యభామను రావద్దని కృష్ణస్వామి యుద్ధభూమికి వెళ్లగలిగాడా? భార్యను కాళ్లదగ్గరుంచుకున్నట్లు బైటికి వీరబిల్డప్పే  శేషప్పశయనుడిది!  భృగుమహర్షి పాదాలు  పట్టాడని అలిగి భూలోకం తారుకున్న శ్రీలక్ష్మమ్మను  ప్రసన్నం చేసుకోడానికి  ఆ ఏడుకొండలవాడు పడ్డ ఇడుములు అన్నీ ఇన్నీ కావు! సహధర్మచారిణి సాహచర్యంలో ఏ మజా లేకపోతే  మహావిష్ణువంతటి భగవంతుడూ అన్నేసి కోట్ల ఖర్చుకు  వెనకాడకుండా పెళ్లిపిటల మీదకు తయారవుతాడు! విరాగి.. బికారి.. అంటూ వీరబిరుదులు ఎన్ని తగిలించుకుంటేనేమి! ఇద్దరు భార్యలనూ  సుబ్బరంగా ముద్దు చేశాడా లేదా  ఉబ్బులింగడు! విధాతగారి కథయితే మరీ విచిత్రం. అర్థాంగి  అవసరం ముదిమితనంలో మరీ ఎక్కువ.   వావివరసలైనా చూసుకోకుండా అందుకే సరసమహాదేవి సరసన చేరిపోయాడు ముసలిబ్రహ్మయ్య!

పూర్వాశ్రమంలో ఎంత చింకిపాతలరాయుడైనాగానీ .. తన మెళ్లో తాళి కట్టిన అదృష్టానికి  'శ్రీవారు' హోదా ప్రసాదిస్తుంది స్త్రీ మూర్తి! అలాంటి ఒక ఉదారమూర్తిని మగాడు ఓ దినం ఎన్నుకొని  అభినందించేందుకు పూనుకోడమేంటి! ఫన్నీ! ఇంగ్లీషువాడికదో  చాదస్తం. మనదేశీయ మగవాడు మాత్రం అడుగడుగునా ఏడడుగులు తనతో కలిసి నడిచిన  ఇల్లాలి అడుగులకు మడుగులు వత్తుతూనే ఉంటాడు.. ఇంట్లో!  బైటకు చెబుతారా అన్నీ!

భార్య కొన్నవి మినహా ఏ మగవాడైనా స్వంత అభిరుచి మేరకు దుస్తులు  ధరించే సాహసం చేయగలడా! విసుగుపుట్టో, జాలి కలిగో.. రీమోటు వదిలితే తప్ప మగవాడన్నవాడు స్వంత ఇంట్లో పడకటింట్లో అయినా ఇష్టమైన ఏ 'ఎఫ్' చానల్నైనా  మనసారా చూడగలడా! 'భోజనంలోకి ఏం చేయమంటారండీ!' అంటూ భార్యలు తలుపు చాటునుంచి  బిడియపడుతూ అడిగి.. చేసి.. వడ్డించే   స్వర్ణయుగం కేవలం ప్రబంధాలలోనే!     వంటకు వంకపెట్టటం అటుంచండి మహాశయా! భార్య బజారునుంచి కొనుక్కొచ్చిన ప్రియా పచ్చడికైనా వంకపెట్టే గుండెదైర్యం ప్రపంచంలో ఏ మొగాడికైనా ఉంటుందా.. చెప్పండి! పచ్చడి పచ్చడి ఐపోదూ ఆ రోజంతా బతుకంతా!

స్త్రీ పాత్ర లేని నాటకాలంటే మగాళ్ళు ముచ్చటపడి రాసుకొనే ఉటోపియాలు!  స్త్రీ ప్రమేయంలేని.. ముఖ్యంగా భార్యామణి హస్తాలులేని సంసారాలను ఆ విధాతకూడా సృష్టించలేడు. సృష్టించాలని ఉన్నా కట్టుకున్న శారదమ్మ చూస్తూ ఉరుకోదు!

'కవులేల తమ కావ్యములలో భార్యలగూర్చి వర్ణించరు?' అని వెనకటికి  తర్కం లేవదిసింది ఓ  ఎల్లేపెద్ది వెంకమ్మగారు 'విద్యానంద'మనే పాత పత్రికలో!

(విద్యానంద- 4-1928) కాళిదాసు శకుంతలను అంత కిలికించితాలుగా వర్ణించాడుగాని..  కట్టుకున్న భార్య కట్టుబొట్టులనైనా  గట్టిగా ఓ శ్లోకంలో వర్ణించలేదని ఫిర్యాదు.  శూలపాణీ అంతే! ముఫ్ఫైయ్యేడు నాటకాల్లో లెక్కలేనంతమందిని ఆడవాళ్లను  అణువు వదలకుండా వర్ణించిన శృంగారపురుషుడు!   అణగిమణగి ఉందన్న చులకనభావం  కాబోలు.. అన్న వస్త్రాలు వేళకు అందించే భార్య సుగుణాలలో ఒక్కటీ సదరు పాణిగారి దృష్టికి ఆనింది కాదు!   

తల్లులను తలుచుకొన్నవారు కొందరున్నారు. అవ్వలమీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించిన కవులూ కొంతమంది కద్దు.  అన్ని దేశాలకవులు తమతమ  రాజులనే కాకుండా వారి వారి దేవేరులను, భార్యలను, వేశ్యలను సైతం  వర్ణించి తరించడం కనిపిస్తున్నదే గాని.. సొంతభార్యల ప్రస్తావనల దగ్గరమాత్రం  ఎందుచేతనో సర్వే సర్వత్రా పస్తాయింపులే!  ఏ కావ్యపీఠికైనా పరకాయించి చూడండి! కావ్యపోషకుడి వంశవర్ణనలే మెండు. ఒక్క రెండు మూడు మంచిపద్యాలైనా సమయం సందర్భం చూసుకొని  కంచిగరుడ సేవ చేసే ఇంటి ఇల్లాలును గురించి రాద్దామన్న బుద్దే ఏ కవిమన్యుడి మనసులో కలగలేదాయ

భార్య లఘువుగా ఉండి మరీ భర్తను గురువు చేస్తుందని మళ్లీ షేక్ష్పియరే స్త్రీమూర్తిని మోస్తాడు! భార్యలేని మొగాడు పైకప్పులేని తాటియాకు గూడని జర్మనీలు కూడా వంతపాడారు. అదృష్టం ఎన్ని భాగ్యాలైనా ప్రసాదిస్తుందిటగానీ.. అనుకూలమైన భార్యమాత్రం  ఈశ్వరేచ్చే'నని చివరికి పెళ్ళికాని ప్రసాదు  జాన్ పోప్ పాలు సైతం  వాక్రుచ్చారు! మరెందుకీ మగాళ్ళందరికీ తాళికట్టిన మఃహిళ మీదంటేనే అంత మత్సరం!

'నిప్పు.. నీరు..  భార్య' అందుబాటులో ఉండే అత్యంత  అపాయకరాలని ఆ ఎద్దేవాలెందుకు మగమహారాజులకు! ఏ మాటకామాటే! నిప్పూ నీరుకు మల్లే ఆడదీ  వళ్ళు మండితే వేడి పుట్టిచ్చేస్తుంది. కన్నీళ్ళతో వణుకూ పుట్టిస్తుంది! మగాడిదే మాయదారి బుద్ధి. చనిపోయిన అర్థాంగి మీదా ఆ మగగాడిద దుఃఖం వాకిలి గడప దాటే దాకానే! 

అందరు మగాళ్ళూ అలాగే ఉంటారని కాదు. మంచన మహాకవి 'కేయూరుబాహు చరితం'లో మగాడి ప్రేమకు అద్దం పట్టే ఓ చిత్రమైన కథా ఉందిభార్య వయసులో చిన్నది. భర్తకు ఆమె అంటే అంతులేని అనురాగం. ఆమె గర్భం దాల్చింది. ఆ  సమయంలోనే ఊరు వాళ్ళంతా  తీర్థయాత్రలకని బైలుదేరారు. 'వయసులో ఉన్నదానివి. నాలుగూళ్లు తిరిగాలన్న సరదా సహజం. నీ గర్భం నేను భరిస్తాను. తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి తిరిగి తీసుకో!' అంటూ ఆలి గర్భం తనకు బదిలీచేయించుకొని మరీ ప్రసవవేదనలు పడేందుకు సిద్ధపడతాడు.   చూలు మోయడమంటే పేలాలమూట మోయడమా! అన్నం సయించదు. నిద్రబాధలు. బిడ్డకుట్లకు ఓర్చి  నీళ్లాడినా.. తరువాత వాతాలు తగలుకోకుండా  పథ్యపానీయాలతో పంచకరపాట్లు పడాలి! గర్భంమోసి బిడ్డను కని.. పెంచి పోషించేందుకు ఆడది అయిదు మల్లెల   సుకుమారి అయి కూడా ఎన్ని కష్టాలనైనా   ఇష్టంగా ఓర్చుకొంటుందో మగవాడు తెలుసుకోవాలి ముందు

నాగరీకులమని బోరవిరుచుకు తిరిగే  నేటి తరాలకన్నా.. ఆనాగరికులుగా ముద్ర వేయించుకొని హీనంగా బతుకులు వెళ్లమార్చే జాతులు కొన్నింటిలో మగవాడు భార్య ప్రసవవేదనలను పలురీతుల్లో తానూ పంచుకొంటూ నిజమైన సహచరుడు అనిపించుకొంటాడు.

ఎరుకల కులంలో  భార్య ప్రసవించే సమయానికి  మగవాడు అమె కట్టు బొట్టులను  తాను అనుకరిస్తూ చీకటిగది కుక్కిమంచంమీద దుప్పటి ముసుగులో  దాక్కుంటాడు. భార్యకు సుఖంగా ప్రసవమయితేనే  మంచం దిగడం! బాలింత తినాల్సిన గొడ్డుకారం.. ఇంగువ ముద్దలు భర్తే మింగుతాడు.  అండమాను దీవుల్లోని మరో తెగలో అయితే   గర్భిణీ భార్య తినకూడని గొడ్డుమాంసం, తేనెవంటి పదార్థాలు తనూ ముట్టడు.  బిడ్డ పుట్టగానే పెనిమిటి ఉయ్యాల్లో పడుకొనే వింత ఆచారం న్యూగినియా ఆదిమజాతుల్లో నేటికీ ఉన్నది. పార్శీసు జాతి మగాడికి ఉయ్యాల శిక్షతో పాటు వంటికి నల్లరంగు పులుముడు అదనం. మైల తీరేదాకా గది బైటికి రాడు కూడా ఆ జాతిలో మగవాడు. బిడ్డ బొడ్డుతాడు ఊడే వరకు ఉపవాసాలుంటాడు అతగాడు.  ఫిలిప్పీన్ దీవుల్లో   ప్రసవించే సమయంలో  భార్య గది గస్తీ బాధ్యత కట్టుకొన్న భర్తదే. బిడ్డ పుటకకు తనే కారణమన్న వాస్తవం  లోకానికి చాటిచెప్పే ఇట్లాంటి తంతులు ఇంకెన్నో పలుదేశాల ఆదిమజాతులు ఈ నాటికీ నిష్ఠగా ఆచరిస్తున్నాయి!  పురిటిబాధల్లో భాగం పంచుకోవాలని  ప్రసవ సమయంలో   భార్య మంచానికి తనను తాను కట్టేసుకొనే  మియాస్ తెగ మగాడికి మించి భార్యలను  ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? 

బుద్ధభగవానుడు భార్యాభర్తలిద్దరూ పాటించవలసిన సూత్రాలు చెరి ఐదేసి  బోధించాడు. 'భార్యను చీదరించుకోకుండా, సంపూర్ణ గౌరవం అందిస్తూ, ఆమెకు తనివితీరా అన్నవస్త్రాలు, ఆభరణాలు  క్రమం తప్పకుండా అందించడం భర్త బాధ్యత అన్నాడు. పరస్త్రీలను కాముక దృష్టితో చూడకపోవడాన్ని మించి మగవాడు మగువకు ఇవ్వగల గొప్ప ప్రశంస మరేదీ లేదని కూడా బుద్ధుడు చురకలంటించాడు.

 

రెండు పుంజులు, రెండు పిల్లులు, ఎలుకలు, ముసలివాళ్లు, పడుచుపెళ్లాం ఉంటే  ఇంట రభస తప్పదని డచ్ దేశంలో ఓ సామెత కద్దు. ‘మగవాడి జీవితానికి రెండే శుభసందర్బాలు.. పెళ్లయిన రోజు, భార్యను పూడ్చిపెట్టిన రోజు’ అని పంచ్ పత్రిక పంచ్! ఎంత అన్యాయం! ‘నీ భార్యను నువ్వు గాడిద చేసావంటే.. ఆ గాడిద నిన్ను ఎద్దును చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!- అని మాత్రమే నేటి వనిత మగవాడిని హెచ్చరిస్తోంది.

మగవాళ్ళు తమ ఎద్దు మొద్దు స్వరూపాలు గుట్టుగా ఉండాలంటే ఆ 'గాడిద' కూతల జోలికి వెళ్ళనే  కూడదు మరి. భార్యలను ప్రశంసించేందుకు ప్రతి ఏటా సెప్టెంబరు నెల  మూడో ఆదివారం నాడు  భార్యామణిని ప్రశంసించే దినం’ (Wife Apptreciation Day) జరుపుకుంటారు పశ్చిమదేశాల్లో మగవాళ్ళు! ప్రశంసలు అనక! సర్వస్వాన్ని నిస్వార్థంగా అర్పించడానికి సిద్ధపడి మగాడి గడప తొక్కిన ఆడదాన్ని ముందు సాటి మనిషిగ్గా గుర్తించడం   నేర్చుకోవాల్సుంది పురుష ప్రపంచం స్ర్వే సర్వత్రా!.

ప్రతి పురుషుని విజయం వెనకా ఒక  స్త్రీ ఉంటుందంటారు కదా! ఆ స్త్రీ కట్టుకున్నది కాకపోతే ఆ పురుషుడి బతుకు ఇక ఇస్త్రీనే! ఆ సంగతి  గుర్తుంచుకోవాలి మగమేస్త్రీలు.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

(తెలుగు వెలుగు మాసపత్రిక ప్రచురణ)

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...