Showing posts with label Adult. Show all posts
Showing posts with label Adult. Show all posts

Monday, February 15, 2021

పుష్పాభిషేకం - కథానిక - కర్లపాలెం హనుమంతరావు- ఆంధ్రభూమి వారపత్రిక ప్రచురణ


 

పుష్పాభిషేకం - కర్లపాలెం హనుమంతరావు - ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక మే - 11 2000 నాటి సంచికలో ప్రచురితం 

Tuesday, November 14, 2017

తల్లిభాషకే తొలి తాంబూలం- ఆంధ్రప్రభ సంపాదకీయ పుట వ్యాసం




"తెనుగు బాసను జుంటి తేనియని పొగడి
పొరుగింటి పులుసుపై మరులు పెంచిన వాడు
దేశభాషలలోన తెలుగు లెస్సని చాటి
మల్లెలను బదులు లిల్లీలు వలచినవాడు తెలుగువాడు"
-డాక్టర్ సి. నారాయన రెడ్ది
వెయ్యేళ్లు పైబడిన చరిత్ర తెలుగు భాషది-అంటూ న్యాయస్థానాలముందు పోరాడి పాక్షికంగా గెలిచిన వాళ్లం. మంచిదే. కానీ.. పరుగులెత్తే కాలంతో సమానంగా మన తెలుగును పరుగులెత్తించడంలో మాత్రం బొత్తిగా  వెనకబడుతున్నాం!
'ఆంధ్ర కవితకు పితామహుడ'ని మనం భుజాలకెత్తుకుని మోసేన నన్నపార్యుడు తెలుగు భాషకు కావ్యగౌరవం కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన 'మహా భారతం' ప్రారంభ ప్రార్థనా పద్యం పూర్తిగా సంస్కృతంలోనే సాగింది! అచ్చు తెనుగు అక్షరాలని ఆంధ్ర భాగవతమనే వెన్నెల్లో పిండారబోసిన తెలుగు కవి పోతన్నను మాత్రం  ఏ స్థాయిలో ఉంచాలో  తెలియక ఈ నాటికీ కుస్తీలు పడుతున్నాం!  ఆదికవి ఎవరన్నలాంటి సాహిత్య వివాదాలు అలా పక్కన  పెట్టేయండి. ఏ తెలుగు పలుకు ప్రామణికమో.. ఏ తెనుగు  పదం అప్రామాణికమో..  తేల్చుకోలేనంత అయోమయంలో ఉన్న మనం ఏ ప్రాంత జనం నోట పలికే మాటకు సాధికారత కల్పించాలో అంతుపట్టనంత దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ  నేపథ్యంలోనే కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించింది. అస్తిత్వం, ఆత్మగౌరవం నినాదాలతో పోరాడి గెల్చుకున్న తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ నేత శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు  అధికార పగ్గాలు చేత పట్టారు.  తెలంగాణాలో ఈ ఏడాది చివర డిసెంబరులో జరగబోయె తొలి తెలుగు ప్రపంచ మహాసభకు ఇదీ నేపథ్యం. మరి ప్రపంచ తెలుగు మహాసభల పూర్వరంగం  ఎలా ఉంది? ఒకసారి అవలోకించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
మొదటి తెలుగు ప్రపంచ మహాసభలుః
మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు నేటికి 42 ఏళ్ల కిందట 1975, ఏప్రియల్ నెలలో వారం రోజుల పాటు(12నుండి 18వ తారీఖు వరకు) మహావైభవంగా జరిగాయి. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం వేదిక. అప్పటి అంచనాల ప్రకారం రోజుకు సుమారు లక్షమంది హాజరయారు. మహాసభ నగరానికి 'కాకతీయ నగరం', 16దేశాల నుండి 92మంది పరిశీలకులు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి 900 చిల్లర ప్రతినిధులు, తెలుగు రాష్ట్రం నుంచి 4500 వరకు భాషాభిమానులు ఈ పాలుపంచుకొని మహా సభల ప్రపంచ స్థాయిని అక్షరాలా నిలబెట్టారు.  సదస్సుల వేదికకు 'నాగార్జున పీఠం', ప్రాచీన వైభవాన్ని, సంస్కృతులను తెలియ చేసే ప్రదర్శనశాలకు 'శాతవాహన నగరం', తెల్లవార్లూ సాంస్కృతిక ప్రదర్శనలు సాగిన ప్రాంగణానికి 'శ్రీ కృష్ణదేవరాయ నగరం' లాంటి నామకరణాలు జరిగడం బట్టి తెలుగు నేల మీది వివిధ  ప్ర్రాంతాల మధ్య ఎంతో శ్రద్ధగా సమతౌల్యం పాటించినట్లు చెప్పకనే చెప్పినట్లు అవగతమవుతుంది. (ఈ మహా సభలకు ఆరేళ్ల ముందే ఆంధ్ర ప్రాంతంలో 'ప్రత్యెకాంధ్ర' ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన నేపథ్యం గమనార్హం) ఉదయం 9గంటల మొదలు సాయంత్రం 6గంటల వరకు.. మధ్యలో ఒక గంటపాటు భోజన విరామం మినహాయించి 5 రోజులూ రోజుకు 8 గంటల చొప్పున 40 గంటల పాటు సుమారు అరవై అంశాలమీద గోష్ఠులు సాగినట్లు రికార్డులు చెపుతున్నాయి. భాష, సాహిత్యం, చరిత్ర, వైజ్ఞానిక, సాంకేతిక అంశాలమీద సుమారు 1500 మంది మేథావులు తమ తమ ఆలోచనలను కలబోసుకున్నారీ సభల సందర్భంగా!
ఏడాది కిందట ఉగాదికి జరిగిన రాష్ట్ర స్థాయి సభల్లోని తీర్మానం ఈ ప్రపంచ స్థాయి సభలకు నాందీ కాగా.. మరో ఆరేళ్ల అనంతరం మలేసియా కౌలాలంపూరులో జరిగిన మరో తెలుగు ప్రపంచ మహా సభలకు ఈ సభలే ప్రేరణగా నిలిచాయి.
రెండవ తెలుగు ప్రపంచ మహా సభలుః
మరో ఆరు సంవత్సరాల అనంతరం 1981, ఏప్రియల్ 14- 18 వరకు.. ఐదు రోజుల పాటు మలేసియా కౌలాలంపూరులో అట్టహాసంగా జరుపుకొన్నారు ప్రపంచ తెలుగు మహా సభలు.  సభాధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు. సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా సభలకు అప్పటి మలేసియా ప్రధాని డాక్టర్ మహీతీర్ బిన్ మహమ్మదీ ముఖ్య అతిధిగా విచ్చేసారు. సభలనుద్దేశించి నాటి భారత దేశాధ్యక్షులు శ్రీ నీలం సంజీవ రెడ్డి సందేశం వినిపించారు.
మూడవ తెలుగు ప్రపంచ మహా సభలుః
మరో నాలుగేళ్ల తదనంతరం 1990, డిసెంబరు 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు మారిషస్ దేశంలో ప్రపంచ స్థాయి తెలుగు మహా సభలు జరుపుకొన్నారు తెలుగువారు. మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, ఆ దేశ ప్రధాని సర్ అనిరుధ్ జగన్నాధ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ తెలుగు మహా సభలలో. ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. నారాయణ రెడ్ది ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు విద్యావేత్తలు, కవులు, కళాకారులు, చలన చిత్ర నటులు, అధికారులు బృందాలు బృందాలుగా ఆ మహా సభలకు హాజరయ్యారు.
నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభలుః
నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభలు సుమారు 25 కోట్ల ఖర్చుతోనాటి ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2013 డిసెంబర్ నెలలో మూడు రోజుల (27, 28, 29) పాటు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిధ్యాలయం ప్రాంగణంలో ఆర్భాటంగా జరిగాయి. 37 ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు నేల మీద జరిగిన తెలుగు మహాసభలు ఇవి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని లోపాలకు ఆస్కారం రానివ్వకుండా తెలుగు  భాషకు సంబంధించిన ముఖ్యులందరి నుంచి ముందస్తుగా తీసుకున్న సూచనలను స్వీకరించి అందుకు అనుగుణంగా,  సాధ్యమైనంత వివాద రహితంగా నిర్వహించిన చక్కని తెలుగు మహాసభలు ఇవి.
అదే ఏడాది ఐరాస్ సాంస్కృతిక శాఖ 'ప్రపంచ మాతృభాషాదినోత్సవ'  సందర్భంగా ఇచ్చిన థీమ్ 'సమగ్ర ఆధునిక విద్యా సమేతంగా మాతృభాషలో విద్యాబోధన'. మాతృభాష, దాని వినియోగం, విస్తృతి, ప్రయోజనాల పరంగా పూర్వ భావజాలానికి పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాలు సమాజంలోని అన్ని రంగాలు, వర్గాల్లో ప్రబలమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ మహా సభల ముందు ఉన్న బాధ్యత బృహత్తరమైనది. ఈ నేపథ్యంలో చర్చోప చర్చలు, గోష్టులు తీవ్రంగానే సాగినా.. తెలుగును అధికార భాషగా అమలు చేసే విషయంలో అవకాశాలను సాధ్యమైనంత మేరా ఉపయోగించుకోవాల'న్న సాధారణ తీర్మానం చేసి సరిపెట్టడంతో ఈ సభల లక్ష్యం అరకొరగానే  ముగిసినట్లయింది.
2014 నాటికి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలి పోవడంతో నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభల ఆ  తీర్మానం అమలుకూ కాలం చెల్లిపోయినట్లయింది.
తెలంగాణా తొలి తెలుగు మహా సభలుః  
తెలంగాణా ఏర్పాటయిన మూడేళ్ల తరువాత జరుగుతున్న ప్రపంచ స్థాయి మహా సభలు ఇవి.  తెలంగాణా సంస్కృతి, భాష, అస్తిత్వం, ఆత్మగౌరవం వంటి ఉద్వేగభరిత అంశాలతో ఉద్యమ మార్గంలో పోరాడి రాబట్టుకొన్న  రాష్ట్రం..  మొదటి   తెలుగు మహా సభల్లో  ఆస్థాయిలోనే ప్రపంచానికి తన ప్రాభవాన్ని చాటి చెప్పాలని ఆరాట పడటంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.
ముఖ్యమంత్రే  స్వయంగా ప్రకటించినట్లు దాదాపు 50 కోట్లు ఈ మహాసభల నిర్వహణకుగాను వెచ్చించబోతున్నారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు జరిగబోయే ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ దేశాల నుంచి 500 మందిని, వివిధ రాష్ట్రాల నుంచి 1000 మందిని, రాష్ట్రంలో ఉన్న సాహితీ, భాషావేత్తలను మరి కొంతమందిని  మహాసభలకు ఆహ్వానించాలని సంకల్పం. ఈ మహా క్రతువులో భాషాభిమానులందరిని భాగస్వామ్యులను చేయాలని.     ఏడు వేదికల ద్వారా తెలంగాణా బహుముఖ పార్వాలని మహోజ్వలంగా  ప్రపంచానికి  ప్రదర్శించి చూపాలని  తెలంగాణా  ఉవ్విళ్లూరడం ..బాగుంది. కానీ
సభల నిర్వహణ మీద జరుగుతున్నంత హాడావుడి సభలో తీసుకోవాల్సిన తీర్మానాల మీద
జరుగుతున్నదా?
ప్రపంచీకర దురాక్రమణ మూలకంగా స్థానిక భాషల ఉనికికి ముప్పు ముంచు కొచ్చేస్తోంది.  అవిఛ్చన్నంగా సాగుతున్న సామాజిక, సాంకేతిక, ఆర్థిక, సాంస్కృతిక  పరమైన  అభివృద్ధుల్లో  భాషదీ కీలకమైన స్థానం. ప్రజలు తమ  జీవితాలలో కోరుకొనే మెరుగుదలలకి కూడా అదే భాష అనివార్యంగా ఉంటుంది, 
కానీ వాస్తవంలో జరుగున్నదేమిటి? పడమటి గాలి ధాటికి  తతిమ్మా జాతుల మాదిరే తెలుగువారి   జీవిత మౌలిక విలువలూ కొట్టుకు పోతున్నవి. తెలుగుదనం పరిమళాలు   మరింత వాడిపోకుండా  పాలకులుగా ప్రభుత్వం చేపట్టవలసిన సత్వర దిద్దుబాటు చర్యలు చాలా ఉన్నాయి.  అవి ఏమిటో.. ఏ దిశగా ఆ సంక్షేమ చర్యలు సాగవలసి ఉన్నదో క్షేత్ర స్థాయి నుంచే ప్రజావాహిని నుంచి  నేరుగా సేకరించుకొనే చక్కని అవకాశం ఈ మహా సభలు కల్పిస్తున్నాయి.
ప్రపంచీకరణ వల్ల, అంతర్జాతీయ సంబంధాల వల్ల, పరాయి దేశాల కొలువల మీద అవసరానికి మించి పెరిగే  కాంక్షల వల్ల, బతుకు తెరువుకు అతకని  ఆధునికత మీద గుడ్డి అకర్షణ వల్ల మిగతా మానవీయ విలువలతో పాటు మాతృభాషకూ  చాపకింద నీరులా చేటు కలుగుతున్న నేపథ్యంలో మునపటి మహా సభలకన్నా ఇప్పుడు జరుపుకోబోతున్న తెలుగు మహా సభల ప్రాముఖ్యం మరంత పెరిగింది.
పాఠశాల, కార్యాలయం, న్యాయస్థానం, వ్యాపార స్థలం, వినోదాల వేదిక.. అన్నింటా తెలుగు వాడి మౌలిక భాషను తోసిరాజని భ్రష్ట ఆంగ్లం  దురాక్రమిస్తున్నది.
ఆ సంకర ఆంగ్ల భాష స్థానంలో మనదైన సజీవ భాషకు వాస్తవంగా ఎంత వరకు స్థానం కల్పించే అవకాశం ఉంది? భావోద్వేగాలతో భాషా దురభిమానులు చేసే అతి సూచనలను పట్టించుకోవలసిన పని లేదు.. ఆంఫ్ల  భాషను కాదనుకుంటే అభివృద్ధిని చేజేతులా జార విడుచుకొన్నట్లే? అనే ఆధునికుల వాదనలు పూర్తిగా కొట్టి పారేయ దగినవి కాదు. కానీ..  స్వాతంత్ర్యం సాధించుకొని ఏడు దశాబ్దాలు దాటినా సామాన్యుడు తనకు పుట్టుకతో  సహజ సిద్ధంగా అబ్బిన పలుకుబడితో నిత్య జీవితావసరాలను నిశ్చింతగా ఎందుకు  గడుపుకోలేక పోతున్నట్లు? పాలన, బోధన, రంగాలలో భాష భ్రష్టు పట్టడానికి మూల కారణాలు ఏమిటి? కారకులు ఎవరు? ఆ లోపాలను అరికట్టేటందుకు పాలకులుగా ప్రభుత్వం తీసుకొనే సత్వర చర్యలు ఏమిటి?  రాజభాషగా విరాజిల్లినప్పుడే ఏ ప్రజాభాషకైనా సాధికారత సాధ్యమయేది.
ఉద్యోగాలు, ఉపాధి కొరకు మాత్రమే కాదు భావోద్వేగాల ప్రకటనకు, సంబంధ బాంధవ్యాల పటిష్ఠతకు, అస్తిత్వానికి, ఆత్మ సన్మానానికి, ప్రపంచం ముందు తనదైన సొంత ముద్ర ప్రదర్శనకు.. మాతృభాష అవసరమవుతుంది. అమ్మ కన్నా కమ్మనైన పదం లేనట్లే అమ్మభాష కన్నా మధుర పథం ఉండబోదు. తెలుగు వారి బుర్ర కథను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఒక ఫ్రెంచి బృందానికి తెలుగు గడ్డమీద  తెలుగు నేర్పే ఉపాధ్యాయులు దొరకడం  కష్టమయిందని వాపోయింది ఈ మధ్య. తెలుగు వారికి విదేశీ భాషలు నేర్పందుకు సీఫెల్ వంటి సంస్థలు ఉన్న నేల మీద విదేశీయులకు తెలుగు భాష నేర్పే సంస్థలు కానరావు?! హైదరాబాద్ లో అమెరికన్ రాయబార కార్యాలయం ఆరంభించేందుకు ముందు  ఇక్కడ పనిచేసే అమెరికన్ అధికారులకి ప్రాంతీయ భాషతో పరిచయం అవసరమయింది. అందుకుగాను రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఎనిమిది నెలలు పటుదలతో  మన తెలుగు మీద ఆ అధికారులు పట్టు సాధించారు. మరి తెలుగు ప్రజలతో మమేకమై పాలనా వ్యవహారాలు చక్కబెట్టే ఐ ఏ ఎస్.. ఐ పి ఎస్ కేడర్ పల్లెపట్టులకు వెళ్లినప్పుడు తెలుగు పలుకు పలికేందుకు చిన్నబుచ్చుకుంటున్నారు! విదేశీ ఉద్యోగాలను ఆశించే 25 శాతం విద్యార్థులకోసం మిగతా 75 శాతం  విద్యార్థులను పుట్టినప్పటి నుంచే కాన్వెంట్ల చదువుల మిషతో  గొడ్లచావిళ్లవంటి గదుల్లో బంధింధి హింసించే అమానుషత్వం ఒక్క తెలుగు గడ్డల మీదే చూస్తున్నాం. అరకొర నైపుణ్యాలతో ఆంగ్లం నేర్చుకుంటూ మాతృభాష అబ్బవలసిన విలువైన బాల్యదశను వృథాగా చెయ్యి జార్చుకుంటున్న తెలుగు పిల్లలను చూస్తే వాస్తవానికి జాలి కలగవలసి ఉంది. మబ్బులని చూసి ముంతలోని నీళ్లను పారబోసుకొనే కన్నవారి అమాయకత్వాన్ని కార్పొరేట్ చదువుల పేర  నిలువునా దోచుకునే కుహనా విద్యాషాఢబూతుల ఆట కట్టించ వలసిన బాధ్యత ప్రబుత్వాల మీదే కదా ఉన్నది? అన్యాయానికి గురై న్యాయస్థానానికి వెళితే అక్కడా సామాన్యుడు బోనులో బొమ్మలా నిలబడి తన తరుఫున సాగే వాద ప్రరివాదాలను  గుడ్లప్పగించి చూస్తూ వినడం కన్నా అన్యాయముంటుందా ఎక్కడైనా?
అందుకే ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావుగారు తెలంగాణాలో జరగబోతున్న తొలి తెలుగు మహా సభల లక్ష్యం పాలనలో, బోధనలో, సామాజిక జీవనంలో తల్లి భాషకే ప్రథమ తాంబూలం అని తడబాటులేమీ చూపించకుండా ప్రకటించడం భాషాభిమానులు.. పురోగమనవాదులంతా రెండు చేతులా మనసారా ఆహ్వానించ దగిన గొప్ప పరిణామం.
-కర్లపాలెం హనుమంతరావు
6142283676
(15-11-2017 నాటి ఆంధ్రప్రభ దినపత్రిక- సంపాదకీయ పుటలో ప్రచురితం) 



Thursday, August 11, 2016

చందమామ విజయ రహస్యం

కాదేదీ నా కబుర్లకనర్హం
మా చిన్నతనంలో బాలల బొమ్మల భాగవతం.. భారతం.. రామాయణం.. లాంటి పుస్తకాలు  చదవడం ఎంతగా ఇష్టపడేవాడినో .. అరవై ఏళ్ళు దాటిన ఈ వయస్సులో కూడా అలాంటి సాహిత్యం కంటబడితే అంతగానే ఇష్టపడతాను. నాలాగే చాలామంది అలాగే ఇష్టపడుతారనే అనుకుంటాను!
పిల్లలకోసం రాసిన పుస్తకాలను పెద్దలం మనమూ అంతే ఇష్టంగా చదవడం కాస్త విడ్డూరంగానే ఉంటుంది. కానీ.. మనస్తత్వవేత్తలు మాత్రం 'ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కదా.. అది మంచి ఆరోగ్యానికి సంకేతం కూడా' అంటున్నారు.
పిల్లల పుస్తకాలలో సాధారణంగా కనిపించే పాత్రలు.. కథానాయకులైనా.. కథానాయికలైనా.. రాక్షసులైనా.. భూతాలైనా.. ఎలాంటి పై ముసుగులు లేకుండా అటు మంచివైపో.. ఇటు చెడువైపో ఉండటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కథ నడుపున్నంత సేపూ ఎలాంటి  మాయా మర్మాలు చూపకుండా  కథానాయకుడు సాహస వీరుడుగానో.. తెలివితేటలు కలవాడి ఉవకుడిగానో.. అమాయకుడిగానో.. పరోపకారిగానో.. సమాజంలో పదిమంది మెచ్చే ఇంకా ఏ ఇతర సుగుణాలు కలవాడిగానో మాత్రమే కనిపిస్తుంటాడు. కథానాయికలైతే అతి సుకుమారులు. అత్యంత సౌందర్యరాశులు. అమాయకత్వం మూర్తీభవించిన ముగ్ధబాలలు. రాక్షసులు.. భూత ప్రేత పిశాచాలు..  సవతి తల్లులు.. మంత్రగత్తెలు..  భయంకరమైన జంతువులు.. వంటి దుష్టశక్తుల చేతుల్లో పడి రక్షించేవారికోసం అలమటించే నిస్సహాయులుగా కనిపిస్తూ మన సానుభూతిని చూరగొంటారు. ప్రతికూలశక్తులేవైనా గానీయండి..  నిష్కారణంగా .. నీచంగా.. అసహాయులను అవస్థల పాల్చేస్తూ.. ఆనందించే కౌటిల్యం ప్రదర్శిస్తుంటాయి. వాటి చెడుకు.. కథానాయకుల రూపంలో కనిపించే మంచికి మధ్య నిరంతరం కథ జరుగుతున్నంత సేపూ సంఘర్షణ జరుగుతుంటుంది. ఆ ఘర్షణలో అంతిమంగా ,, కచ్చితంగా మంచికి విజయం కలగడం.. అమాయకమైన అందమైన కథానాయికలు విముక్తి చెందడం.. చదివే చిన్నారులకు ఎంతో సంతోషం కలిగించే అంశాలు.
వయసు పైనబడి శరీరం వడలిపోయినా .. అంతర్గతంగా .. పసిపిల్లలకు మల్లే ఎప్పుడూ మంచికే జయం కలగాలని; దుర్మార్గం.. దౌర్జన్యం.. రాక్షసత్వం.. శాశ్వతంగా ఓడితీరాలన్న తీవ్రకాంక్ష   ఇంకా  మనసులో ఇంకిపోకుండా మిగిలున్నపెద్దలకి .. పిల్లల మాదిరిగానే.. అలాంటి బాలసాహిత్యం ఎంతో ఆనందం.. ఉత్తేజం.. కలిగిస్తుంది.

పెద్దలకోసం రాసిన పుస్తకాలలో మంచి మంచిలాగా స్పష్టంగా కనిపించక పోవచ్చు. చెడు మంచి ముసుగు వేసుకొని వంచనకు తెగబడుతుండవచ్చు. అందం అన్నివేళలా ఆనందం కలిగించే విశేషం కాకపోవచ్చు. అమాయకత్వమూ  సానుభూతి చూరగొనే తీరులో ఉండక పోగా.. ఒక్కోసారి తీవ్రమైన కోపం తెప్పించే పద్ధతిలో విసుగు పుట్టించవచ్చు. మంచికి .. చెడుకు మధ్య జరిగే సంఘర్షణ బాల సాహిత్యంలో మాదిరి స్పష్టంగా ఉండక..  మేదో సంబంధమైన నారికేళపాకంలో కూడా సాగే రచనలుగా ఉండవచ్చు. తలుచుకొనేందుకే ఇష్టంగా ఉండని మానవ సంబంధాలు.. అవినీతి.. అకృత్యాలు.. క్రౌర్యాలు.. కామకలాపాలు.. నమ్మక ద్రోహాలు..నరికి చంపుకోడాలు..  ఇలా ఏవైనా.. ఏ రూపంలో అయినా .. కనిపించి చదివేవారి మనసుమీద ప్రతికూలమైన వత్తిడి పెంచి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే  రీతిలో సాగవచ్చు. అలాంటి రచనలు వాస్తవానికి.. వాస్తవ ప్రపంచానికి ప్రతిబింబాలుగా ఉన్నంత మాత్రాన.. పెద్దలందరికీ ఒకే విధంగా ఆదరణీయం కాకపోవచ్చు. సంస్కృతీ సంబంధమైన వైవిధ్యాలు.. భాషాసంబంధమైనా వైరురుధ్యాలు.. అన్ని రచనలను అందరు పెద్దలు ఒకే తీరులో అభిమానించేందుకు అవరోధంగా మార్చుతుంటాయి.  పెద్దల సాహిత్యంలో అంతిమ విజయం కచ్చితంగా  మంచికే దక్కాలన్న నియయ.. నిబంధనలు కూడా ఉండవు.  ప్రౌఢసాహిత్యం విషయంలో అందుకే అందరు పెద్దలకు ఒకే విధమైన అభిమానం ఉండాలని ఆశించడం అహేతుకం.
బాలల సాహిత్యంలో ఈ బెడదలేవీ ఉండవు.  ఏ రూపంలో ఉన్నా కథ.. కథనాలు.. సరళంగా.. సదా సమాజహితంగా సాగుతూ.. మంచి చెడుల మధ్య విభజన రేఖ నల్లబల్లమీద తెల్లసుద్దతో వేసిన బొమ్మంత స్పష్టంగా… అందంగా ఉంటుంది. అందుకే అది భాషా.. సంస్కృతి.. కాలం.. దేశం.. వంటి పరిమితులకు అతీతంగా ప్రపంచంలోని  పసిపిల్లలందరి  మానసికానందానికి.. మనో వికాసానికి ఒకే తీరులో ప్రేరణ అవుతుంటుంది. పిల్లల మనస్తత్వంగల పెద్దలనూ అదే తీరులో అలరిస్తుంటుంది.

తెలుగులో కొన్ని దశాబ్దాల పాటు అవిఛ్చినంగా సాగి ఆబాల గోపాలాన్ని ఒకే తీరుగా అలరించిన.. అలరిస్తున్న..   విజయావారి 'చందమామ' మాస పత్రిక విజయంలోనే ఈ రహస్యం దాగి ఉంది.

బాలసాహిత్యాన్ని నిజంగా ఇష్టపడుతున్నట్లయితే- అలా ఇష్టపడుతున్నట్లు బాహాటంగా  చెప్పుకోడాన్ని  పెద్దలెవరూ చిన్నతనంగా భావించవలసిన అవసరం లేదు. బాలల సాహిత్యాన్ని అభిమానిస్తున్నారంటే ఆ  పెద్దల మనసులూ బాలల మనసులంత స్వచ్చంగా.. సహజంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లే లెక్క
-కర్లపాలెం హనుమంతరావు
*** 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...