అనగనగా ఓ గాడిద. దానికి బతుకుమీద విరక్తిపుట్టి రేవులో మునిగి చద్దామని బయలుదేరింది. చివరి నిమిషంలో దేవుడు ప్రత్యక్షమై 'ఏవిటి నీ బాధ?' అని అడిగాడు. 'కోకిలమ్మకు కమ్మటి గొంతిచ్చావు. కోతిబావకు గెంతులిచ్చావు. నెమలికన్నెకు అందమైన ఈకలిచ్చావు. మా జాతిదే అయిన గుర్రానికీ మంచి తేజాన్నిచ్చావు. సింహాన్ని సరే వనానికే మహారాజుని చేసావు. చివరికి చిట్టెలుకక్కూడా గణాధిపతి వాహనంగా గౌరవమిచ్చావు. నేనేం పాపం చేసానని నాకీ గాడిద బతుకిచ్చావు?! గాడిదచాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను. చీదరింపులకు అంతే లేదు. ఇన్నిన్ని అవమానాలు పడుతూ బతికేకన్నా ఈ రేవులో పడి చావడం మేలు' అని ఘొల్లుమంది గాడిద.
'ముందా కొళాయి కట్టేయ్! ఏం జన్మ కావాలో కోరుకో!' అన్నాడు దేవుడు జాలిపడి.
'అందంగా ఉండాలి. అందరూ నా వెంటే పడాలి. పదహారేళ్ళ పడుచుగా పుట్టించు దేవా!' అని అడిగిందా గాడిద ఆశగా.
'తథాస్తు!'అని దీవించి మాయమైపోయాడు దేవుడు.
పదహారేళ్ళ పడుచుగా పదహారు రోజులైనా కాకుండానే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యానుకి ఉరేసుకోబోయిందా మాజీగాడిద.
'మళ్ళా ఇదేం పిచ్చిపని!' అర్జంటుగా ప్రత్యక్షమైపోయి ఆత్రంగా అడిగాడు దేవుడు అడ్డంబడి.
'నా అందమే నాకు శాపమైంది. అడ్డమైన వెధవా ప్రేమించానని వెంటబడుతున్నాడు. కాదంటే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. ఇక్కడా నాకు గాడిదచాకిరీ తప్పడంలేదు. ఇంట్లో రోజూ పెద్దయుద్ధమైపోతోంది. ఈ మగప్రపంచంలో ఆడదానికి ఇంటా బైటా బేటిలూ.. బాటిలే! ఆడదై పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలన్న సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో ఇప్ప్డు అనుభవంలోకొచ్చింది. మానుగా వద్దుగానీ.. వీలైతే నన్ను ‘జెంటిల్ మేను’గా పుట్టించు! కుదరదంటావా.. నా మానాన నన్ను చావనీయ్!' అని ముక్కు చీదిందా కన్నెగాడిద.
'జెంటిల్మాన్ అంటున్నావు కాబట్టి ఓ గవర్నమెంటు చిన్నబళ్ళో పంతులయ్యలా తక్షణమే పుట్టు!' అంటూ ఆశీర్వదించి అంతర్దానమైపోయాడు దేవుడు.
సర్కారుటీచరుగా పుట్టి శతదినోత్సవంకూడా రాకుండానే టేంకుబండుమీదనుంచి దూకబోయిందా గతజన్మగార్దభం.
యథాప్రకారం మళ్లీ విధాత ప్రత్యక్షం! 'పదిమందికీ పాఠాలు చెప్పే పని అప్పగించినా ఇదేం పిచ్చిపని పంతులుగారూ! అయ్యవారి వృత్తీ నీకు నచ్చలేదా?!'
'అయ్యో! నాకసలు పిల్లకాయలకి పాఠాలు చెప్పే అవకాశం ఎక్కడొచ్చింది స్వామీ! అందరూ నాకు పాఠాలు చెప్పేవాళ్ళేనాయ! వేళకు జీతాలు రావు. వచ్చిన జీతాలు చాలవు. ఎవరికీ పంతులంటే లెక్కే లేదు. జనాభా లెక్కల్నుంచి, ఓటర్ల వివరాల సేకరణవరకు అన్నింటికీ అయ్యవార్లకే చచ్చేచావాయ! గాడిద చాకిరీ ఇక్కడా తప్పడంలేదు. గాడిదలకన్నా బుద్ధితక్కువ వెధవాయలతో వేగలేకే ఈ విరక్తి. బడిపంతులైతే అబ్ధుల్ కలాంసారుకిమల్లే మంచిపేరొస్తుందని ఆశపడ్డాగానీ బడుద్దాయుల నోళ్ళలో పిచ్చి పిచ్చి మారుపేర్లతో నానుతానని తెలీదు. వంటబట్టని చదువులు, వకపట్టాన అంతుబట్టని జీవోలు, అంతేలేని పదోన్నతుల కౌన్సలింగులు, అంతమేలేని బలవంతపు బదిలీలు, బెదిరింపులు! బందులదొడ్డిలాంటి బడి. దాని చవుడుగోడలకిందబడి దిక్కుమాలిన చావు చచ్చేకన్నా.. ఈ మురికినీళ్లల్లోకి దూకి ముందే నీ దగ్గరకు రావడం సుఖమనిపించిందయ్యా! మంచిపుటక పుట్టే యోగం ఎటూ లేదు. మనసారా చావడానిక్కూడా నాకు రాసిపెట్టిలేదా భగవాన్?!’ అని ఎదురు దాడికి దిగాడా గాడిద జీన్సు ఉపాథ్యాయుడు.
'ఆ అవకాశం నీకు రాసిపెట్టిలేదు భక్తా! ‘వైద్యో నారాయణో హరిః’ అనిగదా సామెత. మరి ఆ భూలోక దేవుడి అవతారంకూడా ఓసారి ట్రై చేసి చూడరాదా?' అంటూఅంతర్ధానమయిపోయాడు దేవుడు.
వైద్యుడుగా జన్మించిన ఆ జీవి ఆరునెల్లు తిరక్కుండానే యథాప్రకారం ఆత్మార్పణకు పూనుకొన్నాడు.
దేవుడికి తప్పుతుందా? తిరిగి ప్రత్యక్షం!
'పదిమంది రోగులకి మంచి మందూ మాకూ ఇచ్చి మానవసేవ చేయమని వైద్యమాధవుడిగా పుట్టిస్తే.. నువ్వేందీ.. మళ్ళీ ప్రాణార్పణకు బైలుదేరావు? మళ్లీ ఏం పుట్టి మునిగింది నాయనా?'
'ప్రాణదానాలు చేయమని ప్రభుత్వాసుపత్రుల్లోనా పారేసేది పరంధామా! ఆపరేషన్లు చేయడానికి పరికరాలే కరువు వైద్యాలయాల్లో! రోగి ప్రాణంపోతే బంధువులు మా ప్రాణం తీసేస్తున్నారు. ఏళ్లతరబడి కళ్లు గుంటలుపడేటట్లు చదివింది నెలకు సరిపడా ఇంటికి సరిపడా సరుకులైనా కొనలేని జీతభత్యాలకోసమా? పగటికీ, రాత్రికీ తేడా తెలీకుండా ఆ డ్యూటీలేంటి? పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకొంది.. అదిగో.. వాడి తల్లి డెలివరీ రోజునే! ఈ పరేషాన్లు నా వల్లయే పన్లు కాదుగాని.. వీలైతే నా పూర్వజన్మ గాడిద బతుకే తిరిగి ఇచ్చేయ్! కాదంటే నీ దారిన నువ్వు దయచేయ్!'
'పోనీ ఓ సాఫ్టువేరు ఇంజనీరు బాడీ ఖాళీ కాబోతోంది. అందులోకి నిన్ను ఇన్ స్టాల్ చెయ్యమంటావా?ఇవాళ కుర్రకారంతా అంతిమంగా కోరుకొంటున్నది ఆ విలాసజీవితమేగా?'
గాభరా పడింది గాడిద. 'అయ్యయ్యో! అంతపని చెయ్యద్దు దేవయ్యా! ఆ జన్మ జన్మజన్మలకీ వద్దనే వద్దు. ఎవడి బాడీలోకో దూరి మళ్ళీ వాడి కారులోను, కార్డులోను, హోములోను గట్రా క్లియర్ చేసేందుకు గాడిద చాకిరీ చేసేకన్నా.. నా సొంత గాడిద బాడీలోకే దూరిపోయి తంటాలు పడ్డం మేలు ! ఎప్పుడూడిపోతుందో కూడా తెలీని ఆ సంచారజీవి నౌఖరీకన్నా.. ఎవరికీ అక్కర్లేని నా ఖరం పోస్టే మెరుగు!'
'పోనీ మంచి సినిమా స్టారువయ్యే ఉద్దేశం ఉందా? బోలెడంత గ్లామరూ.. డబ్బూ.. అందం.. ఆనందం.. అభిమానులూ నీ సొంతం. కొంతకాలం పోతే సొంత రాజకీయపార్టీకూడా పెట్టుకోవచ్చు. అన్నీ కలసివస్తే అమాంతం ఏ ముఖ్యమంత్రో, దేశానికీ ముఖ్యమైన మంత్రో అయిపోవచ్చు. భూమ్మీద జన్మించిన ప్రతి జీవీ అంతిమంగా ఆశించే అంతస్తును అందుకొనే అంతిమ సోపానం అంతకు మించింది మరేదీ లేదు బోళాభక్తా! మరి నీయిష్టం!'
'అడ్డదారుల్లో వెళ్ళి అలా పెద్దమనిషయేకన్నా.. నేరుగానే సియమ్మో పియమ్మో అయిపోవడం ప్రాణానికి హాయిగదా దేవా? వీలయితే ఆ రెండు పదవుల్లో ఏదో ఒహటి వెంటనే ప్రసాదించు స్వామీ! మళ్ళీ ఆత్మహత్యలమాట తలపెడితే ఒట్టు!'
దేవుడి మొహంలో చిరునవ్వు.
'మూడు మానవ జన్మలెత్తంగానే ఎంత తెలివిమీరిపోయావే గాడిదా! ఆ పదవులేమీ ప్రస్తుతానికి ఖాళీగా లేవుగానీ దానికన్నా కొద్ది దిగువలో ఉన్న మంత్రిపదవి శాంక్షను చేస్తున్నా.. సర్దుకో!' అంటూ అంతర్ధానమైపోయాడు యథాప్రకారం జనార్దనుడు.
గాడిద ఆ మంత్రి పదవి వెలగబెడుతున్న ఏడాదిలోనే జిల్లా పరిషత్ ఎన్నికలొచ్చిపడ్డాయి. మంత్రిగారి ఇలాకాలోని జనం జెల్లాయి కొట్టేసరికి మాజీగాడిదగారి మంత్రిపదవి ఊడింది.
ముఖ్యమంత్రిగారి క్యాంపాఫీసు కార్యాలయంలోక్కూడా ప్రవేశం దొరకనంత అధమావస్థకి పడిపోయింది మాజీమంత్రిగారి పరపతి.
ఆ అవమానంతో.. ఆందోళనతో మంచమెక్కిన మూడోరోజుకే నాడి పడిపోయి దేవుడు కనిపించాడు మళ్లీ. బావురుమన్నాడు గాడిదజీవుడు. 'ఆడపిల్లగా ఉన్నప్పుడు మగాడి వేధింపులకన్నా, అయ్యవారుగా ఉన్నప్పుడు పిల్లకాయలు తిట్టిపోతలకన్నా, వైద్యవృత్తిలో ఉన్నప్పుడు రోగిబంధువులిచ్చిన కాలితాపులకన్నా.. ఇప్పుడు చాలా ఆవేదనగా ఉంది పరమాత్మా! పదవూడిన తరువాత నేతబతుకెంత యాతనగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. దీనికన్నా నా పూర్వజన్మ గార్దభమే ఎన్నోరెట్లు మిన్న. నా పాతజన్మ నాకు తిరిగి ప్రసాదించవూ! చచ్చి నీ కడుపున పుడతాను మహానుభావా!’
'అది కుదిరేపని కాదు గాడిదా! అందుకే నిన్ను నేను ముందే అన్ని విధాలుగా హెచ్చరించింది’ అన్నాడు దేవుడు తాపీగా.
అయోమయంగా చూసాడు జీవుడు.
'అటు చూడు! అంతా నీకే తేటతెల్లంగా అర్థమవుతుంది!' అన్నాడు దేవుడు.
జీవుడు అటుగా చూసాడు. గతంలో తను 'ఛీ.. వద్ద'ని చీదరించుకున్న గాడిద బాడీముందు మంగళగిరి చేంతాండంత క్యూ!
ఆ క్యూలో పడుచుపిల్లగా పుట్టినప్పుడు తనతో ఆడుకొన్న ఆడపిల్లలు బోలెడంత మంది! స్కూలుటీచరుగా పనిచేసినప్పుడు తను కలసి పనిచేసిన గురుదేవులూ తక్కువమంది లేరు! గతంలో ధర్మాసుపత్రిలో తనతో కలసి రోగిబంధువులందరిచేత చివాట్లు, చెప్పుదెబ్బలు తిన్న వైద్యనారాయణులందరూ దాదాపుగా అక్కడే నిలబడున్నారు!
తాను వద్దని వదిలేసిన సాఫ్టువేర్లు.. ఇంజనీర్లు, పెద్ద పెద్ద సినిమాస్టార్లు, బిజినెస్ మాగ్నెట్లు, నిత్యం బిజీగా ఉండే మీడియా మొఘళ్ళు, ఇంకా బంజారాహిల్సు జూబ్లీహిల్సుల్లో బంగళాలు కట్టుకొని ప్రపంచానికి దూరంగా బతికే పేరులే తప్ప ఫేసులెప్పుడూ చూడని ఫేమస్ పర్శనాలిటీసు బోలెడంతమంది.. ఎంతో సేపట్నుంచి అక్కడే నిలబడున్నట్లు వాళ్ళ మొహాల్లోని అసహనాలే ఆనవాలు పట్టిస్తున్నాయి.
'ఇంతకీ వీళ్ళందరూ ఇక్కడ నిలువుకాళ్ల ఉద్యోగం చేస్తున్నది ఎవరికోసం? సినిమా థియేటర్లో కనిపించే క్లాసులన్నీ ఇక్కడ క్యూలో కనిపిస్తున్నాయే! దేనికోసం ఈ కోన్ కిస్కాగాళ్ళు, కోటీశ్వరులు ఇక్కడిలా మునిగాళ్లమీద జపాలు చేస్తున్నారు? దేవుడెందుకు తనను వీళ్లవంక చూడమన్నాడు?!' తాను అడిగింది తన పాతగాడిద బాడీనే గదా! తన బాడీ తనకు స్వాధీనంచేయకుండా ఏదన్నా తిరకాసు పెట్టడానిక్కాదుగదా ఈ మాయలమారి దేవుడుగారు ఇప్పుడీ'క్యూ' షో పెట్టింది?! ఆమాటే నట్టుకొట్టకుండా సూటిగా అడిగేసింది దేవుణ్ణి గాడిద.
సమాధానంగా చిదానందంగా నవ్వి చిన్నగా బదులిచ్చాడు భగవంతుడు 'ఆ క్యూ మొదట్లో ఏముందో చూడు! నువు వద్దని వదిలేసిన బాడీనే పడుందక్కడ! ఇప్పుడు దానికీ బోలెడంత గిరాకీ! గాడిదచాకిరీ అని నువ్వు చీదరించుకొన్నావుగానీ.. నిజానికి ఈ క్యూలోని ఏ ఒక్కడన్నా గంటలో చక్కదిద్దే పనిముందు నువ్వు జీవితాంతం ముక్కుతూ మూలుగుతూ చేసే పని దూదిపింజెకన్నా తేలిక.'అడ్డగాడిద' అంటూ నిన్నడ్డంపెట్టుకొని మనుషులు తిట్టుకొంటారని నీ కంప్లయింటుగానీ.. వాస్తవానికి ఇక్కడునవాళ్లందరూ నిత్యజీవితంలో నీకన్నా ఎక్కవ అవమానాలు భరిస్తున్నారు. ఆడవాళ్లపేర్లతో మగవాళ్ళు తిట్టుకొనే తిట్లు నరమానవులు విని సహించలేనివి! పంతుళ్లమీదున్నన్ని పిచ్చిసామెతలు ప్రపంచంలో మరెవ్వరిమీదా లేవు. డాక్టర్లకు నిత్యం ఆసుపత్రుల్లో జరిగే సన్మానాలు చూస్తే నువ్వు తట్టుకోలేవు. ఇహ సినిమావాళ్లమీద నడిచే పుకార్లలో ఒకవంతు నీమీద నడిచినా నువ్వెందుకు మీ అమ్మకడుపులో పుట్టావా అని ఆవేదన చెందేదానివి. డబ్బున్న మారాజులకు పన్నువేధింపులు, మీడియా మొఘళ్లకు గూండా మొగుళ్ళు! నేతాశ్రీల నరకయాతనలముందు నీ బతుకెంత స్వర్గతుల్యమో అర్థం చేసుకో! నీ గాడిద బతుక్కిప్పుడెంత డిమాండొచ్చి పడిందో నీకు తెలీడం లేదు. వానలు పడక ఎండలు మండిపోతున్న ఈ సీజన్లో అందరి నోళ్ళల్లో నీ నామస్మరణే! మీ గాడిదలకు పోటీలు పడి పెళ్ళిళ్ళు ఆర్భాటంగా చేసేస్తున్నారు జనం. గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తే కుంభవృష్టిగా వర్షాలు పడతాయని వాళ్ల నమ్మకం. గత ఎన్నికల్లో ధరావతు కోల్పోయిన నేతాశ్రీలు పోయిన పరువు పరుసు మళ్ళీ ఎలాగైనా దక్కించుకోవాలని కనీసం నీ గాడిద బాడీలోనైనా దూరిపోవడానికి ఇలా పోటీలు పడిపోతున్నారు..'
'నా గాడిద శరీరం నాకే దక్కడం న్యాయం! నా శరీరం నాకు తిరిగి రావాలంటే నేనేం చేయాలి స్వామీ?' బిక్కమొగమేసుకొని అడిగింది గాడిద.
'చేసేందుకేముంది గాడిదా? నా చేతులుకూడా దాటిపోయింది వ్యవహారం. బాడీ నీదే అయినా నీకిప్పిస్తే నామీద కేసేసేందుకు కాచుక్కూర్చోనున్నాయి కొన్ని అదృశ్యశక్తులు. ఆ రిస్కు నాకొద్దు. నువ్వెళ్ళి క్యూలో నిలబడు. నమోదు చేయించుకో! విధి లాటరీ తీయబోతోంది. నీ లక్కు బాగుంటే నీ బాడీ నీకు దక్కవచ్చు' అంటూ ఠక్కున మాయమైపోయాడు దేవుడు .. మళ్ళీ గాడిద ఏ పితలాటకం పీకలకు మీదకు తెస్తుందోనని భయపడిపోయి.
***
- కర్లపాలెం హనుమంతరావు
బోథెల్ ; యల్ ఎస్ఎ
18 -02 - 2021
( ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం )