Showing posts with label constitution. surya. Show all posts
Showing posts with label constitution. surya. Show all posts

Saturday, February 20, 2021

మగాడిగా పుట్టే కన్నా..! - సరదావ్యాసం -కర్లపాలెం హనుమంతరావు



మగాడిగా పుట్టే కన్నా మైల బట్టలు మోసే గాడిదగా పుట్టడం మేలన్నా మన మేల్సంతా! ఆడదేనా ఆకాశంలో సగం? ఈ రకం  నినాదాలే ప్రమాదం.  ప్రమదలందరి మైండ్ సెట్లను టి.వీ సెట్ల  కన్నా అధ్వానంగా  పాడుచేస్తున్నాయ్ అన్నాయ్!

కొద్దిమంది మగ బుద్ధిమంతులున్నారు చూడూ.. వాళ్ళొట్టి డూ డూ బసవన్నలకు సరిజోడు!  అమ్మగార్లతో  ఎన్నో  అవసరాలు! అందుకే ఆ చందమామ  కతలతో కితకితలు! కలకండ పలుకులు కలకంఠి  అంగిట్లో వేసి మగాళ్ల బతుకుల్లో కలకలం రేపేదీ వీళ్లే. అరే! రేపటి ‘డే’ గురించి ముందు చూపుండే ఏ మగాడైనా ఆడదాన్ని మరీ అంతలా  మాడు మీద ఎక్కించుకుని ఊరేగిస్తాడా? 

మనదీ మనదీ మీసాల జాతి! మరీ పొద్దు పోకపోతే.. పోనీ నాలుగు నిమ్మబద్దలు మూతి అంచుల మీదలా నిలబెట్టుకుంటూ కాలక్షేపం చేయవచ్చుగదా!  వీరలు.. ధీరలు అంటూ నారులకు  ఈ వింజామరలు ఎందుకు? మగాడి  బతుకు బండి నడిరోడ్డునిలా డీలా పడిందంటే కారణం మన  మగతనం  మగతతనం కాదూ! ఇన్నిన్ని టీ.వీ సోపులు గుడ్లప్పగించి  చూస్తూ కూడా ఆడదానికి  అన్నేసి సోపులు రాయడమే మగాడి తలరాతిలా తలకిందులు అవడానికి కారణం.

అన్నం పళ్లెం ముందు అమ్మా, పనిపాటల వెనకతాల  పనిమనిషీ,  పడక ఎక్కే కాడ ఆ రంభో, ఊర్వశో, మేనకో.. దాని  మేనత్త కూతురు ‘షో’ నో! ఓ.కే అన్నా! ఒప్పుకుంటాం.. తమర్రాయించి పెట్టిన కమ్మని పద్యాలు, శాంస్క్రీటు శ్లోకాలే ఒప్పచెప్పుకుంటాం. కానీ.. ఇదేందన్నయ్యా!   సలహాలు ఇచ్చే మహా ముఖ్యమైన  పోర్టుఫోలియో కూడా పొయ్యి ముందు చేరి పొగ్గొట్టం ఊదుకొనే

ఆడదాని చేతిలో పెట్టేయడమేనా? వట్టి  మంత్రి పాత్రకు మాత్రమే

పరిమితమయితే ఇంత ప్రమీలార్జునీయం సినిమా ఎందుకు?   తానే మంత్రి.. తానే రాజు..అనే అంటున్నదయ్యా తాన! 'తాన తందనానా' అంటూ వంతలు పాడడం అన్నయ్యా తమకు న్యాయమేనా! 

నాతి చరామి'  హామీని నాతి మరీ అతిగా తీసుకొంటోంది.   ‘తిరిగి ఆడది.. తిరక్క మొగాడు చెడతార’ని సామెత  మరచిపోతోంది. ఆ నానుడికి చెడ్డ పేరు తేవడమెందుకనే కదా మగాడు బుద్ధిగా  చెడతిరిగేది!  విధిలో భాగంగా వీధిలో కృష్యయ్య పాత్రకే న్యాయంగా మగాడు అంకితమవాలి. అరే! ఆలి ఇంట్లో రామయ్య రోలుకైనా మగడిని కుదురుకోనివ్వదే!. ఓన్లీ వంటింటి భీమయ్య రుబ్బురోలుకే మగడు పరిమితమవాలంట! అవ్వ! నలుగురూ నవ్వుతన్నాదురన్నా మొగుడి చేత పెళ్లాం జడ చిక్కుముళ్లు దువ్వించుకొనే ముచ్చట్లు చూసి!

'గాడ్' కూడా మగాడే కదా! మన సైడేలే.. కాపాడుతాడులే!’ అనుకున్నామా!  దగా! ఆ దేవుడుగారూ చిన్నదాని సైడయిపోతున్నాడే.. డే బై డే! ఇంకెవర్నన్నయ్యా దేబిరించేది మాజీ మగమహారాజా హోదా తిరిగి కివ్వాలని?

టు- డే’స్ మహిళా నినాదం మహిళా సాధికారతంట! పూటకో కొత్త  కూతతో సాధిస్తుంటే ఎంత పూటుగా మందు కొట్టీ  ప్రయోజనమేముందంట? 

అప్పలమ్మలు కూడా ఇప్పుడు బుక్కులు.. హక్కులు అంటూ  ఠప్పు ఠప్పున అప్-టు-డేటు అయిపోతున్నారన్నా! 'మీ.. టూ' అంట! ఆ అమెరికా ట్రంపుకే తప్పడం లేదు తంటా!  మామూలు చంటోళ్లం..  మనం మాత్రం‘జోరూ కా గులామ్స్‘ అవకుంటే  రోజులెట్లా జరిగాలి హుజూర్? 

గడ్డాలూ మీసాలూ చూపించి ఆడబిడ్దల్ని  పడేసే  రోజులంటన్నా ఇవి? కాణీ పరకక్కూడా భామల   గడ్డాలు, బుగ్గలు పుచ్చుకు బతిమాలుకునే సిగ్గుమాలిన రోజులు కానీ!

మన తాతగార్లు ఎంతో ధీమాగా తలలెత్తుకు తిరిగారా రోజుల్లో! కాస్తింత  నాన్చినా నాన్నార్ల కాలానా మగాడిది మహరాజ యోగమే! మన కాలంలోనే ఈ గాజుల జోరు! కుక్కిన పేనల్లే పడుండే మ్యాడమ్ గారి కింద ‘కుక్కు’ల్లా,  కుక్కల్లా పడుండే ఖర్మెందుకు పట్టించావయ్యా.. ద్యావుడా! ఛ! ఏం నామర్దా బతుకురా నారాయణా! పెళ్లినాడు పట్టుకున్న గాజుల చేత్తో   పెళ్లాం గూబ గుయ్యిమనిపించినా  బైటికక్కలేని నాజూకు పరిస్థితి. పెళ్లిలో ఆకాశ అరుంధతిని చూసే ఆ కాస్సేపే ఎంత లావు మొగాడికైనా  తల పైకెత్తుకు చూసే గోల్డెన్ ఛాన్స్! మూడు ముళ్లు పడే వేళైనా కాస్త   తలొంచుకోమంటే ఠలాయిస్తుందన్నయ్యా  అమ్మడు ఇప్పుడు!

ఉద్యోగం పురుష లక్షణం సూత్రం సలక్షణంగా సాగే రోజులే నయం.  

భోజనాలు మినహా   మరేమీ చెయ్యడం రాకపోయినా  రాకుమారుడికి మల్లే  రోజులు చెల్లిపోయాయి! 

సుదతులు ఇప్పుడెవరూ కేవలం చాకలి పద్దు రాతలతో సర్దుకు పోవడంలేదు. సామ్రాజ్యాలు ఏలుతామని సవాళ్లు తీస్తున్నారన్నాయ్! రిజర్వేషనుల కోసం రివర్సులో పురుషులే పోరుబాట పట్టే దురవస్థలు కోరి కోరి  తెచ్చుకుందెవరు?మనమే!  మగాడి నిరుద్యోగ భృతి స్త్రీల ఉద్యోగ భత్యాలకు సరి సమాన స్థాయికి చేరుకొనే వరకు పురుషజాతిని ఆదుకోమని  రోదించే రోజులొచ్చి పడ్డాయన్నయ్యా  మన మగాళ్ల  పూపుర్వ విర్వాకాల వల్లా! మహా కష్టంగా ఉందీ మాష్టారూ ముదనష్టపు మగాడి బతుకు! బితుకు బితుకుమంటూ ఈ బతుకెన్నాళ్లు?

ఆలి కాలిగోరు కూడా తగలకుండా  కారు డోరు తెరిచి నిలబడే

కొలువా.. డేమ్ షేమ్! బ్యాక్ డేస్ మాదిరి బ్యాక్ సీట్ డ్రైవింగే మగాడికి మళ్లీ కళ తెచ్చే గొప్ప ఫీట్! ఆ అదృశ్య పాత్ర తిరిగి దక్కే అదృష్టం కోసమైనా మన మగాళ్లమంతా ఏకమవ్వాలి.

మన పురుష సూక్తాలు, స్త్రీ సూక్తాలన్నీ మగాళ్ల మైండ్ గేమ్సం ట!

'వుయ్ డోంట్ కేర్' అని వుమన్ ఫోల్కంతా మరీ మొండికేస్తుందండీ చండికమ్మల్లా! కుమారి శతకం చదువుకోవమ్మా అంటే.. ముందు కుమార శతకం ‘చదువుకొమ్ము.. పొమ్మురా!'  అంటూ  కొమ్మల  కొమ్ములు విసుర్తున్నా గమ్మున ఉండిపోవాల్సిన  ఖర్మం పక్క గుమ్మం మొగుడికైనా వద్దు భగవాన్! అహమిహలకు పోతే పరానికే కాదు ఇహ ఇహానికీ చెడేటట్లుంది వ్యవహారం. మేలుకో నీ మేలుకోసమైనా మాజీ మగమహారాజా!

డేమ్సెల్స్ తో గేమ్స్ మహా డేంజరస్ గా ఉందా?  మహిళల చేతికి ఈ మాయదారి కమీషనొచ్చి మగాళ్ల చెయ్యి చచ్చుపడిందా? మరే! కుట్టు మిషన్లే గొప్పనుకునే ఆడంగులకు ఏకంగా మహిళా కమీషన్లిచ్చేస్తే వ్యవహారం ఇలాగే ముదురుతుందన్నాయా! ముదితల  కమీషన్ల ముందు  మన  మగ రాకాసుల కథా  కమామిషులు  చెల్లని కాసులవుతాయని ముందే  తెలుసుండాల! ఏ నారి ఊసుబోక ఓ చిన్న కేసు వేసినా మన  నరుడు పని మటాష్! ఎన్ని వేల  సూట్ కేసులతోనైనా పని  సానుకూలపడదు.  ఏ క్రిమీ లేయరూ సివిల్, క్రిమినల్ కోడు సెక్షన్లను  ఏమీ పీకలేవు స్వామీ!   ఎవరో వచ్చి ఎలాగోలా రక్షిస్తారని  చేతులూ రెండూ జోడించి గోల పెట్టినా.. చివరికి ఆ రెండు చేతులకు  పడేది ఉక్కు కడియాలే భాయ్! లేడీసా.. మజాకా!

పులుసులో ముక్కలు  తగ్గినా అదే అలుసుగా   పురుషుడి వంట్లో పులుసు తీస్తున్నది ఈ నాటి పుణ్యవతి!  'షి-టీము' పేరు వింటేనే చాలు షివరింగులొచ్చేస్తున్నాయంటే రావా మరి! వనితల టీం వర్కు అటువంటిది. ఆ నెట్‌-వర్క్ చూసైనా మగ మూర్ఖులిక నేర్చుకోవాలి! 'పురుష కమీషన్' అవసరం తెలుసుకోవాలి! 

ఆ ఉత్తర ప్రదేశ్ అమాత్యుడెవరో గానీ..  ఆ హరిభరుడండీ అసలు  సిసలు మగపురుషుడు! జాతీయ మహిళా కమీషన్ మోడల్లోనే జాతీయ పురుష కమీషన్ కావాలని మంకు పట్టు పడుతున్నాడు!    

ఒక్కళ్లంగా ఎంత గావు గావు మన్నా లెక్కపెట్టే నాథుడుండడు. ఒక్క పెట్టున ఏడవాలన్నా  కలసి కట్టుగా ఉండక తప్పని రోజులు. మీలవేణుల నీలుగుళ్లే మొగాళ్ల నివాళ కేరాఫ్ ఫ్లాట్ ఫారమ్ గాళ్లను చేసేసాయ్! కోలుపోయిన మన మగతనం కోసమైనా ఓ  ఫ్లాట్ ఫారం అవసరమన్నాయ్!

కత్తి నుంచి చీపురు కట్ట దాకా ఆడదానికేనా అన్ని ఆయుధాలూ? కనీసం   అప్పడాల కర్రనైనా తక్షణమే నిషేధించాలి.  ఇంటిపట్టున కూడా మగాడు నెత్తికి ధరించే ఇనప బొచ్చెలు ఉచితంగా ఇప్పించాలి. ఈ మాత్రం ‘కాజ్ ‘కైనా  ఓ కామన్ వేదికవసరమే  కదా బ్రదర్!

కమాన్.. మ్యాన్! ఈ నెల్లోనే దిల్లీలో పురుష్ ఆయోగ్  సమావేశం.  ఈ ‘ఆయోగ్ ' ప్రయోగమైనా మన   పురుషుల యోగం మారుస్తుందని ఆశిద్దాం అన్నాయ్?

***

కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్, వాషింగ్ టన్ రాష్ట్రం, యు.ఎస్.ఎ


.


Saturday, August 1, 2020

దేవుడి కథ -కర్లపాలెం హనుమంతరావు- సూర్య ఆదివారం ప్రచురితం





నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే  విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం  మనిషి చేసిన పనే! తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం  దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే. ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం  ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.   భగవంతుడిని సకల సద్గుణ సంపదల  రాశిగా   భావన చేసి ఆ సమ్మోహన  విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని  భజించి తరించమంటూ  'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' న్న ధాతువులను కలగలిపి  ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది.
ఆయుర్వేదమంత్రం(14 -20) చదవండి. అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ  దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది. సంస్కృత వాజ్ఞ్మయాన్ని పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత   సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసిలే   శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవస్తున్నదన్నది ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం.
ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి  తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా కుడా దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు.  మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా  దివ్యత్వం ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?
దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే  మనిషి దగ్గర  చెప్పేందుకు సబబైన సమాధానం లేదు.  వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమించేసే ప్రయత్నాలేవో  తనకు తోచినవి చేసుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను  బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు ప్రారంభమవడం.. అదో విచిత్ర గాధ. దేవుళ్లకూ మన  మానవులకు మల్లేనే భావోద్వేగాలు,  సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే  సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే  ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా!  ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా  సాధించే దివ్యశక్తులు  తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు.  రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలుగనంత వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు!
భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ  దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో  ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం.  ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న  చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని  సామాజిక మాధ్యమాలల్లో ఎడతెరిపిలేకుండా. మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా  పొంగి పోటెత్తి పారేదీ కాదు.  ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని  విశిష్ఠత.
స్వాత్రంత్ర్య సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా  దళిత జాతుల ఉద్ధరణకై  జీవితాంతం పాటుబడ్డ  మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ  కర్మభూమిలో. పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు  తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ! భక్తి అనే హార్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి  ఎట్టి పరిస్థితులలోనూ ర్కంతో ఆ దివ్య  భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం.
దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ,  ఏ హడావుడీ  దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ,  బౌతిక రూపంలో  పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా  ముక్కుల్దాకా  మునిగితే  ప్రాణాలు గుటుక్కున పోక తప్పదు. దైవభావనలలో పొడగట్టే  ఏ మార్పైనా మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ  ఇంగితం లేకనే .. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిష ఎన్నిరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.  
కవులూ తమ కావ్యాలకు అవతారికలు  రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ  దేవజాతులను సైతం కవులు మనుషులకు  మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ  మళ్లా  కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకే తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత  వెర్రితనం  తప్పదా?! విచారకరం.
'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి – వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు. దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ  రుద్రదేవతలుగా దూషింపబదుతున్నరు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూమ్మీది నిప్పు, మబ్బులోని గాలి.. వెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!
రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళేఅగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా  వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో  దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు. ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు. సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.
వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాథనలు అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం కొత్త పరిణామం.
జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని.. ఇట్లా ప్రతిదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్  వివరిస్తుంటే  ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని  వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.  హద్దులెరుగని కల్పన చేయగల మేథోసామర్థ్యం సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాథ్యమన్న వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే  ఓ గొప్ప ఉదాహరణ.
వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించి ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం.
జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖిసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం. వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాథాన్యం. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు విభాగాలు.  పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా  గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.  వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంఛమంతటా ఉన్నట్లే,రతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శీవాజీ వంటి సాహసవంతులెందరో దేవతల  స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ. ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, సంతోషిమాత, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల  దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు.
మతాల గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని  సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథా ప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రం మిత్రం’ అనే  శ్లోకార్ధాన్ని బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న
రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో   పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే  శాంతి మార్గం  మనిషి కంటబడదు.
కంటికి కనిపించని దేవుళ్ల కౌటింగ్ కన్నా.. కంటి ముందు కదిలే  నుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక-  ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం)






Saturday, July 18, 2020

భారతదేశం హిందూదేశమా? -కర్లపాలెం హనుమంతరావు= సూర్య దిన[పత్రిక ప్వాసం



'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి
మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం
పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక
భాగం భరతవర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది
హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం
ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా
నివృత్తి అవుతుంది.

'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.

స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని
తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా
ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు
కనిపిస్తాయి.

యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి
వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం
వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు
కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు
సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ
ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం
పడింది.

రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ
రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు
పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన
విషయాలు వెలుగు చూస్తాయ్!

ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం
'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల
కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మతరూపంలో చొప్పించి పబ్బం
గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.



నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.
తాత్వికత అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు.
వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి
స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో
ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక
ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం
పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట
లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ
'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.

తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది
సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం,
ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే
సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల
నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.

ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ
మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద
'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం
హిందూధర్మంగా గుర్తింపబడింది.

'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి
రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా
ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!

స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో
మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి
నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా
బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.

మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించారు.
రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని
బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా
చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!



ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం
లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న
రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు
చేస్తున్నాయిప్పుడు!

హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో
అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో..
ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక
చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని
దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల
ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత
అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది.
మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం
చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం,
వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా,
త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే
దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం
వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత
ప్రభావం,

ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత
నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ
చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా
ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ
సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక,
ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు
నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత,
విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో
నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే.
భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు
బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు
తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వం చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత
సిద్ధాంతంతో ప్రభావితమైనవే!

కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం
రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది.
రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ
సమాజంలో చెల్లదు.



హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ
మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే
వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో
బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం
ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా
భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు
చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు
ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే
విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.

టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల
ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ
ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నడిపించారు. బెదిరిన బ్రిటిష్
దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని
ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు
మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ‘ప్రత్యేక ఇస్లాం
రాజ్యం’ కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా
చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం
చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే
కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా
పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది
బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు
విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే
ఉన్నారు.

భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం
వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ.
స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు
అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన
మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా
సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి
సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది.
చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన
పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?

***
(సూర్య దినపత్రిక - ఆదివారం - 18 -07 -2020 ప్రచురితం) 



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...