Showing posts with label communications. Show all posts
Showing posts with label communications. Show all posts

Monday, March 16, 2020

నటి శ్రీదేవి దుర్మరణం నేపథ్యం - హద్దులు తెలియని ప్రసార మాధ్యమాల పద్ధతులు - కర్లపాలెం హనుమంతరావు-మనం దినపత్రిక


కాలాలకు, తరాలకు అతీతమైనది ఆ అభినేత్రి ఆకర్షణ. భాషలు, ప్రాంతాలకు అతీతంగా దేశం ఇంటా బైటా ఒకే తీరైన అశేషమైన అభిమాన సంపద ఆ నటీమణి సొంతం. ఐదు దశాబ్దాల పాటు అటు  కుటుంబ జీవితాన్ని, ఇటు అభినయ వృత్తిని సమన్వయించుకొంటూ మూడొందల పై చిలుకు చిత్రాలలో  ప్రధాన పాత్రలు పోషించడం..  ప్రముఖ కథానాయకులకు దీటుగా ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే స్థిరంగా నిలబడి ఉండడం.. ఒక మహిళగా ఈ పురుషాధిక్య ప్రపంచంలో(మరీ ముఖ్యంగా మగవారి కనుసన్నలలో మాత్రమే నడిచే చిత్రపరిశ్రమలో) నిజంగా ఒక అద్భుతమే! అందం.. అభినయం ఉన్నంత మాత్రాన అందరికీ  సువర్ణావకాశాలు కలసి రావు. అడుగుపెట్టిన ప్రతిచోటా అందలం ఎక్కిందంటే  నిర్వచించేందుకు శక్యం కాని అదృష్టమేదో ఆమె  వరంగా పొంది ఉండాలి.  ఊహించని ఎత్తులకు ఎగబాకించిన ఆ అదృష్టం వరంగా పొందిన అత్యంత అరుదైన భారతీయ తారామణులలో శ్రీదేవిది నిస్సందేహంగా ముందు వరస. కాబట్టే అంతుబట్టని శ్రీదేవి హఠాన్మరణం ఖండాతరాలలో సైతం నాలుగు రోజులు  పెను సంచలనం సృష్టించింది.

జీవితమంటే శ్రీదేవికి సినిమానే. జీవితమూ అంతే విచిత్రంగా సినీమాటిక్^గా ముగిసి పోవడం ఎంతటి కఠినాత్ముడి చేతనైనా కంట తడి పెట్టించే దుర్ఘటన. కోట్లాది ఆమె అభిమానుల మనోభావాలకు సంబధించిన సున్నితమైన ఈ  అంశాన్ని స్వదేశంలోని ప్రసార మాధ్యమాలు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాలు నిర్వహించిన తీరుకు ఇప్పుడు సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి.

ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఎదగాలన్న పంతం ఎలా వీడకూడదో శ్రీదేవి జీవితకావ్యం నుంచి కార్యశీలులంతా  నేర్చుకోవచ్చు. సందర్భం వచ్చింది కనుక ప్రసార మాధ్యమాలూ సోదాహరణంగా ఆమె జీవితంలోని వికాసకోణాలను హుందాగా ప్రదర్శించవచ్చు. సమాజం పట్ల ప్రసార మాధ్యమాలకూ ఉండవలసిన బాధ్యతను గుర్తెరిగి ఉండి ఉంటే.. రెండుగా చీలిన టి.వి తెర మీద ఒక వైపు శ్రీదేవి నీటితొట్టి వరకు నిదానంగా నడుచుకుంటూ వెళ్లి హఠాత్తుగా పడిపోయే దిగ్భ్రాంతికర ఊహా దృశ్యం.. మరో వైపు ఆ   అందాల నటి వానలో తడుస్తూ వయసుకు మించిన కథానాయకుడితో చేసే శృంగార నృత్యం  చూసే దురదృష్టం వీక్షకులకు  పట్టి ఉండేదే కాదు.  వివాదాలకు అతీతంగా మెలిగిన ఒక మంచినటి జీవిత చరమాంకం   చివరకు  వివాదాస్పద అంశాల  ముగింపుగా మిగిలిపోవడం వెనుక భారతీయ ప్రసార మాధ్యమాల.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాల బాధ్యతారాహిత్యం ప్రధాన పాత్రే వహించిందన్నది నిష్ఠుర సత్యం.

రాజీపడని పెంకెతనం ఒక్కోసారి  తెచ్చిపెట్టే అభద్రతాభావన , అశాశ్వతమైన బాహ్యాలంకరణల మీద శృతి మించిన   మోజు ఎంతటి ఘనచరిత్ర కలవారి మీదనయినా ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తుందో శ్రీదేవి జీవితాన్నుంచే ఓ పాఠంగా గ్రహించవచ్చు. ఆ మేరకైనా సమాచార మాధ్యమాలు తమ వంతు బాధ్యతను కొంతయినా నిర్వర్తించి ఉంటే.. ఇంత చర్చకు ఆస్కారం ఉండేదే కాదు.
వయసును ఎవరం ఎలాగూ  జయించలేం. కనుక కనీసం మనసునైనా కొంత మేరకు  నియంత్రించుకునే ప్రయత్నం చేసుకో గలిగితే అర్థాంతరంగా వచ్చి పడే అవాంతరాలను కట్టడి చేసుకోగల ఆత్మవిశ్వాసం అలవడుతుంది. నిత్యం మిరిమిట్లు గొలిపే వెలుగుల్లోనే తప్ప కనీసం మసక  చీకటి మలుపుల్లోకైనా వెళ్లనిచ్చగించని నేటి తళుకుబెళుకుల తరానికి శ్రీదేవి వంటి 'అతిలోక సుందరి' సినీజీవితమే ఆదర్శంగా ఉంటున్నద ఇప్పుడు. ఆచరణలోని దాని సాధ్యాసాధ్యాలను  గురించి అమాయకమైన యువతరానికి ఉదాహరణగా తెలియ చెప్పే అవకాశం శ్రీదేవి హఠాన్మరణం కలిగించింది. అయినా టి. ఆర్. పి రేటింగుల మీది అధిక ధ్యాస.. ప్రేక్షకులు పక్క ఛానెళ్లకి  మళ్ళకూడదన్న వ్యాపార లాభాపేక్షతో ప్రసార మాధ్యమాలు సామాజిక బాధ్యతను పూర్తిగా  ఉపేక్షించాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.

గెలుపు కోసం తపించిపోవడం ఎప్పుడూ వ్యక్తిత్వ వికాసానికి అవసరమయే ముఖ్య ప్రేరణే. కానీ విజయపుష్పాల పొదల మాటున కాటువేసేందుకు విషసర్పాలు ఎలా పొంచి ఉంటాయో విప్పిచెప్పి యువతను   అప్రమత్తం చేసే మరో మంచి అవకాశం శ్రీదేవి విషాద మరణం ద్వారా  అంది వచ్చినా.. అలవాటుగా ప్రదర్శించే నిర్లక్ష్యపు ధోరణితో ప్రసార మాధ్యమాలు మరోసారి తమ సామాజిక బాధ్యతను విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సర్వే సర్వత్రా.

అందని ఎండమావుల కోసం ఎగబడే ఆరాటం.. అవి అందినప్పటికీ ఎంత కాలం అందుబాటులో ఉంటాయో ఇతమిత్థంగా తేలని అభద్రతాభావన జీవితంలో ఎన్ని ఉపద్రవాలను తెచ్చి పెడుతుందో   'శ్రీదేవి విషాదాంతం '  ఉదాహరణగా చూపించి మరీ నేటి యువతరాన్ని హెచ్చరించవచ్చు . కానీ.. వీక్షకులంటే టి. ఆర్. పి రేటింగు  మినహా  రక్త మాంసాలున్న మామూలు మనుషులన్న స్పృహ   మరిచినట్లే ఉన్నాయి మన ప్రసార మాధ్యమాలు.  బుడ బుడ పొంగే స్నానాల తొట్టి నీటి అడుగులనుంచి  ఊపిరాడక గిలగిలా కొట్టుకొనే ‘రూప్ కీ రాణీ’ రూపాన్ని గ్రాఫిక్సుల ఆర్భాటంతో ప్రదర్శించడం ఎంత వరకు  టి.వి. చానెళ్లకు సమంజసం?

 శ్రీదేవి చాందినీ జీవితాన్ని   అర్థాంతరంగా ఇలా  ఓ గ్రహణం ఎందుకు మింగేసిందో?! వాస్తవాలన్నీ శాస్త్రీయ కోణంలో నిర్థారణ అయితే గానీ  ఇతమిత్థంగా ఎవరం తేల్చిచెప్పలేం. కానీ  వార్తలకు, నీలి వార్తలకు మధ్య ఆట్టే భేదం  పాటించే అలవాటు తప్పిన మన ప్రసార మాధ్యమాలు మాత్రం చెవిన పడ్డ ఏ పుక్కిట పురాణాన్నైనా చటుక్కున  ఓ వ్యాపార సరుకుగా మార్చేసుకొనే కళలో  ఆరితేరాయి. వ్యాపార ప్రాయోజితాల మీదే తప్ప  సామాజిక ప్రయోజనాల మీద దృష్టి దండగన్న దురదృష్ట ధోరణి ఇప్పటి ప్రసార మధ్యమాలలో పెరిగిపోతోందా? అమ్మ కన్నీటినయినా  అమ్మకం సరుకు చేసుకొని బతికేసే లౌల్యం క్రమంగా  పెరిగిపోతోందా? సామాజిక మాధ్యమాలకి ఎప్పుడో అంటుకొన్న   ఈ   మహమ్మారి ఇప్పుడు ప్రసార మాధ్యమాలనూ ఆక్రమించేస్తుందనిపిస్తోంది. శ్రీదేవి హఠాన్మరణం అనే ఓ అత్యంత విషాదకర సామాజిక దుర్ఘటనను  ఓ పెద్ద 'సేలబుల్' న్యూస్’ ఐటంగా మార్చి విచ్చలవిడిగా ప్రసారం చేసేటందుకు పురిగొల్పింది ఈ మహమ్మారే అనిపిస్తోంది.

ఈ వ్యాసం ఆరంభించే సమయానికి (27, ఫిబ్రవరి, 2018 ఉదయం 11 గంటలా 11 నిమిషాలు) గూగుల్ అన్వేషణ బాక్సులో 'శ్రీదేవి మరణం' అని తెలుగులో టైప్ చేస్తే కేవలం 0.52 సెకన్లలోనే 83, 200 లంకెలు సూచించబడ్డాయి.   శ్రీదేవి  మరణించడానికి కారణం .. 'గుండె పోటు'(Heart attack) గా నమోదయి కనిపించింది. కానీ ఇదే సమయానికి   తెలుగు టీవీ 24 గంటల ఛానెళ్లన్నింటిలో శ్రీదేవి దుర్మరణానికి కారణం ఆమె కుటుంబంలో ఆస్తిని  గురించి వచ్చిన పేచీలుగా ఓ వార్తా వ్యాఖ్యానం చిలవలు పలవులుగా   విస్తరించి వినిపిస్తోంది! 24వ తేదీ  నాటి మొదటి గుండె పోటు కారణానికి.. 27 వ తేదీ నాటి  కుటుంబ ఆస్తుల ఘర్షణల కారణానికి   మధ్య అంతులేనన్ని సినిమాటిక్  మలుపులతో  వార్తా కథనాలు యధేచ్చగా  ఏ ఛానెలుకు తగ్గట్లు ఆ ఛానెలు తనదైన శైలిలో వండి వారుస్తూ ప్రేక్షకుల మనోభావాలతో చెడుగుడు ఆడేసుకొన్న మాట వాస్తవం. ఒక క్రైమ్ మిస్టరీకి మించిన ఉత్కంఠను రేకెత్తించి సగటు టి.వి ప్రేక్షకుడి దృష్టి పక్క ఛానెలు వైపుకి మళ్లకుండా వార్తాఛానెళ్లు పోయిన పెడసరి పోకడలే ఇప్పుడు భావస్వేచ్చావాదులను  సైతం పునరాలోచనలో పడవేస్తున్నాయి.

వార్తా చానెళ్లు  నిరంతరాయంగా నిమిషానికో సారి  భయంకరమైన నేపథ్య సంగీతంతో,  గ్రాఫిక్స్ ఇంద్రజాలంతో ప్రదర్శించే  'బ్రేకింగ్ న్యూస్' దగ్గర  నుంచి  రెగ్యులర్ న్యూస్ బులెటన్ల చివరి స్లాట్ వరకూ ఊదర గొట్టేస్తున్న  వార్తలు అన్నింటికీ ఈ మూడున్నర రోజులూ ప్రధాన కేంద్ర బిందువు 'శ్రీదేవి' మరణ వార్త  ఒక్కటి మాత్రమే! ఏ విధంగా టి.వి. ల ఈ తెంపరితనాన్ని సమర్థించాలో  అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు  భావస్వేచ్చ కోసం నిత్యం పోరు సలిపే సమరయోధులు ఇప్పుడు.

భారత కాలమానం ప్రకారం శ్రీదేవి మరణించినట్లు వార్త బైటికి పొక్కిన 24, ఫిబ్రవరి,2018 11. 30 కి .. ఈ వ్యాసం ప్రారంభించిన సమయానికి (27, ఫిబ్రవరి,2018, ఉదయం 11 గంటలు)మధ్య దాదాపు మూడు రోజులు మించి వ్యవధానం ఉంది. 24గంటల వార్తా ఛానెళ్లు చేసే నిరంతర వార్తా ప్రసారాల ప్రకారం ఈ సుమారు 72గంటల వ్యవధిలో  స్థానికంగా కానీ, జాతీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ మరే ఇతరేతర  వార్తా ప్రాథాన్యత గల విశేషాలు అసలు సంభవించలేదనే అనుకోవాలి కాబోలు!

అన్ని ప్రధాన సంఘటనలను స్థలాభావం వల్ల ఏకరువు పెట్టడం కుదరక పోవచ్చు.  కానీ.. మచ్చుక్కి  ఓ మూడు నాలుగు రోజులు ప్రపంచాన్ని   ప్రభావితం చేసే ప్రధాన వార్తా విశేషాలు ఉటంకిస్తే వార్తాఛానళ్ల నిర్వాకం తేటతెల్లమవుతుంది. చైనా అధ్యక్ష పదవిని జిన్ పింగ్ కు శాశ్వతంగా కట్టబెట్టేటందుకు రాజ్యాంగ నిబంధనకు సవరణలు చేసేందుకు తీర్మానం జరిగింది ఈ మూడు రోజుల్లోనే. జాతీయ స్థాయిలో.. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారి  మరాఠీ చట్టసభ సభ్యులకు అనువాద పాఠం అందచేయకుండా  గవర్నర్  మరాఠీ భాషా దినోత్సవానికి ఒక రోజు ముందు బడ్జెట్ ప్రసంగం చదవడం పెద్ద రాధ్ధాంతానికి దారి తీసింది. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయి.. భారీ పోలింగుతో ముగిసాయి. ఈ వ్యాసం రాసే రోజునే రాజకీయాలలో నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నారా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రవేశ దినోత్సవం.  'తగిన మద్దతు ఇవ్వని పక్షంలో రైతాంగం యావత్తునీ కలుపుకొని కేంద్ర రాజధానిలో ఆందోళన చేసేందుకైనా సిద్ధమ'ని తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ కుండబద్దలు కొట్టిన రాజకీయ పరిణామం జరిగిందీ ఈ వ్యవధానంలోనే. ఇవేవీ మన తెలుగు వార్తా ఛానళ్లలో చాలా వాటికి అంతగా ప్రాథాన్యమివ్వదగ్గ   వార్తాంశాలుగా తోచలేదు!   శ్రీదేవి మరణ కథనాలు వండి వార్చేందుకే 24 గంటలు సమయం చాలక తన్నుకు లాడుతున్న నేపథ్యంలో విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం ఎట్లా సాధ్యమవుతుంది .. అనిపించినట్లుంది తెలుగు వార్తా ఛానెళ్లలోని అధిక శాతానికి.

సమయం కేటాయింపులోనే కాదు  ప్రసారం చేసే విధానాలలోనూ వార్తా ఛానెళ్లు ప్రదర్శిస్తున్న పోకళ్లకు నోళ్లు వెళ్లబెట్టేస్తున్నారు ఆలోచనాపరులందరూ. శ్రీదేవి హఠాన్మరణ వార్త ఎంతటి కసాయి గుండెనైనా  కంట తడి పెట్టించే తీరులో ఉంది. సందేహం లేదు.  కానీ అంతటి దిగ్భ్రాంతికర దురదృష్ట సంఘటన వార్తగా ప్రసారమయే సందర్భంలోనూ ఆ అభినేత్రి వృత్తిపరంగా తాను  ప్రారంభ దశలో  వానలో తడిదుస్తుల్లో  వేసిన చిందులు పదే పదే టి వి తెర నిండుగా  ప్రదర్మించి    అభిమానుల మనోభావాలను కించపరచడం ఎంత అమానవీయమో ఛానెళ్ల నిర్వాహకులు ఆలోచించినట్లు లేదు.

వార్తలను వార్తలుగా చదివే విధానానికి టి వి ఛానెళ్లు స్వస్తి  పలికి చానాళ్లే అయింది . కర్ణాకర్ణిగా వినవచ్చే ఊసుపోని కబుర్లే ఇప్పుడు టి.వి. ప్రేక్షకులను అలరించే మసాలా దినుసులు. ఒకప్పటి    పేరు మోసిన దర్శకుడు  పదుగురి నోళ్లలో నలగడమే పనిగా పెట్టుకొని   పద్దాకా చేసే అసందర్భ ప్రేలాపనలను  ప్రముఖంగా ప్రసారం చేయడం  సున్నిత మనస్కులను ఎంతగా చీదర గొల్పుతున్నాయో టి.వి ఛానెళ్ల బాధ్యులకు  అర్థమవుతుందా?

నగ్న చిత్రాల నిర్మాణాన్ని బహిరంగంగా పట్టపగలే చర్చకు పెట్టి సమర్థించే వారికి టి.వి ప్రసారాలలో చోటివ్వడాన్ని మహిళా మండళ్లు ఇప్పుడు బహిరంగానే తప్పు పడుతున్నాయి.  పోలీసు స్టేషన్ల వరకు కేసులు ఈడ్చుకు వెళుతున్నాయి. తమకూ సమాజం పట్ల ఒక  బాధ్యత  తప్పక ఉంటుదన్న స్పృహ ప్రసార మాధ్యమాలకే ఉండి ఉంటే పరిస్థితులు ఇప్పుడింతగా దిగజారుండేవా?! అన్నింటికీ పరాకాష్ట    ఈ మూడు నాలుగు రోజుల బట్టి  మంచినటి శ్రీదేవి దురదృష్టకరమైన అర్థాంతర అనుమానాస్పదమైన మరణం మీద నిరంతరాయంగా కొనసాగుతున్న టి.వి ప్రసార మాధ్యమాల తీరు!  ఏ ఆధారాలూ దొరక్క పోయినా..  కేవలం ఊహపోహల ఆధారంగా  ఊసుపోని పోచికోలు  కథనాలను ఆపకుండా ప్రసారం చేస్తూ ప్రేక్షకుల విలువైన 'వాచింగ్ టైమ్ 'ను వృథా చేస్తున్నందుకు  టి.వి. వార్తా ఛానెళ్లను గట్టిగా నిలదీయవలసిన అవసరం ఇప్పుడు మునుపటి కన్న   మరింతగా పెరిగింది. అనారోగ్యకరంగా ప్రసార మాధ్యమాల  నడుస్తున్న స్పర్థను తిలకిస్తున్న వారంతా చిత్రాలకు మల్లే టి వి ప్రసారాలకూ ఖచ్చితంగా ఒక నియంత్రణా వ్యవస్థ తక్షణమే అవసరమన్న అభిప్రాయానికి వచ్చేసారు.

వినోద విజ్ఞానాలు జన సామాన్యానికి అందించే పుస్తకాల స్థానే ప్రస్తుతం  అంతర్జాలం.. దానికన్నా ముందు టి వి మాధ్యమం  ఆక్రమించాయి. సమాజాన్ని చైతన్య పరచే బాధ్యత గతానికి మించి  ఇప్పుడు మరింత అధికంగా ఉన్న నేపథ్యంలో టి వి  నిర్వాహకుల హద్దులు దాటుతున్న ప్రసార పద్ధతులు ప్రజాహిత వాదులందరినీ కలవరానికి గురి చేయడంలో అసహజమేమున్నది!

నిర్ధారణ కాని అంశాల చుట్టూ ఆసక్తికరమైన కథనాలు అల్లే ఆత్రుతలో టి వి ఛానెళ్లు చేస్తున్న  పొరపాట్లు చాలా సందర్భాలలో ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మరెన్నో సమయాల్లో మనస్తాపానికీ దారి తీయిస్తున్నాయి. శ్రీదేవి హఠాన్మరణ విషాద వార్త ప్రసారం చేస్తూనే ఆ సంఘటనకు రెండు రోజుల ముందు నాటి పెళ్లి వేడుకల్లోని ఆమె ఆటపాటలను కలిపి చూపించడం ఆ మహానటి అభిమానుల మనోభావాలను ఎంతలా కుంగదీస్తుందో ఏ ఒక్క ఛానెలూ పట్టించుకున్నట్లు లేదు!

వీక్షకుల  మనోభావాలతో యధేచ్చగా ఆడుకోవడమే తమ భావ ప్రకటనా స్వేచ్చగా టి.వి ప్రసార మాధ్యమాలు భావిస్తున్నాయా?  సమాజాన్ని, వ్యవస్థలని అత్యంత బలంగా ప్రభావితం చేసే ప్రధాన శక్తులలో చిత్రాలకు మించి  ముందుండేది ఇడియట్ బాక్స్.. టి.వి!

భావస్వేచ్చంటే  యధేచ్చగా  వ్యవహరించడమని టి.వి ప్రసారాల నిర్వాకులు అపోహపడుతున్నారు. దానినీ సరిదిద్ద వలసిన బాధ్యత   బావ ప్రకటనా స్వేచ్చ  ప్రగాఢంగా కాంక్షించే  ప్రజాస్వేచ్చావాదులే  తమ భుజస్కంధాల మీదకు  తిరిగి   తీసుకోవలసిన తరుణం ఆసన్నమయింది.
- కర్లపాలెం హనుమంతరావు
బోథెల్ ; యూఎస్
karlapalwm2010@gmail.com
WhatsApp +918142283676
***(మనం - దినపత్రిక ప్రచురితం )

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...