Saturday, January 30, 2016

అంతర్జాతీయ వెనక్కి చూసే దినోత్సవం- జనవరి 31-


మార్నింగ్ గుడ్!
ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు ముందుకే కదా నడుస్తాం! ఒక్క రోజు కాస్సేపు కాస్త వెనక్కు నడవమంటే ఎందుకలా మిర్రి మిర్రి చూడడం! ఈ కొత్త వెర్రి ఏమిటా అనా?
జనవరి 31 వెనక్కి నడిచే రోజు అమెరికాలో!
మనదగ్గరయితే  ఈ వెనక నడక మరీ కొత్త చోద్యమేం  కాదు! అప్పులోడు ఎదురు పడితే అడుగు ముందుకు పడదు. ఎదురొచ్చిన సందు మరీ పాతబస్తీ మోడల్లో ఇరుగ్గా ఉంటే వెనక్కి నడిచి ఏ మలుపులోకి తప్పుకొంటేనే మానం దక్కుదల!
'పదండి ముందుకు!.. పదండి ముందుకు!' అంటూ మహాకవి శ్రీ శ్రీ మరీ కాళ్లకిందలా నిప్పులు ఎందుకు పోసారో! 'వెనక చూసిన కార్యమేమోయి/మంచి గతమున కొంచెమేనోయి/మందగించక ముందు అడుగేయి/వెనుకపడితే వెనకే నోయి' అంటూ  గురజాడవారిదీ అదే గత్తర! ఇహ  మన ఏ.పీ చంద్రబాబుగారైతే మరీ విడ్డూరం! పద్దస్తమానం పెద్దానికీ  'అలా ముందుకు పోదాం' అంటూ ఒహటే తొందర! ముందుచూపుమీదే అందరి చూపైతే మరి  మన  వెనక తీసే గోతుల గతి పట్టించుకునే పరంధాముడు ఎవరంట! బొక్కబోర్లా పడ్డా తట్టుకొని లేవచ్చు. వెల్లికిలా పడ్డమంటే మళ్లీ తేలేది కైలాసంలోనే సుమా!
ఎవరెంతమంది వైతాళికులు ముందు నడకకే తాళమేసినా  శ్రీమాన్ గిరీశంగారు మాత్రం 'అటునుంచి నరుక్కు రమ్మని' దొడ్డిదారి చూపించారు! కొంత నయం! నేటి మెజారిటీకీ ఆ దారే రహదారి! సంతోషం!
మాటవరసకేదో అనుకుంటాం గానీ..  వాస్తవంగా మన నడక ఇప్పుడు వెనక్కికాక ముందుకుందా! ఎప్పుడో వెనక తాతలు తాగిన నేతుల వాసన మనమిప్పుడు  మూతులు ముందుకు చాపి చూపించుకుంటున్నామా లేదా! దేశానికి స్వేచ్చాస్వాతంత్రాలొచ్చిందే  తన వెనక తరం  నెహ్రూతాత  వల్లని ఇటలీ బ్లడ్ రహుల్ బాబు ఇప్పుటికీ డప్పులు కొట్టుకుంటున్నాడు!  పేదల పాలిటి పెన్నిధని అత్తఇందిర పేరు చెప్పుకొంటూ కోడలుగాంధీ పల్లకీ మోయించుకోడంలా! ఏనాడో  చరిత్రపుటల్లోకి ఎగిరి వెళ్ళిపోయిన.. మహానేత వై. ఎస్ పేరు మోసుకుంటూ  జగజ్జేత  కావాలని కలలు కంటున్నాడు  జగన్ జీ! ‘అచ్చేదిన్వచ్చేదింకా ఎంతో దూరంలో లేదంటూనే.. వెనకటి రామరాజ్యమే మళ్లీ తెస్తామంటోంది మోదీ సర్కార్! వెనకచూపును చిన్నచూపు చూస్తున్నదెక్కడ! 
ముందుకు కదలాలంటే వెనక చూపు ఎంతో అవసరం. ఆ చూపు లోపిస్తే బతుకెంత దుర్బరమో ఒక్క రామాయణంలోనే బోలెడన్ని ఉదాహరణలు!   బంగారులేడి మాయదారిదని తెలిసీ   శ్రీరామచంద్రుడు   వచ్చినదారి  పట్టక అష్టకష్టాల పాలయ్యాడా లేదా! వ్యాస మహర్షులవారు రాసి పారేసిన అష్టాదపురాణాలు, ఇతిహాసాలు, భారత భాగవతాదుల్లో ఒక్కడంటే ఒక్కడికైనా వెనకచూపు లేకపోవడం విచిత్రమే కాదు.. విచారకరంకూడానూ!
'బ్యాక్ టు ఫ్యూచర్' పెద్ద హిట్ పిక్చర్ హాలివుడ్లో! 'బ్యాక్ టు స్కూలు' అమెరిన్  స్కూళ్ళు తిరిగి తెరిచే  సందర్భం! ఎన్నికల వేళ మన ప్రజాప్రతినిధులు వాడవాడల్లో చెడ తిరుగుతారే.. అదీ ఓ రకంగా బ్యాక్ టు నియోజకవర్గం పథకం కిందే లెక్క!  అంగారకుడిమీద పరిశోధనలు చేసే నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’  వంద  మీటర్ల దూరం వెనక్కి నడిచినప్పుడు అంతరిక్ష పరిశోధకులు ఎంతానందంగా చిందులేసారో!
వెనకనుంచి చదివే లిపి అరబ్బీ. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా  వెనక్కి నడవాలి! చిన్నబళ్ళో పంతుళ్ళు ఎక్కాలను వెనకనుంచి ఒప్పచెప్పించేవాళ్లు. రాకెట్లు అంతరిక్షంలోకి వదిలేముందు అంకెలు వెనకనుంచి లెక్కిస్తారు! లియొనార్డో డావిన్సీ పేరు విన్నారా! ఆయన వెనకనుంచి ముందుకు రాసుకుపోవడంలో సుప్రసిద్ధుడు!
 రామకృష్ణ విలోమ కావ్యం.. 14వ శతాబ్దంది..  మొత్తం 36 శ్లోకాలు.. ముందు నుంచి చివరికి చదువు.. రామాయణం! వెనకనుంచి మొదటికి రా! భారతం! ‘చిరం విరంచి: న చిరం విరంచి:/సాకారతా సత్య సతారకా సా / సాకారతా సత్య సతారకా సా /చిరం విరంచి: న చిరం విరంచి:’ సాహిత్యంలో కవులు  పద్యాలు ఇలా  వెల్లికిలా వల్లెవేస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేస్తాం. కాకతీయులుకూడా విలోమ పద్ధతుల్లో  వివాహాలు చేసుకున్నారయ్యా అంటే విస్తుపోయి చూస్తాం! అన్నయమంత్రని  రుద్రమాంబ రెండో బిడ్డ  చేసుకుంది!ఇంత పాండిత్యం విని తట్టుకోలేనంటే ఒహ చిన్న ఉదాహరణతో సరిపెడితే సరి! 'దడిగాడువానసిరా'ని తిరగేసి రాసి చూడండి! 'రాసినవాడు గాడిద అవుతుందా లేదా! గురుస్వామిలాంటి స్వాములు  సినిమాపాటలు వరస చెడకుండా  వెనకనుంచి పాడితే భలే అర్థమవుతాయి  కదా!  చేతులు నొప్పుట్టేట్లు చప్పట్లు కొట్టికూడా అభినందిస్తాం కదా! వెనకటి కథలే మళ్ళీ మళ్ళీ తాజాసినిమాలుగా మారి  'రీసైకిల్' కిల్ చేస్తున్నా  'దేంట’ని ఈసడించుకోం  సరికదా.. మొదట్రోజు మొదటాటలోనే తల మోదుకొనేందుకు   తయారయిపోతాం!  మనదగ్గరంటే ఆసే.తు హిమాచల పర్యంతం  దాదాపు ఒకే సమయం నడుస్తుంది. అమెరికాలాంటి అఖండ ఖండాల్లో  అడుక్కో రకం గడియారంనడక! ఆరునెల్లకి ఓ గంట అటుకో ఇటుకో సర్దుబాటు! గడియారాలే  వెనక్కీ ముందుకీ నడవంగా లేనిది   మనమో నాలుగడుగులు అవసరాన్ని బట్టి వెనక్కి నడిస్తే వెక్కిరింతలెందుకంట!
ఈ పండితుల గోల మనకెంకుగ్గానీ  మామూలు రాజకీయాలు చూసుకొందాంవెనక చూపంటూ లేకుంటే చొక్కామీద వెనకనుంచి ఎవరు ఎప్పుడు ఏ సిరాచుక్క చక్కా విదిలించి పోతారో ఎలా తెలుస్తుంది! ఒలంపిక్సు పరుగుపందేల్లో ఎలాగూ కప్పులు తెచ్చే ఒకప్పటి  గొప్ప ఆటగాళ్ళు    పిటి ఉష.. అశ్వినీ నాచప్పల ఇప్పుడెటూ లేరు.  కనీసం కంచుకప్పులైనా కొట్టుకు రావాలంటే వెనక్కి పరుగెత్తే  పందేలు పెట్టించి వాటిలో మన కుర్రబ్యేచికి తర్ఫీదివ్వాలి! తప్పదు మరి! 
పురచ్చితలైవి జయలలిత.. లాంటి నేతలు మనముందుంటే వెనక్కి తిరిగి నడిచే  వీలుండదుగానీ.. గుళ్లో అయినా   పృష్టభాగం చూపించకుండా ప్రదక్షిణాలు చెయ్యడం కష్టం గదా!  వెనక నడకంటే ఇంకా పస్తాయింపులెందుకు!
వెనక్కి నడవడం వల్ల బోలెడన్ని లాభాలుకూడానూ! కవిసమ్మేళనాలప్పుడు వెనక బెంచీల్లో కూర్చుంటే కవితాగానం జరిగేటప్పుడు  నిశ్శబ్దంగా బైటికి పోవడం సులభమవుతుంది. పెద్దపెద్దవైద్యులు నొక్కి చెప్పే ప్రకారం పీల్చిన గాలిని  వెనక్కి వదిలేయడమంటే వంట్లోని మలినాలను బయటకు తరిమేయడమే! అదే యోగానిపుణులు చేయమని మొత్తుకొనే విలోమ యోగాసనం! పద్మాసనంలో కుదురుకొని  కుడిముక్కు మూసుకో! డం ముక్కుతో  గాలి  పీల్చి వెనక్కి వదిలేయ్! లోపలికి లాక్కోవడమేగానీ బైటకు వదిల్లేని బలహీనత ఇక్కడా ప్రదర్శిస్తే ప్రమాదం! భీష్మాచార్యులవారికి మల్లే అంపశయ్యమీదే ఆఖరి శ్వాస వదిలేయాల్సొస్తుంది!  
'ముందు మున్సిపాలిటీ అయినా వెనక పర్శనాలిటీచాలామంది సుందరాంగులకి. మనీ పర్శుకూడా వెనకజేబులోనే కదా దోపుకొనేదీ! ఇక మడమ తిప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా బజారులో బేరాలు చేసేది ఎలా? ఆడవాళ్లను చూసైనా ఇంగితం  తెచ్చుకోవాలి! ముందు.. వెనక బేధం ఉండదు సింగారానికి. నీలవేణుల వెనకున్న వాల్జడలు చూసే చాలామంది కవులు  సంపూర్ణంగా మతులు పోగొట్టుకున్నది! శ్రీరాములవారి సహాయము కావలెను- అని కాదు రాసుకోవాల్సింది.  కనీసం ఇవాళైనా 'నులెవ కాము యహా సరివాలము రాశ్రీ' అని తిరగేసి రాసి చూడండి!  పట్టించుకోకుండా పోయిన భాగ్య సంపదలు  ఠక్కున వెనక్కి  రాకపోతే  అప్పుడు అడగండి!
ఈ 'వెనక పండుగ' రోజున ఏం చేయాలని సందేహమా! ఊహ ఊండాలేగానీ ఆకాశమే హద్దు! చొక్కా తిరగేసి తోడుక్కో! తొక్కతిని అరటి గుజ్జు వదిలేయ్! చెప్పులు కాళ్లు మార్చి వేసుకొని నడువు! కళ్లజోడు నెత్తికి పెట్టుకొని ఊరేగు! సెల్ఫోన్ రింగవంగానే 'బై' అని మొదలెట్టి 'హాయ్'తో ముగించు! టీవీని వెనకనుంచి విను!
గాడిదలకు మాత్రం వెనగ్గా పోవద్దు సుమా! లారీల వెనక నిలబడ వద్దు! ఆడపిల్లల వెనక్కూడా పడద్దు. బివేరాఫ్ ‘షి’ టీమ్స్! ప్యాంటు పైన అండర్ వేర్ అంటే సూపర మేన్ వరకు ‘ఓ. కే’ నే గానీ  ఎంత ‘వెనక్కి తిరిగే దినోత్సవ’మే అయినా కుక్కలకు ఆ విషయాలేవీ తెలీవు కదా! వెనకబడగలవు
శ్రీకారం చివర్లో.. స్వస్తి మొదట్లోనే చెప్పడం వరకూ భేషుగ్గానే ఉంటుంది..కానీ 'శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ../..గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ/కంబపువ్వు మీద కాకారీ పూఛాయ' అంటూ నడిరాత్రి మేలుకొలుపులుగానీ లంకించుకున్నావనుకో .. పండగ పరమార్థం అర్థంకాని పక్కింటి సూర్యనారాయాణ నిజంగానే గడకర్ర పుచ్చుకొని గడపముందుకొచ్చేయచ్చు! 'పసిడి పాదుకలూని పడతి సీత కేలూని/ పవళింప వేంచేయు సమయము స్వామీ!' అంటూ నిద్రపుచ్చే పాటలకు పరగడుపునే తగులుకుంటే ఎదురింటి పవనకుమారుడు  తన మజిల్ పవరు చూపించగలడు! తస్మాత్ జాగ్రత్త! ‘బేక్ వర్డు డేకదా అని యోగా చేస్తూ వెనక్కి వంగితే నడుం పట్టేయచ్చు. భద్రం!
'మరల నిదేల రామాయణం బన్నచో,/ నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ/తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు/ తన రుచి బ్రదుకులు తనివి గాన/చేసిన' అన్నారు మహాకవి విశ్వనాథ సత్యనారాయణగారుకూడా!  'విలోమ దినం' విశిష్టత ప్రభుత్వపెద్దలక్కూడా వంటబట్టినట్లుంది! ఆదివారమని కూడా చూసుకోకుండా ఎన్నికల ప్రచార సాయానికొస్తున్నారు పాపం! రోటీనుకి భిన్నంగా గ్రేటరువాళ్లూ రోజంతా వాటరిస్తున్నారు.!కరెంటిస్తున్నారు! 
రోజూ తాగి వచ్చి, భార్యను తంతేగాని నిద్రపట్టని తాతారావుకూడా ‘ఈ ‘వెనక్కి తిరిగే దినోత్సవ సంబరాన్ని పురస్కరించుకొని ఎప్పట్లా కాకుండా  రాత్రినిద్ర బైట కానించి.. పొద్దున్నే వచ్చి  తన్నుడు కార్యక్రమం మొదలు పెట్టాడు!
తెలుగు దేశం మళ్లీ  అధికారంలోకి రావాలని అన్నవరంనుంచి తిరుపతి వరకు వెనక నడకన యాత్ర చేసాడొక తమ్ముడు ఈ మధ్యనే! రొటీన్ కి భిన్నంగా మోదీజీ ప్యారిస్ నుంచి తిరిగొస్తూ కాబూల్ లో దిగిపోయారా మధ్యన! రొటీన్ కి భిన్నంగా ఎన్నికలప్పుడు పార్టీలే ఓటర్ల చిరునామాలు వెదుక్కొంటూ తిరుగుతున్నాయి! 
ఈ వెనక పండక్కి చాలా ముందునుంచే పురస్కారాలు రివర్సులో తిరిగిచ్చే ఉద్యమం మొదలయింది! ఇప్పుడు మళ్లీ అకాడమీ తిరిగి వెనక్కి ప్రదానం చేసే కార్యక్రమంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలి వెళుతున్నారా! ఈ సారే వనక్కి తిరిగి వచ్చేస్తున్నారు!
పీచే ముడ్!.. ఆగే బడ్!’ లలో ఏది ఎప్పటికి  శ్రేష్టమో అదే అప్పటికి అనుసరించడం ఉత్తమ రాజకీయవేత్త లక్షణం.  చైనా, జపాన్లు వెనక్కి నడవడాన్ని ఓ కళగా అఅభివృద్ధి చేస్తున్నాయి!
మనమూ కొన్ని రంగాలలో వెనకబడేమీ లేమనుకోండి! ఇక్కడ  రైళ్లు, బస్సులు వెనక్కు నడుస్తుంటాయి. విమానాలు కూడా వి ఐ పి లు పిలిస్తే ఓయ్అంటూ చక్రాలు వెనక్కి తిప్పుకుంటాయి!. రూపాయి వెనక్కి నడుస్తుంది. పాపాయి రూపాయిని చూస్తే వెనక్కి నడుస్తుంది.  వెనక తింటున్న కందమూలాలనే మళ్లీ మనం ఇప్పుడు తింటున్నది.. ఆరోగ్య స్పృహ మరీ పెరిగిపోయి. వెనకటి ఆదిమయుగం మానవులు కట్టిన పిక్కల్లోకి వచ్చే దుస్తుల్నే మళ్లీ మన ఆడవాళ్ళు ఇవాళ ఆదరిస్తున్నది! వెనక వాడిన రుబ్బురోళ్ళు.. రోకళ్ళు.. బుడ్డి దీపాలే మళ్లీ ఆరోగ్యదృష్ట్యా మంచివని ఇళ్లల్లో ప్రత్యక్షమవుతున్నాయి.  
ముందుకు పోయే వేగం పెరుగుతుందని వెనకబడిన తరగతుల్లో చేర్చమని కొన్ని వర్గాలు ఉద్యమాలుకూడా జోరుగా చేస్తున్న దేశం మనది. ఐదేళ్లకోసారి ‘మమ’ అనిపించే ఎన్నికల్లో  మనం ఓట్లేసి గెలిపించే ప్రజాప్రతినిధి ముందుచూపుతో నాలుగురాళ్లు వెనకేసుకొంటున్నాడే అనుకోండి! అతగాడిని  మళ్లీ వెనక్కి పిలిపించేందుకు అవకాశం ఉందా మన పాలనావిధానంలో!  ప్రగతి పథంలొ ముందుకు దూసుకుపోయే ప్రజాస్వామ్య వ్యవస్థకైనా సరే వెనక చూపు అందుకే తప్పనిసరి అనేది!

'గో బ్యాక్!’ అని వూరికే నినాదాలు చేస్తే ఏమొస్తుంది! సమయం సందర్భం చూసుకొని వెనక్కి నడిచినప్పుడే ముందుకు పోయే అవకాశం చేజిక్కించుకొనేది!
ఈ క్షణంనుంచే వెనక్కి నడవడం ఆరంభిద్దాం!
పదండి వెనక్కు!.. సారీ.. క్కునవె డిందప!
***
-కర్లపాలెం హనుమంతరావు
Friday, January 29, 2016

ఓ చంటోడి కథ- 'ఆక్షర' సరదా కథ- నేటి సినిమా అభిమానసంఘాలమీద సెటైరికల్ స్టోరీ


'చంటోడు కనిపించడం లేదండీ!' బావురుమంది ఆదిలక్ష్మి.
కనిపించకపోవడానికి వాడేమన్నా నలకా? నల్లపూసా? ఏ బాత్ రూంలోనో, డాబాపైనో ..సెల్లో ఛాటింగులో ..ఉంటాడు చూడండహే!' అంటూ  పాంటు వేసుకుంటో విసుక్కున్నాడు పాపారావు. ఉబ్బెత్తుగా ఉండాల్సిన పర్సు  శివరాత్రినాటి ఉపవాసం భక్తుడిలా చప్పగా అయిపోవడం చూసి  ఉలిక్కిపడ్డాడు. 'అన్నట్లు.. ఇవాళ ఇంటరు రిజల్ట్సు వచ్చే రోజు కదూ! ఇంక ఇంట్లో ఎందుకుంటాడూ?!' అంటో బిగ్గరగా అరిచాడు.
'ఎప్పుడు చూసినా వాడినాడిపోసుకుంటావు.. నువ్వసలు వాడి కన్నతండివేనంట్రా?' అని గఁయ్యిమంది పాపారావు తల్లి.
'ఆ ముక్క.. కన్నదాన్ని.. నీ కోడల్నడుగు!  గాడిదకొడుకు నా కంటపడనీ! కాళ్ళు రెండూ విరిచి పొయిలో పెట్టకపోతే నా పేరు.. పిడకల పాపారావే కాదు!' అంటూ సగం వేసుకున్న పాంటుతోనే పేరిణి నృత్యం ప్రారంభించాడు పాపారావు.
'పాపారావు అరుపులకి, ఆడంగుల ఏడుపులకి అప్పుడే సగం కాలనీ పోగయిపోయింది  పాపారావు ఇంటిగుమ్మంలో. ఇరుగుపొరుగు ధర్మంగా తలో రాయీ విసురుతున్నారు. 'పోలీసులేమైనా ఎత్తుకుపోయారేమో! టీవీ పెట్టండి. ఏ ఏరియాలో ఎన్కౌంటరయిందో వివరంగా చూడచ్చు!' అన్నారెవరో. ఘొల్లుమన్నారు ఆడంగులంతా కూడబలుక్కునట్లు ఒక్కసారే గొంతులెత్తి! ఆదిలక్ష్మి 'ఢా'మ్మని పడిపోయిందా సౌండుకి.
'ఎదురింటి కామాక్షికూడా ఇంట్లో ఉందో లేదో .. ముందా సంగతి  కనుక్కోండి!' గుంపులోనుంచి మరో  గొంతు సన్నాయినొక్కులు. మళ్లా ఘొల్లుమని ఆడంగుల బృందగానం. ముసలమ్మ పడిపోయిందీసారి సౌండుకి.
పాపారావు ఆలోచనలు మరోవైపుకి లాగుతున్నాయి. మొన్నదేదో ఎత్తుభారం చానల్లో కొత్తసినిమాకు అంతా కొత్తముఖాలే కావాల'ని వారంరోజులు ఒహటే  వూదరగొట్టేసారు. కొంపదీసి ఈ చంటిగాడేమన్నా అటు చెక్కేసాడేమో?
పోలీసుస్టేషను నెంబరుకోసం ట్రై చేస్తుంటే సుబ్బలక్ష్మి పరుగెత్తుకొచ్చింది 'డాడీ! అన్నయ్య బెడ్డుమీద ఈ లెటరు పడేసుంది' అంటూ ఓ కాగితంముక్క చేత్తో ఊపుకొంటూ!
'పోలీసులకోసం ప్రయత్నిస్తే మీకే లాసు. మీ చంటాడు మా కంట్రోల్లోనే ఉన్నాడు. మా తరువాత మెసేజీకోసం మీ సెల్ ఫోన్ హమేశా చార్జింగులో ఉంచుకోడం మర్చిపోకండి.. మీకే మంచిది' అన్న హెచ్చరికుంది ఆ కాగితంలో.
చంటాడు కిడ్నాపయిన వార్త క్షణాల్లో కాలనీ అంతా పొక్కిపోయింది.
పాపారావు 'కోతి'మార్కు పళ్లపొడి కంపెనీలో  సేల్సు ఏజెంటు. పాలవాడు పేపరువాడుకూడా నెల మొదటిరోజు   తప్ప పట్టించుకోని పాపరు పాపారావు. 'ఈయనగారి  కొడుకును కొడితే కోట్లొస్తాయనుకున్నారేమిటో  పిచ్చి నా కొడుకులు.. కిడ్నాపర్లు!'- అని పేట పేటంతా ఒహటే జోకులు. 'నీ కోతిమార్కు పళ్లపొడి పొట్లాలు ఓ పాతిక వాళ్ల మొహాన కొట్టు పాపారావ్! తోముకోలేక వాళ్లే తోకముడిచేస్తారు!' అని మొహంమీదే జోకులేసాడు పక్కింటి మోహన్రావు.

పాపారావు కొడుక్కు అప్పుడే సంతాపం ప్రకటించే మూడ్ లోకి వెళ్ళిపోయింది కాలనీ అంతా
'గోల్డులాంటి కుర్రాడు కదండీ! ఊళ్ళో కే సినిమావచ్చినా మనవాడిదే సందడంతా! రిలీజుకి వారంరోజులముందునుంచే ఊరంతా తిరిగి వూదరగొట్టేవాడు, పాపం. సందుచివరి న్యూస్ పేపర్ల దుకాణంముందు ఎప్పుడు చూసినా పిచ్చి పిచ్చి సినిమాపత్రికలేవో ముందేసుక్కూర్చుని అదేదో హీరోకి అభిమానసంఘమంటూ ఆగమాగం చేయడం వాడి హాబీ! అదేదో హీరో పరమ వీర బోరు చిత్రరాజం ‘తీసావే.. చచ్చావే!’ వారంరోజులవకముందే తీసేస్తున్నారని థియేటరుముందు ఆత్మాహుతికి ఒడిగట్టిన  సన్నివేశం నిన్నగాక మొన్ననే జరిగినట్లుంది కాలనీజనాలకి. అగ్గిపెట్టెలో పుల్లలు లేకపోబట్టిగానీ.. లేకపోతే పాపం  పాపారావుకీపాటికే తలక్కొరివిపెట్టే కొడుకు కరువై  పోయుండేవాడు!’
'ఆ పాడుసినిమా ’నా ఆట- నా ఇష్టం’ ఆడియో కేసెట్లేవో బలవంతంగా అంటగడుతున్నాడీ మధ్య. కాలనీ గేటుబైటే కాబూలీవాలాటైపు  కాపువేసి మరీ వేపుకుతింటుంటే.. కడుపు మండిన కోపిష్టెవడో వీడినిలా   మాయంచేసుండొచ్చు' అంటూ ఎదురింటి అప్పారావు ఊహానందం.
'శుభం' అన్నట్లు పాపారావు సెల్  మోగింది అదే సమయంలో మూడు సార్లు. 'మీ చంటిని  మళ్ళీ ప్రాణాలతో చూడాలనుకుంటే మీరీ రోజు 'సాయి' టాకీసులో 'కసాయి' మొదటాట చూసితీరాలి! ఆరుకల్లా కాలనీ జనమంతా హాలులో హాజరవకపోతే మీ వాడి ఆట   రెండో ఆటలోపు మటాష్!'
ఫోన్ కట్టయింది. పాపారావుకు మతిపోయినంత పనయింది.
'వీళ్ళ డిమాండు మండా! ఇంట్లో వాళ్లమంటే ఎలాగో తట్టుకోవచ్చు. కాలనీ కిష్కింధగుంపునంతా పోగేసుకొని పోవాలంటే.. మాటలా? మూటలతో పని. మూడు బస్సులమీద ఆరు ఆటోలవుతాయి. తలకో వందేసుకున్నా.. టీ కాఫీ టిఫిన్లతో కలుపుకొని పదివేలకుపైగానే  పోకెట్ కట్! మనీ సంగతలా ఉంచి.. ముందీ ముసలీ ముతకా.. పిల్లా జెల్లా.. ఆడా మగాని కూడేసుకొని రావాలంటే ఏ పవర్ స్టారో.. ఏక్టింగు లయనో ఎట్రాక్షనుగా ఉండాలి. పోనీ మానవతాకోణాన్ని వాళ్ళలో మేలుకొలిపైనా తోలుకెళదామంటే.. మేలు, ఫిమేలు కలసి కూర్చుని చూసే సినిమాలేనా  ఇప్పుడొస్తున్నవి!’
‘ఈ గొడవలన్నీ ఎందుగ్గానీ.. ఓ పదివేలిచ్చుకుంటా.. మా చచ్చుసన్నాసిని వదిలేయండి! కాదు కూడదంటారా? పొడిచేసేయండి.. ఫర్వా నై! వాడిక్కడుండి పొడిచేసేదికూడా ఏం లేదు' అనేసాడు మళ్లీ ఫోన్ చేసా ఆగంతకులు బెదిరించినప్పుడు పాపారావు.
'ష్! డోంటాక్ రబ్బిష్! నీ ముష్ఠి పదివేలెవడిక్కావాలి బే! మాక్కావాల్సింది మా అభిమాన హీరో  మూవీకి సూపర్ పాజిటివ్ టాక్!' అంటూ లైన్ కట్ చేసారవతలనుంచి.
'పిల్లాడికన్నా సినిమా ఎక్కువటండీ?కాలనీవాళ్ల కాళ్ళు నే పటుకుంటా.. మిగతా సంగతులన్నీ మీరు చూసుకోండి!' అంటూ కన్నీళ్ళు పెట్టుకొంటో బైటికి పరిగెత్తింది ఆదిలక్ష్మి.
*                                     *                                  *
ఆరుకింకా ఐదునిమిషాలుందనంగానే ఆరు ట్రావెల్సు బస్సులు.. మూడు ఆటోలతో సహా సాయి టాకీసు గేటుముందుకొచ్చి ఆగాయి. అప్పటికే హౌస్ ఫుల్ బోర్డు! హాలుముందుమాత్రం పురుగు లేదు!! 'ట్వంటీ.. ట్వంటీ! ట్వంటీ.. ట్వంటీ!' అనంటూ చెవిగోసిన మేకల్లాగా  ఒహటే అరుపులు!
'థియేటరుకా.. స్టేడియానికా మనమొచ్చింది?! క్రికెట్టాటక్కూడా  మనుషుల్లేరేంటి చెప్మా!'
ఓ చష్మావాలా సందేహం.
'పబ్లిక్కే లేదు. బ్లాకెందుకయ్యా?' అనడిగాడు పాపారావు ఓ బక్కకుర్రాడి రెక్క పట్టుకొని బిక్కుబిక్కుమంటూ.
'ముందొచ్చినవాళ్ళంతా బ్లాకే కోయించుకోవాలి సార్!  చివర్లో వచ్చేవాళ్ళ సౌకర్యంకోసం హాలువాళ్ళే చేసారీ ఏర్పాట్లు!’  ఉరుమురిమి చూసాడా పిల్ల బ్లాకటీరు.
వాడు చెప్పిన రేటుకు నోర్మూసుకొని టిక్కెట్లుకోయించుకొని ఎట్లాగో హాల్లోకొచ్చిపడ్డారు కాలనీ జనమంతా పాపారావు సౌజన్యంతో.

చిత్రం మొదలవకముందే ఫోనుల్లో మెసేజీలు మొదలయ్యాయి.
‘ఇప్పుడే హీరో ఎంట్రీ! నాలికబలం కొద్దీ ఈల వేయండి!'
'ఈలెయ్యడం  మొగాళ్ళందరకీ రాదుకదయ్యా మగడా?' ఆదిలక్ష్మి సందేహం.
''ఫర్వానై! చప్పట్లైనా కొట్టొచ్చు! ముందు ముందు చప్పట్లు కొట్టాల్సిన బిల్డప్పు సీన్లు బోలెడొస్తాయి. అప్పుడు నొప్పులంటే కుదరదు మరి. చంటాడి లైఫుకే రిస్కు! ఆలోచించుకోండి!' అవతల ఆగంతకుడి గొంతు.
ఒక్క చప్పట్లతో సరిపుచ్చితే లేనిదేముంది? మధ్యలో ఒకసారి.. టిక్కెట్లు చింపి  పోగుల్ని గాల్లోకి వెదజల్లాలని హుకూములు! మరోసారి హీరో హీరోయిన్ని పాటవంకతో పచ్చడి పచ్చడి చేసేటప్పుడు తెరమీదకు పూలు జల్లమని ఆదేశాలు! 'హఠాత్తుగా పూలంటే..  ఎక్కణ్ణుంచొస్తాయయ్యా!' అనడిగితే 'వట్టి ఫూల్సులాగున్నారే మీ కాలనీ జనమంతా! మా హీరో సినిమాకు వట్టి చేతుల్తోనా  వస్త! మీ ఆడాళ్లకు తలలు లేవా? ఆ తలలకు పూల్లేవా?  విసరండయ్యా వాటిని పీకీ!' అంటో గద్దింపులు!
పడకసీన్లొచ్చినప్పుడు పసిపిల్లలచేత కుర్చీలెక్కించి డ్యాన్సులు చేయించారు. మందుకొట్టి విలన్లను హీరో చితక్కొడుతున్నప్పుడు ఆడంగులచేత కొంగులు బిగించి మరీ చిందులేయించారు! గ్రాఫిక్సులో ముసలి హీరో చేసే మెలికలపాము డ్యాన్సులకు ముసలిప్రేక్షకులచేత  నడుములూపే స్టెప్పులేయించారు  మరీ అన్యాయంగా!
'మేమంతా ఓ మూల నక్కి మీ రియాక్షన్లన్నీ గమనిస్తూనే ఉన్నాం. మొహాలు అలా వికారంగా పెటుక్కూర్చుంటే కుదరదిక్కడ. మీ వంశోద్ధారకుడు క్షేమంగా విడుదలవ్వాలంటే  మూతులు వెడల్పుగా పెట్టుకు తీరాలి.  నీళ్ళురాకున్నా కళ్ళు మధ్య మధ్యలో తుడుచుకుంటుండాల్సిందే. అడపా దడపా వేడి వేడి నిట్టూర్పులు, ఉండుండి పొట్ట చేత్తో గట్టిగా పట్టుకుని పొర్లుగింతలు గట్రా పెడుతూ  బిగ్గరగా నవ్వడాలెలాగూ తవ్వపు. అమీర్ఖాన్   ‘పీకే’ మూవీ చూస్తూ ప్రేక్షకులేవిధంగా స్పందిస్తారో.. దానికిమించి మీరంతా అబినయించకపోతే మీ చంటాడి ప్రాణాలకింక   నీళ్ళు వదులుకోవాల్సిందే' అని వార్నింగు ఇచ్చేశారా దుర్మార్గులు!
నవ్వాల్సిన  చోట నవ్వురాకపోగా కడుపులో తిప్పినట్లై రెండుమూడుసార్లు వాంతులు చేసుకున్నాడు పాపం అప్పారావు.  ఇంటర్వెల్ గంటకొట్టలేదని చంటిపిల్లలంతా ఒహటే గగ్గోళ్ళు. విరామసమయంలో క్యాంటీనుమీద దాడిచేసి వీలైనంత ఇంధనం వేసుకుంటేగాని కాలనీజనాల కండుపుమంటలు  కాస్తంతైనా చల్లారలేదు. కాకపోతే ఆ ఇంధనం పాపం పాపారావుకి పెట్రోలుకన్నా ఎక్కువ మంటపుట్టించింది..నెలంతా గడప గడపా తిరిగి అమ్మిన కచ్చిక పొళ్ళ తాలుకు సొమ్మది మరి!
పాపారావు  వంశోద్ధారకుడి పాడుప్రాణాలకోసం ‘చిత్ర’హింసకుమించిన  చిత్రహింసలను సైతం సహించడానికి సిద్దపడ్డారు పాపం కాలనీవాసులంతా! 'శుభం'కార్డు పడంగానే గభాలున లేచి తొడతొక్కిడిగా తోసుకంటూ బైటకొచ్చిపడ్డా ఆ  వైనమే చెబుతోంది  కాలనీవాసులు పడ్డ 'చిత్ర' హింసల క్షోభ!
'ఇహనైనా మనవాడిని విడిచిపెడతారేమో కనుక్కోండి' అంది ఆదిలక్ష్మి గుడ్లనీరు కుక్కుకుంటో.
పాపారావు సెల్లోకి చివరి సందేశం వచ్చింది 'గేటుబైట టీవీలవారి కెమేరాలన్నీ మీ స్పందనకోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. మా హీరోగురించి  ఎంత సూపర్ గా చెబితే మీ వంశోద్ధారకుడికంత మేలు!’

'సినిమా ఎలా ఉంది?'  ఒక మైకేశ్వరి ప్రశ్న ' పరమఛండాలంగా ఉంది. హీరోది  నీచ నికృష్ట నటన. కథ జీరో సైజు. కథనం అయోమయం. దశాదిశాలేని  దర్శకత్వం. నీరసమైన సంగీతం. అలుక్కుపోయిన గ్రాఫిక్సు. పాటలు పచ్చి బూతు. మాటలు పరమ మొరటు. ఫస్టుహాఫు పెద్దరంపం. సెకండు హాఫు పెనుగునపం. కామెడీ  ఏడిపించింది. కరుణరసం నవ్వించింది..' అంటో రెచ్చిపోతోన్న అప్పారావు నోరు నొక్కేసి పక్కకీడ్చేసి ' హీరో సూపర్.. హీరో యాక్టింగ్ అదుర్స్!.. హీరో డ్యాన్సింగ్  చిరుగ్స్. హీరో  ఫైటింగు  ఇరుగ్స్. హీరో వంచిలు కేక!  హండ్రెడ్ డేస్ గ్యారంటీ! రికార్దు బ్రేకులు పక్కా' అంటో పాపారావు రెండేళ్లూ గాల్లో ఊపుకుంటూ బస్సులోకొచ్చి కూలపడ్డాడు.
'నిజంగా సినిమా నీకంత బావుందా.. డాడీ?' కళ్ళు పెద్దవిచేసి అడిగింది డాటరు సుబ్బలక్ష్మి.
'బాగా.. నా బొందా! కడుపులో తిప్పుతోందిక్కడ. ఎప్పుడింటికెళ్ళి పడదామా అని తొందర!' అని పొట్టనొక్కుకున్నాడు పాపం పాపారావు.

బస్సులు బైలుదేరే వేళకి చంటోడు ఊడిపడ్డాడు రొప్పుకొంటో. కళ్లంతా వాచి ఉన్నాయి. 'బాగా కొట్టారేందిరా పిచ్చి సన్నాసిని చేసి' అంటూ బావురమంది బామ్మగారు మనవణ్ణి గాట్టిగా కావిలించేసుకొంటో.
'అదేం కాదులేవే! రికార్డు బ్రేక్కింకో రెండు బస్సులజనం తక్కువయ్యారని ఏడుపు. రెండో ఆటకైనా ఇంకో రెండు కాలనీలు కవరు కాకపోతే  మా హీరో పరువు గంగలో కలవడం ఖాయం. డాడీదగ్గర్నుంచీ  ఇంకో ఏడువేలైనా వల్చుకు పోకబోతే   మా అభిమాన సంఘంవాళ్ళు నన్ను చంపిపాతరేస్తారే మమ్మీ!' అంటూ తల్లి చీరకొంగు పట్టుకొని లాగడం మొదలుపెట్టాడు చంటిగాడు గారాబంగా. ఆదిలక్ష్మి కంగారు పడింది.
కదిలే బస్సునుంచి  పర్సును కసిగా బైటికి విసిరేస్తూ అన్నాడు పాపారావు. 'ఏడువేలు కాదుగదా.. ఏడు పైసలుకూడా నా దగ్గర్నుంచీ ఇంక వసూలు కావురా   గాడిదకొడకా! నిన్ను కిడ్నాపుచేసిన వెధవలు   మీ ఎద్దుహీరో అభిమానసంఘం మొద్దులా?! నెలంతా అమ్మి దాచిన  కోతిమార్కు కచ్చికపొడి  సొమ్మురా అదీ! కంపెనీకి కట్టాల్సింది. అయ్యో!  మీ ఎదాన పోసానే! ఎవడిది నాయనా ఈ దిక్కుమాలిన బేవార్సు  ఆలోచన?'
'మనదే డాడీ! ఐడియా మనది. యాక్టింగ్ బ్రదర్ది'అంటో  పడీపడీ నవ్వడం మొదలుపెటింది  కూతురు సుబ్బలక్ష్మి. పిచ్చిచూపులు పడ్డాయి పాపం పాపారావుకి. పిచ్చిమాటలు మొదలయ్యాయి ఆదిలక్ష్మికి.
'మన పిల్లలు నిజంగా మహాగ్రేటండీ! ఓ సినీహీరో పరువు నిలబట్టంకోసం సొంత కొంపకైనా  నిప్పెట్టటానికి రడీ అయిపోయారు! ఆహా! ఎంతమంది కనగలరండీ ఇంత రౌడీసంతానాన్ని?! మీరూ ఉన్నారెందుకు? పాతికేళ్లబట్టీ ఆ కోతిమార్కు పళ్ళపొడి పొట్లాలమ్ముకొంటున్నారు. టార్గెట్టు రీచవలేదని  పైవాళ్లచేత ఎప్పుడూ దెప్పుళ్ళే! ఏ కిడ్నాపో.. బ్లాకుమెయిలో.. కనీసం  బాంబుబ్లాస్టింగుకైనా చేసి   సేల్సుపెంచుకోవాలనిగాని,  శభాషనిపించుకోవాలనిగాని,  ప్రమోషన్లు సాధించుకోవాలనిగాని ఐడియాలు రాకపాయా! ఛీ!.. ఛీ!.. ఛీ!‘   
పాపారావిప్పుడు పెళ్ళాం  ఛీదరింపులు వినే మూడ్ లో లేడు. చంటాడి కిడ్నాపు డ్రామాకి తనర్పించిన కోతిమార్కు సొమ్మును రికవర్  చేసుకోడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు.  తాజాగా చూసొచ్చిన సినిమాలోని ట్రిక్కులతో ఏ ఏ  కాలనీలను కవరు చెయ్యాలా?’ అన్న ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఎవరన్నారండీ..  సమాజంమీద సినిమాల ప్రభావం ఉండదనీ?!
-రచనః కర్లపాలెం హనుమంతరావు

***
Sunday, January 17, 2016

'సరి- బేసి= కేజ్రీవాల్+ క్రెజీ' పథకంమీద ఓ సరదా గల్పిక


పిల్లనల్లగా పుట్టిందని సాంబమూర్తి సంబరం. 'పాలనురుగు రంగుతో పుడితే నురుగులు కక్కాలిరా మేమందరం. పాలడబ్బాలకి తోడు పవుడరు డబ్బీల ఖర్చుకూడా  కరువు రోజుల్లో!  ఢిల్లీ కాలుష్యం గురించి వేరే చెప్పాలా! పెళ్లి దిగులుకూడా లేకుండా చేసింది మా పిచ్చితల్లి. నల్లబంగారమంటే ఎవరైనా ఇట్టే ఎగరేసుకు పోతారు' ఆవటా అని సాంబయ్య సంతోషం!
మిల్కీ వైటంటే మహా పిచ్చి   మా మోహన్రావుకి.  మొన్నే కొన్నాడు కొత్త మోడల్ మారుతీ ఆల్టో  యూరో-టు! ఏం లాభం! కేడిలాక్ మోడలు కారునలుపుకి తిరిగింది పదిరోజులపాటు హస్తిన వీధుల్లొ తిరిగేసరికి!
సాయిబాబా అని  నా బాల్యమిత్రుడు కవిగాడు. చిన్నప్పట్నుంచే చైన్ స్మోకరు. లంగ్ కేన్సరొస్తుందని లక్షమంది  బెదిరించుగాక లక్ష్యపెట్టని జగమొండి.  అరవయ్యో పడిలో పడీ అడయారు ఊడల మర్రిలా దృఢంగా ఉన్నవాడు కాస్తా.. మొన్నదేదో పురస్కార ప్రదానోత్సవానికని దేశరాజధానిదాకా వెళ్ళొచ్చాడు.  మర్నాడే పైకి టపా కట్టేసాడు!  దిల్లీ గాలి ఓ గంట పీల్చినా చాలుట.. చార్మీనార్ నాన్-ఫిల్టరు సిగిరెట్లు పాకెట్టు పీల్చినంత చేటు' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో   హెచ్చరించింది.
ఆమ్ ఆద్మీ కమాండరు  ఆ అరవింద్ కేజ్రీవాల్ని ఇవాళా రేపూ  అంతా తెగ ఆడిపోసుకుంటున్నాంగానీ.. ఆ అబ్బి వేసవికాలంలో సైతం ముఖం చుట్టూతా మఫ్లరు చుట్టుకోడం.. ఎడతెరిపి లేకుండా పొడిదగ్గు దగ్గడం.. చూస్తే ఎంతటి భాజాపా భక్తుడికైనా గుండె తరుక్కుపోడం ఖాయం! మోదీ సాబంటే  పి యం కాబట్టి విదేశాల్లో ఏదో పని పెట్టుకొని రాజదాని వాయుగండంనుంచి రక్షణ పొందచ్చు.  దిల్లీకి అచ్చంగా  ముఖ్యమంత్రయిపోయాడే  కేజ్రీవాల్జీ! కదిలేందుకు లేదు..  మెదిలేందుకు లేదు పక్కకి!  ఏ  ఉపాయం కనిపెట్టైనా సరే  ఇక్కడే రాజకీయాలు చేసుకోక తప్పని దుస్థితి! 
సరిబేసి అంకెల్ని కనిపెట్టిన మహామేధావుల్ననాలిగానీ.. వాటి ఆధారంగా కార్లకు సంకెళ్లు వేస్తానంటున్నాడని  కేశవయ్యలా  కేజ్రీవాలుమీద రంకెలేయడమేం బావుంది! 'సరి సంఖ్యల కార్లన్నీ రోడ్లమీద కొచ్చేసి సర్దా చేస్తుంటే బేసంకెలున్న పాపానికి బేకారుగా బేసుమెంట్లలోనే పడుండాలా మా కార్లన్నీ' అని అతగాడి చిందులు!
'మరే! ఉన్న ఒక్క వాహనాన్నీ రోజు మార్చి రోజు  కొంపలో దాపెట్టుకొని.. పనిచేయని రెండు కాళ్ళకి పని చెప్పాలంట విడ్డూరం!  మిల్కా సింగు మనమళ్లమా?.. పి.టి ఉష చెల్లెళ్లమా?  అవ్వ! పిచ్చాళ్ల రాజ్యమైపోయిందంతా!  దావా వేసేసెయ్యాల్సిందే ఎవరైనా!' లాయరు కృష్ణప్పయ్యరు లా పాయింటు!
 'అవీ అయ్యాయిలేవయ్యా!  కేసులు గీసులూ గుడ్డూ గూసుల్తో ఏమవుతుందీ! వారానికెటూ రెండ్రోజులు సెలవులేనాయ ఆఫీసులకి! ఇంకో రెండ్రోజులు అదనంగా  సెలవులిచ్చేసి ఇంటిపట్టునే  ఆ పనేదో చేసుకు రమ్మంటే సరి!  పిల్లకాయలక్కూడా బళ్లసెలవులు పెంచేసి ఇళ్లదగ్గరే  ఆ బండహోంవర్కులేవో ముగించుకు పొమ్మంటే సరి!  సరి, బేసి అంకెల్తో  సతమతమవాల్సిన ఖర్మే ఉండదు.   
'అదెలా కుదురుంతుందన్నయ్యా! ఆఫీసుల్లో కాస్త కునుకేసినా లంచవరు వరకు అడిగే పాపాత్ముడుండడు కదా!   ఇంట్లో ఆ సౌకర్యాలెట్లా సమకూర్తాయ్ భయ్యా! కారు సమస్యలు చూసుకుంటే గృహసమస్యలు పెరగవా!ఆనందరావు అభ్యంతరం.
'మరే! మొగాళ్లు ఇంటి పట్టునే ఉంటే ఆడంగులకి అంతకన్నా నరకం లేదు. ప్రతికొంపా ఓ మెగాసీరియలయి  పోతుంది'  అడ్డం తిరిగారు అపార్టుమెంటు అసోసియేషను ప్రెసిడెంటు ఆండాళ్లమ్మగారు.
 పని నిమ్మళంగా చేసుకొనే దేశాలకేమన్నా  'ఇంట్లో ఆఫీసు పన్లు'   పన్జేస్తాయేమొ గానీ.. చాయ్ పానీలకు బాగా అలవాటుపడ్డ ఆఫీసు ప్రాణులం మనం! ఇంటిపట్టునుంటే  అంత శ్రద్ధుంటుందా అల్లుడూ! దేశరాజధానంటే నేల నాలుగు చెరగుల్నుంచీ మనుషులు రోజూ చీమలదండుల్లా వచ్చిపోయేచోటు!  లాబీయింగులు గట్రా చేసుకొనే స్పాటు. టిక్కీ  అపార్టుమెంట్లలో ఆ కేంటిన్లూ కేరిడార్లు కుదిరే పనేనా ! ఇంటి దగ్గర  భార్యో, భర్తో బాసిజం అంటే ఏదో అలవాటైపోయాం కాబట్టి  సర్దుకుపోవచ్చు. ఆఫీసులో బాసుని బెటరాఫ్ గా చూసుకోడం వరస్టు ఐడియా!’  గోపాలరావు గోల.
'కేవలం రెండువారాలు  ప్రయోగాత్మకంగా నడిపిద్దాం. వచ్చే స్పందనను బట్టి ముందుకు పోదామా.. వద్దా ఆలోచిద్దాం' అని ముందునుంచీ మొత్తుకొంటున్నాడు ఆమ్ ఆద్మీ కమాండరు!
కొత్తగా ఓ ఆలోచన ఆచరణలోకి రావాలంటే ఎన్ని శిశుగండాల్రా బాబూ ఈ దేశంలో!
మా తోడల్లుడు వీరాంజనేయులుగారి రెండోవాడు దిల్లీలో ఉద్యోగం.  మొన్నీమధ్యనే పెళ్లిచూపులకని ఇక్కడికొచ్చాడు.'పిల్లెలా ఉందిరా బుల్లోడా?' అనడిగితే ' అక్క పిఛ్చగా ఉంది. చెల్లెల్లు పచ్చిగా ఉంది. అయినా నో ప్రాబ్లం బాబాయ్!' అని కూసాడు! 'ఇద్దరు పిల్లల్తో నీకేం పనిరా?' అని నిలదీస్తే అప్పుడు బైటపడింది కడుపులోని ఆలోచన. 'చేసేది దిల్లీలో ఉద్యోగం. ఒక్క కారుతో కుదిరి చావడం లేదు. రెండో కారు తప్పని సరి. !' అని వాడి గోల!
కట్టుకథ అనిపిస్తుంది కాని.. ఒట్టు.. మా శ్యామల్రావు కూతురు కాపురంకథకూడా ఇలాగే కేజ్రీవాలు సరి-బేసి పథకంవల్ల కంచికి చేరింది! ఇష్టపడి ఇంట్లోవాళ్లని ఒప్పించి మరీ చేసుకుందా వ్యాఘ్రేశ్వర్రావుని పెళ్లి! ఇప్పుడు విడాకులకు నోటీసు పంపించింది. 'మరేం చెయ్యమంటావ్ మామయ్యా! వ్యాఘ్రూ కారూ.. నా కారూ ఒహటే సరి నెంబర్లయిపోయాయి.  ఎంత మార్పించుకుందామన్నా కుదరకే చివరికిలా విడిపోదామనని నిర్ణయం. మొగుణ్నంటే మార్చుకోగలం గాని.. మూడేళ్లబట్టీ చేసే సచివాలయం జాబు మార్చుకోలేం గదా!' అనేసింది. ఈసారి చేసుకొనేవాడి కారు నెంబరు కంపల్సరీగా బేసి నెంబరు అయివుండాలని కండిషను ఆ అమ్మడిది!
మా కొలీగు లక్ష్మీప్రసాదు కొడుకు లకీనెంబరు ఆరు. కొన్న రెండుకార్లకూ చివర్లో అదే సరి నెంబరు!  కొత్త సంవత్సరం మొదటి తారీఖున 'బాసుని కలిసి శుభాకాంక్షలు చెప్పడం' కుదర్లా!  వచ్చే వచ్చే ప్రమోషను బిగుసుకుపోయింది! ఊహించని చార్జిషీటొచ్చి తగులుకుంది' అని భోరుమన్నాడు మొన్నోసారి  ఫోనులో కలిసినప్పుడు.  'బస్సులు బోలెడు అదనంగా నడుస్తున్నాయిట కదరా! కష్టపడైనా సరే బాసుని కలిసుండాల్సింది!' అని నేనిటునుంచి నిష్టూరాలకు దిగితే 'కలవకుండా ఉంటే కుదురుతుందా బాబాయ్! అలవాటు తప్పిన ఆ బస్సు బోర్డింగే నా కొంపముంచింది. ఫుట్ బోర్డుమీదనుంచి జారి  ఆసుపత్రి బెడ్డుమీద పడ్డా!' అని గగ్గోలు . కాలుక్కట్టిన కట్టుతో వాట్పప్ లో ఫోటో పెట్టాడు!
శాపనార్థాలు పెట్టే ఓటర్ల ఉసురు తగలరాదని అప్పటికీ పాపం ఆ మఫ్లరుసారు కారుచోదకులకు బోలెడన్ని మినహాయింపులు దయసాయించాడు. వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. కేజ్రీవాలు సారు సరి-బేసి  పథకం మా కేశవయ్య కొడుకు పోలీసు ఉద్యోగానికి ఎసరు పెట్టేట్లుంది చివరకు! చేసే చేసే దిల్లీ గస్తీపోలీసుద్యోగానికి  రాజీనామా ఇచ్చేస్తాట్ట కేశవయ్య కొడుకు!
'మఫ్లర్ సాబ్ పుణ్యమా అని మాలో  సగం మందిమి పిచ్చాళ్లమయి పోతిమి. బండి పేపర్లే చదవాలా? బండ ఫేసులే ఛూడాలా? ప్లేటుమీది నెంబర్లే కూడాలా? స్పీడో మీటర్లమీది అంకెలే  చూడాలా? వాహనదారుల లింగ నిర్ధారణ మా చావుకొచ్చింది! ముసుగుచోదకులంతా  మహిళామణులేనని  నమ్మాలి! బుగ్గమీసాలు కనబడుతున్నా  కుర్రపిల్లలేనంటే బుర్రలూపాలి ! గుండెమీద చెయ్యింటే చాలు. గుండులా ఉన్నా  ఆసుపత్రికే వెళుతున్నట్లే లెక్క. ఫ్యాక్టరీ గొట్టంకన్నా పొగలెక్కువ కక్కుతున్నా పొల్యూషన్ సర్టిఫికేట్  ప్రకారం పర్ఫెక్టు! మాసి మరకలతో పెచ్చులూడి వేలాడే నామఫలకంమీది నెంబర్లు   సరో..బేసో  తెలుసుకోవాలిగంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బండి నెంబరు దిల్లీపొగలో చదివేవిద్య పట్టుబడాలి! ఏది విద్యుత్ వాహనమో.. ఏది వంటగ్యాసు సరుకో.. వాసన పట్టే నాసికాపుటాలు  మూసుకుపోయి చానాళ్లయింది మా పోలీసుద్యోగులకి!’ ‘సరి-బేసి పథకం కొత్తఏడాది మొదటిరోజే మొదలవడం మా  చావుకొచ్చింది.  పీకల్దాకా తాగి బండి నడిపే శాల్తీ సొంత పేరే గుర్తుకురాక నాలిక మడతేస్తుంటే ఎవడు వి. ఐ. పి నో.. ఎవడు వి.పి. పుల్లాయో వడబోసేది ఎలా? ఇంకా పథ్నాలుగు రోజులు నడిపించాలి బండి!  నా వల్ల కాక ఇలా మొండికి తిరిగా డాడీ!' అంటూ చావు కబురు చల్లంగా ఊదాడు కేశవయ్య కొడుకు.
'పై రాబడి.. పెద్దాళ్లమధ్య బోలెడు పలుకుబడి! నీ బోడి పదో తరగతి చదువుకి ఈ నౌఖరీనే గొప్ప. ఇదీ విడిచిపెట్టేసి పెళ్లాం పిల్లలకేం పెడదామనిరా?' అంటూ నాయన ఇక్కడ వేసే గంతులకి  ఆ మాజీ పోలీసాయన ఇచ్చిన బదులు  వింటే చాలు .. మన దేశంలో ఏ  కొత్త పథకమైనా ఆదిలోనే ఎందుకు హంసపాదులో పడుతుందో తెలిసిపోతుంది.
'పోలీసుద్యోగంలోకి రాకమునుపు మన భాగ్యనగరం రాంకోఠీలో ఐదురూపాలిస్తే చాలు పాత నెంబరు ప్లేటు గీకి కోరిన అంకెలు చెక్కిచ్చే  వాడుట ఈ కేశవయ్య కొడుకు! మళ్ళీ అదే పనికి దిగుతున్నా! మూడునుంచి ఐదు వేలు పలుకుతున్నాయి ఫేక్ నెంబరు ప్లేట్లు. నలుగురు కుర్రాళ్లని పెట్టుకొని ఈ పథ్నాలుగు రోజులు పని నడిపించినా చాలు.. మామూళ్లకు పోను మిగిలేదెంతో తెలుసా డాడీ! బోడి పోలీసు గొడ్డుచాకిరీలో ఏడాది సంపాదనకి పది రెట్లు!'
నిన్నటిదాకా  కేజ్రీవాలుని క్రాకని  తిటిపోసిన కేశవయ్య 'గ్రేట్’' అని 
పొగుడుతున్నాడు ఇప్పుడు!
-***
-కర్లపాలెం హనుమంతరావు

'

'Saturday, January 16, 2016

సారాజకీయం- చతుర కథ

అనగనగా ఓ బాటసారి. అడవిదారిలో పడి పోతూ ఉంటే ఓ బ్రహ్మరాక్షసుడు ఎదురుపడి 'తినడానికి సిద్ధం కా' అన్నాడు. బాటసారి కాళ్లావేళ్ళా పడిన మీదట కనికరించి ఓ సదుపాయం ఇచ్చాడు. 'నీ దగ్గర తినడానికి ఇంకేమన్నా ఉంటే ఇవ్వు! నిన్ను వదిలిపెడతాను' అన్నాడు.
'చద్దన్నం' మూట చూపించాడు బాటసారి.
'నిన్ను చంపి తినాలనేంత పిచ్చఆకలిగా ఉంది. ఈ చద్దన్నం ఏ మూలకయ్యా? నీ నుదుటన నామాలున్నాయి. అందుకే పస్తాయిస్తున్నా. పోనీ .. ఒక పని చేయి! ఆ కనిపించే గుడిసెలో ఒక పసిపాప ఉంది. దాని గొంతు పిసికి తెచ్చియ్యి. ఈ పూటకు ఎలాగో సర్దుకుంటా!'అన్నాడు బ్రహ్మరాక్షసుడు.
'పసిబిడ్డనా!.. చంపడమా!.. అన్యాయం కదా! నేనా పాపం చేయలేను' అని మొరాయించాడు నామాల బాటసారి.
'ఓరి నీ పాపం కూలా!  పోనీ..  గుడిసెలోపల ఆ పాప తల్లి ఉంది.. ఒంటరిగా! అందంగా ఉంటుంది. నీ తనివితీరా అనుభవించు! ఆనక చంపి  ఆ శవాన్ని నా మొహాన పారేసి నీ దారిన నువు పో!'అని సలహా ఇచ్చాడీసారి బ్రహ్మరాక్షసుడు.
'పరాయి స్త్రీని  ముట్టడమా! పాపపు దృష్టితో  చూడ్డమే తప్పు నా లెక్కలో. ఇంక అనుభవించడం.. చంపి నీకు ఆహారంగా వేయడం.. ఇదంతా  నా వల్లయ్యే పనేనా!' అని చెంపలు వాయించుకున్నాడీ సారి బాటసారి.
బ్రహ్మరాక్షసుడికి వళ్ళు మండింది 'ఇదిగో.. ఇదే నీకు చివరి ఆవకాశం. ఈ సీసాలోదంతా ఖాళీ చేసెయ్యాలి! లేకపోతే నీ చావే ఖాయం నా చేతిలో ఇవాళ' అంటూ అని   సీసా ఒకటి బాటసారి నోట్లోకి బలవంతంగా వంపేసాడు.
అరనిమిషంలో సీసా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకో నిమిషంలో మత్తు బాటసారి  మెదడుకు పూర్తిగా ఎక్కేసింది.  ఆ మత్తు దెబ్బకి ఒంటరి ఆడది కంటికి రంభలాగా కనిపించింది. అనుభవించడం అభ్యంతరం అనిపించింది కాదు. ప్రతిఘటించిన ఆడది, అడ్డొచ్చిన పసిపాప,  పెనుగులాటలో చివరికి బాటసారికూడా హతమైపోయారు.
మూడుశవాలను సుష్టుగా భోంచేసి పోతూ పోతూ ఖాళీసీసానీ చంకనబెట్టుకు పోయాడు బ్రహ్మరాక్షసుడు.
ఆ సీసాలో ఉన్నది సారా! అమాయకుడైన బాటసారికి ఆ సారా పోసి తన పని కానించుకున్న బ్రహ్మరాక్షసుడి పేరు మీకు తెలుసా?
'రాజకీయం'
***
-కర్లపాలెం హనుమంతరావు
(చతుర జనవరి 2016 సంచికలో ప్రచురితం)Thursday, January 7, 2016

గీతా రహస్యం- అక్షర అంతర్జాలపత్రికలోని కథానిక


'పజ్జెనిమిదో అజ్జ్యాయం.. మోక్ష సన్యాస యోగం.. ముప్పైరెండో శ్లోకం.. ఏం చెబుతుందో తెలుసుట్రా చలపతీ!' అనడిగాడు ప్రసాద్.
'పనీ పాటా మానేసి నువ్విట్లా నిత్యం గీతాపారాయణం చేస్తూ కూర్చుంటావని..' అన్నా కసిగా.
'గీత అంతా పారాయణం చేయను. కేవలం పది.. ఏడు.. ఐదు.. నాలుగు.. మూడు.. రెండు శ్లోకాలు మాత్రమే చేస్తాను.' అన్నాడు వాడు నింపాదిగా.
''అదేం?!'
'పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో సుఖంగా ఉండేందుకు ఆ మాత్రం చాలని గీతాసూత్రం చెబుతుందిలే!'
ఆవుపాఠంలాగా వీడు ఎటునుంచి ఎటు తిరిగినా చివరికీ గీతమీదకే వచ్చి వాలుతున్నాడు!
కృష్ణవేణి చెప్పింది కరెక్టే! 'ఈ మధ్య ఈయనగారి వరసేం బావుండటం లేదన్నయ్యా! అదేందో గీతట! అస్తమానం దాని ధ్యాసే! నా కేదో భయంగా ఉంది. ఒక్కసారి వచ్చి పోరా!' అని అదేపనిగా ఫోన్ కాల్సు!
ప్రసాద్ కాలేజీలో నా క్లాస్ మేటు. బుద్ధిమంతుడని మా బాబాయి కూతుర్నిచ్చి చేశాం.
కాలేజీ రోజుల్లో వీడేదో 'లవ్వం;టూ అఘోరించాడు. ఆ పిల్ల పేరూ 'గీతే' అనుకుంటా! విషయం కనుక్కుందామని నేనే బైల్దేరి వచ్చేసానీసారి. ఎలాగూ నాకు వాడితో చిన్నపనికూడా ఉంది.
నేనో గొప్ప రచయితనని నా ఉద్దేశం. నలుగురి చేతా 'ఔను సుమా!' అని ఒప్పించుకోవాలని దుగ్ద! ఎలాగైనా ఓ పుస్తకం ప్రింటేసి ఉచితంగానైనా పంచిపెట్టని నా బందరు మిత్రులందరూ సలహా ఇచ్చారు. ప్రసాదుకు
రెడ్ హిల్సులో పెద్ద ప్రెస్సుంది. గవర్నమెంటు పనులు అవీ బాగా వస్తుంటాయి. నాకేవైనా సులువుసూత్రం చెవుతాడేమోనన్న ఆశతో కూడా వచ్చాను.
ఆటోదిగి అరగంటైనా వాడు పూజగదిలోనుంచి ఊడిపడడే! ఇదంతా భక్తే!
'ఏం పాడో! అస్తమానం ఆ పూజగది తలుపులు లోపలేసుక్కూర్చుంటారు. కదిలిస్తే చాలు! పాటలూ.. పద్యాలూ! పిల్లలుకూడా బాగాబెదిరిపోయారన్నయ్యా! అంతా నా గీత!' అని నుదురు బాదుకొంటూ టిఫిన్ ప్లేట్ పెట్టిపోయింది కృష్ణవేణి.
ప్లేటునిండా నానేసిన మొలకెత్తిన శనగ్గింజలు.. రకరకాల పచ్చికూరగాయ ముక్కలు!
'ఇంటిల్లిపాదీ ఈ గడ్డే తినాలని ఆయనగారి ఆర్డరు' అంది పాలగ్లాసుతో మళ్ళా వెనక్కివచ్చికూర్చొని కన్నీళ్ళు పెట్టుకొంటూ.
వ్యవహారంతోపాటు ఆహారంకూడా మారిపోయిందన్నమాట! పెళ్లయిన కొత్తల్లో ఈ ప్రసాదు మామగారింటికొచ్చినప్పుడు ఎన్వీ లేదని ఎంతలా గోల చేసాడు! గాంధీ జయంతి ఆ రోజు. దొరకదని మొత్తుకున్నా వింటేనా!
వాడు అప్పటికే కాంగ్రిసుపార్టీలో ఓ చోటా సైజు పేట నాయకుడు!
ఇప్పుడు ఇంట్లో వాతావరణంకూడా బాగా మారిపోయింది. ఇదివరకు గోడలమీద గాంధీ, నెహ్రూల్లాంటి నేతలు వేలాడే చోట ఇప్పుడు నిలువెత్తు తైలవర్ణ చిత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు  నిలువుకాళ్లమీద గీతాబోధన చేస్తున్నాడు. 'ఈ కృష్ణుణ్నెక్కడ చూసానబ్బా!' అని ఆలోచిస్తుంటే.. ప్రసాదు ఊడిపడ్డాడు గదిలోనుంచి.
పట్టెనామాలు.. పట్టుబట్టలు.. అచ్చంగా భజరంగ బలి కార్యకర్తలాగున్నాడు.
కాలేజీరోజుల్లో వాడో పెద్ద కమ్యూనిస్టు! కాలంతో పాటు మార్పూ సహజమేగానీ.. మరీ ఇంత యాంటీగానా!
'ఏంటీ ఈ అవతారం?' అనడిగా.
'వాసాంసి జీర్ణాయ యథా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి..'అంటూ సి.డి పెట్టాడు.
 అర్థం కాలేదు! కృష్ణవేణయితే గుడ్లప్పగించి చూస్తోంది.
'చిరిగిపోయిన పాతబట్టలను వదిలేసి మనిషి కొత్త బట్టలను ధరించినట్లే.. మనం పనికిరాని పాతవస్తువులను వదిలిపెట్టి కొత్తవి తెచ్చుకోవచ్చు..' అన్నది.
'ఎవరు?'
'గీత'
'కృష్ణవేణి కన్నీళ్ళాపుకోలేక గిరుక్కని తిరిగి వెళ్ళిపోయింది.
'ఎవర్రా ఈ గీత?' కోపం ఆపుకోలేక అరిచేసా. గోడమీది కృష్ణుడివంక చూపించాడు.
చటుక్కుమని చిక్కుముడి విడిపోయింది.
ఏమీ లేనిదానికి కౄష్ణవేణి ఎంతార్భాటం చేసేసిందీ! అనవసరంగా నేనూ ప్రాణమిత్రుణ్ణి  అపార్థం చేసేసుకొన్నానే!
'గీతంటే భగవద్గీతని ఇంట్లో పెళ్లానికైనా నచ్చచెప్పుకోవద్దుట్రా!' అని కూకలేసే.
'ఎంత గీతయితే మాత్రం! కటుకొన్న పెళ్లాన్నీ.. కన్న పిల్లల్నీకూడా మర్చిపోవాలా! ఖర్మ! భక్తి.. యోగం.. శ్రద్ద.. నా శ్రాద్ధం! సంసారం చేసుకునేవాళ్లకీ సన్నాసియోగం.. విబూదియాగం.. ఏంటన్నయ్యా! రాజకీయాలంటే.. ఏదో సరిపెట్టుకొని వస్తుంటే.. సరాసరి ఇప్పుడు రామకృష్ణ మఠాన్నే తెచ్చి నట్టింట్లో పెడతున్నారు. ఎట్లా?' అంటూ ముక్కు చీదుకొంటున్న పెళ్లాంవంక తిరిగి 'కృష్ణా! గీత దాటుతున్నావ్!' అని గద్దించాడు ప్రసాదు.
కిక్కురుమనకుండా కృష్ణవేణి లోపలికి వెళ్ళిపోయింది పాపం.
' 'సర్వ ధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం ప్రజ'.. అని భగవానుడు ఉత్తినే అనలేదురా చలపతీ!' అని మొదలుపెట్టాడు మళ్లీ నా వంక తిరిగి.
'గీత ఒక శాస్త్రం కాదు. అస్త్రం. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణభగవానుడు ఉపదేశించిన గీతను నేటి నాయకులు ఎన్నికలముందరే ఎందుకు వినిపిస్తున్నారో అర్థం చేసుకో! పెద్ద రచయితవు కదా!' అన్నాడు శనగ్గింజల పళ్లెం ముందుకు లాక్కొని.
'కౌరవులు వందమంది. పాండవులు ఐదుమంది. నేరుగా పోరుకు దిగితే పాండవులకు పరాజయం ఖాయం. ఆరంభంలోనే అర్జునుడు పారిపోయే మూడ్ లో ఉన్నాడు. రథాన్ని యుద్దంరంగం మధ్య నిలబెట్టి శ్లోకం తరువాత శ్లోకం బాదుతుంటే.. వినేవాళ్ళు ఎంత వీరాధివీరులైనా నీరసం రాదా! ఏడొందల పైచిలుకు శ్లోకాలురా!.. సుమారు ఇరవైనాలుగ్గంటలు!.. పైన విశ్వరూప ప్రదర్శన!.. ఆపైన ఉపసంహరణ! ఎంతటి యోధానుయోధుడైనా యుద్దానికి ముందే సగం చచ్చూరుకుంటాడా లేదా! ప్రిపేరై ఉన్నాడు కాబట్టి అర్జునుడికేమీ అవదుగానీ.. కౌరవులు నీరుగారిపోరా! అదే వాళ్ళ ఓటమికి నాంది అయింది.  కృష్ణభగవానుడా మజాకా! మా భాజపా బాబులా కృష్ణభగవానుడి బాబులు. అందుకే అందిన చోటల్లా .. అవకాశమున్నప్పుడల్లా.. గీతా సీ.డీలు  పెట్టి.. పుస్తకాలు పంచిపెట్టి.. అదరగొట్టేస్తున్నారు. ఇన్నేసి రాష్ట్రాలాయ! ఎప్పుడూ ఎక్కడో ఓ చోట చోటా మోటా ఎన్నికల జాతర్లేనాయ! ఆ మాత్రం ముందుచూపు లేకపోటే ఎట్లాలే!' అన్నాడు తైలవర్న చిత్రానికేసి తాదాత్మ్యంగా చుస్తూ.
నా పుస్తకం ప్రచురణ సంగతి అడిగితే 'ఈ బోడి కవిత్వాలు.. కథలూ రాయడం మానేసి..  మా 'గీత' కు మంచి భాష్యం ఓటి రాయరాదుట్రా! వ్యాసులవారి శ్లోకాలు మరీ వ్యాసాలకు మల్లే ఉన్నాయి. మన మూసలో రాసి తీసుకురా! అచ్చు సంగతి ఆలోచిస్తా!' అనేశాడు.
నేను తిరిగి వచ్చేరోజు స్టేషనులో దిగబెట్టి వెళుతూ 'నీ దగ్గర దాచేదేముందిరా! గవర్నమెంటు పన్లు మా డేంజరుగా ఉన్నాయ్! చూశావుగా! పాఠ్యపుస్తకాలమీదెంత రచ్చవుతున్నదో!అందుకే గీతా పుస్తకాలకీ.. డిజిటల్ మెటీరియల్ సప్లయ్యికన్నా ఎట్లాగైనా కాంట్రాక్టు సంపాదించాలి. ఎన్నికలన్నీ అయిందాకా ఈ సన్నాసి వేషం తప్పదురా! పార్టీ లాబీయింగు! నీకు తెలీనిదేముంది ఈ లోతుపాతులన్నీ! మా పిచ్చిదే అర్థంకాక కంగారు పడిపోతున్నది. మీ చెల్లాయికి నువ్వే ఎలాగైనా నచ్చచెప్పాలి!' అని చేతులు పుచ్చేసుకొన్నాడు!
ప్రసాదు రాజవిద్యారాజగుహ్యయోగం!
గీత చదువుదామని అక్కడే ఉన్న హిగ్గింబాధమ్సులో అడిగా. 'లేద'నే సమాధానమొచ్చింది!
అన్నీ అధికార పక్షం వాళ్ళు పంచడానికి కొనేసారు కాబోలు! వరంగల్లు ఎన్నికల తంతొహటి ప్రస్తుతం నడుస్తున్నది కదా!' అన్నాను ప్రకాశంగా.
'భలే అమాయకులు  సార్ మీరూ! మతతత్వపార్టీలవాళ్లెవరికీ ఆ అవకాశం  అందుబాటులో లేకుండా  మావోయిస్టులే కాపీలన్నీ కొని దాచేసారు' అన్నాడు పక్కనే ఇంగ్లీషు పేపరు కొనే పెద్దాయన!
***
-కర్లపాలెం హనుమంతరావు
(అక్షర అంతర్జాల మాసపత్రిక డిసెంబరు 2015లో ప్రచురితం)