Thursday, December 31, 2015

శునక పురాణం- ఓ సరదా గల్పిక




 




కుక్కలమీద కథలు సరదాగానే ఉంటాయి. కక్కకథే చేదు. ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు సృష్టిలో. ఎవరికీ లేని కడగండ్లు మా కుక్కజాతికే!కుక్కలంటే విశ్వాసానికి మారుపేరు అంటారు. మంచిమాటే. కానీ మా విశ్వాసానికి వీసమెత్తైనా విలువేదీ?

మా జంతుజాలం దృష్టిలో మనుషులంతా పాతసినిమా రాజనాలలు. సూర్యకాంతాలు. కుక్క కంటబడితే చాలు  రాళ్లతోనో, కర్రలతోనో  కొట్టాలని మీకు మహా కుతి. ఆత్మరక్షణకోసం మేం కాస్త నోరు చేసుకొన్నామా.. ‘పిచ్చికుక్క’ అని ముద్దరేసి  మరీ వేపుకుతింటారు. మున్సిపాల్టీ బండ్లకోసం పరుగులు పెడతారు!

మా కుక్కలు.. వరాహసోదరులు.. నోరు చేసుకోకుంటే మీ స్వచ్చభారతులు ఎంత కంపుకొట్టేవో! ఆ విశ్వాసమైనా లేని కృతఘ్నులు మీ మనుషులు!

కుక్కకష్టాలు  ఒక్క మనుషులతోనే కాకపోవచ్చు !  కుక్కలకే కుక్కలంటే పడి చావదన్నమాటా నిజమే కావచ్చు.  కాని .. ఆ దొబ్బుతెగుళ్ళన్నీ మీ పొలిటీషియన్లని, టీవీ సోపుల్ని  చూసే  అబ్బుంటాయని నా డౌటు.

'అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. .. సబ్బుబిళ్ల కాదేదీ కవిత కనర్హం' ఆహాహా! ఎంత గొప్పగాచెప్పాడండీ  మీ మహాకవి! ఆ మహానుభావుడికేమో మెమొంటోలు..  చప్పట్లు! మా మీదకు మాత్రం రాళ్ళూ  రప్పలు! మీ హిపోక్రసీని చూస్తే ఎంత బుద్ధిగా ఉండే కుక్కకైనా కసిగా కరవ బుద్ధేస్తుంది!

 

 

‘మీ గొడవలన్నీ మాకెందుకులే!' అని ఓ మూల దాలిగుంటలోపడి వుంటామా ! 'కరిచే కుక్క అరవదు' అని మీకు మీరే డిసైడై పోయి.. మా వెంటబడతారు. ‘చదువులన్ని చదివి చాల వివేకియై /కపట చిత్తుడైన బలునిగుణము/దాలిగుంతనెట్టి దలచిన చందమౌ /విశ్వదాభి రామ వినుర వేమ!’ అంటూ పద్యాలకు తగులుకుంటారు. విని విని పిచ్చెత్తి  కరిచేదాకా వదిలి పోరు .   కరుపుకి, అరుపుకి లింకేం పెట్టుకోరాదని మా రాజ్యాంగంలో ఏ సెక్షను కిందే క్లాజులో రాసుందో? ! అరుస్తూ కరుస్తారు. కరుస్తూనే  అరుస్తారే..మరి మీ మనుషులూ! మీకో నీతి.. మాకో రీతీనా! సిల్లీ!  కుక్కై పుట్టే కన్నా అడవిలో పిచ్చిమొక్కై పుట్టడం మేలనిపిస్తుంటుందొక్కోసారి. 'మొక్కేకదా అని పీకేస్తే .. పీక తెగ్గోస్తా!' అన్న అన్నగారి పంచ్  గుర్తుకొస్తుంది! పిచ్చిమొక్కకిచ్చేపాటి విలువైనా మా కుక్కజాతికివ్వడం లేదీ  మనిషి. మరీ టూ మచ్! ‘అందితే తోక.. అందకుంటే మూతి!’మీ  మనుషులది. ఐ హేట్యూ మ్యాన్!

అమెరికాలో పుట్టే అదృష్టం అన్ని’డాగు’లకూఉంటుందా ? ! అక్కడైతే.. డెమోక్రటిక్ ఒబామానుంచి.. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ దాకా.. పార్టీపరంగా ఎన్ని చీలికలు ఏడ్చినా.. మా పెట్ జంతువులపట్ల  ఒకటే పాలసీ! ఇంటిసభ్యులకన్నా ఎక్కువగా చూసుకుంటారు.   పెళ్లిళ్ళు, పేరంటాలు, సీమంతాలు, పురుళ్లు.. అన్నీ మనుషులకు మించి  జరిపించే గొప్పశునకప్రేమికుల దేశం అమెరికా.  భూతలంమీది కుక్కలస్వర్గం. బుద్ధభగవానుడు పుట్టిన మీ  ‘లైట్  ఆఫ్ ఏసియా’నో! శునకాలపాలిటి భూలోక  నరకం.

వానలు కురవనప్పుడే కప్పలు ఇక్కడ గుర్తుకొచ్చేది.  పోకిరీల ఊరేగింపులకే గాడిదలు అవసరం పడేది! పెట్రోలూ , డీజెలూ  గట్రా రేట్లు తగ్గించాలన్న డిమాండ్లు పుట్టినప్పుడే బండ్లీడ్చే బుల్సు పిక్చర్లో కొచ్చేది! 'అక్కరకు రాని చుట్టము.. మొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము.. గ్రక్కున విడువంగ వలయున'ని మళ్లీ నీతిశతకాలు!  సెంటిమీటరుకో సుమతి మహాశయుడితో కిక్కిరిసున్న  సమాజంరా బాబూ  మీ మనుష్యలది! ఒక్క కుక్కలకనేముందిలే! అన్ని జంతుజాలాలకూ మతులు పోతున్నాయీ  పుణ్యభూమిలో!    

దొంగల్ని పట్టే దివ్యమైన కళ మా దగ్గర ఉందని చేరదీస్తారా! దానికీ రాణింపు రానివ్వని కుళ్ళు మనుషులది! పోలీసుపటాల్లోకి పెద్ద పటాటోపంగా తీసుకున్నట్లు లెక్కలుంటాయి! కుక్కలకు వాసన పసిగట్టడంలో శిక్షణ ఇచ్చే  వంకతో లక్షల కోట్లు కొట్టేస్తారు! అదృష్టం కొద్దీ అవకాశమొచ్చి మేం ఏ దొంగవెధవనో పట్టుకొన్నా ఫలితం సున్నా. మేం పసిగట్టిన ఏ దొంగవెధవైనా మినిమమ్  మూడు రోజులన్నా  లాకప్పులో ఉంచరు.     ఎఫ్ఫైఆర్ల దగ్గర్నుంచే యవ్వారాలు మొదలు దొంగ పోలీసులకు.. దొర మార్కు దొంగలకు మధ్య! రొట్టెముక్కలు విసిరి తోకలు ఊపించుకోడానికి..  పక్కింటివాళ్ల ముందు  గొప్పలు చూపించుకోడానికే మా కుక్కలు మీ మనుషులకు! షేమ్.. షేమ్!

బేసికల్ గా భైరవజాతి అంటేనే ఎందుకో మనుషులకు చీదర.  అన్నం కరడింత పారేస్తే జన్మంతా పెరట్లో పడంటుందన్న  చులకనా!

ఆడించేందుకు కోతులు, కొండముచ్చులు, పాడించేందుకు కోకిలలు, చిలుకలు, తలాడించేందుకు గంగిరెద్దులు, గొర్రెపోతులు, కొట్టు చచ్చేటందుకు  కోళ్ళు, కొక్కిరాయిలు, ఢీడిక్కీలు కొట్టుకొనేందుకు పొట్టేళ్ళు, దున్నపోతులు! ఒక్కో దురదకి ఒక్కో జంతువు మనిషికి! మా కుక్కలతో మాత్రం ఏ అక్కరా లేదు.చీ.. ఎంత కుక్కబతుకయిపోయిందిరా గాడ్  మా డాగులది !

అసలు ! కుక్కలకి, కుక్కులకి ఏమంత పెద్ద తేడా ఉందిట! కుక్కలం మీరు తిన్న ఎంగిళ్ళు నాకితే.. కుక్కులు తిన్న ఎంగిళ్లు మీరు నాకుతారు! దొంగచాటుగా మెక్కే అ కుక్కేశ్వర్లకేమో వేలకు వేలు జీతభత్యాలు! దొరబాబుల్లా ఎంగిళ్లకు ఎగబడే మాకు మాత్రం దుడ్డుకర్రలతో ఘనసత్కారాలు!

దాలిగుంటలో నిద్రోయే సమయంలో రాయేసే రాలుగాయిని రక్తాలొచ్చేటట్లు   కరవాలా? ‘రా.. రమ్మ’ని పిలిచి ముద్దులు పెట్టుకోవాలా? ఏ కుక్కయినా  బేడ్ మూడ్ లో ఉండి   కసిబట్టలేక కాస్త కండ ఊడేటట్లు  కరించిందే అనుకోండి! ఇక కుక్క జాతి మొత్తానికి ఆయువు మూడిందే! మీ సోషల్ మీడియా నిండా  మా గురించి చెడామడా  వార్తలు! లోకమంతా మా కుక్కల దాడితోనే అల్లకల్లోలమైపోతున్నట్లు బిల్డప్పులు ప్రసార మాధ్యమాల్లో!  మాకూ ప్రత్యేకంగా పత్రికలు.. టీవీలుగాని ఉండుంటేనా! మీ మనుషులు చట్టసభల్లో చేరి  చేసే నానాయాగీని నిప్పులతో కడిగి మరీ చెరిగేసేవాళ్లం! చూస్తున్నాంగా రోజూ టీవీల్లో   మీ గౌరవనీయుల యాత్రల తీరు! మా బజారు కుక్కలుకూడా సిగ్గుతో తలలు దించుకొంటున్నాయి మీ కుక్క మొరుగుళ్లతో . ప్రజాస్వామ్యం జోలికి పోనందుకు మహా సంబరంగా ఉంది సుమా మాకిప్పుడు. 

ఆ మాటకు మామీదా సభాహక్కుల తీర్మానం  బనాయిస్తారు కాబోలు! ఫర్వానై! న్యాయస్థానాల్లోనే తేల్చేసుకుందాం తేరే..మేరే బీచ్ కీ యే  ఖిచ్.. ఖిచ్!

బర్త్ కంట్రోలుకని మా కుక్కల్ని బలవంతంగా మున్సిపాల్టీ బళ్లల్లో కుక్కేయడం     కుక్కల హక్కులకు భంగకరం.  బొద్దింకలమీద బయోలజీ విద్యార్థులు ప్రయోగాలు,   ఎలుకలపై  నెవరెండింగ్  జీవశాస్త్ర పరిశోధనలు, కోతులు గట్రా జాతులకు  కత్తికోతలూ! మనుషులమీదా  మా జంతువులు ఇదే మాదిరి బలవంతపు   పరిశోధనలకు తెగపడితే! హక్కు  ఉల్లంఘనలు  అన్ని ప్రాణులను  సమానంగానే హింసిస్తాయి బ్రదర్స్ !

ఎవర్ననుకొని ఏం లాభం ! ఆ దయామయుడికే మామీద కనికరం కరువైనప్పుడు! ఆ పెద్దాయనకూ మాకూ పెద్దతేడా ఏముందని? జి.. ఓ.. డి అయితే గాడ్!  డి.. ఓ.. జి గా రివర్సు చేస్తే డాగ్! కష్టం వస్తే ‘ఓ మై గాడ్’ అంటారే గానీ.. ‘ఓ మై డాగ్’ అనరెవరూ! సరికదా 'గాడ్'గారి ముందు పడీ పడీ పొర్లుదండాలు పెట్టే మూడీ మనుషులు డాగ్ పేరు వింటే మాత్రం  దుట్టు కర్రతో  వెంటబడతారు! మ్యాడ్.. మ్యాడ్.. మ్యాడ్ మీ  హ్యూమన్ వరల్డ్!

శునకానికి కనకంతో రైమింగున్నందుకైనా  పోనీలే అనిపించదా మీ  పెద్దమనుషులకు ! 'కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేల మాను' అంటూ మా పైన వెటకారాలు న్యాయమా ? ! ఇప్పుడేదో ఆ  సింహాసనాలని కరుచుక్కూర్చున్న పెద్దమనుషులంతా పెద్ద   సుపరిపాలన సాగిస్తున్నట్లు! మా జాతికి విశ్వాసమనే  అర్హతైనా  ఉంది. మీనేతల కది  ఓట్లు పడే సరుకు.  

ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంది . ఆదిశంకరులకి  జ్ఞానబోధ జరిగిన  కథ మా జాగిలాల మీదే. జనమేజయుడి యజ్ఞవాటికలో    సరమ  బిడ్డ ఆడుకొన్నది నూ దేవ శునకం తోనే.   మహాప్రస్థానికని బైలుదేరిన ధర్మరాజుని  అన్నదమ్ములతో కలసి అనుసరించిన శునక జాతి వారసులం మేం.  ‘భగవద్గీత’సైతం   ప్రస్తావించే  మాజాతి  రాత ప్రస్తుతం   దయనీయం . 

‘కుక్కగా పుడితే తప్ప కుక్క కష్టాలు మీ తలకెక్కవు. అనుభవిస్తే తప్ప తెలిసిరానివి మా బాధలు. అందుకైనా .. ఓ భగవాన్.. ఈ మనుషులంతా  ఇండియాలో వీధికుక్కలు గ జన్మించాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నా!



***



(కర్లపాలెం హనుమంతరావు(వాకిలి- జనవరి 2016 సంచికలో ప్రచురితం)

 





 

 

 

 


కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- జనవరి 2016 సంచికలో ప్రచురితం)




Tuesday, December 29, 2015

అధిక్షేప సాహిత్యం- మిసిమి నవంబరు 2015


శబ్దరత్నాకరం ప్రకారం 'అధిక్షేపం' అంటే దూఱుట, బెదిరించుట. 'వొక్కొక్కడికీ ఎవడికి వాడికి/ నాలుగ్గోడల నడిం ప్రపంచం/ కల్చర్- కంచం, మంచం/ యెవడికి వాడికి యెవడిది వాడిది!' 'కల్చర్ అండ్ అనార్కీ' కవితలో కవిపూషా చేసిందీ అధిక్షేపాన్నే!ఇష్టంలేని ఎదుటిమనిషి లోపాల్ని ఏదోవిదంగా ఎత్తిచూపాలనుకోవడం మానవతత్వంలోని  బలహీనత. తప్పును సరిచేయాలన్న సద్బుద్ధి కావచ్చు.. దుష్ప్రచారం చేయాలన్న దుర్భుద్దీ కావచ్చు. విశ్వనాథవారు 'శ్రీ'కారాలు విరివిగా వాడతారని  దేవీప్రసాదు 'అచ్చుత్తించు శ్రీ ప్రెస్సులో శ్రీ అచ్చుల్ సరిపోయి ఏడ్చినవటోయ్ శ్రీ విశ్వనాథేశ్వరా!' అని వెటకారం చేయడం ఏ కోవకు చెందిందో ఎవరికి వారు అవగాహన చేసుకోవాలి.


పిల్లిమీదా ఎలుకమీదా పెట్టి అన్యాపదేశంగా ఎత్తిపొడిచే వ్యంగ్యవిధానాన్ని పాశ్చాత్యులు 'సెటైర్' అంటారు. జోనాథన్ స్విఫ్ట్ తనకాలంనాటి పాలకుల లోపాలని ఈ పద్ధతిలోనే గలివర్స్ ట్రావెల్సులో ఎత్తిచూపాడు. మన ఆదికావ్యం రామాయణం పుట్టడానికీ వాల్మీకులవారి అధిక్షేపమే మూలకారణం. క్రౌంచ పక్షుల జంటను విడదీసిన నిషాదుణ్ణి 'ఆట్టే కాలం బతకవ'ని ఆ కవి తిట్టిపోయడం అధిక్షేపం కిందే లెక్క. చేతి ఉంగరం పోయిందని చెరువుమీద, రాసేందుకు పత్రాలివ్వలేదని తాటిచెట్టుమీద అలిగి కవులు తిట్టిపోసిన అధిక్షేప సాహిత్యానికి ఆంధ్రభాషలో కొదువలేదుగానీ అదంతా వైయక్తిక అధిక్షేప విభాగం. సమాజాభివృద్ధికి దోహదపడ్డ సాంఘిక అధిక్షేపాన్ని గూర్చి పరిచయం చేయడమే ఈ చిరువ్యాసం ఉద్దేశం.
జీవితం అంటే మంచి చెడుల సమ్మిశ్రితం. చెడును ప్రతిఘటించడం ఒక ఎత్తైతే.. ఆ  శక్తి లేనప్పుప్పుడు పరోక్షంగానైనా ఎత్తిపొడవడం మరో ఎత్తు. మహాభారతం విరాటపర్వంలో కీచకుడి చేత పరాభవానికి  గురైన పాంచాలి  ధర్మజునిముందు తన గోడు వెళ్లబోసుకోవాలన్న తొందరలో సభామండపంలోకి వచ్చేస్తుంది.'పలుపోకల పోవుచు వి/చ్చలవిడి నాట్యంపు సూపు చాడ్పున' పాంచాలి అలా దూసుకు  రావడాన్ని ధర్మజుడు ఆక్షేపిస్తాడు. భర్త మందలింపుకు నేరుగా బదులీయలేని దుస్థితి పాంచాలిది. బదులియ్యకుండా ఉండలేనీ మనస్థితి. అందుకే 'నాదు వల్లభుండు నటు డింత నిక్కంబు/ పెద్దవారియట్ల పిన్నవారు' అంటో  ప్రత్యధిక్షేపాన్నిఆశ్రయిస్తుందా సాథ్వి. కేవలార్థమే కాదు.. సందర్భాన్నిబట్టి మరో అర్థమూ స్ఫురింపచేసే 'ద్వని' కావ్యానందాన్ని ఇనుమడింపచేస్తుంద'ని ధ్వన్యాలోక కర్త ఆనందవర్ధనుడి వాదన. అభిధ(శబ్దవృత్తి), లక్షణ వ్యాపారాలే కాకుండా పదానికి వ్యంజకత్వం అనే మరో బాధ్యతా ఉందన్నది ఆయన సిద్దాంతం. ఎత్తిపొడుపు, వెక్కిరింత, విసురు, విరుపువంటి ప్రక్రియలెన్నోఈ బాధ్యతను విర్వర్తించే అధిక్షేప విభాగాలే. వీరేశలింగంవంటి వైతాళికుల చొరవతో తెలుగులో ఈ విభాగాలకు సాంఘికోద్ధరణ బాధ్యతా పెరిగింది.
ఆత్కూరి మొల్ల రామాయణం పీఠికలో 'మును సంస్కృతముల దేటగ/ దెనిగించెడి  చోట నేమి దలియక యుండన్/ దన విద్య మెఱయ గ్రమ్మఱ/ ఘన మగు సంస్కృతము జెప్పగా రుచి యగునే!'  అంటూ డాంబికాచారాలని తూర్పార పట్టింది. ఆ తీరులోనే వీరేశలింగం డాంబికాల డొల్లతనాన్ని బైటపెడుతూ 'అభాగ్యోపాఖ్యానం' వంటి  అధిక్షేప కావ్యాలు అల్లారు. నవ్విస్తూనే అధిక్షేపించే ఈ కావ్యాలు ప్రహసనాలుగా ప్రసిద్ధం. విమర్శలపాలైనవారికీ తీవ్రంగా ప్రతిస్పందించ బుద్దేయదు..  సరి కదా ఆత్మవిమర్శద్వారా స్వీయసంస్కరణకు ఈ రకమైన అధిక్షేపం చక్కని అవకాశమూ ప్రసాదిస్తుంది. విమర్శ విమర్శకోసమే కాకుండా సంస్కరణ అంతిమ లక్ష్యంగా సాగే అధిక్షేపాన్ని అందుకే సంఘసంస్కర్లలు ఉత్తమమైనదని నెత్తిన పెట్టుకునేది. చిలకమర్తి గణపతి, మొక్కపాటి పార్వతీశం,  పానుగంటి జంఘాలశాస్త్రి, గురజాడ గిరీశం.. మనిషిలోని, సంఘంలోని వక్రబుద్ధి, అమాయకతల పోతబోసిన అధిక్షేప పాత్రలు.  కాళ్లకూరివారు- వరవిక్రయం వంకబెట్టి వరకట్నాలను తునుమాడితే.. గురజాడగారు గిరీశం భుజంమీద అధిక్షేపంతుపాకి పెట్టి  కన్యాశుల్కంమీద యుద్ధం ప్రకటించారు. కవిరాజు సూతపురాణం పేరుతో పౌరాణికాల పాతకాలను ఎండగడితే.. చమత్కారం,  వెక్కిరింతలనే జోడుగుర్రాలమీద అధిక్షేపరథాన్ని దౌడుతీయించిన ఘనుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి. కాకపోతే అదంతా వైయక్తిక వ్యంగ్య వైభోగంలో భాగం. కుసంఘానికి ఒక స్థాయిలో చురకలు అంటించిన వైప్లవికుడు శ్రీ శ్రీ. 'జమీందారు రోల్సు కారు, మహారాజు మనీపర్శు/ మరఫిరంగి, విషవాయువు,  మాయంటావా? అంతా/ మిథ్యంటావా?' అంటూ ముద్దులవేదాంతిని సైతం వదలక తలంటు పోసిన మహాప్రస్థానం ఆధునిక యుగంలో అత్యధికుల ఆమోదం పొందిన    అతిపెద్ద అధిక్షేప విన్యాసం. 'సులభంగా సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి  ఇవ్వరని స్త్రీలమీదా, దేశనాయకులమీదా, కవులమీదా గంపెడంత అసహనం వెళ్ళగక్కిన చలం సైతం శ్రీ శ్రీ 'ఎకసెక్కాలని' ఎరక్కపోవడం క్షమించరాని విషయం'గా ఒప్పుకున్నాడు.  శ్రీరంగంవారి ధోరణిలోనే వీరంగం వేసిన మరో ఎత్తిపొడుపుల  కత్తివీరుడు ఆరుద్ర.  'ఏకపత్నీవ్రతము/ ఎలుగెత్తి మనమతము/ వేల్పు భార్యలు శతము/ ఓ కూనలమ్మ!' అంటూ కూనారిల్లుతున్న మతతత్వంమీద పూలకత్తితో దాడికి దిగాడు. కాకపోతే పూలదెబ్బలకన్నా.. కత్తివాదరల చురుకే ఎక్కువ. గజ్జెలమల్లారెడ్డి గేయాలైతే దుష్టసంఘంమీద గజ్జెకట్టిన జజ్జనక జనారేలే!
కడుపులోని బాధను కన్నీళ్ళతో కడిగేందుకూ అదిక్షేపం నిక్షేపంగా పనికొస్తుందని నిరూపించిన కారుణ్యకవి జాషువా. 'కనుపడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్/   గనుపడలేదు వర్ణమునకన్న పిశాచము భారతంబునన్/ కనుపడలేదు సత్కులముకన్న మహాభారతంబునన్/గనుపడలేదు పంచమునికన్న నీచపుజంతువేదియున్' అన్న జాషువా వ్యాఖ్య నిమ్న కుల వివక్షను ప్రశిస్తున్న అధిక్షేపమే!
'దిబ్బావధాన్లు కొడుక్కి ఊష్ణం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేయడానికి ఇంగ్లీషు చదువే కారణం'గా భావించే కూపస్థమండూకత్వం కన్యాశుల్కం నాటికే తెలుగునాట వేళ్లూనుకుని విస్తరిస్తుండటం గురజాడవారిని కలిచి వేసినట్లుంది.   సమాజాన్ని సామూహికంగా కుంగదీసి వ్యక్తి చైతన్య వికాసాలను అట్టడుగు స్థాయికి అణగదొక్కేవి ఇట్లాంటి  మూఢనమ్మకాలే. సమాజ ప్రగతిరథానికి నిరోధకంగా మారే ఈ మహమ్మారులమీద గురజాడ ఎత్తిన అధిక్షేప వజ్రాయుధమే కన్యాశుల్కం నాటకం.
సామాజిక అధిక్షేపానికి వేమన సాహిత్యం మకుటాయమానం. 'విప్రులెల్ల జేరి వెర్రికూతలు కూసి/ సతిపతులను గూర్చి సమ్మతమున /మును సుముహూర్తముంచ ముండెట్లు మోసెరా?' అని కుండబద్దలేసిన  విశ్వదాభిరామన్న మన యోగివేమన.
సహజ విద్యావికాసానికి గ్రంధఛాందసభాష పెద్ద అడ్డంకి.  వందేళ్ల కిందటే వివరాలతో సహా  గురజాడ సమర్పించిన  డిస్సెంటు పత్రమే తెలుగుభాషాచరిత్రలో ఇంతవరకు  నమోదైన అతిపెద్ద అధిక్షేప పత్రం. స్త్రీ ఆత్మ స్వాతంత్ర్యం కోల్పోతున్న తీరును ప్రత్యక్షరంలోనూ అధిక్షేపించిన చలం సాహిత్యం అరుణాచలమంత ఉన్నతం. ఉద్వేగం, ఉత్తేజం ఉండకపోవచ్చుకానీ కొకు సిరా రాసిందంతా సామాజిక హిపోక్రసీమీద వామపక్ష అధిక్షేప పూత. నేలబారు పాత్రలతో కిక్కిరుసుండే రావిశాస్త్రి కతలన్నీ మేకవన్నెపులులపైన గోవులు విసిరే కొమ్ములు. 'ఈ పురాతన ధూళిలో బ్రతుకుతున్న వాడికి/ ఒక ఇల్లు కావాలని చెప్పడానికి మార్క్సు కావాలా?/నీకిది ఇన్నాళ్లూ తోచకపోతే నీ కంటే నేరస్థుడు లేడు'  అంటారు గుంటూరు శేషేంద్ర. నరమ్ నరమ్ గా ఉంటేనేమి అధిక్షేపంగీర శర్మస్వరంలోనూ షడ్జమంలో మోగుతోంది. ఎన్ని రకాలుగానైనా లెక్క పెట్టి చూడండి.. అధర్మరావణంమీద అధిక్షేపబాణం ఎక్కుబెట్టని కవిరామత్వం కలియుగంలోకూడా కలికానికి కానరారు.
ఉద్యమంనుంచి ఉద్యమం రూపుమార్చుకునే ప్రతిమలుపులోనూ పాతధోరణిమీద కొత్తవాదం సంధించేది అధిక్షేపాయుదాన్నే. కొట్టొచ్చినట్లు కనిపించేది ముందుతరాన్ని తదనంతరతరం కొట్టేందుకు రావడమే! 'చచ్చిన రాజుల పుచ్చిన చరిత్ర గాధల/ మెచ్చే చచ్చు చరిత్రకారులను/ ముక్కు చెవులు కోసి అడగాలనుంది మానవ పరిణామశాస్త్రం నేర్పిందేమని?'(జ్వాలామ్ముఖి- సూర్యస్నానం) అని నిలదీయడమంటే పాతచరిత్రనంతా 'ఛీ' కొట్టడమేగా!
వలస, భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాలన్నింటిపైన పుట్టిన ఏవగింపుకు విరసం ఒక బాహాటమైన అధిక్షేప రూపం. వర్ణాశ్రమధర్మాలు, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ, మూర్ఖపు అలవాట్లు, మూఢనమ్మకాలు, జన్మ కర్మ భావనలపై అతర్కిక విశ్వాసాలపై ఎక్కుపెట్టిన అధిక్షేపపుతూటా ఈ శతాబ్దారంభంనుంచీ మొగ్గతొడిగిన దళిత ఉద్యమం మాట. 'చెప్పులు కుట్టేవాడు- చెప్పులు తొడుక్కుంటే చెప్పరాని కోపం/ చెరువులు తవ్వేవాడు- చెరువులో నీళ్ళు ముట్టుకుంటే సహించరాని కోపం/ పొలాలు దున్నేవాడు- కాస్తంత భూమి కావాలంటే నేరం/ కాళ్ళమీద పడేవాడు- కాస్త లేచి నిలబడితే ఈ వ్యవస్థకి ద్రోహం' అన్న స్పృహ అట్టడుగు బడుగుకి ఏర్పడటమంటే అధిక్షేపం అక్షరం అంగీ తొడుక్కున్నట్లే!
'పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళిచేస్తానని/పంతులుగారు అన్నప్పుడే భయం వేసింది/ ఆఫీసులో నా మొగుడున్నాడు/ అవసరమొచ్చినప్పుడు సెలవివ్వడు/అని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది/వాడికేం మగమహారాజని ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది/ పెళ్ళంటే 'పెద్దశిక్ష' అని/ మొగుడంటే స్వేచ్చాభక్షకుడని/మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే/ మమ్మల్ని విభజించి పాలిస్తోందని' (సావిత్రి) - స్వశరీరంమీద సంపూర్ణ హక్కులకోసం అమల్లో ఉన్న సకల సామాజిక సాంస్కృతిక విలువలను బహిరంగంగా అధిక్షేపించడం ఆరంభించిన అతివ దిక్కార స్వరం అది. మైనారిటీలూ ఈ గడ్డమీద  పుట్టినందుగ్గాను తమకు  దక్కవలసిన సహజ హక్కులకోసం ఎలుగెత్తి వివక్షను ఆక్షేపిస్తున్నఅధిక్షేపయుగం ప్రస్తుతం నడుస్తున్నది.
'తిట్టకపోతే ఖలుడే కాదు దేవుడూ దారికి రాడు'అని కొందరి విశ్వాసం. ' ఆండ్రుబిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిగాని/ మొదటినుండియు నీవు దామోదరుడవే' అంటూ శ్రీకాకుళాంధ్ర దేవుణ్ణి కాసుల పురుషోత్తమ కవి పనిగట్టుకుని తిట్టిపోసింది బహుశా ఈ ఉద్దేశంతోనే కాబోలు! సున్నితమైన తిట్లు, సుతారమైన హాస్యంతోకలగలిపి వడ్డిస్తే మెక్కేవాడికైనా భుక్తాయాసం తెలియకపోవచ్చు. వట్టి తిట్లపురాణాలు పుట్లకొద్దీ పండిచినా కాలాన్ని మాయం చేసి ఆట్టేకాలం నిలవలేవు. 18వ శతాబ్దంలో ఏకోజీ మహారాజు కొలువులో ఒక వెలుగు వెలిగిన   వాంచానాథుడు తదనంతర పాలనలో ప్రజాపీడనకు కినిసి రాజును నేరుగా హెచ్చరించే అవకాశం కానక మహిషాన్ని అడ్డుపెట్టుకుని ఒక అధిక్షేప శతకం చెప్పుకొచ్చాడు. రాజును దారికి తెచ్చిన  ఆ మహిష శతకం అధిక్షేపధర్మ ఉదాత్త నిర్వహణకు ఉత్తమ ఉదాహరణ.
'మెఱుగు వేయకగాని మృదువుగా దన్నము/.. సాన వెట్టక మణి చాయ మిక్కిలి కాదు/.. ముక్కు నుల్చక దీప మెక్కువ వెలుగీదు/.. ఖలుడు గుణవంతుడౌను చకార గుళ్ళ' అంటూ చేట్రాతి లక్ష్మీనరసింహంకవి చెప్పిన కోదండరామ శతకపద్యం సద్భావంతో అర్థంచేసుకొంటే అవహేళన సాహిత్యంలోని ఔషధగుణం అవగతమవుతుంది. 'ఎమితిని సెపితివి కపితము/
బ్రమపడి వెరిపుచ్చకాయ వడిదిని సెపితో /ఉమెతకయను తినిసెపితో /అమవసనిసి అన్నమాట' అంటూ అల్లసాని పెద్దనవంటి ఉద్దండుణ్నీ దద్దమ్మని ఎద్దేవా చేసే వికటమనస్తత్వం పొటమరించనంతవరకు నిరసన సాహిత్యమూ రసహృదయాహ్లాదకరమే!
భగవద్గీతకు ఉత్తరగీతలు రాసుకున్న ఉదాత్త జాతి మనది. పాణినీయంవంటి సూక్ష్మశాస్త్రగ్రంథాలకూ అసంగత్వ మంటని రసోద్దీప అధిక్షేపాలొస్తే అస్వాదించిన హస్యస్ఫూర్తి మనది. హాస్యరసాధిదేవతగా వినాయకుణ్ణి కొలిచే జాతికి అధిక్షేపమంటే ఏవగింపు ఉంటుందనుకోలేం. జాతి మత భావోద్వేగాలమీద మితి మీరిన వెటకారానికి పోతే ఏమవుతుందో ఇటీవలే ఫ్రెంచిపత్రిక ఛార్లో హెబ్డో వ్యంగ్యచిత్రం సృష్టించిన కలకలం హెచ్చరిస్తోంది. వ్యక్తి శ్రేయస్సు, జాతి సౌభాగ్యం ఆకాంక్షించని ఏ అధిక్షేపమైనా వ్యక్తిగత అసహనానికి, అనారోగ్య మానసానికి మాత్రమే దుష్టదృష్టాంతంగా మిగిలిపోతుంది.  పరిమితులు ఎరిగి పరభాషా సాహిత్య వరవడుల్లోనే తెలుగు అధిక్షేపమూ మునపటి దారినే భావికి సౌభాగ్యసోపానంగా శోభాయమానంగా సంఘసేవ చేస్తుందని .. చేయాలని ఆకాంక్షిద్దాం***
-కర్లపాలెం హనుమంతరావు
(మిసిమి- మాసపత్రిక- నవంబరు 2015లో ప్రచురితం)

















Thursday, December 17, 2015

కందిపోటు దొంగలు- ఓ సరదా కథ


ఎదురుగా బోనులో నిలబడ్డ ఆకారాన్ని వింతగా చూస్తూ అడిగారు యమధర్మరాజు 'ఎవర్నువ్వు?!'
'బేండీకూట్'
'సమవర్తి భృకుటి ముడిపడింది 'విధాతగారు మాకు సమాచారం లేకుండా కొత్తజీవుల సృష్టిని ఎప్పుడు ఆరంభించారు?! యెనభైనాలుగు లక్షల రకాలు. రకానికో నలభై ఎనిమిది లక్షల జీవాలు. ఏది 'హరీ'మని ఇక్కడికొచ్చినా విచారించి పాపపుణ్యాలు బేరీజు వేయలేక మాకు చారులు కారిపోవుచున్నవి.' శివాలెత్తుతూ శివయ్యకు ఫిర్యాదు చేయాలని చరవాణికోసం వెదుకులాట ఆరంభించారా మృత్యుదేవుడుగారు.
చిత్రగుప్తులవారికిక జోక్యం  తప్పింది కాదు.
'ప్రభూ! 'బేండీకూట్' కొత్తజీవి కాదు. ఆంగ్లపదం. అచ్చమైన తెలుగులో దీన్ని 'పందికొక్కు' అందురు. తెలుగు గడ్డమీది గాదెల్లోని కందిపప్పు తెగ మెక్కు కొక్కు ఇది. ఈ సారే ఎందుకో తిన్నది అరక్క  చచ్చి ఇక్కడకు వచ్చిందిగానీ
'తెలుగు కందిపప్పు మెక్కిచచ్చే కొక్కుకి మరి ఆ ఆంగ్ల కొంకరభాష ఎందులకు?’ సమవర్తి చిందులు.
'అది మెక్కి చచ్చింది ఆంగ్ల కందిపప్పు కనక మహాప్రభో!' చిత్రగుప్తులవారి సముదాయింపు.
కాలదేవుడికి ఎక్కడో కాలింది 'యేమీ.. పరాచికములా! యముండ! పశ్చిమాన కందిపప్పన్న ఏమి తెలియునుతుచ్చమైన రంగు, రుచి, వాసనున్న ముక్కసరుకే గదా వారికి దిక్కు! ఈ తెలుగు కలుగుజీవికి ఆ ఆంగ్ల సంకరపప్పు తిని చచ్చు గ్రహచారం ఏల కలిగినట్లు?’
తెలుగునాటంతా ఇప్పుడు దొరికుతున్నది ఆ నాటుసరుకే కనక మహాప్రభో!’
యముండ! తెలుగు నేలల గురించి మాకు తెలియని చదువులా! బహు సారవంతమైన భూములు గదా వారివి. వరుణదేవుడి కరుణ కరువైననూ.. ఏడాదికి రెండు  పంటలు తీయు  గండర గండళ్లుగదా తెలుగు రైతన్నలు!'
'అమరావతి ఆహ్వానపత్రం చదివి పొరబడుతున్నట్లున్నారు ప్రభువులు. తమరు వర్ణించిన తెలుగు వైభవమంతా ప్రపంచీకరణం ముందటి కథ!’
తెలుగువారి పప్పులమీద జిహ్వచాపల్యంతోనే కదయ్యా  మన విష్ణుమూర్తులవారు ఏడుకొండలమీద తిష్ఠ వేసింది! అహా! ఆ స్వామికి  సమర్పించు వడప్రసాదాల రుచికి మా వడలూ పులకించుచున్నవి'
'ఆ వడలు  పులకించు వడలు అరక్కే నా కన్నా ముందు నా అర్థాంగి ఇక్కడకు వేంచేసింది'  కిసుక్కున నవ్వింది పందికొక్కు.
'పందికొక్కులకునూ మాతో పరిహాసములా! యముండ!' గుండెలు బాదుకొన్నారు యమధర్మరాజులుగారు.
'ప్రతిదానికీ మీరలా గుండెలు మోదుకోకండి మహాప్రభోమీరింకా ఆ క్షీరసాగరమధన కాలంనుంచి బైటపడలేకున్నారు!'
'నిజమేనయ్యా చిత్రగుప్తయ్యా! కంది ఏదో కలికాలంనాటి  శాకాహారుల మాంసాహారమని భ్రమపడుతున్నదిగాని పిచ్చిమంది.. 'జీవహింస మహాపాపం' అన్న భావంతో సత్యకాలంకన్నా ఎన్నో  యుగాలముందే  ముల్లోకాలు ఈ పప్పుదినుసుమీద ఆధారపడేవని ఎరుగదు.’
‘’నిజమే ప్రభూ! దానవులతో జరిగిన  భీకరయుద్ధాల్లో ఈ పప్పు ఎప్పుడు అగాధాలలో పడిందో ఎవరికీ తెలియదని వింటిని’ 
నాటినుంచేగదయ్యా దేవతలందరికీ కడగళ్లు మొదలయినవీ!. అలవాటు పడ్డ జిహ్వలాయ!’ ‘కనకనే కదా స్వామీ.. కమ్మని ఆ కందిముద్దల రుచిని వదులుకోలేక రాక్షసాధములతో  రాజీ కుదుర్చుకొని  మరీ పాలసముద్రంమీద  చిలుకుడు మొదలుపెట్టిందీ!’
లెస్సపలికితివి.  కందిని అందించేదే కదా కల్పవృక్షం! ఆ పప్పులో కలిసిన రాళ్లూరప్పలను  ఛేదించేది వజ్రాయుధం. ఉడికేందుకు ఉపయోగించేది అక్షయపాత్ర’,
తేలిగ్గా.. రుచిగా  ఉడికేందుకు తోడుపాలు ఇచ్చేది కామధేనువుకందిమూటలను సప్తలోకాలకు   చేరవేసేందుకు  ఐరావతం. కంది అమృతం అందరికీ అందుబాటులోఉండేందుకేగదా  ధనలక్ష్మీమాత ప్రభవించిందీ!’
ఆ లక్ష్మీసోదరుడు చందమామ అకాశంలో మెరుస్తూ అందరినీ అలరించగలుగుతున్నాడంటే అందులకు కారణం  కందిగింజ  ఆకారంలో ఉండటమేగదయ్యా చిత్రగుప్తయ్యా! అహో! మన దేవతలందరికీ ఆ కంది అమృతమెంత అపురూపమైనదీ!'
'చిత్తం చిత్తం మహాప్రభో! అమృతం ఉన్నచోటే హాలాహలమూ పుడుతుందంటారు. ఆ అమృతం వెలికి తీసేటప్పుడేగదా.. హాలాహాలం బైటపడి అంతలా కోలాహలం చెలరేగిందీ! కాలశివుడు సమయానికి అక్కడుండి  ఆ కాలకూటాన్ని అలా అంగిట్లో వేసుకోబట్టి కదా సర్వలోకాలూ  ఏమీ మూడకుండా బైటపడిందీ!’
మరి అదే ధర్మకార్యంగదా  మా బేండికూటులూ నిర్వహిస్తున్నది!’ అంటూ అడ్డొచ్చింది ఇహ వినే ఓపికలేక పందికొక్కు. ధర్మరాజులవారొక్కసారిగా చిరాకు మొహం పెట్టేసారు. పట్టించుకోదలుచుకోలేదు పందికొక్కు. ‘అవును మహాప్రభో! నాటైం బావులేక  ఖర్మకాలబట్టి చచ్చి ఇలా వచ్చాను. తమరు ధర్మస్వరూపులు. పూర్వాపరాలు  క్షుణ్ణంగా  విచారిస్తే నా  నిర్దోషిత్వం సత్వరమే తేలిపోతుందని మనవి
'గణాధిపతికి దీని వంశంతాలూకు చుంచెలుకలే యుగాలబట్టీ వాహనసేవలు అందిస్తున్నాయి మహాప్రభో! ఆయన నాయన శివయ్యమాదిరి  కాలకూట విషాన్ని మించిన టాంజానియా కందిపప్పును ప్రాణాలకు తెగించి మరీ  బొక్కుతున్నాయి ఈ పందికొక్కులు. ఆ ధర్మకకోణాన్నికూడా తమరు పరిగణలోకి తీసుకోవాల్సుంది
చిత్రగుప్తులవారి వత్తాసుతో సమవర్తి ధర్మసంకటంలో పడటం చూసి పందికొక్కు మరింత  రెచ్చిపోయింది. ‘మా లోకంలోని వ్యాపారులు మీ అంత మాలోకం కాదు  మహాప్రబో! అమెరికా, చైనాలను చూసి  బాగా ముదిరిన సజ్జు. పప్పుధాన్యాలు ఎక్కువ పండితే  లాభాలెక్కడ  తగ్గుతాయోనని దుర్భుద్ధి. సుక్షేత్రమైన భూముల్లో పప్పుకు బదులు పొగాకు, గంజాయిలవంటి మాదకాలను  ప్రోత్సహించే మదపురాయుళ్లకే వారి మద్దతు. అధిక దిగుబడి ఆశ చూపెట్టి  నాసిరకం  పప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నదీ ఈ దేశద్రోహులే. కళ్లేలమీదే వీలైనంత సరుకు  తక్కువ ధరకు రాబట్టిగిడ్డంగుల్లో పూడ్చిపెట్టి  కృత్రిమ కరువు సృష్టిస్తున్నారు. బీదబిక్కీ పప్పులకోసం అల్లాడే స్థితికి తెస్తున్నారు. గద్దెభయం అనుక్షణం వెంటాడే ప్రభుత్వపెద్దలు ఖజానాసొమ్మే కనకఎవరికీ  లెక్కలు చెప్పనక్కర్లేదు కనక ఆ నాసిరకం సరుకునే బజారుధరకన్నా ఎక్కువ పోసి కొంటున్నారు. అంతా కలసి జనం సొత్తును పంచుకొని భోంచేస్తున్నారు
ముక్కపప్పు తిని బతికే పందికొక్కుకు ఇంత పరిజ్ఞానమా!’ నోరువెళ్లబెట్టేసారు  యమధర్మజులవారు. వెంటనే ధర్మవిచారణణ బాధ్యత గుర్తుకొచ్చింది. తేరుకొని  'పప్పు లేనిదే తెలుగువాడికి ముద్ద గొంతు దిగదు. పసిబిడ్డకు తినిపించే గోరుముద్దలనుంచి.. పితృదేవతలకు సమర్పించే పిండాల వరకు,, అన్నింటా కంది కంపల్సరీ! పెళ్ళంటే తెలుగువాడికి  పప్పన్నమే. తప్పుచేసినవాడి కాలుకూడా పప్పులో వేయించే అతిమంచివాడు తెలుగువాడు. మీ కందిమల్లె యోగివేమన కందిమీద వ్యామోహం చావక   'పప్పులేని కూర పాడు కూర'ని ఈసడించాడు. పప్పు పక్కనుంటే చాలు.. పంచభక్ష్యాలనైనా పక్కకు తోసేస్తాడు మీ తెలుగువాడు. కూర, కలగూర, పులుసు, పచ్చడి.. చివరికి పొడిచేసైనా సరే  కందిని ఓ పట్టుబడితేనేగాని తృప్తితీరా త్రేన్చదు  ఏ తెలుగు కడుపైనా!  తెలుగువాడికి అంత ప్రాణపదమైనదని తెలుసుండీ గాదెల్లో దాచుకొన్న కంది అమృతాన్ని దొంగతనంగా మెక్కడం ఓ పందికొక్కుగా నీవు  చేసిన ద్రోహం కాదా! తిన్న ఇంటివాసాలు లెక్కించే నీలాంటి విశ్వాసఘాతుకులకు  శిక్షేమిటో తెలుసా! మా నరకంలో శాశ్వతనివాసం!'
చిత్రగుప్తుల వారు ఘొల్లు ఘౌల్లుమన్నారు! యమధర్మజులవారిని అసుంటా పక్కకు  తీసుకు వెళ్లి చెవుల కొరుకుడు మొదలుపెట్టారు 'భూలోకపాలకులకుమల్లే తమరూ   కంగారు పడితే కొంపలంటుకొంటాయి మహాప్రబోపందికొక్కులు చూసేందుకే చాలా అల్పజీవులు! ఇవి తెచ్చి పెట్టే  ఉపద్రవాలు  కల్పాంతానికైనా  ఆగవు. అందినంతవరకే వాటికి గాదెలో కందులు  ఆహారం. ఏవీ అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి పసికందులే అహారం. కుటుంబనియంత్రణంటే బొత్తిగా గిట్టని వీటికి మన నరకలోకం వీసా దొరికితే  మనగతేమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి మహాప్రభో! దీనికిప్పుడు తోడుగా ఓ ఆడజోడూ  తయారుగా ఉందిక్కడన్నది మరిచిపోకండి!’
యమధర్మరాజుల వారికి అంతా అర్థమయింది.మాట మెత్తబడింది. ‘నిజమేగానీ చిత్రగుప్తా! తీర్పు తిరగరాయడం కుదురుతుందా! చచ్చి ఒకసారి ఇక్కడికొచ్చిన ఏ జీవీ తిరిగి వెనక్కి వెళ్లడం కుదరదని  నీకు మాత్రం తెలీదా! ముత్తెమంత పుణ్యమైనా చేయని ఈ క్షుద్రజీవిని ఏ కారణం చూపెట్టి తిరిగి భూలోకానికి తరిమేయగలం! త్రిమూర్తులతో మాట రాదా!'
'ముత్తెమంత పుణ్యమేం ఖర్మ మహాప్రభో! ఈ పందికొక్కులు చేస్తోన్న ధర్మకార్యంముందు మన మహాదేవుడి శిష్టరక్షణకూడా ఏ మూలకు! గాదెల్లో దాచిన టాంజానియా కందిపప్పు కాలం గడిచేకొద్దీ కాలకూటంకన్నా ఎన్నో రెట్లు ప్రమాదకరం. అయినా ఆ విషాన్ని ప్రాణాలకు తెగించి మరీ భోంచేస్తున్నాయి ఈ పందికొక్కులు. తద్వారా ఎన్ని  తెల్లకార్డుజీవుల ప్రాణాలు వల్లకాడు పాలుకాకుండా కాపాడుతున్నాయో గుర్తించవద్దా ధర్మప్రభువులు!’
‘’ తలపంకించారు యమధర్మజులవారు.
నిజమే కానీ.. ధర్మాసనంమీద అధిష్ఠించి ఉన్న దేవతనుఅక్రమాలు జరుగుతున్నాయని  తెలిసీ గమ్మునుండిపోవడం ధర్మమా! దోషులను దండించడానికే గదయ్యా ఈ దండం నా చేతికొచ్చిందీ!’
చిత్తం మహాప్రభోకందిపలుకు కిలో రెండువందలు పలుకుతోంది కిందిలోకంలో ప్రస్తుతం. ఏం కొనాలో.. ఏం తినాలో తేలక తికమక పడుతున్నది సామాన్యప్రజానీకం.  ఆ కాలే కడుపులు సభల్లో చెప్పులు విసురుతున్నాయి. సచివాలయాలముందు  నిరసనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని  శాంపిల్సు మాత్రమే! అసలు ఎన్నికల మొసళ్ల పండుగలు చాలా ముందున్నాయి స్వామీ..  కందిపోటు దొంగలతో   మిలాకత్తయే  సర్కారు పెద్దలందరికీ!’

భళా! అర్థమయిందిలేవయ్యా! పదవి పోయి.. పరువు పోయి.. ప్ర్రాణాలు పోయి.. ఇక్కడికొస్తారుగా ఆ  పెద్దమనుషులుఅప్పుడు చూపిస్తా నా దండం తడాఖా!’ కసిగా  మీసాలు మెలేసుకోసుకొన్నారు అధర్మదండనాథులు.
కందిపోటుదొంగలు గాదెల్లో దాచిన కాలకూటవిషం  ఎంత మెక్కినా నీ ప్రాణాలకింక ఏ ఢోకా ఉండదు గాక!  నువ్వింక నీ లోకానికి సతీసమేతంగా సురక్షితంగా వెళ్లిపోవచ్చు! అసలు పందికొక్కుల్నిక్కడికి తొందరగా రప్పించు ధర్మకార్యంమాత్రం మర్చిపోవద్దుపందికొక్కు వైపు తిరిగి ప్రసన్నంగా ఆదేశించారు  యమధర్మజులవారు.  
ప్రభూ!.. తరువాతి విచారణ,,’ చిత్రగుప్తులవారింకో కొత్తదస్త్రం తీయబోతుంటే  'బాగా డస్సిపోయానయ్యా చిత్రగుప్తయ్యా! అత్యవసరంగా  రెండు కమ్మపొడి ముద్దలు వేడి వేడిగా  వెన్నకాచిన నేతిలో ముంచుకొని మింగితేకానీ.. మళ్లీ విచారణకు నాకు శక్తి రాదు' అంటూ లేచి నిలబడ్డారు యమధర్మజులవారు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(చిత్రకారులకు క్షమాపణలు. ధన్యవాదాలు- రచయిత)




Saturday, December 5, 2015

ప్రేమకు పరీక్షా!- రచన పత్రికలోని కథాపీఠం కథ

అప్పుడే తెలతెలవారుతున్నది. ఆటో ఓ గుడి ముందు ఆగింది. 'ఇదేనా రామాలయం?'అనడిగాను ఆటోవాడిని బాడుగ ఇస్తూ. ఇంటిముందుండాల్సిన పెంకుటింటి కోసం పరికించి చూసాను.
సగం కూలిన మట్టిగోడల ప్రహరీ. లోపల దుబ్బులా పెరిగిన పిచ్చి చెట్లు. కుంగిపోయిన వసారా.  అవధాని చెప్పిన ఇల్లిదే!
ఇంటినెంబరు ఇంకోసారి సరిచూసుకుని తలుపు తట్టాను. రెండోసారికి సగం తెరుచుకుంది తలుపు. తలుపు వెనకాల ఆమే! ఫొటోలో చూసిన సావిత్రి.
'కృష్ణమూర్తి' అన్నాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ. 'రండి!' అది తను కొద్దిగా పక్కకు తప్పుకుని. చెప్పులు ఓ వారగా విడిచి లోపలికి వచ్చాను. ఆమె చూపించిన సోఫాలో కూర్చున్నాను.  చాలా పాతకాలంనాటి సోఫా అది. తను లోపలికి వెళ్ళింది. అటువైపునుంచి ఏవో చిన్నగా మాటలు.
హాలుని పరికించి చూసాను. పెచ్చులూడిపోయిన గోడలు. వెల్ల వేయించి చాలా కాలమైంది. ఒక రకమైన పాతవాసన ఇల్లంతా. గోడలమీద రకరకాలఫొటోలు. కొన్ని దేవుళ్ళవి. బూజు కూడా దులుపుతున్నట్లు లేదు. ఒక మూల మాత్రం ఏదో ఫ్యామిలీ ఫొటో. కుర్చీలో ఉన్న పెద్దావిడకు వెనకున్న ఇద్దరిలో ఒకరు ఈ సావిత్రిలాగే ఉంది. కింద ఇద్దరు పిల్లలు కూర్చోనున్నారు.

'మొహం కడుక్కుంటారా? కాఫీ ఇవ్వనా?' అన్న ప్రశ్నలకు ఈ లోకంలోకొచ్చి పడ్డాను. 'మొహం కడుక్కుంటాను ముందు' అంటూ వెంటతెచ్చుకున్న బ్రీఫ్ కేసులోనుంచి బ్రష్షు, పేస్టు, షేవింగ్ సెట్టూ బైటికి తీసాను. వెనకవైపు ఆమె చూపించిన రేకుల బాత్ రూంలోకి దూరాను.

షేవింగు చేసుకుంటున్నానన్న మాటేకానీ.. మనసు మనసులో లేదు. అంతర్మథన. 'నేను చేస్తున్న పని సరైందేనా? నిజానికి ఈపాటికి నేను ఎప్పటిలాగా హైదరాబాదులో.. ఇందిరాపార్కు వినాయకుడి గుడిలో ఉండాలి. శారదకు ఆ గుడంటే చాలా ఇష్టం.  ఏటా పెళ్ళిరోజు ఉదయాన్నే తనతో కలసి ఆమె చేసే మొదటి పని ఆ వినాయకుడి గుళ్ళో అర్చన చేయించడం. మధ్యాహ్నం తనకిష్టమైన వంటకాలతో సుష్టుగా విందు. సాయంత్రం ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి పిల్లలతో సరదాగా గడపడం. కేక్ కటింగు రాత్రి తొమ్మిదీ ఇరవైకి. నాలుగేళ్ళ కిందట జరిగిన మా పెళ్ళికి అప్పటి ముహూర్తం అది. తను కేండిల్ ఊదేస్తే, నేను కేక్ కట్ చేసి ఒక ముక్క ముందుగా తనకు తినిపించాలి. అసలైన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్సు మొదలయ్యేది అప్పట్నుంచే. రాత్రంతా ఆ సంబరాలు సాగుతూనే ఉండేవి. రెండేళ్ళ కిందట బస్సు యాక్సిడెంటులో తను పోయేముందుదాకా క్రమం తప్పకుండా సాగిన కార్యక్రమం అది. తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఉయ్యూరు వెళ్ళిన శారద పెళ్ళిరోజు నాతో గడిపి తీరాలన్న పంతంతో తుఫాన్ను కూడా లెక్కచేయకుండా ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ తిరిగివస్తోంది. విజయవాడ హైవేలో నకిరేకల్ దగ్గర బస్సు చీకట్లో చెట్టుకు గుద్దుకున్న దుర్ఘటనలో ప్రాణాలు పోయిన ముగ్గురిలో శారద ఒకతి.  నా ఇంటిదీపాన్ని ఆర్పేసిన భయంకర సంఘటన అది.
శారదలేని జీవితం వెన్నెలలేని ఆకాశంలాగయింది. 'ఏమంత వయసు మీరిపోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకో’మని అమ్మ శతపోరింది శారదస్థానంలో మరొకరిని ఊహించుకోవడం కూడా నా వల్ల కాని పని. మరో ఆడపిల్ల బతుకు ఛిద్రం చేయదలుచుకోలేదు. అమ్మ ఆ దిగులుతోనే పోయినేడాది పోయింది. ఎంత వంటరిజీవితానికి అలవాటు పడుతున్నా ఇలాంటి స్పెషల్ అకేషన్సప్పుడు మాత్రం మనసు ముళ్ళపొదల్లో పొర్లించినట్లుంటుంది ఇప్పటికీ. ఏదో బాధ కొద్దీ అప్పుడప్పుడూ  ఇంత మందు కొట్టడమేగానీ అంతకు మించి ముందుకు పోవాలన్న పాడాలోచన నాకేనాడూ రాలేదు. 'అన్నీ చేసిపెట్టే అర్థాంగి ఇంట్లో ఉన్నా పరాయి రుచులకు పాకులాడే మన అవధానిలాంటి వాళ్లే దండిగా ఉన్న ఈ రోజుల్లో కూడా నువ్విలా ప్రవరాఖ్యుడికి మల్లే మడి కట్టుకున్నావు చూడూ,. అందుకు నీకు హ్యాట్ సాఫ్ రా.. సోదరా!’ అన్నాడు ఈ మధ్య బార్ లో వెంకటరమణ మందుకొట్టే మధ్యలో. అవధానిగాడు ఎగతాళికి దిగాడు. 'వీడసలు మగాడేనా అని నా డౌటురా రమణా!రుచి తెలీకగాని ఈ రుషి వేషం.. సావిత్రిలాంటి ఓ దేవకి తగులుకుంటే చాలదూ.. ఈ మునిముచ్చు..  విప్రనారాయణుణ్ని మించి రెచ్చిపోవడానికి!' అంటూ పనిగట్టుకుని మరీ నన్ను రెచ్చగొట్టేసాడు. మందుదెబ్బలో ఉన్నానేమో ఎన్నడూ లేనిది రోషం ముంచుకొచ్చేసింది. పక్కనున్న వెధవలా మంటను మరింత ఎగదోసారు. చివరికి అవధానిగాడి వ్యూహంలో చిక్కుకుని ఈ పూట ఇక్కడ ఇలా తేలాను.
అవధానిగాడు అన్నాడని కాదుగానీ నిజంగా నాది పరాయి ఆడదాని వళ్ళు తగిలితేనే సడలిపోయేటంత బలహీనమైన ప్రేమా? కొన్ని పచ్చనోట్లకోసం ముక్కూ మొగం తెలీని పరాయి మగాడికి వళ్లప్పగించే సావిత్రిలాంటి ఆడది.. శారదవంటి అనురాగ దేవతనుంచి ఇంచికూడా నా మనసును మళ్ళించలేదని నా దృఢమైన అభిప్రాయం.
నిజం చెప్పాలంటే నన్ను నేను పరీక్షించుకోవడానికే నేనీ పాడు పందేనికి ఒప్పుకున్నది.  పందెం ప్రకారం నేనొక రోజంతా ఈ సావిత్రి సన్నిధానంలో ఒంటరిగా గడపాలి. 'కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ..భోజ్యేషు మాతా.. శయనేషు రంబా' అనేదో అంటారే! అందులో ఆ కరణం పనికి తప్ప మిగతా వాటన్నింటికీ సావిత్రి తరుఫున నాదీ పూచీ! అనుభవంతో చెబుతున్నా' అని కూసాడా అవధానిగాడు. ఆఫీసుపనిమీద క్యాంపులకెళుతున్నప్పుడు రకరకాల రుచులకు వెంపర్లాడే వెధవీ అవధానని అందరికీ తెలుసు. ఎక్కడో తగిలుంటుందీ సావిత్రిపాప అవధానిగాడి వలకు.
బైట తలుపు తట్టిన చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. గబగబా స్నానం చేసి ఇస్త్రీ బట్టల్లోకి మారింతరువాతగానీ మనసులోని అలజడి కాస్తంత సద్దుమణగలేదు.
వేడి వేడి ఇడ్లీ కారప్పొడి.. కొబ్బరి చట్నీలో నంజుకుని తింటుంటే శారదే గుర్తుకొచ్చింది. శారదా ఇదే టిఫిను తయారు చేసేది పెళ్ళిరోజు ఉదయాన. కాకతాళీయమా? అవధానిగాడు ముందే ఓ పథకం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలా? మా ఫ్యామ్లీ ఫ్రెండు వాడు. నా ఇష్టాఇష్టాలన్నీ ముందే తెలుసు వాడికి. నన్నెట్లాగైనా బుట్టలో దింపాలని పెద్ద ప్రణాళికే రచించాడన్నమాట  దుర్మార్గుడు!
సావిత్రి కలిపిచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి పేపరు చూస్తూ కూర్చోనున్నాను.'భోజనంలోకి ఏమి చెయ్యమంటారు?' అని అడిగింది ఓ అరగంత తరువాత వచ్చి. అదీ అవధానిగాడు చెప్పుండాలే! మా పెళ్ళిరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చే ముఖ్యమైన అతిథుల్లో వాడూ ఒకడాయ! మంచివాడుగా శారద దగ్గర మంచిమార్కులే కొట్టేశాడు రాస్కెల్. నా అంచనా కరెక్టయితే ఇంకో గంటలో చిలకాకుపచ్చరంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో ఈ సావిత్రీదేవి ప్రత్యక్షమవడం ఖాయం. పెళ్ళిరోజు శారద కంపల్సరీగా కట్టుకునే శారీ అది. మెదలకుండా కూర్చున్న నన్ను చూసి 'మొహమాట పడుతున్నట్లున్నారు. అవధానిగారంటే ముందునుంచీ తెలుసు.మొదటిసారి వచ్చారు మీరు. చెబితేనే గదా నాకు ఏమైనా తెలిసేది మీ అభిరుచులు?' అంది సావిత్రి.
పెళ్ళిరోజు విందులో  శారద తప్పకుండా చేసే వంటకం పొట్టు తీయకుండా నేతిలో వేయించే మినప్పప్పు గారెలు. అల్లం చట్నీలో వాటిని అద్దుకుని తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో సంచరిస్తున్నట్లండేది. ఇల్లు చూస్తే ఈ తీరుగా ఉంది! ఈ ఇష్టాలన్నీబైటపెట్టి ఆమెను రొష్టు పెట్టడం భావ్యం కాదనిపించింది. 'ఏదో ఒకటి చేసేయండి! కడుపులోకూడా బాగా లేదు' అని బొంకేసాను.
'ఓ గంట ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి. ఒంటిగంటకల్లా భోజనం వడ్డించేస్తాను' అంటూ పడకగది చూపించింది తను వంటగదిలోకి వెళ్ళిపోతూ.
పేరుకే అది పడక గది. పందిరిమంచం మూడొంతులు ఆక్రమించేసింది. పాతకాలం నాటిది లాగుంది. ఆ చెక్క నగిషీ పనితనం ఇప్పుడెక్కడ కనబడుతుంది? బాగా బతికిన కుంటుంబాల్లో తప్ప ఇలాంటి భారీ సామాను కనిపించవు. గదిని అప్పుడే శుభ్రం చేసినట్లుంది.. తేమ తేమగా ఉంది. ఫినైల్ వాసన ప్లస్ ఓ మూల వెలిగించి పెట్టున్న అగరొత్తుల వాసన.. కలగలసి పోయి ఓ విచిత్రమైన వాతావరణం గదంతాపరుచుకుని ఉంది.
పాతకాలంనాటి స్లీపింగు రికార్డుప్లేయరునుంచి మల్లీశ్వరి సినిమా పాట చిన్నగా వినిపిస్తున్నది. 'ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు! దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు!..' భానుమతి గొంతులోనుంచి అలలు అలలుగా సాగివచ్చే ఆ సుస్వర మధుర వాయుతరంగాలు అలసిపోయిన మనసుకి జోలపాటలా హాయి గొలుపుతున్నాయి. శారదకూ ఈ పాటంటే ఎంతో ఇష్టం. పాత చింతకాయపచ్చడని నేను తెగ ఆటపట్టించే వాణ్ణి..పాపం. ఇప్పుడా ఆ పాత మధురిమే ఆపాత మధురంగా ఉంది! కళ్ళు నాకు తెలియకుండానే మూతలు పడిపోయాయి చల్లగా.
'కావుఁ.. కావుఁ.. కావుఁ'
కాకి అరుపులకు మెలుకువ వచ్చేసింది. బైట ఎక్కడో దగ్గర్లోనే ఆ అరుపులు. ఎవరో ఆడమనిషి అదే పనిగా పిలుస్తుందో.. అరుస్తుందో అర్థం కాకుండా ఉంది. టైము చూస్తే ఒంటిగంట దాటి పావుగంట అయింది. కడుపులో పేగులు ఆవురావురుమంటున్నాయు. భోజనానికి పిలుపు రావడంతో ప్రాణం లేచివచ్చినట్లయింది.
ఆలుగడ్డ కూర, దోసకాయ పప్పు, మునక్కాయ సాంబారు, ఆవపెట్టిన దబ్బకాయ చట్నీ, గడ్డపెరుగు.. మధ్య మధ్య నంజుకునేందుకు వూరుమిరపకాయలు.. పొట్టుతీయని మినప్పప్పుతో చేసిన నేతి గారెలు! నా అంచనా తప్పలేదు. అన్నీ నాకిష్టమైన పదార్థాలే! ఏమాట కామాటే. అవధానిగాడి ప్లానింగు మొదట్నుంచీ అద్భుతమే! సావిత్రి చేతివంట శారద చేతివంటకు ఏమాత్రం తీసిపోదు. కష్టం కలిగించిందల్లా వడ్డించేటప్పుడు ఆమె కట్టుకున్న ముతక చీరే! వయసు మళ్ళిన ఆడవాళ్లు కట్టుకునే మడిబట్టలాగా  ఉందా కట్టుకునే తీరు కూడా! నుదుటన బొట్టు దిద్దుకునేటంత తీరికకూడా లేనంతగా ఉందా ఇంటిపని!
అలవాటుకన్నా ఎక్కువగా లాగించేయడం వల్లనేమో భుక్తాయాసంగా ఉంది. ఎప్పుడు కట్టించి పెట్టుంచిందో.. మిఠాయికిళ్ళీ చేతికందించి 'కాస్సేపలా నడుం వాల్చండి. వంటిల్లు సర్దుకుని వచ్చేస్తే ఇంకీ పూటకు ఇంటిపని ఐపోయినట్లే' అని వెళ్ళిపోయింది సావిత్రి.
మంచమెక్కీ ఎక్కగానే కళ్ళు మూతలు పడిపోయాయి.
ఎక్కడో పిడుగు పడిన చప్పుడు.గభాలున మెలుకువ వచ్చేసింది. గదంతా మసక చీకటి. ఒక మూల బీరువాముందు నిలబడి ఉంది సావిత్రి అటు తిరిగి. పైన వంటిమీద అడ్డుగా తువ్వాలు. కింద లోపలి లంగా. బీరువాలో దేనికోసమో వెదుకుతున్నట్లుంది. నేను మంచం దిగిన అలికిడికి ఇటు తిరిగింది. ఆ కంగారులో తుండు కిందికి జారిన మాట వాస్తవం. నా చూపుల్ని మరల్చుకోవడం చాలా కష్టమైంది.
'సారీ! డిస్టర్బ్ చేసినట్లున్నాను. నా బట్టలు బీరువాలో ఉండిపోయాయి.' అంటూ చేతికందిన చీరె తీసుకుని బైటికి వెళ్ళిపోయింది సావిత్రి. మూడు నాలుగు నిమిషాల వరకూ నా గుండె చప్పుళ్ళు నాకే వినిపించాయి. మనసుని మళ్ళించుకోవడానికి చూసిన పేపర్నే మళ్ళా మళ్ళా చూస్తూ గదిలోనే ఉండిపోయాను.
అరగంట తరువాత ఆమె తలుపు నెట్టుకుని గదిలోకి వచ్చింది. మల్లెపూల వాసన గుప్పుమంది. చ్డేతిలో టీ కప్పు. గంటకిందట చూసిన సావిత్రేనా ఈమె! చిలకాకుపచ్చరంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో గంధర్వలోకంనుంచీ దొగొచ్చిన  అప్సరసలాగుంది! నుదుటిమీది తిలకం ఆమె సొందర్యాన్ని రెట్టింపు చేస్తోంది. వదులుగా అల్లుకునీ అల్లుకోనట్లు వదిలేసిన ఆ వాలుజడలో తురిమిన మల్లెల మత్తువాసనలే ఇందాకట్నుంచీ నా మతిని పోగొడుతున్నవి. అవధానిగాడి ప్రణాళిక అర్థమవుతూనే ఉంది. అప్పుడైతే ఏదో రెట్టించాడు కానీ.. వాస్తవానికి విషయవాసనాలౌల్యంనుంచీ బైట పడటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోంది.
అపార్థం చేసుకున్నట్లుంది సావిత్రి 'మీకు నచ్చినట్లు లేదు' అంది అదో రకంగా. 'లేదు. చాలా బాగుంది ఈ శారీ మీ వంటిమీద. చాలా బాగున్నారు మీరు. ఎప్పుడూ ఇలాగే చలాకీగా ఉండొచ్చుగా!' అన్నాను తడబడుతూ. ఆ ఉద్వేగంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే అంతుబట్టడం లేదు.' థేక్సండీ! మీ ఫ్రెండు అవధానిగారిలాగా కాదు మీరు.  తగని మొహమాటం. ఇదంతా ఆయన ఐడియానే. నిజానికి నాకూ ఇదంతా ఏదోలా ఉంది' అంది. ఆమె మాటల్లో ఎక్కడో ఓ చిన్న గిల్టీనెస్!
'నేను అనుకుంటున్నంత ‘ఇది’కాదేమో ఈమె!'అనిపించింది.
'బలవంతంగా ఒప్పించాడా మా వాడు?' అనడిగాను ఆమె వాలకం చూసి.
'అలాగని కాదూ! మీ గురించి చెప్పింతరువాత నాకే  ఇలా చేయడంలో పెద్ద తప్పేం లేదనిపించింది. ఆ టాపిక్ వదిలేయండి! బైట ఇప్పుడే వర్షం కాస్త వెలిసింది. కట్ చేయడానికి కేక్ ఉండాలిటకదా మీకు? వానలకు బేకరీలు తొందరగా మూసేస్తారేమో! ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకోరాదూ ..  ఈ వీధి చివర్నే ఉంది మస్తాన్ బేకరీ!' అని టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయిందామె.
రాత్రికి కేక్ కట్ చేయడం.. వెడ్డింగ్ యానివర్సిరీ సెలబ్రేషన్సు అన్నీ చెప్పేసినట్లున్నాడు అవధానిగాడు. ఈమె వ్యవహారం చూస్తే అన్నింటికీ తెగించినట్లే ఉంది.
'డబ్బెంత చెడ్డది! మంచివాళ్ళనుకూడా చెడగొటేస్తుంది కాబోలు! చెడటానికి ఈమెగారు సిద్ధంగా ఉన్నా నేనెంత సిద్ధంగా ఉన్నానో తెలీని అయోమయం. బయలుదేరినప్పుడున్న బింకం ఇప్పుడు లేదు. మరి ఇప్పుడున్న ఈ కాస్త బింకమన్నా రాత్రిదాకా మిగిలుంటుందా? రెండేళ్ళబట్టీ సుఖానికి దూరమైన శరీరం. ఒంటరిగా ఈ సావిత్రిలాంటి అందమైన ఆడది .. అందుకునేటంత దూరంలో!  పకృతికూడా పగబట్టినట్లంది. రెచ్చగొడుతోంది. వర్షం .. మంటబెట్టే చలి వాతావరణం. ఇన్నాళ్ళబట్టీ నేను గొప్పగా ఊహించుకుంటున్న శారదమీది నా ప్రేమకు నిజంగా ఇది పెను పరీక్షే!
నన్ను నేను పరీక్షించుకోవాలనే కదా ఈ పందేనికి వప్పుకుని ఇంతదూరం వచ్చింది? మధ్యలో పారిపోతే ఆ అవధానిగాడింక బతకనిస్తాడా? నా శారదను నేనే అవమానించినట్లవదా? ఏదేమైనా తెల్లారిన తరువాతే తిరుగు ప్రయాణం. గెలిస్తే శారదప్రేమకు విజయం. ఖర్మగాలి ఓడితే నేను నా భ్రమలనుంచి దూరం.
కేకుకోసం బట్టలు మార్చుకుని సావిత్రి చెప్పిన మస్తాన్ బేకరీ వెతుక్కుంటూ బైలుదేరాను. వీధి చివర్న కనబడిందది.
ఇలా కేక్ కావాలంటే పదినిమిషాల్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. 'అప్పుడే రెడీ ఐపోయిందా?!' అని అడిగితే 'పొద్దునే ఆర్డరిచ్చారుగా! ఎంతసేపు సాబ్!' అని సమాధానం. అవధానిగాడు అన్నీ రడీ చేసే ఉంచాడన్న మాట! నా మడిని భగ్నం చేయాలని వాడికెందుకో అంత పట్టుదల!
సగం దారిలో ఉండగానే మళ్ళా వర్షం మొదలయింది. కుండపోతగా కురుస్తోందీ సారి ఆగకుండా! వీధిదీపాలుకూడా లేకపోవడంతో ఇల్లు గుర్తుపట్టడం కష్టంగా ఉంది. దారంతా రొచ్చు.వళ్ళంతా తడిసి ముద్దయిపోయింది ఒక్క నిమిషంలో. కేకు తడిస్తే పనికిరాకుండా పోతుంది. కాస్త తెరిపిచ్చిందాకా ఎక్కడైనా ఆగడం మంచిదనిపించింది. ఎదురుగా కనిపించిన గుడిమండపంలోకి పరిగెత్తాను.
నాకులాగానే ఇంకో ఇద్దరు పిల్లలు గుడిమండపంలో స్థంబాల చాటున మునగదీసుకుని కూర్చోనున్నారు.  చలిగాలికి కాబోలు చిన్నపిల్లాడు వజవజా వణుకుతున్నాడు. పెద్దబ్బాయి వాడిమీద వానజల్లు పడకుండా అడ్డంగా నిలబడున్నాడు. ఏడుస్తున్న తమ్ముణ్ణి వాడు పెద్దరికంగా ఓదారుస్తున్న తీరు చూస్తుంటే 'పాపం' అనిపించింది. ఎవరి పిల్లలో ఏంటో? చీకట్లో వానజల్లులో చిక్కడిపోయినట్లున్నారు.
'ఎక్కడిదాకా వెళ్ళాలి బాబూ?' అనడిగాను పెద్దబ్బాయిని.  సమాధానం లేదు. 'తడిస్తే తడిసారు. ఇంటికెళ్ళి పోవచ్చుగా?ఇంట్లో మీ అమ్మానాన్నావాళ్ళు ఎంత కంగారు పడుతుంటారో కదా!’ అన్నాను మళ్లీ ఉండబట్టలేక.
'అమ్మే మమ్మిల్నిక్కడ దింపి పోయిందంకుల్! మళ్ళా తనొచ్చిందాకా ఎక్కడికీ కదలవద్దంది' అన్నాడు పెద్దబ్బాయి. వాడికి పదేళ్ళు ఉంటాయేమో! 'పొద్దున్నుంచీ ఇక్కడే ఉన్నామంకుల్! చాలా భయమేస్తుంది.'అంటూ ఏడుపు పెద్దది చేసాడు చిన్నపిల్లాడు.
'ఇల్లెక్కడో చెప్పండి! నేనొచ్చి దించి పోతా! ఇంట్లో వాళ్ళెవరూ ఏమీ అనరులే!'అని ధైర్యం చెప్పబోతే 'వద్దులే అంకుల్! మాకిది అలవాటే! ఇంట్లోనుంచి అంకుల్ వెళ్ళిపోయింతరువాత అమ్మే వచ్చి తీసుకుపోతుంది!' అన్నాడు పెద్దబ్బాయి.
ఇదేదో వింతగా ఉందే!ఇంత వానలో పిల్ల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ తల్లి ఇంట్లో చేసే నిర్వాకమేంటి?! పిల్లలు కూడా చూడకుండా ఆ అంకుల్ చేసే వ్యవహారమేంటి?! నాకెందుకో సావిత్రి గుర్తుకొచ్చించి. కొంపదీసి ఆ అంకుల్ని నేనైతే కాదు గదా?!
సెల్ ఫోన్ టార్చి లైట్ పిల్లలమీదకు ఫోకస్ చేసాను.పొద్దున సావిత్రి నట్టింట్లో చూసిన ఫ్యామిలీ ఫొటోలోని పిల్లలాగా అనిపించారు. అనుమాన నివృత్తికోసం అడిగాను 'మీ అమ్మ పేరేంటి బాబూ?' చిన్నబ్బాయి చెప్పాడు ఠక్కుమని 'సావిత్రీ దేవి' నా గుండె ఒక్కసారి ఆగిపోయినట్లయింది. తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఉదయాన నేనా ఇంట్లో ప్రవేశించినప్పుడు వెనకగదిలోనుంచి చిన్నగా వినిపించిన మాటలు ఈ పిల్లలవేనన్నమాట!
నేనొచ్చానని తెలియంగానే ఈ పసివాళ్లను నిద్రమధ్యలోనే లేపి గుడిమండపంలో దింపి వచ్చిందన్న మాట ఆ తల్లి! ఉదయంనుండి ఎడాపెడా కొడుతున్న గాలివానలో ఈ ముక్కుపచ్చలారని పిల్లలు గుడిమండపంలో  కాలక్షేపం చేస్తున్నారా! ఇల్లుండీ.. తల్లుండీ దిక్కులేని వాళ్లకుమల్లే ఇలా ఇక్కడ పడుండటానికి కారణం నేనా?! ఇన్ని చెప్పిన అవధానిగాడు సావిత్రికి ఇద్దరు ఎదిగిన బిడ్డలునారని మాత్రం చెప్పలేదు. పిల్లలుంటే నేనీ పందేనికి ఒప్పుకోనని వాడికి తెలుసు. నా సంగతి సరే.. మరి సావిత్రి ఎందుకు తలొగ్గినట్లు?!
అమెనే అడిగి తేల్చుకోవాల్సిన  విషయం. పిల్లలిద్దర్నీ బలవంతంగా లేపి చెరో చెయ్యి పట్టుకుని సావిత్రి ఇంటిముందుకొచ్చి తలుపు దబాదబా బాదాను. అప్పటికి వాన తెరిపిచ్చింది కొద్దిగా.
నిదానంగా తలుపు తెరిచి తొంగిచూసిన సావిత్రి నాకు ఒక వైపున్న బేకరీ కేకు, రెండో వైపున్న పిల్లలిద్దర్నీ చూసి అవాక్కయింది. పిల్లలిద్దరూ తల్లివైపు భయభయంగా చూస్తూ నిలబడి ఉంటే  నేనే చొరవగా వాళ్ళతో సహా లోపలికి అడుగు పెట్టాను.

చాలాకాలం తరువాత మళ్ళీ నేను మనసారా నా  వెడ్డింగు యానివర్శిరీ జరుపుకున్నాను సావిత్రి నట్టింట్లో. సరిగ్గా తొమ్మిదీ ఇరవైకి క్యేండిల్సు  సావిత్రి చిన్నకొడుకుతో కల్సి ఊదేస్తే.. పెదకొడుకుతో కల్సి  కేకు కట్ చేసాను తరువాత. పిల్లలిద్దర్తో కల్సి సావిత్రీ నా నోటికి కేకు ముక్క అందిస్తున్నప్పుడు ఆమె కళ్లల్లో తళుక్కుమన్న కన్నీటి తడిని గమనించక పోలేదు.
ఇద్దరు పిల్లలమధ్య పెళ్లిరోజు సంబరంగా  జరుపుకోవాలని శారద కోరిక. పిల్లలిద్దర్నీ చెరోవైపు పడుకోబెట్టుకుని కథలు చెబుతూ  వాళ్ళని నిద్రబుచ్చాలని నా కోరిక. ఈ రోజుతో ఆ రెండూ తీరిపోయాయి సావిత్రీదేవి పుణ్యమా అని.
పిల్లలు గాఢనిద్రలోకి జారుకున్నతరువాత బలవంత పెట్టిన మీదట సావిత్రి చెప్పుకొచ్చింది వాళ్లాయన ప్రసాదశర్మని గురించి. 'ప్రేమించి చేసుకున్న కులాంతర వివాహం మాది. అటువైపునుంచి, ఇటువైపునుంచి  ఆదరణల్లేవు మొదట్నుంచీ. ఆయన ఓ ప్రయివేట్ బస్సు ఆపరేటరు కింద పనిచేసే డ్రైవరు. రెండేళ్ల కిందట బెజవాడనుంచి హైదరాబాదుకు వెళ్తూ బస్సును నకిరేకల్లు దగ్గర చెట్టుకు గుద్దేసారు.  ఆ ప్రమాదంలో పోయిన ముగ్గుర్లో ఆయనా ఒకరు.  తాగి డ్రైవ్ చేస్తున్నట్లు తేలడంవల్ల నష్టపరిహారం ఏమీ రాదన్నారు. అవధానిగారి మధ్యవర్తిత్వం వల్ల చివరికో లక్ష ముట్టింది.అప్పట్నుంచీ ఈయనే ఈ ఇంటికి మగదిక్కు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. తను ఇక్కడున్నంత సేపూ పిల్లలు కంటబడకూడదని షరతు పెట్టారు. ఇవాళ  జరిగిందంతా ఆయన డైరెక్షన్లోనే.  ఆయన చెప్పారనే  ఇలా ఒప్ప్పుకోవాల్సొచ్చింది. అదీగాక  మా వారి తప్పిందంవల్లే మీరు మీ శ్రీమతిగారిని పోగొట్టుకుంటిరి…' కన్నీరు మున్నీరయిపోయింది సావిత్రి.
నాకు శారద ఎంతో సావిత్రికి ప్రసాద శర్మ అంత. ఇద్దరూ పోయింది ఒకే రోజు. ఒకే సందర్భంలో. శారదమీది ప్రేమను  పరీక్షకు పెట్టి తప్పు చేయబోయాను నేను. శర్మమీది ప్రేమతో చేయని తప్పుకు పరిహారం చెల్లించబోయింది సావిత్రి!
ఆడదాని దుస్థితిని అవకాశంగా మలుచుకునే  అవధానిలాంటి వాళ్లు.. ఆ మాటకొస్తే నాలాంటి చపలచిత్తులూ ఉన్నంత కాలం   ఇలాంటి చిత్రమైన కథలకు కొదవుండదేమో!
సావిత్రి చేతిలో ఓ పదివేలు పెట్టి 'ఇది మీ అవధానిగారి దగ్గర్నుంచీ నేను గెలుచుకున్న పందెం సొమ్ము. నీతులు చెప్పే అర్హత నాకెంతవరకుందో తెలీదు. నా దగ్గరా రాసులు పోసుకోనున్న నిధులేమీ లేవుకానీ.. మా పిల్లలకోసమని నేనూ శారదా కలసి చేసిన ఫిక్సుడ్ డిపాజిట్లున్నాయి. పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను. నాకు చెల్లెలు లేని లోటు నువ్వు తీరిస్తే చాలు' అని ఆశీర్వదించి తెల్లారి లేచి వచ్చేసాను.
'మంచి పని చేసారు!' అని శారద మెచ్చుకున్నట్లు కల వచ్చిందా రాత్రి.
-కర్లపాలెం హనుమంతరావు
(రచన- డిసెంబరు 2015 సంచిక కథాపీఠంలో ప్రచురితం)
యూ ట్యూబ్ ఆడియో లింక్ 👇














మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...