Monday, January 29, 2018

బాపూజీ.. నీ చల్లని నవ్వే మా కివ్వు! - ఆంధ్రప్రభ వ్యాసంమహాత్మా గాంధీ నిర్యాణంపై ఒక వ్యాసాన్ని రాయమని నన్నడిగినప్పుడు నాకుగా నేను వేసుకున్న ప్రశ్న ఇది. రాయడానికి కూర్చున్న ప్పుడు దానికి న్యాయం చేయగలనా అనిపించింది. నేనొక రేడియో వ్యాఖ్యాతని. గుండెలు పగిలిపోయిన ఆఖరు క్షణాల్నీ, బాపూజీ అంతిమ యాత్రనీ ఏమని వర్ణించాలి? ఏ విధంగా నా కలం కదులుతుంది? నాకు మాత్రం ఆ రాత్రి సుదీర్ఘంగా అనిపించింది. కాళరాత్రిని తలపించింది. బాధ, విషాదం పొంగిపొర్లుకొచ్చాయి. మాటలలో వర్ణించలేని భావన మెదులాడింది. కాలం అన్నింటికీ మందు. క్రమేపీ బాధ తగ్గుముఖం పడుతుంది. కొన్ని దృశ్యాలు నా మెదడులో నిక్షిప్తమైపోయాయి. ఆ దృశ్యాల గురించే నేనిప్పుడు రాయబోయేది.

ఆరోజు ఉదయం 6గంటలు. మహాత్ముని పార్థివ దేహాన్ని ఉంచిన బిర్లా హౌస్‌కు వెళ్ళాను. బాపూజీ అంతిమ సంస్కారం నిర్వహించే రోజది. నేను వెళ్ళేసరికే పెద్ద సంఖ్యలో ప్రజలు బరువెక్కిన గుండెలతో వరుసలో నిలబడి ఉన్నారు. గత స్మృతులను నెమరువేసుకుంటూ కనిపిం చారు. నన్ను
ఒక ప్రత్యేక ద్వారం ద్వారా గాంధీ మృతదేహమున్న చోటకు తీసుకెళ్ళారు. విశాలమైన ఆయన ఛాతిని నిర్దయగా గాయపరిచిన తూటాల గుర్తులు కనిపించాయి. అవి ద్వేషానికీ, పిచ్చి పనికీ పరాకాష్టగా కనిపించాయి. బాపూజీ ముఖంలోకి చూశా. ఎంత అద్భుతమైన ముఖమది. మృత్యు పరిష్వంగంలో చేరిపోయింది. ఆయన అభిమానుల వదనాలు దీనంగా మారిపోయాయి. ఎగురుతున్న గులాబీ రేకుల మధ్యలో నుంచి కనిపిస్తున్న మహాత్ముని వదనం నా నోటి నుంచి ధారాళంగా పదాల వెల్లువను సృష్టించింది. బాల్యంలో నేను చదువుకున్న ఏసు క్రీస్తు బోధనలలో ఒక వాక్యం గుర్తుకొచ్చింది. ఓ తండ్రీ వారిని మన్నించు. వారేం చేస్తున్నారో వారికే తెలియదు శాశ్వత నిద్రలో ఉన్న మహాత్ముని పెదవులు కూడా అలాగే అన్నట్లు నాకనిపించింది. బాపూజీ మన్నించడానికి పెట్టింది పేరు. ఇంతవరకూ నేనలాంటి మనీషిని చూడలేదు. అదే సమయంలో నా భుజంపై ఓ చేయి పడింది. వెనక్కి చూస్తే ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ. ఆయన కళ్ళలోనూ అదే రకమైన అనుభూతి కనిపించింది. అది కూడా నేను మరిచిపోలేను.

గులాబి రేకులతో అంతిమ వీడ్కోలు
మహాత్ముని అంత్యక్రియల ఊరేగింపులో రేడియో వాహనం మెల్లిగా నడుస్తోంది. క్వీన్స్‌వే, కింగ్స్‌వే, హర్డింగే అవెన్యూ, బీటా రోడ్‌..మీదుగా రాజ్‌ఘాట్‌కు వాహనం చేరాలి. మా వెనుకే మహాత్ముని పార్థివదేహాన్ని ఉంచిన ట్రాలీ కదులుతోంది. ప్రజలంతా చూసేలా దేహాన్ని ఉంచారు. పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, దేవదాస్‌ గాంధీ, సర్దార్‌ బల్‌దేవ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ నిలబడి ఉన్నారు. లక్షలాదిమంది గాంధీ మహాత్మునికి ఇష్టమైన శ్లోకాలను చదువుతున్నారు. ఆ సమయంలో చెమర్చని కన్ను నాకు కనిపించలేదు. మరణానికి రెండు నెలల ముందు బహిరంగ సభలో ప్రసంగించిన జిల్లా జైలు వద్దకు యాత్ర చేరింది. జైలు శిక్ష అనుభవిస్తున్న వారినుద్దేశించి బాపూజీ అప్పుడు ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని నేనూ విన్నాను. ప్రేమాభిమానాలను వర్ణిస్తూ ఆయన ప్రసంగం సాగింది. సరిగ్గా అదే రోడ్డు మీదుగా యాత్ర సాగడం యాదృచ్ఛికం. గాంధీ భౌతిక కాయంపై స్వర్గం నుంచి పూల రేకులను వర్షించినట్లుగా ఉంది. యాత్రలో పాల్గొన్న ప్రజలు గుప్పెట్లో గులాబీలను తీసుకుని ఆకాశంలోకి విసురుతున్నారు. గాంధీజీ అమర్‌ రహే అంటూ నినదిం చారు. రోడ్డుకిరు వైపులా ఉన్న భవనా లపై నుంచి పూలను జల్లుతూ గాంధీకి జై అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. యాత్ర అక్కడ కొద్ది నిముషాలపాటు నిలిచింది. గాంధీజీని కడసారి చూసుకునేందుకు ప్రజలు ముందుకు తోసుకొచ్చారు. మా రేడియో వ్యాన్‌ను కూడా లాగేశారు. దుఖం తాండవిస్తున్న వదనాలు గాంధీజి మరణాన్ని జీర్ణించుకోలే మంటున్నాయి. ఓ మహిళ.. ఇది నిజం కాదు.. రేపు ప్రార్థనల సమయానికి బాపూజీ తిరిగొస్తారంటకూ భోరుమంది. ఎక్కడో తప్పు జరిగిందని అంటోంది. ఆమెలో ఆమె మాట్లాడుకుంటోందని నాకర్థమైంది. తనను తాను ఆమె అలా సంబాళించుకుంటోంది. ఆమె పక్కనే ఓ భిక్షువున్నాడు. అతడి కళ్ళు ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయాయి. ఆ పక్కనే చక్కని దుస్తులు ధరించి ఉన్న మహిళ పరిస్థితి సైతం అదే. ధనిక, పేద లేకుండా దేశం యావత్తూ కుమిలిపోయిన క్షణాలవి. ఒక మరణం పేద, ధనికులను ఒకచోట చేర్చింది.. ఎంత ఆశ్చర్యం. గాంధీజీ భారత దేశమంతటా నిండిపోయారు. ఆయన సాధారణ తత్వం ప్రపంచంలోని అన్ని హృదయాలనూ గెలుచు కుంది. మా వ్యాను ముందుకు కదులుతుంటే ఓ చిన్నారి తన తల్లిని అడిగిన ప్రశ్న నా చెవిన పడింది. అమ్మా! గాంధీజి నిజంగా, శాశ్వతంగా వెళ్ళిపోయారా! అని. అసలు తిరిగి రారా అని కూడా ప్రశ్నించింది. తల్లి చెప్పిన సమాధానం గుర్రపు డెక్కల చప్పుడులో కలిసిపోయింది. బాపూజీ అంత్యక్రియలకు హాజరైన గుర్రాలు సైతం విచారంగా నడుస్తున్నట్లే అనిపించింది.
నిమజ్జన యాత్రలోనూ కన్నీటి ధారలు

యాత్ర రాజ్‌ ఘాట్‌కు చేరడానికి 5 నిముషాల ముందే నేను అక్కడికి చేరుకున్నాను. మా రెండో వాహనం
అంత్యక్రియల వేదికకు 30 అడుగుల దూరంలో నిలిచి ఉంది. అక్కడికి చేరిన ప్రజలంతా నాకు కనిపించేందుకు నేను వాహనంపైకి ఎక్కి నిలబడ్డాను. ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ జరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాట్లు నా దృష్టిని ఆకర్షించాయి. రక్షణ సిబ్బంది సాసర్‌ ఆకారంలో భుజంభుజం కలిసి రక్షణగా నిలుచున్న తరుణంలో చందనపు చెక్కలతో రూపొందించిన చితినుంచి తొలి జ్వాల నింగికెగిసిన తరుణంలోనే సూర్యభగవానుడు అస్తమించడం ఆరంభమైంది. అదే సమయంలో ప్రజల నుంచి పెద్ద నిట్టూర్పు కూడా ఆకాశానికెగిసింది. రాజ్‌ఘాట్‌పై ఒక తుపాను విరుచుకుపడిన తీరును తలపించింది. అడ్డుగా కట్టిన బ్యారికేడ్లను, తాళ్ళనూ, తీగలను తెంచుకుంటూ ఆడా, మగ తేడా లేకుండా చితిమంటలను చూసేందుకు బాధాతప్త హృదయాలతో ముందుకు తోసుకొచ్చారు. చందనపు చితి చుట్టూ చేరారు. వారి శోకంతో పాటూ చితిమంటలు ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి. చందనపు పరిమళం ఆ ప్రాంతాన్ని ఆవరించింది. గవర్నర్లు, రాయబారులు, క్యాబినెట్‌ మంత్రులు.. యమునా నదీ జలాలతో పవిత్రమైన, హరితహారంలా ఉన్న ప్రాంతంలో ఈ దృశ్యాలకు సాక్ష్యాలుగా నిలిచారు. ఈ సన్నివేశాలను చూసిన నా పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్న ఆకులా మారిపోయింది. మహాత్ముని పార్థివ దేహాన్ని ఆబగా కబళిస్తున్న చితిమంటల ఎత్తు మరింత పెరుగుతుండగా.. ఒక పక్క నుంచి చీకటి చుట్టుముట్టేసింది. లక్షలాదిమంది ఇళ్ళకు తిరుగు ముఖం పట్టినప్పుడు వారి కాలి నుంచి లేచిన ధూళి ఆ ప్రాంతాన్ని ఆవరించింది. జాతి పిత లేకుండానే ఇక తమ ప్రయాణం కొనసాగించవలసి ఉంటుందని వారికి అప్పటికి అర్థమైంది. ఆయన ప్రేమ లేదనీ అవగతమైంది. చితిమంటల్లో వారు కడసారి బాపూజీ చిరునవ్వుల్ని చూసుకున్నారు. సోదరీ, సోదరుల్లారా అంటూ ఆయన చేసే సంబోధనలను ఆ చిటపటల్లో విన్నారు. తుచ్ఛమైన ఈ ప్రపంచాన్ని వీడిన బాపూజీకి గుడ్‌బై చెప్పారు. అసత్యం, హింసలతో కూడిన ప్రపంచంలో జన్మించిన గాంధీ సత్యం, అహింసలతో కూడిన తనదైన ప్రపంచాన్ని నిర్మించారు. రాజ్‌ఘాట్‌నుంచి హృదయభారంతో వెనుదిరుగుతున్న ప్రజల శిరస్సులపైనుంచి చితిమంటలను గమనించిన నాకు గొంతులో ఏదో అడ్డం పడినట్టనిపించింది. మింగడానికి కష్టమైంది. ఆ రోజంతా అలాగే ఉంది. అలా అడ్డం పడిందేమిటో? లక్షలాదిమంది బరువెక్కిన గుండెలతో తిరుగుముఖం పడుతుండగా, వెండిరంగులో నక్షత్రాలు మెరుస్తూ, ప్రేమ, సత్యం, అహింసలకు ప్రతిరూపమైన బాపూజీకి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపించింది.
వ్యాఖ్యానం పూర్తయిన తరవాత నేను కొద్దిగంటల పాటు వ్యాన్‌పైనే కూర్చుండిపోయాను. ప్రజలంతా వెళ్ళేవరకూ అలాగే ఉండిపోయాను. మూర్ఛిల్లిన ఓ మహిళను వ్యానుపైకి చేర్చారు. ఒక బాలుడు, బాలికను కూడా అక్కడికి చేర్చారు.
ఆ జనప్రవాహంలో ఒక చేయి వ్యాను పైభాగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపించింది. చూస్తే.. అది ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ. వెంటనే చేయి అందించి, ఆయనను పైకి లాగాను. గవర్నర్‌ జనరల్‌ని చూశారా అని ఆయన నన్ను ప్రశ్నించారు. ఆయన అరగంట ముందే ఇక్కడినుంచి వెళ్ళిపోయారని బదులిచ్చాను. సర్దార్‌ పటేల్‌??? ఆయన కూడా కొద్ది నిముషాల ముందు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆ ప్రజా సమూహంలో కలిసి వచ్చిన స్నేహితులై వేరైపోయారు. ప్రధానిని చూసిన ప్రజలు వ్యాను చుట్టూ చేరారు. ఆయనేమైనా మాట్లాడతారేమోనని చూశారు. ఆ సమయంలో నా మదిలో ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. ఒక అత్యద్భుతమైన వ్యక్తి దగ్గరగా ఉన్నానన్నదే ఆ యోచన. ఒక పక్కన జాతిపిత దేహం అగ్నికి ఆహుతవుతుంటే.. భారత మాత పుత్రుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, స్వాతంత్య్రమనే దీపశిఖను సజీవంగా ఉంచడానికి జాతికి తనను తాను అంకితం చేసుకున్నారు. మరుసటి రోజు 2 గంటలకు నేను ఇల్లు చేరాను. తిరిగి రాజ్‌ఘాట్‌కు వెళ్ళేసరికి అక్కడ చితినుంచి పొగలొస్తున్నాయి. ప్రజలు అదృశ్యమయ్యారు. దుమ్మూ, ధూళీ సర్దుకున్నాయి. ఒక గార్డును అక్కడుంచారు. ఒక్కసారి రాజ్‌ఘాట్‌వైపు చూశాను. మొత్తం దృశ్యాలను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ చీకటిలో తెల్లటి ఖాదీ వస్త్రాన్ని ధరించిన మచ్చలేని మహనీయుడు నా మస్తిష్కంలో ఆవిష్కృతమయ్యాడు. దృఢనిశ్చయంతో కూడిన దృక్కులతో ఆయన కనిపించారు. ప్రజల శిరసుల పైనుంచి ఆయన చూస్తున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీసమయం తెల్లవారు జామున నాలుగున్నర గంటలు..నేను గ్రీన్‌ అస్తి స్పెషల్‌ కంపార్ట్‌ మెంట్‌ ఎదురుగా నిలుచున్నాను.ఆ బోగీలో గాంధీజీ అస్తికలు ఉంచారు. అందులో అన్నీ మూడవ తరగతి బోగీలే. గాంధీజీ ఎప్పుడూ మూడవ తరగతిలోనే ప్రయాణం చేసేవారు. మూడవ బోగీ లో ఏం మంట అది ఎర్రగా వెలిగిపోతోంది. బోగీలో దీర్ఘచతురాస్రాకారంలో ఒక టేబిల్‌ ఉంది. దానిపై శవపేటిక లో అస్తికల కలశం ఉంది.ఆ పేటికపై చేతితో నేసిన త్రివర్ణ పతాకం పరిచారు.ఆకుపచ్చ ఆకులతో నేసిన ఒక చాప ఉంది. దానిపై తెల్లని పూలు,కాషాయి రంగు ఆకులుఉన్నాయి. పూర్తిగా త్రివర్ణ పతాకంతో కప్పివేసారు.మధ్య భాగంపై ఫ్లడ్‌ లైట్ల కాంతి విరజిమ్మేట్టు ఏర్పాటు చేశారు.
బయట ఫ్లాట్‌ ఫారంపై వేలాది మంది ప్రజలు గాంధీజీ అస్తికల కలశాన్ని దర్శించి నివాళులర్పించేందుకు వేచి ఉన్నారు.ఉదయం ఆరున్నర గంటలకు గార్డు ఈలవేశాడు. గ్రీన్‌ బోగీలు కొత్తఢిల్లిd స్టేషన్‌ బయటకు వచ్చాయి. ఆ రైలు కదలుతుండగా, ప్రజలు కట్టలు తెగే కన్నీరు ధారగా ప్రవహిస్తుండగా, విలపిస్తూ జాతిపితకు కడసారి వీడ్కోలు చెప్పారు. గాంధీజీ అస్తికల కలశంపై గులాబీ రేకులనూ,పూలదండలను మంత్రాలు చదువుతూ విసిరారు. శిరసావహించి భక్తిప్రపత్తులతో ప్రణామం చేశారు. తమ తలలు ఎంత గర్వంగా పైకి ఎత్తాలో నేర్పిన జాతిపితకు శిరసు వంచి ప్రమాణం చేశారు.
మా బోగీ మధ్య బోగీ పక్కన ఉంది.ఆ బోగీలోనే గాంధీజీ అస్తికల కలశం ఉంది. కిటికీల్లోంచి బయటకు చూస్తే, పొలాలన్నీ బంగారు తివాచీల్లా కనిపించాయి. నేలపై పరిచిన బంగారు దుప్పట్ల మాదిరిగా కనిపించింది. మామూలుగా అయితే, ఆ దృశ్యం హృదయాలను పులకింపజేసేదే. పొలాల్లో రైతులకూ,వ్యవసాయ కూలీలకు బోధిస్తూ ఒక వ్యక్తి పెద్ద అడుగులేస్తూ వెళ్తున్న భావన కలిగింది.గ్రామీణులంతా రైలు కట్టకుఇరువైపులా నిలబడి ఉబికివస్తున్న కన్నీరును తుడుచుకుంటూ గాంధీజీకి నివాళులర్పించారు. స్పెషల్‌ రైలు అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఘజియాబాద్‌,ఖుర్జా,ఆలీగఢ్‌, హథ్రాస్‌,తుండ్లా, ఫిరోజాబాద్‌, ఎటావా, ఫాఫుండ్‌,కాన్పూర్‌, ఫతేపూర్‌, రసూల్‌ బాద్‌ స్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు.తుండ్లాలో మా బోగీ వైద్యశాలగామారిపోయింది.అనేక మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. విషాదం నిండి ఉంది. సంపూర్ణమైన ఆశ ఉంది.గీతా శ్లోకాల పఠనం నిరంతరం సాగుతూనే ఉంది.అది చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే, ఆయనకు మరణం లేదనిపించింది.ఎవరో ఇలా అంటున్నట్టు అనిపించింది.
ఎవరనగలరు ఒక వ్యక్తిని హత్య చేశారని
ఎవరు భావించగలరు నేను వధించబడ్డానని
జీవితాన్ని ఎవరూ అంతం చేయలేరు. జీవితం అంతంకాదు.
ఆత్మకు పుట్టుక లేదు. ఆత్మకు చావు లేదు.
ి్లటౌు ్హ్‌ిలిబిె ప్ఘ ్హఁి్లడ;
మీకు నారింజ ఇష్టమేనా? ఇలా ఎవరో అడిగేసరికి నాకు గుర్తొచ్చింది నేనేమీ తినలేదు కదా అని.నా బోగీ కిటికీకి దగ్గరగా వచ్చిన వ్యక్తివైపు చూశాను.మళ్ళీ బోగీలో చూశాను.అక్కడ అంత గాంధీజీని గౌరవించేవారు,భక్తితో ఆరాధించేవారూ ఉన్నారు.
విఎ సుదర్శన్‌ అనే మా మిత్రుడు ముప్పయిరెండేళ్ళ వయస్కుడు. గాంధీజీకి ప్రియ శిష్యుడు. మెెం ఇప్పుడే ఫతేపూర్‌ దాటామని నాకు గుర్తుకు వచ్చింది. పురుషులు, బాలురు రైలుతో పోటీ పడి ఒక కిలోమీటరు దూరం పరిగెత్తారు. గాంధీజీ అస్తికల కలశంపై ఉంచేందుకు తెచ్చిన పువ్వులు వారిచేతుల్లో కనిపించాయి.రైలు వేగాన్ని అందుకోవడంతో వారంతా వెనక్కి వెళ్ళిపోయారు. మహాత్మాగాంధీ వర్ధిల్లాలి అనే వారి నినాదాలు మాత్రం చెవుల్లో చాలా సేపు గింగురు మన్నాయి. మా మిత్రుడు ఎర్రని గులాబీని చూస్తూ ఆలోచనలోపడ్డాడు.ఆతడి కళ్ళంట నీళ్ళు బొటబొటా రాలాయి.ఇలాంటి గులాబీనే బుల్లెట్‌ గాయాలపై ఉంచాను. అని గొణుక్కున్నా డు.మా మధ్య సంభాషణ ఏమీ జరగలేదు. బయట ఆకాశం ఎర్రగా కనిపించింది. స్వర్ణకాంతులీనుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ గులాబీని చేతిలోకి తీసుకున్నాను.అది గతంలో ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది. సువాసనలను వెదజల్లింది. అక్కడ ఒక సైనికుడు సైనిక దుస్తుల్లో ఉన్నాడు .రైలు ఆ స్టేషన్‌ దాటుతుంటే వంగి నమస్కరించాడు.
దారి పొడవునా లక్ష లాది మంది గాంధీజీకి కన్నీటి ధారలతో నివాళులర్పించారు. మహాత్మా గాంధీకీ జై అనే నినాదాలు మార్మోగాయి.లక్షలాది మంది ప్రార్థనలు చేశారు. అన్ని రంగాలకు చెందిన వారూ వచ్చారు.వారందరిలో గాంధీజీపై పరిపూర్ణమైన భక్తి ఉంది. వారి నోటంట మహాత్మాగాంధీ అమర్‌ రహే అనే నినాదాలు వినిపించాయి. త్రివేణి సంగమం వద్ద అంతిమ యాత్ర ముగిసింది. మహాత్మాగాంధీ పవిత్ర అవశేషాలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు.పవిత్రమైన,యోగి పుంగవుడి అస్తికలను అంతే పవిత్రమైన త్రివేణి సంగమంలో రామదాస్‌ గాంధీ నిమజ్జనం చేశారు. నేను ఒక పడవపై నిలబడి ఉన్నాను. అస్తికల నిమజ్జనం జరిగిన ప్రదేశానికి కొద్దిగజాల దూరంలో ఉన్నాను.వేలాది మంది ప్రజలు ఆ దృశ్యాన్ని అతి దగ్గర నుంచి చూసేందుకు ఎంతో ఆత్రుతను ప్రదర్శించారు. పీపాల కొద్దీ పాలు పోశారు. ఆ పాలతో ఆ నదీ జలాలు శ్వేత జలాలుగా కనిపించాయి.అది ఒక ప్రస్థానపు ముగింపు.ఆయన అనంతలోకాల్లోకి చేరిపోయాడు.ఆ దృశ్యాన్ని వీక్షించిన వారంతా నాలాగే అనుకుని ఉంటారు.మనంకూడా అలా గాలిలో కలపాల్సిందేనని. ఓ భగవంతుడా! ఆలయాల్లో అర్చనలు చేయలేదు. నాది గంభీరమైన జీవితం కాదు, అలా అని క్లిష్టమైనదీ కాదు.కాని నేను కృతజ్ఞతలు తెలిపానునదీ దేవత నిరంతరం ప్రవహిస్తూ, దప్పికగొన్నవారికి దాహంతీరుస్తోంది. ప్రయాగ అంతటా చీకటి అలుముకుంది. అప్పుడప్పుడే దీపాలు వెలిగిస్తున్నారు. మేం వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం.త్రివేణి సంగమం వైపు ఒక్కసారి పరికించి చూశాను.ఇప్పుడు దీపాలు మరిన్ని కాంతివంతంగా వెలుగుతున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ నక్షత్రాల్లో బాపూజీ ఉన్నారు.ఆయన జ్ఞాపకాలు ఆ దీపాల మాదిరిగానే మెరుస్తున్నాయి. నిజమే దీపం ప్రకాశమానం అవుతుంది.దాని కాంతి నిశీధిలోకి చొచ్చుకునిపోతుంది.ఈ నాగరికత ఉన్నంతకాలం ప్ర కాశిస్తూనే ఉంటుంది.
అనువాదంః శ్రీ కె వి సుబ్రహ్మణ్యం
(ఆంధ్రప్రభ 30-01-2016 సంపాదకీయ వ్యాసం)

                      

Friday, January 26, 2018

తెలుగు రుచులు-ఆంధ్రప్రభ దినపత్రిక - సరదా గల్పికఅన్నం పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ అన్నకర్త సాక్షాత్ విష్ణ్వావతారమే అవాలి గదాభగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో(15-14)సైతం  ఆహారవ్యవహారాల్లో భగవంతుడి  ప్రమేయం (అహం వైశ్వానరో భూత్వా..) తప్పదన్నట్లు  ధృవపడుతుంది. అర్జునుడు యుద్ధరంగంమధ్య విషాదయోగంలో పడి కొట్టుమిట్టాడే వేళా కర్తవ్యబోధ చేసేందుకు ఉద్యుక్తుడైన    భగవంతుడు  తిండిగోల మర్చిపోలేదు! వాల్మీకులవారి రామాయణంలోకూడా రావణాసురుడు అంతలావు క్రోధంలోసైతం 'ఇచ్చిన గడువులోగా శయ్యాస్వీకారం చెయ్యకపోతే  వంటవాళ్లచేత వండించుకొని తింటాన'ని సీతమ్మవారిని బెదిరించాడు! భోజనానికి ముందో శ్లోకం (బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః).. భోజనాల మధ్యలో మరో శ్లోకం (త్వదీయం వస్తు గోవింద).. భోజనానంతరం మరో శ్లోకం(అగస్త్యం  వైనతేయం) మన  ముందు తరాలకి!మన తాతలకి  భజనతో సమానమైన భోజనవ్యవహారం   ఓ  భోగకళగా మారింది మన హయాంలో!
భూగోళంలో  ఒక్కపాలు నేల. మనం భూచరాలుగానే బతుకుతున్నా  తిండికోసం  నీళ్లఅడుగునా,  ఆకాశంలోకూడా  దేవులాడటం మన తిండియావకు నిదర్శనం.  చంద్రమండలంమీదకు వెళ్ళినా   బంగాళాదుంపల్ని ఎలా పండించాలనే కదా మనం ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నదీ!
ఆకలి లేకుంటే జీవికి ఆరాటమే లేదు. ఆ మాటా నిజమేననుకోండి! ఆరాటం ఉండి.. అది తీరేందుకు  చేసేపోరాటమే  జీవితం. అందులోనే ఉంది జీవితసారమంతా!  పాతరాతియుగంనాటి  మనిషికూడా  రాయిని ఆయుధంగా నూరుకున్నది ఆహారం  సంపాదించుకోడంకోసమే!   నిప్పురవ్వను రాజేయడం నేర్చుకున్నది వేటమాసం.. కాయలు, దుంపలు గట్రా కమ్మంగా వండుకు తినేందుటందుకే! వంట ఒక కళగా ఆటవికయుగంనాటినుంచే మనిషివెంట మహాప్రస్థానం చేస్తూ వస్తోందంటారా ఎవరైనా!
సమాజస్వభావం సమ్యగ్దర్శనభాగ్యానికి నోచుకోవాలంటే, ఆచార వ్యవహారాదులతోపాటు ఆహారపద్ధతులూ తెలిసి ఉండాలి!’ అని మల్లంపల్లివారు అభిప్రాయపడ్డారు!   సామాజిక బాధ్యత గుర్తెరిగారు కాబట్టే మన ప్రాచీనకవులు సందర్భశుద్ధి ఉన్నా, లేకున్నా  సందుచూసుకుని మరీ పసందైన విందు భోజనాలు రకరకాలుగా అందించారు. మన కడుపులు నింపారు.
ఆత్మకు ఇంపైన భోజనం సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. ముంగండ అగ్రహారీకుడు పండితరాయలు తెలుగువిస్తరి  ఘుమఘుమల్ని డిల్లీదాకా విస్తరింపచేసాడు. ఆవఠేవ(ఆవకాయ)నుంచి.. ఇంగువ హంగులదాకా దేన్నీ ఓ పట్టు పట్టిందాకా వదిలిపెట్టని తిండిరంధి వేములవాడ భీమన్నకవిది. బమ్మెరవారి భాగవతంలోని 'బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో' పద్యం గోపబాలకులు లోకపాలకుడుతో  భోజనోత్సవ  పూర్ణోత్సాహాన్ని కళ్లక్కట్టించే కమ్మని నేతిబూరె! భోజనాది లౌకికాలనుకూడా మన కవులు ఎంత అలౌకికంగా ఆరాధించారో!  
వెల్లుల్లి, తిలపిష్ఠం అనడమే దోషంగా  భావించే శుద్ధశాకాహారి కదా శ్రీనాథుడు! అయినా తిరువెంగనాచనే శివభక్తురాలు సిరియాలును తరిగి  నానావిధ పాకాలుగా  వండటం వైనవైనాలుగా వర్ణించాడు మహానుభావుడు! మిరియాలపొడి చల్లినవి, సైంధవలవణం కలిపి చేసినవి, ఆవపెట్టి వండినవి, ఇంగువతో ఘుమఘుమలాడేవి,  చింతపండు.. నిమ్మరసం పిసికి చేసినవి, తాజానేతిలో ముంచి తేల్చినవి, లేతకొత్తిమీర మిళాయింపులతో  పరిమళించేవి, కూరగా వండినా  సౌష్ఠవం ఏ మాత్రం చెడనివి.. శివాలయంలో దొంగలా దూరి దాక్కున్న దుండగీడు గుణనిధి  కంటబడ్డ  భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు ఇవన్నీ! ‘’కాశీఖండంలోని ఈ చిన్నిజాబితా సైతం తిండిపుష్టి  దిట్టంగాగల శ్రీనాథ కవిసార్వభౌముడి పాకశాలనుంచి తయారైన అనుపాకాలే!
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. నిలపరా నీ జాతి నిండు గౌరవము'  అన్నారు కదా మన రాయప్రోలు సుబ్బారావుగారు కూడా! ఏ జాతికైనా దాని తిండి తిప్పల్ని  మించిన నిండు  గౌరవం మరేముంటుందిగనక! తెలుగువాడి ఆత్మగౌరవమైతే మరీ ముఖ్యంగా ఏ ఆవకాయ బద్దతోనో.. గోంగూర తొక్కుతోనో  ముడిపడి ఉంటుంది. వేటూరివారికి మాగాయవూరుని 'మహత్తరి' అని పొగిడితేగానీ తనివి తీరలేదు మరి! జిహ్వచాపల్యరంగంలో తెలుగునోటికి  పోటీకొచ్చే జాతి భూమ్మీద ఎందెందు గాలించినా మీకు దొరకదు గాక దొరకదు సుమండీ! ఓ మహాపండితుడు హిమాలయాలను చూసి తన్మయత్వంతో  'అన్నపు రాశుల్లా'  ఉన్నాయని నోరెళ్ళ పెట్టేసాడు. బహుశా అతగాడు మన తెలుగువాడే అయివుండనోపు!
కారంతో కారం కలిపి కొత్తరుచి సృష్టించగలడు.తెలుగువాడు. పులుపులో పులుపు కలిపి పులకరింతలు పుట్టించనూ గలడు. ఆరు రుచులతో ఆరొందల అరవైఆరు రుచులు సృష్టించి ' ఆహా! ఏమి రుచి?' అనిపించి నోరూరించగల  మొనగాడు ఇంకెవడు? మన తెలుగువాడే!
'ఆంధ్ర' లోని అంధ పదం 'అన్నానికి పర్యాయ పదంట!(ఆప్టే సంస్కృత నిఘ౦టువు- పు129). జైన, బౌధ్ధ సాహిత్యాలలో తెలుగువాళ్ళు అంథ శబ్దంతోనే వ్యవహృతులు. నైలునుండి కృష్ణదాకా సాగిన ద్రావిడుల మహావ్యాప్తికి  'పెసలు' పద వ్యుత్పత్తి సాక్ష్యం  పలుకుతోంది ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు చెపుతోంది.  చైనాలాంటి తూర్పు దేశాలతో  భారతీయ బౌధ్ధులు సంబంధాలు  పంచదారతో మరింత మధురమయ్యాయని చరిత్రకారుల పరిశీలన. చెరకు తోటల నీడల్లో చేరి  వరిచేలకు పహరా  కాస్తూ ఆంధ్రమహిళలు రఘుమహారాజు జీవితగాథని పాడుకున్నారు.. ఎక్కడో పక్కమహారాష్ట్రంలో ఉన్న   కాళిదాసు రాసిన 'రఘువంశం'లోకూడా! తెలుగులు ఎక్కడ ఉంటే ఘుమఘుమలు అక్కడ ఉంటాయి కాబోలు!
'కూరదినుసుల విజేతే విశ్వవిజేత' అని యూరోపియన్ల మధ్యయుగాల్లో కనిపెట్టిన సత్యం మనం సాగు ఆరంభించిన తొలిదినాల్లోనే పసిగట్టేశాం. మనగడ్డమీద  మిరియాలు, సుగ౦థ ద్రవ్యాలు చవక.  మనదగ్గర కొనుక్కొని వేరే  దేశాలకు అమ్ముకొని వ్యాపార సంస్కృతిని విస్తరించింది మాత్రం యూరోపియన్లే.   కాయగూరలకోసం  బుడతకీచులు  ఓడలనిండా సరుకులతో మన కోస్తాతీరాలవెంట తెగ తిరుగుతుండేవాళ్ళు. మిరియాలకోసమే  కొలంబస్ ఇండియా ప్రస్థానం ప్రారంభించిందంటారు! పచ్చగా, అమాయకంగా కన్పించే పచ్చిమిర్చి ఘాటుని   పాండురంగడిశక్తితో పోల్చేదశకు  పురందరదాసంతటి వైదాంతికులే వెళ్ళారు కదా! ఇహ  మన ఆహార చరిత్రను 'మిరపకాయకు ముందు- తరువాత' గా విభజించిస్తేమాత్రం  తప్పేముంది!
ఒక్క మిరపకాయనే కాదు పన్నెండో శతాబ్ది 'మానసోల్లాస' గ్ర౦థ౦లో మన లడ్డూల ప్రస్తావనా ప్రశస్తంగా   వినిపిస్తుంది. రామాయణ, భారతాలు, ఆయుర్వేద గ్ర౦థాల్లోని మోదకాలు మన లడ్డూలే! తెలుగుశాతవాహన చక్రవర్తి కథలో 'మోదక' శబ్ద౦ సృష్టి౦చిన కలకలం అంతా ఇంతా కాదుగదా! బుడతకీచులతో పెంచుకొన్న  వాణిజ్యబంధాలవల్లే   బొప్పాయినుంచి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంగాళాదుంపలదాకా తెలుగునాలుకలకి    కొత్తరుచులు వంటబట్టాయి.  మిరియాన్ని ఏమరచి మిర్చిని మరిగి ఆ కారాలకి తగ్గట్టుగా  ఉప్పులు, పులుపులు, తీపుల కలగలుపులతో   కొత్తతరహా వంటలకు తెరలేపిన ఘనుడు మన తెలుగువాడేనని మనం సగర్వంగా చెప్పుకోవచ్చూ! పగిలిన  కుండపెంకుమీదైనా సరే కమ్మని అట్టు పోసేయగల దిట్టతనమండీ  మన తెలుగు చేతిది!
'మేలింపు చవి గుల్కు తాలింపు వంకాయ యూర్పులు గొనియాడ నేర్పు గలదే..' అంటూ 'రాజవాహన విజయం' కావ్యంలో కాకుమాని మూర్తికవి నోరూరించాడు! ‘శుకసప్తతి' కావ్యంలో కదిరీపతి  ‘‘ఒఱపు దనరార జేపల యూర్పుగూర యిడిన..'అంటూ చేపలవూర్పు గురించి బులిపించాడు! దమయంతీ స్వయంవరానికని విచ్చేసిన అతిథులకోసం వడ్డించిన  డెబ్భైరకాల వంటకాలనూ విపులంగా వర్ణించాడు.. శిష్యసమేతంగా విచ్చేసిన వ్యాసమహర్షులవారికి  కాశీవిశాలాక్షి చేతులమీదుగా శబ్దరత్నాకరానికైనా అర్థంకాని పలు పదార్థాలు తినిపించాడు శ్రీనాథుడు! శ్రీనాథుడి భోజన రాసిక్యతను గూర్చి బోలెడన్ని చాటువులు! రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యంలో కపటబ్రహ్మచారిగా వచ్చిన పరంధాముడికి పతివ్రతా శిరోమణి సుశీల ఇచ్చిన ఆతిథ్యంలోని  ఖాద్యవిశేషాలతో అయితే ఏకంగా ఓ పరిశోధనా గ్రందమే వెలువరించేసెయ్యవచ్చు. అయ్యలరాజు నారాయణామాత్యుడు తననాటి ప్రజల జీవనస్థితిగతుల వివరాలతో రాసిన హ౦సవి౦శతి- వ్యాపారి విష్ణుదాసుడి విదేశీపర్యటనలో  వె౦టతీ సుకువెళ్ళిన  పూరీలు, కూడుపరిగెలు, తెలుపరిగెల్లాంటి  డెబ్భయిరకాల పిండివంటల జాబితాను ఏకరువు పెడుతుంది.
త్యాగరాజస్వామివారికి పుస్తికాయల ఒరుగుపులుసు  'వర్తకొలంబు' మహాప్రాణం. వస్త్రంమీద పుస్తికాయలు  ఎండబెట్టుకొనేవేళ  మనసులో  కృతులు మహా పసందుగా అల్లుకుంటాయిట! ఎందరో మహానుభావులు! అందరికీ వందనాలు! అచ్చతెలుగు అప్పచ్చులరుచి అచ్చంగా  అనుభవంలో మిగిలిపోవాలంటే అన్నమయ్య కీర్తనలొక పుడిసెడు పుక్కిలి పడితే సరిపోదా!  మధుర తిరుమలేంద్రుడు- మంచి బహుమానమొసగి/యెదుట కూర్చుండమని ఎన్నికలిమ్మనెనే/యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?/చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె?’ అని మన మొవ్వా వరదయ్య(క్షేత్రయ్య)గారి జావళీలు! జిలేబీలరుచిని  తలపించే మధురరసాలు నోట ఊరటం లేదూ!
'శనగపిండి వంటకం ప్రియురాలి సరసమైతే  అల్పాహారం ఇడ్లీ  ఇంటావిడ అనురాగం' అంటారు డాక్టర్ సినారె.  జ్ఞానపీఠగ్రహీతయితే మాత్రం  తిండిరంధి ఉండకూడదా ఏంది! శతావధానులు తిరుపతి వేంకటకవులయితే.. పకోడీ చేసేవిధానాన్ని శతవిధాల వండి చూపెట్టారు పలు అవధానప్రదర్శన పద్యాల్లో. తెలుగింటి విందులో వడ్డించిన విస్తరి మంగళగౌరీ  గళసీమ నలంకరించిన   నవరత్నఖచితహారంలా రంగులీనుతుంటుందని   ఓ సౌందర్యతుంటరి అభివర్ణన!
అరవైనాలుగు రకాల వరిధాన్యాలు తెలుగు రైతు పండించగలడు. అన్నింటినీ  వండుకుతిని హాయిగా హరాయించుకోనూ గలడు! తెలుగురుచుల్లోని  వైవిధ్యం తెలియాలంటే తెలుగు సాహిత్యమూ రవ్వంత  వంటబట్టాలన్నారు  పెద్దలు మరి! పెద్దలమాట చద్దిమూట!
'ఇప్పుడీ తిండిగోలంతా ఎదుకండీ?' అని కదూ మీ సందేహం.
ఈ ఫిబ్రవరి ఒకటికి కేంద్రం బడ్జెట్ ప్రవేశ బెట్టబోతోంది కదండీ! ఆర్థిక శాఖామాత్ర్యులు అప్పుడే 'హల్వా' వండటం  మొదలెట్టేసినట్లు వార్త. బడ్జెట్లో ఎన్ని తీపి.. చేదు కబుర్లుంటాయో ? మన తెలుగు తిండి మాత్రం నూటికి నూరు పాళ్లు  షడ్రసోపేతంగా ఉండి  గ్యారంటీగా నోరూరిస్తుంటుందండోయ్!  తమరు కడుపారా తిని తృప్తిగా త్రేన్చేస్తే వండినందుకు మాకు అదే ఓ పెద్ద 'తుత్తి'.
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- 27-01-2018 నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్)


Saturday, January 13, 2018

రా.. జా.. కీయాలు- సరదా గల్పిక ఆంధ్రప్రభ -సుత్తి మెత్తంగా-‘ఈ రాజకీయాలు అంటే ఏంటో మూడు ముక్కల్లో  చెప్పన్నా.. అర్జంటు!'
'అంతర్జంటా! అయితే రెండు ముక్కల్లోనే ముగిస్తా! 'రాఁ' అంటే 'వెలకమ్'. 'జాఁ' హిందీ ముక్క. 'వెల్! గెట్ అవుట్'అని రా అర్థం. ఎప్పుడు రమ్మని పిలవాలో.. ఎప్పుడు పొమ్మని మెడ పట్టి బైటిగ్గెంటెయ్యాలో తెలిసుండటమే రాజకీయమంటే. ఎయిటీ ఫోర్ లేక్స్ జీవాలు. సిక్స్టీ ఫోర్  టైప్ ఆర్ట్స్! ఏ జీవీ కదిలించని డొంక..  ఏ ఆర్టుకీ చెందని శాఖ.. ఈ రాజకీయం. ఇదో అబ్రహ్మ పదార్థమనుకోర అబ్బిగా!’  'బ్రహ్మపదార్థం తెలుసు. అబ్రహాం పదానికీ అర్థం తెలుసు. కొత్తగా ఈ 'అ'బ్రహ్మపదార్థం’ ఏంటన్నా?’ 
'బ్రహ్మ తయారు చేయంది  అబ్రహ్మమే కదరా అయేది వెర్రి నాగన్నా! పది దినాల పాటు అలా భూమి దాక వెళ్ళి నాలుగు జీవాలతో కాస్తింత 'మనిషి'గా మెలిగి రమ్మని బ్రహ్మయ్య ఇక్కడికి పంపిస్తే మనమేం చేస్తున్నాం? సింహాలమనుకొని గర్జిస్తున్నాం. నక్కలని వెక్కిరిస్తూనే వాటిని మించి జిత్తులు ప్రదర్శిస్తున్నాం. కుక్కలు కూడా మనలా  తోకలాడించవు. ఇహ కాకిగోలంటావా? కాకులకే మా చెడ్డ చిర్రాకు పుట్టించే కూతలు కూస్తున్నాం అస్తమానం!  కప్పలు కూడా మనంత గొప్పగా తక్కెళ్లలో గెంతటం లేదు! పిల్లులకైనా ఎప్పుడైనా కాస్త సిల్లీ అనిపిస్తుందేమో ఆ గోడదూకుళ్లకూ వాటికీ. వాటం చూసి గోడ దూకడంలో పోటీలు గాని  పెడితే మనమే వాటి రికార్డులన్నీ గ్యారంటీగా బద్దలు కొట్టేస్తాం.  ఛీఁ.. ఛీఁ.. చివరికి గద్దలు, రాబందులకు  మించి  దొరికింది దొరికినట్లే పీక్కుతినేందుక్కూడా  మనం సిద్ధం. కోతీ కొండముచ్చుల్లా కొమ్మలుచ్చుకొని గంతులేసేందు క్కూడా మనలో కొందరు పెద్దలు   సిగ్గు పడ్డం లేదు! పై పెచ్చు పెద్ద ఘనకార్యాలేవో సాధించేస్తున్నట్లు 'పెద్దమనుషులు' ‘గౌరవనీయులు’ ‘ఆత్మబంధువులు’ అంటూ పేద్ద పేద్ద  బిరుదులు బ్యాడ్జీలు గుండెలకు గుచ్చేసుకుంటున్నాం. సరే! రాజకీయాలన్నాక ఇవన్నీ ఓ.కే నేలే గానీ.. నీకే ఇంత పరగడుపునే ఈశ్వరుడికైనా అంతుపట్టని ఈ  రాజకీయాల మీద ఇంత లావు  శ్రద్ధెందుకు పుట్టుకొచ్చినట్లో? ఎవరి పుట్టైనా ముంచడానిగ్గాని ముందస్తు ప్రణాళికలేవన్నా..’
‘ఛఁ..ఛఁ!  నాకంత సీనుందా? నీకు తెలవదా వెంకన్నా?  మా తింగరోడు చాలడా కొంప కొల్లేరు చేసెయ్యడానికి!  రాత్రి బట్టీ వాడు నిద్దట్లో కూడా ఒహటే పలవరింతలు! 'ఇదిగో వస్తన్నా! ఇప్పుడే వస్తన్నా!' అంటూ తెగ కలవరించి చంపేస్తున్నాడన్నా! తెల్లారి లేచి పాచి పళ్లైనా తోమకుండా అద్దం ముందు చేరి ఏంటేంటో  కూస్తున్నాడన్నా! అన్నీ అర్థమయి చస్తాయా మా మొద్దు బుర్రలకీ! ఆ దండాలేంటి.. దస్కాలేంటి? వేళ్లు, చేతులూ అట్లా గాల్లో ఊరికే ఊపేసెయ్యడాలు.. ఉండుండి ముద్దుల మీద ముద్దులు అద్దం మీదకు విసిరేయడాలు!  పండగ రోజుల్లో మాకీ పాడు బెడదేంటన్నా కొంపలో?  మా ముత్తాత  జమానా  మురికి  ఖద్దరు జుబ్బా.. పంచె.. పై కండువా బైటికి తీయించి  చలువ చేయించిండు! వంటికి తగిలించుకొని ఏడకో ఉరుకుతా వుంటే నేనే గడప కడ్డం పడ్డా! 'ఏడకిరా?’అని గట్టిగా గదమాయిస్తే 'ఇంకేడకీ? రాజకీయాల్లోకి నాయనా! అదిగో మా అధినేత ‘రా! రా! రమ్మ’ని పిలుస్తున్నాడు’ అంటా నన్నో మూలకు తొక్కేసి పోతున్నాడన్నా! వీడిగ్గానీ ఏ దిల్లీ గాలో ధూళో సోకలేదు కదా! మా ఇంటా వంటా లేవీ రాజకీయాలు. అరక తీసి పొలానికి పోవడమే మాకు తెలుసు! బుడంకాయలకి బుక్కు బండలేసుకొని బళ్లకు పోవడమే తెలుసు. ఆడంగులకట్లా  చెరువు గట్ల  దాకా  పోయి నీళ్లు చేదుకొచ్చుకోవడం తెలుసు,  పనుల్లేనప్పుడు అట్లా  పక్కోళ్ళ ఇళ్లూ.. చావిళ్లూ చుట్టబెట్టి రావడం తెలుసు కానీ..  ఈ రాజకీయాల్లోకి వెళ్లిపోవడమేంటన్నా కొత్తగా వింటన్నా!’ 
'అర్థమయిందబ్బీ! మొన్నటి  గుజరాత్ ఎన్నికల్లో ఆ ముగ్గురు కుర్రాళ్లెవరో గానీ పెద్దాయన్తోనే పేకాటాడేసుకున్నారు కదా! ఆ దుమారం దుమ్మే మీ తింగరోడి కంట్లోనూ పడ్డట్లుంది.  పోతే పోనియ్యరాదే! రాజకీయాల్లోకే కదా ఆ పొయ్యేదీ?  సన్యాసుల్లో కలిసేందుకేమన్నా పోతన్నాడా? ఎవురికైనా నాలుగు రాళ్లు గడించుకోవాలనే కదా ఉంటుందీ వంట్లో ఓపికున్నంతా కాలం?’ 
'గిట్టనోడి మీద  రాళ్లేయడమంత సులువా అన్నా రాజకీయాల్లో దూరి రాళ్లూ  రత్నాలూ గడించడం? చక్కంగా చదువుకొని..'
'.. సతికి సతికీ ఎంత బుర్రలరగ తీసినా ఏమొస్తదిలేరా నాగన్నా? ఎంత  సర్కారు  కొలువుల్లంకించుకున్నా మిగిలేది గుండుసున్నా! ఏ సదువూ సంధ్యల్లేకపోయినా మంత్రులయినోళ్ళు  ఇంత మంది. మంద బుద్ధివి. నీకా మతలబులన్నీ అందేవి కాదు కానీ.. తింగరోడంటున్నావు కదా నీ కొడుకుని? మరి తిన్నగా రాజకీయాల్లోకే దూరి పోనియ్యరాదా! కేజ్రీవాలే దిల్లీకి సియమ్మయిండు.  ఏమో.. జనం తలరాతలు బా లేక పోతే  మీ పిచ్చోడు కూడా  రేప్పొద్దున ఏ ముఖ్యమైన పదవికో ఎక్కి రావచ్చూ!’ 
'ఎక్కిరావడానికి ఇదేవన్నా దొడ్డిగోడకు చేరేసిన చెక్కనిచ్చనా అన్నా? రాజకీయం వైకుంఠపాళి అని నువ్వే ఓ పాలి అనుంటివి. ఎన్ని పాములు కనికరిస్తే ఆ  చివరి గడికి చేరేదీ! ఎవరెవరి వెనకాలో చేరి గోతులు తీస్తుండాలి! ఎకరాలు అమ్మినా నికరంగా టిక్కెట్టు దొరుకునా? సి- ఫారము దక్కినా  సిఫార్సులు గెలిపించునా? గెలుపుకి ఎవ్వరూ  గ్యారంటీ ఇవ్వరు. గెలుచుకు వచ్చినా ఐదేళ్ల  వారంట్రీ అసలే ఉండదు.  ప్రతీ రోజూ ప్రతినిధుల కతలు ఎన్ని  వింటున్నాం? నాలుగేళ్లు దాటినా నిఖార్సుగా గెలిచిండో లేడో,,  చిట్ట చివరి న్యాయస్థానం కూడా చటుక్కని తేల్చని పరిస్థితి! ఈ పాడు పాలిటిక్సులసలు  మా వంటికి పడేవి కాదు గానీ.. మా తిక్కసన్నాసిని నీ దగ్గరకే పంపిస్తా! ఆ పిచ్చోడి ధ్యాస కాస్త పని మీదకు మళ్లించన్నా! సర్కారు పోస్టులకు ..’ 
‘ఆ సర్కారు పోస్టులన్నీ శుధ్ధ వేస్టురా నాగన్నా! ఆ అరవదేశం చూసన్నా తెలివి తెచ్చుకోవేంటన్నా! ముఖ్య కార్యదర్శంటే ఎంతటి ముఖ్యమైన పదవి? అతగాడి మీదకే ఆదాయప్పన్ను పిశాచాల దాడి! అదే  చోట.. మరి   ఆ రాజా.. కనిమొళమ్మల వైభోగం చూడు! లక్షల కోట్లలో జరిగింది కుంభకోణం. అయినా రాజా.. రాణీల్లా   లక్షణంగా తిరుగుతున్నార్రా రాజకీయాలల్ల! పాలిటిక్సు పవరేంటో నీకేరా వంటపట్టటంలా! గొడ్లు తినే గడ్డి బొక్కినా  ఏళ్ల తరబడి ఎవరూ అడగరు రాజకీయాల్లో.  తలరాత తిరగబడి ఎవుడో తిరగదోడినా తప్పుకు పడే  శిక్ష  ముత్తెమంత! మానవీయకోణం అంటూ లా పాయింటు ఒకటెప్పుడూ రాజకీయాలోళ్ల  సాయానికి సిద్ధంగా ఉంటుందన్నా. ఆ లల్లూ ప్రసాదు భాయీని చూడరాదా.. పాలిటిక్సంటే భయం పోద్ది.  ఓపెన్ జైలు.. అటాచ్డ్ బాత్రూం, సింగిల్ వంటిల్లు, పెళ్లాం కూడా వచ్చి పోతుండొచ్చు బుద్ధి పుట్టినప్పుడల్లా! పిల్లాజెల్లాకీ సలహాలవీ ఇస్తుండొచ్చు. పక్కనే కూర్చో బెట్టేసుకొని ఎవురెవరి కుర్చీల కెప్పుడు ఎట్లా ముప్పందం తేవాలో ముచ్చట్లలా చెప్పుకోవచ్చు. చక్రం తిప్పే ఛాన్సు లేక  పెద్దాయనకి పొద్దు పోకపోతే.. సొంత కొష్ఠం నుంచే ఎద్దులు.. ఆవులూ.. దున్నలూ.. పోతులూ నేరుగా జైలుకే డజన్ల కొద్దీ తరలొచ్చాయన్నా! ఆ వైభోగమంతా చూసే మీ పిల్లాడికి పాలటిక్సు మీదకి గాలి మళ్లినట్లుంది. శభాషో!'
'తెలివి తక్కువ కుంక. నెగ్గుకు రాగలాడా అని శంక!'
'తెలివి బ్రహ్మపదార్థం. రాజకీయం అబ్రహ్మ పదార్థం. రెండింటికీ ముడి పెట్టి కంగారు పెట్టవాక! డొల్లు బుర్ర డొనాల్డే అమరికా దుమ్ము లేపేస్తున్నాడన్నా! కాకపోతే కాస్త మంచీ మర్యాదగా మెలిగే చాదస్తం తగ్గించుకోవాల. అవసరం పడితే కన్నీళ్లు కుండల కొద్దీ కార్చేందుకు సిద్ధపడాల! బోర విరుచుకొని నడిచే దెప్పుడో.. బొక్కబోర్లా పడ్డట్లు నటించాల్సింది ఎప్పుడో ఆ టైమింగు అదీ బాగా ప్రాక్టీసు చేసుకొనుండాల! గుండులాగా ఆరోగ్యం ఉండుగాక.. గుండెనొప్పి, హై బిపి, లో షుగరు, అబ్నార్మల్ లెవెల్లో అల్జీమర్స్, ఫిట్సూ గట్రా  నటించడం బాగా వచ్చుండాలి. ఖర్మకొద్దీ ఏ  సీసీ కెమేరాలకో బుద్ధి గడ్డి తింటూ పట్టు పడిపోవచ్చు. కేసులూ తప్పక పోవచ్చు. ధర్మాసనాలు సులువుగా బెయిళ్లిచ్చే అన్ని అడ్డదారులూ పిండి కొట్టినట్లు  ప్రాక్టీసు చేసుండమను ముందు. ఆ తరువాతే రాజకీయాల్లోకి దూకడం సేఫని నా మాటగా చెప్పన్నా! పిలగాడు  తింగరోడేనని నువ్వే అంటుంటివి.  బంగారమంటి భవిష్యత్తు  గ్యారంటీ! బెంగెట్టుకోవాకా వెర్రి నాగన్నా!  ముందు ఇంటికి లగెత్తుకెళ్లు! బిడాయించిన గది తలుపులు బేగి తీయించు. లేకుంటే మణిపూసలాంటి మరో యువనేతను లోకానికి కాకుండా చేసిన పాపం ముందు నీకే చుట్టుకుంటుందబ్బీ!’
‘!!!’
‘ఆఁ.. అన్నట్లు నీ మనవడిక్కూడా నా అడ్వాన్సు అభినందనలు చెప్పు నాగన్నా! వచ్చే తరానికి వాడేగదా మీ అబ్బాయికి దక్కబోయే కుర్చీకి చచ్చినట్లయ్యే వారసుడు!'
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- సుత్తి మెత్తంగా కాలమ్-13-01-2018 -ప్రచురితం)