Sunday, February 21, 2016

హైకూ-ఒక ధ్యాన మార్గం- కవిత్వ పరామర్శ


దేశమంటే మట్టి కాదోయ్…కవిత్వమే.కొండలలో నెలకొన్న రాయడు వాడు…కవిత్వమే.వందే వందారు మందారమిందిరానంద కందలమ్…కవిత్వమే. చచ్చిన రాజుల పుచ్చిన గాథల మెచ్చే చచ్చు చరిత్రకారులను ముక్కు చెవులు కోసి అడగాలనుంది… ఇదీ కవిత్వమే.
కవిత్వానికి లిట్మస్ టెస్టులు, రంగు రుచి వాసనాదులు నిర్ద్రారించె పని వ్యర్థం. అలాగని పుటలను నలుపు చేసిన ప్రతి రాతను కవిత్వమే అనాలా!
కవి నిరంకుశుడే…కదా అని చంపకమాల రాసి కందమని దబాయిస్తే సహించాలా! పద్యం రాయాలనుకున్నప్పుదు పద్య నియమాలకి బద్ధుడయ్ ఉండాలి కదా!
హైకూల పేరుతో ఇప్పుడొస్తున్నసర్కస్ ఫీట్స్…ను గురించే ఈ ఘోషంతా!
సంప్రదాయక కవిత్వానికి ఉన్నది నియమబద్ధ వ్యాకరణ సూత్రాలే…హైకూల వెనుకున్నది ఒక కచ్చితమైన ఫిలాసఫీ!
హైకూ అంటే 5,7,5 అక్షరాలను ఉపయోగించి రాసే కవితా రూపం మాత్రమే అనేది ఒక అపోహ.
"Haiku-Expression of a single impression of natural object or a scene without intellectual interuption..."
భాషాప్రావీణ్యతకు,పాండిత్య ప్రకర్ష్ వ్యక్తీకరణలకు హైకూ వేదిక కాదు.హైకూ వెనుక ఒక మతం కాని మతం ఉంది. జైన్ మతం.నియమ శృంఖలాల బంధన లేకుండా మనిషికి నైసర్గిక స్వేచ్చను కోరుకునేది ఆ మతం. ప్రకృతితో మమేకం అవడమే ముక్తికి సాధనం అని దాని ప్రతిపాదన. కళ్ళు మూసుకుని కాదు…తెరిచి ధ్యానించు. ప్రకృతి ఉన్నది దర్శించడానికే. నిర్యాణానికి ఇంద్రియానుభూతి ఎంత మాత్రం అవరోధం కాదు.సామాన్య మానవుని కన్నా అసామాన్య అస్తిత్వం మరొకటి లేదు.-ఇదీ ఆ మత సిద్ధాంతం.
హైకూ వరకు వస్తే-ప్రకృతిలో మమేకమయే క్రమంలో దృశ్యానుభవాన్ని తృటి కాలంలో మెరుపులా కవి వ్యక్తీకరించాలి.ఇంద్రియగ్రహణ ద్వారా చైతన్యవాహిని ఏర్పడేందుకు మనిషికి కావలసింది కేవలం 17 చిత్తక్షణాలే (thought instants)అంటారు. తొలి దశలో మూడు పాదాల్ని, 17 మాత్రల్ని(syllables) హైకూ లక్షణంగా నిర్ణయించడానికి ఇదే కారణం.
జపనీస్, ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉన్న మాత్రాసౌలభ్యం తెలుగుకి లేదు.ఈ మాత్రానియమం వల్ల హైకూ సౌదర్యం కోల్పోయే ఇబ్బంది ఉంది.
ముఖంపై ప్లస్సు
వీపు మీద మైనస్సు
చెయ్యిపై ఇంటూ… దీన్ని హైకూ అంటే భరించగలమా!
దోసిట్లో నీళ్ళు
ముఖచిత్రం కరిగి
కారిపొతుంది… ఇదీ హైకూ.
ఆకాశానికి రోడ్డుకీ మధ్య/చక్రాలు తిరుగుతాయి/అధిక భాగం ఆకాశంలోనే/అంగుళం మేర మాత్రం/అంటిపెట్టుకునుంటుంది నేలని/నా కవిత్వం లాగే…అంటూ తన కవిత్వాన్ని స్థూలంగా నిర్వచించుకున్న మహాకవి ఇస్మాయిల్ తెలుగుకి ఒదగని మాత్రల జోలికి పోకుండా కూడా అద్భుతమైన హైకూలని ప్రకటించారు.
కాళ్ళకి కాళ్ళు తొడుక్కుని
నీళ్ళల్లో నిలుచున్నాడు కుర్రాడు
పై కింది మొహాల్లో ఆశ్చర్యం ఆశ్చర్యం...
తలకి మబ్బూ
కాళ్ళకీ సరస్సూ తొడుక్కోకపోతే
కొండ కొండే కాదు...
పటిక బెల్లమ్ తింటుంటే
పాప చూసి ఆగింది.
దానికి పెట్టాక ఇంకా తీపెక్కెంది బెల్లం...
కవికి స్ఫురించిన మెరుపును మూడు పాదాల్లో ఇలా హృద్యంగా అందించడమే హైకూ లక్ష్యం. మేథో ప్రమేయం లేని జ్ఞాన జ్యోతే హైకూ కవిత ఆంతర్యం.
మామూలుగా కవి అంతగా స్పృహలో లేని ధ్యాన దశలోనె గదా హైకూ వెలువడేది! మితిమీరిన మేథో ప్రదర్శన హైకూ సౌందర్యాన్ని చెరుస్తుంది. వేరే కవిత్వం రాసే వేళ అలవాటుగా చేసే హంగామా హైకూ కవిత్వం రాసే సమయంలో ప్రదర్శించడమే చాలా మంది కవులు చేసే పొరపాటు.
భిన్నత్వం విశ్వజనీన గుణం.ఓ భావ జాలంతో ఏకీభవించ వచ్చు.విభేదించవచ్చు. కానీ ఒక స్థిర భావం నుంచి మొలకెత్తిన రూపాన్ని అదే పేరుతో రసాభాస చేయడం అన్యాయం.అది పేరడీ మాత్రమే అవుతుంది.
హైకూను మరొ విధమైన మినీ కవితా ప్రక్రియగా భావించడం కూడా దుర్ వ్యాఖ్యే.
అందరం గుర్తుంచుకోవలసింది…హైకూ కవిత ఆత్మకు ప్రధాన రూపం(Form) కాదు. విషయం(content) మాత్రమే.
"The flame of life lies in the heart of each passing second"
జెన్ బౌద్ధపు ఈ చైతన్య దీప్తే ... హైకూ
-కర్లపాలెం హనుమంతరావు

(నరేష్ నున్నా-"కొట్టివేతలు…దిద్దుబాట్లు" వ్యాస సంకలనంలోని 'హైకూ-ఒక ధ్యాన మార్గం'-స్ఫూర్తితో)

Friday, February 19, 2016

గీతా మకరందం- ఈనాడు ఆదివారం సంపాదకీయం


గంగ, గాయత్రి, గీత- ప్రపంచానికి భారతీయత ప్రసాదించిన మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక కానుకలు. తొలిరెండింటి మాట అలా ఉంచి గీతాసూత్రం మాత్రం 'శంకా సంకుచితాంతరంగులకు, వృథా సందేహమందేహులకు' కింకర్తవ్య విమూఢత్వం ఆవరించినప్పుడల్లా మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా స్వస్థతనందించే చక్కటి ఔషధం. దాదాపు అయిదువేల సంవత్సరాల కిందట- దుర్మదాంధులైన కురుసైన్యం ఎదుట కురుక్షేత్ర రణక్షేత్రం ముంగిట దైన్యయోగంలోపడ్డ నరుడికి నారాయణుడే జ్ఞానసారథ్యం వహించి చేసిన కర్తవ్యబోధ- గీత! 'గీ' అంటే త్యాగం, '' అంటే తత్వజ్ఞానం. యుద్ధ సందర్భాన్ని ఓ మిషగా ఎంచుకొని సర్వకాలాలకూ వర్తించే నిష్కామ కర్మయోగ ప్రాశస్త్యాన్ని భగవంతుని ఉవాచగా 'గీత' ప్రకటించిందని బుద్ధిజీవులూ విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సరిసమానంగా ప్రమాణ్యత సంతరించుకొన్న ప్రవచనంగా శంకరాచార్యుల
వంటి భగవత్పాదులే గీతను భావించి భాష్యాలు వెలువరించారు. సంక్షుభిత సమాజానికి సాంత్వన చేకూర్చే చిత్రమైన తత్వమేదో గీతలో దాగుందని డాక్టర్ అనిబిసెంటువంటి మేధావులూ వ్యాఖ్యానాలు చేశారు. దేవుడు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడు కనుక, మనిషి నిర్భయంగా సుఖపడవచ్చని ఆదిమానవుడు నమ్మిన కాలంనుంచి, నేటికాలందాకా- మానవజీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మతాలు, మార్పులు, మలుపులు. త్రికరణశుద్ధిగా, ఫలాపేక్ష  లేకుండా, భవబంధాలకు అతీతంగా, కర్మ చేయడమొక్కటే మనిషి కర్తవ్యమని నిక్కచ్చిగా తేల్చిచెప్పిన గీతాసూత్రం- ఈ అణుయుగంలో సైతం అణువంతైనా మారలేదు. గీత సజీవతకు, అంతస్సూత్రంగా దాగిన ఈ నిత్యజీవిత సత్యసంధతే ప్రధాన కారణం. మంచి మనుగడే మతం అభిమతమైతే గీత సర్వమత సమ్మతం ఎందుకు కాకూడదు?

'దేహమా కంపించుచున్నది/ 'ద్రోహమా' యనిపించుచున్నది/ మోహమేదో కుంచుచున్నది' అంటూ విషాదయోగంలో పడ్డ నరుణ్ని- 'మోహమడంగె తొలంగె ధర్మ సందేహములన్నియున్' అనే మోక్ష సన్యాస యోగదశదాకా నడిపించుకొని రావడానికి 'గీత'లో నారాయణుడు ఎత్తిన అవతారాలు శతాధికం. 'ముందు గూర్చుండి నే పగ్గములను బట్టి/ రథము నడిపింతు/ కార్యసిద్ధికి నీవింక గడగుమయ్య!' అంటూ నాయకుడిలా ముందు నిలబడి భరోసా ఇస్తాడు ఒకసారి. 'దారుణ మారణ క్రియ/ కెట్టు లోర్చు మదీయ హృదయము?/ కొట్టనీ... చేతులు కట్టుకొని యుందున్' అంటూ డీలాపడిపోయినప్పుడు 'త్యజింపుము బేలతనమ్ము/ ధైర్యమున్ జెదరనీకుము' అంటూ తల్లిలా లాలిస్తాడు ఇంకోసారి. 'కొంచెపు మాట లాడెదు, జుగుప్స, అశోచ్యుల కోసమేల శో/ కించు టనార్యజుష్ట మపకీర్తికర, మ్మపవిత్రమైనదీ/ చంచలబుద్ధి, కశ్మలత చాలు' అంటూ తండ్రిలా మందలిస్తాడు మరోసారి. మోహపాశంలో పడి కొట్టుమిట్టులాడే మిత్రుడి చేయిపట్టుకొని ఉద్ధరించాలనే తాపత్రయం ప్రదర్శిస్తాడు పలుపర్యాయాలు. 'నరుడే కైక ధనుర్ధరుండయి యఖండ త్యాగదీక్షా దురం/ ధరుడై నిల్చిన ముజ్జగమ్ముల నసాధ్యమన్నదే లేదు' అంటూ గురువులా ధర్మమార్గం దర్శింపజేస్తాడు భగవానుడు గీతలో. 'కర్తన్ నేను సమస్త భూతములకున్/ సర్వమ్ములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారమున్/ దీర్తున్, నీవు నిమిత్త మాత్రమగు మంతే, క్త్లెబ్యమింకేల? నీ/ కర్తవ్యము గుర్తెరింగి విజయా/ గైకొమ్ము గాండీవమున్' అంటూ నిలబెడతాడు. చింతాక్రాంతుడైన మానవుడికి సాంత్వన కలిగించేందుకు అంతా తనమీద వేసుకొనే ఔదార్యం ఇంతగా మరే సంస్కృతిలోనూ ఎవరూ ప్రదర్శించినట్లు కనిపించదు.

చెప్పడంలోని గొప్పతనమో, వ్యాసుడు రాయడంలోని గడుసుదనమో..  పరమగంభీరమైన వేదాంతసారం గీతాపాత్రలో పరమాన్నమంత మధురంగా ఉంటుంది. యోగులు, స్వాములు, జ్ఞానులు, అవధూతలే
కాదు... బుద్ధివాదులు, చివరికి చలంవంటి స్వేచ్ఛాప్రణయ జీవులూ గీతామకరందాన్ని సీతాకోకచిలుకల్లాగా సేవించేందుకు  ఉవ్విళ్లూరడాన్నిబట్టి, సుఖజీవిత అంతస్సూత్రమేదో ఆ పుష్పరాజంలో దాగుందనేగా అర్థం! 'చాలాకాలం కిందటే కనుమరుగైన నా తల్లి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీతే. మనసు కలత చెందినప్పుడల్లా నేను ఆ  తల్లి ఒడిలోనే తలదాచుకొనేది' న్నది అహింసాయోగి మహాత్మాగాంధీ వాక్కు. 'చిత్తం
పరిశుద్ధమయ్యేకొద్దీ కొత్త
కొత్త అర్థాలు తోచే చిత్రమైన ఆధ్యాత్మిక పొత్తం గీత' న్నది ఆధునిక యోగి వివేకానందుని వాణి. ధర్మాధర్మాల మధ్య ఘర్షణ హృదయాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు విచక్షణ భగవత్స్వరూపం పొంది సన్మార్గం చూపిస్తేనేగదా మనిషి పతనావస్థనుంచి విముక్తి పొందగలిగేది! వ్యాసప్రోక్తమైన గీత అష్టాదశాధ్యాయాల్లోని శ్లోకాల్లో- ఏదో ఒకటి ఎల్లవేళలా ప్రపంచంలోని ఏదో మూల ఎవరో ఒకరి చిత్తచాంచల్యమనే చీకటిని చెండాడే దివిటీలా జ్వలిస్తూనే  ఉంటుంది. అందుకనే విశ్వవ్యాప్తంగా శ్రీమద్భవద్గీతకు ఇంతకాలంగా ఇంత వన్నె తరగని  మన్నన. గీత కేవలం వ్యాసమహాభారతంలోని
అధ్యాయభాగం
మాత్రమే కాదు. మనిషి- నిశ్చింత జీవితానికి నిత్యం పాటించదగ్గ జీవన సూత్రాలన్నీ విస్తారంగా  పొదిగిన మనోవికాసశాస్త్రం. నరుడికి నారాయణుడు గీతలో బోధించిన  'తామరాకు మీది నీటిబొట్టు తత్వం'- మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా లోకం మొత్తం అనుక్షణం అనుసరించదగ్గ సూక్తం. అనేక భాషల్లో భాష్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డ భగవద్గీతపై నేడు వివాదం రేగడం దురదృష్టం. ఉత్తమ మానసిక వికాససాహిత్యంగా, జ్ఞానామృతభాండాగారంగా ప్రశంసలు అందుకొంటున్న శ్రీమద్భగవద్గీతమీద తీవ్రవాద సాహిత్యం’ అనే ముద్ర వేయడం,  ఆ మిషతో నిషేధానికి పూనుకోవడం సంకుచిత మనస్కుల తెలివిమాలినతనానికి నిదర్శనం. మనసును ఉద్దీప్తం చేసి, జాతి కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక జ్ఞానపిపాసుల జిజ్ఞాస తీర్చడంలో ముందున్నది గీతామందారం, దానిపై ఎవరెంత మకురుదనం ప్రదర్శించినా చెక్కుచెదరని మాధుర్యం ఆ మందార   మకరందానిది!


(ఈనాడు 25-12-2011 నాటి  ఆదివారం సంపాదకీయపుటలో ప్రచురితం. ఈనాడు యాజమాన్య సౌజన్యంతో.. కృతజ్ఞతలతో)

Wednesday, February 17, 2016

గెలుపు పిలుపు- ఈనాడు ఆదివారం సంపాదకీయం


'గెలుపు ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమిదే ముందు గెలుపు' అని చైనా సూక్తి. ప్రతి విజయం వెనక ఓ ఓటమి చల్లని చూపు తప్పనిసరి.. బావి తవ్వేవాడి చేతికి మొదట మట్టే అంటుకున్నట్లు. శరీరం మినహా  మరే ఆధారమూలేని జీవజాలానికి పోరాటం, బతకి తీరాలనే ఆరాటం మినహా జయాపజయాలు పట్టవు. కష్టించి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడూ ఆత్మాహుతి చేసుకోదు.  మళ్ళీ చినుకుపడి చెరువు నిండేదాకా కప్ప మండుటెండయినా  బండమధ్యే రోజులు గడుపుతుందికానీ, గుండె పగిలి చావాలనుకోదు. శీతోష్ణాలు, రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులు తరహానే గెలుపు ఓటములు!  రాయితో రాయిని కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పు రాజేయటంనుంచి  చంద్రమండలంమీది నీటిజాడలు ఆనవాలు పట్టిందాకా  అసలు ఓటమంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి! అమ్మ కడుపులో పడ్డ మరుక్షణంనుంచే మనిషికి పరీక్షలు మొదలవుతాయి. ఒలింపిక్సు పరుగుపందెం ప్రథమ విజేతైనా బుడిబుడి అడుగుల వయసులో ఎన్నో సార్లు తడబడి పడిపోయుంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాలవారధి దాటినప్పుడే అవరోధాలదీవిలోని 'ఆనంద నిధి' సొంతమయేదని చాటేందుకు. 'మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు ఆచరించినా ప్రాణంముందు అన్నీ తృణప్రాయమే' అన్నది మహర్షి యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవన సూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతంకోసం దాయాదివైరం సైతం   తోసిరాజని  క్షీరసాగర మథనయాగానికి పూనుకున్నది దేవదానవులు. యమధర్మరాజంతటి సాక్షాత్‌ మృత్యుస్వరూపుడే  దండంతో ప్రాణాలు హరించేందుకు  వచ్చినా శివలింగంపట్టు వదలలేదు మార్కండేయుడు!

పెద్దలు 'జాతస్య మరణం ధ్రువమ్‌' అన్నారని చేతిగీతలను చేజేతులా చెరిపి
వేసుకోవాలని అనుకోవడం పిరికితనం. మన ప్రమేయంతో మనం పుట్టామా.. మన ప్రమేయంతోనే పోయేందుకు! తల్లి తొమ్మిది నెలలు కడుపున మోసి జన్మనిస్తే.. తండ్రి
తొమ్మిదేళ్ళు కంట్లో పెట్టుకుని పెంచుకున్న శరీరం ఇది. బిడ్డ ఆటపాటలకు, ముద్దుముచ్చట్లకు తమ జీవితాలను చాదగా చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్‌ పాణి పాద  పాయు, ఉపస్థలలు  అనే అయిదు కర్మేంద్రియాలు, త్వక్‌ చక్షు శ్రోత జిహ్వ ఆఘ్రాణాలు అనే అయిదు జ్ఞానేంద్రియాలు.. మనోబుద్ధిచిత్తాహంకారాలనే అంతఃకరణ చతుష్టయంతో కలిసి పంథొమ్మిదిమంది దేవతలకు ఆవాసం’గా మానవ శరీరాన్ని ప్రశ్నోపనిషత్తు ప్రస్తుతించింది.  శాస్త్రోక్తమా.. కాదా అన్న వాదన  తరువాత. నేటి సామాజిక జీవన వాతావరణంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగే వీలులేనిది. 'పుటక నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రజాకవి కాళోజీ నివాళులు అర్పించారు. బతుకంతా దేశానిది అనిపించుకోవడం ఆనక..  కనీసం  కన్నవారిది, మనం కన్న వారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది అని అయినా అనిపించుకోవాలి!  బిడ్డ ఒక్కపూట పాలుమాలితేనే పాలు కుడిపే తల్లిరొమ్ము ఎలా తల్లడిల్లుతుందో తెలుసుకోవాలి! ఆకాశంలో అకాలచుక్క పొద్దుగా మారతాడనా  కన్నతండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసేదీ! 'నాతి చరామి' అంటూ చేయిపట్టుకొని పెళ్ళిపీటలమీద  ఇచ్చిన హామీని నమ్మేకదా  బిడ్డకు తల్లిగా మారేది  పిచ్చితల్లి! 'అమ్మా.. నాన్నేడే!' అని  బిడ్డలు నిలదీసినప్పుడు నీకు బదులుగా తనెందుకు తలొంచుకోవాలి!

పండే పొలాలు ఎండిపోయాయనో, ప్రే మించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్ళయిపోయిందనో, ఉద్యోగమూడి బతుకూ పరువూ బజారున పడ్డాయనో, స్టాక్‌- మార్కెట్‌ కుప్పకూలి షేర్లు 'బేర్‌' మంటూ  భయపెడుతున్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా తొలిప్రదర్శన  టిక్కెట్లు దొరకలేదనో,  నూటికి నూరు మార్కులు పరీక్షల్లో  రాలేదనో, ఇష్టమైన మహానేత హఠాత్తుగా పైకి వెళ్ళిపోయాడనో, క్రికెట్టాటలో తనజట్టు ఓడిపోయిందనో, నిరాహారదీక్షలకు కూర్చున్న  నేతలు అర్థాంతరంగా నిమ్మరసం తాగారనో.. తాగాలనో స్వీయప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమంగా పెరిగడం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా నిరుడు 1.22లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,224 మంది బలవన్మరణాల పాలయ్యారు. స్వహననం సమస్యకు పరిష్కారం కానే కాదు. విసుగుదలకీ, ఓటమికీ  ఔదలచి ఉసురు తీసుకోవటం విరుగుడు అసలు కాదు. యోధులుగా మారి ప్రతీ అడుగూ ఓ దీక్షాశిబిరంలా మార్చుకొనే సమరాంగణం జీవితమంటే. ఒడుపు మరనంతకాలం జీవనయానం  ఏ వంకర టింకర మలుపుకూ అవరోధం కాబోదు. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...' న్న పాట అర్థం ఒంటపట్టించుకొంటేనే వంటికి, ఇంటికి, దేశానికి మంచిది.
                                   ***
(ఈనాడు ఆదివారం 27-12-2009 నాటి సంపాదకీయం- ఈనాడు యాజమాన్య సౌజన్యంతో.. కృతజ్ఞతలతో)

మనవిః

కొన్ని సేకరించిన ఈనాడు- ఆదివారం సంపాదకీయాలను ఇక్కడ వరసగా ప్రచురించడానికి కారణం.. మరింతమంది విజ్ఞులైన పాఠకులకు మంచి విషయాలు  చేరాలనే. ఈనాడు సంపాదకీయాలమీద సర్వహక్కులు ఈనాడు యజమాన్యానివే. ఈనాడు యాజమాన్యం సౌజన్యం- కృతజ్ఞతలతోనే ఈ వ్యాసాల ప్రచురణ ఇక్కడ జరుగుతున్నదని మనవి. ప్రచురించిన వ్యాసాలమీద ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియ చేయగలరు. వెంటనే ఈ వ్యాసాలను ఇక్కడినుంచి తొలగించడం జరుతుగుతుంది అని గమనించ గలరు.

Monday, February 15, 2016

దేవుడి పాలన- ఓ సరదా గల్పిక

దేవుడి పాలన'.. 'దేవుడి పాలన' అంటూ అంతా అలా ఊదరగొట్టే
సజ్జేగానీ.. ఆ పాలించే దేవుడుగారెవరో ఇతమిత్థంగా ఎవరూ తేల్చిచెప్పరు! ఎందుచేతనంటావ్ బాబాయ్!'
'నీ ద్యాసీ పొద్దు  దేవుడిగారిమీదకు మళ్లిందే! వివరాలేమన్నా తెలిస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యమేదన్నా లాగిద్దామన్న దుర్భుద్ధి కాదుగదా!'
'అపార్థాలొద్దు బాబాయ్! మన ప్రపంచ జనాభా ఏడొందలకోట్ల పైచిలుకు మైలురాయికి చేరుకుంది కదా ఇప్పటికేఅదే దామాషాలో దేవుళ్లసంఖ్యా పెరుగుతున్నదా.. లేదా.. అని నాకో ధర్మసందేహం! మనకి ముక్కోటి దేవతలున్నట్లు ఎక్కడో చదివాను. ఆ లెక్కన ఒక్కో దేవుడికి రెండువందల ముఫ్ఫైముగ్గురు భక్తులను ఆదుకోవాల్సిన బాధ్యతా ఉందిగదా! ఈ కరువు రోజుల్లో అదెంత బరువు! అందుకే వాళ్ళ కష్టనష్టాలేమిటోకూడా కాస్త  వాకబు చేద్దామనీ,,!'
'ఇహనేం! జనగణన మాదిరిగా దైవగణనకీ బైలుదేరూ! ఎలాగూ పనీ పాటా లేనట్లుందిగా నీకీ మధ్య!'
***

అబ్బాయి ముందుగా బ్రహ్మలోకంలోకి ప్రవేశించాడు.
తామరతూడులో తామరాసనుడు లేడు! అక్కడే మానససరోవరం మడుగులో  కునికిపాట్లు పడే హంసవాహనం అంది 'మీ లోకానికి సెకనుకి నాలుగు శాల్తీలయ్యా  తయారవ్వాలి! ఇక్కడికి తిరిగొచ్చేవి మాత్రం రెండంటే రెండే! ఈ లెక్కన మనుషుల్నిచేసే ముడిసరుక్కి ఎంత కరువొచ్చి పడిందో తెలుసా అబ్బాయ్! పనిభారమూ ఎక్కవపోయింది  పాపం మా పెద్దాయనకి. బ్రహ్మ రాసిన నుదుటిరాతల్నీ మీరవేవో కంప్యూటర్లో.. పాడో.. వాటి సాయంతో తిరగరాసేసుకుంటున్నారంటగా! బోలెడన్ని ఫిర్యాదులు వచ్చిపడుతున్నయ్ బాబూ బ్రహ్మలోకానికి  రోజూ! వీటన్నిటికీ చెక్ పెట్టేసే కొత్త సాఫ్టువేరేదన్నా దొరుకుంతేమోనని వాకబు చేయడానికి వెళ్లారు విశ్వకర్మ దగ్గరకు  విధాతగారు'
'వాణీమాతకూడా కనిపించడం లేదే!'
'బ్రహ్మ కష్టాలు బ్రహ్మవి. అమ్మ కష్టాలు అమ్మవి. మీ మానవుల బుర్రల్లో బుద్ధి ఎక్కువ  దోపడం బుద్ధితక్కువ పనయిందనుకుంటున్నారయ్యా  ఇక్కడంతా! అంత కష్టపడి ఎన్నో భాషలు కనిపెట్టి ఇంచక్కా ఎవరి పుట్టుకభాష వాళ్ళు మాట్లాడుకోమంటే.. మీరేం చేస్తున్నారబ్బాయ్! అన్నింటినీ కలగలిపేసి ఓ కొత్త సంకరభాష తయారు చేసేశారు! ‘నా భాష గొప్పదంటే నా భాష గొప్పదని దుర్భాషలు మొదలుపెట్టారు! మైకులముందు మీరు కూసే కూతలు.. పత్రికల్లో మీరు రాసే రాతలు భాషామతల్లికే  ఓ పట్టాన బుర్రకెక్కి చావడం లేదు! 'మానవా! దూర్భాష మానవా!' అని మీకు అర్థమయేలా అర్ధించాలన్నా ఆమ్మకూ సంకరభాషే గతయిపోయింది.. ఖర్మ! ఎవరో టీ.వీ యాంకరమ్మట! ఆమె దగ్గర సంకరట్యూషను పెట్టించుకొందీ మధ్య. అక్కడికెళ్లింది.. ఇంకా రాలేదు
అబ్బాయి అటునంచటే విష్ణులోకానికి  పయనమయ్యాడు.
పాలకడలిమీది పాముపడగా బోసిగా ఉంది. పరమాత్ముడేమన్నా కొత్త అవతారం ఎత్తేందుకని వెళ్లాడేమో! ఆ మాటే ఆదిశేషుని అడిగితే ఇంతెత్తున బుస్సుమని లేచింది!
'అదొక్కటే తక్కువయ్యా ఇప్పుడు మా పరంధాముడికి! మీ లోకంలో ఎవరో
గాలి సోదరులంటగా! నలభైమూడు కోట్లుపోసి వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటమొకటి స్వామివారి నెత్తికి తగలేసారు అప్పుడెప్పుడో! అప్పుడొచ్చిన మాడుపోటు.. ఇప్పటికీ తగ్గలేదు. మా ధన్వంతరిగారేమో వల్లకాదని చేతులెత్తేసాడు! మంచి వైద్యుడేమన్నా దొరుకుతాడేమోనని  మీలోకంలోనే.. గాలించడానికని ఎక్కడికో వెళ్ళారు.. ఇంకా రాలేదు’
'మరి సిరి? అమ్మగారూ అయ్యగారి వెంటనే వెళ్లారా?’
'అమ్మో! మీ లోకమే! డబ్బుకాకలో కొట్టుమిట్టాడుతున్నారంటగా మీరంతా! ఎక్కడే పాపాత్ముడు కట్టిపారేస్తాడోనని స్వామివారే లక్ష్మమ్మను వెంట రావద్దన్నారు. అయినా.. మీ మానవులమీదే ఆ తల్లికి ఆదరం ఎక్కువ. అక్కడి బీదాబిక్కిని ఆదుకుందామని వస్తే ఆదిలక్ష్మనికూడా గౌరవం లేకుండా ఏంచేసారయ్యా మీ పెద్దమనుషులు! నల్లరంగు పూసేసి నేలమాళిగల్లో  దాచేస్తారా! అహ్వ..!' అంటూ జిహ్వనిండా నిప్పులు గుమ్మరించింది ఆదిశేషు.
ఇంకాసేపు అక్కడే ఉంటే ఏం జరుగుతుందో తెలీనంత పిచ్చికొయ్యేంకాదు అబ్బాయి. అమాంతం కైలాసం జంప్!

వెండికొండా భూత్ బంగళానే తలపిస్తోంది.
తెల్లకార్డువాళ్లకి చంద్రన్నలిద్దరూ రూపాయిక్కిలో బియ్యం పంచుతున్నారు  కదా ఈ మధ్య! దారిద్ర్యరేఖకు ఎల్లప్పుడూ దిగువునే ఉండే  మారాజాయ  ఈ  ఆదిభిక్షువు! చౌకబియ్యంకోసం అటుగానీ వెళ్లాడేమో!
అదే అడిగితే 'కాదయ్యా!' అంది నంది 'ఆ ముక్కసరుక్కి కొండలెక్కి దిగాలా! మింగి హరాయియించుకోడానికి ఆ నూకలేమన్నా  అలనాటి హాలాహలమా నాయనా! వ్యాహ్యాళికని వెళ్లిన అమ్మవారు వెండికొండకు ఇంకా  తిరిగి రాలేదు.  ‘విచారిద్దామని  వెళ్లారు మా స్వామివారు!' అంది నంది.

దేవుళ్ళంటే ఒక్క త్రిమూర్తులే కాదుగదా!
బాపట్ల భావనారాయణ స్వామివారేమన్నా వివరాలు చెబుతారేమోనని అటుగా వెళ్లాడు అబ్బాయి. ఆ మధ్యనే ఏదో చిన్నగాలితెర వీస్తే నెత్తిమీది గాలిగోపురంకాస్తా ఠప్పుమని కూలిపోయిందట! ఆ కుములుడింకా తీరనే లేదేమో! బైటికొచ్చి మొహమే చూపించలేదు నారాయణస్వామి!
శ్రీ కాళహస్తీశ్వరుడిదీ అదే చేదుఅనుభవం. దర్శనభాగ్యం  కలగలేదు!
'ఏడుకొండలవాడి గుడికి బంగారు తాపడాలేమిటి? చిన్నగుళ్లమీద చిన్నచూపేమిటి? దేవుళ్లంతా సమానమే అయినప్పుడు ఒక్కోగుడికి ఒక్కో తీరు కెటాయింపులు.. అన్యాయం! నడవనివ్వం' అంటూ కొట్లాడేందుకు  చిల్లర దేవుళ్లంతా కలిసి  కొత్తగా ఓ  సంఘం (చిదేసం) పెట్టుకొనే పనిలో బిజీగా ఉన్నారన్న సమాచారం అందింది అబ్బాయికి.

మర్రిచెట్టు నీడలో కునికిపాట్లు పడుతున్న పోతురాజు దొరికాడు చివరికి  అతికష్టంమీద. 'మీరు నిజంగా ముక్కోటి దేవతలేనా! మూడురోజులబట్టీ కాలికి బలపం కట్టుకు తిరుగున్నానయ్యా దేవుడా! ఒక్క దేవుడూ కనిపించడేమయ్యా మగడా!' అంటూ గట్టిగానే  నిలదీసాడు పోతురాజును ఆబ్బాయి.
'గాలి సోదరుల్లాంటి మాఫియా దెబ్బలకు సుంకాలమ్మల్లాంటి
గ్రామదేవతలకు    నిలవనీడా! కరువు కాటకాలతో అల్లాడే చిన్న చితకా జనతా.. ఎక్కడ చిన్నపిల్లలకు కాన్వెంటు బళ్లల్లో ఫ్రీ సీట్లు..పెద్దతలకాయలకు స్టారాసుపత్రుల్లో  బెడ్లు అడుగుతారోనని కలల్లోనైనా  కనిపించాడానికి  జంకుతున్నారయ్యా దేవుళ్లంతా!' అని మళ్లీ నిద్రకు పడ్డాడు పోతురాజు.
ఒక్క చిన్నదేవుడితోనైనా మాట కలవకుండానే అబ్బాయి దైవగణన కార్యక్రమం  ఆ విధంగా విఫలమయింది.
***
'పెట్రోలు సుంకాలు తగ్గించమని, పచారీ సామాను చవక దుకాణాల్లోనైనా చవగ్గా ఇప్పించమని, కోతల్లేని కరెంటు కంటిరెప్ప పాటైనా కనికరించమనినలకలున్నా సరే నాలుగు నిమిషాకు ఆగకుండా  నల్లాల్లో  నీళ్లు ధారకట్టాలని.. ఏవేవో మనం గొంతెమ్మ కోరికలు  కడుపులో పెట్టుకొని వెంటబడితే  పాపం.. దేవుళ్లుమాత్రం ఏం చేయగలరూ! దోమలుజైకా' వైరస్సున మోసుకుంటూ ప్రపంచమంతటా ఝామ్మ న  జైత్రయాత్రలు  చేసే తరుణంలో దైవగణనకని బైలుదేరాను చూడూ.. నాదీ బుద్ధితక్కువ! నా ముక్కోటి దేవతల సందేహం ప్రస్తుతానికి అలాగే పెండింగులో పడిపోయింది బాబాయ్ చివరికి.. ప్చ్!’ అని నుదురుబాదుకొన్నాడు అబ్బాయి.
'ముక్కోటి ఏం ఖర్మరా పిచ్చోడా! మూడొందల కోట్లమంది దేవతలున్నారు..  మన చూట్టూతానే! ఆ దేవుళ్ల దగ్గరికి నువ్వసలు వెళ్లనే లేదు. వెయ్యినోటు చూపిస్తే బొందితో కైలాసానికైనా తోసేస్తామని ప్రకటనలు గుప్పించే  బాపతు  చిల్లర దేవుళ్ళు.. ఎంత మందున్నారో నీ లెక్కలేం తేలుస్తాయ్.. అమాయకుడా! ఎన్నికలముందు దేవుడి పాలనఅందిస్తాం.. 'దేవుడి పాలన' అందిస్తామని మన నేతాశ్రీలు.. ఓహో.. అదేపనిగా  హామీలు కుమ్మేస్తుంటారు కదా! ఆ దేవుళ్ళు ఈ   దేవుళ్లేరా పిల్లగాడా!  చిల్లర  దేవుళ్ల ఆశీర్వాదాలతోనే మనం ఓట్లేసి గెలిపించే నేతలు మనల్ని  తోకున పరిపాలించేస్తున్నది!’ నేసాడు బాబాయ్!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సెప్టెంబరు 9, 2011 నాటి  సంపాదకీయ పుటలో ప్రచురితం)
'

Sunday, February 14, 2016

సృజన


సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపు  సహజచర్య. మానవేతర జంతుజాలం తమలాంటి జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషిది. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలూ చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికి ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం సృజనగా గుర్తిస్తున్నాం.  ఆ శక్తి గలవారిని  సృజనశీలురు, స్రష్టలు అంటున్నాం.
కళాకారులందరూ స్రష్టలే. కాని అంతకన్నా ముందు మానవులు. అలాగని మానవులందరూ కళాకారులు కాదు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలోనూ పిసరంతైనా కళంటూ ఏదో ఒకటి దాగుండక పోదు కానీ..ఆ కళేదో బహిర్గతమైనప్పుడే అతనికి    కళాకారుడిగా గుర్తింపొచ్చేది.
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఆలోచనను బట్టే ఉనికి’ (Cogito ergo sum)సిద్ధాంతం ప్రకారం మనిషి సృజనశీలి కన్నాముందు బుద్ధిజీవి.   ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం దీనికి బద్ధ వ్యతిరేకి.  ‘I exist.. therefore I think’ అంటుంది అస్తిత్వ వాదం. ఈ వాదం ప్రకారం మనిషి బుద్దిజీవికన్నా ముందుగా సృజనశీలి.  జెన్ తత్త్వం, మన  భారతీయుల భక్తి యోగాలకూ రసవాదంతోనే చుట్టరికం. హేతువు
కన్నాముందు  అనుభూతికే మనిషి ప్రాధాన్యత ఎందుకిస్తాడు?- ఇది అంతుబట్టని రహస్యం.  కానీ సృజన అంటే మాత్రం స్థూలంగా ఒక అభిప్రాయానికి రావచ్చు. శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండికలో మాదిరి కవితాత్మకంగా చెప్పాలంటే  అదొక
సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి
డాంధకార నిర్జన వీధికాంతరముల
నా చరించెడు వేళ ప్రోన్మత్త రీతి,
అవశ మొనరించు దివ్యతేజోనుభూతి’.
లేని దాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందటం, తోటివారినీ తన్మయపరచడానికి  ప్రయాస పడటం.. సృజనశీలత  కొన్ని  ప్రధాన  లక్షణాలు.
సరసియై చల్లనై నన్ను జలకమార్చె,
నందన నవ నీలతాంత కాంతస్రజమ్ము
గా నొక క్షణమ్ము నామెడ కౌగలించె’
అని మహాకవొచ్చి మొత్తుకున్నా సరే ‘ఎవరా ‘సరసి’ మహానుభావా?’ అని మాత్రమే వివరాలడుగబోతాడు శుద్ధ లౌకికుడు. లౌకికులకు ఒక పట్టాన అంతు పట్టని వింత చేష్టలింకా ఇలా చాలానే ఈ అలౌకిక ప్రాణుల్లో ఉంటుంటాయి మరి. నిశ్శబ్దం విసుగెత్తినప్పుడు  శబ్దాన్ని సృష్టించటం, శబ్దం ఎక్కువైనప్పుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం ఈ అలౌకిక లక్షణాలే. ఈ అలౌకిక మహాశయుడు శబ్దాలకేవో అర్థాలు కల్పించి కవిత్వమంటాడు. ఎక్కడా లేని ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ కనిపెట్టి నృత్యం పేరుతో సొంత లోకంలో విహరిస్తుంటాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.
అస్తిత్వ సిద్దాంతాన్ని పైపైన చూస్తే మాత్రం-  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్రమే నిర్థారించిన సత్యం.
కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలు కూడా మాని ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడెందుచేత?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడినుంచీ ముక్తి పొందటానికిలా   ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.
కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరెందు కెంత తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్చన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్లా, అనుకూల పరిస్తితుల చలవ వల్లా శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు మన సమాజంలో మన మధ్యనే  ఎప్పుడూ సంచరిస్తుంటారు’అనీ ఆయన వాదం. కాదనలేము కదా!
ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా ..సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లోలాగా బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతననెంత  మాత్రం  ప్రభావితం చేయ లేవు.  సందుఛూసుకుని మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది..చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేసినట్లు.

కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానం దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చవెచ్చని చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..
ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు
పక్షపాతపు రచనల పస నశించె
రసికులకు మీ చరిత్ర విసువు దోచె
పరువుగా నింతట బ్రబంధపురుషులార!
కదలిపొం డెటకైనను..మీకు
నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.
అలాగని లోకమంతా  ఆషాఢభూతుల బంధువులతో నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చెసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు
అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.
సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలు.. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  హేతువాదం వికాసం.  సృజనశక్తికి సాయంగా  సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత సమాంతరంగా వెలిగే ఆ కళాజ్యోతుల జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడుగా కూడా సమాజానికి సదా ఆదర్శప్రాయుడై ఉండి తీరాలని చిత్తశుద్ధితో నమ్మి ఆచరించి చూపించిన కళావైతాళికుల అడుగుజాడల్లో నడవడానికి కవులుగా మనకెవరు అడ్డొస్తున్నట్లు!

నడవడకయ నడచివచ్చితి
నడచిన నే నడచిరాను నడచెడునటులన్
నడిపింప నడవనేరను
నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’
అని కదా సృజన  బులపరింపు!
పరిసర ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నాస్వయంప్రతిభతో ఆ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేయడం,   సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవడమూట -మనలోని సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువులు. కాదంటారా?

-కర్లపాలెం హనుమంతరావు