Showing posts with label celebrations. Show all posts
Showing posts with label celebrations. Show all posts

Sunday, February 20, 2022

కవిత ఆమని అరుదెంచె .. జి.కె. సుబ్రహ్మణ్యం

 కవిత 

ఆమని అరుదెంచె .. 

జి.కెసుబ్రహ్మణ్యం 


వగరు చివురుల మెక్కి

ఎలకోయిలలు

వలపు రాగాలు ప్రకృతికి నేర్ప

చిగురుటాకుల తొడిగి 

ప్రతి తరువు పచ్చదనాలు మెరయ

విరిసిన పూలనెత్తావుల పులుముక 

రంగుపుట్టములు తొడిగి

నిన్న ఎరుగని వన్నెచిన్నలు

నేడు తొంగి చూడ

సొగసులు సౌదామినిగా 

ఆమని అరుదెంచె!


నవవత్సర అరుణోదయాన 

పుడమి పగడపు కాంతులందింప

గుబురు కొమ్మల తీవెలు పూరెమ్మలు

ప్రణయ వీచికల  తలలూప

కొమ్మక్రీగంటి చూపుల పులకింప

ప్రకృతి జగతి రసడోలికల తూగ

ఏటికొకసారి వేపపూల రుచిచూప

 వేడుకల నందింప ఆమని అరుదెంచె


మింట తారకల వెలుగు తోరణాల

తారణను స్వాగతింప

అవని హరిత వనాలు

హర్షమున ఆహ్వానింప

కవుల కలాలు అక్షరపూజ సేతు

సకల కళావిశారదగా

పొత్తుల పొదరిళ్ళ

పాలకుల వరాల వాగ్దానాలు

ప్రజకు కొత్త ఆశలు రేప 

మోడువారిన ఓటరు

బ్రతుకు పల్లవింప

కొత్త ప్రభుత

ఎన్నికల కలహంసలా

రాజహంసలా

ఆమని అరుదెంచే!

Thursday, December 23, 2021

ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక ఎన్నికల్లో ఉగాది రచన - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు ప్రచురితం - 27-03 -2009)


 


ఈనాడు - హాస్యం-  వ్యంగ్యం - గల్పిక

ఎన్నికల్లో ఉగాది 

రచన -  కర్లపాలెం హనుమంతరావు 


(ఈనాడు ప్రచురితం  - 27-03 -2009) 


'అసలే విరోధి.  ఆపై ఎన్నికల ఏడాది . అందుకే నేననేది.. 

ఈ ఉగాది ఉత్తి జగడాలమారిది' అంటూ పదోసారి పండుగ కవితలు వినిపించారు మావారు. 


ఆ సోదింకా భరించే ఓపిక లేక శ్రీవారి నాలిక్కింత ఉగాది పచ్చడి తగిలించా! అంతే, ఆ చేదుకి నోరు ఠక్కుమని మూతబడింది.


' నీతో పనికాదులే... నేరుగా జాతికే వినిపిస్తానీ కవితలు ఆవటా అంటూ పేంటూ చొక్కా వేసుకుని విసురుగా వాకౌట్ చేసేశారు.. ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక బైటికి పారిపోయే మంత్రులకి మల్లే.


ఇదిగో ఇప్పుడు అదనంగా ఎన్నికలు కూడా కలిసొచ్చాయి. కనక పండగకళలో మరింత మార్పు వచ్చేసింది. మెగాస్టార్ కోరుకొనే మార్పు ఈసారి ముందుగా ఈ కొత్త సంవత్సరం పండగలోనే కొట్టొచ్చినట్లు కనిపించేస్తుంది. చూశారా! 


పండక్కి చాలాముందు నుంచే అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలను ఉగాది పచ్చడి మాదిరి రుబ్బేస్తున్నాయి గదా! మూడు నాలుగు రోజుల బట్టి  పంచటం కూడా మొదలె ట్టేసరికి... పండగ 'మూడే' ఎలా మారిపోయిందో చూడండి!


టికెట్టొస్తే తీపి . రాకపోతే చేదు. ఎదుటివాడి కొస్తే కారం. అడిగింది రాకపోతే పులుపు . అన్ని రుచులూ పండగ ముందే రుచి చూపించేస్తుందీ ఉగాది మరి!


సంకురుమయ్య ఈసారి ఎప్పుడో సంక్రాంతి దాకా ఆగే మూడ్ లో  లేనట్లుంది ... కప్ప వాహనమెక్కి ఇప్పుడే హడావుడిగా వచ్చేస్తున్నాడు.

అందుకేనేమో ఢిల్లీ నుంచి గల్లీదాకా చోటామోటా నాయకులతో సహా అందరూ ఆ పార్టీనుంచి ఈ పార్టీలోకి .. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి దూకేస్తున్నారు. 


ఈసారి పండక్కి కవుల గోలకన్నా ముందే ఈ కప్పల  బెకబెకల గాల ఎలా మొదలయ్యాయో చూశారా!


ఎన్నికల తేదీలు ప్రకటించినప్పట్నుంచీ ఈసీ రోడ్ కొరడా పట్టుకుని కాచుక్కూర్చొనుంది. దెబ్బలు కాచుకుంటూ పబ్బం గడుపుకోవడం మన నాయకులకు తెలీని విద్యేం కాదుగానీ.. ఇలా పండగ పంచాగ శ్రవణాలమీద డేగకన్నేసి ఉండటం పాపం కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నట్లుంది ప్రభుత్వ సిబ్బందికి.


ప్రత్యక్ష ప్రసారం కూడా పరోక్ష ప్రమేయాలను  ఈజీగా తీసుకొనేట్లు లేదు ఈసీ. అభ్యర్థుల ఆదాయ వ్యయాల మీద అభ్యంతరాలుంటే పరిశీ లన తప్పదంటున్నారు సీఈసీ. మాజీ డి.జీ. పి రాజపూజ్యం మీద తీసుకున్న చర్యే దీనికి సజీవ ఉదాహరణ.


మామూలుగా సర్వజనాలకు మాదిరిగా చదివే పంతులుగారికి కాస్త మామూళ్ళు ఎక్కువగానైనా చదివించి, వచ్చే జనాలు మెచ్చేవిధంగా ఫలితాలు అనుకూ లంగా చదివించుకోవడం ఏ సర్కారైనా ఎప్పుడూ చేసే పనేగానీ.. ఈసారి ఈ వేడుక కోడ్ మూలంగా సాధ్యపడే సాధనం లేదు. అందుకేనేమో అవధానిగారు టీవీలో చాలా కాలానికి మొదటిసారి కాస్త నిజాయతీగా ఎన్నికల స్పృహ ధ్వనిస్తున్నారు. 


వరి, గోధుమలు, జొన్నలకన్నా ' ఓట్ల'కు మద్దతు ధర అధికంగా పలికే సమయం ఇది. ఉచిత హామీలు పుష్క లంగా పండుతాయి. రథాలు రోడ్ల మీదా, జనాలు రథాల కింద నలిగి ఆస్తినష్టం, ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. తగ్గేది రూపాయి ధర ఒక్కటే.  చమురు ధరలు పడిపో యినా చేతి చమురు రేట్లు యధావిధిగా పెరుగుతూనే ఉంటాయి. 


శిలా ఫలకాల వాడకం అధికమవటం చేత ఇంటి నిర్మా రాళ్ళ కరవు ఏర్పడు తుంది. జలాలు లేకపోయినా జలాశయాలు నిర్మిస్తారు. ఆర్థిక మాంద్యం వల్ల పావలా వడ్డీలు చెల్లవు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యో గాలు ఊడే పరిస్థితి ఉన్నా ఇక్కడ ఎన్నికల మూలాన జనం చేతిలో చిల్లర ఆడుతుంది. 


అందరూ మళ్ళా మరోసారి  కులమతాలను గుర్తు చేసుకునే సమయం. గ్యాసు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. పోటీలుపడి ఛానెళ్ళు నిజాలు చెబుతాయి. నీరుకన్నా బీరు అధికంగా దొరుకుతుంది. ఓట్లు తక్కువగా వచ్చినవాళ్ళకు సీట్లు ఎక్కువగా వచ్చే విచిత్ర పరిస్థితి. జొన్నపొత్తులకన్నా పార్టీల పొత్తులు ఎక్కువ. భిక్షకులు సుభిక్షంగా ఉంటారు. 


చంద్రుడు రసాధిపతి, రాజు నీరసాధిపతి. రాహుల్.... అనగానే సభలో సగం జనం లేచి నిలబడ్డారు. పంచాంగం చెప్పే పంతులుగారితో ఏదో లోపాయకారీ ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం . రాహుల్ గాంధీ తప్ప రాహు, కేతువుల ఊసే లేదు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం.. అంటూ విసురుగా నినాదాలు చేసుకుంటూ బయటకు వెళ్లిపోతున్నారు. 


పంచాంగ పఠనం సాగుతుండగానే ఉగాది పచ్చడి పంచుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది. 


మావారు కాల్ చేశారు. 'టీ.వీ.లో చూస్తున్నావా! ఉగాది పచ్చడి తినాల్సి వస్తుం దని ప్రతిపక్షాలవాళ్లు ఎలా పారిపోతున్నారో! పచ్చడి వెండి గిన్నెల్లో పెట్టి ఇస్తున్నారు. పంచాంగాల మధ్య పార్టీలు మేనిఫెస్టోలు అచ్చేశాయి. నువ్వు మాత్రం టీవీ కట్టేయద్దు. చివరిలో నా కవితాపఠనందాకా ఆగు' అంటూ...!


శాస్త్రులుగారు ఆ రణగొణ ధ్వనిలోనే తన ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. 


'రాజకీయాలలో 'మాయ' ప్రభావం అధికంగా ఉంటుంది. లోటు బడ్జెట్లకు లోటుండదు. రాష్ట్రా దాయం రెండు, వ్యయం పన్నెండు. రాజుగారి ఆదాయం పన్నెండు వ్యయం సున్నా.' 


హాలులో మిగిలిన సగం లేచి హాహాకారాలు చేశారు. ఎందుకో బయటకు పారిపోతున్నారు. క్షణంలో హాలు ఖాళీ అయిపోయింది కవులు కాగితాల కట్టతో వేదిక మీదకు ఎగబాకుతున్నారు.


మావారు మైకు పట్టుకుని ఖాళీ హాలుని చూసి ఉద్రే కంగా ఊగిపోతూ చదువుతున్నారు. 


చూశారా.. రంగు రంగుల కతలు అల్లగలరు నేతలు... 

కళ్ళు పడినా మూతలు...

ఓటరూ నీకు మిగులును పల్లకి మోతలు/' అంటూ... 


-రచన -  కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు ప్రచురితం  - 27-03 -2009) 


Tuesday, December 21, 2021

ఈనాడు - గల్పిక మేరా భారత్ మహాన్ రచన - కర్లపాలెం హనుమంతరావు ఈనాడు - ప్రచురితం - 26-10- 09


 


ఈనాడు - గల్పిక


మేరా భారత్ మహాన్


రచన - కర్లపాలెం హనుమంతరావు 

ఈనాడు - ప్రచురితం - 26-10- 09


ఏంవాయ్  వెంకటేశం, ఏంటలా టీవీకి అతుక్కుని కూర్చున్నావ్? పెరేడ్  వస్తుందా? ప్రెసిడెంట్ గారి స్పీచి వింటు న్నావా? మేడం గారు ఏ శారీ కట్టు కొస్తుందో చూసి మీ అక్కకు కొనిద్దావనే! దిస్... ఐ థింక్.. ఎండాఫా ల్ ఇండియన్ వ్యాల్యూస్.. అనగా మన భారతీయ విలువల అంతిమ దిన మన్న మాట. అంతిమదినం కాదు... గణతంత్ర దినమంటావ్... సరే.. అలాగేకానీయ్!


గంట నుంచి ఆ టీవీ చూస్తున్నావు గదా! ఏదీ, గణతంత్ర దివస్ అంటే ఏంటో వివరంగా చెప్పూ .. చూతం! సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్కా! ఆ ముక్క తెలుగువాడివి... తెలుగులో ఏడవ్వచ్చు గదా! తెలీదా... నోట్ బుక్ .తీసుకో..రాసుకో! కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రజాతంత్ర స్వతంత్ర రాజ్యం. ఇది తెలుక్కా దా? తెలివిమీరిపో యావోయ్ మై బోయ్!


సర్సరే .. వదిలేయ్... మన కంట్రీ స్పెసాలిటీస్... అనగా ప్రత్యేకతలేంటో అవన్నా తెలుసా! జనాభాలో చైనా కాక మన తర్వాతే ఇంకెవరైనా! పరెగ్జాంపుల్ ... మీ ఇంట్లోనే చూసుకో... మీ నాయనా, అమ్మా, బుచ్చెమ్మా, నువ్వూ, నీ, చెల్లెలూ, మీ మామ మైరావణుడు... ఆయన శిష్యుడు. వుపరి ఇప్పుడు నేనూ, ఒక్కింట్లోనే సెట్విన్ బస్సునిండే జనం ఉన్నామా... అందుకే థర్డువరల్డులో మనదేశందే తడాఖా ! శ్రీమాన్ ఒబామాగారు కూడా ఎప్పుడో వప్పేసుకున్నారోయ్ బాబ్జీ ! మరో తమాషా చూసావూ... ముఫ్ఫైయ్యొక్క స్టేట్లూ, ఆరువేల కులాలూ, మరో నాలుగొందలపైన ఉపకులాలూ, అందులో సగం మతాలూ, మూడు కోతులూ, ముక్కోటి దేవతలూ, పదహారొందల భాషలూ, ముప్పై మూడు పండగలు, తొమ్మిదొం దల ఆరు పార్టీలు, పార్టీకో రెండు అజెండాలు.. ఇంకో రహస్య అజెండా. . ఆఖరికి ఒక్కో ఓటుకి రెండేసి రాష్ట్రాలూ.... ఒక్కదాంట్లోనైనా మచ్చుక్కి ఏకత్వం లేకపోవటమేనోయ్ మన భిన్నత్వంలోని విచిత్రం! మన దేవుళ్ళక్కూడా మనుషులకు మల్లే మోర్ దేన్  టూ వైవ్స్ ఉండాలాయె! అటు కాశ్మీర్నుంచీ ఇటు కన్యాకుమారి దాకా ఒక్క విష యంలో మాత్రం మనవాళ్ళంతా ఘట్టిగ ఒక్కపట్టు మీద నిలబడుతున్నారోయ్ ! అదేంటంటావూ! ఆఖరికి చెప్తాగానీ... ఇప్పటికైతే మీ మామ పంచాగ ప్పొదిలో దాచిన పొగాకు పొయొకటి పట్రా... ఫో... పొయెట్రీ తన్నుకొచ్చేస్తుంది! 


నౌ బ్యాక్ టు పాయింట్! మన ప్రత్యేకతల గురించి మరో ముక్క చెప్పేదా! గుండుసున్నా కని పెట్టింది మనమేనోయ్ సన్నాసి! ఆ సంగతి సమస్తానికి  తెలియాలనే గదా జెండా మధ్య బండిచక్రంలా పెట్టి మరీ రెపరెపలాడించేస్తున్నాము! చక్రం తిప్పటంలోని చాణక్యమంతా శ్రీకృష్ణుడి నుంచీ లాగేసుకున్నారోయ్ మన లీడర్లు! 


మనరాజ్యాంగంలోని మరో చిత్రం చెప్పనా! ఇంత పెద్ద ఇండియాలో ఇంకేం లేనట్లు కాన్స్టిట్యూషన్ మొత్తం రెండొందలిరవైఐదు పేజీలూ చైనా ఇంకుతో రాయించేసారు మనసార్లు.... ఏ ఇండి యనింకో యూజు చేయచ్చుగదా!... ఊహూ... మనవాళ్ళకి మొదట్నుంచీ పరాయి సొమ్ముమీదే కదా పరమ మోజు! లేకపోతే నైరుతివైపున్న సముద్రానికి అరేబియా పేరు పెట్టుకోటమేంటోయ్! ఆగ్నేయంలో ఈవైపు నీళ్ళకు బే ఆఫ్ బెంగాలని బెంగాలువాళ్ళు పేరు పెట్టేసారు గదా! రేప్పొద్దున బెంగాలోళ్ళు... బంగలాదేశంగాళ్ళూ కొట్టుకు చేస్తారని బెంగగా వుందోయ్ ! ధరలూ, జలయజ్ఞం, అణుబాంబూ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలూ, ఆర్థిక మాంద్యం, కల్తీలూ, కరవులూ, అవినీతి, పిల్లల 

ఉద్యోగాలూడిపోవటాలూ, ప్రత్యేక రాష్ట్రాలూ, సత్యం గోలా  ఇన్ని బిలియన్స్ ఆఫ్ బర్నింగ్ ప్రాబ్లమ్సుంటే ... మళ్ళీ కొత్త తకరారులు నెత్తికి తెచ్చుకోటం తెలివైన వాళ్ళు చేసే పనేనా! .. అబ్బే.. ఈ చుట్ట అంటుకోటం లేదోయ్ .. ఇదే పెద్ద బర్నింగ్ ప్రాబ్లం అయిందోయ్ ఇప్పుడు! 


అవునూ.. మధ్యాహ్నం భోజనం సంగతేం చేశావోయ్! అహహ.. నేనంటున్నది మీ ఇంట్లో సంగతి. మన రాజశేఖర్రెడ్డిగారిది కాదు మేన్! పొలిటికల్ ఫ్లోలో  నువ్వలా పిలవటం బిట్ నేచుర లేగానీ.. ప్రెసిడెంటు స్పీచిక్కూడా నువ్విలాగే పాలిటిక్సూ గట్రా అంటగడితే చుట్ట తిరగేసి అంటించాలని అధర్వణ వేదంలోని అయిదో అధ్యాయంలో రాసి ఉంది. తస్మాత్ జాగ్రత్త! 


 ఎలక్షన్ రోజులు గదా.. ఏ జెండా చూసినా నీ పార్టీ ఫ్లాగే అనిపిస్తుందా? 'వందేమాతరం' అన్నా వంద ఏ మాత్రం అని వినిపి స్తుందా? సహజం. జెండా పోలుకి, పోలింగుకీ సౌండులో తప్ప మరిదేని లోనూ పోలికలేదన్న కామన్ సెన్సు కోల్పోతే రాజకీయాల్లో ఇంకెలా రాణి స్తావో బోధపడకుండా వుంది. పాలిటిక్స్ అంటే ఏంటనుకున్నావోయ్? ఆర్టాఫ్  నాట్ డూయింగ్ ఎనీథింగ్... అసలేమీ చేయకుండా అన్నీ చేస్తున్నట్లు బిజీగా వుండే కళ ! అంటే మీ అగ్గిరాముడి దగ్గర ఇంగ్లీషు దంచటమన్న మాట. మనం మీ అక్కయ్యకిచ్చే హామీలన్న మాట. పార్లమెంటులో ప్రత్యక్షంగా నోట్ల కట్టలు చూపెట్టినా అబ్బే... అదేం లేదని తేల్చేసారే. దటీజ్ పాలిటిక్స్ ! 


పండుగపూట ఈ కప్పల తక్కెడ తెరవటమెందుకంటావా! ఓకే. మేరా భారత్ మహాన్... అని ఏఆర్ రెహమాన్ వరసలో పాడు కుందామా! అలాగే కానీయ్... అదిగో... అల్ల దిగో టీవీలో మన ఆంధ్రా శకటం అందరికన్నా ముందొస్తుందే ఈసారీ! అన్నమయ్యను చూస్తున్నా అదేంటో రామలింగరాజే గుర్తొస్తున్నాడు ... సారీ.. మైబోయ్! 


వచ్చేసారికైనా మనం రిపబ్లిక్ డే పండగని ఇంతకన్నా ధైర్యంగా పబ్లిగ్గా జరుపుకోవాలని ఆశిద్దామా....


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26-10- 09) 


Monday, December 20, 2021

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈనాడు - గల్పిక అమ్మకు వందనం రచన- కర్లపాలెం హనుమంతరావు ( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం )


 


అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా 

ఈనాడు - గల్పిక


అమ్మకు వందనం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం ) 


ప్రేమకు తొలి చిరునామా అమ్మ! తల్లి ఒడే శిశువుకు మొదటి గుడి .. బడీ . 'మాతృదేవోభవ'  అని తైత్తరీయం సూక్తి,


ఎవ్వనిచే జనించు జగము.... అంటూ సందేహపడిన జీవుడు- పరమేశ్వరుడే ప్రాణాధారానికి మూలకారణమని సమాధానపడినా ఆ వ్యక్తి శక్తిని మాతృమూర్తిలో  సంభావించుకున్నదాకా సంతృప్తి చెందలేకపోయాడు.


ప్రపంచంలోని ఏ దేశంలోనూ... తల్లినీ, దైవాన్నీ వేర్వేరుగా చూడటం లేదు. పరివ్రాజకుడు పరమహంస కాళిని 'మాత' అని తప్ప సంభావించలేదు. గొప్ప తల్లి లేనిదే గొప్ప బిడ్డ ఉండే అవకాశం లేదు. అవతారపురుషుడు శ్రీరామ చంద్రుడిని  ' కౌసల్యా సుప్రజా రాముడ'ని విశ్వామిత్రుని వంటి జ్ఞాని సంబోధించడం వెనక ధర్మమర్మమిదే!


భక్తుల కోసం భగవంతుడు ఎత్తిన అవతారాలు పది. పిల్లలకోసం తల్లి ఎత్తే అవతారాలు కోకొల్లలు. బిడ్డకు అమ్మ నడిచే ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్.  లోకంలోని నవ రత్నాలు, మణిమాణిక్యాల పోగునొకవైపు పేగుబంధాన్ని మరో వైపు ఉంచి ఒక్కదాన్నే ఎంచుకోమంటే ఏ తల్లయినా మొగ్గు చూపేది తన కడుపుపంట వైపే !


ఏటికేడు ప్రపంచ వింతలు మారిపో వచ్చు - కానీ తల్లి ప్రేమ మాత్రం సృష్టి ఉన్నంతవరకూ చెక్కు చెదరకుండా సాగే అద్భుతం. భువనభాండాలను చిన్ని నోట చూపిన కృష్ణమాయ సైతం యశోదమ్మ పుత్ర వాత్సల్యం ముందు తన్మయత్వంలో తేలిపోయింది. త్రిలోక పాలకులను చంటి పాపలుగా మార్చిన అనసూయ అమ్మ కథ సర్వలోక విదితం. తను కన్న బిడ్డనే ' ననుకన్న తండ్రీ! నా పాలి దైవమా!' అని పలవరించేదాకా వామనుడి తల్లి ప్రేమ పొంగులు వారిందంటే వింతేముంది? అగాధాల అడుగులనైనా తడిమి చూడగలమేమోగాని అమ్మ ఆత్మీయానురాగాలకు పరిధులు వెదకడం ఎవరి తరం? మైత్రీధర్మాన్ని బుద్ధ భగవానుడు తల్లిప్రేమతో పోల్చి చెప్పింది ఎల్లలెరగక పారే ఆ వైశాల్యం  వల్లే! తల్లిలేని పాప రెప్పలేని కంటిపాప.  పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో అమ్మలేని ఆదిదే

వుడి దయనీయస్థితిని బెజ్జమహాదేవి ద్వారా కళ్ళకు కట్టించాడు. ' తల్లి గల్గిన పేల తపసిగానిచ్చు / తల్లి కల్గిన ఏల తలజడల్గట్టు? / తల్లియున్న విషంబు ద్రావనేలనిచ్చు/- అంటూ సాంబయ్యనే తన సంతుగా భావించి ఆ పిచ్చి తల్లి తల్లడిల్లిపోయింది. అమ్మ విషయంలో మనిషి దేవుడికన్నా అదృష్ట జాతకుడనే చెప్పాలి. అందుకేనేమో 'అమ్మ ఒక వైపు... దేవతలంతా ఒకవైపు ఉన్నప్పటికి  తాను అమ్మ వైపే మొగ్గుతానని ఓ కవి తన భావోద్వేగాలను చాటుకున్నారు. అమ్మతనంలోని కమ్మదనానికి నిలు వెత్తు ధనాలూ దిగదుడుపే. 'శివరాత్రి యాత్రకై శ్రీశై లమెడుతుంటే/ అమ్మమ్మ మారుపడ అమ్మ ఏడుస్తుం టె/ అదిచూచి నవ్వానురా దైవమా, అనుభవిస్తున్నా నురా!' అని కన్నతల్లి మీద గత శతాబ్దారంభంలోనే ఓ కవి స్మృతిగీతం ఆలపించాడు . 'అరువది యేండ్లు నాదగు శిరోగ్రమునెక్కిన తల్లి కంటికిన్/ జిరతను గాకపోనియది.. విచిత్రము' అంటూ జాషువా వంటి కవికోకిల గళమెత్తి మాతృస్తోత్రం చేశాడంటే ఆ మహాత్మ్య మంతా మాతృత్వా నిదే.  తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి తల తెగనరికినా, ఆ తల్లే తిరిగి సజీవంగా రావాలని భార్గవ రాముడంతటి అవతారమూర్తి కోరుకున్నాడు.  మాతృమూర్తిత్వంలో అంత  ఉదాత్తత ఉంది. 


సృష్టిలో అతిపెద్ద ఉద్యోగం అమ్మగిరీ! తరగని పిల్లల ప్రేమానురాగాలే ఆమెకు జీతభత్యాలు. ' పిల్లల్ని పెంచడంకన్నా సర్కస్ కంపెనీ నడపటం సులభం' అంటాడో రచయిత. నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి పోషించిన బిడ్డ ఈ లోకం నుంచి అర్ధాంతరంగా తప్పుకొంటే తల్లిగుండె ఎంతగా తల్లడిల్లుతుందో చెప్పనలవి కాదు. 'కన్నబిడ్డ ఒంటిమీదేకాదు, ఆత్మమీద కూడా సంపూర్ణాధికారం జన్మదాతదే' అన్నారు శంకరాచార్యులు. సన్యాసం పుచ్చుకునేముందు తల్లి అనుమతి తప్పనిసరి అని చెబుతుంది శాస్త్రం.


ఏ బాధకలిగినా అమ్మను తలచుకుని ఉపశమనం పొందే బిడ్డకు- ఆ తల్లికే బాధ కలి గించే హక్కు ఎక్కడిది ? తన కడుపు నలుసు లోకం కంటిలో నలుసుగా సలుపుతుంటే ఏ తల్లి మనసూ ప్రశాంతంగా ఉండదు. పెరుగు తున్న వ్యాపార సంస్కృతిలో అమ్మడానికీ, కొన డానికి ఈ భూమ్మీద ఇంకా అతీతంగా ఏదైనా ఉన్నదంటే , అది అమ్మ ప్రేమ మాత్రమే ! 


అమ్మ పట్ల క్రమంగా పెరుగుతున్న నిరాదరణ మానవతకే మాయని మచ్చ.  ఇప్పుడు పెరగవలసింది వృద్ధాశ్రమాల సంఖ్య కాదు. వృద్ధులైన తల్లిదం డ్రులమీద బిడ్డల శ్రద్ధ.  పూలు, పున్నములు, సూర్యోదయాలు, ఇంద్రధనుస్సులు- సృష్టిలోని అందమైన వస్తువులన్నీ సముదాయాలుగానే లభ్యమవుతాయి. ఒక్క అమ్మ మాత్రమే మినహాయింపు. 


ప్రేమకు తొలి చిరునామానే కాదు, చిట్టచివరి చిరునామా సైతం అమ్మే! అంతరించిపోయే జాతుల జాబితాలోకి అమ్మ చేరిపోకుండా జాగ్రత్తపడవలసిన అగత్యాన్ని గుర్తించాలి నేటితరం . 


ఏటా జరుపుకునే అంతర్జాతీయ మాతృ దినోత్సవాలైనా  ఆ సత్సంకల్పానికి ప్రేరణ కలిగిస్తే అమ్మ జన్మకు అంతకుమించిన సార్ధక్యం ఏముంటుంది?


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం ) 

Sunday, December 19, 2021

ఈనాడు - గల్పిక గురువు - లఘువు కాదు ; కారాదు! - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 )


 


ఈనాడు - గల్పిక 

గురువు - లఘువు కాదు ; కారాదు! 

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 ) 



'గురువు, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటారు షిర్డీ సాయి బాబా యుద్ధరంగం మధ్య విషాదయోగంలో పడ్డ అర్జునుడికి సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైత బోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు


రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి.  శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది.  అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే.  కాబట్టే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్ధన తరువాత ' స్వస్తినో బృహస్పతి ర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనిషి ఎలాగవుతాడు? అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన. గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు సమాజంలో గురుస్థానం అంతటి ఘనతరమైనది.  కనుకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నది.


గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.  ఔరంగజేబు కూడా చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును చక్రవర్తి అయిన తరువాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్ ఏథెన్స్ ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్ లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురుపు కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.


మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క.  ఇంటివరకూ తల్లే అదిగురువు.  తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు.  కాబట్టే గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే. మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కులు పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులకు  అప్పగిం చాడు . పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు బిడ్డలు విద్యాగంధంలేక అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉన్నారని  వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటా నికి సాగనంపింది.


నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవి కావు. వేదాధ్య యనం తరువాత పరీక్షలు. నింబ, సారస మనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం.  సామవేదం  సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లించడం  పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు.  నింబ పరీక్ష మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి.  అది నారస పరీక్ష.  గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది. 


మన పురాణాలు, ఉపని షత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురు ప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు ' ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు. ఒకసారి చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహా ప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందు కయ్యా' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు- అని విన్నవించుకున్నాడుట . రాజు గారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రో జుల్లో గురువుకిచ్చిన విలువ!


దేవతలకూ గురువున్నాడు .. బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు . మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 


 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు.  ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఉంది . . భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటే గాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం  పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా శిష్యుడిని వారించే నిమిత్తం అడ్డుపడి కన్నుపోగొట్టుకున్న గొప్ప గురువు శుక్రాచార్యుడు.


గురు శబ్దం  అంత గొప్పది.  కనుకనే  మన మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపేవారు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా? ' అని అడి గితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. 


అటువంటి  గురువుకి నేటి మన సినిమాలలో  పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు. గుండ్రాయే.  మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రామే  నిజమైన గురువు .  తాను అనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ కుర్చీలో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.


గురువులు అష్టవిధాలు . అక్షరాభ్యాసం చేయించిన వాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయంచినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాలను  నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించే వాడు - అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టిం చుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డ కీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది,  యాచ కలకిచ్చినా రవంత తరగనిది-  గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 ) 

Tuesday, December 14, 2021

గల్పిక - ఈనాడు ఆచార్యదేవోభవ! నేడు ఉపాధ్యాయ దినోత్సవం - రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)

గల్పిక - ఈనాడు 


ఆచార్యదేవోభవ! 

 నేడు ఉపాధ్యాయ దినోత్సవం

- రచన: కర్లపాలెం హనుమంతరావు

 ( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)



' గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా.  

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. 

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. 

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. 

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు, 

గాయత్రి ఉపదేశించినవాడు, 

వేదాధ్యయనం చేయించినవాడు, 

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, 

పురోగతి కోరేవాడు, 

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు, 

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, 

మోక్షమార్గాన్ని చూపించేవాడు 

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. 

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది. 


- రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)


Sunday, December 12, 2021

చదువులయ్య చలవదినం -కర్లపాలెం హనుమంతరావు (ఒకనాటి ఈనాడు సంపాదకీయం)

 చదువులయ్య చలవదినం

-కర్లపాలెం హనుమంతరావు
(ఒకనాటి ఈనాడు సంపాదకీయం)
సమీపంలో ఉన్నప్పుడే తల్లి పోషించగలిగేది. సాన్నిహిత్యంలోనే తండ్రైనా హితాహితాలు బోధించగలిగేది. మధురవాక్కులతో సాంత్వన కలిగించేందుకు స్వీయకాంతకైనా సామీప్యం అవసరం. ఎంత మంచిమిత్రునికైనా 'చింతాలత చ్చేదన' సమక్షంలో ఉన్నక్షణాలలోనే కదా సాధ్యం! భోజరాజప్రబంధంలో చెప్పినట్లు 'కల్పలతాఖ్య అయిన విద్య ఒక్కటే ప్రత్యక్ష.. పరోక్షాలలో సర్వవిధాలా అదుకునే నిధి'. చర్చక్షువును మించిన ఆ మనోనేత్రం- విద్యనందించే ఉపాధ్యాయుడు. భారతీయ సంస్కృతి ఒజ్జను ప్రత్యక్షదైవంగా సంభావించింది. 'నాస్తి మాతృసమో గురుః' అని పంచమవేదం సైతం గురువును తల్లితో సమానంగా గౌరవించింది. 'తమ కటాక్షము బల్లిదపు కుంచెకోల యావైకుంఠనగర కవాటములకు' అంటూ ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడయ్య చేసిన గురుస్తుతి లోకంలోని అయ్యవార్లందరికీ వర్తించే ప్రస్తుతి. ఎందరో విద్వాంసుల ముందర శ్రీ గురుబ్రహ్మగా వందనాలు అందుకున్న చెళ్లపిళ్ళవారూ 'కథలు-గాథలు' గ్రంథంలో తమకు విద్యనందించిన జ్ఞానసింధువులందరిని 'గురుపరంపర' పేర పేరుపేరునా సంస్మరించుకున్న వైనం మననీయం. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపుడు, కురుపాండవులకు ద్రోణాచార్యులు.. మౌర్యపుత్రుడికి విష్ణుగుప్తుడు, అలెగ్జాండరుకి అరిస్టాటిల్, ఆ అరిస్టాటిలుకు ప్లేటో ఆచార్యవర్యులు. గురుపాత్రలేని శిష్యుల చరిత్ర ప్రపంచం మొత్తం గాలించినా ఏ మొత్తలోనూ కనిపించదు. గురుప్రమేయం గిట్టని నవక్రీతుడు జపతపాలతో సాధించిన నడమంత్రపు విద్య సైకతనిర్మాణ సమయాన వట్టిపోయిన కథ భారతంలో ఉండనే ఉంది. 'విద్యాయుక్త వివేకసారథికి అమర్చబడి సిద్ధంగా ఉన్న అశ్వరాజం గురుహృదయం' అని కదా కఠోపనిషత్ వాక్కు!
సాహిత్యం, శాస్త్రం, కళ.. దేశీయవిద్యలన్నింటిలో సర్వకళాపారంగతులు ఒకనాటి మన గురువులు. గురుశుశ్రూష.. బ్రహ్మచర్యనిష్ఠ.. కౌమారదశ నిండే వరకు జ్ఞానార్జనలు మాత్రమే శిష్యుల వ్యాపకాలుగా సాగిన ఉత్తమ గురుకులవ్యవస్థ ఆ నాటిది. ఇప్పటి విడ్డూరపు చదువులు కావారోజులవి. 'బెంచీ లక్కఱలేదు గేమ్సు మొదలౌ ఫీజుల్ వినన్ రాదు పొ/మ్మంచున్ నిర్ధను ద్రోచిపుచ్చరు గురుల్/ప్యాసైననే లాభమిం/చంచున్ నేమము లేదు మీచదువు నందు' అంటో ప్రాచీన గురుశిష్య పద్ధతులను ప్రస్తుతించారు తిరుపతి వేంకట కవులు. ఆధునీకరణ మిషతో మనం కోలుపోతున్న మానవీయ విలువలేమిటో తెలుసుకోవటానికి ఆ పద్యాలు చాలు. ముఖ్యంగా ఉత్తమజాతి ఉపాధ్యాయవర్గం. 'శుచి యౌవేషము శుద్ధమౌ మతము సంశుద్ధంబు దేహంబ ని/ర్వచనీయం బగు పాండితీగరిమ ద్రవ్యంబంద నాసక్తి పూ/ ర్వచరిత్రంబులయందు భక్తియును చాత్రశ్రేణిపై రక్తి గ/ల్గు'.. అన్నారు గురువుకు ఆహార్య విషయంగా కూడా ఉండవలసిన శ్రద్ధాదులను గురించి హెచ్చరిస్తూ ప్రాచీనులు. చతుర్వేదులైన ఆ అచార్యదేవుళ్ళను ఇప్పుడు తలుచుకున్నా రెండు చేతులూ ఎత్తి నిండుమనసుతో నమస్కరించ బుద్దవుతుంది. వదాన్యులైన ధనవంతుల ఆదరాభిమానాలతో వికాసమానంగా నడిచిన ఒకనాటి ఆ విజ్ఞానకేంద్రాల నడత ఎక్కడ? విద్య వంకతో వంకరటింకర పోకడలు పోతోన్న నేటి వ్యాపారకేంద్రాల వంకర నడకలెక్కడ! పాలకుండకి కల్లుకుండకి మధ్య పోలికా! ఆచార్య మామిడిపూడి వేంకట రంగయ్యగారు ఓ సందర్భంలో అంటారూ 'ఇప్పుడు నడుస్తున్న బళ్ళన్నీ వట్టి 'కడుపుకూటి' చావళ్ళు'. అని. మల్లంపల్లి సోమశేఖరశర్మ 'మన ప్రాచీన విద్యాసంస్థలు' అనే వ్యాసంలో వర్ణించిన ఆ పురావిద్యావైభోగమంతా ప్రస్తుతం కేవలం సంస్మరణకు మాత్రమే మిగిలుండిపోయిన సుసాంప్రదాయ విచారధార. విచారకరం. విషాదకరం కూడా.
విద్యాసంస్కరణల ఆవశ్యకత మీద అందరిదీ ఒకే అభిప్రాయం. విధానాల వద్దే వైరుధ్యమంతా. విద్యాలయానికి పునాది ఉపాధ్యాయుడు. శిఖరం విద్యార్థి. ఆ ముఖ్యులిద్దరిని విశ్వాసంలోకి తీసుకోని ఏ సంస్కరణ అయినా నీరులేని నూతిలో వేసే చేద బాపతే. జ్ఞానక్షేత్రంలోని విద్యార్థి బీజం ఆయురారోగ్యాభివృద్ధికి ఆచార్యవర్యుడేగదా బాహిర్ప్రాణం! నియతి, పాండిత్యం, బోధనాశక్తి- ఏ అయ్యవారికైనా ఉండవలసిన మొదటి మూడు ముఖ్యలక్షణాలన్నదీ అందుకే. నీతి అందరికీ అవసరమే. గురువులకి మరీ అవసరం. వృత్తి చేతే కాదు ప్రవృత్తి రీత్యా ఒజ్జ రుషితుల్యుడైతేనే విద్యార్థివర్గం నుంచి మన్నన దక్కేది. జూదం, వ్యసనాలు, రాజకీయ జోక్యాలు, లాలస, లైంగిక నిర్వాకాలు దైవసమానులైన ఉపాధ్యాయుల నుంచీ సమాజం అసలు సహించదు. కేవలం పోటీపరీక్షలు దాటుకొచ్చిన సజ్జంతా ఒజ్జలవర్గంలో దూరటమే నేటి విద్యావ్యవస్థ మౌలిక దురవస్థ. ఐదారేళ్ళ దీక్షతో గానీ ఒక వైద్యుడు పుట్టుకు రాడు. నాలుగైదేళ్ళ నైపుణ్యంతోగానీ ఒక నిర్మాణ నిపుణుడు తయారు కాడు. దేహంకన్నా.. భవనంకన్నా చవకైనదనా ఒక పసివాడి భవితవ్యం! రెండేళ్ళ మొక్కుబడి శిక్షణతో బడిపంతులు ముద్రవేసి భావిపౌరుల జీవనశకటాలకు చోదకులుగా తోలెయ్యడం! సంస్కృతీ సంప్రదాయలపైన అభిమానం, స్వజాతి సంక్షేమం మీద ఆదరం, బతుకుపట్ల.. భావిమీద సానుకూల దృక్పథం, మంచిచెడులను ఎంచి తూచి, మేలువైపుకే మొగ్గు చూపించే బుద్ధి.. కరవైన గురువులు మకిలినీటి దొరువులు. సంఘానికి వారు చేసే చెరుపు అణువిచ్చిత్తికి మించి ఎన్నో రెట్లు ప్రమాదకరం. చిలకమర్తివారు ప్రహసన గణపతి ద్వారా చేసే హెచ్చరిక ఇదే. పెడచెవిన పెడితే పెనుగాడి పొయ్యిలో పడి మాడేది మన బిడ్డల భవితవ్యమే. పాశ్చాత్యులు ఇక్ష్వాకులనాడే విసర్జించిన విఫల పథకాల చూరులు పట్టుకునేనా ఇంకా ఈ అధునాతన శతాబ్దంలోనూ మన గబ్బిల విన్యాసాలు! గురువంటే కన్యాశుల్కం మార్కు సిగారు గీరీశాలు కాదు. శిష్యులతో చిడప్పొక్కులు గోకించుకునే కరటకశాస్త్రులూ కాదు. గుర్రానికి కళ్ళెం. భాద్రపదానికి ముందొచ్చే శ్రావణం. మైత్రావరుణులబంధం గురుశిష్య సంబంధం. బతకలేక బడిపంతులు ..కాదు. బడిపంతులు లేక బతుకులేదు. ఏటా వచ్చేది ఉపాధ్యాయదినం. ఏదో మొక్కుబడి ముక్కు చివరి స్తుతులు చాలవు. ఏడాది పొడుగూతా సాగేవీ చదువు సాములు. చదువులయ్య పాత్ర చల్లంగా సాగే కార్యాచరణ సత్వరమే అరంభించటం సమాజానికి క్షేమకరం.
-కర్లపాలెం హనుమంతరావు
(ఒక నాటి ఈనాడు సంపాదకీయం)

Saturday, December 11, 2021

ఈనాడు - గల్పిక అమ్మా .. నాన్నా రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురణ - 26-01-2009)

 





మనిషి భూమ్మీద  పడక ముందే దేవుడు రెండు అవతారాలెత్తి సిద్ధంగా ఉంటాడట..  ఒకటి అమ్మ.. రెండు నాన్న. 


అమ్మ తోలపాట అయితే, నాన్న నీతి కథ . వెరసి, ఇద్దరూ ఒక పెద్దబాలశిక్ష . 


తల్లిదండ్రుల ప్రేమ ఊటబావి లోని నీటిపాయలాంటిది.  ఎప్పుడూ మన జీవితాలని  చెమ్మగానే ఉంచుతుందది .


బిడ్డ కడుపునిండితే తల్లికి త్రేనుపొస్తుంది. కొడుకు ఘన కార్యానికి ముందుగా పొంగేది తండ్రి ఛాతీనే:


తల్లిదండ్రుల ప్రేమలోని మాధుర్యానికి ద్రాక్ష నల్లబడి పోయింది. చక్కెర రాయిలాగా మారిపోయింది. అమృతం చిన్నబోయి స్వర్గానికి పారిపోయిందని ఓ కవి చమత్కారం. 


భూమ్మీద పడగానే బిడ్డ ముందుగా చూసేది అమ్మనే . ముందుగా పలికేది అమ్మ అనే శబ్దాన్నే.  ఆ అమ్మ చూపించే నాన్నే క్రమంగా ఆ బిడ్డకు అన్నీ అయిపోతాడు. 


 'నాన్న' అన్న పిలుపులోనే 'నా' అన్న భావం దాగుంది కదా ! అమ్మ ఒడి గుడి అయితే, నాన్న ఒడి బడి. మనం ఎదగటానికి ముందుగా కొలమానంగా భావించేది. ముందున్న అమ్మా నాన్న వ్యక్తిత్వాలనే గదా! 


సంతానంకోసం సంతోషన్నంతా వదులుకొని కారాగారంలో యౌవనం వృథాచేసుకున్న దేవకీ వసుదేవుల కథ మనకు తెలుసు. కాకైనా , కోకిల అయినా  బిడ్డలను గాంధారీ దృతరాష్ట్రుడిలా గుడ్డిగా ప్రేమించటమే తల్లిదండ్రులకు తెలిసిన విద్య.  


వినాయకుని రూపాన్ని గేలి చేసినందుకు చందమామకు పార్వతమ్మ శాపనార్థాలు పెట్టింది! పుత్రవియోగం తట్టుకునే శక్తి చాలక  దశరథ మహారాజు ప్రాణాలు చాలించాడు . 


బిడ్డకోసం బిడ్డనే  మూపున కట్టుకుని కదనరంగంలో కత్తి    ఝళిపించింది  ఝాన్సీరాణి !  లోకం, కాలం, ఏదైనాసరే- తల్లిదండ్రుల లోకం మాత్రం పిల్లలచుట్టూనే ప్రదక్షిణచేస్తుంది. . 

ఈ ప్రేమాకర్షణ శక్తి ప్రభావం ఏ విజ్ఞానశాస్త్ర సూత్రానికి అందనంత విచిత్రమైనది. 


సంతానం తమకన్నా మిన్నవారు కావాలని పగలు కూడా కలలు కనేవారు కన్నవారు . తమ ప్రాణాలను సైతం తృణప్రా యంగా సంతానం కోసం ఇవ్వటానికి సదా సల సిద్ధంగా  ఉండేవాళ్ళలో అందరికన్నా ముందువరసలో ఉండేది అమ్మానాన్నలే. 


పిల్లకాయలంటే తల్లిదండ్రులకు కళ్ళముందు తిరిగే తమ గుండెకాయలు. మనకోసం గాలిమేడలు కట్టేయటమే కాదు .. క్రమం తప్పకుండా వాటి దుమ్మూ ధూళీ కూడా దులిపే పనిలో నిమగ్న మై ఉంటారు. మనమూ నాన్నలమైనదాకా మన వారంటే ఏమిటో అర్థం కాదు. అందుకే అనేది.. ఎన్ని తరాలు గడిచినా అ అంటే 'అమ్మా' అని అంటేనే ఏ జాతైనా నిలబడేదని.  నాన్న చెప్పులో కాళ్ళు పెట్టుకుని చిన్నతనంలో నడిచినవాడు నాన్న అడుగుజాడల్లో పెద్దయిన తరువాత కూడా నడవ టానికి చిన్నతనం అనుకోరాదని. 


అమ్మ పేగు ఇస్తే . . నాన్న పేరు ఇస్తాడు. పేగు తెంచు కుని పుట్టిన బిడ్డ తమ పేరు నిలబెట్టాలని ఏ తల్లితండ్రులు  కోరుకోరు ? తమ సర్వస్వాన్నీ ఇచ్చి బదులుగా మరేమీ  కోరని  పిచ్చి అమ్మానాన్నలు తప్ప రీ  వ్యాపార ప్రపంచంలో పాపం, ఇంకెవ కుంటారు?


మబ్బులు కమ్మిన ప్పుడు సూర్యుడు, డబ్బులేనప్పుడు బంధువులు, అధికారం పోయినప్పుడు లోకులు, శక్తి తగ్గినప్పుడు సంతానం చులకన చేయవచ్చు.. కానీ, ఉన్నప్పుడూ లేనప్పుడూ  కూడా ఒకేలాగా  ఉండేగలిగే వాళ్లు  మాత్రం జన్మనిచ్చిన అమ్మానాన్నలే! 


హిమాలయాలు దేశానికి ఉత్తరానే ఉన్నాయి. ఎత్తులో వాటిని మించిన ప్రేమాలయాలు ప్రతి ఇంట్లోనూ అమ్మా నాన్నల రూపాల్లో ఉన్నాయి. వాళ్ళ అనురాగం అరేబియా సముద్రంకన్నా విశాలమైనది . బంగాళాఖాతమైనా   లోతులో చాలా చిన్నది  . హిందూ మహాసముద్రం కన్నవారి ప్రేమాభి మానాలముందు పిల్లకాలువే సుమా! 


ఈ గజిబిజీ జీవితంనుంచీ ఎప్పుడైనా విరామం దొరికినప్పుడు నువ్వు పుట్టిన ఊరుకు వెళ్ళు. నువ్వు కోతీకొమ్మచ్చి ,  దాగుడుమూతలాడుకున్న ఆ ఇంటి ఆరుబయట మంచం వేసుకుని ఒంటరిగా పడుకో. 


 ఆకాశంలో అమ్మ నీకు గోరుముద్దలు తినిపిస్తూ రారమ్మని పిలిచిన ఆ చందమామను పలకరించు. మీ అమ్మ నీకోసం ఎన్ని కమ్మని కబుర్లు , కథలు చెప్పేదో గుర్తుచేస్తాడు. వెన్నెల్లో మీ నాన్న నిన్ను మోకాళ్ళమీద కు ఎత్తుకొని ఎంత సరదాగా గుర్రమాట ఆడేవాడో చెబుతాడు. అయినదానికి కానిదానికి మీ అమ్మ నీకు తీసే దిష్టి. . కానిదానికి అయినదానికి మీ నాన్న నీకోసం పడే హడావుడి .. మళ్ళా గుర్తుకొస్తే కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు.


అనగనగా ఓ అమ్మ.  ఆ అమ్మకు బుడి బుడి అడుగులు బుడతడు. గడపదాటి పోకుండా ఆ గడుగ్గాయి నడుముకి  తన చీరె కొంగు ముడి వేసుకుని పనిపాటలు చూసుకునేది అమ్మ . 


పాపాయిదిప్పపుడు పాకే వయసు.  బైట కనబడే చెట్టూ చేమా, పుట్టా గుట్టా రారమ్మని బుడతడినిప్పుడు తెగ ఊరిస్తున్నాయి. బుడ్డితండ్రి కి తల్లి కొంగు బంధనమయింది ! 


ఆ రోజు బ్రహ్మాండంగా వాన కురిసి వెలిసింది.  తూర్పుదిక్కున  కొండ కొమ్మున  ఏడు రంగుల ఇంద్రధనుసు  విరిసింది. పాపాయిని రారమ్మ ని పిలిచింది.  తల్లి గాఢనిద్రలో ఉన్న . సందు చూసుకుని బుడతడు చీరకొంగు అడ్డు తొలగించుకుని   కొండ కొమ్ము కేసి   పాకసాగాడు . వెనక నుంచీ తోకలా  అమ్మ చీరె కొంగు ముడి   . ఇంద్రచాపమెక్కి జారాలని బిడ్డడి హడావుడి  . ఆ తొందరలో  పసిబాలుడు కాలు జారి పాచిబండ సందునుండి  కింది నీటి సుడిగుండంలో  పడబోతున్నాడు. . జారిపడే భడవాయిని   చివరి గడియన   కాపాడింది అమ్మ నడుముకు చీరె చుట్టి  గట్టిగా వేసిన ... ముడి ! రెండు బండల సందున పడి  అమ్మచీరె కొంగుముడి బాలుడిని అలా కాపాడింది ! 


 అదే బుడతడు మరికాస్త ఎదిగాడు ఇప్పుడు . నాన్నతో ఆరుబయట పడుకుని ఉన్నప్పుడు ' నాన్నా! మనం పేద వాళ్లమా? 'అనడిగాడు. తండ్రి అగి ఆలోచించి ' కన్నా! మనం అందరికన్నా ధనవంతులం . అదిగో ఆకాశంలో కనిపిస్తుందే ఆ చందమామ..అచ్చంగా మనదే. అందులోని నిధులు నిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు. 'అయితే మరి నాకు సైకిలు కొనొచ్చుగా?' అనడిగాడు బుడతడు . 'పెద్దయిన తరువాత నీకు  రైలు కొనిద్దామని ఆగా .  ఇప్పుడే తెచ్చుకుంటే అప్పటికి  చాలవుగదా!' అన్నాడు నాన్న . ' అయితే నేను కూడా నీకు లాగే ఆఫీసు కెళ్లి డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు కొడుకు . 'మరి . . ఆఫీసు  పనికి  మంచి చదువు కావాలి. అందుకు బడికి ఎగనామం పెట్టకుండా పోవాలి' అన్నాడు తండ్రి. 


 పిల్లవాడు క్రమం తప్పకుండా బడికెళ్లి చదువుకుని ఓ ఉద్యోగంలో కుదురుకున్నాడు. పెళ్లయి ఓ బాబు పుట్టి పెరిగిన తరువాత ఓ రోజు అలాగే డాబామీద ఆరుబయట పడుకున్నాడు. పక్కనే  పక్కలో ని కొడుకు 'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా' అని ఆడిగేసరికి- ఆకాశంలోని చందమామ నవ్వుతున్నట్లనిపించింది.  నాటి తండ్రి ముఖం తలపుకొచ్చి  నేటి తండ్రి కళ్లలో  తడి కనిపించింది. 

 నిండుమనసుతో రెండు చేతులూ జోడించి మనస్సులోనే నమస్కారం చేసుకున్నాడు. ఒక చేయి అమ్మ చీరె కొంగు ముడికి. మరో చేయి తండ్రి ఇచ్చిన  రైలు బండికి .  


కన్నవారి తీయని తలుపులకు ఈ అంతర్జాతీయ అమ్మానాన్నల దినోత్సవాలే కావాలా? 


పేరెంట్స్ నీడ్ అవర్ ప్రెజన్స్... నాట్ అవర్ ప్రెజెంట్స్! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురణ - 26-01-2009) 

Saturday, December 4, 2021

గల్పిక: ముద్దూ ముచ్చట - కర్లపాలెం హనుమంతరావు

' ప్రకృతి వరం- జీవితం.జీవితం వరం- ప్రేమ . ప్రేమ వరం- ముద్దు' అంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశికల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/అత్యున్నతంబైన యవనీధ రానీక, మంబోధ పటలి ముద్దాడుచుండె..' అంటో ముద్దుకుఅచేతనాలే మురుసి పోతుంటేమనిషి చిత్తవృత్తినిగురించి మరిక చెప్పేదిఏముంది?' అవును.. ఒకపార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటిక, కదళీ ఫలం, ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసం, దివ్యామృతం, అలరుతేనెల ధార, చెరుకు రసాల చవులు దేనిలోనూలేనిదీ ముద్దులోపలి తీపి. వట్టి రుచేనా.. మనసుముడతలను సరి చేసేదీ ఈపెదాల ముడితడే. పెదవి పెదవి కలిసాయంటేసగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతిమమ మానసం, దేహి ముఖకమల మధుపానం' అంటూప్రియనాయిక మధురాధరాల కోసంవూరికే ఆరాటపడతాడా జయదేవుడిఅష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండగొల్లభామా! ఒక్క/ చిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!' అని నల్లనయ్యనే గొల్లభామవెంట పరుగులెత్తించి అల్లరిపెట్టింది ఈ అధరవల్లరి.'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగమేనికి వింత మైకమ్ము గ్రమ్ము/చిత్తమున కేదో యున్మాదమత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడునవసరమున.' అదీ మధురాధర సంగమావస్థమదనావస్థ. మదనతాపానికి ప్రథమ చికత్స ప్రియముఖకమల మధువు ఆస్వాదనమే. ఆఔషధ సేవనం'సురగణాధీశ దుర్లభసుఖమొసంగు, అగణితాత్మ వ్యథాభార మణచివేయు/ భీష్మసదయప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించికలవరించని వారుఅసలు యవ్వనులేకారు.
నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదు? గోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరే, మనసును కోఱే ఆ 'ఛీ పాడు' ముద్దుతోనే అసలు పేచీ. తలుపు చాటునో, పెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తి, దొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళ' అన్నారు కవి దాశరథి.వెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాల, బుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలి, ముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షి, నిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానం. చేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం. చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే. చెవుల దొప్పలు, ముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే.
మనిషి పెదాలు మాత్రమే ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడి. మనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ అధర ముఖద్వారాలనుంచే. సిగ్గు, బిడియం, కామన, సంశయం, భయం, అసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవ పెదవి చివరి భాగాలే. ముద్దులాడుకునే వేళ 'డోపమిన్' అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడం, నిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్' అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది.'న్యూరోట్రాన్స్ మీటర్స్' మెదడులోఉత్పన్నమై గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుంది. మనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలు. నిముషం ముద్దుకు 20 కేలరీలు ఖర్చు. ముద్దుకో శాస్త్రమూ కద్దు. పేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరం. వ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాం' కొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు అంటువ్యాధి కారక క్రిములు. అయినా ముద్దంటే చేదెవరికి? చంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూ, ధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం. నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహ. ముద్దు ఆలోచన ముందు రోమనులదే అని ఒక వాదం. భారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ. ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలు. వారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం. అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందని, పెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని 'డెయిలీ ఎక్స్‌వూపెస్' బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే సారాంశం. సంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవు, నీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవు, నాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండు, త్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారు, స్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరి. వద్దనుకుంటే ఎలా?

- కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ.ఎస్.ఎ 

( సిలికాంధ్రవారి సాహిత్య అంతర్జాలి పొదరిల్లు - సుజనరంజని - ఫిబ్రవరి 2015 లో ప్రచురితం ) 


 


Saturday, June 19, 2021

నవ్వు అరవై విధాల మేలు -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

 



 

హాసం పరమేశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' అన్న ఆదిదేవుని  సంస్తుతే ఇందుకు ఒక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయలు వెన్నెలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా సాగుతోంది.. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి పెదవులపై చిరుదరహాసాలు! ఎవరికి వారుగా ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం.. తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఇక్కడి ఉదహృతానికి సంబంధించిన ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసురవధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటాడు పోతన. భామ మందహాసం అదే. హరిని, అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం  ఏ భావంతో తేరిపార చూశాడో.. నీలాపనిందల పాలయ్యాడు చవితి చంద్రుడు. హాసానికి, పరిహాసానికి మధ్య ఉండే పలుచని మేలితెర మూలకంగానే భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాలపాలయింది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అంటూ హాసంపై గల పరిమితులను గుర్తుచేసే శతక పద్యమూ మనకొకటుంది. 'కారణము లేక నవ్వును.. ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.

 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలపు మొరటు మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి  గౌరవ స్థానమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచి ఉచ్ఛరించినా, పదాలు అడ్డదిడ్డంగా మార్చి కూర్చినా, చేష్టితాలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా.. అనేకానేక సవాలక్ష  వంకర టింకర విన్యాసాలింకేవైనా ప్రదర్శించినా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను పువ్వుల్లా రాల్చవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు,ఆ కన్నుల్లో నిప్పురవ్వలు రాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని తతిమ్మా మరో ఎనిమిది.. మొత్తంగా ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రలు పోషించిన హాసవైవిధ్యాన్ని రసప్లావితంగా ప్రదర్శిచి 'ఆహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాలను గురించి కాళిదాసు మొదలు కృష్ణదేవరాయల దాకా, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి వరకు అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ భారతీయ సాహిత్యంలో కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకు  మించి శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేసిన మాటా వాస్తవం. మే మొదటి వారాంతంలో వచ్చే  'ప్రపంచ నవ్వుల దినం'  ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!

ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని కరోనా తరహా పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధుల పై ఇంకెన్నో అధ్యయనాలు, మరింకెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా ఆ పరిశోధనాఫలాలలో కొన్నైనా! ఆ వెసులుబాటు లేనితనమే వీలున్నంత మేర మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యత  కల్పిస్తున్నది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు. సరికదా, అందుకు విరుద్ధంగా ఆరోగ్యానికి అరవై రకాల మేలు కూడా. చాలా అధ్యయనాల్లో హాసోల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగా గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాసచికిత్సా విధానమే నవ్వుల దినోత్సవ నేపథ్యం.  కారణమేమీ లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు.. ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయని కటారియా వాదం. నవ్వు రక్తవాహికలను విశాలపరుస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తిని విరోధిస్తుంది.  రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవడం వంటివి వందలాది లాభాల్లో ఒకటి మాతమే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వగలిగితే చాలు.. దానికే పది నిమిషాల పాటు వ్యాయామం చేసినంత మేలు. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటురాయిలా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపకా నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం హాస దినోత్సవ సంబరాల వెనకున్న  ప్రధాన స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీదనే సేవకు సదా సిద్ధంగా  ఉంటుంది. ఆ హాస సేవికకు పనికల్పించేందుకే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా.. పుట్టుకొచ్చింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

Saturday, March 13, 2021

ఆచార్యదేవోభవ! ఉపాధ్యాయ దినోత్సవం - కర్లపాలెం హనుమంతరావు

 







 'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు







కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

(ఈనాడు, 05-09-2009)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...