తెలుగు పాత్రికేయం
సమానార్థకాలకు ప్రయత్నలోపం
- సి. రాఘవాచారి
-- సేకరణ- కర్లపాలెం హనుమంతరావు
తెలుగు పత్రికల భాషాసేవ అనన్య సామాన్యమైనది. వివిధ రంగాల్లోని సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడంతో పాటు తెలుగుభాషా వికాసం కూడా పత్రికల కర్తవ్యంలో భాగంగా ఉండేది. వార్తాసంస్థలు ఇంగ్లీషులో పంపించే వార్తలను అనువాదంచేసి, ప్రచురించేటప్పుడు సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వినియోగించాలని ఒకనియమం స్వచ్ఛందంగానే పాటించడం జరిగేది. దానిని నియమం అనడంకన్నా స్వభాషపట్ల అనురక్తిగా చెప్పడం ఇంగ్లీషు పదాలకు సమానార్థకాలు సృష్టించడం, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో రూపొందించడం ఆరోజుల్లో సంపాదకవిభాగంలో పనిచేసేవారి ప్రాథమ్యంగా ఉండేది. కొత్తపదం వచ్చినప్పుడు మక్కికి మక్కి కాకుండా అర్ధాన్ని బట్టి, తెలుగులో సులభంగా అర్ధంగ్రహించటానికి వీలయ్యే సమానార్థకాన్నే స్థిరపరచి వాడేవారు. తెలుగును అధికారభాషగా ప్రకటించిన తరువాత ఈ ప్రయత్నంపట్ల ఉండాల్సిన శ్రద్ధాశక్తులు ఏ కారణంతో లోపించినా విచారకరం.
తెలుగుపాత్రికేయుల్లో సంపాదకులతోపాటు అనుభవజ్ఞులైనవారు ఈ విషయమై ఆవేదన పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు అనేకాదు, సంస్కృతం, ఉర్దూ పదాల వెల్లువలో తెలుగుభాష తన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నదా అనే బాధ సహజం. అవసరమైనప్పుడు అన్యభాషా పదాలు బాగా ప్రచారంలో ఉన్నవయితే వాటిని తెలుగుభాష విసర్గ సౌందర్య సౌష్టవాలు చెడకుండా వాడడంలో ఆక్షేపణలకు తావుండరాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అదికాదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమున్నట్లు ఇంగ్లీషుపదాలు శీర్షికల్లోనూ, వార్తల్లోనూ విశృంఖల స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి పాత్రికేయులతోబాటు విశ్వవిద్యాలయాలు, వివిధ అకాడమీలు (ప్రత్యేకించి ప్రెస్ అకాడమీ) కలిసి ప్రయత్నిస్తే సమానార్థకాలసృష్టి అసాధ్యమేమీకాదు. తెలుగుభాష సమయ సందర్భాలనుబట్టి అన్యభాషాపదాలను స్వీకరించడానికి అనువైనది. ప్రాచీన సాహిత్యంనుంచి నేటి పత్రికలభాష వరకు వెయ్యేళ్ళచరిత్ర ఈ విషయాలను నిరూపిస్తోంది. గతంలో తెలుగుపత్రికలకు తెలుగులోనే వార్తలు పంపాలని విధిగా ఆదేశాలున్నరోజుల్లో సమానార్థకాలకోసం విలేకరి కొంత ప్రయాస పడాల్సివచ్చేది. కానీ ఆ ప్రయాస ఫలప్రదంగా
భాషకు, విలేకరి భాషాభివృద్ధికి తోడ్పడుతుండేది.
అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా ఇంగ్లీషు పదాల వాడకం పెరగడం ఒక విచిత్రమైన వైవిధ్యం,
గతంలో వలె పత్రికల్లో రాజకీయాలకు పరిమితం కాకుండా, ఈ రోజు అనేక శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందజేయడం విరివిగా పత్రికల్లో అదాజేయడం జరుగుతున్నది. పత్రికలలో ఉండే సహజమైన వత్తిళ్ల కారణంగా పారిభాషక పదాలకు సమానార్థకాల ఇబ్బందితో కూడుకున్నప్పటికీ, ఆ కారణంతో అన్యభాషాపదాలను అదేపనిగా ఉపయోగించడం సరైనదికాదు. పరిభాష వెనుకఉండే భావాన్ని - సమానార్థకాలు స్వీకరించే సదవకాశం ఎక్కువ. సోవియట్ యూనియన్ లో గోర్బచెవ్ సంస్కరణలుగా 'గ్లాస్ నోస్త్ ', 'పెరిస్త్రోయికా' అనేపదాలు విరివిగా వార్తల్లో వచ్చేవి. వాటికి స్థూలంగా దగ్గరైన 'గోప్యరాహిత్యం', 'పునర్వ్యవస్థీకరణ' అనేపదాలు తెలుగులో వాడినందువల్ల పాఠకులు సులభంగా గ్రహించేపరిస్థితి ఉండేది. ఏదైనా సమానార్థకంకన్నా అన్య భాషా పదమే పాఠకులకు అర్థమవుతుందనుకుంటే అది వినహాయింపు తప్ప సూత్రం కారాదు.
పారిభాషిక పదాలకు తెలుగులో సమానార్థకాలు రూపొందించడం లక్ష్యంగా తెలుగు అకాడమీవంటి సంస్థలను ఏర్పాటుచేశారు. శాసన, పరిపాలనా సంబంధమైన పదాలకు స్పష్టమైన ప్రసిద్ధమైన సమానార్థకాలు రూపొందించినప్పటికీ వాటివినియోగం పత్రికల ద్వారా ఆశించినంతగా లేకపోవడం బాధాకరమే. ఉదాహరణకు 'టాక్స్'ను తీసుకుంటే దానికి పన్ను' అని రాస్తుంటాం. అంతేగాకుండా సెస్సు, డ్యూటీ, లెవీ అనే బడ్జెట్ పారిభాషిక సాంకేతికార్థం భిన్నంగా ఉంటుంది. అయినా పైసంస్థలు రూపొందించిన పదాలకంటే ఎక్కువగా పాఠకులకు ఆమోదయోగ్యమైనవాటిని పత్రికలు తమకుగా తాము సృష్టించుకుంటే అభ్యంతరం ఉండరాదు . ఆ ప్రయత్నం లేకపోగా సమానార్థకాలపట్ల అలసత్వం, తేలికభావన చోటుచేసుకోవడం విచారించదగిన విషయం.
జన వ్యవహారంలో అలవాటుపడిన అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి. వాటికి భాషా ఛాందసం జోడించి విశ్వామిత్ర సృష్టితో సమానార్థకాలు రూపొందించాల్సిన పనిలేదు. ఒకవేళ అలా సృష్టించినా అవి ఆమోదయోగ్యత పొందడం కష్టం. తెలుగుమాత్రమేవచ్చి అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని పత్రికలద్వారా తెలుసుకోవాలనుకొనే పాఠకుడు ప్రమాణంగా ఉండాలి. తెలుగు పత్రిక చదవటానికి మరో రెండుభాషల పరిచయం అర్హతగా ఉండాల్సినస్థితి అపహాస్యభాజనం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో అధికారభాషాయంత్రాంగం నిర్వహించిన కీర్తిశేషులు పి.వి. నరసింహరావు, పరిపాలనారంగంలో తెలుగు వినియోగంపై శాసనసభలో శ్వేతపత్రం (వైట్ పేపర్) ప్రకటించినప్పుడు అందులోని సమానార్థకాలపట్ల పత్రికల్లో పెద్దవిమర్శ సాగింది.
ఒక ప్రసిద్ధసంపాదకుడు అయితే ధారావాహిక సంపాదకీయాల్లో భూరాజసము (ల్యాండ్ రెవిన్యూ) లాంటి పదాలను ఉటంకించి ప్రత్యాఖ్యానం వెలువరించారు. దీనికి స్పందించి నరసింహారావుగారు తెలుగురాక మరిన్ని భాషలు చదివినవారు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకమని చెప్పినదాంట్లో అతిశయోక్తి ఉండవచ్చేమోగానీ ఇప్పటి స్థితినిబట్టి ఎంతో కొంత సరైన ప్రతిస్పందన అనిపిస్తోంది.
ప్రస్తుతం తెలుగు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో అవసరంలేకున్నా ఇంగ్లీషుపదాలు వాడటం ఎబ్బెట్టుగా తోస్తోంది. అచ్చమైన తెలుగుమాట దేవుడెరుగు, అసలు ఇంగ్లీషుమాటలు వాడితేనే అదేదో శ్రేష్ఠమన్న భావన చోటు చేసుకున్నది. ఒక పత్రికలో గతంలో పతాకశీర్షికల్లో కూడా భారత్ బదులు ఇండియా అని వాడేవారు. అది అప్పుడు చివుక్కుమనిపించినా ఇప్పటి పరిస్థితుల్లో కొంత మేలేమో అనిపిస్తోంది. ప్రాంతీయ ప్రత్యేకతలను బట్టి భాషలో అక్కడికక్కడే అర్థమయ్యే పదాలు ఇతరత్రా వాడినందువల్ల గందరగోళం తప్ప మరేమీ
ఉండదు,
కోస్తా ప్రాంతాల్లో వెలువడే ఎడిషన్లలో 'షురూ' అనే ఉర్దూ పదం కనిపిస్తోంది. ఏమైనా ఏ భాషపట్ల వ్యతిరేకత అక్కర్లేదుగానీ, మనభాషను సుసంపన్నం చేసుకోవడం అభిలషణీయం. ఈ అంశంపై పాత్రికేయుల్లోనే ఆత్మపరిశీలన అవకాశం కల్పించడం ద్వారా మిత్రులు టంకశాల అశోక్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జర్నలిస్టులు, ప్రెస్ అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలు భాగస్వాములైతే ఆ ఫలితం అందరికీ చెందుతుంది.
( ' వార్త' 15-06-05- ఆధారంగా )
- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
07-11-2021