Sunday, December 12, 2021
మనసు మీద నిగ్రహం ఉంటేవచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది-Tచిట్టి కథ
సాహిత్యం : సరదాగా ఒక సున్నా కథ - కర్లపాలెం హనుమంతరావు
సాహిత్యం : సరదాగా
ఒక సున్నా కథ
- కర్లపాలెం హనుమంతరావు
కాళిదాసుగారు ఓసారి చదరంగం ఆడుకుంటూ .. మధ్యలో తన పరిచారిక అందించిన తాంబూలం నోట్లో పెట్టుకుని, ' అబ్బ! సున్నం ఎక్కువయ్యింది! ' అన్నాడుట!
ఆ సమయంలో సోటి కవి భవభూతి రాసిన 'ఉత్తరరామ చరిత' అనే కావ్యం అతగాడు పంపిన్ దూత చదివి వినిపిస్తున్నాడు. కాళిదాసు మహాకవి కాబట్టి కావ్యంలోని మంచీ చెడ్డా వివరంగా పరిశీలించి సూచనలిస్తాడని భరభూతిగారి ఆశ.
కావ్యం అయితే వినిపించడం జరిగింది. కాని, తిరిగొచ్చిన దూత భవభూతిగారు పదేపదే అడిగిన మీదట 'మహాకవి గారి ధ్యాసంతా ఆ చదరంగం ఆటమీదా , అతగాని పరిచారిక మహాతల్లి తెచ్చిచ్చిన తాంబూలం మీదనేనాయ! మీ కావ్యం ఎంత వరకు విన్నాడో .. నాకయితే అనుమానమే! మధ్యలో మాత్రం ఓ శ్లోకం దగ్గర ' సున్నం ఎక్కువయింద'ని ముక్తుసరిగా అన్నాడండీ !
' ఏదీ ? ఆ శ్లోకం ఎక్కడిదో .. చూపించు! ' అ భవభూతిగారు అడిగిన మీదట
'ఇదిగో ఈ ' కిమపి కిమపి' శ్లోకం అని చెప్పుకొచ్చాడుట దూతగారు.
'కిమపి కిమపి మందం మందమాసక్తి యోగా
దవిరల కపోలం జల్పతో రక్రమేణ
అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్'
- ఇదీ శ్లోకం.
భవభూతిగారు కూడా కవే కాబట్టి కాళిదాసు నర్మగర్భంగా అన్నది.. దూతగారికి అర్థం కాకపోయినా తనకర్థమయింది..
శ్లోకంలోని ఆఖరి పాదంలో ' ఏవం వ్యరంసీత్' అనే పదప్రయోగానికి బదులుగా ‘ఏవ వ్యరంసీత్’ అని ఉండాలని కాళిదాసుగారి సూచన. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్లన్న మాట. భవభూతిగారూ కాళిదాసు సూచన ప్రకారమే మార్చి శ్లోకాన్ని మరింత అర్థవంతం చేశాడని కథ.
కథ, దాని అర్థం కేక! కరతాళధ్వనులు మిన్నుముట్టడానికి తగినట్లే ఉన్నాయి. అనుమానం లేదు. కానీ ఇది ఇక్కడ ఉదాహరణ కింద చెప్పడానికి కారణం వేరే ఉంది.
మన వాళ్లకు చరిత్ర .. కవి కాలాదుల పట్ల బొత్తిగా పట్టింపు లుండవనే అభియోగం ఒకటి మొదటి నుంచీ కద్దు . దానికి మరింత బలం చేకూరేలా ఉందనే ఇంత విపులంగా చెప్పడం ఈ కట్టుకథ .
భవభూతి కాలం దాదాపు ఎనిమిదో శతాబ్దం; కాళిదాసు జీవించిన కాలం బహుశా నాలుగో శతాబ్దం! ఈయనగారు ఆయనగారికి ఒక దూత ద్వారా తన కావ్యం వినిపించడం కామెడీగా లేదూ? 😁
ఒకానొక తెలుగు చలనచిత్రంలో కూడా ఇట్లాగే భద్రాద్రి రామదాసుగారు , భక్త కబీరును కలిసి వేదాంతచర్చలు సాగిస్తారు! అదీ సంగతి ! 😁
ఇట్లాంటి కామెడీలే చూసి చూసి మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావుగారు ' I like these fantastic lifespans and anachronistic legends. Indian literature is full of them. Remember Kalidasa and Bhavabhuti and Dandin meeting together in caatu tradition?'
( Refer to the Afterword in A Poem at the Right Moment) అనేశారు.
అన్నారంటే అనరా మరి?
- కర్లపాలెం హనుమంతరావు
30 - 10-2021
బోథెల్ ; యూఎస్.ఎ
పెయిడ్ ఇన్ ఫుల్ -. చిన్నకథp హనుమంతరావు
సుబ్బుకు పదేళ్లు. ఐదో తరగతి. బుద్ధిగా చదువుతాడు. లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా. కూడికలు తీసివేతలు రెండంకెల వరకు నోటితోనే చేసేయగలడు. కానీ ఈ సారి నోట్ బుక్ లోని ఒక కాగితం చించి దాని మీద ఈ విధంగా లెక్క వేసాడు.
వీధి చివరి శేషయ్య కొట్టు వరకు వెళ్లి ఉప్పు, కరేపాకు లాంటి సరుకులు వెంటనే తెచ్చి ఇచ్చినందుకుః రూ.2
అమ్మ వంట పనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడించినందుకుః రూ.3
ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు రూ. 3
అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా మూట్ లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు రూ.1
బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు.. ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పచెబుతున్నందుకు రూ.3
కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు తోడుగా వెళుతున్నందుకుః రూ.2
ప్రోగ్రెస్ రిపోర్టులో ఎప్పుడూ తెచ్చుకునే రెండో ర్యాంకు పోయినవారం కూడా తెచ్చుకున్నందుకు ఆ వారం వాయిదాః రూ.10
చిల్లర పనులుః రూ.10
పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తంః రూ 34వీడియో గేమ్ కు లెక్క తక్కువ పడింది.
సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు. ఆఫీసు పని మీద వేరే ఊరికి వెళ్లారు. వారం దాకా రారు. అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న
అమ్మకు అందించాడు సుబ్బు .
వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ. అదే కాగితం వెనక సుబ్బు నుంచి పెన్సిలు అడిగి తీసుకుని ఈ విధంగా రాసి ఇచ్చింది .
అమ్మ రాసిన లెక్కః
నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను. మోత కూలీః రూ. 0
రాత్రిళ్లు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకోనేదాన్ని. చల్లగాలి తగిలి జలుబు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచినిద్రలో కూడా వచ్చి చూసేదానిని. నిద్రలో నీకు తెలియదు. కాపలా పనికిః రూ.0
నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు. మళ్లా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకుః రూ.0
ఇట్లా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి బెట్టి ఇప్పటి దాకా నీ ఆటపాటలకు బొమ్మలు, పుస్తకాలు, చదువు సంధ్యలకు పుస్తకాలు, ఉల్లాసానికి వెంట తీసుకువెళ్లిన పార్కులు, సినిమాలు, ఆఖరికి నీకు రొంప పడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చీదరించుకోకుండా తుడిచేదాన్ని. ఈ మాదిరి చిల్లర సేవలు చాలా చేసాను. చేస్తున్నాను. ముందు ముందూ చేయాలి, ఆ సేవలకు రూః0' అంటూ రాసే రాసే కాగితం వెనక్కు ఇచ్చేస్తూ అంది అమ్మ :
" సుబ్బూ! నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం చేతకావడం లేదు. ఆ బిల్లూ నువ్వే వెయ్యి! నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు. ఇంకా ఏ మన్నా ఇవ్వాల్సింది మిగులుంటే అప్పుడు మళ్లా కొత్తగా వేసుకురారా నాన్నా అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు!
అమ్మ తిరిగి ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ల వెంట నీళ్లు బొట బొటా కారాయి. పెన్సిలూ వెనక్కు తీసుకుని
ఈ విధంగా రాసుకున్నాడు
' పైడ్ ఇన్ ఫుల్' కాగితం మీద
- కర్లపాలెం హనుమంతరావు
బోథెల్ ; యూఎస్ఎ
04-04-2020
Saturday, December 11, 2021
నాన్నగారూ! నన్ను క్షమించండి!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు (నవ్య వారపత్రికలో ప్రచురితం)
గోపాలకృష్ణయ్యగారు వణికే చేతుల్తో ఆ కాగితం మడతలు విప్పారు. అక్షరాలు అలుక్కుపోయినట్లున్నాయి. కూడబలుక్కుని చదువుకోడం మొదలుపెట్టారు గొణుక్కుంటున్నట్లు.
ప్రియమైన నాన్నగారికి,
నమస్కారం. నేనిలాంటి ఉత్తరం రాయాల్సొస్తొందని
కలలో కూడా అనుకోలేదు. కానీ.. రాస్తున్నాను. లోకంలో ఏ కొడుకూ తండ్రికి రాయకూడని
విధంగా రాస్తున్నాను. నన్ను క్షమించండి!
నన్ను కని అమ్మ కన్ను మూసినప్పటి నుంచి నాకన్నీ
మీరే అయి పెంచారు. తాతయ్య మీకు మరో పెళ్లి చేస్తానని పంతంపట్టినా, సవతి
తల్లొస్తే నన్నెక్కడ సరిగ్గా చూసుకోదోనని మరో పెళ్ళికి మొరాయించిన మంచి నాన్న
మీరు. అమ్మ బతికున్నా మీ అంత బాగా
చూసుకునేదో లేదో తెలీదు. పదేళ్ళు వచ్చినా మీరే నాకు వళ్లు రుద్ది స్నానం
చేయించేవారు. నా కిష్టమైనవన్నీ చేసి దగ్గరుండి కడుపు నిండా తినిపించేవారు. మంచి
బట్టలు వేసి, శుభ్రంగా తయారుచేసి బడిదాకా వచ్చి
దిగబెట్టేవారు. గేటు దగ్గర నిలబడి లోపలికి
పోనని నేను మారాం చేస్తే 'బాగా చదువుకోవాలి. పెద్ద
ఇంజనీరవాలి. అప్పుడే మంచి పెళ్లామొచ్చేది. మనింట్లో అమ్మ లేదు కదా! అప్పుడు నీ
పెళ్లామే నాకూ, తాతయ్యకూ అమ్మ అవుతుందంటూ.. 'ఏవేవ్ తమాషా కబుర్లు చెప్పి లోపలికి పంపించేవారు.
క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చి స్కూల్ ఫంక్షన్
లో నేను ప్రైజ్ తీసుకోడానికి స్టేజ్ మీదకు వెళుతుంటే చిన్నపిల్లవాడిలా
సంబరపడిపోయేవారు. 'మీకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఒట్టేసుకున్నాను' అప్పట్లో. ఆ ఒట్టు తీసి ఇప్పుడు గట్టు మీద పెట్టేస్తున్నాను. నాన్నగారూ! నన్ను
క్షమించండి!
సెవెన్త్ గ్రేడులో జిల్లా ఫస్టొచ్చినప్పుడు
మీరు కొనిచ్చిన 'ప్రసాద్' మార్క్ పెన్నుఇంకా నా దగ్గరే భద్రంగా ఉంది.
దానితోనే రాస్తున్నాను ఈ ఉత్తరాన్ని. మధ్యలో కొన్ని రోజులు శ్రావణి అడిగిందని
ఇచ్చా. కానీ, తను మళ్లా తిరిగిచ్చెసిందిలే! శ్రావణి ఎవరనుకుంటున్నారు
కదూ! అక్కడికే వస్తున్నా! ఆ సంగతి చెప్పడానికే ఈ ఉత్తరం నాన్నగారూ!
తను టెన్త్ లో నా క్లాస్ మేట్. ఇంటర్ లో పోటీ.
గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఇద్దరం కొట్టుకు చచ్చేవాళ్లం. నేను ఎం.పి.సి
తీసుకుని ఐ. ఐ. టి చెయ్యాలని మీ కోరిక. మొదటి సారి మీ మాట కాదన్నాను. బైపిసి
కెళతానని మారాం చేశాను. శ్రావణి బైపిసి కెళ్ళింది. అందుకే ఆ గోల. అప్పుడు మీకు
చెప్పలేదు. ఎమ్.సెట్ చేసే రోజుల్లో గవర్నమెంట్ సీటంటే ఏదో తంటాలు పడతా. కానీ, ప్రయివేట్
కాలేజీ అంటే నేను పడలేనుర!' అని రోజుకో సారి హెచ్చరించేవారు
మీరు. 'మంచి రేంకు తెచ్చుకుంటా'నని
ప్రామిస్ చేశాను. మంచి రేంకే వచ్చినా కాకినాడ కాలేజీలో డొనేషన్ కట్టయినా
చెరాల్సిందేనని మొండికేశాను. ఎందుకో తెలుసా నాన్నగారూ? శ్రావణి
కొచ్చిన రేంకుకు అందులో మాత్రమే సీటొచ్చింది మరి. ఎక్కడ క్లాసు పీకుతారొనని ఆ
విషయమూ మీకు చెప్పలేదు.'
పక్కగదిలో అలికిడయితే ఓపికచేసుకుని లేచి వెళ్లి చూసొచ్చారు గోపాలకృష్ణయ్యగారు.
మళ్లా ఉత్తరం చదువుకోడం మొదలుపెట్టారు.
'.. సాదర ఖర్చులకని డబ్బవసరమయితే
హాస్టల్ ఛార్జీలు పెంచారనీ, బుక్సనీ, పరీక్ష
ఫీజులని ఏదో ఓ వంకతోడబ్బులు పంపమని డిమాండ్ చేస్తుంటే.. ఒక్కసారైనా మీరు 'ఎందుకురా ఇంత డబ్బు?' అని ఆరా తీయలేదు. ఎంత తంటాలు
పడేవారో! టంచన్ గా టి.ఎం.ఓ వచ్చేది! అంత పిచ్చిప్రేమ మీకు నా మీద. శ్రావణి మైకంలో
పడి కొట్టుకుపోయే నాకు అవేమీ పట్టేవికాదు అప్పట్లో.
ఆమె ఫాదర్ ఇన్-కంటాక్సులో ఓ పెద్ద ఆఫీసర్.
అందుకు తగ్గట్లే ఉండేవి ఆమె సరదాలు. తన ముందు తేలిపోకూడదని నేనూ తలకు మించిన భారం
మోసేవాడిని. శ్రావణి ప్రేమ కోసం నేను పడని పాట్లు లేవు నాన్నగారూ! అందులో సగమైనా
స్టడీస్ మీద చూపించుంటే ఫస్ట్ ఇయర్ అలా పోయేది కాదు. శ్రావణి ఒకేడు ముందుకు
పోయిందని నేనేడుస్తుంటే.. అదంతా పరీక్ష పోయినందుకని ఓదార్చారు మీరు. అప్పుడైనా
చెప్పలేదు అసలు సంగతి. శ్రావణి ఒక్ ఇయర్ సీనియర్ అయిపోయినా మా మధ్య స్నెహం
చెదరలేదు సరికదా.. ప్రేమగా మారింది. మా ఎఫైర్ గురించి లోకమంతా కోడై కూస్తున్నా మీ
చెవి దాకా రాలేదు. వచ్చినా 'ఛఁ! మా శీను అలాంటి వాడు కాదని
కొట్టిపారేసేవాళ్లే మీరు. మీ పిచ్చి ప్రేమ సంగతి నాకు తెలుసు కదా! దానికి ఆకాశమే
హద్దు'
గ్రాడ్యుయేషన్ అయి పి.జిలో చేరంగానే శ్రావణి
తెచ్చి మీకూ తాతయ్యకూ చూపించి 'ఇదిగో 'నాన్నగారూ! మీ
అమ్మ!' అని సర్ప్రైజ్ చెయ్యాలని నా పిచ్చి ఆలోచన.
అన్నీ మనమనుకున్నట్లే అయిపోతే మధ్యలో
దేవుడెందుకూ?
శ్రావణి హౌస్ సర్జన్ లో ఉండగానే వాళ్లింట్లో పెళ్లి యావ
ప్రారంభమయింది. తను వాళ్ల డాడీకి నా గురించి చెప్పింది. నన్ను తీసుకుని వెళ్లి
పరిచయం చేసింది. శ్రావణివాళ్ల డాడీ మా డాడీలాగా కాదు నాన్నగారూ! చాలా ప్రాక్టికల్.
"ప్రేమ అనేది ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య వ్యవహారం. అది పెళ్లి దాకా రావాలంటే
రెండు కుటుంబాల మద్దతు అవసరం శ్రీనివాస్! నా దురదృష్టం కొద్దీ శ్రావణి మా బాస్
కొడుకు కంట్లో పడింది. నో అంటే నా కెరీర్ క్కూడా 'రిస్క్'.
ఈమెకు కాక ఇంకో ఇద్దరు ఆడపిల్లలకు కూడా పెళ్లిళ్లు చేయాలి నేను. నా
పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు.. నేనూ అదే చేస్తాను' అన్నాడు ఆయన. నేనేమీ చెప్పక ముందే తను చేయాల్సింది చేసేశాడు. బాస్
కొడుకుతో నిశ్చితార్థం సంగతి తెలిసి అడుగుదామని వెళితే ఆ ఇంట్లో అందరూ 'ఔటాఫ్ రీచ్'. పెళ్లయిన మర్నాడు రాత్రి శ్రావణి ఫోన్
చేసి 'సారీ! శీనూ! పెద్దాళ్ల మాట కాదనలేకపోయాను' అని ఒక ముక్క చెప్పి లైన్ కట్ చేసేసింది.
శ్రావణి కోసం నేను కొన్ని తొమ్మిదేళ్ల బట్టీ
వందల కొద్దీ అబద్ధాలు చెబుతూ వచ్చాను. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాను.
ఇంకొక్కసారి.. చివరిసారి.. ఇబ్బంది పెట్టక
తప్పడం లేదు నాన్నగారూ! నన్ను క్షమించండి!
నా చిన్నతనంలో మన పెరట్లోని జామకాయల కోసం
చెట్టెక్కినప్పటి సంగరి గుర్తుకొస్తోంది. చెట్టైతే ఎక్కాను గానీ.. దిగడం రాక
ఏడుస్తున్నాను. మీ రొచ్చి 'దూకు! నేను పట్టుకుంటాను!' అని భరోసా ఇచ్చారు. మీ
మీది నమ్మకంతో దూకేశాను. మీరు పట్టుకోలేకపోయారు. మోకాలు చిప్పలు పగిలి ఏడుస్తుంటే
కట్టు కట్టించి 'నీకు నువ్వే దిగడం వచ్చు అన్న ధీమా
వచ్చిందాకా ఎక్కకూడదురా శీనూ!' అన్నారు. ఇరవై ఏళ్ల తరువాత
సరిగ్గా మళ్లా అదే పొరపాటు చేశాను నాన్నగారూ! వంటికి తగిలిన దెబ్బయితే మందు
వేసుకుని మానిందాకా ఓ మూల ముసుగేసుకు పడుకోవచ్చు. ఇది మనసుకు తగిలిన దెబ్బే!
తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నాన్నగారూ! చిన్నప్పుడు మీరు నన్ను పట్టుకోకుండా
వదిలేశారు కదా! నేనిప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను. చెల్లుకు చెల్లనుకోండి..
క్షమించండి నాన్నగారూ!
ఇన్నేళ్లు దాచిపెట్టి ఇదంతా ఇప్పుడే ఎందుకు
చెబుతున్నావని మీరడగవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే ఛాన్స్ నాకు
లేదు నాన్నగారూ! నేనేమీ చెప్పకుండా సైలెంటుగా వెళ్లిపోతే నా ఓటమికి కూడా మిమ్ములను
మీరు బాధ్యులను చేసుకుని కుమిలిపోతారు. మీ పెంపకంలోని లోపం అనుకుంటారు. అది తప్పు.
'లోకంలోని ఏ తండ్రీ.. ఆ మాటకొస్తే.. తల్లీ.. తన బిడ్డను ప్రేమించలేనంత
గొప్పగా మీరు నన్ను ప్రేమించారు.' ఇది చెప్పడానికే ఈ చివరి
ఉత్తరం రాస్తున్నాను. ఈ సారు జన్మలో మళ్లీ మీకే కొడుకుగా పుట్టి నా తప్పుల్ని
సరిదిద్దుకొంటా! ..గాడ్ ప్రామిస్! ఉంటా .. టాటా! తాతయ్యకూ నా నమస్కారాలు , క్షమాపణలు తెలియచేయండి!'
ఇట్లు
ప్రేమతో
శ్రీనివాస్
పోలీసువారికి సూచనః నేను కృష్టలో స్నానానికని
పోతున్నాను. తీరానికి తిరిగొచ్చేది నా నిర్జీవమైన నా శరీరమే! అనవసరంగా ఎవరినీ
విసిగించవద్దని ఆఖరి మనవి!
శ్రీనివాస్
---
నలిగి మాసిపోయి మడతలు దగ్గర పట్టుకుంటే
చిరిగిపోయేటంతలా చీకిపోయినా ఆ పాత ఉత్తరాన్ని మళ్లా భద్రంగా మడతలు పెట్టి టేబుల్
సొరుగులో దాచి లేచారు గోపాలకృష్ణయ్యగారు నిట్టూరుస్తూ.
ఏడవడానికి ఆయన కళ్లలో నీళ్ళు లేవు ఇప్పుడు.
తొంభై ఏళ్లు దాటిన పండు ముదుసలి ఆయన ఇప్పుడు.
గోడ మీద ఉన్న దందేసిన ఫొటోలో నుండీ శ్రీనివాస్
చిరునవ్వుతో చూస్తున్నాడు.
'నీకేంరా నాయనా! నవ్వుతాలుగానే
ఉంటుందిప్పుడు. ఏడాది కిందట నువ్వు క్రిష్ణాలో పడ్డావు. మీ నాయన కోమాలో పడ్డాడు.
నీ ఉత్తరం చదువుకొనేందుకు వాడెప్పుడు స్పృహలో కొస్తాడో తెలీదు. నువ్వంటే
జన్మనిచ్చిన తండ్రిన పున్నామ నరకానికి వదిలేసి పోయావు కానీ,
జన్మనిచ్చిన పుణ్యానికి నేను నా కొడుకుని ఇట్లా అర్థాంతరంగా వదిలిపోలేను కదా!
కొడుకుతో సేవలు చేయించుకొనే వయసులో కొడుకుకు సేవలు చేయమని భగవంతుడే నా నొసటన రాసి
పెట్టాడు. భగవంతుడు కాదు.. నువ్వే రాసి పెట్టి పోయావురా మనవడా!' అని గొణుక్కుంటూ కోమాలో పడివున్న కొడుకును చూసేందుకు పక్కగదిలోకి వెళ్లారు
గోపాలకృష్ణయ్యగారు.
-కర్లపాలెం హనుమంతరావు
(నవ్య వారపత్రికలో ప్రచురితం)
Wednesday, December 8, 2021
అజ్ఞాన ' సమ్ ' ఉపార్జనం ! - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక - సుత్తి మొత్తగా - కాలమ్ - ప్రచురితం)
u
అజ్ఞాన ' సమ్ ' ఉపార్జనం !
- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దినపత్రిక - సుత్తి మొత్తగా - కాలమ్ - ప్రచురితం)
'జ్ఞానం' అంటే గురువా?
'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?
తెలియదు కనకనే కదా స్వామీ.. తమరి దగ్గరికీ రాక!
ఆ తెలియక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా
ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా కాస్త
సెలవివ్వండి స్వామీ!
'స్వ' అనవద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది. ఆ విశేషణం నీ సొంతానికివర్తించేది. రాజకీయాలల్లో ఉంటే మినహా డాంబిక పదప్రయోగాలు హాని చేస్తాయ్. ఆ తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే'
చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడ ఉంటుందో కూడా తమరే వివరించిపుణ్యం కట్టుకోండి స్వామీ!
గురువుగారు గడ్డం నీవురుకున్నారు.
గురువుగారి గుబురు గడ్డంలో అజ్ఞానం దాగుందని శిష్యుడికి అర్థమైపోయింది. అందుకే కాబోలు.. అంతుబట్టని ప్రశ్న ఎదురు పడ్డప్పుడల్లా గురువుగారిలాంటి బుద్ధిజీవులు గడ్డాలు గోక్కుంటుంటారు! సీదా సాదా జీవులకు మల్లే బుర్రలుగోక్కోరు.
' గురూజీ! 'అజ్ఞానం' అంటే గాడిద గుడ్డు వంటిదని ఎవరో స్వాములవారు ఆ మధ్య ఓ టీ. వీలో ప్రవచిస్తుండంగా విన్నాను. అదెంత వరకు నిజం?
'గాడిద' నిజం. 'గాడిద గుడ్డు' అబద్ధం. నిజం నుంచి పుట్టిన అబద్ధానికి 'గాడిద
గుడ్డు' ఒక సంకేతంరా శుంఠా!
ఆ స్వామి వారన్న మాట నూటికి నూటొక్కపాళ్లు నిజమే!
' మరి ఆ 'అజ్ఞానం' రుచికూడా ఎలా ఉంటుందో విశదపర్చండి గురూజీ?'
చిటికెడు పంచదార అప్పటికప్పుడు గాలిలోనుంచి సృష్టించి శిష్యుడి నాలిక మీద
వేసి 'రుచి చెప్పు!' అన్నారు స్వామీజీ.
తియ్యగా ఉంది స్వామీ! ఇప్పుడు ఈ లోటాలోని కాఫీ ఓ గుక్కెడు తాగి దాని రుచీ ఎలాగుందో చెప్పు! అన్నారు. ఎప్పుడు ఎలా వచ్చాయో కాఫీ..!
కప్పు పెదాలకందించుకుని కషాయంలాగా ఉంది స్వామీ! అని ముఖం చిట్లించాడు శిష్యుడు.
' ఇంద' ఈ సారి ఇంకో చిటికెడు ఉప్పు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసిఈ సారి కాఫీ రుచి చూడమని ఆదేశించారు గురువుగారు.
' భలే ఉంది స్వామీ! కానీ ఏ రుచో చెప్పలేను'
' ఆ చెప్పలేక పోవడాన్నే అజ్ఞానంగా తెలుసుకోరా సన్నాసీ! '
ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టడం శిష్యుడి వంతయింది.
'అయితే స్వామీ . '
' .. అర్థమయింది. వాసన గురించే కదా నీ నెక్స్ట్ క్వశ్చన్? ఉనికిలో ఉన్నదానికైతే వాసనంటూ ఏదైనా ఉంటుంది కానీ.. అసలు ఉనికేలేని అజ్ఞానానికి వాసనేముంటుంది రా అజ్ఞానీ! ' అన్నారు గురూజీ!
శిష్యుడికి మెల్ల మెల్లగా బోధపడుతోంది అజ్ఞానసారం. అయినా ఇంకా ఏదో
ఇతమిత్థంగా తేలని సందేహం.
' స్వామీ! ఆఖరి ప్రశ్న. జ్ఞానం సంపాదించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు ఒంటికాలు మీద జపం చేస్తుంటారు. నా వంటివాళ్ళు మీ బోటి జ్ఞానుల పాదాల చెంత చేరి తత్త్వబోధనలు వింటుంటారు. జ్ఞానం వల్ల ఏదో మేలు లేకపోతే అన్నేసి తంటాలు అవసరమా స్వామీ?
' మంచి చెడ్డా.. లాభం నష్టం.. ఉచితం అనుచితం తెలుస్తాయి కాబట్టి ఆ యాతన లేవో వాళ్లు అలా నిత్యం తలో రూపంలో పడుతుంటారురా బాలకా!
' మరి అజ్ఞానం వల్ల ఏం ప్రయోజనం ఉందని స్వామీ.. ఇంతమంది ఈ
లోకంలో జ్ఞాన సముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయకుండా మూర్ఖవర్గంలోనే ఉండిపోడానికి కొట్టు కు ఛస్తున్నారూ? ముఖ్యంగా మన రాజకీయ నాయకులు?'
' ఇదేరా భడవా .. అసలు సిసలు అజ్ఞాన భాండారమంటే ! పొరుగువారిని ప్రేమించుము. నిత్యము సత్యమును మాత్రమే వచించుము! ఆడవారిని తోబుట్టువులవలె గౌరవించుము ! పెద్దలమాట చద్దిమూటగా మన్నించుము . ఆడి తప్పకుము. దొంగతనము చేయకుము. అహింస పరమ ధర్మము. జంతుహింస అమానవీయము. దుర్భాషలాడబోకుము! నీతి మార్గం వదలబోకుము!' ఇత్యాది మంచి సూక్తులన్నీ వింటూ కూర్చుంటే లోకంలో మనం ఎవరికీ ఏమంచీ చేయలేం. మనక్కూడా మనం ఏ మేలూ చేసుకోలేం. అడ్డదారిలో గడ్డికరిస్తేనే కదరా బిడ్డా.. ఆదాయానికి మించిన ఆస్తులేవైనా కూడబెట్టే పట్టు దొరికేది! కొడుకులను.. కూతుళ్లను.. అల్లుళ్ళను.. కోడళ్ళను అందలమెక్కించకుం డా అలా గాలికి వదిలేస్తే వాళ్లు అజ్ఞానం వల్ల చేసే అల్లరిచిల్లర్లతో సొంత ఇమేజి డేమేజవుతుంది కదా శిశువా? పెద్దతనంలో ఏ రోగమోరొప్పో వచ్చి
మంచాన పడ్డాక నీ ఏ మంచీ.. మన్నుగడ్డా పక్కగుడ్డలు మార్పించే నాధుణ్ని రాబట్టలేదు. ఎక్కడెక్కడి రాబందులో సహేలీలు..
స్నేహితులంటూ సంబంధాలు కలుపుకొని పొయస్ గార్డెన్లలోక్కూడా వచ్చి పాగావేస్తారు. సంపాదించుకున్న మంచి పేరుకు తూట్లు పడతాయ్! సొంతానికంటూ ఆస్తులేవో పది రకాలుగా కూడబెట్టుకుంటేనే కదరా అమాయకుడా.. కోట్లులక్షలు ఖర్చయ్యే ఎన్నికల గోదాట్లోకి దూకినప్పుడు గట్టెక్కగలిగేది! అది ఈదే పాదసేవకులకు సాయపడేదీ? అక్రమార్కుడి మార్కు ప్రత్యర్థి అజ్ఞానుల్ని పడగొట్టాలన్నా చెడ్డదారి తొక్కడం మినహా మరోటేమన్నా ఉందామూర్ఖ మంచి మార్గం? ఇందాక నువ్వన్నావే.. ఆ జ్ఞానం గన్నీ బ్యాగులు ఎన్ని గుట్టలుగడించినా జీవితంలో సాధించింది సున్నా. ఇలా వివిధ మంచి చెడ్డలనుతర్కిస్తూ భావి చరిత్రకారుల దయాదాక్షిణ్యాల కోసం దేబిరించటం కన్నా.. పదవుల్లో పచ్చగా ఉన్నప్పుడే చరిత్ర పుటల్లో పేర్రాయించుకునే దారులు వెదుక్కోవడం మేలు. దనమూలం ఇదం జగత్! డబ్బుతో దెబ్బేయలేనిదేదీ తేదీలోకంలో! జ్ఞానసముపార్జన ధనసంపాదన కాళ్లకడంరా శుంఠా! ఏ ఎన్నికల కోడిఎప్పుడు
కూస్తుందో ఎవడికీ తెలియని రోజుల్లో ఎన్నికల సంఘం కోడులకుజడుస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది గోడుగోడుమనే ఏడపులూ.. మొత్తుకో!
అజ్ఞానమే ఓటర్ల తత్త్వంగా తయారైనప్పుడు వాళ్ళు బుట్టలో పడటానికితొక్కలోని జ్ఞానమార్గం నమ్ముకుంటే అంతకు మించిన అజ్ఞానం మరోటి ఉండదు.
ఇప్పుడు చెప్పు! జ్ఞానానికా? అజ్ఞానానికా నీ ఓటు?'
ఆ శిష్యుడు అప్పుడే మొలుస్తున్న గడ్డం నిమురుకోవడం మొదలు పెట్టాడు.
' కళ్లుతెరిపించారు గురూజీ! ధనమూలం ఇదం జగత్. సందేహం లేదు. కాబట్టే సర్వ సంగ పరిత్యాగులై ఉండీ తమబోంట్లు ఒక్కొక్క ప్రశ్నకే లక్ష చొప్పునభక్తుల నుంచి నిర్మొహమాటంగా గుంజుతున్నారు! తమరి సంపాదనకు దొంగలెక్కలు రాయలేక నా రెక్కలు గుంజుతున్నాయి . .
ఏ శిష్యుడికైనా గురువు దారే అనుసరణీయం. అజ్ఞానుల వర్గంలో పోటీ తాకిడి మరీ ఎక్కువగా ఉంది స్వామీ! మరీ ముఖ్యంగా పొలి టికిల్ సర్కిల్లో. నా బిడ్డలకు బారెడు గడ్డాలు మీసాలు పెరిగి నాలుగైదు ఆశ్రమాలు.. టీ వీ ఛానెళ్లు దొరికిందాకా.. చారెడు రూకలు సంపాదించుకోవాలి. తమరిలాగా అజ్ఞాన సమ్ 'ఉపార్జన'కే నా ఓటు కూడానూ! '
సభక్తిపూర్వకంగా చేతులు జోడించి లేచి నిలబడ్డాడు శిష్యపరమాణువు.
***
( సూర్య దినపత్రిక - సుత్తి మొత్తగా - కాలమ్ - ప్రచురితం)
- కర్లపాలెం హనుమంతరావు
05 - 11-2021
Tuesday, December 7, 2021
చిన్న కథ సుబ్బరావమ్మ ఏడ్చింది - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం )
చిన్న కథ;
సుబ్బరావమ్మ ఏడ్చింది
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం )
సుబ్బరావమ్మ సూపర్ ధైర్యవంతురాలు. ఏడవటం అస్సలు తెలీదు. తల్లి కడుపులో నుండి బైటపడంగానే ఎవరైనా కేర్..కేర్మని ఏడుస్తారు కదా! ఈవిడ 'ఐ డోంట్ కేర్' అన్నట్లు నవ్వటం మొదలుపెట్టిందట! దయ్యంపిల్లేమో అని ఇంట్లో వాళ్లు శాంతులు చేయించినా గాని సుబ్బరావమ్మ సుబ్బరంగా నవ్వుతూనే ఉంది.
సుబ్బరావమ్మ పదమూడో ఏట తండ్రి గుండెపోటొచ్చి పోయినప్పుడు కూడా సుబ్బరంగా నవ్వుతూ నట్టింట్లో తిరిగింది. కళ్ళనీళ్లు పెట్టుకోలేదు సరికదా...ఆరోజు అత్యంత విషాదంలో మునిగుంటే తనే అందర్నీ సముదాయించింది.
సుబ్బరావమ్మకు కష్టాలు రావనికాదు...ఏడవటం ఎలాగో తెలీదు. అదీ ప్రాబ్లమ్.
కొంతమందికి నవ్వటం రాదు కదా!...అలాగ.ఏడ్చినపుడు నరాలు రిలాక్సవ తాయి. గుండె తేలికవుతుందని ఎంత చెప్పినా ఉపయోగం లేకపోయింది.
పెళ్లయి అత్తారింటికి వెళ్ళినప్పుడు దీని తిక్క కుదురుతుందిలే అనుకొన్నారు. అత్తగారికే కుది రిందా తిక్కేదో! ఎప్పుడూ ఏడవకుండా ఉండే కోడల్ని చూసి ఆ అత్తగారికే తిక్క ఎక్కు వైందో..ఏమిటో...మరింత 'కోడరికం' పెట్టింది.
సుబ్బరావమ్మ మొగుడు పరమత్రాష్టుడు. తాగుడూ.. పేకాట.. తిరుగుళ్లు... తెల్లారి కొంప కొచ్చి పెళ్ళాన్ని చితకబాదేవాడు. మహా ఇల్లాలు... ఆ బాధలన్నీ కిమ్మనకుండా భరిం చింది గానీ ఏనాడైనా కట్టుకున్న వాడిట్లా కసాయి వాడని...కనీసం ఒక్కసారయినా ముక్కు చీదెర గదు. పెళ్ళాం వైఖరికి విసిగి మొగుడు పట్టించుకోవటం మానేశాడు.
అత్తగారు బెదిరి దూరంగా ఉండేది. ఆడపడచులు వదినవైపే ఆశగా చూస్తుంటేవాళ్లు ఎప్పటికైనా తమ ఆశ నెరవేరక పోతుందా అని.
కాలచక్రం గిర్రున తిరిగింది. సుబ్బరావమ్మిప్పుడు అత్తగారయింది. కొడుకులు, కోడళ్లు పెట్టే హింస నరమానవుడు సహించలేనిది. అలాంటి వాటిని తట్టుకుని నిలబడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.
హఠాత్తుగా సుబ్బరావమ్మకి ఇప్పుడు ఒక కొత్తరకం జబ్బొచ్చి పడింది. దాన్ని ఇంగ్లీషులో అదేదో నోరు తిరగని 'ఫోబియా' అంటారుట..మొత్తానికి అదొక చిత్రమైన జబ్బు. దానికింతవరకూ మందు వైద్యరంగంలో కనుక్కోలేదుట. సుబ్బరావమ్మిక రోజులు లెక్కించు కోవచ్చు అన్నారు డాక్టర్లు.
కొడుకుల గుండెల్లో బండరాళ్ళు పడ్డాయి. ప్రేమతో కాదు... ఆమె ఇంకా కనీసం ఒక ఏడాదన్నా బతికుండాల్సిన అవసరముంది. మనుమరాలికి మైనారిటీ తీరిందాకా తన నానమ్మ ఇచ్చిన పదికోట్ల ఆస్తికి తనే హక్కుదారు.
నానమ్మలు మనవరాళ్లకి ఆస్తిని నేరుగా రాసిచ్చే చిత్రమైన సంప్రదాయం వాళ్ళ వంశంలో నాలుగు తరాలనుండి నిరాటంకంగా వస్తుంది. మనమరాలికి మైనారిటీ తీరకుండానే తాతమ్మ గుటుక్కుమంటే ఆస్తంతా ఊళ్ళో ఉన్న శివాలయానికి చెందాలన్నది అందులో రూలు. అందుకే సుబ్బరావమ్మ కొడుకులు తెగ ఆందోళన పడుతున్నారు. ఇంకో ఏడాది గడిస్తేగాని పెద్ద కొడుకు కూతురు మేజర్ కాలేదు. అందాకా సుబ్బరావమ్మ ఎలాగైనా బతికి తీరాలి.
బతకా లంటే ఆమె నరాలు మెత్తబడాలి. నరాలు మెత్తబ డాలంటే బాగా ఏడవాలి. అది సుబ్బరావమ్మకి చేతగాని పని. అన్ని రకాల వైద్యాలూ అయ్యాయి.
అల్లోపతి... ఆయుర్వేదం... హోమి యోపతి...న్యూరోపతి...నాచురోపతి, భూమం డలం మీదున్న వైద్య విజ్ఞానం మొత్తం ఈ సుబ్బ రావమ్మని ఏడిపించలేమని నిస్సహాయంగా చేతులెత్తేసింది.
బట్... ఇండియా ఈజే లాండాఫ్ మిరాకల్స్ కదా! హిమాలయాల్నుంచీ హిందూ మహా సముద్రందాకా పాదయాత్ర చేస్తూపోయే తాంత్రికబాబాగారు ఈపూరుపాలెం వచ్చిన ప్పుడు ఈజీగా ఈ సమస్యను పరిష్కరించారు.
బాబాగారు విషయమంతా విని సాలోచనగా తలూపి కొడుకుని పిలిచి చెవిలో ఏదో ఊదారు.
వాకిట్లో వేసున్న సుబ్బరావమ్మగారి మంచాన్ని నట్టింట్లోకి మార్పించారు. వారం రోజులవరకూ ఏ మార్పూ లేదు.
ఆరోజు ఆదివారం... అందరూ ఎవరిపన్లలో వాళ్ళున్నారు. సుమారు పది గంటల ప్రాంతంలో ఘొల్లుమని గోల వినప డింది. ఆ వింత శబ్దాన్నింతవరకూ ఎవరూ విని ఉండలేదు. కంగారుగా ఇంటిల్లిపాది గదిలోకి పరుగెత్తారు.
సుబ్బరావమ్మ ఏడుస్తున్నది . భయంకరంగా ఏడుస్తోంది . గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తోంది.
ఇంటిల్లిపాదీ ఆనందంతో గంతులేసారు.
ఇంక ఆస్తికి ఢోకా లేదు .
థేంక్సు టూ కేబుల్ టీవీ అని గొంతెత్తి అరిచారు ఇంటిల్లిపాదీ! .
అసలేం జరిగిందంటే...
టీవీలో రోజూ అన్ని ఛానెల్సులో వరసగా వస్తున్న సీరియల్సుని చూసి చూసి సుబ్బరావమ్మ అందులో పూర్తిగా లీనమైపోయింది.
ఆవాళా ఆదివారం అవటంచేత...ఆ ఏడుపు సీరియళ్లేవీ రావు . కనుక.... ఘొల్లుమన్నది సుబ్బరా వమ్మ.
తానొకటి తలిస్తే దైవమొకటి తలు స్తుంది. సుబ్బరావమ్మగారు ఏడుస్తూ ఏడుస్తూ ఆరోజు చీకటి కాకుండానే కన్నుమూ సారు.
ఇప్పుడు ఏడవటం ఇంట్లో వాళ్ళ వంతయింది.
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం )
Saturday, March 13, 2021
Friday, March 12, 2021
తన కోపమె తన శత్రువు- చిన్న కథ - రచన : కర్లపాలెం హనుమంతరావు
బాలు వయసు పదేళ్ళు. అంత చిన్నతనంలో కూడా కోపం బుస్సుమని వచ్చేస్తుంది. కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడు. పెద్దా చిన్నా చూసుకోడు. అంత దురుసుతనం భవిష్యత్తుకు మంచిది కాదని వాళ్లమ్మ ఎన్ని సార్లో చెప్పిచూసింది. కాస్సేపటి వరకే అమ్మ మాటల ప్రభావం. మళ్లీ కోపం యధాతధం. ఆ సారి పుట్టిన రోజు పండుగకు తనకు కొత్త వీడియో గేమ్ కావాలని అడిగాడు బాలు. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి. ఆటల రంధిలో పడి చదువు మీద ధ్యాస తగ్గుతుందని అమ్మానాన్నల బెంగ. పరీక్షలు అయి వేసవి సెలవులు మొదలయితే గానీ ఏ ఆటలూ వద్దని అమ్మ నచ్చచెప్పబోయింది. వినకపోగా అమ్మ మీద ఇంతెత్తున ఎగిరి గభాలున ఒక బూతు పదం కూడా వాడేసాడు. షాకయ్యాడు అక్కడే ఉండి బాలు వీరంగం అంతా చుస్తున్న నాన్న. అప్పటికి ఏమీ అనలేదు.
మర్నాడు పుట్టినరోజు బాగానే జరిగింది. ఫెండ్స్ రకరకాల ఆటవస్తువులు బహుమానంగా ఇచ్చారు. పరీక్షలు అయిన దాకా వాటిన తెరవకూడదన్న షరతు మీద నాన్నగారు ఒక పెద్ద రంగుల పెట్టె బహుమానంగా ఇచ్చారు. తెరిచి చూస్తే అందులో బోలెడన్ని మేకులు, ఒక సుత్తి, బాలుకి చాలా ఇష్టమయిన తన ముఖం అచ్చొత్తించిన పెద్ద చెక్క ఫ్రేము ఫొటో. నాన్నగారు ఇలా చెప్పారు 'బాలు! కోపం మంచిది కాదు అని ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఎందుకు మంచిది కాదో నీకై నువ్వే తెలుసుకోవాలి. అందుకోసమే నీకు ఈ చిన్న పరీక్ష. ఇందులో వంద మేకులు ఉన్నాయి. నీకు కోపం వచ్చిన ప్రతీసారీ ఒక మేకు ఈ పటం మీద ఈ సుత్తితో కొట్టాలి. మేకులన్నీ అయిపోయిన తరువాత ఇంకా కావాలంటే కొని ఇస్తాను' అన్నాడు.
బాలుకు ఈ ఆట బాగా నచ్చింది. మొదటి రోజు ఏకంగా 37 మేకులు పటం మీద సునాయాసంగా కొట్టేసాడు. అంటే 37 సార్లు కోపం వచ్చిందని అర్థం. రెండో రోజు ఆ ఊపు కొంత తగ్గింది. 21 మేకులు మించి పటంలోకి దిగలేదు. సుత్తితో మేకును కొడుతున్నప్పుడు బాలు మనసు మెల్లిగా ఆలోచనలో పడడం మొదలుపెట్టింది. ఈ మేకులు కొట్టే తంటా కన్నా అసలు కోపం తెచ్చుకోకుండా ఉంటే గోలే ఉండదు కదా! అని కూడా అనిపించింది.
రోజు రోజుకూ ఆ భావన బాలులో పెరుగుతున్న కొద్ది పటం మీద మేకులు దిగడం తగ్గిపోయింది. అంటే బాలుకు కోపం వచ్చే సమయం క్రమంగా తగ్గిపోయిందనేగా అర్థం! కోపం వచ్చిన ప్రతీసారీ మేకులు, సుత్తితో వాటిని పటం మీద కొట్టే బాదరబందీ గుర్తుకు వచ్చి చల్లబడిపోయేవాడు.
మేకులు కొట్టడానికి ఇప్పుడు పటం మీద చోటు వెతుక్కోవడం కూడా కష్టంగా ఉంది. పటం నిండా మేకులు నిండిపోయేవేళకు బాలుకు అస్సలు కోపం రావడం పూర్తిగా మానేసింది. కోపం తగ్గిన తరువాత అమ్మానాన్నా వీడియోగేమ్ ఇప్పుడు ఎందుకు కొనివ్వడం లేదో అర్థమయింది. నెల రోజుల కిందట అమ్మతో తాను దురుసుగా మాట్లాడిన సంగతీ గుర్తుకు వచ్చింది. కళ్ల వెంబడి ఇప్పుడు నీళ్లు వచ్చాయి. తప్పు తెలుసుకున్న బాలు కొట్టలేక మిగిలిపోయిన మేకులు, సుత్తి తండ్రి ముందు పెట్టి 'నాన్నా! 'కోపం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు అర్థమయింది. ఇక ఈ మేకులు కొట్టే పని నా వల్ల కాదు . నేను అమ్మ మీద ఇక నుంచి ఎప్పుడూ కోపమే తెచ్చుకోను' అని చెప్పాడు.
తండ్రి 'కోపం వల్ల ఇబ్బంది ఏమిటో నీకు తెలిసి వచ్చిందే! కానీ నాకే ఇప్పుడు ఇబ్బంది వచ్చిపడింది . నీకు ఈ పాఠం నేర్పడానికి మేకులు, సుత్తి, పటం ఫ్రేము కట్టించడానికి 500 రూపాయలు అవసరమయ్యాయి. సమయానికి నా దగ్గర అంత డబ్బు లేకపోతే ఒక ఇనుప కొట్లో అరువు మీద తీసుకున్నాను. ఇప్పుడు మనకు వాటితో అవసరం లేదు కదా! అతని మేకులు, పటం తిరిగి అతనికి ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేస్తే సరి. నువ్వు రోజుకో మేకు చొప్పున మేకులన్నీ పీకి పారేయ్! కాకపోతే మళ్లా ఒక షరతు. నీకు కోపం వచ్చిన రోజున మేకు తీయడానికి లేదు. గుర్తుంచుకో!'అన్నాడు.
బాలుకు ఆ రోజు నుంచి రోజుకు ఒక మేకు పటం నుంచి తీయడం మీదనే ధ్యాసంతా. అందుకోసం గాను కోపాన్ని ఆమడ దూరం పెట్టవలసిన అగత్యం మరింత గట్టిగా అర్థమయింది. మొత్తానికి పటం మీది మేకులన్నీ తీసి మేకులు, సుత్తి, పటం తండ్రికి ఇచ్చే సమయానికి బాలు పూర్తిగా శాంత స్వభావుడిగా మారిపోయాడు.'మేకులు పీకడానికి నీవు కోపాన్ని ఎట్లా నిగ్రహించుకున్నావో గమనించాను. కోపం తెచ్చుకోకపోవడమే కాదు.. అది వచినప్పుడు దానిని నిగ్రహించుకోవడం కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ' తన కోపమే తనకు శత్రువు' అని పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో ఇప్పుడు బాగా అర్థమయింది అనుకుంటా. కోపం తెచ్చుకొని ఏదో ఒక దురుసుమాట అని ఎదుటి వాళ్ల మనసును గాయ పరచడంలాటిందే మేకుతో పటం మీద సుత్తితో బాదడంతో సమానం. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని మేకు మళ్లీ తీసినా పటం మీది చిల్లులు పోవు కదా! ఆ వికారం పోగొట్టడం మన తరం కాదు గదా! నోటికొచ్చింది తిట్టి ఆనక 'సారీ' అన్నా ఎదుటి వాళ్ల మనసు మీద గాయమూ ఇట్లాగే ఎప్పటికీ చెరిగిపోకుండా మిగిలిపోతుంద'ని గుర్తుంచుకో చాలు.' అన్నాడు తండ్రి.
బాలు బుద్ధిగా తలుపాడు.
పరీక్షలు అయి వేసవి రాగానే తండ్రే బాలును వెంటబెట్టుకుని ఎలక్ట్రానిక్ షాపుకు తీసుకువెళ్లి అతగాడికి కావలసిన వీడియోగేమ్సు కొనిపెట్టాడు. ఎన్ని గేమ్సు కొనిపెట్టాడో అన్ని పుస్తకాలు కొని ఇస్తూ.. ఒక పుస్తక చదవడం పూర్తయిన తరువాతే ఒక వీడియా గేమ్ ఆడుకోవడానికి పర్మిషన్' అన్నాడు తండ్రి నవ్వుతూ.
బాలుకు ఈ సారి కోపం రాలేదు 'అలాగే నాన్నా !' అని సంతోషంగా వీడియో గేమ్సూ, పుస్తకాలూ అందుకుని షాపు బైటికి వచ్చాడు
***
Tuesday, February 23, 2021
గిల్టీ -చిన్నకథః రచనః కర్లపాలెం హనుమంతరావు
"సార్!"
అతను గదిలోకి వచ్చినట్లు గమనించక
పొలేదు. కావాలనే చూడనట్లు నటించాను.
కారణం ఉంది.
ఇంట్లో ఇందిర రాత్రి చెప్పిన సంగతి
గుర్తుకొచ్చింది.
"మీ ఆఫీసులో
సుబ్బారావనే పేరున్న వాళ్లెవరన్నా ఉన్నారా?"
"ఉంటే?!"
"అతగాడి
తల్లికి రేపు హార్ట్ ఎటాక్ రాబోతుంది. 'స్టార్ట్
ఇమ్మీడియట్లీ' టైపు ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే మూడు రోజులు క్యాజువల్ లీవు కావాలని మీకు లీవు లెటర్ ఇవ్వబడుతుంది. మీ చేత 'సాంక్షన్డ్' మార్క్
చెయించుకుని సదరు సుబ్బారావు వేంచేసేదెక్కడికో తెలుసా సార్?"
"ఎక్కడికీ?!"
"వేసంగి కదా!
చల్లగా ఉంటుందని.. ఊటీకి. ఈ పాటికే అతగాడి ఇంట్లో ప్రయాణానికని
అన్ని ఏర్పాట్లూ ఐపోయాయి కూడా. తెల్లారంగానే తమరు సెలవు మంజూరు చెయ్యడమే కొరవడింది”.
"ఇవన్నీ నీకెలా
తెలుసోయ్!" ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నాకు.
"లేడీసుమండీ
బాబూ మేం. మీ పురుష పుంగవులకు మల్లే 'కంటబడిందంతా కటిక
సత్యం.. చెవిన బడిందంతా గడ్డు వాస్తవం'
అని నమ్మే చాదస్తులం కాం. సదరు సుబ్బారావు గారి సహధర్మచారిణి
నోటినుంచే రాలిపడిందీ స్కెచ్. నేను తన హబ్బీ బాసు తాలూకు
మనిషినని తెలీక నా ముందే పాపం నోరు జారింది. మీ కొలీగు
రంగనాథంగారి చెల్లెలు సీమంతంలో బైటపడింది
సుమా ఈ కుట్రంతా" అంది ఇందిర.
బాసుని నేను. నా కన్నుకప్పి, అబద్ధాలు చెప్పి తప్పించుకుని తిరగాలనే! ఆ క్షణంలోనే
ఈ ధూర్తుడితో ఎంత మొండిగా వ్యవహరించాలో డిసైడ్ చేసుకుని ఉన్నా.
---
"సార్!ఒక చిన్న రిక్వస్టు"
"తెలుసు.
మీ అమ్మగారికి హార్ట్ ఎటాక్. 'స్టార్త్
ఇమ్మీడియట్లీ' అని ఇంటినుంచీ కాల్. నీకర్జంటుగా మూడు రోజులు
క్యాజువల్ లీవు శాక్షన్ చేయాలి. యామై రైట్?"
ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేశాడు
ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు "సార్! మీకెలా తెలిసింది?
ప్లీజ్ .. సాంక్షన్ మీ లీవ్ సార్!"
సుబ్బారావు కళ్ళల్లో నీళ్ళు.
ముందుగా అనుకున్న ప్లాన్
ఇంప్లిమెంటు చేసే టైమొచ్చింది. దొంగేడుపులకే
మాత్రం ఛస్తే లొంగరాదు.
సాధ్యమైనంత విచారాన్ని గొంతులో
రంగరించుకుని "సారీ సుబ్బారావ్! రేపు ఆడిటర్సు వస్తున్నారు ఇన్
స్పెక్షనుకి. మొదట్నుంచీ నువ్వే చూస్తున్నావుగా ముఖ్యమైన ప్రాజెక్టు
రిపోర్టులన్నీ! నువ్వు లేకుంటే ఎలాగా? కావాలంటే వాళ్ళు
వెళ్ళిపోయిన తరువాత నువ్వూ వెళ్ళి రావచ్చు.. ఒక్క పూట. ఓకే..నౌ.. యూ కెన్ గో అండ్ గెట్ రడీ ఫర్ ఆడిటింగ్"అని అప్పుడే గుర్తుకొచ్చినట్లు ఫోనందుకున్నా.
"సార్! మా అమ్మ ఇప్పుడు గుండె నొప్పితో అల్లాడిపోతుంటే ఎప్పుడో ఆడిటింగయిన తరువాత
వెళ్లాలా? అప్పటిదాకా ఆమెకేమీ కాదని మీరెవరన్నా భరోసా
ఇవ్వగలరా?"
బాగానే రక్తి కట్టిస్తున్నాడూ
నాటకాన్నీ! ఈ సుబ్బారావులో ఇంత పెద్ద కళాకారుడున్నాడని
ఇప్పటిదాకా తెలీదే! ఒక్క అతగాడికేనా నటనా కౌశలం తెలిసింది! నేను మాత్రం తక్కువ తిన్నానా!"
పాత సినిమాల్లో రంగారావు మార్క్ గాంభీర్యం ప్రదర్శిస్తూ "ఐ
సెడ్ సుబ్బారావ్ ! నౌ యూ కెన్ గో! లెట్ మీ డూ మై డ్యూటీ.. ప్లీజ్!" అనేసి
సెల్ రిసీవర్లో తల దూర్చేశాను.
మరో మూడు నిమిషాల పాటు అలాగే కన్నీళ్ళతో మౌనంగా నిలబడి చివరికి వెళ్ళిపోయాడు సుబ్బారావు.
---
"నన్నెప్పుడూ
ఓ మెతక వెధవ కింద జమ కడతావుగా నువ్వు.
ఇకనైనా నీ అభిప్రాయం
మార్చుకుంటే బెటర్.. బెటర్ హాఫ్ గారూ" అంటో
ఆఫీసులో జరిగిందంతా ఇంట్లో ఇందిరకు
చెప్పేసాను గొప్పగా.
సాంతం విని తాపీగా అంది ఆ మహాతల్లి
"నిన్న నేను పొరపడ్డాను సుమండీ! ఊటీ
చెక్కేద్దామనుకున్నా సుబ్బారావుది మీ సెక్షను కాదట. మీ పక్క సెక్షన్ కొలీగ్ రంగనాంగారి
స్టెనోగ్రాఫర్ ఆ సుబ్బారావు. శుభ్రంగా సెలవులు పుచ్చేసుకొని
ఊటీ చెక్కేసాడు కూడా ఈ పూట. మాటల సందర్భంలో
రంగనాథంగారి మిసెస్ అంది ఇందాక. అతగాడి పెళ్ళాం తెచ్చే మేలు రకం ముత్యాల కోసం
ఎదురు చూస్తుంటేనూ ఇక్కడ ఈవిడగారూ..!"
ఇందిర ఇంకేదేదో చెబుతున్నది కానీ..
ఆ క్షణంలో మాత్రం నాకు .. న్నీళ్ళు నిండిన
కళ్లతో ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు మొహమే
కనబడింది. చలా గిల్టీగా అనిపించింది.
-కర్లపాలెం హనుమంతరావు
23 -02 -2021
బోథెల్, యూఎస్ఎ
Monday, February 22, 2021
(ఈనాడు ఆదివారం అనుబంధం, 1, డిసెంబర్ 2002 ప్రశకునం -కథానిక -కర్లపాలెం హనుమంతరావు-చురితం)
కొంత మంది 'అయ్యో' అన్నారు. కొంతమంది 'అమ్మయ్య!' అనుకున్నారు. ఈ 'అయ్యో'.. ' కు అమ్మయ్య' కు మధ్యనే మనిషి సాధించుకునే కీర్తి ప్రతిష్ఠలంతా.
పున్నారావు ఒక ముఖ్యమైన గవర్నమెంటు ఆఫీసులో అతి ముఖ్యమైన సీటులో చాలా ఏళ్ల బట్టి పనిచేస్తున్న ప్రజాసేవకుడు. గవర్నమెంటాఫీసంటున్నావు!.. పనిచేస్తున్నాడంటున్నావు.. ప్రజాసేవకుడంటున్నావు! .. ఇదెలా సాధ్యమయ్యా పెద్దమనిషీ! అని గద్దిస్తారని తెలుసు. ఎంత ప్రభుత్వ కార్యాలయమైనా ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. ముత్తెమంత దస్త్రమయినా ముందుకూ వెనక్కూ కదిలించకపోతే ప్రభుత్వపాలన ఎట్లా నడిచినట్లు లెక్కా? అట్లా 'పని' చేసే వర్గం ప్రజాసేవకుడు కాబట్టే పున్నారావు పోయిన వార్త విన్న వెంటనే 'అయ్యో' అని కొంత మంది 'ప్రజలు' కంగారుపడింది. ఆఫీసు పనికి అతగాడు కుదిర్చిన రేటు అఫర్డ్ చేసుకునే శక్తిలేని దద్దమ్మలేమైనా 'అమ్మయ్య' అనుకోనుండవచ్చు. ఈ కథకు వాళ్లతో కాకుండా 'అమ్మయ్య' వర్గంతోనే ప్రసక్తం.ఆ 'అమ్మయ్య' అనుకున్న వర్గంలో ఇంకో రకం కూడా ఉన్నారు. వాళ్లను గురించే ఈ కథంతా!
***
యమధర్మరాజుగారు
విగత జీవుల పాపపుణ్యాల లెక్కలను బేరీజు వేసుకుని ఆత్మలకు స్వర్గమో, నరకమో మంజూరు చేస్తారన్న
విశేషం అందరికీ తెలిసిందే! కాకపోతే ఈ మధ్యకాలంలో పాపుల సంఖ్య పగిలిన పుట్టలోని చీమలకు మల్లే పెరిగి పెరిగి నరకం నరకం కన్నా హీనంగా తయారైంది. పుణ్యాత్మల సంఖ్య మరీ పలచనయిపోయి వంద మంది పట్టే పుష్పక విమానం కూడా
తొంభై తొమ్మిది మంది నిండేందుకే వందలొందల ఏళ్లు తీసుకుంటుంది. విమానం పూర్తిగా నిండితే తప్ప
అది గాలిలోకి ఎగిరే ఏర్పాటు లేదు. ఎక్కువ మందిని ఒకే ట్రిప్పుల్లో తొక్కి
స్వర్గానికి తోసేయకుండా విశ్వకర్మ చేసిన కొత్త ఏర్పాటది. ఎంత మందెక్కినా ఇంకొకరికి అవకాశం ఉండే పాతకాలం ఏర్పాటు విమర్శల పాలవడం చేత విశ్వకర్మ కొత్త మోడల్ పుష్పకంలో త్రిమూర్తుల సలహా మీద ఈ తరహా ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడీ కొత్త పద్ధతే పుణ్యాత్మల ప్రాణానికి సంకటం మారిన పరిస్థితి! మన్వంతరాల తరబడి విమానం ఎప్పుడు నిండుతుందా? అని కళ్లు
చిల్లులు పడేటట్లు.. ఎక్కి కూర్చున్న పుణ్యాత్మలు ఎదురుచూడడమంటే.. మాటలా మరి!
కాళ్లు పీక్కు పోయేటట్లు విమానంలోనే పడుంటం కన్నా నరకం మరేముంటుంది! 'స్వర్గం
పీడాబాయిరి! తెలీక పుణ్యం చేసి చచ్చాం!' - అంటూ తలలు మోదుకునే ఆత్మలు రోజు రోజుకు
ఎక్కువైపోతున్నాయి చిక్కుపోయిన విమానంలో.
ఆత్మల ఘోష విని తట్టుకోలేక అక్కడికీ పాపాల చిట్టాలో నుంచి చాలా అఘాయిత్యాలను కొట్టిపారేయించారు యమధర్మరాజుగారు. ఇదివరకు పద్ధతుల్లోనే చాదస్తంగా పాపులను నిర్ధారిస్తు కూర్చుంటే నరకం నడవడం ఎంత కష్టమో అనుభవం మీదట గానీ తెలిసిరాలేదు పాపం.. సమవర్తిగారికి. ఏదో విధంగా అయినా వందో పుణ్యాత్మ దొరక్కపోతుందా అని ఆయన ఆశ.
అందుకే ఇద్దరు పెళ్లాలుండటం ఇది వరకు లెక్క ప్రకారం మహానేరం. ఇప్పుడు.. ఆ
ఇద్దర్నీ చక్కగా చూసుకుంటే పుణ్యాత్ముడి కిందే లెక్క. అబద్ధాలాడడం గతంలో పెద్ద శిక్షకు
ప్రథమ దండన. ఇప్పుడు వంద కాదు.. అవసరమైతే అంశాల వారీగా అవసరాన్ని బట్టి వెయ్యి వరకు
హాయిగా ఎన్ని అసత్యాలైనా అలౌడ్. మరీ అవసరమయితే అసలు అసత్యమనేదే శిక్షార్హమైన నేరమేమీ కాదనే ఆలోచన
చేసే ప్రతిపాదనా ఆలోచనలో ఉంది. సరుకుల్ని కల్తీ చెయ్యడం, శాల్తీలను మాయం చేసేయడంలాంటి పాపాలు
చేసే కిరాతకులు గుడి కెళ్లి హూండీలో ఓ పదో పరకో పడేసొస్తే చాలు.. పాప విముక్తులయే కొత్త
శాసనం ఒకటి జారీ అయివుంది. దొంగనోట్లు ముద్రించేవాళ్లూ, చెలామణీలో
పెట్టేవాళ్లు ద్రవ్యోల్బణం ప్రమాదం నుంచి
దేశాన్ని కాపాడుతున్న పుణ్యాత్ముల కింద స్వర్గానికి వెళ్లే అర్హులలో ప్రత్యేక కోటాగా ట్రీట్ చెయ్యబడుతున్నారీ మధ్య కాలంలో! ప్రశ్నపత్రాలు లీక్ చేయించడం, దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలిప్పించడం, మారుపేర్లతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి విదేశాలకు తరలించేసెయ్యడం లాంటి అమానుష కార్యాలన్ని
ఇప్పుడు విశ్వకళ్యాణార్థం నడుం బిగించి చేసే ప్రజాసేవ పద్దు లోకే మారిపోయాయి.
పున్నారావు
పైసల కోసం కక్కుర్తి పడితే పడ్డాడు కానీ, ఒప్పుకున్న పనిని సాధ్యమైనంత నిజాయితీతో పూర్తిచేయడంలో నిబద్ధత పాటించే
మనిషి. ఫేక్ స్కాలర్ షిప్పులు సృష్టించి ఎంతో మందిని ఆదుకున్నాడు. సర్కారు భూముల
కూపీలు లాగి వాటిని తగు మొత్తంలో ప్రయివేట్ పార్టీలకు అప్పచెప్పాడు. చేసే ఏ పనిలో అయినా పిసరంత ప్రజాకళ్యాణం తొంగిచూస్తుండటంతో ఫోర్సులో ఉన్న రూల్సు
ప్రకారం పున్నారావు కచ్చితంగా 'పుణ్యాత్మ' కేటగిరీలోకే రావడం న్యాయం. అందుకే పున్నారావు చచ్చిపోయాడన్న కబురు
చెవినబడగానే పుష్పక విమానంలోని పుణ్యాత్మలన్నీ ముక్తకంఠంతో 'అమ్మయ్య'
అనుకున్నాయి. మన్వంతరాల తరబడి విమానంలో దిగబడిపోయిన పుణ్యాత్మలంతా ఇహనైనా తమకు విమాన
విమోచనం ప్రాప్తించబోతున్నందుకు పరమానందంతో గంతులేశాయి.
***
పున్నారావు
యమధర్మరాజుగారి ముందుకు రాగానే చిత్రగుప్తుడు చిట్టా తీశాడు. పై నుంచి కిందికి పుట
నంతా భూతద్దాల కింద నుంచి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తృప్తిగా తల ఆడించి 'ప్రభూ! ఇతగాడిని నిస్సందేహంగా
పుష్పక విమానం ఎక్కించేయచ్చు. చిత్తగింజండి!' అంటూ పుట నొక్క
సారి ప్రభువులవారికి అందించారు.
యమధర్మరాజులూ
ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు. చివరాఖరుకు 'వందో పుణ్యాత్మ' లభించినందుకు ఆయనకు అపరిమితమైన
ఆనందం కలిగింది. విమానంలోని పుణ్యాత్మలూ తృప్తిగా సర్దుకుని కూర్చుని ప్రయాణానికి
సంసిద్ధమైపోయాయి. పున్నారావు పెట్టే బేడా సర్దుకుని (కొత్త నిబందనల ప్రకారం భూలోకంలో
కూడబెట్టిన ఆస్తిపాస్తుల్లో ఒక శాతం వెంట తెచ్చుకునే కొత్త సౌకర్యం ఆత్మలకిప్పుడు
దఖలు పడింది) గర్వంగా విమానం వేపుకేసి బైలుదేరేందుకు సిద్ధమయాడు. పైలెట్ కింకరుడు
కాక్ పిట్ లో కూర్చుని చివరి నిమిషం ఏర్పాట్లవీ పూర్తిచేశాడు. ఇంజన్ స్టార్ట్ చేసి ఇహ యమధర్మరాజుగారి
ఆఖరి మౌఖిక ఆదేశమొక్కటే తరువాయ అన్నట్లు సన్నివేశం క్లైమాక్సు కొచ్చిన సందట్లో...
***
'మ్యావ్ఁ' మంటూ అరుస్తో ఎక్కడి నుంచొచ్చిందో.. ఓ గండు పిల్లి పున్నారావు ఆత్మ గుండు మీద కొచ్చిపడింది అకస్మాత్తుగా. పిల్లి మీద పడగానే పున్నారావు గుండె
గతుక్కుమంది. ఉద్రేకమాపుకోలేకపోయాడు. పక్కనే ఉన్న కింకరుడి చేతిలోని ఈటె లాక్కుని
పిల్లి వెంటపడ్డాడు. పిల్లి అంటే పున్నారావుకు అంతలావు అసహ్యం.. జుగుప్స!
'ఎక్కడికైనా బయలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయితే ఆ పని ఇంకావేళ దుంపనాశనమయినట్లే లెక్క' అంటూ చిన్నప్పటి బట్టి ఆయన
నాయనమ్మ నూరి పోసిన ఉద్బోధ ఫలితం! పెద్దయిన తరువాత కూడా ఆ ప్రభావం జిడ్డు అతగాడిని అంబాజీపేట ఆవదంలా వదిలిపెట్టింది కాదు. చచ్చి పైకొచ్చిన తరువాతా అతగాడి ఆత్మను 'పిల్లి
ఫోబియా' వదిలిపెట్టలేదనడానికి .. ఇదిగో ఇప్పుడు పున్నారావు
ప్రదర్శించే విచిత్రమైన మనస్తత్వమే ప్రత్యక్ష సాక్ష్యం.
శరీరాన్ని
వదిలి వేసిన ఆత్మకు ఏ వికారాలు ఉండవంటారు. మరి
పున్నారావు ప్రవర్తనకు అర్థమేంటి?
యమధర్మరాజుగారికి
మతిపోయినట్లయిందీ సంఘటన చూసి. 'మధ్యలో ఈ మార్జాల
పితలాటకం ఏమిటి మహాశయా?' అన్నట్లు చిత్రగుప్తుల వైపు గుడ్లురిమి చూశారు యమధర్మరాజుగారు.
చిత్రగుప్తుడూ యమ కంగారుతో గబగబా చిట్టా తిరగేశాడు. 'చిత్రం మహాప్రభో! ఈ
పిల్లి కూడా చచ్చి ఇక్కడి కొచ్చిన మరో ఆత్మే! పున్నారావు తరువాత విచారించవలసిందీ ఆత్మనే. పిలవక ముందే ఎందుకు హాజరయిందో మరి.. అర్థమవడం లేదు!'అన్నాడు మిణుకు మిణుకు చూస్తూ. పిల్లి వైపు గుడ్లెర్రచేసి చూశారు యమధర్మరాజు.
'క్షమించండి మహాప్రభో! మీ సమక్షంలోనే న్యాయానికి ఘోర పరాజయం జరుగుతుంటే
చూస్తూ గమ్మునండలేకపోయాను. తొందరపడక తప్పిందికాదు' మ్యావ్( అంది పిల్లి పిల్లిభాషలో.
యమధర్మరాజులవారికి అన్ని భాషలూ కరతలామలకం. కనక ఇబ్బంది లేకపోయింది.
'వివరంగా చెప్పు' అని ఉరిమిచూశారాయన.
పిల్లి
తన గోడు చెప్పుకోడం మొదలుపెట్టింది. 'రోజూ లాగే ఆ రోజూ నేను పెందలాడే
నిద్ర లేచి ఎలుకల వేటకని బైలుదేరాను మహాప్రభో! వాకిట్లోనే ఈ పున్నారావు మహాశయుడు ఎదురయ్యాడు. 'చచ్చాంరా! ఇవాళేదో మూడింది నాకు.' అని భయపడ్డాను. పొద్దున్నే లేచి ఈ పున్నారావులాంటి
త్రాష్టులను చూస్తే మన కారోజు అన్నీ కష్టాలే!' అని మా అమ్మ
చెప్పేది నాకు. ముందు నేను నమ్మలేదు, కానీ,
రెండు మూడు దృష్టాంతాల తరువాత నమ్మక తప్పింది కాదు. ఈ మహానుభావుడు ఎదురయిన రోజున నాకు సరయిన ఆహారమైనా దొరికేది కాదు. లేకపోతే కుక్కల బారినన్నా పడేదాన్ని ఖాయంగా. అందుకని
వీలయినంత వరకు ఈ పెద్దమనిషి ఎదురు అవకుండా తప్పించుకుని తిరిగడం అభ్యాసం చేసుకున్నాను. కానీ, ఆ రోజు నా ఖర్మ కాలింది. ఒక పొగరుబోతు ఎలుక వెంటబడిపోతూ పొరపాటున ఈ మనిషికి ఎదురొచ్చేశాను.
వెనక్కు
తిరిగి వెళ్లిపొదామనుకునే లోపలే నా వెన్ను మీద ఇంత పెద్ద ఇనుపరాడ్ తో బాదాడు ఈ కిరాతకుడు. అది తగలరాని చోట తగిలి చాలా రోజులు విలవిలాకొట్టుకుంటూ .. చివరకు..
ఇదిగో ఇప్పటికి ఇక్కడ ఇలా తేలాను.. తమ సమ్ముఖంలో విచారణ ఎదుర్కోవడానికి. చూశారుగా! తమరి సమక్షంలోనే ఈ రాక్షసుడు
ఎంత అమానుషంగా ప్రవర్తించాడో! అభం శుభం తెలియని నన్ను, నా
మానాన నా పనేదో నేను చేసుకుపోయే జంతువును.. నిష్కారణంగా
నిర్దయగా చంపిన పున్నారావును ఎక్కడ పుణ్యాత్మ కింద లెక్కేసి విమానం ఎక్కించేస్తారో అన్న కంగారులో ఆవేశపడి మీ ముందుకు దూకేశాను. క్షమించండి!' అని మ్యావ్ మంది పిల్లి.
యమధర్మరాజుగారు
ఆలోచనలో పడ్డారు.
పుష్పకవిమానం
ఇంజన్ రొద పెడుతోందవతల. ఆపమన్నాడాయన.
ఒకసారి స్వర్గం ల్యాండ్ టచ్
చేస్తే గానీ ఈ ఇంజన్ ఇక ఆగదు మహాప్రభో! ఇదీ ఈ విమానం లేటెస్ట్ మోడల్ ప్రత్యేకత'
అంటూ తన నిస్సహాయతను వెల్లడించాడా పుష్పకం
నడపాల్సిన పైలెట్ కింకరుడు. వందో సీటు నిండితే గాని
వాయువాహనానికి ఎగిరే యోగం లేదు. చూస్తూ చూస్తూ పున్నారావును
విమానం ఎక్కించ బుద్ధేయడంలేదు దర్మవర్తికి. పిల్లి కథ విన్న తరువాత ఆయన మనసు పూర్తిగా మళ్లిపోయింది.
'ఇప్పుడేంటి దారి మరి?' అన్నట్లు చిత్రగుప్తుడి దిక్కు మిణుకు
మిణుకు చూశారాయన.
'నిందితుడి తరుఫు వాదనా విందాం మహాప్రభో! అదే న్యాయం కదా మన రాజ్యాంగం ప్రకరాం!' అని విన్నవించుకున్నాడు చిత్రగుప్తుడు.
పున్నారావు
పిల్లి చెప్పిన ఉదంతం మననం చేసుకునే ప్రయత్నం చేశాడు.
ఆ
రోజూ ఎప్పటిలానే తాను ఆఫీసుకు బైలుదేరుతున్నాడు. ఈ దిక్కుమాలిన పిల్లే కాబోలు నా పనంతా సర్వనాశనం చేసేందుకు ఆ రోజు నాకు ఎదురుగా తయారైంది. బామ్మ చెప్పినట్లే ఇంటి
నుంచి బైలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయిన రోజున పనులన్నీ సర్వనాశనమవడం ఖాయం. మూఢ నమ్మకం కింద కొట్టిపారేసేందుకు లేదు. ఒక సారైతే సరే.. ప్రతీ సారీ పిల్లి శకునం నిజం కావడంతో పిల్లి భయం
నుంచి బైటపడలేకపోయాడు తను.
ఆ
రోజు ఆఫీసులో తనకు ఒక పెద్ద పార్టీతో ఫైనల్ డీలింగ్ ఉంది. దాదాపు లక్ష రూపాయల వ్యవహారం.
సవ్యంగా సాగితే ముడుపు చెల్లిస్తానని దేవుడిక్కూడా మొక్కుకుని మంచి
ముహూర్తం చూసుకుని ఇల్లు దాటి కాలు బైటపెట్టాడు తను.ఎన్ని
జాగ్రత్తలు తీసుకున్నప్పటికి గడప దాటి కాలు బైటపెట్టేవేళకు ఎక్కడ నుంచి తగలడిందో.. ఈ శనిగ్రహం పిల్లి సరిగ్గా గుమ్మం ముందు నిలబడి మిర్రి మిర్రి చూస్తోంది
తన వంకే. కోపం పట్టపగ్గాలు తెంచుకోదా మరి ఎంతటి శాంతపరుడికైనా అట్లాంటి క్షణాలలో! అందుకే అందుబాటులో ఉన్న ఇనప
రాడ్ తో వెనక్కి తిరిగి అది వెళ్లిపోతున్నా కసి ఆపుకోలేక దాని నడ్డి మీద శక్తినంతా కూడదీసుకుని ఒకట్రెండు గట్టిగా వడ్డించుకున్నది. ఆ దెబ్బలకే ఇది చచ్చి ఇక్కడకు వచ్చి విచారణ కోసమై ఎదురుచూస్తున్నదన్న విషయం తనకెలా తెలుస్తుంది? ఎప్పుడో మర్చిపోయిన సిల్లీ పిల్లీ ఇన్సిడెంట్ ఇది. సరిగ్గా విచారణ పూర్తయి
స్వర్గానికి వెళ్లే పుష్పకం ఎక్కేందుకు పర్మిషన్ వచ్చే చివరి క్షణంలో ఇట్లా
వెనక నుంచి వచ్చి హఠాత్తుగా మీద తన మీద పడేసరికి యమధర్మారాజుగారి ముందే మళ్లీ తన పాత
ప్రవర్తన బైటపెట్టుకున్నాడు! పిల్లి రంగ ప్రవేశంతో ఇక్కడా మళ్లీ ఎప్పటిలానే పని
సర్వనాశనం!. ఇహ తనకు స్వర్గలోక ప్రాప్తి హుళక్కి- అన్న విషయం అర్థమయిపోయింది పున్నారావుకు. మాటా మమ్తీ లేకుండా నిలబడిపోయాడు దర్మరాజుగారి సమక్షంలో.
రెండు
నిమిషాలు గడచినా పున్నారావు నుంచి తగిన సంజాయిషీ రాకపోయేసరికి మౌనం అర్థాంగీకారంగా
తీసేసుకున్నారు యమధర్మరాజుగారు.
'చుస్తూ చూస్తూ ఒక కిరాతకుడిని స్వర్గానికి పంపించడం ఎట్లా? పైలట్ అవతల ఒహటే గత్తర పెట్టేస్తున్నాడు. ఇంజను ఆపటం
దానిని పుట్టించిన విశ్వకర్మ తరమే కానప్పుడు ఇహ కేవలం ధర్మాధర్మ విచక్షణాధికారాలు
మాత్రమే కలిగిన తన వల్ల ఎలా అవుతుంది? వందో పుణ్యాత్మను
గాలించి పట్టుకునే దాకా ఈ రొద ఇలాగే సాగితే త్రిమూర్తులకు తను ఏమని సమాధానం
చెప్పుకోవాలి? విమానంలోని ఆత్మలు పెట్టే ఘోషకు పిచ్చెత్తిపోయేటట్లుంది
అంత లావు ధర్మమూర్తికి కూడా!
ఇన్ని యుగాల విధినిర్వహణలో ఇంత ధర్మసంకటం ఎన్నడూ ఎదురయింది కాదు! దిగాలుగా ఆయన
సింహాసనానికి అతుక్కుపోయి కూర్చోనుండగా.. వందో పుణ్యాత్మ కోసమై చిత్రగుప్తులవారు చిట్టా మొత్తం తెగ గాలించేస్తున్నారు మహా అయాసపడిపోతూ.
అయిదు నిమిషాల పాటు ఆ మహాగ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి ఆఖరులో 'హుర్రేఁ!'అంటూ ఓ వెర్రి కేక వేసేశారు చిత్రగుప్తులు.
నివ్వెరపోయి చూస్తున్న
ప్రభువులవారి ముందు అమాంతం ఆ గ్రంథరాజాన్ని అలాగే ఎత్తి ముందు పెట్టి ఓ పుట వేలుతో
చూపించారు.
అదీ
పున్నారావు పాపపుణ్యాల పేజీనే!
ఒక్క
క్షణం పాటు దాని వంక ఆసాంతం పరికించి చిరునవ్వుతో మార్జాలం వంక తిరిగి 'మార్జాలమా! ఎగిరివెళ్ళి వెంటనే ఆ విమానంలో
కూర్చోమని మా ఆజ్ఞ!' అని ఆదేశించారు యమధర్మరాజు.
మ్యావ్ మంటూ పిల్లి విమానంలోకి గెంతటం, మరుక్షణంలోనే పుష్పకమూ గాలిలోకి లేవడమూ జరిగిపోయాయి! పుణ్యాత్మలంతా సంతోషంతో కేరింతలు కొడుతుండగా పుష్పక విమానం స్వర్గధామం వైపు దూసుకుపోయింది.
కనుమరుగయిపోయిన విమానం వంక చూస్తూ పున్నారావు ఖిన్నుడయాడు. తనకు దక్కవలసిన స్వర్గవాసం చివరి నిముషంలో పిల్లి కొట్టేసింది. అయినా.. తన పాపపుణ్యాల పేజీ చూసి పిల్లి పుణ్యాన్ని నిర్దారించడం ఏమిటి? .. వింతగా ఉంది!
'యుగాలబట్టీ సమవర్తిగా కీర్తి గడించిన యమధర్మరాజులవారు నా విషయంలో సవ్యమైన తీర్పు చెప్పలేదనిపిస్తోంది!'
అంటూ ప్రొటెస్టుకు దిగాడు పున్నారావు.
'మానవా! ఇది మీ భూలోకం కాదు. ఇక్కడ నీవు పనిచేసిన
ప్రభుత్వాఫీసులలో మాదిరి అపసవ్యంగా పనులు సాగవు. ఇది
యమధర్మరాజులవారి న్యాయస్థానం. న్యాయం ఏ మూలన పిసరంతున్నా పసిగట్టి
దానికి ధర్మం చేయడమే యుగాలుగా మేం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ధర్మకార్యం'
అన్నాడు చిత్రగుప్తులవారు సమవర్తి తరుఫున వకాల్తా పుచ్చుకుని.
'నాకు దక్కవలసిన స్వర్గం సీటును బోడి పిల్లికి ఎందుకు ధారాదత్తం చేసినట్లు వివరం సెలవిప్పించగలరా?'
తెగించి అడిగాడు పున్నారావు.
'నువ్వు నిందవేసినట్లు ఇది 'బోడి'పిల్లి కాదు పున్నారావ్! నీ మర్యాద మంట కలవకుండా ఎంతో కాలంగా నిన్ను కాపాడిన నీ ఇంటి దేవత' అన్నాడు చిత్రగుప్తుడు.
'అదెలాగా?!' ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టడం
పున్నారావు వంతయిందిప్పుడు.
'ఆ రోజు నువ్వు ఆఫీసుకు బైలుదేరిపోతున్నప్పుడు ఎదురైందన్న కోపంతో పిల్లిని చావగొట్టటం
ఒక్కటే కాదు.. మరో ఘనకార్యం కూడా చేశావు. నీకు గుర్తుందా?'
'లేకేం! ఇహ ఆ రోజు పని తలపెడితే దుంపనాశనం అవుతుందన్న భయంతో ఆఫీసుకు డుమ్మా
కొట్టి ఇంటి పట్టున ముసుగేసుకు పడుకుండిపోయాను. అయితే..'
'అ రోజే సిబిఐ వాళ్లు నీవు పని
చేసే ఆఫీసు మీద దాడి చేశారు పున్నారావ్! నువ్వు గాని సీటులో ఉండుంటే ఏమయివుండేదో తెలుసుగా? నీ పార్టీతో నువ్వు
కుదుర్చుకున్న బేరసారాల భారీ మనీతో సహా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా
పట్టుపడుండేవాడివి. మీ నాయన చేసిన ఇట్లాంటి పరువుతక్కువ
పనికే మీ అమ్మ నీ చిన్నతనంలో చెరువులో పడి ప్రాణాలు తీసుకుంది. నీ భార్యకూ అలాగే ఏ గ్యాస్ సిలెండర్ గతో పట్టించకుండా 'పిల్లి మీద నీకు ఉండే
పనికిమాలిన మూఢనమ్మకం' నిన్ను కాపాడిందయ్యా పున్నారావ్!
నీ పసిబిడ్డలు తల్లిలేని బిడ్దలుగా జీవితాంతం
బాధలు పడకుండా కాపాడిన పిల్లి పుణ్యాత్మురాలా? ఉత్తి పుణ్యానికి ఒక జంతువును పొట్టన పెట్టుకుని ఎన్నో పిల్లిపిల్లలను
తల్లిలేని పిల్లలుగా మార్చిన నువ్వు పుణ్యాత్ముడివా? ..
ఇప్పుడు చెప్పు! ఎవరికి పుష్పకంలో
ఎక్కే అధికారం ఎక్కువగా ఉంది?' అని ముగించాడు
చిత్రగుప్తులవారు.
"శకునం
వంకతో నిష్కారణంగా ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నందుకుగాను నీకు నరకమే గతి!.. నెక్స్ట్' అని హూంకరించారు యమధర్మరాజుగారు
పున్నారావుకు మరో మొండి వాదన లేవదీసేందుకు అవకాశం ఇవ్వకుండా!
పున్నారావును
కాలుతున్న ఇనుప స్తంభానికి కట్టేస్తూ 'వచ్చే జన్మలో అయినా ఈ పిచ్చి పిచ్చి
శకునాలు.. అవీ మానేస్తావనుకుంటా జీవా!' అన్నాడు
యమకింకరుడు వెటకారంగా నవ్వుతూ.
'ఎట్లా మానడం కింకరా? విమానం ఎక్కి స్వర్గానికి
పోవాల్సిన రాత దిక్కుమాలిన పిల్లి తగలడ్డం
మూలానే కదా ఇట్లా కాలే కాలే ఇనప స్తంభాలని కావలించుకోనే గతికి తెచ్చిందీ!' అన్నాడు పున్నారావు కసి కసిగా!
***
-కర్లపాలెం
హనుమంతరావు
(ఈనాడు
ఆదివారం అనుబంధం, 1, డిసెంబర్ 2002 ప్రచురితం)
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...