Showing posts with label Editorial. Show all posts
Showing posts with label Editorial. Show all posts

Tuesday, February 8, 2022

ఈనాడు- సంపాదకీయం కృషీవలుని విలాపం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో - ప్రచురితం - 18 -01 - 2015 )

 ఈనాడు- సంపాదకీయం 

 కృషీవలుని విలాపం 

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో  - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

'తిండి  లేకుండా జీవించే మానవ వంగడాన్ని ఎవరూ సృష్టించ లేరు' అంటారు ప్రఖ్యాత చారిత్రక తత్వవేత్త డి.డి. కోశాంబి. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచి మా/ గాణములన్‌  సృజించి, ఎము/ కల్ నుసిజేసి పొలాలు దున్ని' ఇంత అన్నం పెడుతున్నది రైతే.  ఏ జాతికైనా అతడే వెన్నెముక. వరదల అనంతరం పేరుకుపోయిన బురద ఒండ్రుమట్టిలో విత్తులు చల్లి ధాన్యం పండించిన తొలి అనుభవం మొదలు ప్రపం చవ్యాప్తంగా కాలానుగుణంగా వస్తున్న మార్పులకు దీటుగా నిలదొ క్కుకునే నేటి యోచనలదాకా రైతుకథ ఒక మహాభారతమంత. తొలిదశ కథలను, జాతక కథలను చెబితే... జానపదుల గాథలు ప్రతీ అడుగును తడుముతుంటాయి. 'ఏరువాకమ్మకు ఏం కావాలి?' అని అడిగి 'ఎర్రెర్రని పూలమాలలు, ఎరుపు తెలుపులు మబ్బుటెండలు, పొలంగట్టున టెంకాయ వడపప్పులు' అంటూ ఆరుబైటి హారతి పరిమళాలుగా పల్లెపట్టులు సాగుసంబంధాలను కొనసాగించడం ఒక్క భరత ఖండానికే చెల్లుతుందేమో! సప్తసముద్ర ముద్రితమైన భూమండలాన్ని పరశురాముడు సంతర్పణ చేసే. సందర్భంలో యాచించి బతకడం తలవంపుగా ఉంది.. చిన్న మడిచెక్కనైనా దానం పట్టమని ఆదిభిక్షువు చెవిలో పోరుపెడుతుందట పార్వతీదేవి. మిత్రుడు కుబేరుడిని అడిగి  విత్తులు, బలరాముడినడిగి నాగలి, యమధర్మరాజునుంచి దున్నలు తెచ్చి త్రిహలం సాయంతో వ్యవసాయం చేసి గౌరవంగా బతుకుదామని ఆ గౌరమ్మతల్లి ఆశ. 'అడిగిన జీతంబివ్వని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటే/ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు' అన్నది మహిలోని సుమతుల భావన. 'ఉండి తిన్నను లేక పస్తున్న  గాని/ యాస చేయవు పరుల కష్టార్జితంబు' అని కదా కృషీవలుడి గురించి దువ్వూరివారి ప్రస్తుతి.

 

కళ్ళంలో పైరు నూర్చి ఏడాదంతా నమ్ముకుని పనిచేసిన సాటి పనివాళ్లందరికి నియమానుసారం పొల్లుపోకుండా పాళ్లు పంచిన పదప మాత్రమే  మిగులు ధాన్యాన్ని బళ్లకెత్తించి ఇళ్లకు మళ్ళించే రైతన్నను మించిన  ప్రజాపోషకుడు జగాన ఎంత గాలించినా ఏ యుగానా కనిపించడు. 'దొరలు ఇచ్చిన పాలు కంటే ధరణి పుత్రుడిచ్చిన పాలు మేలు' అన్న నానుడి ఊరకే పుట్టిందా! కానీ, 'కొర్రు గుచ్చిన దేశమందు కరవులుంటాయా? దుక్కి దున్నిన దేశమందు దుఃఖ ముంటుందా? కావు నడచిన భూమి మీద ఏపు తగ్గిందా?'  అన్న పాట మోట నాగలి దున్నుకుంటూ పాటలేవో పాడుకుంటూ పాటుపడే రైతుకు ఊరట ఇచ్చే రోజులు వెళ్ళిపోయాయేమో! సమకాలీన మాయాజాలంలో రైతు చిక్కిన దుస్థితిని ఒక ఆధునిక కవి వ్యంగ్య వైభవంగా వెలిబుచ్చిన వైనమే ఈ పరిస్థితికి అద్దంపడుతుంది. గొప్ప నాయకులు కొద్దిమంది కుప్పగా  వచ్చి 'ఎద్దుల జత మాకు జమ్ము సుమ్మి/ నిన్ను ఉద్ధరించి మిన్నగా జేతుము' అని హామీ ఇచ్చి పశువులను తోలుకెళ్ళారట. 'నీదు కొడవలిమ్ము లేదు అనకు/ నీకు సేవ చేయ నేలపై పుట్టినాము' అని మాట  ఇచ్చి  కొడవలితో మాయమయిందట మరో మాయదారి గుంపు. 'అవుదూడల నిమ్ము అన్ని విధముల నీకు/ సేవ చేయగలము' అని గోపు సాక్షిగా మాయచేసిన మూక మరొకటి. బక్కరైతును అప్పుడైనా వదిలారా! 'నిన్ను చేరదీయ   వచ్చినాము సుమ్మి భగవాను సాక్షిగా/ వేగ తెమ్ము నీదు నాగలి 'కొని' ' అని తీపిమాటలు చెప్పి అదీ తీసుకుని పోతే- చివరికేమీ లేక రైతు దీనుడైన వైనం ఇప్పటి రైతన్న దైన్యాన్ని   అద్దంలో చూపించే చేదు విషాదమే! 

 

సామాజికంగా వ్యవసాయదారుడు  ఎన్నో వ్యవస్థల పీడితుడు. పన్నులు, జరిమానాలు, హింసలు, దౌర్జన్యాలు రాజుల కాలంనుంచే రైతును సలుపుతున్న పీడలు. ఫ్యూడల్ వ్యవస్థ నాటి  భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, గ్రామాధికారులు బహుముఖాలతో సతాయించిన సైతానులు. కరవులు, వరదలు- ప్రకృతిపరమైన శాపాలు నిరక్షరాస్యత, నిరుపేదరికం- విజ్ఞానాన్ని, అభివృద్ధిని మింగేస్తున్న భూతాలు. రైతు జీవితంలో మెరుగుదల ఉంటేనే అధిక ఆహారో త్పత్తి... మరేదైనా' అంటుంది ఆరు దశాబ్దాల కిందటి 'గ్రోమోర్ ఫుడ్ కమిటీ.  ప్రపంచీకరణం ప్రతికూల ప్రభావంలో, ఆధునిక విలాస ఇంద్రజాలంలో చిక్కింది యువ రైతాంగం. వలసలు, మానవ వనరుల కరవు, అరకొర నీటి సదుపాయం, సేంద్రియ విధానాలకు దూరం, మితిమీరిన ఎరువుల వాడకం, నాణ్యతలో నాసిరకం, తడిసి మోపెడవుతున్న వ్యయభారం, ఎడాపెడా వాయించే రుణాల రణగొణ ధ్వనులు. అందని మద్దతుధర, దళారుల మాయాబజారులో చిక్కి చేతికందిన పంటకు నిప్పు పెట్టుకోవడమో చేయి కాలిందని చివరికి 'పురుగు మందు' తాగడమో... ఇదీ నడుస్తున్న రైతుకథలోని ప్రస్తుత విషాదాంకం. 'బురదమళ్లను సుధా- వరదల ఉంది/ వరద వెన్నుల వీజె సరిగల్మీటి/ నాగేటి చాలులో- రాగరసాలు/ పారకచ్చులలోన సారస్వతంబు' సృష్టించిన సైరికుడికా ఈ  విలాపం? 'కృషితో నాస్తి దుర్భిక్షం' సూత్రం నేతిబీర చందంగా  మారడానికి  కారణాలు అనేకం. దాశరథి అన్నట్లు 'ఈ ధరా భూమి మధురాధరాన/ అమృతమొలికిస్తున్న హాలికుడికి ఇదమిత్థంగా  దక్కుతున్నదేమిటి? రామపాదం లాంటి రైతుపాదం తాకిన భీళ్లన్నీ శాపవిమోచనం పొందుతున్నా అన్నదాత ఇంట కరవు ఛాయలుండటమేమిటి? తెలుగు గడ్డమీద రైతు శిరసెత్తుకు నిలిచి నడిచిన నాడే  కదా అసలు సిసలు సంక్రాంతి!

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈ నాడు - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

 

 

 

Friday, December 31, 2021

ఈనాడు- సంపాదకీయం ఆనందాక్షరి రచన-కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

 

ఈనాడు- సంపాదకీయం 


ఆనందాక్షరి

రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )


'ఏ వాణి వేదశాస్త్రేతిహాస మహాబ్ది మందారవల్లియై కందళించే/ ..అయ్యమరవాణి హంసవాహనుని రాణి' ని  ఆవాహన చేసుకుంటూ గాని కరుణశ్రీ ఏ కావ్య రచనకూ శ్రీకారం చుట్టేవారు కాదు. వాణీ కటాక్షం లేకపోయుంటే వాల్మీకి మహర్షి వట్టి కిరాతకుడిగానే మిగిలే వాడు. 'మాణిక్య వీణాం ముపలాలయన్తి/ మదాలసాం మంజుల వాగ్విలాసాం' అంటూ మనసారా స్మరించిన మాతంగ కన్య అను గ్రహం వల్లనే మేకలు కాసుకునే కాళిదాసు మహాకవిగా చిరంజీవి అయ్యాడని ఓ కథ. ఆకాశాన్ని గుప్పిట పట్టేటంత విజ్ఞానఖని వ్యాస ముని. ఆ మహర్షి మేధస్సూ భారతమ్మ ఆశీస్సు ఫలమే! దైత్యనా థుడు హిరణ్యకశిపుడికి బిడ్డ ప్రహ్లాదుడి విష్ణుభక్తిపై దిగులు, 'లభ్యంబైన  సురాధిరాజ పదమున్ లక్షింపడ' ని  విచారం. 'విద్యాభ్యాసంబున గాని తీవ్ర మతిగాడని చండామార్కులవారికి చదువుసంధ్యలు అబ్బించే పని అప్పగిస్తాడు. ఆ సందర్భంలో చదువులు చేసే చలువ గురించి ఆ అసురప్రభువు చేసిన ప్రకటన ఇన్ని యుగాలు గడచినా వన్నెతగ్గని ఆభరణం. 'చదవని వాడజ్ఞుండగు/ జదివిన సద సద్వి వేక చతురత గలుగుం/ జదువగ వలయును జనులకు-  కృతయుగానికే కాదు అన్నింటా కృతకతపాలు పెచ్చు మీరుతున్న  ఈ కలియుగానికీ  అతికినట్లు సరిపోయే సూక్తి ఇది. జగత్తుకు గురువై ఉండీ మానవజన్మ ఎత్తినందుకుగాను శ్రీమన్నారాయణుడికే సాందీపని గురుకులాన జ్ఞానార్జన చేసేపని  తప్పిందికాదు. 'వానలు పస పైరులు కభి/ మానము పస వనితలకును మరి యోగులకున్/ ధ్యానము పస యా మీదట/ జ్ఞానము పస సుప్రసన్ను'లకు అన్న పరమానం దయతి 'సంపంగిమన్నా' శతకపద్యం నొక్కిచెప్పే సత్యమూ ఇదే. శేషము వేంకటపతి శశాంకవిజయంలో చెప్పినట్లు 'చెరకునకు పండు, పసిడికి పరిమళమును, చిత్రమునకు ప్రాణంబును, తా/ నరుదగ గల్గిన రీతిని' నరునికి విద్య అదనపు శోభాభరణం. ' లేశమేని సద్విద్య లేనివాడు/ శోభగాంచడు నిర్గంధ సుమము వోలె ' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తిలో కాదని కొట్టిపారేసే అతిశయోక్తి రవంతైనా లేదు. 


కోటి విద్యలు కూటి కొరకేనని సామెత.  మేదిన గల విద్యలన్నీ మెతుకుల కొరకేననడం సగం సత్యమే! అందరూ 'కూరగాయల' కోసమే చదువులు సాగిస్తే మనకు సౌందర్యలహరులు, కుమారసంభవాలు సంభవించేవా! 'తత్తరపడి యా ఉత్త చదువులు చదివితే తత్వ విచారంబయ్యేనా? / యుత్తమమైన నూరేండ్లు దాటినా ఉత్తమ పురుషుండ య్యేనా? ' అని ఏనాడో వీరబ్రహ్మేంద్రస్వామి డంబాల చదువును నిలదీశాడు. 'అసమాన దానవిద్యా రసికత లేనట్టి నరుని బ్రతుకేటికి సీ కసవేరు కతికి బ్రదుకదె/ పసరము తన కడుపునిండ' అని పర్వత కొండా శతకంలోని ఎత్తిపొడుపు. నార్లవారు అన్నట్లు- విజ్ఞతలేని విద్య ఎంత ఆర్జించినా ఏం లాభం? పేరు చూసి పిండినంత మాత్రాన నేతి బీరలోనుంచి నేయి కారుతుందా! 'పండితుండు' అని ప్రగల్భాలు పలి కినంత మాత్రాన నోటినుంచి రాలేవన్నీ ఆణిముత్యాలేననుకోవడం భ్రమ. మనిషిని మనిషి తినే కరవుకాలం విరుచుకుపడి ఒక పేద ద్విజుడు బతుకుతెరువు కోసం ఊరు విడిచిపోయే పనిలో పడ్డాడు. శివుడు కరుణించి అరవబాసలో స్వయంగా ఒక పద్యం చేసి పురాన్నేలే  రాజుకు సమర్పించి వెచ్చం తెచ్చుకొమ్మని ఆ పురోహితుడిని పురమాయించిన కథ ధూర్జటి విరచిత శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ఉంది. 'సింధురరాజ గమనా ధమ్మిల్ల బంధంబు సహజగంధం' అనే ప్రయోగ ఔచిత్యాన్ని రాజాస్థానకవి నత్కీరుడు ఆక్షేపిస్తే యాయవారం అయ్య వారి దగ్గర తిరుగు సమాధానమేది? చివరికి దక్కింది నిండుసభలో ఘోరపరాభవమే. శరీరపాటవం, మంచివాక్కు, పరిశుభ్రమైన దుస్తులు సంపదలు కలిగి ఉంటేనే లోకం గౌరవించేది. బంగారానికి సువాసన లాగా సింగారానికి నిజంగా మన్నన దక్కేది స్వయంగా సాధించుకున్న విద్యాసుగంధంవల్లనే. 'విజ్ఞానం మహాభాగ్యం' అన్న అబ్దుల్ కలాం సూక్తి ఎన్ని యుగాలకైనా వర్తించే సుభాషితం.


హెలెన్ కెల్లర్ ఈ వాస్తవానికి వర్తమాన ఉత్తమ ఉదాహరణ. మాట వినలేని, లోకాన్ని చూడలేని అనేకమంది అభాగ్యుల్లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది అంతులేని విద్యార్జన  అనే తపనే! 'వేడినీరు' స్వభావ స్వరూపాలను స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునేందుకు మసిలే నీటిని ఒంటిమీద వంపించుకుంటూ ఒక్కో అక్షర ఉచ్ఛారణ సాధన చేసిన తెగువ ఆ మగువది. నిరామయ నిశ్శబ్ద నీరవ నిశ్చల నిబిడాంధకార మస్తిష్కంనుంచి నిబద్ధతతో మేధను సానబట్టింది కాబట్టే 'ది స్టోరీ ఆఫ్ లైఫ్' అనే ఉత్కృష్ట గ్రంథకర్తగా ఆమె చరిత్రలో మిగిలిపోయింది. ఏళ్లతరబడి ఏకాంతవాసంలో గడపాల్సిన దురదృష్ట దుర్దినాలలో  సైతం నెల్సన్ మండేలా నమ్ముకున్నది బుద్ధిమాంద్యపు ఉపద్రవానికి నిరంతర పఠనం అనే మంచిమందు. గోడలను కాగితాలుగా కొనగోళ్లను కలం పుల్లలుగా మలచి కారాగారంలోనే గణితాభ్యాసం చేసిన జ్ఞాని కథ ' కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో' ది . అధ్యయనం చేయాలన్న ఆసక్తి ఉండాలేగాని ఆర్కిమెడిస్ సూత్రంనుంచి ఆవకాయ పాళ్ల దాకా అన్నీ ఆనందం కలిగించే అంశాలే! 'పెక్కులు చదివిన బెనగు దోడనే/తెక్కుల పలు సందేహముల'  అన్న అన్నమయ్యవారి సందేహానికి చిన్నయసూరి ' పంచతంత్రం' లోని  ' విద్య పలు సందియములు దొలచును/వెలయించు నగోచరార్థ విజ్ఞానము' అన్న సూక్తే చక్కని సమాధానం. విజ్ఞానంతోపాటు విద్య ఆనందాన్ని అందిస్తుందని బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం తాజా సర్వేలో తేలిందంటున్నారు నిర్వాహ కులు, అధిక విద్యార్హతలు కలిగిన వారిలో 81శాతం, అల్పవిద్యావంతులలో  74శాతం, నిరక్షర కుక్షులలో  64శాతం ఆనందకరమైన  జీవితాలు గడుపుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ' అవ్యక్త నిధిని తూచేందుకు మనిషి దగ్గరున్న పడికట్టు రాయి అక్షరం ఒక్కటే'  అంటారు ఖలీల్ జిబ్రాన్. ఆ అక్షరానికి ఆనందం అనే విలువ జోడించాలి. అప్పుడది మనిషి విలువను మరింతగా పెంచుతుంది!


రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

Thursday, December 30, 2021

ఈనాడు- సంపాదకీయం పాటే మంత్రమూ... రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 )

   ఈనాడు- సంపాదకీయం 


పాటే మంత్రమూ... 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 


దివ్యభావాలతో అమూర్తిని భగవంతుడిగా భావించి ఆరాధించడమే భక్తి. అది తొమ్మిది విధాలు. అందులో సంకీర్తనం ఒకటి. అది సంగీత సంబంధి. రామామాత్యుని స్వరమేళ కళానిధి- స్వర ప్రకరణం ప్రకారం, సంగీతం సామవేద సంగ్రహం. బ్రహ్మ సంగ్రహకర్త. సర్వజ్ఞుడైన శంకరుడు గానసంతుష్టుడు. అనంతుడు సంగీత స్వాధీనుడు. యక్షగంధర్వ దేవదానవ మానవాదులే కాదు... పశుపక్ష్యాదులూ నాదప్రియులు. గాంధర్వం, గానం అని సంగీతం రెండువిధాలు. గంధర్వులు గానంచేసే అనాది స్వరసంప్రదాయం గాంధర్వం. వాగ్గేయకారులు లక్షణయుక్తంగా రచించి దేశీరాగాలతో జనరంజకంగా పాడేది గానం. సంకీర్తనం గానప్రధానం. ఖట్వాంగుడు అనే రాజు ఇంద్రాది దేవతల వరప్రసాదం వల్ల తన ఆయష్షుకాలం ఒక్క ముహూర్తం మాత్రమే అని తెలుసుకుంటాడు. ' గిరులు బోలెడి కరులను/ హరులం దన ప్రాణ దయితలై మనియెడి సుం/ దరులను, హితవరులను, బంధ/ వరులను అందరిని వర్ణించి'  చివరకు గాఢ వైరాగ్యంతో మోక్షం పొందే ముందు నిరంతరాయంగా కొనసాగించింది గోవిందనామ సంకీర్తనమే ! 'ఈ మేను కలిగినందుకు సీతారామ నామమే పల్కవలెను' అని త్యాగరాజస్వామివారి కృతి. ' సకల సంగ్రహము సకల సంచ యము/ అకృత సుకృతమిది హరినామం' అని అన్నమాచార్యులు వారి సంకీర్తనం. 'రాతిరనే ఏనుగునెక్కి- రాకా చంద్రుడు గొడుగు గాను/ లేత తుమ్మెద మొదలైన బలముల చేత గెలిచెదనం టివా?' అంటూ మువ్వగోపాల పదకర్త క్షేత్రయ్య పదం. విరహం, వైరాగ్యం, శృంగారం, వేడుకోలు , అలక, సందేశం, సంతాపం, నుతి, ఎత్తిపొడుపు, బెంగ, పాగల్భ్యం  , బేలతనం- భావన ఏదైతేనేం... పొదిగే పనితనం ఉండాలేగానీ అన్నీ- సంకీర్తనాభరణంలో అందంగా అమిరే మణులూ మాణిక్యాలే!


జానపదం, యక్షగానం, జావళులవలె సంకీర్తనా ఒకానొక కాలంలో ముమ్మరంగా వెలిగిన దాఖలాలు కద్దు . సంకీర్తన ప్రక్రి యకు లక్షణాలు నిర్దేశించి, వేలకొద్ది గేయాలను సృజించిన పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య వంశంలోని పన్నెండుమంది కవులు స్వయంగా సంకీర్తన కర్తలు, ప్రచార నిర్వాహకులు. పెద తిరుమలయ్య తండ్రి సంకీర్తన కర్తృత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తే, ' సంప్రదాయాగత జ్ఞానసహితుడైన మనుజు సత్కవితయు వేదమంత సమము'  (తెలుగు సంకీర్తన లక్షణం-23) అంటూ సంకీర్తనాక్రియకు వేదప్రామాణికతను ప్రసాదించినవాడు చినతిరుమలాచార్యుడు. భక్తి అంటే రాతి విగ్రహం ముందు మోకరిల్లి మనసులోని కోరికలన్నీ ఏకరువు పెట్టడం ఒక్కటే కాదు. డాక్టర్ శ్రీపాద పినాకపాణివారన్నట్లు హృదయానుభవ భావమాధుర్యాన్ని బాహాటమైన పదాలతో ప్రకటించుకోవడమూ ఒక రకమైన భక్తిమార్గమే. భక్త మీరాబాయి కృష్ణప్రే మలో మునిగి భజనలు చేసినా, తుకారాం పాండురంగడిమీది అపరిమిత ప్రేమతో అభంగాలు గానం చేసినా, పురందరదాసు సుందరీమణుల ముందువెనకలనున్న శ్యామసుందరుడి అందచం దాలను పదాలుగా పలికినా- సంకీర్తనార్చనలోని అంతర్భాగాలే అవన్నీ. గీతాంజలి - ఈశ్వరుడికి టాగోర్ పట్టిన కీర్తనల హారతి. 'సానుతాప గానముతో సానురాగ గీతముతో/ మేనుమరచి నిన్నె వలచి/ వెదుకుచుంటి... వేచియుంటి' అంటూ బ్రహ్మసమాజం కోసం కృష్ణశాస్త్రి కలంనుంచి జాలువారిన సంకీర్తనలు ఎన్నెన్నో! తూము నరసింహదాసునుంచి ఎడ్ల రామదాసుదాకా తెలుగు సంకీ ర్తన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులు ఎందరో! 'చింతలేదిక యేసు పుట్టెను/ వింతగను బెత్లహేమందున' అంటూ అతిలోకదైవం మితిలేని ప్రేమను ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తూ యేసుభక్తులు చేసే కీర్తనలు, ఉర్దూ భాషామయ గీతికలను వచ్చిన లిపిలో రాసుకుని ఖురాను సమీపభావంతో అల్లా దయను కీర్తించే మొహరం గీతాలు- సంకీర్తనారాధనకు మతాలు ఎల్లలు లేవనేదానికి సంకేతాలు. 


వాంఛితార్థాలు తీరడం ఎలా ఉన్నా... పారవశ్యంతో సంకీ ర్తన గానం సాగించే నాదోపాసకులు మానసికంగా పొందే సాంత్వన అనిర్వచనీయం. 'పాట దైవసన్నిధికి బాట' అని పరమ భాగవతుల విశ్వాసం. ఇష్టమూర్తుల సద్గుణాలను పదపదంలో ప్రశంసిస్తూ ప్రతి పదానికి మానసికంగా అర్థాన్ని అనుభవించే సంకీర్తనా ప్రక్రియలో చైతన్యం వలయాలుగా ప్రసారమవుతూ మనసును ఆనందలోకాల విహారానికి మోసుకెళుతుంది. భక్తితత్వం అంటే కేవలం దైవసంబంధమనే భావన సగమే సత్యం. సామాజిక రుగ్మతలమీద విముఖతతో కూడుకున్న వైరాగ్య భావాలనుంచీ తత్వాల రూపంలో వెలువడ్డ సంకీర్తన సాహిత్యం తెలుగులో బోలెడంత. మేలుకొలుపులు, జోలపాటలు, పవ్వళింపులు, మంగళహార తులు, నీతిబోధనలు, బైరాగి గీతాలు, దేశభక్తి గీతాలు... సంకీర్తన ప్రక్రియకు బహుముఖ రూపాలు. కీర్తనల ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలిందిప్పుడు. మతిమరుపు వ్యాధిపీడితులు వందమందిమీద కీర్తన క్రియాత్మక ధ్యాన పద్ధతులను ప్రయోగించగా అందరి జన్యువుల్లో సానుకూల స్పందనలు నమోదయ్యాయని పరిశోధక బృందం తేల్చి చెప్పింది. ఆత్మాశ్రయం, అనుభూతి, ఆవే దనలనుంచి సాంత్వనను కలిగించే కీర్తనల ప్రక్రియ- మతిమరుపు రుగ్మత నిదానానికి ఔషధంగా ఉపయోగపడుతుందని తేలటం సంతోషించదగ్గ పరిణామమేగా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 

Wednesday, December 29, 2021

ఈనాడు - సంపాదకీయం క్రీడా స్ఫూర్తి ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

క్రీడా స్ఫూర్తి 


...

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


'క్రిందు మీదెఱిగి కృతకార్యుడగువాడు/ చేయు కార్యమెల్ల సిద్ధి బొందునన్న' ది  మడికి సింగన పద్మపురాణ ప్రవచనం. తండ్రి తొడలపై కూర్చుండనీయలేదని చిన్నారి ధ్రువుడు దృఢదీక్షకు దిగి శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకున్న కథ పోతన భాగవతంలో కనపడుతుంది. బాల ధ్రువుడికి కార్యదీక్ష లక్షణాలను వివరిస్తూ నారదులవారు చేసిన బోధ- సర్వకాలాలకు వర్తించే కార్యదక్షత పాఠం 'యుద్ధ సమయంలో బంధుమిత్ర పరివారాన్ని సంహరించడం ధర్మకార్యమేనా? ' అంటూ పార్థుడిలాగా సందేహ డోలికల్లో ఊగిసలాడేవాడికి విజయం- చెట్టుమీద ఉన్నా కొట్టలేని పిట్టలాంటిదే. ' చిత్తము చిక్కబట్టుము; త్యజింపు బేలతనమ్ము; మోము పై/ కెత్తుము, ధైర్యము జెదరనీకుము కొంపలు మున్గునయ్య నీ/ తత్త రపాటు నీ ముఖ విధంబు పరుల్ పసిగట్టిరేని' అంటూ హితవా క్యాలు పలికే నారాయణుడు నిజానికి మన గుండెల్లోనే కొలువై ఉంటాడు. శ్రీనాథుడి హరవిలాసంలోని హంసతూలిక పాన్పుపై ' నలరు మొగ్గ/ యెత్తునను మేను గలిగిన నీలోత్పలాక్షి' పార్వతి పశుపతిని తనపతిగా చేసుకునేందుకు శైల పాషాణ పట్టికా స్టండి లమున' పవ్వళించింది. ముత్తాతల పుణ్యగతుల కోసం దివిజ గంగను భువికి దింపిన భగీరథుడు- శివుడినుంచి జహ్నుమహర్షి వరకు  పెట్టిన పరీక్షలను తట్టుకుని నిలబడిన తీరు చాలు, ధీరోదా త్తుడికి ఉండవలసిన ముఖ్యగుణమేదో తెలుసుకునేందుకు .


ఏనుగు లక్ష్మణకవి సుభాషితంలో చెప్పినట్లు- కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని మదిలో లెక్కకు రానీయడు. పుట్టినప్పటినుం ఏ తన కన్నతండ్రికి పట్టం కట్టించేదాకా కన్నయ్యకు ఎదురైన కష్టాలు కడలిలో కెరటాలకు మించినవి. కందుకూరి వీరేశలింగం నీతికథామంజరిలో బోధించిన విధంగా '  కష్టపడునట్టివారు లోకంబు తోడ/ మొర్రపెట్టరు తమ కష్టములను గూర్చి వట్టివారలె యరతురు మిట్టిపడుచు'. అరుపులు గొడ్డు గేదెలకే గాని మనుషులకు గొప్పకాదని వీరేశలింగం అభిప్రాయం. వాస్తవానికి పశుపక్ష్యా దులూ నిశ్శబ్దంగానే తమ పనులు చక్కబెట్టుకుంటాయి. నల దమయంతుల మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం ఫలవంతం కావడానికి రాయంచ కడదాకా చూపించిన కార్యకుశలతే ప్రధాన కారణం. దారిపొడవునా దృశ్యాలు తరచూ గతిమారిపోయే తరుణంలోనూ సైబీరియన్ పక్షులు గడబిడ పడకుండా సుదూర ప్రాంతాలకు దారితప్పకుండా చేరడాన్ని కార్యశూరతకు ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవాలి. అసూయపడితే చాలదు... ప్రకృతినుంచి మనిషి చాలా పాఠాలు నేర్చుకోవాలి. 'పనులను ప్రయత్నము చేతన, కావవి బహు మనోరథములున్నంతన్' అని విక్రమదేవవర్మ సూక్తి. ఇసుక బొరియల్లో నుంచి బయటపడే వేళ సముద్ర  తీరప్రాంతాలు తాబేళ్లకు పూర్తిగా అపరిచితం. చిటికెన వేలంత లేని ఆ జీవాలు అట్లాంటిక్ సముద్ర జలాలను దశాబ్దంపాటు అన్ని అడ్డంకులు దాటి ఈదుకుంటూ తిరిగి క్షేమంగా స్వస్థలాలకు చేరుకుం టాయి. ఎవరు శిక్షణ ఇచ్చారు వాటికి?  లక్ష్యంమీద గురితప్ప కుంటే ఏనాటికైనా విజయం సాధ్యమే! బలమైన బంధనాల నిర్బంధం మద్యే ఎదిగిన ఏనుగు మామూలు మోకునూ ఛేదించే ప్రయత్నం చేయదు. ఆత్మవిశ్వాస లోపమే మనిషి పాలిట పెనుమోకు. విజయసాధనకు సులభమార్గం తెలుపమని ఓ జిజ్ఞాసి సోక్రటీసును సందర్శించాడు. జిజ్ఞాసి తలను చెరువు నీటిలో బలవంతంగా ముంచి ఉంచి లేపి బతికి తీరాలన్న కోరిక ఇప్పుడు ఉన్నంత బలంగా ఎప్పుడూ ఉంటే విజయం తనంతట తానే వచ్చి వరించి తీరుతుందన్న సోక్రటీస్ గురుబోధను మరవరాదు.


మూడువందల కోట్ల డాలర్ల వ్యాపారం చేసిన జేమ్స్ బాండ్ చిత్రానికి రచయితగా ఇయాన్ ఫ్లెమింగ్ కి దక్కింది ఆరువందల డాలర్లే. నిస్పృహతో కలం పారేసి ఉంటే బాండ్ సృష్టికర్తగా ఆయన చరిత్రలో మిగిలి ఉండేవాడా! ప్రమాదంలో కాలు కోల్పో యినా కృత్రిమ పాదంతో మయూరిగా తిరిగి వచ్చిన సుధా రామ చంద్రన్ ది  విజయకాముకులందరూ ప్రేరణపొందే స్ఫూర్తిగాథ. మొదటి విద్యుత్ బుగ్గ పనిమనిషి పాలబడి పగిలిపోయిన క్షణంలో నిరాశకు గురై ఉంటే ఎడిసన్ గొప్ప ఆవిష్కర్తగా నమోదై ఉండేవాడే కాదు. విజేత జీవిత పదకోశంలో ఓటమి అంటే అర్థం గెలుపు సోపానం. సైకిల్ రిక్షా వ్యాపార నష్టాలకు చెక్కుచెదరనందుకే ఉక్కు ట్రక్కులకు టాటా కొలబద్ద కాగలిగాడు. పదాలు సరిగ్గా పలకలేని ఐన్ స్టీన్ ప్రముఖ వక్తగా మారగలిగాడంటే- పట్టు దలే ప్రధాన కారణం. తుపానులొస్తాయని ఓడలను ఒడ్డున కట్టేసి ఉంచగలమా? విపత్కర పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించే ధీరులే కావాలి మనకిప్పుడు. బీజింగ్ ఒలింపిక్స్ లో  చేజా రిన పతకం లండన్ మైదానంలో దొరకబుచ్చుకున్న సైనా నెహ్వా ల్ లు  నేడు దేశావసరం. భారతావనికి తనవంతుగా మొదటి పతకం అందించిన గగన్ నారంగ్ రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించి తీరతానని సగర్వంగా ప్రకటించుకున్నాడు. ఇద్దరు బిడ్డల తల్లయి ఉండీ మేరీకోమ్ బాక్సింగ్ లో  సాధించిన విజయం ముందుతరాలకు ఆదర్శం. ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ కుమార్ సాధించిన రజతపతకం విలువ దేశవాసులందరికీ బంగారాన్ని మించినంత విలువైనది. సైనా గురువు గోపీచంద్ ఈమధ్య భాగ్యనగరంలో జరిగిన భారీ సన్మానసభలో దేశం తర పున ఆడే క్రీడాకారులందరి పక్షాన చేసిన వాగ్దానం- 'ఇది ఆరంభం' మాత్రమేనన్నది. క్రీడా ప్రేమికులందరూ సంబరపడవలసిన  గొప్ప సంకేతమది. క్రీడాకారులందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప సందేశమూ అందులో ఇమిడి ఉంది!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


Tuesday, December 28, 2021

ఈనాడు- సంపాదకీయం జాతీయ పానీయం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 )

 



ఈనాడు- సంపాదకీయం 


జాతీయ పానీయం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


ఉల్లాసంగా ఉండాలనుకున్నప్పుడు, ఒంటరితనం వేధిస్తున్నప్పుడు.... ఎప్పుడైనా సరే, కావాలనిపించేది కుదిరితే ఓ కప్పు తేనీరు. థేంక్ గాడ్! టీ కనిపెట్టిన తరువాతే నేను పుట్టాను' అనుకున్నాడట ప్రముఖ రచయిత సిడ్నీ స్మిత్. మదిరానికి అలవాటుపడి అనవసరంగా ప్రాణా లమీదకు తెచ్చుకున్నాడు గానీ... తేనీరు రుచి తెలుసుకుని ఉంటే ఉమర్ ఖయ్యాం మరిన్ని రుబాయీలు మనకు మిగిల్చి ఉండేవాడు. సుమతీకర్త కాలం నాటికి చాయికి  ఇంత ప్రాచుర్యం లేదు. ఉంటే అప్పిచ్చువాడు, వైద్యుడు వంటి అత్యవసరాల జాబితాలో తాజా తేనీరూ చేరి ఉండేదే. 'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష' అన్న మన పెద్దలు తేనీరు ప్రస్తావన ఎందుకు తేలేదో! తాగేవాడి హోదానుబట్టి పానీయం పేరు మారే విధానాన్ని నన్నెచోడుడు కుమారసంభవంలో చెప్పనే చెప్పాడు! 'అమరులు త్రావుచో అమృతమందురు దీని, వహిప్రజంబ జప్ర ముని గోనియానుచో నిది రసాయనమందురు' . ఆ క్రమంలోనే ఈ కలియుగంలో మర్త్యులు  పడిచస్తున్న పానీయం పేరు ' తేనీరు' ఎందుకు కాకూడదు? ' పెరుగును శరచ్చంద్ర చంద్రికా ధవళం'తో పోల్చిన కాళిదాసు తేనీరు రుచి కనుక తెలుసుకుని ఉంటే- ఏ తేనె పట్టు బొట్టుతోనో సరిపోల్చి ఉండేవాడు. శ్రీనాథుడి జమానాలో ఈ చాయ్ గొడవలు లేకగాని... ఉండి ఉంటే హరవిలాసంలో ' చిరుతొం డనంబిని చేగానుగాడి చెరుకుం/ దీగె రసంబును' జంగముడు తెమ్మ న్నట్లు'  ఏ అల్లం కొట్టిన సుగంధ తేనీరో కావాలని దబాయించకుండా ఉండేవాడా! నాటి కవులకన్నా మనం అదృష్టవంతులం. నేటి జనాభాలో నూటికి ఎనభైమంది తేనీటి ప్రియులేనని అఖిలభారత తేనీరు సంఘం తాజా గణాంకాలు తేల్చి చెబుతున్నాయి మరి. 


పని ఒత్తిడినుంచి పలాయనం చిత్తగించడానికి ఏనాడో ఓ చీనా వైద్యుడు కనిపెట్టిన చిట్కా తేనీరు. నాగరికులు చాయ్ రుచి మరిగేందుకు మరో పది శతాబ్దాలు పట్టింది. వినిమయ విధాన వాణిజ్యంలో భాగంగా తేనీటి కోసం విలువైన దుస్తులను , వెండినీ ఆంగ్లేయులు వదులుకున్నారంటే దాని రుచికి వేరే వివరణ ఎందుకు?  చైనాతో తెల్లవాడికి చెడటం భారతీయులకు కలిసివచ్చింది. అస్సాం సాగుమీదకు ఇంగ్లిషువాడి దృష్టి మళ్ళటం మన అదృష్టం. ప్రపంచ తేనీటి అవసరాలను తీర్చే ప్రముఖ దేశాల జాబితాలో భారతదేశానిదే ఇవాళ ప్రథమస్థానం. ఉత్పాదన లోనే కాదు.. వినిమయంలోనూ భారతీయులదే అగ్ర తాంబూలం. పడక దిగినప్పటినుంచి రాత్రి శయన మందిరం చేరే దాకా  భారతీయులు సగటున పదకొండు కప్పుల టీ సేవిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రుచికి ఆరోగ్యానికి సాధారణంగా చుక్కెదురు. 'మది రాపానము చేయువానికిని సన్మానంబులే సిగ్గు లే/ వదనాలంకరంబు  లే సుగతి లే వాక్పుష్టి లే వాంఛ లే ' అంటూ ఓ ఆధునిక కవి ఏకరువు పెట్టనే పెట్టాడు. కవివరుడు, భిషగ్వరుడు వేంకట నరసిం హాచార్యులవారు 'విశంగాదిరసం', 'రేపు మాపును మనుజుండు బదరీ పల ప్రమాణము సేవిస్తే వాత గుల్మాలు, జ్వరాలు, సంధి ప్రకోపాలు, ధాతు నష్టాలు వంటి ఎన్నో రుగ్మతలు దూరంగా పారిపోతాయని చికిత్సగా చెప్పుకొచ్చారు . ఖరీదైనది ఆ ఔషధం. అంతకన్నా అధిక ప్రయోజనాలను కలిగించే కారుచవుక ఔషధం తేనీరు. కేన్సరుకు తేనీరు విరుగుడు అంటారు. టీలోని బి కాంప్లెక్స్ విటమిన్లు, నికోటిన్, కెఫైన్  ఉత్తేజకరమైన శక్తి ఉత్ప్రేరకాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచే శక్తిమంతమైన ఔషధాలలో  టీ కి  మరొకటి సాటి లేదు. రక్త పోటు, చక్కెరవ్యాధి, దంత క్షయాలకు గొప్ప నిరోధకంగా పనిచేసే ఔషధం తేనీరు. దేవతలకు అమృతం ఉందో లేదో తెలియదు . మానవులం అదృష్టవంతులం. మనకు సర్వరోగ నివారిణి తేనీరు దొరికింది!


కొప్పరపు సోదరులు ఒక అష్టావధాన పద్యంలో చెప్పినట్లు ' ప్రభు భటులు, నైష్ఠికులు  గార్య పరత నేగ .. గొక్కరో కోయనుచు' కోడి కూయాలి. ఆ కోడికన్నా ముందే లేచి ఇంటి ఇల్లాళ్లు చాయ్ నీళ్లను  మరగబెడుతున్న రోజులివి. పొట్టలో టీ చుక్క పడనిదే పడక దిగనని మొరాయించే జనాభా పెరుగుతోంది. చైనా, జపాన్లలో తేనీటి సేవనం ఒక ప్రత్యేక ఉత్సవం. నిమ్మరసం టీ వారి ప్రత్యేకత. టిబెట్టులకు ఉప్పు టీని కొయ్యకప్పులో తాగడం సరదా. ఆఫ్రికన్లు టీ కషాయాన్ని చిలికి ఆ నురగ తాగుతారు. పశ్చిమాసియాలో యాలకుల తేనీరంటే ప్రాణం పెడతారు. భారతీయులు అన్నిరకాల తేనీటినీ ఆదరించే పానప్రియులు. గుజరాతీలకు మసాలా టీ మీద మనసైతే, కాశ్మీరీదేశవాసులు వట్టి కషాయంలో బాదం, యాలకులు కొట్టి వేసి ' కాహ్వా' అనే టీని 'వాహ్వా  వాహ్వా' అంటూ సేవిస్తారు. తేనీటి సేవనానికి వయసుతో నిమిత్తం లేదు. విద్యార్థి లోకానికి టీ నిద్రకాచే చిట్కా.  వయసు పైబడినవారికి శక్తినిచ్చే ఔషధం. ఉపవాసాలకూ నేడు తేనీరు నిషిద్ధం కాదు. అతిథి మర్యాదల్లో తేనీరు ప్రధాన అంశం. జీవనానికి నీరు ఎంత అవసరమో, చాయి  అంతకన్నా ముఖ్యావసరమైన రోజులు వచ్చాయి. మారుమూల పల్లెనుంచి మహా పట్టణం దాకా చాయ్ దుకాగాలు  కనిపించని చోటు భూమండలమంతా గాలించినా దొరకదు. టీ కప్పుల చప్పుళ్లు లేని సభలు, సమావేశాలు చప్పగా సాగినట్లే లెక్క.  సమరావేశాన్ని చప్పున చల్లార్చగల మహత్తు గుప్పుమని పొగలు గక్కే వేడి తేనీటికే కద్దు . ఎన్ని విభిన్న దృక్పథాలైనా ఉండనీయండి.... వందకోట్లకు మించిన మన జనాభా ముక్తకంఠంతో ' జిందాబాద్'  అనే  ఒకే ఒక్క పానీయం- తేనీరు. అసోమ్ లో  తొలుత తేయాకు సాగు చేసిన సిపాయిల తిరుగుబాటు వీరుడు మణిరాయ్ దేవన్ 212వ జయంతిని పురస్కరించుకొని తేనీటికి  జాతీయ పానీయం హోదా కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వాణిజ్యంపై నియమించిన పార్లమెంటరీ స్థాయీసంఘమూ తేనీటికి  జాతీయ హోదా కల్పించవలసిందని  సిఫార్సు చేయడం తేనీటి ప్రియులందరికీ తీయని కబురు.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


Sunday, December 26, 2021

ఈనాడు- సంపాదకీయం స్వేదయాగం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 )

 ఈనాడు- సంపాదకీయం 


స్వేదయాగం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 ) 


"పొలాలనన్నీ/హలాల దున్నీ! ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధార ల/తవిలి కురిపించి? ' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు, ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయ పూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరి కుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలై గాలులు వీస్తాయి. నాగులేటి వాగు నీళ్లు కాళ్లు కడు గుతుంటే, జామ కొమ్మ చిలకమ్మ క్షేమసమాచారాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరు పేరునా పలకరించుకొంటూ పొలం పనుల్లోకి దిగే హలధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా పొగుడుతాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసి పాపలకు మల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుంటూ మురిసిపోతాడు ఇంకో గేయకవి సుద్దాల. 'మట్టి దాహం తోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కుర వంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనే గదా పాతరలోని పాత గింజకైనా పోయిన ప్రాణం లేచి వచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులు రైతన్న మంత్రసానితనం వల్లనేగదా చల్లంగా తీరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా తీయడం, బలుపు తగ్గకుండా తగు ఎరువులేయడం, తెగులు తగలకుండ మందు చల్లడం, పురుగు ముట్టకుండ ఆకులు గిల్లడం, పశువు మేయకుండా కంచెలా కాపు కాయడం, పిట్ట వాలకుండా వడిసెతో కొట్టడం- పంట చేతికి దక్క డమంటే చంటిబిడ్డను మీసకట్టు దాకా పెంచడం కన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.


అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ము కున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అది! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమే కాదు. బిడ్డ ఆకలి తీర్చలేని తల్లిపడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచి మా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/భాషాణముల్' జాతికి నింపి పెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు' అని కవి జాషువాలాగా ఆర్తి చెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కోకొల్లలు. సింగమనేని నారాయణ భావించినట్లు నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతి అన్నదాతా కవులకు స్ఫూర్తి ప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి , మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీ వలుడు' అనే కర్షక కావ్యాన్నే సృష్టించారు. శాస్త్ర విజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోయినా  సాగుదారుడు లేకపోతే బతుకు బండి  ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాల నుంచీ ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాల దాకా... అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకులను  మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగు భారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.


జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్యమెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీట మునిగితే తల్లికెంత కడుపు కోతో, పంట మునిగిన రైతుకంత గుండెకోత.  చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటిం చుకున్నా ప్రభుత్వాలకు పట్టదు. గోడలేని పొలాలకు గొళ్లేలు బిగిం చుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ  రాడు. కళ్ళాల దగ్గరే కాదు... అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ చివరి వరకూ పోరాడవలసిన కర్ణుడైనాడు కర్ష కుడు. పొలం గుండె తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి... పంట చేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్లు పడు తున్నాయి... ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణ దాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద? రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతు పవనాలు. వేదికల వాదనలు రైతు వేదన తీర్చవు. అన్నదాత కన్నీ టికి కావాల్సిందిప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొని పోయే ప్రమాదం అట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా ఒక్క వాన చుక్క యినా చాలు/ వచ్చే కారు'కి 'చాలు'లో విత్తే చారెడు గింజలైనా దక్కుతాయి' అన్నది అన్నదాత ఆశావాదం. 'ఇఫ్కో' సాహితీ పుర స్కార ప్రదానోత్సవ సభలో కేంద్ర మంత్రి శరద్ పవార్ వల్లెవే సిన మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత అదే. 'మూల వర్షం ముంచినా జ్యేష్ఠ వర్షం తెలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా బతికిస్తోంది. మనందరికీ బతుకులు మిగులుస్తోంది.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 )

Saturday, December 25, 2021

ఈనాడు - సంపాదకీయం తన కోపమే తన శత్రువు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 )

 



ఈనాడు - సంపాదకీయం 

తన కోపమే తన శత్రువు


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 ) 


బ్రహ్మ ఆరంభంలో సృష్టించే విధానం తెలియక కుపితుడైన సమయంలో కనుబొమలనుంచి ఉద్భవించిన రూపమే రుద్రుడని పురాణ కథనం. నవరసాల్లో రౌద్రానిది శాంతరసంకన్నా ముందుస్థానం. దుష్టశిక్షణార్థం దివినుంచి దిగివచ్చిన అవతారమూర్తి సమయోచితంగా సత్యాగ్రహాన్ని ప్రదర్శించి ఉండకపోతే శిష్టరక్షణ సాధ్యమై ఉండేదా అన్నది ప్రశ్న. నారదమహర్షికి సనకమహాముని ఇచ్చిన వివరణ ప్రకారం కలియుగం మరో పేరు తామసయుగం. త్రేతా యుగంలోనే శ్రీరామచంద్రుడంతటి శాంతమూర్తికి వారధి నిర్మాణం వేళ సముద్రుడిమీద ఆగ్రహం పుట్టుకొచ్చింది. ద్వాపరంలో కురుక్షేత్ర సంగ్రామం మూలాలు దుర్యోధనుడి వంటి దుష్టుల మదమా త్సర్యాలలో దాగున్నాయి. రజోగుణజనితాలైన కామక్రోధాలే సర్వపాపా లకు మూలకారణమని గీతాచార్యుడు ప్రబోధించాడు. ఆయనే రాయబారంవేళ ' అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముడజాతశత్రుడే యలిగిననాడు సాగరములన్నియునేకము గాకపోవు' అంటూ యుద్ధ తంత్రంలోని దండోపాయాన్ని ప్రయోగించబోయాడు. అలకలకొలికి సత్యభామ పడకటింటి కోపతాపాలేగదా నందితిమ్మన పారిజాతాప హరణం' పరిమళ సౌరభాలు.  సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షాలవల్ల పునరుజ్జీవితుడైన పరీక్షిత్ మహారాజు శమీకమహర్షి తనను నిర్లక్ష్యం చేశాడన్న ఉక్రోషంతో క్షణికావేశంలో మృతస ర్పాన్ని మునిమెడలో వేసి చావును కొనితెచ్చుకున్న సందర్భం సదా స్మరణీయం . తండ్రికి జరిగిన అవమానానికి కుంగి శాపానికి పూనుకొన్న శృంగితో ఆ సందర్భంలో తండ్రి శమీకుడు అన్నమాటలు నిజానికి సర్వకాలాలకూ సర్వలోకాలకూ సహితం కలిగించే చద్దిమూటలు. త్రాచువంటి మూగజీవులకు కేవలం ఆత్మరక్షణాయుధమైన క్రోధంతో మేధావి మనిషి కార్యాలన్నింటినీ సాధించుకోవాలనుకుంటే ముందుగా నష్టపోయేది తాను, తనచుట్టూ ఉన్న సమాజం.


దమయంతి కల్యాణం నలుడితో జరిగిందని విన్న ద్వాపరుడు, శని కోపంతో చిందులువేసే సందర్భంలో వారి సేనానాయకులైన అరిషడ్వర్గాలు ఒక్కొక్కరే తమ ప్రతాపాలను ఉగ్గడించుకొనే సన్ని వేశం మహాభారతంలో ఉంది. కాముడి కారుకూతల తరవాత క్రోధుడి 'నా దుర్గం ఈ కామునికైనా దుర్భేద్యం . కాముని ఆశుగాలు ఈ క్రోధుని ముందు బలాదూరు' అనే కోతలు చాలు- ఈ దుర్వాస మానసపుత్రుడు మానవజీవితంలో చేసే అలజడులు, ఆగడాలు, విధ్వంసాలు వివరించడానికి. 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్ర/ నీవు కులుకుచు దిరిగెదవెవరబ్బ సొమ్మని రామచంద్ర'  అంటూ దాసునిచేతనే స్వామిని తిట్టిపోయించే గడుసుదనం దానిది. 'ఎగ్గుసిగ్గులు లేక ఏకచక్రపురాన/ భిక్షాటనము చేసి వెలగలేదే' అని పాండవ పక్షపాతే అధిక్షేపించగా 'నల్లపిల్లివోలె ఇల్లిల్లు గాలించి/పాల్వెన్న  దొంగిలి ప్రబలలేదే' అంటూ ఆ పాండవ మధ్యముడు ఎదు రుదెబ్బ తీస్తాడు. ఆ రచ్చంతా ఎంత అంతరంగికుల మధ్యనైనా చిచ్చు పెట్టించగల ముచ్చు క్రోధానిదే. ఉత్తమకావ్య రసాస్వాదన చేయలేని అశక్తుల మీద యధాశక్తి కసి తీర్చుకునే నిమిత్తం  నన్నెచో డుడు ఎన్నుకున్న మార్గం ప్రబంధ లక్షణమన్న వంకతో కుకవి నింద.  మదమాత్సర్యాలకు, కోపతాపాలకు కొరతేలేని సృజనరంగంలో తిట్టుకవిత్వం పేరుతో పొల్లుకొట్టుకుపోగా పొట్టుగా మిగిలిన సాహిత్య సరకే గుట్టలు గుట్టలు. 'నీపేరేమిట'ని అడిగిన నేరానికే 'వట్టిమానైన చిగురు బుట్టింప గిట్టింప బిరుదుగల వేములవాడ భీమ కవినే గుర్తించలేవా' అంటూ చాళుక్య చొక్కరాజంతటివాడిమీద తాడి చెట్టంత ఎత్తున ఎగిరిపడే కవితావతంసులకు కొదవ లేదు. వాక్పా రుష్యం దహనంకంటే దారుణమన్న నన్నయ్య శాంతిప్రవచనాలు చెవిన పెట్టకపోతే చెడేది ముందు మన ఆరోగ్యాలే!


మనిషి దేనిని  పరిత్యజించి శోకరహితుడవుతాడని యక్షుడు సంధించిన ప్రశ్నకు యుధిష్ఠిరుడిచ్చిన సమాధానం- క్రోధం. మనిషి జీవితం శోకమయం కావడానికి కోరికలే కారణమని బుద్ధభగవానుడి ప్రబోధం. 'తీరిన కోరికలు మరిన్ని కోరికలకు ప్రేరణలవుతాయి... తీరని కోరికలు క్రోధానికి కారణాలవుతాయి' అంటుంది భగవద్గీత. కోపమునకు ఘనత కొంచెమైపోవును/కోపమునకు మిగుల గోడుచెం దు/కోపమడచెనేని కోరికలీడేరు' అన్నది వేమన మాట. భూమినుంచి సహనం, వాయువునుంచి పరోపకారతత్వం, ఆకాశం నుంచి కాలాతీత మైన గుణస్థిరత్వం, నీటినుంచి నిత్య స్వచ్ఛత, అగ్నినుంచి పునీతమయ్యే గుణం అలవరచుకోవడానికే పంచభూతాలనే ప్రసాదాన్ని ప్రకృతి మనిషికి బహూకరించింది. ముక్కుమీదికోపం ముఖానికి అందమని ముప్పూటలా ముటముటలాడతామంటే మొదటిగా మోస మొచ్చేది మన ఆరోగ్యానికే అంటున్నారు వైద్యశాస్త్రజ్ఞులు. కాన్కార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకులు మానవజీవన ప్రమాణాలమీద ఒకటిన్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ప్రయోగాలలో  కోపగుణం- రక్తపోటు, నిద్ర, మానసిక ఒత్తిడి, హార్మోన్లు, శరీరావయవాలు, జీర్ణకోశం తదిత రాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. అనివార్యమైనప్పుడు కోపాన్ని ఆవేశపూరితంగాకాక అర్థవం తంగా సున్నితంగా ఎదుటివారు అర్థం చేసుకొనేటంత తగుమోతాదులో వ్యక్తం చేయడం ఆరోగ్యవంతమైన మార్గం అంటున్నారు ఆ పరిశోధక బృంద నాయకుడు. పేలుళ్లు, పెను విస్పోటాలవంటి దుస్సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే- విశ్వవ్యాప్తంగా ప్రతివ్యక్తీ తన మనసును స్వర్గధామంగా మలచుకొనే ప్రయత్నం ఆరంభించాలి. 'కోపాన్ని అణచుకోవడం గొప్ప యజ్ఞం చేసినంత ఫలం' అన్న తాళ్ళపాక తిరుమలాచార్యులవారి తత్వాన్ని ఒంటబట్టించు కొంటే- ఒంటికీ, ఇంటికీ, దేశానికీ, విశ్వానికీ మేలు.L


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 ) 

Friday, December 24, 2021

ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక కలకాలం కరవే కరువు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - కరవు ఘోష పేరుతో - ప్రచురితం - 15 -08-2009)


 



ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


కలకాలం కరవే కరువు!  

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - కరవు ఘోష పేరుతో - ప్రచురితం - 15 -08-2009) 



'తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి'  అనిగదా పెద్దలు అనేది' ఈ కరవు రోజుల్లో గారెలెలాగూ తినేది లేదుగానీ.. ఆ భారతమన్నా చెప్పు బాబాయ్.. ఈ జెండా పండుగ రోజున వినాలనుంది!'


' ఏం భారతంరా ... కరవు భారతమా? ఇప్పుడు మనకొ చ్చిన కరవు అప్పుడు ద్వాపరయుగంలో గనక వచ్చిఉంటే?  ఆ వందమంది కౌరవులను ముప్పూటలా మేపలేక పాపం గాంధారమ్మ మొగుడిచేత హస్తినాపురాన్ని ఏ మార్వాడీ వాడికో కుదువ పెట్టించి ఉండేది. అయిదూళ్ళయినా ఇవ్వమని పాండవులు ప్రాధేయపడ్డారంటే నిజంగానే కరవుందేమోనని అనుమానంగా ఉందిరా అబ్బాయ్ ! లేకపోతే పుట్టిన పిల్లల్ని పుట్టినట్లు ఆ గంగమ్మ నీళ్ళలో ఎందుకు వదిలేసుకుంటుందిరా కుంతి  ? ' 


' పో బాబాయ్; నువ్వెప్పుడూ ఇలాగే విచిత్రంగా మాట్లాడతావ్! ఆ కాలంలో కరవు ఉండి ఉంటే నిండుసభలో ద్రౌపదమ్మకు బేళ్ళ కొద్దీ చీరెలు శ్రీకృష్ణపరమాత్ముడెలా సరఫరా చేశాడంటావ్?'


' అందుకేరా ఆయన్ని దేవుడన్నది. అలాంటి మాయలు తెలియవు కనకనే భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు బండెడన్నం పప్పు, కూరలు రోజూ పంపిం చమన్నాడని బకాసురుణ్ని బండకేసి ఉతికాడు . కరవు రోజులొచ్చి మీదపడితే ఎంత లావు దానవీరశూర కర్ణుడైనా కవచ కుండలాల్లాంటివేవో అడిగితే ఠపీమని  పీకిచ్చే స్తాడుగానీ... కందిపప్పు ఓ పావు కిలో కావాలంటే దిక్కులు చూడాల్సిందే' 


' నువ్వు మరీ బాబాయ్! ఒక భారతమేంటి.. భాగవతంలో కూడా కరవు కాటకాలు తాండవించాయనేట్లున్నావ్ బాబోయ్!' 


  ' బాగా గుర్తు చేశావ్ రా అబ్బాయ్! ద్వాపరంలో మాత్రం ఈ కరవు కాట కాలకు కాపురాలు సరిగ్గా ఏడ్చి చచ్చాయా? చిటికెన వేలితో కొండనెత్తిన కృష్ణుడు తులాభారం నాటికి తులసాకంత బరువు కూడా తూగలేదంటే అర్ధమేమిటి? కరవు కాటకాలకు చిక్కి శల్యమైపోయాడనేగా ! అన్నీ ఉంటే ఆ కన్నయ్య అలా మన్ను ఎందుకు తింటాడురా! పాలు పెరుగులకోసం పొరుగు ఇళ్ళల్లో ఎందుకలా దూరతాడురా అబ్బాయ్? ' 


'బాబోయ్ నీ వరస చూస్తుంటే రామాయణానికి ఈ కరవు ఎసరు పెట్టేట్టున్నావే! ' 


'రామరాజ్యమనగానే కరవు కాటకాలనేవి అసలు రానేరావని నీ ఉద్దేశమా? నిజం నిష్ఠురంగా  ఉంటుందిగానీ, రాములవారు ఏకపత్నీ వ్రతమాచరించటానికి ముఖ్యకారణం ఈ దుర్భిక్షమే.  సీతాపహరణమనేది ఒక వంక గానీ, లంకమీద యుద్ధానికెళ్ళటానికి అక్కడ చక్కగా దొరికే ఉప్పూ, పప్పూ, బంగారమూ, బట్టలే అసలు కారణమంటే భక్తులు నొచ్చుకోవచ్చు. ఆ కాలంలో అడవులూ కరవు కోరల్లో చిక్కుకోబట్టే అప్పుడే పుట్టిన ఆంజనేయుడు కూడా ఆకలికి తట్టుకో లేక పోనీ సూర్యుణ్నయినా పండులాగా తిందామని పైకెగురుకుంటూ వెళ్ళాడు.' 


'ఇంక ఆపుతావా బాబాయ్ నీకు పుణ్యముంటుందీ!' 


'పాయింటొచ్చింది కనక చెబుతున్నాన్రా! ఆ హరిశ్చంద్రుడు నక్షత్రకుడి నస వదిలించుకోవడానికి ఆఖరికి అలిని కూడా అమ్మకానికి పెట్టాడుగానీ... అదే ఇప్పటి కరవు కాలంలో అయితే ఎవరు కొనేవారు చెప్పు?  సృష్టి ఆరంభంలో కనక అమృతంకోసం దేవదానవులు అలా కొట్టుకు చచ్చారు. ఈ కరవు కాలంలో అయితే అందరూ హాలాహలానికి ఎగబడి ఉండేవాళ్ళు పాడు జీవితాలతో విసిగి విసిగి ' 


'ఆ దానవుల్నంటే సరే, దేవతల్నీ వదలిపెట్టవా?' 


'ఈసారి నుంచి 'కరవు వీర', కరవు ధీర,'కరవుకాటక' బిరుదులిస్తున్నారు!' 


'విను' అందరి రాత రాసే విధాతకే కరవువాత పడక తప్పలేదురా బాబూ! నాలుగు నోళ్ళకు రెండు పూటలా ఆహారమంటే  మామూలు వ్యవహారమా! పొద్దస్తమానం పాలసముద్రంలో పడుంటే చింతామణికైనా చవిచెడి నాలిక్కింత చింతతొక్కు రాసుకుందామనిపించినా  కలికానికైనా ఆ లోకంలో దొరకని కరవుకాలం.  కనకనే అన్నేసి అవతారాల వంకతో భూమ్మీదికొచ్చి పోయాడేమో.. ? కలిమికి మొగుడైతే మాత్రం ఏం లాభం... కరవుకు ఆ దేవుడైనా దాసుడవాల్సిందేరా నాయనా! దేవుడి బతుక్కున్నా జీవుడి బతుకే నయం!"


'అదేంటి బాబాయ్... మరో వింత విషయం చెబుతున్నావ్ ! ' 


'మనకిలా ఏ కరవో కాటకమో వచ్చినప్పుడు వానలు పడాలనో, పంటలు పండాలనో దేవుళ్ళకు మొక్కుకుంటాం. దేవుళ్లకూ ఆ  కాటకాలొచ్చిపడితే పాపం ఎవరికి చెప్పుకొంటారు చెప్పు?' 


' పాయింటే బాబాయ్ ! ' 


' అంతే కాదు. మానవ  జన్మెత్తితే మరిన్ని లాభాలున్నాయిరా నాయనా! నిజాలే చెప్పాలన్న నియమం లేదు. పంట చేను పగులిచ్చి వానబొట్టుకు నోరెళ్ళబెట్టుకు చూస్తున్నా, వీధి బావి ఎండిపోయి, పాడిగేదె వట్టిపోయి, ముసలి తల్లి మందులేక మూలుగుతున్నా, పిల్ల గాడు ఫీజుకట్టక బడినుంచి చదువు మాని తిరిగి వచ్చినా , తాకట్టు కొట్టులో  ఉన్న పెళ్ళాం తాళి కలలో కనపడి ఎగతాళి చేస్తున్నట్లున్నా.. తట్టుకోలేక తెల్లారకుండానే ఓ అన్న దాత పురుగుమందు తాగి బతుకు తెల్లార్చుకున్నా - మందెక్కువై చచ్చాడేగానీ, కరవుతో  కాదని, అసలు కరవనేదే లేదు పొమ్మని బుకాయించవచ్చు.  ధరలు ఆకాశంలో వీరవిహారం చేస్తున్నాయి. ' దించండి మహాప్రభో ! ' అని వేడుకుంటే 'మంత్రాలకి చింతకాయలు రాల్తాయా! మా దగ్గరలాంటి మంత్రదండమే నిజంగా ఉండుంటే ప్రతిపక్షాలన్నింటినీ ఈ పాటికి హాంఫట్ మని మాయం చేసిఉండమా! ' అంటూ సాక్షాత్  ముఖ్యమంత్రి మాదిరి మాట విసిరి వినోదం చేయచ్చు.  జనం బియ్యం కొనలేక గంజి కాసుకుని తాగుతుంటే 'గంజి కాదది హోటల్  స్పెషల్ ‌ సూప్ ' అని సూపర్బుగా  కామెడీ చేసేయచ్చు . ఆ 'వ్యాట్' పన్నయినా పీకి పారెయ్యండి మహాప్రభో! ' అని మొత్తుకుంటే 'వ్హాట్ ' అంటూ గుడ్లురిమి చూసి ఆనక పకపకా నవ్వేయచ్చు.  పొరుగు రాష్ట్రాలకు బియ్యం తరలిపోకుండా ఆపగలిగితే ఈ ఆపద కొంతవరకైనా తగ్గుతుందేమో ఆలోచించండి సార్ ! ' అంటే ' అక్కడా ఇక్కడికన్నా ఘోరకలి ఉండబట్టే గదా... మన సరుకుల కోసం ఎగబడుతున్నది! మనది దేవుడి పాలనయ్యా!  పాపం జగన్ బాబు  ఆనందపడతాడని ఈసారికి వానదేవుడిని  నేనే కాస్త విశ్రాంతి తీసుకోమన్నా! జనం దాహం తీర్చటానికి బావి తవ్వుదామని ఉవ్విళ్లూరుతున్నా.  'సెజ్ కానిది గజం భూమి కూడా దొరక్క ఇబ్బందిగా ఉంది' అని కన్నీళ్ళు పెట్టుకోవచ్చు'


'ఇంకొద్దు బాబాయ్! నిజంగానే నాకూ కన్నీళ్ళొచ్చేటట్లున్నాయ్... ఆఖరుగా అడుగుతున్నా... రకరకాల కరవులున్నాయంటగా? తీవ్రమైన కరవు, సాధారణ కరవు, మూగ కరవు, ఏదేదో ఏకరువు పెట్టకుండా మనది ఏ రకం కరవో ఒక్కముక్కలో మాత్రం చెప్పు బాబాయ్! ' 


'మూగకరవురా అబ్బీ!  ఆగస్టులో నలభై డిగ్రీలు ఎండ కాస్తున్నా కరవు మండలాలు ప్రకటించకుండా మూగగా చూస్తూ కూర్చుందే ప్రభుత్వం... అందుకూ! ఈ ఆగస్టు పదిహేనుకున్నా సంకెళ్ళు తెంపుకొని స్వేచ్ఛగా చెలరేగి పోయే ధరవరలను అదుపుచేసి మళ్ళా మనకింకో స్వాతంత్ర్యం తేవాల్సిన విధి విధాతది కాదు.. దేవుడిపాలన అయిన మన ప్రభుత్వానిదే! 


'బాగా చెప్పావ్ బాబాయ్! తెల్లోడిని తరిమినవాడికి, తలచుకుంటే ఈ కరవును తరుమటం ఒక లెక్కా... పత్రమా!'



రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - కరవు ఘోష - పేరుతో 15 -08-2009-న ప్రచురితం) 


ఈనాడు- సంపాదకీయం కల్యాణం... కమనీయం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 04-2012 )

 



ఈనాడు- సంపాదకీయం 


కల్యాణం... కమనీయం!

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 04-2012 ) 


కీర్తి, కాంత, కనకం ఒకేసారి వరుడికి కలిసొస్తుంటే, వధువుకు జీవన మధువు అందివచ్చేది మెడలో మూడుముళ్లు పడే తొలి ఘడియల నుంచి.  ప్రకృతి మూలశక్తి, పురుషుడు ఆ శక్తిధరుడు. ఇద్దరూ పరస్పరాధారితులు' అని గీతావాక్యం! 'జీవితాంతం కలిసి ఉందాం. స్నేహితుల్లా జీవిద్దాం' అంటూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి వధూవరులు చేసుకునే ప్రమాణాలే వివాహకాండలోని ప్రధాన ఘట్టం. 'వంశం నిలబడాలన్నా.. ముక్తి సాధించాలన్నా గృహస్థాశ్రమం అత్యంత ఆవశ్యకం' అని  యాజ్ఞవల్క్యస్మృతి విధి . ఉగ్రుడు నారదుడికి గృహస్థు ధర్మ ప్రాశస్త్యాన్ని ప్రబోధించిన 'అయుతు- నియుతుల కథ' తెనాలి రామ కృష్ణ కవి 'శ్రీపాండురంగ మాహాత్మ్యం'లో కనబడుతుంది. అగస్త్యుడంతటి మహర్షి ప్రియశిష్యులు ఆయుతు, నియుతుల ఆలనా పాలనా చూసుకొనేటందుకు విధాత తనయలను తెచ్చి పాణిపీడనం (పెండ్లి) చేయించబోతాడు. 'అడవుల నవయు తపస్వికి/ గడు సౌఖ్యముకోరు సతికి కలయిక తగునే!' అని తలపోస్తాడు అయుతుడు. కపట గృహ స్థుగా రంగప్రవేశం చేసిన ఇంద్రుడు ఆ సందర్భంలో విశదీకరించే గృహస్థాశ్రమ ధర్మ మర్మాలు ఏ కాలానికైనా సర్వజన శిరోధార్యాలు. పాడిపం టలు, విందు వినోదాలు, దానధర్మాలు, దాసదాసీలు, బంధుబలగాలతో గ్రామపెద్దగా గౌరవం పొందుతూ, నిత్యనైమిత్తికాలు నిష్ఠగా ఆచరిస్తూ, ధర్మపత్ని ప్రేమతో వడ్డించే మృష్టాన్నపాయసాలను స్వీకరించడంలోని బ్రహ్మానందం రాయిలాగా జీవితం గడిపే నిత్యబ్రహ్మచారికి - ఆ దేవరాజు దెప్పినట్లు నిజంగా ఏం బోధపడుతుంది!


పచ్చపచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కల్యాణ మందిరాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య వధూవరుల సిగ్గులూ స్వప్నాలు, పట్టుచీరెల రెపరెపలు, పడు చుజంటలు పక్కచూపులు, పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, విందులు, వియ్యాలవారిమధ్య వినోదాలు, ఎదుర్కోల పన్నీరునుంచి అప్పగింతల కన్నీరుదాకా ఎన్నెన్ని అపూర్వ అపురూప అనిర్వచనీయ చిరస్మరణీయ మధురానుభూతులో... కల్యాణమంటే! 'వధువు వరు డును ద్వంద్వమై మధువు గ్రోలు' ఆ ప్రేమ బృందావనారామసీమ' గురించి కాళిదాసునుంచి కరుణశ్రీ వరకు వర్ణించని కవులు అరుదు. ఉమను పెళ్ళికూతురు చేస్తూ 'శృంగారక్రీడలో నీ భర్త తలమీది చంద్రకళను తాడించవలసింది ఈ వామపాదంతోనే సుమా!' అన్న సమకత్తెను  పూమాలతో ఉమ కొట్టిన తీరును కాళిదాసు వర్ణించిన వైనం అనుపమానం. సప్తమాతృకలు అందించిన విలాస సామగ్రిని విధా యకంగా మాత్రమే సృజించి వదిలేస్తాడు విరాగి గిరీశుడు. అయి తేనేం... ఒంటిమీది విభూతే సుగంధ లేపనం, కపాలం హస్తభూ షణం, గజ చర్మం చక్కని అంచున్న దుకూలం(తెల్లని వస్త్రం). మూడోకన్ను కల్యాణ తిలకం. సర్పాలు సర్వాంగాభరణాలు. వాటి శిరోమణుల వెలుగుల్లోని ఆ సహజ సౌందర్యమూర్తిని 'ఉమ' దృష్టితో చూడాలే గానీ... ఒడలు పులకరించిపోవూ! రాయలవారి ఆముక్తమా ల్యద రంగనాథుని వివాహ వైభోగం మరీ అతిశయం. ద్వాదశాదిత్యులు దివిటీలు. చంద్రుడు స్వామికి పట్టిన గొడుగు. నక్షత్రాలు దాని కుచ్చులు. కళ్లాపి చల్లినవాడు సముద్రుడు. అగరుధూపం అగ్నిదే వుడు. పందిళ్ళు చాందినీలు... దేవేంద్రుడు. నారద తుంబురులా



 దులు సంగీతం. గరుత్మంతుడు అంబారీ.  ఆదీ ఆ రంగనాథుడు కళ్యాణ వేళ తరలివచ్చినప్పటి ఆర్భాటం.  అల్లుడి కాళ్లుకడిగి, నిజపత్నితో కలిసి ఆనాడు విష్ణుచిత్తుడు చేసిన కన్యాదాన మహోత్సవమే నేటికీ తెలుగునాట పరిణయమంటే.


' స్వర్లోకమందున్న మానినులయందు బెండ్లిళ్లు  లేని కార ణమున మరులెత్తి మర్త్యలోకమున దేశ/ దేశముల పయింబడి వారు తిరుగుచుండ్రు' అని కవిరాజు త్రిపురనేని 'నందనోద్యానం'లోని ఒక చమత్కారం. ' తాడులేని బొంగరం- జోడులేని జీవితం' అని సామెత. వయసు పిల్లలు కనిపిస్తే ఇప్పటికీ పెద్దలు వేసే కుశల ప్రశ్నలలో  మొదటిది పెళ్ళి గురించే. ' పరిచారికల నడుమ మనోహర కాంచన మంటపంలో/ మసృణ  పర్ణాల నడుమ మందారం మాదిరి/ కూర్చొన్న మహారాజ్ఞి' అలవోకగా కేలనున్న జిలుగు చామరాన్ని కదిలిస్తే చాలునట... మరకత ఖచిత కనక పీఠిక పై/ మంతనాలయంలో మంత్రి మాండరీనులతో/ సామ్రాజ్య సంబంధ చర్చల మధ్య చిక్కిన మహామహీ మండలేశ్వరుడైనా ఆ పరిమళ సందేశాన్ని అందుకునేం దుకు కదలిపోవాల్సిందేనం' టారు కవి కృష్ణశాస్త్రి.  నిజమే. 'ఒక్కసారి ఈ కెమ్మోవి రుచి మరిగితిరా మరి వదలరు! ఒక్కసారి ఈ (ప్రేమ) బాహువులకు చిక్కితిరా మరి కదలరు' . ఆదికావ్యం రామాయణమే 'చతురాశ్రమాలలో  గార్హస్త్య జీవితం శ్రేష్టం.. ఉత్తమమ్' అని నిర్ధారించింది. ప్రతిదీ ప్రచండ వాయువేగంతో మార్పులకు లోనవుతున్న ఈ ఆధునికయుగంలో సైతం వేలాది సంవత్సరాలుగా వీస మెత్తయినా  తేడా లేకుండా తరంనుంచి తరానికి తరలివస్తున్నదంటేనే తెలు స్తోంది- మన వివాహ వ్యవస్థ ఎంత సుదృథమైనదో ! ... మరెంత సుందరమైందో!  శతాబ్దాల కిందట సోమేశ్వరదేవుడు 'అభిలాషితార్ధ చింతామణి'లో అభివర్ణించిన వధువు నిర్ణయం, నిశ్చితార్ధం, పెళ్ళి ఏర్పాట్లు, వివాహ కార్యక్రమం (నాతిచరామి, జీలకర్రబెల్లం, మంగళ సూత్ర ధారణ, సప్తపది, అగ్నిసాక్షి ప్రమాణాలు, లాజహోమం, అప్ప గింతలు లాంటివి) నేటికీ మనం తు.చ. తప్పకుండా ఆచరిస్తున్న పెళ్ళితంతు. ఏకపతి, ఏకపత్నిత్వాలకు  మొదటినుంచీ మనకు సీతారాములే ఏకైక ప్రతీకలు. శ్రీరామనవమి పేరుతో ఊరూ వాడా జరిగే సీతారాముల పెండ్లివేడుకలు  సువ్యవస్థితమైన వైవాహిక బంధంమీద ఈ జాతికున్న అచంచల భక్తివిశ్వాసాలకు గుర్తు.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 04-2012 ) 

Thursday, December 23, 2021

ఈనాడు - సంపాదకీయం ప్రణయ పరిమళం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 


ప్రణయ పరిమళం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 ) 


కంటిరెప్పల మైదానాలమీద కలల విత్తులు చల్లి అనుభూతుల పంట పండించేది ప్రేమ. హరిహర సుర జ్యేష్ణాదులు, కౌశిక శుక వ్యాసాదులు సైతం వలపు వలకు చిక్కి చిక్కిసగమైనవారే! ' కాయజుడు చేయు మాయల/ కా యజుడు, హరుండు, నంబుజాక్షుడు లోనై! తోయజ నయనల బాయరు/ హేయ జనుల్ నరులనంగ నెంత ధరిత్రిన్!' అన్న వైజయంతీ విలాసకర్త సారంగు తమ్మయ వాదన- కాదని కొట్టిపారేయలేనంత గట్టిది. చెట్టు నీడుండి, రుచియైన రొట్టె ఉండి/ దివ్యమైనట్టి శృంగార కావ్యముండి/ పరవశము చేయ గల మధుపాత్ర ఉండి/ పాడుచు హాయిగా ప్రియమైనవారు'  పక్క నుంటే ఉమర్ ఖయ్యామంతటి వాడికే- 'వట్టి బయలున స్వర్గం ఉట్టి పడుతుందట! వలచిన చిన్నది చాలాకాలం సుదూరంలో ఉన్నందువల్లే కాళిదాసు మేఘదూతం కథానాయకుడు చిక్కి శల్యమై చేతి కంకణాన్ని జారవిడుచుకొన్నది. 'మరలు కొనుచు హరిని వీడి/ మరలిన నర/ జన్మమేమి? ' అన్నంత భక్త్యావేశం ఉన్న విప్రనారాయణుడూ 'ఆడ ఉసురు తగలనీకు స్వామీ/ ముసురుకున్న మమతలతో కొసరిన అపరాధమేమి? ' అని ఒక ఆడుది ఇలా వేడుకొన్నదో లేదో రంగనిమాలా కైంకర్యమంతా ఆ అంగన సాంగత్యం పాల్జేసాడు! కావ్యాలంకార సంగ్రహ కర్త భట్టుమూర్తి- స్వాధీనపతిక, వాసవ సజ్జిక, విరహోత్కంఠిత , విప్రలబ్ధ , ఖండిత, కలహాంతరిత, ప్రోషిత భర్తృక, అభిసారిక అంటూ అష్టవిధ నాయికలుగా విభజించి చూపించాడు . కానీ - నిజానికి 'ఈ స్థాయీ భావాలన్నీ స్త్రీ పురుష భేదం లేకుండ పడుచు గుండె లన్నింటిలో సందర్భానుసారం గుబాళించే ప్రణయ పుష్ప పరిమళాలే! కొసచూపు దూసినప్పుడు, కులుకు నడక కంటబడ్డప్పుడు, సంయోగ శర్వరీలో, వియోగ విభావరిలో హృదయ సంబంధమైన సమస్తావస్థలలో  సరసులందరి మనసు లో పొరల్లో ముందుగా తళుక్కున మెరిసేది శృంగార భావమే! 'నాలో నన్ను ఇలా కలవరపరచేదేదో తెలీడం లేదు' అంటూ చలం 'గీతాంజలి'లో పడే ఆ అవ్యక్త మధుర బాధే ప్రేమికులందరిదీ. 'యెనక జల్మంలోన యెవరమో? ' అని బావ నాయుడంటే సిగ్గొచ్చి నవ్విన యెంకి, 'ముందు మనకే జల్మ ముందోలే' అనగానే తెల్లబోయిందట. ఎన్నాళ్లు మనకోలె ఈ సుకము లంటూ ఆ బావ దిగాలుపడితే కంట నీరెట్టేసుకుంటుంది ఆ నండూరివారి వెర్రి యెంకి. | నెత్తురు చెమ్మైన క్రమ్మకుండు/ పచ్చి గాయము లవి యమబాధ- పడవ/ కదిపితిని పొమ్ము, లక్షల కత్తులచట/ దిగ బడునయన్న భీతితో దిగులు నాకు' అని 'నాయని' ప్రేమను కత్తిపడ వ'తో పోల్చి మొత్తుకుంటారు. పువ్వులో తావిలా- తావిలో తలపులా/ కోకిలా గొంతులా- గొంతులో కోర్కెలా/ వెన్నెలా వెన్నలా వెన్నలో వెలుగులా నింగిలో నీడలా- నీడలో నిదురలా ప్రణయం ఒక్కొక్క రికి ఒక్కోవేళ ఒక్కో రూపంలో కనిపించి మురిపిస్తుంది. . కనిపించక కవ్విస్తుంది. . కనిపించీ కనిపించవండా ఏడిపిస్తుంది. గోడచాటున చేరి గుటకలేయడంతో మొదలయ్యే ప్రేమయాత్ర చూపులే ఆపేసి , రూపు పూసే మరిసి/వొకరెరుగ కింకొకరు వొంగి నిదరోదాము' అన్నంతదాకా సాగి సుఖాంతం కావాలంటే ధైర్యంగా దాటవలసిన  అవాంతరాలు ఎన్ని ఉంటాయో! మధ్యలో పడవలసిన  అవస్థలూ అంతే.  నిదురపోని కనుపాపలకు జోలపాట పాడలేక, ఈలవేసి చంపుతున్న ఈడుపోరు ఆపలేక పడుచుగుండెలు పడే దుర్భరానంద బాధ మేఘదూతం కాళిదాసు ఊహలకు సైతం అందనంత వింతైనది. మనసిచ్చినట్లు మాటొచ్చిన దాకా ఒక అంకం. మాటిచ్చినట్లు చివరిదాకా మనసును నడిపించుకో వడం మరో అంశం.  ప్రేమంటే రెండు గుండెలు చేసే సాము. గెలుపు కోసం ఓటమి, ఆ ఓటమికోసం అలుపెరుగని పోటీ.  వలపు- ప్రేమ పిచ్చివాళ్ల కూటమికి మాత్రమే అంతుబట్టే ఓ వింతక్రీడ.


భూమ్యాకర్షణ శక్తి సూత్రాన్ని సాధించినంత సులభం కాదు ప్రేమ ఆకర్షణశక్తి మూలాన్ని శోధించడం. ప్రణయ గణితంలో సంతోషం గుణకారం, సంతాపం భాగహారం, స్నేహం కూడిక, ద్వేషం తీసివేత అంటారు యండమూరి సమాధానంతో నిమిత్తం లేకుండా. ప్రశ్నలా పుట్టి మనసును సలిపేదే ప్రేమ.  ప్రేమను గురించి వివరిం చమని ఆల్మిత్రా అడిగినప్పుడు అలుస్తఫా సుదీర్ఘమైన వివరణ ఇస్తారు.  ఖలీల్ జిబ్రాన్ ప్రవక్త సందేశంలో ప్రేమమార్గం పరమ కఠినం. భీతి చెందకుండా విశ్వాసంతో వశమైపోయేవాళ్లను పరవశుల్ని చేసేది ప్రేమ పరుసవేది. నిజం. ప్రేమభావన సముద్రతీర లాంతరుగా మారి దారి చూపకపోతే జీవన సాగరంలో మనిషి ఏనాడో జాడ తెలియని ఓడగా కనుమరుగైపోయి ఉండేవాడు. మనిషి ఉనికికి ప్రేరణ ప్రేమే. నది ఇంకిపోయిన పిదప ప్రవాహపు గుర్తులు ఇసుక మేటలో కనిపించినట్లు- మనిషి కనుమరుగైన తరువాత అతను విత్తిన ప్రేమ వృక్షాలు పుష్పించి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. జీవితం వెలుగు చీకట్ల పడుగు పేకయితే, వెలుగు ప్రేమభావన. చీకటి దాని ఛాయ. 'లోకము నవ్వునంచుదనలో జనియించిన ప్రేమ నాపగా /నే కమలాక్షికైన దరమే!' అంటారు కొప్పరపు సుబ్బారావు 'తారాశశాంకం'లో. ఒయాసిస్సుల తడిసోకని ఎడారిలా బతుకు గడచిపోవాలని ఎవరు కోరుకుంటారు? కలల్ని రుమాలులో మూట కట్టుకోవాలన్నా, పిడికిలితో సముద్రాలని ఒడిసి పట్టుకోవాలన్నా- ప్రేమలో పడటమొక్కటే సులభమార్గం. మనసు నుంచి ప్రేమను దూరం చేయడం అంటే నదినుంచి నీటిని తోడేయటమే' అని ఒక ఆధునిక కవి భావన. కంటినుంచి దృష్టిని గెంటేయడం సాధ్యమా? ప్రేమా అంతే 'ఈసు కన్నుల దోయి/ చూచు చెడుపులు వేయి/ గుడ్డిప్రేమే హాయి' అంటారు కూనలమ్మ పదాల్లో ఆరుద్ర. ' ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును/ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును/ ప్రేమ కలుగక బ్రతుకు చీకటి'  అని ఎలుగెత్తారు యుగకవి గురజాడ. హింస, ద్వేషం, ఆవేశం, ఆక్రోశాలకు తావులేని ప్రేమ తావిని పంచుకోవాలన్నదే రాబోయే ప్రేమికుల దినం' యువలోకానికి అందిస్తున్న పరిమళ సందేశం.


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 ) 



Wednesday, December 22, 2021

ఈనాడు- సంపాదకీయం సౌహార్ధ దౌత్యం - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 )

 




ఈనాడు- సంపాదకీయం 


సౌహార్ధ దౌత్యం


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 ) 


పురాణాల ప్రకారం భారతీయులకు ప్రథమ దూత ఆంజనే యుడు. వాలి భయంతో రుష్యమూకంమీద కాలక్షేపం చేస్తున్న రాజు సుగ్రీవుడికి రామసోదరులకు మధ్య మంత్రి హోదాలో రాయబార మంత్రాంగం నడిపింది వాయుపుత్రుడే. సాధారణంగా ఎవరినీ  ప్రశంసించని రాఘవుడిని  ప్రథమ పరిచయంలోనే మెప్పిం చిన వాక్యవిశారదుడు హనుమంతుడు. 'ఇక్ష్వాకల  దశరథ తనయుడు పితృవాక్య పాలనకోసం అడవుల పాలయ్యీ కోల్పోయిన భార్య పునస్సాధనకోసం సాయం ఆశిస్తూ మన దరిచేరాడు. అంటూ ఆ విజ్ఞుడు చేసిన రామ పరిచయంలో ఒక్క పొల్లు పలు కైనా ఉందా! 'దూతకు ఉండవలసిన  ప్రధాన లక్షణం వాక్య విజ్ఞత'  అంటాడు చాణక్యుడు అర్థశాస్త్రంలో.  రాయబారం అంటేనే రాజకీ యాల బేరం. నియమానుసారం  అజ్ఞాత వాసానంతరం రాజ్యభాగాన్ని తిరిగి ఇచ్చే ఉద్దేశం లేని కౌరవులు యుద్ధభయంతో సంజయుడిని  పాండవుల వద్దకు రాయబారం పంపిస్తారు. యుద్ధ నివారణ సంజయుని రాయబార లక్ష్యం. యుద్ధ సన్నద్ధత పాండవుల ఆలోచన. రాయబారం విఫలమైనా దౌత్యకార్యంలో ప్రతిఫలించే లౌక్య లక్షణాలన్నింటికీ ధర్మరాజు, సంజయుల సంవాదం దర్పణం పడుతుంది. రెండు విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ ఏర్పడి నప్పుడు నివారణార్ధం రాయబారం అవసరం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సాగించిన ప్రఖ్యాత రాయబారం అందుకు విరుద్ధమైనది. కురుపాండవుల మధ్య సంధి కుదిరితే ద్రౌపది మానావమాన దుష్కార్యాలకు శిక్ష ఎక్కడుంటుంది? దుర్యోధన దుశ్శాసనులవంటి దుర్మదాంధులు కర్మఫలాన్ని అనుభవించకుండా తప్పించుకుంటే 'కృష్ణావతార ధర్మసంస్థాపన' కు మరేమి సార్థకత? రాయబారాలన్నీ ఒకే లక్ష్యంతో సాగవు. ఏ సాగరం లోతు దానిది.


పిల్లలమర్రి పిన వీరభద్రకవి 'శృంగార శాకుంతలం'లో శకుం తల దుష్యంతుల మధ్య కణ్వమహాముని పంపున  శిష్యులు రాయబారం నిర్వహిస్తారు. 'అగ్నిద్యోతనుడు' అనే పురోహితుడి అసమాన  రాయబార సామర్థ్యంవల్లే 'రుక్మిణీ కల్యాణం' సాధ్యమైంది. మనసు- వలచిన కన్యదే కావచ్చు. మాటల రూపంలో దానికి  దర్పణం పట్టవలసింది దూతగా వచ్చిన పురోహితుడే గదా! సందర్భం చూసి రుక్మిణి ఆకార సౌందర్య విశేషాలను ఆ భూసురుడు అత్యంత రసవత్త రంగా ఏకరువు పెట్టబట్టే గోపికానాథుడికి అగ్గిలం పుట్టింది. పురో హితులవారి చేత 'పెండ్లి నక్షత్రం' తెలుసుకొని మరీ విదర్భ దేశానికి పరుగులెత్తాడు.  ఆ కార్య సామర్థ్యమంతా భూసురుడి రాయ బారంలో ఉంది. ఆకాశ మార్గంలో సంచరించే మేఘశకలాలలకూ 'ప్రేమ సందేశాలు' మోయక తప్పలేదు. కాళిదాసు ' మేఘ దూతం' పేరుకు రెండు సర్గల ఖండకావ్యం కావచ్చునేమోగానీ.... దానిని  అనుసరిస్తూ వచ్చిన సందేశ కావ్యాలు లెక్కలేనన్ని. నలదమయంతులను కలిపే నిమిత్తం  బంగారు రెక్కల రాయంచ  రాయబారి పాత్ర నిర్వహించిందీ పరమేశ్వరుడే. నలుడి గుండెల్లో అగ్గి పుట్టించడం నుంచి, దమయంతిని నలుని దక్కంగ నొరునినే దలతునెట్లు? అన్నంత దాకా తీసుకుని పోయింది రాయంచ రాయబార విన్యాసమే. పింగళి సూరనార్యుని ' ప్రభావతీ ప్రద్యుమ్నం'లోని రాజ హంస శుచిముఖి ప్రేమరాయబారమూ అమోఘం. కథానాయిక అంగాంగాలను తనివితీరా వర్ణించి 'వచింపలేనయా/ క్కొమ్మ బెడం గులోన నొక కోటి తమాంశమునైన' అన్నదంటే 'శుచిముఖి వాణి'  వాస్తవంగా 'ఉపమాతిశయోక్తి కామధేనువే' !


పరవస్తు చిన్నయసూరి 'మిత్రభేదం'లోని దమనకుడు- వన రాజు పింగళకుడికి, వృషభరాజు సంజీవకుడికి నడుమ నిలబడి నడిపిన రాయబార మంత్రాంగం దౌత్యరీతులకే కొత్తపాఠాలు కూర్చినట్టిది . కొలువిచ్చిన పెదకోమటి వేమారెడ్డి పంపున బాల్యమి త్రుడు అవచి తిప్పయసెట్టిని కంచి రాయబారంలో శ్రీనాథుడు మంచి చేసుకొన్న తీరు సృజనరంగంలో రాయబారాలకు విలువ పెంచింది. మనిషి జీవితానికి, దేవుని రాయబారానికి మధ్యగల అనుబంధం అనుభవాలకు అతీతం. దైవ వాక్యాన్ని భూతలం మీదకు మోసుకొచ్చిన దేవదూత యేసు. 'లోభ మోహ మద కామ క్రోధ మాత్సర్య దుర్వ్యాళక్ష్వేళ కరాళ హాలాహల కీలాభిలమై అల్ల కల్లోమైన జగమ్ము సర్వమ్ము'నకు 'ఓం శాంతి' మంత్రాన్ని మోసు కొచ్చిన దూత బుద్ధభగవానుడు. భారతీయత ఔన్నత్యాన్ని ఎల్లల 'కావల మోతలెక్కించిన యువదూత వివేకానందులు. 'పవలున్ రాత్రులు నెత్తుటేళ్ళు ప్రవహింపన్ పాప భూయిష్టమౌ నవకళా నరకమ్ములో చరణ విన్యాసమ్ము గావించిన విశ్వమానవ సౌభ్రాత్ర దూత గాంధీతాత. 'ప్రాజ్యమైన సంగీత సామ్రాజ్యమునకు రాగ దూత'  త్యాగయ్య. ఇంటిదీపాన్ని ఆర్పిన గబ్బిలాన్నే తన కన్నీటి కథ ఈశ్వరునికి వినిపించే దూతగా మార్చుకున్నారు కవిపీష్వా జాషువా. దౌత్యకార్యాలతోనే ప్రపంచ తంత్రం ప్రస్తుతం నడుస్తున్నది . యుద్ధతంత్రాలకు, వ్యాపార సంబంధాలకు, సాంస్కృ తిక విశేషాల మార్పిడికే కాదు... శరణార్థుల సంక్షేమాలకూ రాయబారులను నియమించే కొత్త విధానానికీ నాంది పలికింది. హాలివుడ్ అందాలనటి ఏంజెలీనా జోలీ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమి షన్ ప్రత్యేక సౌహార్ద రాయబారిగా నియమితులు కావడం అభినం దనీయం. ఆరుబయట మలమూత్రాల విసర్జనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చేపట్టబోతున్న పారిశుధ్య ప్రచారోద్యమ ఆరోగ్య రాయబారులుగా బాలీవుడ్ నటీనటులు విద్యాబాలన్, షారుక్ ఖాన్  ఎంపికయ్యారు. తెరవేల్పుల మాటే మంత్రమై, ఆరోగ్య సూత్రాలపై కనీస అవగాహన అట్టడుగు స్థాయి చేరితే అంతకన్నా కోరదగినది ఇంకేముంటుంది ?


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 ) 


Tuesday, December 21, 2021

ఈనాడు - సంపాదకీయం ప్రాణభయానికి పగ్గాలు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 )

ఈనాడు - సంపాదకీయం 


ప్రాణభయానికి పగ్గాలు 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 


దుఃఖాలలో  కెల్లా  మరణం భయంకరమైంది. 'మరణమను లేతనుడి చెవింబడినయంత/ దలిరు గాలికి శుష్క పత్రమువోలె' గడగడ వణకడం- మానవ బలహీనత. 'మనుజుడై పుట్టి మనుజుని సేవించి/ అనుదినమును దుఃఖమందనేలా? ' అని అన్నమాచార్యుల వంటి మహానుభావులు ఎందరు ఎన్ని వందలసార్లు వేదాంతాలు వల్లించినా ప్రాణంమీది తీపి  అంత తొందరగా పోయేది కాదు. నది, సముద్రం కడకు ఒకటే అయినట్లు కాలప్రవాహానికి జీవితం, మృత్యువు రెండు పాయలు. చనిపోవడం అంటే ఉచ్ఛ్వాస  నిశ్వాసాలు, కాల పంజరం నుంచి శాశ్వతమైన ముక్తి పొందడం- అంటాడు ఖలీల్ జిబ్రాన్. ఎవ రెన్ని సుద్దులు చెప్పినా గడిచిపోయే ప్రతిక్షణం కాలవాతావరణ కేంద్రం మరణమనే తుఫానుకు హెచ్చరికగా ఎగరేసే ప్రమాద కేతనం సంఖ్యను పెంచుతూనే ఉంటుందన్నది మనిషి దిగులు. రేయింబవళ్లు చీకటి వెలుగులు, ఇంటాబైటా, ఏ జీవీ, ఏ యుద్ధం, ఏ ఆయుధం తన మరణ కారణం కారాదని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని  వరం కోరింది ఈ మృత్యుభీతితోనే.  ఆ మరణభయంతోనే మార్కండేయుడు మారేడు దేవుడి శరణుజొచ్చాడు. మహాసాథ్వి సావిత్రి సాక్షాత్ సమవర్తినే బురిడీ కొట్టించింది. భర్త ఆయుష్ చంద్రికలను మృత్యుకేతువు మింగేసిందని  దేవతల చిరాయువు కోసం కచుడు పడిన ఆరాటమే మృతసంజీవనీ విద్య కధ. అమరత్వ సిద్ధికి జాతివైరం కూడా మరచి సురాసురులు క్షీరసాగర మధనానికి పూనుకొన్నారు. దేవదానవులదాకా ఎందుకు- ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే కాకులూ తమలో ఒకటి పడిపోతే కావు కావుమని గగ్గోలు పెడతాయి. జీవరాశులన్నింటిలోకీ తనది అత్యున్నతమైన జన్మ అని నమ్మే మనిషిని జీవితం మిథ్య అనుకొమ్మంటే అంగీకరిస్తాడా? పోయినవాడూ తిరిగి ప్రాణాలతో వస్తాడేమోనన్న ఆశతో గ్రీకులు మూడురోజులు, రోమన్లు ఏడురోజులు శవజాగారం చేసేవారు. పార్థివదేహం ప్రాణం పోసుకుంటుందేమోనన్న చివరి ఆశతో దింపుడు కళ్ళెం  పేరిట మహాప్రస్థానం వేళా మృతుడిని ఆత్మీయులు ముమ్మార్లు పేరుతో పిలిచే ఆచారం మనది. 'కన్ను తెరిస్తే జననం/ కన్ను మూస్తే మరణం/ రెప్పపాటే కదా ఈ పయనం' - అని తెలిసినా ఈ ప్రయాణం నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉండాలని కోరుకోవడమే జీవనపోరాటం. ఆ ఆరాటమే మృత్యుంజయత్వంపైకి మనిషి దృష్టిని మళ్ళించింది.


ఆరాటం ఆలోచనాపరుణ్ని విశ్రాంతిగా ఉండనీయదు. ఖాళీ గిన్నెను ముందేసుకుని డీలా పడేవాడే అయితే, పొయ్యిమీది గిన్నె మూతను కదిలించిన శక్తితో మనిషి ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించగలిగేవాడు కాదు. సుఖంకోసం వెంపర్లాటే లేకపోతే ఇంకా పక్షి ఈక లను చెట్టు మానులనుంచి స్రవించే ద్రవంలోనే ముంచి తాళపత్రాల మీద గిలుకుతుండేవాడు. ఆరుద్ర ఒక చిత్రంలో చెప్పినట్లు- మాన వుడు శక్తియుతుడు, యుక్తిపరుడు. దివిజ గంగను భువికి  దింపిన భగీరథుడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్రుడు. 'ఎంత లెక్క తిరిగినా నేమి లేదురా/ చింత చేసి చూడకున్న వింతలేదురా' అంటూ వీరబ్రహ్మేంద్రస్వామి తత్వాలు పాడారు. నిజం. ఆ కాల జ్ఞాని ప్రబోధించినట్లు- మూల మూలలా శోధిస్తేనే ముక్తి ఆ మూల నున్న జ్యోతిని ముట్టిస్తేనే బతుకులో వెలుగు.  అది తన ప్రాణజ్యోతి  అయినప్పుడు అది అఖండంగా కాంతులీనుతుండాలని మనిషి కోరుకోవడం అత్యాశ కాదుగదా! శరీరం శిథిలమైపోయింది. జుట్టు నెరిసిపోయింది. పళ్లన్నీ ఊడిపోయి నోరు బోసిపోయింది. వృద్ధుడై కర్ర సాయంతో నడుస్తున్నాడు. అయినా జీవితేచ్ఛ మనిషి శరీరాన్ని విడవడం లేదు' అని సంస్కృతంలో ఒక శ్లోకముంది. శాస్త్రవేత్తలూ తమ వంతు కర్తవ్యంగా చావు  పుట్టుకల గుట్టుమట్లను ఇప్పుడు శాస్త్రీయంగా బట్టబయలు చేసే కృషిలో తలమునకలుగా ఉన్నారు.


ఆజన్మ బ్రహ్మచారి నారదుడు ఒకసారి జన్మ రహస్యాన్ని గురించి 'ప్రారంభాది వివేకమెవ్వ డొసగుం! ప్రారంభ సంపత్తి కాధారం బెయ్యది! / యేమిహేతువు? ' అని అడిగాడట. మనిషి   దేవాంతకుడు   కదా! అందుకే 'సర్వానుసం/ధానారంభ విచక్షణత్వమ' నే      జీవరహస్యం అంతుచూసి కాలాంతకుడిగా మారాలని కంకణం కట్టుకున్నాడు. జన్యువుల కోడ్ తిరగరాయడం ద్వారా జరామరణాలను నియంత్రిం చవచ్చన్నది ఆధునిక విధాత  సిద్ధాంతం. ఇటీవలి టైమ్స్ పత్రిక ముఖచిత్ర కథనం ప్రకారం- కంప్యూటర్ పరిజ్ఞానం, బయోటెక్నాలజీ లను జోడించడం ద్వారా జీవి ఆయురారోగ్యాలను కోరుకున్న విధంగా పొడిగించుకోవడం సాధ్యమే. సింగ్యులారిటీ విభాగంలో ప్రసిద్ధులైన అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త రేమండ్ కర్జల్, బ్రిటిష్ బయాలజిస్ట్ అట్రే డి గ్రే మరో రెండు దశాబ్దాల నాటికి మానవ మేధను మించిన సూపర్ కంప్యూటర్లు రంగప్రవేశం చేస్తాయంటున్నారు. వాటి సాయంతో మానసిక చైతన్యాన్ని చిప్స్ రూపంలోకి మార్చుకోవచ్చని చెబుతున్నారు. నానోటెక్నాలజీ సాయంతో ఈ చిప్సు ను  మనిషి మెదడుకు అనుసంధానిస్తే శరీరంలో అంతర్గతంగా ఏర్పడే రుగ్మతల మూలాలను ఆదిలోనే పసిగట్టి సరిచేసుకోవచ్చని ఆ శాస్త్రవేత్తల భావన. పరిశోధనలు ఫలిస్తే మనిషి మృత్యువును జయించడానికి మరో మూడు దశాబ్దాలకు మించి సమయం పట్టకపోవచ్చని ఆశ. 'అన్నా! చావనని నమ్మకం నాకు కలిగింది/ చావు లేదు నా' కని కవి తిలక్ లాగా జనం ఎలుగెత్తి చాటే రోజులు నిజంగానే రాబోతున్నాయేమో! తేనెలేని తేనెపట్టు లాగా మనిషి మారకుండా ఉంటే చాలు. చావులేని ఆ లోకం నిజంగానే అప్పుడు నేలమీదకు దిగివచ్చిన నాకంలాగా వెలిగిపోదూ!


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 

Monday, December 20, 2021

ఈనాడు - సంపాదకీయం ఏది స్వర్గం, ఏది నరకం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 )

 






ఈనాడు - సంపాదకీయం 


ఏది స్వర్గం, ఏది నరకం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 ) 




ఏ రహస్య సృష్టి సానువులనుంచో జాలువారే కాంతి జలపాతం ఈ జీవితం.. జనించేదెవరి వలస చలించేదెందు కొరకు, లయించేది ఏ దిశకు అన్నీ ధర్మసందేహాలే. అసలు కిటుకు కమలాసుడికైనా తెలుసో లేదో! మానవుడు బుద్ధిజీవి. రాశి చక్రగతులలో/ రాత్రిందిన పరిణామాలలో/ బ్రహ్మాండ గోళ పరిభ్రమణాలలో/ కల్పంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువుకా ప్రేరణకేది మూలకారణమో అంతు తేలేదాకా ప్రయాణం మానడు. అదే చిత్రం. గ్రహరాశుల నధి గమించి/ గగనాంతర రోదసిలో! గంధర్వ గోళగతులు దాటిన మనిషి ఓ వంక నెలవంకనంటివస్తాడు. మరోవంక, మరణానంతరం జీవితం ప్రశాంతంగా సాగేటందుకు చుక్కలకు ఆవలి దిక్కున ఎక్కడో చక్కని లోకాలు చక్కర్లు కొడుతున్నాయని బలంగా నమ్ము తుంటాడు. అదింకో విచిత్రం మార్గాలు, రూపాలు వేరువేరైనా స్వర్గాలు, నరకాలు అన్న భావనలు అన్ని మతాలకూ ఒకేలా ఉండటం అన్నింటికన్నా చిత్ర విచిత్రం! పుణ్యం చేసుకున్నవారు మరణానంతరం దైవదూతలుగా తేలియాడే ప్రేమారామమని యూదులు స్వర్గధామాన్ని అభివర్ణిస్తారు. 'అమృతం కురిసిన రాత్రి'లో బాలగంగాధర్ తిలక్ వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలబడినప్పుడు పాదాల తారామంజీరాలు ఘల్లు ఘల్లుమని మోగించుకుంటూ వయ్యారంగా ఆకాశమార్గాన పరుగులెత్తుతూ పరవశం కలిగించింది బహుశా అటువంటి  దేవతా ప్రేమమూర్తులేనేమో!


అమరలోకాలకు నిచ్చెనలు వేసిన కవులకు , భావుకులకు విశ్వసా హిత్యంలో కొదవ లేదు. కాళిదాసు నుంచి  మిల్టన్ దాకా, కృష్ణశాస్త్రి నుంచి  కవి తిలక్ వరకు  దివిసీమ  అందాలను గురించి పలవరించనిదెవరు? మనుచరిత్రలో అల్లసాని పెద్దన అరుణాస్పదపురం పేరును అడ్డుపెట్టుకుని చేసిన వర్ణనంతా ఆ రంగుల ప్రపంచం  గురించే.  అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ' అంటూ అమరపురి వైభోగాలను కలవరంచిన తీరుకు మునిముచ్చుకైనా కలవరం కలగక మానదు. కళాపూర్ణోదయంలో మణికంధరుడనే  గంధర్వుడు ఈ కిందిలోకపు అందాలను చూసి మనసు పారేసుకుంటాడు. మరి మామూలు మానవుడి మరులు ఆ సురలోక సౌఖ్యాలనుంచి ఓ పట్టాన మరలి రాగలవా? ' దిగిరాను దిగిరాను దివినుంచి భువికి' అని భావకవి ఊరికే మారాం చేస్తారా?! వరూధిని వంటి వయ్యారి వగలాడుల  సాముగారీడీలట  పద్మసంభవ, వైకుంఠ, భర్గసభలు. ఆ కొలువు కావాలని కోరిక లేకపోవడానికి మనసును ప్రవరాఖ్యుడు ఆవరించాలి. అదంత సాధారణమైన సాధనేనా? కాళిదాసు కల్పనలోని ఆ మేరుపర్వతంమీది కల్ప వృక్షచ్ఛాయలలో  పచ్చల పట్టు పరుపులపైన అచ్చరల  వెచ్చని ఒడి.. అమరగానం... అమృతపానం... అవో... ఏ మర్త్యయప్రాణిని ఝల్లుమనిపించవు? ఏడు ఊర్ధ్వ  లోకాలనే కాదు.. ఏడు అధో లోకాలనూ సృష్టించి పెట్టారు. పాపాల పాలును యాతనా దేహంగా మార్చి వైతరణిని తరించిన పిదప ఇరవై ఆరు రకాల నరకాల వెంట పాపిని తిప్పి పిప్పిచేసే  వైనాన్ని వైనతేయ పురాణం వర్ణిస్తుంది. 'నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు' ఉరికి పడితే గుండె జారని ధీరుడెవ్వడు?  కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించినట్లు అరిషడ్వర్గాల వైరివర్గంలో చేరిపోవడమొకటే చివరి దరి . ' దైవమూ-దయ్యమూ, పాపమూ పుణ్యమూ, స్వర్గమూ-నర కమూ, మందభాగ్యులను ఓ మందగా మార్చేటందుకు కామందువర్గం కనిపెట్టుకున్న మత్తుమందు' అంటాడు కవి ఎమ్మాగోల్డ్. మన హేతు కవిరాజు సూత పురాణం కూడా 'మతిమాలిన కవిచంద్రులు/ గతిమా లిన వారలగుచు గడుకక యెవరో/ బతిమాలిన నల్లిన' కట్టుకథలివి అని కొట్టిపారేస్తుంది.


స్వర్గం, నరకం- మానవ మనోమందిరంలోని రెండు ఊహా లోకాలు అయితే కావచ్చు.. మరి మహనీయుల ఆ కమనీయ కల్పనల వెనకున్న తపనో?। మానవుడనే శిలను మాధవుడనే శిల్పంగా తొలిచి భువిని భువర్లోకంగా మలచాలనుకోవడం మహదాశయం కాదా? మహాభారతంలో స్వర్గారోహణం వేళ ధర్మజునితో యమధర్మ రాజు అన్నట్లు స్వర్గ నరకాలు వేరువేరుగా లేవు. తన సంతోషమె స్వర్గం, తన దుఃఖమె నరకమనే గదా సుమతీ శతక కర్త సుభాషితం! 'తృప్తిచెందని నరుని సప్త ద్వీపంబులైన చక్కంజేయునే! అక్షరంబులు నాలుగు కుక్షిలో వేసి  అ క్షరంబేదో తెలుసుకో మనసా' అని హెచ్చరించారు వేదాంతులు. నిగమంబులు వేయి చదివినా జీవిత సారం ఒంటబట్టనివాడికి ఏ ముక్తిమార్గమూ సుగమం కాదు. జీవితాన్ని చెదలపుట్టలో చీకిన ఆకులు తిని బతికే మకిలి పురుగులాగా చీదరించుకొనే వాదం ఎంత అసంబద్ధమో... విడివిడి భాగాల కలివిడితో తయారైన ఓ భౌతిక యంత్రంతో పోల్చి చూడటమూ అంతే అహేతుకం. శాస్త్ర నిఘంటువు నిర్వచనానికి అందనిదంతా అసత్యమన్న వాదనా సత్యదూరమే. క్రాంతి దర్శకులు వెలుగు చూపరు. వారు చూపిన దారిని పట్టుకుని జీవితాన్ని వెలిగించుకోవలసింది మనం. ఆ తెలివిడే జ్ఞానం. ప్రేమను మూలధనంగా పెట్టి జీవితాన్ని వ్యాపారంగా మలుపుకోవాలనుకునే బేహారులకు- లాభం  స్వర్గం, నష్టం నరకం. విజయం స్వర్గం, అపజయం నరకం. దుఃఖం నరకం, సుఖం స్వర్గం. ఠాగూర్ గీతాంజలి ప్రార్థన ప్రకారమైతే- ఎక్కడ జ్ఞానం నిత్యం వెల్లివిరుస్తుంటుందో అదే శాశ్వత స్వర్గం.  ' కాలసంక్షిప్త చరిత్ర'  గ్రంథకర్త, అయిదు దశాబ్దాల బట్టి చావుబతుకుల సరిహద్దుల వద్ద తచ్చాడుతూనే మానవ చరిత్ర పురోగతికి అసమానమైన సేవలందిస్తున్న శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ' స్వర్గం మిథ్య' అని చేసిన తాజా వాదాన్ని ఈ నేపథ్యంలోనే అర్ధం చేసుకోవాలి. మానవజాతి అభివృద్ధి కోసం  తపించే వారెవరికైనా అడుగడుగునా గుడే కనిపిస్తుంది . అందులో వెలిగే దీపం భావవాదులకు దైవం అయితే... భౌతిక వాదులకు జ్ఞానం. చూపులు వేరైనా చూస్తున్నది ఒకటే. అదే దైవజ్ఞానం, జ్ఞానదైవం. తేడా లేదు- రెండూ ఒకటే.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 ) 


Saturday, December 18, 2021

ఈనాడు - సంపాదకీయం వృథా అరికడదాం! రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 15 - 05 - 2011 )






చూడు- ఇల్లుకట్టి చూడు' అని సామెత. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా ఏ గృహస్థుకైనా ఈ రెండూ తలకు మించిన కార్యాలే. వరవిక్రయంలో పురుషోత్తమరావు బాధపడినట్లు ఆడపిల్ల పెళ్ళంటే అశ్వమేధ యాగమే! 'కావిళ్లతో కాఫీయు, దోసెలి/ డ్డెనులు, నుప్మాయు నడిపింప వలయు/ కుడుచుచున్న ప్పుడు పంక్తి నడుమ నాడుచు బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయు' అన్న ఆ వధువు తండ్రి మాటల్లో ఉన్నది నూరుశాతం ఆవేదన. లోకం, కాలం ఎన్ని మార్పులకు లోనైనా వివాహాది శుభ కార్యాల ఆచారాలు, ఆలోచనలు తాతల కాలంనాటివి కావడమే విచిత్రం! ఆడపిల్ల పెళ్ళంటే ఇప్పటికీ కన్నవారి గుండెలమీద నిప్పుల కుంపటే! ఆ బరువు దింపుకోవడానికి తల తాకట్టుకైనా తయారుగా లేకపోవడం లోకుల దృష్టిలో తప్పు. ' అన్నింటికి వేలు వ్యయించి గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు తుదకు' అని ఎన్ని నిట్టూర్పులు విడిచినా ఫలితం సున్నా. కష్టించి జీవితాంతం కూడబెట్టిన లక్షలు క్షణాల్లో ఎంత గొప్పగా ఆరిపోయాయన్నదే ఘనతకు గుర్తు! అందుకే పెళ్ళితంతును ఒక ఆధునిక కవి ' అంతరిక్షనౌక ప్రయోగం' తో సరిపోల్చాడు. వధువు మెడలో తాళిపడే సుముహూర్తం క్షిపణి ప్రయోగ క్షణమంత అమూల్య మన్న అతగాడి చమత్కారం- అణాపైసలలో చూసుకున్నా రూపాయికి వంద పైసలంత నిజం. కల్యాణమండపం ఖరారు, ఆహ్వాన పత్రాల ముద్రణ, ఆహూతుల సంఖ్య, వంటకాల జాబితా... అదు పులో ఉండవచ్చు గానీ, అతిథుల ఆ పూట ఆకలి దప్పికలను ఏ సూపర్ కంప్యూటర్ అంచనా వేయగలదు?! అది వేయలేకా, వృథాను అదుపు చేయలేకా ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఎక్కడైనా ఏదైనా సమృద్ధిగా లభిస్తున్నప్పుడు, దాని విలువ తెలీదు. భూమాత అందించే ప్రతి గింజనూ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప, నేలపాలు చేయకూడదు. పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయం కావచ్చు గాక- భోజనాల ఏర్పాట్లు భూలోకంలోనే కదా జరిగటం! కన్య వరుడి రూపానికి, తల్లి అల్లుడి ఆస్తిపాస్తులకు, తండ్రి అతగాడి పరువు ప్రతిష్ఠలకు, బంధుబలగం కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చినా, అతిథి జనాలు ఆరాటపడేది భోజ నాదికాల కోసమేనని ఓ సంస్కృత శ్లోక చమత్కారం. 'జల సేవన | గళగళలు, అప్పళముల ఫెళఫెళలు, భోక్తల భళాభళాల' సందడి లేని పెళ్ళి విందుకు అందమే లేదు పొమ్మన్నాడు ఓ భోజనప్రి యుడు. పెళ్ళిలో పుస్తెలకున్నంత ప్రాముఖ్యం విస్తరికీ ఉంది మ రి! మాయాబజారు చిత్రంలోని ఘటోత్కచుడిలా గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, పులిహోర, దప్పళాలు... వరస పెట్టి అంగిట్లోకి జార్చుకోవాలనే యావే ముప్పు. అష్ట భోగాల్లో మృష్టాన్నమూ ఒకటి. అది మితిమీరడం అహితమే. మర్యాదల పేరుతో శ్రుతి మించి సాగే వియ్యాలవారి విందుకు చెయ్యడ్డుపెట్టుకోకపోతే ముందు చెడేది అతిథి కడుపే. మాయదారి జిహ్వచాపల్యం జీవి తానందాన్నే దెబ్బతీసే ప్రమాదముంది. పీకలదాకా మెక్కి పీకలమీదకు తెచ్చుకోవడం ఏమంత తెలివైన పని? కుడుము కడుపును చేరకముందే మనసును మంగళగిరి పానకాల స్వామి ఆవహిస్తే 'మంగళం మహత్ ' . పరగడుపున రాజులాగా, అపరాహ్నం మంత్రి లాగా, సాయంత్రం బంటులాగా భుజించాలని భోజన నీతి. అందుకు కట్టుబడటం ఇంటికీ దేశానికి మంచిదంటున్నారు ఆహార, ఆర్థిక శాస్త్రవేత్తలు. నూటికి నలభై అయిదుమంది ఒక్క పూటైనా ముద్దకు నోచని మన పూర్ణగర్భలో ఆ హితోక్తి శిరోధార్యం.!

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 15 - 05 - 2011 )




Friday, December 17, 2021

ఈనాడు - సంపాదకీయం సమజీవన సౌభాగ్యం - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ప్రచురితం - 08 -07 - 2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

సమజీవన సౌభాగ్యం

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 08 -07 - 2012 ) 


క్షీరసాగర మథనసారంగా దక్కిన మధుర రసం అసురులకు ఒక్క చుక్క దక్కకుండా మొత్తం అమరసంఘానికే ధారపోసిన హరి- ఆ 'మాయ'కోసం ఆశ్రయించిన వేషం జగన్మోహినీ అవతారం.  బొమ్మ పెళ్లిళ్లకు కూడా పోనొల్లని బేల సత్యభామ నరకాసురునితో సమరానికని 'వీర శృంగార భయరౌద్ర విస్మయములు/ గలసి భామిని యయ్యెనో కాక యనగ ' తయారయింది! ఆడామగా తేడా ఏముంది... పనులు చక్కబడటం ముఖ్యంగానీ! 'రామ' అంటే సీత అని కూడా అర్ధం. 'అన్యూహిమయా భాస్కరస్య ప్రభాయథా- సూర్యునికి వెలుగులా నాకు సీత 'వేరుకాదు' అని వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడే స్వయంగా చెప్పుకొన్నాడు. దాంపత్య ఔన్నత్యానికి ఇంత కన్నా గొప్ప వ్యాఖ్య ఇంకేముంటుంది! ఒకే పరమాత్మ తనను తాను రెండుగా విభజించుకున్నాడని అదే ప్రకృతి పురుష స్వరూపాలని వేదబోధ. భార్యాభర్తల అనుబంధాన్ని వాక్కు అర్ధాల బంధంగా సరిపోల్చాడు రఘువంశ కర్త కాళిదాసు. ఇల్లు చూస్తే ఇల్లాలిని చూడనక్కర్లేదని సామెత. అశోకవనంలో ఉన్న సీతమ్మ హనుమ కంటికి స్త్రీ వేషంతో ఉన్న రామయ్యలాగే కనిపించిందట. కైకేయి కోరింది శ్రీరాముడి వనవాసాన్నే అయినా సీతమ్మ  రామయ్యను అనుసరించింది. దుష్టరావణ సంహారంలో తనవంతు పాత్ర పోషిం చింది. నరకాసుర సంహారంలో సత్యభామ పాత్రా శ్రీకృష్ణుడితో సరిసమానం. 'నా పాపపుణ్యాలలో  నా భార్యకు వాటా ఉంటుందా? ' అన్న ధర్మసందేహం మహర్షి కాకముందు వాల్మీకి మనసును తొలిచింది. అది త్రేతాయుగంనాటి ముచ్చట.  పాపపుణ్యాల మాట పక్క నుంచి పనిపాటల్లో మాత్రం ఆలుమగల  పాత్ర సరిసమానం అంటున్నారు నేటి మగువలు.


'అలుమగలు అంటే ఒకరికొకరు పూరించుకునే ఖాళీలు' అంటారు ఆరుద్ర. తనది అనే గూడులేక ఆడది బతకలేదు. నాది అనే తోడులేక అతగాడు నిలువలేడు . 'మనువు' అంటేనే రెండు తనువులు అనువుగా మసలుకోవడం! ఇల్లాలిగా మారిన ఇంతిని ఇల వేలుపుగా భావిస్తే పతిగా మారిన పురుషుడి ప్రతి విజయానికి తానే ఒక ప్రేరణ అవుతుంది. 'చిరునవ్వుల వరమొసగే శ్రీమతి/ శుభశకునాలే వెలిగించే హారతి' అంటారు వేటూరి. ఈనాటి వనిత శతకోటి సీతల మేలి కలబోత. సరిజత కావాలంటే మరి మగడు ఎంతమంది రాముళ్ల వడపోత కావాలి! పురుషుడికి దైవమిచ్చిన స్నేహితులెవరు? ' అని యక్షుడు అడిగిన ప్రశ్నకు యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం 'భార్య'. .'స్నేహం సాప్తపదీనాం' అని కుమార సంభవంలో కాళిదాసు వాక్కు.  వివాహ మహోత్సవవేళ నిర్వహించే సప్తపది తంతులో కలసి  ఏడడుగులు పడినప్పటినుంచే మొగుడూ పెళ్ళాలు కడదాకా ఒకరికొకరు తోడు, నీడగా నిలబడే స్నేహితులయ్యారు. 'దంపతులారా! కలిసి వర్తించండి! సమాన ధర్మాన్ని ఆచ రించండి!' అంటుంది యజుర్వేదం. 'వృత్తిలో, ప్రవృత్తిలో భార్యాభ ర్తలు ఒకరికొకరు ఉత్ప్రేరకంగా నిలవాలి' అని బోధించడానికి వేదాలు, ఉపనిషత్తులే కావాలా? ఒంటిచేయి ఊపితే చప్పట్లు మోగవని మనకు తెలియదా! 'చెలిమి గావింపను జేరి భాషింప/కలహింస ద్రోపాడు (తోసివేయు) గలసి వర్తింప' అని ద్విపద భారతంలోనే తిమ్మయ్య సూక్తి చెప్పాడు. సంసారంలో నిన్న మొన్నటి దాకా మగవాడి దృష్టిలో  మగువ ' కార్యేషు దాసి... శయనేషు రంభ!... కాలం మారింది. ఒంటెద్దులా సంసార వాహనం  ఒక్కరే లాగడం ఇక కుదరదు అంటున్నారు కొత్తతరం భార్యలు.


వాహనం  నడక సవ్యంగా సాగాలంటే బండికి రెండు చక్రాల్లా భార్యాభర్తలిద్దరూ సమన్వయంతో సాగాల్సిందే! త్వమే వాహం- నువ్వే నేననే భావన తప్ప అహంకారానికి తావులేని వ్యవహారం సంసారం. 'కుడి యెడమ భేదమున్నది పడతికి బురు/షు నకు... కత్తి కతడర్హుడగు; సూడి గరిటెలకు సమర్హమగు నీమె' అన్నది కాలం చెల్లిన వాదన. 'ఇంటాబయటా ఇద్దరిదీ సమవాటా' అనేదే ప్రస్తుతం చెల్లుబాటయే మాట . నరకాసుర వధానంతరం పద హారు వేలమంది స్త్రీలను పరిణయమాడిన శ్రీహరి అన్ని సంసారాలను ఎలా నిభాయించుకొస్తున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు నారదుడు. 'ఒకచో సంధ్యావందనం, ఒకచో పురాణపఠనం, ఒకదెస స్నానపానాదులు, మరో దిశ భూగోదానాదులు, ఒక ఇంట ఆట పాటలు, మరో ఇంట విందు విశ్రాంతులు'గా సాగుతోందట గోవిం దుడి లీలావినోదం. 'ఎలా సాధ్యం' అన్న ముని సందేహానికి 'లోకాలకు మేలు చేకూరాలన్న సంకల్పం కలగాలేగానీ... సమయమూ, సంయమనమూ స్వయంగా సమన్వయమైపోవా!' అన్నది పరంధాముడి సమాధానం. లోకాలదాకా ఎందుకు... సొంత సంసారాన్ని చక్కబెట్టుకునేందుకు మరి నేటి మగవాడు కొంతైనా చొరవ చూపాలిగదా! 'పనిలో భర్త భాగస్వామ్యం భార్య మానసిక ఒత్తిడిని గణ నీయంగా తగ్గిస్తుంది' అంటున్నారు స్త్రీలమీద పరిశోధనలు చేసే అంతర్జాతీయ కేంద్ర పరిశోధకులు. వారి ఆసియా ప్రాంతీయ న్యూఢిల్లీ విభాగం వెల్లడించిన తాజా సర్వే గణాంకాల ప్రకారం ఇంటిపనుల్లో భార్యకు సంపూర్ణ సహకారం అందించే పురుషులు నూటికి పదహారుమంది. గృహకృత్యాల్లో తమది ఇంకెంతమాత్రం 'అతిథి పాత్ర'  కాదని గుర్తిస్తున్న భర్తల శాతమూ గణనీయంగా పెరుగుతోందంటున్నాడు సర్వే బృందనాయకుడు రవివర్మ. 'శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా/ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా' ఒకరికొకరు అండగా ఉండే ఇల్లు ఆదిదంపతుల విలాసం కైలాసంగా మారిపోదా! సమజీవన సౌభాగ్యానికి శ్రమ విభజనే మూలమన్న సత్యాన్ని మగవారిప్పటికైనా గుర్తించడం మగువలకు మహదానందం కలిగించకుండా ఉంటుందా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 08 -07 - 2012 ) 

Thursday, December 16, 2021

ఈనాడు - సంపాదకీయం చిరంజీవులు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురణ- 25-06-2009 )

 


ఈనాడు - సంపాదకీయం 


చిరంజీవులు

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురణ- 25-06-2009 ) 


'షేక్స్పియర్ నాటకాలు- అన్నీ షేక్స్పియరే రాసి ఉండకపోవచ్చు' అని ఒకాయన తెగ వాదిస్తున్నాడు. విని విని శ్రోతకు విసుగొచ్చింది. 'ఇదిలా తేలదు, నేను చచ్చి స్వర్గానికి వెళ్ళాక ఆయననే అడిగి కనుక్కో వాలి' అని లేచి పోబోయాడు. మొదటాయన వదలలేదు- 'షేక్ స్పియర్ స్వర్గంలోనే ఉంటాడని నమ్మకం ఏముంది? నరకంలో ఉండొచ్చుగా' అని ఎదురు తిరిగాడు. శ్రోత తాపీగా లేచి 'అయితే పేచీ ఏముంది? మీరే స్వయంగా ఆయనతో తేల్చుకుందురుగాని' అనేసి చక్కాపోయాడు. స్వర్గం నరకం అనేవి ఉన్నాయని, అక్కడికి వెళ్ళాక తమ పూర్వీకులను కలుసుకోవచ్చునని చాలామంది నమ్ముతారు. వారిలో కొందరిది విశ్వాసం, మరికొందరిది భయం. విశ్వాసం గల వారికి పుణ్యకార్యాలు చేద్దామన్న ఆసక్తి ఉంటుంది. భయపడేవారిలో పాపకార్యాలు చేయరాదన్న జంకు ఉంటుంది. స్వర్గ నరకాలు ఎక్కడో కాదు మనలోనే ఉంటాయి' అని మరికొందరంటారు. జపాన్ జాన పద కథలో ఒక గొప్ప మల్లయోధుడు(సమురాయ్) రాజవుతాడు. స్వర్గ నరకాలకు తేడా తెలుసుకోవాలన్న ఆలోచన ఓరోజు అతని మనసును  తొలిచేస్తుంది. ఉన్నపళంగా తన ఆధ్యాత్మిక గురువు దగ్గరకు పోయి, సంగతి తేల్చుకోవాలనుకుంటాడు. విషయం విన్న గురువు రాజును తేరిపారచూసి తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి రాజుకి ఓపిక తగ్గినా ఎలాగో తమాయించుకున్నాడు. అసలే సాహసి, దానికితోడు రాజ్యాధికారం. చివరికి గురువును బలవంతాన పట్టి కుది పాడు. ఆయన కళ్లు తెరిచి 'నువ్వు మూర్ఖుడివి... స్వర్గ నరకాల మధ్య తేడా గురించి నీకు చెప్పినా అర్థం కాదు' అన్నాడు. రాజుకు ఒళ్లు మండిపోయింది. కోపం ముంచుకొచ్చింది. 'నిన్ను చంపేస్తాను' అంటూ కత్తిదూసి రొప్పుతూ గురువుపైకి దూకాడు. గురువు చిన్నగా నవ్వి 'అదిగో అదే నరకమంటే!' అన్నాడు. ఒక్కసారిగా బిత్తర పోయాడు రాజు. గురువు చెప్పిందేమిటో అర్థం అయ్యేసరికి సిగ్గుతో చచ్చిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ గురువు కాళ్లపై పడి 'గురువర్యా' ఎందుకిలా చేశారు? ఒక్కక్షణం ఆలస్యం అయితే ఎంత ఘోరం జరిగిపోయేది!' అంటూ విలపించాడు. గురువు ఆప్యాయంగా లేవనెత్తి 'ఇప్పుడు నువ్వున్నది స్వర్గంలో' అన్నాడు.


' కారే రాజులు! రాజ్యముల్గలుగనే! గర్వోన్నతి పొందరే! వారేరీ? భూమిపై పేరైనన్లదే' అని ప్రశ్నించాడు బలిచక్రవర్తి. ' శిబి వంటివారిని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. కారణం ఏమిటి?' అని శుక్రాచార్యుణ్ని నిలదీశాడు. ఇహపరాల్లో మనిషికి కీర్తి యశస్సు అనేవి రెండే తోడు. ధర్మబుద్ధివల్ల దానగుణంవల్ల కలిగే పేరు ప్రతిష్ఠలను  కీర్తి అంటారు. శౌర్య పరాక్రమాలతో విజయాలు సాధించిన వారికి దక్కేది యశస్సు . ఆ రెండే ఇక్కడ మనిషికి ప్రాచుర్యాన్ని కలి గిస్తాయి. పరలోకానికి వెంట వస్తాయి. 'ఈ లోకమయగుకొందరకు, ఆలోకమ కొందరకున్.. ఇహమ్మున్ పరమున్ మేలగు కొందరకు' అన్నాడు భారతంలో ఎర్రాప్రెగ్గడ.  అలా ఇక్కడా అక్కడా కూడా గొప్పగా గుర్తింపు సాధించాలనే పూనికతో జీవించేవారిని 'మహాశయులు' అంటుంది లోకం. వారికి స్వగతమే కాకుండా లోకహితమూ ప్రధానమై ఉంటుంది. కొందరికి స్వార్ధమే జీవితాశయం. పాప పుణ్యా లతో గాని, స్వర్గ నరకాలతో గాని ప్రమేయం ఉండదు. అసలాదృష్టి ఉండదు. ఈ భూమిపై ఉన్నన్నాళ్లూ ఉంటారు. తినగలిగినంతా తింటారు. ఎవరికీ తెలియకుండా పోతారు. బతికున్నప్పుడే ఈ లోకం వారిని పట్టించుకోదు. మరణించిన మరుక్షణం మరిచిపోతుంది. అలాంటివారిని 'జీవన్మృతులు'గా పరిగణిస్తుంది లోకం. 'నరుడు నరు డౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము!' అన్నాడు గాలిబ్. మనుషులంద రిలో మనిషి లక్షణాలే ఉంటాయని చెప్పలేం. దయ, సౌజన్యం, ఇత రులకు సాయం చేద్దామన్న బుద్ధి వంటివి మనిషి లక్షణాలు. వాటి వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. 'ఇతరులను పీడించడం పాపం, మేలు చేయడం పుణ్యం' అని చెప్పింది భారతం. దాన్ని పాటించిన వాడే మనిషి.  మానవీయమైన గుణాలతో సంపూర్ణ మానవుడిగా జీవించిన మనిషిని ఈ లోకం దేవుడిగా ఆరాధిస్తుంది.


రాముడు, ధర్మజుడు, జీసస్ వంటివారు తమ ఉదాత్త జీవితాల కారణంగా మహాశయులుగా పేరొందారు. రావణ వధానంతరం వరం కోరుకొమ్మని ఇంద్రుడు అడిగితే- 'నా కొరకు చనిపోయిన వానర వీరులందరికీ జీవం ప్రసాదించాలి' అని కోరాడు రాముడు. నాకన్నా ముందు మరణించిన బంధువర్గం అంతా ఎక్కడ ఎలా ఉన్నారో తెలు సుకోకుండా- నేను స్వర్గంలో అడుగుపెట్టే ప్రశ్న లేనేలేదు' అన్నాడు ధర్మరాజు. తన వారికోసం ప్రాణత్యాగానికి సిద్ధపడటమే కాదు, తనకు హాని చేసినవారికి క్షమాభిక్ష సైతం కోరాడు జీసస్ క్రీస్తు.  మహాశ యులు, మహనీయుల జీవన వైఖరి ఆ రకంగా ఉంటుంది. అలాంటివారు  గతించి ఎన్నో వేల ఏళ్లయినా ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోతారు. గట్టిగా కొలిస్తే గుప్పెడుండే గుండెలో కొండంత చోటిచ్చి మనిషి అలాంటివారి జ్ఞాపకాలను నిత్యం పచ్చగా కాపాడు కుంటాడు. గుండెలో కొంతమేర అలా పచ్చగా ఉండటమే మనిషితనా నికి గుర్తు. జీవించి ఉన్నంతకాలం స్మరించడమే కాదు, చనిపోయాకా వారిని కలుసుకోవాలన్న ఆశ మనిషి గుండెలో ఏమూలో స్థిరపడి ఉంటుంది. అలాంటి మూడువేల మందితో బ్రిటన్ లో ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. 'చనిపోయాక ఎవరిని కలుసుకోవాలని గాఢంగా కోరుకుంటారు? ' అనేది ప్రశ్న. ఎక్కువమంది జీసస్ క్రీస్తును కలవ డానికి మొగ్గు చూపారు. ప్రజల గుండెల్లో కొలువై ఉన్న ఆ పరమ పురుషుడు ఇప్పటికీ బ్రిటన్ ప్రజల 'సూపర్ స్టారే' అని నిర్వాహకులు కొనియాడారు. యువరాణి డయానా, విలియం షేక్స్పియర్, ఐన్స్టీన్, మార్లిన్ మన్రో, మోనాలిసా చిరునవ్వును ముగ్ధమోహనంగా చిత్రించిన లియోనార్డో డావిన్సీ వరసగా తరవాతి స్థానాలు పొందారు. తాము చనిపోయాక వీరిని కలుసుకోవాలనుకోవడానికి కారణాలు ఏమైనా వారంతా ఇప్పటికీ జనం గుండెల్లో కొలువున్నారన్నది వాస్తవం. ఎన్నేళ్లు గడిచినా పచ్చగా గుర్తుండేవాళ్లు మరణించారని ఎలాగంటాం? 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురణ- 25-06-2009 ) 

Wednesday, December 15, 2021

ఈనాడు - సంపాదకీయం ఆనందోబ్రహ్మ! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం 05 -06-2011 )




ఈనాడు - సంపాదకీయం 


ఆనందోబ్రహ్మ!

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 -06-2011 ) 


మనుచరిత్ర వరూధిని మొదలు సముఖం కృష్ణప్ప అహల్యా సంక్రందనం కథానాయిక చెలికత్తె వరకు ఎందరికో- ఆనందమంటే అదేదో ఒంటినుంచి పుట్టే పరబ్రహ్మ స్వరూపం! 'ఎందే డెందము కందళించు రహిచే - అందే ఆనందోబ్రహ్మం'  వరూధినికి. అహల్య సహేలికీ 'ఎందును సంచరింపక అఖిలేంద్రియముల్ సుఖమొందు'- అలాంటి, బుద్ధికి అగోచరమైన ఆనందమే పరమానందం. తార అతిచొరవతో మనసు చెదిరిన శశాంకుడూ ప్రారంభంలో పరకాంత అని కొంతా, అధర్మమని కొంతా చింతపడ్డా చివరికి దేహరుచికే దాసోహమన్నాడు. అడిదం  సూరపరాజు 'కవి జనరంజనం' కథానాయకి చంద్రమతి శోభనం గదిలో అడుగుపెట్టే వేళ చెలికత్తెలకు బహుపరాకులు చెప్ప వలసిన పరిస్థితి. మొగుడు మునిపంట నొక్కగానే మొగమటు తిప్పుకొనే అంతటి లజ్జావతీ ఆరుమాసాలు ముగియకుండానే అతగాడు అడిగీ అడగక ముందే తియ్యనిమోవినందించే గడసరితనానికి అలవాటుపడింది! ఇదంతా పడుచుతనపు పరవళ్ల ఉరవళ్లని సరిపుచ్చుకొంటే సరిపోతుందా? మరి రఘునాథ నాయకుడి 'శృంగార సావిత్రి' విశ్వా మిత్రుడి వ్యథో? మద్ర దేశాధిపతి ఉగ్రదీక్షను భగ్నం చేయాలని బదరికావనానికి బయలుదేరిన మేనక వెనుక  'అకట! నీవు నన్ను విడనాడి చనం బదమెట్టులాడు? ' నంటూ అంతటి జితేంద్రియుడూ గోడుగోడుమంటూ వెంటబడ్డాడే! ఆనందం ఒక అర్ణవమైతే అందులో ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా మునక. రసరమ్య కావ్యం రాయమని రాయలవారు అడిగినప్పుడు పెద్దనామాత్యుడి వంటి పెద్దమనిషే 'నిరుపహతి స్థలం, రమణీయ ప్రియదూతిక చేతి కప్పుర విడెం, ఆత్మ కింపయిన భోజనం, ఊయల మంచం' వంటి భోగాలు లేనిదే ఊర కృతులు రాయడం ఆశక్యమనేశాడు. మరి మామూలు మనిషికి ఆనందమంటే భౌతిక సుఖాల భోగమని మాత్రమే అనిపించదా?


నిజానికి ఆనందానికీ భౌతిక సుఖాలకీ అసలు సంబంధమనేది ఉందా? సిలువ మేకులకు వేలాడే క్రీస్తు పెదవులమీది చలువ నవ్వులు ఏ ఆనందానికి ప్రతీకలు? ఆనందమంటే కేవలం భౌతిక భోగానుభవం అనే భావన బలంగా ఉన్నంత కాలం ఎవరికైనా, భిక్షాపాత్ర ధరించిన బుద్ధ భగవానుడి వదనంలోని ఆ ప్రశాంతత అర్ధం కాదు. చిదానంద స్వరూపంగా సదా మనం సంభావించే ఏ భగవదవతారమూ భూమిపై  సుఖపడిన దాఖలాలు లేవు అంటారు స్వామి సుఖబోధానంద. లోకాదర్శంకోసం చివరికి జానకి నైనా సంతోషంగా పరిత్యజిస్తానని ఆచరించి చూపినవాడు మర్యాదా పురుషోత్తముడు. రాజసూయ యాగం వేళ అతిథి అభ్యాగతుల ఎంగిలి విస్తరాకులను గోవర్ధనోద్ధరణమంత సంబరంగా ఎత్తి పారేసినవాడు గోవిందుడు. అన్నమయ్యను ఎవరి బలవంతాన బాలాజీ పల్లకిలో మోసుకెళ్లాడు? తామరాకుమీది నీటిబొట్టు తత్వం నాకు అత్యంత ప్రీతిపాత్రం- అని గీతలో భగవానుడు చెప్పాడు. ఆనందం, భౌతిక సుఖాలు- పాలూ నీరు వంటివి. నీటిలో నేరుగా కలిస్తే పలచనయ్యే పాలు పెరుగై మథనానికి గురయి వెన్న ముద్దగా  మారితే ఏ  నీరూ ఏమీ చేయలేదు. పెరుగుగా మారటానికి పాలకు పెట్టే తోడే ఆనందం అంటారు మాతా అమృతానందమయి. 'ఒక కొత్త ముఖాన్ని చూడకుండా ఒక కొత్త సుఖాన్ని చవిచూడకుండా / నా రోజు మరణిస్తే/ నేను బతికి ఉన్నట్లా?'  అని ఓ ఆధునిక కవి అంతర్మథనం. మనసుతోపాటు మన పరిసరాలకు సరిసమానంగా సంతోషాన్ని పంచేదే అసలైన ఆనందం. అది ఉండేది పైనో, పక్కనో, పక్కలోనో కాదు. కస్తూరి మృగం దేహ పరిమళం లాగా అది పుట్టుకొచ్చేది మనలోని మంచి భావనల్లోనుంచే! మనిషి ఆ పరి మళ మృగంలాగా ఆనందమనే ఆ చందనం కోసం మూలమూలలా వెదుకులాడటమే ఇప్పటి అన్ని అశాంతులకూ మూలకారణం.


కౌమారంలో మిరాయి నోరూరిస్తే యౌవనాన మిఠారి  చూపులు కవ్విస్తాయి. వయసు పడమరకు వాలుతున్నకొద్దీ గతం ఆకాశాన వెలుగులు విరజిమ్మిన తారల చమత్కారాలు పగటి చుక్కలకు మల్లే వెలాతెలాబోతాయి. చివరకు మిగిలేది విలువైన క్షణాలు వృధాగా  చెయి జారిపోయాయన్న బాధాజ్ఞానమే. 'ఎంతమాత్రం ఎవరు దలచిన అంతమాత్రమే'  అందే ఆ బ్రహ్మపదార్థం ఆదీ అంతూ ఇదీ అని ఇదమిత్థంగా తేల్చిచెప్పినవారు ఇటు వైదాంతికుల్లోనూ లేరు, అటు శాస్త్రవేతల్లోనూ కానరారు. 'నీ వలన కొరత లేదు. మరి నీవు నీరు కొలది తామెరవు' అంటూ వాగ్గేయకారుడు అన్నమయ్య పాడినదే ఇప్పటివ రకూ అందరం ఒప్పుకోవలసిన ఆ ఆనందస్వరూపం తాలూకు స్వభావం. ఆవల భాగీరథి  ఉంటే దరిబావుల ఆ జలమే ఊరుతుంది. మరి మన అంతరంగబావుల్లో సంతోషపు జల పడవలనంటే - మన జీవన ప్రవాహాన్ని ఆనందసాగరానికి పాయలుగా మలచాలి. ఆరు దశాబ్దాలక్రితం ఓ కారు బయలుదేరతీయాలంటే ఇద్దరు ముగ్గురు వెనకనుంచి తోయవలసి  వచ్చేది. కాలంమారి అదే పనిని ఒకరు ముందు ఓ చువ్వసాయంతో పూర్తిచేసేవారు. ఇప్పుడు ఎవరిసాయమూ లేకుం డానే బ్యాటరీతో కారు బయలుదేరుతోంది. కారుమీద గల శ్రద్ధ  మనిషికి తన మనసుమీద ఉండాలా, వద్దా?! చక్కని ఇల్లు, చల్లని సంసారం, సంఘంలో పరువూ, జేబునిండా పరుసు బరువు... అన్ని ఆనందాలకూ భౌతిక సుఖాలే మూలమన్న ఇక్ష్వాక కాలంనాటి ఆలోచనలే ఈనాటికీ చలామణీలో ఉన్నాయంటున్నారు బ్రిటన్ పింఛన్ల శాఖ తరపున సర్వే చేసిన మానవ శాస్త్రవేత్తలు. యుక్తవయస్కుల్లో మధ్య వయస్కులలో భౌతికానంద అయస్కాంతం మరీ బలంగా పనిచేస్తుంటే ఏడుపదుల వయసు దాటినవారిలో మాత్రం నూటికి డెబ్బై రెండుమంది తాతయ్యలు, తాతమ్మలు శీత వేళాను , శిశిరాన్ని ఖాతరు చేయటం లేదంటున్నారు! 'తీరని దాహము దేనికై / వేసారిన మోహము దేనిపై / క్షీర జలనిధి నీలోనే ఉండగ, ఆరని దీపం లోపల ఉండగ? ' అని మన భావకవి కృష్ణశాస్త్రిలా కులాసాగా పాడు కునే ఆ తాతల తరాన్నుంచి ఆనందానికి అసలైన అర్థం ఆధునికులూ తెలుసుకుంటే... అదే బ్రహ్మాండంలో అసలు సిసలు ఆనందో బ్రహ్మ !


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 -06-2011 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...