నీమహత్వంబు విబుదైక విగదితంబు/ దశదిశలయందు నీచారు ధవళకీర్తి
తనరుగావుత మాచంద్ర తారకముగ!' అంటూ హారతులు పట్టించుకున్న వృక్షసంపద ప్రాణికోటికి కోటి ప్రయోజనాల దాత . వృక్ష
రహిత జీవావరణం ఊహకందటం కష్ట తరమే. 'పుటకే పుటకే మధు' అని పురాణ సూక్తి. ప్రతి పత్రంలోనూ మధురసం దాచి ఉంచి,
ఆది నుంచి ప్రతి జీవి కుక్షి నింపుతున్నది వృక్ష మాతే. చిగురుటాకు మొదలు.. ఎండు చితుకుల
వరకు మొగ్గలు, పూవులు, కాయలు, పండ్లు, బెరళ్ళు.. ప్రత్యణువూ పరహితార్థంగ బతికే
ప్తత్యక్ష దైవం వృక్షం.
'భూరుహాలూ మానవుల తరహాలో సుఖదుఃఖ అనుభవాలకు
అతీతులేమీ కాదు. ' అన్నది మనువు మతం. జేమ్స్
మోరిసన్, జెసి బోసు గెల్వనా మీటరు సాయంతో నిరూపించిందీ ఈ సత్యమే. కుఠార ప్రహారానికి విలపించిన విధంగానే..
గట్టు కట్టి నీరు పోస్తే చెట్టూ చేమా సంతోషిస్తాయి.. పుష్ప
భావోద్వేగాలు ప్రధానాంశంగా సాగిన కరుణశ్రీ ఖండ కావ్యం మనకు ఉదాహణగా ఉండనే ఉంది. కాల గతిన గతించక ముందే చేసే వృక్షచ్ఛేదనను ఉపపాతకంగా యాజ్ఞవల్క్యం(276) పరిగణించింది. పూర్వీకులు వృక్షాలకు దైవత్వం
కల్పించి.. పూజనీయం చేయడంలోని ఆంతర్యం.. విలువైన
వృక్ష సంపద అర్థాంతరంగా అంతరార్థం కారాదనే. పరీశీలించే విశాల దృక్పథం
ఉండాలే గాని ప్రాచీనుల సూత్ర బద్ధ నిబందనల చాటున దాగి ఉన్నదంతా.. నేటికి గాని నిగ్గు తేలని వైజ్ఞానిక అంశాల సమాహారమేనన్న సులువుగానే బధపడుతుంది.
వరాహమిహిరాచార్యులు పన్నెండు వందల ఏళ్ల కిందటే
వృక్షారోపణ లక్షణాలను.. పుష్పాదుల వికాసానికి సహకరించే దోహద క్రియలను గూర్చి పూసగుచ్చినట్లు వివరించారు.
మొక్కా మోడులను పెంచడం ఒక్క ఆహారానికేనా? ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, మానసిక
ప్రశాంతతకు, ఏకాంతానికికూడా! వైద్యునిలా, మిత్రునిలా,
హితునిలా జీవితో సన్నిహితంగా
మెలిగే తల్లి ప్రవృత్తి ప్రకృతిది. కాబట్టే అడవుల నుంచి.. అధునాతన
కట్టడాల వరకు హరిత పత్ర పోషణ ఒక ముఖ్య జీవితోపాసనగా మారింది. వృక్షో రక్షతి
రక్షితః.
వృక్షాంశం ఒక
శాస్త్రంగా పఠించే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుంచే ప్రచారంలో ఉందీ దేశంలో. కౌటిల్యుడు (క్రీ. పూ 850) అర్థ శాస్త్రంలో ఆయుర్వేద వైద్యం విధి విధానాలు విస్తృతంగా చర్చించిన విశేశం ఎంత మందికి తెలుసు?. వేదాలు, సంహితలు మొక్కల బాహ్య స్వరూప స్వభావాలను అత్యంత
మనోహరంగా వర్ణించాయి. ఆర్యులు ఆదరించిన సాగు పద్ధతుల నుంచి, చరకుడు
అనుసరించిన వైద్య విధానం వరకు అన్నింటికీ వృక్షాలు, మొక్కలు,
మూలికలే ప్రధాన ఆలంబన. వాల్మీకి రామాయణం ఒక
వృక్ష వైజ్ఞానిక గ్రంథం. సుందర కాండలో లంకానగర ఉద్యాన వనాలు, కాళిదాసు
మేఘసందేశంలో అలకాపురి వృక్షాలు రుతుభేధం లేకుండా
పుష్పిస్తాయి. లక్ష్మణ స్వామి మూర్చ బాధకు సుషేనుడు సంజీవ పర్వత ఓషధులతోనే చికిత్స చేసింది.
యుద్ధ కాండలో ఆయుధ ప్రహారాల నుంచి గాయపడకుండా తప్పించుకునే నిమిత్తం
మహాపార్శ్వుడు, మహోదరుడు
ఓషదులను, నానావిధ సుగంధాలని దేహానికి పట్టించడం విశదంగా వర్ణించడం
ఉంది. శిఖరాగ్ర వృక్షాల
బెరళ్లలోని శిలీంద్ర జాలం పొడి
వర్ష ధారలకు తడిసి శరద్రాత్రుల్లో మెరుస్తుంటుంది. అధిక మోతాదుల్లోని భాస్వరం ఈ రసాయనిక చర్యకు ప్రేరణం.
హిమవత్పర్వతం మీద ఓషధులు వెదికే ఆంజనేయుడి దృష్టి నుంచి ఈ 'సందీప్త సర్వౌషధ
సంప్రదీప్త'మూ దాటి పోలేదు! అణ్ణామలై విశ్వవిద్యాలయం మాజీ
వృక్షశాస్త్రాచార్యులు టి.సి.ఎన్. సింగ్
శబ్ద తరంగాలతో భూమి పొరల ద్వారా మొక్కల్లోని ప్రత్యుత్పత్తి కణజాలాన్ని
ఉత్తేజపరిస్తే సత్వర పుష్ప వికాసం సాధ్యమేనని
నిరూపించారు. స్రీ పాద తాడనంతో అశోకం,
ఆలింగనంతో గోరింట, నమ్ర వాక్యాలతో కొండ గోగు
అకాలంలోనూ పుష్పిస్తాయని కాళిదాసు, శ్రీహర్షుల కృతుల్లోనూ ఉండటం
తెలిస్తే నవీన తరం ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుడుతుందేమో! కాళిదాసు శృంగార మంజరిలోని
'పూవు నుంచి పూవు పుట్టే' వింత నేడు
గులాబీ, జినియా జాతి
బంతి పువ్వుల్లో కనిపిస్తుంది.
ధూర్జటి 'కాళహస్తీశ్వర మాహాత్మ్యం' లోని ఓ చెట్టు ఆకులు తటాక జలాల్లో
పడ్డవి జలచరాలుగాను, గాలిలో తేలేవి పక్షులుగాను, వడ్డుకు అటు ఇటుగా పడ్డవి
ఉభయచరాలుగానూ మారే విడ్డూరం వర్ణీంపబడింది. ఈజిప్టు, రోము, గ్రీసు నగరాల తవ్వకాలలో బయట పడ్డ కొన్ని చిత్రాలు
ఇదే వింతను చిత్రీకరిస్తుంటే ఆ అద్భుతానిని ఏమనిపిల్చుకోవాలి?! అయినా నాటి కవుల వృక్ష పరిజ్ఞానాన్ని సాటి పాశ్చాత్యులతో కలసి మనమూ
వెటకరిస్తున్నాము! పెరటి చెట్టంటే మరి అంత చులకన కాబోలు!
రావిలోని రాగి తేజోకారి. బావి నీటిని సైతం ఆవిర్లెక్కించే
ఉష్ణకారి. పగలు
ప్రాణ వాయువు, రాత్రి బొగ్గు పులుసు విడిచే గుణం వేప చెట్టుది. చింత గాలి
వంటిసున్నానికి బద్ధ విరోధి. అశ్వత్ఠం వృక్ష
జాతుల్లోకెల్లా అత్యుత్తమమైనదని గీత
ధృవీకరిస్తున్నది. చెట్లు విడిచే గాలి వంటికి
తగిలే చోట నివాసముంటే చాలు.. సగం ఆరోగ్యం సర్వదా వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లే
నంటున్నారు ఆరోగ్య శాస్త్రవేత్తలు.
రష్యన్ వృక్ష శాస్త్ర
పరిశోధకులు దక్షిణ భారతాన దొరికే అత్యంత అరుదైన ఆరువేల రకాల మొక్కలను, వెయ్యి
రకాల విత్తనాలను పరిశోధనల నిమిత్తం
పట్టుకు పోయారు. అయినా మనకు చీమ కుట్టినట్లైనా లేదు! మనకు చెట్టంటే పట్టదు!
కార్తీక మాసం సంబరాల్లా
వనభోజనాల సందళ్ళు సాగే కాలం. ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన..
సామూహిక భోజనాలు ఓ ఆచారం. కాలుష్య రహిత హరిత వనాల్లో పవిత్ర ఔషధ పరిమళాల మద్య చేసే విందు ఆరోగ్య కోణం
వైద్యుల ప్రశంసలు అందుకుంటోన్నది. 'జిరుత వాయువులను దెచ్చి చెమట లార్చి/ చల్లదనమిచ్చి సుఖమిచ్చి
సత్వమిచ్చి/కౌతుకము నిచ్చి బుద్ధివికాస మిచ్చి/యతిధి కభ్యాగతికి మరియాద
వెలయ/నాదరము జూపు మంచి గృహస్థు'నితో పోల్చాడు
వృక్షరాజ్యాన్ని వెనకటికి ఓ ప్రకృతి ప్రేమికుడు. వివిధ విలయాలకు ఇప్పుడా వృక్షాలు లక్షలాదిగా నేలకూలుతున్నాయి. . పచ్చదనం తగ్గి నేల తల్లి
కళ తప్పివున్నది. వనాలే లేవు .. వన భోజనాలు ఎక్కడని
ఇప్పుడు జనాల బెంగ. నిరుత్సాహం
చికిత్స కాదు గదా! విలయాల అనంతరమైనా చెట్టు ఘనత మనకు తెలిసి వచ్చింది కదా! సంతోషం.
కూలినంత వేగంగా వృక్ష జాతుల్ని తిరిగి నాటే ఉద్యమానికి ప్రభుత్వాల చేత శ్రీకారం చుట్టించాల్సింది
ఓట్లు వేసి గెలిపించుకున్న జనతే. ఆనందం, ధృఢ సంకల్పంతో చెట్లు నాటే కార్యక్రమంలో జనమూ
స్వచ్చందంగా చొరబడితే కోల్పోయిన పచ్చ'ధనా'న్ని తిరిగి సాధించడం ఎంత సేపూ?
***
(ఈనాడు సంపాదకీయం)
-కర్లపాలెం హనుమంతరావు
బోథెల్, యూఎస్ఎ