Showing posts with label Folk. Show all posts
Showing posts with label Folk. Show all posts

Sunday, December 19, 2021

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు - కర్లపాలెం హనుమంతరావు ( ఒక జానపద కథ ఆధారంగా )

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 



పూర్వం మన దేశంలో అవుమాంసం తినేవారు. మన కనేక విధాల సహాయపడే ఆవును చంపి తినడం న్యాయమేనా అని ఒక రోజున రాజు గారు ఆలోచించారు. ఆవును చంపడం చాలా తప్పని తోచింది రాజుగారికి, తక్షణమే మంత్రిని పిలిచి గోమాంస మెవరూ తినకూడదనీ, తినిన వారికి ఉరి శిక్ష విధించబడుననీ దండోరా వేయించమని ఆజ్ఞాపించారు.


ప్రజలందరికీ రాజాజ్ఞ ప్రకటితమైంది. అందరూ గోవును చంపడం మానేశారు. కాని ఒకాయన గోమాంసం తినకుండా ఉండలేకపోయాడు. ఎవరూ చూడకుండా రహస్యంగా ఆవును చంపేసి దాని గిట్టలు భూమిలో పాతేశాడు. ఆయన గిట్టలు పాతిపెట్టిన చోటునుండి, ఒక మొలక వచ్చింది.

ఆడే వెల్లుల్లి, ఆవు గిట్టలనుండి పుట్టింది. కనక వాటిలాగా వెలుల్లి  నాలుపాయలుగా ఉంటుంది. ఇదీ వెల్లుల్లి జీవిత రహస్యం.


ఇంక నీరుల్లి సంగతి: 


ఒకరోజున కాయగూరలన్నీ సభ చేశాయి. 

వంకాయ లేచి సభికులనందరినీ ఉద్దే శిస్తూ ఇలా అంది.


"స్నేహితులారా ! ఇవాళ మన మందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషం. అన్ని దేశాలకీ రాజు మానవలోకంలోనూ, దేవలోకంలోనూ కూడా ఉన్నారు. ఒక్క మనలోనే లేరు. అన్ని దేశాల వలె మనకికూడా రాజుంటే బాగుం టుంది.”


అందరూ వంకాయఅభిప్రాయానికి సంతోషించారు. గుమ్మడి, పొట్ల కాయలు వచ్చి వంకాయ ఉద్దేశాన్ని బలపరిచాయి.


మిరపకాయ లేచి, “వంకాయగారు చెప్పినది, సత్యమే. మనకికూడా రాజు కావాలి. ఈ విష యం అందరూ గుర్తించి ఒప్పుకొన్నందుకు చాలా సంతోషం. కాని రా జెవరిని చెయ్యాలో చర్చించాల్సిన విషయం.” అని చెప్పి కూర్చుంది.


మిరపకాయ తెలివితేటల కందరూ మెచ్చుకున్నారు. తర్వాత వంకాయ, "భగవంతుడు పుట్టుకతో టే నాకు కిరీట మిచ్చాడు. మీ అందరికన్న నాలో సార మెక్కువ. రుచి అధికము. వంకాయ ఇష్టము లేనివా రెవరైనా ఉన్నారా? కనక నేను రాజపదవి కర్హుడనని తలచుచున్నాను” అని పలికింది.


పొట్లకాయ వెంటనే లేచి, “వంకా యగారు పొరబడినారు. నేను చాలా భారీగా ఉంటాను. అందంగా ఉంటాను. నన్ను మర్చిపోయి, తనకు రాజలక్షణా లున్నా యనుకుని అలా చెప్పి ఉంటా రు” అని యథాస్థానంలో కూర్చుంది.


రాజెవరో తేలలేదు. ఎవరికివారే తాము రాజపదవికితగుదు మని వాదించారు. గుమ్మిడికాయ, “సోదరులా రా మన మిట్లు వాదించుకోవడం అనవసరంగా  దెబ్బలాట?  మనని పుట్టించిన బ్రహ్మ దేవుణ్ణి నిర్ణయించమందాం,' అంది. దానికి అందరూ అంగీకరించారు.


బ్రహ్మ దేవునివద్దకుపయాణమైవెళ్లారు. మార్గమధ్యంలోనే దొండకాయ పండిపోయింది. పొట్లకాయ కుళ్లి పోయింది. మిరపకాయ, వంకాయ  ఒడిలిపోయాయి. అలాగే అన్నీ కలిసి బ్రహ్మదేవుడిదగ్గర కెళ్లాయి.


బ్రహ్మ దేవుడు వారి తగవు విని, "మీకూ పుట్టిందీ ఈ జబ్బు! పదవీవ్యా మోహం, మానవులకే అనుకున్నా; నిద్రకళ్లతో సృష్టించి ఉంటా మిమ్మల్ని" అని నసుక్కున్నాడు. 


బ్రహ్మదేవుడు గుమ్మడిని   రాజు చేద్దా మనుకున్నాడు. కాని తనయెదుట నిర్లక్ష్యంగా అంతఠీవిగా కూర్చున్నందుకాయనకి కోపం వచ్చింది. నలుగురి మధ్యనూ ఒదిగిఉన్న ఉల్లిపాయని ఆయన చూశాడు. దానిని వినమ్రతకి బ్రహ్మదేవుడెంతో సంతోషించాడు. ఉల్లిపాయని నిర్ణయించాడు. అందరికీ కోపం వచ్చింది. 'ఛీ ఇదా మా రాజ'ని అన్నీ చీదరించుకున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఉల్లికి పల్చటి రేకులాటి వస్త్రాలిచ్చాడు. శంఖచక్రా లిచ్చాడు. అందుకనే ఉల్లి నడ్డంగా తరిగితే చక్రం, నిలువుగా తరిగితే శంఖం కనిపిస్తాయి.


***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 

Sunday, December 12, 2021

నేరమూ శిక్షా -కథానికః -కర్లపాలెం హనుమంతరావు

 


 

పగలు రాజ్యపాలన సాగిస్తూ రాత్రిళ్ళు మారువేషంలో సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను స్వయంగా పరిశీలించడం మహారాజు కృష్ణవర్మకి  అలవాటు.

ఒకసారి ఇలాగే బాటసారి వేషంలో పర్యటిస్తూ రాత్రి చీకటి పడే వేళకు  నగర పొలిమేరల్లోని ఒక ఇంటితలుపు తట్టారు కృష్ణవర్మమహారాజు.

ఆ ఇల్లొక బీద బ్రాహ్మణుడిది. ప్రాచీన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుంటుంబం అతనిది. ఉన్నంతలోనే చేతనైనంత అతిథి మర్యాదలు చేసాడా రాత్రి.

భోజనం ముగించి.. పడుకునే ముందు బాటసారికి, బ్రాహ్మణుడికి మధ్య చిన్నపాటి లోకాభిరామాయణం సాగింది.

మాటల సందర్భంలో బ్రాహ్మణుడు మారువేషంలోని రాజావారితో  దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను ఏకరువు పెట్టి రాజుగారి పాలనను దుయ్యబట్టాడు.

అంతా సావకాశంగా విన్న రాజావారు "అన్ని కార్యాలూ రాజుగారే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమా! న్యాయ పర్యవేక్షణ, చట్టం అమలు వంటి  విభాగాల నిర్వహణకు అందుకే ఆయన ఎక్కడికక్కడ  ఉద్యోగులను నియమించారు కదా! వారి ప్రవర్తనల్లో లోపం కలితే ఆ దుష్ఫలితాలను రాజుకు ఆపాదించడం సరి కాదు" అని  వాదనకు దిగారు.

"కావచ్చు కానీ.. ప్రజలకు వాటితో పనిలేదు. అంతంత లోతులు ఆలోచించ లేని అమాయకులు వారు. సుఖంగా బతుకుతున్నప్పుడు రాజుగారి చలవ వల్లనే అని ఎలా నమ్ముతారో..  శాంతి భద్రతలు కరువైనప్పుడూ అలాగే  రాజుగారి వైపు  వేలెత్తి చూపిస్తారు. శరీరానికి  దెబ్బ తగిలితే.. గాయపరిచిన ఆయుధాన్ని కాకుండా.. ఆ ఆయుధాన్ని ప్రయోగించిన మనిషినే కదా మనం దూషిస్తాం! అన్యాయం చేసింది ఉద్యోగే అయినా.. అలాంటి దుర్మార్గుడికి అధికారం అప్పగించిన రాజే ఆ నిందను భరించక తప్పదు. సత్పరిపాలన అంటే సచ్చరితులను గుర్తించి సరైన పదవుల్లో నియోగించుకోవడమే" అన్నాడా బ్రాహ్మణుడు.

రాజావారు ఆలోచనలో పడ్డారు.

"చెప్పడం సులభమే.  పదవి చేతి కొచ్చిన తరువాత గాని అసలు నైజం బైటపడదు.   ఎవరి దాకానో ఎందుకు? మీకే గనక ఓ న్యాయాధికారి పదవి అప్పగిస్తే రాజుగారికి ఏ మచ్చా రాకుండా బాధ్యతలు నిర్వహించగలరా?" అని అడిగారు చివరికి.

బ్రాహ్మణుడే మాత్రం తొట్రు పడలేదు. "మహారాజు గారి నమ్మకాన్ని వమ్ముచేయననే అనుకుంటున్నాను" అన్నాడు. ఆ సంభాషణ అంతటితో ముగిసి పోయింది.

 

మర్నాడు ఆ బ్రాహ్మణుడిని కృష్ణవర్మ  కొలువుకి పిలిపించారు. రాత్రి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది స్వయంగా మహారాజే అని అప్పటికి గాని గ్రహింపుకి రాలేదు బ్రాహ్మణుడికి.

"నేటి నుంచి నగర న్యాయపాలనాధికారాలు తమకే అప్పగిస్తున్నాం. న్యాయం 'తు..' తప్పకుండా పాటించడ మెలాగో మీరు నిర్వహించి చూపించాలి. గడువు నెల రోజులు.  గాడి తప్పినట్లు ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా శిక్ష ఘోరంగా ఉంటుంది. తల కోట గుమ్మానికి వేలాడటం ఖాయం. బీరాలు పలికి చివరికి కార్యభీరువులయే వారంతా నేర్చుకోవాల్సిన పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది. అంగీకారమైతే  వెంటనే అంగుళీకమును అందుకోవచ్చు" అని రాజముద్ర ఉన్న ఉంగరాన్ని  ముందుకు చాచారు కృష్ణవర్మమహారాజు.

క్షణకాలం మాత్రమే ఆలోచన. ఆ రాజముద్రను అందుకుని భక్తిగా కళ్లకద్దుకొన్నాడు పేద బ్రాహ్మణుడు. నగర కొత్త న్యాయాధికారిగా రామశాస్త్రి పేరు  ప్రకటింపబడింది. రామశాస్త్రి ఆ బ్రాహ్మణుడి పేరే.

 

సగం గడువు తీరిపోయింది. నగరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇప్పుడు. మొదటి వారంలో రామశాస్త్రి దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలావరకు అక్కడికక్కడే పరిష్కరింపబడ్డాయి. దోషులను విచారించడంలోను, దండనలు విధించడంలోను, శిక్షల అమలును పర్యవేక్షించడంలోను.. రామశాస్త్రి చూపిస్తున్న నిజాయితి, నిష్పక్షపాతం, నిబద్ధత, చాతుర్యం రెండోవారంలోనే మంచి ఫలితాలు చూపించడం మొదలు పెట్టాయి. నేరస్తులు జంకుతున్నారు. నిందితులు తప్పించుకునే  కొత్తదారులు వెదుకుతున్నారు. శిక్షల రద్ధుకోసం పూర్వం  అవలంబించిన అడ్దదారులేవీ పనిచేయక ఇబ్బంది పడుతున్నారు బందీలు.

కొత్తన్యాయాధికారికి జనం  'జేజే'లు పలకడం నగరసంచారంలో  కృష్ణవర్మ మహారాజు స్వయంగా గమనించారు. మహారాజా వారు రామశాస్త్రినే రాజ్యం మొత్తానికి శాశ్వత న్యాయాధికారిగా నియమించబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో కొచ్చేసింది ఎలాగో. అప్పుడు జరిగిందా విచిత్రం.

 

పనిమీద దేశాంతరం పోయిన ఒక చిన్నవ్యాపారి అనుకోకుండా అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అమావాస్య కావడం వల్ల అప్పటికి చీకటి బాగా చిక్కపడి ఉంది. భార్య చాలా తాత్సారం చేసి గానీ తలుపు తీసింది కాదు.  అనుమానం వచ్చిన భర్త ఇల్లంతా వెతికితే పడకగదిలో మంచం కింద మరొక మగమనిషి  నక్కి  కనిపించాడు.  తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో వాడికీ, ఇంటియజమానికీ మధ్య పెద్ద పెనుగులాట అయింది. ఆ దెబ్బలాటలో కత్తిపోటుకి బైటమనిషి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి.

ఇప్పుడు హతుడి భార్య  న్యాయం కావాలంటూ రామశాస్త్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. "ఒక ఇంటి ఆడది చనువు ఇవ్వకపోతే మొగవాడనే వాడికి అర్థరాత్రి ఆ  ఇంట దూరే ధైర్యం ఎక్కడి నుంచీ వస్తుంది? భర్త వుండీ పరాయి మగవాడితో పోవాలనుకునే ఆడదానికి పడాలి అసలైన శిక్ష.. ముందుగా" అని విగతజీవుడి భార్య వాదన.

కొట్టి పారేయదగింది కాదు.

"నాకే పాపమూ తెలీదు. ఈ మనిషి ముఖం కూడా నేను   ఎన్నడూ చూసి ఎరగను.  వీడు ఎప్పుడు ఇంట్లో కొచ్చాడో..  పడకగదిలో మంచం కింద ఎందుకు దూరాడో అస్సలు   తెలీదు.  నా బిడ్డమీద ఒట్టు. తలుపు ఆలస్యంగా తీయడానికి కారణం నేను మంచి నిద్రలో వుండటమే. మా ఇంటాయన  ఆ సమయంలో వస్తాడని నేనేమన్నా కలగన్నానా?"అని భోరుమంది ఆ ఇల్లాలు. కన్నబిడ్డమీద కూడా ప్రమాణం చేసి చెప్పిందా ఇల్లాలు. కల్లిబొల్లి కథలుగా  శంకించడం సబబు కాదు.

"నిజానికి ఆ దుర్మారుడే నన్ను చంపాలని చూసాడు. తప్పించుకునే ప్రయత్నంలో నేను కత్తి విసిరిన మాట నిజమే. కాని.. వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. గాయ పరిచి చట్టానికి పట్టిద్దామన్నదే అప్పటి నా ఆలోచన.   చేతికి గురి చూస్తే కత్తి  గొంతులో దిగబడింది.." అని పశ్చాత్తాపం ప్రకటించాడు ఇంటి యజమాని. ఆయనకు పరమ శాంతపరుడిగా చుట్టుపక్కల మంచి పేరు కద్దు.

విచారణలో ఏ మాత్రం పొరపాటు జరిగినా అమాయకులు అన్యాయంగా బలైపోయే ప్రమాదం ఉంది.

రామశాస్త్రికి మొదటిసారి ధర్మసంకటం ఏర్పడింది.

'న్యాయానికి భార్య ఉండీ.. పరాయిస్త్రీ కోసం వెంపర్లాడిన ఆ కాముకిడికి తగిన శిక్షే పడింది. కానీ దాని పర్యవసానం  అమాయకురాలైన వాడి భార్య మీద కూడా పడింది. వ్యాపారి భార్య మీద ఆరోపించిన కాముకత్వానికి రుజువులు లేవు. చట్టప్రకారం శిక్షించడం కుదరదు. సహజన్యాయం దృష్టితో చూస్తే.. తన కాపురంలో నిప్పులు పోయబోయిన దుర్మార్గుడిని ఆత్మగౌరవం గల ఏ మగవాడూ ఉత్తిపుణ్యానికి సహించి వదిలి పెట్టలేడు. నిజంగా వాణ్ని చంపినా వ్యాపారికి పాపం అంటుకోరాదు.

కాని ఇది న్యాయస్థానం. న్యాయం ఇక్కడ  కొన్నిచట్రాల పరిధిలో మాత్రమే ఇమిడి నిర్థారింపబడుతుంది.  కావాలని చేసినా.. అనుకోకుండా జరిగినా ఒక నిండుప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దానికి కారకుడైన వాడిని ఉపేక్షిస్తే సమాజం మొత్తానికి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి.

ఇదే అదనుగా తన మీద గుర్రుగా ఉన్న తతిమ్మా న్యాయాధిపతులు మహారాజు గారికి ఫిర్యాదులూ చేయవచ్చు. తన తలను గురించి కాదు కానీ.. రాజ్యం మళ్ళీ పూర్వసంక్షోభంలో  చిక్కుకుంటుందేమోనన్నదే దిగులు.  ముందు ముందు సమాజానికి  ఈ తలతో చేయవల్సిన సేవ ఎంతో వుంది. ఈ చిన్న కారణంగా ఆ పెద్ద సామాజిక భాధ్యతనుంచి ఇలా తప్పుకోవాలనుకోవడం కార్యశీలుడి లక్షణం కాదు.'

ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా ఆలోచించిన రామశాస్త్రి తెలారి చెప్పవలసిన తీర్పు మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అప్పుడు గాని నిశ్చింతగా నిద్ర పట్టిందికాదు.

 

మర్నాడు న్యాయస్థానంలో రామశాస్త్రి చెప్పిన తీర్పు ఎందరినో ఆశ్చర్య చకితులను చేసింది.  'ఘటన పుర్వాపరాలు అతి సూక్ష్మంగా పరిశీలించిన పిమ్మట ఈ నేరం మొత్తానికి సంపూర్ణ భాధ్యులు దేశాన్ని ఏలే కృష్ణవర్మమహారాజు గారే అని నిర్ధారించడమైనది. దేశాంతరం పోయిన చిరువ్యాపారి చేసే పని తాను పండించిన కూరగాయలను కనీస ధరలకు అమ్ముకోవడం. దేశీయంగా తగిన మద్దతు ధర దొరికితే ఎవరూ కుటుంబాన్ని అలా వదిలి దేశాలుపట్టిపోరు.

 

మహారాజుగారి మరో నేరం మృతుడి దుర్మరణం.  స్వయంకృషితో నిమిత్తం లేకుండా సంపదలు వచ్చి పోగుపడే మిడిమేళపు వర్గం ఒకటి దేశంలో వర్ధిల్లుతున్నది ప్రస్తుతం. వారికి పొద్దు గడవడమే పెద్ద ఇబ్బంది. తిన్నదా అరగదు. కొవ్వా కరగాలి. రకరకాల దోవల్లో వాంఛలు తీర్చుకునే తాపత్రయాలు ప్రదర్శిస్తుంటారు. సంసార స్త్రీలను ఉచ్చులోకి లాగడం ఈ తరహా కుత్సిత ప్రయత్నాలలో ఒకటి. చట్టాలు వీరికి చుట్టాలు. న్యాయం ఆంటే వీరికి మహా అలుసు. పాపాత్ములకు ఏ శిక్షలూ పడని ఈ అస్తవ్యస్త వ్యవస్థకూ సర్వోన్నతాధికారి అయినందు వల్ల మహారాజుగారే  ఈ నేరానికి భాద్యత వహించవలసి ఉంది.

 

కట్టుకున్న వాడితో కలసి   బతుకును పండించుకోవాలన్న ఒక్క ఆశతో మాత్రమే స్త్రీ  మెట్టినింటికి అడుగుపెట్టేది. కలకాలం పక్కనే ఉంటానని  ప్రమాణం చేసి మరీ చెయ్యందుకున్న  మగవాడు  కలలో తప్ప కనపడని  దుస్థితి దాపురిస్తే పడతులందరూ  ఒకే రీతిలో స్పందిస్తారన్న ధీమా లేదు.  కడుపు నిండిన వాడు అన్నం దొంగిలిస్తాడా? సంసార జీవితం సంతోషంగా సాగితే పక్క చూపులు చూస్తుందా ఏ సుదతైనా? బిడ్డ ఖాళీ కడుపుకి కన్నవారిదే నేరం ఎలాగో..  ఇక్కడ ఏలిన వారి దోషం ఇక్కడ అలాగే.

మూడు తప్పులకూ మూలకారణం  మహారాజుల వారే కనక మరణ దండనే వారికి సరైన శిక్ష.  నిందితుడే స్వయంగా,  బహిరంగంగా మహారాజుల వారి పైకి  కత్తి విసిరాలి. ఆ తరువాత  ఆ నేరం మీద వ్యాపారికీ యథేచ్చగా ఉరిశిక్ష అమలు చేయవచ్చు.  హతుడి భార్య కోరుకుంటున్న న్యాయం కూడా   అప్పుడే సాధ్యమవుతుందని ఈ న్యాయస్థానం భావిస్తున్నది"

రామశాస్త్రి తీర్పు పుట్టించినంచిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రజలు తీర్పుకి అనుకూలంగా.. ప్రతికూలంగా రెండు వర్గాలుగా చీలి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. అంశం మహారాజుగారి మరణదండనకు సంబంధించింది అవడం చేత ఆ చర్చల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద తీవ్రంగా ఉంది. తీర్పులో ప్రస్తావించిన దేశీయ వ్యాపార ధోరణులు.. కలవారి విచ్చలవిడి బతుకులు.. ఆడవారి జీవితాల్లో  జరుగుతున్న అన్యాయాల్లాంటి ఎన్నోసామాజిక సమస్యలు మేధావివర్గాల చర్చల్లో నలిగి నలిగి సామాన్య్లుల అవగాహనా స్థాయి పదును కూడా పెంచాయి. న్యాయస్థానాల్లో, శాంతిభద్రతల రక్షణ  యత్రాంగాల్లో అప్పటి వరకూ లోపాయికారీగా సాగుతోన్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం లాంటి ఎన్నో రుగ్మతలు ఇప్పుడు నిర్భయంగా బహిరంగ చర్చల్లో నలుగుతున్నాయి.

రామశాస్త్రి కోరుకున్న చైతన్యం కూడా అదే.

 మహారాజుగారూ  తీర్పుకి కట్టుబడి ఉంటానని ప్రకటించడంతో చట్టం ముందు అందరూ సమానమేనన్న సందేశం అత్యంత బలంగా సమాజానికి అందించినట్లయింది. న్యాయవ్యవస్థ పక్షపాతం మీద అప్పటిదాకా ధనికవర్గాలకున్న భేఫర్వా మొత్తం  ఒక్కసారి కుప్పకూలింది.

రామశాస్త్రి తీర్పు అమలు చేయాల్సిన క్షణాలు రానే వచ్చాయి. బహిరంగ వధ్యశిల ఏర్పాటు చేయబడింది.  రాచపరివారం సమస్తం వెంటరాగా మహారాజు గారు శిక్షాస్థలికి అట్టహాసంగా తరలి వచ్చింది.

శిక్షలు విధించడమే తప్ప శిక్షలు అనుభవించే వ్యవస్థ రాచరికానికి కొత్త. చరిత్రలో సైతం ఎక్కడా జరిగినట్లు విని ఉండని ఈ  అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి జన సమూహాలో  విరగబడి వచ్చాయి.

 ఎక్కడ విన్నా మహారాజుగారి మంచితనాన్ని గురించిన స్మరణలే.  ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించే  కృష్ణవర్మ మహారాజు స్థానాన్ని వారసులు  ఎంతవరకు పూరిస్తారోనన్న నిరాశ. మహారాజుగారి పాలనలో కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు. రామరాజ్యానికే ఈ మచ్చ తప్పలేదని రామాయణం చెబుతోంది.  రాములవారికి ఇలాంటి దారుణమైన శిక్ష పడిందా?

చర్చలు ఇలా పలు రకాలుగా సాగుతుండగానే.. చీకటి పడింది. తీర్పులో విధించబడిన సమయానికి సరిగ్గా వ్యాపారిని మరణ వేదిక మీదకు తీసుకొచ్చారు. అతని చేతికి ఒక కత్తి ఇచ్చారు.

ఎదురుగా తలమీద ముసుగుతో సర్వంసహా చక్త్రవర్తులు..  ప్రాణాలు అర్పించడానికి సిద్ధబడి ధీరోదాత్తంగా  నిలబడి వున్న దృశ్యం.

ప్రకటన వెలువడింది "వ్యాపారీ! తీర్పు ప్రకారం నువ్వు మహారాజుగారి  మెడ మీదకు ఈ కత్తి విసరాలి. ఒకే ఒక్క వేటుతో  మహారాజుగారి ప్రాణాలు  పోవాలి సుమా! ఇహ అప్రమత్తమయి  విసురూ!"

అంతటా హాహాకారాలు.

వజవజా వణుకుతూ వ్యాపారి చేతిలోని కత్తి బలంగా విసిరాడు.  గురి తప్పింది.  మెడకు తగలవల్సిన కత్తి భుజానికి రాసుకుని కింద పడింది. తీర్పులో వ్యాపారికి ఇచ్చింది ఒకే ఒక్క అవకాశం కనక మహారాజు గారు ఇక  సురక్షితం.

అంతటా ఆనందంతో కేరింతలు.

ప్రజాభిమానానికి  కదలి పోయారు కృష్ణవర్మ మహారాజు. ఇంతగా ప్రేమించే ప్రజలకు ఏమిస్తే రుణం తీరేను! జన సంక్షేమానికి మరింత  ప్రాధాన్యమివ్వాలని ఆ క్షణంలోనే  కృతనిశ్చయానికొచ్చారు  కృష్ణవర్మ మహారాజు.

ఇదంతా రామశాస్త్రి చిత్రమైన తీర్పు  కలిగించిన మనోవికాసం.

"నిజమే కానీ.." అంటూ అప్పటి వరకూ తనను తొలుస్తున్న సందేహాన్ని రామశాస్త్రి ముందు బైట పెట్టారు మహారాజా వారు "అర్థరాత్రి పరాయి యింటిలోకి  ఆ దుర్మార్గుడు జొరబడింది ఎందుకో నిర్ధారణ కాలేదు. ఆ ఇంటి ఇల్లాలు చరిత్ర ఎంత స్వఛమైనదో  తేలిందిలేదు.  వ్యాపారి 'దుర్మార్గుడిని కావాలని చంపలేదు.. నిర్దోషిన'ని బుకాయిస్తున్నాడు. ఆ మాటల్లోని  నిజాయితీ పాలు నిగ్గుతేలలేదు. తప్పు చేసిన వాళ్ళందరిని గాలికి  వదిలేసి ఆ సంఘటనతో ఏ మాత్రం సంబంధం లేనినాకీ..శిక్ష ఏమిటి? అందునా గురి చూసి విసిరే కత్తికి ఎదురుగా నిలబడి ఉండడం!  వ్యాపారి సుశిక్షితుడైన యోధుడు కాడు. కాబట్టి తడబడ్డాడు.  లేకపోతే.."

మధ్యలోనే అందుకొని ముగించాడు రామశాస్త్రి "అతను తడబడ లేదు మహారాజా! గురి చూసే విసిరాడు. కానీ ఆ గురి తప్పింది. అతని గురే అంత. కుడికన్నులో దృష్టిలోపం ఉంది. ఆ లోపం కారణంగానే ఆ రోజు రాత్రి కూడా ఈ వ్యాపారి చేతిలో ఆ దుర్మార్గుడి ప్రాణాలు పోవడం!  దుర్మార్గుణ్ని గాయపరిచి వదిలేద్దామనే కత్తి విసిరాడు పాపం, ఇతగాడు. దృష్టి లోపం వల్ల అది అతని ప్రాణాలు పోవడానికి కారణం అయింది. నిజానికి అలాంటి నీచులు బతికి ఉండటం వల్ల అమాయకులకు ఏ మాత్రం మనశ్సాంతి ఉండదు. వ్యాపారి భార్య  ఒంటరిగా ఉండటం చూసి   నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే వాడు చీకటి మాటున చాటుగా వచ్చి పడక గదిలో ముందే దూరి కూర్చున్నది. ఆ పాపంలో ఆమెకే భాగం లేదు. ఆ కాముకుడి చరిత్ర.. ఆ ఇల్లాలి చరిత్ర వాకబు చేయించిన తరువాతనే నేనీ రకమైన శిక్ష ఖరారు చేసింది.

సంఘటన విచారణకు వచ్చినప్పుడు  ఆ చిన్నవ్యాపారికి శిక్ష పడుతుందనే అందరూ భావించారు. సాక్ష్యాలనీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి. నా మనస్సాక్షి ఒక్కటే  అనుకూలం. వాకబు చేసిన మీదట నా నమ్మకం నిజమని తేలింది. కానీ సాక్ష్యాలుగా అవి చాలవు.  వ్యాపారిని శిక్షించకుండా వదిలేస్తే నా తల కోట గుమ్మానికి వేలాడితే చూడాలను వువ్వీళ్ళూరేవాళ్ళకు అవకాశం ఇచ్చినట్లవుతుంది.  ఇప్పటి వరకూ ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడిప్పుడే ఆ  పరిస్థితులు చక్కబడుతున్నాయి. నా తలను గూర్చి నాకు బెంగ లేదు. కానీ.. తమ మంచితనం వల్ల ఈ పేదవాడు కలలో అయినా ఊహించలేని విధంగా ప్రజాసేవ చేసుకునే ఈ గొప్ప అవకాశాన్ని పొందాను. దాన్ని సమాజ హితం కోసం మరింత పదునుగా వాడాలని మాత్రం ఆత్రంలో ఉన్నాను.  ముందు ముందు నా విరోధులు మీ మనసు విరిచే ప్రమాదం ఉంది. అందుకే .. ఏ సంబంధం లేకపోయినా ఈ వ్యవహారంలో  మిమ్మల్ని కూడా ఇరికించవలసి వచ్చింది. మీ ముందు అనుమతితోనే ఇది సాధ్యమయిందనుకోండి. వ్యాపారి దృష్టి లోపం మీద ఒకసారి మీకు నమ్మకం ఏర్పడితే ..ఇంక ఎవరు ఎన్ని చెప్పినా మీరు నా తీర్పుని  శంకించరన్న నమ్మకమే నా చేత ఈ అతిసాహసం చేయించింది. మీ సహృదయత వల్లే ఇది సాధ్యమైంది.  ఇదీ నేను ఇవ్వాలనుకున్న సంజాయిషీ. ఇప్పుడు మీరే శిక్ష విధించినా శిరసావహించడానికి ఇక సిద్ధం మహారాజా!"

మందహాసం చేసి అన్నారు  మహారాజు "నాకు ఇంత పెద్ద శిక్ష విధించిన పెద్దమనిషిని వూరికే వదిలి పెట్టడం కల్ల.శిక్ష ఖాయం. అమలుకు గడువు దాకా వేచి చూడటం దేనికి? రేపే ముహూర్తం. మీరు మా ముఖ్య  ఆంతరంగిక వర్గంలో చేరాలి. సామాన్యులకు మా ద్వారా  మరింత న్యాయం జరిగే అవకాశం కల్పించాలి!   మా ముఖ్య సలహాదారులుగా  చేరడమే  మీకు తగిన శిక్ష " అంటూ ఆప్యాయంగా రామశాస్త్రిని ఆలింగనం చేసుకున్నారు కృష్ణవర్మ మాహారాజు.

-కర్లపాలెం హనుమంతరావు

( గో తెలుగు.కామ్ లో ప్రచురితం)

***

 

 

   

 

 

 

 

 

 

 

మందు' పుట్టుక వెనుకటి కత! 😊సరదాకే - కర్లపాలెం హనుమంతరావు

 ' 


ఇప్పచెట్టు నుంచి స్రవించే మత్తు పదార్థం (ఒక రకమైన కల్లు) మనుషుల బుద్ధి మీద మద్యంలా  దుష్ప్రభావం చూపిస్తుందని మనందరికి తెలిసిన విషయమేగా!  కల్లు, సారాయి వంటి ఆ మత్తు  పదార్థాలే  ఇప్పడు ఈ కరోనా వైరస్ పుణ్యమా అని ఒక పట్టాన ఎక్కడా దొరకడం లేదని వినికిడి. దేవదాసులంతా రోడ్ల మీద కొచ్చేసి  డాంకీసు క్కూడా చేతరాని  డేన్స్  స్టెప్పు లేస్తున్నారని  రోజూ పేపర్లలో చదూతుంటే ఈ జాసపద కథ గుర్తుకొచ్చింది.  😁😀😂


పూర్వ౦  ఒక సాధుజీవికి  జీవితం మీద చచ్చే బోరు కొట్టింది !   ఆత్మహత్యకు డిసైడై అడవి దారి పట్టాడు. ఒక కృూరమృగం  పులి కనబడితే దాని  తలలో నోరు పెట్టబోయాడు. ఆ పులి ఏ కళ నుందో పాపం సాధువును చంపలేదు. సరికదా   అతని వైరాగ్యానికి  కారణం   విచారించింది. సింగిల్ లైనార్టరులో విన్న అతగాడి  కష్టగాథను  తానుసుఖాంతం చేస్తానంది.  తనతోనే చెట్టాపట్టాలేసుకుని అడవిలో ఉండిపొమ్మని కోరింది! అప్పటి  నుంచి పులి, సాధువు నిజంగానే భాయీభాయీ! 

వీళ్లిద్దరి స్టోరీ విన్న ఒక గార్దభానికి  వీరి జట్టులో కలుద్దామన్న కోరిక పుట్టింది. పులి, సాధువులు ఒప్పుకున్న మీదట ముగ్గురూ అడవిలో  ఆదర్శ మిత్రులుగా బతుకు గడుపుతున్నారు . కాలం ఎప్పుడూ ఒకే తీరుగా  నవ్విస్తే ఇన్ని ఏడుపు కతలెక్కడ మనబోటోళ్లకి దొరికేదీ! ఒక వేటగాడికి పుట్టిన దుర్మార్గపు బుద్ధి  వల్ల కల్లోలం మొదలయింది.  పులి జీవితం పాపం అర్ధాంతరంగా ముగిసిపోయింది.  మంచి మిత్రుని ఎడబాటును  తట్టుకు నిలబడ్డం ఎంతటి దీశాలులకైనా   మనసుకు మించిన పనే కదా! అసలే   ఒకడు సాధువు . అతగాడితో బుద్ధి లేకుండా జట్టుకు ఆశపడ్డ అడ్డగాడిద మరొకటి ! రెండు  బుద్ధితక్కువ జీవులుదిక్కు తోచక ప్రాణాలు  తీసేసుకున్నాయి  చివరాఖరుకి. వీళ్ల ముగ్గురూ భూస్థాపితం అయిన చోట  ఏ శ్రీకాళహస్తో, చార్మివారో లేవవు కదా! దిక్కూ దివాణం  లేని వాళ్లు కలసిపోయినమట్టి దిబ్బల్లో దిక్కూ మొక్కూ లేని మొక్కలే మొలుస్తాయి ! ఆ లెక్క ప్రకారమే అక్కడ కేవలం ఒక పెద్ద ఇప్పచెట్టు మాత్రం ఏపుగా మొలిచింది ! ఆ ఇప్పచెట్టు నుంచి తీసిన పదార్థమే కల్లు. కల్లు మత్తు పదార్థం అని కల్లు తాగని వాళ్లక్కూడా తెలుస్తుంది కదా న్యాయంగా! అది కాదు అసలు మేటరు ఇక్కడ! 

కల్లు తాగకముందు సాధుపుంగవుడిలా ఉండే మనిషి అది  తాగే సమయంలో పులిలాగా చెలరేగిపోతాడు.. రెండో మూడో రౌండ్లు ముగించిన   తరువాత గాడిదలాగా  గెంతులేస్తాడు| ఏ కల్లు దుకాణంలోకి తొంగి చూసినా కనిపించేది సేమ్ సీన్స్!అందుక్కారణం   ఇదిగో ఈ కథలో  చెప్పిన సాధువు, పులి, గాడిద పాత్రల ప్రభావమేనని జానపదుల గట్టి నమ్మకం  ! 😳


జానపదులకు శాస్త్రీయమైన అవగాహన అంతగా ఉండదు కదా! లోకంలో తమ కంటి ముందు కనిపించే అంశాలను గురించి అందుకే ఇట్లా కొంత కల్పనతోను  , మరికొంత తమ జీవితానుభవాలతోను  కలగలిపి ఊహించి  కతలు  అల్లేది. వాటినే పురా జానపద గాథలు అనుకుంటున్నాం మనం. ఆ పురా జాసపద గాధలు  ఎక్కడైనా  తటస్థిస్తే వదిలి పెట్టకుండా తప్పక చదవండి! పిట్టకథల్లా చాలా వినోదం గా ఉంటాయవి విజ్ఞానం పాలు కొద్దిగా తక్కువైనా సరే . ఒకే కత వంద,రెండొందల సార్లు 'తినుచున్న  అన్నమే రోజు రోజానూ తినుచున్నాము' అన్నట్లుగాచెపుతుంటే వినడంలా  కాకుండా కొంత రిలీఫ్ గా కూడా ఉంటుంది మరి మన బుర్రలకు  !


పైన  చెప్పిన ఇప్పచెట్టు పుట్టుకను గురించిన  చిట్టి కథ ఇట్లా చదివిందే ఎప్పుడో! డాక్టర్ రావి ప్రేమలత గారి - తెలుగు జానపద సాహిత్యం - పురాగాథలు నుంచి - అని గుర్తు  !

- కర్లపాలెం హనుమంతరావు 

29-03-2021 

Sunday, May 3, 2020

అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు-





తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు నియమంగా తమకంటూ ఒక విశిష్టమైన సాంస్కృతిక పరంపరను అనుసరిస్తూ తమను పోషించే కులాల మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తున్నాయి. వీరి మౌఖిక సాహిత్యమంతా పోషక కులాల (దాతృ కులాల) సాహిత్యమే అవుతుంది. ఇందులో పోషక కులం యొక్క పుట్టుక, కులం మూలపురుషుని ఆవిర్భావం, దేవతలకు కుల మూలపురుషునికి ఉన్న సంబంధం, వృత్తి ఆవిర్భావం, వృత్తి పరికరాల పుట్టుక, నియమాలు, నమ్మకాలు మొదలైన వృత్తి ధర్మాన్ని తెలియజేసే అంశాలు. వారి కుల దైవం ప్రస్తావనతో పాటు కులం సామాజికంగా మనుగడకు కావలసిన అనేకాంశాలు పురాణాల్లో కనిపిస్తాయి. ఆశ్రిత జానపద కళలు పటం కథలు, హరి కథలు, నాటకాలు మొదలైన ప్రక్రియలతో కుల పురాణాలను ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. రకంగా కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు ఆయా కులాలకు ఒకటికి మించి ఎక్కువగా ఉన్నాయి. ఇవి కులాన్ని అయితే ఆశ్రయించి కుల పురాణం కథా గానం చేస్తుందో, కులం దగ్గర మిరాశి కలిగి ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వేరే కులాన్ని ఆశ్రయించకుండా తమకు నియమింపబడిన కులాన్ని ఆశ్రయించటం వీటి ప్రత్యేకత. అయితే రజకుల కుల పురాణమైన మడేలు పురాణాన్ని కథాగానం చేసే గంజి కూటి, మాసయ్యలు అనే రెండు ఆశ్రిత కళారూపాలు ఉన్నాయి. ఇందులో గంజి కూటి వారు హరికథ రూపంలో మడేలు పురాణం కథా గానం చేయగా, మాసయ్యలు పటం ఆధారంగా మడేలు పురాణాన్ని కథాగానం చేస్తారు. మాసయ్యలను పటమోళ్లని, పటం చాకళ్లని కూడా పిలుస్తారు. కళాకారులు చెప్పే మడేలు పురాణంలో వీరి పుట్టుకకు చెందిన ప్రస్తావన కనిపిస్తుంది.
మడేలు పురాణం:
మడేలు పురాణం కూడా సృష్టి పుట్టుకతోనే మొదలవుతుంది. త్రిమూర్తుల జననం అనంతరం పార్వతీ కల్యాణం జరుగుతుంది. పురాణం లో భాగంగా దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి శివపార్వతులను పిలవ కుండానే యజ్ఞాన్ని తల పెడతాడు. అయితే పార్వతీ దేవి పిలువని యజ్ఞానికి వెళ్లగా దక్షుడు ఆమెను అవమానిస్తాడు. అవమానం తట్టుకోలేక యజ్ఞగుండంలో నే పార్వతీదేవి ఆహుతి అవుతుంది. ఇందుకు కోపించిన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి అతన్ని సంహరించి రమ్మంటాడు. ప్రకారంగా వీరభద్రుడు కార్యం ముగించుకొని త్రిమూర్తుల వద్దకు వెళ్లి విషయం చెప్తాడు. అందుకు త్రిమూర్తులు కోపంతో నువ్వు మూడు తప్పులు చేశావని, అందులో ఒకటి బాలకీ దేవుని సంహరించడం, రెండు శిశు హత్య, మూడు బ్రహ్మ హత్య చేశావని కాబట్టి నీ నీడ మాపై పడకూడదని పాల గుండంలో స్నానం చేసి పాప పరిహారంగా మడివేలయ్య అవతారం ఎత్తమంటారు. వీరభద్రుడు సరేనని పాల గుండంలో దూకేేసరికి అందులో నుండి మడివేలయ్య, మాసయ్య ఇద్దరూ పుడతారు.
వీరభద్రుని అంశతో పుట్టిన మడేలయ్య లింగాన్ని ఆరాధిస్తూ మెడలో 32 లింగాలు చేతిలో నల్లని వీర గంటతో మైల ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మాసయ్య నిత్యం శివున్ని పూజిస్తూ ఎప్పుడూ శివధ్యానం లోనే ఉండేవాడు. ఆకలిదప్పులు అనేది ఆయనకు ఉండేది కాదు. ఎవరైనా వచ్చి అన్నం పెడితేనే తినేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకలితో ఉన్న మాసయ్య, మడేలయ్య అడుక్కొని తెచ్చుకున్న అన్నా న్ని అతనికి చెప్పకుండా తింటాడు. అందుకు మడేలయ్య కు కోపం వస్తుంది. నేను తెచ్చుకున్న అన్నాన్ని నువ్వు తిన్నావు కాబట్టి త్రిమూర్తుల దగ్గరకి కోపంతో విషయమై వెళ్తారు. అక్కడ వారికి విషయం చెప్పగాత్రిమూర్తులు 33 కోట్ల దేవతల ముందర మడేలుతో నీ అన్నం తిన్న వాడు కాబట్టి నీకు అర్థివాడై ఏడాదికి ఒకసారి మీ ఇంటికి వస్తే మీ ఇంట పుడితే పురుడు కట్నం, చస్తే చావు కట్నం, పెరిగితే పెళ్లి కట్నంమివ్వాలని నీ తమ్ముడు కాబట్టి కంచం పొత్తు ఉంటుందని, అందుకు ప్రతిఫలంగా నీ వంశాన్ని కీర్తిస్తాడనిఒప్పందం చేస్తాడు.
తర్వాత మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించదలచి తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చావకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అప్పుడు మడేలయ్య శీతలా దేవి కన్నీరు పోకుండా కట్టకట్టి నీరుగాను, కనుగుడ్లు తీసి ఉడకబెట్టే కడువలుగాను, చనుబాలను పొయ్యి రాళ్ల గాను, ఆమె ఇరవై వేళ్లు కొట్టి వంటచెరకు గాను, నరములు తీసి గాలి తాళ్లుగాను,చర్మాన్ని వడ కోక గాను, రక్తం తీసి చౌడు గాను, శీతలాదేవి డొక్కను బానగాను, కడుపుల అన్నం సున్నంగాను చేసి శివుని బొంత పిండుతాడు. అలాగే అప్పుడే ఆమె పేగులను తీసి చెరువు మీద వేయగా తూటికూరగా మొలుస్తాయి. రజకులు ఇప్పటికీ తూటికూర తినకపోవడాని కి కారణంగా ఇదే చెబుతారు. మడేలయ్య శివుని బొంత పిండిన తర్వాత శివుని కొరకు వెతుకుతుండగా ఎక్కడ శివుడు కనిపించడు. దారిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎదురుపడి మడేలయ్యనుఎవరి కోసం వెతుకుతున్నావనిఅడుగుతాడు. అతను శివుని గురించి అని చెప్పగా అయితేనన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తాఅంటాడు. అతన్ని భుజాలపై ఎక్కించుకొని బయల్దేరి తిరుగుతుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. బరువు మోయలేక అతన్ని క్రిందికి దింపుతాడు. వెంటనే అతను మాయమైపోయి, అతని ఎదురుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమై నువ్వు పోయేటప్పుడు నీ భార్య నువ్వు ఇద్దరు వెళ్లారు కదా మరి ఇప్పుడు ఒక్కడివే వస్తున్నావు కారణమేమని అడుగుతాడు. అప్పుడు మడేలయ్య జరిగిన విషయమంతా వ్యక్తి కి వివరిస్తాడు. విషయం విన్న వ్యక్తి ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూడమన్నాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది. ఆవ్యక్తియే శివుని రూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మడేలయ్యనాకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడ కని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎవరి కోకలు అయినా కట్టుకున్నా నన్ను ఏమీ అనకూడదనికోరుకుంటాడు. అందుకు శివుడు దీవించి నీకు అన్నం పెట్టని వారు నరకం పోతారని అభయమిస్తాడు. అలాగే పురాణంలో చాకలి వృత్తిలోని నమ్మకాలు, వివిధ కులాల ప్రస్తావన కనిపిస్తుంది.
గంజి కూటి ప్రస్తావన:
మాసయ్యలు పటం ఆధారంగా కథా గానం చేసే మడివేలు పురాణంలో గంజికూటి ప్రస్తావన కూడా కన్పిస్తుంది. మడేలయ్య వృత్తి ధర్మంలో భాగంగా నుదుటన బొట్టు మెడలో లింగం ధరించిన శంకు ద్వారాజి రాజ్యానికి చెందిన బసవన్న రాజుల బట్టలు ఉతికే వాడు. అయితే కనగాంగిరి పట్టణాన్ని పరిపాలించే బొట్టు, లింగం ధరించని బైరాగి రాజుల బట్టలు మడేలయ్య ఉతకక పోవడంతో వారి మంత్రి అయినా రాజులబంటుకు సైన్యాన్ని , మాసిన కోకల మూటలను మరియు వరహాల మూటలను ఇచ్చి పంపుతాడు. ఒకవేళ మడేలయ్య కోకలు పిండితే వరహాల మూటలు అప్ప చెప్పమని లేకుంటే యుద్ధం చేయమని చెబుతాడు. ఇది గమనించిన మడేలయ్య తన దగ్గర ఉన్నవిభూదితో కోకలన్నింటినీ దగ్ధం చేసి, సైన్యాన్ని ఎదురించి నిలుస్తాడు .ఇదంతా స్వయంగా చూసిన రాజుల బంటు భయపడి మడేలయ్య బట్టలు పిండే బండ కింద దాక్కుంటాడు. అతన్ని చూసిన మడేలయ్య ఎవరని ప్రశ్నించగా నేను బండ కింద దాక్కున్న పురుగునని చెప్తాడు. ముందు బయటకి రా యుద్ధం చేస్తామనగా, ఎంతకీ రాకపోయేసరికి మడేలయ్య విభూతి మంత్రించి బండమీద వేయగా రెండుగా విడిపోతుంది. అందులో నుండి బయటకు రాగానే మీ తల్లిదండ్రులు నీకు ఏం పేరు పెట్టారు అని అడుగగా నేను మరచిపోయానని అంటాడు. వీడేదో మాట తప్పి మాట్లాడుతున్నాడని బసవన్న బట్టలు పిండటం కోసం తెచ్చిన గంజిలో నుండి మూడు ముద్దుల అన్నం తీసిపెట్టగా తింటాడు. తర్వాత గంజి పోయగా తాగుతాడు. ఇప్పుడు చెప్పురా నీ పేరేంటి అని అడుగగా, నా పేరు ధాతి, కోటి, కితాభ్ అంటాడు. ధాతి అంటే దాయి గుడ్డ, కోటి అంటే తోడి గోలపుల్ల, కితాబ్ అంటే ఇస్త్రీ పెట్టె. అప్పుడు మడేలయ్య మా ఇసరల పేర్లు చెప్పినావని, మా గంజిలో అన్నం పెడితే తిన్నావని, గంజి పోస్తే తాగినావు కాబట్టి కలియుగంలో గంజి కూటి వారిగా జన్మించి మా మధ్యన, పటమోళ్ల మధ్యన ఆశ్రితునిగా ఉండమని వరమిస్తాడు. కానీ గంజి కూటి వారు చెప్పే పురాణం లో కథనం వేరే కనిపిస్తుంది.
గంజి కూటి వారు మాసయ్యలు ఇరువురూ చెప్పే మడేలు పురాణాల మధ్య కొంత భేద సాదృశ్యాలు కనిపిస్తాయి. పురాణాల్లో మాసయ్యలు మరియు గంజి కూటి వారి పుట్టుక విభిన్నంగా కనిపిస్తుంది. మాసయ్యలు చెప్పే పురాణంలో వీరభద్రుని అంశతోనే మడేలయ్య మాసయ్య జన్మించినట్లు కనిపిస్తుంది .అట్లాగే బైరాగి రాజుల బంటు బండ కింద దాక్కున్న వాడే గంజి కూటి వారిగా చెప్పబడుతుంది. ఇక గంజికూటి పురాణంలో శివుని బొంతను మడేలయ్య గంజి లో పిండుతుండగా అతని చెమట నుండి పుట్టిన వాడే గంజి కూటి వారని తెలుస్తుంది. అంతేగాక వీరి పురాణంలో జైన రాజుల మంత్రులలో ఒకరైన కొండేల మాసయ్య మడేలయ్యకు భయపడి బండ కింద దాక్కున్న వాడే మాసయ్యలని తెలుస్తుంది. ఈరకంగా వీరిరువురు తమ కులం పట్ల అత్యున్నత స్థానాన్ని పురాణంలో చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది.
పురాణంలో రజకుల మూలపురుషుడైన మడేలయ్య పరమ వీరశైవ భక్తుడిగా కనిపిస్తాడు. ఇతను శివుని కోరిక తీర్చడం కోసం వృత్తి ధర్మాన్ని పాటించడం కోసం సాక్షాత్తు పరమశివుడే పరీక్షించదలచిన కార్యాన్ని సైతం సాధించడానికి తన భార్యను సంహరించి కార్యాన్ని నిర్వర్తించడం శివుని మీద ఉన్న భక్తి, వృత్తి ధర్మం పురాణంలో కనిపిస్తుంది. అంతేగాక మడేలయ్య శివ భక్తుల మైల బట్టలనే ఉతుకు తానని, ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకు ఎదురు వచ్చిన వారితో యుద్ధం చేయడం శివుని మీద, అతని భక్తుల మీద ఉన్న భక్తి భావన, ఆసక్తి కనిపిస్తుంది. తమకు రజక వృత్తిని దేవతలే ప్రసాదించినట్లుగా కనిపించే సన్నివేశాలు, కులం పట్ల ఆత్మనూన్యతా భావాన్ని తొలగించడానికి దోహదం చేసి, వృత్తి మీద గౌరవాన్ని కలిగిస్తుంది. పురాణంలో వృత్తి మనుగడకు కావలసిన మానసిక ధైర్యాన్ని కలిగించే అంశాలు అనేకం ఉండటం విశేషం.
చారిత్రకంగా 12 శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం( 4 ఆశ్వాసం )లో మడేలయ్య కథ కనిపిస్తుంది. ఇందులో ఆనాటి కాలంలో శైవాన్ని ఆచరిస్తూ కీర్తిప్రతిష్టలు పొందిన శైవ భక్తులలో ఒకరిగా మడేలయ్యను కీర్తించబడుతుంది. ప్రాచీనమైన చరిత్ర కలిగిన మడేలయ్యను పురాణ పురుషునిగా పాల్కురికి సోమనాథుడే ఆవిష్కరించాడు. పురాణ పురుషుని వృత్తాంతాన్ని మాసయ్యలు నకాశి కళాకారులతో 33 మూరల పొడుగు, గజంనర వెడల్పు ఉండే నూలు గుడ్డ మీద చిత్రించుకొని పటం ఆధారంగా మూడు రోజులు కథా గానం చేస్తారు

కథకులుప్రదర్శనా విధానం :
మాసయ్యలకు వంశపారంపర్యంగా సంక్రమించిన హక్కు గ్రామాలు లేదా మిరాశి గ్రామాలుంటాయి. ఆయా గ్రామాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రదర్శన నిమిత్తం వెళతారు .ప్రతి సంవత్సరం కళాకారులు మిరాశి గ్రామాలకు దసరా పండుగ లేదా దీపావళి పండుగ తర్వాత సంచారానికి బయలుదేరుతారు. రకంగా బయల్దేరేముందు ఏకాదశమి లేదా దశమి రోజున కళాకారులు పెట్టె పూజ చేసుకుంటారు. ఇందులో భాగంగా వేర్వేరు గ్రామాల్లో ఉన్న కళాకారులను ఏకం చేసుకుని మేళం అంటే బృందంగా ఏర్పడతారు. తర్వాత అందరూ కలిసి పటం, రాగి శాసనం, వీర పలకలు, మద్దెల హార్మోనియం, గజ్జెలను పూజించుకొని ఒక మేక పోతును బలి ఇచ్చి తమ మిరాశి గ్రామాల్లో త్యాగం సమృద్ధిగా లభించాలని కోరుకుంటారు. అంతేగాక ఇదే రోజున హక్కు గ్రామాల్లో వచ్చిన ప్రతిఫలం బృందంలోని కళాకారులు రకంగా పంచుకోవాలో నిర్ణయించుకుంటారు.
ప్రదర్శనలో కళాకారులు ఇప్పటికీ తమ పూర్వ పద్ధతినే అవలంభిస్తూ రావడం విశేషం. తమ హక్కు గ్రామాలకు వెళ్లినప్పుడు కళాకారులు తప్పనిసరిగా పటం ,రాగి శాసనం వీర పలకలు తీసుకొని బయలుదేరుతారు. గ్రామంలో మొదట రజకుల కుల పెద్దలను కలిసి రాగి శాసనం మరియు వీర పలకలను చూపించి త్యాగం లేదా సంభావన చెప్పాలని కోరుతారు. కళాకారుల దగ్గర ఉండే రాగి శాసనం మీద మడేలయ్య వృత్తాంతం తో పాటు మాసయ్యలకు రజకులు ఇచ్చే ప్రతిఫలం లిఖించి ఉండటమేగాక వారికి ఏయే గ్రామాలు మిరాశి గా సంక్రమించాయో వాటి పేర్లు రాయ బడి ఉంటాయి .
వీర పలకలు:
వీర పలకలు అనేవి టేకు కర్రతో తయారు చేయబడి సుమారుగా ఫీట్ నర వెడల్పు, పొడవుతో ఉంటాయి. పలకలమీద వీరభద్ర స్వామికి జన్మించిన మడేలయ్య మాసయ్యల సన్నివేశం మరియు శివుని బొంతను ఉతికే సన్నివేశాలను రంగులతో చిత్రించికొని సన్నివేశాలను చూపి కథా గానం చేస్తారు. తర్వాత రజకులను వీర పలకలను ముట్టుకొమ్మని చెప్పి, పలకల మీద సంభావన పెట్టమంటారు. తర్వాత మాసయ్యలు రజకులకు విభూది అలంకరించి, దివనార్తి పెడతారు.
ప్రదర్శన నిమిత్తం గ్రామంలో త్యాగం కుదుర్చుకున్న తర్వాత రజకుల వీధిలోనే వేదిక నిర్మించుకొని రాత్రి గాని ఉదయం గాని వారి వీలునుబట్టి పటాన్ని తూర్పుదిశగా వేలాడదీసి కథా గానం చేస్తారు. రకంగా వేలాడదీస్తే నే కథ సుఖాంతమవుతుందని విశ్వసిస్తారు . ప్రదర్శనలో కళాకారులు ఐదుగురు ఉంటారు . ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతను నడుముకు దట్టీ కట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, చేతిలో బెత్తం బరిగే తో పటం మీద బొమ్మలను చూపుతూ కథా గానం చేస్తాడు. ఇతనికి ఇద్దరు సహాయంగా తాళాలు వాయిస్తూ వంత పాడతారు. మరొక ఇద్దరిలో ఒకరు తబలా హార్మోనియమ్ వాయిస్తారు.
ప్రధాన కథకుడు కొన్ని సందర్భాల్లో విశ్రాంతి తీసుకుంటే వంతల్లో ఒకరు ప్రధాన కథకుని పాత్ర పోషిస్తాడు. కథలో వచనం, పద్యం, పాటలతో పురాణాన్ని ప్రేక్షకులకు రసవత్తరంగా సందర్భాన్నిబట్టి కథలో వచ్చే పాత్రల హావభావాలను ప్రకటిస్తూ కథను రక్తి కట్టిస్తూ ప్రదర్శిస్తారు. అంతేగాక కథపట్ల, ప్రదర్శన పట్ల ప్రేక్షకుల్లో భక్తి మరియు గౌరవాన్ని పెంపొందించే విధంగా కథలో వచ్చే ముఖ్యమైన సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత అనుష్ఠానాలు, చదివింపులు చేయిస్తూ ఉంటారు. ప్రదర్శన పట్ల ఆకర్షితులైన భక్తులు కళాకారులకు చదివింపులు చేస్తే వారికి ఘనంగా దివనార్తి పెడతారు. కళాకారులు ప్రదర్శన మధ్యలో తమకు సహాయం చేసిన కుల పెద్ద మనుషులను స్మరిస్తూ, కీర్తిస్తూ ఇదంతా కళాకారులు తమ నైపుణ్యంతో సందర్భాను గుణంగా ప్రదర్శిస్తారు. అంతేగాక కళాకారులు కథలో భాగంగా వచ్చే రౌద్రం ,శోకం, యుద్ధం భయానకం వంటి సన్నివేశంలో అంతే ప్రతిభతో ప్రదర్శిస్తూ అడుగులు వేస్తూ ప్రేక్షకులు సన్నివేశాల్లో లీనమయ్యే టట్టు ప్రదర్శించటం వీరి ప్రత్యేకత.
నేటి స్థితి:
బహుళ చారిత్రక నేపథ్యం ఉన్న మాసయ్య లు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ, తమ సాంస్కృతిక మనుగడ ను కొనసాగిస్తూ మరుగున పడి పోయే దశకు చేరుకున్నారు . పూర్వం కళాకారులు రజకుల దగ్గర గౌరవమైన స్థానంలో ఆదరణ పొంది జీవించారు. కానీ నేటి ఆధునిక సమాజంలో గౌరవం లేకుండా పోయింది. కోవలో తమ మూల సంస్కృతిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కళాకారులు రాగి శాసనం మరియు వీర పలకలు చూపిస్తూ కథా గానం చేసేవారు. సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయింది. మిరాశీ గ్రామాల్లో రాగి శాసనాలు వీర పలకలు అడగడం లేదని వాటిని తీసుకు వెళ్లడం మానేశారు. అయితే ఇదే సందర్భంలో ఒక దళారీ వ్యవస్థ కళాకారులనే మధ్యవర్తులుగా చేసుకొని కళాకారుల దగ్గర అరకొర డబ్బులకు వాటిని సేకరించి వాటిని అధిక ధరలకు అమ్ముకున్నారని భోనగిరి సంగయ్య మాటల్లో తెలుస్తున్నది. అంతేగాక వీరి పటాలను కూడా సేకరించి లక్షల్లో అమ్ముకున్నట్లు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మడేలు పురాణం కథాగానం చేసే కళాకారులు కూడా ఒకటి లేదా రెండు కళాబృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఒకవేళ కళాకారులు ప్రదర్శించాలనుకున్నా వీరి తాతలు తండ్రులు పటాలను, రాగి శాసనాలను, వీర పలకలను అమ్ముకోవడం వల్ల మా మూల సంస్కృతి తెలియకుండా పోయిందని, మాకు బతుకునిచ్చే పటాలు అమ్ముకొని, మాకు బతుకుదెరువు లేకుండా చేశారని కళాకారులు వాపోతున్నారు. గంజి కూటి వారి సంస్కృతి కూడా రకంగానే కాలగర్భంలో కలిసిపోయి, చివరికి వారు కులం కిందికి వస్తారో తెలియకుండా పోయింది .అలాగే మాసయ్య లు తమ కళా సంస్కృతిని పరిరక్షిస్తూ వస్తున్నప్పటికీ పోషక కులం దగ్గర ఆదరణ లేక అంతరించే దశలో ఉన్నది. అంతేగాక వీరిని పోషించే రజకులు ప్రభుత్వపరంగా బీసీ – ‘కేటగిరిలో ఉండగా ఇదే కేటగిరీలో మాసయ్య లను గుర్తిస్తూ కులం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అప్పుడు మరియు తమ పిల్లల చదువుల విషయంలో వీరికి ప్రత్యేక కులం లేకపోవడంతో సామాజికంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాసయ్యలను ప్రత్యేక కులంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు .అంతే గాక రజకుల ఆశ్రితులు అయిన గంజి కూటి వారికి, మాసయ్యల వారికి ఒకరి మధ్య ఒకరికి కంచం పొత్తు మాత్రమే ఉంటుంది. వియ్యం పొత్తు ఉండదు. అలాగే గంజి కూటి వారికి మాసయ్యలకు కూడా కంచం పొత్తు మాత్రమే ఉంటుంది. వీరి జనాభా అతి తక్కువగా ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాకారులు తమ మూల సంస్కృతిని పోషించుకుంటూ వస్తున్న సమయంలో ప్రభుత్వం మాసయ్యలను ప్రత్యేక కులంగా గుర్తించాలని, తమ కళా రూపం మనుగడకు కావలసిన ఆర్థిక వనరులను చేకూర్చాలని కోరుకుంటున్నారు. తద్వారా తమ మౌఖిక సాహిత్యం, సంస్కృతి భవిష్యత్ తరాలకు అందుతుందని ఆర్థికంగా తమ జీవనం కూడా కొనసాగుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కళాకారులు

పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

May 1, 2020
(కొలిమికి సౌజన్యంతో - రచయిత  డా. బాసని సురేష్ గారికి ధన్యవాదాలతో)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...