'ఏ' ఫర్ 'ఏపిల్' ఏంటి..విడ్డూరంగా! 'ఏ' ఫర్ 'ఎనిమల్'..'బి' ఫర్ బఫెల్లో.. 'సి' ఫర్ కౌ..'డి' ఫర్ డాంకీ..ఇలా ఏవైనా జంతువుల పేర్లు పెట్టుకోవచ్చుగా ! తమరి ఆత్మ గౌరవానికి భంగమా?
అబ్బో! 'మ్యాన్
ఈజ్ ఏ సోషల్ ఏనిమల్' అని మళ్లీ మీరేగా లెక్చర్లు దంచేదీ! అంటే 'ఏనిమల్
ఈజ్ ఆల్సో ఏ సోషల్ మ్యాన'నేగా అంతరార్థం?
ఎదుకో ఆ చిరాకూ? తమరు పడీ పడీ
దణ్ణాలూ దస్కాలూ పెట్టుకునే దేవుళ్ళందర్నీ వీపుల మీదెక్కించుకుని ఊరేగించే
దెవరూ? మేం కాదూ! ఆదిదేవుడికి వాహనం మా మహానంది. ఆ నందిని బంగారంతో తాపడం చేసందిస్తే సరి.. మా షోగ్గా
షోకేసుల్లో దాచేసుకుని తెగ మురిసానందిస్తారు!
నిజం నందిని మాత్రం పంది కన్నా హీనంగా ఇంటెనకాల గొడ్లచావిట్లో మురికి గుంటల మధ్య
బందీ చేస్తారు. దాని నోటి కాడ గడ్డిని మీరు
మేస్తారు. పేరు వినీ వినగానే తమరికి ముచ్చెమటలు
పోస్తాయే.. ఆ మృత్యు దేవత యమధర్మరాజా వారి వాహనం ఏదీ? ఎనుబోతు.
కాలయముణ్ణి చూస్తే కాళ్ళు వణుకుడూనూ.. మా
దున్నపోతును చూస్తే చిన్న చూపూనా! అందుకే మీ
మనుషులందరిదీ ద్వంద్వ నీతనేది.
మీకన్నా మేమెందులో తీసిపోయామో! కులాలు, మతాలు, రంగులు, హంగులు
అంటూ మీలో మీకే ఎన్న్ని అంట్లూ..సొంట్లు! పేరుకే మా నెత్తిమీదవి కొమ్ములు. అసలు కుమ్ముళ్లన్నీ రక రకాల పార్టీల పేర్లతో మీవి.
పైపెచ్చు మీ రొచ్చు కీచులాటల మధ్యలోకి ఏ సొమ్మూ సంబధం లేకపోయినా 'ఎద్దులూ.. మొద్దులూ..దున్నపోతులూ.. గొడ్దుమోతులూ' అంటో మా పేర్లు
లాక్కొచ్చి తిట్లూ.. శాపనార్థాలా!
మా సాయం లేకపోతే మీ వ్యవసాయం క్షణం
ముందుకు సాగదు. మేం కాడిని వదిలేస్తే మీ బండి గజం ముందుకు నడవదు. మా దూడల్ని దూరంగా
నెట్టేసి మా పాలు మీరు కాఫీలు టీనీళ్ళకు వాడేసుకుంటున్నా.. పోనీలే పాపం.. మీ
పాపానికి మీరే పోతారని చూసీ చూడనట్లు పోతూ ఉంటే.. మా
పోతులంటే మీకింత అలుసా?
మా గొడ్డూ గోదా గాని రోడ్డు కడ్డం పడితే మీ
బుల్లెట్ ప్రూఫులూ, బుగ్గ కార్లూ ఒక్కంగుళం ముందుకు
జరగ్గలవా? తోక ముండిచిందాకానే మేం గంగి గోవులం. లిక్కరు పాకెట్లకు .. చిల్లర నోట్లకు.. కుక్కల్లా
తోకూపే మీ బక్క ఓటర్లం కాం మేం! చెత్తనేతల
మీద విసుగెత్తున్న జనం విసిరే పాత
జోళ్లలోనుంచీ మా నిరసనలు వినిపిస్తునే
ఉంటాం.
అక్కరయిన దాకా మాకు దణ్నాలు దస్కాలు. అక్కర తీరినాక
గొడ్దుమోతులని ఎకసెక్కాలా?
పుష్టిగా ఉన్నంత కాలం మా పుష్టభాగాల క్కూడా పూజలూ.. పునస్కారాలు. కాస్త ఈడిగిల పడితే చాలు కబేళాలకు ఈడ్చి పారేయడాలా?! మీ కడుపుకిన్ని తిండి గింజ లందించే అన్నదాతలమే.. మానోటి కాడి ఎండుగడ్డి కాడ క్కూడా పాలుమాలుతారా? నేతంటే మోతగా మేత మేసేవాడనేనా మీ అర్థం? మా కాలి గిట్టల్నుంచీ నెత్తిమీది కొమ్ముల్దాకా దేన్నీ
వదిలి పెట్టరా మీరు! అచ్చమైన పచ్చి
వ్యాపారానికి అచ్చుపోసిన శాల్తీలు మీరు.
సిగ్గు ఎగ్గు లేకుండా నడి బజారులో
మీరు నిలబెట్టే బడిత బొమ్మల మానం
పేడముద్దల మాటున దాచి కాచి కాపాడే శ్రీకృష్ణ పరమాత్ములం మేం. మేం నోరు చేసుకోబట్టే
మీ వీధులు చెత్తకుండీల కన్నా మెరుగ్గా ఉంటున్నాయి. బ్రిటన్ మహారాణి విక్టోరియా మ్యాడం కన్నా ఎక్కువ
గ్లామరున్న మూగ జీవాలం మేం. మీ అభిమాన నటవిరాట్టులు గ్రాఫిక్సుల్లోఎన్ని కుప్పిగంతులు వేసినా రావడం లేదు హిట్లు. మేం మాత్రం ఇలా కాస్త తోకలు కదిలించినా చాలు చప్పట్లే చప్పట్లు. కోట్లే కోట్లు.
మాతోనే మీకు అక్కర తప్ప మీరు తిని పారేసిన అరటి తొక్కతో
కూడా మాకు అవసరం పడదు. ఎన్నికల్లో మీకు మేమే పార్టీ గుర్తులం. మీ ఎన్నికల
ప్రచారాల హోరుకీ మళ్ళీ మేమే ఆసరా. మీరు బాదే డోళ్ళు చచ్చినాకా మాట్లాడే మా వంటి తోళ్ళ నోళ్ళే. మీ మీ అధిష్ఠానాల ముందు మీరు ఊదే బూరాలు మా కొమ్ములు విజయ
గర్వంతో చేసే హాహాకారాలు. మీకూ మాకూ తేడా ఏముంది?మీరు చేతుల్తో వీపులు తోముకో గలరు. మేం తోముకోలేం. మేం
తోకల్తో ఈగలు తోలుకోగలం. మీరు తోలుకొంటారా?
ప్రజాసేవలో మేము మీరెన్నుకున్న
ప్రతినిథులకన్నా ఎన్నో రెట్లు మెరుగు జీవులం. దున్నేకాలంలో
దూరం పోయి.. కాసే కాలంలో
కోడవలి తెచ్చే భడవలం కాం మేం.
మాతో మీకు వారసత్వం పేచీ రాదు. కుంభకోణాల
గోల ఉండదు.
పశువులనీ.. మనుషులనీ విభజించి చూస్తున్నారు చూడండీ..అదే సబబైన పద్దతి కాదన్నదే మా ఆవేదన. జనాభా లెక్కలు తీసినప్పుడల్లా 'ఓహో వందా పాతిక కోట్లు దాటేసిందండోయి దేశ జనాభా'అంటో ఒహటే దండోరా. అందులో
అందరూ మనుషులే ఉన్నారా? నిజాయితీగా లెక్కలు తీసి చూడండి! మెజారిటీ
మా పశువుల జాతిదే!
మీ మందల్ల్ల్లో మా పశువులెన్ని కలిసున్నాయో లెక్క లు తేలాలి ముందు. మా పోరాటం ఆ దిశగా సాగేందుకే ఈ మా కొత్త పార్టీ. దేశ జనాభాలో మెజార్టీ మా పశువులే అయినప్పుడు మీ పాడు మనుషులకేల ఊడిగం చేయాలన్నది మా వాదన.
ఒకప్పటి ఉత్తర ప్రదేశ్ అమాత్యవర్యులు
అజం ఖాన్ గారి రాంపూర్ బందిల దొడ్దినుంచి
ఈ మధ్యనే స్వేచ్చా ప్రపంచంలోకొచ్చి పోయాయి
ఏడు ఎనుబోతులు. ఆ చైతన్యమూర్తులు స్ఫూర్తితోనే మేమూ అర్జంటుగా ఓ ఫ్రంటును కట్టే ఏర్పాట్లలో
ఉన్నాం. దేశ జనాభాలో దామాషా ప్రకారం చూసుకున్నా అధికార పీఠం మా
పశుజాతికే దక్కడం న్యాయం. శతాబ్దాలు గడిచి పోతున్నా మా
పశుభాషకు ఇంకా అధికార హోదానే దక్క లేదు.
ఏ సేవలూ అందించకుండానే ఎన్నికల్లో
నిలబడి ఎందరో ప్రజానాయకులుగా తయార
వుతున్నారు. మేం మాత్రం ప్రజాసేవలో ఎవరికి తీసి పోయాం? తేనీరు అమ్మే
మనిషి ప్రధాని పదవికి పోటీ పడుతుండగా లేనిది.. తేనీటిలోకి
పాలందించే పశువులం అధికారంలో మా పాలు కోరుకోవడంలో తప్పేముంది? రాబోయే ఎన్నికల్లో మా
పశుజాతి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇదే తగిన అదనని అభిప్రాయ
పడుతున్నాం.
ఇప్పుడున్నవన్నీ నకిలీ
పశుప్రభుత్వాలు.అసలైనపశువుల పాలనెలా ఉంటుందో ఒక
అవకాశమొస్తే రుచి చూపిస్తాం.
ఇల్లంతా యథేచ్చగా కలాపులు చల్లుకోవడానికి గోమయం ఉచితంగా సరఫరా చేస్తాం. ఏడాదికి
వంద పిడకలు సబ్సిడీ ధరలో ఆడపడుచులకు అంద చేస్తాం. పిల్లా
జెల్లాకు నీళ్లు కలపని పాలు గొడ్లు ఇళ్లముందే
పిదికిచ్చి పోయే ఉచిత పథకాలు
ప్రవేశ పెడతాం. ఇంటింటికీ ఒక 'స్టేటాఫ్ ఆర్ట్'
గొడ్ల చావిడి.. పండగ రోజుల్లో
పుణ్య సంపాదనకు భక్తుల సన్నిధానికే సుష్టైన పుష్టభాగాలున్న గోదేవతల తరలింపు ఇవీ
మాకు మాత్రమే సాధ్యమయిన సేవా పథకాలు.
గద్దె నెక్కే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి! మా
గొడ్డు గోదా నుంచి వీలైనంత సహకారం రాబట్టి ప్రజాసేవను ఇంకెన్ని విధాల మెరుగు
పరచాలో పశుప్రేమికులనుంచి సూచనలు కోరి అమలు చేసే
దిశగా మరింత అంకితభావంతో మా వంతు ప్రయత్నాలు విధిగా చేస్తాం.
చెత్త నేతల పాలనతో విసుగెత్తి ఉన్న
ఓటరు మహాశయులారా! 'ఏమో.. దున్న ఎగరా వచ్చు!' అన్న
ఒకే ఒక్క నమ్మకంతో మాకూ ‘ఒక
అవకాశం’ ఇచ్చి చూడమని ప్రార్తన!
అంబే..
పశు రాజ్యం పార్టీ! అంబే.. అంబే!
దున్నపోతుల ప్రభుత్వం! అంబే.. అంబే
.
ఎనుబోతుల నాయకత్వం! అంబే..అంబే!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- దినపత్రిక సంపాదకీయ
పుట ప్రచురితం)