Wednesday, March 22, 2017

పెద్దమనుషులు కావలెను


ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమే కానీ.. పెద్దమనుషులకే పెద్ద కరవొచ్చి పడిందిప్పుడు మన  పెద్ద దేశంలో!
గద్దెమీదున్నంత  కాలం 'కారు' కూతలతో కాలక్షేపం చేసిన హస్తం పెద్దలు.. అధికారం దూరమై పోగానే 'కారుకూత'లకు దిగిపోతున్నారు! మొన్న పంద్రాగస్టు పండగనాడూ.. దాంతాడు తెగా..  జెండా తాడు లాగేందుక్కూడా జిల్లాకో పెద్దమనిషి కరవయ్యాడయ్యా మన  బంగారు తెలంగాణంలో!
కరవు లేందెక్కడ?.. అని దబాయించద్దు! అపరాలనుంచి..  ఆడకూతుళ్ల వరకు, బడిబుక్కుల్నుంచి.. మడిచెక్కల వరకు.. అన్నింటా కరవే! ఆ జాబితా ఏకరువు పెట్టాలంటే కాగితానిక్కరవు. సమయాని.. స్థలానికి అంతకన్నా కరవు! నిజవేఁ కానీ.. పెద్దమనుషుల కరవు కందిబద్దల కరవు పద్దులా కాదు గదా! దేశీయంగా దొరక్కపోతే ఏ అఫ్రికానుంచో దిగుబడి చేసేసుకొని పబ్బం గడిపేసుకోడానికి!
పెద్దల సభల్నిండా బెంచీలు పట్టకుండా పెద్దతలకాయలు అనున్నాయిగా?’ అనీ అడగద్దు. అటేపెళితే  ప్రజాప్రతినిధుల హక్కుల గోల! మనకొద్దు! ఇటేపు ఇలా ఊళ్ళల్లోకోసారొచ్చి తొంగి చూడండయ్యా బాబులూ! చిన్నబళ్ల పంతుళ్లే  చిన్నూళ్ళల్లో పెద్ద తలకాయలు. పంతుళ్లందర్నీ మంత్రులంతా సొంత పన్లకి ఎగరేసుకొని పోతుంటే పంచాయితీ పంచలు.. పైన కండువాలున్న దొరలెవరూ లేకుండా బోసిపోతున్నాయయ్యా!
పద్దస్తమానం ఏవేవో ఎన్నికలు జాతర్లు కదా మన ప్రజాస్వామ్య దేశంలో! అందుకే రాజకీయాల్లో నలిగే దొరబాబులెవ్వరికీ  'పెద్ద మనుషుల' పాత్ర పోషించే తీరిక దొరకడం లేదు! సుపరిపాలన స్థానంలో 'సుపారీ' పాలన వచ్చి పడ్డానికి పెద్దమనుషుల కొరతే ప్రధాన కారణం.
దేశాలకీ దేశాలకీ మధ్య ఉద్రేకాలు. రాష్ట్రాలకీ రాష్ట్రాలకీ మధ్య రచ్చరచ్చలు. రాష్ట్రాలకీ కేంద్రానికీ మధ్య కీచులాటలు. ప్రాంతాలకీ ప్రాంతాలకీ మధ్య పొరపచ్చలు. ఊళ్లమీదకి ఊళ్ళే వచ్చి పడిపోతా ఉంటే.. ఊళ్ళోని పేటలకీ పేటలకీ మధ్య పేచీలు ముదిరిపోతున్నాయ్. ఆడా.. మగా మధ్యా ఆగడాలకయితే అంతే లేదింక. అంతెందుకు.. అయ్యేయస్సులు.. ఐపీయస్సుల మధ్యా 'పీస్' పీసు పీసులై పొయ్యేదాకా యవ్వారాలు ముదిరి పాకాన పడ్డాయంటే  పెద్దతలకాయలు లేని లోటు  కొట్టొచ్చినట్లు కనబడుతున్నట్లేగా లెక్క!కాలజ్ఞానం బ్రహ్మంగారైనా ఊహించుంటారా  ఈ అకాల పెద్దమనుషుల ఉపద్రవం గోల!
న్యాయపాలకుల తీర్పుల్ని కక్షిదారులే లక్ష్య పెట్టడం లేదండీ!  అంతర్రాష్ట్ర వివాద  సంఘాల సలహాలన్నీ చెవిటివాడి  ముందూదే శంఖువులవుతున్నాయి ! పెద్దతలకాయల కరువ్వల్లే కదా సర్వే సర్వత్రా  ఈ రవ్వా.. రట్టూనూ!
అమెరికాలో, జపాన్లో కుర్రకారుకు మాత్రమే కొరతంట! మన దగ్గరో? పెద్దతలల్లేక  తల పట్టుకోవాల్సిన తంటా!
రెండు పుష్కరాలొచ్చి పోయాయి ఈ మధ్యనే! వారాంతం వచ్చి పోయిందంటే సరి .. తిరుమలగిరి నుంచి వేదాద్రి వరకు వేలాదిమంది భక్తులు పాప పంకిలంనుంచి  విముక్తులైపోతున్నారు.. తత్తరపాటుతో ఎవరొక్క మాట తూలినా.. ఉత్తర క్షణంలోనే ముక్కు రాపిళ్ళు.. కాణిపాకం గుళ్లో  దీపాలార్పుళ్లు దివ్యంగా జరిగిపోతున్నాయి! బాబాలు. అమ్మోర్లు.. స్వాములార్లు.. అవధూతలు.. అక్కడికీ అడుగడుక్కీ పీఠాలేర్పాటు చేసుకొని పాపపంకిలాలను ప్రక్షాళన  చేస్తూనే ఉంటిరి! ఏడాది తిరిగేసరికల్లే వేలాదిమంది ఖైదీలు.. తీవ్రవాదులు.. క్షమాభిక్షలు పొంది మరీ  జనజీవన స్రవంతుల్లోకొచ్చి పడిపోతున్నా.. పెద్ద తలకాయల లోటు  పూడటం లేదెందుకో.. బొత్తిగా అంతుబట్టకుండా ఉందే!
పరమాత్ముడు అక్కడికీ అన్నేసి అవతారాలెత్తి మరీ ధర్మసంస్థాపనలు గట్రా నిర్వహిస్తున్నా ఇంకా ఈ శిష్టజనుల  కొరత కొనసాగడమేంటో.. విపరీతం కాకపోతే! కాలం ఎంత కలికాలం నాలుగోపాదమీద కంటుతున్నా దొడ్డతనం లేమి మరీ ఇంత విడ్డూరంగా ఉందేవిఁటి  స్వామీ?
అట్లాసులు, ఆంజనేయుళ్లు, కుంభకర్ణుళ్లవంటి  భీకరాకారాలకు కొరతైతే.. ఏదో ఒలంపిక్సు మార్కు  డోపింగు మందుల్తో  తలకాయలు ఉబ్బించుకోవచ్చు. ఏళ్ల తరబడి న్యాయస్థానాలు  విచారణలు గట్రా చేసీ  చేసీ మరీ  నిర్ధారించిన పెద్దమనుషులమీదా   మళ్లా మళ్లా మసి పడాల్సిందేనని  అప్పీళ్ళు పడిపోతుంటే .. పెద్దమనుషుల కొరత ఇహ్క తీరేదెప్పటికి? 
కొత్త జిల్లాలు.. తొందర్లో పట్టాలమీదకు ఎక్కబోతున్నాయి. మండలాల గుమ్మాలక్కూడా రేపో ఎల్లుండో కొత్త మావిఁడి మండలు వేలాడబోతున్నాయి!   ఇప్పుడే పెద్ద తలలకింత  తలనొప్పి తంతుగా ఉందే.. ! ముందు ముందు  సమస్యెంత ముదరనుందో.. తలుచుకొంటేనే గుండెలదురుతున్నాయ్! సర్కారే సమస్యా పరిష్కారానికి పూనుకోవాల్సుందిహ.
ఉద్యోగాలు.. ఉపాధులంటూ ఎటూ ప్రణాళికలూ సాగుతూనే ఉన్నాయిగదా! పనిలో పని.. 'పెద్ద మనుషులు 'కేటగిరీ' ఒకటి కొత్తగా సృష్టిస్తే సరి! చదువు సంధ్యలబ్బక అబ్బల రెక్కల కష్టంమీద పడి మెక్కే పోరంబోకులకింత ‘ప్రత్యేకహోదా’  క్కించినట్లవుతుంది! పేకాట రాయుళ్లమీద 'పెదరాయుళ్ళ' ముద్దర్లద్దితే  పల్లెల్లో పెద్దతలలకిహ వెనక్కి తిరిగి చూసే అగత్యముండదు. కీచకుల చేతికి సర్కారు 'కీ' పోస్టులొస్తే  ఆడకూతుళ్ల హడావుళ్లతో పరువుపోయే బెడద   తగ్గిపోతుంది. పేచీకోరుగాళ్లందరికీ  పెద్ద పీటలేసేస్తే ..   గోచీపాతరాయుళ్ల గోడుకి  చుక్క పెట్టినట్లవుతుంది. 
అక్రమార్కులమీద ఉక్కుపాదం మోపి చక్కబెట్టిన ఘనకార్యమొక్కటైనా ఉందా సర్కార్ల రికార్డుల్లో  ఇప్పటి వరకూ? బుద్ధిగా గూండాల పాదాలకు గండపెండేరాలు తొడగడం.. పెద్దతలల గండం చిటికెలో  తేలిపోయే చిటుకండీ! దైవత్వాన్నైనా  దర్జాగా ప్రసాదించే రోజులు. ధైర్యంగా ఏ సన్నాసికైనా పెద్దరికాన్ని అంటకట్టేయచ్చు. ప్రశ్నించే దద్దమ్మలకు పెద్దమ్మ తెరిసాను ఉదాహరణగా చూపిస్తే సరి. 
కొత్త రక్తాన్నే  కనుక్కుంటున్న మేధావులమండీ మనం! 'పెద్దమనుషులు' అనే కొంగొత్త పదవుల్ను సృష్టించలేమా? 
'మనుషులే కాని వాళ్ళకు 'పెద్దమనుషుల' పదవులేంటనా?' సందేహం మహానుభావా?  అమెరికా అధ్యక్షపదవిని కోరుకున్న  పెద్దమనుషులిద్దరూ  మన దేశీయ  భభ్రాజమ్మలకన్నా  దేంట్లో మిన్నంటా?
పనులు చక్కబెట్టడమే పెద్దమనుషుల  ముఖ్య బాధ్యతైతే ..  నయీం ఎటూ పోయాడు..  అతగాడి  అనుచరవర్గాన్నైనా  సర్కారు అక్కున చేర్చేసుకోవాలి. అర్హతలు సడలించైనా 'పెద్దమనుషుల' పోస్టుల్లోకి సర్దుబాటు చేసేయాలి! తాత్సార చేసుకొంటూ పోతే పొరుగు దేశమే స్వర్గధామం అన్న  ప్రచారం పెరిగి పోతుంది. తస్మాత్ జాగ్రత్త! తరువాత పట్టుకుని కూర్చోడానికి పెద్దసైజుది అలా ఉంచి చిన్నతలకాయైనా దొరక్కపోవచ్చు!
-కర్లపాలెం హనుమంతరావుTuesday, March 7, 2017

చవలాయీల దినం- ఓ నెల ముందుగానేనా!జనాభాకన్నా ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్యం మనది. ఆరుపదులు నిండకుండానే స్వాతంత్ర్ర్ర్య యోధుల పింఛన్లందుకునే సమర యోధులూ దండిగా ఉన్న ధర్మభూమీ మనదే! ఇక్కడ 'ఇడియట్ బాక్సు'ల అమ్మకాలకు ఎంత లావు ఆర్థిక మాంద్యాలైనా అడ్డు రాలేవు! సూర్యమండలంమీదైనా సరే భూములు చవగ్గా అమ్ముతున్నారంటే కొనేదానికి కుమ్ముకు చచ్చే ఆసాములు గజానికొక అరడజనుకైనా   తక్కువ కాకుండా వర్ధిల్లే పూర్ణగర్భ కూడా ఇదే.. ఇదే! ఇంతకన్నా మన తెలివితేటలకు నిదర్శనం ఇంకేం కావాలి?!

యథా రాజా తధా ప్రజా! పాత పథకాకాలకే కొత్త కొత్త పేర్లెట్టేసి పార్లమెంటులో ప్రధాని అనుచరగణం పడా పడా చదివేసుంటే.. చేతులు నొప్పెట్టే దాకా చప్పట్లు కొట్టేస్తుంటారు మనం ఎన్నుకున్న ప్రతినిధులు! కన్యాశుల్కం నాటకంలో ఒక్కడే వెంకటేశం. మనదేశ ప్రజాస్వామ్య నాటకంలో అడుగడుక్కీ వెంకటేశాలే! వెంకటేశాలూ పిచ్చిపుల్లయ్యలూ ఒకళ్ల నొకళ్లు తిక్కశంకరయ్యలు చెసుకొంటూ సంబరపడే పండుగ పేరే… చవలాయీల దినం. ఐ మీన్ ఆల్ ఫూల్స్ డ్!

ఈ 'ఫూల్సు  పండుగ'ని కనిపెట్టిన మహానుభావుడెవరో కానీ మహా గడుసుపిండమై ఉండాలి. చవలాయీల దినం.. ఆర్థిక సంవత్సరం ఒకే సుమూహర్తంలో వచ్చేస్తుంటాయి. ఏడాది పొడుగూతా మనం గడిపిన చచ్చు జీవితాన్నోసారి సింహావలోకనం చేసుకోడానికి.. ముందు ముందు ముంచుకు రాబోయే ముప్పులకి మనల్ని మనం సంసిద్ధం చేసుకోడానికి.. ఈ చవటాయీల సంబరాన్ని మించిన ఉత్తమ సందర్భం మరోటి లేనే లేదు. హ్యాపీ ఫూల్సు డే.. ఇన్ ఎడ్వాన్స్!

'ఫూల్' అంటే తెలివితక్కువ దద్దమ్మని కదా అంతరార్థం. నా కన్నీ తెలుసనుకొన్నవాడంత దద్దమ్మీ లోకంలో మరొకడుండడు. మనం దున్నుకునే,  మనదే అనుకొనే భూమి ఏ పెద్దమనిషి కభ్జా పద్దుల్లోకి పోబోతుందో పుట్టించిన భగవంతుడికైనా తెలీదు. నీ బ్యాంకు కాతా జమా సొమ్ము  ఖాయంగా నీదేనన్న ధీమా  నీ దగ్గరే ఉంటుందా పర్మినెంటుగా? అందాకా ఎందుకయ్యా.. నీ మనీ పర్సు చిల్లర వందనోట్లు కచ్చితంగా నకిలీ.. మకిలీలేవీ కానే కావని కనీసం నీకైనా తెలుసా?  అందుకే గురజాడగారి గిర్రాయిగాడనేది అస్తమానం 'ఈ తెలివితక్కువ లోకంలో తెలివితక్కువగా బతకడం కన్నా తెలివైన కార్యం మరోటేదీ లేద'ని. తెలివి ఎక్కువై పోతే తెల్లారి లేచినప్పట్నుంచి తిప్పలే తిప్పలు!

భర్తృహరంతటి మహాకవే తన సుభాషితాల్లో ముందుగా మూర్ఖుణ్ని తలుచుకొన్నాడు. నిప్పుకు నిరు, ఎండకు గొడుగు, ఏనుగుకి అంకుశం, ఎద్దు.. గాడిదలకు ముల్లుగర్ర, రోగానికి మందు, విషానికి మంత్రం… విరుగుడుగా చెప్పిన శాస్త్రాలు సైతం చెవటాయీలకు మాత్రం ఏది నిదానమో నిర్ధారించలేక చేతులెత్తేసాయ్' అంటాడా పెద్దాయన.
పప్పుతో వజ్రాన్నైనా పరా పరా కోసేయచ్చేమో కానీ మంచి మాటలు చెప్పి మూర్ఖుణ్ని రంజింపచేయడం.. ఉప్పు సముద్రంలో తేనె బొట్టేసి తీపిదనాన్ని ఆశించడమంత తెలివితక్కువతనం అనటం .. ఎంత తెలివైన మాట!

జేబులో చిల్లి కానీ లేకపోయినా ఎన్నికల్లో నిలబడి నెగ్గేయ గలమని ఎవరైనా నమ్మగలరా.. ఈ కలికాలంలో మన ప్రజాస్వామ్యంలో? తెలుగు చిత్రాలకు ఏనాటికైనా తప్పకుండా ఆస్కారు పురస్కారాలొచ్చి తీర్తాయని ఆశపడగలరా ఎవరైనా? టీ.వీ ధారావాహికలు పదమూడు ఎపిసోడ్లతో పరిసమాప్తమవుతాయనీ, పెట్రోలు రేట్లు ఎప్పటికైనా తగ్గుముఖం పట్టక తప్పదనీ, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల్లేకుండానే పిల్లకాయలకు  తెలుగు పాఠాలు చెప్పే మంచిరోజులొస్తాయనీ మీరూ నమ్ముతున్నారా? కచ్చితంగా నమ్మేవారంతా కలసి చేసుకోవాల్సిన ఘనమైన సంబరం ఈ ' చవటాయీల దినోత్సవం'.
విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే పాలచెంబులతో  పరుగులెత్తే భక్త గణాలు, పూర్వజన్మల  పాప ప్రక్షాళనార్థం  బాబాల కాళ్లతో తన్నించుకోడానికి  బ్లాకు టిక్కెట్లకోసమైనా  ఎగబడే ముక్తి కాంక్షాపరులు, బైటకళ్లకు కనిపించేదంతా అశాశ్వతమైన తోలుతిత్తి ఆత్రమేగాని, అసలైన లోపలి అంతరాత్మ ఎన్ని అంట్లపనులు చేసినా  మైలనేది అంటుకోదని దృశ్యకావ్యంలో శృంగార లీలలు ప్రబోధించే ఆనందస్వాముల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలాచరించే భక్తపరమాణువులంతా కల్సి ఓ 'చవటాయీల సంఘం' సగర్వంగా ఆరభించుకోదగ్గ సమయం.. సందర్భం ఇదే.. ఇదే!
ఎలాగూ ఏదో ఒక జనాభా లెక్కల గలభా లెప్పుడూ జరిగే గణాంకాల దేశం మనది. ఈ సారైనా మూర్ఖుల వివరాలు సమగ్రంగా సేకరించే ఏర్పాట్లు సర్కార్లు సక్రమంగా చేపట్టే దిశగా వత్తిడి తెచ్చేందుకు  ముక్కోటి మూర్ఖుల సంతకాలు సేకరించే ఉద్యమం  చిత్తశుద్ధితో ప్రారంబించాల్సిన తగిన తరుణమూ ఇదే! చవలాయీలెవరైనా  చైతన్యయాత్రలు తెచ్చుకొనేందుకు ఈ దినాన్ని మించిన సముచిత సందర్భం మరోటి లేనే లేదు.
ఫోర్బ్స్ జాబితా టాప్ టెన్లో మనవాళ్లేదో ఇద్దరు ముగురున్నందుకే మురిసి ముక్కలైపోతున్నామే! ఫోర్బ్సుగాళ్ళను ఫూల్సు జాబితా నిజాయితీగా రిలీజు చేయమనండి.. టాప్ టెన్ థౌజండ్లో ఒక్క పేరైనా పక్క దేశాలకు పోయే ఛాన్సు బొత్తిగా లేదు. నోబెల్ పురస్కారాల్లాంటివి దద్దమ్మలకూ ఇచ్చే పద్ధతీ ప్రారంభిస్తే ఏడాదికో డజను మంది మన దేశంనుంచే పోటీ పడ్డం ఖాయం.

మనలోని తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేక పోవాడాన్ని మించిన తెలివితక్కువతనం మరోటి లేదు. 'మనవాళ్లొట్టి చవటాయిలోయ్' అంటూ గురజాడగారి గిరీశం చేత గోతాలు చెప్పించుకోడం కాదు.. ఆ దిశగా మనల్ని మనం ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన ప్రణాళికలింకా ఎన్నెన్నో సర్కార్లు సిద్ధం చేయాల్సుంది! ఆందోళనలకు దిగితేగానీ ఈ మొండి సర్కారులేవీ బండిదిగిరావని అందరికీ తెల్సు. వచ్చే నెల ఏప్రియల్ ఫస్టుకే 'చవలాయీల దినం'. అందుకే ఓ నెల ముందుగానే ఇన్నేసి హెచ్చరికలు!.
కోట్లు కూడేసి విలాసవంతమైన జీవితం దిలాసాగా గడిపుతున్నా.. ఆ  పెద్దమనుషులెవ్వరినీ 'టచ్' చెయడానికైనా దడిసి.. నాలుగైదు చిరిగిన చీరలకేవో  చాటు మాటుగా మూట కట్టుకు పోయే చవటాయిని  పట్టుకుని ఏడాదిపాటు ఏ వారంటూ లేకుండా  కటకటాల వెనక కుక్కి యమదర్శనం చేయిస్తున్నదంట మన ఘనమైన తెలంగాణా రక్షక భటశాఖ!
కేకోయ్  కేక! 'మూఢుల దినం' ఇంకో ఇరవై రోజులుందనంగానే మన శాంతిభద్రతల సిబ్బంది  అప్పుడే తన వంతు  'చెవలాయీల సంబరాలు' ఆరంభించేసిందన్న మాట! శభాషో శభాష్!
***
-కర్లపాలెం హనుమంరావు 

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో  2010నాటి ఏప్రియల్ ఫూల్సు డే  సందర్భంగా ప్రచురితం) 

Saturday, March 4, 2017

'జులాయి' అంటే నిజంగా తిట్టు పదమేనా?

'జులాయి' అని ఈ మధ్య ఓ సినిమాకూడా నిర్మాణమయింది కదా తెలుగులో! ఆ 'జులాయి' అంటే మన వాళ్లకి పనీపాటా లేకుండా బేవార్సుగా తిరిగే గాలిగాడని అర్థం. అదొక రకంగా తిట్టు పదం కూడా. 'వాడా? ఒట్టి జులాయి వెధవ!' అని చీదరించుకోవడం మనం తరచూ వింటూనే ఉంటాం. నిజానికి ఈ 'జులాయి' పదం మరీ అంత నీచపదమా? అదేమీ కాదంటున్నారు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణగారు తన 'మాటల వాడుక- వాడుక మాటలు' గ్రంథంలో.
'జులాయి' అనేది హిందీ/ఉర్దూ భాషాప్రభావం నుంచి  తెలుగులో వాడుకలోకొచ్చిన  పదం. మూల రూపం 'జులాహీ'. అంటే నేతగాడని అర్థం. నేతపని చేసుకొని బతికేమనిషి మరి 'జులాయి'పనీ పాటా లేని మనిషిగా ఎలా రూపాంతరం చెందాడన్న సందేహం చాలా మందికి కలగవచ్చు. ఆ వివరణకోసం ఈ టపా!

మన ప్రాచీన భారతావని గ్రామీణ వ్యవస్థ ఆధారంగా  పటిష్ఠంగా ఉన్న రోజులు ఒకానొకప్పుడు ఉండేవి. 'పంచాగణంవారు'గా ప్రసిద్ధులైన ఐదు కులాల వారి చేతిచలవవల్ల ఆ నాటి జనం జీవితాలు చల్లంగా సాగుతుండేవి.  కమ్మరి, కుమ్మరి, సాలె, వడ్రంగి, చాకలి.. ఈ ఐదు వృత్తులవారు. వారి సేవాధర్మంవల్ల గ్రామసీమలు ఎలాంటి ఒడుదుడుకుల్లేకుండా సాఫీగా సాగుతున్న కాలంలో తెల్లోళ్ళు ఈ గడ్డమీదకు దిగబడ్డారు. తెల్లవాళ్లది ప్రధానంగా యంత్ర ఆధారితమైన ఆర్థిక.. సామాజిక వ్యవస్థ. తమ పాలనా విధానాలను ఇక్కడి జనజీవితంమీద బలవంతంగా రుద్దేందుకు వాళ్లు చెయ్యని కుతంత్రాలు లేవు. అంతకు ముందునుంచే పాలకులుగా ఉన్నా మొగలాయీలు క్షీణదశలో ఉన్న కారణంగా తెల్లోడి ఆధిపత్యం ముందు గట్టిగా నిలబడలేక పోయారు. బ్రిటీషువారు ధ్వంసంచేసేందుకు ప్రయత్నించి సఫలమయిన ముఖ్య వృత్తుల్లో నేతపని ఒకటి. మిల్లులమీద నేసి దిగుమతి చేసిన నాజూకు బట్టముందు మన మగ్గంపనివారి ప్రజ్ఞ నిలబడలేకపోయింది. క్రమంగా మిల్లుభూతం మింగేసిన నేతజీవులు పనీపాటలకోసం పట్నం బాటలు పట్టారు. ఆ సందర్భంలో పనీ పాటా లేకుండా పొట్టచేతబట్టుకుని తిరిగే ఆ నేతపనివారిని ఉద్దేశించే 'జులాయి'  అన్న పదం పుట్టింది. క్రమంగా ఆ 'జులాయి' పద ప్రయోగం అన్ని  వర్గాలకీ సంబంధించే విధంగా స్థిరబడింది.

దేశం స్వాతంత్ర్యం సాధించి ఏడుదశాబ్దలు గడిచినా నేతపనివారి జీవన పరిస్థితుల్లో ఏ మాత్రం మెరుగుదల కనిపించక పోవడం నేటికీ మనం  గమనించవచ్చు. ఇప్పటికీ ఆకలి చావులు, ఆత్మాహుతులు.. చేనేత కుటుంబాలలో తరచూ వినిపిస్తున్న మాటలే.

ఇటీవలనే తెలంగాణా ప్రభుత్వం దృష్టి ఈ చేనేతవృత్తి పనివారి జీవనవిధానంమీద పడింది. హర్షించదగ్గ అంశమే! 'జులాయి' అనే పదాన్ని తెలుగుభాషకు ఆ విధంగా అందించిన చేనేతన్నకు ఎన్ని చేసినా తక్కువే కదా!

సందర్భం వచ్చింది కాబట్టి మరో ముచ్చట. అమెరికాలో ఉద్యోగాలకని ఎగబడే   మన భారతీయ యువతకూ  అక్కడి కొత్త ప్రభుత్వాధినేత ట్రంప్ మహాశయుడి జాతీయభావాల కారణంగా  హెచ్-1 బి వీసాలమీద వివిధ నిర్బంధాలు అమలు దిశగా ధృఢంగా అడుగులు పడుతున్నాయి కదా ఇప్పుడు. ఈ స్పీడు చూస్తుంటే  నిన్నటి వరకు మకుటం లేని మహారాజాలమనుకున్న మన ప్రవాస భారతీయులు రేపు  డొనాల్డుగారి పుణ్యమా అని  విదేశీయ 'జులాయి'ల్లాగా మారరు కదా కొంపదీసి? ఏమో చూడాలి మరి!

ఏదేమైనా తిట్టో.. దీవనో.. వాడుకలో ఉన్న పదాలమీద ఆ కాలంనాటి సామాజిక పరిస్థుల ప్రభావం తప్పకుండా ఉంటుందన్నది భాషాశాస్త్రవేత్తలు చెప్పే సిద్ధాంతం. ఆ వాదాన్ని బలపరిచే 'జులాయి'లాంటి పదాలింకెన్నున్నాయో మన తెలుగు పద సంపదలో!  పరిశోధకులు తేల్చి చెపాల్సిన లోతైన అంశమిది. ఏమంటారూ?
(డాక్టర్  బూదరాజు  రాధాకృష్టగారి 'మాటల వాడుక.. వాడుక మాటలు' ఆధారంగా)


-కర్లపాలెం హనుమంతరావు

నా నచ్చిన పుస్తకం లోని నాకు నచ్చిన చిన్న కథ- కాదేదీ నా కబుర్ల కనర్హం


ఒక అడవిలో మూడు చెట్లు. మూడింటికి మూడు కోరికలు.
మొదటి దానికి ఒక అందమయిన రాకుమారిపడక గదిలో అద్దం దగ్గర ఆమె తన విలువయిన ఆభరణాలు దాచుకునే అందమయిన నగిషీలు చెక్కబడిన చెక్క పెట్టెలాగా మారి అందరి దృష్టిని ఆకర్షించాలని అభిలాష .
రెండో చెట్టుకి ఒక బ్రహ్మాండమయిన నౌకలాగా మారి రాజులూ రాణులు విహరించే లాహిరి లాహిరి ఊయలగా మారాలని కోరిక.ప్రళయం వచ్చినప్పుడు జనాల ప్రాణాలను కాపాడే అవకాశం రావాలని కూడా దాని ఆశ .
మూడో దానికి మాత్రం ఈ ప్రపంచం లో అందరికన్నా ఏపుగా ఎదిగి తన జాతికి పేరు తీసుకురావాలని ఆశయం .
కొంత కాలానికి చెట్లు కొట్టేవాళ్ళొచ్చి అన్నింటి తో పాటు వాటినీనరికి తీసుకుని పోయారు.
మొదటి చెట్టు కొయ్య జంతువులకు ఆహారం పెట్టే చెక్క పెట్టె గా చెక్కబడింది.రెండోది చేపల తొట్టి. మూడోదాన్ని మరీ అన్యాయంగా చిన్న చిన్న పేళ్ళు గా కొట్టేసారు.
మూడు చెట్లు తమ దురదృష్టానికి దుఃఖపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేక పోయింది. 
కొంత కాలానికి జంతువుల కొష్టం లోకి ఒక ఆడమనిషి ప్రసవించటానికి వచ్చింది.పుట్టిన బిడ్డను ఆ గడ్డి తొట్టెలో పడుకోబెట్టింది.ప్రపంచం లోకెల్లా అత్యంత విలువయిన నిది తనలో వున్నట్లు తెలిసి ఆ చెక్క పెట్టె మురిసిపోయింది.
చాలా ఏళ్ల తరువాత ఆ బిడ్డ పెరిగి పెద్దయి ఒక నది వడ్డుకి వెళ్లి అక్కడి పడవలో పడుకున్నాడు.ఇంతలో పెను తుఫాను ఆరంభమయింది.పడవలోని మనిషి ప్రకృతి వైపు చూసి 'శాంతి శాంతి 'అని ఆదేశించాడు. ప్రకృతి శాంతించింది. ఆ క్షణంలో పడవకు అర్ధమయింది -తనలో పడుకున్నవాడు రాజు కాదు రాజులకు రాజు వంటి వాడని.
మరి కొంత కాలానికి అదే వ్యక్తిని శిలువ వేయటానికి కొయ్య పేళ్ళను ఏరుకుని వెళ్లారు కొంత మంది సైనికులు.
జీసస్ ను శిలువ వేసిన తన చెక్కలతో సహా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు 
ఆ మూడో చెట్టు అందరికన్నా ఎక్కువగా మురిసిపోయింది.
ఆ రకంగా మూడు వృక్షాల ఆకాంక్షలను దేవుడి బిడ్డే స్వయంగా వచ్చి తీర్చాడు.
-యండమూరి వీరేంద్రనాథ్దేవుడు వున్నాడా లేడా?... జీసస్ దేవుడి బిడ్డ అవునా కదా ? అని చర్చల లోకి వెళ్ళటానికి కాదు ఈ కథ ఇక్కడ ప్రస్తావించింది..
కల్పించే వూహా శక్తి వుండాలే కానీ...చెయ్యి తిరిగిన రచయిత దేనినయినా ఎంత అందంగా సమన్వయం చేయగలడోనని చెప్పటానికి!

(యండమూరి వీరేంద్రనాథ్ 'విజయానికి ఆరో మెట్టు' లో ఈ కథ కనిపించినప్పుడు ముందుగా నాకూ తట్టిన ఆలోచన ఇదే ! .ఇలాంటి చిత్రమయిన చిన్నచిన్న కథలు..ఆలోచనలను రేకెత్తించేవి ఆ పుస్తకం నిండా కోకొల్లలు. ఆసక్తి వున్న వాళ్ళు తప్పకుండ చదవదగిన వ్యక్తిత్వ వికాస సబంధంయిన మంచి ఉపయుక్తమయిన  పుస్తకం 
ఏది ఎలా వున్నా యండమూరివారి దగ్గరనుంచి మనం చాల చక్కని తెలుగు భాషను నేర్చుకోవచ్చు. ఇది .చదివేవారి సమయం వృధా పోదు  నాదీ గ్యారంటీ
-కర్లపాలెం హనుమంతరావు

Thursday, March 2, 2017

పిల్లాడొస్తాడా? - పి. సత్యవతిగారి కథ- నా పరామర్శ
 ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?'  ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని నా అభిప్రాయం.

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. కుటుంబ ప్రధాన పాత్ర చుట్టూ సుళ్ళు తిరిగే ఆలోచనా స్రవంతిని కథారూపంగా మలిచారు రచయిత్రి.
ఆ ప్రధాన పాత్ర విజయ ఒక సాధారణ గృహిణి. భర్త ఏదో వృత్తిపని మీదా,  ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చేసుకుని వేరే దేశాల అవతలా. ఎదిగిన  కొడుకు మాత్రం ఇక్కడే ఇంజనీరింగు చదువుతున్నాడు. ఎనభైయేళ్ళ అమ్మమ్మను నాలుగు రోజులు ఉండిపోతుందని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటుందా ఇల్లాలు.
ఆ ఆమ్మమ్మ ఒకానొక కాలంనాటి గృహిణికి ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఈ అమ్మాయి ఈనాటి గృహిణి ఆలోచనలకు ప్రతిరూపంగా కనబడుతుంటుంది.

ఇంజనీరింగు చదువుకునే పిల్లాడు ఒక వానరాత్రి ఎప్పటిలాగా పెందలాడే ఇంటికి రాకా.. ఎక్కడున్నాడో ఫోను చేయకా.. తల్లి చేసే ఫోనులకూ అందుబాటులో లేని నేపథ్యంలో కథ ఆసాంతం సాగుతుంది.  పిల్లవాడికి సంబంధించిన ప్రపంచమేదీ  తల్లికి ఏ కోశానా  ఆచూకీ దొరకని సందర్భంలో   తల్లిహృదయం తెల్లార్లూ ఎంతలా తల్లడిల్లిపోతుందో  ప్రతీ ఇల్లాలకీ ఎప్పుడో ఒకసారి తప్పక  అనుభవంలోకి వచ్చే అనుభవమే అయివుంటుంది. అటువంటి సందర్భాలలో  ఏ  తల్లికయినా  కొడుకు యోగక్షేమాలను గూర్చి వచ్చే ఆలోచనల్లో    అపశకునపు పాళ్లే అధికంగా ఉంటాయి.
తాగి బైకు నడుపుతుంటే ఎదురుగా వచ్చిన మరో తాగుబోతు లారీ గుద్దేసినట్లు, లిఫ్టిచ్చిన ఆగంతకుడు సందు చూసుకుని ఉంగరాలు, వాచీలు, సెల్ఫోనుల్లాంటి  ఖరీదైన వస్తువులకోసం ప్రాణాలు తీసి పారిపోయినట్లు, స్నేహితుల పుట్టిన్రోజు  పార్టీలో గర్ల్ ఫ్రెండ్సు గురించిన వివాదం ముదిరి బిడ్డ ప్రాణాలకు ముప్పం ఏర్పడినట్లు, సందుచివరి పిల్ల సంధ్యతో కలివిడిగా తిరగడం చూసి నచ్చక ఆ పిల్ల తాలూకు వాళ్లెవరో  ఏదో అపాయం తలపెట్టినట్లు… ఇలా అన్నీ ప్రతికూలమైన  ఆలోచనలు చేస్తుండే నేటితరం గృహిణి విజయ.  ఆ ఇల్లాలి  ఆలోచనలు అత్యంత సహజంగానే సాగుతున్నాయని చదువరులకూ అనిపిస్తుంటుంది. కానీ ఎనభైయేళ్ళ ఆమె  అమ్మమ్మకు మాత్రం విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ ముసలమ్మా  తన రోజుల్లో ఇలాగే  మొగుడూ, బిడ్డలూ వేళకు ఇంటికి రాకపోవడంలాంటివి అనుభవాలు చవిచూసిన ఘటమే. అయినా ఎన్నడూ ఈ విధంగా   ప్రతికూలమైన ఆలోచనలు చేయాలని తోచనేలేదు.  ఎంత ఆలస్యమైనా ఎక్కడో ఒకచోట ఏదో ఒక  మంచిపనిలో ఉండుంటారన్న పాజిటివ్ ఆలోచనలే సాగుతుండేవి మనసులో. స్వాతంత్ర్యయుద్ధానంతరం  సాంస్కృతికి పునరుజ్జీవనం పుంజుకునే రోజులు. కాబట్టి ఇంట్లోని మగవాళ్ళు వాటికి సంబంధించిన ఏవో   పునర్నిర్మాణ కార్యక్రమాల్లో  మాత్రమే తలమునకలై ఉంటారనే  ఒక గట్టి నమ్మకం. ఆ భావనవల్ల ఏర్పడ్డ  గుండె నిబ్బరంతో  తమ వాళ్ళను గురించిన ఆలోచనలు  ఆ విధంగానే చేసుకుంటూ ఇంటిపనులు చక్కబెట్టుకునే తత్వం అలవడ్డంవల్ల  మనుమరాలు చేసే ప్రతికూల ఆలోచనలు అబ్బురం అనిపిస్తుంటాయి. పిల్లాడు ఇంటికి వచ్చిందాకా పచ్చి మంచినీళ్ళయినా ముట్టనని మనుమరాలు భీష్మించుకుని కూర్చోవడం అందుకే ఆ పెద్దావిడకు అంతలావు విస్మయం కలిగిస్తుంది.
సొంతచేతులతోనే కనిపెంచిన బిడ్డల సంస్కారాలమీద  పరోక్షంలోనైనా కన్నతల్లులకు కించిత్  విశ్వాసం లేకుండా పోవడం ఆ పెద్దావిడ విస్మయానికి అసలు కారణం.

కథ అంతటా పరుచుకుని ఉన్న అమ్మమ్మగారి అనుకూల మనస్తత్వ ధోరణి (పాజిటివి పర్సనాలిటీ). మనమరాలు తాలూకు ప్రతికూల మానసిక ధోరణి (నెగటివ్ పర్సనాలిటీ)..  రెండు విభిన్న తరాల  సంస్కారలమీద 'ధ్వని'మాత్రంగా రచయిత ప్రకటించిన అభిప్రాయంగా  'పిల్లాడొస్తాడా?' కథను నేను భావిస్తున్నాను.

కథాంతంలో- తెల్లారిని తరువాత కాలింగ్ బెల్ మోగినప్పుడూ.. ఎవరే దుర్వార్త మోసుకొచ్చారోనని మనుమరాలు సోఫాలో కుప్పకూలినట్లు కూర్చుండి పోతే.. 'ఒక వేళ పిల్లాడే వచ్చాడేమో .. త్వరగా తలుపు తీయి!' అని ఆశావాదం ప్రకటిస్తుంది అమ్మమ్మ.

తరాలమధ్య గల తల్లుల ఆలోచనల్లో వస్తోన్న  తారతమ్యాలను.. పక్కపక్కన నిలబెట్టి పోల్చి చూపించేందుకు చెయితిరిగిన కథారచయిత్రి  పి.సత్యవతి ఎంచుకున్న ఈ కథ.. కథనం..  అధునాతనంగానే కాదు.. ఆలోచనాత్మకంగానూ ఉండి 'కథ' సాధించవలసిన ఉత్తమశ్రేణి ప్రయోజనాన్ని  సాధించింది  అని నా అభిప్రాయం. రచయిత్రికి అబినందనలు.
-కర్లపాలెం హనుమంతరావు
(29, జూన్, 2014 నాటి ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితం)


కథ కావాలనుకున్నవారు ఇక్కడ చదువుకోవచ్చు!
 పిల్లాడొస్తాడా?
                                                                                                         
“రాజావారి కుటుంబం “ దైనిక ధారావాహిక  తాలూకు తొమ్మదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదో ఉదంతం ఒక గంటసేపు ప్రసారం కాబోతోంది ఈ రోజు... అందులో నటించిన  తారలంతా ఆ ఫలానా ధారవాహికలో తాము పాల్గొన్న అపురూప ఘట్టాలనూ   జన్మసార్థక సన్నివేశాలనూ జుట్టు పైగకెగదోసుకుంటూ  ముద్దుముద్దుగా మణిప్రవాళంలో ముచ్చటిస్తారు. ఈ ఉదంతం తప్పక చూడమని గత పదిరోజులుగా నిర్మాతలు చెవిలో  ఇల్లు కడుతున్నారు.అందుచేత కాలేజీ నుంచీ వచ్చి అబ్బాయి వెంటనే తినడానికి  స్వయంగా పీజ్జా తయారుచేసి పెట్టి, రాత్రిభోజనంలోకి వాడికిష్టనైనవి వండి ,అమ్మమ్మకోసం రాగిజావ కాచి ,తనకోసం పుల్కాలు చేసుకుని ఇటీవలే కొని గోడకి అమర్చిన పెద్ద “బుల్లితెర”ముందు కుదురుకున్నదివిజయ.

  అమ్మమ్మ సావిత్రమ్మకు ఎనభై ఏడేళ్ళు..  ఆమెను తన దగ్గర పదిరోజులుంచుకు పంపిద్దామని  మొన్న తీసుకొచ్చుకుంది విజయ..... విజయ వాళ్ళాయన  ఏదో సమావేశంకోసం సింగపూర్ వెళ్ళి వున్నాడు.కూతురికి వివాహం అయి అమెరికా వెళ్ళింది.కొడుకు  ఇంజినీరింగ్ చదువుతున్నాడు.  నమూనా కుటుంబం.
 అమ్మమ్మకి బుల్లితెర కార్యక్రమాలు నచ్చవు. గదిలో కూచోడమూ గిట్టదు .ఆకాశంలో ఒక చిన్న ముక్కా , నాలుగుచుక్కలూ, రెండు మొక్కలూ కనపడతాయని సాయంత్రం కాగానే బాల్కనీ లోకి చేరుతుంది . అలా బాల్కనీలో కూచున్న అమ్మమ్మ హడావిడిగా లోపలికొచ్చి “ బాగా మబ్బేసింది.చినుకులు కూడా మొదలయినై. .ఇంకా పిల్లాడు రాలేదే!” అంది
రాజాగారి కోడలు కోడలికి కోడలు పాత్రధారిణి సకలాలంకార భూషితంగా అప్పుడే తెరమీదకొచ్చి వీక్షకులకు వినమ్రంగా నమస్కారం చేసింది.”ఆ పిల్ల పెట్టుకున్ననెక్లేసు చాలాబాగుంది “  అనుకుంటూన్న విజయ, అమ్మమ్మ మాటలకి ఉలిక్కి పడింది.అవునూ రాత్రి ఎనిమిదౌతున్నా పిల్లాడింకా ఇంటికి రాలేదేమిటీ? అయ్యో పిల్లాడు రాలేదు. రోజూకన్న ఒక అరగంట ఆలస్యమైనా అమ్మ కంగారుపడుతుందని ఫోన్ చేసి చెబుతాడు కదా?
వాడు ఫోన్ కూడా ఎత్తడంలేదే! ఏమైంది వీడికి?
దబ దబ చినకులు.
ఒరేయ్ మోటూ,చింటూ ,బబ్లూ బంటీ ,మున్నా ,రహీం రాజా ,మా వాడేడిరా? ఫొన్ మీద ఫోను.
“ఏమో ఆంటీ “  వాళ్లంతా.
“ మీరంతా ఇంటికొస్తే వాడెందుకు రాలేదు? కాస్త ఫోన్ చేసి కనుక్కోండి మా బాబులు కదూ?”
“ మాకూ పలకడం లేదు ఆంటీ”
వందోసారికూడా వాడి ఫోన్.స్విచ్డ్ ఆఫ్.
రోజూ ఏడుగంటలలోపు వచ్చేవాడు పదైనా రాలేదు.ఏం చెయ్యాలిప్పుడు?
వాళ నాన్నకూడా దేశంలో లేడే!! ఇప్పుడు ఫోన్ చేసి చెబితే కంగారుపడిపోడా?
“ వస్తాడులే అమ్మా! ఎక్కడో చిక్కడిపోయి వుంటాడు .వాన తగ్గనీ వాడే వస్తాడూ” అని ,తనకోసం పెట్టిన జావ తాగేసి   సోఫామీద ముడుచుకుని పడుకుంది అమ్మమ్మ.
వాడు వెళ్ళే చోట్లు ,వాడికున్న స్నేహితులు పరిచయస్తులు అన్ని నంబర్లూ అయిపోయాయి
పన్నెండు.
చుట్టుపక్కల ఇళ్లల్లో టీవీ లన్నీ బందయ్యాయి.అపార్త్మెంట్ సెల్లార్ లోకి రావాల్సిన వాహనాలన్నీ వచ్చేశాయి.
పిల్లాడురాలేదు
“ వాడెక్కడో చిక్కుపడి వుంటాడు  అని చెప్తున్నా కదా!!నువ్వలా జావకారిపోకు.వెళ్ళి కాస్త ఎంగిలి పడు” అంది అమ్మమ్మ మళ్ళీ
విజయకి ఒళ్ళుమండింది.
“ వాడు రాలేదని నేనిక్కడ భయపడి చస్తుంటే తినమంటావేమిటీ? నువ్వు జావ తాగేశావుగా పడుకో!” అని కసిరింది
“  నేను నీరసంతో కళ్ళుతిరిగి పడిపోతే నా సేవ చెయ్యాలి నువ్వు... అందుకని ఎక్కడున్నా ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా నా సంగతి  నేను చూసుకుంటాను అట్లా వూరికే కంగారు పడి ఏం చేస్తావ్?  “ అంది ఆవిడ.
బుల్లితెర రూపం సంతరించుకున్న విజయ మెదడు పైన   ఎర్రని భయంకర దృశ్యాలు.
అంతులేని వేగంతో వస్తున్న మోటర్ సైకిల్ మీద ముగ్గురు పిల్లలు. ముగ్గురి చెవుల్లోనూ సెల్ఫోన్లు .మద్యం మత్తులో జోగుతూ అంతకన్న వేగంగా వస్తున్న లారీ డ్రయివర్!    రోడ్డుమీద అడ్దదిడ్దంగా నెత్తురోడుతూ మూడు శవాలు.తెల్లటి టీషర్టు ఎర్రగా తడిసి ముద్దై!
 వానలో వస్తున్న మోటర్ సైకిల్.....చెయ్యి ఊపి లిఫ్ట్ అడిగాడు గుర్తు తెలియని వ్యక్తి.మోటర్ సైకిల్ ఆగింది.ఆ వ్యక్తి వీడిని రోడ్డు మీదకి ఈడ్చి బాగాకొట్టి ల్యాప్టాపూ సెల్ఫోనూ పర్సూ ,మోటర్ సైకిల్ తాళాలూ లాక్కుని    వెనక్కి తిరిగిచూడకుండా పోయాడు,వీడు స్పృహలేకుండా రోడ్డుమీద.పడి వున్నాడు...   వెంకటేశ్వరస్వామీ అలా జరగనివ్వకు .మెట్లన్నీ ఎక్కి కొండకొస్తాను.
ఎవడిదో పుట్టిన రోజు.. వాడు వీడిని. పార్టికి రమ్మన్నాడు.వీడు రానంటాడు.వాడు వెక్కిరిస్తాడు. వీడికి రోషమొచ్చి వెడతాడు .. అక్కడ వాదాలు.. వాదాల్లోనించీ ముష్టి యుద్ధాలు. కొట్టుకోడాలు,వీడి గర్ల్ ఫ్రెండ్ ని వాడేదో అన్నాడనీ వాడి  గర్ల్ ఫ్రెండ్ ని వీడేదో అన్నాడనీ ! ఆ వూపులో .. ఎవడిప్రాణం పోతుందో తెలీదు.
కృష్ణలో ఈతకి పోయి  మునిగిపోయిన యువకుడు. 
కొన్ని వేల రూపాయల క్రికెట్ బెట్టింగ్ లు! డబ్బొచ్చిందా జల్సాలే జల్సాలు. ఎక్కడినించీ తేవాలి ఓడిపోయిన డబ్బు? స్కూటర్లు మోటర్ బైకులు ల్యాప్టాపులు దొంగిలించి అమ్మాలి.పోలీసులు పట్టుకుని మొహనికి ముసుగేసి వీక్షకులముందు పెడతారు. ఆ ముసుగుల్లో అమాయకుడైన మనవాడు తెలీకుండా ఇరుక్కోలేదు కదా?
 “ మన  పిల్లాడు అట్లాంటి వాటి జోలికి పోడు. ఊరికే పిచ్చి ఆలోచనల చెయ్యకు..  ఇరవై ఏళ్లకి పైగా పెంచుకొస్తున్నావు నీకొడుకు ఎలాంటివాడో నీకు తెలీదా? చూడు ఎట్లా చెమటతో తడిసిపోతున్నవో నిస్త్రాణ వస్తుంది.. కాసిన పాలు తాగు” మళ్ళీ అమ్మమ్మ
“నా పిల్లాడొచ్చేదాకా పచ్చిమంచినీళ్ళుకూదా ముట్టను. నా ఒక్కగా నొక్క కొడుకు నా ప్రాణం”
అమ్మమ్మ మాట్లాడలేదు
 “ఈ మధ్య వీడు మన సందుచివరి ఇంట్లో వుండే సంధ్య ని నాలుగైదు సార్లు మోటర్ సైకిల్ ఎక్కించుకొచ్చాడు. అదేమైనా ప్రేమ వ్యవహారం అనుకుని వాళ్ల వాళ్ళు వీణ్ణి చావకొట్టారేమో! మనకులంకాదు కదా వాళ్ళు. .మన వెంకట్రత్నంగారి మనవణ్ణి అట్లాగే కొట్టి పడేశారు తెలసుగా?” విజయ చెప్పింది మౌనంగా విని ఊరుకుంది అమ్మమ్మ
రెండు ,మూడు నాలుగు గంటలు
గదిలో పచార్లు చేస్తూ ప్రతిచిన్న అలికిడికీ ఉలిక్కిపడుతున్న విజయకి ఉన్నట్లుండి వాంతి అయింది.అమ్మమ్మే మెల్లిగా ఆమెని మంచందాకా నడిపించి మార్చకోడానికొక నైటీ ఇచ్చింది
మంచం మీద పడుకున్న విజయను శోకపు వరద ముంచెత్తింది. నిస్సహాయంగా ఆ వెక్కిళ్ళు వింటూ వుండిపోయింది అమ్మమ్మ. విజయ ఇంకా చెప్పింది.. మొన్నటికి మొన్న స్నేహితులే ఒక పిల్లాడిని చంపేసి కాలవలో పడేశారు.ఇప్పుడెవరు స్నేహితులో ఎవరు శత్రువులో కనుక్కోలేం అమ్మమ్మా!
“ నీకన్నీ ఇట్లాంటి ఆలోచనలే ఎందుకొస్తయ్ తల్లీ ! రాత్రి నుంచీ నువ్వు అన్నీ అపశకునాలే మాట్లాడుతున్నావ్? మీ తాతయ్య ఉద్యమంలో పనిచేసేటపుడు పదేసిరోజులు ఇంటికొచ్చేవారే కాదు .అప్పుడిట్లా సెల్ఫోన్లా ఏమన్నానా? అట్లాగ ఎదురుచూస్తూ మాపన్లు మేం చేసుకునే వాళ్ళం..” అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంది అమ్మమ్మ
తన పెళైన మూడేళ్ళకే  అత్తగారు పోతే  మావగారు తన ఈడావిడని మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ పిల్లల్నీ తన పిల్లల్నీ కలిసి ఇద్దరూ పెంచేవాళ్ళు.అదీకాక . మావగారి పెద్ద భార్య తాలూకు ఆడపిల్లలు పురుళ్ళు పోసుకోడానికొచ్చేవాళ్ళు. ఎడపిల్లలు పసిపిల్లలు ఇంటనిండా!! ఆ గుంపెడు పిల్లల్లో ఎవడెప్పుడు ఇంటికొచ్చేవాడొ ఎందుకు రాలేదో ఇట్లా ఊహించుకుంటూ ఏడుస్తూ కూచోడానికి ఎవరికి తీరింది? ? పిల్లలతో కూచుని కాసేపు మంచీ చెడూ మాట్లాడుకోడానికి సమయం ఎక్కడిది? మావగారే పిల్లందర్నీ కూచోబెట్టి ఎపుడైనా కథలు చెప్పేవాడు.ఆడవాళ్ళకి ఇంట్లో పనులే సరిపోయేవి.  తన భర్తకి  ఉద్యమాలు. మీటింగులు.  పెద్దకొడుక్కి ఇరవై ఏళ్ళోచ్చాయోలేదో  సంఘాలు ఊరేగింపులు! పోలీస్ భయాలు ,అజ్ఞాత వాసాలు.. .వాళ్ళేవో మంచిపన్లు చేస్తున్నారనే నమ్మకంతో తమ పన్లు తము చేసుకుంటూ వుండేవాళ్లు.  ఎప్పుడూ ఇట్లా హైరాన పడలా...ఒక వేళ వీడూ ఏదో మంచిపని కోసం ఎక్కడైనా ఆగిపోయాడేమో !ఎవరికైనా సాయం చేయడానికి వుండిపోయాడేమో! అని ఎందుకనుకోదీ పిల్ల?  తన పిల్లాడిమీద తనకే నమ్మకం లేకపోయే! లోకం మీదా నమ్మకం లేకపోయే ! అనుకుని అమ్మమ్మ కాస్త చిరాకుపడింది
 “ఆ రోజులు వేరమ్మమ్మా! ..ఇప్పటి పిల్లల సంగతి నీకు తెలీదు రోజూ పేపర్ చదువు తెలుస్తుంది.”
’అవున్లే అమ్మా! అప్పుడు వాళ్లకి ఏవో ఆశయాలనీ అవీ వుండేవి..కోరికలూ డబ్బులూ కూడా తక్కువే  ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ మామయ్య అక్కడ ఉండిపోయేవాడు,వాడికి తిండీ నీళ్ళూ కూడా గుర్తొచ్చేవి కాదు వీడికి వాడి పోలిక వచ్చిందేమో .అనుకుంటూన్నాను..”అంది అమ్మమ్మ .
“ వాడికి ప్రతిరోజూ చెబుతాను. తనకు మాలిన ధర్మానికి పోయి నువ్వు అనవసరమైన విషయాల్లో ఇరుక్కోకు,  లేని పోని బురద అంటించుకోకు అని,.మనం ఎవర్నీ ఉద్ధరించక్కర్లేదు మనని మనం ఉద్ధరించుకుంటే చాలనీ  ! మన చదువేదో మనం చూసుకుని జీవితంలో స్థిరపడాలని!!. అడిగిన వన్నీ ఇస్తాను .ఏదిష్టమో అదే వండిపెడతాను. బయటికెళ్లాక ఎట్లా వుంటాడో ఏం చేస్తాడో మనకేం తెలుస్తుంది ”  కళ్ళు తుడుచుకుంటూ అంది విజయ.
అంటే ,వాడు ఎవరికోసమూ ఏమీ చెయ్యడనీ ఇట్లా తను ఊహించే ప్రమాదాల్లో ఇరుక్కుంటాడనీ విజయ ఉద్దేశమా ఒక వేళ వాడికే ఏ ప్రమాదమన్నా జరిగుంటే వాడికి సాయం చేసి ఇంటికి తెచ్చేవాళ్ళే వుండరా? ఆ ఊహ కూడా రావడం లేదు.,ఆ ఇంట్లో పుట్టి పెరిగిన తన మనవరాలికి! పైగా గట్టి నమ్మకంతో వుంది ఏదో చెడే జరిగిందని! పరిస్థితుల్లో అంత మారొచ్చిందా అని ఆశ్చర్యపోయింది అమ్మమ్మ.
కొన్ని యుగాలకి సూర్యుడొచ్చాడు.పిల్లాడురాలేదు.వాకిట్లో పడివున్న పాల పొట్లాలూ వార్తాపత్రికా తీసుకుని పని చేసిపెట్టే దుర్గ వచ్చింది.
“లేమ్మా ! లేచి కాసిని కాఫీ తాగి ఇప్పుడేం చెయ్యాలో చూడు .నీ స్నేహితులెవరికైనానో మీ ఆయన స్నేహితులకెవరికైనానో ఫోన్ చేసి పిలు . అట్లా ఏడిస్తే ఏమవుతుంది “ అని మళ్ళీ బ్రతిమిలాడింది అమ్మమ్మ
విజయ పత్రికలోని  సిటీ టాబ్లాయిడ్ తీసుకుని అందులో హత్యలు, ప్రమాదాలూ దొంగతనాలూ వేసే పేజీ చూసింది. ఎక్కడా తన పిల్లవాడికి సంబంధించిన వార్తలాంటిది కనిపించలేదు. రోజూ వుండే వివాహితల ఆత్మహత్యలూ రోడ్డుప్రమాదాలూ వైగైరాలున్నాయి.కాస్త కుదుటపడి కాఫీ తాగుదాం అనుకుంది కానీ అది నోటికి పోలేదు. కడుపులో తిప్పింది. అయినా రాత్రి జరిగిన సంఘటన అప్పుడే పేపర్లోకి ఎట్లా ఎక్కుతుంది? ప్రమాదం పాలై రోడ్డు మీద పడి వున్న వాడిని పట్టించుకునేదెవరు? పోలీసులకో, నూట ఎనిమిదికో ఫోన్ చేసే తీరిక ఎవరికి? లేనిపోని బురద అంటించుకోడం ఎందుకు, మన పని మనం చూసుకుపోదాం అనుకుంటారు కదా అందరూ!
అప్పుడు
పిలిచే గంట మోగింది;
“ఎవరే వార్త మోసుకొచ్చారో “ అని సోఫాలో కూలబడి పోయింది విజయ
“ఒకవేళ పిల్లాడే వచ్చాడేమో! దుర్గమ్మా త్వరగా తలుపు తియ్ తల్లీ” అంది అమ్మమ్మ***

satyavathi-p.blogspot.in/2014/12/blog-post.html
రచయిత్రిని గురించి సంక్షిప్త పరిచయం కావాలంటేః
http://www.teluguone.com/sahityam/single.php?content_id=679
(తెలుగువారి అక్షర సంపద- సౌజన్యంతో)