Sunday, October 23, 2016

నల్ల’మేతగాళ్లు- ఈనాడు వ్యంగ్య గల్పిక


రోజూ ఉండే రాజకీయాలకేం గానీ ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచి కథ చెప్పాలనుందిరా!'
'కహానీలు చెప్పడంలో నిన్ను మించిన మొనగాడు లేడుగా! బాదేయ్  బాబాయ్!'
'సృంజయుడనే ఓ రాజుగారికి సంతానం లేదు. నారదులవారో సారి చూడ్డానికని వచ్చినప్పుడు రాజు కోరితే 'గుణవంతుడు, రూపవంతుడయిన కొడుకు పుడతాడ’ని ఆశీర్వదించాడు.’
'గుణాన్నేమన్నా కోసుకు తింటామా? రూపాలతో ఏమన్నా వ్యాపారాలు చేయబోతున్నామా?  వాడి చెమట, రక్తం, ఉమ్మి, కన్నీళ్లుకూడా చివరికి కాసులుగా మారిపోవాలి.  అట్లాంటి రూకలు రాల్చే పుత్రుణ్ని ప్రసాదించండి స్వామీ!' అని కోరుకున్నాడా రాజు. అట్లా పుట్టిన సుపుత్రుడే సువర్ణష్ఠీవి.'
'ఆ నడిచే ఏటియంగానీ  ఇంకా ప్రాణాలతో ఉంటే.. అర్జంటుగా  అడ్రస్ చెప్పెయ్  బాబాయ్! అసలే మన కష్ణమ్సోళ్ళు  గోల్డు గట్రాలు గీకే పనుల్లేక పాపం   గోళ్లు గిల్లుకుంటున్నారూ!'
'హుష్ఁ! ముందు కథ విన్రా! ఆశకొద్దీ ఆ బంగారు బాబుని దొంగలు ఎత్తుకెళ్లా రోసారి. నిధులకోసం పొట్టకోసి చూస్తే వట్టి పేగుచుట్టలు, మాంసం ముద్దలు! రక్తధారలు మినహా మరేవీఁ కనిపించక చెత్త కుండీలో పారేసి పోయారు చిర్రెత్తిపోయి. రాజుగారి దుఃఖం సంగతింక చెప్పాలా? నారదులవారా పుత్రశోకానికి చలించిపోయి 'అందుకే ఎర్ర చందనం దుంగల్లాంటి బిడ్డల్ని కాదు.. ఎవర్ హీరో చంద్రబాబులాంటి మచ్చలేని చంద్రుళ్లను  కొడుకులుగా కోరుకోవాల'ని మందలించాడు. మళ్లీ సువర్ణష్ఠీవిని  బతికించి పోయాడు'
'కథ బాగుంది కానీ బాబాయ్ .. ఇప్పుడా గోల్డుబాబుగాడి గోలింతర్జంటుగా  ఎందుగ్గుర్తుకొచ్చిందో?!’
'ఇవాళ్టి పత్రిక పరీక్షగా చూసుంటే నీకూ ఇట్లాంటి కథే ఇంకోటేదన్నా గుర్తొంచ్చుండేదేమో! అపరాల ధరవరలు ఆకాశాన్నంటుతున్నట్లు.. అవినీతి అధికారుల ఆమ్యాఁమ్యాఁలు కూడా అంగారక గ్రహాని కెగబాకుతున్నాయంట.. వింటంలేదా!'
'పెట్రోలు రేట్లు తగ్గించినట్లే తగ్గించి డీజిలాయిలుమీద దొంగ దెబ్బలు తీస్తే ఎంతధికారులయితే మాత్రం పాప మింకేం చేస్తారు బాబాయ్.. పాపిష్టి పన్లకు  పాల్పడ్డం తప్ప?'
'అందుకేనంటావా పోయినేడాది మన అధికారుల దగ్గర పట్టుబడ్డ అక్రమార్జన  సొమ్ము సిటీ మెట్రో ప్రాజెక్టు  సగం నిధులకు సరిసమానంగా ఉందీ! ఈ లెక్కన ఏ.సి.బి వాళ్లు దాడి చెయ్యని.. చెయ్యలేని.. చెయ్యడానికి మనసొప్పని సొమ్మంతా లెక్క చూస్తే  మన పోలవరం పెంచిన అంచనాలక్కూడా మించుంటుందేమో గదా?! సమాచార హక్కు చట్టాలు, అన్నాహజారేలు అన్నం నీళ్లూ మానేసి దీక్షలకు  దిగడాలు, అవినీతి నిరోధక శాఖల అడుగడుగు నిఘాలు, కాలు కదిపినా చాలు వళ్లు ఝల్లుమనిపించే విజిలెన్సువాళ్లు  ఝళిపించే కొరడాలు, న్యాయస్థానాల మార్కు నిష్పాక్షిక విచారణలు, జనాల చీదరింపులు.. ఎన్ని ముళ్ల కంచెలడ్డంగా ఉన్నా .. ఇదేందిరా 'పచ్చి గడ్డే' పరమాన్నమంత హుషారుగా మన అధికారులిలా చేలల్లోపడ్డ ఆంబోతుల్లా  లంచాలు మేసెయ్యడాలూ?!'
'లంచాలు' ఏంటి బాబాయ్.. మరీ అంత మొరటు పిలుపు? ముడుపులు, నైవేద్యాలు, నజరానాలు, మామూళ్లు, ఫలహారాలు, ప్రసాదాలు,  చాయ్ పానీలు, విరాళాల్లాంటి నాజూకు సహస్రనామాలు వేలకు వేలుంటేనూ! అయినా ఇవాళే ఈ అరాచకాలన్నీ కొత్తగా పుట్టినట్లా తత్తర్లేంటంట? పరగడుపునే భగవంతుడి ముందు బోర్లాపడిపోయి 'నాకిది కావాలి.. వాడికది ఇవ్వద్దం'టూ కోరికల చిట్టా విప్పి.. బదులుగా కొట్టే ముష్టి ' మూడ్రూపాల టెంకాయ' నే మంటారో?! దేవుడంతటి వాడే దేవేరులవారి అనుగ్రహంకోసం పారిజాతపుష్పాన్ని సమర్పించుకోవాల్సొచ్చింది.  రాజులనుగ్రహించే  అగ్రహారాల కోసం కాదా కవులు ఏకాక్షులను సైతం ఏకాంబరులతో కలిపి స్తోత్రపాఠాలు వల్లెవేసిందీ?! భూం పుట్టినప్పట్నుంచే బహుమానాలు పుట్టుకొచ్చాయంటారు  పెద్దలు.  ఆదాము అవ్వలచేత సంసారం చేయించడానిక్కూడా సైతానుకి ఆపిల్ పండు చవుఁరొదిలింది మరి! '
'ఆ లెక్కలిక్కడ కుదరువురా తిక్క సన్నాసీ! జనంచాకిరీ చేయడానికని కదా సర్కారు నెల నెలా జీతభత్యాలు ధారపోస్తునదీ? అదనంగా ఈ 'చాయ్ పానీ'లని గుంజటం అన్యాయ మనిపించడం లేదట్రా నీకూ?'
'నూలు పోగైనా అందకపోతే చందమామక్కూడా వెలుగులందించాలనిపించని  రోజులు బాబాయివి!  ప్రభుత్వందలాలకు బల్లకింది చేతులదో రకమైన అందం చందం. 'ఠంచనుగా బడికి పోరా!' అంటే జీళ్లు కొనుక్కోడానికి  డబ్బులిమ్మంటున్నాడు చడ్డీలేసుకోడంకూడా రాని చంటి కుర్రాడివాళా రేపూ. నోరూ వాయీ లేని మూగ గేదైనా  నోటికింత పచ్చిగడ్డందకపోతే పొదుగుమీద వేలైనా వెయ్యనివ్వదు కదా! నోరున్న మనిషి.. అందునా సర్కారు నౌఖరు. నోరు కుట్టేసుకోమంటే దారం దబ్బనం తెచ్చేసుకుంటాడనే?! ఇన్ని నీతులు వల్లేస్తున్నావ్ గానీ బాబాయ్.. నీ నాలిక్కే ఓ బొట్టు తేనెచుక్క అంటిందనుకో..  చప్పుమని  చప్పరించెయ్యకుండా వుండగలవా? నీళ్లమడుగులో చేపలాంటిది బాబాయ్  అధికార పదవి. తడవకుండా చేపెట్లా ఈతకొట్టలేదో.. డబ్బూ దస్కమంటకుండా  అధికారి కూడా తన ధర్మానికి న్యాయం చెయ్యలేడు.'
'ఆహాఁ! ఎంతమోఘమైనా తర్కం లేవదిసావురా బాబ్జీ! మేతగాళ్లను కూడా ఓ గొప్ప సృజనాత్మక కళకారులుగా ఆవిష్కరించిన తమ ఘనతను మెచ్చుకు తీరాల్సిందే!'
‘నీ మెప్పుల మెడల్సు మెడల్లో వేసుకుని డప్పట్టుకొనూరేగాల్సింది నిజానికి నేను కాదు బాబాయ్! ఇక్కడ నయీం తరహా భాయీలతో కల్సి అందినన్ని రాళ్ళు దండుకునే దండనాయకులు.  అక్కడ నయా నయా ప్రాజెక్టులడొంకల్లో దొరికినన్ని  దోరమగ్గిన పళ్లు పోగేసుకునే  సర్కారు దొరలు!  జీతమెలాగూ  చేతికొచ్చేదే. గీతానికే చేతికళలవసరం. వాటిమీదా నువ్విలా  గీతాబోధనలు సాగిస్తే.. సర్కారువారి దస్త్రాలు ఒక్కంగుళమైనా ముందుక్కదలని మొండి రథాలయిపోతాయ్. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా పన్లెంతో మందకొడిగా సాగే రోజుల్లో.. మన దగ్గర సర్కారు కార్యాలయాలెంత  మందు దుకాణాల్లా కళకళ లాడేవో తెలుసా నీకు? అందుక్కారణం.. ప్రభుత్వం తాలూకు కామందులవారి  క్కావలసినంత మందు- మాకూ అందుతుండటమే! ఆర్థికరంగం పరిపుష్టి సర్కారు నౌకర్ల ‘ముష్టి’ పన్లమీదే ఆధార పడుండేది.’
'బాగుందిరా బాబూ తర్కం! నీ వాలకం చూస్తుంటే.. సర్కారు మార్కు అక్రమార్జనను కూడా ఏ సవరణలైనా చేసి రాజ్యాంగబద్ధం చెయ్యాలనేట్లున్నావుగా?!'
'సందర్భానికి తగ్గ సూచనిచ్చినందుకు నిన్నభినందించకుండా ఉండలేక పోతున్నా బాబాయ్! అక్రామార్జనను సర్కారుద్యోగుల హక్కుగా గుర్తించి తీరాల్సిందే! సిటిజన్ ఛార్టుల్లో మాదిరి ప్రభుత్వ కార్యాలయాల్లో 'ఈ ఫలానా పనికి పైన ఇంత.. ఆ ఫలానా పనికి అడుగునింతింత'ని  రేట్లు ఫిక్స్ చేసేస్తే..  అస్పష్టత తొలగిపోతుంది. అవాయిడబుల్ పోటీలు.. అన్వాంటెడ్  లిటిగేషన్లతో అయే జాప్యం నివారణయిపోతుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారిని గుర్తించి గౌరవిస్తే.. తరువాతొచ్చే తరాలకు   ప్రేరణ కల్పించినట్లవుతుంది. ఆదాయప్పన్ను వెల్లడి పత్రాల్లో  కూడా అదనపు ఆస్తులు ప్రకటించుకునే సంస్కరణలు వెంటనే చేపటాల్సుంది. జీతభత్యాల   తరహాలో గీతభత్యాలమీదా రాయితీలు ప్రకటించాలి. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్సు డిపార్టుమెంటులాంటి అభివృద్ధి నిరోధక శాఖలను వెంటనే రద్దు చేసెయ్యాలి.  ఆ ఆఫీసు కార్యాలయాలను సర్కారుద్యోగుల బేరసారాల కేంద్రాలుగా మార్చాల్సుంది వెంటనే.  ఆవినీతి నిరోధక శాఖ సిబ్బందిని నీతి నిరోధక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం ద్వారా  సమస్యలుత్పన్నం కాకుండా చూసుకోవచ్చు. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే పద్ధతిలోనే అక్రమార్జనలనుకూడా సక్రమార్జనలుగా గుర్తించే పథకాలు వెంటనే చేపట్టాల్సుంది. అధికారులు.. ఉద్యోగులు  నానాగడ్డీ కరిచి పోగేసుకొనే సంపదలను దాచుకొనేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో స్వఛ్ఛంద ప్రకటనలు వచ్చే వరకు నల్లసరుకును  భద్రపరుచుకొనేందుకు సర్కార్లే గిడ్డంగులను నిర్వహించాల్సుంది. ఇసుక తవ్వకాల్లాంటి భారీ ప్రాజెక్టుల్లో పోగైన సొమ్ముకా గిడ్డంగులు చాలని పక్షంలో నేలమాళిగలు ఏర్పాట్ల దిశగా  వెంటనే చర్యలు చేపట్టాల్సుంది. లంచగొండులకు తగినంత ధీమా కలిగిస్తే. విదేశాల్లో మూలిగే మన  సొమ్మంతా స్వదేశానికి తరలొచ్చి జాతివనరుల నిర్మాణంలో తనవంతు నిర్మాణాత్మక పాత్ర తప్పక పోషిస్తుంది. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ మనదేశం నుంచీ కేవలం ఒక్కరడజను మించి పేర్లు కనిపించక పోవడం  సిగ్గుపడే విషయం. నల్లధనానిక్కూడా చట్టబద్ధత కల్పిస్తే ఒక్క మనదేశంనుంచే ఊరికి వకరడజనుకు తగ్గకుండా  కుబేరులు బైటపడ్డం ఖాయం. ఏమంటావ్ బాబాయ్?'
'నా మనసులోని ముచ్చట బైట పెట్టాలంటే నువ్వు నాకూ ముందొక వెయ్యినూటపదహార్లచ్చుకోవాలంటాను. హ్హాఁ.. హ్హాఁ.. హ్హాం!'

‘!..!..!’
-కర్లపాలెం హనుమంతరావు
((ఈనాడు 18, నవంబరు, 2011లోని సంపాదకీయం పుటలో ప్రచురితం-కొద్ది సవరణలతో) 

Saturday, October 22, 2016

వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు- వానికి భుక్తి లేదు


'పొలాలనన్నీ/హలాల దున్నీ/ ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు- కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధారల/తవిలి కురిపించి?' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు? ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయపూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరికుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలు వీస్తాయి. నాగులేటి వాగునీళ్లు కాళ్లు కడుగుతుంటే,
జామకొమ్మ చిలకమ్మ యోగక్షేమాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరుపేరునా పలకరిస్తో పొలం పనుల్లోకి దిగే హలంధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా ప్రస్తుతిస్తాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసిపాపలకుమల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుని మురిసిపోతాడు ఇంకో గేయకవి- సుద్దాల. 'మట్టి దాహంతోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కురవంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనేగదా పాతరలోని పాతగింజకైనా పోయిన ప్రాణం లేచివచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులకు రైతన్న మంత్రసానితనం వల్లనేకదా చల్లంగా సాంత్వన చేకూరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా ఏరి అవతల పారవేయడం, బలుపు తరగకుండ తగు ఎరువు తగిన మోతాదులో అందించడం, తెగులంటకుండ ఆకుమళ్లపై పురుగుమందులు చల్లడం, పురుగు  తగిలిన  ఆకులు గిల్లి పారబోయడం, పశువుకు  కంచెలా.. పక్షికి వడిసెల రాయిలా మారి అహర్నిశలు  కాపుకాయడం!  పంట చేతికి దక్కడమంటే చంక బిడ్డను మీసకట్టు దాకా పెంచడంకన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.
అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ముకున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అదంతా! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమేనా? బిడ్డ ఆకలి తీర్చలేనితల్లి పడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచిమా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/ భోషాణముల్' జాతికి నింపిపెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు/వానికి భుక్తి లేదు' అని కవిజాషువాలాగా ఆర్తిచెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కో కొల్లలు. సింగమనేని నారాయణ అన్నట్లు  నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతీ అన్నదాతా కవులకు స్ఫూర్తిప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి, మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీవలుడు' అనే కర్షకకావ్యాన్నేసృజించారు. శాస్త్రవిజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోతున్నా సాగుదారుడు లేకపోతే బతుకు బండి ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాలనుంచి.. ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాలదాకా..  అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకుల్ని మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగుభారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్య మెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీటమునిగితే తల్లి కెంత కడుపు కోతో, పంట మునిగిన రైతు కంత గుండెకోత. చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటించుకున్నా ప్రభుత్వాలకు పట్టటం లేదు.   గోడలేని పొలాలకు గొళ్లేలు బిగించుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ రాడు. కళ్ళాల దగ్గరేకాదు.. అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ కడవరకూ పోరాడవలసిన కర్ణుడవుతున్నాడు కర్షకుడు. పొలంగుండెలు  తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి.
పంటచేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్ల ముళ్లు బిగుస్తున్నాయి. ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణదాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద?! రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు. వేదికలమీది వాదనలు రైతు లావేదనలు  ఆరుస్తాయా.. తీరుస్తాయా? అన్నదాత కన్నీటికి కావాల్సింది ఇప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొనిపోయే ప్రమాదం ఆట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా/ ఒక్క వాన చుక్కయినా చాలు/ వచ్చే 'కాఱు'కి 'చాలు'లో విత్తేందుకు చారెడు గింజలైనా దక్కేందుకు' అన్నది అన్నదాత ఆశావాదం. ఏ అమాత్యుల వారయినా సభల సాక్షిగా వల్లెవేసే  మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత వాస్తవానికి అదే. 'మూలావర్షం ముంచినా జ్యేష్ఠజల్లు తేలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా కాడి కింద జార్చకుండా బతుకీడవనిస్త్తోంది. నూకలు కతికి బతికే జీవులకు బతుకులు మిగులుస్తోంది.
-కర్లపాలెం హనుమంతరావు
***
Friday, October 21, 2016

రాచకులం కన్నా యాచకులం మిన్న- ఈనాడులో ఒకనాటి వ్యంగ్యంయాచకులు ఎక్కడుంటారో సంపదలు అక్కడ సమృద్ధిగా ఉంటాయంటారు.
భిక్షువులే సుభిక్షానికి ప్రత్యక్ష సూచికలు. కులాల వారీగా అధికారంలో పాలు  దబాయించి మరీ అడుక్కుంటున్న ఈ కాలంలో మా మానాన మేం మౌనంగా 'భిక్షాం.. దేహీ!' అనరుచుకుంటూ తిరుగుతున్నాం. అయినా మా మీదే అందరికీ అనుమానాలు! మాకే ఎందుకో ఇన్నిన్ని అవమానాలు?! పిడికెడు ముష్టికే పాపిష్టి జనాలకి కడివెడంత పుణ్యం సంపాదించి పెట్టడమేనా మేం చేసిన పాపం?
ఆ మాట కొస్తే యాచక భుక్తి భూం పుట్టకముందునుంచీ వస్తున్నదేగా! మా కులదైవం మహాశివుడు ఆది భిక్షువు. ఆ తోలువస్త్రధారి దర్శనంకోసం అలమటించే  భక్తులు సైతం మేం కనిపిస్తే చాలు.. ‘తోలు వలిచేస్తా’మని వెంటబడతారు! సాక్షాత్తూ లక్షీనాథుడై వుండీ  విష్ణుమూర్తి వామనావతారంలో బలిని మూడడుగులు అడుక్కుంటే 'ఆహోఁ! ఏం లీల!' అంటూ ఈలలేస్తారు! మేమేదో మా జానెడు పొట్టకోసం 'భవతీ.. భిక్షాం దేహీ!' అంటూ బజార్న పడితే పెద్ద రాద్ధాంతాలు సిద్ధం చేస్తారు!
ఇంద్రుడినుంచి.. హిరణ్యకశిపుడి వరకు.. దేవదానవులందరూ ఏదో ఓ సందర్భంలో సందు చూసుకొని  చేతులు చాచిన మహానుభావులే కదా! లేనివాడండే అందరికీ లోకువే కానీ.. ఆ దౌర్భాగ్యుడనేవాడే లేకుంటే బలినుంచి.. అంబరీషుడి వరకు.. కర్ణుణ్నుంచి.. దధీచి దాకా 'మహాదాతలనే కీర్తి కిరీటాలు గడించడం సాధించగలిగేవారా? చేతికి ఎముకలేదన్న ఆ ఖ్యాతి మా యాచక వృత్తివల్లనే  కదా సాధ్యమయిందీ?
బిచ్చగాళ్లంటే సర్కారుకైనా లెక్కుండదుకానీ.. నిజాయితీగా గణాంకాలుగానీ సేకరిస్తే  మా యాచ'కుల'దే మెజారిటీ వర్గం.  దామాషా ప్రకారం మా యాచకులే అన్ని చట్టసభల్లోనూ మూడొంతులు మించి ఉండాలి.  ఎన్నికలముందీ  ప్రజాప్రతినిధులంతా మా బిచ్చగాళ్ళ ఓట్లనీ అడుక్కున్న సంగతి అప్పుడే మర్చిపోతే ఎలా?
'అడగనిదే అమ్మైనా పెట్ట'దని మీరే అంటారు.  అడుక్కుంటుంటే 'ఎద్దులా ఉన్నావ్.. ఏదైనా పని చేసుకొని బతకరాదా?' అని ఈసడించుకుంటారు! పంట పొలాలన్నింటినీ కుహనా పరిశ్రమల కప్పనంగా  ధారాదత్తం చేసి ఉన్న దున్నపోతులకీ.. ఎద్దులకే పని.. పాటా లేకుండా చేసారు. మీ మాట విని పాపం ఆ మూగజీవుల నోటికూటిక్కూడా మేం పోటీకి పోనందుకు 'శభాష్' అని భుజం చరిచి మెచ్చుకోడం పోయి ‘శనిగాళ్ల’ని శాపనార్థాలా? చిన్ని కడుపుకోసం మేం పడే పాట్లనిలా చిన్నబుచ్చుతారా? ఎంతన్యాయం?
యాచకత్వాన్నింతగా తక్కువ చేస్తున్నారుగానీ అసలు అడుక్కోవడమెంత గొప్ప కళో ఏ జ్ఞానికైనా తెలుసా? అస్తమానం హస్తిన చూట్టూ కాళ్ళరిగిపోయేట్లు సియం సార్లు ఎన్నేసి సార్లు తిరిగొస్తున్నారు? ఒక్క పథకం.. ప్రాజెక్టు.. నిధి.. నిఖార్సైనది.. ‘ప్రత్యేక హోదా’లో  లేనిది సాధించుకొచ్చారా? ‘పని చేసుకో’మని మాకు ఉచిత సలహాలు దయచేయకుండా మా సలహాలు గానీ చెవినపెట్టుంటే ప్రపంచబ్యాంకునుంచైనా సరే ఎప్పటికీ తీర్చనక్కర్లేని అప్పులు.. కుప్పలు తెప్పలుగా తెచ్చిపడుండేవాళ్ళు కదూ ఇప్పటికే!
పుట్టినప్పట్నుంచీ ముష్టిబొచ్చె పట్టడం తప్ప మరొహటి ఎరగని పరమ వీర ముష్టి చక్రవర్తులు అడుక్కొక అరడజనుకు తగ్గని ఆగర్భ గడ్డ మనది. ఒక్క ముష్టి మేథావి దగ్గరైనా యాచకశాస్త్రంలో సక్రమంగా శిక్షణ ఇప్పించి ఉంటే.. ఉత్తర కొరియావాడి అణుబాంబేంటి.. వాడి బాబు చైనావోడి ‘మేకింగ్ ‘ కళక్కూడా కాపీలు అడుక్కునైనా తెచ్చి పడేసుండే వాళ్ళు కదూ మన  యువనిపుణులు!
పెరటి చెట్లం కాబట్టి మా కళ మీకెందుకూ కొరగాకుండా పోతోంది గానీ.. అమెరికా ఒబామాగారుకూడా మన యాచక నైపుణ్యాన్ని గూర్చి సందర్బం వచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తేస్తుండేవారు.
పంచయితీలని, మండలాలని, జిల్లాలని, మంత్రి పదవులని, మంచి అధికార పదవులని, నిధుల్లో కోటాలని, పనుల్లో వాటాలని.. దేనికో దానికి.. ఎవరో ఒకరు.. ఎప్పుడంటే అప్పుడు.. దేవురించడం అధర్మం కాదు కానీ.. ఏదో రోడ్డువారగానో.. గుడి మెట్లమీదనో.. ఇంటి గుమ్మంలోనో.. ఒదిగొదిగి  నిలబడి 'ఒక్క రూపాయి ధర్మం చేయమ'ని వచ్చే పోయే అమ్మలు.. అయ్యలముందు  మేం చేయి చాపి అడగడంమాత్రం అధర్మం! ఏ రాజ్యాంగంలోని సెక్షన్ల ప్రకారం అడుక్కు తినడం శిక్షార్హమవుతుందో తేల్చాలి!
చదువుకున్న బాబుల్లాగా సర్కారు జాబులిప్పించాలని డిమాండ్లేమన్నా చేస్తున్నామా? డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కావాలని.. రేషను బియ్యం కోటాలు పెంచాలని.. ధరలమాంతం పాతాళానికి దించాలని.. ధర్నాలేమన్నా చేస్తున్నామా? మగపిల్లకాయల మాదిరి ప్రేమించి తీరాలని యాసిడ్ సీసాల్తో ఆడపిల్లలెంట పడుతున్నామా? శనల్లుళ్లకు మల్లే అదనపు కట్నకానుకలు ముట్టకపోతే కట్టుకున్నదనైనా జాల్లేకుండా గేసునూనెతో కాలుస్తామని అల్లర్లు పెడుతున్నామా? ‘చందా’మావఁలకన్నా.. పార్టీ విరాళాలకు వేధించే యములాళ్లకన్నా.. పనులు తెమలాలంటే 'చాయ్.. పానీ'ల సంగేతేంటని నిలదీసే అవినీతివంతులకన్నా.. చీటికి మాటికి చీకటి మాటున తోటి తల్లులనైనా చూడకుండా ‘చీరలిప్ప’మని చికాకులేమన్నా పెడుతున్నామా? 'మాదా కబళం తల్లీ!' అంటూ మర్యాదపుర్వకంగానే కదా మా దారిన మేం  ఇంటి గుమ్మాలముందు గంటలకొద్దీ నిలబడుతున్నాం?
గొంతెత్తి అరవడం, గొప్పలు చెప్పడం , ఇచ్చకాలు పోవడం, భట్రాజులకు మల్లే  స్తోత్రాలు చదవడం.. యాచకుల నీచలక్షణాలని వెనకటి కెవరో మహానుభావుడు యాచకగుణాన్నిగూర్చి నిర్వచించాడంట! మంచిది. ఆ కొలమానం ప్రకారం చూసుకొన్నా కాన్డబ్బులకోసం జోలట్టుకు తిరిగే మా కుచేలజాతికన్నా ముందుచ్చోది నిత్యం రాజకీయాల్లో నలిగే పెద్దమనుషులేనంటే చిన్నబుచ్చుకోకూడదు మరి!
'సాధు మేధానిధి' అనే శతకంలో పుష్పగిరి అమ్మన అనే పెద్ద పండితుడు - ప్రపంచంలో బిల్ గేట్స్ బికారిలాగాను..  బికారి బిర్లా తాతలాగానూ మారువేషాల్లో తిరుగుతూ మాయ చేస్తుంటారని కుండబద్దలు కొట్టేసాడు. ఏ మాయలు మంత్రాల జోలికి పోకుండా కేవలం పొట్టకూటి కింత ముద్ద కోసం మాత్రమే జోలె పట్టుకొని తిరిగే మేమే ఎన్ని అవమానాలైనా భరించే అమాయకులం.
ఏ అమెరికానుంచి అధ్యక్షులవారో.. బ్రిక్స్  దేశాల్నుంచీ అధినేతలో   వ్యాపారొప్పందాలు అడుక్కునేందుకు  మన దేశానికి ఎప్పుడూ వచ్చి పోతుంటారు.  ఎప్పుడు పడితే అప్పుడు మమ్మల్ని వీధుల్లో కనిపించకుండా దాచేయాలనుకోడం..  చిన్నగాళ్లమనేనా పెద్దబిచ్చగాళ్లముందు మా కిన్నేసి అవమానాలు?! ధర్మం కాదు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు 24 అక్టోబరు, 2009 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం- చిన్ని సవరణలతో)

 (ఈనాడు యాఅమాన్యానికి- కార్టూనిష్టు శ్రిధర్ గారికి ధన్యవాదాలతో)

Monday, October 10, 2016

గురువు.. దేవుడూ ఒకేసారి కనిపిస్తే..?

'
గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. 
యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు.
'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు.
గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.
అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం
ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది.
 మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.
అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు
కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు.
సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.
చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.
క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు.
అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.
కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే!
మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.
పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష.
గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు.
జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు.
'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.
బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన
విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.
'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు,
గాయత్రి ఉపదేశించినవాడు,
వేదాధ్యయనం చేయించినవాడు,
శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,
పురోగతి కోరేవాడు,
మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు,
మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,
మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.
దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
- కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, o5-o9-2009)

వార్తా వ్యాఖ్య-1 - సి.సి. కెమేరాలు

సి సి కెమేరాలు అంటే క్లోజ్డ్ సర్క్యూట్ కెమేరాలు. నిజానికి ఇవి సర్వ సాక్షి ధర్మాన్ని నిర్వహించే ఆధునిక యంత్రాలు. 'అంతటా ఉండి.. అన్నీ గమనిస్తుంటాడు దేవుడు' అని భక్తుల విశ్వాసం. అదెంత వరకు నిజమో .. చర్చనీయాంశం.  ఆ వాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే ఆ నమ్మకాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించే అమాయకులు దైవభీతితో అయినా కొన్ని దుష్ట కార్యాలను ప్రయివేటుగానైనా చేసేందుకు జంకే అవకాశం కద్దు. సమాజానికి  మేలు కలిగే వరకు సి సి కెమేరాల ఉనికికి  అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు కూడా.
అభివృద్ధి చెందిన దేశాల్లొ సి సి కెమేరాలే నిఘా వ్యవహారాల్లో అధిక శాతం మానవ ప్రమేయాన్ని తగ్గిస్తున్నాయి. అమెరికా వీధుల్లో అడుగడుగునా ఈ నిఘా కెమేరాలు  కళ్లు విప్పార్చుకొని చూస్తుంటాయి రాత్రింబవళ్ళు. రోడ్డుమీద పోలీసుల ఉనికి ఆట్టే కనిపించక పోయినా .. ట్రాఫిక్ రూల్సు కాస్తంత ఉల్లంఘించినా ట్రాఫిక్ వ్యవస్థనుంచి తాఖీదులు రావడం.. కోరితే  వాటికి సంబంధించిన  సె. సి. కెమేరాల క్లిప్పింగులూ జత చేసుండటం వల్ల తప్పు చేసిన వారికి తప్పించుకొనే మార్గాంతరం తోచదు. అక్కడి నేర శిక్షా స్మృతులూ  సి సి క్లిప్పింగులను ముఖ్యమైన అధికారిక సాక్ష్యంగా అంగీకరిస్తాయి. కాబట్టి దోషికి జరిమానాలు చెల్లించక తప్పని పరిస్థితి. సి సి కెమేరాలకు మనుషులకు మల్లే రాగ ద్వేషాలు ఉండవు. కాబట్టి.. తప్పు పోలీసు వ్యవస్థనుంచి జరిగినా నిస్సంకోచంగా ఎత్తి చూపిస్తాయి. ఆ భయం వల్ల కూడా అమాయకులమీద అన్యాయంగా నేరారోపణలు చేసేందుకు జంకుతారు పోలీసులు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ సి సి కెమేరాలు క్రియాశీలకంగా తమ పనిచేసుకుంటున్నాయి.  నిత్యానందస్వామి రాసలీలలనుంచి..  'నోటుకి ఓటు వ్యవహారం' వరకు సి సి కెమేరాల పాత్ర ఎంతటిదో  వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టి యం లలో దూరి రొక్కం దొంగతనం చేసేవాళ్లు.. బంగారం దుకాణాల్లో దూరి  బెదిరించి సరుకు కొల్లగొట్టేవాళ్ల పాలిటి సింహస్వప్నం సి సి కెమేరా. ఇది నాణేనికి ఒక కోణం. రెండో కోణం నుంచి చూస్తే జరుగుతున్న అపాకారాలు ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలు దుస్తులు మార్చుకొనే  వ్యక్తిగత ప్రదేశాలలో, బసచేసే హోటళ్లలో దొంగతనంగా పెట్టిన కెమేరాల మూలకంగా అసాంఘిక శక్తులకు మరింత శక్తినిచ్చినట్లు అవుతున్నది. ఎంతో మంది అమాయకులు ఈ సి సి కెమేరాల వలల్లో చిక్కి విలవిలలాడడం.. పరువుకి భయపడి ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతున్నది. సి సి కెమేరా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పండు కోసుకున్నట్లే.. గుండెల్నీ చీల్చవచ్చు. ఉపయోగించే వాడి మనస్తత్వంమీద అదంతా ఆధారపడి ఉంటుంది.
తెలంగాణా రాష్ట్రం భూముల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇప్పుడు సి సి కెమేరాలు ఉపయోగించే ఆలోచన చేసున్నది ప్రభుత్వం. ఒకే సందర్భంలో ఒకే వ్యక్తి పేరుమీద ఒకటికి మించి రిజిస్ట్రేషన్లు జరపించడం, నకిలీ
 వ్యక్తుల ద్వారా పత్రాలమీద సంతకాలు చేయించడం, కార్యాలయాలకు ఆవల భూముల రిజిస్ట్రేషన్లు లోపాయికారీగా జరిగిపోవడం.. వంటి ఇంకా ఎన్నో చట్టబాహ్యమైన వ్యవహారాలకు సి సి కెమేరాల ప్రయోగంతో చెక్ పెట్టినట్లవుతుంది. కాకపోతే ఈ
సి సి కెమేరా ప్రయోగంకూడా దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్ట గలిగేది.
ఈ దేశం అత్యున్నతంగా భావించే రాజ్యాంగ వ్యవ్యస్థల్లో ఒకటైన పార్లమెంటు సభాప్రాంగణంలోనే.. ఒక అత్యంత విశాలమైన రాష్ట్రాన్ని రెండుగా విభజించే రాజ్యాంగ నిర్వహణ  సందర్భక్రమాన్ని  దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూసేందుకు
సి సి కెమేరాల అవకాశం కల్పిస్తున్నా.. వాటి కన్ను కప్పిన క్షణాలను మనం మర్చిపోకూడదు.
-కర్లపాలెం హనుమంతరావు
10-10-2016


    

Friday, October 7, 2016

కథానికః మా తెలుగుతల్లికి మల్లెపూదండ!- రచన మాస పత్రికలో ప్రచురితం


విద్యారణ్య- 
అన్ని రకాల హైటెక్ హంగులతో నేను నడుపుతున్న విద్యాసంస్థ అది. ర్యాంకులు పండించే విద్యాక్షేత్రంలో మా సంస్థ స్థానం మొదటినుంచి మొదటి మూడింటిలో ఒకటి. శాశ్వతంగా మొదటిస్థానంలోనే స్థిరపడాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో భాగంగానే ప్రపంచస్థాయి గుర్తింపున్న 'జీనియస్' గ్రూపుతో 'టై అప్' అవ్వాలని వ్యూహం. ఆ ప్రయత్నాలన్నీ ఓ కొలిక్కి వచ్చి ఇప్పుడు చివరిదశకు చేరుకొన్నాం. ఇంకో గంటలో జరగబోయే సాంస్కృతిక ప్రదర్శనల్లోకూడా మా ప్రత్యేకత నిరూపించుకుంటే.. ఇహనుంచి నగరంలో మా విద్యారణ్యదే ప్రప్రథమ స్థానం.

కల్చరల్ ఈవెంట్ ఇన్-చార్జ్ మిసెస్ కపర్దీది ఓ ప్రసిద్ధ విద్యాసంస్థకు చెందిన  ప్రధానోపాధ్యాయురాలి హోదాలో దాదాపు ముఫ్ఫైఏళ్ల అనుభవం. అక్కడ పదవీ విరమణ అయిన వెంటనే ఇక్కడకు రప్పించాను పెద్ద జీతంతో! ఆమె గత సంబధాలమూలకంగానే 'జీనియస్' దృష్టిలో మా సంస్థ పడగలిగింది. నిలబడగలిగింది.
గ్రీన్-రూంలో మిసెస్ కపర్దీ విద్యార్థులకు చివరి హచ్చరికలు జారీ చేస్తున్నది. పదో తరగతి పిల్లలు హేమ్లెట్ ప్లేలెట్, దిగువ తరగతులవాళ్ళు బెంగాలీ రవీంద్రగీత్, పంజాబీ భాంగ్రా, ఒరియా ఒడిస్సీ.. అందరికన్నా ముందు కిండర్ గార్టెన్ పసిమొగ్గలతో వందేమాతరం! అన్నీ చక్కగా అమిరినట్లే కదంబంలో పూలవరసలా!
కార్యక్రమం పర్యవేక్షణకొచ్చిన బృందంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో జాతీయస్థాయిలో నిష్ణాతులు. శ్యాంలీలా పర్షాద్, మాతంగి రమణ, బిజయ్ మిశ్రో, మదన్ లాల్ కథేరియా, దివిజశర్మ. దివిజశర్మకు మాత్రమే కొద్దిగా తెలుగు భాషతో పరిచయం. తెలుగు తెలిసినవారు లేకపోవడం నిజానికి ఒక అనుకూలమైన అంశం. ఒక తెలుగువాడు మరో తెలుగువాడిని ఎక్కిరానీయడన్న సామెత మనకుండనే ఉందిగదా! అదీ నా బాధ!
తెర లేచింది. 'వందేమాతరం' అద్భుతంగా పేలింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం మిసెస్ కపర్దీ చేసిన ఆంగ్ల ప్రసంగమూ అంతే 'ఇంప్రెసివ్'! పావుగంట బాలే, అరగంట ఆంగ్ల నాటిక. హిందీ గీతమాలిక జరుగుతున్న సమయంలో దివిజశర్మ వచ్చింది.' మావాళ్లు మీ తెలుగు ప్రోగ్రామ్సు చూడాలనుకొంటున్నారు. ఇంటర్మిషన్ తరువాత అవే అరేంజి చేయండి! ఒక గంట చూస్తాం' అంది.
నా గుండెల్లో రాయి పడింది. కార్పొరేట్ కల్చర్ కదా! హిందీ, ఇంగ్లీష్ లాంటివాటిమీద మాత్రమే మోజుంటుందని అనుకొన్నాం!
''ఫైవ్ ఆర్ టెన్ మినిట్సు అంటే ఏదో మేనేజ్ చేయగలంగానీ.. ఇప్పటికిప్పుడు గంటపాటు తెలుగు ప్రోగ్రామంటే ఎలా సార్?!' అని నాకే ఎదురు ప్రశ్న వేసింది మిసెస్ కపర్దీ!
'ఏదో ఒకటి మేనేజ్ చేయండి మ్యాడమ్! నెక్స్ట్ ప్రోగ్రాం మాత్రం తెలుగులోనే ఉండాలి. ఏం చేస్తారో .. మీ ఇష్టం!' అని చెప్పి  నా ఛాంబరుకి వచ్చేసాను.
వచ్చానన్నమాటేగానీ.. మనసు మనసులో లేదు. పర్యవేక్షక బృందం ఏదో ఆంతరంగిక చర్చల్లో ఉంది.. లంచ్ చేస్తూనే! వాళ్ల మధ్యలో దూరడం మర్యాదకాదు గనక కాఫీ  నా చాంబరుకి కాఫీ తెప్పించుకొని తాగుతూ కూర్చున్నాను. ఆరు దశాబ్దాల కిందట బెనారస్ యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పటి సంఘటన గుర్తుకొచ్చింది.
అవి నేను ఎమ్మెస్సీలో ఫిజిక్సు చేసే రోజులు. అన్ని భాషలవాళ్లకి మల్లేనే తెలుగువాళ్ళకీ ఒక ప్రత్యేకమైన మెస్సు ఉండేది. ఓ చలికాలం ఆదివారం మధ్యాహ్నం. భోజనం లాగించి ఆరుబైట బండలమీద వెచ్చదనంకోసం కూర్చొని ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం తెలుగు విద్యార్థులం.
ఒక పొట్టి మనిషి. నుదుట పట్టెనామాలు. ముతక పంచె.. లాల్చీ.  చేతిసంచీ ఊపుకొంటో  మా మధ్యకొచ్చి నిలబడి 'మీరంతా తెలుగు పిల్లలే కదుటోయ్! నాకో పని చేసి పెట్టాలి. ఓ గంటపాటు నేనో ఉపస్యాసం ఇచ్చిపోతా.  తెలుగు తెలిసినవాళ్లందర్నీ  వెంటనే పోగేయాలి!' అన్నాడు!
'ఈయనెవడ్రా బాబూ! పిలవని పేరంటానికొచ్చిందికాక.. ఉపన్యాసాలిస్తానంటున్నాడు!' అని మాకు ఒకటే ఆశ్చర్యం. మా బృందనాయకుడు సుబ్బరాజుకి మొహమాటం తక్కువ. పొట్టిమనిషి మొహంమీదే 'తమరెవరు మహానుభావా?' అంటూ   వెటకారంగా వెళ్ళబోసాడు.
పొట్టాయన ఆ వెటకారాన్నేమాత్రం పట్టించుకోలేదు. 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ!' పాట ఎప్పుడన్నా విన్నారుటోయ్? ఆ గీతాన్ని రాసింది నేనే!' అనేసాడు.
ఇండియాకు స్వాతంత్ర్యంవచ్చి అప్పటికి నిండా పదేళ్ళుకూడా నిండలేదు. జనంలో ఇంకా దేశభక్తి ఇప్పట్లా పూర్తిగా ఇంకిపోని కాలం. 'మా తెలుగుతల్లి' పాట చాలా సార్లు వినివుండటంచేత మా ఎదురుగా నిలబడి ఉన్నది శంకరంబాడి సుందరాచారిగారని తెలుసుకొన్నాం. అమాంతం గౌరవం పెరిగిపోయింది. సుబ్బరాజూ అందుకు మినహాయింపు కాదు. స్వరంలోని మునుపటి దురుసుతనం తగ్గించుకొని ‘ఇప్పటికిప్పుడు జనాలని పొగేయాలంటే ఎలా సార్?' అని నసిగాడు.'సరేలేవోయ్! రేపు నాలుగ్గంటలకి పెట్టుకోండి. నేను నేరుగా మీ మీటింగుహాలుకే వచ్చేస్తా!' అంటూ చేతిసంచి ఊపుకొంటూ మాయమైపోయారు శకరంబాడి సుందరాచారిగారు.
తెలుగు సంఘం ఎన్నికలు ఎలాగూ దగ్గరపడుతున్నాయి. ఈ వంకతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఎన్నికల్లో అది తనకు ఉపయోగపడుతుందని సుబ్బరాజు ఎత్తుగడ. వాడి పూనికతో భారీగానే పోగయ్యారు జనం.
నాలుగ్గంటలకు అనుకొన్న కార్యక్రమం ఆరుగంటలగ్గానీ మొదలవలేదు. ఆలస్యానికి కారణం సుందరాచారిగారే! ఆలస్యానికి క్షమాపణలైనా అడగలేదు. వచ్చీ రాగానే మైకు అందుకోబాయారు. 'ఇప్పుడు మొదలైతే ఎప్పటికయ్యేను? ఇంకో రెండు గంటలయితే మెస్సుకూడా మూసేస్తారు!' అంటూ సుబ్బరాజు బిగ్గరగానే గొణుకుడు.
విన్నారులాగుంది పెద్దాయన 'తిండికోసం వెంపర్లాడేవాళ్ళకోసం కాదు నా ప్రసంగం. ఇష్టం లేనివాళ్ళు నిక్షేపంగా వెళ్ళిపోవచ్చు.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా!' అంటూ మైకందుకొన్నారు.
ఆద్యంతం ఆయన ఉపన్యాసం సాగిన తీరు అత్యద్భుతం. తెలుగుభాష విశిష్టతనుగూర్చి సాగిన ఆ ప్రసంగం ఓ రసగంగాప్రవాహం. తలమునకలా ఆ గంగలో తడిసి ముద్దవని తెలుగువాడు లేడు.
తొలిఝాములో వినిపించే కోడికూతలనుంచి పొద్దుపోయిన తరువాత వీధుల్లో సంచరించే కుక్కల అరుపులదాకా.. ఆయన అనుకరించని జీవజాలం లేదు. పల్లెజీవనంలోని తెలుగుదనం కమ్మదనం సుందరాచారిగారి స్వరంలో ఆవిష్కరణ అయిన వైనం మామూలు మాటల్లో వర్ణించనలవి కానిది.
తొలిసంజె వెలుగుల్లో ఇంటిగుమ్మాలముందు  రంగవల్లులు తీరుస్తూ ఇంతులు పాడుకొనే పాటలు, కోడికూతతో లేచి పొలంబాట పట్టే రైతన్నలు ఆలమందలని అదిలించుకొంటూ తీసుకొనే కూనిరాగాలు, అత్తాకోడళ్ళు, వదినామరదళ్ళు రోటిపోటుల దగ్గర ఆడిపోసుకొనే సరదా సూటిపోటు పాటలు, పెద్దపండుగ సంబరాల్లో వీధివీధీ తిరిగే హరిదాసయ్యల చిందులు,  ఇంటిల్లిపాదిని ఆశీర్వదించిగాని పక్కగుమ్మం తొక్కని గంగిరెద్దుల ఆటలు.. శంకరాచారిగారి గొంతులోనుంచి అలా అలా జాలువారుతుంటే మెస్సు భోజనం సంగతి ఇంకేం గుర్తుకొస్తుందెవరికైనా?! 'తప్పయిపోయింది స్వామీ! క్షమించండి' అంటూ సుబ్బరాజే చివరికి చేతులు జోడించాల్సి వచ్చింది. అంతకన్నా తమాషా ఆయన అవేవీ పట్టించుకోకుండా అప్యాయంగా సుబ్బరాజును అక్కున చేర్చుకోవడం!
మెస్సువాళ్లూ సభలోనే ఉండిపోవడంతో అందరికీ ఉపవాస బాధ తప్పిందనుకోండి ఆఖరికి!
ఆ రాత్రంతా సుందరాచారిగారు మా హాస్టలుగదిలోనే బస చేసారు. ఉపన్యాసం ఎంత ఉదాత్తంగా ఉందో.. ఆ పూట ఆయన చెప్పిన మాటలు అంతకన్నా ఉత్తేజకరంగా ఉన్నాయి. 'తేనెలొలికే తెలుగుభాష సౌందర్యాన్ని వివరించి చెప్పడం నా బోటి వామనుడికి తలకుమించిన పని. అయినా కాని, చేతకాదని చేతులు ముడుచుకొని మూల వదిగే మనస్తత్వం కాదు నాది.  కాబట్టే చేతనైనంతలో అమ్మభాష కమ్మదనాన్ని నేల నాలుగుచరగులా ప్రచారం చేయడానికి పూనుకొన్నది.' అంటో చేతిసంచిలోనుంచి కొన్ని పుస్తకాలని తీసి పంచిపెట్టారు మాకందరికీ! అదృష్టంకొద్దీ నాకూ ఒక పుస్తకం దక్కింది సుందరాచారిగారు స్వహస్తాలతో  చేసిన సంతకంతో సహా! ఆ నాటి ఆ పల్లెపదాల పుస్తకం  ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.
పండిత పామర జనరంజకంగా తెలుగుభాషా సౌందర్యాన్ని పుస్తకరూపంలో ప్రచురించాలని సుందరాచారిగారి ఆశయంట. అందుకోసం ఓ అయిదంచల ప్రణాళిక సిద్ధంచేసుకొని  ఆర్థికవ్యవహారాలను చక్కబెట్టుకొనే ఉద్దేశంతో పెద్దలందరిని కలుస్తున్నారుట. అప్పట్లో హస్తినలో పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యక్షపదవిలో ఉన్నారు. 'ఆయన్ని కలసి తిరిగి వెళుతూ ‘తెలుగు పిల్లలు మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. తెలుగు ఎక్కడుంటే నేనక్కడ ఉండాలన్నది  నా ఆకాంక్ష. తెలుగును ఎవరన్నా చిన్నచూపుచూస్తే నాకు తిక్కరేగుతుంది. వేల ఏళ్ళ చరిత్రగల మన తెలుగు ఇతర భాషల ధాష్టీకంవల్ల నష్టపోరాదన్నదే నా పంతం' అని చెప్పుకొచ్చారాయన.. ఆ రాత్రంతా నిద్రమానుకొని.. మమ్మల్నీ నిద్ర పోనీయకుండా!
'ఇప్పటి నా కష్టాన్నికూడా గట్టెక్కించడానికి రాకూడదా గురువుగారూ!' అనిపించింది నాకు ఆ క్షణంలో. మరుక్షణంలోనే నా పిచ్చి ఊహకు నవ్వూ వచ్చింది. ఎక్కడో ఓ కంఠం ఖంగున మోగుతుంటే ఈ లోకంలోకొచ్చి పడ్డాను.
'అదే గొంతు! అదే వాగ్ధార! శంకరంబాడి సుందరాచారిగారిది! ఇక్కడికి ఎందుకొస్తారు? ఎలా వస్తారు? నా భ్రమ కాకపోతే!' లేచి ఛాంబర్ బైటికి వచ్చాను.
వేదికమీద మైకుముందు కార్యక్రమాలకని ఏర్పాటుచేసిన అలంకరణ విద్యుద్దీపాల వెలుగులో సుందరాచారిగారు కంచుకంఠంతో ఉపన్యాసం దంచేస్తున్నారు.. తెలుగులో! తెలుగురాని పర్యవేక్షకబృందంకూడా మంత్రముగ్ధమయినట్లు వింటోంది! కనురెప్ప కొట్టడంకూడా మర్చిపోయేటంతగా కనికట్టు చేసున్నది ఆ మాట.. పాట.. ఆట!
మధ్య మధ్యలో ఆంగ్లపదాలతో.. హిందీపదప్రయోగాలతో.. సంస్కృతశ్లోక భూయిష్టంగా తెలుగుభాష ఔన్నత్యాన్నిగూర్చి ఆయన చేసేప్రసంగం అచ్చు శంకరంబాడిగారి శైలిలోనే ఉద్వేగంగా ఉరకలేస్తోంది!
'మంచి ప్రసంగం!' అంటూ మధ్యలో దివిజశర్మ లేచొచ్చి నన్ను అభినందించడంతో ఫలితం సగం తెలిసిపోయినట్లయింది.
శంకరాచారిగారి ఉపన్యాసంలోని చాలా అంశాలు నాకే చురకలు అంటించే విధంగా ఉన్నాయి. '
నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు' అని రాసిన పలకలు పసిపిల్లల మెడల్లో వేయడంకన్నా అమానుషం మరోటుందా? మాతృభాష ప్రాముఖ్యం తెలీని మూర్ఖులు చేసే వికృత చేష్టలవి. పసిబిడ్డల్ని తల్లిభాషనుంచి వేరుచేయాలనుకోవడం తల్లినుంచి వేరుచేయడమంత పాపం. పరిసరాలనుంచి సహజసిద్దంగా అబ్బేసంపద తల్లిభాషద్వారా అందే విజ్ఞానం. దానికి దూరమయే బిడ్డడు భాగ్యవంతుడు ఎలా అవుతాడు? బాల్యంలో అమ్మభాష సాయంతో లోకాన్ని అర్థంచేసుకొన్నవాడే ఎదిగివచ్చిన తరువాత  కొత్తభాషల సారాన్ని జుర్రుకొనేది.  భాషావేత్తలనుంచి, మానసిక శాస్త్రవేత్తలదాకా అందరూ నిర్ధారిస్తున్న సత్యం ఇదే! ఇహ తెలుగుకి వద్దాం! ఇటాలియన్ భాషకి మల్లే పదం చివర హఠాత్తుగా విరగని మంచిగుణం తెలుగుకి వరం. వేదాలు ఆదిలో తెలుగులోనే ఉన్నాయని ఊహించడానికి ఈ సంగీతగుణమే కారణం. ఏ భాషాపదాన్నయినా తల్లి బిడ్డను పొదువుకొన్నట్లు పొదువుకోగలదు తెలుగుభాష. సంగీతంలోని ఏ శబ్దానికైనా తెలుగంత సమీపంలోకి  రాగల ద్రావిడభాష మరొకటి లేదు. కంప్యూటర్లో వాడే బైట్స్(bytes) పరిజ్ఞానానికి తెలుగంత అనుకూలత ఆంగ్లానిక్కూడా లేదని ఏనాడో 'సైన్స్య్ టు డే' లాంటి వైజ్ఞానిక పత్రికలు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించాయి. జనం నాలికలమీద సహజంగా పలికే భాషలో చెబితేనే ఏ విషయమైనా చొచ్చుకుపోవడం సులభమవుతుంది.  క్రైస్తవమత ప్రచారకులనుంచి, శైవమత ప్రచారకులవరకు అర్థమయిన ఈ విషయం మన తెలుగునవనాగరీకులకే ఎందుకో తలకెక్కడం లేదు! ఆంగ్లం పట్టుబడకపోతే నేటి పోటీప్రపంచం ధాటికి తట్టుకోవడం కష్టమని తల్లిదండ్రుల భయం. ఆ భయం అర్థం చేసుకోదగ్గదే! కానీ.. అందుకోసం బిడ్డ కడుపులో పడ్డనాటినుంచే ఏబిసిడిలు తప్ప మరోటి ‘అనరాదు.. వినరాదు.. కనరాదు' అని ఆంక్షలు విధించడమే విడ్డూరం! వసతో పాటు ఆంగ్లాన్ని రంగరించి పోయాలన్న తల్లిదండ్రుల ఆత్రం  చూస్తే నవ్వొస్తోంది. కోపమూ వస్తోంది. అభివృద్ధికి ఆంగ్లానికి ముడిపెట్టేవాళ్ళు చైనా, రష్యాల్లాంటి దేశాల ప్రగతికి ఏం సమాధానం చెబుతారు?! సొంతభాషంటే సొంత ఉనికిని చాటే ప్రకటన, తమిళుడికి తమిళమంటే ప్రేమ. కన్నడిగుడికి కన్నడమంటే ప్రాణం. మరాఠీవాడికి మల్లే మనమూ మనభాషను ఠీవీకి దర్పణంగా ఎందుకు భావించమో అర్థంకాదు! పిల్లల క్కాదు.. ముందు బుద్ధి రావాల్సింది పెద్దలకి, తల్లిదండ్రులకి, విద్యావేత్తలకి! ముఖ్యంగా  ఈ తెలుగుగడ్డమీద! ఆముక్క చెప్పిపోదామనే నేనిక్కడదాకా వచ్చింది' అంటుంటే హాలు హాలంతా కరతాళ ద్వనులతో మిన్నుముట్టింది.
'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చిన వాళ్ళలో పర్యవేక్షక బృందమూ ఉంది.
*                              *                      *


'జీనియస్'సంస్ఠ నగరఫ్రాంచైసీ మా 'విద్యారణ్య'కే దక్కిందని వేరే చెప్పవల్సిన పని లేదనుకొంటా.
అరవైఏళ్ళ కిందట పిలవని పేరంటానికి వచ్చి మమ్మల్నంతా మంత్రముగ్ధుల్నిచేసారు శంకరంబాడి సుందరాచారిగారు.  మళ్ళీ అదే తరహా మాయాజాలంచేసి మమ్మల్ని గట్టెక్కించి పోవడానికి రావడం ఎలా సంభవం?!
ఎవరు పిలిచారని ఇక్కడిదాకా వచ్చి తెలుగు ఔన్నత్యంతో పాటు  అవసరాన్ని గురించీ కుండబద్దలు కొట్టినట్లు!
వేదికమీద ప్రసంగంచేసిన సుందరాచారిగారు సుందరాచారిగారు కాదు. ఆయన శిష్యపరమాణువులాంటి రామాచారిగారుట! గంటపాటు తెలుగుకార్యక్రమం సమర్పించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు   మిసెస్ కపర్దీకి ఠక్కుమని గుర్తుకొచ్చిన ఆపద్భాంధవుడు ఆయన. మిసెస్ కపర్దీ పూర్వం పనిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యాయుడు. పిల్లలకి ఆంగ్లపాఠాలు చెబుతూనే తెలుగుభాష గొప్పతనాన్ని గురించీ కథలు, పాటలు, పద్యాలు చెబుతుండేవాడుట! ఆ విషయమై యాజమాన్యంతో గొడవలైతే  ఉద్యోగం వదులుకోవడానిక్కూడా సిద్ధపడ్డాడుట! ‘పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు  ఆంగ్ల, తెలుగు సజ్జెక్టుల్లో  తర్ఫీదు ఇచ్చే ఏదో కోచింగు సెంటర్లో అత్తెసరు జీతానికి  పొట్టపోసుకొంటున్నాడు ప్రస్తుతం’ అని మిసెస్ కపర్దీ వివరించింది.
రామాచారిగారు చేసిన ఉపకారానికి తృణమో ఫణమో ఇద్దామనుకొన్నాను. తృణంలాగే తృణీకరించాడా సాయాన్ని! ఫణంగా కోరిన కోర్కె మాత్రం విచిత్రమైనది. 'మీ ఉదయంపూట ప్రార్థనల్లో  'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' పాట పాడించండి చాలు! అలాగైనా పిల్లలకు ‘మన తెలుగుభాషం’టూ ఒకటుందని మన్నన ఉంటుంది' అనేసాడు.
ఆ పని  ఎటూ నేను చేయాలనుకొన్నదే!
పాఠ్యప్రణాళికతో నిమిత్తం లేకపోయినా  మాతృభాషను కనీసం ఐదు తరగతులవరకైనా ఐచ్చికంగా నేర్చుకోవడానికి సిద్దపడ్డ పిల్లలకే  మా విద్యారణ్యలో ప్రవేశం. ఆ నిబంధన విధించడానికి అంగీకరించిన తరువాతే జీనియస్ సంస్థ మాతో టై-అప్ అవడానికి సిద్ధపడింది. .
‘తెలుగు విభాగానికి రామాచారిగారినే బాధ్యులని చేస్తే సరి. సుందరాచారిగారే మన మధ్య మసలుతున్నట్లుంది గదా సార్!’ అని సలహా ఇచ్చింది మిసెస్ కపర్దీ.
మంచి సూచన. ‘తెలుగు ఎక్కడ ఉంటుందో తనక్కడ ఉండాలన్న గురువుగారి ఆకాంక్షా నెరవేర్చినట్లుంటుంది’ అనిపించింది నాకు.
'అది సరి కాదేమో సార్! సుందరాచారిగారిలాంటి వాళ్ళెక్కడ ఉంటే అక్కడ మాత్రమే తెలుగు వినబడే పరిస్థితి వచ్చిందేమో!' అన్నాడు రామాచారిగారు ఆ తరువాత కలిసినప్పుడు!
కాదనగలమా!
-కర్లపాలెం హనుమంతరావు
మా 'తెలుగు తల్లి' గీతం వినాలనుకొనేవారికోసం ఈ లంకెః
https://youtu.be/uNE4RJ36ONU

***

(రచన మాస పత్రిక అక్టోబర్, 2016  సంచికలో ప్రచురితం)