Wednesday, September 30, 2015

రాజకీయాల్లేని రోజు- సరదా గల్పిక


'దేవుడు కనబడి 'నీకేం కావాలో కోరుకోరా.. భడవా!' అనడిగితే తడుముకోకుండా మనమడిగే మొదటి వరమేంటో తెలుసా మాధవా?'
'ఏంటో?'
'యాంటీ పొలిటికల్ వర్ల్డ్'
'అంటే?'
'ప్రపంచంలో పాలిటిక్సు అనే మాటంటూ లేకుండా పోవడటం' అన్నాడు మా మాజీ మేజర్ పోతురాజు మామయ్య.
మంటెక్కినప్పుడల్లా ఆయనా మాటంటం  మామూలే!
రాజకీయాలంటూ లేకుంటే ఈ లీడర్లూ, ప్లీడర్లూ, పార్టీలూ, పార్లమెంటులూ.. ఎన్నికలూ హడవుడీ.. అంతా ఎమైపోయేట్లు!
ఆ మాటే అడిగా.
'పోనీ ఒక్కరోజన్నా ఈ పాడు రాజకీయాలు లేకుండా ఉండలేముట్రా?' అనడిగాడు దీనంగా.
'అపొలిటికల్ డే అసలు సాధ్యమేనా మామయ్యా?'
'గాంధీగారి జయంతికో.. వర్ధంతికో.. మా సందులోని మందుదుకాణాలన్నీ బందుచేయడంలేదుట్రా! అలాగే ఇదీ సాధ్యమే!'
'మద్యవ్యతిరేక దినోత్సవంనాడు ఎంతమంది నిజంగా  మందు మానేస్తున్నారూ? ముందురోజే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు!' టీ తెచ్చిచ్చిన మా అత్తయ్య సందుచూసుకొని అధిక్షేపించింది.
'ధిక్కారమా!' అన్నట్లు హూంకరించాడు మామయ్య 'పాయింటిప్పుడు  లీడర్లును గురించా? లిక్కర్ని గురించా?'
మేజర్ మామయ్య మాజీ అయింతరువాత సర్కారిచ్చిన స్థలంలో ఫామ్ హౌస్ పెట్టాలని మోజు పెంచుకున్నాడు. 'రిక్షాపుల్లర్ని ముందుపెట్టుకొని 'పదేళ్లబట్టీ ఈడిక్కడే గుడిసేసుకొని కాపురముంటున్నాడు. లా  ప్రకారం పట్టా వీడిదే' అంటూ పులయ్యనొకణ్ణి అడ్డంపెటుకొని ఓ పట్టాన స్థలం ఖాళీ చేయడంలా  ఆ పేట రౌడీ. వాడికి ఏరియా ఎంఎల్యే  ఏడుకొండలుగారి అండదండలు దండిగా ఉన్నాయ్!
మామయ్య తమ్ముడు శరభరాజు సెలవమీదొచ్చినప్పుడు జిల్లామంత్రిగారిని కలిసి దండేసి దండం పెట్టుకొచ్చాడు. ప్లాన్ సాంక్షన్ దగ్గర్నుంచి, డీవియేషన్సు అప్రూవల్వరకు అన్నిపనులు దగ్గరుండి మరీ అయినాయనిపించుకొని  'ఇదిగో! ఈ బోరు పనిమాత్రం నువ్వేచూసుకోవాలన్నయ్యా! సెలవులు పొడిగించడం కుదరదు' అని తిరిగి వెళ్ళిపోయాడు.
మిలటరీ మామయ్య ముక్కుసూటి మనిషి. ఆయన భారీగా బోరుకొట్టే తీరుచూసి చుట్టుపక్కల కాలనీ జనాలు చుట్టుముట్టేసారు. వందడుగులమించి కిందకు దిగితే ఊరుకోబోమని వార్నింగ్!
 ఆ మర్నాడు మార్నింగే మామయ్య వెళ్లి ముఖ్యమంత్రిగారిని కలిస్తే 'కోడి ఎలా గుడ్డు పెట్టాలో గంటసేపు లెక్చరు దంచి.. ఆ విధంగా మనం ముందుకు పోదాం! జై జన్మభూమి' అని చక్కా లేచివెళ్ళిపోయాట్ట! అందుకే  ఇప్పుడీ  రాజకీయాలమీదిలా మా మామయ్య మండిపాట్లు! 'ప్లేటో మహాశయుడు ఏ పూట ఈ రాజకీయాలను కనిపెట్టాడోగానీ.. ప్లేటు తిప్పేవాళ్ళుమాత్రం పేట పేటకో పటాలం తయారవుతున్నదం'టూ!
ప్లేటోకన్నా ముందున్న మనపురాణాల్లో మాత్రం  రాజకీయాల్లేవా! గణాధిపత్యానికి పోటీ పెడితే వినాయకుడు అమ్మానాన్నలచూట్టూ ప్రదక్షిణాలనే ఉపాయం కనిపెట్టి మరీ కాకాయిజానికి శ్రీకారం చుట్టాడు. మహాభారతంలో శ్రీకృష్ణులవారలా నడిపించిందంతా రాజకీయం కాక మరేవిటో! వేళచూసి గోడదూకబట్టేగా విభీషణుడికి  లంకానగరం దక్కింది! తలొంచినవాణ్ణి పాతాళానికి తొక్కేసే తంత్రం బలికాలంనుంచే చలామణీలో ఉందికదా! బోళాశంకరులకు హాలాహలమే దక్కేది. సత్యహరిశ్చంద్రుళ్ళా నిష్టగా నీలిగితే  జీవితమంతా కష్టాలే కష్టాలని.. కాన్వెంట్లకెళ్లే  పిలగాళ్ళుకూడా గుర్తుపట్టే కలికాలం కదా ఇది! రాజకీయాలొద్దే వద్దని పోతురాజు మామయ్యిలా పేద్ద పేద్ద సిద్ధాంతాలు చేస్తే మాత్రం అవంత  సులువుగా రద్దపోయేవా!
పాలిటిక్సే లేకుంటే ఇరవైనాలుఘ్ఘంటల వార్తాఛానళ్లకు నోళ్ళు పడిపోవూ!  పేపర్లేమైపోతాయి!  పరగడుపునే పేపరువాసన ముక్కుకి సోకాలి.. మా పక్కింటి పాపారావుకు. లేకుంటే కక్కసుకైనా చక్కాపోలేడు!
'పాయింటిప్పుడు పేపర్లు.. టీవీలను గురించా? రాజకీయాల్ని గురించా? 'యాంటీ పొలిటిక్సు వల్ల ఏంటీ ప్రయోజనం?' అనడిగావు కదూ! బోలెడన్నిరా! ఐపిల్ మోదీ ఒక్కరోజులో దొరికిపోతాడు. రాముడు రహీము పక్కపక్కనే క్షేమంగా ఉంటారు.  నక్సలైట్లు మిగిల్చిన మందుగుండుతో దీపావళి పండగ బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు. ఢిల్లీచౌకులోకూడా బంగళాలు బంగాళాదుంపలకన్నా కారుచౌకగా కొనుక్కోవచ్చు. చవితికి చందాదందాలు చేసేవాళ్ళు కలికానిక్కూడా కనిపించరు. కనిపించినా ఇచ్చిన అరకాణీకే  పడీపడీ దండాలుపెట్టి మరీ పోతారు. వెంకయ్యనాయుడింక సంపూర్ణంగా సినిమాల్లోకొచ్చేయచ్చు. ఎస్వీ రంగారావెటూ లేని లోటొకటుండేడ్చిందికదా! ఒలంపిక్సుకెళ్ళిపోయి మన వై యస్ జగన్  మారథాన్లో మంచిరికార్డు సొంతం చేసుకోవచ్చు. కరుణానిధిగారించక్కా సినిమా కథలు రాసుకోవచ్చు. పశువులకు గడ్డీ గాదం పుష్కలంగా దొరుకుతుంది. ఇసుక  నెత్తిన పోసుకొనేంతగా కుప్పలు పోగేసుకోవచ్చు. టీవీలకు కాస్తంత ఊపిరి సలిపేందుకైనా రాజకీయాలకో రోజు సెలవియ్యాల్సిందేరా అబ్బీ!'
పోతురాజు మామయ్యలా పట్టాలు తప్పిన బండిలా దూసుకుపోతుంటే.. అత్తయ్యొచ్చి భర్తకు వంతలందుకొంది 'వాజపేయిగారా రోజుల్లో ఒక్కపార్లమెంటులో మాత్రమే కవిత్వం వినిపించేవారు పాపం తీరిక దొరక్క.  పాలిటిక్సుకో పూటైనా విరామముండుంటే రంజైన  ఓ షాయిరీల సంకలనం జాతికి దక్కుండేది! అద్వానీగారి రథమీమధ్యేదో మూలబడిందని వింటున్నాం. స్వచ్చందంగా ఆయనే సెలవులు పుచ్చేసుకొని మళ్ళా రోడ్డెక్కితే అడ్డేదెవరంట! మైకు కంపెనీలన్నా మళ్లా పుంజుకొంటాయి! మెగాస్టార్లకి పక్క చూపులతో పనుండదు. ఖద్దరు కంపెనీలకు గిరాకీలసలుండవు. అటు సియం  చంద్రబాబు ఏ సింగపూరు కంపెనీకో ఇంచక్కా సిఇవో షిఫ్టైపోవచ్చు. ఒక్క ఫాం హౌసుకే మీ మామయ్య ఎన్ని పొర్లుదండాలు పెడుతున్నాడో చూస్తున్నావుగా మాధవా! ఈ వయసులో చంద్రబాబుకి కొత్త రాజధాని కట్టే నెత్తినెప్పెందుకు చెప్పు! ఫామ్ హౌసేదో కొనుక్కొని చంద్రశేఖర్రావుసారు ఆ మధ్యలో  ఎకరాకి లక్షరూపాయలు మిగులుసాగు చేసి చూపించాడు గదా! అన్నదాతలెంతోమంది కళ్ళముందే కూలిపోతున్నారు.. వాళ్ళింకా  పిట్టల్లా రాలకుండా చిట్కా ఏదైనా కనిపెట్టే సావకాశం  సారుకి దొరికుతుందబ్బాయ్ ఈ  రాజకీయాలకు  కనీసం కొన్నాళ్లైనా విరామం ప్రకటిస్తే. పాలిటిక్సుకి సెలవలవసరం ఎంతుంటుందో చిన్నాడైనా ఆ రాహుల్బాబు  పసిగట్టేసాడు. మోదీసాబులా పద్దస్తమానం క్షణం తీరికలేకుండా పరాయి దేశాలక్కూడా పోయి రాజకీయాలు చేస్తుంటే జనాలకిక గుక్కతిప్పుకొనే వ్యవధానం ఎక్కడుంటుందిరా!'
మొన్నటి సీజన్లో చట్టసభలో రెచ్చిపోయిన సుష్మాస్వరాజమ్మను మించి ధాటీగా అత్తమ్మలా పాలిటిక్సునుగూర్చి దడ్దడలాడించేస్తుంటే నోరెళ్లబెట్టడం నా వంతయింది.
'అంతెందుకబ్బాయ్ అసలు! రాజకీయాలకొక్కరోజు సెలవిచ్చేసుకొన్నా ఉగ్రవాదమిట్టే పల్చబడిపోదూ! తుపాకులన్నీ తుప్పుపట్టిపోవూ! అంతెందుకు! అసలు మీ మామయ్యలాంటి మిలటరీవాళ్లవసరమే ఉండదు. సెలవులిచ్చేసి ఇంటికెళ్లి వంటా వార్పూ చూసుకోమంటారు!' అంటూ గాలిని మామయ్యమీదకు మళ్లించేసరికి మాజీ మేజరుగారికి ఒళ్ళు మండింది.
ఆయనా ఏదో ఎదురుదాడికి దిగేవేళకి.. భగవంతుడొచ్చి కాపాడినట్లు..  బైటనుంచి ఏవో.. పెద్దపెద్ద పెడబొబ్బలు!
అందరం కంగారుగా అటువైపు పరుగులు తీసాం.
'పిల్లాడు కనబడ్డం లేద'ని పుల్లయ్యపెళ్లాం ఘొల్లుమంటోంది. తవ్వుతున్న బోరుబావిలో జారిపడటం కళ్లారా చూసామన్నారెవరో!  బోరుమన్నారు పుల్లయ్య దంపతులు.
ఎవరు పిలిచారో.. ఆగమేఘాలమీద సర్కారు రిగ్గులొచ్చి పడ్డాయి! ఊరంతా దగ్గరుండి మరీ బోరులోపలకు లోతుగా తవ్వించి మరీ చూశారు.
వందేంటి! నాలుగొందల అడుగుల లోతుకు పోయినా నరపురుగు ఆనవాలు కనబడితేనా!
జలపడిందాకా ఆగి.. 'పిల్లాడు సెల్లార్లో పడి నిద్రపోతున్నాడ'ని తెచ్చిచ్చాడు పేటరౌడీ!
సర్వే జనా సుఖినోభవన్తు!
పిల్లాడు కళ్లబడినందుకు పుల్లయ్య దంపతులు హ్యాపీ! పోతురాజు  మామయ్య సంతోషంగా ఇచ్చిన  పదివేలు పుచ్చుకొని ఆ తెల్లారే గుడిసె ఖాళీ చేసి వెళ్లిపోయాడు రిక్షాపుల్లర్ పుల్లయ్య!
రెండు మూడు  లక్షలు పోస్తేనేగాని పూర్వవని బోరుపని.. ఉచితంగా.. గంటల్లో..  అదీ కాలనీజనాల ఆమోదంతో  జరిగినందుకు పోతురాజు మామయ్యా హ్యాపీ!

'లోకల్  ఎలక్షన్లేవో వస్తున్నాయటగా! మన ఇలాకాలోని  పవిత్రమైన ఓట్లన్నీ పేటరౌడీ 'బోరుపంపు' గుర్తుకే వేయిస్తానని మాట ఇచ్చానన్నయ్యా.. ఏరియా ఎంఎల్యేగారికి. బోరు ఖర్చులో ఆదా అయిన సొమ్ములో సగం వినాయకచవితి సంబరాలకని చందాలకోసం ఆయన తాలూకు మనుషులొస్తారు.  నసగుళ్లేమీ పెట్టుకోకుండా  ఇవ్వడం మర్చిపోవద్దు!' అంటూ శరభరాజు తమ్ముడు కబురు చేసినప్పుడుగాని తెలిసిరాలేదు రాజకీయాల మహత్యం అంటే ఏమిటో పోతురాజు మామయ్యకి!
'రంగు రుచి వాసనా లేని రాజకీయాలవల్ల అన్నీ నష్టాలే' అంటూ రోజూ  తెగ తిట్టిపోసే పోతురాజు మామయ్య  ప్రస్తుతం వార్డు మెంబరుగా నిలబడితే ఎలాగుంటుందా!' అని తెగ లెక్కల్లో మునిగితేలుతున్నాడు!
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాల పత్రిక లాఫింగ్ గ్యాస్ కాలమ్- అక్టోబర్ సంచికలో ప్రచురితం)


Tuesday, September 22, 2015

ఆతిథ్యం- కథానిక- అచ్చంగా తెలుగులో ప్రచురితం


చిత్రం 'అచ్చంగా తెలుగు' అంతర్జాల పత్రిక సౌజన్యంతో
నాగపూర్ స్టేషన్లో రైలు దిగేసరికి సాయంత్రం నాలుగయింది. చలికాలం కావడంవల్ల అప్పుడే నీడలు పొడుగ్గా సాగుతున్నాయి.
రాష్ట్రం సరిహద్దులు దాటడం నాకిదే మొదటిసారి. 'బొడ్డూడని పిల్లలు కూడా పొలోమని ఉద్యోగాల కోసం, చదువుల కోసం విమానాలెక్కి దేశాలుపట్టి పోతుంటే పక్కనున్న రాష్ట్రం పోవడానికి పస్తాయిస్తావా?' అని మామయ్య ఎద్దేవా చేస్తుంటే పౌరుషం ముంచుకొచ్చి ఈ సాహస యాత్రకు సిద్ధపడ్డా.
నిజానికి మా ఊళ్ళో నాకు ఇల్లూ, ఆఫీసూ .. దారిలో నా అవసరాలకు సంబంధించిన షాపులతో తప్ప వేరే  పరిచయాలే లేవు. 'మీ అమ్మ బిడియం నీకు వచ్చి పడిందే! ఆ కాలం కాబట్టి ఆడవాళ్లకి సరిపోయింది.. 'ఉద్యోగాలు చేస్తాం.. ఊళ్లేలుతాం.. మగాళ్ళకన్నా మేం మాత్రం ఎందులో తక్కువ?' అని మహా గొప్పలు పోతున్నారుగా ఈ మధ్య మీ ఆడంగులు! ఏదీ మరి చూపించు నీ తెగువ.. భారతనారీ!' అని మా మామయ్యే..  నేనెక్కడ భయంకొద్దీ వచ్చిన ప్రొమోషన్ని వదులుకుంటానోనని మరీ మరీ రెచ్చగొట్టి పంపించాడీ నాగపూరుకి.
సిండికేట్ బ్యాంకులో క్లర్కుద్యోగం ఇప్పటిదాకా. ఆడపిల్లనని, ఇంకా పెళ్లి కాలేదన్న మిషతో  ఎట్లాగో మా బెజవాడలోనే బండిని నెట్టుకొచ్చానిన్నాళ్ళూ. ఇప్పుడొచ్చిన ఆఫీసరు పోస్టును ఏక్సెప్ట్ చేయాలంటే ఔటాఫ్ స్టేట్ పోస్టింగునీ రూలు ప్రకారం ఒప్పుకు తీరాల్సిందే.
'ఫస్టు పోస్టింగే పక్క రాష్ట్రంలో రావడం.. మీరు చాలా లక్కీ! వదులుకోవద్దు!' అని ఎక్కబెట్టారంతా ఆఫీసులో కొలీగ్సు. పక్క సీటు ప్రసాదుగారైతే నా అవస్థ చూసి 'నాగపూరులో మా అక్కా వాళ్ళుంటారు. మా బావగారు అక్కడ డిఫెన్సులో సీనియర్ ఎక్కౌంటెంటు. ఎకామిడేషన్ ప్రాబ్లం వాళ్ళు సాల్వు చేస్తార్లేండి! మనం మాట్లాడదాం' అంటూ నా ముందే అన్ని వివరాలూ చెప్పి ఫలానా తారీఖున ఫలానా బండికి వస్తున్నది.  స్టేషనుకొచ్చి రిసీవ్ చేసుకోవడం మర్చి పోవద్దు' అని ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పాడు కూడా. అన్నింటికి 'ఓకే.. ఓకే' అంటూ భరోసా ఇచ్చిన పెద్దమనిషి.. ఇప్పుడు అయిపూ ఆజా లేకుండా పోయాడు!
బండి దిగి అరగంటయింది. ముందుగా అనుకున్న ప్రకారం నా ఫోటో కూడా మెసేజికి ఎటాచ్ చేసి పంపించాడు ప్రసాదుగారు. గుర్తుపట్టలేక తిరిగి పోవడానికి ఆస్కారమే లేదు.
అక్కడికీ ప్రసాదుగారు ఇచ్చిన ఆ బావగారి సెల్ నెంబరుకి అరడజను సార్లు కాల్ చేసాను.  ఒక్క సారీ లిఫ్టు చేయలేదు.. వూరికే రింగవడం తప్ప.
ఇహ తప్పక చివరికి ప్రసాదుగారికే ఫోను చేయాల్సి వచ్చింది. మూడో పిలుపుకి గానీ లైన్లోకి రాలేదా మహానుభావుడూనూ. 'సారీ! శ్యామల గారూ! మా బ్రదరిన్లాగారి మదర్ అనుకోకుండా పోయారుట రాత్రి. ఉన్నఫళంగా ఫ్యామిలీ అంతా తెనాలి వెళ్ళిపోయారు. జర్నీలో ఉండటం వల్లనుకుంటా సిగ్నల్స్ సరిగ్గా అందక మీకు రెస్పాండవక పోవడం. ఐ యామ్ ఎక్స్ ట్రీమ్లీ సారీ!' అనేసాడు.
'సారీ' సంగతి ఆనక. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ బ్రదరిన్లాగారి భరోసామీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేసుకోకుండా బైలుదేరాను. సరే! ఇహ తప్పేదేముంది? దగ్గర్లో ఉన్న ఏదైనా ఓ హోటల్లో దిగి రేపు భ్యాంకులో జాయినయినాక అప్పటి పరిస్థితుల్నిబట్టి షిఫ్టింగు సంగతి అలోచించుకోవచ్చు.
చలిగాలికి తోడు బైట వర్షమూ మొదలయింది. రెండు సూటుకేసులు.. ఒక షోల్డరు బ్యాగు. ఒక్కత్తినే ఎలాగో తంటాలు పడుతూ స్టేషను బైటికి రాగానే ఆటోవాళ్ళు గండుఈగల్లా మూగి రొద చేయడం మొదలు పెట్టారు. మరాఠీలో కొందరైతే.. హిందీ.. ఇంగ్లీషు తుంపుడు ముక్కల్తో కొందరు. 'ముందు వీళ్ళ వేధింపుల్నుంచి తప్పించుకుని  బైటపడటమెలాగురా భగవంతుడా!' అనేటట్లుంది అక్కడి వాతావరణం.
అప్పుడు వచ్చాడు దేవుడిలాగా ఆ పెద్దమనిషి. మూడొంతుల బట్టతల, నల్లగా నిగనిగలాడే నుదురు. కొబ్బరి చవురు రాసుకున్నట్లుంది మొహమంతా! తెల్లటి దుస్తుల్లో ఉన్నాడు. నడికారు వయసు దాటుతుందేమో! పిలవకుండానే దగ్గరికొచ్చాడు. 'తెలుంగువాళ్ళేనా? ఫ్రమ్ విజయవాడా?' అని పలకరించాడు. నా జవాబుకోసం ఎదురుచూడకుండానే ముందు ఆ ఆటో గండుఈగల్ని తరిమేశాడు.
క్వశ్చన్ మార్కు మొహంతో నిలబడ్డ నన్ను చూసి 'అట్లా ఆశ్చర్యపోకండి మ్యాడమ్ గారూ! మీ యాసనుబట్టి కనిపెట్టేసా.ఇందాకట్నుంచీ మీరదేపనిగా ఫోన్లో మాట్లాడుతున్నారు కదా! గుర్తు పట్టేసా. ఇదేమంత గొప్ప విషయం? చిత్తూరు సైడు 'తట్ట' అంటే ఒంగోలు సైడు 'కంచం' అంటారుగదా తినే పళ్లేన్ని. అట్లాంటి విద్యే అనుకోండి నాదీనూ. దేశం నాలుగు చెరగులా నాలుగు రోజులు చెడతిరిగొస్తే సరి 'రాం.. రాం'కీ 'వణక్కా'నికీ ఒకే అర్థం అని తెలిసొస్తుంది.  బై ది బై.. మై నేమీజ్ రామసుబ్బు. ఆరిజన్ కేరళ. ఖైతాన్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా దేశం మొత్తం ఒక సారి కాదు.. ఏడాదికొకసారి చెడతిరిగాను. తిరిగి చెడ్డానేమో కూడా! మీ బెజవాడలో బస్టాండు దగ్గరున్న మమత హోటల్నుంచి..  గాంధీనగర్ సందులో ఉండే మడత మంచాలు అద్దెకిచ్చే ప్రశాంత్ లాడ్జింగుదాకా అన్నీ నాకు కొట్టిన పిండే!' అంటూ తనమానాన తాను టివీ యాంకర్లను మించిన జోరుతో చెప్పుకుపోతున్నాడు. 'స్మాల్ కమర్షియల్ బ్రేక్' కోసం ఎదురుచూస్తూ నిలబడ్డమే నా వంతయింది.
నా అవస్థ గమనించినట్లున్నాడు. 'సారీ! కాస్త ఓవరయిందనిపిస్తుందనుకుంటా మీకు.కానీ అవసరమే మ్యాడమ్ జీ ఒక్కోసారి. మీ తీరు ఎప్పట్నుంచో గమనిస్తున్నా. ఫ్లాట్ ఫామ్మీద ఈ బరువులు మోసుకుంటూ ఎవరికోసమో గంటల తరబడి విఫల వైయిటింగు చేస్తున్నారే గానీ.. అప్పాయింటుమెంటిచ్చిన ఆ హోస్టుగారెవరో హ్యాండిచ్చాడని నిర్థారణకు రాలేకపోయారు. చొరవ లేకపోవడమంటే ఇదే మరి! సారీ! ఫర్ ది కామెంట్! మా అమ్మాయిదీ డిటో క్యారెక్టరే! అందుకనే మిమ్మల్నీ తేలిగ్గా గుర్తు పట్టగలిగా! పదిమాటలకొక మాటైనా జవాబు రాని మీలాంటి వారినుంచి మినిమమ్ నాలుగు మాటలు రాబట్టాలంటే ఎన్నొందల రకాలుగా మాట్లాడాలి!' చురుక్కుమని కాలింది నాకు. ముక్కూ మొగం తెలీని మనిషితో మాట్లాడే తీరిదేనా! నేనేంటో నాకే సరిగ్గా తెలీదు. చూసి అరగంటైనా కాలేదు. అప్పుడే నా మెంటాలిటీని గురించి లెక్చర్లిస్తున్నాడు మహా! ఎవరిచ్చారీ పెద్దమనిషికీ అధికారం?
నా ఆలోచనల్నప్పుడే చదివేసినట్లు న్నాడు. 'సారీ!ఐ డోంట్ మీనిట్! మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్లున్నారు.  హెల్ప్ చెయ్యాలన్నదే నా ఉద్దేశం. మే ఐ హెల్ప్ యూ!'
ఎంత విచిత్రమైన మనిషి! హెల్ప్ చేస్తానన్న మనిషి మాటమాత్రమైనా చెప్పకుండా చెయ్యిచ్చి పోయాడు ఒక వైపు! ముక్కూ మొగం కూడా ఎరగని వాళ్ళని పట్టుకుని హెల్ప్  చేస్తానని వెంటబడుతునాడింకో మనిషి మరో వైపు!  ఏమై ఉంటుంది ఇందులో ఇతగాడి వ్యూహం?  ఏ లాభం లేకుండా ఎవరైనా సాయం చేయడానికి ముందుకొస్తారా ఈ రోజుల్లో?  ఒంటరి ఆడపిల్లనని పసిగట్టేసాడా?
ఊళ్ళు చెడతిరిగానంటున్నాడుగా! సొంత ఊళ్ళో మంచి లాడ్జింగేదో తెలిసే ఉండాలి. ఆ వివరాలు చెప్పించుకుని వదిలించుకోవడం మంచి దనపించింది. అదే అడిగాను. 'లాడ్జింగులకేం మ్యాడమ్! నన్ను కట్టుకుని పోయేటన్ని! సెంట్రల్ ఇండియా కదా! టూరిస్టుల తాకిడి జాస్తీనే! రిజర్వేషను లేకుండా మంచి హోటల్సు దొరకడం కష్టం. ఓవర్ బ్రిడ్జి దాటి గాంధీబాగ్ లోకి వెళితే కాస్ట్లీ హోటల్సున్నాయి. ఓ మాదిరివి కావాలంటే చుట్టూ తిరిగి మార్కెట్ ఏరియాలో వెదకాలి. మంచివే దొరుకుతాయని గ్యారంటీ లేదు. మీ వాలకం చూస్తుంటే సత్యహరిశ్చంద్రుడిక్కూడా దుర్భుద్ధి పుట్టేటట్లుంది. సారీ! మీరేమనుకోక పోతే నాదో ఆఫర్! ఇక్కడికి దగ్గర్లోనే మా ఇల్లుంది. హోటలంత సౌకర్యాలుండక పోవచ్చుగానీ.. ఒకటి రెండు పూటల వరకు ఓకే! వచ్చేయండి మ్యాడమ్! వానలో.. కొత్త చోట్లో.. చీకట్లో.. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇట్లా అసహాయంగా ఆట్టేసేపు నిలబడటం .. జనాల కంటబడ్డం .. మంచిది కాదు. మా ఊరి సంగతి తెలిసి చెబుతున్నా. మా అమ్మాయి   మరేదన్నా ఊళ్లో ఇట్లాంటి పొజిషన్లో చిక్కుకున్నప్పుడు ఏం సహాయం కావాలని కోరుకుంటానో.. అదే నేనూ మీకు ఆఫర్ చేస్తున్నది! వచ్చీ రాని భాషతో కంతిరి ఆటోవాళ్ళను నమ్ముకుని ఎక్కడ బడితే అక్కడ దిగేకన్నా.. ఇదే మంచిది! కాస్త రిలాక్సయిన తరువాత ఏం చేయాలో రేప్పొద్దున తీరిగ్గా ఆలోచించుకుందురుగానీ! ముందు పదండి!' అనేసాడు.
ఆశ్చర్యం! నిజంగా అత్యాశ్చర్యమే! మధ్యలో వాళ్లమ్మాయిని గూర్చి  ఆ రెండు ముక్కలుగాని అనక పోయుంటే ఈ పెద్దమనిషితో ఈ రోజు నిజంగానే నాకు పెద్ద దెబ్బలాటయి ఉండేదే! ఓ వంక కామెంట్ సు  చేస్తున్నాడు. మరో వంకనుంచి హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడు! ఎట్లా అర్థం చేసుకోవాలీ సిట్యుయేషన్ని? ఈ మనిషి మంచి స్థితిలో ఉన్నట్లేనా?
నా అనుమానాలు నన్ను పీకుతూనే ఉన్నాయి. నా అనుమతి లేకుండా ఎప్పుడు పెట్టించాడో.. సగం లగేజి అప్పుడే అక్కడే ఉన్న ట్యాక్సీలో సర్దించేసాడు! ఆలస్యం చేస్తే నా సామానుతో సహా ఉడాయించినా ఉడాయించేయచ్చు.
ఎటూ పాలుపోక మిగతా సామానుతో సహా ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నాను.'చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం!' అన్న తెగింపూ వచ్చేసింది విచిత్రంగా!
'మీ డౌటూ అర్థం చేసుకోదగ్గదే! ఇవిగోండి నా వివరాలు. సెల్ ఫోన్ నెంబరుతో సహా అన్నీ ఉన్నాయి. ఈ విజిటింగు కార్డు దగ్గరుంచుకోండి! అంతగా అవసరమనిపిస్తే పోలీసు కంప్లెయింటుకి పనిక్ వస్తుంది.. ట్యాక్సీ నెంబరు కూడా నోట్ చేసానందులో! ఉంచుకోండి' అంటూ బలవంతంగా ఓ విజిటింగు కార్డు నా చేతిలో ఉంచాడు. ఇంకేమాలోచించగలం ఇంత నిజాయితీ ప్రదర్శిస్తుంటే!
ట్యాక్సీలో మాటల మధ్యలో నేనిట్లా బ్యాంకులో ఆఫీసరుగా జాయినవడానికని వచ్చినట్లు పసిగట్టాడు. 'ఈ కాలంలో అందరూ ఇంజనీర్లూ.. సాఫ్టువేర్లూ అంటూ కలవరిస్తున్నారు.సొంతగడ్డను వదులుకొని పరాయి పంచన చేరైనా సరే నాలుగు రాళ్ళు ఎక్కువ గడించడానికే పేరెంట్ సూ ప్రోత్సహిస్తున్నారు.అనింటికీ భిన్నంగా మీరిట్లా మతృదేశాన్నీ, మాతృభాషని నమ్ముకుని ఉండటం చాలా ముచ్చటేస్తోంది. మీ తల్లిదండ్రులకు నిండుమనస్సుతో నమస్కారం చేయాలనిపిస్తోంది' ఇట్లా సాగుతోంది ఆయన మాటల ధోరణి. ఇన్ని మంచి విషయాలు మాట్లాడే అతనిలో దురాలోచనలు ఉంటాయంటే నమ్మలేం!
'నాగపూర్ చాలా కామ్ సిటీ. ముంబై వెస్టుసైడులాగా కాదు. రేపు  బ్యాంకులో జాయినయి ఎకామిడేషన్ ఎరేంజయినదాకా ..మీరు మా ఇంట్లోనే ఉండవచ్చు. మా శ్రీమతి కూడా ఊళ్లో లేదు. వాళ్ల పిన్నిగారు పోయారని బెనారస్ వెళ్ళింది. పదిరోజులదాకా రాదు'
‘అంటే ఈయనగారు తీసుకెళ్లే ఆ ఇంట్లో ఆడవాళ్లెవరూ లేరనేగా అర్థం! ఎంత చల్లగా చెబుతున్నాడూ ఇప్పుడీ వార్త!
'మీ భయం అర్థమైందిలేండి మ్యాడమ్' అని చిన్నగా నవ్వాడు రామసుబ్బు. మా శ్రీమతి లేదన్నానుగాని మా పనివాళ్ళు లేరన్నానా! ఇల్లు చూసుకునేందుకు రెడ్డి, వాడి పెళ్ళాం ఎప్పుడూ అక్కడే హాజరు. మనం వీధులు పట్టుకునిలా బలాదూర్లు తిరుగుతుంటామని మా ఆవిడగారు చేసిన ఏర్పాట్లు లేండవి' అన్నాడు. మనసు కుదుట బడింది. అనవసరమైన అనుమానమేగానీ రామసుబ్బుగారి ఆహ్వానంలో కల్మషమేమీ లేదు.
ట్యాక్సీ ఆగిన ఇల్లు మరీ చిన్నదేమీ కాదు.'ఈయన తన్నుగూర్చి తాను చెప్పుకున్నది చాలా తక్కువ.' అనిపించింది.. ఇంటిముందు లాన్.. కారు గ్యారేజ్.. వగైరా ఆర్భాటం చూసిన తరువాత.
ట్యాక్సీకి బాడుగ తనే ఇచ్చేసాడు నేను పర్శు తీసే లోపలే. ‘చివర్లో చూసుకుందాంలేండి ఆ లెక్కలన్నీ. కొత్త చోట్లో సరిపడ్డంత క్యాష్ దగ్గరుండటం అవసరం. అచ్చంగా ఈ ప్లాస్తిక్ కార్డుల్ని నమ్ముకుంటే ఒక్కోసారి ఇబ్బందెదురవచ్చు' అని సలహా. నా కన్నా ముందు నా లగేజీని లోపలకి చేరవేయడంలో ట్యాక్సీ మనిషికి సాయం చేసాడు.
జేబులోనుండి తాళం గుత్తి తీసి అలవాటుగా ఓ కీ తో డోర్ అన్ లాక్ చేసి.. ఆదరాబాదరాగా లోపలికి పరుగెత్తికెళ్ళి వచ్చాడు.'అలారం సిస్టం ఉంది. తాళం తీసిన రెండు నిమిషాల్లో దాన్ని డిజార్మ్ చేయకపోతే సైరన్ ఎలర్టు మొదలవుతుంది. ఏంటో అంతా చాదస్తం! ఇన్నేసి జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగే అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి’ అన్నాడు రామసుబ్బు నవ్వుతూ. నవ్వు ఆయన ట్రేడ్ మార్కనుకుంటా.
ఇంట్లో మనిషి అలికిడి లేకపోయినా ఇల్లు మాత్రం  చాలా పరిశుభ్రంగా ఉంది! 'రెడ్డీ!.. రెడ్డీ!'అంటూ రెండు మూడుసార్లు గావుకేకలేసాడు. సమాధానం లేదు.  సా'యమ్మా!.. సాయమ్మా!' మళ్లీ కేకలు. నో రెస్పాన్సు. 'వాడెక్కడో తాగి తొంగునుంటాడు. అదను చూసుకుని ఇది ఏ సినిమాకో చెక్కేసి ఉంటుంది. వీళ్లమీద మా  ఆవిడగారికి మా చెడ్డ భరోసా!' అని ఎద్దేవా చేస్తూ 'మీ సామానంతా ఇక్కడే కింద గదిలో వేసుకుని లాక్ చేసుకోండి మ్యాడమ్ గారూ! కీ మీదగ్గరే ఉంచుకోండి!' అంటూ తనే లగేజీని ఓ మూలగదిలో సర్దేసి తాళం వేసేసాడు. కీ నా చేతిలో పెట్టేసాడు.
స్నానాల గది పైన ఉంది. నా షోల్డరు బ్యాగు ఓపెన్ చేస్తుంటే 'అవన్నీ ఇప్పుడెందుకు బైటికి తీయడం? ఉండనీయండి.. ఒక పూటకే గదా!'అంటూ ఇస్త్రీ చేసిన పొడి టవల్సును అందించాడు.
'ఏ మాత్రం భేషజంలేని మనిషి. ఈ కాలంలోకూడా ఇలాంటి వాళ్ళుంటారా!' అనిపించింది.
స్నానాలవీ ముగించుకుని వచ్చే లోగానే.. ఎప్పుడు ఆర్డరు చేసి తెప్పించాడో.. డైనింగు టేబుల్ మీద ఇద్దరికీ భోజనాలు రడీ. అనుపాకాలు హోటలువే ఐనా కూరలో కారం ఎక్కువైనందుకు, పప్పులో ఉప్పు లేనందుకు తను నొచ్చుకున్నాడు.'ఇంట్లో వాళ్ళుండు ఉంటే మీ కీ ఇబ్బంది ఉండేది కాదు' అని ఆయన బాధపడుతుంటే సముదాయించడం నా వంతయింది.
అప్పటికే రామసుబ్బును గురించి ఆశ్చర్యపోవడం మానేసాను. ఎన్నింటికని నోరు వెళ్లబెట్టను! జరిగేదంతా ఆస్వాదించడానికే ప్రిపేరయి ఉన్నాను.
ప్రసాదుగారి బావగారివల్ల ఏర్పడ్డ ఇబ్బంది ఇలా ఎక్కడినుంచో ఊడిపడ్డ రామసుబ్బుగారి అదరణతో పరిష్కారమవుతుండటం వింతల్లోకెల్లా వింత! 'వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్' అన్న గురుజాడవారి పాట గుర్తుకొస్తున్నదెందుకో ఈయన్ని చూస్తుంటే!
మర్నాడు  ఉదయం తయారై.. బ్యాంకుకి పోయి జాయినింగు రిపోర్టు ఇచ్చిందాకా దగ్గరే ఉన్నాడు రామసుబ్బు. 'సాయంకాలం మళ్లీ వస్తాను. మీ అకామిడేషన్ ఫిక్సయితే ఫోన్ చేసి చెప్పండి. లగేజీ డ్రాప్ చేస్తాను. కుదరకపోయినా ఇబ్బంది లేదు . మన ఇల్లు ఉండనే ఉందిగా.. పది రోజులదాకా నో ప్రాబ్లం' అని భరోసా ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు.
జరిగిందంతా విన్న మా మేనేజరుగారు చాలా నెగెటివ్ గా స్పందించారు. 'ఎలాంటి ఎలాంటి మనుషులున్నారో లోకంలో! తెలివిగలవాళ్ల మనుకంటున్నాంగానీ మన ఊహక్కూడా అందనంత విడ్డూరంగా జరుగుతున్నాయి నేరాలు. ఈ మధ్యిలాగే ఇక్కడ ఓ కొత్త చోట్లో కెమేరా కన్నుకి బేర్ గా దొరికిపోయి చాలా ఇబ్బందులు పడిందొక అమ్మాయి.చేతులు కాలింతరువాత ఆకులు పట్టుకునేం లాభం లేదు. ముందు మీ లగేజీ షిఫ్టు చేయించండి! ముక్కూ మొగం తెలీని మనిషి కష్టడీలో దాన్నలా వదిలేసి రావడమేంటి? సాయంకాలంలోపు మన బ్యాంకు క్వార్టర్సులో ఎక్కడన్నా ఎకామిడేట్ చేస్తాను. మన స్టాఫు లొఖండేని వెంట తీసుకుపోండి! ఏదైనా ప్రాబ్లముంటే తను టేకిల్ చేస్తాడు. లోకల్ మనిషి. పొలిటికల్ ఇన్ ఫ్లుయన్సూ జాస్తి!' అని ఆయన అన్ని రకాలుగా బెదరగొట్టిన తరువాత నా మనసూ తిరిగిపోయింది.
నిన్న స్టేషన్లో దిగినప్పటినుంచి జరుగుతున్నదంతా నాకే ఒక సినిమా కథలాగా ఉంది. మానేజరుగారనేముంది! రామసుబ్బు కథ చెబితే ఎవరికీ నమ్మబుద్ధి కాదు.
సాయంకాలం ఐదు కాకుండానే రామసుబ్బు నెంబరుకి కాల్ చేసాను. 'మేనేజరుగారరు ఏర్పాటు చేయించిన ఎకామిడేషన్లోకి నా లగేజి షిఫ్టు చేయించుకుంటాను. థేంక్స్ ఫర్ ది టైమ్లీ హెల్ప్!' అని ధన్యవాదాలు చెప్పే నెపంతో ఝంఝాటం వదిలించుకోవాలని నా ఆలోచన.
ఫోన్ రింగవుతుందికానీ మహానుభావుడు..ఎంత సేపటికీ ఎత్తడే! ఒకసారి కాదు పాతిక సార్లు ట్రై చేసాను. మొదట్లో వూరికే రింగయిన ఫోను తరువాత 'స్విచ్డాఫ్' అని వస్తోంది! ఇంటికి పోయి చూడటం తప్ప మరో మార్గాంతరం లేదు. ఎందుకైనా మంచిదని మరో గంట ఆగి లొఖండేని వెంటబెటుకుని బైలుదేరాను.
ఆటో సగం దూరంలో ఉండగా రామసుబ్బే కాల్ చేసాడు. 'బ్యాంకుకి రావాలనే అనుకున్నాను మ్యాడమ్ గారూ! మథ్యాహ్నంనుంచి చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. రాంకోటి రోడ్డులో ఎవరో చిన్నపిల్లాడు బస్సు ముందుచక్రాల కిందపడి గందరగోళం చేసాడు. పెద్ద యాక్సిడెంటు! ఎవరూ పట్టించుకోరే! పోలీసులొచ్చిందాకా పసిప్రాణాలు నిలబడతాయా? అర కిలోమీటరు దూరంలో ఉంది గవర్నమెంటాసుపత్రి. ఐనా ఏ ఒక్క గాడిదకొడుకూ రానంటాడే! పోలీసులతో పెంటవుతుందని భయం పిరికి వెధవలకు! నేనే భుజంమీద వేసుకుని తీసుకు వెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాను. పిల్లాడి పేరెంట్ సు ఎవరో కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.  ఈ గొడవల్లో ఫోనెత్తలేక పోయాను. సారీ! మీ కొత్త అకామిడేషన్ అడ్రసు ఇవ్వండి! ఎంత రాత్రయినా లగేజీ చేర్చే పూచీ నాదీ!' అని ఆగకుండా సంజాయిషీ ఇస్తుంటే ఇంకేమనాలో తోచకుండా ఉంది.  అదీగాక ఆయన ధోరణి నిన్నట్నుంచీ చూస్తుండీ అనుమానించడం మహా పాతకం' అనిపించింది. నా తటపటాయింపు చూసి లొఖండేనే కలగజేసుకున్నాడు తనే ఫోనులో 'మీకెందుకు శ్రమ? ఎవరిద్వారానైనా వెంటనే లగేజీ పంపించెయ్యండి సార్!' అన్నాడు గడుసుగా.
'విలువైన సామాను. మ్యాడమ్ గారు నన్ను నమ్మి నా మీద భరోసాతో వదిలేసి పోయారు. మధ్యలో ఏదైనా ఐతే నా మాట పోదా!  మంచితనంమీద జనాలకున్న ఈ కాస్త నమ్మకం వట్టిపోదా! అదంతా నా వల్ల అయేది కాదుగానీ.. నా మీద నమ్మకముంచండి సార్! తెల్లారేలోగా మ్యాడంగారి లగేజీ మీ కొత్త అకామిడేషన్ గుమ్మం ముందుంటుంది. సరేనా!' అంటూ నా కొత్త చిరునామా తీసుకున్నాడు. చేసేదేంలేక ఆటో వెనక్కి తిప్పుకుని వచ్చేసామిద్దరం.
పాతికమైళ్లన్నా దూరం ఉంటుందనుకుంటా  నా కొత్త అకామిడేషనుకి, రామసుబ్బు వాళ్ళింటికీ మధ్య దూరం. రాత్రి ఏ ఝాములో వచ్చి దించిపోయాడో.. తెల్లారేసరికల్లా గుమ్మం ముందు నా లగేజీ మొత్తం ప్రత్యక్షం! చెక్ చేసుకుంటే.. నాలిక గీసుకునే బద్దతోసహా ఎక్కడి సామాను అక్కడే భద్రంగా ఉంది!
రామసుబ్బు నెంబరుకి కాల్ చేస్తె ఎంతసేపటికీ ఎత్తడమే లేదు. ఎక్కడ ప్రజాసేవలో తలమునకలై ఉన్నాడో! ఎప్పుడు కాల్ చేసినా నో రెస్పాన్స్. రామసుబ్బులాంటి మనిషి చిన్నపిల్లల నీతికథల్లో తప్ప ఎక్కడా కనిపించడేమో! విచిత్రం!
తరువాత ప్రసాదుగారి బావగారిని కలిసినప్పుడు అంతకన్నా విచిత్రమైన విషయం బైటపడింది. రామసుబ్బు కథవిని.. విజిటింగ్ కార్డు చూసిన ఆయన విస్తుపోయాడు. 'ఈయనా రామసుబ్బంటే!
కేరళానుంచొచ్చి టీ పౌడరు వ్యాపారం చేసే నాయరు కొనుక్కున్నాడే ఆ ఇంటిని ఈ మధ్య! మా డిఫెన్సు క్యాంటిన్సుకి లిప్టన్ పౌడరు సప్లై చేస్తుంటాడు. కూతురు పెళ్ళికని  ఓ నెల రోజులపాటు ఊరికెళ్ళాడా మధ్యలో! మా కందరికీ రిసెప్షన్  ఇచ్చింది మీరున్న ఆ ఇంట్లోనే! యస్! నాకు బాగా గుర్తుకొస్తుందిప్పుడు. మీరు బ్యాంకులో జాయినవడానికి వచ్చిన రోజుల్లోనే జరిగిందా పెళ్ళి. నా దగ్గర ఇంకా ఆ ఇన్విటేషను కూడా ఉంది' అని ఓ పెళ్ళి పత్రికను వెదికి మరీ తెచ్చి చూపించాడాయన. దానిమీద రిసెప్షనుకని అచ్చొత్తిన చిరునామాలోనే  నేనారోజు రాత్రంతా రామసుబ్బుగారి ఆతిథ్యాన్ని చవి చూసింది!
'నాయరు ఇంటితాళాలు మీ రామసుబ్బు ఎలా దొరకబుచ్చుకున్నాడో!' అని ఆయన అంటుంటే నోరు వెళ్ళబెట్టడం నా వంతయింది.
లొఖండే విప్పాడా మిస్టరీ తన సోర్సులద్వారా సమాచారం రాబట్టి. ' మీ రామసుబ్బుగారికి మతి స్థిమితం తక్కువ. దయాగుణం ఎక్కువ. ఖైతాన్ కంపెనీ మనీ ఇలాగే దానధర్మాలు చేసి ఉద్యోగం పోగొట్టుకున్నప్పట్నుంచీ మొదలయిందట జబ్బు. మిమ్మల్ని ఎకామిడేట్ చేసిన భవంతి ఆయన ఫ్యామిలీ  ప్రాపర్టీనే. ఇల్లు గడవడంకోసం నాయరుకు అమ్మిన మాట నిజమే. ఆ నాయరు ఊళ్ళో నప్పుడు మీకక్కడ ఆతిథ్యం లభించిందన్న మాట. అమ్మకముందు అదాయన సొంత భవనమే కదా! పాత డూప్లికేట్ తాళాలతో పని నడిపించాడన్న మాట ప్రజా సేవకుడు!'
'పరాయి కొంపలో ముక్కూ మొగం తెలీని మనిషికి పడీ పడీ రాత్రిళ్ళు  సేవలు చేయడం ఏంటి?! ఇందులో ఆయనకొచ్చే లాభం ఏంటి?! ఒక్క క్షణంకూడా నాకు ట్రబులివ్వలేదా పెద్దాయన. పైపెచ్చు తన సొమ్మే బోలెడంత  ఖర్చు చేసాడు! ఎంత మతి స్థిమితం లేకపోతే మాత్రం ఇంత పకడ్బందీగానా ఆతిథ్యం?!'
'అదే శ్యామలగారూ ఇందులో ట్విస్టు. అసలు విషయం వింటే మీరు షాకవుతారు. ఇల్లు గడవని రోజుల్లో ఆయనగారి కూతురు ముంబైలో ఓ చిన్న ఉద్యోగం చేసేదిట. ఎవరో త్రాష్టుడు అమె వంటరిగా ప్రయాణం చేయడం గమనించి ఎడ్వాంటేజి తీసుకున్నాడంటున్నారు. చెట్టంత ఎదిగిన బిడ్డ అలా అన్యాయంగా బలై పోయినప్పట్నుంచి  మీ రామసుబ్బుగారి పిచ్చి ఇటు మళ్ళిందన్నమాట. స్టేషనులో కాపు కాయడం.. మీలాంటి ఆడకూతుళ్లెవరన్నా అసహాయంగా కనిపిస్తే సేఫుజోనులో చేరిందాకా వెంటబడి మరీ సేవల మిషతో కాచుకోవడం! మామూలు  చికిత్సకు లొంగక కొంత, లొంగే చికిత్సకు డబ్బు లేక కొంత ఇంట్లో వాళ్ళంతా ఈయన్ను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైందట!’ 
సినిమా కథలనుకుంటాం గానీ.. కొన్ని జీవితాలు  సినిమా కథలకన్నా విచిత్రంగా ఉంటాయి.. ఇలా!'
రామసుబ్బుగారి మంచితనం, మాటకారితనం ఓ పిచ్చి వల్ల వచ్చిందా?! నమ్మబుద్ధికాకపోయినా ఇదో పచ్చినిజం! బాధతో నిట్టూర్చకుండా ఉండలేకపాయాను.
-కర్లపాలెం హనుమంతరావు
(అచ్చంగా తెలుగు- అంతర్జాల పత్రిక- 23- 09-2015 నాటి సంచికలో ప్రచురితం)

http://acchamgatelugu.com/%E0%B0%86%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82



Saturday, September 19, 2015

థింక్ ట్వైస్ బిఫోర్ యూ క్లిక్- కవిత


కవిత 
లవ్ ఫైర్ 
- కర్లపాలెం హనుమంతరావు 

1
రోమియోకి రోడ్ మ్యాపు లేదు
జ్యూలియట్ హృదయాన్ని చేరడానికి!

కొట్టినపిండనుకున్న పారూ మనసుకి
దారేదో తెలీకే  దేవదాసలో  తూలిపడింది !

ప్రేమయనగా ' రొండు హృదయములు ఒకే పన్ థాన నడుచుట' ట
ముళ్ళపూడి కథలో హిందీ చిత్రదుబాసీ అనువాదపు తూట
ఆ 'పన్' థా ఏమిటొ అంతుబట్టకే కదా ఇంత కథా!

2
'ఈ రాణీ ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర సారం'
ఓకేనండీ శ్రీ శ్రీ మహాశయా !
మరి క్లియోపాట్రా కొటేరుముక్కునే సమాధిలో  పాతేస్తారూ?

'సమాధి'కైనా బెదరని అమరప్రేమ కదా అనార్కలి కథ
సమోసాలతో లాగించే మొగలాయీ చాయైతే కాదు కదా!

తాజ్ మహల్ తాజాదనపు లోలోపలి రహస్యమంతా
ముంతాజ్ బేగం మేలిముసుగు అనురాగంలోనే ఉందా? 

భాగ్యమో.. దౌర్భాగ్యమో .. 
భాగమతీమోహంలోపడి ఉన్నమతి కోల్పో యాక
కులీ కుతుబ్షా కానీ. కూలీ పుల్లయ్యే కానీ
అందరిదీ ఒకేమాదిరి దిల్ దర్ద కహానీ!

ఆరుపదుల నది నీదిన అనుభవంతో చెబుతున్నా
వలపంటే ఓడ్డూ లోతూ తెలియని ఓ గడ్డు అగాథం!
యధార్థానికదో దోషాతిశయాలంకారం
పరమపదసోపానపటంలో
పాముపక్కని నిచ్చెన ఆరోహణం ! 

అందితే చింత
అందనంతసేపే  అదో వింత
బైటకు దారిలేని పద్మవ్యూహం అంతా! 

మయసభా మధ్యంలో 
అభిమాన సుయోధనుడి 
జారిపడే  పరాభవం 
ప్రేమాతిశయానుభవం ! 

దేహా త్మల  సర్వాన్నీ 
సందేహ డోలికగ మార్చేసే     
మంతగత్తె మాలిక ప్రేమ! 

నీ ప్రేమ కావ్య పాదానికి  
ఆదిలోనే హంసపాదా  ..! 
చిత్త హింస తప్పినందని
ఆ వెంకయ్యకు ఓ 
టెంకాయ కొట్టూరుకో!

4
ఇంత చెప్పినా
సోకిందా .. సోకు గాలి!
గాండ్రించే పులివి
ఇక తలపు తలుపుల దగ్గర
తచ్చాడే కాలుగాలిన పిల్లివి. 

ఆగాగు.. ఆఖరుగా ఓ మాట!
అపరిచితం టు సుపరిచితం 
కాదు ఎన్నటికీ పూలబాట 

'కిక్' కోసమే ఈ బొకే ఎఫైరా ! 
థింక్ ట్వైస్ బిఫోర్ .. 
బివేరాఫ్ ది లవ్ ఫైర్ ! 
***

Wednesday, September 16, 2015

ఉర్దూ గజళ్ళు- తెలుగు అనువాదం- ఎండ్లూరి సుధాకర్ 'నజరానా'కి డా॥ సదాశివ ముందుమాట

నజరానా’ పేరుతో ఎండ్లూరి సుధాకర్ అనువదించిన 237 ప్రసిద్ధ ఉర్దూ కవుల అముద్రిత కవితల పుస్తకానికి డా.సదాశివ 6.2.2009నాటికి  రాసిన అచ్చు కాని ముందుమాట ఇది.
డా॥ సదాశివ
ఉర్దూగజల్లను గానీ, షేర్లను గానీ తెలుగులో అనువదించటం అసా« ధ్యం కాకున్నా కష్టసాధ్యం. ఆ కష్టం ఇంతా అంతా కాదు. అందుకు కారణం ఉర్దూ భాష స్వభావం వేరు. ఎందుకంటే ఉర్దూ కవిత ఫారసీ సాహిత్య లక్షణాలు కలిగి వుంటుంది. తెలుగు కవిత చాలావరకు సంస్కృత లక్షణాలను, కొంతవరకు దేశి లక్షణాలను కలిగి వుంటుంది. ఒక భాష కావ్య లక్షణాలు, అలంకారాలు, ధ్వని మొదలైనవి ఇంకొక భాష కావ్య లక్షణాలు, అలంకారాలు, ధ్వనీత్యాది కావ్యాంశాలు చాలా భిన్నంగా వుంటాయి.
అందుకే ఉర్దూ గజల్లను ఇతర కావ్య రీతులను అనువదించే కవికి ఉభయ భాషల కావ్య లక్షణాలు, అలంకారాలు మొదలైనవి బాగా తెలిసి వుండాలె. అవన్నీ తెలిసి వున్నందు వలన అనువాద కవి ఉర్దూ కవి హృదయాన్ని చక్కగా గ్రహించి అతడు వెలువరించ దలచిన భావాన్ని అవగాహన చేసుకోగలడు. ఆ పైన అదంతా తెలుగులో చెప్పేటప్పుడు తెలుగు కావ్య లక్షణాలను, అలంకారాలను పాటించవలసి వుంటుంది. అక్కడే కవి కష్టాన్ని ఎదుర్కో వలసి వస్తుంది. ఉర్దూ లక్షణాలను అలంకారాలను తెలుగులో ప్రవేశపెట్టలేడు. తెలుగు లక్షణాలతో, అలంకారాలతో చెప్పిన కవిత ఉర్దూ కవిత వలె వుండదు. అందుకే అన్నాను, అనువాదం కష్టసాధ్యమైన పని అని.
ఉర్దూ షేర్లకు రదీఫ్, ఖాఫియాల నియమం వుంటుంది. తెలుగులో ఆ నియమాన్ని ప్రవేశపెట్టలేము. హిందీ కవులు కొందరు రదీఫ్, ఖాఫియాలను పాటించే ప్రయత్నం చేసినారు, కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. చేయి తిరిగిన తెలుగు కవులు ఆ ఖాఫియాలకు బదులు అంత్య ప్రాస నియమం పాటించినారు. రదీఫ్‌ను పాటించే ప్రయత్నం చాలా వరకు అసఫలమయింది.
అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయ కాదె కవి వివేకంబు” అన్నాడు పాల్కురికి సోమన. ఇది ఉర్దూ కవితకే వర్తించే మాట. కొద్ది శబ్దాల్లో గొప్ప భావాన్ని ఆవిష్కరిస్తాడు ఉర్దూ కవి. ఏ మాటా స్పష్టంగా చెప్పడు. కానీ ఉర్దూ కావ్య సంప్రదాయాన్నెరిగిన శ్రోతలకు, పాఠకులకు ఎక్కడా అస్పష్టత కనిపించదు. ఉర్దూకవి ప్రతీకలు శ్రోతలకు, పాఠకులకు చిరపరిచితాలు. కాబట్టే వేదిక మీద నిల్చున్న కవి ప్రతీకల ఊతంతో పరిమిత పదాలలో ఏమి చెప్పబోతున్నాడో ముందే గ్రహించిన శ్రోత కవి కంటే తానే ముందు చెప్పేస్తాడు.
ఖాఫియా రదీఫులను కూడా జోడిస్తాడు. తెలుగు కవి సమ్మేళనంలో కవి చదువుతాడు. శ్రోతలు బుద్ధిమంతుల్లాగా మౌనంగా వింటారు. ఉర్దూ కవి రాగంలో చదివితే తరన్నుమ్’ – వచనంలో చదివితే ‘తహత్’. కవి ఎట్లా చదివినా అందులో పస వుంటే శ్రోతలు మధ్యమధ్య వహ్వా, షాబాష్, క్యా బాత్ హై అంటూ ప్రోత్సహిస్తారు. మరీ గొప్పగా వుంటే ‘ముకర్రర్ – ఇర్షాద్’ అని రెండవసారి చదివించుకుంటారు. కొన్ని సందర్భాల్లో కవి చెప్పిన దాన్ని బట్టే ఆపైన కవి ఇంకేమి చెప్పబోతున్నాడో ఊహించిన శ్రోతలు కవి కంటే ముందే చెప్పేస్తారు. ఖాఫియా రదీఫుల సహా చెప్పేస్తారు. అనువాదంలోనూ ఆ ఊపు రావాలంటే కష్టమే మరి.
అయినా కొందరు తెలుగు కవులు ఉర్దూ గజల్ షేర్లను, రుబాయీలను తమ పద్ధతిలో అనువదించి సాహిత్య రసికుల సమావేశాల్లో షాబాషీలు పొందుతున్నారు. వహ్వా లందుకొంటున్నారు. అటువంటి కవుల్లో డా.ఎండ్లూరి సుధాకర్ గారొకరు. వారుగాక మరికొందరున్నారు. వాళ్ల గురించి తర్వాత మాట్లాడతాను. సుధాకర్ గారు ఉర్దూ భాషా సాహిత్యాల వాతావరణంలో పెరిగిన వారు. ఉర్దూ కవితా సంప్రదాయాన్నెరిగినవారు. కాబట్టి వారి అనువాదం కవి హృదయానికి దగ్గరగా వుంటుంది. రాజమండ్రిలోనే ఉంటున్న శ్రీ వి.వి.సుబ్రహ్మణ్యం గారు (టెలికామ్ ఇంజినీయర్) రెంటాల శ్రీవేంకటేశ్వరరావు గారు (లెక్చరర్) ఉర్దూ నేపథ్యం లేకున్నా మూలకవి హృదయాన్ని చక్కగా గ్రహించి అనువదించినారు.
డా.ఎండ్లూరి సుధాకర్ గారు ఉర్దూ గజల్ షేర్లను తెలుగులో అనువదించి, ఉర్దూ కవితా మధువును తెలుగు చషకాల్లో అందిస్తున్నారు. తెలుగు సాహిత్య రసికులను అందుకోండి’ అని ఆహ్వానిస్తున్నారు. కానీయండి. మధ్యలో ఇంకా నేనెందుకు? అన్నట్లు ఈ చషకాలను ప్రత్యేకంగా చిత్తగించండి.
డా॥ ఎండ్లూరి సుధాకర్

ఓ దర్ద్! ఏ సుగంధ గాత్రి
నీ హృదయంలో అధివసించింది?
నీ స్వేద బిందువుల్లోంచి కూడా
గులాబీ పరీమళం గుబాళిస్తోంది
–దర్ద్

ప్రణయ తాదాత్మ్యం ఎప్పుడంటే
ప్రేయసి సైతం ఉండాలి భగ్న హృదయంగా
ఇరువైపులా దహించాలి
ఈ అగ్ని సమానంగా….
–ఇస్మాయిల్ మీరాఠీ

నీకు దూరంగా వెళ్లిపోవాలని
అనుకున్నాను పలుమార్లు
ఏ గమ్యానికి చేరినా
నీ వైపే నడిపిస్తాయి అన్ని దార్లు
–జిగర్

చేతులెత్తి ఒళ్లు కూడా
విరుచుకోలేక పోయింది
నన్ను చూడగానే నవ్వి
అమాంతం
హస్తాలు దించేసింది
–నిజాం రాంపురి

గాలి నీ తోటలోంచి
నడిచి వెళ్లింది
ఈ ఉదయం
పరుచుకున్న పరిమళం
అది నీ దేహానిదే
అయి వుంటుంది
–ఫైజ్ అహ్మద్ ఫైజ్

ఆకులకీ గడ్డి పరకలకీ
అవగతమే నా దుస్థితి
తోటకంతా తెలుసు గానీ
తెలియని దల్లా పూలకే నా గతి
–మీర్ తకీమీర్

ఇవి నా పసందు. మీ పసందు ఇది కావచ్చు. వేరే కావచ్చు. పసంద్ అప్నీ అప్నీ” అనే మాట వుండనే వున్నది. జిందాబాద్! సుధాకర్ సాబ్! జీతే రహో, పీతే రహో – పిలాతే రహో, హమారీ దువాయేఁ లేతే రహో!
-డా॥ సదాశివ

(ఆంధ్రజ్యోతి-వివిధ-13-08-2012)
ఏండ్లూరి సుధాకర్ 'నజరానా' కొన్ని కవితలు ఇక్కడ చదువుకోవచ్చు
http://sudhakaryendluri.blogspot.in/2009/04/blog-post_22.html

Tuesday, September 15, 2015

మైండ్ బ్లాక్- ఓ సరదా గల్పిక

"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో.. వాడే పండుగాడు" అని 'పోకిరీ' చిత్రంలో మహేష్ బాబు డైలాగ్. డైలాగునుబట్టి మైండు బ్లాకుకి మహేష్ బాబే ఆద్యుడని ఆయన అభిమానసందోహం కేరింతలు  కొడుతుండవచ్చు గాక .. వాస్తవానికి 'మైండు బ్లాకు'కీ అన్నింటిలోలాగానే ఆ  బ్రహ్మదేవుడే ఆద్యుడు. బ్రహ్మాండ పురాణం నిండా దీనికి బోలెడన్ని   ప్రమాణాలున్నాయి కూడానూ.
వేద వేదాంగాలను సృష్టించిన అలసటలో బ్రహ్మదేవుడు  కాస్త మాగన్నుగా కన్ను మూసిన వేళ తాళపత్ర గ్రంధాలన్నీ ప్రళయ జలాల్లో జారిపడిన కథ సారి గుర్తు చేసుకుంటే మైండు బ్లాకు ఆది మూలాలు బైట పడతాయి. నీటి పాలైన వేద సాహిత్యాన్ని హిరణ్యాక్షుడు నోట కరచుకుపోయాడన్న విషయం బోధపడగానే ముందుగా బ్రహ్మాజీలో కలిగిన మానసిక వికారం 'మైండు బ్లాక్'. బిడ్డ అచేతునడై అవస్థలు పడుతోంటే తండ్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండి పోగలడు! మత్సావతారం ఎత్తడం.. ఆనక  హిరణ్యాక్షుని  సంహరణ.. వేదాల ఉద్ధరణ..  ప్రస్తుతానికి  మనకవన్నీ అప్రస్తుతాంశాలే గానీ.. మైండు బ్లాకు వరకు ప్రస్తావనార్హమే!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే పనిగా పెట్టుకున్న భగవంతుడూ మత్సావతారం నుంచి కూర్మావతారం, వరహావతారం,  నరసింహావతారాల మీదుగా రామద్వయావతారాలు, కృష్ణావతారాది మిగతా అవతారాలు వెరసి మొత్తం దశ అవతారాలు ఎత్తినా .. చివరికి ప్రస్తుతం నడుస్తున్న కలియుగం నాలుగో పాదంలో ధర్మదేవత   కుంటికాలితో కాదు సరిగదా.. కనీసం కాలి మునివేళ్ల మీదైనా నడిచే యోగం కనిపించడంలేదు. ఇప్పుడు   అవతారమెత్తి ధర్మోద్ధరణచేయాలో అంతుబట్టకే భగవంతుడు గుళ్ళోబెల్లం కొట్టినరాయిలా పడివున్నాడని దేవుడంటే పడని  నాస్తికుల వాదన. భగవంతుడంతటి వాడికే తప్పని ఈ మైండుబ్లాకు మానవచరిత్రను ఇంకెంతగా ప్రభావితం చేసిందో చర్చించడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

క్షీరసాగరమధన ఫలితంగా  పుట్టిన హాలాహలం సేవించడంతో పరమ శివుడికి మైండు బ్లాకయితే.. అమృతం పంపకాల ప్రహసనంలో జగన్మోహిని సమ్మోహనాస్త్రంతో రాక్షసాధముల మైండ్లు బ్లాకయ్యాయి. ఒంటికి వెలిబూది పట్టించి,  మంచుకొండలమీద   పులిచర్మం కప్పుకుని యుగాలబట్టీ యోగముద్రలో మునిగివున్నాకాలరుద్రుడి మెదడుకి ఏమీ కాలేదు. కానీ గిరిపుత్రిక పార్వతీదేవి
సపర్యల  నెపంతో స్వామిసన్నిధానంలోచేరి  సమయంచూసి విరిచూపులు విరజాజుల్లో కలిపి చేసిన మన్మధప్రయోగానికి మాత్రం మహేశ్వరుడికి మైండు బ్లాకయింది. కాబట్టే వంక గిరిజాకుమారి పాణిగ్రహణం చేస్తూనే  మరోవంకనుంచి
సృష్టి ప్రేరకుడైన మన్మధుడిమీద.. పాపం.. ఆగ్రహజ్వాలలు కురిపించింది! పార్వతమ్మ కలగ చేసుకుని పరిస్థితులను చక్కబెట్టబట్టి సరిపోయింది కానీ లేకపోతే రుద్రమూర్తి గారి  మైండు బ్లాకు నిర్వాకం మూలకంగా సృష్టిమొత్తం సహారా ఎడారి మాదిరి ఎండిపోయుండేది కాదూ!

రామాయణం రాయకముందు వాల్మీకులవారు సాధారణ కిరాతకుడే! క్రౌంచపక్షుల జంట మిథునభంగం కంటబడ్డాకే మైండుకి 'మా నిషాద' శ్లోకంతట్టి  అనుష్టుప్ చందస్సులో అమర కావ్యం సృష్టి జరిగింది! పిట్టల పుణ్యమాఅని   ఒక మహనీయుడు  మైండు బ్లాకు గండం నుండి బైటబడి మనకో మర్యాదాపురుషోత్తముడి కథను సంస్కృతీ సాంప్రదాయాల వరవడికింద  అందించాడు!

ఆ రామాయణం మాత్రం?! ఆరు కాండల ఉద్గ్రంథ రాజమే కావచ్చు కానీ ఏకమొత్తంగా  చూస్తే బోలెడన్ని మైండు బ్లాకుల కథా గుచ్చం! విశ్వామిత్రులవారు వచ్చారన్న ఆనందం క్షణకాలం నిలవలేదు పాపం దశరథ మహారాజులవారికి. నూనూగు మీసాలైనా రాని పెద్దబిడ్డ రామచంద్రుణ్ని యజ్ఞయాగాదుల సంరక్షణార్థం  పంపించమని ముని కోరిన  ఉత్తరక్షణంలో మహారాజుగారికి కలిగిన చిత్తసంక్షోభం పేరు ఇవాళ్టి ఇంగ్లీషుభాషలో మైండు బ్లాకే! వశిష్టుల వారు కలగజేసుకుని పరిస్థితులని చక్కబెట్టకపోయుంటే కైకమ్మకథ వరకూ దశరథుడివ్యథ అసలు కొనసాగేదే కాదు! 'ఎవరు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైండు బ్లాంకవుద్దో ఆవిడ పేరే కైకమ్మ' అని నిజానికి చిన్నరాణిగారు చెప్పుకోవాల్సిన రామాయణం కోట్ 'పోకిరీ'లో మహేష్ బాబు కొట్టేసాడనిపిస్తోంది.

కాలి బొటనవేలుకు కాస్త ఎదుర్రాయి తగిలితేనే చాలు ప్రాణం పోయినట్లుంటుంది. మరి
ఏకమొత్తంగా  ఏడు తాడిచెట్లను ఒకేవేటుతో కూల్చిన రాంబాణం తగిలితే! ఎన్ని తలకాయలు ఉంటేనేమి..  మైండు బ్లాకవడం ఖాయం.  రావణాసురుడికి చావుకుముందు కలిగిన అనుభవం ఇలాంటిదే! ఆ రోజుల్లో ఇప్పట్లోలాగా.. పోస్టుమార్టమ్స్  గట్రా గొడవల్లేవు.  ఉండుంటే బాణంమొన బొటనవేలుకి తగిలినందుకు కాదు.. 'ప్రాణం  అక్కడే ఉందని రాముడికి ఎలా తెలిసిందబ్బా?' అన్న సందేహంవల్లే రావణాసురుడి మరణం సంభవించిందని తేలుండేది.

కృష్ణ పరమాత్ముడి కథ అంతకన్నా విచిత్రంరేపల్లె తాలూకు గొల్లభామల్నుంచి..
మధురానగరి కంసమహారాజులవారివరకూ ఎందరి మైండ్లనో దిమ్మతిరిగే రేంజిలో దెబ్బకొట్టిన లీలావినోది శ్రీ కృష్ణ పరమాత్ముడు మామూలు వేటగాడి పుల్లబాణం దెబ్బకే ఉత్తిపుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు! భక్తిభావం తగ్గించుకుని కాస్త ఓపిగ్గా మరింత లోతుల్లోకెళ్ళిగాని వెదగ్గలిగితే..  చావు పుట్టుకలకు అతీతమైన ఆ భగవదంశ అంతటితో పరిసమాప్తమవడానికి ముఖ్యకారణం అంతకుముందు యాదవకులంలో పుట్టిన ముసలమూ.. అది సృష్టించిన కలకలమూ.. దానికారణంగా కృష్ణయ్య మెదడు బొత్తిగా స్థంభించడంగా అర్థమవుతుంది!
ఐ మీన్ దిసీజ్ ఆల్ బికాజాఫ్  మైండ్ బ్లాక్!

కురుక్షేత్రం రణక్షేత్రం మధ్యలో బంధుమిత్రులందరినీ చూసిన పాండవమధ్యముడికీ కలిగింది మైండు బ్లాకే! వేళకి భగవంతుడు  రథసారథి అవతారంలో దగ్గరుండి కర్తవ్యబోధ
చేసుండకపోతే అర్జునుడి బుద్ధిస్థబ్దతవల్ల పాండవులు ఆరంభించకముందే  ఆ యుద్ద్జం ఓడి ఉండేవాళ్లు!

జూదమంటేనే ఓ బుద్ధితక్కువ వ్యసనం కదా! ధర్మరాజుది మహాజూద వ్యసనబుద్ధి. శకునితో పాచికలాటకని కూర్చున్నతరువాత  ఓటమిమీద ఓటమికారణంగా పెద్ద అన్నగారి   బుద్ధి పూర్తిగా మందగించింది.  ఆ చిత్తస్థంభనంలోనే రాజ్యాన్ని, అన్నదమ్ముల్ని, చివరికి కట్టుకున్న భార్యనిసైతం ఫణంగాపెట్టి చిక్కుల్లోపడింది. మైండు బ్లాకు కాకపోతే  ఆడకూతుర్నెవరన్నా మరీ  అంత నీచంగా ఆటల్లో ఫణంగా పెడతారా!

పూరీ జగన్నాథస్వామి విగ్రహాన్ని చెక్కిన మహాశిల్పి ఎవరో కానీ.. ఆ మహానుభావుడికీ ఈ మైండు బ్లాకు జబ్బే దండిగా ఉన్నట్లు లెక్క. అంత అత్యద్భుతమైన కళాఖండాలని  మలిచే శిల్పికి  ఏ మైండు ఫ్రీజ్  వ్యాధో లేకపోతే అలా అర్థాంతరంగా వదిలేసి పోడుగదా!

బమ్మెర పోతనామాత్యుడు భాగవతం రాసుకుంటూ పద్యంమధ్యలో  సరైనపదం  తట్టక తన్నుకులాడినట్లు పుక్కిటపురాణాలు చెబుతున్నాయి. మైండు బ్లాకుని వదిలించుకోవడానికి ఆయనా వేళకాని వేళ  నదీస్నానానికని వెళ్ళడం..   సందులో 
భగవంతుడే  స్వయంగా  పోతనగారి వేషంలోనే దిగొచ్చి  తనపద్యం తానే పూరించుకుని పోవడం మనందరికీ తెల్సిన కథే. దివిలోని దేవుణ్నీ భువికి దింపించిన  మైండు బ్లాకుని అందుకే  మనమంత చులకనగా  చూడ రాదనేది.

యథావాక్కుల అన్నమయ్య అని మరో మహానుభావుడు ఉన్నాడు. సర్వేశ్వరునిమీద  శతకం రాస్తూ స్వీయప్రజ్ఞ మీదున్న అపారమైన  విశ్వాసంతో  ఓ విచిత్రమైన పంతం పట్టాడు. రాసిన పద్యంలో ఎక్కడైనా దోషంగాని ఉన్నట్లు  రుజువైతే తరువాతి  పద్యరచనకు పునుకోడుట సరిగదా.. గండకత్తెరతో అక్కడికక్కడే తల నరుక్కుని చస్తాడుట! దోషపరీక్షకు అతగాడు ఎన్నుకున్న విధానం  మరీ విచిత్రం! పద్యం పూర్తయిన వెంటనే దాన్ని ఏటివాలుకు వదిలేస్తాడు. ఏటికి ఎదురీది తిరిగి ఆ తాటాకు తనదగ్గరికి  వస్తేనే.. తదనంతర పద్యం రచన ప్రారంభమయేది. విచిత్రం ఏమిటంటే ఏట్లోవేసిన పద్యాలతాటాకులన్నీ అలాగే తల్లిని వెత్తుకుంటూ వచ్చే పిల్లల్లాగా బుద్ధిగా కవిగారిని   క్రమం తప్పకుండా చేరుకోవడం! ఓ పోకిరీ పద్యంమాత్రం వరస తప్పించి తిరిగి రాకపోయే సరికి కవిగారు గండ కత్తెర బైటికి తీసారు. కవీ.. కావ్యమూ రెండూ అర్థాంతరంగా అలా అన్యాయంగా ఖతమయిపోతాయనుకున్న ఆఖరిక్షణంలో ఓ  పిల్లవాడు ఆ పద్యమున్న  తాటాకుతో పరుగెత్తుకుంటూ  వచ్చి   కవిగారినిశతకాన్ని రక్షించాడుఆ వచ్చింది  సాక్షాత్తూ సర్వేశ్వరుడేననీ.. యథావాక్కులవారి తాత్కాలిక మేథో బంధనం వల్ల ఏర్పడ్డ గండాన్ని స్వయంగా అలా నివారించి తన వంతు  సాహిత్యసేవ చేసాడని మరో కథనం.
ఎంత యథావాక్కులవారి మేథస్సుకైనా మైండ్ బ్లాకు గండం ఎదురవక తప్పదు. మధ్య  మధ్యలో ఏ అదృశ్య శక్తుల లీలావిలాసాల వల్లనో కథలిలా ముందుకు కదులుతుంటాయి..  అలా కదలాలనిగాని రాసి పెట్టుంటే!

తెనాలి రామకృష్ణుని 'పాండురంగ మాహాత్మ్యం'లో ఓ కవిగారు ఏకంగా భగవంతుడి బుద్ధిమాంద్యం ఎత్తిచూపే   కష్టాలపాలయ్యాడు. రాజుగారు మంచిపద్యాలకి అగ్రహారాలు పురస్కారంగా ఇస్తున్నారని తెలిసి ఓ శివభక్తుడికి  ఆశ పుట్టింది. 'ఇన్నాళ్ళుగా  నిత్య ధూపదీప నైవేద్యాలతో నీకు  కంచిగరుడ సేవ చేస్తున్నానే!  నాకీ ఆగర్భదారిద్ర్యం వదలనే వదలదా?' అంటూ నిత్యం కొలిచే పరమేశ్వరుడితో పోట్లాటపెట్టుకుని  దేశంవదిలి పోబోతుంటే .. భక్తుడి విశ్వాసాన్ని పోగొట్టుకోవడం ఇష్టంలేక రాజుగారికి వినిపించి మంచిపురస్కారం  అందుకోమని  ఒక పద్యం చెప్పాడు పరమశివుడు. తీరా అదికాస్తా రాజుగారి సమక్షంలో పెనువివాదానికి దారి తీసింది. రాజాశ్రయంలోని  నత్కీరుడనే ఓ  కవిగారు  పద్యంలోని దోషాన్ని ఎత్తి చూపించడం వల్ల.. కుష్టవ్యాధికి గురికావాల్సి వచ్చింది. పార్వతీదేవి కేశపాశపరిమళ  వర్ణనల్లోని దోషాన్ని గురించి ఆ రచ్చంతా!  భగవంతుడికీ కొన్ని సందర్భాల్లో మైండు బ్లాకయే అవకాశం ఉందని ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం.

రామచంద్రునిమీద కీర్తనలుకట్టే కంచర్ల గోపన్నకీ   ఈ మైండు బ్లాకు గండం తప్పినట్లు
లేదు.  మంది సొమ్ముతో మందిరం నిర్మించినందుకు తానీషా ప్రభువు గోల్కొండ చెరలో బంధించాడు గోపన్నను. అప్పట్నుంచే గోపన్నకి బుధ్ధి స్థబ్దత బాధలు  ఏర్పడ్డట్లనిపిస్తోంది.   ఏ కవికైనా  మైండు బ్లాకుకి మించిన చెర మరేముంటుంది? గోల్కొండచెర  కన్నా భావస్తబ్దత చెర రామదాసుని అధికంగా బాధించినట్లుంది. ఆ కష్టంనుంచి  విముక్తికే ఆ  రామదాసుడు ఎక్కువగా పెనుగులాడినట్లు స్పష్టం. 'ఇక్ష్వాకు కుల తిలక.. యికనైన పలుకవె రామచంద్రా! నన్నురక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా!' అంటూ ఆ దాసుగారు వేడుకున్నది బహుశా బుద్ధిబాధలనుంచీ విముక్తి కోసమే అయుండాలి. మధ్య మధ్యలో  'సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా/ ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా!'అని లెక్కలూ గట్రా తీయడం, 'ఏటికి చల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా! నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా' అంటూ శోకన్నాలు పెట్టడం.. వగైరా చెష్టలన్నీ  బుద్ధిమాంద్యం నుంచీ బైటపడేందుకు చేసిన విఫల యత్నాలుగానే భావించాలి.

మహానుభావుడు అన్నమాచార్యులుమాత్రం? శ్రీ వేంకటేశుని మీద ముప్పైరెండువేల కీర్తనలు ఎలా గట్టాడో! మధ్య మధ్యలో ఎన్ని విధాలుగా ఈ మైండు బ్లాకు గండంనుంచి  గట్టెక్కగలిగాడో ఆ ఏడుకొండల వాడికొక్కడికే ఎరుక!

త్యాగరాజయ్యరుస్వామివారికి  మానసికస్థభ్దతా కాస్త అధిక మోతాదులోనే ఉండేదంటారు చరిత్ర కారులు. ఆయన  అదోవిధమైన ట్రాన్సులోకి వెళ్లిన మూడ్ చూసి మరీ  చుట్టూ మూగేవారుట  శిష్యపరమాణువులు!  ఆ క్షణంలో ఆ వాగ్గేయకారుని నోటినుంచి రాలే ముత్యాలను పత్రాలమీదకు ఏరి పోగేసుకోవడమే వారిపని.  అలా ఏరి దాచిన ముత్యాలకోపుల్లోనివే  పంచరత్నమాలవంటి పంచదార  కోవాబిళ్ళలు.  పారవశ్వంనుంచి బైటికొచ్చిన ఉత్తరక్షణంనుంచి  త్యాగరాజయ్యరుకి.. ఉడిపి కాఫీహోటలు అయ్యరికీ మధ్య ఆట్టే తేడా ఉండేది కాదనేవారూ కొందరున్నారు. మామూలుగా కవులందర్నీ వేధించే మానసిక స్తబ్దత త్యాగయ్యనీ వదిలింది కాదనడానికి  'మరుగేలరా ఓ రాఘవ.. మరుగేల చరాచర రూప పరా-త్పర సూర్య సుధాకర లోచన' అన్న ఒక్క కీర్తనే మచ్చుక్కి చాలు.  మరుగయిందని అంతగా  ఆ సంగీత మూర్తి ఆర్తిచెందింది చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనుణ్ణి గురించా?  పరాకు చిత్తగించి చిరాకెత్తించే బుద్ధిసూక్ష్మతను గురించా? ఆలోచించాలి విజ్ఞులు!

పౌరాణిక పద్యాలను వూరికే చేంతాళ్ళకు మల్లే చెడలాగి   పాడుచేస్తుంటారని  షణ్ముఖి.. పీసపాటిలాంటి  పద్యనాటక కళాకారుల మీద బోలెడన్ని అభాండాలున్నాయి ఆ రోజుల్లోఎన్నో చిత్రాల్లో ఘంటసాలవంటి గాయకులు ఆ రాగాలహోరును తగ్గించి పాడారు. చిత్రాలు కాబట్టి ఆ గాయకులకి మేథోస్తంభన ఇబ్బంది తక్కువ. నాలుగురకాలుగా పాడించి
మంచిముక్కల్నన్నింటినీ ఏరి జతచేసుకొంటే వినసొంపుగానే ఉంటుంది 'జండాపై కపిరాజు' పద్యమైనా. నేరుగా వేదికలమీద సంభాషణల రూపంలో పద్యాలు  పాడాల్సిన అగత్యం స్టేజీనాటక కళాకారులది. ఎక్కడ తప్పుదొర్లినా  వెంటనే ప్రేక్షకులు చెప్పులకు పని చెప్పేవాళ్ళు.   భయంకరమైన ప్రతిస్పందన వచ్చిపడే  ప్రమాధం అనుక్షణం అలా  నాటక కళాకారులను వెంటాడుతుంటుంది కనకనే..  తరువాతి సంగతి బుర్రలో మెదిలేదాక బుర్రా సుబ్రహ్మణ్యం లాంటి  అత్యుత్తమ కళాకారులుసైతం  అంతలా గొంతుచించుకుంటూ  పద్యాలు సాగదీసి మరీ ఆలపించించేవాళ్లేమో! మతిస్తబ్దత  మాయరోగానికి నాటకాలవాళ్ళు కనిపెట్టిన గోసాయిచిట్కా   ఆరున్నొక్క రాగంలోకూడా శృతిని తెగకండా  లాగడం!

'పదండి ముందుకు.. పదండి ముందుకు.. పోదాం పోదాం పై పైకి' అంటో కవులందరినీ తెగ హైరానాపెట్టే శ్రీ శ్రీ నీ ముందుకు కదలనీయకుండా బ్రేకులేసింది  మైండు బ్లాకే. చలాన్ని అరుణాచలానికి తరిమిందీ ఈ మైండు బ్లాకే. ఆరుద్రను సినిమాలకు దూరం చేసినా, ఆదుర్తిని కడదాకా సాగనీయక దెబ్బతీసినా ఆ పాపమంతా  ఈ మైండు బ్లాకు సైంధవుడిదేనంటాయి  తెలిసీ తెలియని అభిజ్ఞానవర్గాలు! ఆత్రేయలాంటి ఎందరో మహానుభావులు  పచ్చనోటు కళ్ళ జూడందే మైండు బ్లాకు నుంచి ససేమిరా  బైటకొచ్చేవాళ్ళు కాదంటాయి మరికొన్ని జ్ఞానవర్గాలు. ఈ జబ్బుబారినపడి డబ్బు వృథా కావద్దనే .. నిర్మాతలు ఒక్కరచయిత మైండుమీదే   ఎప్పుడూ ఆధారపడేవారు కాదు.  ఆఫీసుబాయ్ దగ్గర్నుంచి.. ఫైనాన్సియర్  తాలుకు ఫియాన్సీదాకా ఎవరైనా ఏ దశలోనైనా నిరభ్యంతరంగా కథానిర్మాణంలో వేళ్లూ కాళ్లూ పెట్టే వెసులుబాటు చిత్రసీమలో గగ్గయ్యగారికాలం నుంచీ అనూచానంగా వస్తున్నదీ అందుకే.

విక్రమార్కుడికి కథలుచెప్పే బేతాళుడికి ఈ మైండు బ్లాక్ ప్రాబ్లం లేదు. భోజరాజుకి
కథలు చెప్పే సాలభంజికలకూ ఈ మైండు బ్లాకు జబ్బు అంటలేదు. మొగుళ్ళు ఇంటలేనప్పుడు రాజుగారి పడగ్గదికని  బైలుదేరిన ఇల్లాళ్ళను 'సప్తశతి'లో చిలక ..' హంస వింశతి'లో హంస రకరకాల  కథలు.. కబుర్లు  చెప్పి పాపకూపంలో పడకుండా  కాపాడాయి. మనుషులకుమల్లే  పశు పక్ష్యాదులకు  మైండు బ్లాకు జబ్బు లేకపోవడం ఆ విధంగా అదృష్టం.

విశ్వనాథ వారికీ  ఈ బుద్ధిసంకోచ రుగ్మత ఆట్టే  తగులుకొన్నట్లు లేదు.  వేయి పడగలు నుంచి.. రామాయణ కల్ప వృక్షంవరకూ ఆ మొండిమనిషి సృష్టించిన బౌండు సైజుసాహిత్యం చాలు..  మైండు బ్లాకుకి ఆయన బెండయ్యే టైపు కానేకాదని తెలుసుకోడానికి.     

గురజాడవారి గిరీశంతరహా పాత్రల్ని చూడండి. ఎలాంటి ఉపద్రవాన్నుంచైనా  అప్పటికప్పుడు ఏవేవో తడికలల్లి తప్పించుకునే ప్రజ్ఞ పుష్కలంగా ఉంటుంది.. ఖర్మ.   మధురవాణివంటి నీతిమంతులు సమయానికి ప్రవేశించకుంటే ఒక్కబుచ్చమ్మ అనేముంది.. సౌజన్యారావు పంతులుగారు సైతం చివర్లో 'డ్యామిట్ .. కథ అడ్డం తిరిగింది' అని ఘొల్లుమనాల్సొచ్చేది.

గీరీశం .. ఆషాఢభూతుల్లాంటి 'బ్లాక్ మైండెడ్‌' ఫెలోస్ కి మైండ్ బ్లాక్  రోగం రాకపోవడం  ఒక రకం దురదృష్టమైతే .. ఎన్నిదఫాలుగా దగాపడ్డా.. రాజకీయచదరంగంలో పెద్ద పాము నోట పడకుండా  తప్పించుకోడం రాని ఆమ్ ఆద్మీ పెనుబుద్ధిమాంద్యం మరో పెద్దదురదృష్టం.    

రావిశాస్త్రిలాగానో.. కారాగారిలాగానో  రాయడం రాకపోతేనేమి!   రాజకీయ నేతాశ్రీల ప్రాప్తకాలజ్ఞత  చూడండి!  ఏ మైండు బ్లాకులూ ఈ  'నక్క' మార్కు రాయనిభాస్కరుల  బెండు తీయలేకుండా ఉన్నాయి! అదొక్కటే బాధాకరం ఈ మైండ్ బ్లాక్ ఎపిసోడ్ మొత్తానికీ! ఏమంటారో తమరు? ఏమైనా అనటానికి బుద్ధి పనిచేయడం లేదంటారా! దటీజ్ 'మైండ్ బ్లాక్'!

-కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2014 నాటి వాకిలి- అంతర్జాల పత్రికలో ప్రచురితం)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...