Thursday, September 29, 2016

స్వర్గం అంటే?! - ఓ సరదా రాజకీయ వ్యాఖ్య

"స్వర్గం అంటే?" ఏంటి బాబాయ్?
 "ఏంరోయ్. ఉన్నట్టుండి చింతన ఇవాళ అటు మళ్లిందీ? కోడలింకా పుట్టింటి నుంచీ రావడం ఆలస్యమయేట్లుందా?"
"సూటిగా ఎప్పుడూ జవాబు చెప్పవు కదా! ప్రశ్నకు ప్రశ్న జవాబా? తమరేమన్నా సర్కారు తరుఫు సమాచార అధికారా"?
 "అంత పెద్ద నింద నా మీదెందుకులే! ఐతే స్వర్గం ఏంటో కావాలంటావు?  'స్వర్గం అంటే  కల్పవృక్షాలుంటాయి. రంభా ఊర్వసులుంటారు' అన్నాడురా వెనకటికి ఎవరో నీ లాంటి నిత్య సందేహి అడిగినప్పుడు మన మునిమాణిక్యం నరసింహారావు గారు.
 "ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో.. అది చెప్పరాదా బాబాయ్?"
 "ఆరగా ఆరగా తాగేందుకు మన ఆఫీసు క్యాంటీన్లలోలాగా అమృతం భాండాల నిండుగా  దొరుకుతుంటుంది అనుకుంటున్నాన్రాసర్కారు ఉద్యోగమల్లే సరదాగా కూడా ఉంటుందేమో! పనీ పాటాతొ వళ్ళు విరుచుకోవాల్సిన పనే ఉండదనుకుంటా. వేళా పాళా లేకుండా.. ఎప్పుడైనా ఎంత సేపైనా హాయిగా  గుర్రు కొట్టొచ్చు. సిసి కెమేరాల గోల ఉండదు.‘ఇదేమిటి?'..అని గద్దించేందుకు  ముఖ్యమంత్రులు సచివాలయాల్లో అసలే ఉండరు. మన చట్టసభల్లో కన్నా రెట్టింపు అల్లరీ.. ఆగం చేసినా ఇబ్బందేమీ ఉండదు. ఎత్తుకెళ్ళి బైట కుదేయడానికంటూ  ఏ సిబ్బంది నియామకం ప్రత్యేకంగా ఉండదనిపిస్తోంది."
 "ఈ మాత్రం సుఖానికే స్వర్గం కోసం వెంపర్లాడాలా బాబాయ్? ప్చ్..!"
 "నీ కిష్టమైన గానాబజానాలు కూడా పెద్దపండుగల్లోలా  నడుస్తుంటాయిరా బాబూ అక్కడా! ఇష్టమైనవాళ్ళతో ఇష్టమొచ్చినట్లు ఇష్టమైనంతసేపు మహా విచ్చలవిడిగా వీరసంచారం చేసెయ్యొచ్చు. చూసుకో! ఏదీ పాపం కాదంటారక్కడ మరిపీకల్దాకా భోజనాలుతాగి  తూము కాలవల్లో పడి దొర్లినా వచ్చి తట్టిలేపే నాథుడెవడూ ఉండని లోకంరా బాబూ స్వర్గం!"
"పో బాబాయ్! ఒక ఐదో పదో మనది కాదనుకొంటే  ఏ రేవ్ పార్టీలోనైనా  ఇంతకన్నా ఎక్కువగానే మజా చేసెయ్యచ్చుగదా! ఈ మాత్రం సుఖాలకే  స్వర్గం దాకా దేకటమెందుకంటాసరే..ఇంకో సందేహం!  స్వర్గాలన్నీ ఒకే తీరుగా ఉంటాయా? అక్కడా మన నక్షత్ర హోటళ్ళ మాదిరిగా.. సినిమాహాల్లో టిక్కెట్ల లెక్కన  తేడాలుంటాయా? ఉంటే అవి ఎన్ని రకాలు?"
 "వంట్లో ఎలా వుందిరా నీకూ? ఎందుకైనా మంచిది ఓ సారలా ఆసుపత్రి దాకా వెళ్ళొద్దామా చూపించుకోడానికీ?"
 "శవాలకు మనుషుల్లాగా.. మనుషులకు శవాలకు మల్లే  చికిత్స చేసే ఆ ఆసుపత్రిలకి ఇప్పుడెందుకులే! అసలే నా దగ్గర ఆరోగ్యశ్రీ  ఒరిజినల్ కార్డు కూడా లేదు. నా సందేహం అలాగే వుంది. ముందది తీర్చు చాలు"!
 "సివిల్ సర్వీసు పరీక్ష తెలుగు ప్రశ్నపత్రంలాగా గందగోళంగా ఉందిరా నీ సందేహం నాకు. అడగినంత సులభం కాదు బాబూ దీనికి  జవాబు చెప్పటం! ఒక్క ముక్కలో చెప్పాలంటే మన హిమాలయాల్లా చల్లంగా ఉంటుందని సరిపెట్టుకో.. పో”’
“చంపావ్ బాబాయ్! రీ కాశ్మీరీ లోయలా  కల్పవృక్షాలు గట్రాలతో  చల్లంగా ఉంటే.. ఎవరెళతారూ బాబూ మళ్ళీ ఆ చలి చోట్లకీ.. ఇక్కడ గడ్డకట్టుకొని చావడం చాలకనా! కనీసం  తలుచుకొన్నప్పుడల్లా విస్తర్లో దండిగా పిండివంటల వర్షం కురిస్తుంటేనన్నా కాస్త ఆలోచించుకోవచ్చుగానీ..”
మన తిరుపతిలో నిత్యాన్నదానం ఫక్కీలోనా! ఎప్పుడూ తిండి రంధేనుట్రా నీకూ! బండిని మరి కాస్త ముందుకు నడిపించరా బాబూ!"
"బాబూ అంటే గుర్తుకొచ్చింది.. మా బాబుకి బడిత పూజల్లేని బడులుండే చోటే స్వర్గం  బాబాయ్! కనీసం అలాంటి బడులైనా ఉండుంటాయంటావా స్వర్గంలో?”
అసలు స్వర్గంలో బళ్ళు మాత్రం ఎందుకూ? పంతుళ్ళతో, పేంబెత్తాలతో, మెళ్లో వేలాడేసే పలక బిళ్ళలతో అవసరం ఏముంటుందక్కడ? సర్సరే..  నీ స్వర్గం, మీ బాబు స్వర్గం. నేనెట్లా కాదంటాను దేనికైనా? మరి నా స్వర్గం ఎలా ఊంటుందో తెలుసురా అబ్బిగా?"
"పరగడుపునే తిట్టకుండా లోటానిండుగా చిక్కటి ఫిల్టరు కాఫీ కలిపిచ్చే  పిన్నిగారుండాలి అనుకుంటా. పెందళాడే వార్తాపత్రిక పడేసి పోయే పేపర్ కుర్రాడు, పిలిచీ పిలవంగానే 'సార్' అంటో హాజరై పోయే చౌకీదారు, నోరు పడిపోయిన పక్కింటి కుక్కపిల్ల, ఇంట్లో పనిచేయని టీవీ, గకుండా పనిచేసే లిఫ్టు, దొంగనోట్లు కక్కని ఏటియం, చౌకధరలకే ఖరీదైన మందులు, గొణక్కుండా నాడిచూసే వైద్యుడు, పద్దాకా నీ పిచ్చిరాతలు మాత్రమే ప్రచురించే ఓ పది పత్రికలూ.." 
"కొంత వరకూ నిజవే కానీ.. నిజానికి నా వరకు నాకు స్వర్గం అంటే.. టీవీ సీరియల్సు పదమూడు ఎపిసోడ్లకే బందయి పోయే చోటురా! పాదచరులు రోడ్డుకు ఎడమవైపున.. వాహనాలు.. విధించిన గీతల మధ్య మాత్రమే నడిచే స్థలంపండగలు.. పబ్బాలప్పుడైనా సరే దిగి వచ్చే ధరవరలు, బళ్ళ పార్కింగులకు సరైన సదుపాయాలు, ఒకటికీ.. రెంటికీ   శుద్ధమైన ఏర్పాట్లు,. వగైరా వగైరా ఉంటేనే అది అచ్చమైన స్వర్గమైనట్లు లెక్క. ఐదేళ్ళకోసారి మాత్రమే  సజావుగా..హుందాగా ఎన్నికలు జరిగాలి. బందులూ ధర్నాలూ నిష్కారణంగా జరగద్దు, ప్రజాసేవకులు సదా చిరునవ్వుతో జనాల సమస్యలను విని జరూరు జరూరుగా పరిష్కరించేందుకు తహతహలాడే పుణ్యభూమికనీసం గాంధీ జయంతి.. వర్ధంతులకైనా నిజాయితీగా స్వచ్చందంగా మధ్యనిషేధం అమలయ్యే పొడిచోటును మించిన  అమరలోకం మరేముంటుంది! పొడిచేస్తాం.. బాంబులతో పేల్చేస్తాం.. అని బెదిరింపులు అసలు  వినపడని శాంతిభూమికూడా అయివుండాలి నా దృష్టిలో స్వర్గమంటే! చేతులు.. మూతులు తడపకుండానే కనీసం కొన్ని ప్రభుత్వకార్యాలయాల్లోనైనా సరే చకచకా దస్త్రాలు పరుగులెత్తే దేవాలయాలకి, కారణం లేకుండానే కారు కూతలు, కారణమున్నా సరే  నేతల కారుకూతలు అసలు  వినబడని నిశ్శబ్ద భూస్థలికి, సాయంకాలాలు..  ఆదివారాల పూటైనా  పిల్లల్నలా కాస్తంత  హాయిగా ఆడుకునేందుకు బళ్ళు, కన్నవాళ్ళు  కనికరించి  వదిలేసే స్వేచ్చాస్థలికి,  తెలుగుపంతుళ్ళైనా కనీసం  సగం సంభాషణ జనంభాషలోనే జంకులేకుండా సాగించే స్వర్గానికి.. హే భగవాన్.. నన్నూ..నా దేశాన్నీ నడిపించు!"
"బాబోయ్ బాబాయ్! ముందు నువ్వు నేలమీదకు దిగిరావాలి! ఇప్పటికే దేవుడికి  పైన కంగారు మొదలై నట్లుంది.. పాపం! అసలు సందేహం తీర్చుకుందికి నీ దగ్గరకని పరుగెత్తుకొచ్చాను చూడు.. నాదీ బుద్ధి తక్కువ. సందు దొరికింది కదా అని.. సందర్భంకూడా తెలుసుకోకుండా నీ కడుపులోని ఆలోచన్లను ఇలా బొళబోళా బైటికి వెళ్ళకక్కడం ..ఏమన్నా బావుందా?"
"ఆ సందర్భమేందో బైట పెట్టాల్సింది ముందు నువ్వూ! స్వర్గం గురించి చర్చ రేపిందెవరూ అసందర్భంగా పరగడుపునే పరుగెత్తుకొచ్చి!"
"అసందర్భమేం కాదులే బాబాయ్. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలొచ్చి పడుతున్నాయ్ గదా!  ఎన్నికల్లో నిలబడ్డ  అభ్యర్థులు ఎవరికి వాళ్లు ఓటర్లకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటో ఎడా పెడా హామీలు  గుప్పించేస్తున్నారు!మా  వార్డులో ఒక సన్యాసి.. ఓటేసి గెలిపిస్తే ఏకంగా స్వర్గానికి పంపిస్తానంటూ కనబడ్డవాళ్లందరి నుదుటి మీదా ఇంత పొడుగు పట్టెనామాలు దిద్ది పోతున్నాడు! మా పిచ్చిది ఇంట్లో ఒహటే నస.. ఆ సన్యాసికే తప్పకుండా ఇంటిల్లిపాదీ ఓటెయ్యాలని. ఒహవేళ అతగాడుగాని  మా ఓట్లతో  గెలిచి స్వర్గానికి  రమ్మని బలవంత పెడితే వెళ్లడానికి సిద్దమవాలా వద్దా అని సందేహంతో బుర్ర బద్దలయిపోతోంది! రాత్రుళ్ళు నిద్ర పట్టడంలే! సరే.. నువ్వున్నావు కదా.. సందేహాలు తీర్చడానికని   ఇల్లా పరుగెత్తుకొస్తే..  నువ్వంతకన్నా విచిత్రమైన స్వర్గాన్ని చూపించి బెదిరించి పారేస్తుంటివి!"
 "అదా సంగతి! నేనూ విన్నాన్లేరా ఆ స్వర్గం సన్నాసిని గురించి. అధికారంలో ఉన్నంత కాలం  జనం సంగతి పట్టకుండా.. రౌడీలకన్నా హీనంగా కాట్లాడేసుకున్న పెద్ద మనుషులు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకొస్తే స్వర్గం సృష్టిస్తామని.. కుదరకపోతే నేరుగా స్వర్గానికే  తరలించేస్తామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు చూడు.. దాన్ని వెటకారం చేస్తో ఎవరో జన  చైతన్య స్వచ్చంద సంస్థ పక్షాన నిలబడి పెద్దమనిషిలే ఆ సన్యాసి! ఓటర్లకు అవగాహన పెంచే వ్యూహంలో అదొక భాగం. నిజంగా స్వర్గానికెళ్ళాల్సిన గత్తరేం ఉండదులేరా నీకూ.. మీ ఆవిడకు పిల్లకాయలకు! కంగారు పడకు!"
"అరెరే! ఇప్పుడెలా బాబాయ్ మరి! ఆ సన్యాసికే ఓటేస్తామని పెద్దమ్మ గుడికెళ్ళి దీపంకూడా ఆర్పొచ్చిందే మా మొద్దుది! వృథా  అవుతుందా పవిత్రమైన ఓటు?”
"మరేం ఫర్లేదులేరా. ఆ సన్నాసి కాకపోతే ఇంకో సన్నాసి. ఎవరొచ్చినా పెద్ద తేడా ఏం ఉంటుందనీ! నిజమైన స్వర్గం  నీకు ఇక్కడే రావాలంటే ముందు ఇలాంటి తిక్క ఆలోచన్లలో మార్పు రావాలి.  తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. వెనక్కి  తిరిగి తీసుకోవటానికి  కనీసం దేళ్ళైనా  ఆగాలి.. ఆ సంగతి  ముందు తెలుసుకోవాలి! మన ఓట్లేమన్నా వృత్తి రాజకీయనాయకులు జేబుల్లో పెట్టుకొని తిరిగే  ఉత్తుత్తి రాజీనామా పత్రాలా? చాలా అప్రమత్తంగా ఉండాలిరా అబ్బాయ్! ముందు ముందూ ఇంకా  మరన్నో కీలకమైన ఎన్నికలు ముంచుకు రాబోతున్నాయ్ మరి!"
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం)-కార్ట్యూనిష్టు శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)

ఉభయ కుశలోపరి- ఈనాడు సంపాదకీయం

'స్నేహం- తేనెమనసుల్లో వెల్లివిరిసే నాకం' అన్నాడో ఆధునిక కవి. జీవితం  కురుక్షేత్ర రణక్షేత్రమయినప్పుడు విజయానికి సారథ్యం వహించేదీ స్నేహమే! కృష్ణుణ్ణి కుచేలుణ్ణి కలిపి ఉంచింది, రాముణ్ణి రావణాసురుడి సోదరుణ్ణి కలిపి నడిపించిందీ ఈ స్నేహసౌహార్ద్రమే! 'సర్వే భవన్తు సుఖినః/ సర్వే సన్తు నిరామయా/ సర్వే  భద్రాణి  పశ్యంతు/ మా కశ్చత్ దుఃఖ  భాగ్భవేత్'- అందరు సుఖంగా, నిశ్చింతగా ఉండాలి. ఆయురారోగ్యాలతో ప్రవర్థిల్లాలి. మంగళవచనాలు వీనులకు, మంగళకార్యాలు కళ్లకు విందులు చేయాలి. ఏ ఒక్కరూ దుఃఖభాజితులు కారాద'ని కోరుకొనే 'మంగళాచరణం' తెలుగునాట ప్రతి  గుడిముంగిట సమయసందర్భం వచ్చినప్పుడల్లా గుడిగంటలతో కలసి ప్రతిద్వనించడం అనూచానంగా వస్తున్న సదాచారం. 'వాక్కును మితంగా, పరహితంగా వాడితే అదే మంత్రమవుతుంది' అంటారు శ్రీశంకరులు. తామెల్లరూ భద్రంగా ఉంటూనే చుట్టుపక్కలవారందరూ క్షేమంగా జీవించాలని మనసా వాచా కాంక్షించే గొప్ప సంకల్పం 'యోగక్షేమం వహా మ్యహమ్'లో కల్పన చేయబడింది. అభయ హస్తం ఆశించి వచ్చినవాడు పరమశత్రువయినా సరే యోగక్షేమలయినా  విచారించకుండా తిప్పిపంపడం భారతీయులకి బొత్తిగా  సరిపడని సంస్కృతి. పరమబొంకుగా కొందరు భావించే భారతంలో సైతం అడుగడుగునా సత్సంప్రదాయాలు  కంటపడుతంటాయి. యుద్ధానికిముందు విధాయకం కనుక శకుని పనుపున  యాదవుల సాయమర్థించేందుకు ద్వారకాపురి చేరుకుంటాడు సుయోధన మహారాజు. కిట్టనివాడని కిట్టయ్యేమన్నా పలుచన చేసాడా! 'బావా! ఎపుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్- చుట్టముల్?'అంటూ యోగక్షేమాలన్నీ చట్టబెట్టి మరీ విచారిస్తాడు. తిరుపతి వేంకట కవుల 'పాండవోద్యోగ విజయాలు' లోని ఈ పద్యాలు నాటికే కాదు.. నేటికీ  ప్రతి తెలుగునోటా ప్రతిద్వనిస్తూనే ఉన్నాయి. కారణం? తెలుగునాట అతిథులను ఆత్మీయులుగా భావించి ఆదరించడమే!

'నోరు మంచి- ఊరు మంచి', 'మంచిమాట మనుగడకు ఊరట', 'ధన్యత్వం అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుట' లాంటి సూక్తులెన్నోచిన్నబళ్లల్లో బాలల నోళ్లల్లో సుళ్లు తిరుగుతుంటాయి తెలుగు ఊళ్లల్లో! 'ఐకమత్యమే అసలు బలిమి' అని, కలసి ఉంటేనే కలదు కలిమి' అని, 'విడిపోతే చెడిపోతాం.. చెడిపోతే పడిపోతా' మని పిల్లలనేమిటి.. పెద్దలూ వంటబట్టించుకొనవలసిన నిత్యజీవిత వ్యక్తిత్వ వికాస సూత్రాలు కావా! 'సదాచారం, సత్సంప్రదాయం సంకలించిన జీవనవిధానమే సంస్కృతి' అని వివేకానందుని నిర్వచనం. వ్యక్తిలోని మూర్తివంతమైన సంస్కృతే పరిణత మానవత్వంగా పరిమళించేది' అని భగవాన్ రమణ మహర్షి బోధనకూడా! మంచి నడవడిక, సంఘ న్యాయౌన్నత్యం, సుఖజీవనం, సర్వమానవ సౌభ్రాభృత్వం వంటి సుగుణాలు పెంపొందించే జీవకళలు వంద ఉదహరించాడు నాలుగో శతాబ్దినాటి క్షేమేంద్రుడు తన జౌచిత్య సిద్ధాంత విచారదారలో. తండ్రి లోభం. తల్లి మాయ. కుటిలనీతి సోదరుడు. కృతక వేషభాషాదులు. భార్య స్థానీయులు, హూంకరించే  పుత్రుడుఅమాకమానవుడి జీవితాన్ని నిర్వాకంచేసేందుకు బ్రహ్మదేవుడి పనుపుమీద దంభం ఇంత పెద్ద పరివారంతో భూమ్మీద సంచరిస్తుంటుంది. తస్మాత్ జాగ్రత్త'ని క్షేమేంద్రుడు ఆనాడే వ్యంగ్యంగా హెచ్చరించాడుమనిషిని మంచిబాట పట్టించాలన్న ఆరాటంగానే క్షేమేంద్రుడి వెటకారాన్ని స్వీకరించాలి. వాస్తవానికి తెలుగువారు .. భారతంలో నన్నపార్యుడు అన్నట్లు 'స్వస్థాన వేషభాషాభిమానులు'. స్వసంస్కృతీనిష్టులయీ, స్వదేశానురాగులయీ.. పరసంస్కృతులపట్ల సంసర్గం, పరాయి దేశాలపట్ల గౌరవం పుష్కలంగా ప్రదర్శించే సామరస్య జీవన దోరణే  అనాదినుంచి  హూందాగా పదర్శిస్తూ వస్తున్నది.

'సాహసం మూర్తిగైకొన్న సరణివారు' అని క్రీడాభిరామం వాడిన పదప్రయోగం తెలుగు'వాడి'కి సరిగ్గా అతికినట్లు సరిపోయేది. కోట సచ్చిదానందమూర్తిగారన్నట్లు 'ఆత్మాభిమానం, స్వాతంత్ర్య ప్రియత్వం.. ఒక ఆకు ఎక్కువవడం చేతనేమో.. విశాలదృక్పథం ఉండీ మనసు అడుగుపొరలకింద పడి ఉంది. 'నీ అడుగులకో తుదిగమ్యం అందాలంటే/ ఎడతెగని యెదురు దెబ్బలు - గమనించు మిత్రమా! గుండెను ఒక అద్దంలా తుడిచి చూసుకో నేస్తమా!' అంటారు డాక్టర్ సినారె.   ట్రాన్సాక్షనల్ ఎనాలసిస్ప్రతిపాదకుడు ఎరిన్ బెర్న్ సిద్ధాంతం ప్రకారం ప్రతివ్యక్తిలోనూ పెత్తనం ప్రదర్శించే పెద్దాయనా, కార్యశీలత కనబరిచే పెద్దమనిషి, గారాంబంగా ప్రవర్తించే పసిబిడ్డ ఉంటారు. 'సమయానికి తగు మాటలాడు' చాతుర్యం ప్రదర్శిస్తే చాలు! 'విద్వేషం వింధ్యపర్వతంలా  అడ్డం నిలబడ్డా.. నట్టింట్లో ఆనందం వెల్లువలా పొంగులెత్తుతుంద'న్నది బెర్న్ మార్కు పరిష్కారం. మైత్రి సంపాదనకైనా, కొనసాగింపుకైనా మాటపట్టింపే గదా ప్రధాన అవరోధం! అందుకే 'ఓహో.. నువ్వా!ఎక్కడ ఎప్పుడు ఏలాగ ఏంచేస్తున్నావు/ ఏ నక్షత్రంకింద సంచారం చేస్తున్నావు' అంటూ కవి అజంతా  సరళిలో కుశల ప్రశ్నల శరపరంపర మనోచాపంనుంచి వరసబెట్టి సంధిస్తే.. ఎదుటి వ్యక్తి ఎంతపాటి రావణాసురుడైతేనేమి.. విభీషణుడిమాదిరి మారి శ్రీరామాలింగనంకోసం పరితపించడం ఖాయం. ముదిగొండ శివప్రసాదు అన్నట్లు 'వేదాంతులు ఎన్ని గ్రంథాలు వ్రాసినా.. వాదాలు చేసినా/ ఈ రంగుల తెర ఇంద్రజాలం తెలియకనే!' నిజమేకానీ.. పరిస్థితుల్లో మంచిమార్పు ప్రస్తుతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 'మంత్రకవాటాలు తీయడం..మూయడం' వంటబట్టించుకొన్న ఇద్దరు చంద్రులు తెలుగురాష్ట్రాలు రెండింటికీ అధిపతులుగా ఉండటం కలసివస్తోంది. నవ్యాంధ్రపరదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శుభసందర్బానే    తెలుగుసీమల సౌభాగ్యహార్మ్యాలకూ  సౌహార్ద్ర పునాది రాయి పడటం శుభసంకేతం. ఏపి ముఖ్యమంత్రి మనసారా  ఆహ్వానించడం.. తెలంగాణా ముఖ్యసచివులు అంతే హుందాగా స్పందించడం.. ఆనందదాయకం. 'ఏనాడో ఎదచేనిలో వెదజల్లిన స్నేహబీజాలు/ మొలకెత్తి పిలకలు వేసి/ మళ్లీ ఇన్నాళ్లకు మమతల ధాన్యపురాసులతో మనసుబండ్లను నింపడం' ఎవరికైనా ఎందుకు ఆనందం కలిగించదుఉభయకుశలోపరుల్లోనే తెలుగువారందరి అభివృద్ధి ఫలాలు దాగున్నాయని గదా ఆశఇద్దరు చంద్రుల పునస్సమాగనం అందుకే  ఆనందం.

***
(ఈనాడు అక్టోబరు 31, 2015 నాటి సంపాదకీయం)

Thursday, September 22, 2016

అవధానిగారి జీన్సు కోరిక- చిన్న కథ- గుడ్లదొన సరోజినీదేవి

అవధానిగారికి ఎప్పట్నుంచో కోరిక.. చిన్నకొడుకులాగా  ఒక జీన్స్ ప్యాంటు వేసుకోవాలని.
ఆయన వయసు అరవై దాటింది రెండేళ్ళ కిందటే. పుట్టినప్పట్నుంచీ పల్లెపట్టుల్లోనే వ్యవసాయంలో ఉండటం చేత పంచెలే తప్ప కనీసం తోటివాళ్ళలాగా మామూలు ప్యాంట్లయినా  కట్టుకుని ఎరగడు. ఇప్పుడు ఏకంగా జీన్సంటే.. నలుగురూ నవ్వి పోరూ!

' కాలంలో ఎవరికి పట్టింది! ఎవరిగోల వారిదిగా ఉంది లోకం. మీకంత మోజుగా ఉంటే వేసుకోరాదూ! భాగ్యమా..బంగారమా! ' అని సమర్థించింది భార్యామణి పున్నమ్మ కూడా. వూరికే సమర్థించడం కాదు.. ఎప్పుడు చెప్పిందో కాని.. చెన్నైలో ఉన్న చిన్నోడి దగర్నుంచి ఎల్లుండి పుట్టిన్రోజనంగా పార్సెల్ కూడా వచ్చేసింది.

బ్లూ కలర్ రగ్డ్ టైపు బ్రాండెడ్ అమెరికన్ కంపెనీ సరుకు. షర్టు.. మ్యాచయ్యేటట్లు ముచ్చటైన జీన్స్.. వుడల్యాండ్స్ వైట్ స్పోర్ట్స్ షూస్.

అంతా ఓకేనే గాని.. ప్యాంటు పొడుగు నాలుగంగుళాలు ఎక్కువైంది. అది మామూలే. రెడీమేడ్ డ్రెసెస్..ముఖ్యంగా ప్యాంట్లు.. షాపునుంచి కొన్నవి ఏవీ పొడుగులు సరిగ్గా ఫిట్టవవు. ఎవరి సైజుకి సరిపడా వాళ్ళే కట్ చేఇయించుకోవాలి.

నిజమే కాని.. అవధాని గారుండేది చిన్న పల్లెటూరు. ఊరు మొత్తానికి ఉన్నది ఒక్క టైలర్.. కాలీషా. వాళ్ళ కుటుంబంలో ఎవరో దగ్గరి వాళ్ళు పోవడం వల్ల కాలీషా మిషన్ పెట్టటం లేదు వారం రోజులుగా.

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడంటారు చుసారూ.. అలాగుంది అవధానిగారి పని.
ఎలాగైనా ఈ సారి పుట్టినరోజు పండక్కి జీన్సు వేసుకోవాలనే ఆయనగారి కోరిక. ఆదివారం పండగనగా.. శుక్రవారం రాత్రి  భార్యనడిగాడు.. ప్యాంటు పొడుగు రెండంగుళాలు తగ్గించి కుట్టివ్వమని. గయ్యిమంది ఇల్లాలు ఏ కళనుందో "ఇంటినిండా నన్ను కట్టుకుపోయేంతమంది పిల్లలుంటే వయస్సులో నేనే దొరికానా.. మీ సేవలకి. నా నడుం నొప్పితే నేను చస్తుంటే.. మీకిప్పుడు షోకులు కావాల్సొచాయా..షోకులూ!" అంటూ.
పాపం మానవుడు బిక్కచచ్చిపోయాడు. మళ్ళా మాట్లాడితే ఒట్టు.
మర్నాడు మళ్ళీ ప్రాణం పీకింది.. ఎట్లాగైనా ప్యాంటు కట్టుకు తీరాల్సిందేనని. పండక్కని పుట్టింటి కొచ్చున్న పెద్దకూతురు ముందు కోరిక వెళ్ళబెట్టాడు. ఆ సమయంలో ఆమె టీవీలో ఏదో సీరియల్ చూస్తోంది యమసీరియస్ గా. డిస్టర్బ్ చేసాడు తండ్రి అన్న కచ్చతో "నాన్నా..నువ్వేమన్నా షారూఖ్ ఖాన్ వా? ఈ వయసులో నీకీ పిచ్చేంటీ?"అంటూ విసుక్కుంది.
కూతురు మాటలకి కుంగిపోయారు పాపం అవధానిగారు.

'చపలత్వం వల్ల చిన్నపిల్లల దగ్గరకూడా చులకనైపొతున్నాడు. వెధవ ప్యాంటు తగలబడి పోనీ.. ఇంక నోరు విడిచి చచ్చినా ఎవరినీ అడగకూడదు. ఎప్పటిలాగానే కొత్త  పంచెల చాపు కట్టుకుంటే పేచీ ఉండదు' అని సర్దిచెప్పుకున్నాడు. ఆ ప్యాటును అట్లాగే నట్టింట్లో వదిలేసి పొలం పనులకి వెళ్ళిపోయాడు ఎప్పట్లాగా.

పుట్తినరోజు. పెందళాడే లేచి.. తలంట్లు వగైరా తతంగాలు ముగించుకుని గుడికి పోయి దైవదర్శనం చేసుకుందామని.. కొత్త పంచెలచాపుకోసం  పెట్టె తెరిస్తే.. పంచెలచాపుఏదీ?!
పెళ్ళాన్ని పిలిచి అడిగితే "అబ్బాయి ఇచ్చిన ప్యాంటు కట్టుకుంటానంటిరిగా.. అందుకే మీ కొత్త పంచెలచాపు గుళ్ళో పూజారిగారికి ఇచ్చేసా.. నిన్న. ప్యాంటు కట్టుకోండి ఈసారికి" అనేసింది.

"అవున్నాన్నా..నిన్న నేనేదో బ్యాడ్ మూడ్ లో వుండి నోరు జారా. సారీ! మీరు జీన్స్ ప్యాంటులో ఎలా వుంటారో.. పిల్లలు కూడా చూడాలనుకుంటున్నారు. కట్టుకు తీరాల్సిందే" అంటూ ప్యాంటు మడతలు విప్పి మరీ తండ్రి భుజం మీద వేసి గదిలోకి తోసేసింది కూతురు చనువుగా.

పెద్ద కొడుకు పిల్లలు కూడా చుట్టూ చేరి గోల చెయ్యడం మొదలు పెట్టారు " తాతయ్యా.. జీన్సువేసుకోవాలి.. తాతయ్యా.. జీన్సు వేసుకోవాలి" అంటో. తప్పదన్నట్లు నవ్వుతూ చూసారు పెద్ద కొడుకు.. పెద్ద అల్లుడు కూడా.

ఫోన్లోనుంచి చిన్నాడి బెదిరింపు "బోలెడంత పోసి కొన్నా నాన్నా! కట్టుకోక పోతే నా మనీ వేస్టు" అంటూ వార్నింగ్. చిన్నకోడలు వత్తాసు ఫోనులోనుంచే.

చివరికెలాగైతేనేం..అవధానిగారు..జీన్స్ ప్యాంటు ధరించారు.
కానీ..

ప్యాంటు మోకాలి కిందదాకానే వచ్చింది!

కారణం? ఒకరి తెలియకుండా ఒకళ్ళు.. భార్యా..కూతురు.. తలా ఓ రెండంగుళాలు తగ్గించి కుట్టేసారు. అత్తగారి మాటలు, ఆడపడుచు మాటలు చెవినబడ్డ పెద్దకోడలు మామగారి చిన్న బోయిన మొహం చూసి జాలిపడి చాటుగా తనూ ఒక రెండంగుళాలు..తగ్గించి కుట్టేసింది.

" ప్యాంటులో నువ్వు అచ్చంగా జోకర్ సినిమాలో రాజ్ కపూర్ లా వున్నావు తాతయ్యా!" అని మనమరాలు అల్లరి చేస్తుంటే చిన్నబోలేదు సరికదా అవధానిగారు.. చిరునవ్వులు చిందిస్తూ చిన్నపిల్లాడిలా భళ్ళున నవ్వేశారు.

ఇంట్లో వాళ్ళందరికి తనమీద ఉన్న ప్రేమ తల్చుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు.
ఆ ప్యాంటులోనే ఒక ఫొటో తీయించుకుని చెన్నైలో ఉన్న చిన్నకొడుకు, కోడలకి పంపించారు.

అవధానిగారి  చిన్ననాటి జీన్సు కోరిక అలా సుఖాంతమయింది.
మళ్ళా ఆయన జీన్సు ఊహను మనసులోకి రానీయలేదు.
ఆ ప్యాంటును  ఇంటిముందుకొచ్చిన బుడబుక్కలవాడికి ఉదారంగా ఇచ్చేయడంతో వాడి కళ్ళల్లోనే పెద్ద పండుగ ఉత్సాహం కనిపించి తృప్తి అనిపించింది అవధానిగారికి *
-గుడ్లదొన సరోజినీదేవి
(విపుల మాసపత్రిక ప్రచురణ- ఈనాడు యాజమాన్యానికి కృతజ్ఞతలతో)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...