"స్వర్గం అంటే?"
ఏంటి బాబాయ్?
 "ఏంరోయ్. ఉన్నట్టుండి
చింతన ఇవాళ అటు మళ్లిందీ? కోడలింకా
పుట్టింటి నుంచీ రావడం ఆలస్యమయేట్లుందా?" 
"సూటిగా ఎప్పుడూ జవాబు చెప్పవు కదా! ప్రశ్నకు
ప్రశ్న జవాబా? తమరేమన్నా
సర్కారు తరుఫు సమాచార అధికారా"?
 "అంత పెద్ద నింద నా మీదెందుకులే! ఐతే స్వర్గం ఏంటో కావాలంటావు?  'స్వర్గం అంటే  కల్పవృక్షాలుంటాయి. రంభా ఊర్వసులుంటారు' అన్నాడురా
వెనకటికి ఎవరో నీ లాంటి నిత్య సందేహి అడిగినప్పుడు మన మునిమాణిక్యం నరసింహారావు
గారు”.
 "ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో.. అది చెప్పరాదా బాబాయ్?"
 "ఆరగా ఆరగా తాగేందుకు మన ఆఫీసు క్యాంటీన్లలోలాగా
అమృతం భాండాల నిండుగా  దొరుకుతుంటుంది
అనుకుంటున్నాన్రా! 
సర్కారు ఉద్యోగమల్లే సరదాగా కూడా ఉంటుందేమో! పనీ పాటాతొ వళ్ళు విరుచుకోవాల్సిన పనే ఉండదనుకుంటా. వేళా పాళా లేకుండా.. ఎప్పుడైనా
ఎంత సేపైనా హాయిగా  గుర్రు కొట్టొచ్చు. సిసి కెమేరాల గోల ఉండదు.‘ఇదేమిటి?'..అని గద్దించేందుకు  ముఖ్యమంత్రులు
సచివాలయాల్లో అసలే ఉండరు. మన
చట్టసభల్లో కన్నా రెట్టింపు అల్లరీ.. ఆగం
చేసినా ఇబ్బందేమీ ఉండదు. ఎత్తుకెళ్ళి
బైట కుదేయడానికంటూ  ఏ సిబ్బంది నియామకం ప్రత్యేకంగా
ఉండదనిపిస్తోంది."
 "ఈ మాత్రం సుఖానికే స్వర్గం కోసం వెంపర్లాడాలా
బాబాయ్? ప్చ్..!"
 "నీ కిష్టమైన గానాబజానాలు కూడా పెద్దపండుగల్లోలా  నడుస్తుంటాయిరా బాబూ
అక్కడా! ఇష్టమైనవాళ్ళతో
ఇష్టమొచ్చినట్లు ఇష్టమైనంతసేపు మహా విచ్చలవిడిగా వీరసంచారం చేసెయ్యొచ్చు. చూసుకో! ఏదీ పాపం
కాదంటారక్కడ మరి! 
పీకల్దాకా భోజనాలు.  తాగి  తూము కాలవల్లో పడి దొర్లినా వచ్చి
తట్టిలేపే నాథుడెవడూ ఉండని లోకంరా బాబూ స్వర్గం!"
"పో బాబాయ్! ఒక ఐదో పదో
మనది కాదనుకొంటే  ఏ రేవ్
పార్టీలోనైనా  ఇంతకన్నా
ఎక్కువగానే మజా చేసెయ్యచ్చుగదా! ఈ
మాత్రం సుఖాలకే  స్వర్గం దాకా దేకటమెందుకంటా!  సరే..ఇంకో సందేహం!  స్వర్గాలన్నీ ఒకే తీరుగా ఉంటాయా? అక్కడా మన నక్షత్ర హోటళ్ళ మాదిరిగా.. సినిమాహాల్లో
టిక్కెట్ల లెక్కన  తేడాలుంటాయా? ఉంటే అవి ఎన్ని రకాలు?"
 "వంట్లో ఎలా వుందిరా నీకూ? ఎందుకైనా మంచిది ఓ సారలా ఆసుపత్రి దాకా వెళ్ళొద్దామా చూపించుకోడానికీ?"
 "శవాలకు మనుషుల్లాగా.. మనుషులకు శవాలకు మల్లే  చికిత్స
చేసే ఆ ఆసుపత్రిలకి ఇప్పుడెందుకులే! అసలే
నా దగ్గర ఆరోగ్యశ్రీ  ఒరిజినల్
కార్డు కూడా లేదు. నా సందేహం
అలాగే వుంది. ముందది
తీర్చు చాలు"!
 "సివిల్ సర్వీసు పరీక్ష తెలుగు ప్రశ్నపత్రంలాగా
గందరగోళంగా ఉందిరా నీ సందేహం నాకు. అడగినంత సులభం కాదు బాబూ దీనికి  జవాబు చెప్పటం! ఒక్క ముక్కలో చెప్పాలంటే మన హిమాలయాల్లా చల్లంగా ఉంటుందని
సరిపెట్టుకో.. పో”’
“చంపావ్ బాబాయ్! మరీ కాశ్మీరీ లోయలా
 కల్పవృక్షాలు గట్రాలతో  చల్లంగా ఉంటే.. ఎవరెళతారూ బాబూ మళ్ళీ ఆ చలి చోట్లకీ.. ఇక్కడ గడ్డకట్టుకొని చావడం చాలకనా! కనీసం  తలుచుకొన్నప్పుడల్లా
విస్తర్లో దండిగా పిండివంటల వర్షం కురిస్తుంటేనన్నా కాస్త
ఆలోచించుకోవచ్చుగానీ..”
“మన తిరుపతిలో నిత్యాన్నదానం ఫక్కీలోనా! ఎప్పుడూ
తిండి రంధేనుట్రా నీకూ! బండిని మరి కాస్త ముందుకు నడిపించరా బాబూ!"
"బాబూ అంటే గుర్తుకొచ్చింది.. మా బాబుకి బడిత పూజల్లేని బడులుండే చోటే స్వర్గం  బాబాయ్! కనీసం
అలాంటి బడులైనా ఉండుంటాయంటావా స్వర్గంలో?”
“అసలు స్వర్గంలో బళ్ళు మాత్రం ఎందుకూ? పంతుళ్ళతో, పేంబెత్తాలతో, మెళ్లో వేలాడేసే పలక బిళ్ళలతో అవసరం ఏముంటుందక్కడ? సర్సరే..  నీ స్వర్గం, మీ
బాబు స్వర్గం. నేనెట్లా
కాదంటాను దేనికైనా? మరి నా
స్వర్గం ఎలా ఊంటుందో తెలుసురా అబ్బిగా?"
"పరగడుపునే తిట్టకుండా లోటానిండుగా చిక్కటి
ఫిల్టరు కాఫీ కలిపిచ్చే  పిన్నిగారుండాలి అనుకుంటా. పెందళాడే
వార్తాపత్రిక పడేసి పోయే పేపర్ కుర్రాడు, పిలిచీ
పిలవంగానే 'సార్' అంటో హాజరై పోయే చౌకీదారు, నోరు
పడిపోయిన పక్కింటి కుక్కపిల్ల, ఇంట్లో
పనిచేయని టీవీ, ఆగకుండా పనిచేసే లిఫ్టు, దొంగనోట్లు
కక్కని ఏటియం, చౌకధరలకే
ఖరీదైన మందులు, గొణక్కుండా
నాడిచూసే వైద్యుడు, పద్దాకా
నీ పిచ్చిరాతలు మాత్రమే ప్రచురించే ఓ పది పత్రికలూ.."  
"కొంత వరకూ నిజవే కానీ.. నిజానికి నా వరకు నాకు స్వర్గం అంటే.. టీవీ
సీరియల్సు పదమూడు ఎపిసోడ్లకే బందయి పోయే చోటురా! పాదచరులు
రోడ్డుకు ఎడమవైపున.. వాహనాలు.. విధించిన గీతల మధ్య మాత్రమే నడిచే స్థలం.  పండగలు.. పబ్బాలప్పుడైనా సరే దిగి వచ్చే ధరవరలు, బళ్ళ
పార్కింగులకు సరైన సదుపాయాలు, ఒకటికీ.. రెంటికీ   శుద్ధమైన
ఏర్పాట్లు,. వగైరా
వగైరా ఉంటేనే అది అచ్చమైన స్వర్గమైనట్లు లెక్క. ఐదేళ్ళకోసారి మాత్రమే  సజావుగా..హుందాగా ఎన్నికలు జరిగాలి. బందులూ
ధర్నాలూ నిష్కారణంగా జరగద్దు, ప్రజాసేవకులు
సదా చిరునవ్వుతో జనాల సమస్యలను విని జరూరు జరూరుగా పరిష్కరించేందుకు తహతహలాడే
పుణ్యభూమి. 
కనీసం గాంధీ జయంతి.. వర్ధంతులకైనా
నిజాయితీగా స్వచ్చందంగా మధ్యనిషేధం అమలయ్యే పొడిచోటును మించిన
 అమరలోకం మరేముంటుంది!
పొడిచేస్తాం.. బాంబులతో
పేల్చేస్తాం.. అని బెదిరింపులు అసలు  వినపడని శాంతిభూమికూడా అయివుండాలి నా దృష్టిలో స్వర్గమంటే! చేతులు.. మూతులు తడపకుండానే కనీసం కొన్ని ప్రభుత్వకార్యాలయాల్లోనైనా సరే చకచకా
దస్త్రాలు పరుగులెత్తే దేవాలయాలకి, కారణం
లేకుండానే కారు కూతలు, కారణమున్నా
సరే  నేతల కారుకూతలు అసలు  వినబడని
నిశ్శబ్ద భూస్థలికి, సాయంకాలాలు..  ఆదివారాల
పూటైనా  పిల్లల్నలా కాస్తంత  హాయిగా ఆడుకునేందుకు బళ్ళు, కన్నవాళ్ళు  కనికరించి  వదిలేసే స్వేచ్చాస్థలికి,  తెలుగుపంతుళ్ళైనా కనీసం  సగం సంభాషణ జనంభాషలోనే జంకులేకుండా
సాగించే స్వర్గానికి.. హే భగవాన్.. నన్నూ..నా దేశాన్నీ నడిపించు!"
"బాబోయ్ బాబాయ్! ముందు
నువ్వు నేలమీదకు దిగిరావాలి! ఇప్పటికే
దేవుడికి  పైన కంగారు
మొదలై నట్లుంది.. పాపం! అసలు సందేహం తీర్చుకుందికి నీ దగ్గరకని పరుగెత్తుకొచ్చాను చూడు.. నాదీ బుద్ధి తక్కువ. సందు
దొరికింది కదా అని.. సందర్భంకూడా
తెలుసుకోకుండా నీ కడుపులోని ఆలోచన్లను ఇలా బొళబోళా బైటికి వెళ్ళకక్కడం
..ఏమన్నా బావుందా?"
"ఆ సందర్భమేందో బైట పెట్టాల్సింది ముందు నువ్వూ! స్వర్గం గురించి చర్చ రేపిందెవరూ అసందర్భంగా
పరగడుపునే పరుగెత్తుకొచ్చి!"
"అసందర్భమేం కాదులే బాబాయ్. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలొచ్చి
పడుతున్నాయ్ గదా!  ఎన్నికల్లో నిలబడ్డ  అభ్యర్థులు
ఎవరికి వాళ్లు ఓటర్లకు అది చేస్తాం.. ఇది
చేస్తాం.. అంటో ఎడా
పెడా హామీలు  గుప్పించేస్తున్నారు!మా  వార్డులో ఒక సన్యాసి.. ఓటేసి గెలిపిస్తే ఏకంగా స్వర్గానికి
పంపిస్తానంటూ కనబడ్డవాళ్లందరి నుదుటి మీదా ఇంత పొడుగు
పట్టెనామాలు దిద్ది పోతున్నాడు! మా పిచ్చిది ఇంట్లో ఒహటే నస.. ఆ సన్యాసికే తప్పకుండా ఇంటిల్లిపాదీ
ఓటెయ్యాలని. ఒహవేళ అతగాడుగాని  మా ఓట్లతో  గెలిచి స్వర్గానికి  రమ్మని బలవంత పెడితే వెళ్లడానికి సిద్దమవాలా
వద్దా అని సందేహంతో బుర్ర బద్దలయిపోతోంది! రాత్రుళ్ళు నిద్ర పట్టడంలే! సరే.. నువ్వున్నావు కదా.. సందేహాలు తీర్చడానికని
  ఇల్లా పరుగెత్తుకొస్తే..  నువ్వంతకన్నా విచిత్రమైన స్వర్గాన్ని చూపించి
బెదిరించి పారేస్తుంటివి!"
 "అదా సంగతి! నేనూ
విన్నాన్లేరా ఆ స్వర్గం సన్నాసిని గురించి. అధికారంలో ఉన్నంత కాలం  జనం
సంగతి పట్టకుండా.. రౌడీలకన్నా హీనంగా కాట్లాడేసుకున్న
పెద్ద మనుషులు.. ఇప్పుడు
మళ్లీ అధికారంలోకొస్తే స్వర్గం సృష్టిస్తామని..
కుదరకపోతే నేరుగా స్వర్గానికే 
తరలించేస్తామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు
చూడు.. దాన్ని
వెటకారం చేస్తో ఎవరో జన  చైతన్య స్వచ్చంద సంస్థల పక్షాన నిలబడిన పెద్దమనిషిలే ఆ సన్యాసి! ఓటర్లకు అవగాహన పెంచే వ్యూహంలో అదొక భాగం. నిజంగా స్వర్గానికెళ్ళాల్సిన గత్తరేం ఉండదులేరా నీకూ.. మీ ఆవిడకు పిల్లకాయలకు! కంగారు పడకు!"
"అరెరే! ఇప్పుడెలా బాబాయ్
మరి! ఆ
సన్యాసికే ఓటేస్తామని పెద్దమ్మ గుడికెళ్ళి దీపంకూడా ఆర్పొచ్చిందే మా మొద్దుది!
వృథా  అవుతుందా పవిత్రమైన ఓటు?”
"మరేం ఫర్లేదులేరా. ఆ సన్నాసి కాకపోతే
ఇంకో సన్నాసి. ఎవరొచ్చినా
పెద్ద తేడా ఏం ఉంటుందనీ! నిజమైన
స్వర్గం  నీకు ఇక్కడే రావాలంటే
ముందు ఇలాంటి తిక్క ఆలోచన్లలో మార్పు రావాలి.  తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. వెనక్కి  తిరిగి
తీసుకోవటానికి  కనీసం ఐదేళ్ళైనా
 ఆగాలి.. ఆ
సంగతి  ముందు తెలుసుకోవాలి! మన ఓట్లేమన్నా వృత్తి రాజకీయనాయకులు
జేబుల్లో పెట్టుకొని తిరిగే 
ఉత్తుత్తి రాజీనామా పత్రాలా? చాలా అప్రమత్తంగా ఉండాలిరా అబ్బాయ్!
ముందు ముందూ ఇంకా  మరన్నో కీలకమైన ఎన్నికలు ముంచుకు రాబోతున్నాయ్ మరి!"
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం)-కార్ట్యూనిష్టు శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)

 



 
