Tuesday, December 24, 2019

కవి కాని వాడు లేనేలేడు! (సరదాకే సుమా1) కర్లపాలెం హనుమంతరావు
బ్రహ్మపురాణం చెప్పనే చెప్పింది ' యుగాంతం సమీపించే కొద్దీ కవి కాని వాడు ఎవడూ ఉండడని! 'న కశ్చిదకవిర్నామ యుగాంతా సముపస్థితా!' అన్న ప్రవచనానికి అదే అర్థం. పురాణాలూ ఇంతలా భరవాసా ఇచ్చినా ఉబలాటానికి తగ్గట్లు తమ దగ్గర వ్యుత్పత్తి సామాగ్రి  లేదని వాపోయే జడపదార్థాలు ఇంకా కొన్ని  కవితామ తల్లిపై కత్తి కట్టడానికి సంకోచిస్తున్నాయ్! తెలుగు సాహిత్యం ఈ ద్రోహం పసిగట్టి ఏదో ఓ ప్రతిచర్యకు పూనుకొనే లోగానే మనిషి పుటక ఎత్తిన ప్రతి జీవీ కనీసం రోజుకో పది పుటల మీద అయినా తోచిన అక్షరాలు గిలక్క తప్పదు! 
తినగా తినగా వేము తీపి అయినప్పుడు  రాయగా రాయగా అక్షరం మాత్రం కవిత్వం కాక ఛస్తుందా? కవులు కావాలన్న జ్వరం ఎంత వేగిరం నిరక్షరాస్యుల వరకూ పాకితే  తెలుగు కవితామ తల్లికి అంత తొందరగా చెర విముక్తి!
మొద్దు నిద్రపోయే బుద్ధిమంతులకు ధీమా కలిగించే   ముఖ్యమైన ఓ  ముక్క బైటకు ఊదాల్నా?  శ్రీగిరి మల్లికార్జున స్వామి అనీ.. ప్రసిద్ధ కవిసత్తములుగా  ప్రఖ్యాతి కలిగించుకొన్న పెద్దలు ఒకరు సాంప్రదాయ సాహిత్యం చండశాసనం చేసే రోజుల్లోనే 'మహాముని(దుష్ట సమాసం), సోంవారం(భ్రష్ట ప్రయోగం) వంటి ఆనాటి వ్యాకరణ సూత్రాలు ఏ మాత్రం సమ్మతించని  పదాల ప్రయోగాలలో తొడగొట్టి మరీ దూకుడు ప్రదర్శించారు.  వారు విరచించిన సోంవార వ్రత మహాత్మ్యం’ లాంటి ఏదో గమ్మత్తైన ఓ  కావ్యం బౌండు బుక్కులో 'అని సూత మహాముని యాద్యుల కెల్ల వినిపించె పసోంవార  విత చరిత్ర! (డి.1019)- ఆంటూ ఎంతో సాహసపూరితమైన (అప్పటి రోజుల బట్టి) ముళ్ల డొంకన దూరి మరీ చూపించారు భావి ఔత్సాహిక కవి సమూహాలకు దారి. అయినా కవిత్వం  ఆధునికోత్తర గోడ కూడా దాటేసి దిక్కు తెలియని ఇంకేదో  దిశగా దూసుకుపోతున్నట్లు చెప్పుకునే  ఈ దశలో కూడా ఇంకా 'ఆ పదం పొసగలేదు! ఈ పదం ఇమడలేదు.. అబ్బే! ఈ మాదిరి డొంకల్లో పడి ఈడ్చుకుపోడం వల్ల కవిత్వానికి వరగబడే వరహాలు, వజ్రాలేం లేవు'  అంటో  వినిపించే నసుగుళ్ళ వల్ల  కవ్విత్వానికి పెద్ద వరిగేదేంలేదం'టూ పెదాలు విరిచే పదారణాల సమీక్షకులకు బెదురుతూ మునుక్కుని  కూర్చోవద్దు!  'పేరు పరుగు పందేలల్లో ' పతకాలే ముఖ్య మనుకునే కాలంలో వెనకెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కద్దు !
ఇంత చెప్పినా నిఖార్సైన ఆగ్ మార్క్ కవిత్వం కోసమే మా కసంతా అంటూ భీష్మించుక్కూర్చుంటానంటారా! మీ ఖర్మం.. ఆ గుంటుపల్లి జగన్నాథకవిగారిలా 
 'శ్రీరంగ చరిత్రము వి/ 
స్తారంబుగ నాంధ్ర కావ్య సరణిని జెప్పే /
 నేరుపు చాలక చింతిల/ 
నాతాతరి స్వప్నమున మహాద్భుతలీలన్ (ఆర్.247) అని కుందుకుంటూ రాయదలుచుకున్న ఆ శ్రీ రంగనాథుని చరిత్రమేదో రాయకుండా  రోజూ నిద్రకు ముందు కుమిలి కుంగిపోవడమొక్కటే మిలిగిపోయేది  సుమా! మీరు నకలు తీయదలుచుకున్న ఆ కవిల కట్ట మరే అకవి చేతిలో గాని పడిందా..  ఆనక మీ ఇష్టం.. అతగాడే రేప్పొద్దున ఏ సాహిత్య అకాడమీకో, తెలుగు విశ్వవిద్యాలయానికో సంచాలకుడైపోయి మీరు బతికి వుండగా
'మహాకవి'  కాదు కదా.. అసలు ‘కవి’ అనే బిరుదు ఛాయలక్కూడా ఛస్తే మిమ్ములను రానివ్వడు గాక  రానివ్వడు! బ్రహ్మాండ పురాణం ఘోషించిన ‘సర్వం కవితామయం’ థియరీ కి మీరొక్కళ్ళు మాత్రమే  బైట ఉండిపోయేది సుమా!
***
కర్లపాలెం హనుమంతరావు,
25 -12 -2019, బోథెల్
వాషింగ్టన్ రాష్ట్రం, అ.సం.రా

(సూచనః కవిత్వానికి నింబంధనలు ఉండే విధానానికి నేనూ నూటికి నూరు పాళ్లు వ్యతిరేకమే! కానీ పేలవమైన వాక్యాలను తునకలు తునకలు గా తుంచి దాన్నే కవిత్వం అనుకోమని ఇబ్బంది పెట్టే  తమ్ముళ్ల, చెల్లెళ్ళ  వత్తిళ్లకూ శుద్ధ వ్యతిరేకం. ఆ దృష్టితోనే పై రైట్-అప్ ను చూస్తే వర్తమాన కవితాలోకం పట్ల నా దృక్పథం కొంత అర్థమవుతుందని వినతి!)
-కర్లపాలెం హనుమంతరావు
24 -12 -2019

Monday, December 23, 2019

ఎలుకలు. ఎలుకలు. ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు!


                                                                     నెవిల్ మాస్కెలిన్

1903
లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లెక్చర్ హాల్
భౌతిక శాస్త్రవేత్త జాన్ అంబ్రోస్ ఫ్లెమింగ్ 20వ శతాబ్దపు ఒకానొక వింతను ప్రజానీకం ముందు ప్రదర్శించేందుకు అన్నీ సిద్ధం చేసుకుని ప్రకటించిన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ వేరెవరో కాదు సుమండీ! వైర్ లెస్ టెలిగ్రాఫ్ ప్రసార సృష్టికర్త మార్కొనిగారి శిష్య పరమాణవు.
గురువుగారి తరుఫున ప్రదర్శనకు పూనుకొని వూరుకుంటే సమస్యే  ఉండేది  కాదు.ఏదో పూనకం వచ్చిన గణాచారికి మల్లే తీగల సాయం లేకుండా సాగే ఆ సమాచార ప్రవాహ వ్యవస్థ  రెండు అనుమతించిన మాధ్యమ యంత్రాల మధ్య ఎవరూ తస్కరించలేనంత పకడ్బందీగా రూపొందించింది అంటూ రెచ్చిపోయి మరీ ప్రకటనలకు తెగబడ్డాడు.

జనంలో అసక్తి కలిగించేoదక ఈ  తరహా కిటుకులు  బాగానే పనిచేస్తాయిగా! వింతను చూసేందుకు జనమూ  తండోప తండాలుగా  పొగయ్యారు! సరిగ్గా అప్పుడే మార్కొనీ నిస్తంత్రీ సమాచార ప్రసార వ్యవస్థ చరిత్ర సృష్టించడానికి ముందే చరిత్రలో మరో వింత నమోదు అయింది.  ఆ వింత పేరే 'హ్యాకింగ్ ' !

ఆంబ్రోస్ ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందే, టెలిగ్రాఫ్ యంత్రం దానంతట అదే  ప్రాణం పోసేసు కుంది. తనకు తానే బోలెడంత సేపు టక్ టక్‌ మంటూ  ' రాట్స్ .. రాట్స్  .. రాట్స్ .. రాట్స్  ... రాట్స్  ( ఎలుకలు.  ఎలుకలు.  ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు) అంటూ కొట్టిందే కొట్టుకుంటూ  షేక్స్పియర్ సాహిత్యం నుంచి కూడా మంచి మంచి పదాలను ఎంచుకుని మరీ  మార్కొనీమహాశయుడు  ప్రభుత్వానికీ, ప్రజానీకానికి చెప్పే మాటల్లోని నిజాన్ని సందేహాస్పదం కింద మార్చేసింది !

ఆ బూటకాలను ఎండగట్టిన మొదటి హ్యాకర్‌   నెవిల్ మాస్కెలిన్! అతగాడు వేసిన బాటలోనే తదనంతరం హ్యాకింగ్ చరిత్రలో చాలా పెద్ద ఘటనలు జరగడం ప్రపంచ చరిత్ర పరిశీలించే ఆసక్తిపరులందరికీ తెలిసిన విషయమే ! అసాంజే మార్క్ స్విస్ బ్యాంకుల ఖాతాల నుంచి పనామా  పత్రాల లీకేజీ  దాకా హ్యాకింగ్ మూలకంగా జరిగిన పరిణామాలలో  మంచివీ ఉన్నాయి .. పాకిస్తాన్ మాజీ ప్రధాని  వంటి వారి  కొంపలు  మంచినవీ ఉన్నాయి! అది వేరే కథ!
ఎలుకల వల్ల ఎల్లప్పుడూ చెడే కాదు సుమండీ . మంచీ జరగుతుందని తెలుసుకోవడమే ఈ మొదటి హ్యాకర్    నెవిల్ మాస్కెలిన్ గారి  కథ సారాంశం! .. కదా !

వైజ్ఞానిక వింతలు : 1 ఎలుకలు.  ఎలుకలు.  ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు!  - కర్లపాలెం హనుమంతరావు

😾😹

Monday, December 16, 2019

తేనీరు సంజీవని -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయఁం - 26, జూన్, 2011
లోకంలో నీరు తరువాత తేనీరే అధికంగా వినియోగమయే ద్రవం. కప్పు కాఫీనో, తేనీరో పడకపోతే పడక దిగడానికి పెద్దలే పస్తాయిస్తున్న కాలం ప్రస్తుతం నడుస్తున్నది. ఓ ఆధునిక తేనీటి ప్రియుడు వాపోయినట్లు 'కిటికీలోంవి వానా ఉరుములూ  వినిపిస్తున్నప్పుడు/ శవంలా ఒరిగున్న నీరసం/ నిప్పుల పులిలా లేచి నుంచోవాలంటే' కావలసింది ఓ కప్పుడు చాయ్. ఒకప్పుడే కాదు ఇప్పుడూ ఆ కవి చాయాలపన  నూటికి నూరు శాతం వాస్తవమే! ఎంతలా వేధించకపోతే పోకూరి కాశీపతి వంటి ఉద్దండ పండితులు కూడా దండకాలు చదువుతూ ఈ కాఫీ టీల ముందు సాష్టాంగ ప్రణామాలకు పాల్పడివుంటారు! 'శ్రీ మన్మహాదేవీ! లోకేశ్వరీ! కాళికా సన్నిబాకరణీ! .. అంబా కాఫీ జగన్మోహినీ!' అంటూ ఏకరువు  పెట్టిన  గుణగణాలన్నీ పేరుకే కాఫీకి కానీ తేనీటి వంటి అన్ని ఉత్సాహ ప్రసాద తీర్థాలన్నింటికీ అక్షరాలా వర్తించే స్తుతిమాలలే  వాస్తవానికి!  'శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరి  ఊతంబునే పారిజాతంబున్ దెచ్చియున్  నాతికిన్ బ్రీతిగ నిచ్చు కాలంబు నందా సుమంబునందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలి' ఏ కాఫీ చెట్టుగానో, తేయాకు మొక్కగానో పుట్టుకొచ్చిందన్నంత దాకా ఆ అవధానిగారి ప్రేమగానం  ముదిరిపోయిందంటే ఆ దోషం వారి పాండిత్యంలో లేదు. కాఫీ టీలకు కవులూ కళాకారులకూ మధ్య ఉన్న బంధం అంత బలమైనదిగా అర్థంచేసుకోవాలి. 'కాఫీ టీ లయినా సర/ దాకైనా మందొ కింత తాగరు సిగిరె/ ట్టూ కాల్చరు మరి వారె/ ట్లీ కవులైరొ తెలియనగునా!' అంటూ కోవెలవారు ఓ శతావధానంలో ఆదే పనిగా ఆబ్బురపడిపోతారు! 'సరదాకే' అని ఆ కవిగారన్నా  కాఫీ టీ లు కేవలం కవుల  సరదాకేనా?! 
'తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి' అనే నానుడి బహుశా వేడి వేడి కాఫీ టీలు వాడకంలోకి రాని కాలం నాటివై ఉండాలి. గారెలు తినగ తినగ చేదు. కాఫీ చాయిలకు ఆ దోషం లేదు. తెల్లవారగానే తేనీటికి వెంపర్లాడే బుద్ధి తెల్లవాడు వచ్చి మనకు మప్పినన కాలానికి  ముందు పుట్టబట్టే అల్లసానివారు సత్కృతులకు అవసరమైన సరంజామాలో 'అల్లం టీ' ని కలపలేదు. కాఫీ టీల యుగంలోనే గాని ఆ కవితాపితామహుడు ప్రభవించుండి ఉంటే 'రా! నడిచే నగరంలానో / నిద్రించే పల్లెలానో  వచ్చి/ నా ముఖం మీద దుప్పటి లాగిపారెయ్/ బోర్లించుకున్న రాత్రిళ్లూ/ పొర్లించుకున్న పాటలూ/ నిరామయ ప్రపంచాలూ చెరిసగం పంచుకుందాం ఇరానీ కప్పులో.. గోర్వెచ్చగా' వంటి ఈ నాటి కవితలకు దీటైన 'టీ కవితలు' టీకా తాత్పర్యాలతో సహా రాసుండేవారు. నాయుడుబావ ప్రేమ కోసం నండూరివారి వెంకి అట్లా గుత్తొంకాయ కూరలు, పూరీలు, పాయసాలు చేసి అంతలా హైరానా పడింది కానీ -చారెడు ఏలకులు గుండ కొట్టి కలిపిన తేనీటీని ఓ కంచు లోటాకు నిండుగా పోసిచ్చి ఉంటే  జుర్రుకుంటూ తాగి వెర్రిత్తిపోయుండేవాడా ప్రియుడు. 'దిగిరాను దిగిరాను దివి నుండి భువికి' అంటో భావకవి కృష్ణశాస్త్రి అన్నేసి మారాములు చేయడానికి 'మసాలా చాయి' రుచి పరిచయం కాకపోవడమే కారణం కావచ్చును. 'క్షీరసాగర మధనంలో  సాధించిన సుధ  జగన్మోహిని దేవ దానవులకు పంచే వేళ  ఒలికిపడ్డ ఓ రెండు మూడు  చుక్కలే  భూమ్మీద మొలకెత్తిన ఈ తేయాకు మొక్కలు' అన్నది గురజాడ గిరీశంగారికి అన్నలాంటి మేధావి తీసిన థియరీ! భగీరథుడు అంతలా పరిశ్రమ చేసి భూమ్మీదకు సురగంగను పారించింది ఎందుకైనా ..   లాభం  అందుతున్నది  మాత్రం ఈనాటి మన తరాలకే సుమా! గంగ పారే నేల సారం, గంగ వీచే గాలి తరంగం భారతీయుల  తేయాకుకు అందుకే అంతలా బంగారపు రంగు, సుగంధాల రుచి.. వెరసి విశ్వవిపణిలో విపరీతమైన గిరాకీ!  చైనాకు చాయ్ ఒక ఔషధమయితే, జపానుకు అదే 'ఛదో' అనే ఓ కళ.  భారతీయులకు మాత్రం అన్నివేళలా అవసరమయే ఓ నిత్యావసర పానీయం.  పేటెంట్ హక్కుల కోసమై  తమిళనాట సుదీర్థకాలంగా సాగిన న్యాయ వ్యాజ్యమే తేయాకు మీద భారతీయులకున్న అవ్యాజప్రేమాభిమానాలకు నిదర్శనం.
నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రమండలం మీద పాదం మోపిన మరుక్షణమే 'హుర్రే! పరాయి గ్రహం మీద కాలుపెట్టిన మొదటి మొనగాడిని నేనే!' అని ఓ వెర్రికేక వేయబోతే..'అంతొద్దు! నీకు టీ.. కాఫీలు అందించేందుకు ముందుగానే ఓ అయ్యర్ ను అక్కడ దింపి ఉంచాం' అంటూ భూ కేంద్ర నుంచి సందేశం అందిందని.. ఓ జోక్! కాఫీ.. చాయ్ లు దొరకని స్థలి భువన భాండములో  ఎక్కడా ఉండదు' అన్నదే ఈ ఛలోక్తి సారాంశం. మూడు వేల రకాల 'టీ'లను పదిహేను దేశాలవారు రోజుకు మూడు కప్పులకు తగ్గకుండా తాగుతున్నారంటే తేనీటి మహిమ చెప్పతరమా? రుచికి ఆరోగ్యంతో పొసగదని కదా సామాన్య సూత్రం! కాకర చేదు. కరకరలాడే కారబ్బూందితో గుండెకు ఇబ్బంది. మద్యంతో అందేది పెగ్గుల కొద్దీ అనారోగ్యమే! తేనీటిలోనూ చూపుకు దొరకని రోగకారకాలుంటాయనే వైద్యనిపుణులు కద్దు. ' 'ఆరోగ్యానికి అమరదు'  అని ఎవరేమి అనుకున్నా   కాఫీ చాయిల వంటి అమృత పానీయాల పైన  మనిషి చాపల్యం అమరం.   'కడుపులోకి  ప్రవేశించాక/ కరెంటు లావాలా ఉరకలు వేస్తుంది/  ఆ వేడి నీటిపూల నీరు కాటుకు గుండె  కంట్రోల్ టవర్ నుంచి / తల వెంట్రుకలు కూడా ఫిలమెంటులవుతాయం'టూ మానేపల్లివారు వినిపించిన గిటారు సంగీతం కాఫీ గురించే కావచ్చునేమో కానీ.. నిజానికి ఇరాన్ నుంచి దక్కన్ దాకా ఏ రకం చాయ్ కప్పు చేతికి తీసుకున్నా అంతకు మించిన మరపురాని  ఉత్తేజాన్నందిస్తుంది. ఉత్త ఉత్తేజమే కాదు.. వాషింగ్టన్ అంతర్జాతీయ ఆరోగ్యనిపుణుల తీర్మానం ప్రకారం తేనీరు ప్రాణాంతక వ్యాధులను నిరోధించే దివ్యౌషధం కూడా! ఒక కప్పు చాయ్ కిలో కాయగూరల సారాన్ని ప్రసాదిస్తుందన్నది ఆరోగ్యశాస్ర నిర్ధారణ. చురుకుదనం, జ్ఞాపకశక్తి, రేడియేషన్ కు విరుగుడు, కంటికి చలువ- వంటి ప్రయోజనాలు ఎన్నింటినో  జనాలకు అందించేదీ వేడి వేడి ఔషధమే! అధిక రక్తపోటుకు, నరాల నిస్సత్తువకు, రక్తనాళాలలో అధికమయ్యే కొవ్వు పదార్థాలకు, పంటి చిగుళ్ల సమస్యలకు.. తేనీరు ఓ సంజీవనీ ఔషధం. బ్లాక్ టీ లోని థియాఫ్లావిన్-2 కేన్సర్ కణాల సంహరణకే కాక ఆ ధర్మం నిర్వర్తించే జన్యుకణాల క్రియాశీలతకూ తిరుగులేని మందులా పనిచేస్తుందని అమెరికా విశ్వవిద్యాలయ  పరిశోధనల్లో తాజాగా తేలింది. కేన్సర్ వ్యాప్తికి కారణమైన సివో ఎక్స్ -2 నీ నిర్వీర్యం చేసే చాయ్ నిజానికె సంజీవనీ జేషధమే! చెయ్యెత్తి  ఆ తేనేటి మందుకు  'జై' కొట్టకుండా  ఎట్లా ఉండగలం?
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయఁం - 26, జూన్, 2011)


Sunday, December 15, 2019

తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలు -కీర్తి ప్రతిష్ఠలు -కర్లపాలెం హనుమంతరావు
తోకచుక్కలు తృటికాలం మెరిసి కనుమరుగవుతాయి. గ్రహాల వెలుగు దూరాలు, దగ్గరల మీద ఆధారపడుంటుంది. నక్షత్రాల కాంతి నిరంతరాయం. దవ్వులతో నిమిత్తం లేని చిరంజీవి నక్షత్రం. స్థూలంగా సాహిత్య వినీలాకాశంలో మెరుపులీనే కవులనూ ఈ తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలతో పోల్చుకోవచ్చు. అసమాన ప్రతిభగల వాళ్లను నక్షత్రాలతో పోల్చడం ఉచితం. సామాన్య జనాలకు వీళ్ల ప్రతిభా పాటవాలు బేరీజు వేసేటంత సామర్థ్యం ఉండదు. సమకాలీన రచయితలు వృత్తిఅసూయల కారణంగా వారి కీర్తి ప్రతిష్టలకు అడ్డు.  అన్నిటికీ మించి అత్యంత ప్రతిభావంతులను అనామకులుగానే మిగిల్చే అతి ముఖ్య కారణం.. పూవై పరిమళాలు వెదజల్లక ముందే ఆ మొగ్గలను తుంచేయడం.  సమకాలికుల రహస్య ఆయుధం ఇదే! సాటి రాచయితలు ఎవ్వరూ తమకన్నా ఎక్కువగా కీర్తి ప్రతిష్ఠలు పొందడం గిట్టని ఈర్ష్యాపరులు వీళ్లు. ఎవరూ స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఇష్టపడరాదు. తాము అనుకున్న భావాజాలమే తమకు అనుకూలమైన వర్గ ప్రయోజనాలకు తాము ఆమోదించిన మోతాదులో ప్రతిభను ఉపయోగించే వాళ్లనే వీళ్లు ప్రతిబావంతులైన  రచయితలుగా అంగీకరించేది. వాళ్ల దురష్టం కొద్ది ఎన్ని అవాంతరాలు సృష్టించినా కొంతమంది ప్రతిభావంతులు తాము అదుపుచేయలేనంత నైపుణ్యంతో ఊహించనంత కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. జీనియస్ ల పట్ల సెకండ్ రేట్ సమకాలికుల అకృత్యాలు ఈనాటివి కాదు.
ఎదుటివారి ఆధిక్యాన్ని మరుగుపరచడం రెండు పద్ధతుల్లో సాధ్యం. అంతకన్నా ఎక్కువ ప్రతిభను ప్రదర్శించేందుకు కృషిచేయడం. కష్టంతో కూడిన ఈ పని కన్నా అసలు ఎదుటివాడి ప్రతిభనే గుర్తించకపోవడం సులభం. చేవ తక్కువ అసూయాపరులు అందుకే ఎక్కువగా రెండో పద్ధతిలో పోతుండేది. స్వీయ సంస్కరణ కన్నా రంధ్రాన్వేషణ సులభమైన పని కూడా. కోకిల, కాకి ఒకే పక్షి జాతి. పంచమ స్వరంతో  లోకాన్ని పరవశింపచేస్తుందని కోకిలకు కీర్తి. అది సహించలేని కాకులు గుంపుగా చేరి గోలగోలగా కూయడంలా ఉంటుంది అసూయపరుల అవాకులు, చవాకులు. స్పానిష్ తత్వవేత్త  జాల్త్ జార్ చెప్పుకొచ్చిన ప్రతిభ, అసూయల మధ్యనుండే అంతరం అన్నివేళలా అన్ని స్థలాలా  దర్శనిమిచ్చేదే! ప్రతిభలేమితో బాధపడే ఆత్మన్యూనత నుంచి మనసును ఉపశమింపచేసే బ్రహ్మాస్త్రం అసూయాద్వేషాలు. ద్వేషం దాచి అసూయతో చేసే వెటకారాలు ప్రతిభావంతుల కీర్తిని మరింత పెంచుతాయి.  'ప్రతిభ లేని సందర్భంలో వినయం భూషణంగా భాసిస్తుంది' అంటాడు లిక్టెన్ బర్గ్.  అట్లా అని అతివినయం చేటు తెస్తుంది.  గోతె  'దొంగవెధవలే అతివినయం నటిస్తారు' అంటూ కుండబద్దలు కొట్టేసాడు మరి. సెర్ర్వాంటస్ కూడా తన 'జర్నీ అప్ పర్నాసస్' లో కవులను అతివినయం ధూర్తుల జాబితాలో కలిపేస్తుంది' అని చేసిన  హెచ్చరిక మర్చిపోరానిది. 'నా రాతలు కాలానికి ఎదురీతలు' అని షేక్స్పియర్ లా అతిశయాలు పోవాలంటే షేక్స్పియర్ అంతటి ప్రతిభ ఉందో లేదో బేరీజు వేసుకోవాలి ముందు. చెత్తను మాత్రమే  ఆకాశానికి ఎత్తేసే కువిమర్శకులు అసూయతో చేసే వ్యాఖ్యలు ఒక రకంగా  ప్రతిభ గల రచయితలకు ప్లస్సే! అరచేయి అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్లే కుళ్లుబోతుతనంతో చేసే వ్యాఖ్యానాలు సత్తా గల సద్గ్రంథాలను సహృదయలోకం నుంచి ఆట్టే కాలం దూరంపెట్టలేవు. పనిగట్టుకుని చెత్తను ప్రోత్సహించినా కాలం గడిచే కొద్దీ ఆ కళ వెలాబోవడం ఖాయం.   కాల పరీక్షకు కూడా తట్టుకునే ప్రతిభ తటాలున కళ్లెదుట తలెత్తుకు నిలబడినప్పుడు కుళ్లుమోతులకు మతిపోతుంది ముందు. మాటా పడిపోతుందేమో కూడా!  ఆ మౌన ముద్రా ప్రమాదకరమే. సెనాకా హెచ్చరించినట్లు 'కాటేసే వాటం కోసం కాలనాగులు ఆలోచించే సమయం కూడా కావచ్చును. సాహిత్యం పరిభాషలో ఈ మౌనం పేరే 'విస్మరించడం'. అసూయాపరులతో   ఎన్నేసి  ఇడుములు పడ్డాడో కానీ పాపం..  'విదేశాల నుంచి విడుదలయితే తప్ప  స్వదేశీయుల దృష్టి మంచి పుస్తకం మీద పడదు' అని వాపోతాడు మహా తత్వవేత్త గోతె.
మనం చేసే పనే మరొకడూ చేస్తున్నప్పుడు.. మనల్ని వదిలి ఆ మరొకడిని పొగడ్డం అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్లు. ప్రతిభ పరంగా రెండు పనుల్లో ఉండే తేడాను గుర్తించనీయకుండా మన మనసును శాంతింపచేసేది అసూయ. సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా మానవుల్లో సహజంగా ఉండే నైజమే అయినా కళాజగత్తుని ఈ ఈర్ష్యాద్వేషాలు మరంత ఎక్కువ పాళ్లల్లో ప్రభావితం చేయడమే ఆశ్చర్యం.
ఎన్నో అడ్డంకులని అధిగమించి ఎవరికైనా చిరస్థాయి కీర్తి లభించింది అంటే ఆ ప్రతిభ ఎంతటి ఉన్నతమైనదో అర్థంచేసుకోవాలి.
పరస్పర డబ్బా బృందాల వ్యవహారాలను పక్కన పెట్టి మరంత లోతుగా తరచి చూద్దాం. గొప్ప పని స్వయంగా చేయడంలో ఉన్న తృప్తి ఎదుటివారి గొప్ప పనిని గుర్తించి మనస్ఫూర్తిగా శ్లాఘించడంలో కూడా లభిస్తుంది.  నిజాయితీగా ఒకరిని పొగడడం.. మనల్ని మనం కించపర్చుకోవడం కిందకు రాదు. గ్రీక్ కవి హోమర్ సమకాలీనుడు హీసియడ్ మాటల్లో చెప్పాలంటే 'కొందరికి ప్రతిభ స్వయంగా పసిగట్టే ప్రజ్ఞ ఉంటుంది, మరి కొందరికి విజ్ఞులు విడమరిచి చెబితే అర్థమవుతుంది. చాలామంది స్వయంగా తెలుసుకోనూలేరు. ఎవరు చెప్పినా వినిపించుకొనే సహనమూ ఉండదు.' అందుకే మాకియవెల్లి భావించినట్లు లోకంలో జీవించి ఉన్న కాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు గడించే అవకాశం అరుదు. హీసియడ్ క్లాసిఫికేషన్ లోని రెండో తరగతికి చెందిన సమాజంలో జీవింఛడం కూడా ఒక అదృష్టమే! దొరికిన గుర్తింపు చిరస్థాయిగా నిలబడేదీ ఈ రెండో తరగతి జిజ్ఞాసుల కారణంగానే.
ఒకసారి గుర్తింపు పొందిన పనిని, వ్యక్తిని గురించి తిరిగి తిరిగి పొగిడేందుకు ఎవరూ సంకోచించరు.. సరి కదా, కాలం గడిచే కొద్దీ ప్ర్రశంసలకు పోటీ పడతారు. పదిమంది గుర్తింపు సాధించిన పనిని తామూ పొగడకపోతే తతిమ్మా బృందం కన్నా వెనుకపడతామేమోనన్న హిపోక్రసీ వీరి నోటి నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. జెనోఫోన్ సూక్తి ప్రకార్రం 'జ్ఞానం ఎక్కడ ఉందో గుర్తించడం కూడా జ్ఞానం కిందే లెక్క. స్వయంగా  ప్రతిభ ప్రదర్శించలేని లోపాన్ని ప్రతిభ ప్రదర్శించిన వారిని శ్లాఘించడం ద్వారా అయినా పూరించుకోవాలన్న సామాన్యులకు ఉండే యావ కీర్తి ప్రతిష్ఠల కొనసాగింపుకు ప్రధాన కారణం. అందరూ అందరు ప్రతిభావంతులను పొగడడం అసాధ్యం.  ఏ తరగతికి చెందిన రచయితలకు ఆ తరగతికి చెందిన వందిమాగదులు. ఆ పొగడ్తరాయుళ్ల మధ్య పోటీ కూడా కద్దు. ఎథీనియన్ రాజకీయ పండితుడు ఫోసియస్  అనర్గళంగా ప్ర్రసంగించగల సామర్థ్యం గల వక్త. ఒకానొక సభలో ఆయన ఉపన్యాసం ఉధృతంగా సాగే వేళ  నిశ్శబ్దంగా ఉన్న హాలులో ముందుగా ఒక మూల నుంచి కరతాళ ధ్వనులు మొదలయ్యాయి. కొంత విరామం తరువాత ఒకరికొకరుగా ఆ తమాషాను అందిపుచ్చుకొని  సభాప్రాంగణం దద్దరిల్లేలా చప్పట్లను మారుమోగిస్తుంటే.. అర నిమిషం తరువాత ఆ హంగామానంతా అణగనిచ్చి అణుకువగా 'మరీ అంత మూర్ఖంగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి' అంటూ చేతులు జోడించాడుట. అనుకరణతో కొనసాగే ప్రశంసల వల్ల అసలైన కీర్తి ప్రతిష్ఠలేమాత్రం అబ్బవు. చిరకాలం మనగలిగే కీర్తి క్రమంగా, నిదానంగా పరిపక్వత సాధిస్తుంది. సమకాలికుల సమర్థన ఒక్కటే చాలదు . తరువాతి తరాల  గుర్తింపును కూడా సాధించి నిలుపుకోవడానికి చాలా ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించాలి. సమకాలికుల అసూయాద్వేషాలకు తట్టుకుని శతాబ్దాల పాటు ప్రాజ్ఞులుగా మన్ననపొందేది కోటికి ఒక్కరు. కొద్దిపాటి తెలివితేటలతోనే కీర్తి ప్రతిష్ఠలు మూటగట్టుకునేవాళ్లే ఎక్కువ. తమ జీవితకాలంలోనే మంచు తునకలా కరిగిపేయే పేరు ప్రఖ్యాతులు ఈ తాత్కాలిక వస్తు జాబితాలోకే వస్తాయి. యవ్వనంలో ఓ వెలుగు వెలిగి వయసు వాటారే దశలో పేరు మసకబారే ప్రముఖులు అశేషంగా కనిపిస్తారు. అందుకు విరుద్ధంగా జీవించివున్న కాలంలో ఆట్టే గుర్తింపు లేకపోయినా తరువాతి తరాల దృష్టిలో మేధావులుగా కీర్తింపబడేవాళ్లు కొందరుంటారు. వాళ్లు అచ్చమైన ప్రతిభావంతులు. రోమన్ కేథలిక్ సంప్రదాయంలో మరణానంతరమే సెయింట్స్ గా మన్నింపు దక్కడం ఇందుకు ఉదాహరణ. గొప్పపని వెంటనే సామాన్యుడి మెప్పుదల పొందదు. పజ్జెనిమిదో శతాబ్ది జర్మన్ పాత్రికేయ రచయిత సీగ్ ఫ్రీడ్ తన హెరొడెస్ ' లో ఆ మాటే చెబుతాడు. చరిత్రలోకి వెళ్లి చూస్తే హెరొడెస్ మాటల్లోని వాస్తవం తెలిసివస్తుంది. ఈనాడు గొప్ప కళాఖండాలుగా హారతులు అందుకునే ఏ చిత్రమే చిత్రకారుని జీవితకాలంలో ఆ స్థాయిలో గుర్తింపు సాధించిన దాఖలాలు కనిపించవు. అనేక తరాల పాటు అనేకమంది కళావివర్శకులు వాటి విలువను వివరించినప్పుడు గాని సామాన్యుడికి వాటి గొప్పతనం బుద్ధికెక్కదు. ఇక రచనల విషయానికి వస్తే చిరకాల కీర్తి ప్రతిష్ఠలకు రెండు అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. పండిత పామర జన రంజకంగా ఉండటం.. వస్తువు ఏ తరగతి పాఠకులకు చెందివుందనే కోణం. వీధినాటక ప్రదర్శనకారులు, సర్కస్ కళాకారులు, నాట్యకత్తెలు, గారడీ ప్రదర్శకులు, నటీనటులు, గాయకులు, సంగీత విద్వాంసులు, రచయితలు, భవన నిర్మాతలు, చిత్రకారులు, శిల్పులు, చివరగా తత్వవేత్తలు. తమాషా ప్రదర్శకులకు మాదిరి తత్వవేత్తలకు తటాలున గుర్తింపు రాదు. విషయం వినోదానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఆకర్షణా తక్కువే. తత్వవేత్తల ప్రబోధ సారం తమాషా ప్రదర్శనలో మాదిరి తటాలుమని తలకెక్కదు. లోతైన అంశాల స్వారస్యాన్ని ఆలస్యంగా అయినా  ఆస్వాదించే స్వల్ప వర్గాలు పరిమితంగా ఉంటాయి కనుక తత్వవేత్తలకు ఒక పట్టాన తమ జీవితకాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు దక్కే అవకాశం తక్కువ. సర్వజనామోదం పొందిన వ్యక్తి కీర్తి ఎక్కువకాలం మనలేదు, నెమ్మది నెమ్మదిగా తక్కువ మందితో మొదలయ్యే గుర్తింపు తరతరాలపాటు నిలబడుతుంది.
దాదాపు తత్వవేత్తల సరసనే చేరే వర్గం కవులు, రచయితలు. చిత్రకారులు,  సంగీతప్రాజ్ఞులు, శిల్పనిపుఉణులు. సాకారాత్మకం చెందిన కళకి చావు ఉండదు. అచ్చయిన పుస్తకంలో సరుకుంటే కాలం గడిచిపోయినా ఏదో ఓ శుభదినాన దాని వెలుగులు బైటపడడం ఖాయం. వేలాది రాగి రేకుల మీద నిక్షిప్తమయ్యాయి కనకనే అన్నమయ్య సంకీర్తనలు కాలాంతరంలో ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించాయి. కర్త కన్నా కావ్యం ఎక్కువ కీర్తి ప్రతిష్ఠలు సాధించడం మన్నం చూస్తున్నాం. థేల్స్, ఎంపిడాకల్స్, హెరాక్లిటస్, డెమోక్రిటస్, పార్మెనెడ్స్, ఎపిక్యూరస్  వంటి గ్రీకు తత్వవేత్తలు నక్షత్రాల మాదిరి మేథో జగత్తు మీద వెలుగులు విరజిమ్మడానికి కారణం.. తోకచుక్కలు, గ్రహాల మాదిరి కాకుండా తారల స్థాయిలో  నిదానంగానే అయినా కీర్తి ప్రతిష్ఠలు సాధించడం,
తత్వశాస్త్రం సామాన్యుడి జీవితానికి అనునిత్యం ఉపయోగించే బౌతికాంశం కాదు. దానికి కీర్తి ప్రతిష్ఠలు  తక్షణమే దక్కకున్నా సమాజానికి జరిగే నష్టం తక్కువ. సామాన్యుడి చైతన్య స్థాయిని తట్టి లేపి సుఖమయమైన జీవిత సూత్రాలకు మార్గం చూపించే సత్సాహిత్యం సమకాలీనుల ఈర్ష్యాద్వేషాల కారణంగా మరుగునే ఉండిపోవడం మాత్రం జనావళికి నష్టం కలిగించే అంశమే! వినోదమూ జీవితానికి అవసరమైన దినుసే. ఆ వంటకం తయారుచేసే వంటవాడికీ గుర్తింపు తప్పనిసరి ప్రేరణే. వంటకంలో ప్రత్యేకత ఉంటే  వంటింటి దాకా వెళ్ళి అభినంధించే సంప్రదాయం ఇంగ్లీషువారి సంస్కృతిలో ఉంది. మంచి పుస్తకం మంచి వంటలాంటిదే. కానీ పుస్తకం శ్రేష్టత పనిగట్టుకుని పరిచయం చేస్తే మినహా ప్రాచుర్యంలోకి రాదు. కృత్రిమంగా అయినా సరే కీర్తి ప్రతిష్ఠలు గడించాలని పాకులాడే పేరాశగాళ్ల సంఖ్యే సమాజంలో ఎక్కువ. మిత్రుల చేత పొగిడించుకోడం, భజన బృందాలతో కీర్తించుకోడం, దొంగ విమర్శలు రాయించుకోడం, అసందర్భ సన్మాలకు అంగలార్చడం వంటి ఎన్ని స్వీయ ప్రాయోజిత కార్యకలాపాలకి పాల్పడినా పుస్తకంలో గుజ్జంటూ లేని పక్షంలో గాలి నింపిన బంతి మాదిరి ఆకాశంలో నిలబడుతుంది. గాలి పోయి నేల కూలిన బంతుల్లాంటి నిష్ప్రయోజనమైన సాహిత్యంతో సమాజానికి ఒనగూడే ప్రయోజనం సున్నా. ప్రతిభ అనే ఇటుకలతో నిర్మితమయే  ప్రజాసాహిత్యం శుక్ల పక్షం చంద్రుని మాదిరి దినదినప్రవర్థమానమయి తీరుతుంది. కాలం గడిచే కొద్దీ గురుత్వాకర్షణ శక్తిని కూడా ధిక్కరించి సాహిత్యాకాశంలో వెలుగులు విరజిమ్ముతుంది. సత్సాహిత్యం కాలాతీతమైన కీర్తి ప్రతిష్ఠలు గడించడం సమాజానికే శ్రేయస్కరం.
(మూలంః ఆర్థర్ షోపెన్ హావర్ ప్రసంగం - కీర్తి ప్రతిష్ఠలు- మిసిమి- జమవరి- 2016)
`
 ఇప్పటి అయ్యేయెస్సుల వ్యవహార శైలి ఒకప్పటి సమాల్ రామచంద్ర సార్ ఉదంతం గుర్తుకు తెప్పిస్తుంది. అదికారుల అవినీత పురాణాల మీద  ఆయనగారు బైటపెట్టిన భాగోతంజంగానే గారెలకన్నా రుచి. బాధితులంతా కలసిపోయి సమాల్ సార్ మీద ఓ పిచ్చోడి ముద్ర కొట్టి రాష్ట్రం బైటికి నెట్టేసే దాకా నిద్రపోలేదు అప్పట్లో. ఇప్పుడు నడుస్తున్న అధికారుల దూకుడు చూసినా మరోసారి ఆ సారుగారి చాదస్త ప్రవచనాలే జ్ఞప్తికొచ్చేస్తాయ్!

నాలుక చివర్న నేతి బొట్టేసి నాకవద్దంటే   ఎంత సాధుపుంగవుడికైనా సాధ్యమవుతుందా? నీటిలో ఈదే చేప తాగే నీరు ఏ మాత్రం మోతాదులో ఉంటుందో లెక్క గట్టి ఓ సూత్రం సిద్ధంచెయ్యమంటే  పైకెప్పుడో వెళ్ళిపోయిన ఆ నోబెల్ మేధావి సర్ రామానుజమైనా  నోరు మెదపలేడు.  అర్థశాస్త్ర విజ్ఞానంలో ఎంతో పాండిత్యం వలకబోసిన ఓనాటి చాణక్యుణ్ని తెచ్చి సర్కారు ఖజానా ముందు కుదేసి చూడండి.. నో  యూజ్! సమాల్ సార్ తన నివేదికలో పదే పదే ఢమాల్ ఢమాల్మంటూ వర్ణించిన మాయావిలాసాలు ఆనాడు భగవానుడు ఎత్తిన పది అవతారాలను తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. కాకపోతేక్కటే తేడా! పరమాత్ముడు ఎత్తిన అవతారాల లక్ష్యం ధర్మసంస్థాపనార్థం.    మన అధికారులు ఎత్తుతున్న అవతారాలు స్వార్థానికి చేసుకునే ధనసంపాదనార్థం!
ఏసిబి దాడులప్పుడో, సిబిఐ, ఈడీలకు దొరికినప్పుడో సదరు అవినీతి అధికారిని మనం ఒక చేపతో పోలుస్తాం. ఎప్పుడూ చిన్నచేపలేనా దొరికేదీ?’ అంటూ  ఆ మధ్య అధికారుల సంఘం సమావేశమొకటి పెట్టి మరీ తెగ ఆవేశపడ్డ  ఘట్టం చూస్తే 'మత్స్యావతారం' గుర్తుకురాకుండా ఉంటుందా? చిన్ని చిన్ని చేపలే ఎప్పుదూ వలలకు చిక్కేది. బడా బడా తిమింగలాలకు మింగే నెట్ వర్క్ వేరేగా  ఉంటుంది. ఆ మాత్రం ఆర్థిక సూత్రాలు ఆ పెద్ద పెద్ద బుర్రలకు తట్టవనా? పాడు కడుపు ఆత్రం బైటపడనంత కాలం.. తట్టలో రొయ్యలు ఖాళీ అవుతున్నా అంతా అయ్యవారలే!
ప్రభుత్వ పథకాలు నడిపించే డ్యూటీ నడ్డి మీద కొచ్చి పడ్డప్పుడు చాలామంది అధికారులు కూర్మావతారం ఎత్తేస్తారు. ఎత్తరా మరి? సర్కారు వర్కంటే మూడు మంధర పర్వతాలకు మించిన భారం కదా! సార్ల నడక పెళ్ళి కూతురు మోడల్లో మందంగా ఉండక ఛస్తుందా? అదే ఇంధనం పడిందనుకోండి!  తాబేలు- కుందేలుహానీలో మాదిరి కుందేలు కన్నా ముందే గమ్యం చేరే కూర్మం రోల్ మోడల్’  యిపోతుందా అధికారికి!
'పెద్దల ప్రమేయం ఏమీ లేకుండానే అంతా అధికారులే చేసే ప్రజాస్వామ్యమేనా మనది?' అంటూ అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత అధికారులు నోరు తెరిచి తీసే కూనిరాగాల కచేరీకి  ఒక వేదిక ఎప్పుడూ  తయారుగానే ఉంటుంది. ఆ బురదజల్లుడు కార్యక్రమంలో అధికారిది  'వరాహమూర్తి' అవతారం! ఈ వరాహమూర్తుల 'నోట్' లో నోట్ పెట్టినందుకే అప్పట్లో సమాల్ సాబ్ అంతలా కమాల్ చేసినా పిచ్చివాడుగా మాత్రమే చివరికి చరిత్ర పుటలకెక్కింది!
అధికారులందరిలో కామన్ గా కనిపించే  సామాన్యగుణం అతివినయం. పై వాళ్ల ముందు ప్రదర్శించే ఆ ధూర్త లక్షణం.. తన కింది వారి ముందుకు వచ్చేసరికి దూర్వాసుని వారసత్వపు దుర్లణంగా మారిపోతుంది. ఆ బాపతు అరసింహావతారాలు  'దశావతారాల' తాలూకు 'నరసింహావతారాలకు  నకళ్లు!
పొట్టి సంతకంతో పని నడిపించే అధికారులు వామనావతారులు. గిలికే హస్తాక్షరి పొట్టిది అయితేనేమి.. రెండడుగులతో భూమ్యాకాశాలను ఆక్రమించి  మూడో అడుగు ఎవరి  మాడు మీద వేసి  బలిని మాదిరి పాతాళానికి తొక్కేద్దామా అని ఎదురు చూసే   వామనాతారులు  ఈ బాపతు అధికారులు!
ఒకే నోట్.. ఒకే పార్టీ! 'ఒకే బాణం.. ఒకే భార్య' తరహాలో సాక్షాత్ ఆ మర్యాదారామచంద్రుల దారిలో నడుచుకునే బుద్ధిమంతులూ  కద్దే అదికారుల్లో! కానీ..  అయితే ఆ కొద్ది మంది ప్రవర్తననూ అస్తమానం అనుమానంలో పడదోసే  అమర్యాదారాముల లెక్కే అధికం అధికారుల వర్గంలో! మర్యాద బాపతు ఆఫీసర్ల సరుకు ప్రజారాముళ్లకు ప్రతిరూపాలయితే .. అమర్యాద బాపతు సార్లకు మాత్రం 'ఆత్మారాముల' సంతృప్తి మాత్రమే పనికి వచ్చే ప్రధాన సూత్రం.

నీతిగా పనిచేసే అధికారులు అసలే లేరంటే అపార్థం చేసుకున్నట్లవుతుంది. కానీ.. అధికశాతం అధికారుల్లో మనీ 'పరసురాముళ్ళ'  శాతమే ఎక్కువని ఇన్నేళ్ల మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల అనుభవాలు  ముక్కు గుద్ది మరీ చెప్పే సుపరిపాలన సారం!
ఆయుధం పట్టకుండా కథ నడిపించగల కృష్ణావతారులూ అధికారుల్లో కోకొల్లలు. 'చెలుల చీరెలు దోచి.. చెల్లి చీరెను కాచి.. చేసెనే లాలూచి' అంటూ ఆరుద్రగారు ముద్ర గుద్దినట్లు మరీ చెప్పిన కూనాలమ్మ పదాలకు ఈ బాపతు కృష్ణావతారులు ఉదాహరణలు! గిట్టుబాటైతే రాయబేరాలు నడిపించడం, అవసరార్థం చక్రాలు అడ్డుపెట్టడం ఈ అవతారంలో అధికారుల గడసరితనం. ఆయా లీలా మాయావినోదాలలో పాలుపంచుకున్న ఈ కృష్ణుళ్ళల్లో ఏ సారైనా    నోరు తెరిస్తే నికృష్ట 'భువన భాండంబు' లెక్కలు బైటకుపొక్కేస్తాయ్! ఏనుగుకుండే అసాధారణ జ్ఞాపకశక్తి ఆయుధంగా వాడగలిగే   అధికారులను అందుకే పదవీ విరమణల పిదపా సర్కార్లు ఏదో ఓ  సలహాదారు పదవి పేరుతో ఏనుగు లాంటి కార్ల మీదెక్కి  మరీ ఊరేగే అవకాశం దయచేసేది!
జీత భత్యాలిచ్చే పదవుల నుంచి విరామం లభించినా ప్రభువుల భృత్యు సేవ నుంచి విముక్తి దొరకని అధికారులు 'బుద్ధావతారం' కోవకి చెందుతారు. సర్కారు జీవోలు వీరికి కంఠోపాఠాలు.  నేతల జాతకాలు కరతలామలకాలు! జ్ఞాన సముపార్జన అవసరానికి మించి  అధికంగా సాధించిన ఈ ప్రభుద్ధులకు ఏదో ఓ పీఠం కట్టబెడితేనే 'బుద్ధులకు' మల్లే  పద్ధతిగా మసలుకొనేది. ఎంత విలువ’ అయినవైనా సరే బుద్ధావతారుల ఉచిత సలహాల సర్కారు పెద్దల  మనుగడకు ఎప్పటికప్పుడు చాలా  అవసరం ప్రజాస్వామ్యంలో.
ఏ అవతారం అచ్చిరాకుంటే అధికారి ఎత్తే ఆఖరి అవతారం 'కల్క్యావతారం'. మునుపు ఆ సమాల్ సార్  చివరకు ఎత్తింది ఆ అవతారమే!   మొన్నీ మధ్యన కృష్ణారావుగసారు ఎక్సెట్రాలు పట్టిన బాటా అదే. గిట్టనప్పుడూ, గిట్టనివాళ్లు గద్దెలు ఎక్కి, దిగినప్పుడూ రూల్సు అనే కరవాలాలు ఝళిపిస్తో అధికారం అనే అశ్వం అధిరోహించి మరీ కదన రంగానికి ప్రత్యక్షంగా ఎప్పుడు కదలివచ్చేస్తారో ఆ పోస్టులకు రికమండు చేసిన శక్తులకూ తెలియదు!
భగవంతుని ఏ అవతారమైనా ఆఖరి లక్ష్యం  ధర్మ సంస్థాపనే కదా! కాకపోతే  దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ  ప్రజాస్వామ్య ధారావాహికంలో ఎవరు ఎప్పుడు దుష్టులుగా.. ఎవరు ఎందుకు విశిష్టులుగా  మారిపోతారో అంతుబట్టకే ఓటేసే బోడి మల్లయ్య బిక్కచచ్చి బుర్రగోక్కుంటూ కూర్చునుండేది చేసేది మరేమీ చేతిలో లేక!
***
కర్లపాలెం హనుమంతరావు
(కౌముది - అంతర్జాల మాసపత్రిక ( 'చుట్టు పక్కల చూడరా'- కాలమ్) ఏప్రిల్, 2012 ప్రచురితం)
-

Saturday, December 14, 2019

చలం గురించి - కర్లపాలెం హనుమంతరావు


చలం అంత అపార్థం చేసుకోబడిన రచయిత తెలుగులో మరొకరు లేరంటారు. నాది కూడా ఒక సందర్భంలో.. ఒకానొక వయసులో అదే మానసిక స్థితి. అస్సలు చలం పుస్తకం కనిపిస్తే చాలు మొహం వికారంగా పెట్టి పక్కకు నెట్టేసిన   వాడిని. These all are of because of our preoccupied positions on so called Social stigma prevailed at that particular period.. అన్న తెలివిడి బలిసిన తరువాత ఒక్కొక్కటే అజ్ఞాన ద్వారం వెనకటివి మూసేసుకుంటూ  ముందుకు పోయే గుణం మార్క్సిజం నేర్పిన తరువాత ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా వాత్సాయన కామ సూత్రాలనుంచి రాహుల్ సాంకృత్యాయన్ వరకు అందుబాటులోకి వచ్చినవన్నీ  సంపూర్ణంగా చదివి సాపేక్షికంగా తుల్యమానం చేసుకొని సంతృప్తి చెందిన తరువాతనే ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పరుచుకోవాలని తెలుసు కున్నాక మళ్లీ ఒక్కొక్కటిగా చలం పుస్తకాలు తెరిచి చదవడం మొదలు పెట్టింది . అప్పటిక  నా బుద్ధికి అర్థమయిన విషయం ఏవిటంటే.. చలం ఆశయం ఇప్పటి సామాజిక దృష్టి కోణంతో చూడగలిగితే కచ్చితంగా గొప్పదే. స్త్రీలవరకు ఇప్పటికీ జరుగుతున్న  దైహిక, మానసిక దోపిడి అక్షరాలా సత్యమైనదే. కాకుంటె అప్పటికింకా ఇప్పటి దానిలో ఐదో శాతమైనా వికసించని సమాజానికి తప్పని అనిపించడమూ సహజమే అనిపించింది. చలం ఎక్కుపెట్టిన అస్త్రాలన్నీ ఎక్కువగా 'బ్రాహ్మణవాదం' మీద. ఇహ సహి స్తుందా చాందస లోకం? అదీ కాకుండా ఆయన మరీ దురుసుగా  'ఆపరేషన్ క్లీన్' కి తలపడ్డాడేమోనని నాకనిపిస్తుంది. 
అదే భావజాలం  కొడవటిగంటి కూడా వెలిబుచ్చుతూనే తెలివైన  గడుసుదారిలో చురకలు, హాస్యం అనే చమ్డాకోలు తోళ్లను అదిలిస్తూ ముందుకు పోవడం మనం గమనించవచ్చు. కొకును ఇష్ట పడుతూనే చలంని అసహ్యించుకోవడం వెనక చలం జీవన సరళి కూడా ఒక ప్రధాన కారణం కావచ్చును. ఆయన ఏమయితే చెప్పదలిచాడో అది అందవలసిన వారికి అందక పోవడానికి, అందించవలసిమధ్యవర్తులకు అందించడానికి జంకడానికి  కారణాలు చలం ఎన్నుకున్న సామాజిక చట్రం సమ్మతించని నైతిక చట్రంలో ఇమడకపోవడమే! వ్యక్తిగా  వాటిని పక్కన పెట్టి చూస్తే చలం ' చెప్పింది  ఒకటి..చేసింది ఒకటి జాతికి ' చెందిన వాడు కాకపోవడం హర్షించదగిన విషయమేగా! నాటి ఎంతోమంది కవులు ప్రసిద్ధ రచయితలు వ్యక్తిగత, ప్రవచన జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉండటం గమనించవచ్చు. చలం భావనలు ఎంత తీవ్రమైనవో వాటి వ్యక్తీకరణల స్థాయికూడా అంతే తీవ్రంగా సాగింది. ఆయన భావాలు సున్నితంగా ఉన్న సమయంలో ఆ వ్యక్తీకరణలు అంతే సున్నితంగా సాగిన విషయమూ మనం గమనించాలి. చలం గీతాంజలి అవడానికి ఠాగోర్ రచన మూలమే అయినా ఆయన తనదైన ఆత్మతో దానిని మళ్లీ తెలుగులో వెలిగించాడు. చలం గీతాంజలిలోని ఒక్కో శబ్దం స్వయం పూర్ణం.. స్వయం సంశోధితమార్గం.. స్వయం శోభిత దుఃఖ సంక్షుభిత సందిగ్ధ ఆత్మార్పణ ప్రయత్నం. 
నా నలభైలలో నేను గీతాంజలి చదువుతున్నప్పుడు రోజుకు ఒక్క పద్యం మాత్రమే చదివే వాడిని. దానిని తిరిగి నా డైరీలో చూడకుండా రాసుకొనేవాడిని. ఆ ట్రాన్సులో ఉన్నప్పుడే నాదైన సొంత పద్యం నా డైరీలో రాసుకొనేవాడిని. అన్ని పద్యాలకూ అన్ని నా సొంత పైత్యాలు రికార్డులో నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. 
చలం మ్యూజింగ్సుతో మొదలు పెట్టండి వీలైతే మళ్లీ  చలాన్ని చదవాలనుకునే వారు ఎవరైనా. ఆ మైదానం వంటి నవలలు ఇప్పుడు కేవలం అపార్థం చేసుకున్న చలాన్ని మళ్లీ అర్థం చెసుకునేందుకు మాత్రమే పనికొస్తాయి కానీ.. సమాజం అర్థమయేందుకు పనికి రావు. They are all out of context now! చలం ఊహించిన దానికన్నా బాగా ముదిరి పోయింది ఇప్పటి కాలం!
కర్లపాలెం హనుమంతరావు 
13 - 12 - 2019 
బోథెల్ ; యూ . ఎస్ 

వనం, మనం; మధ్యన దైవం కర్లపాలెం హనుమంతరావు
వనం హిందువులకు దైవం. చెట్టులో పుట్టలో దేవుళ్లను దర్శించుకునే తత్వం భారతదేశం అంతటా కనిపిస్తుంది.  వనం మనకు వట్టి వనదేవతేనా.. వరాలు ప్రసాదించే వనలక్ష్మి కూడా. లక్ష్మి సంపదలకు పర్యాయపదం. కాబట్టి ప్రకృతి ప్రసాదాలే అయినా చెట్టూ చేమా మనుషులకు ఆస్తి పాస్తుల కిందనే జమ.
ఆలయం నిర్మాణం తరువాత దేవతా విగ్రహాలు ప్రతిష్టాపనకు ముందు   పరిసరాలలో చెట్టూ చేమా వృద్ధిచెందే అవకాశాలను పరిశీలించే పద్ధతి పురాణేతిహాసాల కాలం బట్టి అనూచానంగా వస్తున్న ఆచారవ్యవహారలలో అంతర్భాగం!  
పంచభూతాలలో ఒకటిగా పరిగణించే పృథ్వి విఘ్నాధిదేవత వినాయకునికి ప్రతిరూపంగా భారతీయుల ఆధ్యాత్మిక భావన . ఆయనకు శమీ, దూర్వ పూజలు ఇష్టం. ఉదకానికి భవానీమాతగా పరిగణన. ఆమెకు అశోక, విష్ణుక్రాంత దళాలతో పూజంటే ప్రీతి. వాయువు విష్ణువు కింద జమ. అశ్వత్థ, తులసీ దళాలతో అభిషేకం అంటే ఆయనకు మోజు. ఆకాశం ఈశ్వరాంశంగా భావించడం హైందవ ఆచారం. బిల్వ, ద్రోణ సంబంధ పూజాదికాలంటే అంబర దేవునికి మహా సంబరం. అగ్ని సూర్యభగవానుడు. ఆయనను అర్క, కరవీర పుష్ప పత్రాలతో పూజిస్తే శాంతిస్తాడని నమ్మకం.
భగవంతునికి ప్రతీకలుగా చెట్లను భావించే అనాది మనస్తత్వం నుంచే నేటి మన ఆలోచనాధారా వికసిస్తో వస్తున్నది.
వేరు నుంచి చిగురు వరకు చెట్టులోని ప్రతీ కణమూ ఏదో ఒక దేవునికి ప్రీతిపాత్రమైనదిగా భారతీయులు భావిస్తుంటారు. ఫల, దళ, పుష్ప సముదాయాల వంటి సరంజామా లేని  పూజావిధానం మనం ఊహించనైనాలేము కదా! శుభకార్యాలలో సైతం చెట్టు చేమల పాత్ర అనివార్యం. దేవీదేవతల చిత్రాలలో మనకు ఏ మూలనో ఓ మూల పిసరంతైనా కాయో, కొమ్మో, పండో, చిగురో కనిపించడం తప్పనిసరి. వృక్ష ప్రమేయం లేని దైవత్వాన్ని ఊహించడం భారతీయులకు మనస్కరించదు.
రామాయణ, భారత, భాగవతాది మహా కావ్య, పురాణాదులు వర్ణించిన వనాల వివరణ వింటుంటే చెవులకు బహు పసందుగా ఉంటుంది. రామాయణంలోని చిత్రకూటం, పంచవటి, అశోకవనం, ఋష్యమూకం, కిష్కింధ, మధువనం వంటి  మనకు తెలిసినవే కాకుండా అనేకానేక ఇతర వన్యదేవాలయాలూ ఉన్నాయి. మహాభారతంలో ఖాండవవనం, , కణ్వాశ్రమం, దైతవనం  దండకారణ్యాలు.. మహాభాగవతంలోని నైమిశారణ్యం, బృందావనం, వంటి వనాలూ ఈ కోవకే చెందే అందాల హరితాలయాలే.
కృష్ణుడు బృందావన సంచారి. వనమాలి, కుంజవిహారి. ఆ హరితప్రేమి  వేణువు ధరించి వేణుమాధవుడయినాడు. కొండను గోటికి ఎక్కించి గిరిధారి, ఆలమందలను వనాల వెంట తిప్పి  గోపాలస్వామి అయిన ఆ నీలమేఘస్వామిని చూసైనా మనిషికి, ప్రకృతి సంబంధమైన చెట్టూ చేమకూ మధ్య ఉన్న అవినాభావ అనుబంధం అర్థమవాలి.  
కృష్ణుని మాదిరే రాముడూ నిత్య సత్యమాలాధరుడు. అవతారమూర్తుల మూల మూర్తి విష్ణువు చేతిలో పద్మం, నాభిన తామర! అతని సహచరి లక్ష్మిదేవిది పద్మాసనస్థితి. రెండు చేతులా రెండు కమల పుష్పాలు ధరించిన ఆ మందస్మిత  దర్శనం కళ్లకు పండువుగా ఉండటం సహజం. 
ఇక ఈశ్వరునిది బిల్వలోకం. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ మూర్తి దర్శన భాగ్యం లభించిన పిదపనే పద్మపత్రాలు వికసించినట్లు.. ప్రకృతి పచ్చగా పలకరించినంత కాలమే మనిషిలోని చైతన్యం ప్రవర్థిల్లేది!
సృష్టి ఆరంభానికి ముందు భగవానుడు బాల దిశమొల స్థితిలో వటపత్రం పైన శయనించినట్లు   భారతీయులు భావించడం మనకు తెలుసు.  బాలశాయి శయనతల్పం రావిపత్రం  అశ్వత్ఠామ వృక్ష ప్రసాదితం. బాలకుడి బొడ్డు నుంచి లేచి నిలిచిన తామర తూడు కొసలు విస్తరించిన భాగమే సృష్టిని ప్రారంభించిన శక్తికి ఆధారభూతమయింది' అన్న ఆ కల్పనల్లో లోతైన ప్రతీకలే ఉన్నట్లు ఆధునిక  తత్వచింతనాపరులూ భావించడం విశేషం. ఆకులలమల బంధంలోనే స్త్రీ-పురుష బంధాల మూలాలు ఉన్నట్లు భావించడంలో  తర్కం ఎంత వరకుందో ఎవరికి వారుగా  విచక్షణాశీలులు తర్కించుకోవలసిన అంశం.
ఆకుల ఆకృతిని బట్టి రావికి పురుషత్వం, వేపకు స్త్రీ తత్వం ఆపాదించిన మేథస్సు మనిషిది.  కళ్యాణం జరిపించిన  ఆ  రావి- వేపల జంట నీడ కింద నాగ'బంధం' ప్రతిష్ఠించి దాని చుట్టూతా   ప్రదక్షిణాలు చేయిస్తే జంటకు నూరేళ్ల పంటగా సంతానం ప్రాప్తిస్తుందని పూర్వీకుల నుంచి ఓ విశ్వాసం.
దశావతారాలలోకి మనం లాగేసుకున్న బుద్ధుడి అవతారమూర్తి గాథల్లో ఈ రావిచెట్టుకు అద్వీతయమైన 'బోధివృక్షం' స్థాయి కల్పించడం హైందవుల గడసరితనానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. 
విష్ణువుకు తులసీ దళం ప్రీతి. నిత్య తులసీ దళ మాల గళధారి  ఆ లక్ష్మీనాథుడు .  మన్మథుడు తులసీ పత్రాలతో అల్లిన శరాలనే తన లక్ష్యాల పైన ప్రయోగించేది. మదనుడి అమ్ముల పొది వివిధ రకాలైన పుష్పబాణాదులతో నిండి ఉన్నట్లు ప్రబంధ కావ్యాల నిండా వర్ణనలే వర్ణనలు!  
ఆరోగ్య క్షేత్రంలో వృక్షజాతికి అగ్ర తాంబూలం అందించింది ఆయుర్వేదం.  ఆ చికిత్సా విధానం  అంటేనే వృక్ష సంతతికి చెందిన వనరుల ప్రయోజనాల ఏకరువు.  క్షీర సాగర మధన కథనంలో సముద్ర గర్భం నుంచి వెలికివచ్చిన కల్పవృక్షం కథ అందరికీ సుపరిచితమే కదా!
ప్రాచీన సాహిత్యం మీదనే కాదు సుమా.. ఆధునిక నాగరికత పైన కూడా చెట్టూ చేమకు గల  పట్టు సామాన్యమైనది కాదు. ఉదకమండలం మొదలు, కలకత్తా చండీగఢ్ తాలూకు వృక్ష  సంబంధమైన తోటలు, బెంగుళూర్ లాల్ బాగ్, మైసూర్ బృందావనం, కశ్మీర్ శ్రీనగర్ మొగలాయీ ఉద్యానవనాలు, దిల్లీ రాష్ట్రపతి భవనం ఆవరణలోని అలంకార వనాలు.. ఇట్లా  చెప్పుకుంటూ పోతే అంతూ పొంతూ లేనంత పెద్ద జాబితా భారతదేశంలోని పచ్చదనాల కథా కమామిషూ. 
 ఆంధ్రదేశంలోని తిరుమలవాసుని సేవకై పెరిగే వినియోగపు పూల తోటల కథ మరీ ప్రత్యేకమైనది. దేవతా విగ్రహాల స్థానే దేవతావృక్షాలను స్థాపించే సంప్రదాయానికి దేవాలయ వాస్తు, శాస్త్ర సూత్రాలు ప్రస్తుతం దారి చూపించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆచారంలో ఉన్న కొన్ని తోటలు నాటే విధానాన్ని స్థాలీపులాక న్యాయంగా పరిశీలించే ప్రయాస మరో సందర్భంలో చేసుకోడం సముచితం. 
-కర్లపాలెం హనుమంతరావు
13 -12 -2019, బోథెల్, యూ.ఎస్