Showing posts with label Karona. Show all posts
Showing posts with label Karona. Show all posts

Sunday, April 25, 2021

మహమ్మారి కరోనా విస్తరణకు - మన లెక్కలేనితనమే కారణమా! -కర్లపాలెం హనుమంతరావు

 

 



రష్యా అధినేత కృశ్చేవ్ ఓసారి ఇండియా వచ్చినప్పుడు స్వాగత వచనాలు పలికి తోడుకుని తెస్తున్నాడుట అప్పటి మన దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. మార్గమధ్యంలో  ఓ పౌరుడు తన ట్రేడ్ మార్క్ చెంబుతో పొదల్లో దూరడం చూసి కృశ్చేవ్ ఆసక్తి కొద్దీ అతగాడు అంత పరగడుపునే పొదల చాటుకెళ్లి చేసే మహాకార్యమేంట’ని అడిగితే, వివరాలు కనుక్కొచ్చిన మనిషి తెచ్చిన సమాచారం దేశం శుచి శుభ్రతలకు సంబంధించిందవడంతో చెప్పలేక చెప్పి చాచాజీ తలొంచుకున్నాడుట. మరి కొంతకాలం తరువాత అదే సన్నివేశం మాస్కోలో కాకతాళీయంగా జరిగటంతో  చాచాజీకీ బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. 'చెంబు చేత పట్టుకుని పొదల చాటుకు జనం పరుగెత్తే దృశ్యాలకు తమ దేశమూ కొదవేంపోలేదూ!' అన్నట్లు నవ్వితే తలతీసినట్లనిపించిందీ సారి  కృశ్చేవ్ కి. ఆ అనాగరికుడిని పట్టి తెమ్మని ఆయనిచ్చిన ఆదేశం మేరకు.. వెళ్లి వచ్చిన మనిషి 'ఆతగాడి పలుకును బట్టి ఇండియనని చెప్పడంతో చాచాజీకీ మరో మారు తలవంచుకునే పరిస్థితి తప్పింది కాదు'అని కుశ్వంత్ సింగ్ ఓ సందర్బంలో చెప్పిన పిట్టకథ ఇప్పుడు గుర్తుకొస్తోంది. భారతీయులను అవమానించే ఈ తరహా చెత్త కథలు  కట్టుకథలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  కానీ.. అలవాట్ల వరకు భారతీయుల వెకిలి చేష్టలను చక్కగా వెలిబుచ్చేవని మాత్రం ఒప్పుకోక తప్పదు.

మారుతున్న కాలంలో ఇప్పుడు ఏ భారతీయుడూ విదేశీ గడ్డ మీద ఆ విధంగా ప్రవర్తించడంలేదు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము' అన్నట్లు మాతృభూమి వళ్ళు పులకరించేలా ఎంతో ఒద్దికైన ప్రవర్తనతో పదిమంది మధ్యనా ఆదర్శవంతంగా నడుచుకుంటున్నాడు. కానీ.. చిత్రంగా ఆ బుద్ధిమంతుడే కన్నభూమి పై కాలు పెట్టిన తొలిక్షణం నుంచి  మళ్లా లోపలున్న ఒరిజనల్ని బైటికి తీసేస్తున్నాడు! పాత దురలవాట్లను శాయశక్తులా పాటిస్తున్నాడు! రోడ్లను  యధా తధంగా ఉమ్ముతో పావనం  చేయడం నుంచి కుండీ ఎదుటే ఉండినా  చెత్త అందులో పడకుండా శాయశక్తులా శ్రద్ధవహించడం వగైరా.. వగైరా వరకు.. ఏది చట్టమో అంతా తెలిసినట్లే.. పంతంగా వాటిని ఉల్లంఘించే పాత అలవాట్లనే సాధన చేస్తున్నాడు! అందువల్లనే పై తరహా చిల్లర కథలకు అంత  విస్తృతమైన   ప్రచారం!

క్రమశిక్షణారాహిత్య కార్యకలాపాలలో సుశిక్షణేదో పొందినట్లు మనం మరీ అంత విపరీతంగా ప్రవర్తించడం ఎందుకు! ప్రస్తుతం దేశంలో జరిగే కరోనా విలయ తాండవంలో  ఈ అపరిశుభ్రతే కదా ముఖ్య కారణం!

మొదటి దశలో ఎంతో శ్రద్ధగా ధరించిన మొహం తొడుగులు రెండో దశలో ఎందుకు నామర్దాగా మారినట్లు! ప్రారంభంలో వైద్యులు చెప్పుకొచ్చిన సామాజిక దూరం వంటి జాగ్రత్తలన్నీ నియమబద్ధంగా పాటించిన మనమే తదనంతర దశలో  ఏం ఘనకార్యం సాధించామని  పూర్తిగా గాలికి వదిలేసినట్లు! పెళ్లిళ్లు, ఉత్సవాలు వంటి సామూహిక కార్యక్రమాలకూ సై అనేందుకు ఏ వైద్యం మనల్ని కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి చేసేసిందని! ఇంటికొకరు పిట్టల్లా రాలుతున్న కరోనా దేశంలో   హరిద్వారా కుంభమేళా, అయిదు రాష్ట్రాల ఎన్నికల మేళా చూసి ప్రపంచం నోరెళ్లబెట్టేస్తోంది. కనిపించే రోగగ్రస్తులకు ఎన్నో రెట్లు కనిపించని రోగవాహకులుగా ఉన్న  దుర్భర పరిస్థితులకు కారణాలేమిటో కనుక్కునే ప్రయత్నాలు ఏ కోశానా కనిపించడం లేదు ఇప్పటికీ! మన అపరిశుభ్రతే మనకు తీరని శాపం అని  సామాన్యుల నచ్చచెప్పేందుకు ఇంకే బ్రహ్మదేవుడు దిగిరావాలో!

పరిశుభ్రతకు సంబంధించిన చట్టాలు లేక కాదు. ఉన్నవాటినైనా కఠినంగా అమలుచేసే చింతన లేదనే ఈ చింతంతా! అపరాథ  రుసుం పైసల్లోఉండటంతో ‘ఆఁ! చెల్లించేస్తే పోలా!’ అన్న తుస్కార ధోరణే తప్ప సంస్కార కోణంలో ఆలోచించే గుణం తరతరానికి తరిగిపోతూ రావడమే కరోనా తరహా మహమ్మారులకు మన మీది ప్రేమ దినదినాభివృద్ధి చెందడం.

నిజం నిష్ఠురంగానే ఉంటుంది. ద్విచక్రవాహన చోదకులు ఎంత మంది శిరస్త్రాణాలు ధరిస్తున్నది? ధరించనివాళ్ళ మీదయినా నమోదయ్యే కేసులు ఎన్ని? ఎరుపంటే ఏదో జడుపున్నట్లు  ఆ రంగు లైట్ కంటపడగానే ఆగాల్సింది పోయి  వాయువేగంతో పారిపోయే వాహనాలే జాస్తీ మన దేశంలో ఎంత  బిజీ రోడ్ల మీదయినా! ‘ఒన్ వే’ అంటూ  నియమం ఓటి  ఉన్నా ‘జానే దేవ్’ అనే సజ్జే గజ గజానికీ ఈ దేశంలో! మూగజంతువు మీద నుంచి బండి నడుపుతూ పట్టుపడితే అపరాధ రుసుం కేవలం 50 రూపాయలా! కబేళాకు గొడ్డును అమ్మేందుకు ఆరోగ్యంగా ఉండే కాలును పుటిక్కున  విరిచేస్తున్నాడు త్రాష్టుడు! జబ్బు పడ్డ గొడ్డును పోషించడం ఖర్చుతో కూడిన వ్యవహారమయితే.. అదే కబేళాకు అమ్మేస్తే ఝంఝాటం వదలడంతో పాటు అదనంగా అంతో ఇంతో ధన లక్ష్మీదేవి సుప్రసన్నం!

సింగపూర్ లో ట్రాఫిక్ ఉల్లంఘనకు శిక్ష వెయ్యి డాలర్లు. చెల్లించలేని పక్షంలో జైలు శిక్షలు. అదే ఇండియాలోనో! గుప్పెడు రూకలతో చూపిస్తే అంతా గుప్.. చుప్! అవినీతిని గురించీ, న్యాయ విచారణల తీరును గురించి ఎంత తక్కువ చెబితే అంత మన్నన.

రోడ్డు నిబంధనలు తెలుసుకుని, నేర్చుకుని కష్టపడి  పరీక్ష ఉత్తీర్ణమవకుండానే  కొంత సొమ్ము మనది కాదనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికే బెంజి కారులో వచ్చేసే వ్యవస్థలో మనం బతుకుతున్నది. మందు కొట్టి బండి నడిపినంత మాత్రాన గ్యారంటీగా పోలీసు కేసు బుక్కవాలనుందా ఇక్కడ? కేరాఫ్ ఫుట్ పాత్ గాడి  పీకల మీద నుంచి గాడీ నడిపేసుకెళ్ళిన బేఫర్వా  హీరోగాడే సేఫ్ గా మూవీలు చేసుకునే దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఎవడికి తోచిన అర్థం చెప్పుకుంటున్నాడు మరి.  సాంకేతిక కారణాలనేవి సైంధవుడి సోదరుడికి మల్లే   అడ్డుపడకుంటే  ఈ దేశపు  చట్టసభలను నింపే శాల్తీల పడకలన్నీ నిజానికి సెంట్రల్ జైళ్లలో ఉంటాయి. పగటి కలలో అయినా ఆ మాత్రం  సంస్కరణలను ఊహించుకుంటే పిచ్చాసుపత్రిలో బెడ్ సిద్ధం చేసే దుస్థితి. తోటకూర నాటి నుంచే విచ్చలవిడితనం ఇచ్చే సుఖాలు మరిగిన సంతు ఎదిగొచ్చే కొద్దీ ఎంత అసాంఘిక జంతువుగా మారుతుందో చెప్పాలంటే మరో  థగ్గుల చరిత్ర తిరగరాసినంత తంతవుతుంది.  

'ఇచ్చట మల మూత్రములు విసర్జించ రాదు' అన్న హెచ్చరికలు ఇక్కడ దర్శనమిచ్చినన్ని బహుశా ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ కనిపించవు. నడిరోడ్డు పక్కన మగవాళ్లు ప్యాంటు జిప్పులు నిస్సిగ్గుగా తీసే జగుప్సాకరమైన సన్నివేశాలకూ ఈ పవిత్ర దేశమే ప్రథమ స్థానం.  

1936 ప్రాంతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషనంటూ ఓటి ఏర్పడి  గాంధీజీ అప్పటి అవసరాలకని ఇచ్చిన 'పౌరుల సహాయ నిరాకరణ' ఉద్యమానికి ఊతంగా విద్యార్థులను బళ్ల నుంచి బయటికి వచ్చేయమంది. గురువుల బోధనలను ధిక్కరించినవాడే అప్పట్లో గొప్ప దేశభక్తుడుగా గుర్తిస్తానంది! బ్రిటిష్ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించేలా సమాచార, రవాణా, పాలనా సౌకర్యాలు సర్వస్వానికి ఆటంకాలు కల్పించడాలవంటివి ఏళ్ల పర్యంతం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించిన సంస్కృతి ఈ దేశానిది.  స్వాతంత్ర్యం వచ్చినా తుచ్ఛ రాజకీయాలలో అదే నీచ సహాయ నిరాకరణ ధోరణులు! పుట్టుకొస్తున్న కొత్త తరాలకు  నియమ నిబంధనల పట్ల  ఉండవలసిన స్థాయిలో బాధ్యతాయుతమైన భయభక్తుల కొదవ అందుకేనేమో అనిపిస్తున్నదిప్పుడు! రాజకీయ పక్షాలే స్వలాభాపేక్ష నిమిత్తం విద్యుత్ వగైరా బిల్లులు చల్లించవద్దని, బ్యాంకు రుణాలను నిర్భయంగా  ఎగవేయమని,  పాఠశాలలకు వెళ్లి ఫలానా విద్యలు చదవరాదని,  రాస్తాలను దిగ్బంధనం  చేసెయ్యాలని, బస్సులు పై రాళ్లు రువ్వాలని, రైలు పట్టాలు పీకెయ్యాలని, ప్ర్రభుత్వ అస్తులు ధ్వంసం చేసి మరీ ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శించాలని ప్రోత్సహిస్తున్నప్పుడు సామాన్య పౌరుడికి ఏది ఎప్పుడు ఎవరి మాట ఏ మోతాదులో ఆచరించవలసిన అగత్యం ఉందో ఎట్లా అవగాహనకొచ్చేది?

భారతీయులు అమితంగా ఆరాధించే ఆరాధ్య గ్రంథం భగవద్గీత కర్మయోగమే విశిష్ఠమైన వ్యక్తులు ఏమి చేస్తారో చూసి తతిమ్మా ప్రపంచం దాన్నే అనుసరిస్తుందని   'యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే' శ్లోకంలో చెప్పింది కదా! మన నేతాశ్రీలకు గీతలు, రామాయణాలు చదివే పాటి తీరిక ఉండదు.  కాబట్టే  చట్టాలు చేసిన తమ చేతులతోనే ఆ చట్టాలను నిర్భయంగా చట్టుబండలు చేసేస్తున్నారు! భారీ సభలు రోడ్డు కడ్డంగా పెట్టి చెవులు దిబ్బళ్లుపడేలా నినాదాలు చేయించే నాయకులను నుంచి సామాన్యుడేం నేర్చుకోవచ్చు? డ్యూటీలో ఉండే ఉద్యోగులను తిట్టడం, కొట్టడం మాత్రమే నాయకత్వానికి ముఖ్య ల్క్షణంగా భావించే నేతలున్న దేశంలో  పౌరుడు మంచి మార్గాన్ని ఏ మూల నుంచి ఎంచుకోవాలి?

పర్యవసానం ఏదైనా కానీ, చివరికి ఇవాళ మొత్తంగా పడకేసింది సామాజిక ఆరోగ్యం.. దానికి ఏ ఆసుపత్రుల్లో పడక దొరకని దుస్థితి. ఊపిరాడని పరిశుభ్రత.. దానికీ ఆక్సిజన్ కరువంటున్న అస్తవ్యస్త వ్యవస్థ పరిస్థితి!  

 

-కర్లపాలెం హనుమతరావు

25 -04 -2021

Saturday, April 18, 2020

కోవిడ్‍ -19 రామాయణంలో బవిరి గడ్డం పిడకల వేట -సరదాకే- కర్లపాలెం హనుమంతరావు



గడ్డం ఇంటి పేరున్న వాళ్లందరికీ గడ్డాలుండాలని రూలు లేదు. దేవుడి


మొక్కులకు, పెళ్లాం ప్రసవానికి, తగ్గని జబ్బులకు, క్షౌర బద్ధకానికి,

పంతానికి, దేశాంతరంనుంచి అప్పుడే దిగబడ్డానికి, దిగులుకి, దీక్షకు, దీర్ఘ
చింతనకు, యోగులకు, బైరాగులకు, క్షురశాల దాకా తీసుకెళ్లే ఆధారం లేని ముసలి
వాళ్ళకు, ముసల్మాన్ సోదరులు కొంత మందికి- గడ్డం ఒక సంకేతం.




 స్వాభావికంగా శారీరక సౌందర్యానికి ఆట్టే విలువ ఇవ్వని విరాగులూ బారెడు

గడ్డం పెంచుకోవడం రివాజే. సాధారణంగా దేవుడు ప్రత్యక్షమయేంత వరకు రుషులు
గడ్డాలు, మీసాలు పుట్టల్లా పెంచే వాళ్లని పురాణాలు ప్రమాణాలు
చూపిస్తున్నాయి. బైబిలులో చాలా పాత్రలకు గడ్డాలు తప్పని సరి. నిప్పు
రాజేయడానికి రాయిని రాయితో రుద్దడం తెలుసుకున్న మానవుడు గడ్డం గీయడానికి
రాయిమీద కత్తిని సాన బెట్టడం ఎప్పటినుంచి మొదలు పెట్టాడో బైటపెట్టే
ఆధారాలు ఇంతవరకు బైటపడినట్లు లేవు. గుహలమీది పాత చిత్రాల్లో సైతం
ఆదిమానవులకు మరీ ఆట్టే పెరిగిన గడ్డాలు, మీసాలు ఉన్న దాఖలాలు కనిపించవు.




 మన కృష్ణుడి మీసాలు వివాదాంశమైనంతగా గడ్డాలు కాలేదు. ఎందు చేతనో?!

అవునూ.. రవివర్మ గీసిన చిత్రాలన్నింటిలో మగ దేవుళ్ళు (ఒక్క శివుడు మినహా)
అందరూ అప్పుడే నున్నగా గీసిన చెక్కిళ్లతో కనిపిస్తారు కదా.. ఆ కాలంలోనే
క్షురకర్మ విధానం స్వర్గంలో అమల్లో ఉందనా అర్థం?గడ్డాలమీద ఎవరైనా గడ్డాలూ
మీసాలు పెరిగిందాకా పరిశోధనలు చేస్తే గానీ తెమిలే అంశాలు కావివన్నీ!




 తెల్లవాళ్ళకు ఈ గడ్డాలంటే ఆట్టే గిట్టవు లాగుంది. పాచిమొహంతోనే ఏ

ఎలక్ట్రిక్ షేవరుతోనో గడ్డం పని పట్టిస్తే గాని బాహాటంగా దర్శనమీయరు.
ఒక్క ఫాదర్లు మాత్రం .. పాపం..  పెరిగిన గడ్డాలతో కనిపిస్తారు. అక్కడి
మేధావులకూ ఇక్కడ మన మునులకు మల్లేనే బారెడు గడ్డాలు, మీసాలు. గడ్డాలు
మేధస్సుకు బాహ్య  సూచన లాగుంది. గడ్డం లేకుండా కార్ల్ మార్క్సుని
గుర్తించ గలమా? అబ్రహాం లింకను అనగానే నల్లవారి  హక్కుల పోరాటంకన్నాముందు
గుర్తుకొచ్చేది ఆయనగారి బారెడు నెరసిన గడ్డం.




 మహా మేధావులకే కాదు మాంత్రికులకూ గడ్డాలు సంకేతమే. మన పాతాళ భైరవి

మార్కు ఎస్వీరంగారావు గడ్డం ఎంత సుప్రసిద్ధమో అందరికీ తెలుసు. ఏదన్నా
దుష్ట ఆలోచన చేయాలంటే   శకుని మామలు దుర్మార్గులు ధూళిపాళలాగా మెడ ఓ
వారకు  వాల్చేసి గడ్డం దువ్వుకునే వాళ్ళేమో!  అవునూ.. ఇన్నేసి లక్షల
లక్షలు  కోట్లు రకరకాలుగా కుమ్మేస్తునారు కదా ఇవాళ రాజకీయ నాయకులు! ఒక్క
శిబూ సెరన్ కి తప్పఈ బవిరి గడ్డాలు గట్రా మరి ఎవ్వరికీ బైటికి కనిపించడం
లేదు! ఎందుకో?




యోగా గురువు రాందేవ్ బాబా  భృంగామల తైలంతో పెంచే గడ్డంతో కనిపిస్తారు.

రవి శంకర్, జగ్గీ వాసుదేవ్, చిన జీ అయ్యరు, సుఖబోధానంద స్వామిలాంటి
ఆధునిక అధ్యాత్మిక గురువులకూ ఎవరి తరహాలో వాళ్ళకు చిన్నవో పొన్నవో
గడ్డాలు కద్దు. మొన్నజరిగిన ఎన్నికల్లో మోదీగారిని మళ్ళా విజయలక్ష్మి
వరించడానికి ప్రధాన కారణం ఆయన తెల్ల గడ్డంలో దాక్కొని ఉందేమోనని అనుమానం!
రాహుల్ బాబాను చూడండి! ఎప్పుడు చూసినా తాజ్ మహల్ పాలరాయి గచ్చు మాదిరిగా
నున్నగా  చెక్కేసిన చెక్కిళ్ళతో తాజాగా కనిపిస్తారు. మరి ఎంత పోరితే
మాత్రం విజయం ఎట్లా సిద్ధిస్తుందని?




 దీర్ఘ కేశపాశాలతో ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా ఆట పట్టిస్తారో ఏ శృంగారకావ్యం

చదివినా అర్థమవుతుంది.   మగవాడు దానికి  బదులు తీర్చుకునే  ఆయుధాలే ఈ
గడ్డాలు, మీసాలు. మీసాల మీద మోజు పడ్డంతగా గడ్డాలమీద ఆడవారు మోజు పడతారా?
మాసిన గడ్డంతో దగ్గరి కొస్తే ఈసడించుకుంటారు గదా అని సందేహమా? మొన్నటి
వరకు గడ్డాలు మీసాలు ఓ నాగరిక అలంకారం అన్న సంగతి మీరు మర్చి పోయారు.
నిన్నటికి  అవి వికారం అయితే కావచ్చు. మళ్ళీ ఇవాళ వాటికే మంచి రోజులు
వచ్చేసాయ్! సినిమా హీరోలనుంచి చిల్లర తిరుబోతుల దాకా ఎవరి ముఖారవిందాఉ
తిలకించినా   చిరుగడ్డాలే! గడ్డం  మగతనానికి తిరుగులేని చిరునామాగా
మారిపోయింది.




మగ వాళ్లకి వద్దన్నా వచ్చేవి.. ఆడవాళ్లకి కావాలన్నా రానే రానివి ఈ

గడ్డాలు, మీసాలే!  ఆధిక్యానికి తిరుగులేని ఆయుధాలవి. వాటిని కావాలని
కాలదన్నుకోవడం  మగవాళ్ల తెలివితక్కువతనానికి నిదర్శనం.




'నువ్వసలు మొగాడివేనా?'  అని ఎదుటి పక్షం వాళ్ళు ఎన్నడూ సవాలు విసరకుండా

ఉండాలంటే రాజకీయనేతనే వాడు  పిసరంతైనా  గడ్డమో, మీసమో పెంచుకోవడం ఒక్కటే
శరణ్యం. ఆడువారి బారు జడలకు సమాధానం మగవారికి  గడ్డాలు, మీసాలే. తరుణంలో
గడ్డం పెరగని మొగవాడిని ఏ ఆడపిల్లా పెళ్లాడటానికి చచ్చినా ఇష్ట పడదు.




ఫ్రెంచి వాళ్ళను ప్రపంచ ప్రసిద్ధం చేసింది ఈ గడ్డమేనని మర్చి పోవద్దు.

యోగికైనా యోదుడికైనా ప్రపంచంలో ఎక్కడైనా గడ్డమే  ఘనమైన మార్కు. గడ్డం
గొప్పదనాన్ని పసిగట్టలేక దాన్నొక చాదస్తంగా కొట్టి పారేస్తున్నాం.
తాతయ్యలకే గడ్డాలనే పాత రోజులు పోయాయి.




ఆది దేవుడినుంచి ఆరుద్ర దాకా రకరకాల గడ్డాలు. గడ్డం లేని శివాజీని

ఊహించుకోవడం కుదరదు. వీర బ్రహ్మేంద్రస్వామివారి కాల జ్ఞాన మహిమలన్నీ
ఆయనగారి గడ్డంలో నుంచే పుట్టుకొచ్చాయని నమ్మే భక్తులూ కద్దు. గడ్డం ఆట్టే
పెరగని లోటును దుబ్బు జుట్టుతో పూడ్చుకొన్నారు చూసారా  పుట్టపర్తి సాయి
బాబా. ఒక్క బుద్ద భగవానుడికి మినహా మరే ప్రబోధకుడికి గడ్డాలు లేవు
చెప్పండి?! మత స్థాపకులకనేనా.. మత ప్రచారులకు సైతం మంగలి కత్తంటే
గిట్టదు. గమనించండి




గాంభీర్యానికి, యోగ్యతకు, అనుభవానికి, ఆలోచనకి గడ్డం తిరుగులేని  బాహ్య

చిహ్నం. గ్రీసు దేశంలో  వీరులనుంచి వేదాంతుల వరకు అందరికీ గడ్డాలే.
ప్లేటో, సోఫాక్లీసు, హోమరులకు గడ్డాలు మీసాలే గ్లామరు. టాల్ స్టాయి గడ్డం
రష్యాలో నవ శకానికి నాంది పలికింది. మన గురుదేవుని జ్ఞానసంపదంతా  అతగాని
గుబురు గడ్డంలోనే దాగి ఉంది. నిరాండంబరం ఒక విధానంగా పెట్టుకోబట్టి గాని
లేకుంటే మన మహాత్ముడూ గడ్డాలు మీసాలతో ప్రపంచాన్ని మరింతగా ఊపేసుండేవారే.




ఒక్క అలెగ్జాండరుకే గడ్డం అంటే ఎందుకో చెడ్డ కోపం.  సైన్యం గడ్డాలు

పెంచుకోరాదని ఆదేశించాడు. యుద్ధాలల్లో శత్రువు చేతికి జుత్తు
అందించాల్సొస్తుందన్న భయం కాబోలు! ప్రపంచాన్ని గడగడలాడించిన యోధుణ్ణి
గడగడలాడించింది మరి గడ్డమే! పీటరూ తన రాజ్యంలో గడ్డాలమీద పన్నులు
విధించాడు.  నెపోలియను, సీజరు  గడ్డాలకు వ్యతిరేకులు అయితేనేమి.
ఔరంగజేబు గడ్డాలు లేని వాళ్ళ నుంచి  పన్నులు పీకాడు.




ఎంత మందికి  కూడు పెడుతున్నాయో   గడ్డాలు, మీసాలు! తిరుమల రాయునికి హుండీ

ఆదాయమెంతో మగ భక్తుల గడ్డం, మీసాల మీద రాబడి అంతకు పదింతలు.  క్షురకర్మ
చేసే వాళ్ల నుంచి, కత్తెర సామాను తయారుచేసే పరిశ్రమల వారి దాకా ఎందరో ఈ
మగవాళ్ల గడ్డాలు, మీసాల మీదనే ఆధారపడి దర్జాగా బతికేస్తున్నారు.




 అన్నింటా సమానత్వం కావాలని నినదించే ఆడవాళ్ళు మగవాళ్ళ ఈ గడ్డాల జోలికి

మాత్రం రావటం లేదు.  స్త్రీల సవరాలకు మగవారి స్వచ్చంద కేశపాశాలే ముఖ్యమైన
దినుసులు కదా మరి!




 గడ్డాలున్నంత వాళ్లంతా యోగులు, యోగ్యులవాలని అర్థం కాదు. సీతమ్మవారిని

ఎత్తుకెళ్ళిన రావణాసురుడు బవిరి గడ్డాన్ని అడ్డం పెట్టుకున్నాడు.
ఆషాఢభూతులకు బారెడు గడ్డాలు. ఆశారాం బాపూలు, నిత్యానంద స్వాములూ
ఆకర్షణీయమైన గడ్డాలతోనే అమాయకులను మోసం చేసారు. తస్మాత జాగ్రత్త మరి.




క్లియోపాత్రావంటి  సొగసుగత్తెలకంటే  కనుముక్కు తీరులో కాస్తంత వంపు

ఉంటుంది. ఆ సొంపే  ప్రపంచ చరిత్రను ఎంతో  విచిత్రంగానైనా మలుపు
తిప్పింది. మగవాడికి మరి ప్రత్యేక ఆకర్షణ ఏముంది? గడ్డాలూ మీసాలే గతి. ఏ
గడ్డంలోని ఏ  నలుసు మెరుపు  చరిత్రనింకో  మలుపు తిప్పుతుందో.. ఎవరికి
తెలుసు?




చాందసమనే కాదు రాజసం తొణికిసలాడే ఈ గడ్డానికి ఇవాళ అగ్రరాజ్యంలో ఓ

ప్రత్యేక దినం కద్దు(అక్టోబరు 18).  'ఈరోజు ఉండి.. రేపు రాలిపోయే జుత్తు
మీద వృథాగా ప్రేమ ఎందుకు? గీకి పారేయండి సంపూర్ణంగా ' అని తెల్ల బాబులంతా
వేదాంతం వెళ్ళబెట్టి రేజర్లు బిగించే రోజు అది. గడ్డం విలువ గ్రహించ లేక
గదా ఆ ఉద్యమాలన్నీ! మన దగ్గర ఎన్ని ఉపయోగాలో గదా ఈ గడ్డాలు.. గుబురు
మీసాల వెనక?




ఇక్కడా మగవారు బవిరి గడ్డాలన్నీ చెక్కించి పారేస్తేనో? ఇంతకాలం

కనిపించకుండా పోయిన   ఎంత మంది దొంగ వెధవులు, దొంగనోట్ల వెధవలు,  దొంగ
ఓట్లు వేయించుకుని గెలిచిన  వెధవలు, దొంగతనంగా ఎర్ర చందనం దుంగల్ని దేశం
దాటించిన వెదవలు, దొంగ పాసుపోర్ట్లతో దర్జా  వెలగబెట్టే వెధవులు,  దొంగ
ధ్రువపత్రాలతో సర్కారు ఉద్యోగాలు వెలగబెడుతున్న వెధవలు, దొంగ మాటలు
చెప్పి కోట్లు వసూలు చేసి బోర్డ్లు తిప్పేసిన  వెధవులు, దొంగ హామీలు
గుప్పించి ఆడవాళ్లని మోసం చేసిన వెధవలు, దొంగతనంగా ఫోటోలు తీసి
ఆడపిల్లల్ని వేధిస్తున వెధవలు..  అబ్బో ఇంకెంత మంది దొంగ వెధవులు అంతా
ఒక్కసారే మూకుమ్మడిగా బైటపడి అల్లకల్లోలమయి పోతుందేమో కదా?




ఈ కరోనా వైరస్ కాలుష్యం కారణంగా జనాల ఎవ్వరినీ బైటకు  అనుమంతించడంలేదు.

సెలూన్లకూ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో   మరి నిజమైన మగ జనాభా దేశంలో
ఎంత ఉందో నిగ్గు తేలేదీ ఇప్పుడే.




ఆడ పేర్లతో ‘కతలు’ నడిపే మగరాయుళ్ల బండారాలన్నీ  ఈ విధంగా అయినా

బైటపెడతాయి కదా! మరకా మంచిదే ఒక రకంగా అన్నట్లు కోవిడ్ -19 కోరకుండానే
స్త్రీ జాతి సముద్ధరణ విషయంలో  పాంచాలిని కాచిన  గోవిందుడి పాత్ర
నిర్వహిస్తుందన్నమాట!




శుభం!

కర్లపాలెం హనుమంత రావు
***
(19 -04-2020 నాటి సూర్య - సంపాదకీయ పుట కాలమ్ - సరదాకే! ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...