Showing posts with label Nation. Show all posts
Showing posts with label Nation. Show all posts

Wednesday, May 9, 2018

మేరా భారత్ మహాన్!-సరదా వ్యాసం





'ఏంవాఁయ్ వెంకటేశం? ఏవిఁటలా టీవీ కతుక్కొని కూర్చున్నావ్? పెరేడ్ చూస్తున్నావా? ప్రెసిడెంటుగారి స్పీచి వింటున్నావా? మేడంగారే రకం చీర కట్టుకున్నారో చూసి మీ అక్కక్కొనిద్దావనే? దిస్.. ఐ థింక్.. ఎండాఫ్ ఆల్ ఇండియన్ వాల్యూస్. అనగా మన భారతీయ విలువల అంతిమ దినమన్న మాట. అంతిమ దినం కాదు.. గణతంత్ర దినమంటావ్! సరే.. అలాగే కానీయ్..!
'గంట నుంచీ ఆ టీవీ చూస్తున్నావు గదా? ఏదీ గణతంత్ర దివస్ అంటే ఏందో వివరంగా చెప్పూ.. చూతాం! సావరిన్ సోషలిష్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్కా? ఆ ముక్క .. తెలుగువాడివి.. తెలుగులో ఏడవ్వచ్చుగా?.. తెలీదా?  నోట్ బుక్ తీసుకో!.. రాసుకో! .. కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రజాతంత్ర స్వతంత్ర రాజ్యం. ఇదీ తెలుక్కాదా? తెలివిమీరిపోయావోయ్.. మై బోయ్!'
'సర్సెరే! వదిలేయ్! మన కంట్రీ స్పెషాలిటీస్.. అనగా. ప్రత్యేకతలు.. అవేంటో.. అవన్నా తెలుసా? జనాభాలో చైనా కాక మన తర్వాతే ఇంకెవరైనా. ఫరెగ్జాంపుల్.. మీ ఇంట్లోనే చూసుకో! మీ నాయనా, అమ్మా, బుచ్చెమ్మా, నువ్వూ, నీ చెల్లెలూ, నీ మామ మైరావణుడు, ఆయన శిష్యుడూ.. ఉపరి ఇప్పుడు నేనూ! ఒక మెట్రో బోగీకి సరిపడా జనం నిండామా! అందుకే థర్డు వరల్డులో మనదే థడాకా అని శ్రీమాన్ డొనాల్డ్ ట్రంప్ గారూ కూడా ఎప్పుడో ఒప్పేసుకున్నారోయ్ బాబ్జీ! మరో తమాషా చూసావూ! ముఫ్ఫై ఒక్క స్టేట్సూ.. ముప్పై ఒకటేనా.. ఏవోఁ.. లెక్క జూసుకో..  ఆరువేల కులాలూ.. మరో నాలుగొందలు పైచిలుకు ఉపకులాలూ.. అందులో సహం మతాలూ.. మూడు కోతులూ.. ముక్కోటి దేవతలూ.. పదహారొందల భాషలూ.. ముఫ్ఫై మూడు పండుగలూ.. మూడో నాలుగో ఫ్రంట్లూ.. తొమ్మిదొందల ఆరు పార్టీలు, .. పార్టీకో రెండో మూడో ఎజెండాలు.. ఇంకో రహస్య అజెండా.. ఆఖరికి ఒక్కో ఓటుక్కూడా మినిమమ్ రెండేసి రాష్ట్రాలూ.. ఒక్కదాంట్లోనైనా ఏకత్వం లేకపోవడమేనోయ్ మన భినత్త్వంలోని విచిత్రం!'
'మన దేవుళ్లకూ మనకులానే మోర్ దేన్ టూ వైవ్స్ ఉండాలాయె! అటు కాశ్మీర్ టు ఇటు కన్యాకుమారి వరకు ఒక్క విషయంలో మాత్రం మనవాళ్లంతా ఒక్క పట్టు మీద ఘట్టిగా నిలబడుతున్నారోయ్! అదేంటంటావూ? ఆఖర్న చెబుతాగానీ ఇప్పటికైతే మీ మామ పంచాగప్పొదిలో దాచిన పొగాకు పాయొకటి పట్రా.. పో! పొయెట్రీ తన్నుకొచ్చేట్లుంది!'
'…'
'నౌ ..బ్యాక్ టు ది పాయింట్!మన ప్రత్యేకతల గురించి మరో ముక్క చెప్పేదా! గుండు సున్నా కనిపెట్టింది మనవేఁనోయ్ సన్నాసీ! ఆ సంగతి సమస్తానికి తెలియాలనే కదా జాతీయ జెండా మధ్య బండి చక్రంలా పెట్టి  రెపరెపలాండించేస్తున్నాం! చక్రం తిప్పడంలోని చాణక్యమంతా శ్రీకృష్ణుణ్నుంచీ వడలాగేసుకుంటున్నారోయ్ మన లీడర్లూ! మన రాజ్యాంగంలోని మరో చిత్రం చెప్పనా? ఇంత పెద్ద ఇండియాలో ఇంకే లేనట్లు కాన్స్టిట్యూషన్ మొత్తం రెండొందలిరవైఅయిదు పేజీలూ చైనా ఇంకుతో రాయించేసారు మన సార్లు! ఏ ఇండియనింకో యూజ్ చేయచ్చుగదా? ఊహూఁ! మనోళ్ళకి మొదట్నుంచీ పరాయి సరుకు మీదే పరమ్మోజు. లేకపోతే నైరుతీ వైపు ఆ సముద్రానికి అరేబియా పేరు పెట్టటమేంటోయ్! ఆగ్నేయంలో ఈ వైపు నీళ్లకు బెంగాలు వాళ్లు 'బే ఆఫ్ బెంగాల్' పేరు పెట్టేసారు కదా! రేప్పొద్దున బెంగాలోళ్లు.. బంగ్లాదేశంగాళ్లూ.. ఆ నీళ్ల కోసం కొట్టుకు చస్తారని బెంగేస్తోందోయ్.. బోయ్! ధరలూ, జలయజ్ఞాలూ, అణుబాంబులూ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలూ, అర్థికమాంద్యం, కల్తీలు, కరువులూ, నీళ్ల కోసం కొట్లాటలూ, అవినీతి, అసహ్యంగా పోట్లాటలూ, ఉద్యోగాలూడ్డాలూ, ఉపాధులు దొరక్క చచ్చిపోడాలూ, చట్టుబండ చదువులూ, కేజీ టూ పీజీ లాన్గ్వేజీ పేచీలు, ప్యాకేజీలూ,  ప్రత్యేక రాష్ట్రాలు, హోదాలు, రిజర్వేషాలూ, ఇప్పుడు  కొత్తగా చట్టం.. న్యాయం మధ్య కొట్లాటలూ, పక్క మతం మీద పక్కా వ్యూహంతో  దాడులూ, అసహనం, ఆక్రోశం.. ఇన్ని బిలియన్సాఫ్ బర్నింగ్ ప్రాబ్లమ్సుంటే.. మళ్లీ కొత్త తల్నెప్పులు నెత్తికి తెచ్చుకోడం తెలివున్నవాళ్లు చేసే పనేనా? అబ్బే! ఈ చుట్ట అంటుకోడంలేదు. ఇదే ఇప్పుడు పెద్ద బర్నింగ్ ప్రాబ్లమయిందోయ్.. బోయ్!'
'అవునూ.. మద్యాహ్న భోజనం సంగతేం చేసావ్.. మై డియర్ వెంకీ? అహఁహఁ! ఆ సర్కారు స్కీము భోజనాలు కాదోయ్.. వెధవాయ్! నేనంటున్నది మన కడుపాత్రం సాపాటు ఏర్పాట్లు సంగతి మేన్! పొలిటికల్ ఫ్లోలో నువ్వలా ఫీలవడం బిట్ నేచురలే గానీ.. ప్రెసిడెంట్ స్పీచుకీ నువిట్లాగే పాలిటిక్స్ పెంటంటిస్తే.. చుట్ట తిరగేసి అంటిచాలని అధర్వణవేదం అయిదో అధ్యాయం పదో శ్లోకం తెగేసి చెపుతోంది.. తస్మాత్ జాగ్రత్త!'
'ఎలక్షన్ రోజులు కదా ఏ జండా చూసినా నీ పార్టీ ఫ్లాగే కనిపిస్తుందా? 'వందేమాతరం' అన్నా 'వందోట్లున్నయ్,, ఏ మాత్రం?' అని అడగాలనిపిస్తుందా? సహజం! జెండా పోలుకీ.. పోలింగ్ బూతుకీ సౌండులో తప్ప  మరెందులోనూ పోలిక లేదన్న కామన్ సెన్స్ కోల్పోతే రాజకీయాల్లో ఇంకెలా రాణిస్తావో బోధపడకుండా ఉంది. పాలిటిక్సంటే ఏంటను కున్నావోయ్? ఆర్ట్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ థింగ్. అసలేవీఁ చేయకుండా అన్నీ చేసేస్తున్నంత బిజీగా ఉన్నట్లు బిల్డప్పిచ్చే కళ! అంటే మీ అగ్గిరాముడు దగ్గర ఇంగ్లీషు దంచడం లాంటిదన్న మాట! మీ అక్కయ్యకిచ్చే హామీలనుకో.. తప్పు లేదు! కోర్టు బోనుల్లో ప్రత్యక్షంగా  నిలబెట్టి తప్పట్టినా సరే.. 'అబ్బే! అదేం లేదు మిలార్డ్! గిట్టనోళ్లేవో కల్పించి చేసే ఆగం అదంతా! మా మెంబర్లంతా పులుకడిగిన ముత్యాల!'ని తేల్చేసేయ్యడవేఁ.. దటీజ్ పాలిటిక్స్ !'
'పండగ పూట ఈ కప్పల తక్కెడ తీయడ మెందుకు అంటావా మై బోయ్! సరే! అలాగే కానీయ్! మేరా భారత్  మహాన్! మన మహాన్ భారత్  కీ బోలో జై!,, జై జై!'
-కర్లపాలెం హనుమంతరావు
***
(26, జనవరి, 2009 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...