Tuesday, July 25, 2017

ఆ.. అంటే ఒక్క ఆవేనా?



పశువుల్ని సొమ్ములని పిలుచుకొనేవాళ్లు మొన్న మొన్నటి వరకూ.. పల్లెపట్టుల్లో.. ఆధునిక సోకులు ముదరనంత వరకురావిశాస్త్గ్రిగారి 'సొమ్ములు పోనాయండి'లోని సొమ్ములంటే పాలిచ్చే 'పశు'సంపదే! ఇప్పుడు మనం  'ఆవుగా పిలుచుకొనే జంతువుని ప్రాచీనాంధ్ర శాసనాల్లో  'తొఱ్ఱ' అనేవారని బూదరాజుగారు తన 'మాటల మూట'లో సెలవిచ్చారు

' 'పసరం' అంటే పశువులాంటిదేదో అయుంటుందని కాస్త ఆనవాలు పట్టవచ్చేమోగానీ .. మరీ గిడ్డి(వేలుపుగిడ్డి అంటే కామధేనువు), తొడుకు, మొదవు లాంటి  పదప్రయోగాలకు పూనుకుంటే.. మనుషుల సంగతి అలా ఉంచి.. ముందు గొడ్లూ గోదానే గుడ్లు తేలేస్తాయేమో.. ఎవరిని ఎవరు ఏమని తిడుతున్నారో అర్థం కాక.. అయోమయంతో?' అని ఎద్దేవా చేసే వాళ్లెప్పుడూ ఉంటుంటారు. తెలుసు. కానీ.. మన భాషలోని పద సంపద ఎంత పుష్కలంగా ఉందో.. కనీసం తెలుసుకొనేందుకయినా   చదివే ఆసక్తి చూపిస్తే .. ఈ వ్యాసం రాసిన శ్రమ సార్థకమయినట్లే!



సంస్కృతంలో 'ఆవు'కు సురభి అనే చక్కని ప్రయోగముంది. దైవమహిమ గల ధేనువుని సురభి అంటారు.  (సురభి బాల సరస్వతి' అని గతంలో ఒక సినిమా నటీమణి ఉండేది. ఆమె మహారాష్ట్రనుంచి తెలుగునాటకు వలస వచ్చిన సురభి నాటక కంపెనీకి చెందిన కళాకారిణి. చలన చిత్రాల ప్రాథమిక దశ ఆవిర్భావానికి  'సురభి' నాటక కంపెనీ పేరు ప్రఖ్యాతులూ  ప్రేరణగా నిలిచాయ'నే  పెద్దలూ ఉన్నారు.)


'ఆవు' పదంలోని మొదటి '' వరకే ఒకానొకప్పుడు ఆవుజాతికి సూచకంగా ఉండేది. క్రమేపీ ఆ '' కి 'వు' కలిపి 'ఆవు' అని, 'పోతు' కలిపి 'ఆఁబోతు.. 'ఆబోతు'అని  లింగ విభేదం ప్రకారం పదవిభజన చేసుకున్నాం.. మనం.
వయసులో చిన్నదైన ఆవును దూడ...పెయ్య'  అంటారని తెలుసా? తొలిచూలు ఆవు/గేదెకు 'పడ్డ' సరైన పదప్రయోగమని శబ్దకోశాల వాక్కాణం. 'దూడ' అంటే  లేత వయసులో ఉన్న ఆవో గేదో.. ఎద్దో.. ఏదైనా అయినప్పుడు.. మరి.. 'లేగదూడ'లోని 'లేగ' పదప్రయోగం అదనంగా ఎందుకో?   ఆ పదం పుట్టించిన మహానుభావుడికే  తెలియాలీ మతలబు! పాలు తాగడం ఆపిన ఆవును 'పెయ్య' అనాలని జంతుశాస్త్రాలు  చెబుతున్నాయి. ఒహ పట్టాన పాలు పితకనీయని ఆవును 'అఱ్ఱ' అంటారు. ఆవులకు ఒకానొకకాలంలో 'బర్రె'లనే పదప్రయోగం ఉన్నా క్రమంగా ఆ పదం కేవలం  గేదెల జాతికి మాత్రమే వర్తిస్తున్నట్లనిపిస్తుంది. 
అప్పుడే పుట్టిన బిడ్డని 'తర్ణకం' అనాలి. దూడకు పాలు కుడిపే ఆవును 'లేగటా' ఆనాలి. బిడ్డకు ఇచ్చేందుకు పాలు లేని ఆవుని ' గొడ్డుమోతు' అంటారని అందరికీ తెలుసు. ఈ 'గొడ్డుమోతు'(గొడ్రాలు) పదం పిల్లలు పుట్టని ఆడవాళ్లక్కూడా వర్తింప చేస్తున్నాం మనం

తెలుపు రంగులో కాకుండా   'గోరోజనం' రంగులో ఉండే ఆవును 'కపిల(సంస్కృతంలోని 'కపిల' కు వికృతా?)' అనో 'నల్లావు' అనో పిలవాలని నింఘంటువుల మతం.
'మహిషి' అన్నా ఆవే. అందులోని 'మహి' శబ్దానికి గొప్పది అనే అర్థం ఉంది. 'భూమి' అనే మరో అర్థమూ ఉంది. ఆవును భూమితో సరిపోల్చడం ఆర్యసంప్రదాయం. దేవలోకంలో ఉండే మహిషి 'కామధేనువు'గా మన్నన  పొందింది'ధేనువు' అన్నా ఆవు అనే  అర్థం. కోరిన వరాలు  వర్షించే ఆవు కాబట్టి అది 'కామధేనువు' అయింది.
 

ఆవుకి 'అర్జున' అనే మరో నామమూ కద్దు.  'అర్జున' అంటే 'తెలుపు' అని అర్థం కదా! ఆవు సాధారణంగా  తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ పదం అతికినట్లే ఉంటుందికానీ.. మరి నల్లటి రంగులో ఉండే పాండవ మధ్యముడికి అర్జునుడు అనె పేరెలా వచ్చిందన్న సందేహం ఉండనే ఉంది.. ఇప్పటికీ సమాధానం అందకుండా!('అర్జునుడు నల్లటివాడా.. కాదా?' అనే విషయంమీద  మన పండితులు 'భారతి'  మాస పత్రికలో నెలల తరబడి వాదులాడుకున్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఆ వాదనలు ఎటూ తేలకుండా సమాధానం దొరకని సందేహాల పద్దులోనే ఉండిపోయాయి ఇప్పటికీ) 'అర్జున' శబ్దానికి 'కసవు' 'గడ్డి' అన్న అర్థాలూ నిఘంటువుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి.. పాండవ మధ్యముడి సంగతి ఎట్లా పోయినా.. 'ఆవు' విషయం వరకు  సమంజసంగానే ఉందని  కోదిగుడ్డుకి  ఈకలు పీకే పండితులూ ఒప్పుకున్నారు)
 

'శృంగం' అంటే కొమ్ము అని అర్థం కనక కొమ్ములున్న ఆవును 'శృంగి'  అన్నారుబాగుంది. 'రోహిణి' పదం వినేందుకు  అంతకన్నా శృతిపేయంగా ఉంది.  'రోహిణి' ఓ తెల్లచండ్ర  మొక్క పేరని తెలుగుభాషామీద సాధికారత గల  బూదరాజు రాధాకృష్ణగారో  సందర్భంలో వివరించారు. తెల్ల రంగులో ఉంటుంది కాబట్టి ఆవుకీ ఆ పేరు  పెట్టి ఉంటారు. రోహిణికి పుట్టిన దూడ 'రోహిణేయ' అయింది.. సురభికి పుట్టిన బిడ్డ 'సౌరబేయ' అయినట్లు!  

జంతువుల వరకు  హిందువులకి మాతంటే 'గోమాతేమంచి జాతి ఆవుకి 'నైతిక'.. చుక్కలున్న ఆవుకి 'శబలి' .. పొట్టి ఆవుకి 'వామని'.. తెల్లగా ఉంటుంది కనుక 'ధవల'.. పుల్లావుకి 'కపిల .. వెదలో ఉంది కనక   'నందిని' అని .. ఆయా ఆవులని సందభాన్ని బట్టి పిలుచుకోవాలని పలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.  శబ్దకోశాలు     సోదాహరణంగా  ఆయా సందర్భాలనూ వివరిస్తున్నాయి
ఆవు సాధువుగా ఉంటే 'సుకర' అవుతుంది. ఇబ్బంది పెట్టకుండా పాలిస్తుంటే 'సువ్రత' అవుతుంది..  ఏటా క్రమం తప్పకుండా  పాలిస్తుంటే 'సుమాంసమీన'గా గుర్తింపొస్తుంది.  గోవుమీద గల ప్రాచీన ప్రాచిన సాహిత్యం అంతా ఏకరువు పెట్టడం ఇంత చిన్న వ్యాసంలో అసాధ్యం. 

'ఇవన్నీ కూడా ఎక్కువగా సంస్కృత తత్సమాలో.. తద్భవ  శబ్దాలే కదా! మరి తెలుగులోనే మాట్లాడమని ఇబ్బంది పెట్టడంలో అర్థమేముంది?' అంటూ విసుగు పడేవాళ్లూ ఉంటారని తెలుసు. ఆ తరహా తెలుగు మాటలు బోలెడన్ని చెప్పుకోవచ్చు.  విస్తృతి భయం. మరో సందర్భంలో  చర్చించుకొందాం.. అవసరమైనంత మేరకు.  అచ్చు తెలుగులో ఆవును తెల్లగొడ్డు' అనాలని.. ఆవులను కట్టేసే దొడ్డిని 'కొష్టాం'అనాలని.. ఆవుల గుంపును 'మంద' అనాలని.. ఇలా చాలా  ఉంది గ్రంథం. సంక్షిప్తంగా చెప్పుకుంటేనే ఇంత రామాయణమైంది కదా..ఇంకా వివరాలలోకి గాని పోతే ఓ పట్టాన బైటికి తెమలగలమా? 
కానీ కొసమెరుపు ఏమిటంటేః

ఆవుకి ఇన్ని రకాల తెలుగు.. సంస్కృత పదాలున్నా.. ఇప్పటి వరకూ మనం సాధారణంగావ్యవహరించే 'ఆవు' అనే పదాన్నికూడా ఉఛ్చరించడం మానేసాం! మొరటయి పోయిందితెలుగు పదాలు పలకడం మన కుర్రకారు నాలుకలకు.   
ఆవు తెల్లోడి బిసలో పడి  'కౌవ్వు' అయిపోయింది! పిల్లలు సరే..  పెద్దలూ పిల్లల మాటలకు '..' అంటున్నారు! అదీ విచారించాల్సిన విషయం! తెలుగు భాషకి పట్టిన దౌర్భాగ్యం ఎప్పటికి వదిలేనో?
***

-కర్లపాలెం హనుమంతరావు


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...