నిజాన్ని నిజంగా చెప్పడం నిజంగా చాలా కష్టం..
నష్టం! ఆ రెండింటికీ సిధ్దపడే దిగామన్న 'దిగంబర కవులు' చివరిదాకా
తమ ఉద్యమ స్వరూపాన్ని నిలబెట్టుకోలేదు. ఆ కథా.. కమామిషూ.. కొద్దిగా!
20వ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు గడ్డల మీద ఎన్నో
ఉద్యమాలు చెలరేగాయి. స్వాతంత్ర్యోద్యమం, ఆధ్రోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం ఆరాటం.. వగైరా!
ప్రధానమైన ఉద్యమాలన్నింటిలో ప్రజాకవిత్వం మమేకమైంది. స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయింది. తెలంగాణా సాయుధ పోరాటం విజయవంతమయింది. విశాలాంధ్ర సాధ్యమయింది. ఏ ఉద్యమ చైతన్యమూ ప్రేరణగా
లేనందున తెలుగు సాహిత్యం సామాజిక స్పృహ
కోల్పోయిందని యువతలో అసంతృప్తి మొదలయింది. ఊసుబోని
ప్రణయ ప్రేలాపన, ఉత్కంఠే ప్రాణంగా నేరపరిశోధన, పాలకులకు అనుకూలమైన చక్కభజనే.. సాహిత్యంగా పెట్రేగడం సమాజం పట్ల జరిగే కుట్రగా
భావించిన యువకులు కొందరు 1960 ప్రాంతాల్లో ‘దిగంబర కవితోద్యమం’ పేరుతో కరెంటు షాక్
ట్రీట్ మెంట్ ఇవ్వదలిచారు. కుందుర్తి 'తెలంగాణా', కాళోజీ 'నా గొడవ', సీతాదేవి నవలా ప్రక్రియ, కొకు విమర్శ వంటి ప్రగతికాముక సాహిత్యం పట్ల ఆదరణ
తగ్గనప్పటికీ.. అంతకు మించిన ఆసక్తి ఊకదంపుడు సాహిత్యం మీదే పాఠక జనం
ప్రదర్శించడం అభ్యుదయ సాహిత్యకాముకులకు ఆవేదన కలిగించింది. చాసో, రావి శాస్త్రి వంటి వారి నుంచి ప్రగతిశీల వచన సాహిత్యం
ప్రబలంగా వస్తున్నప్పటికీ.. కవిత్వపరంగా స్తబ్దత ఆవరించడం ఆ యువత కలతకు కారణమయింది. ప్రయోజశూన్యతను ప్రశ్నిస్తూ రక్తం
ఉడికే ఓ ఐదుగురు యువకవులు 1965లో ఓ వినూత్న కవిత్వోద్యమానికి భాగ్యనగరం నుంచి
శ్రీకారం చుట్టారు. 'నన్నయను నరేంద్రుడి బొందలోనే/ నిద్రపోనియ్యి/ లేపకు/ పీక నులిమి గోతిలోకి లాగుతాడు’ అంటూ గతించిన కవిత్వ ధోరణులన్నింటిపైనా ధిక్కారస్వరం ప్రకటిస్తూ ఒక్క పెట్టున
ఉప్పెనలా తెలుగు కవిత్వం మీద విరుచుకు పడిన
ఆ కొత్త ప్రక్రియే 'దిగంబర కవిత్వం'. అచ్చు, ఆవిష్కరణ, కలంపేర్లు.. అన్నింటా అప్పట్లో అదో గొప్ప కలకలం. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు, మహాస్వప్న, భైరవయ్య.. పేర్లతో మూడేళ్ల పాటు వీరవెల్లి రాఘవాచార్యులు, యాదవరెడ్డి, మానేపల్లి హృషీకేశవరావు, బద్ధం భాస్కరరెడ్ది, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, మన్ మోహన్ సహాయ్.. సాహిత్య సాగరంలో సృష్టించిన సునామీలకి పెద్ద పెద్ద పేర్లే చెట్లూ
చేమలూ ఎక్కి పెద్దరికాన్ని కాపాడుకొన్నాయి!
'మానసిక దిగంబరత్వం కోసం నిత్య సచేతన ఆత్మ స్ఫూర్తితో జీవించడమే’ తమ ఆశయంగా ప్రకటించుకొన్నారా
దిగంబర కవులు. ‘శ్వాసించే
ప్రతీవ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ కోసం, అంతరంగంలో అణిగి మణిగి పడి ఉన్న ఆరాటాన్ని, అసంతోషాన్ని, విసుగును అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన
విశ్వాసాన్ని, ఆశను కలిగించాల’న్న వాళ్ల సామాజిక తత్పరత- తరువాతి మరో మూడేళ్ళు వరకు నిత్యపరిణామ దిశగా ఆడుగులు వేస్తో
స్తబ్దసాహిత్య సాగరంలో నిజంగానే కల్లోలాన్ని సృష్టించింది.
పాత రుతువులు, సంవత్సరాల మీద సైతం వాళ్లకు నిలువెల్లా పరమరోత! పురాతత్వాన్ని
సంపూర్ణంగా వదిలించుకొని.. కవిత్వాన్ని పై నుంచి కింది వరకు దిశమొలగా నిలబెట్టాలన్న దిగంబర కవుల ఆరాటం కొందరికి తెంపరితనమనిపిస్తే ఇంకొందరికి నిస్పృహ పైన నిజాయితీగా చేసే నిబద్ధ పోరాటంగా స్ఫూర్తినిచ్చింది. ప్రతీ
నాణేనికీ బొరుసు ఒక్కటే కాదు.. బొమ్మా ఉంటుంది. తిరగేసి చూడాలి.. అంతే!
'ఇది దిగంబరశకం. మేం దిగంబరకవులం. మాది దిగంబరకవిత. ఇది సాహిత్యోద్యమంలో దిగంబర కవితోద్యమం. కవితా స్వరూపాన్ని బట్టి మేం రాస్తున్నది వచన కవిత అని మేం అనదలుచుకోలేదు. అననివ్వదలుచుకోలేదు. వచన కవిత
అనే పదం మాకు నచ్చదు.' అని తమ కవిత్వ ప్రక్రియ లక్షణాలను తామే
ప్రకటించుకున్నారు దిగంబర కవులు. అందరిలా కాకుండా తమ కవితలను 'ధిక్' లు గా
పిల్చుకున్నారు.
ప్రాచీన సంస్కృతిని దుర్గంధభూయిష్టంగా గర్హించే
దిగంబర కవిత్వానికి అంతర్జాతీయ నేపథ్యం
ఉంది. 20వ శతాబ్దంనాటి పారిశ్రామికీకరణ.. నాగరీకరణల ఫలితంగా సమిష్టి కుటుంబ వ్యవస్థ వ్యక్తి కేంద్రీకృత వ్యవస్థగా విఛ్చిన్నమయింది. ఆ విధ్వంసం మానవ
విలువలు దిగజారుడంగా భావించి వేదన చెందింది పాశ్చాత్య సాహిత్యంలోని ఒక యువ వర్గం. స్వార్థ చింతన పెచ్చుమీరడం, మనిషి ఆర్థిక సంబంధాలే ప్రధానంగా భ్రమించడం, విలాసజీవనం పట్ల నియతి, నియంత్రణలేని లౌల్యం పెరిగిపోవడం.. వ్యవస్థలో విశృంఖలతకు, అమానుషతలకు దారి తీస్తున్నట్లు ఈ యువ వర్గం
భావించింది. మానవ ప్రేరిత ప్రపంచ యుద్ధాల విధ్వంసం తరువాతా
సామ్రాజ్యవాదం తన దాష్ఠీకం కొనసాగింపుకే మొగ్గు చూపడం ఈ యువతను కలచివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమయిన ఉపద్రవాలకి
ప్రతిస్పందనగా మేధావివర్గాలు స్తబ్దతనో, నిరాశావాదాన్నో, పలాయనవాదాన్నో ఆశ్రయించడం ఆగ్రహం తెప్పించింది. సహజంగా ఆవేశం పాళ్లు ఒకింత అధికంగా ఉండే యువకులు కొంతమంది అత్యంత తీవ్రంగా
స్పందించారు. ఆ స్పందన ఉద్యమ రూపాలు
వివిధ దేశాలలో వివిధ స్వభావాలలో సాగినా అన్నింటి సామాన్యలక్షణం నిరాశ నుంచి పుట్టిన
నిరసనే. తెలుగు గడ్డ మీదా రేగిన ఈ తరహా సామాజిక
అసంతృప్తి జ్వాలలకు సాహిత్యపరమైన ఉద్యమ రూపం దిగంబర కవిత్వం.
మానసిక సంఘర్షణ, సంప్రదాయం పట్ల నిరసన, గతంమంటే గల అనాసక్తత, ఆధునికత మీద వైముఖ్యతల కారణంగా అమెరికాలో 1960ల్లో 'బీట్నీక్కులు’ 'బీట్నిక్ జనరేషన్' తరహా నిరశనోద్యమం లేవదీశారు. పొరుగుదేశాల దాడి కారణంగా జాతీయ జీవనం విఛ్చినమైన హంగరీ (అప్పటి ఆస్ట్రియా)లో కూడా అశాంతికి గురయిన యువకులు కొందరు 'గాయపడ్డ యువతరం' పేరుతో ఈ
మాదిరి సాహిత్య పరమైన నిరశనోద్యమానికి నడుం కట్టారు.
అంతర్జాతీయ ఆందోళనా బృందం 'యాంగ్రీ యంగ్ మెన్' ల నిరశనోద్యమానికి
సమాంతరంగా మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్లో 1960లో 'హంగ్రీ యంగ్ మెన్' సాహిత్య ధోరణి తలెత్తింది. పెరుగుతోన్న అన్యాయాలూ, అరాచకాలూ, ఆర్థిక అసమానత, నిరుద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా దేశంలో
ఏదో ఓ మూల ఓ 'భూఖీ పీడీ', ఓ ‘హంగ్రీ జనరేషన్’ వంటి ఆకలి తరం ఆవిర్భవించే
దుర్భిక్ష కాలంలో తెలుగునాటా ‘దిగంబర కవులు’ కొత్త
సాహిత్యోద్యమానికి తెర లేపారు.
'ఊపిరి పీల్చే ప్రతీ మనిషీ ఉనికి కోసం తపన పడి భావిని చూపి భయపడి వెక్కి
వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రవచించిన కవిత తమద'ని లక్షణం
ప్రకటించుకున్నారు. ‘మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటంలేని చిరునవ్వులు చిందే సమాజం కోసం, అహోరాత్రాలు ఆరని అగ్నిలో నడిచిన ఆత్మలోంచి
పలుకుతున్న గొంతు'లని తమ నిరశన స్వరాలను నిర్వచించుకున్నారు. 'ఏ ఆఛ్చాదనకీ తలవగ్గని, ఏ భయాలకీ లొంగని నిరంతర సజీవ మానవుడి కోసం ఎలుగెత్తి పిలుస్తున్నామ'ని లక్ష్యం చెప్పుకొన్నారు. ఆ చెప్పడంలోని ఘాటుదనమే సమాజ పెద్దరికానికి వెంపర్లు పుట్టించింది.
'నిండుగా నిజంగా ఊపిరి పీల్చేవాడు/
ఆత్మయోని నుంచి పుట్టుకొస్తున్నాడు' అన్నాడు నిఖిలేశ్వర్.
నిజానికి ఆత్మనుంచి పుట్టుకొస్తున్నాడన్నా.. అదే భావం! సమాజం బుద్ధిమాంద్యానికి షాక్ ట్రీట్ మెంటు ఇవ్వడమే తమ తపనగా
చెప్పుకున్న దిగంబర కవులు ఈ తరహా పదప్రయోగాలకు పూనుకోవడం దిగ్భ్రమ కలిగించదు! 'చచ్చిన రాజుల పుచ్చిన గాథల/ మెచ్చే చచ్చు చరిత్రకారులను/ ముక్కు చెవులు కోసి అడగాలనుంది/ మానవ పరిణామ శాస్త్రం నేర్పిందేమని?' అన్నప్పుడూ ' ఆ 'ముక్కు
చెవుల కోతలు' కవుల కసిలోనుంచి పుట్టుకొచ్చినవే!
'దిగంబర కవిత్వంలోని అక్షరాలు/ కామంతో పుచ్చిపోయిన/ లతాంగి పయోధరాలపై నూతన నఖక్షతాలు కావ'ని భైరవయ్య ఎంత సమర్థించుకున్నప్పటికీ
'కీర్తికాముకుల. నియంతల/ అహంతల దౌర్జన్య బాహువుల దురాక్రమణలో/ దేశదేశాల సుఖవ్యాధి పుండ్లతో/ భూమి వెలయాలై, పతితయై, భ్రష్టయై/ పుచ్చి గబ్బు గొడుతున్నప్పుడు/ నేను పుడుతున్నాను దిగంబరకవిని'(మహాస్వప్న) అనడం
అప్పటి మర్యాదస్తుల సాహిత్య లోకాన్ని మెప్పించలేక పోయింది. 'ఐదేళ్ల పెంటపోగులో దొరికిన అద్దం పెంకులో పగలని తన
అవయవాన్ని చూసుకుంటూ ఆంధ్రమాత గర్వంగా మురిసిపోతున్నద'న్న(నగ్నముని) తరహా వర్ణనలు జాతిని, నాతిని ప్రేమించేవారెవరూ జీర్ణించుకోవడం కష్టం.
'కార్జ్యంలేని యజమాని/ గుండెలేని గృహిణి/ చెత్తకుండీ విస్తరాకుల యువకులతో/ ఈ చాప వ్యవస్థ మారేదెప్పుడు?' అని చెరబండరాజు ప్రశ్న. భయంకరంగా విజృంభించిన కుల మత దురహంకారాలకి, ధనమదంతో ప్రజాస్వామ్యాన్ని యధేఛ్చగా వాడుకుంటున్న గూండాయిజానికి, సినిమారొంపిలో ఈదులాడుతున్న యువత బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు
జీవనానికి, అతీత జీవనంతో గడుపుతున్న మేధావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల
కోటేశు స్మృతికి అంకితం చేసిన మూడో సంకలనమే దిగంబర కవిత్వ పరంపరలోని ఆఖరి అంచె. మొదటి సంపుటి ఆవిష్కరణ 1965, మే 6వ తేదీ అర్థరాత్రి. హైదరాబాద్ నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడు
ఆవిష్కర్త. రెండో సంపుటి విజయవాడ జంగాల చిట్టి 1966, డిసెంబర్ 8 న ఆవిష్కరించింది. దిగంబర కవిత్వానికి పరిణత దశగా భావించే మూడో సంపుటి
1968లో విశాఖపట్టణం బిచ్చగత్తె 'ఎడమసూరి యశోద' ఆవిష్కరించింది.
మూడు సంపుటాల్లో తొంభై మూడు కవితలు. అనువాదాలకు, అనుకరణలకు అలవాటు పడిన తెలుగు కవిత్వాభిమానులకు దిగంబర
కవిత్వ మౌలిక రూపం నిర్ఘాంతపరచిన మాట వాస్తవం. తిరుగుబాటు కవిత్వం తెలుగువారికి కొత్తేమీ కాదు. అంతర్జాతీయం, అణుయుద్ధం, నగరజీవనం, వర్గపోరు, వ్యక్తిస్వేఛ్చ, ప్రపంచశాంతి ఇన్నేసి అంశాల మీద గంపగుత్తగా ఇంత
తీవ్రంగా దుయ్యబట్టిన సందర్బాలకు దిగంబర కవిత్వమే నాందీ పలికింది.
రాచమల్లు రామచంద్రారెడ్డి అంతే తీవ్రంగా
విమర్శనాస్త్రాలు దిగంబర కవిత్వం పైన
సంధించారు. పాతికేళ్ల అనంతరం దిగంబర కవుల్లో ఒకరైన జ్వాలాముఖి
స్వయంగా తెలుగు దినపత్రికల్లో ఆత్మవిమర్శ చేసుకున్నారు. బూతు పరిష్కారం కాబోదు. తిట్లు ఎవరిని మేల్కొలపవు. కాకపోతే స్తబ్దత నుంచి తిరుగుబాటు దారిలో విప్లవలక్ష్యం వైపుకు తెలుగు
సాహిత్యం దృష్టిని మళ్లించినవారిగా దిగంబర కవులను జ్వాలాముఖి సూత్రీకరించడం సబబే
అనిపిస్తుంది.
'హిందీ ధర్మయుగ్' లో దిగంబర కవిత్వానికి అనువాదాలొచ్చాయి. భారతీయ జ్ఞాన్ పీఠ్, లహర్, పొయెట్, కొన్ని బెంగాలీ, కన్నడ పత్రికలూ దిగంబర కవితలకు అనువాదాలు
ప్రచురించాయి. మూడు సంపుటాలనూ ప్రొఫెసర్ రామానాయుడు అనువదించారు. కేంద్రీయ సంస్థాన్ పురస్కారం దిగంబర కవిత్వం అందుకుంది. ఉర్దూ, పంజాబీ, అస్సామీ
భాషల్లో కూడా దిగంబర కవిత్వం అనువదింపబడింది. కన్నడంలో బండాయ సాహిత్యానికి, హిందీలో సరికొత్త ధోరణులకు దిగంబర కవిత్వం స్ఫూర్తినిచ్చింది.
విచిత్రం ఏమిటంటే దిగంబర కవుల్లోని ఇద్దరు తదనంతర
పరిణామ క్రమంలో మార్క్సిజం వైపుకు మళ్లితే, మరో ఇద్దరు అస్తిత్వవాదం వైపుకు వెళ్ళిపోయారు. నిర్దిష్టమైన భావజాలం, స్పష్టమైన సంస్థాగత నిర్మాణం లేని ఏ ఉద్యమానికయినా
తదనంతర కాలంలో పట్టే దుర్గతే దిగంబర కవిత్వానికీ దాపురించింది. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు 1970లో విప్లవ రచయితల సంఘంలో చేరి.. 1975 నాటికి మళ్లీ బైటికి వచ్చేసారు. పోతే.. మిగతా ఇద్దరూ భైరవయ్య, మహాస్వప్నలు
వ్యక్తులుగా మిగిలిపోయారు. విప్లవ కార్యకలాపాలలో మొదటినుంచి క్రియాశీలకంగా
పనిచేసిన చెరబండరాజు .. బ్రయిన్ ట్యూమర్ తో కాలం చేసాడు. కఠిన కారాగారవాసాలు, పోలీసుల చిత్రహింసలు కారణమని కొందరి విశ్వాసం.
సాహిత్యంలో సంకోచాలను వదిలించుకొనేందుకు, అనుభూతులు యధేచ్చగా వ్యక్తీకరించుకొనేందుకు
ప్రజాస్వామిక భూమికను సిద్ధం చేయడం వరకు దిగంబర కవితోద్యమం సార్థమయిందన్న వాదనతో
అందరం అంగీకరించక తప్పదు.
మొదటి సంపుటిలో సామాజిక రుగ్మతలు, రెండో సంపుటిలో మనిషి ఉనికి, సామాజిక అస్తిత్వం, మార్క్సిజం పట్ల సానుకూలత, మూడో సంపుటి సమస్యల పరిష్కారానికి సాయుధ పోరాటం.. అనే అంశాల చూట్టూ పరిభ్రమించినట్లు సాహిత్య
విమర్సకులు విశ్లేషించుకుంటున్నారిప్పుడు.
ఏదేమైనా తదనంతర కాలంలో సాహిత్యంలో కొత్త కొత్త
ఆలోచనా ధోరణులకు వికాసానికి దిగంబర కవిత్వం దోహదం చేసిందన్న మాట మాత్రం వాస్తవం.
-కర్లపాలెం హనుమంతరావు
(సాహిత్య దృక్పథాలు- దిగంబర కవిత్వం - డా।। యస్వీ సత్యనారాయణ వ్యాసం ప్రేరణగా)
No comments:
Post a Comment