మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి ప్రసరించుగాక .. అనే వేద సూక్తిని ఉద్బోధిస్తూనే వర్ణ వ్యవస్థ మిషతో సాటి మనిషిని అమానుషంగా అధిక సంఖ్యాక మతవాదులు గతంలో హింసించిన మాట వాస్తవం కాదని ఎవరం చెప్పలేం. భారతీయాన్ని .. హైందవాన్ని కలగాపులగం చేసి బుకాయించే ధోరణులను తార్కిక దృష్టితో నిలదీసిన ప్రతీ సందర్భంలోనూ మొదట తార్కిక దృక్పథాన్నే తప్పు పట్టడం .. కొంత దవ్వు సాగిన పిదప విచక్షణకు ఎదురు నిలబడే బలిమి సన్నగిల్లి పాశ్చాత్య ఆలోచనా ధోరణుల మూల అంశం అంటూ హేళన చేయ బూనడం .. అబ్బో.. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి సాగుతున్న మత తతంగమే ఇదంతా ! వర్ణ, కుల, విశ్వాసాలనే పొరలతో నిర్మితమైన సమాజం మీద ఆధిపత్యం కోసం .. నిమ్న కులాలని హింసించిన వాస్తవం పక్కన పెట్టినా .. బ్రాహ్మణవాద విశ్వాసుల మధ్యనే (ఉదా: శైవులు .. వైష్ణవులు .. మళ్లా ఈ విశ్వాసుల మధ్యా ముద్రాంకితాల మీద కక్షతో కూడిన అంతర్గత పోరులు!) శతాబ్దాల తరబడి విధ్వంస కాండలు సృష్టించిన వైనాల మీద విదేశీయులు తమ పర్యటనల సందర్భంగా ఎన్నో పర్యాయాలు వివిధ వ్యాఖ్యలు చేసినట్లు చరిత్ర చెబుతోనేవుంది. వాటిపైనా ఏదో మిషతో బురద పులమడం .. ఎప్పుడూ కనిపించే ప్రహసనాలే!
మనువు అనని మాటలను మనువుకు ఇప్పటి అర్థ సత్యవాదులు అంటగడుతున్నారన్నది కొద్దిమంది హిందూ బుద్ధిమంతుల బాధ. ఆ మాటా నిజమే! అయితే మాత్రమేం? మను మహానుభావుడు అన్నట్ల్లుగా అధునాతన హిందూవిశ్వాసులు ఒప్పుకొనే సూక్తులు (?) చాలవా .. నిమ్న జాతులని పేరుతో కొన్నివృత్తుల వారిని .. అటరానివారుగా దూరంగా ఉంచారనడానికి .. ఇంటి పనికి, వంటి పనికి అవసరమైనప్పుడు కరుచుకుని .. అక్కర తీరిన తరువాత దూరంగా జరగమని ఆడవారిని కరవడానికి!
ముసల్మానుల వల్ల చెడు జరిగిన మాట కొట్టి పారేయలేం. కానీ వారి మధ్యప్రాచ్య సంస్కృతి, సాహిత్యాలతో, శిల్ప, భవన నిర్మాణాదుల వైభవాలతో మన భారతీయ సంస్కృతీ మరో విశిష్టమైన కళాకోణం సంతరించుకొన్న మాటా వాస్తవమే. మంచిని మంచిగా , చెడును చెడుగా విశ్లేషించుకొనే వజ్ఞత వివేకవంతులైనా ప్రదర్శిస్తుంటే ఇప్పుడు ఓ క్రమపద్ధతిలో పెచ్చరిల్లుతున్న 'సర్వం హిందూమయం' సిద్ధాతం అయోమయానికి. కొంతైనా తాత్విక చర్చ తోడయి ఉండేది . ఖండ ఖండాలుగా ఉండి నిత్యం హిందూ రాజులు చేసుకొనే అంతర్గత యుద్ధాలతో జనసామాన్యం శక్తియుక్తులు , జాతీయ వనరులు వృథా అయే తరుణంలో మధ్యప్రాచ్య పాలకులు అప్రతిహతంగా సాగించిన వరుస విజయాలతో దేశానికి ఒక అఖండత్వం సాధ్యమైంది. ఆ విధంగానే ఆంగ్లేయ పాలకుల పెత్తనాల ప్రభావం వల్లా మన స్వాతంత్ర్య ప్రతిపత్తికి పెద్ద దెబ్బ తగలడం, జాతీయ వనరులు సముద్రాలు దాటి తరలిపోవడం వరకు వంద శాతం వాస్తవం. రెండో వాదన లేదు. కానీ అదే సయయంలో స్వేచ్ఛా ప్రవృత్తిని బాగా ఇష్టపడే ఆంగ్లేయ సమాజం నుంచి ఇంగ్లీషు భాష , తద్వారా సిద్ధించిన ఇంగితం ద్వారా మన భారతీయ చింతనాపరులు ఎంతో మందిలో అప్పటి సమాజానికి అవసరమైన సంస్కరణలకు సంబంధించిన ఆలోచనా బీజాలూ పడిన మాటా వాస్తవమే. హిందూమతం మీద మాత్రమే ఏక పక్షంగా అపేక్ష చూపించే మతతత్వవాదులు ఈ నిజం ఒప్పుకోకపోయినా 'ఓపెన్' గా యోచించగల ఆలోచనాపరులైనా అంగీకరించవలసి ఉంది. మత విస్తరణ కోసమే ముసల్మానులు , క్రైస్తవులు బడుగు వర్గాలను చేరదీసారు కానీ ప్రత్యేకమైన అభిమానమేమీ కారిపోయికాదు అన్నది హిందూమతవిశ్వాసుల ఫిర్యాదు. నిజమే. కాదనం లేం. జైనులను, బౌద్ధులను .. శైవులు, వైష్ణవులు తన్ని తగలేసినప్పుడు ఆ ధర్మం అధర్మంగా ఎందుకు అనిపించింది కాదో?
లక్ష్యం ఏదైతే ఏం .. మతం మార్చుకోవడం ద్వారా కొంత ఆత్మసమ్మానం సాధించుకోవడం.. అతిహైందవ బిశ్వాసుల అమానుషు దాడుల నుండి తమను తాము కొంత రక్షించుకోవడమయితే వాస్తవం. హిందూమతం నుంచి కొంతైనా ఆదరణ లభించి కనక ఉండివుంటే కనీసం కొన్ని వర్గాలయినా ఈ పాటికి మూల మత విశ్వాసం వైపుకు మళ్లి ఉండేవే. ఇప్పటికీ గోమాంస భక్షకుల పేరున అన్నెం పున్నెం ఎరుగని పాత వృత్తులతో పొట్టపోసుకొనే బక్కజీవులను వెంటాడి వేధిస్తుంటిరి! ఇదేమని నిలదీసే మానవతావాదులను పాశ్చ్యాత్య భావదాస్యులని కించపరుస్తుంటిరి?!
సౌదీలో ఆడవారికి ఓటు హక్కు కల్పించిన సందర్భంగా ఈనాడు ఆదివారం సంపాదకీయం రాసాను నేను. ఆ టపాను ఫేస్ బుక్ లో పెట్టినప్పుడు వయసు సంగతి వదిలేయండి, వాదనలోని సారాంశానికయినా వీసమెత్తు విలువ ఇవ్వకుండా వ్యాఖ్యల పేటికలో అసభ్యమైన వ్యక్తిగత దూషణల పరంపర వెల్లువెత్తింది ఒకానొక సందర్భంలో! ఈ తరహా అతిమతతత్వవాదుల అసహనం గత ఎన్నికలలో ప్రో-హిందువాదుల చేతికి అధికార పగ్గాలు అందినప్పటి నుంచి క్రమంగా పెచ్చు మీరుతున్నది.
పెరుగుట విరుగుట కొరకే అన్న మన తెలుగు నానుడిని ఒక అత్యంత పురాతన జాతీయ స్థాయి పార్టీ ఎలాగూ తన వికృత చేష్టల ద్వారా రుజువు చేసుకొని ఉన్నది. చరిత్ర చెప్పే పాఠాలను పట్టించుకొనే అలవాటులేని మరో జాతీయ పార్టీ అదే బాటల్జొ ప్రస్తుతం ఉరకలు వేస్తో పతనం వైపుకు అత్యుత్సాహంగా పరుగులు పెట్టేస్తున్నది!
భశుమ్!