Friday, August 27, 2021

వ్యాసం- గురించి సూక్ష్మంగా! -కర్లపాలెం హనుమంతరావు

 తెలుగు సాహిత్యం వరకు 'వ్యాసం' ఆధునిక ప్రక్రియ కిందే లెక్క. పరిణతి, ప్రౌఢి, గభీరత, అగాధత, ప్రగాఢత.. లక్షణాలన్నీ ఏకకాలంలో ప్రదర్శించే నైపుణ్యం కేవలం ఒక్క వ్యాస ప్రక్రియకే సొంతం.  వ్యాసం పేరు తాలూకు పుట్టు పూర్వోత్తరాల చరిత్ర మన దగ్గర ప్రస్తుతానికి లేనట్లే.

శతాబ్దం కిందట బ్రౌన్ దొర, బహుజనపల్లి సీతారామయ్యగారు వంటి విజ్ఞులు తమ పదకోశాలలో ఇచ్చిన వివరాలను బట్టి- విస్తరించి చేప్పేటంత విషయం ఉన్నప్పటికి, సంక్షిప్తంగా పర్యాప్తత లక్షణానికి భంగం రాకుండా ఉపక్రమణ, ఉపసంహరణ వంటి  లక్షణాలతో పద్ధతిగా సాగే ప్రకియగా భావించాలి.  తెలియని విషయాలను తెలిసేలా చెప్పడానికి, తెలిసినవే అయినా మరింత లోతుగా తెలిపేందుకు వ్యాసప్రక్రియను ఉపకరణగా చేసుకోవడం తెలుగు వరకు ఆనవాయితీగా వస్తోవుంది ఇప్పటి దాకా! వ్యాసంలో విషయ పరిజ్ఞానానికే పరిమితమయేవాళ్లు కొందరయితే, అదనంగా కళాత్మకతనూ జోడించే సృజనశీలత ఇంకొందరిది. శాస్త్రానికి శాస్త్రం, కళకు కళా అనుకోవడం ఉభయత్రా శ్రేయస్కరం.

భారతీయ వేదవాజ్ఞ్మయానికి వ్యాసుడు సూర్యుడు వంటివాడని ప్రాచీనులకు అమితగౌరవం.  వేదాలను విషయ విభజన చేసి విశదపరిచినందుకు భారతీయ వాజ్ఞ్మయ సంస్కృతులకు సృజన, ప్రతిభలతో జీవం పోసిన వ్యాసుడిని వ్యాస శబ్దానికి  జోడించే ప్రయత్నం కూడా కద్దు.  కానీ అది వృథా ప్రయాస.  ఆధునిక పాశ్చాత్య ప్రక్రియ ప్రభావం అధికంగా ఉండే సాహిత్య ప్రక్రియ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న మనం వాడే వ్యాసరూపం.

సాహిత్యభాషగా తెలుగుకు ఒక స్థాయి ఏర్పడి ఇంకా నిండా వెయ్యేళ్లైనా  నిండాయి కాదు. ఆరంభంలో అంతా పద్యమయంగా సాగిన తెలుగు సాహిత్యంలో వచనానికి చొరవగా పాదం పెట్టి నిలదొక్కుకునే  అవకాశం మరో నాలుగొందలేళ్ళకు మాత్రమే వచ్చింది.  ఆంధ్రమహాభారతంలో వచనం ఉంది కదా? అంటారు కొందరు పండితులు. అది చంపూకావ్యంలా సాగిన మాట వాస్తవమే కానీ,   రూపురేఖలు, శైలీ విన్యాసాల పరంగా అందులో కనిపించే వచనానికీ.. అధునాతకంగా మనం వాడుకునే  వచనానికి పోలికే లేదు.

పంథొమ్మిదో శతాబ్ది మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత తెలుగువాళ్లకు పరిచయమయిన అచ్చుయంత్రాల పుణ్యమా అని  వచనంలో మెల్లగా చలనం మొదలయింది. కాలం గడిచే కొద్ది ఎదురయే రకారకాల అరిష్టాలను అధిగమిస్తూ అది చక్కటి, చిక్కటి పాకంలోకి తేలడానికి  వీరేశలింగంపంతులుగారు వంటి చైతన్యమూర్తులు పడ్డ తంటాలు అన్నా.. ఇన్నా? అప్పటికీ పంతులుగారి వచన రచన పూర్తిగా శిష్టవ్యవహారంలోనే సాగిందని చెప్పడానికి మనసొప్పుకోదు.. ఇప్పటి లెక్కల ప్రకారం.

తాటాకుగ్రంథాలు అచ్చుపుస్తకాలుగా మారే క్రమంలో కావ్యకర్తల వివరాలను, కావ్య పరిష్కరణకు సంబంధించిన కడగండ్లను.. అచ్చయ్యే కావ్యానికి చెందిన ముచ్చట్లేవైనా ఉంటే.. ముందు..   'ముందు మాటలు'లోనో, పీఠికలోనో, పరిచయంలోనో, పరామర్శ రూపంలోనో  ఎంతో కొంత సాటి పండితులతో పంచుకోవాలని, చదివే పాఠకులలో ఉపజ్ఞ పెంచాలన్న తపన ఉండటం సహజం. ఆ సదుద్దేశంతో  గ్రంథ ప్రకాశకులు చేసిన ఆలోచనల మూలకంగనే  నేటి వచనం  పురుడుపోసుకుంది.  అచ్చయిన కావ్యాలను గురించి సమకాలీన పత్రికలలో పండితుల మధ్య సాగిన సమీక్షలు, ప్రశంసలు, విమర్శలు, ప్రతివిమర్శలు తరహా ఖండన మండనలు వేటికైనా వచనమే వేదికగా నిలబడిన పరిస్థితి మొదట్లో. ఆ వచనం వాడుక పెరుగుదల  శాస్త్రబద్ధమైన వ్యాస ప్రక్రియ పరిణతికి కూడా బహుధా దోహదం చేస్తూవచ్చింది క్రమంగా. ఇవాళ వార్తా విశేషాలను కూడా మనం అందమైన కథనాల రూపంలో చదువుతున్నాం. అది వ్యాసమనే తరువుకు  తాజా పూలు, కాయలు, పండ్లు కాయిస్తున్న  కొత్తగా పుట్టుకొచ్చిన శాఖ.

స్థూలంగా గమనిస్తే, తెలుగులో పత్రికల పుట్టుక తొలిరోజుల్లో వెలుగు చూసిన వ్యాస ప్రక్రియలో  సింహ భాగం  సాహిత్య సంబంధితాలే. సహజంగానే అవి ప్రచురించే వ్యాసాలు సాహిత్య సంబంధంగానే ఉంటాయి కదా!

ఆ తరహా సాహిత్య వ్యాసాలను సేకరించి సంకలనాలుగా వెలువరించాలనే సంకల్పం ఏర్పడ్డ తరువాత వెలుగు చూసిన మొదటి వ్యాససంకలనం 'హితసూచని' అంటారు. ఆ పుస్తకాన్ని ప్రచురించింది కీ.శే. శ్రీ సామినేని ముద్దు నరసింహులునాయుడు. ఆ తరువాతి అయిదేళ్ళకు గాని బెంగుళూరు నుంచి జియ్యరు సూరి అనే మరో  తెలుగు ఉపాథ్యాయుడి చొరవతో  రెండు భాగాలలో మహిళలకు సంబంధించిన 'స్తీ కళా కల్లోలిని' అనే వ్యాససంపుటి వెలుగు చూసిందికాదు. అయితే తన వ్యాసాలను ఆ మహానుభావుడూ  వ్యాసాలుగా కాకుండా 'గ్రంథం'గా  పేర్కొనడం  విచిత్రం.  మనం ఘనంగా స్మరించుకునే సంఘసంస్కర్త  కీ. శే కందుకూరి వీరేశలింగంపంతులుగారికి స్ఫూర్తినిచ్చిన మహామహోపాథ్యాయుడు కీ.శే పరవస్తు వేంకట రంగాచార్యులవారు తన కాలంలో విశాల సామాజిక భావజాలం దట్టిస్తూ అతి చక్కని వచనంలో స్ఫూర్తివంతమైన వ్యాసాలు వెలువరించారు. జంటకవులుగా ప్రసిద్ధి పొందిన  తిరుపతి వేంకట కవుల గురువు కీ.శే చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారికీ పరవస్తులవారే పరమ గురువులని చెళ్లపిళ్లవారు తన 'కథలు-గాథలు'లో చెప్పుకొచ్చారు.  అయితే తెలుగు వ్యాసకర్తల తొలితరంలో వందేళ్లు జీవించిన ఈ పండితుడు పత్రికలకు వ్యాసాలను వ్యాసాల పెరుతో కాకుండా 'సంగ్రహం' పేరుతో పంపించేవారుట! వేంకట రంగాచార్యులవారు చూపించిన ఆ వ్యాస జ్యోతుల వెలుగుదార్రిలోనే కందుకూరివారు తన స్వంత పత్రికలలో రాజారామ్మోనరాయ్ మొదలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహదేవ గోవింద రానడేల వరకు .. అందరి వ్యాసాలు పరశ్శతంగా ప్రచురించి  తెలుగు సమాజాన్ని చీకటి నుంచి విముక్తం చెయ్యడానికి శతథా ప్రయత్నించింది.  ఆ వైతాళికుడూ ప్రారంభంలో తన వ్యాసాలను వ్యాసాలు అనేవారు కాదు; ఉపన్యాసాలు అనే ప్రస్తావించేవారు. బహుశా తాను ఉపన్యసించిందల్లా అచ్చులో  ప్రచురించడం వల్ల కావచ్చు. విషయ వైశద్యమూ, విజ్ఞాన వైదగ్థ్యంతో పంతులుగారు రాసిన వైవిధ్య ప్రక్రియల పరంపరలో చిట్టచివరిది కూడా 'వ్యాసమేకావడం.. అదో విశేషం. 1919 నాటి ఆంధ్రపత్రిక ఉగాది వార్షిక సంచికలో పోతన జన్మస్థల వివాదం గురించి  రాసిన 'వ్యాసం అది.

తెలుగు సమాజ బహుముఖీన వికాసం ఇరవయ్యవ శాతాబ్ది తొలి దశాబ్ది నుంచి ఆరంభమయిందంటారు చరిత్రకారులు. ఆ వికాసోద్యమంలో  భాగంగా సాహిత్యరంగం తాలూకు ఎదుగుదల బారలు మూరల్లో కాకుండా అంగల్లో ఉండటం తెలుగువాళ్లు చేసుకున్న  అదృష్టం. కృష్ణాపత్రిక ఆవిర్భావంతో ఆరంభమయిన ఆర్భాటం దేశాభిమాని, ఆంధ్రకేసరి లాంటి చిన్నా చితకా పత్రికలతో సరిపుచ్చుకోక అనంతరం కాలంలో అమేయపర్వతంలా ఎదిగిన ఆంధ్రపత్రికకు, మరో దశాబ్దంనర  తరువాత భారతి వంటి సాహిత్య మాసపత్రికలకు  ప్రేరణగా మారటం.. చెప్పుకోదగ్గ విశేషం.  అన్ని పత్రికలలో  కాల్పనిక సాహిత్యానికి రెట్టింపు ఆదరణ విషయ ప్రాధాన్యతకు అధిక గౌరవమిచ్చే 'వ్యాస' ప్రక్రియకు లభించడం సాంస్కృతిక పునరుజ్జీవన కోణంలో విశేషమైన సగుణాత్మక మలుపు.

సాహిత్య ప్రక్ర్రియ ఏదైనా కావచ్చు.. అందులోని విషయ వివరణ పరిచయానికి వస్తే వ్యాసమే ఆలంబన అవుతుంది కదా! అందులోనూ త్రిలింగ, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, ప్రబుద్ధాంధ్ర, రెడ్డిరాణి, ప్రతిభ, జయంతి లాంటి పత్రికలకు వ్యాసాలు మాత్రమే అంగీకారయోగ్యం. అందుకే, పంథొమ్మిదో శతాబ్దిని పక్కన పెట్టినా, కేవలం ఇరవయ్యో శతాబ్దపు వ్యాసరచయితల పట్టికను పరిశీలిస్తే ఆంజనేయుడి తోకంత సుదీర్ఘంగా ఉంటుంది. తిరుపతి వేంకట కవుల నుంచి, కట్టమంచి, వేలూరి, విశ్వనాథ, నోరి, నిడదవోలు, మల్లంపల్లి, బండారు తమ్మయ్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, భావరాజు వెంకటకృష్ణారావు.. ఇట్లా జాబితాలోని ఉద్దండుల పేర్లు అంతూ పొంతూ లేకుండా సాగిపోతాయి. వ్యాస ప్రక్ర్రియకు పరిణతిని సమకూర్చిన గిడుగు రామ్మూర్తిపంతులు, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు వంటివారు ప్రత్యేకంగా ఈ సందర్భంలో ప్రస్తావనార్హులు.

ఎప్పటి కప్పుడు కొత్త నీరు ఊటలెత్తే  వ్యాసజలనిధిలో ఎన్ని పొరలనని మనం తడవగలం? ఎంత మంది ప్రజ్ఞావంతులైన వ్యాసకర్తలకు న్యాయం చేయగలం?! కుతూహలం కొద్ది ఏదో తెలిసిన నాలుగు మాటలు నలుగురు మిత్రులతో పంచుకోవడం తప్పించి. స్వస్తి.

-కర్లపాలెం హనుమంతరావు

నవంబర్, 12, 2020.

బోథెల్, యూ.ఎస్.

పెయిడ్ ఇన్ ఫుల్ -కర్లపాలెం హనుమంతరావు

 సుబ్బుకు పదేళ్లు.  ఐదో తరగతి. బుద్ధిగా చదువుతాడు. లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా.  కూడికలు తీసివేతలు  రెండంకెల వరకు  నోటితోనే  చేసేయగలడు. కానీ ఈ సారి నోట్ బుక్ లోని ఒక కాగితం చించి దాని మీద ఈ విధంగా లెక్క వేసాడు. వీధి చివరి శేషయ్య కొట్టు వరకు వెళ్లి  ఉప్పు, కరేపాకు లాంటి సరుకులు వెంటనే తెచ్చి ఇచ్చినందుకుః  రూ.2

అమ్మ వంట పనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడించినందుకుః రూ.3

ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు రూ. 3

అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా  మూట్ లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు రూ.1

బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు.. ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పచెబుతున్నందుకు రూ.3

కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు  తోడుగా వెళుతున్నందుకుః రూ.2

ప్రోగ్రెస్ రిపోర్టులో ఎప్పుడూ తెచ్చుకునే  రెండో ర్యాంకు పోయినవారం కూడా  తెచ్చుకుంటున్నందుకు ఆ వారం  వాయిదాః రూ.10

చిల్లర  పనులుః రూ.10

పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు  ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తంః రూ 34

వీడియో గేమ్ కు  లెక్క తక్కువ పడింది. 

సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు. ఆఫీసు పని మీద వేరే ఊరికి వెళ్లారు. వారం దాకా రారు. అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న అమ్మకు అందించాడు.

వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ.

అదే కాగితం వెనక సుబ్బు నుంచి పెన్సిలు అడిగి తీసుకుని ఈ విధంగా రాసి ఇచ్చింది అమ్మ.

అమ్మ రాసిన లెక్కః

నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను. మోత కూలీః రూ. 0 

రాత్రిళ్లు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకోనేదాన్ని. చల్లగాలి తగిలి జలుబు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచినిద్రలో కూడా వచ్చి చూసేదానిని. నిద్రలో నీకు తెలియదు. కాపలా పనికిః రూ.0

నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు. మళ్లా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకుః రూ.0

ఇట్లా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా నీ ఆటపాటలకు బొమ్మలు, పుస్తకాలు, చదువు సంధ్యలకు పుస్తకాలు,  ఉల్లాసానికి వెంట తీసుకువెళ్లిన పార్కులు, సినిమాలు, ఆఖరికి నీకు రొంప పడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చీదరించుకోకుండా తుడిచేదాన్ని. ఈ మాదిరి  చిల్లర సేవలు చాలా చేసాను. చేస్తున్నాను.  ఆ సేవలకు రూః0

సుబ్బూ! నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం నాకు చేతకావడం లేదు. ఆ బిల్లూ నువ్వే వెయ్యి. నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు. ఇంకా ఏ మన్నా ఇవ్వాల్సింది  మిగులుంటే అప్పుడు మళ్లా కొత్తగా వేసుకురారా నాన్నా అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు!

అమ్మ ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ల వెంట నీళ్లు బొట బొటా కారాయి. పెన్సిల్ వెనక్కు తీసుకుని 

ఈ విధంగా రాసుకున్నాడు ' పైడ్ ఇన్ ఫుల్'ఎక్కడో  

( ఎక్కడో చదివిన బాలల కథానిక నా శైలిలో )  

-కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ , యా ఎస్.ఎ 

***


సామాజిక మాధ్యమాలు-దుర్వినియోగం -వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 


ప్రపంచం మొత్తంలో  సామాజిక మాధ్యమాల  దుర్వినియోగంలో మనమే నెంబర్ ఒన్.  రోజువారీ సామాజిక మాధ్యమాల టపాలలో సింహభాగం.. అబద్ధం.. అసంబద్ధంపనికిరానివిప్రతికూలమైనవి.  అవమానకరమైతే వాటి లెక్కకు ఇహ అంతే లేదు. అసభ్యంగా ఉండిఅక్కరకు రాకుండా పక్కదారి పట్టించేవి కొన్నైతేఏకంగా  సామాజిక సామరస్యానికి ముప్పు తెచ్చేవి కొన్నిఏ ఒక పక్షం తరుఫునో పద్దాకా బుర్రలు తోమే పనిలో నిరంతరం మునిగుండేవి కొన్ని.  రత్నాల వంటి టపాలను పట్టుకోవడం ఉప్పు నీటి సామాజిక మాధ్యమ సముద్రంలో నిలువీత ఈదే వస్తాదులకైనా దుస్సాధ్యం అన్నట్లుంది ఇప్పటి దుస్థితి. 

 

అవసరముండీ ఓ పొల్లు మాట బైట అనేందుకే ఒకటికి రెండు సార్లు సంకోచించే సంస్కృతి మన గతానిది. ప్రస్తుతమో!  ఎంతటి పెద్దరికమున్నప్పటికీ  పది మంది నసాళాలకు అంటే ఏదో  కుంటి కూత డైలీ ఓటి ట్వీట్ గా పడందే పప్పు అనో.. తుప్పు అనో దెప్పిపొడుపులు వినక తప్పని దిక్కుమాలిన  సోషల్ వర్కింగ్ సీజన్లో చిక్కుకుపోయాం అందరం.   

 

సామాజిక మాధ్యమాలు వ్యక్తిగత జీవితం  విలువైన సమయాన్నే కాకుండాచెమటోడ్చి గడించిన సొమ్ములో అధికభాగాన్నీ దుర్వినియోగ పరుస్తున్నాయ్! స్పాములు.. ఫిల్టర్లు  ఎన్ని ఉన్నా బురద నీరులా వచ్చిపడే ఈ-మెయిళ్ల ప్రక్షాళనకే అధిక సమయం కేటాయించే దౌర్భాగ్య పరిస్థితికి అడ్డుకట్ట వేయడం కుదరని పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల మూలకంగా ఎంత మంది క్షోభిస్తున్నారో .. ఆ లెక్కలు తీసే టెక్నాలజీ ఇంకా రాలేదు! 

 

మాదక ద్రవ్యాల వినియోగం మాదిరిదే సామాజిక మాధ్యమాల దుర్వినియోగం కూడా. నిండా కూరుకున్న తరువాత గాని చుట్టుముట్టిన సుడిగుండం లోతు తెలిసే యోగం లేదు. చేజేతులా చేతులు కాల్చుకోడం.. ఆనక ఆకుల కోసం అల్లల్లాడడం! ఎంత మంది అమాయక జీవుల బతుకులు అల్లరిపాలవుతున్నాయో!  

భావి దివ్య జీవన హార్మ్యానికి సోపానాలు నిర్మించుకునే శక్తివంతమైనది మనిషికి యవ్వనకాలం. నైపుణ్యాలు దీక్షగా సాధన చేయవలసిన యవ్వనకాలంలో అధికభాగం నిరర్థక సామాజిక మాధ్యమాల గ్రహణం నోటపడితే ముందొచ్చే కాలమంతా మసకబారవలసిందే.  

వ్యక్తిగత విజయాలకు ఊతమిచ్చే వరకు సమస్యలేదు. అందుకు విరుద్ధంగా అభివృద్ధికి ఆటంకంగా మారినప్పుడే సామాజిక మాధ్యమాలు అభివృద్ధికి అడ్డంకులుగా మారడం! పరిశోధన తీరులో సాగవలసిన పని తీరు క్రమంగా  సామాజిక మాధ్యమాలకు  కట్టుబానిసలుగా మార్చేయడమే ప్రస్తుతం ఆందోళన కలిగించే పరిణామం.  వృద్ధులను మరంత ప్రతికూలంగా ప్రభావితం చేయడం  సోషల్ నెట్ వర్కింగ్ ప్రధాన బలహీనత. పఠనం, పర్యటనపరిశీలనదిశానిర్దేశంఅనుభవాల సారం పదిమందికి వ్యక్తిగతంగా పంచే తీరులో ఇంత వరకు సాగిన నిర్మాణాత్మక పాత్ర స్థానే  అసాంఘిక నైజం చొరబడ్డం ఆందోళన కలిగించే పరిణామం. 

యుఎస్ లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారంసోషల్ మీడియాటెలివిజన్వీడియో గేమ్‌లు వంటి  సామాజిక మాధ్యమాలలో   సగటు అమెరికన్ ఏడాదికి 400 గంటలు వృథా చేస్తున్నట్లు తేలింది. ఇండియాలో ఈ వ్యర్థ సమయం మోతాదు అందుకు రెట్టింపు. సమాజ శ్రేయస్సుకుకొత్త నైపుణ్యాల సాధనకు గతంలో వినియోగమైన సమయం ప్రస్తుతం నాలుగింట మూడు వంతులు సామాజికంగా వ్యర్థ వినియోగం దిశకు మళ్లడం మొత్తంగా దేశానికీ ప్రతికూలమైన అంశంగా పరిగణించక తప్పదు! 

విశ్వవ్యాప్తంగా విద్యావంతులూ సోషల్ నెట్‌వర్క్‌ కు చిక్కి రోజుకు సుమారు  2.5 గంటలు వృథా చేస్తున్నట్లు మరో అధ్యయనం నిర్ధారణ.  భారతదేశంలోసగటున ప్రజలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో 2.4 గంటలు గడుపుతున్నట్లుఎక్కువ సమయం నాసిరకంపాత జోకులను పంచుకునేందుకే దుర్వినియోగమవుతున్నట్లు పరిశోధన తేల్చింది. పరిశోధన ప్రకారం ఎవరికీ ఉపయోగపడని వ్యక్తిగత విషయాలుసొంత 



విషయాలను గురించి ప్రగల్భాలకై వినియోగించే సమయమూ తక్కువేమీ లేదు. ఒక జపానీయుడు సగటున 45 నిమిషాలు మించి గడిపేందుకు మొగ్గు చూపని కాలంలో జీవిస్తున్న మనం ఎందుకు ఆ నిగ్రహం పాటించలేకుండా ఉన్నాం! దేశం కోసం కాకపోయినా వ్యక్తిగత మానసిక ఆరోగ్యం దృష్ట్యా అయినా సామాజిక మాధ్యమాల వినియోగించే సమయం,నాణ్యతల పైన సమాజం పునరాలోచించే తరుణం దాటిపోతోంది. తస్మాత్ జాగ్రత్తని హెచ్చరించేందుకే ఈ చిన్న వ్యాసం. 

-కర్లపాలెం హనుమంతరావు

30 -04 -2021

Thursday, August 26, 2021

ఇస్లాం మతం -కర్లపాలెం హనుమంతరావు

 పుట్టింది కేవలం 1500 ఏళ్ల కిందట. కానీప్రపంచ జనాభాలో ఆరో శాతనికన్న కొంచెం ఎక్కువగా ఇప్పుడు విశ్వసిస్తున్నది ఇస్లాం మతం. ప్రపంచ జనాభా 652 కోట్లు అని లెక్కవేసిన 2004లో ముస్లిం మత విశ్వాసుల సంఖ్య 152 కోట్లు. ఇండొనేశియాలో మెజారిటీ మతం ఇస్లాం 21 కోట్ల 60 లక్షలు. సౌదీ అరేబియా, బహ్రేన్, వెస్ట్రన్ సహారాలలో వంద శాతం ముస్లిములే! టర్కీ, ఒమాన్, గాజా, యూ.ఎ.ఇ, సోమాలియా, ఇరాన్, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, గాజాస్ట్రిప్, కతర్, సెనెగల్, సిరియా, గాంబియా, మాలి లాంటి దేశాలు ఇంకా చాలా చిన్నవి పొన్నవీ ఉన్నాయి.. వాటిలో నూటికి తొంభై మంది ముసల్మాన్ మతస్తులే! భారతదేశంలో 109 కోట్లుగా ఉన్నప్పుడు ముస్లిం జనాభా15 కోట్ల 30 లక్షలు. జనాభాలో  ఏడో వంతు. (పాకిస్తాన్ జనాభా మరో 70 లక్షలు మాత్రమే అధికం). ఇవన్నీ కొత్త శతాబ్దం తొలి దశకం అంచనా. తతిమ్మా అన్ని మతాల కన్నా ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు లెక్కలు వేసుకుని చెబుతున్నాయి. 

ఇస్లాం అనే పదం అరబిక్ భాషలోని 'స్లం' అనే అక్షరం నుంచి పుట్టింది. మనసుని బుద్ధిని భగవంతుని పరం చేసి సాధించే శాంతిని 'స్లం' అంటారు. ముస్లిం అంటే బుద్ధిని సర్వేశ్వరుని పరం చేసిన వ్యక్తి. ఖుర్ ఆన్ వీరి పవిత్ర గ్రంథం. ఇందులోని సూక్తులన్ని స్వయంగా భగవంతుడు ప్రవక్తకు అందించినవి. ఇస్లాం ప్రవక్త పుట్టించిన మతం కాదని.. సృష్టి ఆది నుంచి ఉన్న మతాన్నే ప్రవక్త ద్వారా ప్రపంచానికి తెలియచేసాడని మత పెద్దలు భావిస్తారు. తన ముందు వచ్చిన ప్రవక్తలకు మల్లే ఇస్లాం మత సూత్రాలని ఏ కొద్దిమందికో కాకుండా ప్రపంచమానవాళి మొత్తానికి అందించిన కారణంగానే మహమ్మద్ ప్రవక్తకు ఎక్కువ ప్రాచుర్యం లభించినట్లు చెబుతారు.  తాము నమ్ముతూ వస్తున్న మత భావాలకు విరుద్ధంగా హేతుబద్ధమైన సూత్రాలతో ప్రపంచాన్ని వేగంగా ఆకర్షించే మహమ్మదు ప్రవక్త మీద ఆ మత పెద్దలకు కినుక. కినుక ఎక్కువ అయితే హింసా ఎక్కువవుతుంది. మహమ్మదు మీదా, అతని అనుచరల మీదా హింసాకాండ పెచ్చు మీరడంతో మక్కాను వదిలి రెడి సీ మీదుగా అబిసీనియా(ఇప్పుడది ఇథియోపియా) చేరుకున్నాడు  మహమ్మద్. ప్రవక్తను అనుసరించిన నూటొక్క మంది అనుచరులలో 83 మంది పురుషులు, 18 మంది స్త్రీలు. అయినా మక్కాలో మహమ్మద్ కుటుంబాన్ని సంఘబహిష్కర చేసి హింసించింది మక్కా  మతపెద్దల గుంపు. ప్రవక్తకు అండగా ఉంటూ వచ్చిన పినతండ్రి  అబూ తాలిబ్, భార్య ఖదీజా మరణించిన విషాద కాలాన్ని ముసల్మానులు అముల్ హుజ్న్ (విషాద సంవత్సరం) పరిగణిస్తారు. ఆ తరువాతా హింస తగ్గని వాతావరణంలోనే మక్కావాసుల  భక్తి విశ్వాసాలను క్రమంగా పెంచుకుంటూ బహిష్కరణ తరువాత పదమూడవ ఏట ఎస్రిబ్ నగరంలో భగవంతుని వాణిని వినిపించేందుకు సిద్ధమయాడు మహమ్మద్.  అక్కడ అంతకు ముందున్న విరోధి వర్గాల మధ్యన సయోధ్య కుదిర్చి శాంతి వాతావరణం కలిపించి తిరిగి వెళ్లే సమయంలో రాత్రి వేల హంతకుల మూఠా ఆయనను మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. ప్రవక్త స్థానంలో ఆలీ అనే అనుయాయి ఉండిపోవడంతో ప్రాణగండం తప్పింది. ప్రాణమిత్రుడు అబూ బకర్  ఒక్కడినే వెంటపెట్టుకుని మదీనా చేరడంతో ఇస్లా చరిత్రలో నూతన శకం 'హిజ్రీ శకం'  ఆరంభమయింది. ప్రవక్త మక్కా నుంచి మదీనా వలసవెళ్లడం 'హిజ్రల్ ' చరిత్రలో ప్రసిద్ధం.  ప్రవక్త రాకతో ఎస్రిబ్ 'మదీన్నతుబీ' (ప్రవక్త నగరం)గా పేరు మారిపోయింది. ప్రవక్త రాకతో ఎస్రిబ్ నగరవాసులు ఎందరో ఇస్లాం మతంలోకి చేరిపోయారు. బహుదేవతారాధకులకు/అవిశ్వాసులకు.. ఇస్లాం మతానుయాయులకు క్రీ.శ 624 నుంచి 627 దాకా మూడు యుద్ధాలు జరిగాయి. మక్కా మదీనాలకు మధ్యన నైరుతీ దిశలో సుమారు 136 కి.మీ దూరంలో ఉన్న బద్ర్ అనే స్థలంలో హిజ్రీ శకం ఆరంభం అయిన రెండో ఏడాది (క్రీ.శ 624)లో జరిగిన యుద్ధం ఇస్లాం చరిత్ర గతిని మార్చేసిన ఘట్టం. ముస్లిములు ఈ యుద్ధంలో ఓడిపోతే ప్రపంచంలో ఇప్పుడు ఇస్లాం అన్న ఒక మతమే ఉండేది కాదు. ఈ మాట స్వయంగా మహమ్మద్ ప్రవక్త యుద్దసమయంలో అల్లాకు చేసుకున్న విన్నపం. తక్కువ సంఖ్య  ఉన్నాఇస్లాం పక్షం విజయం సాధించడానికి అల్లా ఆశీర్వాదమే కారణమని ముస్లిములంతా భావిస్తారు.తరువాతి  రెండు ఏడాళ్లూ ఉహుద్ కొండప్రాంతంలో మదీనా పరిసరాల ప్రాంతంలో జరిగిన యుద్ధాల విజయాల కారణంగా  మక్కా కూడా ఇస్లాం మతం స్వీకరించడంతో విగ్రహాలు అక్కరలేని 'కాబా' పూజా విధానం ప్రపంచమంతటా ఆల్లుకునేందుకు పునాది వేసినట్లయింది. ప్రపంచ ముస్లిములకంతా ఇప్పుడు హజ్ ఇప్పుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిన పుణ్యస్థలి. క్రీ.శ 632, జూన్ 8 న (హిజ్రీ శకం 11 వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ నెల 11వ తేదీ) మహమ్మద్ తన 23 ఏళ్ల ప్రవక్త జీవితాన్ని చాలించుకుని బౌతికంగా కనుమరుగయినప్పటికీ.. ఆయన  ప్రసాదించిన జ్ఞాన సంపదలు ఖుర్ ఆన్, సున్నత్ ప్రపంచగతిని ప్రతీ దేశంలోనూ అనుకూలంగాగానో, ప్రతికూలంగానో మొత్తానికి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్!

ఖుర్ ఆన్ ముస్లిముల పవిత్ర గ్రంథంగా మనందరికీ తెలుసును. సున్నత్ ప్రవక్త నెలకొల్పిన సంప్రదాయాల సంకలనం. ఆఖరి రోజుల వరకు ఆయన  చేసిన బోధనలు 'హదీసు' పేరుతో సుప్రసిద్ధం. సమాధులను, గోరీలను పూజాలయాలు చేయవద్దన్నది మహమ్మది ప్రధాన ఆదేశం.

అల్లా ధర్మమని భావించిన దానినే తాను 'హలాల్' గా , అధర్మని భావించిన దానినే 'హరామ్' గా బోధించినట్లు చెబుతూనే దేనినీ తనకు వ్యక్తిగతంగా ఆపాదించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఇస్లాం మత పేరున చెలరేగుతున్న  అనుకూల, ప్రతికూల  సంఘటనలన్నీ మహమ్మద్ ప్రవక్త రూపంలో బోధించిన తీరులో సాగడంలేదు. విచారకరం!

(అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వ్యాసం. రచయితకు ఏ తరహా ఉద్దేశాలు ఆపాదించవద్దని ప్రార్థన) .

- కర్లపాలెం హనుమంతరావు 

25 -08 -2021 


Wednesday, August 25, 2021

భూపాలరాగం - కర్లపాలెం హనుమంతరావు - కవిత

 పురుగుమందుకు మనుషులంటేనే ఎందుకో అంత ప్రేమ !

విషం మిథైల్ ఐసో సైనేట్ మారు వేషంలో

నగరం మీద విరుచుకుపడిన చీకటి క్షణాల ముందు

హిరోషిమా నాగసాకీ బాంబు దాడులే కాదు

'తొమ్మిదీ పదకొండు' ఉగ్ర దాడులు కూడా దిగదుడుపే !


టోపీల వాడి మాయాజాలమంటే అంతే మరి!

మనకి ఊపిరాడదని మన తలుపుకే కన్నం వేసే కంతిరితనం వాడిది.

అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చి మిరియంమొక్క అడిగినా

కంపెనీవాడొచ్చి మూడడుగుల నేలడిగినా

మన కళ్ళుకప్పి మాడుమీద వాడి జెండా దిగేయ్యటానికే!

మన కండలు పిసికి పండించిన  పంటను ఓడల కెత్తుకెళ్ళటానికే.

అదిప్పుడు పాత కథ.

కొత్త కథలో..

వామనుడు అడగక ముందే  నెత్తి చూపించే అమాయక బలి చక్రవర్తులం మనం

భూమిని చాపలా చుట్టి వాడి పాదాల ముందు పరచటానికి

పోటీలు పడే కలియుగ దానకర్ణులం.

మన రూపాయి ప్రాణవాయువును

వాడి డాలరు బతుకుతెరువు కోసం

తృణప్రాయంగా సమర్పించుకునే

పిచ్చి బేహారులం

వాడి విమానాలు క్షేమంగా దిగాలని

మన వూళ్ళు కూల్చుకుని

రహదారులు విశాలంగా చేసుకునే

విశాలహృదయులం

వాడి నాలిక మడత పడటం లేదని

మన మాటను సంకరం చేసుకునే టందుకయినా సంకోచపడం.

వాడి అణుదుకాణాల కోసం

మన అన్నపూర్ణ కడుపులో చిచ్చు పెట్టుకోటానికయినా మనం సిద్దం.

సార్వభౌమత్వమంటేనే ఒక చమత్కారం

ఆ డాబు దర్పాలకి మురిసి చప్పట్లు కొట్టటమే మనకు గొప్పతనం.

అణుఒప్పందం వల్ల భవిష్యత్తులో జరిగే భారతీయ చెర్నోబిల్ నాటకానికి

పాతికేళ్ళ క్రిందటే ప్రారంభమయింది

భూపాల రాగం… వింటున్నారా!

- కర్లపాలెం హనుమంతరావు 

( Published on 2010, October 5 in 'Poddu'(పొద్దు )- Internet Telugu Monthly Magazine)

About కర్లపాలెం హనుమంతరావు

రచన వ్యాసంగం లో కర్లపాలెం హనుమంతరావు గారిది పాతికేళ్ళ పైబడిన అనుభవం. వందకు పైగా చిన్న కథలు,వందన్నరకు పైగా వ్యంగ్య గల్పికలు (అన్నీ ప్రచురితాలే), డజనుకు పైగా నాటికలు, ఆకాశవాణికి రచనలు... వారి సాహిత్య రికార్డు. సినిమాలకు రచన చేసిన అనుభవం అదనం. "శైలజ కృష్ణమూర్తి-వాళ్ళకింకా పెళ్లి కాలేదు ", "ఫోటో" చిత్రాలకు రచన విభాగంలో పనిచేసారు. మరికొన్ని చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఈనాడు ఆదివారం ఎడిటోరియల్ కు రచనలు అందిస్తుంటారు. "ఒక్క నవల మీద తప్ప అన్ని ప్రక్రియల మీద చెయ్యి చేసుకున్నపాపం నాది. స్థిరంగా వుండక కొంత, చేసిన బ్యాంక్ మేనేజర్ వృత్తి వుండనీయక కొంత. మొత్తంగా పెద్దగా సాధించినదేమీ లేదు. వారం వారం ఈనాడులో మాత్రం దాదాపు పుష్కర కాలం మించి  ఎవరినో ఒకరిని సాధిస్తూ ( వ్యంగ్యం ) కాలక్షేపం చేస్తున్నాను. మధ్యలో ఆంధ్రభూమి వెన్నెల సినిమా పేజీలో కొత్త సినిమాలను సాధిస్తూ కాలక్షేపం చేశాను. కవిత్వం అంటే మరీ ఎక్కువ ఇష్టం కాబట్టి దాన్ని చదువు కోవటం తప్ప సాధించింది తక్కువ .మరీ తప్పనప్పుడు, మనసు మరీ సాధిస్తున్నప్పుడు తప్ప కవితామతల్లి జోలికి పోయే సాహసం చేయను." అని అంటారాయన.

- పొద్దు కవి పరిచయం 

Saturday, August 7, 2021

కవికి ఏం కావాలి ? - సాహిత్య వ్యాసం - కర్లపాలెం హనుమంతరావు

 


కవికి ఏం కావాలి? 


కవిత్వానికి నిర్వచనం ఏమిటి?

కవులెంతమందో కవిత్వానికి నిర్వచనాలన్ని.అదనంగా సాహిత్య విమర్శకుల శాస్త్రీయ నిర్వచానాలు.

" The best in the best order is “Emotions recollected in Tranquility” అంటారు  శ్రీశ్రీ.

అల్లసాని పెద్దన గారి లెక్క ప్రకారం కవిత్వం”రాతిరియుం బవల్ మరపురాని హోరు”

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఒకసారి కవిత్వాన్ని గురించి అరగంట మాట్లాడతానని చెప్పి మధ్యాహ్నం 3గంటల్నుంచీ రాత్రి 8గంటలదాకా ఏకబిగిన ఉపన్యాసం చేశారుట.కవిత్వ పరిధి అంత విస్తృతమైనది మరి.

ప్రపంచమంతా కవితావస్తువే కదా!’మరిచి పోయేది చెత్త…జ్ఞాపకంలో మిగిలుండేది కవిత్వం’ అన్నది కూడా ఆయనే.లోకుల రసనలే తాటాకులుగా వేమన పద్యాలు తెలుగులోకంలో నేటికీ  నిలిచివుండటమే దీనికి మంచి ఉదాహరణ.

శ్రీపాదకృష్ణమూర్తి గారు భారతం మొత్తాన్ని ఒంటిచేత్తో పద్యాలుగా రాశారు. చదివినంతసేపూ బాగానే ఉన్నా తిరిగి చెప్పమంటే ఒక్కటీ చప్పున గుర్తుకు రాలేదంటారు  శ్రీశ్రీ!

విలియమ్ సారోయిన్ ప్రఖ్యాత short story రచయిత.The Latest Position In Modern American Poetry అని శీర్షిక పెట్టి తనకు తోచినదంతా ఒక క్రమంలో కథగా రాసేవాడుట.కథ పూర్తయింతరువాత ఆశీర్షికను తీసేసి కథకు తగిన Title పెట్టుకోవడం ఆయన అలవాటు.కథకు కూడా పొయిట్రీనే ప్రేరణ అని చెప్పటానికి ఈ పిట్ట కథ చెప్పింది.

ఇక తెలుగు కవిత్వానికి వస్తే…

నన్నయగారు ఆదికవి అని మనందరి అభిప్రాయం.అంటే ఆయనకు ముందు కవిత్వం అసలే లేదా! ఉంది.జానపదుల ప్రపంచం నిండా ఉండేది కవిత్వమే.కాకపోతే అది గ్రంధస్థం అవడానికి నోచుకోలేదు.ఆ గాసటబీసటలు చదివి ప్రేరణ పొంది సంస్కరించి వాగనుశాసనుడయ్యాడు నన్నయభట్టారకుడు.

ప్రపంచం అంతటా ఈ ధోరణే ఉంది.కవిత్వం అంటే అక్షరబద్ధమైనదేనా!Haves poetry(కలవారి కవ్విత్వం) ఉన్నట్లే లేని వారికీ కవిత్వం ఉంటుంది.అది శిష్టసాహిత్యం కన్నా పాతది కూడా.నన్నయ గారికన్నా ముందు నదుల్లో నావలు నడుపుకునే వాళ్ళూ, పొలంపనులు చేసుకునే కూలీనాలీ పాటకజనం  నోట నలిగిందీ కవిత్వమే.మల్లంపల్లి సోమశేఖరశర్మగారి మాటల్లో’అది అనాఘ్రాత వాజ్ఞ్మయం’.

ఇంక ఆధునికతకు వస్తే…

గురుజాడగారు ముత్యాలసరాలు రాసిందాకా తెలుగుకవిత్వం పద్యాల్లో ధర్మంలాగా నాలుగు పాదాల మీదే కచ్చితంగా నడిచింది. చంపకమాలైనా..శార్దూలమైనా రథవేగం సాధించాలంటే నాలుగు చక్రాలే ఆధారం. అప్పటికి రథవేగం గొప్పది. రైలింజను వచ్చిన తరువాత HorsePower గొప్పయింది.విమానాలు ఎగరడం మొదలయిన తరువాత వాయువేగం మీదే అందరి దృష్టి.ఇప్పుడయితే రాకెట్ వేగాన్ని కూడా అధిగమించే ఉపగ్రహాల స్పీడ్ తెలిసిందే.పెరిగే వేగాన్ని అందుకోవడానికి కవులకూ కొత్తకొత్త ప్రక్రియల్లో ప్రయోగాలు చేయడం అవసరం అయింది.నత్తనడకను చీదరించుకునే కొత్త తరాన్ని అందుకోవడానికి కవులు కనిపెట్టిన అతినవీన అద్భుతం అత్యంత వేగంగా పరుగులెత్తే వచన పద్యం.

తెలుగులొ 30వ దశకంలొ ఊపందుకున్న ఈ ప్రక్రియకు పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో అంతకుముందే వచ్చిన ప్రయోగాలు ప్రేరణ. 30వ దశకాన్ని Hungry Thirties అంటారు.ఇప్పటికన్నా ఎక్కువ ఆర్థికమాద్యం ముమ్మరించిన కాలం అది.స్పానిష్ సివిల్ వార్ జరిగింది  ఆ దశాబ్దంలోనే.ప్రపంచమేధావులు మొత్తం రెండువర్గాలుగా చీలిన  పరిస్థితి. స్పానిష్ యుద్దాన్ని ఖండిచిన వాళ్ళు కాగితాలతో కలాలతొ పోరాటం మొదలుపెట్టారు. రాల్స్ ఫాక్స్(క్రిస్ట్ ఫర్, కాండ్ వెల్, స్టిఫిన్ స్పేండర్ లాంటి కవులైతే) ఏకంగా ఇంటర్నేషనల్ ఆర్మీలోనే చేరిపోయారు.’కవి అన్నవాడు కల్లోలప్రపంచానికి దూరంగా కళ్ళుమూసుకుని కూర్చోనుండరాదు’అన్న భావానికి ఊతం పెరుగుతున్న రోజులు అవి.ఆ ప్రభావంతోనే శ్రీశ్రీ లాంటి ఉష్ణరక్తపు యువకులు అంతకు ముందుదాకా రాస్తున్న సాంప్రదాయక కవిత్వాన్ని కాదని కొత్త పల్లవి ఎత్తుకున్నారు.శ్రీశ్రీ మహాప్రస్థానంలోని చాలా గీతాలు 30వ దశకంలో రాసినవే.గమనించండి.భావకవిత్వం ప్రచారకుడు కృష్ణశాస్త్రి కూడా అభ్యుదయ రచయితల సంఘం ఒక వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహించారు ఆ రోజుల్లో.

1970దాకా ఒక వెలుగు వెలిగింది అభ్యుదయ కవిత్వం.నూనె ఐపోయిందో…వత్తి సారం  తగ్గిందో మెల్లిగా కొడిగట్టడం మొదలుపెట్టింది.

శ్రీకాకుళోద్యమం ప్రేరణతో విప్లవ కవిత్వం ప్రభ మొదలయింది.

1910 లో తోకచుక్క రాలినప్పుడు గురుజాడవారు మొదలు పెట్టిన ముత్యాలసరాలు లగాయితు కవిత్వం ఇప్పటిదాకా పోయిన… పోతున్న వన్నె చిన్నెలన్నీ చర్చించడం ఇక్కడ అప్రస్తుతం కానీ…ఇప్పుడు నడుస్తున్న కవిత్వానికి  మాత్రం  అస్థిత్వవాద వైయక్తివాదాదులే ప్రధాన భూమికలుగా ఉన్నాయన్న ఒక్క మాటతో స్వస్తి చెప్పుకుంటే సరిపోతుంది.

వరదపోటులాగా వచ్చిపడుతోంది కవిత్వం ఇప్పుడన్ని దిక్కుల్నించీ.చందోబంధనాలు, వ్యాకరణాల సంకెళ్ళు వంటి ప్రతిబంధకాలు లేకపోవడం…భాషసారళ్యం వల్ల ఎంత సున్నితమైన భావాన్నయినా కవిత్వరీకరించవచ్చన్న స్పృహ పెరగడం, ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక విజ్ఞానప్రగతి,  సంక్షుభిత సామాజిక పరిస్థితులు, గణనీయంగా పెరుగుతున్న చదువరుల సంఖ్యాపరిమాణాలు, ఆత్మగౌరవ కాంక్షలు, అపరిమితమైన భావవ్యక్తీకరణ స్వేచ్చ నేటి కవిత్వవికాసానికి కొన్ని ప్రధాన ప్రేరణలు, కారణాలు.


కవిత్వం పెరగడం సంతోషించదగ్గ పరిణామమే. మరి ప్రమాణాల సంగతి? వరదంటూ వచ్చిన తరువాత మంచినీటితో పాటు మురుగునీరూ కలిసి ప్రవహించడం సహజమేగా! కొంతకాలానికి తేటనీరు పైకి తేరుకొని…రొచ్చు అడుగున మిగిలిపోతుందనుకోండి. కాకపోతే మడ్డినీరే ఎక్కువగా కలిస్తే మంచినీరూ ఉపయోగించకుండా వృథా ఐపోతుంది.అదీ బాధ.

ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే… అక్షరం అందుబాటులో ఉన్న ఉచిత వనరు కనక కనిపించిన ప్రతిసన్నివేశమూ, అనిపించిన ప్రతి భావావేశమూ ఔత్సాహిక కవులు కవితాలంకరణకు అర్హమైనదే అనుకునే ప్రమాదమూ పెరిగిపోయింది. విస్తృతమైన అధ్యయనం, సమాజాన్ని సరైన కోణంలో పరిశీలిస్తున్నామా లేదా అన్న విచక్షణ, వ్యక్తిగతమైన భావోద్వేగాల పరిమితుల స్పృహ కొరబడుతుండటం వల్ల అకవిత్వాన్నీ కవిత్వం పంక్తిలోకి జొరబడుతున్నది. వచనకవిత అంటే వచనాన్నే కవితగా అనుకుని రాయడం కాదు. అలంకారరహితం అంటే..నిరలంకారంగా రాసుకుపోవడం కాదు.వట్టి స్లోగన్సు కవిత్వం ఎన్నటికీ కాదు…వాటి వెనుక ఒక తాత్వికనేపథ్యం లేకపోతే. ‘Workers Of The World..Unite! శ్రామిక వర్గాన్ని మొత్తం ఏకం చేసిన విప్లవ నాదం..కవిత్వానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపించింది.స్పెయినీష్ బార్శిలూనా సమరంలో’లాషాపనారా'(ముందుకడుగు వేయనీయం)అన్న స్పెయినీష్ సోల్జర్ల నినాదం ఆనాటి సమాజంమీద  చూపించిన  ప్రభావం అంతా ఇంతా కాదు.  పదమా?..నినాదమా? అన్నది ప్రధానం కాదు.. అది కవి హృదయంలోని రసానుభవంలో మగ్గి బాహ్యప్రపంచాన్ని కదిలించేదిగా ఉండాలి. ‘కదిలేదీ కదిలించేదీ/పెనునిద్దుర వదిలించేదీ’అని అతిసరళంగా శ్రీశ్రీ కవిత్వరీకరించింది దీనినే.

కవికి తన మాట మీద అధికారం ఉండాలి.చిత్రకారుడికి గీతలాగా, సంగీతవేత్తకు స్వరంలాగా,శిల్పికి శిలలాగా కవికి పలుకు పరికరం.పికాసో అంతటి చిత్రకారుడు’Probably I am not an Artist..I am not a Painter..I am a Draftsman’ అని చెప్పుకున్నాడు.కళాకారుడికి ముందు తనను గూర్చి తనకు ఒక కచ్చితమైన అంచనా అవసరం. కవీ కళాకారుడే కదా!

పోతన..శ్రీనాధులే దీనికి మనకు మంచి ఉదాహరణలు.’మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు?’అన్న పొతనగారి మంచి పద్యం వినడానికీ వీనులవిందుగానే ఉంటుంది. కానీ…కవికోణం దృష్ట్యా చూస్తే మాత్రం ముందు వచ్చే సందేహం…’కవి మాటలను నడిపిస్తున్నాడా?…మాటలు కవిని నడిపిస్తున్నాయా?’ అని.

శ్రీనాథుడి శివరాత్రిమాహాత్మ్యము పద్యం చూడండిః ‘నిష్ఠాసంపదనర్ఘ్యపాణులగుచున్ విపుల్ బ్రశంసింప, మంజిష్థారాగము మండలంబున నధిష్థింపన్ నిలింపాది భూకాష్థా మధ్యంబున తోచెన్/శతాంగాభ్రష్థ సర్పద్విష జ్యేష్థుండప్పుడు నిష్థుర ప్రసర బంహిష్థద్యుతిశ్రేష్థతన్'(తూర్పుదిక్కున అనూరుడు వెలిగాడు-అని అర్థం)అర్థం గురించి కాదు ఇక్కడ చెబుతున్నది.చంధోనియమం ప్రకారం ప్రాసస్థానంలో నాలుగు చోట్ల ‘ష్థ’కారం వస్తే చాలు.కానీ శ్రీనాథుడు ష కింద ‘ఠ’ వత్తు పెట్టి ఎన్నెన్ని మెలికలు తిప్పాడో చూడండి.భాష మీద అధికారం గలవాడు మాత్రమే చేయగల సాముగరిడీ అది.అంతటి అధికారం ఉన్నప్పుడు అక్షరం చేత ఎంతటి ఊడిగం ఐనా చేయించుకోవచ్చు. విస్తృతమైన పఠనం, గాఢమైన అనురక్తి, సునిశితమైన పరిశీలనాశక్తి…ఎంచుకున్న ప్రక్రియమీద సరైన అవగాహన అభివృద్ధి పరుచుకున్న వారెవరైనా పదికాలాల పాటు జనం గుండెల్లొ పదిలంగా నిలిచిపోయే విలక్షణమైన కవిత్వం సలక్షణంగా రాయవచ్చు.


శ్రీశ్రీ గారు చెప్పిన ఒక జోకే చెప్పి ముగిస్తాను.మద్రాసు మీనంబాకం ఏరోడ్రోములో ఇద్దరు పల్లెటూరి బైతులు మొదటిసారి బోయింగ్ విమానాన్ని చూసి గుండెలు బాదేసుకున్నారుట.అందులో పెద్దవాడికి ముందుగా వచ్చిన సందేహం ‘ఇంత భారీ బండికి పెయింట్ వేయాలంటే ఎంత తెల్లరంగు కావాలీ! రంగున్నా వెయ్యడం ఎట్లా?ఎంత శ్రమా..ఎంత టైము వృథా?’అని.రెండో వాడు దానికిచ్చిన సామాధానం మరీ విడ్డూరంగా ఉంది.’అందుకేనేమో మామా..విమానం ఆకాశంలో ఉన్నప్పుడు అక్కడికెళ్ళి వేస్తారనుకుంటా…అప్పుడయితే బుల్లిపిట్టంతే కదా ఉండేదీ!’

ఈ జోకు వినంగానే ముందు మనకు నవ్వొస్తుంది.నిజమే కానీ..నిజానికి..కవిత్వతత్త్వ సారం మొత్తాన్నీ ఆ బైతు ఒక్క ముక్కలో తేల్చేశాడు. విశాలవిశ్వాన్ని కళ  (మన దృష్టిలో ఇక్కడ కవిత్వం)  తన పనితనంతో కళకళ లాడించాలంటే కళాకారుడు బాహ్యప్రపంచాన్ని   తన అంతరంగాకాశంలో  ఎగరేయాలి’

అంతరంగాకాశంలో విహారవిన్యాసం మరో పేరే కవిత్వం.ఎంత ఎత్తు ఎగరగలిగితే అంత గొప్ప కవిత్వం దర్సనమిస్తుంది. రెక్కలు విప్పుకోవడమే కాదు..వడుపుగా వాటిని కదపడమూ పట్టు బడాలి.పట్టు చిక్కే దాకా సాధన చేయాలి.అలాంటి సాధన విజయవంతంగా చేసినందుకే ఇవాళ మనం ఒకశ్రీశ్రీని ఒకవిశ్వనాథని ఉదాహరణగా ఇలా చెప్పుకుంటున్నాం.

- కర్లపాలెం హనుమంత రావు


20 ,నవంబర్ 2012 

(కవిసంగమం - కోసం రాసినది ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...