Friday, September 4, 2015

ఆచార్యదేవోభవ!- నేడు ఉపాధ్యాయ దినోత్సవం

'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగంమధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమేకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారం పోగొట్టేది గురువే! కనకే,   జన్మనిచ్చిన తల్లిదండ్రుల పిదప  పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం భారతీయులది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- అభ్యాసానికి కూర్చునేముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన అనంతరం 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించుకొనే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలా అవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలుచేసే శ్రీరామచంద్రుడు సైతం విశ్వామిత్రుడి ముందు అంజలి ఘటించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది. కాబట్టే శ్రీకృష్ణుడు విద్యగరిపిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నది.

గురువును గౌరవించలేనివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం. బాల్యంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుసైతం  చక్రవర్తి అయిన పిదప దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడుశతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయం స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను సానపట్టాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు  కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు సాధారణ  మంత్రివర్యుడే కాదు.. గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలో పడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లిదండ్రులు ప్రేమపాశంచేత కఠినశిక్షణనీయలేరు గనక గురువు అవసరం పెరిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడుకూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు  విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతున్నారనే గదా తన బిడ్డలని విష్ణుశర్మనే పండితుడి వద్దకు విద్యనభ్యసించేందుకు సాగనంపింది!

నాటి విద్యలు నేటి చదువులంత సుకుమారం కావు. వేదాధ్యయనం తరవాత జరిగే పరీక్షలు ఎంతో కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీదుంచిన నిమ్మకాయ దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష గట్టెక్కినట్లు లెక్క. అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచులు కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు దిగేది సూటిగా గొంతులోనే!  అది నారస పరీక్ష. గురువాక్కు  వేదవాక్కుగా సాగిన క్రమశిక్షణ ఆ కాలం నాటిది.

పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రలోనే కాదు..   గురుప్రసక్తిలేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులు విశ్వవ్యాప్తంగా చూసుకున్నా దొరకవు.  'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు చదువు ఎలా సాగుతున్నదో  పర్యవేక్షించాలని ఉబలాటపడ్డాడు జార్జి చక్రవర్తి.  ‘రావద్ద'ని కబురు చేశాడు పాఠాలు చెప్పే గురువుగారు!  'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే ప్రపంచంలో అందరికన్నా   అత్యుత్తమ స్థానంలో ఉన్న పెద్దను. నాకంటే పై స్థానంలో మరొకరున్నారని తెలిస్తేతే, నా మాటవిలువ తగ్గిపోతుంది.. మహాప్రభూ! అది వారి భవిష్యత్తుకు మేలు చేయదు!' అని సవినయంగా విన్నవించుకున్నాడు. మహారాజూ  గురువుగారి కోరికలోని సదుద్దేశంగ్రహించి మన్నించి అటువైపు వెళ్లటం విరమించుకున్నారని ఒక నీతికథ. అదీ రోజుల్లో గురువులకు సమాజం ఇచ్చిన గొప్పగౌరవం!

దేవతలకూ గురువున్నాడు. బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య శుక్రునికొక్కనికే తెలుసు. కచుడు తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేసే నెపంతో వచ్చి.. చచ్చి బతికిన కథ మనందరకీ తెలుసు. ద్రోణాచార్యుని' పేరుతో క్రీడాగురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ద్రోణాచార్యుడి వద్ద  విలువిద్య నేర్చుకోవాలని ఉబలాటపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందుపెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి  శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలిచక్రవర్తి వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తికి అమాయకంగా సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా.. శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కాబట్టే  మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటంలోనే ఎక్కువ మక్కువ చూపించారు. తమిళపత్రికకి  ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలుపడి చివరికి పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమేనని మీరు భావిస్తున్నారా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని చక్కని సమాధానం ఇచ్చారు  కలాం.
కృష్ణపరమాత్ముడినుంచి.. అబ్దుల్ కలాం వరకు అందరి గౌరవాభిమానాలని అందిపుచ్చుకొన్న  గురువుగారికి నేటి మన చలనచిత్రాలు పట్టిస్తున్న దుర్గతిని చూస్తుంటే దిగులు కలుగక మానదు.. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు సినీకవి. ‘కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే. గురువు ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు కాబట్టే శిష్యుడీనాడు 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాడు

గురువులు అష్టవిధాలు. అక్షరాభ్యాసం చేయించే గురువు,  గాయత్రినుపదేశించే గురువు, వేదాధ్యయనం చేయించే గురువు, శాస్త్రజ్ఞానం విడమరచి చెప్పే గురువు,  పురోగతి కోరే గురువు, మతాది సంప్రదాయాలని  నేర్పించే గురువు, మహేంద్రజాలాన్ని విప్పి చూపించే గురువు, మోక్షమార్గానికి నడిపించే గురువు. పురాణాలు ఇంత వైనంగా గురుప్రాధాన్యాన్ని  తెలియజేస్తున్నా..పట్టించుకొనే,  వంటపట్టించుకొనే శిష్యపరమాణువులు తగ్గిపోతున్నారు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు పెరిగిపోతున్నారు. దొంగలపాలబడనిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనికలిగించేది,  యాచకులకెంత ఇచ్చినా పెరిగేదేగాని.. రవంత తరగనిది,.. గొప్పనిధి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా ప్రసాదించే  గురువును లఘువు చేయకుండా ఉంటేనే జాతికైనా మేలు జరిగేది. కనీసం కీడు జరగకుండా ఉండేది.
కర్లపాలెం హనుమంతరావు

***

Thursday, September 3, 2015

స్త్రీ సూక్తం- ఓ సరదా గల్పిక


'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అన్నవాణ్ణి ముందు ఇస్త్రీ చేసెయ్యాలి' అంది మా కసిగా మా శ్రీమతి ఇస్త్రీ చేస్తూ. చలంగారి పుస్తకమో.. రంగనాయకమ్మగారి నవలారాజమో మళ్లీ తిరగేసినట్లుంది! ముందావిడగారిని చల్లబరచడం నాకు చాలా ముఖ్యం.
'మొన్నా మధ్యే గదుటోయ్ మన ఏ ఆర్ రెహ్మాన్ ఆస్కారందుకొంటూ 'మాఁ! తుఝే సలామ్' అన్నాడూ! మన మెగాస్టార్ చిరంజీవీ పార్టీపెట్టిన రోజూ తల్లిని ఎన్నోసార్లు తలుచుకొన్నాడు.  మనగడ్డమీద ఆడాళ్లకి దక్కే మంచీ మర్యాదా ప్రపంచంలో మరెక్కడా దొరకవు.. దొరసానిగారికా సంగతి తెలుసో లేదో!'
'వంకాయ పులుసు! మర్యాదా! మన్నా! పబ్బుల్లో వెంటబడి మరీ మా ఆడపిల్లలకు బడితెపూజలు చేస్తున్నారు కదండీ మీ మగమహారాజులు!  ‘లజ్జ’ పుస్తకంరాసిందని పాపం ఆ బంగ్లాదేశు ఆడమనిషిని ఎన్ని పడతిట్టారు. ! పడేసి కొట్టనుకూడా కొట్టబోయారేమో ప్రెస్ క్లబ్బులో! ప్రేమించలేదన్న పాపలమీద పాపం యాసిడ్ బాటిలు ఎత్తి పోస్తారా! పార్కులో తిరిగే పిల్లకాయలకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారా! పుట్టేది ఆడనలుసని పసిగడితే బలవంతంగానైనా  సరే నలిపేక్షేడందుకు సిద్ధమా!  అదనపు కట్నం తేవడం ఆగితే  బహిరంగంగానే గ్యాసుబండకు బలా? పరమ కిరాతకులండీ బాబు మీ మగజాతి సమస్తం’
'అదేంటోయ్! ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతీ' అన్న పాటరాసినాయన మా మగాడేగా! 'కంటే కూతుర్నే కనాలి' .. ‘పెళ్లాం చెబితే వినాలి' అంటూ బోలెడన్ని ఫిమేల్ ఓరియంటెండు మూవీలు తీసినవాళ్లేమన్నా ఆడాళ్ళా! ‘ఎక్కడ స్త్రీలు సంచరిస్తారో అక్కడ మాత్రమే దేవతలు సంచరిస్తా’రని కదా మన పెద్దల నీతిబోధ!’
'సడి! ఆ దేవుళ్ల సంగతే చెప్పాలింక! ఒక దేవుడు కట్టుకొన్నామనే కట్టుబట్టలతో అడవులకు తోలేసాడు! మరో దేవుడు ఆడాళ్ల స్నానాల రేవులో దూరి బట్టలు దాచేసాడు! ఎంతమంది ఆడాళ్ళ మెళ్లల్లో తాళిబొట్ల పేరుతో ఉరితాడు బిగిస్తే అంత గొప్ప మగవాడికి! అప్పు తీర్చుకోడానికి ఆలిని తాకట్టు పెట్టిన సత్యహరిశ్చంద్రుడు గొప్ప ప్రభువా! మగాడికి ముక్కోటి దేవతలేనండీ! ఆడదాని ప్రాణంమీదకు అదనంగా మరో దేవుడు.. పతిదేవుడు! ఆడదంటే వాడి దృష్టిలో ఇంటికి దాసి. పంటికి  చిప్సు.  పక్కకి రంభ! ఆడదెలా మసలుకోవాలో శతకాలు చెప్పిన పెద్దమనుషులు మగాడికే నిబంధనలు  విధించలేదెందుకో!'
'ఎందుకూ?'
'తల్లో పూలు పెట్టుకొంటానని తల్లో గుజ్జులేని ఫూలుననుకోవద్దు మిస్టర్ హబ్బీ! జడలు అల్లుకొన్నంత మాత్రాన జడపదార్థంలాగా ఇక్కడెవరూ పడి  లేరు! చట్టసభల్లో మీ మగఎంపీలు చేసే రభస మాకర్థం కాదనుకోవద్దు! మా జుట్లు ముడేసుకొంటూ పోతే భూగోళం మూడు సార్లు చుట్టిరావచ్చు. ఐదొందలు పైచిలుకు ఉండే హస్తిన సభలో  ఆడంగులు ఐదుపదులుకూడా కనిపించరెందుచేతో! ఆకాశంలో సగమని తెగ  ఉబ్బేస్తారేగాని భూమ్మీదరంగుళమైనా  చోటిస్తున్నారూ! మూడోవంతుకోసం చట్టసభలో బిల్లు పెట్టినప్పట్లో  మీ పురుషపుంగవులు చేసిన  ఆ యాగీ పేరేంటో! ఇరవైయ్యొకటో శతాబ్దంట! నవనాగరీకం ముదిరిపోతున్నదట! అక్కడ అడవుల్లో ఆడాళ్ళు వంటిమీద జాకెట్టేసుకొనే హక్కుకోసం ఇప్పటికీ పోరాడుతునే ఉన్నారు! రేకేట్లో ఆడాళ్లని చంద్రమండలంమీదకి పంపిస్తున్నారా!అలా చెప్పుకొని  చంకలు గుద్దుకొంటే సరిపోతుందా! స్త్రీహింసకు తెగబడే దేశాల జాబితాలో   మేరా భారత్ మహాన్ ది వందో నెంబరని తాజా నివేదికలెలా ఘోషిస్తున్నాయయ్యా వింటున్నావా మహానుభావా!'
'ఇంటిపని మానేసి ఇలాంటి కాకిలెక్కలు తీస్తూ కూర్చున్నావా?'
'నేనింట్లో ఒక్కరోజు చేసేచాకిరీకి  మూడుగాడిదలు వారంరోజులపాటు విరామం లేకుండా చేసినా సమానం కాదు. మీరాఫీసులో పేనేసుకొని కునుకుతీస్తూ  చేసేపని ప్రకారం చూసుకొన్నా నా జీతం ఈ ఇంటి విలువకు రెట్టింపుంటుంది. నీళ్ళకోసం, రేషనుకోసం, పిల్లల బళ్లకోసం రోజూ నేను నడిచే దూరానికి రథంముగ్గేసుకొని పోతే ఎవరెస్టు  శిఖరం రెండుసార్లు ఎక్కి దిగి రావచ్చు!'
నిజం చెప్పద్దూ.. నాకూ రోషం వచ్చేసింది. ఆపకుండా ఆవిడగారు అదేపనిగా వదిలే వోల్గా మార్కు డైలాగులకిఏ మగాడికైనా మరి కాలదా చెప్పండి!
'ఇందిరాగాంధీని ప్రధాని చేసింది మేమే! ఖబడ్దార్! మథర్ తెరిస్సా మాదగ్గరికొచ్చిన తరువాతే సెయింటయింది!తెలుసుకో!  అటు అనీబిసెంటు, విజయలక్ష్మీ పండిట్టూ, సరోజినీదేవి నాయుణ్ణుంచీ ఇటు సోనియాగాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీదాకా అంతా  ముఖ్యులూ, ముఖ్యమంత్రులూ అయింది మా మగవాళ్ల జమానాల్లోనే మ్యాడమ్ జీ! అరబ్బు దేశాల్లో మొన్న మొన్నటిదాకా ఆడోళ్లకి ఓటుహక్కే నిల్లు. ఏకంగా రాష్ట్రపతులు, సభాపతులు అయిపోతున్నారు మన దగ్గర'
'హుఁ! రాష్ట్ర'పతి', సభా'పతి'! రాష్ట్రమాత, సభామాత అనొచ్చుగా! అక్కడే మీ మగాళ్ళ ధాష్ఠీకం బైటపట్టంలేదూ! మాతృభాష అంటూ భేషజాలు పోతుంటారు! మాతృస్వామ్యం  అంటేమాత్రం మండిపడుతుంటారు!  మగబుద్ధి! ఆడదేమన్నా అబలా? మగాళ్లటూ అటూ ఇటూ వాయించే తబలా?'
'ఆడదంటే అలుసైతే.. రైళ్ళల్లో ప్రత్యేక బోగీలు, బస్సులు,  బస్సుల్లో స్పెషల్ సీట్లు, సినిమాహాళ్లల్లో కూల్ కూల్ క్యూలు, టీవీలో సీరియళ్ళు.. పండగలొస్తే భారీ డిస్కౌంట్లు.. అన్నీ మీకే ఎందుకు పెట్టిస్తాం తల్లీ?'
'మరుగుదొడ్లు, మంగళసూత్రాలతో అభివృద్ధంతా ఐపోయినట్లేనా మై డియర్ హబ్బీ? ఇపటికీ చాలా గుళ్లల్లో ఆడాళ్లకి ప్రవేశం నిషిద్ధం! నూటికి ఎనభై పై చిలుకుమంది ఆండాళ్లు  మగాళ్లపంజరాల్లో చిలకలే! ఆడదానికే ఇంటెపేరు ఎందుకు మారాలో కాస్త సెలవిస్తారా? ఆడబిడ్డలే గాజులు ఎందుకు వేసుకోవాలి? మా బూబమ్మలే మొహాలకి ముసుగులు ఎందుకు తొడగాలి? పసుపు కుంకుమలు పంచడం.. మగవాడొక అవమానంగా ఎందుకు భావించాలంట్! ఆడదంటే అలుసవబట్టేకదా బహిరంగంగా అలా తొడలు బాదుకొనేది! మీసాలలా మెలివేసేది! భాష ఉన్నది  ‘అమ్మా.. అక్క’లమీదలా అవసరమున్నా లేకపోయినా దుష్టప్రయోగాలు చేయడానికా? పురుష సూక్తం, స్త్రీసూక్తం ఒకేలా ఎందుకు లేవో ఓ సారేమన్నా  వివరిస్తారా బావా! దేవతల పేర్లు  పెట్టుకోడంవరకే.. ఆడపిల్లలు దేవతామూర్తులు! మగాడు ప్లస్సూ..  ఆడపిల్ల మైనస్సా! ఏ సామాజికసూత్రం ప్రకారం బాబూ ఈ కూడికలు.. తీసివేతలు! ఎంత ఒబామా అయినా ఒక ఆడది తొమ్మిదేసి నెలలు నొప్పులుపడి కంటేనేగా అమెరికాకు అధినేత కాగలిగింది! ప్రేమ పిచ్చిది..  కనక ప్రేమించే ఆడదీ పిచ్చిదయిపోతుందా! ఆడది ప్రాణంపెడితే ప్రాణాలు తీసే యమధర్మరాజుతోనైనా పోరాడి మరీ నిలబడుతుంది. ప్రాణం విసిగిస్తే కాఫీలో ఇంత విషమైనా కలిపిచ్చేసి  పీడా వదిలింఉకొంటుంది.   మగాడు తోడుగా ఉంటే నీడగా ఉండేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధమే! చిలకలకొలికుంటేనే   ఏ ఇల్లైనా  చిలకలువాలిన చెట్టులా  కళకళలాడేది! చప్పట్లు కొడితే చిలకలు ఎగిరిపోతాయేమోగానీ.. ఎన్నిక్కట్లు వచ్చినా చిలకలకొలికిమాత్రం చెలికాడి చెయ్యివిడిచి పోదు!' అంది శ్రీమతి ఆవేశంగా!
ఓడిపోఆయాను ఆమె వాదన ముందు.
'ఇంతకీ ఈ ఉపన్యాసమంతా ఇప్పుడెందుకో కాస్త సెలవిస్తారా మ్యాడమ్ గారూ!' అనడిగేసా.
'అంతర్జాతీయ మహిళా దినోత్సవమండీ బాబూ ఇవాళ. చూసారా.. ఆసంగతీ తమరికి గుర్తుకు రాలేదు! సగానికి పైగానే మా  ఆడఓట్లున్నా మాకు ఇన్నేసి పాట్లు!’
 ‘ఆ మాట నేనొప్పుకోను! ఒక పార్టీ పావలావడ్డీ అంటూ వలవేస్తుంటే మరోపార్టీ ఉచిత నజరానాల జాబితా వల్లె వేస్తుంది.  ఇసుక దగ్గర్నుంచి బంగారందాకా అన్నింటిలో ఆడదానినే అందలాలెక్కించేది అన్ని పార్టీలు’ అన్నాను అసూయ పట్టాలేక.
‘రూపాయిక్కిలో బియ్యమొక వంక. .గుండిగలకొద్దీ గుడుంబా మరో వంక! ఏ  ఆడది ఏ సాధికారత సాధించడానికి అడిగిందో ఈ మందుతాయిలాలు! ఠీవీ అయిన బతుక్కి కావాల్సింది ఉచిత టీవీలూ.. రుబ్బుడు పొత్రాలు కాదండీ బాబూ! మీ   మగాళ్ళు అడుగడుగునా అల్లే  మాయదారి బుట్టల్లో  పడకుండా  ఉండే అప్రమత్తత!
'వావ్! మహిళా దినోత్సవ శుభసందర్భంలో మా మహారాణిగారికే కానుక సమర్పంచమని  ఆజ్ఞ' అన్నాను నాటకీయంగా!
'ఇవాళా రేపూ వంట చేయమని ఆజ్ఞ' అనేసింది ఫక్కుమని నవ్వి  నా చేతిలోని వార్తాపత్రిక తను లాగేసుకొంటూ!
-కర్లపాలెం హనుమంతరావు
***
(07-03-2009నాటి 'ఈనాడు' సంపాదకీయపుటలో ప్రచురితం)
  

'

Monday, August 31, 2015

ధర్మనిర్ణయం- బహుమతి పొందిన కథ

బ్యాంకుడ్యూటీనుంచి ఇంటికి వస్తూ వసూ రామకృష్ణాపురం ఓవర్ బ్రిడ్జిమీద వెనకనుంచీ వస్తున్న ఇసుకలారీ గుద్ది బైకుమీదనుండి పడిపోయాడు గోవిందరావు.
ఆ సమయంలో చీకటి. వర్షంకూడా జోరుగా పడుతోంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే సాధారణంగా ఆ బ్రిడ్జిమీద జనసంచారం కనిపించదు అంతగా.
దాదాపు రెండు మూడు గంటలు అపస్మారక స్థితిలో పడివున్నాడు గోవిందరావు.
ఎవరో గమనించి అతని దగ్గర ఉన్న సెల్ఫోనులోనుంచి ఇంటివాళ్ళకు సమాచారం అందించారు. ఆయన్ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించేసరికి అర్థరాత్రి దాటిపోయింది.
మెడికో లీగల్ కేసు కనక ముందు పోలీసు రిపోర్టు అవసరం. ఆ తతంగమంతా పూర్తయి చికిత్స ఆరంభమయేవేళకి తెలిసింది.. పేషెంటు కోమాలోకి వెళ్ళిపోయాడని!
గోవిందరావు కొడుకు శరత్ గ్రూప్ త్రీ సర్వీస్ కమీషన్  ఇంటర్వ్యూలకని ఢిల్లీ వెళ్ళివున్నాడా సమయంలో. ఇంటార్వ్యూ ముగించుకొని ఇంటికి ఎలా వచ్చిపడ్డాడో తెలీదు.. ఇల్లంతా శోకసముద్రంలో మునిగివుంది.
'లాభంలేదు.. ఇంటికి తీసుకువెళ్లమంటున్నార్రా డాక్టర్లు! ఏం చేద్దాం?' అనడిగాడు గోపాలరావు. ఆయన శరత్ కి బాబాయి. అన్నగారు చేసే బ్యాంకులోనే లీగల్ ఆడ్వైజరుగా ఉన్నాడు.
'నాన్న ఉన్నది కోమాలో కదా! ఎంత డబ్బు ఖర్చైనా సరే బతికించుకుంటాం బాబాయ్!' అన్నాడు పళ్లబిగువున పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపుకొంటూ శరత్.
'విషయం ఖర్చును గురించి కాదురా!..' ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు గోపాలరావుకి.
'మరి?'
'శరత్ ని ఆసుపత్రి బయటవున్న కేంటిన్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి విపులంగా చెప్పే ప్రయత్నం చేసాడు గోపాలరావు. 'నాన్న కోమాలో ఉన్న మాట నిజమేకానీ.. డాక్టర్లు చెబుతున్నదాన్నిబట్టి ఇంక హోప్స్ లేవురా!.. మనకింకో రెండు మూడు లక్షలు ఖర్చవడం తప్ప! ఇలా అంటున్నందుకు నాకూ బాధగానే ఉందిగానీ.. కొన్ని కొన్నిసార్లు వాస్తవాన్ని డైజస్టు చేసుకోక తప్పదు'
'వాస్తవమేంటి బాబాయ్! నాన్న సజీవంగానే ఉన్నాడు. డబ్బుకోసం చూసుకొనే సమయం కాదిది. అమ్మకు తెలిస్తే చాలా బాధ పడుతుంది. పదండి.. వెళదాం!' అని లేచాడు శరత్.
బలవంతంగా శరత్ ని కూర్చోబెట్టాడు గోపాలరావు. 'అమ్మలాగా నువ్వూ ఎమోషనల్ గా ఆలోచిస్తే ఎలారా! ప్రాక్టికాలిటీ కావాలి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో!'
'బతికున్న మనిషిని డబ్బుఖర్చు చూసుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్చ్ చేయించుకొని పోవడమేనా ప్రాక్టికాలిటీ అంటే!'
శరత్ గొంతులోని వెటకారాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు గోపాలరావు. 'చిన్నపిల్లాడు. జీవితమంటే ఏంటో అనుభవం లేనివాడు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమాభిమానాలున్న ఏ కొడుకైనా అలాగే ఆలోచిస్తాడు. అన్నీ తెలిసిన తనే ఎలాగో నచ్చచెప్పి అన్నయ్యకుటుంబాన్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించాలి' అనుకొన్నాడు గోపాలరావు.
'మీ నాన్న తరువాత నాన్నంత వాణ్ని. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినరా!'అన్నాడాయన.
'తొందరగా చెప్పు బాబాయ్! అమ్మెందుకో కాల్ చేస్తోంది' అంటూ రింగ్ టోన్ కట్ చేసి అసహనంగా కూర్చున్నాడు శరత్.
గోపాలరావు చెప్పాడు 'మీ నాన్న రిటైర్మెంటు ఇంకో వారంలో ఉంది. కంపాషియేనేట్ గ్రౌండ్సుమీద బ్యాంకునుంచి బెనిఫిట్స్ రావాలంటే రూల్సు ప్రకారం ఎంప్లాయీ రిటైర్మెంటునాటికి  సజీవుడై ఉండకూడదు'
'డెత్ బెనిఫిట్స్ అంటే మనీనా? ఆ ముష్టి రెండు మూడు లక్షలకోసం జన్మనిచ్చిన తండ్రిని బతికుండగానే చంపేయడం నావల్ల కాదుగానీ.. పద బాబాయ్.. ఇక వెళదాం!.. డాక్టర్లతోకూడా మాట్లాడాల్సిన పని చాలా ఉంది'
లేవబోయిన శరత్ ని బలవంతంగా లాగి కూర్చోబెట్టి అన్నాడు గోపాలరావు 'సాంతం వినిపోరా! బెనిఫిట్స్ అంటే నాటోన్లీ మనీ.. ఎంప్లాయిమెంటుకూడా! మీ నాన్న సర్వీసులో ఉన్నప్పుడే పోయాడని డాక్టర్లు సర్టిఫై చేస్తేనేగానీ మీ ఇంట్లో ఒకళ్లకి ఉద్యోగం రాదు. ఇది నీ ఒక్కడికే సంబంధించిన విషయం కాదు. చెల్లాయి పెళ్ళి చెయ్యాల్సి ఉంది. మీ నాన్న చేసిన అప్పులున్నాయి!'
గోవిందరావు ఇంటిపరిస్థితులు గోపాలరావుకు తెలియనివి కావు. నీతికి, నిజాయితీకి నిలబడే అధికారిగా మంచిపేరైతే ఉందిగానీ.. కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో అన్నగారు విఫలమయ్యారనే ఒప్పుకోవాలి. శరత్ కి బాగా చదువు అబ్బినా విదేశాలకు పంపించి ఊడిగం చేయించడానికి ఇష్టపడలేదు. కొడుకుచేత ఇక్కడే ఎమ్మెస్సీ చేయించాడు. కూతురు పెళ్ళి ఇంకా వరాన్వేషణ దశలోనే ఉంది.
అయినా బిడ్డలకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి బతికుండగానే 'నీ వల్ల నాకేంటి ప్రయోజనం? వ్యాపారం చేసుకోవాలి.. పెట్టుబడి తెచ్చివ్వు! నీ ఉద్యోగం నాకిప్పించేసి నువు విశ్రాంతి తీసుకో!' అనే సంతానం అంతకంతకూ అధికమవుతున్న ఈ కాలంలో ఇలాంటి బిడ్డల్ని కలిగివుండటంకూడా అదృష్టమే!శరత్ ను మనసులోనే అయినా  అభినందించకుండా ఉండలేకపోయాడు గోపాలరావు.
'ఈ విషయాన్ని ఎలాగూ తల్లితో, చెల్లితో సంప్రదించడు వీడు! పోనీ తనే నేరుగా ఒకసారి వదినతో మాట్లాడితేనో!' అనిపించింది గోపాలరావుకి.
***
గోవిందరావుకి ఇంకో ఆపరేషన్ అవసరమన్నారు ఆసుపత్రి వైద్యులు. ఫస్టు ఆపరేషను వల్ల ఫర్దర్ డేమేజీ కంట్రోలయింది. ఈ ఆపరేషను సక్సెస్ అయితేనే పేషెంటు తొందరగా రికవరయే అవకాశం ఉంది. వికటిస్తేమాత్రం ప్రాణానికి ముప్పు. రిస్క్ ఫ్యాక్టరు కాస్త ఎక్కువే! ఈ విషయం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి! బట్.. మేటర్ అర్జంట్! 'ఓకే' అనుకొంటే మాత్రం ఒక హాఫ్ ఇన్స్టాల్మెంటుకింద రెండు లక్షలు కౌంటర్లో కట్టేయండి' అంటూ పెద్ద ఫార్మాలిటీస్ లిస్టే చదివాడు ఆసుపత్రి సూపరింటెండేంటు శరత్ ని పిలిచి కూర్చోబెట్టుకొని.
తల్లితో, చెల్లితో సంప్రదించి బాబాయిచేత రెండులక్షలు కౌంటర్లో కట్టిస్తున్నప్పుడు మాత్రం శరత్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
'కూలి పనయినా చేసి నీ సొమ్ము అణాపైసలతో సహా చెల్లిస్తాను బాబాయ్!' అని తన రెండు చేతులూ పట్టుకొన్న అన్నకొడుకుతో అన్నాడు గోపాలరావు 'ఆ కూలీపని చేసే ఖర్మనీకు పట్టకూడదనే అంతగా నీకు చెప్పుకొచ్చింది. ఇప్పుడైనా చెప్పు! మరోసారి ఆలోచించుకొన్న తరువాతే డబ్బు కడదాం!'
'ఈ నిర్ణయం నాదొక్కడిదే కాదు బాబాయ్! అమ్మకూ, చెల్లాయిక్కూడా నాన్నను మళ్లీ మామూలు మనిషిగా చూడాలని ఉంది' అని శరత్ అన్న తరువాత గోపాలరావు మౌనంగా సొమ్ము చెల్లించేసాడు.
ఆ సాయంత్రమే ఆపరేషన్ అయిపోయింది. రాత్రంతా కండిషన్ బాగానే ఉందన్నారు డాక్టర్లు. తెల్లారుఝామునుంచి కంగారు పడటం మొదలుపెట్టారు.
సూర్యోదయానికన్నా ముందే గోవిందరావు అస్తమించాడు. 
ఏడుపులు.. పెడబొబ్బలు.. అయినవాళ్ళొచ్చి పరామర్శించడాలు..! చివరిచూపులకని ఎక్కడెక్కడివాళ్లో తరలివచ్చారు. ఫార్మాలిటిసన్నీ యథావిధిగా జరిగిపోయాయి. శరత్ తండ్రి చితికి కొరివిపెట్టాడు.
కొత్తసంవత్సరం ప్రపంచమంతా వేడుక జరుపుకొంటుంటే.. గోవిందరావు లేని లోటును  జీర్ణించుకొంటూ విషాదంగా గడిపింది శరత్ కుటుంబం.
శిశిరం శాశ్వతం కాదు. వసంతం మళ్ళీ రాక మానదు. ప్రకృతి చెప్పే పాఠం ఇదే!
మళ్లీ ఏడాది గడిచేసరికల్లా ఆ ఇంట్లో మరో బుల్లి గోవిందు కేరింతలు వినిపించాయి. తండ్రిపోయిన ఆర్నెల్లలోపే కూతురికి పెళ్ళి జరిపిస్తే ఆ కన్యాదానఫలం తండ్రికే దక్కుతుందని- శరత్ పంతంకొద్దీ చెల్లికి మంచిసంబంధం చూసి కళ్యాణం జరిపించాడు.
శరత్ కి తండ్రి చేసే బ్యాంకులోనే ఉద్యోగం వచ్చింది కంపాషియనేట్ గ్రౌండ్సుమీద. గోవిందరావు యాక్సిడెంట్ సందర్భంలో అయిన ఖర్చంతా బ్యాంకే భరించింది రూలు ప్రకారం.
గోవిందరావు- రిటైర్మెంటుకి సరిగ్గా ఇరవైనాలుగ్గంటలముందు ఆసుపత్రిలో చేసిన ఆ రెండో ఆపరేషన్ విఫలమై చనిపోవడంవల్లే ఇవన్నీ సంభవమయాయి!
ఆసుపత్రి సూపరింటెండెంటుగారి సహకారంలేనిదే ఇవన్నీ సాధ్యమయేవి కాదు. గోవిందరావు చొరవవల్లె బ్యాంకునుంచి లభించిన రుణం సాయంతో చిన్న ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి పెంచగలిగాడు సూపరింటెండెంటు. గోవిందరావు ఇంటి పరిస్థితి వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకొమ్మని ప్రాఢేయపడింది మాత్రం గోపాలరావే!
డెసెంబరు ముప్పైఒకటో తారీఖునే అంత అర్జంటుగా అవసరం లేకపోయినా.. ఉన్నట్లు కలరిచ్చి రెండో ఆపరేషను చేయాలని నిర్ణయించడం వెనకున్న అంతరార్థం ఇప్పటికీ శరత్ కుటుంబానికి తెలీదు.
***
'ఇంతకాలం మీరు తోటివైద్యులందరికీ నిత్యం బోధించే మెడికల్ ఎథిక్సన్నీ ఇలా గాలికి వదిలేయడం న్యాయమేనా?' అని అడిగింది సూపరింటెండెంటుగారి భార్యామణి భర్తద్వారా ఇంట్లో అసలు విషయం విన్నతరువాత.
''నేను ఎథిక్సుని ఎప్పుడూ జవదాటను. ఇప్పుడూ జవదాటలేదు  మైడియర్ శ్రీమతిగారూ! మైండిట్.. ప్లీజ్! ఒక పేషెంట్ అన్ని రోజులు కోమాలో ప్రోగ్రెస్ లేకుండా పడివున్నాడంటేనే వైద్యభాషలో 'క్లినికల్లీ డెడ్'.  రిటైర్మెంటుకి ముందే గోవిందరావుగారి మరణాన్ని ధ్రువీకరించడంవల్ల ఏజ్ బార్ కి దగ్గరగా ఉన్న అతని కొడుక్కి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆర్థికపరమైన చిక్కుల్నుంచి ఆ కుటుంబం బైటపడింది. నేనా రోజున లోనుకోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ గోపాలరావుగారే ఏమన్నాడో తెలుసా! 'ఏ వృత్తికైనా ఎథిక్సుంటాయండీ! ఎథిక్సంటే రూళ్లకర్రపట్టుకొని చండశాసనం చేసి నిజాయితీపరుడనిపించుకోవడం ఒక్కటే కాదు. మేథస్సిచ్చిన వివేకాన్ని  ఉపయోగించి నిజమైన అర్హులను ప్రోత్సహించడంకూడా! అఫ్ కోర్సు.. అది అన్నంపెట్టే తల్లిలాంటి సంస్థకి కన్నంపెట్టి చేసే ఘనకార్యంమాత్రం కాకుడదనుకోండి!' అని.  నాలాంటి ఎంతోమందికి కొత్తజీవితాలను ప్రసాదించిన ఆ మంచిమనిషికి ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఇలా సాయంచేయడంలో ఎథిక్సును ఎక్కడ అతిక్రమించినట్లు! అన్నట్లు మరో ముఖ్యమైన విషయం చెప్పనా! అసలీ ఆలోచనంతా  చేసిందే ఆ గోవిందరావుగారి తమ్ముడు గోపాలరావుగారు. వృత్తిపరమైన ఎథిక్సుకి ఆయన తరువాతే ఎవరైనాఅన్నాడు ఆసుపత్రి సూపరింటెండెంటుగారు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(స్వప్న కథలపోటీలో 'శ్రీమతి గొర్రెల అప్పాయమ్మ పురస్కారం పొందిన కథ- జూన్ 2012 సంచికలో ప్రచురితం)

ఈ కథను తెలుగు రేడియో వారి భావవీచికలో స్వరమాధ్యమంద్వారా వినమని మనవి!
http://teluguoneradio.com/archivesplayer.php?q=20073&host_id=36




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...