'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగంమధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమేకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.
రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారం పోగొట్టేది గురువే! కనకే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పిదప పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం భారతీయులది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- అభ్యాసానికి కూర్చునేముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన అనంతరం 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించుకొనే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలా అవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలుచేసే ఆ శ్రీరామచంద్రుడు సైతం విశ్వామిత్రుడి ముందు అంజలి ఘటించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది. కాబట్టే శ్రీకృష్ణుడు విద్యగరిపిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నది.
గురువును గౌరవించలేనివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం. బాల్యంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుసైతం చక్రవర్తి అయిన పిదప దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడుశతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయం స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను సానపట్టాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు సాధారణ మంత్రివర్యుడే
కాదు.. గురువు కూడా.
మనిషి భూమిమీద పడిననాడే బడిలో పడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లిదండ్రులు ప్రేమపాశంచేత కఠినశిక్షణనీయలేరు గనక గురువు అవసరం పెరిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడుకూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు
విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతున్నారనే గదా తన బిడ్డలని విష్ణుశర్మనే పండితుడి వద్దకు విద్యనభ్యసించేందుకు సాగనంపింది!
నాటి విద్యలు నేటి చదువులంత సుకుమారం కావు. వేదాధ్యయనం తరవాత జరిగే పరీక్షలు ఎంతో కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీదుంచిన నిమ్మకాయ దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష గట్టెక్కినట్లు లెక్క. అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచులు కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు దిగేది సూటిగా గొంతులోనే! అది నారస పరీక్ష. గురువాక్కు వేదవాక్కుగా సాగిన క్రమశిక్షణ ఆ కాలం నాటిది.
పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రలోనే కాదు.. గురుప్రసక్తిలేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులు విశ్వవ్యాప్తంగా చూసుకున్నా దొరకవు. 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు చదువు ఎలా సాగుతున్నదో పర్యవేక్షించాలని ఉబలాటపడ్డాడు
జార్జి చక్రవర్తి. ‘రావద్ద'ని కబురు చేశాడు పాఠాలు చెప్పే గురువుగారు! 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే ప్రపంచంలో అందరికన్నా అత్యుత్తమ
స్థానంలో ఉన్న పెద్దను. నాకంటే పై స్థానంలో మరొకరున్నారని తెలిస్తేతే, నా మాటవిలువ తగ్గిపోతుంది.. మహాప్రభూ! అది వారి భవిష్యత్తుకు మేలు చేయదు!' అని సవినయంగా విన్నవించుకున్నాడు. మహారాజూ గురువుగారి
కోరికలోని సదుద్దేశంగ్రహించి మన్నించి అటువైపు వెళ్లటం విరమించుకున్నారని ఒక నీతికథ. అదీ ఆ రోజుల్లో గురువులకు సమాజం ఇచ్చిన గొప్పగౌరవం!
దేవతలకూ గురువున్నాడు. బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య శుక్రునికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేసే నెపంతో వచ్చి.. చచ్చి బతికిన కథ మనందరకీ తెలుసు. ద్రోణాచార్యుని' పేరుతో క్రీడాగురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి వద్ద విలువిద్య నేర్చుకోవాలని ఉబలాటపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందుపెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి
శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలిచక్రవర్తి వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తికి అమాయకంగా సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా.. శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.
గురుస్థానం అంత గొప్పది కాబట్టే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటంలోనే ఎక్కువ మక్కువ చూపించారు. ఓ తమిళపత్రికకి
ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలుపడి చివరికి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమేనని మీరు భావిస్తున్నారా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని చక్కని
సమాధానం ఇచ్చారు కలాం.
కృష్ణపరమాత్ముడినుంచి.. అబ్దుల్ కలాం
వరకు అందరి గౌరవాభిమానాలని అందిపుచ్చుకొన్న గురువుగారికి నేటి మన చలనచిత్రాలు పట్టిస్తున్న దుర్గతిని చూస్తుంటే దిగులు కలుగక మానదు.. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినీకవి. ‘కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే. గురువు ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు కాబట్టే శిష్యుడీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాడు.
గురువులు అష్టవిధాలు. అక్షరాభ్యాసం చేయించే గురువు, గాయత్రినుపదేశించే
గురువు, వేదాధ్యయనం చేయించే గురువు, శాస్త్రజ్ఞానం విడమరచి చెప్పే గురువు, పురోగతి కోరే గురువు, మతాది సంప్రదాయాలని నేర్పించే
గురువు, మహేంద్రజాలాన్ని విప్పి చూపించే గురువు, మోక్షమార్గానికి నడిపించే గురువు. పురాణాలు ఇంత వైనంగా గురుప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నా..పట్టించుకొనే, వంటపట్టించుకొనే శిష్యపరమాణువులు తగ్గిపోతున్నారు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు పెరిగిపోతున్నారు. దొంగలపాలబడనిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనికలిగించేది, యాచకులకెంత ఇచ్చినా
పెరిగేదేగాని.. రవంత తరగనిది,.. గొప్పనిధి జ్ఞానం. ఆ
జ్ఞానాన్ని నిస్వార్థంగా ప్రసాదించే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది. కనీసం కీడు జరగకుండా ఉండేది.
- కర్లపాలెం హనుమంతరావు
***