కె.డి. వి.వి.వి.కప్ప(కప్పదాటు వీర వేంకట వెంకప్ప) గారు అబ్బల కాలం బట్టీ దిబ్బలగూడెం నియోజకవర్గ
ప్రజా ప్రతినిధులు. పదవులు వారికి తృణప్రాయంతో సమానం. కానీ కొన్ని ప్రాణాలకు ఆ తృణమే
జీవనాధారం గదా! రెండు దఫాలుగా వెంకప్పగారికి ఆ తృణం ఫణమైనా అందకుండా పోయింది. వయసా మీద పడిపోయింది. ఇంత బతుకూ బతికి ప్రైవేట్ ఖాతాలో చావడం ఎవరికి మాత్రం హితవు? సిగ్గు బిడియాలకు తిలోదకాలు ఈయడమే సద్గతి ప్రాప్తికి ఉత్తమ మార్గంగా తోచింది వెంకప్ప గారికి.
అధికార పార్టీ పెద్దలతో లోపాయికారీ మంత్రాంగం నడుస్తోంది. మంత్ర పదవికీ ఒక్కటే మెలిక. ఎన్నిక చేసిన పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ గుర్తు చూసి గుద్ది గెలిపించిన ఓటర్ల నుంచి ఏకగ్రీవ తీర్మానం తేవాలి. కార్యకర్తలంటే సరే.. స్వామి కార్యాన్ని తమ కార్యంగా నిర్వహించే నిస్వార్థ కర్తలు. నియోజక వర్గ ప్రజలు అలా కాదే! ఇదేమని నిలదీస్తే
బదులేం చెప్పాలి?!
వెంకప్పగారీ మధనలో ఉండగానే గది తలుపులు ధడాల్మని తెరుచుకున్నాయి.
ఎదురుగా అల్లుడు గారు. ఆయన మెడా నిండా పూల దండలు. పక్కన అమ్మాయి. ఆ పిల్ల మొహం నిండా పూలదండలే. ఆనందంతో తబ్బుబ్బయిపోయారు
మామగారు. పూలలో పెట్టుకుని చూసుకోడం అంటే ఇదే కామోసు! ఆషాఢం ఇంకా రానే లేదు. అమ్మాయి మీద ఎంత శ్రద్దో! పుట్టింట్లో దిగబెట్టడానికి స్వయంగా దిగబడి పోయారు!
"సారీ.. మాజీ
మామాజీ! మీ పిల్లను దిగబెట్టేందుకు వచ్చిన మాట నిజమే. కానీ అందుక్కారణం ఆషాఢం కాదు. ఈ శ్రావణిని పెళ్ళాడ్డం." పక్కనున్న పిల్లను చూపించి అన్నాడా మాజీ అల్లుడు గారు.
అప్పటి దాకా ఎక్కడ నక్కి ఉందో గాని పిచ్చి తల్లి.. భోరుమంటూ తండ్రి గుండెల మీదకు వచ్చి పడింది కూతురు.
కన్నబిడ్డను చూసి గడ్డకట్టుకు పోయారు వెంకప్పగారు. ఆనక పిచ్చి కోపంతో రెచ్చి పోయారు. "అన్యాయం! కట్నం కింద పది కోట్లు, కమ్మంగా
పండే తోటలు, దొడ్లు దొబ్బి ఇప్పుడిలా నమ్మక ద్రోహం చేస్తావా అబ్బీ!" అదీ మామగారి ఆక్రోశం.
పకాల్మని నవ్వి అన్నాడూ ఆ అల్లుడబ్బి "అన్ని కోట్లు అప్పనంగా కుమ్మరించారంటే మీ అమ్మాయిగారెంత కాకి బంగారమో అర్థమవుతూనే ఉంది. ఆర్నెల్లు ఈ
కాకితో కాపురం వెలగ బెట్టాను. అందుకు మీరే ఈ గోరింక కింకో
పది కోట్లు బాకీ"
"'నాతి చరామి' అంటూ ఈ కాకి చెయ్యి పట్టుకునే గదా సామీ వాగ్దానం చేసిందా నాడు పెళ్ళిలో పదిమంది
పెద్దల ముందూ! ఇప్పుడు నమ్మక ద్రోహం చేయడం నేరం" వెంకప్పగారి లా పాయింటు.
" హీఁ..హీఁ..హీఁ ! ధర్మపన్నాలా! మరి దిబ్బలగూడెం జనాలకు ఎన్నికలప్పుడు తమరు చేసిన హామీలో? అధికార పార్టీలోకి జంపు.. ఏ ప్రజా సేవకో సెలవిస్తారా మాజీ మామాజీ!"
వెంకప్పగారేం జవాబేం
చెప్పాలా అని తడువుకుంటూండగానే…
"కెవ్వు" మని కేక. ధడాల్మనేదో బరువుగా పడ్డట్లు చప్పుడు. అటు చూస్తే ఏడుపులు.. పెడబొబ్బలు. పడింది గారాబాల కూతురు. ఏడుపులు గాభరా పడే భార్యామణివి.
పెడబొబ్బలు అంబులెన్సు కోసం!
క్షణాల్లో సీను మారి పోయింది.
ఒన్ నాట్ యైట్ వాహనంలో అమ్మాయి యములాడితో ఫైటు. "డైవర్.. తొందరగా
పోనీయ్.. అపోలోకి!' వెంకప్పగారి హుకూం.
నింపాదిగా అడిగాడు అంబులెన్సు చోదకుడు " అపోలో పది మైళ్ళు. అప్పలాచారి
ఆసుపత్రి పదడుగులు. ఎటు పోదాం సార్ మరి మన మిప్పుడు?"
"అమ్మాయి ప్రాణం ముఖ్యం ముందు. అలోపతైతే సరి.. అప్పలాచారైనా నో వర్రీ"
అంబులెన్సు డాక్టర్ అప్పలాచారి గారి డిస్పెన్సరీ ముందాగింది. క్షణాల్లో స్పందన.. బిల్లు చెల్లింపుల సిబ్బంది నుంచి. అడ్వాన్సుగా ఐదు లక్షలు వదిలింది. ఆ తరువాతే నింపాదిగా
చికిత్స మొదలైంది.
ఏవేవో మూలికలు, మండలు, కషాయాలు, నూనెలు, కల్వాల్లో చూర్ణాలు నూరుతున్న చప్పుళ్ళు! వైద్యనారాయణులవారి దర్శన భాగ్యం ఆఖరి సన్నివేశంలో గాని కాలేదు. నుదుటి నామాలకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ విషాద వదనంతో గంభీరంగా ప్రకటించారా వైద్యశిఖామణులు
"మానవ ప్రయత్నం మనం చేసాం! దైవమే అనుకూలించింది కాదు. ఎన్ని చూర్ణాలు.. గుళికలు.. దట్టించినా ప్రాణయోగం లేక పోయింది జీవికి. తులసీ తీర్థం గొంతులో పోసుకోండి.. పోండి!"
"చూర్ణాలు.. గుళికలా! ఇదేం మాయదారి అలోపతి వైద్యం డాక్టర్?" గంపెడంత దుఃఖంలోనూ గయ్యిమన్నారు వెంకప్పగారు .
"హలో.. అలోపతి అని ఎవరన్నార్ సార్! మాది ఆయుర్వేదం" నింపాదిగా డాక్టర్ అప్పలాచారి
సమాధానం.
"మోసం.. దగా! ఆ సంగతి ముందే చెప్పాలి గదా?"
"ముందే చెబితే అపోలోకి పారిపోతారు గదా! ఎన్ని లక్షలు పోస్తే వచ్చిం దిక్కడ
ఈ
పట్టా! తమరు మాత్రం తక్కువ తిన్నారా! ఎన్నుకున్న పార్టీకి వెన్ను చూపించారా లేదా? మంచి పదవుల కోసం అధికార పార్టీలోకి దూకడం లేదా? నాది మోసమైతే మీది పచ్చి మోసం కాదా!"
నోట మాట రాకుండా నిలబడి పోయారు అట్లాగే వెంకప్పగారు.
సీను మారింది మళ్లీ!
పియ్యే పరుగెత్తుకుంటూ వచ్చాడీ సారి రొప్పుకుంటో.
"సార్ మీకు ఫోన్. అర్జంటుగా కలవమని కబురు"
"అధికార పార్టీ అధిష్ఠానం నుంచేనా?" ఆనందంగా లేచి నిలబడ్డారు వెంకప్పగారు.
"అధికారి నుంచే గానీ.. పార్టీ తాలూకు కాదనుకుంటా ! పంజగుట్ట పోలీస్ స్టేషన్నుంచి. ఎవరో పెద్దాఫీసరు!"
తెల్లబోయి ఫోనందుకున్నాడు వెంకప్ప.
"సార్! ఈ గాడిద కొడుకు మీ కొడుకేనా?" పోలీసాఫీసరు సింహ గర్జన.
"ఏ గాడిదో తెలిస్తేనే గదయ్యా కొడుకో కాదో చెప్పగలిగేదీ!"
వివరాలన్నీ ఇచ్చి " మీ పేరే చెబుతున్నాడు సార్! పోలికల బట్టి నిజమే ననిపిస్తోంది. మీరే ఓ సారి నిర్ధారించాలి. పేకాట క్లబ్ గోడ దూకుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నాం! " పోలీసాఫీసరు డబ్బా.
" గోడలు దూకే వాడైతే మా ఘనుడేనయ్యా కచ్చితంగా! ఐనా క్లబ్బు గోడతో పనేమిటా పింజారీ వెధవకి? ఒకసారీ
ఫోన్ వాడి చేతికి ఇవ్వండి!"
లైన్లో కొచ్చిన పుత్రరత్నం దర్జా వెలగ బెట్టి చెప్పిన వివరాల్ని బట్టి గౌ॥ వివివి
కప్పగారు గత వారం బట్టే ఆర్థికంగా కుప్ప కూలినట్లు! అబ్బ అడ్డంగా కూడబెట్టింది
బిడ్డలా నీళ్ళలా బెట్టింగుల్లో పెట్టి తగలేసాడన్న మాట. పరా పరా రాసేసాట్ట ప్రాంసరీ నోట్లు తన వాటా కొచ్చే లెక్కలు తరవాతైనా తీరిగ్గా చూసుకోవచ్చు లెమ్మని. "బాకీపడ్డ పీనుగలు కత్తి గొంతుమీద పెడితే గత్తర పడకేం చేస్తాం చెప్పు డాడీ!" అని ఆ సుపుత్రుడి సన్నాయి నొక్కులు!
"నువ్వు రాసేసావు సరేరా!
నోటు రాయించుకున్న ఆ పెద్ద మనుషులకైనా బుద్ధీ జ్ఞాన ముండక్కర్లే! నెత్తిమీదచిల్లి కాణీ పెట్టినా అర్థ కాణీకి కొరగాని సన్నాసి వెధవ్వి నువ్వని
తెలుసుండక్కర్లా!"
"పిచ్చి డాడీ! అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. నోట్లు రాసే నాటికి నేను నీ ఆస్తి మొత్తానికి
సంపూర్ణ హక్కుదారుణ్ణి. దాన వినిమయ విక్రయాదులాది సర్వ సంపూర్ణ హక్కుభుక్తులతోసహా నువ్వు నీ యావదాస్తిని నాకు ఇచ్చాపుర్వకంగా పూర్తి స్పృహలో ఉండి ధారాదత్తం చేసేసావు. లాయర్లు పక్కాగా తయారు చేసిన దస్తావేజులు డాడీ.. నువ్వు నా కాలేజీ దరఖాస్తు అనుకుని బరబరా సంతకాలు గిలికినవీ!"
"ఏరు దాటించిన తెప్పను నువ్వు మాత్రం తగలెయ్యడంలా! దిబ్బల గూడెం జనాలు నిన్నెలా
చీదరించుకుంటున్నారో తెలుసా! నీ బిడ్డగా పుట్టినందుకు సిగ్గనే అనిపిస్తోంది డాడీ!"
"నిజంగా నువ్వు నా కడుపున పుట్టిన బిడ్డవేనుట్రా?"
కోపంతో కొయ్యబారి బోవడం వెంకప్పయ్యగారి వంతయి పోయింది.
సీను మారిందింకో సారి.
"సారీ! ఇప్పటికైనా నిజం కక్కకపోతే నా బతుక్కిక నిష్కృతి లేదండీ!" వెక్కి వెక్కి ఏడుస్తోంది పక్కనే పక్కలో సతీ సావిత్రీదేవి.
"ఏవిటే సావిత్రీ.. నీ బతుక్కి నిష్కృతి లేని ఆ నిజం?"
బిక్కు బిక్కు మంటూ భార్యామణి వైపు చూసి అడిగాడు వెంకప్పగారు గాభరాగా.
"నా కడుపున పుట్టిన బిడ్డల్లో ఒకరు.. ఒకరు.. మీ రక్తం పంచుకోలేదేమోనని
అనుమానంగా ఉందండీ!
భగవంతుడా! ఏ ఆడదానికీ రాకూడదయ్యా ఇంత పెద్ద కష్టం" పాత
కాలంనాటి అరవ కథానాయికి నయం సతీ సావిత్రమ్మగారి
శోకరసాభినయం ముందు.
"ఒకరు నా రక్తం పంచుకుని పుట్టలేదా?! ఈ దౌర్భాగ్యంలో కూడా మళ్లీ సస్పెన్సా.. నా ఖర్మానికి?! ఎవరే సావిత్రీ ఆ ఒక్కరూ?" కత్తి వేటు పడకుండానే నెత్తురు చుక్క లేకుండా పోయింది
వెంకప్పగారి ముఖారవిందంలో.
"ఏమోనండీ.. ఎంత గింజుకున్నా గుర్తుకొచ్చి చావడం లేదు! గుర్తొస్తే.. ఇది చెప్పిందాన్ని.. అది మాత్రం చెప్పనా! నా శీలాన్నే శంకించడం న్యాయమా?"
నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి గౌరవనీయులు వెంకప్పగారిది. "ఇప్పటిదాకా గుట్టుగా పెట్టి ఇప్పుడా ఈ నిప్పుమూటను నా గుప్పేట్లో పెట్టేది! ఈ వయసులో ఎలానే నేనీ షాకును
తట్టుకునేదీ!.. పాపిష్టి దానా!"
"పిల్లల్ని చూసి మీరలా కుమిలి పోతోంటే నిమ్మళంగా ఉండలేక పోయానండీ! ఐనా తప్పంతా నా మీదే తోసెయ్యడం న్యాయంగా లేదండీ! పెళ్లి చూపుల కొచ్చినప్పుడు ఉప్మాలో అల్లం పచ్చి మిర్చి ఉందో లేదో చూసుకున్నారు గాని కట్టుకోబోయేదాని కడుపువంక చూడాలన్న కనీస జ్ఞానం కూడా లేక పాయ మీకు! నాదా తప్పు? ఆడపిల్లని. నోరు విడిచి కాబోయే మొగుడితో కడుపు విషయాలెలా మాట్లాట్టం? మా ఇంటా వంటా లేదు అంతలా బరితెగించడం. పిల్ల గుణవతా?.. ధనవతా?.. చదువుల సరస్వతా?.. అంటూ ఆరాలు తీసుకున్నారే గానీ అత్తా మామలు.. గర్బవతో కాదో కనుక్కోలేదు. లొసుగంతా
మీ మీద పెట్టుకుని నన్నిలా తూలనాడ్డం ఏవీ బావో లేదు. మహిళా హక్కుల సంఘానికి మా పెద్దమ్మే చైర్ పర్సన్. ఆ విషయం
మర్చిపోవద్దు" సతీ సావిత్రి ఉక్రోషం.
"మహ బాగుందే. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడ మంటే ఇదే! తాళి కట్టిన వాడిని ఇలా దగా చేసింది చాలక.."
"ఆగండక్కడ! మీరు చేసే మోసం ముందు నాది చీమ తలకాయంత దోషం. ఎన్నికైన తరువాత అది చేస్తా ఇది చేస్తానని మన దిబ్బల గూడెం జనాలకి తెగ హామీలు గుప్పించి గెలిచారు. మంచి పదవుల కోసం ఇప్పుడు గోడ దూకుతున్నారు. తమరు చేసేది మహా పుణ్య కార్యం.. నేను చేసింది కిరాతకమూనా!"
సతీ సావిత్రీ దేవి గర్జనలకి ఉలిక్కి పడి గబుక్కున లేచి కూర్చున్నారు వెంకప్పగారు. నిద్ర తేలిపోయింది. పోతే పోయింది పాడు నిద్ర. తనిప్పటి
దాకా కన్నది వట్టి పీడకలేనని తేలి పోయింది. మనసు తేలిక పడింది.
"తేలిక పడ్డానికి కారణం పీడకల నుంచి బైట పడ్డం కాదప్పా!
పీడాకారపు శరీరాన్నుంచి
బైట పడ్డం! ఎంత సేపట్లా
నిలబడి గుర్రు కొడ్తావ్ కానీ..లే! నరకం కావాలా? స్వర్గం పోతావా? ముందది తెముల్చు" గంభీరమైన ఆ గొంతుక్కు గభాలున ఈ లోకంలోకి ఊడి
పడ్డారు వెంకప్పగారు.
సీను మారిందని..
తను ఇప్పుడున్నది వేరే లోకాల కెళ్లే దారుల కూడలి ప్రధాన ద్వారం దగ్గరనీ.. అప్పుడు గానీ బుర్ర కెక్కింది కాదు వెంకప్పగారికి.
ఎదురుగా యమ భటులు.. దేవ దూతలు.. తన బదులు కోసమే ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు.
"ఇదేంటీ! నేనెప్పుడు
చచ్చి పోయాను? ఎవరు చంపేసారు నన్నిట్లా అన్యాయంగా?"
వెంకప్పగారి ఆక్రోశం.
"ఎవరికి పట్టిందబ్బా నిన్ను చంపడానికి! నీకై నువ్వే కోరి తెచ్చుకున్నావీ చావుని. మొన్నటి ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి అడుగు పెట్టిన మొట్ట మొదటి రోజు నువ్వేం చేసావో గుర్తుందా వెంకప్పా?" ఓ కింకరాకారం ప్రశ్న.
"సభాపతి గారి సమక్షంలో పదవీ స్వీకార ప్రమాణం చేసానూ..అదీ తప్పే?! దానికే ఇంత పెద్ద శిక్షా!"
"అదిగో.. ఆ చావు తెలివితేటలే నీ కొంప ముంచింది. దైవ సాక్షిగా చేసిందయ్యా ఆ ప్రమాణం. అందుకే
నీకిప్పుడది ప్రాణాంతకమై కూర్చుంది ప్రజా ప్రతినిథి మానవా!"
'కప్పదాటు వీర వేంకట వెంకప్ప అను నేను దిబ్బలగూడెం నియోజక వర్గ ప్రజల ఆంకాక్షల మేరకు నిస్వార్థంగా కర్తవ్యం నిర్వహిస్తానని, నా ప్రజల యొక్క హక్కులకు భంగం కలగనీయనని, భయ రాగ ద్వేషాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'- ప్రమాణం గుర్తుకొచ్చింది వెంకప్ప గారికి.
"దైవ సాక్షిగా చేసిన ప్రమాణం అది. ఉల్లంఘిస్తే ఇలాగే మూడుతుంది మరి. సొంత లాభం కోసం గోడ దూకాలని నిర్ణయించుకున్న తక్షణమే నువ్వు రాజకీయంగా మృతుల జాబితాలో చేరిపోయావప్పా!
మళ్లా ఎన్నికల దాకా అవకాశం రాదు గదా అని ఓడ మల్లయ్యల్ని నువ్వు పిచ్చి పుల్లయ్యల్ని చేసుండచ్చు. కానీ నమ్మక ద్రోహం చేసిన నేరానికి
దేవుడైతే అస్సలూరుకోడు.. తెలుసా!"
"కహానీలొద్దు! మీ లెక్కనైతే మా లోకం చట్ట సభల్లో ఎక్కడా ఒక్క పురుగు మిగల్దు"
"చర్చల కిదేమీ మీ టీ వీ చానెళ్ల బఠానీల కార్యక్రమం
కాదు గానీ.. స్వర్గమో.. నరకమో తొందరగా తెముల్చు. అవతల నీ లాంటి పాపులు చాలా మందుండి చచ్చారు క్యూలో" విసుక్కున్నాడో దైవ దూత.
పక పక నవ్వి అన్నారు వెంకప్పగారు " చూస్తూ చూస్తూ ఏ పిచ్చి కుంకన్నా నరకం కోరుకుంటాడుట్రా కింకరుల్లారా? రంభా ఊర్వశి తిలోత్తమ లుండే ఆ స్వర్గసీమే కావాలి నాక్కూడాను. రాజకీయాల్లో పడి ఎంజాయ్మెంటన్న మాటే మర్చిపోయాను
ఈ మధ్య చాలా కాలం బట్టీ"
వెంకప్ప గారికోసం స్వర్గ ద్వారాలు బార్లా తెరుచుకున్నాయి.
దర్జాగా ఆయనగారు లోపలికి అడుగు పెడుతుండగా …
సీను మారిపోయింది మళ్లా! అయోమయంగా ఉంది వెంకప్పగారికి ఇక్కడ పరిస్థితంతా.
ధ్వని కాలుష్యం. వాయు కాలుష్యం. రాష్ట్ర
రాజదాని తాతమ్మ లాగుందీ నగరం. బొగ్గు రైళ్ల మాదిరి బళ్ళు కాలిదారి మీద నుంచి దౌడు తీస్తున్నాయి. పాద చారులు బళ్ళ దారి నడి మధ్యలో పడి వాటితో పరుగు పందేలు పెడుతున్నారు.
వీధుల్లో దుర్గంధం. సైడు కాలువల్లో పొంగి పొర్లే బురద నీళ్ళు. చూస్తేనే కడుపులో దేవుతున్నట్లుందీ దేవ నగరం.
"బురద నీళ్లేంటి? బిగ్గరగా
అనకు.. పెద్ద గొడవవయి పోద్ది. స్వర్గ వాసులు నిత్యం తాగే మంచి తీర్థం బాబూ ఇది. బురదంటే అలా గుంటుంది " పరిగెత్తి పోయే ఓ బురదాకారాన్ని చూపించాడు దైవ దూత.
స్వర్గంలో అసలు బురదుండడమే అబ్బురం అనుకుంటే.. ఆ
కీచడ్ తో వీధుల వెంట పడి ఇలా క్రీడా వినోదాలా! "
"మరీ కప్పలా అలా తెరవకు బాబూ నోరు.. నోట్లో ఈగలు దూరగలవు. ఆ పరిగెత్తేది కీచడ్ కాదప్పా! మీ లోకం తాలూకు కీచకుడు. ఆడమనిషి కనబడితే చాలు వావి వరసలు కూడా చూడకుండా వెంట పడ్తార్టగా నీచులు! అప్పట్లో వాళ్లు కార్చిన ఆ చొంగంతా డ్రమ్ముల్లో పట్టి ఉంచుతారు ఇక్కడ. ఆ వెంట బడి చల్లేది స్త్రీ దూతలు. రోజూ ఓ బక్కెట చొప్పున
వాడిమీదిలా చల్లుతుంటారు. ఎవడి కోటా డమ్ములు ఖాళీ ఐతే వాడికీ
వసంతాలాట నుంచీ విముక్తి"
వణికి పోయారు వెంకప్పగారు "ఇదేం స్వర్గంరా బాబూ! మరి రంభా..ఊర్వశీ.. మేనకా..తిలోత్తమా..?!"
"నీ చాదస్తం కూలా! ఎప్పటి వాళ్ళయ్యా వాళ్ళంతా! మీ ముత్తాతల ముత్తాతల ముత్తాతలతో తైతక్కలాడిన తాతమ్మల్తోనా ముచ్చట్లు? మీలాంటోళ్లందరూ చేర బట్టే ఆ అమ్మళ్లలా పాపం నరకానికి పారి పోయింది! మా తాతలెంత
అదృష్టవంతులో కదా!" దైవదూత నిట్ట్ట్టూర్పులు.
"గాంధీ తాత, బోసు బాబు, భగత్‌సింగు, పటేల్ సాబ్, ఫూలే జీ, గురు ఠాగూరు, బాబా అంబేద్కరు, థెరిసా తల్లి, సరోజినీదేవి
నాయుడమ్మ, కామ్రేడ్ సుందరయ్యల్లాంటి మహాత్మలందరికీ సేవలందించే భాగ్యం అబ్బింది వాళ్ళకి. మాకే ఈ స్వర్గంలో మీలాంటోళ్ళతో
దిక్కుమాలిన చెర!" కసి పట్ట లేక వెంకప్పగారి పెడ రెక్కలు మరింత గట్టిగా విరిచి ముందుకు తోసాడా దైవదూత.
వెంకప్పగారి
వెర్రానందమంతా ఒక్క పుటలోనే పూర్తిగా ఆవిరై పోయింది.
ఈ మధ్యే చచ్చిన పాప్యులర్
పాపులంతా స్వర్గలోకంలోనే దర్శనమిస్తున్నారు. బాంబులతో విధ్వంసం సృష్టించిన అల్లరి మూకలు, ఆస్తుల కోసం
కన్నవాళ్లనే కడతేర్చిన నీచులు, ఫ్యాక్షను గొడవల్లో పడి ప్రాణాలను మంచినీళ్ళ ప్రాయంగా తీసిన
కసాయీలు, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసి ఆనందించే నికృష్టులు,
ఆడబిడ్డలుంటే పరువు తక్కువని, బరువు బాధ్యత లెక్కువని
భ్రూణహత్యలు చేసే త్రాష్టులు, ఆలు బిడ్డలుండగానే మరో ఆడదానితో చాటు మాటు సంసారం వెలగబెట్టే సరసులు, వేలు కళ్ల చూడందే ఫైలు మీద వేలైనా కదపని కర్మచారులు, మందులో సైతం కల్తీ కలపందే అమ్మబుద్ధి కాని నీచ బేహారులు, డబ్బుకోసం లేని జబ్బులకు దొంగవైద్యం చేసే వైద్యులు, కాకి
లెక్కల్తో మంది సొమ్మును నొక్కేసే రాకాసులు, ఇసుక నుంచి బొగ్గు దాకా సృష్టిలోని సమస్తం వ్యాపార సరుకేనని మనసారా నమ్మే అక్రమార్కులు, పిల్లకాయల పరీక్ష పత్రాలనుంచి, పెద్దవాళ్ల పించన్ల
దాకా చేతివాటం చూపకుండా నాటకం నడపించబుద్ధికాని బడుద్ధాయిలు, శరీర అవయవాలు, ఖరీదైన భూములు, అత్యవసర పత్రాలు, సర్కారువారి పనులు, కంట్రాక్టులు,
ఉద్యోగాలు, పదవులు, కళాశాల సీట్లు, విదేశీ ఉపాధులు, ఆస్తి తగాదాల వేటి మధ్యలోనైనా మధ్యవర్తుల మిషతో దూరి ఏకమొత్తంగా సింహభాగం భోంచేసే దళారులు.. అంతా మళ్లీ పోగైతే
ఏర్పడ్డ భూలోకం అడ్డాకు నకలుగా ఉందీ స్వర్గంలో కంగాళీ.
నీరజాక్షులు లేని ఈ నీరస లోకంలో మొదలే బోరు. పైపెచ్చు
రోజుకో రకం శిక్షను
కన్నార్పకుండా చూడ్డం అన్నింటికన్నా పెద్ద శిక్ష.
తన వంతు ఎప్పుడొస్తుందో తెలీదు. ఎలాంటి శిక్షలో చెప్పరు. ఎన్నాళ్లీ
కుళ్లులోనో తేలదు. ఎవరొచ్చి ఎప్పుడు ఏ ఫిర్యాదు చేస్తారో.. ఏ అభియోగానికే విచారణ ఎప్పటి దాకానో.. నిర్దారణైన నేరాలకు పడే శిక్షలు ఏ సెక్షన్లవో.. తెమల్చరు!
ఎంత స్వర్గమైనా ఇది నరకాని కన్నా హీనమని అనుభవ పూర్వకంగా అర్థమైంది వెంకప్పగారికి.
దేవుడు ఎలాగూ దర్శనమీయడు ఇక్కడ. ఏ కష్టం చెప్పుకోవాలన్నా ఆయనగారి దూతలే గతి. వాళ్లకైనా కేవలం విని 'ఊ'కొట్టడం వరకే డ్యూటీ. పైవాడి స్పందన ఏ విధంగా
ఉండబోతుందో ఆ పైవాడి కొక్కడికే తెలుసు.
"స్వర్గం ఇంత దరిద్రంగా ఉంటుందని ముందే ఎందుకు చెప్ప లేదయ్యా? మీరిక్కడ చేస్తున్నది మాత్రం పచ్చి మోసం కాదా?"
అని అక్కడికీ ఓ రోజు ఉండబట్ట లేక ఎదురు తిరగనే తిరిగారు వెంకప్ప గారు ఇక తప్పక.
అప్పుడు పలికింది దైవ వాణి "ఇప్పటికి తెలిసొచ్చిందా కష్టమంటే ఏంటో నీకు వెంకప్ప మానవా! నీ నియోజక వర్గం ప్రజలు ప్రతి క్షణం పడే క్షోభ ఇంతకు పదింతలు. కొత్త బంగారు లోకం పునర్నిర్మిస్తానని వాగ్దానాలు కుమ్మి గట్టెక్కావు
గుర్తుందా ఎన్నికల్లో? గెలిచిన మరుక్షణం నుంచే జనం సంగతే మరిచావు. కార్యకర్తల మంచి చెడ్డలు చూడ వలసిందే. కానీ అంతకన్నా ముందు నీ సేవా భాగ్యం దక్కవలసింది నిన్నీ అందలం ఎక్కించిన దరిద్ర నారాయణులకే
గదా!
స్వర్గమని ఉహించిన లోకం నరకం కన్నా హీనంగా హింస పెడుతుంటే ఆ సలుపు ఎలా ఉంటుందో స్వానుభవంలో తెలుసుకుంటావనే నిన్నిక్కడకు రప్పించింది. నీవు వద్దనుకున్న
నరకం ఇప్పుడెలా ఉందో ఓ సారి
చూస్తావా?"
"అక్కర్లేదు స్వామీ! బాపుజీనుంచి.. బాబా అంబేద్కరు దాకా అక్కడే ఉన్నారంటున్నారుగా అందరూ! అహింసను, అసమానతనీ,
అన్యాయాన్నీ అణువంతైనా సహించని పెద్దలంతా ఉన్నది నరకమెలా
అవుతుందిలే?!"
"మరి అదే పెద్దల బాటలో నడుస్తున్నామని పొద్దస్తమానం సుద్దులు చెప్పి
గద్దెలెక్కుతున్న పెద్ద మనుషులు కదా మీరంతా? కానీ వాస్తవంలో చేస్తున్నదేమిటి?"
తలొంచుకున్నారు కప్పదాటు వీర వేంకట వెంకప్పగారు.
"ఇదంతా పశ్చాత్తాపమేనని నమ్మవచ్చునా? ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశముంటే చెప్పు. మరో అవకాశమివ్వడానికి నేను సిద్ద్జం. మీ లోకానికే పోయి మళ్ళా ప్రజా సేవ చేసుకుందువు గాని.
నీ నియోజక వర్గ ప్రజా బాహుళ్యం నిజంగా నిన్ను తమ ప్రతినిధిగా చట్టసభలో చూడ్డం భాగ్యంగా భావించాలి. ఆ రోజునే నీ పాపాలన్నింటికీ
విముక్తి. అప్పుడు
నీవసలు ఈ స్వర్గం సంగతే తలుచు కోవు. 'జన్మభూమే స్వర్గానికన్నా
గరీయసి' అన్న మాట విన్నావుగా!"
రెండు చేతులు జోడించి తలాడించేసారు కెడివివివి కప్పగారు.
" ఎలాగూ వచ్చావు. ఓ సారి నరకం కూడా చూసి పో! మీ ప్రజా నేతలంతా ఆ భూమిని స్వర్గధామం చేయడానికి అనుక్షణం ఎలా తపిస్తున్నారో తెలిసొస్తుంది."
గభాలున మెలుకవ వచ్చింది వెంకప్ప గారికి. సీను మారింది మళ్లీ! గిచ్చుకుని చూసుకుంటే తెలిసొచ్చింది ఇదే అసలైన వాస్తవ జీవితమని.
పక్కనున్న సెల్ ఫోన్ అదే పనిగా మోగుతున్నది. నెంబరు చూస్తే అధికార పార్టీ మధ్యవర్తిది. అప్పటి దాకా తాను తహ తహ పడ్డది.
చివరి సీనులో భగవంతుడొచ్చి చేసిన బోధంతా మళ్లీ గుర్తుకొచ్చింది! సెల్ ఫోన్ అందుకున్నారు కెడివివివి కప్పగారు.
'గోవిందా.. గోవిందా అనవయ్యా!' అని సెల్ ఫోను అదే పనిగా భజన చేస్తున్నది. పీక నొక్కి ఆ సెల్ ఫోన్నో
పక్కకు గిరాటేశారు
కప్పదాటు వీర వెంకట
వెంకప్ప గారు!
ఆయన మనసంతా
ప్రశాంతంగా ఉందిప్పుడు*