బమ్మెర పోతనామాత్యునికి కావ్యకన్య 'బాల రసాలసాల నవ
పల్లవ'మంత కోమలం. పింగళ సూరనకైతే కైత 'బహుతపఃఫలం'. కాళిదాసు
దృష్టిలో 'మందఃకవియశః ప్రార్థీ(ఎత్తైన చెట్టు చిటారుకొమ్మనున్న పొట్టివాడికి అందని పండు). మిల్టన్ మహాశయుడికి స్వర్లోకవాసిని. వర్డ్సువర్త్ ఊహలో 'సమస్తమైన పరిజ్ఞానానికి ప్రాణవాయువు'. కోల్రెడ్జికి 'కళానందం'. రవీంద్రుడికి అనంతం.. శాశ్వతం. అరవిందునికి 'ఆత్మవిశ్వసందర్శనం'. ఇంతకీ
కవిత్వం అసలు తత్వం ఏమిటి?
'తత్వం' అనే మాట ఎక్కడ వినబడ్డా విషయం కాస్త జటిలమనే అనిపిస్తుంది. కంటి ముందు కనబడుతుంది.. అంటుకుంటే తెలుస్తుంది.. ఆలోచిస్తే ఊహకి అందుతుంది శరీరం. దానికి తత్వం అనే పదం తగిలించామా.. తంటా మొదలవుతుంది.
కవిత్వానిదీ అదే వరస.
కవిత్వం అంటే కావ్యరసం,. రాగపు వరసలు.. వగైరా వగైరా. సరే! మరి దాని తత్వం? ఆ ఆరాకు దిగామా! ఆయాసమే సుమా! 'ఐనా సరే' అనుకునే వారి కోసమే ఈ చిరుపరిచయ వ్యాస ప్రయాస.
(తత్= అది, త్వం= నీవు) తత్త్వం= అదే నీవు అని ముక్కస్య ముక్క అర్థం చెప్పుకోవచ్చు. కానీ సరిపోదు. 'శరీరం'తో జతచేస్తే స్వభావమనీ, వేదాంతంతో జోడిస్తే పరంధామమనీ నానార్థాలు పోయే 'తత్త్వం'
మరి కవిత్వంతో జతకలిసి
సాధించే పరమార్థమేంటో పెద్దల పద్యాల్లో చూద్దాము.
'కాళ్లకు గజ్జెలు, చేతికి
చిడతలు, భుజంమీద తంబూరా.. మొదలు
పెట్టరాదా భజన! అదిగో భగవంతుడు!' అంటే ఎలా ఉంటుందీ?
'శ్రవణోదంచిత కర్ణికారవముతో స్వర్ణాభచేలంబుతో/
నవతంసాయిత కేకిపించములతో నంభోజధామంబుతో/
స్వవశుండై మధురాధరామృతముచే వంశమ్ము బూరించుచున్/
ఉవిదా! మాధవు డాలవెంట వనమం దొప్పారెడిన్ జూచితే' అంటే ఎలా ఉంటుందీ? చదువరి హృదయాన్నిలా రసప్లావితం చేయడమే కవిత్వ తత్వం అనుకోవాలా?
నంది తిమ్మనగారి 'పారిజాతాపహరణం;లో సత్యభామ ప్రేమకోపంతో భర్త శిరస్సును వామపాదంతో తంతుంది. ఎంత కృష్ణయ్య అయినా కినుక తప్పదు కదా! కానీ అది ప్రకటితమైన
తీరులోనే ఉంది అసలు కవిత్వమంతా.
'నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూని తా/
చిన అది నాకు మన్ననయ, చెల్వకు నీ పదపల్లవంబు మ/
త్తనుపులకాగ్రకంటకవితానము సోకిన నొచ్చునంచు నే/
ననియెద, నల్క మానవుకదా! యికనైన నరాళ కుంతలా!'
క్రోధభావాన్నైనా ఇలా బహు కోమలంగా వెలిబుచ్చగలగడమే కవిత్వతత్వం అనుకోవాలా?
'పూతపసిండి వంటి వలపున్ బచరించుకులమ్ము నీతికిన్/
లేతకదమ్మ యిత్తెఱగు లేమ సురాంగన లెల్ల నిట్టి నీ/
సేతకు మెత్తురమ్మ, దయసేయక తిన్నని మేము వెన్నెలన్/
వేతురటమ్మ, యింత కనువేదుఱు సెల్లునటమ్మ యింతికిన్'
అల్లసాని పెద్దనయ్య మనుచరిత్రపాదపానికి పూసిన పద్యకుసుమం ఇది.
'నీతి తప్ప వద్దు' అన్న హితవూ ఎంత
నుతిమెత్తంగా ప్రవరాఖ్యుడి నోట పలికిందో! ఇదే
సుమా కవిత్వతత్వం మరో పార్శ్వం అనుకోవాలా?
'తమి బూదీగెల దూగుటుయ్యెలల బంతాలాడుచున్ దూగుగా/
కొమరుం బ్రాయపు గుబ్బిగుబ్బెతల యంఘ్రల్ జక్కగా జాగి మిం/
టి మొగంబై చనుదెంచుఠీవి గనుగొంటే దివ్యమౌనీంద్ర! నా/
కమృగీ నేత్రలమీద కయ్యమునకున్ గాల్చాచులా యొప్పెడి న్'(కళాపూర్ణోదయం)
నేలనుండి నింగికి
సాగే ఆడపిల్లల తూగుటూయలల సౌందర్యం. ఇద్దరు బ్రహ్మచారుల
ఆకాశదృష్టి కోణంనుంచి ఆ విలాసాలనన్నింటినీ వర్ణించవలసి రావడం. కవి ఏమాత్రం
వశంతప్పినా ఆ పరవశం అభాసుగోతిలో పడిపోవడం ఖాయం. అత్యంత సున్నితమైన
సందర్భానా పింగళి సూరనార్యుడు భావాలకి రంగులద్దిన వైనం కవిత్వతత్త్వ అంతస్సార శక్తికో గొప్ప ఉదాహరణగా తీసుకోవద్దా మరి!
అనురాగం, ఆక్రోశం, ప్రణయ విరహం, ఘోర కలహం, అనంత మోక్షం, లౌకిక సంక్షోభం, అన్నీ తనలో అణగి ఉన్న అణుకణం లక్షణమే
కవిత్వతత్వానిదీ అనుకుంటే సరిపోతుందేమో మరి చివరికి! సుతిమెత్తని పూరెక్క.. శ్రుతి చేసిన మాండోలిన్.. మనసును మోసే స్ఫుత్నిక్ రెక్క కవిత్వ తత్వానికి సరిగ్గా అతికినట్లు
సరితూగే పోలికలేనన్నా కాదనలేము కదా!
గిరిశిఖరంలా అరసుడిని హడలెత్తించే కవిత్వం.. అ'రసుడికి' పర్వత శిఖరంలాగా వెరపూ పుట్టించవచ్చు. తరచి తరచి చూస్తే చివరికి తేలే సారమేమిటయ్యా అంటే.. కవిత్వం ఒక 'సచ్చిదానందరూపాత్మకమైన జీవప్రపంచ కళాప్రదర్శన సంకీర్తనం' అని. కవిత్వసుమ కోమలత్వమంతా తొణికిసలాడుతుండేది ఆ సంకీర్తనంలోనే సుమా!
ప్రపంచం మిథ్య.
అజ్ఞానం వ్యసనాత్మకం.. లాంటి వేదాంతాలు చెప్పదు కవిత్వం. సత్యం జ్ఞానపూర్ణం, ఆనందమోహనం అని నొక్కి చెప్పేది కవిత్వం. సచ్చిదానందరూపాత్మకం అంటే ఇదే. జీవప్రపంచం అంటే మహత్, అమహత్ నపుంసక జీవులన్నింటితోనూ నిండివున్న కళాప్రదర్శనం. జీవాజీవాల హావభావాలు, సమీకరణాలను గురించి చేసే సంకీర్తనమే కవిత్వం అంటే మహబాగుంటుంది.
గులాబి మొక్కనే ఉదాహరణగా తీసుకుందాం. కంటికి ఎదురుగా కనబడుతుందది. గాలిని శ్వాసిస్తుంది. పూవుగా వికసిస్తుంది. తాకినా, వాసన చూసినా
ఆ పూవు ఉనికి తెలుస్తుంది. అంతేనా! కళ్ళు మూసుకున్నా స్మృతిపథంలో మెరుస్తుంది. తనవంటి
మరెన్నో పూల మనోహర రూపలావణ్యాలను, పరిమళాలను స్మృతిపథంలోకి మోసుకొస్తుంది.
వికాసం, అందం, పరిమళం - పుష్పాల చిద్భావం. హావభావ ప్రదర్శనం చల్లగాలిలో
మెల్లగా తలలూచడం.. మెత్తని రేకులు వేకువ మంచుబిందువులకు దోయిలించడం. సౌరభాన్నినేల నాలుగు చెరగులా ఉదారంగా వెదజల్లడం రసభావ ప్రకటనం. ఈ సచ్చిదానందమయాత్మకమైన గులాబీల హావభావ రసప్రదర్శనాన్ని కీర్తించడమే కవిత్వతత్వం.
"అత్తరువు గబ్బును, నలవేము
తీపి, మెత్తని రాయియు మేదిని గలవె!"లాంటి పంక్తులు కవిత్వం అనిపించుకోవు. అత్తరువుకు జీవముండవచ్చుగానీ.. హావభావాలేవీ?!
కాళిదాసు 'ఆషాఢస్య ప్రథమ దివసే మేఘ మాశ్లిష్ట సానుమ్' లో కవిత్వం ఉట్టిపడుతోంది. సచ్చిదానందస్వరూపం మేఘసంజీవాన్ని ఆక్రమిస్తున్నట్లు కవి తనభావనలో దర్శిస్తున్నాడు. ఆ భావననే కొండమీదా దర్శిస్తున్నాడు. 'ఆషాఢస్య ప్రథమ దివసే' అనే
కాలనిర్ణయంలో రసాన్ని ప్రదర్శిస్తున్నాడు. మామూలు మేఘమే అయినా ఇన్ని
కళాప్రదర్శనల కారణంగా కవిత్వపూర్ణమై అలరిస్తున్నది. కవిత్వతత్వమంటే అమూర్తాలను సైతం అలా మూర్తిమంతంగా మలచడమేగదా!
కవిత్వంలో పరమాత్మ:
ఆత్మలోనే ఉంటూ ఆత్మకు ఇతరమై, ఆత్మకు లోబడకుండా ఆత్మను తనలో లీనమొనరించుకునేదే పరమాత్మగా భావిస్తుంది ఆధ్యాత్మికం. ఆత్మకు ఆశయం మూలం. ఆత్మలకెల్లా సర్వస్వం పరమాత్మ. దీన్నే
విశ్వహృదయం అన్నా దోషం లేదు. ఈ విశ్వహృదయ వికాసమే కవిత్వం
అంతిమలక్ష్యం. సర్వసామాన్యమైన ఈ పరమాత్మని ప్రతి పదార్థంనుంచి గ్రహించి తనలో సూచించడమే కవిత్వం చేసే మరో గొప్ప కార్యం.
'కొందలమందె డెందము శకుంతల తా నిపు డేగునం చయో/
క్రందుగ బాష్పరోధమున కంఠమునుం జెడె బుద్ధిమాంద్యమున్ బొందె' ఇది
కణ్వుని ఆత్మానుభవం. 'ఒకింత పెంచిన తపోధనులే యిటుగుంద, నెంతగా గుందుదురో తమంత గను కూతుల బాయు గృహస్థు లక్కటా!' అని ఆ మహర్షి నోట అనిపించడంలో విశ్వహృదయం స్ఫురిస్తున్నది. వర్డ్సువర్త్ 'ఇంద్రధనుస్సు' ఏడో పంక్తీ ఇదే ధర్మం నెరవేర్చడం ఇక్కడ గమనార్హం. ఎప్పుడైతే కవిత్వం సచ్చిదానందమయాత్మకమైన పదార్థంగా మారి హావభావరసాలను పోషిస్తూ పరమాత్మను స్ఫురింపచేస్తున్నదో.. అప్పుడే పాఠకులకు తత్ (ఆ పరమాత్మ) త్వం(నీవే) అనే ఐక్యతాభావం
చేకూరుస్తున్నది. 'తత్త్వమసి' అనే వేదవాక్యం ఉత్తమకవిత్వం బోధిస్తో తన్మయత్వాన్ని కలిగిస్తున్నది.
కవిత్వం ఒక్క పద్యంలోనే ఉంటుందనుకోవడం పొరపాటు. గద్యంగానూ,
గద్యపద్యాత్మకంగానూ ఉక్తానుక్తంగానైనా ఉండవచ్చు.
పసిబిడ్డల ముగ్ధావలోకనంనుంచి, కన్నెపిల్లల శృంగారచేష్టల వరకు ముదుసళ్ళ ముక్కాలి నడకల్లో సైతం దర్శించవచ్చు.ఇంత విశాలమైన కవిత్వతత్వాన్ని గ్రహించడానికి పాఠకుడికి మరి కావాలసిందేమిటీ?
దృష్టి వైభవం: అది కొరవడితే వేశ్యాంగన విలాసాలు, మృదంగ ధిమధిమలు, బాలకృష్ణుని మదస్మిత వదనారవిందం, కాళిదాసు కణ్వకుటీరం, రవీద్రుని గీతాంజలయినా అర్థం కాని సముద్ర ఘోషే. ఇంద్రియనిగ్రం: అమాయకత్వంమీద అనురాగం, వియోగం, కరుణార్ద్ర హృదయంతో స్పందించవలసిన సందర్భంలో సైతం
నీతి తప్పి పరవశుడైతే ఎంత కవిత్వమూ
చెవిటి ముందు చేసే శంఖునాదమే! ప్రఫుల్ల వ్యక్తిత్వం: వికాసవ్యక్తిత్వం లేని జడ్డికి కవిత్వం అగ్రాహ్యం.
ఆధ్యాత్మిక ప్రశాంతి: కేవల లౌకిక సంక్షుభిత మానసిక సంకుల స్థితిలో ఎంత ఉదాత్తకవిత్వమైనా అనాస్వాదితం.
'చదువన్ భావము- భావముట్టిపడుచో సుకీర్తనాశక్తియున్/
ముదమేపాఱ పరస్పరంబు మదినిన్ ద్రోపారుకొంచుందనున్/
హృదయానందతరంగలాలముల ముంచెత్తంగనే పాఠ కుం/
డదిరా యంచు నుతించునో యదియెయౌ నచ్చంపు కావ్యంబుగన్"
పాఠకుడికి అవ్యక్తమైన ఆనందాన్నిఅందించడమే కవిత్వం అంతిమ లక్ష్యం. కవిత్వతత్త్వాన్ని చక్కగా నిర్వచిస్తుందీ పద్యం***
-కర్లపాలెం హనుమంతరావు
(అంతర్జాజల పత్రిక సుజనరంజని డిసెంబరు 2015 సంచికలో ప్రచురితం)
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec2015/index.html
-