Friday, March 25, 2016

యాకూబ్ కవిత-నా పరామర్శ



సహజంగానే ఉందాం
చల్లని గాలిలా ఉందాం, ప్రేమలా ఉందాం
నిప్పుకణికలా ఉందాం
నిలువెత్తు నిజంలా ఉందాం
సహజంగా ఉందాం
అలజడిలా ఉందాం,ఎలుగెత్తే పాటలా ఉందాం
పడవలకు ఈతల్నీ, అలలకు కదలికల్ని నేర్పుదాం
అక్షరాలకు కవచాలు తొడిగి సైనికుల్ని చేద్దాం
మట్టిని మన మాతృకగా లిఖిద్దాం
కాలానికి భాషనేర్పి భవిష్యత్తును ఇద్దాం
ప్రశ్నల్లా ఉందాం,పలకరించే స్నేహితుల్లా ఉందాం
సహజంగానే ఉందాం
నకిలీ ముఖాలమీద ఉమ్మేద్దాం
నిజంలా ఉందాం, కలల్లా ఉందాం, నిర్భయంగా ఉందాం
కవిత్వంలా ఉందాం
సహజ సహజ సహజంగా ఉందాం !!!
*సరిహద్దు రేఖ ‘సంకలనం నుండి…మార్చి,2000
నా పరామర్శః
పువ్వు తాజాగా ఎందుకుంటుంది?
పిట్ట రెక్కలకా స్వేచ్చ ఎక్కడిది?
హెచ్చార్కె ఎక్కడో ఓ కవితలో అన్నట్లు గుర్తు..ఎగ్జాట్ పదాలిప్పుడు గుర్తు లేవు కాని..పాపాయి ఎవరి కోసమూ ఏడవదు..ఎవరి కోసమూ నవ్వదని.
సహజత్వమంటే అదేనేమో. ఆ తత్వం మీదే ఈ కవిత్వమంతా!
పంచదార పలుకులు పది కంట పడగానే పరుగెత్తుకొచ్చేస్తుంది చీమ. ఎలుగెత్తి చాటుతుంది తోటి చీమలకా తీపి వార్త చేరేదాకా! చీమల కన్నా ఘనమైన కమ్యూనికేటర్లమా మనం?
కొమ్మల్లో కోయిలమ్మ ‘కో’ అన్నా..తుమ్మల్లో గుడ్లగూబ ‘గీ’ అన్నా
ఒక పరమార్థమేదో తప్పకుండా అంతర్గతంగా ఉండే ఉండుంటుంది. అనంత జీవకోటి అహోరాత్ర హృదయ ఘోషేమో అది! అనువదించు కోవడం మనకు కుదరనంత మాత్రాన అది జీవభాషవకుండా పోతుందా? తాలు పదాల ఎత్తిపోతే కవిత్వమనుకునే మనం జంతుజాలం గొంతుల్లోని స్వేచ్హాస్వచ్చతలను కత్తికోతలుగా చిత్రిస్తాం. చిత్రం!
బక్క జీవాలనేముందిలే.. ప్రకృతి మాటను మాత్రం మనం పట్టించు కుంటున్నామా? పూల రుతువు విరిసినపుడు, సిరివెన్నెల కురిసినపుడు, చివురుటాకు పెదవి మీద మంచు బిందువు మెరిసినపుడు, పెను చీకటి ముసిరి వినువీధిన కారు మొయిలు ప్రళయార్భటి చేసినపుడు, జడి వానలు కురిసి కురిసి ఏళ్ళువూళ్ళు నొకటి చేసి ముంచేసి నపుడు..అయే చప్పుడు మన చెవుల కెక్కిందెప్పుడు?
అనుదినముం బ్రదోషసమయంబున బ్రొద్దున వేయిచేతులం
బనిగొని వర్ణవర్తికలు వ్యర్థముగా క్షణభిన్న రూప క
ల్పనల నలౌకికాకృతుల బంకజమిత్ర, యయాచితంబుగం
బొనరిచి నీ యపూర్వకళాపోడిమి జుల్కనసేయ బాడియే?
-అంటో కవికోకిల దువ్వూరివారెంతలా కలవర పడేం లాభం?
ప్రకృతి సంగతలా పోనీ.. పక్క మనిషి గుక్కనైనా ఒక్క క్షణమాలకిస్తున్నామా? ఆక్రోశం రగిలి, ఆవేశం పొగిలి, ఆనందం పెగిలి అవమానం తుంచినపుడు, అనుమానం ముంచినపుడు,అభిమానం పెంచినపుడు.. కోపం కట్టలు తెంచుకుని , తాపంగుట్టలు పేల్చుకుని, పరితాపం పుట్టలు చీల్చుకుని ..చెలరేగే భావాలు, కదలాడే క్రోధాలు, కలిపెట్టే భయాలు.. కన్నీళ్ళు, ఎక్కిళ్ళు, కౌగిళ్ళు .. ఆర్ద్రంగా, చోద్యంగా, హృద్యంగా ..తీవ్రంగా, హేయంగా, తీయంగా..కులం గోత్రం..మతం ప్రాంతం..చిన్నాపెద్దా..బీదా బిక్కీ..రోగీ భోగీ.. నలుపూ తెలుపూ.. ఆడామగా..తేడా లేకుండా..అందరికీ సమంగానే వస్తాయా..రావా! కలలు, కలవరాలు సమానమేగా చీమూ నెత్తురు నాళాల్లో పారే ప్రాణులెవరికైనా? ఐనా తమదాకా వస్తేగానీ కదలని రథాలం మనం.
పోయెను పాపభీతి, విడిపోయెను ముష్కుర నీతి, మాయమై
పోయెను శాంతి, వ్య్ర్థర్థమైపోయెను దేవుడు పడ్డపాట్లు, వా
పోయెను భూతధాత్రి, సరిపోయెను పొట్టకు జీవితార్థ, మై
పోయెను మానవామర మహోదయస్వప్న మహస్సమాధిగానె!’
అని ఈ దేవదానవులమిశ్రమాల కోసం ఎన్నో మార్లు మారి మారి అవతరించిన దేవుడే ఆఖరికి అలసిపోయి ఇహ మార్చడం తన తరం కాదని మార్చ లేనిదంతా హతమార్చడం తప్ప వేరే దారేదీ లేనే లేదని ఒక్క క్షణం నిస్పృహలోపడి నిరాశగా చేసుకున్న సృష్టినంతా చెరిపేసుకుని ఠక్కుమని లేచి పోతే? పోలేదుగదా!
మాదిరి దప్పి మానవు లమానుషవృత్తి జరింప, జెల్లినన్,
కాదగు పూరుషార్థ మది కాదగునే పరమార్థ మింక నీ
మేదిని లేదె, సిల్వపయి మేకు కరంగిన గుండె నెత్తురుల్
బూదయి పోయెనే, ఋషులు బుద్ధులు నూరక పుట్టిపోయిరే!’
అని చీకాకుల పాలవకుండా పాపం సహనంతో స్నేహంగా సర్దుకు పోయిన ఆ పెద్దాయనలాగే..కవిత్వం పొంగుకొచ్చి సమయానికి రాసే ఏసాధనమూ చేతలేక తాళపత్రం కోసం ‘తాళమా! తుత్తినియలై ధరపై బడుమా!’ అంటో కోపించిన నిప్పుకణికలతో నీరులా సహృదయ సంబంధాన్నే కోరుకుంటున్న ప్రేమకవిత్వం కూడా ఇది. ప్రేమంటూ వుంటే చంద్రుడిలో మచ్చను కూడా మందులా నాకేయచ్చంటాడు కదా శ్రీరంగం నారాయణ బాబు! గుబులును కెలికే అగాథన్నుంచే సుధను చిలికి పంచాలనుకోవడం మించిన గొప్పతత్త్వ మింకేముంటుందబ్బా ఏ కవిత్వానికైనా?
ఘటమంటూ లేకుండానే గట్లు దాటే ఆత్మలున్న వైతరణి కదా ప్రస్తుతం మనం పడి ఈదుతున్నది. పంచభూతాలకీ పంచేద్రియాలకీ కట్టుబానిసలమై పోయి బతకీడ్చటం దుర్బరమై పోతున్నదని వాపోతున్నది. ఐనా ‘దోమలు నల్లుల కన్నాకరువులు వరదలేం ఎక్కువరా కన్నా!’ అనేదో సరిపెట్టుకొనే కదా మనమీ కంటకాల బతుకునిలా ఏడుస్తూనన్నా ఈడుస్తున్నది! ‘బోను తెరిస్తే నోరు తెరిచే పెద్దపులిరా బాబోయ్-జీవితం’ అని తెలిసీ చొక్కా దులిపేసుకుని ఎంచక్కా ముందుకే దూకేస్తున్నామా లేదా? ‘అదృశ్య హలాలతో అవ్యక్తాలను దున్నిఅనుమానాలను చల్లి అలజడి సాగునే ఐనా ఎలాగో కొనసాగిస్తూనే ఉన్నామా కాదా? ఈ కవిత్వానిదా టైపు ఆందోళన కానే కాదు. చరిత్ర కెక్కాల్సిన బాధల్ని అశ్రుబిందువుల హిందోళంగా మలిచే కళ. మరి అవసరమేగా!
లోకమంతా మరీ ఇంతలా బురద గుంతలానే ఉందా?. బ్రహ్మజెముళ్లే గాని బోధి వృక్షాలసలే మొలవని పుంతై పోయిందా? సుష్టుగా మెక్కి మేడమీదెక్కి మెత్త పరుపులు తొక్కే నిద్ర పట్టని పెద్దయ్యల నెత్తి మొత్తుకోళ్ళకేం గానీ.. ఆవల జొన్నచేను కావలికని మంచె మీద చేరిన నాయుడుబావయ్య కన్నుమూత పడకుండా తీసే కూనిరాగాల నాలకించవయ్యా! ‘ఆ కులాసా ఊసులనే ఎంకిపిల్ల ఊహలకో దిలాసాగా చేరేసే చల్లగాలి పదాలవుదాం.. పదవమ్మా!’అంటున్నదీ కవిత్వం. సర్దాగానే కాదు సరసంగాను లేదూ ఈ తరహా వరస?
బ్రతుకేమన్నా మృత్యుగ్రంథ ముపోద్ఘాతమా? సంక్లిష్టం కావచ్చేమో కానీ.. సజీవ స్వప్నసౌజన్యం కూడా సుమా! హృదయానువాద కళన ఆరితేరుండాలే కాని మూలమూగ సైగల్నిసైతం ‘సైగల్ రాగాలు’గా మలచడం క్షణం. ‘సహజ సహజ సహజంగా ఉందాం !!!’ అని కవి అన్నేసి మార్లలా కలతనిద్ర మధ్యలో మాదిరి పలవరించడ మాత్రం మహా అసహజంగా ఉందని కదూ సందేహం? తత్వం తలకెక్కకే ఈ చిక్కుముడి. మనసు ఎక్కి జారే జారుడుబండంట చైతన్యం. రాయీ రప్పా, పశువూ పక్షీ, మనిషి- అదే క్రమంలోశుద్ధభౌతికం, ప్రాణం, మనసు లాక్రమించిన జీవస్థానాలని ‘తత్త్వప్రభ’ ప్రబోధం.’పరస్మాత్ ప్రస్థితా సేయం/భూమి కానాం పరంపరా/సోపానకల్పితాకారా/నిః శ్రేణి రివ నిర్మితా’ అంటే అర్థం ఇదేనండీ బాబూ! భూ భువ సువ ర్లోకాల పైనున్నమహర్లోకంలోని చివరి ఆనందం మన మనీ ప్రపంచంలో గుప్త రూపంతో అప్రకాశంగా అణిగి పోయింది కదా.. ఈ చిదానందాన్నా కూపంనుంచి చివరి కెలాగైనా చేదుకోవడమే ఏ కళకైనా పరమావధని లక్షణగ్రంధాల సిద్ధాంతం కూడా. తృణకంకణం కృతి సమర్పణంలో ‘శాశ్వత నవ్య స్ఫురణల/ నశ్వరలావణ్యమై పెనగ, కావ్యకళా/విశ్వమునం దానంద ర/సైశ్వర్యము లేలు’ నని రాయప్రోలువారానాడు కనిపెట్టిన రస రహస్యాన్నే యగైన్’ యే చోళీ కే పీచే యేహీ హై’ అని మళ్లీ ఈ కవిత గుర్తు చేస్తున్న్దన్న మాట. గొప్పే కదా మరి?
తొలి ఉషస్సు తూర్పును తడిపే వేళకి గుండె చేతపట్టుకుని గుమ్మంలో నిలబడుండేదే కవిత్వం. లోగిలి ఎవ్వరిదని కాదు తల్లిలా లాలించడమే కవితా ధర్మం. ఆశించిన హస్తం ఏ భూతానిదైనా కాని ప్రేమతో ముందుకు నడిపించడమే పదంలోని తండ్రి పని.’ఒరులేయని యొనరించిన/నరవర! యప్రియము తనమనంబునకు తా/నొరులకు నని చేయకునికి, / పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్’ అని కదా నీతి! ఆ నీతిని తన ధర్మంగా ప్రకటించుకున్న కవతని అభినందించి తీరాలి. ఆకాశం అనంతం అగాథం అనంతం కారుణ్యం అనంతమైతే కావచ్చు కానీ కవి అంతరంగం ముందు అవన్నీమోకాలు తడవని పిల్లకాలువలు. నిరంకుశుడైతేనేమి ఒక ధర్మాస్త్రానికి సత్యంగా కట్టుబడుండాల్సిన ఆంజనేయుడు కవి. అపారసార సంసారసాగర మధనం చేసి నవజీవన సుమధుర సుధారస సువర్ణ కలశం తీసి నిరాశ నిట్టూర్పులతో నిండి యెండి మండే కంఠాల రక్తి భక్తి ముక్తి శక్తిధారలుగ ఒలికించాలనే సంకల్పం స్వల్పమైనదా? నిప్పుకణికలా, నిలువెత్తు నిజంలా, అలల్లా, అలజడిలా,కలల్లా, కలవరంలా, అక్షరాలకు తొడిగే సైనిక రక్షాకవచాల్లా, మట్టిలా, కాలానికి భాషనేర్పే భావిలా, ప్రశ్నల్లా, పలకరించే స్నేహితుళ్ళా సహజంగా సహజంగా సహజంగా ఉంటానంటం కన్నామించిన మంచి దర్శనం ఏ కవికైనా ఇంకేముంటుంది? సహజంగా ఉంటానని అన్నేసి మార్లు సంకల్పం చెప్పుకున్నా కవిత్వంలా మాత్రం వుండడం మానబోనని ప్రకటించడమే ఈ కవి అసలు పాటవం. ఎక్కడ ప్రేమ అవ్యాజమో, ఎక్కడ సత్యమకుంఠితమో, ఎక్కడ నీతి నిశ్చలమో అక్కడ కవి పువ్వై వికసించడంలో వింతేముంది కానీ ఎడారిలో సైతం ఒయసిస్సై పిలవడం, నడిసంద్రాన కూడా గడ్డిపోచై నిలవడం అపురూపం. ‘చిగురింపగలవాడు శిశిరకాలమునైన ప్రకృతినెల్ల వసంతరాగ కాంతి/కాయింపగలవాడు కాళరాత్రినైన రమణీయ చంద్రికా సముదయముల/కురియిపగలవాడు మరుభూమిలోనైన సతతము అమృత నిష్యంద వృష్టి/మలయింపగలవాడు మండువేసవినైన మలయపర్వతశీత మారుతములు/అరయగలవాడు బాహ్యము నంతరంగమును/వ్రాయగలవాడు దైవ లీలావిలాస/చిత్రములనైన, బ్రహ్మాండసీమనైన/కవికసాధ్యంబు రవ్వంత గలదె భువిని! -అన్న తత్వం ప్రతి అక్షరంలో ప్రత్యక్షమౌతున్నందునే ఈ కవిత్వానికిలా ఉత్తమత్వం.
హంసలన్నీ శ్వేత వర్ణంలో ఉండవు కొన్ని నల్లగానూ ఉంటాయంటారు.. ‘ నల్లగా ఉన్నావేమని’ నాలాంటి నిత్య శంకితుడొకడు నిలదీస్తే ‘నీలకంఠుడు నిద్రపోతే గళమే నల్లకలు వనుకొని కొరికా. విశ్వమానవ సహస్రారం మళ్ళా అర్పిస్తేనే తెల్లబడేద’ని జవాబు.
అర్థం అయితే తత్-త్వం-అసి(నీవే అది). కాని వారికీ కవిత్వంలాగానే తత్వం- మసి.
స్వస్తి
-కర్లపాలెం హనుమంతరావు


Wednesday, March 23, 2016

పెళ్ళికి వేళాయరా! - 'అక్షర' మార్చి 2016 సంచికలో ప్రచురితం

'అవతల పెళ్ళివాళ్ళొచ్చే వేళయింది.. అమ్మాయినింకా రడీ చేయలేదేంటే! చింపిరి జుట్టు.. చిరిగిన ఓణీ.. మాసిన పరికిణీ.. నట్టింట్లో ఈ కుక్కిసోఫా.. డొక్కు టీవీనా!  ఫర్నిచరింకా మార్చలేదేంటే!'
'మీరేగదండీ! ఇంటికెవరన్నా కొత్తవాళ్లొస్తుంటే.. వరదల్లో సర్వస్వం కొట్టుకుపోయిన వాళ్లకుమల్లే దేభ్యం మొహాలేసుకు తిరగమందీ!'
'ఓసినీ..! ఆ వచ్చేవాళ్ళేమన్నా వరదనష్టం రాసుకుపోయేవాళ్ళా! పిల్లను చూడ్డానికొచ్చేవాళ్లే! ఇల్లంతా ఇట్లా దొంగలుపడి దోచుకుపోయినట్లుంటే అట్నుంచటే తారుకుంటారే తాయారూ! ముందు అమ్మాయిని కందనపు బొమ్మల్లే తయారుచేయ్! నువ్వూ తయారవ్! పనమ్మాయికూడా కంచిపట్టు చీరెలో కళ్ళు జిగేల్మనేటట్లుండాల! ముందీ దరిద్రపు ఫర్నిచరంతా అవతల పారేయించి  బెంగుళూర్నించి తెప్పించి చేయించిన ఆ సామాన్లని సర్దించూ! ఉప్మాలో జీడిపప్పు  దంచు! జిలేబీ.. లడ్డూలు.. నాలుగురకాలూ డ్రింకులూ రడీగా ఉంచు! ఇంకా..'
'అర్థమయిందండీ! ఇహ చూడండి నా ప్రతాపం! ఆ వచ్చినవాళ్ళు మన డాబుకి డంగై మూర్ఛొచ్చి పడిపోకపోతే నేను ఆగుమయ్య పెళ్లాన్నే కాదు'
'అంతొద్దు! ముందా శపథాలు మానేసి కథ నడిపించు.. ఫో!' అంటూ ఆగుమయ్య ఊడే పంచను పైకెగలాగుకొంటూ కార్లు వచ్చిన అలికిడికి హడావుడిగా బైటికి పరుగెత్తాడు!
అరడజను కార్లలో డజనుకు పైగానే ఆడా మగా డాబుగా దిగి లోపలికొచ్చి కూర్చున్నారు. అందరు కొత్త వెయ్యినోట్లులా ఫెళఫెళలాడిపోతున్నారు. అసలు పేళ్లికోడుకెవరో అంతుబట్టేటట్లు లేదు! పెళ్ళిళ్ల పేరయ్య పెళ్ళికొడుకు తండ్రిని పరిచయం చేసాడు.
పెళ్ళిచూపులు మొదలయ్యాయి.
'ఇదే మా బంగారు కొండ!' అన్నాడు అప్పుడే వచ్చి కూర్చున్న కూతుర్ని మురిపెంగా  చూపించి ఆగుమయ్య. పైనుంచి కిందిదాకా బంగారు తొడుగుల్తో ఆ ఏడుకొండలవాడికన్నా వైభోగంగా వెలిగిపోతున్న  పిల్లను చూసి 'బంగారు కొండ కాదు. కొండ బంగారం లాగా ఉంది!' అంది పెళ్ళికొడుకు తల్లి పిల్లపక్కన చేరి గాజుల చేతిని తీసుకుని బంగారం గీరి చూస్తూ.
'వదినగారూ! అన్నీ ఒరిజనలే! బంగారం రేటు కొండెక్కి కూర్చున్నా పెళ్లికి పనికొస్తాయని ఈ మధ్యే ప్రొద్దుటూరునుంచి పదికిలోలు తెప్పించి చేయించారు మీ అన్నయ్యగారు' అంది తాయారమ్మ.
'అవును చెల్లమ్మా! ఇంకా ఇన్ని బ్యాంకులాకర్లలో మూలుగుతున్నాయి. లాకర్లు ఖాళీగా లేకపోతే వూరికే పడుండటమెందుకని మా పక్కింటివాళ్లక్కూడా పెట్టుకోమని పడేస్తుంటాం. మా కుక్క మెడగొలుసుకూడా ఉమ్మిడియార్ వారి బంగారంతో చేయించిందే!'
'ఇవన్నీ..?'
'మీ అనుమానం అర్థమైందిలేండి బావగారూ! చేసేది ఇసక తవ్వుకునే  వ్యాపారం కదా! ఇవన్నీ వీడికెలా వచ్చాయనేగా డౌటు! మీకు తెలీనిదేవుంది? హ్హిఁ! హ్హిఁ! ఇవే కాదు! ఈ నట్టింట్లో పెట్టించిన హోం థియేటర్నుంచి.. స్నానాలగదిలో కట్టించిన పాలరాయి తొట్లదాకా అన్నింటికీ బిల్లులు కూడా ఉన్నాయి సారూ! చూపిస్తానుండండి!.. ఈ బిల్లు భజగోవిందం పేరుతో ఉంది. భజగోవిందమంటే మా బావమరిది. ఈ ఇంటిపేపర్లు మావూళ్లయ్య పేరుతో ఉన్నయ్!  మావూళ్లయ్యంటే మా ఊళ్లో ఓ మామూలు బడిపంతుల్లెండి! పాలేరు పేరుతో మా పల్లెల్లోనే ఓ పాతికెకరాల కొబ్బరితోట కొని పడేసాను. ఈ ప్లాట్లూ.. ఫ్లాట్లూ కాదుగానీ కొని దాచలేక నేను పడే పాట్లు ఆ దేవదేవుడికే తెలియాలి. మీకు తెలీనిదేముంది? ఈ రోజుల్లో ఇసుక వ్యాపారం అనేసరికి గిట్టనివాళ్ళేవేవో కతలు కతలు అల్లుతుంటారు! అల్లరి పెడతుంటారు. రోజూ టీవీల్లో.. పేపర్లల్లో వచ్చే భాగోతాలు చూస్తూనే ఉన్నారు గదా!'
'అన్నయ్యగారికి ఇళ్లూ వాకిళ్లూ అన్నీ వివరంగా చూపించండీ! లేకపోతే ఇదంతా  ఏదో పిట్టలదొర కబుర్లు అనుకోగలరు' అంది తాయారమ్మ.
'ఆ మాటా నిజమేనే! బావగారూ! ఏదో మీ సంబంధానికి మేమూ కాస్తో కూస్తో సరితూగగలమని చెప్పుకోడానికే ఈ సోదంతా! ఇవికాక బంజారాహిల్సులో రెండు బంగళాలుకూడా ఉన్నాయి! లోపలికి రండి! ఈ బాత్రూము కిందున్న రాయి ఎత్తితే అమ్మాయి పేరున దాచిన బ్లూషేర్లు ఒకైదుకోట్లదాకానైనా కనిపిస్తాయి. ఎకౌంటు చేయడానికి కుదరని హార్డు క్యాషైతే ఇంకో రెండు రెట్లు అదనంగానే ఉండొచ్చు!
'వచ్చి అరగంట దాటింది. పిల్లగురించి వాళ్ళింకా ఒక్కముక్కయినా అడగ లేదు. గుక్కతిప్పుకోకుండా మీ పాటికి మీరు  మీ దండకం  చదువుకుపోతున్నారు! ముందు వాళ్లనో గుక్క కాఫీనీళ్లైనా తాగనివ్వండీ!' అంది తాయారమ్మ,
అప్పటిగ్గానీనిజమేనే! అమ్మాయిచేత ఆ టిఫిన్లేవో పంపించు!' అని వెనక్కి తగ్గారుకాదు  ఆగుమయ్యగారు.
వేడి వేడి ఉల్లిగారెలు.. పొగలుకక్కే జీడిపప్పు ఉప్మా.. జాగర్లమూడి నేతిలో ముంచి తేల్చిన జిలేబీలూ లాగించి.. కాఫీ టీలు ముగించి.. వచ్చినవాళ్లు త్రేన్చుకుంటూ లేచేసరికి నడిఝాము నెత్తికెక్కింది.

పెళ్లివారిని కార్లదాకా సాగనంపుతూ చివరి నినిషంలో ఆగలేక పెళ్లికొడుకు తండ్రిని అడిగేశాడు ఆగుమయ్య 'పిల్ల నచ్చినట్లేనా? ఇంకా ఏమన్నా అనుమానలున్నాయా బావగారూ?'
'అన్నీ దగ్గరుండి సాక్ష్యాలతో సహా  వివరంగా చూపిస్తిరి. ఇంక అనుమానాలకు తావేముంటుంది ఆగుమయ్యగారూ! ఏ సంగతీ రేపే మన పేరయ్యగారిద్వారా కబురుచేస్తాంగదా! మీరు అందుబాటులో ఉండండి చాలు' అంటూ వాళ్లు చక్కా వెళ్లిపోయారు.

మర్నాడు పేరయ్య గంతులేసుకొంటూ రానే వచ్చాడు. 'కొంపముంచేశారండీ బాబూ! వాళ్లు పిల్లను చూడ్డానికని వచ్చినవాళ్లు కాదటఅవినీతి నిరోధకశాఖ వాళ్లు! మామూలుగా వచ్చి దాడిచేస్తుంటే ఎవరూ పెదవి విప్పటంలేదని .. ఇట్లా కొత్త కొత్త  ఎత్తులు  వేస్తున్నార్ట! మీరేమో ఆత్రం ఆపుకోలేక సాక్ష్యాలతో సహా సర్వం విప్పి చూపించేసారు! ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని మీమీద పక్కా కేసొకటి బుక్కయిపోయిందక్కడ!'
'గాడిద గుడ్డులేవయ్యా! పాతికేళ్లబట్టి వ్యాపారాల్లో నలిగేవాడికి ఆ మాత్రం ఫ్లాట్లూ..ప్లాట్లూ, కార్లూ.. షేర్లూ, తోటలూ.. దొడ్లూ, నగా నట్రా అమరవా ఏంటయ్యా! ఈ కుట్ర నిలబడేది కాదులే! తేలిపోయేదే చివరికి! ఎన్ని చూడ్డంలా!’
'ఎట్లా తేలిపోతుంది మహాప్రభో! అల్పారంలోనే మీరు అంత దిట్టంగా  కుమ్మేస్తిరి! జీడిపప్పు ఉప్మాలు.. నేతి జిలేబీలు  గట్రా గట్రా ఎట్లా ఏడ్చినా.. ఆ ఉల్లిగారెలున్నాయ్ చూసారూ.. అవి మిమ్మల్ని పట్టించేసాయ్ సారూ! ఉల్లి బంగారంకన్నా మిన్నగా మండిపోతోందిపప్పులు ఏరకమైనవైనా  నిప్పుల్లా కాలుతున్నాయి మార్కెట్లో! ఎంత ఇసుక వ్యాపారైనా ధర్మబద్ధంగా నడిస్తే .. కొని తిని భరాయించుకొనే  స్థితిలో ఉన్నాయా ధరవరలు! అక్కడ ఇరుక్కుపోయారు సారూ తమరు! ఇహ తప్పించుకోవడం కుదరదు. ఇదిగో ఇంకాసేపట్లో తమరికి తాంబూలాలు రాబోతున్నాయి. తన్నుకు చావడమే ఆలయమిహ!'
ఎగురుకుంటూ వెళ్లిపోయే పెళ్ళిళ్లపేరయ్య వంక నిలువుగుడ్లేసుకొని చూస్తూ ఉండిపోయాడు ఆగుమయ్యగారు
-కర్లపాలెం హనుమంతరావు
***




Sunday, February 21, 2016

హైకూ-ఒక ధ్యాన మార్గం- కవిత్వ పరామర్శ


దేశమంటే మట్టి కాదోయ్…కవిత్వమే.కొండలలో నెలకొన్న రాయడు వాడు…కవిత్వమే.వందే వందారు మందారమిందిరానంద కందలమ్…కవిత్వమే. చచ్చిన రాజుల పుచ్చిన గాథల మెచ్చే చచ్చు చరిత్రకారులను ముక్కు చెవులు కోసి అడగాలనుంది… ఇదీ కవిత్వమే.
కవిత్వానికి లిట్మస్ టెస్టులు, రంగు రుచి వాసనాదులు నిర్ద్రారించె పని వ్యర్థం. అలాగని పుటలను నలుపు చేసిన ప్రతి రాతను కవిత్వమే అనాలా!
కవి నిరంకుశుడే…కదా అని చంపకమాల రాసి కందమని దబాయిస్తే సహించాలా! పద్యం రాయాలనుకున్నప్పుదు పద్య నియమాలకి బద్ధుడయ్ ఉండాలి కదా!
హైకూల పేరుతో ఇప్పుడొస్తున్నసర్కస్ ఫీట్స్…ను గురించే ఈ ఘోషంతా!
సంప్రదాయక కవిత్వానికి ఉన్నది నియమబద్ధ వ్యాకరణ సూత్రాలే…హైకూల వెనుకున్నది ఒక కచ్చితమైన ఫిలాసఫీ!
హైకూ అంటే 5,7,5 అక్షరాలను ఉపయోగించి రాసే కవితా రూపం మాత్రమే అనేది ఒక అపోహ.
"Haiku-Expression of a single impression of natural object or a scene without intellectual interuption..."
భాషాప్రావీణ్యతకు,పాండిత్య ప్రకర్ష్ వ్యక్తీకరణలకు హైకూ వేదిక కాదు.హైకూ వెనుక ఒక మతం కాని మతం ఉంది. జైన్ మతం.నియమ శృంఖలాల బంధన లేకుండా మనిషికి నైసర్గిక స్వేచ్చను కోరుకునేది ఆ మతం. ప్రకృతితో మమేకం అవడమే ముక్తికి సాధనం అని దాని ప్రతిపాదన. కళ్ళు మూసుకుని కాదు…తెరిచి ధ్యానించు. ప్రకృతి ఉన్నది దర్శించడానికే. నిర్యాణానికి ఇంద్రియానుభూతి ఎంత మాత్రం అవరోధం కాదు.సామాన్య మానవుని కన్నా అసామాన్య అస్తిత్వం మరొకటి లేదు.-ఇదీ ఆ మత సిద్ధాంతం.
హైకూ వరకు వస్తే-ప్రకృతిలో మమేకమయే క్రమంలో దృశ్యానుభవాన్ని తృటి కాలంలో మెరుపులా కవి వ్యక్తీకరించాలి.ఇంద్రియగ్రహణ ద్వారా చైతన్యవాహిని ఏర్పడేందుకు మనిషికి కావలసింది కేవలం 17 చిత్తక్షణాలే (thought instants)అంటారు. తొలి దశలో మూడు పాదాల్ని, 17 మాత్రల్ని(syllables) హైకూ లక్షణంగా నిర్ణయించడానికి ఇదే కారణం.
జపనీస్, ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉన్న మాత్రాసౌలభ్యం తెలుగుకి లేదు.ఈ మాత్రానియమం వల్ల హైకూ సౌదర్యం కోల్పోయే ఇబ్బంది ఉంది.
ముఖంపై ప్లస్సు
వీపు మీద మైనస్సు
చెయ్యిపై ఇంటూ… దీన్ని హైకూ అంటే భరించగలమా!
దోసిట్లో నీళ్ళు
ముఖచిత్రం కరిగి
కారిపొతుంది… ఇదీ హైకూ.
ఆకాశానికి రోడ్డుకీ మధ్య/చక్రాలు తిరుగుతాయి/అధిక భాగం ఆకాశంలోనే/అంగుళం మేర మాత్రం/అంటిపెట్టుకునుంటుంది నేలని/నా కవిత్వం లాగే…అంటూ తన కవిత్వాన్ని స్థూలంగా నిర్వచించుకున్న మహాకవి ఇస్మాయిల్ తెలుగుకి ఒదగని మాత్రల జోలికి పోకుండా కూడా అద్భుతమైన హైకూలని ప్రకటించారు.
కాళ్ళకి కాళ్ళు తొడుక్కుని
నీళ్ళల్లో నిలుచున్నాడు కుర్రాడు
పై కింది మొహాల్లో ఆశ్చర్యం ఆశ్చర్యం...
తలకి మబ్బూ
కాళ్ళకీ సరస్సూ తొడుక్కోకపోతే
కొండ కొండే కాదు...
పటిక బెల్లమ్ తింటుంటే
పాప చూసి ఆగింది.
దానికి పెట్టాక ఇంకా తీపెక్కెంది బెల్లం...
కవికి స్ఫురించిన మెరుపును మూడు పాదాల్లో ఇలా హృద్యంగా అందించడమే హైకూ లక్ష్యం. మేథో ప్రమేయం లేని జ్ఞాన జ్యోతే హైకూ కవిత ఆంతర్యం.
మామూలుగా కవి అంతగా స్పృహలో లేని ధ్యాన దశలోనె గదా హైకూ వెలువడేది! మితిమీరిన మేథో ప్రదర్శన హైకూ సౌందర్యాన్ని చెరుస్తుంది. వేరే కవిత్వం రాసే వేళ అలవాటుగా చేసే హంగామా హైకూ కవిత్వం రాసే సమయంలో ప్రదర్శించడమే చాలా మంది కవులు చేసే పొరపాటు.
భిన్నత్వం విశ్వజనీన గుణం.ఓ భావ జాలంతో ఏకీభవించ వచ్చు.విభేదించవచ్చు. కానీ ఒక స్థిర భావం నుంచి మొలకెత్తిన రూపాన్ని అదే పేరుతో రసాభాస చేయడం అన్యాయం.అది పేరడీ మాత్రమే అవుతుంది.
హైకూను మరొ విధమైన మినీ కవితా ప్రక్రియగా భావించడం కూడా దుర్ వ్యాఖ్యే.
అందరం గుర్తుంచుకోవలసింది…హైకూ కవిత ఆత్మకు ప్రధాన రూపం(Form) కాదు. విషయం(content) మాత్రమే.
"The flame of life lies in the heart of each passing second"
జెన్ బౌద్ధపు ఈ చైతన్య దీప్తే ... హైకూ
-కర్లపాలెం హనుమంతరావు

(నరేష్ నున్నా-"కొట్టివేతలు…దిద్దుబాట్లు" వ్యాస సంకలనంలోని 'హైకూ-ఒక ధ్యాన మార్గం'-స్ఫూర్తితో)

Friday, February 19, 2016

గీతా మకరందం- ఈనాడు ఆదివారం సంపాదకీయం


గంగ, గాయత్రి, గీత- ప్రపంచానికి భారతీయత ప్రసాదించిన మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక కానుకలు. తొలిరెండింటి మాట అలా ఉంచి గీతాసూత్రం మాత్రం 'శంకా సంకుచితాంతరంగులకు, వృథా సందేహమందేహులకు' కింకర్తవ్య విమూఢత్వం ఆవరించినప్పుడల్లా మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా స్వస్థతనందించే చక్కటి ఔషధం. దాదాపు అయిదువేల సంవత్సరాల కిందట- దుర్మదాంధులైన కురుసైన్యం ఎదుట కురుక్షేత్ర రణక్షేత్రం ముంగిట దైన్యయోగంలోపడ్డ నరుడికి నారాయణుడే జ్ఞానసారథ్యం వహించి చేసిన కర్తవ్యబోధ- గీత! 'గీ' అంటే త్యాగం, '' అంటే తత్వజ్ఞానం. యుద్ధ సందర్భాన్ని ఓ మిషగా ఎంచుకొని సర్వకాలాలకూ వర్తించే నిష్కామ కర్మయోగ ప్రాశస్త్యాన్ని భగవంతుని ఉవాచగా 'గీత' ప్రకటించిందని బుద్ధిజీవులూ విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సరిసమానంగా ప్రమాణ్యత సంతరించుకొన్న ప్రవచనంగా శంకరాచార్యుల
వంటి భగవత్పాదులే గీతను భావించి భాష్యాలు వెలువరించారు. సంక్షుభిత సమాజానికి సాంత్వన చేకూర్చే చిత్రమైన తత్వమేదో గీతలో దాగుందని డాక్టర్ అనిబిసెంటువంటి మేధావులూ వ్యాఖ్యానాలు చేశారు. దేవుడు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడు కనుక, మనిషి నిర్భయంగా సుఖపడవచ్చని ఆదిమానవుడు నమ్మిన కాలంనుంచి, నేటికాలందాకా- మానవజీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మతాలు, మార్పులు, మలుపులు. త్రికరణశుద్ధిగా, ఫలాపేక్ష  లేకుండా, భవబంధాలకు అతీతంగా, కర్మ చేయడమొక్కటే మనిషి కర్తవ్యమని నిక్కచ్చిగా తేల్చిచెప్పిన గీతాసూత్రం- ఈ అణుయుగంలో సైతం అణువంతైనా మారలేదు. గీత సజీవతకు, అంతస్సూత్రంగా దాగిన ఈ నిత్యజీవిత సత్యసంధతే ప్రధాన కారణం. మంచి మనుగడే మతం అభిమతమైతే గీత సర్వమత సమ్మతం ఎందుకు కాకూడదు?

'దేహమా కంపించుచున్నది/ 'ద్రోహమా' యనిపించుచున్నది/ మోహమేదో కుంచుచున్నది' అంటూ విషాదయోగంలో పడ్డ నరుణ్ని- 'మోహమడంగె తొలంగె ధర్మ సందేహములన్నియున్' అనే మోక్ష సన్యాస యోగదశదాకా నడిపించుకొని రావడానికి 'గీత'లో నారాయణుడు ఎత్తిన అవతారాలు శతాధికం. 'ముందు గూర్చుండి నే పగ్గములను బట్టి/ రథము నడిపింతు/ కార్యసిద్ధికి నీవింక గడగుమయ్య!' అంటూ నాయకుడిలా ముందు నిలబడి భరోసా ఇస్తాడు ఒకసారి. 'దారుణ మారణ క్రియ/ కెట్టు లోర్చు మదీయ హృదయము?/ కొట్టనీ... చేతులు కట్టుకొని యుందున్' అంటూ డీలాపడిపోయినప్పుడు 'త్యజింపుము బేలతనమ్ము/ ధైర్యమున్ జెదరనీకుము' అంటూ తల్లిలా లాలిస్తాడు ఇంకోసారి. 'కొంచెపు మాట లాడెదు, జుగుప్స, అశోచ్యుల కోసమేల శో/ కించు టనార్యజుష్ట మపకీర్తికర, మ్మపవిత్రమైనదీ/ చంచలబుద్ధి, కశ్మలత చాలు' అంటూ తండ్రిలా మందలిస్తాడు మరోసారి. మోహపాశంలో పడి కొట్టుమిట్టులాడే మిత్రుడి చేయిపట్టుకొని ఉద్ధరించాలనే తాపత్రయం ప్రదర్శిస్తాడు పలుపర్యాయాలు. 'నరుడే కైక ధనుర్ధరుండయి యఖండ త్యాగదీక్షా దురం/ ధరుడై నిల్చిన ముజ్జగమ్ముల నసాధ్యమన్నదే లేదు' అంటూ గురువులా ధర్మమార్గం దర్శింపజేస్తాడు భగవానుడు గీతలో. 'కర్తన్ నేను సమస్త భూతములకున్/ సర్వమ్ములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారమున్/ దీర్తున్, నీవు నిమిత్త మాత్రమగు మంతే, క్త్లెబ్యమింకేల? నీ/ కర్తవ్యము గుర్తెరింగి విజయా/ గైకొమ్ము గాండీవమున్' అంటూ నిలబెడతాడు. చింతాక్రాంతుడైన మానవుడికి సాంత్వన కలిగించేందుకు అంతా తనమీద వేసుకొనే ఔదార్యం ఇంతగా మరే సంస్కృతిలోనూ ఎవరూ ప్రదర్శించినట్లు కనిపించదు.

చెప్పడంలోని గొప్పతనమో, వ్యాసుడు రాయడంలోని గడుసుదనమో..  పరమగంభీరమైన వేదాంతసారం గీతాపాత్రలో పరమాన్నమంత మధురంగా ఉంటుంది. యోగులు, స్వాములు, జ్ఞానులు, అవధూతలే
కాదు... బుద్ధివాదులు, చివరికి చలంవంటి స్వేచ్ఛాప్రణయ జీవులూ గీతామకరందాన్ని సీతాకోకచిలుకల్లాగా సేవించేందుకు  ఉవ్విళ్లూరడాన్నిబట్టి, సుఖజీవిత అంతస్సూత్రమేదో ఆ పుష్పరాజంలో దాగుందనేగా అర్థం! 'చాలాకాలం కిందటే కనుమరుగైన నా తల్లి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీతే. మనసు కలత చెందినప్పుడల్లా నేను ఆ  తల్లి ఒడిలోనే తలదాచుకొనేది' న్నది అహింసాయోగి మహాత్మాగాంధీ వాక్కు. 'చిత్తం
పరిశుద్ధమయ్యేకొద్దీ కొత్త
కొత్త అర్థాలు తోచే చిత్రమైన ఆధ్యాత్మిక పొత్తం గీత' న్నది ఆధునిక యోగి వివేకానందుని వాణి. ధర్మాధర్మాల మధ్య ఘర్షణ హృదయాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు విచక్షణ భగవత్స్వరూపం పొంది సన్మార్గం చూపిస్తేనేగదా మనిషి పతనావస్థనుంచి విముక్తి పొందగలిగేది! వ్యాసప్రోక్తమైన గీత అష్టాదశాధ్యాయాల్లోని శ్లోకాల్లో- ఏదో ఒకటి ఎల్లవేళలా ప్రపంచంలోని ఏదో మూల ఎవరో ఒకరి చిత్తచాంచల్యమనే చీకటిని చెండాడే దివిటీలా జ్వలిస్తూనే  ఉంటుంది. అందుకనే విశ్వవ్యాప్తంగా శ్రీమద్భవద్గీతకు ఇంతకాలంగా ఇంత వన్నె తరగని  మన్నన. గీత కేవలం వ్యాసమహాభారతంలోని
అధ్యాయభాగం
మాత్రమే కాదు. మనిషి- నిశ్చింత జీవితానికి నిత్యం పాటించదగ్గ జీవన సూత్రాలన్నీ విస్తారంగా  పొదిగిన మనోవికాసశాస్త్రం. నరుడికి నారాయణుడు గీతలో బోధించిన  'తామరాకు మీది నీటిబొట్టు తత్వం'- మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా లోకం మొత్తం అనుక్షణం అనుసరించదగ్గ సూక్తం. అనేక భాషల్లో భాష్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డ భగవద్గీతపై నేడు వివాదం రేగడం దురదృష్టం. ఉత్తమ మానసిక వికాససాహిత్యంగా, జ్ఞానామృతభాండాగారంగా ప్రశంసలు అందుకొంటున్న శ్రీమద్భగవద్గీతమీద తీవ్రవాద సాహిత్యం’ అనే ముద్ర వేయడం,  ఆ మిషతో నిషేధానికి పూనుకోవడం సంకుచిత మనస్కుల తెలివిమాలినతనానికి నిదర్శనం. మనసును ఉద్దీప్తం చేసి, జాతి కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక జ్ఞానపిపాసుల జిజ్ఞాస తీర్చడంలో ముందున్నది గీతామందారం, దానిపై ఎవరెంత మకురుదనం ప్రదర్శించినా చెక్కుచెదరని మాధుర్యం ఆ మందార   మకరందానిది!


(ఈనాడు 25-12-2011 నాటి  ఆదివారం సంపాదకీయపుటలో ప్రచురితం. ఈనాడు యాజమాన్య సౌజన్యంతో.. కృతజ్ఞతలతో)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...