ఈ సెప్టెంబరు
నెలలో పరమపదించిన
సాహిత్య మూర్తులు
డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు,
గళగంధర్వుడు ఉషశ్రీ,
బీనాదేవి అర్థభాగం భాగవతుల నరసింగరావు గార్లు.
ఆ ముగ్గురు సాహిత్య మూర్తులకు
మనసారా నివాళులు
డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు
'కవి' అంటే 'కట్టేసి వినిపించే యమకింకరుడు' అన్న అపప్రథ బహుళ ప్రచారంలో ఉన్న ఈ కాలంలో కూడా పుట్టపర్తివారి నిలువెత్తు విగ్రహం స్వంత ఊరు కూడలి నడుమ సగర్వంగా నిలడి ఉంది. పుట్టపర్తివారంటే ‘శివతాండవానికి మరో పేరు. కవితార్తితో ఆ పండితుడు రాసి.. చేసిన శివతాండవం ప్రాచీన, నవీన; సంగీత సాహిత్య రస పిపాసులు అందరినీ సమానంగా అలరిస్తుంది నేటికీ!. నారాయణాచార్యులవారి ఈ పాండిత్య ప్రకర్షకి ఆకర్షితులయే స్వామి శివానంద సరస్వతి 'సరస్వతీ పుత్ర' బిరుదు ప్రదానం చేసింది.
వేష భేషజాలకి మాత్రమే దాసోహమనే నవనాగరిక సమాజం సైతం దృష్టి మళ్లించుకోలేనంత బహుముఖీన ప్రజ్ఞ
పుట్టపర్తి ఆచార్యులవారిది. ఎవరు రాసే పరీక్షలో వారే వారి పూర్వ విరచిత గ్రంథం నుంచి వివరణ రాసుకోవలసిన వింత ఘటన ప్రపంచం మొత్తంలో పుట్టపర్తివారికిలాగా మరే ఇతర సాహిత్యమూర్తికీ అనుభవమయి ఉండదేమో! 15 భాషలలో ఉద్దండ పండితులు అప్పటికే! మళయాళ నిఘంటు నిర్మాణంలో సహాయ మందించమన్న విన్నపాలు అందుకున్న తెలుగు పండితుడు పుట్టపర్తి. ఏడు పదులమీద ఏడేళ్లు గడిచినా ఏదో ఓ కొత్త
భాష నేర్చుకునే ఉత్సుకత కనబరిచే
నిత్యోత్సాహి పుట్టపర్తి. సకల కళా నికేతనం ఆచార్యులవారి అపురూప వ్యక్తిత్వం.
చేపట్టిన ప్రక్రియ ఏదైనా.. అపార పాండిత్య ప్రకర్ష దానికి
జోడించి తెలుగు భాషామ తల్లి గళసీమలకు మణిహారాలుగ తొడగడం నారాయణాచార్యులవారి
మొదటినుంచి ఓ సరదా.. శతాధిక
గ్రంథ రచనల దగ్గరైనా ఆగింది కాదు ఆ పండితులవారి కలం. బాల్యంలో పుట్టపర్తి రాసిన పద్యకావ్యం 'షాజీ' అప్పటి మద్రాసు రాష్ట్రం పాఠశాలలో తెలుగు వాచకం!!
అనంతపురం జిల్లా, చియ్యేడు గ్రామంలో 28-03-1914న శ్రీనివాసాచార్యులు, లక్ష్మీదేవి అనే పుణ్య దంపతుల నోముల పంటగా జన్మించిన పుట్టపర్తివారిదీ కృష్ణదేవరాయల గురువు శ్రీ తిరుమల తాతాచార్యులగారి మూల వంశమే. బాలాచార్యుల్ని పెనుగొండ సబ్ కలెక్టరు
సతీమణి చేరదీసారు. ఆంగ్లంలో నిష్ణాతునిగా మలిచారు. ప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షమ్మగారి సుశిక్షణలో, మేనమామ రాళ్ళపల్లిగారి క్రమశిక్షణలో
భారత, భాగవతాది గ్రంధాల అవలోకన, సంగీత, నాట్య శాస్త్రాల అవపోశన సాగింది.
కడప గడపలో కాలు కుదుట పడ్డాక సహచరి కనకమ్మగారి సాహచర్యంలో గృహ ప్రాంగణాన్నే కమ్మని
సాహితీ మాగాణంగా మలుచుకొన్నారు.. పుట్టపర్తివారిని వరించని సాహితీ ప్రక్రియ లేదు.
ఏకవీర'కు మళయాళ అనువాదం.. కోశాంబి, సావర్కర్ల వంటి ఉద్దండుల రచనలు, అరవిందుల గీతోపన్యాసాలు, శివకర్ణామృతం, అగస్తేశ్వర సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం వంటి సంస్కృత గ్రంథాలకు తెలుగు
సేతలు, ఆంగ్లంలో లీవ్స్ ఇన్ ది విండ్, ది హీరో వంటి మౌలిక రచనలు,. అన్నీ ఒకే వ్యక్తి ఒంటి చేతిమీదుగా
సాహిత్య క్షేత్రంలో పండిన ఫలాలేనంటే నమ్మ బుద్ధి కాదు కదా!. .. పుట్టపర్తివంటి దిట్టకవుల విషయంలో నమ్మక తప్పదు మరి. ఆచార్యులవారికి చాదస్తపు ఆచారాలమీద ఆట్టే ఆసక్తి లేదంటారు! ప్రతిభకు తగ్గ గుర్తింపుకు
నోచుకోలేదని అస్తమానం నొచ్చుకొనే ఈ వైష్ణవ సరస్వతీ పుత్రుడు 01-09-1990, శనివారం, ఏకాదశి.. తొలి జాములో భాగవత సారాన్ని వివరిస్తూ శివైక్యం చెందారు. తెలుగు సాహిత్య లోకానికి పూడ్చలేని లోటును మిగిల్చి పోయారు.
***
బీనాదేవి.. నరసింగరావుగారు
కలం పేరు కొందరికి అసలు పేరుకు మించి
మంచి పేరు తెస్తుంది. ఆలుమగలిద్దరూ కలసి అక్షర వ్యవసాయం చేసినా కలిసివచ్చే అదృష్టం కొన్ని
కాపురాలకే.
ఈ రెండు లక్షణాలు పుష్కలంగా గల జంట బీనాదేవిగా పేరుబడ్డ
భాగవతుల నరసింగరావు..
త్రిపుర సుందరులనే సాహిత్య
దంపతులది. ఒకే పేరుతో రాసినా భార్యాభర్తలిద్దరూ
ఒకే విధంగా చెలరేగిన సందర్బాలూ ఒక్క తెలుగు సాహిత్యంలోనే కాదు.. విశ్వసాహిత్యం మొత్తంలో కూడా ఒక్క
బీనాదేవి దంపతులదే అయివుంటుంది. నరసింగరావుగారు కీర్తి శేషులయే వరకు బైటి ప్రపంచానికి తెలియని
వింత బీనాదేవి పేరుతో వచ్చే రచనలన్నీ అచ్చంగా అన్నీ నరసింగరావుగారి కలంనుంచి
ఊడిపడ్డవే కాదని. కళాకారులను సహజంగానే కీర్తి
వెంపర్లాట వెంటాడుతుంటుంది. భర్తే బీనాదేవి పేరుతో అన్నింటిమీదా చెయి
చేసుకొంటున్నారన్న అపప్రథను ఎంతో సహనంగా సాగనిచ్చిన సహచరి త్రిపుర సుందరిగారి సౌమ్యగుణాన్ని ఒప్పుకు తీరాలి!
బీనాదేవి కథల్లోని పాత్రల వస్తౌచిత్యం
విస్మయం కలిగించే తీరులో సాగుతుంది. రావి శాస్త్రి ప్రభావం నీడలా వెన్నాడుతుంటుంది. పుణ్యభూమీ కళ్లు తెరు, మార్క్సిజం ప్రభావంతో రాసిన హేంగ్ మీ క్విక్ లాంటి ఎన్నో రచనల్లో ప్రతీ అక్షరం
ప్రజల తరుఫున వకాల్తా పుచ్చుకొని సమాజాన్ని, పాలకులను బోనెక్కిస్తుంటుంది. బీనాదేవి
రచనలు రావి శాస్త్రి రచనలకు నకలుగా ఉండటం ఒక బలం. బలహీనత కాకపోవడం ఆశ్చర్యకరం. నకళ్లు వేరు. ఒకే కళ్లతో లోకాన్ని చూడడం వేరు. బీనాదేవి
విషయంలో రెండో లక్షణమే నిజమయింది. రావి శాస్త్రి రచనా
వ్యక్తిత్వానికి బీనాదేవి కేవలం వారసత్వ
ప్రతిరూపం..
అంటారు కొడవటిగంటివారు. కాదనలేం.
నరసింగరాజు ఆగస్టు 25, 1924లో జన్మించారు. న్యాయవాద వృత్తిలో
స్థిరపడ్డారు. త్రిపురసుందరి ఫిబ్రవరి 11, 1935న
జన్మించారు. 1990లో నరసింగరావుగారి
మరణానంతరమూ అదేపంథాలో రచనలు కొనసాగించారు. బీనాదేవి పేరుతో వచ్చిన ఫస్ట్
స్టోరీ ఫస్ట్ కేఫ్ 1960లో , ఏ మేటరాఫ్ నో ఇంపార్టెన్స్ 1972లో. రాధమ్మపెళ్లి ఆగిపోయింది, డబ్బు డబ్బు డబ్బు 1975లో, హరిశ్చంద్రమతి 1980లో వెలుగు చూసాయి. బీనాదేవి ‘కథలు – కబుర్లు’ భర్త పోయిన తర్వాత భార్య ఒంటిగా ప్రకటించిన
రచన. త్రిపుర సుందరమ్మ 90ల తర్వాతా రచనా
వ్యాసంగం కొనసాగించడం గమనార్హం. కొన్ని రచనలు పోటీలలో బహుమతులూసాధించాయి. బీనాదేవి రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర
పలుకుతుంటుంది.. కథల్లోని, పాత్రల వస్తౌచిత్యం విస్మయం కలిగిస్తుంది. బీనాదేవి పేరు వినగానే చప్పున స్ఫురించేది 'పుణ్యభూమీ కళ్లు తెరు'. 'హేంగ్ మీ క్విక్' పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. న్యాయస్థానాల్లో ఓడిపోయే పేదల నిజాయితీ, కష్టాలు కళ్లక్కట్టినట్లు కనిపిస్తాయి. 1972లో బీనాదేవికి
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆత్మహత్య, అసలు లేని వడ్డీ, ఉద్యోగపర్వం, అదృష్టహీనుడు,
కుంకుమ ఖరీదు పదివేలు.. వరస బెట్టి ఇలా వప్పచెప్పుకు పోతుంటే చక్కనివి కాని కథలను వేరుగా పెట్టడం చాలా
కష్టం. వాస్తవాన్ని వస్తువులుగా స్వీకరిస్తూ, దోపిడీని, రాజ్య స్వభావాన్ని తూర్పార పట్టేస్తూ నిత్యం చైతన్యవంతమైన
అక్షరాలను చెక్కే బీనాదేవి కలం అందుకే
తెలుగు కాల్పనిక సాహిత్యరంగంలో అంతలా
కలకలం సృష్టిస్తుంటుంది ఇప్పటికీ!
***
గళ గంధర్వుడు ఉషశ్రీ
పిన్నా పెద్దా అందరినీ తన వాగ్ధాటితో
కట్టేసినట్టు రేడియో సెట్టుల ముందు
కూర్చోపెట్టిన పురాణ ప్రవచనాల తాలూకు మంద్రగళ గంధర్వుడి పేరు ఉషశ్రీ! అసలు పేరు పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు . ‘సమస్త సన్మంగళాని భవంతు..’ మొదలు ‘స్వస్తి’ వచనం వరకూ ప్రత్యక్షరం సుస్పష్టంగా, సూటిగా
హృదయరంజకంగా ఉషశ్రీ సాగించే
ప్రత్యక్ష వ్యాఖ్యానాలు తెలుగు శ్రోతలమీద ఓ తరం పాటు తనదైన శైలిలో చెరగని ముద్ర వేసాయి. నండూరి రామకృష్ణమాచార్యులు, దిగువర్తి సీతారామస్వామి వంటి ఉద్ధండులు.. బాలదీక్షితుల వాక్పటిమను గుర్తించి, విషయాన్ని
మరింత ఆకట్టుకునే చిట్కాలు నేర్పిన గురువులు. విషయం ఏదైనా సరే.. చెప్పే సమయంలో వడుపుగా సమకాలీన
అంశాలను గడుసు వ్యావహారికంలో
మనసులకు హత్తుకొనేటట్లు చెప్పడం ఉషశ్రీ
విలక్షణ శైలి.
‘సహదేవుడు నక్సలైటా?’ అని అడగాలని ఒక్క ఉషశ్రీ బుర్రకి మాత్రమే తట్టే చిలిపి ఆలోచన! విసుగెత్తించే పాడి
పంటలు కార్యక్రమాన్నైనా సరే ఆ మాటకారి
తనదైన చమత్కార పంథాలో రక్తి కట్టించేవాడు. దేవాలయ ప్రాంగణాలలో ఉషశ్తీ పురాణ ప్రవచనాలు కొత్త సినిమా మొదటాట రద్దీని తలపించేవి. సినిమా రద్దీ మొదటి వారమే. ఉషశ్రీ ప్రవచనాలకి చివరి రోజు వరకు అదే సందడి. ఆగల గంధర్వుడు అనర్గలంగా చేసిన పురాణ ప్రవచనాలే (రామాయణ భారత.. భాగవతాలు) ఆకాశవాణి అభిమానుల సంఖ్యను
పెంచిందన్న అభిప్రాయం కద్దు. నిరక్షర కుక్షులకు సైతం కళ్లక్కట్టినట్లు సాగేది కాబట్టే ఉషశ్రీ భద్రాచల సీతారాముల కల్యాణ ప్రత్యక్ష
వ్యాఖ్యానానికి అంతటి ప్రాచుర్యం. 'శ్రీ గురుభ్యోనమః' అంటూ ఆరంభించి శ్రోతలు సంధించే ఏ ప్రశ్నకైనా తనదైన మార్కు మసాలా జోడించి మరీ
సంతృప్తికరమైన సమాధానాలిచ్చే ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం అప్పట్లో ఆకాశవాణి
కార్యక్రమాలలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఆనాటి ధ్వన్యనుకరణ ప్రదర్శనల్లో ఉషశ్రీ గళ
అనుకరణ ఉంటేనే హిట్టు.. అన్నట్లుగా ఉండేది
పరిస్థితి.
పాత్రికేయుడుగా ప్రారంభించిన ఉషశ్రీ వ్యావృత్తి 1965 నుంచి ఆకాశవాణి వ్యాఖ్యాతగా కొనసాగింది.
దీక్షితులుగారు దక్షతగల
కవి, రచయిత కూడా.
60ల్లో ఆయన కృష్ణాపత్రిక్కని రాసిచ్చిన 'పెళ్లాడే బొమ్మ'
ధారావాహికం ఆ
తరహాలో చేసిన మొదటి రచన. రాజాజీగారు
ఉపన్యాసాలను రసవత్తరంగా అనువదించాలంటే
ఉషశ్రీ ఎక్కడున్నాడో వెదుక్కోవాల్సిందే! ‘ఆతిథి మర్యాద’ అనే పురాణపండ కథ
ఒకటి ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో
ఒకటిగా ప్రచురితమయింది.
సహజంగానే దీక్షితులవారు సాంపదాయక వాది. ఆధునిక పోకడలను విమర్శించడంలో ఆయన ఎన్నడూ వెనుకంజవేయని మొండి ఘటం కూడా! 1973లో భారత ఘట్టాలతో ప్రారంభయిన
ఉషశ్రీ రేడియో పురాణ ప్రవచన పరంపర .. అవిఛ్చినంగా కొనసాగింది. 1979లో తిరుమల తిరుపతి దేవస్థానంవారి
తరుఫునుంచి ఉషశ్రీ వచన భాగవతం వెలువడింది.
ఉషశ్రీ జననం మార్చి 16,1928.
కాకరపర్రు జన్మస్థలం. తండ్రి
రామ్మూర్తి కాంగ్రెస్ జాతీయోద్యమ నాయకుడు. తల్లి కాశీ
అన్నపూర్ణమ్మ.
ఒక నిండు తరాన్ని తనదైన సమ్మోహన శైలితో అపూర్వంగా కట్టిపడేసిన ఆ గాంధర్వగళం
1990
సెప్టెంబరులో
మూగపోయింది. కళకి జరత్వం ఉండదు. ‘ఉషశ్రీ’ గారి గళ తరంగం ఆ నాటి శ్రోతల హృదయాంతరంగాల్లో
నిరంతరాయంగా మారుమోగుతూనే ఉంటుందన్న మాట
నిజం.
బాలాంత్రపు రజనీ కాంతారావుగారు చమత్కరించినట్లు బాగా నోరు
పెట్టుకొని బతికేసిన గొప్ప స్వర
మాంత్రికుల వరసలో ఉషశ్రీది ఎప్పుడూ ముందు వరసే. ఆ గళ గంధర్వుడికి నిండు మనసుతో నివాళి***
కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక
04-09-2017 నాటి ‘సాహితీ గవాక్షం’ లో ప్రచురితం)
.