Friday, September 22, 2017

వయసు చూడ తగునా! - ఆంధ్రప్రభ- సరదా కాలమ్



వయసు మహా చెడ్డది. వంటిమీదకు ఏళ్ళొస్తున్న కొద్దీ పెళ్ళి జటిలమవుతుంది. ఉద్యోగం   కఠినమవుతుంది. ఉన్న కొలువు నిలవడమూ కష్టమవుతుంది.  'వయసుఇప్పుడు కుర్చీ రాజకీయాలక్కూడా పెద్ద సమస్యయి కూర్చోంటోంది. పదవుల్ని, పరువుల్ని   సుడిగండంలోకి నెట్టే కొత్త   సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది.
గుజరాతీ మాజీ సాహస బాల ఆనంద్ బెన్ జీ ఏడున్నర పదులు   నిండిన మర్నాడే ఓటి కుండలా ఓ మూలన పడింది.  'పెద్దతనం’ వచ్చి పడిందని సంబర పడాలా? పెద్ద పదవికి గండి పడిందని దుఃఖ పడాలా? కుర్చీకి కాళ్లొచ్చాయి సరేనయ్యా.. మూడోకాలు ఇలా  మొల్చీ మొలవంగానే   ‘వంగి నడిచే మిగతా పెద్దలందర్నీ తనలానే  గంగలో  కలపెయ్యాలి. అదే మంచి సంప్రదాయం’  అంది ఆ మాజీ సి.యం బెన్ జీ! పార్టీ ఉప్పు తిన్న పుణ్యానికి  ప్రజాస్వామ్యానికిలా ముప్పు కోరడం  అన్యాయం కదా బెహన్ జీ!
చక్రాల బండినుండే ఇంచక్కా  చక్రం తిప్పాడా .. లేదా కళైవార్ తిరు కరుణానిధి  తమిళనాట తరాల తరబడి? ‘నీ’(Knee) నొప్పుల్తో మూలుగుతూనే రంజుగా దేశమంతటా రథయాత్రలు నడిపించిన    అద్వానీ సమర్థుడా .. కాదా?  జోషీ టు జస్వంతు సింగు వరకు  అందరికీ ఒకే సింగిల్గెటౌట్’  ఫార్ములానా? పెద్దల  భుజాలు ఫెడీ ఫెడీ  ఎక్కడానికి,  పాదాలు   పడీ పడీ మొక్కడానికి   మాత్రమేనా ప్రజాస్వామ్యంలో పనికొచ్చేది?  ఒక్కడుగు ముందుకు పడి  ఏ పదవికో  ఆశ పడితే   డ్యామిట్..  పెద్దల కథ ఎంత ఘనమైనదైనా అడ్డం తిరగేయడమేనా?  అహాఁ.. ఉండబట్టలేక అడుగుతున్నామండీ! ఉడుంపట్టు పాలిటిక్సుల ఉడుంకుండే వెయ్యేళ్ల వయస్సు ప్లస్సే కానీ.. మైనస్సెలా అవుతుందో చెప్పండి! మాషా అల్లా.. మాష్టార్లంటే మరీ  అంత  తమా’షా’లా ? నడుం పట్టుకు నడిచే పెద్దలు పక్కనుండి నస పెడుతున్నప్పుడే కదా మిడిలేజి దుందుడుకు కథలకు ఎదుర్లేని   పొలిటికల్ మైలేజి!
మహాభారతం చూడుడు! ముసలి  ధృతరాష్ట్రుడు కుర్చీ చేతులు తడుముకుంటూనే తన తరం  అనితర సాధ్యంగా లాగించేసాడు! యయాతి మారాజు  మాత్రం?  ఏమంత చిట్టి పాపాయా?  యవ్వనాంగులతో ఎన్ని  యవ్వారాలు  చేసినా.. మంత్రిపుంగవులతో నిరంతరం  మంతనాలు సాగించాడా లేదా ?  పురాణాల కాలం.. అవన్నీ పుక్కిట పురాణాలని  కొట్టి పారేద్దామంటారా?  చావు మంచం మీదనుంచే చండశాసనుడు మాదిరి  బెత్తమాడించిన జగజ్జేత  అలెగ్జాండరు సత్తా మాట ఏమిటండీ మరి?
కాళ్ళు చచ్చుబడ్డా  కథానాయకులు కర్ర పోటేసుకుంటూనైనా  వెండితెరల్ని పడచించేస్తుంటారు   మహా ప్రభువులూ!  చెత్త చలన చిత్రాలక్కూడా పనికిరాని   పనికిమాలిన  వయో పరిమితులు.. ఒక్క  రాజకీయాలకి మాత్రమే వర్తించడమెందుకో.. చిత్రాలు కాకపోతే!
 లాలూ మాదిరి నేతలందరికీ  పదుల కొద్దీ పసికూనలు పుట్టుకొస్తార్టయ్యా..  ఒక్కో బుడ్డోడ్ని   ఒక్కో  కుర్చీలో కుదేసి వెనక నక్కి  మరీ వెక్కిరింతల  మంత్రాంగం నడిపించీసెయ్యడానికి? యూపీ నేతాజీని చూసైనా  'పెద్దవయసు' ఇబ్బందులు  అర్థమవద్దా?  కన్నబిడ్డే కదా అని  భ్రమ పడ్డాడా ముసలాడు. ఏళ్ల బట్టి బల్లిలా అంటిపెట్టుకున్న  సి.యం. కుర్చీ! కళ్ళుమూసుకుని  కాస్తింత కాళ్ళు పెట్టుకోనిస్తే.. ఆ  అర్భకుడేం చేసాడబ్బా?  లేని పోని  ఆర్భాటాలకు పోయి దిల్లీ దర్భారు  దెబ్బకి  దభాల్మని పడిపోయాడు!   పట్టుమీద కొట్టుకొచ్చిన వస్తాదు  కుస్తీపట్ల అనుభవం..  చిన్న పిల్లడి చేష్టల వల్ల అంతా  అల్లరి పాలయి పోయింది పాపం. ప్రాణం విలవిలలాడదా  మరి ఎంత వయస్సు  వైరాగ్యం నటించినా?  
సంక్షోబాలెన్ని మార్లు వరాల్లా వచ్చి పడ్డా తల్లి వయసులో సగమైనా లేనందు వల్లే కదా బుల్లి రాహుల్  కథలా తలకిందులైంది!   ‘రాగా’ని చూసైనా రాలుగాయి వయసుకి రాజకీయాల్లో ఏమంత పెద్ద సీనుండందని  అర్థమవకుంటే.. అనర్థమే అంతా!
వయసొచ్చిన వాళ్లంతా చచ్చు పుచ్చు దద్దమ్మలేనా? వైఁ? పెద్దలసభ ‘సేన’దంతా  పనికిమాలిన రభసేనా? నోటి  పళ్ళు  ఎన్నూరు సార్లు రాలి పడితేనేమి.. హస్తం మార్కు  దిగ్గీరాజా రెండో సారీ పెళ్లి బాజా మోగించాడా ..లేదా స్వామీఈడేరకుండానే బలవంతంగా  పాడు పాలిటిక్సుల్లోకి  ఈడ్చుకొచ్చేస్తేనే కీడు. చెప్పుల్లో కాళ్లు పెట్టుకున్నట్లు చెడ తిరుగుళ్లు.  చెప్పాపెట్టకుండా   చటుక్కుమనే సెలవుల మీదెక్కడెక్కడికో  చెక్కేయడాలు. నిండుసభలో ఎంత రభసవుతున్నా  గుర్రుకొట్టి మరీ నిద్రోయేది కుర్రకుంకలా? చంకల్లో కర్రలున్న పెద్దమనుషులా? పనికి పెద్ద వయసొక వంకా?  నిద్ర సరిగ్గా పట్టని ముదివగ్గులే  చట్టసభలకు నిజంగా  నిండుతనం తెస్తుండేది.  కాళ్ళూ కీళ్లూ సవ్యంగా సాగనప్పుడేగా బుద్ధిగా బెంచీల్లో  కూర్చోగలిగేది? చెవులు సరిగ్గా  వినబడనప్పుడేగా బ్రదరూ..  అధిష్టానం  ఏం కూసినా బల్లలు అదిరేట్లు   చప్పట్ల బాదుళ్లు!   చట్టసభలు చుట్టపక్కాలొచ్చి తీరిన విడిదిళ్ళ  మాదిరి కళకళలాడాలంటే  .. ముందు  పండు వయసు ఉద్దండులకే ముందు వరస సీట్లు మీదు కట్టాలండీ! ‘శతమానం భవతి’ అనడమే శాపంగా మారడమా? అశుభం స్వామీ ప్రజాస్వామ్యానికీ!   శతాయుష్కుల శాతమే జనాభాలో అధిక శాతంగా ఉన్న  దేశంలో  వృద్ధుల అనుభావాన్నిలా  వృథాచేయడం వ్యథాపూరితం.
ఓ సారి ఓట్లేయించుకొనొచ్చి పదవీ  ప్రమాణాలు చేసేసినాక.. జనం  గగ్గోళ్లెటూ వినాల్సిన అవసరం ఉండదు కదా! ప్రజాప్రతినిధులకి   చెవులతో పెద్ద పనేమిటీసొంతానికి  ఆస్తులు కూడేసుకోవడమే పదవుల అంతిమ లక్ష్యమయిపోతున్నప్పుడు  కూడదీసుకుని  లేచే ఓపిక ఒక్కటుంటే  చాలదా   ప్రజాసేవకులకిక వేరే సొదలెందుకో?
 బారులకే ఏజ్ బారు లేని గడ్డమీద ఒక్క రాజకీయాలమీదే వయోభారం ఏమిటో?  బాధాకరం.   ప్రభుత్వోద్యోగాలకేమో  ఏటికేడాది వయోపరిమితుల్లో సడలింపులా? ప్రజాసేవలకేమో  నానాటికీ  ‘పెద్దవయసు వాళ్ళొద్దు.. వాళ్లొట్టి దద్దమ్మల’ని  ఈసడింపులా? బాగుందయ్యా సంబడం!
వయసుమీదపడ్డ పెద్దలు గౌరవనీయమైన స్థానాల్లో కంటపడుతున్నప్పుడే పార్టీల గౌరవ ప్రతిష్టలు! కారణాంతరాలతో   సభలో నేత   కనిపించకుండా పోయినా  ప్రాణాంతక రోగాలకే  అమెరికా చికిత్సకో తాత చెక్కేసినట్లు  ఇంచక్కా  నిశ్చింతగా ప్రకటించేసుకోవచ్చు.  ముక్కుపచ్చలారక ముందే  పార్టీ పగ్గాలప్పగించేస్తేనే ముప్పు.   హవాయి దేశం రాయబారులతో మంతనాలకి వెళ్లినా  ‘హనీమున్’  షికార్లకని పుకార్లు పుట్టుకొస్తాయ్. పార్టీ పుట్టి  ముంచేస్తాయ్.  సభ్యులు కోడె వయసులో చలాకీగా గెంతుతుంటే పార్టీలో   చీర్ లీడర్లకు మల్లే కిక్కొచ్చే మాట నిజమే! కానీ.. జోరు మరీ ఎక్కువైపోయి.. ఎయిర్ పోర్టులో కూడా సాటి ప్రజా ‘బ్రో’ తోటే  ‘బ్రో బీటింగ్’ కి దిగితే పార్టీ  పరువు  దుంప నాశనమయిపోతుందే!  అత్యాచారాల్లాంటి నిత్యాచారాలు బైటపడ్డా..  ‘పోనీలే.. ఉప్పూ.. కారం తినే పోకిరీ శరీరం.. సిగ్గూ శరం లేకపోవడం ప్రకృతి సహజం’ అంటూ ఏదో బుకాయించేసెయ్యచ్చు  బుల్లి బాబులు  గానీ ప్రజానేతలుగా ఎన్నికై  బులిపిస్తుంటే!  వ్యూహం ‘ఓహోఁ.. అదిరింద’నిపిస్తుంది. నిజమే కానీ..    కుంభకోణాల్లో ఇరికినప్పుడే ఎక్కళ్లేని ఇరకాటం!   'గుండె పోట్లు’.. గట్రా దొంగ జబ్బుల్తో  బెయిళ్లు రాబట్టడం కుర్రసన్నాసుల  విషయంలో ఎంతో కష్టం! ఆయా పార్టీలకది ఎంతో కొంత నష్టం.
'పిప్పర్ స్ప్రే' ఇన్సిడెంటప్పుడు పార్లమెంటులో అందరికన్నా ముందు కాళ్లకు బుద్ధి చెప్పిందెవరో తెలుసా సాములూ?   సాయం లేకుండా  మోకాళ్లైనా లేవలేని పెద్దతలకాయలు! గంటలకొద్దీ ప్లకార్డులు చేత పట్టి సభాపతి బావిలో   దీపస్థంభంలా  రోజుల్తరబడి పాతుకు  నిలబడింది ఏడుపదులు దాటిన ఓ  రాజకీయ కురువృద్ధుడు! అధిష్టానాలు కనుసైగ చేయడమే ఆలస్యం.. ఎదుటి పక్షం వాదనలేంటో  జనాలకసలు  చేరకుండా నినాదాలతో సభలు హోరెత్తించేసే వేమూరి గగ్గయ్య కంఠస్వరాలేవీ కుర్ర గడుగ్గాయిలవి కానే  కావు! మైసూరు బోండాలో మైసూరు ఉండదని.. పెద్దల సభలో కూడా పెద్దల ఉండద్దనడం.. ఇదెక్కడి విడ్డూర వాదనండీ బాబులూ!
ప్రజల ఊసులేవీ  అసలు ఉబుసు పోకకైనా చర్చకు రాని చట్ట సభల్లో   సభ్యుల గొంతు ఎంత పీలగా ఉంటే ఏంటి?  మూజువాణి ఓటుతోనే  మెజార్టీ బిల్లులు చట్టాలయిపోతున్నప్పుడు ఎత్తే చేతులు ఎంత బలహీనమైతే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉన్నట్లు!  పెద్ద వయస్సని వృద్ధుల్ని  పక్కన పెట్టేయడం తగునా?
 మనిషి సగటు జీవితకాలమే ఆరుపదులు దాటి శరవేగంతో ముందుకు పరుగెడుతుంటే ఒక్క ప్రజాసేవకులను మాత్రం  ఏడుపదులు  దాటంగానే చట్టసభ గడప దాటి  లోపలకు రావద్దనడం.. ఇదేం  ఏం ప్రజాస్వామ్యం? వయసుతో పాటు అనుభవమూ చూడ వద్దా?
ఎన్నికల సందర్భంలో సమర్పించే ప్రమాణ పత్రాల్లో  వయసు ప్రస్తావనలందుకే అసలు ఉండ కూడదనేదిగెలిచొచ్చిన ప్రజాపతినిధులందరికీ మీసాలకి,  జుత్తుకి రాసుకొనే నల్లరంగు సీసాల ఖర్చు  అదనంగా ఇచ్చేస్తే సరి! చట్టసభలు చూసినా దమయంతి స్వయంవర సభలకు మల్లే  నలకూబరులతో నిండి    కళకళలాడి పోతాయ్.   
కడదాకా ప్రజాసేవలోనే ఉండి 'పోవాలని' లనే మొండి  పెద్దలు దండిగా ఉన్న ప్రజాస్వామ్యమండీ మన ఇండియాది.   చిలిపి వయసుకోసం  చీకటి మాటున వయసు పిల్లలతో వళ్లు పట్టించుకొనే దుర్గతి  పెద్దమనుషులకు  పట్టించొద్దండీ! మన  ప్రజాస్వామ్యస్ఫూర్తికి వయసు మిషతో  గండి కొట్టొద్దండీ మహాప్రభో! దండం పెడతాం!
-కర్లపాలెం హనుమంతరావు

***
(ఆంధ్రప్రభ - 23-09-2017 నాటి సంపాదకీయ పుట- సుత్తి మెత్తంగా- కాలమ్0

Wednesday, September 13, 2017

చిల్లర గోడు- ఆంధ్రప్రభ లో వ్యంగ్య గల్పిక

బ్యాంకోళ్ల కన్నా బంకోళ్లు బెటరబ్బీ బిచ్చగాడిని చూస్తే చాలు.. చిల్లర ‘గాడ్' ను చూసినంతగా  పొంగిపోతారు. బ్యాంకోళ్లకే ఎందుకో.. బిచ్చగాళ్లంటే బచ్చాగాళ్లకన్నా హీనం!
యాచకులం.. మాదేవఁన్నా నీచకులవాఁ?  ఆ మాటకొస్తే ఈ జంబూద్వీపంలో జంపకానా పర్చుకుని  అడుక్కోని జమీందారు ఉన్నాడా అంట? ‘గజ గజానికీ ఓ గాంధారి కొడుక’న్నాడబ్బా కవి గజ్జెల మల్లారెడ్డి. ఆ మహానుభావుడే కానీ ఇంకా బతికుండుంటే.. ‘అడుగడుక్కీ ఓ అడుక్కునే డబ్బాగాడు’ అనుండేవాడే.. నో డొట్!
ఉద్యోగాలు అడుక్కుంటున్నారు. ఉపాధులు అడుక్కుంటున్నారు. ‘నిధుల మొర్రో!’ అంటో ముఖ్యమంత్రులే కేంద్రం కీలక ముఖ్యుల వెంటబడి మరీ వేడుకొంటున్నారు. సర్కారాఫిసుల్లో మంచి మంచి పోస్ట్ల కోసం  బేవార్సాఫీసర్లు సైతం  ప్రజాప్రతినిధుల సిఫార్సులకోసం ఏం ఫార్సులు చేస్తున్నారో చూస్తున్నారా లేదా? అరెఁ! జానా బెత్తెడంతుండడు..  బడి గుంటడు.. ఆడూ  జాంపండులాగా ఝమఝమలాడుతుందని  ఈడూ పాడూ కూడా  చూడకుండా.. కంటబడ్డ ప్రతీ ఆడపిల్ల వీపెనకాల బడి  ‘ప్రేమ భిక్షో’ అంటూ గోకుతుంటడు! కేడీలకూ   క్షమాభిక్షలే! రౌడీలకూ  ప్రాణభిక్షలే! ఇహ రాజకీయాల్లోకట్లా లగెత్తి చూడండెహె! పాత తప్పులనుంచి మినహాయింపులు కోరేదొహడు! కొత్త తప్పులకోసం ముందస్తు బెయిళ్లు అడిగేదొహడు.! అడుక్కోడానికి లేని ఐటం ఒక్కటైనా మాకు మిగిల్చినార్రా నారాయణా మన పెద్దమనుషులంతా కల్సి ఈ పుణ్యగడ్డలో! డప్పేసుకోకూడదంటారు. నిజవేఁ కానీ.. నిజం కూడా ఒప్పేసుకోవాలి కదా జనమంతా! ‘ధర్మా’నికో రూపాయో.. అర్థో దయచేయించడయ్యా.. అమ్మా అంటూ తండ్రుల్నీ.. తల్లుల్నీ  దయనీయంగా అడుక్కొనే అమాయకులం  మేమొక్కళ్లమే బాబులూ ఈ భూమ్మీద కొట్టొచ్చినట్లు కనిపించేదీ!   
ఎండనకా, వాననకా, చలికీ, మురిక్కీ ముక్కీ మూలిగీ, తినీ
తినకా.. ఇంత మిగుల్చుకుంటున్నందుకా   మా చిల్లర బిళ్లలమీదింత కంటు బ్యాంకోళ్లకు!
గొప్పోళ్లెంత  ప్రమాదకరవోఁ తెలిసీ కాస్తింత కనికరించి   కరచాలనం చేసేసినా చాలు.. ‘హిఁ.. హిఁ’ అంటూ ఉహూఁ తెగ ఇచ్చకాలు  పోతుంటారు బ్యాంకోళ్లు! లోళ్లకు లోళ్లు కరెన్సీ నోట్లు గోతాల్లో కుక్కి  తెచ్చి దొంగ  లాకర్లు  నింపేస్తుంటారని కాబోలు! ఆ  డేరా బాబాగాడు ఎంత డేంజరు బాబులూ? ఆ బాపతు కీచక యోగులకన్నా  యాచకులం.. అభాగ్యులం  మేమెందులో బిలో యావరేజి వినియోగ దారులం? దారుణంగా మంది సొమ్ము దోచేసే   బడా బాబులకూ  ఏదేదో చేసేసే బ్యాంకులోళ్లు.. ఏదో అడ్డమైన చోటా నానా గడ్డి గాదం కరిచి కూడేసుకున్న మా 'చిల్లర' సొమ్మును  చూస్తే మాత్రం.. 'ఛీఁ.. ఛీఁ' అంటూ ఓ  సైడుకు నెట్టేస్తారు! గుమ్మం గేటు దాటైనా లోనికి రానీయరు!  ఇదేనా సమాన ధర్మమంటే? రిజర్వు బ్యాంకోళ్లైనా సమాధానం చెనుతారా? ఊహూఁ.. నోరు విప్పరు!
అడుక్కు తినే వాళ్లమనా అంత లోకువా? మ్యాన్! లోకంలో మా కన్నా తక్కువ  'తినే'  జెంటిల్మేన్లెక్కడున్నారో  కమాన్..  చూపించండి! సాక్ష్యాత్తు మన విత్తశాఖామాత్యులవారే స్వయంగా 'పెద్ద పెద్దోళ్ళే  బ్యాంకుల్ని నిండా ముంచేస్తున్నారు. మొండి బకాయిల్ని కొండల్లా పెంచేస్తున్నారం'టో  సెలవిచ్చారా లేదా మొన్నీ మధ్యనే మన హైడ్రాబేడ్ మీటింగులో? వెరీ బ్యాడ్! ఇక్కడ తేరగా  బ్యాంకు సొమ్ము  తెగ బొక్కేసి ఎక్కడో పక్క దేశం  ఏ.సీ లాడ్జీల్లో  లార్డ్ లిన్లిత్ గో లా  పక్కలు పర్చుకు బబ్బున్న    బకాసురుల  జాబితా ఏ వీకీలీక్సు అసాంజే బాబో  బైటకు  తీస్తే తప్ప.. బ్యాంకు అప్పుల వంకతో ‘చిల్లర పన్ల’క్కక్కుర్తి పడే షికారీ బ్యాచీలెక్కువో..   'చిల్లర' బిళ్లలేరుకు బతికే మా బికారీగాళ్ల మదుపులెక్కువో లెక్కలు తేలవు! పోనీ.. పనామా లెక్కలకైనా పంగనామాలెట్టకుండా కుండబద్దలు కొట్టే   గుండె దైర్యమెవరికైనా ఉందెమో చెప్పుండ్రీ!..
ఆ మాటకొస్తే బ్యాంకోళ్ళ యాపారం మాత్రం మా బిచ్చగాళ్ల యాయవార సూత్రం కాదా? గుడి మెట్లమీద మేం జోలె పర్చుక్కూర్చుంటే.. గాజద్దాల వెనకాల గా  తెల్ల కాలరు బాబులు డాబుగా జోగుతుంటారు! గంతేగా తేడా!  కాణీకి.. ఏగాణీకీ ఏ ‘జి. ఎస్. టి’   టాక్సులు గట్రా గోల్లేకుండా ఫ్రీగా  'ధర్మం' ఫ్యామ్లీ ప్యాకేజీ దయగా ప్రసాదించే  ఉధ్దారకులం మేంఉధ్దరంగా  ఒక్క చిల్లి పైసా అయినా  మదుపుకు అదనంగా విదిల్చ బుద్ధికాని   
‘ఎగ్స్ట్రా బ్యాంకు సర్వీస్ టాక్సు’ మోతగాళ్లా కంజూస్ ఇంగిలి పింగీస్ గేస్ బీస్ బాస బాసులా బ్యాంకులోళ్లు!   
కోట్లు కుమ్మరించి ఆడే వన్ డే క్రికెట్టు వండరైనా  ఓ ‘వన్ రుపీ కాయిన్’ గాల్లో ఆడితే గానీ తరువాయి తమాషాకి తెర లేవదు కదా! చిల్లర బిళ్లలని ఇంకా మా సంపాదనమీదింత చిర్రుబుర్రులెందికంట  బ్యాంకోళ్లకు? చిరగవు. చిల్లులు  పడవు. చెవఁట గబ్బు కొట్టవు. చీపు రాతలుండవు. కాస్తింత  బరువు ఎక్కువనే కానీ.. పరువు తక్కువ   పేపర్ కరెన్సీకన్నా కాపర్ మనీనే ఎన్నందాల పోల్చినా మన్నికైనది. ఎన్ని చేతులు మారినా వన్నె తగ్గనిది.  చిల్లర బిళ్లలంటే మరెందుకంట  బ్యాంకోళ్లూ మీకంత వళ్లు మంట?!
కరేబియన్ దీవుల్లో ముద్దర్లేసు కొనొచ్చినా నిద్దర మత్తులో గభాల్న డిపాజిట్టు చేసేసుకొంటారు! కాస్తింత పెద్దనోటుగా కనిపిస్తే చాలు.. దద్దర్లాడిపోతూ కళ్లకద్దేసుకొని మరీ కాతాల్లో కాత్రంగా  జమేసుకొంటారు.  పక్క పాకిస్తానోడి జిరాక్సు  నోటుక్కూడా 'నో' చెప్పనంత ఉదారుడు కదా మన బ్యాంకు సోదరుడు! మరి  మేకిన్ ఇండియా సరుకు మా చిల్లర నాణేలంటేనే  ఎందుకో అంతలేసి బాదరింగ్స్.. బ్రదర్స్?  ..
దొంగ నోట్లుంటాయేమో కాని.. దొంగ బిళ్లలుంటాయా చెప్పు సోదరా! ఇహ సత్తు బిళ్లలంటారా?    కలరు జిరాక్సుకో  రెండ్రూపాయిల కాయిన్ పారేసినా చాలు.. రెండువేల కొత్తనోట్లో రెండు మూడు వందలు... కట్టలు కట్టలుగా బైటికి తన్నుకుంటూ వచ్చే రోజులు.  చచ్చు సత్తు బిళ్లలెవరండీ బాబూ చచ్చీ చెడి తయారు చేసేదీ కరువుల్లో?  రాటు దేలిన  స్మగ్లర్లకే సర్క్యులేటు చేసే జబ్బ సత్తువ లేనప్పుడు ఇహ మా సత్తెకాలం సత్తెయ్యలకా ఆ ఉపరి ఓపికలేడ్చేదీ? సిల్లీ!
మాట వచ్చింది కనక మనలో మన మాట! సూటు కేసుల్లో  డబ్బు దాచే కేటుగాళ్లక్కూడా చిల్లర నాణేలే సూటు,  కాస్తింత చోటు ఎక్కువ కావాలి తప్పిస్తే.. ఏ కక్కసు దొడ్డి అడుగున  ఎన్నేళ్లు కుక్కిపెట్టినా చెత్త నోట్ల మాదిరి   చెదలు పట్టవు. అధాటున ఏ ఆదాయం పన్ను యమకింకర్లొచ్చి వాలినా కౌంటింగుకొక పట్టాన లొంగి చావవు చిల్లర కాయిన్లు. లెక్కలు తేలాల్సిందేనని  మరీ అంత  మంకుపట్టు పట్టే జె.డి. లక్ష్మీనారాయణ బాపతు జీళ్ళపాకాలూ ఉంటారంటారా!ఇహ వాళ్ల ఖర్మ.. వేళ్లు కొంకర్లు పోవడం తప్ప   తప్పులు ఛస్తే బైట పడనే పడవు.  
ఏ నగదుతోనైనా  ఎసుంటి నగా నట్రా యవ్వారాలసలు బొత్తిగా పొసగవని ఢిల్లీ సర్కారోడే ఎప్పటి కప్పుడు జెల్లకాయలు కొట్టేస్తున్నప్పుడు.. కొత్తవైతే ఏంటంటా.. రెండువేల నోట్లు జేబీల్లో  పెట్టుకు దర్పంగా తిరగడానికి తప్ప కొట్లో ఇంత జిలేబీ చుట్ట కొని నోట పెట్టుకోటానికైనా  అక్కరకొస్తుందంటావా అక్కా? ఎక్కడ చూసినా మూత బడ్డ ఏటియంలే మతి పోగొట్టేస్తుంటే  ఎనీ టైం మనీ నీడ్సుకి ఇహ మీదట మా బిచ్చగాళ్ల  బొచ్చెల  గూడ్సే జనాలకు కూడ్స్.. కుమ్మక్స్!  బిల్ గేట్స్  ఇప్పట్టున ఇండియా కొచ్చినా ఇదే గతి.
బ్యాంకోడికి మల్లే భిచ్చగాడూ  'బొచ్చె డౌన్' సమ్మెకు దిగేస్తే..  ఛేంజనేది దొరక్క  ముంబయ్  ఎక్స్ఛేంజయినా ఢమాల్మని   క్రాషవడం ఖాయం!  బుకీల సంగతేవోఁగానీ బాబులూ.. బికారులం మేం కరువైతే మాత్రం  బుల్లియన్ మార్కెట్టైనా 'బేర్' మంటూ కుప్పకూలక తప్పదు తమ్ముళ్లూ!
కార్లో పెట్రోలుకోసం టూ థౌంజడేవఁన్నా  పచేస్తుందేవోఁ  కానీ.. కారుటైర్లో గాలికి మాత్రం  టూ రూపీ కాయినే కంపల్సరీ. రైతు బజార్లో బడి రోజంతా చక్కర్లు కొట్టు.. నీ బ్లడీ పచ్చనోటుకో పుచ్చొంకాయొచ్చినా ఒట్టే! వందనోట్లు వందున్నా  ఒన్ రుపీ కాయిన్ కన్నంలో పడితే గానీ ఏ శాల్తీ బరువునూ  వెయింగ్ మిషను    తూయదు! పిలగాడి పీచు మిఠాయి కోరిక ఏ పిచ్చి పచ్చనోటూ చస్తే తీర్చదు.  చిల్లర చేతిలో లేందే పైకెక్కద్దని హూంకరిస్తాడు బస్ కండక్టర్.  హుండీలో  హండ్రెడ్ నోటేసేపాటి  భక్తి ఎంత ఘనాపాటి భక్తుడికైనా ఉంటుందా ఏవిఁటీ? లక్ష్మీపూజ రోజు లక్ష్మీ మిట్టలైనా చిల్లర బిళ్లల కోసం దేవుళ్లాడాల్సిందే కదా! బ్యాంకులోళ్లు ఎట్లగూ  నోరెళ్ల బెట్టేస్తారు. దేవుళ్ల ముందు ఆ సంకట స్థితిలో భక్తులు అప్రతిష్ట కాకుండా  కాపాడేది గుడి చిడీలమీద తిష్ఠేసుక్కూర్చునే మా మాదా కబళం తిరిపంగాళ్లమేనండీ బాబులూ!   
బిచ్చగాడంటే చిల్లర ప్రసాదించే 'గాడ్'. గుళ్లో దేవుళ్లు కూడా హారతి పళ్లెంలోకో  రూపాయి బిళ్లను మించి ఆశించనప్పుడు. బ్యాంకులోళ్లకే   మరెందుకు మా చిల్లర  జమలమీదంత  మజాకు?
ఏ సర్కారోడూ మా గోడు వినిపించుకోడు. ఏ రిజర్వు బ్యాంకోడూ మా మొర ఆలకించుకోడు.  కనకనే మా కాంచన్రాయి దాసు బాసు ఆ కలకత్తా హై కోర్టు తలుపు నంతలా తట్టేస్తున్నది. ఏ నెగోషియబుల్ యాక్టు కోడైనా   తోడుగా వస్తుందేమోనని మా గోడు.
అన్నట్లు.. మా యాచ’కుల’పోళ్లందరం కలసి ఆ వకీలు బాబుకు వకాల్తా  ఫీజుకింద సమర్పించుకున్నదీ  అక్షరాలా రెండు నిండు  బస్తాల  ‘ఘట్టి’   రుపాయి బిళ్లలే సుమండీ.. నమ్మండీ!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- కాలమ్- 14-09-2017)



































***

Sunday, September 10, 2017

డాక్టర్ పు ట్టపర్తి, బీనాదేవి నరసింగరావు, ఉషశ్రీ గార్లకు నివాళులు... ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం ప్రచురణ


ఈ సెప్టెంబరు నెలలో పరమపదించిన 
సాహిత్య మూర్తులు 
డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు, 
గళగంధర్వుడు ఉషశ్రీ, 
బీనాదేవి అర్థభాగం భాగవతుల నరసింగరావు గార్లు. 
ఆ ముగ్గురు సాహిత్య మూర్తులకు 
మనసారా నివాళులు







డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు

'కవి' అంటే 'కట్టేసి వినిపించే యమకింకరుడు' అన్న అపప్రథ బహుళ ప్రచారంలో ఉన్న కాలంలో కూడా పుట్టపర్తివారి నిలువెత్తు విగ్రహం స్వంత ఊరు కూడలి నడుమ సగర్వంగా నిలడి ఉంది. పుట్టపర్తివారంటేశివతాండవానికి మరో పేరు. కవితార్తితో పండితుడు రాసి.. చేసిన శివతాండవం ప్రాచీన, నవీన; సంగీత సాహిత్య రస పిపాసులు అందరినీ సమానంగా అలరిస్తుంది నేటికీ!. నారాయణాచార్యులవారి పాండిత్య ప్రకర్షకి ఆకర్షితులయే స్వామి శివానంద సరస్వతి 'సరస్వతీ పుత్ర' బిరుదు ప్రదానం చేసింది.
వేష భేషజాలకి మాత్రమే దాసోహమనే నవనాగరిక సమాజం సైతం దృష్టి  మళ్లించుకోలేనంత బహుముఖీన ప్రజ్ఞ   పుట్టపర్తి ఆచార్యులవారిది. ఎవరు రాసే  పరీక్షలో వారే వారి పూర్వ విరచిత గ్రంథం నుంచి వివరణ రాసుకోవలసిన వింత  ఘటన ప్రపంచం మొత్తంలో పుట్టపర్తివారికిలాగా మరే ఇతర సాహిత్యమూర్తికీ అనుభవమయి ఉండదేమో! 15 భాషలలో ఉద్దండ పండితులు అప్పటికే! మళయాళ నిఘంటు నిర్మాణంలో సహాయ మందించమన్న విన్నపాలు అందుకున్న తెలుగు పండితుడు పుట్టపర్తిఏడు పదులమీద ఏడేళ్లు గడిచినా ఏదో కొత్త  భాష నేర్చుకునే  ఉత్సుకత  కనబరిచే   నిత్యోత్సాహి పుట్టపర్తిసకల కళా నికేతనం ఆచార్యులవారి అపురూప   వ్యక్తిత్వంచేపట్టిన  ప్రక్రియ ఏదైనా..  అపార పాండిత్య ప్రకర్ష దానికి  జోడించి తెలుగు భాషామ తల్లి గళసీమలకు  మణిహారాలుగ తొడగడం నారాయణాచార్యులవారి మొదటినుంచి ఓ  సరదా.. శతాధిక  గ్రంథ రచనల దగ్గరైనా ఆగింది కాదు ఆ పండితులవారి కలంబాల్యంలో పుట్టపర్తి రాసిన పద్యకావ్యం 'షాజీ' అప్పటి మద్రాసు రాష్ట్రం పాఠశాలలో తెలుగు వాచకం!!
అనంతపురం జిల్లా, చియ్యేడు  గ్రామంలో 28-03-1914 శ్రీనివాసాచార్యులు, లక్ష్మీదేవి అనే పుణ్య దంపతుల నోముల పంటగా జన్మించిన పుట్టపర్తివారిదీ   కృష్ణదేవరాయల గురువు శ్రీ తిరుమల తాతాచార్యులగారి మూల వంశమే. బాలాచార్యుల్ని  పెనుగొండ సబ్ కలెక్టరు  సతీమణి చేరదీసారుఆంగ్లంలో నిష్ణాతునిగా మలిచారు. ప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షమ్మగారి సుశిక్షణలో, మేనమామ రాళ్ళపల్లిగారి క్రమశిక్షణలో  భారత, భాగవతాది గ్రంధాల అవలోకన,   సంగీత, నాట్య శాస్త్రాల అవపోశన సాగిందికడప గడపలో కాలు కుదుట పడ్డాక సహచరి   కనకమ్మగారి సాహచర్యంలో గృహ ప్రాంగణాన్నే కమ్మని  సాహితీ మాగాణంగా మలుచుకొన్నారు.. పుట్టపర్తివారిని వరించని   సాహితీ ప్రక్రియ లేదుఏకవీర'కు మళయాళ అనువాదం.. కోశాంబి, సావర్కర్ల వంటి ఉద్దండుల రచనలు, అరవిందుల గీతోపన్యాసాలు, శివకర్ణామృతం, అగస్తేశ్వర సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం వంటి సంస్కృత  గ్రంథాలకు తెలుగు  సేతలు, ఆంగ్లంలో లీవ్స్ ఇన్ ది విండ్, ది హీరో వంటి మౌలిక రచనలు,.  అన్నీ ఒకే వ్యక్తి ఒంటి చేతిమీదుగా   సాహిత్య క్షేత్రంలో పండిన ఫలాలేనంటే  నమ్మ బుద్ధి కాదు కదా!.  ..  పుట్టపర్తివంటి దిట్టకవుల విషయంలో నమ్మక తప్పదు మరి. ఆచార్యులవారికి చాదస్తపు ఆచారాలమీద ఆట్టే ఆసక్తి లేదంటారుప్రతిభకు తగ్గ గుర్తింపుకు  నోచుకోలేదని అస్తమానం నొచ్చుకొనే వైష్ణవ సరస్వతీ పుత్రుడు 01-09-1990, శనివారం, ఏకాదశి.. తొలి జాములో భాగవత సారాన్ని వివరిస్తూ శివైక్యం చెందారు. తెలుగు సాహిత్య లోకానికి పూడ్చలేని లోటును మిగిల్చి పోయారు.
***



బీనాదేవి.. నరసింగరావుగారు
కలం పేరు  కొందరికి అసలు పేరుకు మించి మంచి పేరు తెస్తుంది. ఆలుమగలిద్దరూ కలసి అక్షర వ్యవసాయం చేసినా కలిసివచ్చే అదృష్టం కొన్ని కాపురాలకే. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా గల జంట బీనాదేవిగా పేరుబడ్డ భాగవతుల నరసింగరావు.. త్రిపుర సుందరులనే సాహిత్య  దంపతులది.  ఒకే పేరుతో రాసినా భార్యాభర్తలిద్దరూ ఒకే విధంగా చెలరేగిన  సందర్బాలూ  ఒక్క తెలుగు సాహిత్యంలోనే కాదు..  విశ్వసాహిత్యం మొత్తంలో కూడా ఒక్క బీనాదేవి దంపతులదే అయివుంటుంది.    నరసింగరావుగారు  కీర్తి శేషులయే వరకు బైటి ప్రపంచానికి తెలియని వింత బీనాదేవి పేరుతో వచ్చే రచనలన్నీ అచ్చంగా అన్నీ నరసింగరావుగారి కలంనుంచి ఊడిపడ్డవే కాదని. కళాకారులను సహజంగానే కీర్తి  వెంపర్లాట వెంటాడుతుంటుంది.  భర్తే బీనాదేవి పేరుతో అన్నింటిమీదా చెయి చేసుకొంటున్నారన్న అపప్రథను ఎంతో సహనంగా సాగనిచ్చిన సహచరి  త్రిపుర సుందరిగారి సౌమ్యగుణాన్ని  ఒప్పుకు తీరాలి!
బీనాదేవి కథల్లోని పాత్రల వస్తౌచిత్యం  విస్మయం కలిగించే తీరులో సాగుతుంది.  రావి శాస్త్రి ప్రభావం నీడలా వెన్నాడుతుంటుంది.   పుణ్యభూమీ కళ్లు తెరు, మార్క్సిజం ప్రభావంతో రాసిన హేంగ్ మీ క్విక్ లాంటి ఎన్నో రచనల్లో ప్రతీ అక్షరం ప్రజల తరుఫున వకాల్తా పుచ్చుకొని సమాజాన్ని, పాలకులను బోనెక్కిస్తుంటుంది.  బీనాదేవి  రచనలు రావి శాస్త్రి రచనలకు నకలుగా ఉండటం ఒక బలం. బలహీనత కాకపోవడం ఆశ్చర్యకరం. నకళ్లు వేరు. ఒకే కళ్లతో లోకాన్ని చూడడం వేరు. బీనాదేవి విషయంలో రెండో లక్షణమే నిజమయింది. రావి శాస్త్రి రచనా వ్యక్తిత్వానికి  బీనాదేవి కేవలం వారసత్వ ప్రతిరూపం.. అంటారు కొడవటిగంటివారు. కాదనలేం.
నరసింగరాజు ఆగస్టు 25, 1924లో జన్మించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. త్రిపురసుందరి ఫిబ్రవరి 11, 1935న జన్మించారు.  1990లో నరసింగరావుగారి మరణానంతరమూ అదేపంథాలో రచనలు కొనసాగించారు. బీనాదేవి పేరుతో వచ్చిన ఫస్ట్ స్టోరీ  ఫస్ట్ కేఫ్ 1960లో , ఏ మేటరాఫ్ నో ఇంపార్టెన్స్ 1972లో. రాధమ్మపెళ్లి ఆగిపోయింది, డబ్బు డబ్బు డబ్బు 1975లో, హరిశ్చంద్రమతి 1980లో వెలుగు చూసాయి. బీనాదేవి ‘కథలు – కబుర్లు’ భర్త పోయిన తర్వాత భార్య ఒంటిగా ప్రకటించిన రచన.  త్రిపుర సుందరమ్మ 90ల తర్వాతా రచనా వ్యాసంగం కొనసాగించడం గమనార్హం. కొన్ని రచనలు  పోటీలలో బహుమతులూసాధించాయి.  బీనాదేవి రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర పలుకుతుంటుంది.. కథల్లోని, పాత్రల వస్తౌచిత్యం విస్మయం కలిగిస్తుంది. బీనాదేవి పేరు వినగానే చప్పున స్ఫురించేది 'పుణ్యభూమీ  కళ్లు తెరు''హేంగ్ మీ క్విక్' పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. న్యాయస్థానాల్లో ఓడిపోయే పేదల నిజాయితీ,   కష్టాలు కళ్లక్కట్టినట్లు కనిపిస్తాయి.   1972లో బీనాదేవికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆత్మహత్య, అసలు లేని వడ్డీ,  ఉద్యోగపర్వం, అదృష్టహీనుడు, కుంకుమ ఖరీదు పదివేలు.. వరస బెట్టి ఇలా వప్పచెప్పుకు పోతుంటే చక్కనివి కాని కథలను వేరుగా పెట్టడం చాలా కష్టం.  వాస్తవాన్ని  వస్తువులుగా స్వీకరిస్తూ,  దోపిడీని, రాజ్య స్వభావాన్ని తూర్పార పట్టేస్తూ నిత్యం చైతన్యవంతమైన అక్షరాలను చెక్కే  బీనాదేవి కలం అందుకే తెలుగు  కాల్పనిక సాహిత్యరంగంలో అంతలా కలకలం సృష్టిస్తుంటుంది ఇప్పటికీ!
***

గళ గంధర్వుడు ఉషశ్రీ
పిన్నా పెద్దా అందరినీ తన వాగ్ధాటితో  కట్టేసినట్టు  రేడియో సెట్టుల ముందు కూర్చోపెట్టిన  పురాణ ప్రవచనాల  తాలూకు మంద్రగళ గంధర్వుడి పేరు ఉషశ్రీ! అసలు పేరు పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు . ‘సమస్త సన్మంగళాని భవంతు.. మొదలు  స్వస్తి వచనం వరకూ ప్రత్యక్షరం సుస్పష్టంగా, సూటిగా హృదయరంజకంగా ఉషశ్రీ సాగించే  ప్రత్యక్ష  వ్యాఖ్యానాలు  తెలుగు శ్రోతలమీద  ఓ తరం పాటు తనదైన శైలిలో చెరగని ముద్ర  వేసాయి. నండూరి రామకృష్ణమాచార్యులు, దిగువర్తి సీతారామస్వామి వంటి ఉద్ధండులు.. బాలదీక్షితుల వాక్పటిమను గుర్తించి, విషయాన్ని మరింత ఆకట్టుకునే చిట్కాలు నేర్పిన గురువులు. విషయం ఏదైనా సరే..  చెప్పే సమయంలో వడుపుగా  సమకాలీన  అంశాలను గడుసు  వ్యావహారికంలో మనసులకు హత్తుకొనేటట్లు  చెప్పడం ఉషశ్రీ విలక్షణ శైలి. ‘సహదేవుడు నక్సలైటా?అని అడగాలని ఒక్క ఉషశ్రీ బుర్రకి మాత్రమే తట్టే చిలిపి ఆలోచన!      విసుగెత్తించే పాడి పంటలు కార్యక్రమాన్నైనా సరే  ఆ మాటకారి తనదైన చమత్కార పంథాలో  రక్తి కట్టించేవాడు. దేవాలయ ప్రాంగణాలలో ఉషశ్తీ పురాణ ప్రవచనాలు కొత్త సినిమా  మొదటాట రద్దీని తలపించేవి.   సినిమా రద్దీ మొదటి వారమే. ఉషశ్రీ ప్రవచనాలకి చివరి రోజు వరకు అదే సందడి. ఆగల గంధర్వుడు అనర్గలంగా చేసిన పురాణ ప్రవచనాలే  (రామాయణ భారత.. భాగవతాలు)  ఆకాశవాణి అభిమానుల సంఖ్యను పెంచిందన్న అభిప్రాయం కద్దు. నిరక్షర కుక్షులకు సైతం కళ్లక్కట్టినట్లు   సాగేది కాబట్టే ఉషశ్రీ  భద్రాచల సీతారాముల కల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానానికి అంతటి   ప్రాచుర్యం. 'శ్రీ గురుభ్యోనమః' అంటూ ఆరంభించి శ్రోతలు సంధించే ఏ ప్రశ్నకైనా తనదైన మార్కు మసాలా జోడించి మరీ సంతృప్తికరమైన  సమాధానాలిచ్చే ధర్మసందేహాలు కార్యక్రమం  అప్పట్లో ఆకాశవాణి కార్యక్రమాలలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఆనాటి   ధ్వన్యనుకరణ ప్రదర్శనల్లో   ఉషశ్రీ గళ అనుకరణ  ఉంటేనే హిట్టు.. అన్నట్లుగా ఉండేది పరిస్థితి.
పాత్రికేయుడుగా ప్రారంభించిన ఉషశ్రీ వ్యావృత్తి 1965 నుంచి  ఆకాశవాణి వ్యాఖ్యాతగా కొనసాగింది. దీక్షితులుగారు  దక్షతగల కవి, రచయిత కూడా. 60ల్లో ఆయన కృష్ణాపత్రిక్కని రాసిచ్చిన 'పెళ్లాడే బొమ్మ' ధారావాహికం ఆ  తరహాలో చేసిన మొదటి రచన.  రాజాజీగారు  ఉపన్యాసాలను రసవత్తరంగా  అనువదించాలంటే  ఉషశ్రీ ఎక్కడున్నాడో వెదుక్కోవాల్సిందే! ఆతిథి మర్యాద అనే పురాణపండ కథ ఒకటి  ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో ఒకటిగా ప్రచురితమయింది. సహజంగానే  దీక్షితులవారు సాంపదాయక వాది. ఆధునిక పోకడలను విమర్శించడంలో ఆయన ఎన్నడూ వెనుకంజవేయని  మొండి  ఘటం కూడా! 1973లో భారత ఘట్టాలతో ప్రారంభయిన ఉషశ్రీ రేడియో పురాణ ప్రవచన పరంపర .. అవిఛ్చినంగా  కొనసాగింది.  1979లో తిరుమల తిరుపతి దేవస్థానంవారి తరుఫునుంచి  ఉషశ్రీ వచన భాగవతం వెలువడింది.
ఉషశ్రీ జననం మార్చి 16,1928. కాకరపర్రు జన్మస్థలం. తండ్రి రామ్మూర్తి కాంగ్రెస్ జాతీయోద్యమ నాయకుడు. తల్లి కాశీ అన్నపూర్ణమ్మ.
ఒక నిండు తరాన్ని తనదైన సమ్మోహన శైలితో అపూర్వంగా కట్టిపడేసిన ఆ   గాంధర్వగళం  1990 సెప్టెంబరులో  మూగపోయింది.   కళకి జరత్వం ఉండదు. ఉషశ్రీగారి గళ తరంగం  ఆ నాటి శ్రోతల హృదయాంతరంగాల్లో నిరంతరాయంగా  మారుమోగుతూనే ఉంటుందన్న మాట నిజం. బాలాంత్రపు రజనీ కాంతారావుగారు చమత్కరించినట్లు బాగా నోరు పెట్టుకొని  బతికేసిన గొప్ప స్వర మాంత్రికుల వరసలో ఉషశ్రీది ఎప్పుడూ ముందు వరసే. ఆ గళ గంధర్వుడికి నిండు మనసుతో నివాళి***
కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక 04-09-2017 నాటి ‘సాహితీ గవాక్షం’ లో ప్రచురితం)

  

















 .




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...